visitors

Sunday, July 11, 2021

నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 2 - ముఫ్ఫై తొమ్మిదవ భాగం

11.07.2021 -  ఆదివారం భాగం - 39*:
అధ్యాయం 2 భాగం 38  ఇక్కడ

  

నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్
" సింగిల్ టిక్కెట్
  డబుల్ సినిమా -
  ఒకే టిక్కెట్ కు
  రెండు సినిమాలు"

ఘంటసాల మాస్టారి తమ్ముడు సదాశివుడుగారు నందంబాక్కం సర్జికల్ ఇన్స్ట్రమెంట్స్ ప్లాంట్ లో పనిచేస్తున్న రోజుల్లో వారి క్వార్టర్స్ కు దగ్గరలో ఒక పాత టూరింగ్ టాకీస్ వుండేది. అక్కడ శని, ఆదివారాలలో రాత్రి 9.30 గంటలకు ఒకే టిక్కెట్ మీద రెండు సినిమాలు వేసేవారు.  ఆదివారం శెలవు దినం కావడాన సర్జికల్ ప్లాంట్ ఉద్యోగులంతా తమ కుటుంబంలోని పిల్లపాపలందరితో సరదాగా కాలక్షేపం కోసం ఆ సినిమాలకు వచ్చేవారు. ఈ సినిమా లు చూసేందుకు టి.నగర్ నుండి పెద్దబాబు, రతన్, నేనూ కూడా శనివారం సాయంత్రానికి నందంబాక్కం ఎస్.ఐ.పి. కాలనీలోని పిన్నిగారింటికి చేరేవాళ్ళం. రాత్రి  భోజనాలు ముగించుకొని తొమ్మిది తర్వాత క్వార్టర్స్ లో వున్నవారంతా మెల్లగా ఆ టూరింగ్ హాలుకు చేరేవారు. వేసవికాలంలో వెన్నెల రాత్రుళ్ళలో అందరూ సరదాగా కబుర్లు చెప్పుకుంటు నడుచుకు వెళ్ళేవారు. పెద్దలందరికీ ఒకళ్ళతో ఒకళ్ళు పరిచయాలు, స్నేహబంధాలు పెంచుకోవడానికి మంచి అవకాశం. పిల్లలంతా అక్కడ బయలు ప్రాంతంలోఇసకలో ఆటలాడేవారు. సినిమా ఒక సాకు. ఇంటర్వెల్ సమయంలో పెద్ద ఉద్యోగులు, చిన్న కార్మీకులు అనే తేడాలేకుండా అన్ని వర్గాలవారు కలసిమెలసి అక్కడి టీ స్టాల్ లో టీ త్రాగుతూ, బన్నులు తింటూ సరదాగా కబుర్లు చెప్పుకునేవారు. నిద్రలకు ఆగలేనివారు ఒక సినిమా మాత్రం చూసి ఇళ్ళకు వెళ్ళిపోయేవారు. ఓపికవున్నవాళ్ళు మాత్రం ఆ ఒక్క టిక్కెట్ కు రెండు సినిమాల ఛాన్స్  వదులుకునేవారు కాదు. మర్నాడు ఆదివారం హాయిగా నిద్రపోయి లేటుగా ఏ మధ్యాహ్నానికో లేచి సోమవారం షిప్ట్ లకు రెడీ అయిపోయేవారు. ఇలాటి కంపెనీలలో పనిచేసే ఉద్యోగస్తుల సౌకర్యం కోసమే ఆ థియేటర్ వాళ్ళు సింగిల్ టిక్కెట్ డబుల్ సినిమా ప్లాన్ వేసివుంటారు. శని ఆదివారాలెప్పుడూ రాత్రి ఆటలు హౌస్ ఫుల్ కలెక్షన్స్ తోనే ఆడేవి. సదాశివుడుగారు, పిన్నిగార్ల సౌజన్యంతో నేను కూడా బట్ రోడ్ టూరింగ్ టాకీస్ లో నెలకు ఒకటి రెండుసార్లు  పాత ఎమ్.జి.ఆర్ సినిమాలు, జయశంకర్ క్రైమ్ సినిమాలు, ఫ్రాంక్ నీరో కౌబాయ్ సినిమాలు, సీన్ కానరీ జేమ్స్ బాండ్ సినిమాలు చూసేవాణ్ణి. అలాటి సమయాలలోనే తాతగారి(సదాశివుడు) మేనేజర్స్ కృష్ణగారు, కుటుంబరావు గార్లతో,   ఇరుగుపొరుగు కొలీగ్స్ సెల్వనాయగం, పార్థసారధిగారి వంటి వారితో పరిచయాలు ఏర్పడ్డాయి. ఎస్.ఐ.పి కాలనీలోని తెలుగువారంతా కలసి ఒక ఏడాది ఉగాది వేడుకలు  చేసేరు.  అందులో భాగంగా ఒక నాటకం, లలిత సంగీత కార్యక్రమాలు  కూడా జరిగాయి.  కంపెనీ ఉద్యోగస్తులతో పాటూ కనకదుర్గ, జూ.భానుమతి వంటి సినిమా నటీమణులు కూడా  ఆ నాటకంలో నటించారు. ఆ డ్రామా రిహార్సల్స్ ఘంటసాల మాస్టారింటి హాలులోనే సదాశివుడుగారి ఆధ్వర్యంలో  జరిగాయి. సదాశివుడుగారి ముస్లీమ్ కొలీగ్, సన్మిత్రుడు ఒకాయన  అబూబెకర్ అని పేరు. ఘంటసాలవారి అభిమాని. బాగా పాడేవారు. ఆయనకు ఘంటసాలవారి పాత తమిళం పాటలన్నీ బాగా వచ్చు. ఆయన ఆరోజు ఉత్సవంలో ఆలపించి, ప్రేక్షకుల ప్రశంసలు అందుకొని ఎస్.ఐ.పి జూనియర్ ఘంటసాలగా గుర్తింపుపొందారు. 

🌷🌷

ఇలాటి ఒక టికెట్ కు రెండు సినిమాల్లాంటి ఛాన్స్ ఒకటి ఒకసారి విజయాగార్డెన్స్ లో తగిలింది. ఈనాటి పరిభాషలో చెప్పాలంటే  అది ఒక డబుల్ ఢమాకా... కాదు త్రిబుల్ ఢమాకా! విజయాగార్డెన్స్ రికార్డింగ్ థియేటర్ లో 'భువనసుందరి కథ' రీరికార్డింగ్ మొదలయింది. ఘంటసాల మాస్టారే ఆ సినిమాకు సంగీత దర్శకుడు. 9 to 9 కాల్షీట్.  వరసగా మూడురోజులపాటు జరిగింది. జానపద సినిమా అందులోనూ మంత్రాలు, తంత్రాలు, కుతంత్రాలు, పరకాయ ప్రవేశాలు, ఆకాశంలో ఎగరడాలు, దొమ్మరాటలు వంటి విశేషాలతో నిండిన సినిమా కావడంవలన అడుగడుగునా నేపథ్య సంగీతం అవసరమైన సినిమా. అలాటి సినిమా రీరికార్డింగ్ చూడడానికి మంచి హుషారుగా వుంటుంది. మాస్టారు ఏ సీన్ మీద ఎలాటి మ్యూజిక్ కంపోజ్ చేస్తారా అని పక్కనే సైలంట్ గా కూర్చొని గమనించేవాడిని. 

ఒక రోజు బ్రేక్ సమయంలో బయట వరండాలోకి వచ్చి చూసేప్పటికి  ఎదురుగా లాన్ లో ఒక తమిళ సినిమా డ్యూయెట్ సాంగ్ ఒకటి షూట్ చేస్తున్నారు. వాహినీ స్టూడియో ఎంట్రన్స్ లో రెండు తెల్లటి పోట్లగిత్తల లైఫ్ సైజ్ బొమ్మలు బహు ఆకర్షణీయంగా దర్శనమిచ్చేవి. వాటి ముందు ఎన్నో భాషల్లో సినిమా షూటింగ్ లు జరిగేవి. అవే బొమ్మలు విజయా గార్డెన్స్ లో కూడా కనిపించేవి. ముఖ్యంగా ఔట్ డోర్ లోకేషన్లో పాటల సన్నివేశంలో ఈ జంట గిత్తలు కనిపించేవి. ఆ రోజు ఆ బొమ్మల ముందే పాట షూటింగ్.  సినీమా పేరు గుర్తులేదు. దేవిక, జయశంకర్ హీరో హీరోయిన్లు. అశోకన్ విలన్. ఆ పాటలో ముగ్గురూ కనిపిస్తారు. కానీ ఆ రోజు షూటింగ్  లో దేవిక మాత్రమే పాల్గొన్నారు. మంచి హుషారైన  డ్యాన్స్ సాంగ్. కాలంతో పాటూ కాళ్ళాడించక తప్పక దేవికలాంటి ఉదాత్త కథానాయకి కూడా అల్ట్రా మోడర్న్ డ్రెస్ లలో అవస్థపడుతూ నటించకతప్పలేదు. డాన్స్ మాస్టర్ ఒక పక్క చేసి చూపిస్తూంటే, 'స్టార్ట్, 'కట్', 'క్లాప్, 'టేక్' లతో ఒక గంటపైనే సాగింది. పాట పల్లవి పూర్తికానే లేదు. కెమేరామెన్  కట్ ఎండ్ బ్రేక్  చెప్పేశాడు. కారణమేమిటంటే కెమేరాలో హిరోయిన్ గారి  కాళ్ళ దగ్గర వేసుకున్న టైట్ లెగ్గీస్ కుట్లు విడిపోయాయట.  మేకప్ రూమ్ కు వెళ్ళి ఆ డ్రెస్ పూర్తిగా మార్చుకొని రావాలంటే టైమ్ టేకింగ్ వ్యవహారం. ఈ లోపల సూర్యభగవానుడు కనుమరుగైపోతాడు. అందుకోసం ఆపధ్ధర్మ కాస్ట్యూమర్ సూదీ దారంతో వచ్చి హీరోయిన్ గారి లెగ్గీ కి రిపేర్ మొదలెట్టాడు. అతను లాన్ లో క్రింద కూర్చొని కుడుతూంటే ఆ హిరోయిన్ రిలాక్స్ అవుతూ తర్వాతి షాట్ లో వచ్చే డాన్స్ మూమెంట్స్ చూసుకుంటూవుంది. పాట షూటింగ్ కంటే ఇదే మంచి వినోదంగా అనిపించింది. కొంతసేపటి తర్వాత  షూటింగ్ మళ్ళీ కొనసాగింది. ఇలా ఒక అరగంట చూసేప్పటికి బోర్ కొట్టింది. మనం సినిమాలో చూసినట్లు వరసగా షూటింగ్ జరగదు. ఒక్కొక్క షాట్ కు లొకేషన్ ఛేంజ్, లైటింగ్, మేకప్ టచప్ లు, స్టార్ట్, కట్ ల తోనే కాలం గడిచిపోతుంది. ఆ రోజు షూటింగ్ లో జయశంకర్, అశోకన్ కనపడనే లేదు. ఆ మర్నాటి  పాట షూటింగ్  జయశంకర్ మీద. అక్కడ దేవిక లేదు. ఆ ఇద్దరి కంబైన్డ్ షాట్స్ తర్వాత ఎప్పుడో ఇద్దరి డేట్స్ కలిసొచ్చినప్పుడు షూట్ చేయాలని ఆ ప్రొడక్షన్ వాళ్ళు మాట్లాడుకోగా విన్నాను. తమిళంలో జయశంకర్ మంచి పాప్యులర్ యంగ్ హీరో. తమిళనాడు జేమ్స్ బాండ్ గా పేరుపోందారు. చాలా హుషారుగా  డ్యాన్స్ లు, ఫైట్స్ చేస్తాడు.  ఆ రోజు జయశంకర్ మీద వచ్చే బిట్స్ షూట్ చేశారు. ఆ షూటింగ్ చూస్తున్న సమయంలో నా పక్కనే మరో ఇద్దరు వ్యక్తులు  కూడా ఆ షూటింగ్ గమనిస్తూ మాట్లాడుకోవడం విన్నాను. "ఒరేయ్! చూడు. ఆ మూమెంట్స్, టైమింగ్అబ్జర్వ్ చెయ్యి. ఎవరెవరు ఎలా ఏక్ట్ చేస్తున్నారో గమనించాలి" అంటూ ఏవో టిప్స్ ఇస్తున్నారు. ఆ ఇద్దరిలో ఒకరు డైరక్టర్ కె.ఎస్.ప్రకాశరావుగారు. మరొకరు అప్పుడే కొత్తగా నటించడం మొదలెట్టిన కొత్త హీరో కృష్ణగారు. అంతకుముందు కృష్ణగారిని మాస్టారింటి వద్ద తన తేనెమనసులు చిత్రం ప్రివ్యూకు ఆహ్వానించడానికి వచ్చినప్పుడు చూశాను. 

కొంతసేపటికి లొకేషన్ ఛేంజ్ అంటూ అందరూ అక్కడినుండి వెళ్ళిపోయారు.  ఆ మర్నాటి సాయంత్రం విలన్ నటుడు అశోకన్ వచ్చారు. తెల్లటి లుంగీ, ఫుల్ హ్యాండ్ షర్ట్ లో వున్నారు. వెనకాలే మరొకరు ఆ రోజు కాస్ట్యూమ్స్ నల్లటి సూటు, బూట్లు తెచ్చారు. వాటిని ఆ కారిడార్ లోనే ఒక పక్కన ధరించి షూటింగ్ కు హాజరయ్యారు. అది ఒక అరగంటో గంటో అయింది. ఈ మూడు రోజుల షూటింగ్ ను ఎడిటింగ్, మిక్సింగ్ చేసి ఒక పాటగా రూపొందిస్తారు. ముగ్గురు నటుల మూడు రొజుల కష్టాన్ని ఒక మూడు నిముషాల పాటగా మనం తెరమీద చూసి ఆనందిస్తాం. అక్కడితో సరి. 

💐

పరమానందయ్య శిష్యుల కథ తర్వాత శ్రీదేవి ప్రొడక్షన్స్ బ్యానర్ మీద తోట సుబ్బారావు గారు నిర్మించిన మరో జానపద చిత్రం ' భువనసుందరి కథ'. ఆకాశంలో ఎగిరే వింతైన విమానం, ఆలయంలోని భువనేశ్వరీదేవి ముక్కున వేలేసుకోవడం,  పరకాయ ప్రవేశ ప్రభావంతో అందాల రాకుమారుడు గూని చాకలి తిప్పడుగా మారడం వంటి విశేషాలతో నిండిన సినీమా. ఎన్.టి.ఆర్., కృష్ణకుమారి, వాణిశ్రీ,  కన్నడ ఉదయకుమార్, ధూళిపాళ, సత్యనారాయణ, ముక్కామల నటించిన వినోదభరిత చిత్రం. సంగీతపరంగా చెప్పాలంటే సినీమా టైటిల్ మ్యూజిక్ చాలా వినసొంపుగా, హాయిగా వుంటుంది. 


భువనసుందరి కథ టైటిల్ మ్యూజిక్

పాటల విషయానికొస్తే  - లీల, సుశీల పాడిన 'ఎంత చిలిపివాడవురా ప్రియా ప్రియా', సుశీల గారు పాడిన 'నా సొగసు రమ్మందిరా ఈ వయసు ఝుమ్మందిరా', నృత్యగీతం, ఘంటసాలవారి 'ఎల్లి నాతో సరసమాడేను', 'ఎవరికైనా ఎన్నడైనా తెలియరానిది దైవమూ' వంటి పాటలు బహుళ జనాదరణ పొందాయి. 


ఎల్లి నాతో సరసమాడేనూ....(భువనసుందరి కథ లో)

పాత తరం దర్శక పితామహుడు చిత్తజల్లు పుల్లయ్యగారు దర్శకత్వం వహించిన ఆఖరు చిత్రం ఇదే. ఈ సంవత్సరంలోనే సి.పుల్లయ్య దివంగతులయ్యారు. 

💥

'స్త్రీజన్మ' దగ్గుబాటి రామానాయుడు గారికి నిర్మాతగా ఐదవ చిత్రం. స్వంత సురేష్ బ్యానర్ మీద అయితే నాల్గవ చిత్రం. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు ఘంటసాల మాస్టారు. సురేష్ సంస్థకు మాస్టారు పనిచేసిన ఏకైక చిత్రం. అంతవరకూ రామానాయుడుగారు తీసిన ఐదు చిత్రాలలో మూడింటికి పెండ్యాలగారు, ఒకటి మాస్టర్ వేణు, ఒకటి ఘంటసాలగారు చేశారు. ఈ 'స్త్రీజన్మ' సినీమాకు మూలం ' పూమాలై' తమిళం సినిమా. ఎస్.ఎస్.రాజేంద్రన్, విజయకుమారి, అంజలీదేవి నటించారు. మురసోలి మారన్ నిర్మించిన ఈ చిత్రానికి కథ ఎమ్.కరుణానిధి సమకుర్చారు. ఈ చిత్రాన్నే తెలుగులో 'స్త్రీజన్మ' గా ఎన్.టి.ఆర్., కృష్ణకుమారి, అంజలిదేవి, కాంతారావు, కృష్ణ, ఎల్.విజయలక్ష్మిలతో తీశారు. కె.ఎస్.ప్రకాశరావు దర్శకుడు. ఎన్.టి.ఆర్., కృష్ణ కలసి అన్నదమ్ములుగా నటించిన మొదటి చిత్రం. ఏన్టీ హీరో సెంటిమెంట్. హీరోయిన్ పాలిట హీరోవే విలన్. హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ. తమిళంలో గొప్ప హిట్. తెలుగులో ఫట్ అని చెప్పలేము కానీ పెద్దగా విజయం కాలేదు. 'స్త్రీ జన్మ'  సినీమా  ఘంటసాల మాస్టారికి రావడానికి కారణం మాధవీ ప్రొడక్షన్స్ ఎ.ఎస్.ఆర్.ఆంజనేయులుగారే కారణమనిపిస్తుంది. ఈ సినిమాలో కొంత భాగస్వామ్యం కలిగినవారు. అందుకే సురేష్ కంబైన్స్ బ్యానర్ మీద రామానాయుడు ఈ చిత్రం తీసారు. ఈ సినీమాలో పాటలన్నీ సన్నివేశపరంగా ఉత్తమ విలువలు గల పాటలే మాస్టారు, సుశీల పాడిన 'ఎడారిలో పూలు పూచే ఎందుకని' చాలా మంచి యుగళగీతం. బేహగ్ రాగంలో చేశారు. ఈ జోడీ పాడినదే మరో యుగళం ఆరుద్రగారు రాసిన 'హలో అన్నది మనసు, ఛలో అన్నదీ సొగసు' అనే ఛలాకీ అయిన హుషారు గీతాన్ని కృష్ణ, ఎల్ విజయలక్ష్మిల మీద చిత్రీకరణ. అలాగే సుశీలగారి సోలోలు 'ఏదో ఏదో అవుతున్నదీ', 'చేయని నోమై అడగని వరమై చక్కని తండ్రీ లాలి జో' అనే జోలపాట  చాలామంచి పాటలు.


ఎడారిలో వూలు పూచె ఎందుకనీ....(స్త్రీ జన్మ)


చేయని నోమై.....( స్త్రీజన్మ)

ఈ సినీమాలో మాస్టారికి కొంత చేదు అనుభవం మిగిల్చిన పాటలు రెండు సోలోలు. మాస్టారు పాడినవే.  ఒకటి 'మగజాతికి బలి పశువమ్మా', మరొకటి 'తల్లీ ఇది తరతరాల కధ చెల్లీ'.  ఆత్రేయగారు వ్రాసిన ఈ రెండు పాటలు సన్నివేశ ప్రాధాన్యం కలవి. నేపధ్యగీతాలు. ఎంతో భావోద్వేగంతో, పైస్థాయిలో పాడవలసిన పాటలు. ఈ పాటలను ఎందుకో తమిళ గాయకుడు టి.ఎమ్.సౌందరరాజన్ చేత పాడించాలనే కోరిక నాయుడిగారికి పుట్టింది. ఆ విషయాన్ని స్వయంగా ఆయన మాస్టారితో చెప్పకుండా వేరెవరిద్వారానో (జె.వి.రాఘవులు) చెప్పించారు. ఇది మాస్టారిని నొప్పించింది. తర్వాత మరే పరిణామాలు చోటుచేసుకున్నాయో తెలియదు కానీ చివరికి ఆ రెండు పాటలు ఘంటసాల మాస్టారే పాడారు. మాస్టారు ఈ పాటలను ఒక ఛాలెంజ్ గా తీసుకొని ఆ పాటల శ్రుతి కూడా కొంచెం పెంచి అత్యద్భుతంగా ఆలపించారు. గాయకుడిగా ఘంటసాలవారి పట్ల ఎవరికి ఏ వ్యతిరేక భావాలున్నా పూర్తిగా  తుడిచిపెట్టుకుపోయాయి. ఆ తర్వాత సురేష్ సంస్థ సినీమాలకు ఘంటసాలవారు సంగీతం సమకూర్చలేదు.


తల్లీ... ఇదితరతరాలకథచెల్లీ- స్తీజన్మ

ఈ సినీమా రీ రికార్డింగ్ కు నేను పూర్తిగా వున్నాను. కాలేజి ఏనివర్శరీ ఫంక్షన్, స్టూడెంట్స్ ఫుట్ బాల్ మ్యాచ్, హీరో హీరోయిన్ ను రేప్ చేసే సీన్, హీరో అక్కగారు ఇల్లువదిలే సమయంలో నేపథ్య సంగీతంలాటి సీన్ల్ ఎన్నిటికో మాస్టారు చాలా మంచి సంగీతాన్ని సమకూర్చారు. మంచి సినీమాయే. తెలుగు ప్రజానీకానికి అంతగా నచ్చలేదు.

💥 కొసమెరుపు💥

ఈ 'స్త్రీజన్మ' సినీమా రీరికార్డింగ్ జరుగుతున్నప్పుడు ఒక తమాషా జరిగింది. ఘంటసాల మాస్టారు ఒక హెవీ సీన్ కు చాలా సీరియస్ గా మ్యూజిక్ కంపోజింగ్ లో నిమగ్నమైవున్నారు. సడన్ గా థియేటర్ స్క్రీన్ మీద' దోరనిమ్మపండు లాగా ఊరించే దొరసానీ' అనే పాట ఆడియో గట్టిగా వినిపించడంతో మాస్టారి సీరియస్ మూడ్ కి అంతరాయం కలిగింది. వెంటనే మైక్ లో 'ఎవడ్రా ఆ నిమ్మపండు, వాడి నోరు మూయించండి' అని గట్టిగా అరిచారు. వెంటనే రికార్డిస్ట్ రూములో నుండి 'సారీ మాస్టారు, బై మిస్టేక్ ఏవో ఫీడర్స్ ఓపెన్ అయాయి ' అంటూ పాటను ఆపేసారు. ఈ పాట 'చిక్కడు దొరకడు' సినీమాలోది.  మరో రూములో ఆ పాట మిక్సింగ్ జరుగుతోంది. పొరపాటున ఆడియో థియేటర్ లోకి ఓపెన్ అయింది. ' ఆ దోర నిమ్మపండు మీదే మాస్టారూ' అంటూ తబలా ప్రసాద్ జోక్ వెయ్యడంతో అందరూ ఒకటే నవ్వులు. మాస్టారు యథాప్రకారం తన పని కొనసాగించారు.

ఘంటసాల మాస్టారి సాన్నిహిత్యంలో ఇలాటి సరదా సంఘటనలెన్నో రికార్డింగ్ సమయాలలో జరిగేవి.

ఇలాటి మరిన్ని విశేషాలతో ....
 మళ్ళీ వచ్చే వారం.....
                ... సశేషం

*With a view to make the narrative more authentic and to corroborate it, images, audio and video clips are attached at appropriate places. If such usage is found objectionable to the copyright holders the same shall be removed if and when notified.

1 comment:

మహేష్ బాబు సంబటూరి వెంకట said...

ఈరోజు మీ జ్ఞాపకాల దొంతర లో నుండి బయటకు తీసి పంచిన ఒక టికెట్ రెండు సినిమాలు.... భువన సుందరి కథ సినిమా రీ రికార్డింగ్ & తమిళ సినిమా షూటింగ్ ప్రహసనం..... స్త్రీజన్మ సినిమా పాటల రూపకల్పన విశేషాలు.... వర్క్ ఏరియాలో ఘంటసాల గారి మూడ్స్ ఇత్యాది అంశాలన్నీ చాలా ఆసక్తికరంగా వివరించారు👌👌👌👌.... చాలా చాలా ధన్యవాదాలు మీకు స్వరాట్ బాబాయ్ గారూ 👍👍😊🙏🌺💐🌹💐🙏