ప్రణవ స్వరాట్
కొట్టబడును... నేర్పబడును...
👆పై అక్షరాలు బొబ్బిలి అగ్రహారం వీధిలోని కోపరేటివ్ అర్బన్ బ్యాంక్ కు ఎదురుగా వుండే జూబ్లీ రోడ్ కు ఆనుకొని వుండే ఇంటి గోడమీదో లేక ఆ పక్కింటి గోడమీదో పెద్దవిగా దూరం నుంచే కొట్టచ్చేలా వచ్చేపోయే వాళ్ళందరినీ ఆకర్షించేవి. ఆకతాయి పిల్లలకు మంచి తాయిలం. "ఒరేయ్! ఇక్కడ కొట్టడం నేర్పుతారట, మనమూ పోయి నేర్చుకుందామా" అంటూ అల్లరిగా గోలచేస్తూ పోయేవారు. నల్లటి చెక్కబల్లమీద పెద్ద తెల్ల అక్షరాలతో ఈ బోర్డ్ ను నేను హైస్కూలులో జాయిన్ అప్పటినుండి చూస్తూండేవాణ్ణి. ఆ బోర్డ్ కు దగ్గరగా వెళ్ళి చూస్తే ఆ బోర్డ్ ఇలా కనపడేది 👇
ఆ బోర్డ్ లోని "ఇచ్చట", "టైప్" అనే అక్షరాలు చాలా చిన్నవిగా వుండి "కొట్టబడును, నేర్పబడును" అనే పదాలు మాత్రం చాలా పెద్దవిగా వుండేవి. ఇది తెలియకో, పొరపాటునో చేసిన పనికాదు. అదొక ఎడ్వర్టైజ్మెంట్ స్ట్రాటజీ. జనాలను ఆకర్షించే గొప్ప చిట్కా.
అదొక టైప్ రైటింగ్ ఇన్స్టిట్యూట్, మరియు, జాబ్ టైపింగ్ సెంటర్. బొబ్బిలిలో ఆనాటికి అదే ఏకైక టైప్ రైటింగ్ ఇన్స్టిట్యూట్. బొబ్బిలి చుట్టుప్రక్కల గ్రామాలనుండి ఎంతోమంది పిల్లలు ఇక్కడికి కాలినడకన, సైకిళ్ళ మీద టైప్ నేర్చుకోవడానికి వచ్చేవారు. ఆరోజుల్లో మధ్యతరగతి కుటుంబీకులు తమ పిల్లలు ఎస్.ఎస్.ఎల్.సి వరకు చదివి టైప్ లోయరో, హయ్యరో అయిందనిపించుకుంటే ఏదో ఉద్యోగం దొరుకుతుందనే ఆశతో వుండేవారు. మా చిన్ననాటికి ఆ తరంవారిని ఆదరించి పోషించిన సంస్థ సౌత్ ఈస్టర్న్ రైల్వే. ఉత్తరాంధ్రకు చెందిన అనేక వేలమంది ప్రజలు సౌత్ ఈస్టర్న్ రైల్వేలో వివిధ శాఖలలో పని చేస్తూ ఒరిస్సా, బీహార్, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాలలో స్థిరపడిపోయి ప్రవాసాంధ్రులుగా మారిపోయారు. వీరిలో అత్యున్నత పదవులు అలంకరించిన వారు ఉన్నారు, కేవలం కార్మికులుగా సేవలందించినవారూ ఉన్నారు. అలాగే టాటా వారి టిస్కో, టెల్కో, భిలాయ్ స్టీల్ ప్లాంట్, రౌర్కేలా స్టీల్ ప్లాంట్ లలో కూడా మా విశాఖపట్నం, శ్రీకాకుళం ప్రాంత ప్రజలు పనిచేస్తూ ఆయా ప్రాంతాల్లో స్థిరపడిపోయారు. తండ్రి రిటైర్ అయితే అతని కొడుకుకు కూడా అదే కంపెనీలో ఏదో ఉద్యోగం లభించే అవకాశం, సహృదయత ఆరోజుల్లో వుండేది. నా చిన్ననాటికే మా బొబ్బిలికి చెందిన అనేక కుటుంబాలు ఆంధ్రప్రదేశ్ ను వదలి పక్క రాష్ట్రాలకు వలసపోయారు.
ఈ 'కొట్టబడును' 'నేర్పబడును' టైపింగ్ కు యజమాని భళ్ళమూడి గోపాలరావుగారు. ఆయన ఏ ఉద్యోగం చేసేవారో తెలియదు కానీ, నాకు తెలిసినప్పటినుండి ఈ టైపింగ్ స్కూల్ వుండేది. అప్పటికే ఆయనకు అరవై ఏళ్ళు దాటివుంటాయి. ఆజానుబాహువు. దృఢంగానే వుండేవారు. తెల్లటి పంచెకట్టు, పొడుగుచేతుల లాల్చీ, మెడలో కండువాతో అర్బన్ బ్యాంక్ లోనో, ఆంజనేయస్వామి గుడి పక్కనుండో వెడుతూ దారిలో కావిళ్ళలో వెళ్ళే పెద్ద పెద్ద ఆకుపచ్చ ముళ్ళ వంకాయలను బేరమాడుతూ కనిపించేవారు.
భళ్ళమూడి గోపాల్రావుగారు
మా ఉత్తరాంధ్రాలో ఆకుపచ్చని ముళ్ళ వంకాయలు చిన్న, మధ్య, పెద్ద, అతి పెద్ద రకాలలో నిగనిగలాడుతూ మహా తాజాగా దొరికేవి. ఆ పెద్ద ఆకుపచ్చ వంకాయల వల్లనే విజయనగరం ప్రాంతాలలో బోదకాలు (ఫైలేరియా) వ్యాధి ప్రబలివుండేదనే అపవాదు వుండేది. కానీ, వంకాయ అంటే ఇష్టపడని తెలుగువారుంటారా? అలాటి ఆకుపచ్చ పెద్ద వంకాయలన్నా, పొదుపరితనమన్నా, గోపాలరావుగారికి మహా ప్రాణం.
బొబ్బిలిలో అనేక సంస్థలలో టైపిస్ట్ లుగా పనిచేసే అనేకమంది ఆయన వద్ద టైపింగ్ నేర్చుకున్నవారే. అర్బన్ బ్యాంక్ లో మరో భళ్ళమూడి వుండేవారు. రమణ. ఎక్కౌంటెంట్. విశాఖపట్నం స్వస్థలం. అక్కడే చదువు ముగించుకొని ఇల్లరికపు అల్లుడిగా బొబ్బిలి వచ్చేసారు. మేనమామే మామ కూడా. మామ సామవేదుల జగన్నాధంగారు కూడా అర్బన్ బ్యాంకు ఉద్యోగే. మా తాతగారికి (మా అమ్మగారి మేనమామ, సామవేదుల నరసింహంగారు, సింహాలుగారనేవారు) కజిన్ వరస. తాతా సహోదరుల పిల్లలు. ఈ జగన్నాధంగారి గురించి మా అమ్మమ్మగారు చెప్పిన ఒక సంఘటన నా మనసులో బాగా నాటుకుపోయింది. ఈ జగన్నాధంగారికి పెళ్ళికాక ముందు యువకుడుగా వుండే రోజుల్లో విపరీతంగా సినీమాలు చూసేవారట. తల్లి ఒక్కతే ఇంట్లో వుండేదట. ఇతను సినీమాకు వెళ్ళి ఏ రాత్రికో ఇల్లుచేరుకుంటే అప్పటిదాకా మేల్కొని, కాచుకొని వుండి కొడుక్కు భోజనం వడ్డించేదట. అప్పటికే ఆవిడ వృధ్ధురాలట. ఒకనాడు కొడుకు దగ్గర దీనంగా చెప్పుకున్నదట, ఇలా రోజూ ఆలస్యంగా ఇంటికి చేరితే వండి వడ్డించే ఓపిక తగ్గిపోతోందిరా నాయనా! అని. అంతే. ఆ రోజుతో జగన్నాధంగారు సినీమాలు, షికార్లు బంద్ అయిపోయాట. సినీమాలు చూడనని శపథం చేసారట. ఆ తర్వాత జీవితాంతం వరకూ సినీమాలే చూడలేదు. వారింట్లో భార్యా పిల్లలంతా వచ్చిన సినీమాలన్నింటికి వెళ్ళేవారు, కానీ, ఈయన మాత్రం ఇంటిపట్టునే వుండేవారు. ఆ విషయం నాకు బాగా తెలుసు. ఆనాటి వ్యక్తులలోని మానవత్వం, సంస్కారం, పట్టుదల ఆశ్చర్యం కలిగిస్తుంది.
అన్నట్టు బ్యాంక్ సెక్రెటరీ పేరు కూడా రమణే. అయితే ఆయన గుణుపూడి. మేనేజర్ నే కోపరేటివ్ బ్యాంక్ స్ట్రక్చర్ లో సెక్రటరీ అనేవారనుకుంటాను. ఈయన భళ్ళమూడి. మా సింహాలు తాతగారికి వయసులో, అనుభవంలో వీరిద్దరూ జూనియర్లే. భళ్ళమూడి రమణ మహా స్పీడ్ గా టైప్ చేసేవారు. కాలుక్యులేటర్స్, టోటలింగ్ మెషిన్ల కంటే స్పీడ్ గా మాన్యువల్ గా టోటలింగ్ చేసేవారు . మహా పక్కాగా వుండేవి రమణ ఎక్కౌంట్స్. రాత్రుళ్ళు తాలూకా ఆఫీస్ లో జాబ్ టైపింగ్ చేసేవారు. చదివింది హైస్కూలు వరకే కానీ తన స్వయంకృషితో ప్రైవేట్ గా కామర్స్ డిగ్రి సంపాదించి చివరకు అర్బన్ బ్యాంక్ కు సెక్రటరీ అయ్యారు. రమణ వయసులో నాకంటే పెద్దే అయినా ఒక స్నేహితుడుగానే చూసేవారు. ఆయన నాకు ఒక రోల్ మోడల్ గా వుండేవారు. ఆ రమణను చూసి నేనూ ఎప్పటికైనా అంత స్పీడ్ తో టైప్ చేయగల ప్రావీణ్యం సంపాదించాలని అనుకునేవాడిని. భళ్ళమూడి రమణ పని విషయంలో ఎంతటి చురుకో, స్పీడో, సిగరెట్లు కాల్చడంలో కూడా అంతకన్నా యమస్పీడ్. పెట్టెలకు పెట్టెలు ఊదేసేవాడు. అదే అతని కొంపముంచింది. రిటైర్మెంట్ కు ముందే జాబ్ లో వుండగానే మంచానికి అంటుకుపోయేలా చేసింది. Cigarette Smoking is injurious to health అని సిగరెట్ల కంపెనీ వాళ్ళచేతే statutory warning ఇప్పించడానికి కారణం ఇలా చాలామంది శ్వేతకాష్టాలకు బానిసలై, బలైపోవడమే. ఈ విషయంలో కూడా ఆయన రోల్ మోడలే. ఆ జోలికి వెళ్ళకుండా ఉండడానికి.
హైస్కూలు చదువు అయ్యాక మరల అదే బొబ్బిలిలో కాలేజీలో చేరాక ఒక కాలక్షేపంగా, అవసరార్ధం ఉపయోగపడే ఒక సైడ్ క్వాలిఫికేషన్ క్రింద టైప్ రైటింగ్ ఎందుకు నేర్చుకోకూడదు అని అనిపించింది. మా తాతగారితో చెప్పాను. మనవడు ఏదో ఓ మంచి పనిచేసి బాగుపడతానంటే ఒద్దనే తాత వుంటారా! వెంటనే భళ్ళమూడి గోపాలరావుగారితో మాట్లాడారు. ఒక శుభ ముహుర్తాన 'కొట్టబడును, చేయబడును' లోకి చేర్చబడ్డాను.
మొదటిరోజున గోపాలరావుగారు ఒక పాతకాలపు టైప్ మెషిన్లో ఒక తెల్లకాగితాన్ని పెట్టి మొదటి ఫింగరింగ్ ఎలా కొట్టాలో చేసి చూపించి ఒక లైన్ టైప్ చేసి చూపించారు. అలాగే పేజీ అంతా కొట్టమన్నారు. నేను టైప్ రైటర్ ముందు కూర్చున్నాను. ఆయన నా చేతివేళ్ళను పట్టుకొని ఏ కీ మీద ఏ వేలు ఉండాలో చూపి అలాగే ఒక్కొక్క లెటర్ టైప్ చేయమన్నారు. టైప్ చేసేప్పుడు వేళ్ళన్ని ఆయా లెటర్ కీ ల మీదే ఉండాలని ఎట్టి పరిస్థితుల్లోనూ వేళ్ళు పైకెత్తకూడదని ఏవేవో కండిషన్స్ చెప్పారు. సరేనని ఆయన టైప్ చేసిన ఫస్ట్ ఫింగరింగ్ చూశాను. అవి - asdfgf ;lkjhj - ఈ 'కీ' లను క్రమం తప్పకుండా వరసగా లైన్ కింద లైన్ ఆ పేజీ అంతా కొట్టమన్నారు. మొదటిరోజు ఉత్సాహం, ఆ ఫస్ట్ ఫింగరింగ్ కొడుతూనే వున్నాను. కొడుతూనే వున్నాను. దించిన తల ఎత్తకుండా కొడుతూనే వున్నాను. ఇంతలో ఒక గంటకాలం అయిపోయింది. తర్వాతి బ్యాచ్ కుర్రాళ్ళు తయారయిపోయి మేమున్న టేబిల్స్ వద్దకు రావడం మొదలెట్టారు. అందరూ తాము టైప్ చేసిన కాగితాలను గోపాలరావుగారికి అందజేసారు. నేనూ నా కాగితాన్ని చూపించాను. ఆ గంట కాలంలో ఒక ఐదారు లైన్లు మాత్రమే కొట్టాను. అది కూడా అక్కడో అక్షరం ఇక్కడో అక్షరం. a వుండవలసినచోట g ; l కొట్టాల్సిన చోట h ఇలా ఒక దానితో ఒకటి సంబంధం లేకుండా ఎగుడు దిగుళ్ళుగా ఒక కొత్త రకం డిజైన్ లా పేపరు తయారయింది. ఆయన వాటన్నిటికి రౌండాఫ్ లు చేసి మర్నాడు కూడా అవే అక్షరాలు అదే వరసలో టైప్ చేయాలని చెప్పి పంపేసారు. నాకు వేళ్ళు నొప్పులు పుట్టాయి. హాయిగా వరసగా a to z టైప్ చేయడం నేర్పకుండా ఈ asdfgf బెడద ఏమిటనిపించింది. మర్నాడు మళ్ళీ కాలేజీకి వెళ్ళేముందు ఒక గంట క్లాసు. మళ్ళీ అవే asdfgfలు. అలా ఫస్ట్ ఫింగరింగ్ నేర్చుకోవడానికి నాలుగైదు రోజులు పట్టింది. ఒక గంట సమయంలో కనీసం నాలుగు పేజీలైనా టైప్ చేయమనేవారు. ఈవిధంగా టైప్ రైటర్ కీబోర్డ్ లోని నాలుగు ఫింగరింగ్ లు నేర్చుకునేప్పటికి రెండు మాసాలు పట్టింది. అదయ్యాక అప్పుడు వరసగా a to z వరకు స్పీడ్ గా టైప్ చేయించేవారు. ఇలా అడ్డదిడ్డంగా టైప్ రైటర్ కీ లలో ఉన్న అక్షరాలను వరసగా ఇంగ్లీషు ఆల్ఫబెట్ గా టైప్ చెయ్యడం నేర్చుకునే క్రమంలో రివర్స్ లో కూడా Z నుంచి A వరకు అక్షరాల వరస గుర్తుండిపోతుంది. ఆ తర్వాత చిన్న చిన్న మాటలు; వాక్యాలు, పేసేజ్ లు ఇవన్నీ నేర్చుకోవడానికి ఆరు మాసాలు పట్టింది. తర్వాత నిముషానికి నలభై వర్డ్స్ పదిహేను నిముషాలపాటు ఒక మేటర్ చేయడం అలవాటు చేసారు. "A quick brown fox jumps over the lazy dog", "Amazingly few discotheques provide jukeboxes" లాంటి pangrams - అంటే ఇంగ్లీషు భాషలోని అన్ని అక్షరాలూ ఉన్న వాక్యాలు - త్వరగా టైప్ చెయ్యడం అలవాటయితే కీ బోర్డ్ మీద వేళ్ళు సునాయాసంగా కావలసిన 'కీ' లను కళ్ళుమూసుకుని కూడా గుర్తించగలుగుతాయి. టైప్ మెషిన్ లోని సెగ్మంట్ సక్రమంగా పనిచేస్తున్నదీ లేనిదీ పరిక్షించడానికి ఈ "A quick brown fox jumps over the lazy dog" అన్న పేన్గ్రాం వాక్యమే 1890వ సంవత్సరం నుంచే వాడుకలో ఉందట.
సరే, తర్వాత క్రమక్రమంగా లెటర్స్ టైప్ చేయడం, స్టేట్మెంట్ లు, బ్యాలన్స్ షీట్లు టైప్ చేయడం నేర్పేవారు. ఇవన్నీ కూడా, శంకరశాస్త్రి పరిభాషలో చెప్పాలంటే ఒక నిర్దిష్టమైన పద్ధతిలో, టైపింగ్ నియమాలను పాటిస్తూ శ్రద్ధాభక్తులతో నేర్చుకోవలసినవి. ఏదో కొట్టాము అనుకోవడానికి వీలులేదు. టైప్ చేస్తున్నప్పుడు కీబోర్డ్ ను చూడకూడదు. వేళ్ళు కీబోర్డ్ మీదే వుండాలి. ఏ మేటర్ ను టైప్ చేస్తున్నామో దాని వేపే చూస్తూ టైప్ చేయాలి వంటి రూల్స్ ఎన్నో. అలా టైప్ చేయాలంటే బ్లైండ్ టచ్ ప్రాక్టీస్ కావాలనేవారు. మొదట్లో విద్యార్ధుల కళ్ళకు గంతలు కట్టి ప్రాక్టీస్ చేయించేవారని అనుకునేవారు. మాకాలం వచ్చేసరికి, మాస్టారికి వయసు కారణంగా ఓపికపోయి కళ్ళకు గంతలతో ప్రాక్టీసునుండి మేము తప్పించుకున్నాము.
ఆ ఇన్స్టిట్యూట్ లో వర్కింగ్ కండిషన్ లో పది పన్నెండు టైప్ మిషన్లు వుండేవి. పాతకాలపు అండర్వుడ్, ఒలివెట్టి , రెమింగ్టన్ , హాల్డా కంపెనీ టైప్ రైటర్స్ వరకూ చాలా రకాల టైప్ మిషన్లు వుండేవి. అప్పటికింకా గోద్రెజ్ మిషన్లు రాలేదు. రెమింగ్టన్ మిషన్లు గ్రే కలర్ లో గ్లాసీ కేబినెట్ తో వుండేవి. హాల్డా మిషన్లు బాటిల్ గ్రీన్ కలర్ లో మ్యాటీ కేబినెట్ తో వుండేవి. హాల్డా టైప్ రైటర్స్ కంపెనీ బొబ్బిలి రాజావారిది. మద్రాస్ గిండీలో రాయలా కార్పరేషన్ కంపెనీ ద్వారా హాల్డా మిషన్లు ఉత్పత్తి అయేవి.
భళ్ళమూడి గోపాలరావుగారు విద్య విషయంలో చండశాసనుడు. ఏడాదికి రెండుసార్లు టైపింగ్ ఎక్సామ్స్ లోయర్ గ్రేడ్ కు, హయ్యర్ గ్రేడ్ కు అయేవి. విద్యార్ధుల అర్హత పట్ల తనకు సంపూర్ణమైన నమ్మకం కలిగే వరకు పరీక్షకు పంపేవారు కాదు. వీక్లీ టెస్ట్ లలో నిల్ మిస్టేక్స్ తో సెంట్ పెర్సెంట్ మార్కులు వస్తేనే పరీక్షలకు పంపుతాననే వారు. అంతవరకు రాచి రంపాన పెట్టేవారు. అలాగే విద్యార్ధులకు మంచి incentives కూడా ప్రకటించేవారు. స్పీడ్ టెస్ట్ లో సెంట్ పెర్సెంట్ మార్కులు తెచ్చుకుంటే తన దగ్గరున్న టైప్ రైటర్స్ లో వారు కోరుకున్న మెషిన్ బహుమతిగా ఇచ్చేస్తానని చెప్పేవారు. అలా టైప్ మిషన్ ను గెల్చుకున్న విద్యార్ధులూ వున్నారని అనుకోవడం ఉంది. అయితే అది ఒక వెయ్యిమందిలో ఒకరో ఇద్దరో ఉంటారు అలాటి టైపింగ్ విజర్డ్స్. గోపాలరావు గారి దగ్గర టైపింగ్ నేర్చుకున్నవాళ్ళెవరూ ఫెయిల్ అయ్యారనే మాటే వుండేదికాదు. ప్రతీ ఏటా ఆయన ఇన్స్టిట్యూట్ ఫస్ట్ ర్యాంక్ లోనే వుండేది. అయితే ఆయన శిక్షణా విధానాన్ని తట్టుకోలేక కొందరు మధ్యలోనే మానేసి వెళ్ళిపోయేవారు. నేను మాత్రం ఎలాగో అలా ఆయన శిక్షణలో ఓ రెండేళ్ళు నిర్విరామంగా నేర్చుకొని టైప్ లోయర్ (40 words/minute for 15 minutes speed); హయ్యర్ (80 words/ minute for 15 minutes speed) పరీక్షలకు కట్టి ఓ అరవై, డెభ్భై శాతం మార్క్ లతో పాసయ్యాను.
ఈ పరీక్షలు మా బొబ్బిలిలో జరిగేవి కావు. అక్కడ ఎగ్జామ్స్ సెంటర్ లేదు. అందుకు విజయనగరం కానీ, విశాఖపట్నం కానీ వెళ్ళవలసి వచ్చేది. గోపాలరావుగారు తన స్టూడెంట్స్ ను పక్కనున్న విజయనగరం కాకుండా పరీక్షలకు వాల్టేర్ ( విశాఖపట్నం) తీసుకువెళ్ళేవారు. అలా నేను ఈ పరిక్షలకోసం రెండుసార్లు వైజాగ్ వెళ్ళాను. మా నారాయణమూర్తి చిన్నాన్నగారు అప్పట్లో వైజాగ్ లోనే ఉండేవారు. హాయిగా ఓ రెండు రోజులు వారింట్లో వుండవచ్చునని అనుకున్నాను. కానీ, గోపాలరావుగారు ముందే విద్యార్ధులకు కండిషన్ పెట్టారు. పరీక్ష పూర్తయేవరకూ అందరూ తన పర్యవేక్షణలో, తన ఆధీనంలోనే వుండాలి, తర్వాతే చుట్టాలు, చుట్టడాలు, సినీమాలు సరదాలు అని స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చి మరీ మమ్మల్ని వైజాగ్ తీసుకు వెళ్ళేవారు. బొబ్బిలి నుండి రాయపూర్ ప్యాసెంజర్లో ప్రయాణం. ఉదయాన్నే రైలెక్కితే నాలుగైదు గంటల తర్వాత వాల్టేర్ చేరేది. ప్యాసెంజర్ అవడం వలన డొంకినవలస, బొండపల్లి, గరుడబిల్లి, కంటకాపల్లి, సింహాచలం, గోపాలపట్నం అంటూ సవాలక్ష స్టేషన్లలో ఆగుతూ, ఎదురుగా వచ్చి పోయే ఎక్స్ప్రెస్ రైళ్ళకు దారి వదులుతూ నింపాదిగా ఒక గంట, రెండుగంటలు లేటుతో గమ్యం చేరేది. ఆనాటికి ప్యాసెంజర్ రైళ్ళలో రిజర్వేషన్లు వుండేవికావు. అందుచేత త్రొక్కిసలాటలోనే రైళ్ళు ఎక్కవలసి వచ్చేది. అసలు ప్రయాణీకులకంటే రైళ్ళలో అమ్మకాలు సాగించేవారి సంఖ్యే ఎక్కువ. శనగలు, బఠాణీలు, జంతికలు, చేగోడీలు, కోవాబిళ్ళలు, తాటిముంజెలు, సూదులు, దారాలు, మొలత్రాళ్ళు, ఘంటసాల పాటల పుస్తకాలు, వేమన పద్యాలు, బ్రహ్మంగారి తత్త్వాలు ఇలా సమస్తమూ ఈ నాలుగు గంటల ప్రయాణంలో లభించేవి. అంతేకాదు ఆరున్నర శృతిలో కొంతమంది గుడ్డివాళ్ళు ఇతరుల సాయంతో హార్మణీ వాయిస్తూనో లేక రెండు చిన్న కుండపెంకులతో చిడతలు వాయిస్తూనో ఘంటసాల పాటలు పాడుతూ రైళ్ళలో ముష్టెత్తుకునేవారు. ఈ గాయకులలో కొంతమంది వినికిడి జ్ఞానంతోనే శ్రుతిలయలు తప్పకుండా సుశ్రావ్యంగా పాడేవారు. మరికొంతమంది పాడుతూవుంటే కర్ణకఠోరంగా వుంటూ, పాట ఆపేస్తే చాలు అణావో, బేడో డబ్బులు ఇస్తాము అనే రీతిలో వుండేవి. ఇంత గోల, ఘోషల మధ్య మా వైజాగ్ ప్రయాణం సాగేది. వైజాగ్ మెయిన్ రోడ్ లోని టర్నర్స్ చౌల్ట్రిలో మా నివాసం. ఒక పెద్ద హాలులోనో, డార్మెటరీలోనో పరీక్షలకు వెళ్ళే పది పదిహేను మందికీ భళ్ళమూడి గోపాలరావుగారు బసలు ఏర్పాటు చేసేవారు. ఎప్పుడు వెళ్ళినా అక్కడే అందరూ బస చేయాలి. ఎవరి టైప్ మెషిన్లు వారే పట్టుకెళ్ళాలి. కొన్నింటిని స్థానికంగా ఏర్పాటు చేసేవారని గుర్తు.
స్టేషన్ నుండి సైకిల్ రిక్షాలలో ప్రయాణం. ఆ రోజుల్లో వైజాగ్ అంతా సైకిల్ రిక్షాలే. ఎంత దూరం అయినా అర్ధరూపాయి లోపే. అదివ్వడానికి ఓ అరగంట బేరాలు. వాదోపవాదాలు జరిగేవి. వైజాగ్ రోడ్లు పూర్తిగా ఎగుడుదిగుళ్ళుగా, ఎత్తుపల్లాలతో వుంటుంది. తప్పనిసరైతే తప్ప మానవత్వం వున్నవారెవరూ వైజాగ్ లో సైకిల్ రిక్షా ఎక్కరు. కానీ అప్పట్లో అవే ప్రయాణ సాధనాలు.
బస టర్నర్స్ చౌల్ట్రీ అయినా, పరీక్షా కేంద్రం వేరొక చోట వుండేది. పరీక్ష సమయం వరకూ గోపాలరావుగారు విద్యార్థులకు రకరకాల సూచనలు ఇస్తూ ఎంతో ప్రోత్సాహాన్ని కలిగించేవారు. ఎన్నో విషయాలు చెప్పి ఉత్సాహపర్చేవారు. పిల్లలందరిని చాలా జాగ్రత్తగా చూసుకునేవారు.
పరీక్ష హాలులో సుమారు ఏభై, అరవై మంది టైపింగ్ పరీక్ష సమరానికి సంసిద్ధంగా వుండేవారు. స్పీడ్ టెస్ట్ కు స్టార్ట్అని గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే రేసు గుర్రాల చప్పుడులా ఒకేసారి అన్ని టైప్ మిషన్లు టకటకమని గట్టిగా మ్రోగుతూంటే ఆ ధ్వనికి కొత్తవాళ్ళకి జంకూ, కంగారు పుట్టేవి. పదిహేను నిముషాలలో స్పీడ్ టెస్ట్ ముగించగలమా అని భయం పుట్టేది. అలాటి పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో ముందుగానే గోపాలరావుగారు శిక్షణ ఇచ్చేవారు. హైయ్యర్ గ్రేడ్ స్టూడెంట్స్ కు ఒక రోజు ప్రాక్టికల్స్ వుండేవి. ఎవరో వచ్చి టైప్ రైటర్ లోని భాగాల గురించి, వాటి మెకానిజం గురించి అవసరమైనవి, అనవసరమైనవీ ఏవో ప్రశ్నలు వేస్తే వాటికి సరైన సమాధానాలు చెప్పాలి. ప్రాక్టికల్స్ లోని మార్కులు కూడా కలుపుతారు.
పరీక్ష ముగిసినప్పటినుండి మర్నాడు సాయంత్రం మళ్ళీ దుర్గ్ ప్యాసెంజర్ ఎక్కేవరకు పిల్లలందరికీ ఆటవిడుపు. బంధువుల ఇళ్ళకు వెళ్ళవచ్చు, సినీమాలు చూడవచ్చు. కానీ అందరూ ప్రయాణానికి ముందు టర్నర్స్ చౌల్ట్రీ లో హాజరవాలి. అక్కడినుండి అందరూ కలిసే స్టేషన్ కు వెళ్ళాలి. నేను ముందుగా మా చిన్నాన్నగారి ఇంటికి నడిచే వెళ్ళేవాడిని. వారిల్లు ఆసీలుమెట్ట డౌన్ లో వుండేది. డాబా గార్డెన్స్ మీదుగా, ఓల్డ్ జైలు పక్కనుండి వెళ్ళవలసి వచ్చేది. అప్పట్లో పగటిపూటే మహా నిర్మానుష్యంగా వుండేది. ఇప్పుడు ఆ ప్రాంతమంతా RTC కాంప్లెక్స్, ఫ్లైఓవర్ల్, షాపింగ్ మాల్స్, సినీమా హాల్స్, త్రీస్టార్ హోటల్స్ తో క్రిక్కిరిసి ఒక పెద్ద జనారణ్యమయిపోయింది.
అలా నిర్మానుష్యంగా వుండే రోడ్లమీద ఒంటరిగా మా చిన్నాన్నగారింటికి వెళ్ళేవాడిని. ఆయన మ్యూజిక్ క్లాసెస్ డాబాగార్డెన్స్ లో. ఇల్లు ఇక్కడ. ఇంటి దగ్గరి వీణ, గాత్రం క్లాసెస్ ను మా పిన్నిగారు నిర్వహించేవారు. ఆవిడ అందరితో చాలా సరదాగా ప్రేమతో స్నేహపూర్వకంగా వుండేవారు. ఆడామగా శిష్యులంతా కాఫీ టిఫిన్లు లాగిస్తూ ఇంట్లో వ్యక్తుల్లా మసిలేవారు. వీరింటికి ఒక పక్క ఒక ఆశ్రమం, మరోపక్క కోళ్ళ ఫారమ్ ఉండేవి. ఆ వీధిలో మహా అయితే మరో రెండు ఇళ్ళు, అంతకు మించి మరేవీ ఉండేవి కావు. ఇప్పుడు ఆ ప్రాంతమంతా గుర్తుపట్టలేనంతగా మారిపోయింది.
మా చిన్నాన్నగారికి ఇద్దరమ్మాయిలు. పెద్దమ్మాయి వెంకట రాజరాజేశ్వరి ప్రసన్న జ్యోతిర్మయి. అప్పటికి ఓ పన్నెండేళ్ళు. రెండవ అమ్మాయి కిరణ్మయి. బాగా చిన్న పిల్ల అని గుర్తు. ఆ ఇంటిలోని వీణలు, సంగీత వాతావరణం మరల మా విజయనగరం ఇంటిని గుర్తుకు తెచ్చేవి. మధ్యాహ్నం మరల మా చిన్నాన్నగారు తన క్లాసులకు వెళ్ళేవరకు అక్కడ గడిపి ఆయనతోపాటే రిక్షాలో డాబాగార్డెన్స్ లోని ఆయన స్కూలుకు వెళ్ళేవాడిని. అది లీలామహల్ కు సమీపంలో వుండేది. అక్కడ కాసేపు కూర్చొని ఆయన దగ్గర సెలవు పుచ్చుకొని కె.జి.హెచ్. మీదుగా ఆ డౌన్ లో వున్న బీచ్ కు వెళ్ళేవాడిని ఆ ఏరియాలో కూడా పెద్దగా మానవ సంచారం వుండేదికాదు. అక్కడ బీచ్ లో మొండిగోడలతో ఒక గోడౌన్ లాటిది వుండేది. ఒకప్పుడది ఒక వెలుగు వెలిగిన సినీమా హాలని చెప్పగా విన్నాను. సముద్రపు ఉప్పుగాలికి ప్రొజెక్టర్లు బాగా పాడైపోవడంతో ఆ సినీమా హాలు మూతపడిందనేవారు. ఆ హాలు పేరు గుర్తులేదు.
అలా సాయంత్రం సినీమా టైమ్ అయేవరకు గడిపి తిరుగుదలలో పూర్ణాలోనో, సరస్వతీ టాకీస్ లోనో లేక లీలా మహల్ లోనో ఏదో సినీమా చూసి పక్కనే ఏదో హోటల్ లో పూరీయో , చపాతీయో తిని మెల్లగా టర్నర్స్ చౌల్ట్రీకి చేరేవాడిని. అందరు నాలాగే బయట తిరిగి రాత్రి పడకలకు అక్కడికి చేరేవారు. ఆ మర్నాడు మళ్ళి అందరం కలసి దుర్గ్ ప్యాసెంజర్లో బయల్దేరి రాత్రి పది గంటల ప్రాంతానికి బొబ్బిలి చేరేవాళ్ళం. తర్వాత కొన్ని నెలలకు టైపింగ్ ఎగ్జామ్స్ రిజల్ట్స్, మరికొన్నాళ్ళ తర్వాత సర్టిఫికెట్లు వచ్చి చేరేవి.
టైపింగ్ పరీక్షలకు ముందో, అయిన తర్వాతో పరీక్షలకు హాజరయ్యే/హాజరైన విద్యార్ధులందరితో కలసి ఒక గ్రూప్ ఫోటో దిగడం అనేది భళ్ళమూడి గోపాలరావుగారి ఆనవాయితి. సంప్రదాయం. ఆ ఫోటోలే ఆయన రికార్డ్ గా భావించేవారనుకుంటాను. ఫోటోలో తమ తమ ముఖాలు చూసుకోవాలనే ఆసక్తి కలవారి దగ్గర డబ్బులు వసూలు చేసి ఒక కాపీ ఇచ్చేవారు. అలాటి గ్రూప్ ఫోటో ఒకటి నా దగ్గరా వుంది. బహుశా టైప్ రైటింగ్ హయ్యర్ పరీక్షలనాటిదే అయివుంటుంది. ఆ గ్రూప్ ఫోటోలో సెంటర్లో గోపాలరావుగారు, ఆయనకు ముందు నేలమీద ఒక టైప్ రైటర్, గ్రూప్ అంతటికీ ఒకే ఒక అమ్మాయి, క్రిందనే కూర్చొని ఒక చిన్న కుర్రవాడు కనిపిస్తారు. ఆ పిల్లవాడు గోపాలరావుగారి మనవడు. ఉద్యోగరీత్యా ఏ ఒరిస్సాలోనో, బీహార్ లోనో వుండే అతని తల్లిదండ్రులు తెలుగు చదువుకోసం బొబ్బిలిలో తాతగారి వద్ద వుంచారనుకుంటాను. అతనిపేరు కూడా గోపాల్రావు. అందరూ గోపాల్ అని పిల్చేవారు. గోపాలరావుగారి (కూతురు కొడుకు) మరో మనమడు, చెళ్ళపిళ్ళ వేణుగోపాలరావు (మురళి) కొన్ని దశాబ్దాల తర్వాత హైదరాబాద్ లో మా మరదలు సుధారాణికి చిన్నాన్నగారు(పిన్నిగారి భర్త) గా నాకు పరిచయం అయ్యారు. అలాగే మరో వ్యక్తి బొబ్బిలి గుమ్మావారి అబ్బాయి ప్రభు. ఆయన తల్లి అమ్మన్నగారు, అన్న విశ్వనాధంగారు, అక్క సుగుణ మా అమ్మమ్మగారికి, దొడ్డమ్మగారికి అతి సన్నిహిత మిత్రులు. శ్రేయోభిలాషులు. ఎవరికి తెలియని సుందరి పేరుతో మా అమ్మగారిని (శ్రీలక్ష్మి) పలకరించే ఆత్మీయులు. ఆయన మరో సోదరుడు, గుమ్మా ప్రసన్నకుమార్ మా సుధారాణికి చిన్నాన్నగారు (మరో పిన్నిగారి భర్త)గా పరిచయం అవడం మరో విశేషం. అదే ఆశ్చర్యం. ఎక్కడ వాళ్ళు, ఎప్పుడు, ఎక్కడ, ఎలా కలుస్తారో కదా!
సందర్భం వచ్చింది కనుక, ఈ నా 35, ఉస్మాన్ రోడ్ ని కేవలం చదువరులకు ఒక వ్యాససంపుటిగానే కాకుండా, శబ్ద, దృశ్య చలనచిత్రమాలికగా చిత్ర, విచిత్రంగా, శోభాయమానంగా సమర్పిస్తున్న మా సుధారాణికి నా శుభాశీస్సులు.
ఈ వారపు ఈ విషయాలన్నీ, డిగ్రీ చేతికి వచ్చాక మద్రాస్ మహానగరంలో నెం.35, ఉస్మాన్ రోడ్ నుంచి నేను మొదలుపెట్టబోయే ఉద్యోగపర్వానికి నాంది ప్రస్తావన.
ఆ విశేషాలలోకి వెళ్ళబోయేముందు ఈ వారపు సినీమా చూద్దాము. సంగీత దర్శకుడిగా, గాయకుడిగా ఘంటసాల మాస్టారి సంగీత ప్రతిభకు గీటురాయి "రహస్యం ". ఉన్నత సంగీత సాహిత్యాలకు సమున్నత స్థానం కల్పించిన చిత్రం 'రహస్యం'. సత్త్వ, రజస్తమో గుణాలకు ప్రతీకలుగా నిలిచే పలువురు వ్యక్తుల మధ్య జరిగిన పోరాటమే "రహస్యం " చిత్రకథ.
తాత్త్విక, వేదాంత విషయ పరిజ్ఞానం లేని సామాన్య ప్రేక్షకులకు ఈ సినీమా ఒక రహస్యంగా మారింది. తత్ఫలితం, రహస్యం అపజయం పాలయింది. లలితా శివజ్యోతి ఫిలింస్ అధినేత ఎ.శంకరరెడ్డి గారు ఒక సంచలన వ్యక్తి. విద్యాధికుడు, విలక్షణమైన వ్యక్తి. ఇరవై ఏళ్ళకు పైగా చిత్రసీమలో వున్నా ఆయన తీసిన సినీమాలు ఐదే . అవి - చరణదాసి, లవకుశ (తెలుగు, తమిళం), రహస్యం , సతీ సావిత్రి. అన్ని పంచవర్ష ప్రణాళికా చిత్రాలే.
లవకుశ సినీమా కోట్లు వసూలు చేసినా అందులో ఒక పైస కూడా నిర్మాతగా శంకరరెడ్డి గారికి దక్కలేదు. ఫైనాన్స్ చేసి నెగెటివ్ రైట్స్ కొనుకున్న సుందర్లాల్ నహతా బాగుపడ్డారు. తర్వాత వెంచర్ గా శంకరరెడ్డి రహస్యం మొదలుపెట్టారు. హీరోగా జానపదాలకు తిరుగులేని హీరో ఎన్టీఆర్ నే బుక్ చేసి వుండవచ్చును. కానీ, శంకరరెడ్డిగారికి జ్యోతిషం మీద, అంజనాల మీద నమ్మకం ఎక్కువ. ఆ కారణంగా, జ్యోతిష్కుల సలహా ప్రకారం అంజనం వేయించి అందులో వచ్చిన వారి పేర్ల ప్రకారం ముఖ్య నటీనటులను, ముఖ్య సాంకేతిక వర్గాన్ని ఎంపిక చేశారట. అలా ఎంపిక అయినవారేనట మన ఘంటసాల మాస్టారు, అక్కినేని, రంగారావు, గుమ్మడి, మరికొందరు. రహస్యం సినీమాను రంగులలో మొదలెట్టారు. వెంపటి సదాశివబ్రహ్మంగారు రహస్యం సినీమాకు కథ, మాటలు, కొన్ని పాటలు , పద్యాలు సమకూర్చారు. ఆయన పండితుల కోవకు చెందిన రచయిత. సినీమారంగంలో ఆరితేరిన కవి. మల్లాది రామకృష్ణ శాస్త్రిగారు, సముద్రాల రాఘవాచార్యులవారు, సి.నారాయణరెడ్డిగారు, ఆరుద్రగారి వంటి ఉద్దండులు అద్భుతమైన పాటలు వ్రాశారు. వాటికి ఘంటసాలవారు సమకూర్చిన సంగీతం అసామాన్యం. అజరామరం. మరి పాడిన వారంతా శాస్త్రీయ సంగీతంలో నిష్ణాతులే. ఘంటసాల, పి.సుశీల, లీల, కోమల, మల్లిక్, మాధవపెద్ది, వైదేహి, సరోజిని యిత్యాదులు రహస్యం చిత్రంలోని పాటలకు ప్రాణప్రతిష్ట చేశారు. అక్కినేని, ఎస్.వి.రంగారావు, గుమ్మడి, కాంతారావు, నాగయ్య, రమణారెడ్డి, రేలంగి, హరనాథ్, రాజనాల, బి.సరోజాదేవి, కృష్ణకుమారి, జి.వరలక్ష్మీ, సూర్యకాంతం, అంజలీదేవి, గిరిజ, గీతాంజలి అంటూ తెలుగు సినీమా అతిరథ, మహారథులంతా రహస్యం సినీమా తారాగణం. పి.ఎల్.రాయ్ కెమేరామన్. వెంపటి పెద సత్యంతో పాటు నృత్య దర్శకత్వం, దానితోపాటు చిత్రదర్శకత్వం కూడా వహించారు వేదాంతం రాఘవయ్య.
'రహస్యం' సినీమా రీరికార్డింగ్ జరిగినన్నాళ్ళు నేను స్టూడియోకు వెళ్ళేను. కాంతారావు, నాగేశ్వరరావులు పాల్గొన్న ఔట్ డోర్లో జరిగిన యుధ్ధం దృశ్యాలు, ఎస్.వి.రంగారావు అమ్మవారి పాదాల క్రింద వున్న సొరంగ మార్గంలోకి వెళ్ళడం, అక్కడ వున్న పరాశక్తిని పూజించే సమయాలలో ఉపయోగించిన ఎఫెక్ట్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ నాకెంతో థ్రిల్లింగ్ గా అనిపించింది.
రహస్యం చిత్రానికి పెద్ద ఆస్తి, అస్తిత్వం సంగీతమే. రహస్యం సినీమాలో సాహిత్యం, సంగీతం పోటాపోటీగా నడిచాయి. ముఖ్యంగా మల్లాది, సదాశివ బ్రహ్మంగార్ల సాహిత్యం (సామాన్య ప్రేక్షకుల స్థాయికి మించినది), వాటికి ఘంటసాలవారు సమకూర్చిన సంగీతం అనితరసాధ్యం.
ఈ సినీమాలోని పాటలను, గిరిజాకళ్యాణం యక్షగానాన్ని విన్న సుప్రసిద్ధ దాక్షిణాత్య సంగీత విద్వాంసుడు శ్రీ చిత్తూర్ సుబ్రహ్మణ్యం పిళ్ళై గారు 'సినిమాలలో శుద్ధ శాస్త్రీయ సంగీతం లేదని ఎలా అంటారు' అని వ్యాఖ్యానించారు. 'లలితభావ నిలయ', 'శ్రీ లలిత శివజ్యోతి సర్వకామదా', 'సాధించనౌనా జగానా', 'మగరాయా వలరాయా', 'ఉన్నదిలే దాగున్నదిలే', మొదలైన పాటలలో సంగీతం రసవాహినిగా సాగింది. రాగమాలిక 'లలిత భావ నిలయ' గీతానికి రాగ నిర్దేశం చేసినది మల్లాది వారైనా ఆ సరస్వతి, లలిత, శ్రీ రాగాలను శాస్త్రీయ నృత్యానికి అనుగుణంగా శ్రవణానందంగా మలచడంలో ఘంటసాలవారి సంగీత విద్వత్తు ద్యోతకమవుతుంది.
రహస్యం చిత్రంలో రమణారెడ్డికి మాస్టారు పాడిన వేదాంత తత్త్వాలు ఎంతైనా కొనియాడతగ్గవి. అలాగే, గుమ్మడి, అక్కినేని, కాంతారావు, హరనాథ్ లకు మాస్టారు, మాధవపెద్ది పాడిన పద్యాలు ఎంతో ఔన్నత్యాన్ని సంతరించుకున్నాయి. అక్కినేని, రమణారెడ్డి, కాంతారావు, హరనాథ్, గుమ్మడి వీరి హావభావాలకు తగినట్లుగా తన గాత్రాన్ని మలచుకోవడంలో గాయకుడిగా ఘంటసాలవారి ప్రతిభ, వైవిధ్యం సుస్పష్టమయ్యాయి.
'రహస్యం' చిత్రానికి మకుటాయమానం మల్లాది రామకృష్ణ శాస్త్రిగారు వ్రాసిన 'గిరిజాకళ్యాణం యక్షగానం'. ఈ యక్షగానానికి వున్నంత చరిత్ర మరే సినిమా పాటకు లేదు.
గిరిజాకళ్యాణం వైశిష్ట్యం గురించి సుప్రసిధ్ధ విశ్లేషకులు ఎందరో ఎంతగానో వర్ణించి చెప్పేరు. నేను కూడా లోగడ నా పరిజ్ఞానం మేరకు వ్రాసేను. ఎన్నో సుమధుర రాగాల సమాహారం " గిరిజాకళ్యాణం" కూచిపూడి యక్షగానం. ఘంటసాలవారి అద్వితీయ సంగీత ప్రతిభ , వేదాంతం రాఘవయ్యగారి నాట్యశాస్త్ర ధురీణత్వం ఈ పదమూడు నిముషాల సంగీత, నృత్య రూపకంలో అణువణువునా గోచరిస్తాయి.
కురంజి, హంసధ్వని, మధ్యమావతి, కాంభోజి, అఠాణా, కేదారగౌళ, వసంత, రీతిగౌళ, శహన, సరస్వతి, హిందోళ, నాదనామక్రియ, కానడ, సామ, సౌరాష్ట్ర వంటి శాస్త్రీయ రాగాలను అతి సమర్ధవంతంగా, సందర్భానుసారంగా ప్రయోగించారు ఘంటసాల.
సినీమా ప్రపంచంతో సంబంధంలేని కూచిపూడి కళాస్రష్టలు కోరాడ నరసింహారావు, వేదాంతం సత్యనారాయణ శర్మ, వేదాంతం రత్తయ్యశర్మ, భాగవతుల యజ్ఞనారాయణ శర్మ, మొదలైన వారితో సినీ నటీమణులు బి.సరోజాదేవి , గీతాంజలి కూడా ఈ అపూర్వ కూచిపూడి నృత్య నాటకంలో పాల్గొన్నారు.
మన భారతీయ నృత్యకళా వైశిష్ట్యాన్ని ఈ గిరిజాకళ్యాణం ద్వారా విదేశాలలో ప్రచారం చేయాలనేది నిర్మాత శంకరరెడ్డిగారి అభిలాష. అందుకే ఎంతో వ్యయప్రయాసలకు ఓర్చి ఈ రహస్యం చిత్రాన్ని, గిరిజాకళ్యాణం నృత్య రూపకాన్ని తయారు చేశారు. ఘంటసాలవారు తన శాయశక్తులా కష్టపడి రహస్య చిత్ర సంగీతానికి చిరంజీవత్వం కల్పించారు.
శ్రీ మల్లాది రామకృష్ణ శాస్త్రిగారు ఈ గిరిజా కళ్యాణాన్ని ఎప్పుడు వ్రాసారో సరిగ్గా తెలియదు కానీ , ఇది ఆయన వ్రాసిన 'కేళీ గోపాలమ్' అనే పుస్తకంలో వుండేది. ఆ భాగాన్ని 1963 ప్రాంతాలలో వివి రాఘవయ్యగారి 'జ్యోతి' మాస పత్రికలో ప్రచురితమయింది. ఆ తర్వాతే శ్రీ శంకర రెడ్డిగారు తన 'రహస్యం' చిత్రానికి ఒక యక్షగానం కావాలని శ్రీ మల్లాదివారిని సంప్రదించినప్పుడు ఈ గిరిజా కళ్యాణాన్ని ఇవ్వడం జరిగింది.
ఈ గిరిజా కళ్యాణం యక్షగానం మన సంగీత నృత్యరీతులకు ఒక దర్పణంగా, కలకాలం ఒక మార్గదర్శిగా నిలిచిపోవాలని, ఆ నృత్య రూపకాన్ని భారతీయ సంస్కృతి లో భాగంగా విదేశాలలో ప్రచారం చేయాలని భావించిన నిర్మాత శంకరరెడ్డిగారు, సంగీత దర్శకుడు ఘంటసాలవారు, చిత్రానికి దర్శకత్వం, నృత్య దర్శకత్వం బాధ్యత లు చేపట్టిన వేదాంతం రాఘవయ్యగారు అనేక వ్యయ ప్రయాసలకు ఓర్చి తమ విద్వత్ ను అంతా ధారపోసి రూపొందించిన కళాఖండం గిరిజా కళ్యాణం. ఇచ్చిన కథావస్తువును యథాతథంగా కంపోజ్ చేసినప్పుడు 25 నిముషాలకు పైనే వచ్చింది. మధ్య మధ్యలో బ్యాక్ గ్రౌండ్స్ తో కలిపి అరగంట వరకు వచ్చింది. ఒక్క నృత్య సన్నివేశానికే అరగంట సేపు వెచ్చిస్తే సినీమాలో టెంపో తగ్గుతుందని, ప్రేక్షకులకు అసహనంగా వుంటుందని భావించి మరల సాహిత్యాన్ని కుదించి పధ్నాలుగు పదిహేను నిముషాలకు తయారు చేసి ఫైనలైజ్ చేశారు. అదే సినీమాలో పెట్టారు. కానీ మన దురదృష్టం 'గిరిజా కళ్యాణం' యక్షగానం ఇప్పుడు మనకు లభిస్తున్న "రహస్యం' ప్రింట్లలో అలభ్యంగానే వుంది.
ఇప్పుడు రంగులు వెలిసిపోయి మనకు కనిపిస్తున్న ఈ నృత్య సన్నివేశం అతి దుర్లభంగా ఎంతో కష్టపడి వెదికిన పిమ్మట లభించినది. దాదాపు ఓ పదిహేడేళ్ళ క్రితం డా. వెంపటి చిన సత్యంగారి ఆధ్వర్యంలో కూచిపూడి నాట్యోత్సవాలు ఒక వారం పాటు వారి స్వగ్రామం కూచిపూడిలో అతి ఘనంగా జరిగాయి. అందులో ఒక రోజు కూచిపూడి నాట్యంలో నిష్ణాతుడైన శ్రీ వేదాంతం రాఘవయ్యగారి సంస్మరణకు కేటాయించారు. ఆనాడు వారి ప్రతిభను కొనియాడుతూ ఏదైనా ఒక చిత్రం చూపించాలని నిర్ణయించినప్పుడు రహస్యంలోని గిరిజాకళ్యాణం దృశ్యాన్ని తెరమీద చూపాలని సంకల్పించారు. కానీ అది ఎక్కడా దొరకలేదు. అప్పుడు కూచిపూడికి చెందిన దండిభొట్ల శ్రీనివాస శాస్త్రిగారు ఎన్నిచోట్లో వెతికి వెతికి చివరకు విజయవాడలో ఏదో ఒక ఫిలిం డిస్ట్రిబ్యూషన్ కంపెనీలో వున్నట్లు తెలుసుకొని, మొత్తం మీద దానిని శోధించి, సాధించి అనుకున్న సమయానికి కూచిపూడి నాట్యోత్సవాలలో తెరపై ప్రదర్శించారు. పిక్చర్ క్వాలిటీ అందరినీ నిరాశపర్చినా అందులోని సంగీత, నృత్యాలకు అందరూ ముగ్ధులయ్యారు. ఆ ప్రింటే ఇప్పుడు మనకు యూట్యూబ్ లో కనిపిస్తున్నది.
ఘంటసాల మాస్టారు ఈ సినీమా రిలిజ్ కు ముందే తన కచేరీలలో ఈ గిరిజా కళ్యాణం మొత్తం 25 నిముషాల వెర్షన్ గానం చేసేవారు. స్థలాన్నిబట్టి, ప్రేక్షకుల మనోభావాలను అనుసరించి గిరిజాకళ్యాణాన్ని మొత్తం పాడడమో, తక్కువ చేసి పాడడమో చేసేవారు. అలా ఘంటసాలవారు అతి తక్కువగా రెండు మూడు వాద్యాలతో, మా నాన్నగారు శ్రీ పట్రాయని సంగీతరావుగారు హార్మోనియం, గాత్ర సహకారం అందిస్తూండగా, కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ పరమాచార్యుల వారి సమక్షంలో హైదరాబాద్ లో గానం చేసారు.
అప్పుడు రికార్డ్ చేసి, ఎడిట్ చేసిన అసంపూర్ణ భాగాన్ని ఆలిండియా రేడియో వారు వారి సమయానుకూలంగా వారి తెలుగు కేంద్రాలనుండి ప్రసారం చేసేవారు. అలాగే, పుట్టపర్తి సాయిబాబా, తదితర మఠాధిపతుల సమక్షంలో సమయం సందర్భాన్నిబట్టి ఈ గిరిజాకళ్యాణంలోని కొన్ని భాగాలను ఘంటసాలవారు గానం చేసేవారు. అయితే మొత్తం గిరిజాకళ్యాణం ఎక్కడా రికార్డ్ చేయబడలేదు.
ఈ గిరిజాకళ్యాణం మొత్తం కంపోజింగ్ నొటేషన్స్ మా నాన్నగారు శ్రీ సంగీతరావుగారి జిహ్వాగ్రంమీద, ఆయన మస్తిష్కంలోనే నిక్షిప్తమైపోయాయి. అంత ఘన చరిత్ర కలిగిన ఏకైక సినీమా గీతం 'రహస్యం' లోని గిరిజా కళ్యాణం కూచిపూడి యక్షగానం. ఇంత శ్రమపడి రూపొంచిన ఒక అపూర్వమణి సినీమా అపజయం పాలైన కారణంగా మరుగున పడిపోవడం చాలా దురదృష్టం.
విజయవంతమైన అనేక జానపద చిత్రాలకేమీ తీసిపోని చిత్రం రహస్యం. అయినా ప్రేక్షకాదరణకు నోచుకోకపోవడం ఒక రహస్యం. ఏ సినీమా ఎందుకు విజయవంతమవుతుందో, ఎందుకు ఫెయిల్ అవుతుందో ఎవరికీ అంతుపట్టని రహస్యం. అసలు తెలుగు సినీమా ప్రేక్షకుల అభిరుచి, మనస్తత్త్వమే ఒక పెద్ద రహస్యం.
ఏమైనా గిరిజా కళ్యాణం వంటి అపూర్వ సంగీత నృత్యనాటకం మొత్తం దృశ్యరూపం అందుబాటులో లేకపోవడం నిజంగా తెలుగువారి దురదృష్టమే. ఘంటసాలవారి నిజమైన అభిమానులంతా ఈ గిరిజా కళ్యాణం కూచిపూడి నృత్యనాటకాన్ని విస్తృతంగా ప్రదర్శింపజేసి, ప్రచారం చేసి ఘంటసాలవారి పట్ల తమకు గల అభిమానాన్ని, గౌరవాన్ని చాటుకోవాలి. రానున్న శతజయంతి ఉత్సవాలలో ఘంటసాలవారి గిరిజా కళ్యాణానికి ఉన్నతస్థానం తప్పక కల్పించేలా కృషిచేయాలి. అదే ఈ శతాబ్ది గాయకునికి అర్పించగల గొప్ప నివాళి.
ఘంటసాలవారి కి సంబంధించిన మరిన్ని పాటల విశేషాలతో.... వచ్చే వారం...
...సశేషం
*With a view to make the narrative more authentic and to corroborate it, images, audio and video clips are attached at appropriate places. If such usage is found objectionable to the copyright holders the same shall be removed if and when notified.
6 comments:
చాలా ఓపికగా మీ అనుభవాలను వివరిస్తున్నందుకు ధన్యవాదాలండి
ఆ ప్రాంతాలూ, ఆనాటి వ్యక్తులూ, వాతవరణమూ అంతో ఇంతో పరిచయం ఉండడంతో, నీ అనుభవాలూ, జ్ఞాపకాలతో తాదాత్మ్యం చెంది,ఆరోజుల్లోకీ, ఆసన్నివేశాల్లోకీ సులభంగా ప్రయాణించి చక్కర్లు కొట్టిన రాగలుగుతున్నాం అన్నయ్యా.
అంత సునాయాసంగా మమ్మల్ని ఆ రోజులకి తీసుకుపోయి యథాతథంగా ఆసమాజాన్ని కనులకు కట్టించిన నీ రచనా సామర్ధ్యాన్ని ఆనందంతో మననంచేసుకుంటున్నాను.
�� మీ జ్ఞాపకాల మాలిక మాతో పంచుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నాం సర్! మీ టైప్ రైటింగ్ జ్ఞాపకాలతో (కొట్టడం-నేర్పడం) మేం చదువుకున్న రోజుల్లో మా టైప్ రైటింగ్ మిత్రుల, టీచర్ల పరిచయాన్ని గుర్తుకు తెచ్చింది. నేను టైప్ రైటింగ్ నేర్చుకోకపోయినా...బ్యాంకులో చేరిన తరువాత Leave letters టైప్ చేయడానికి సింగిల్ ఫింగర్ టైపింగ్ తో మొదలై....ఆఫీసరైన తరువాత టైపిస్ట్ మీద depend కాకుండ హెడ్ ఆఫీస్ లెటర్స్ అన్నీ స్వంతంగా టైప్ చేయడం( రెండు వేళ్ళ టైపింగ్...ఒకటి ఎడమ, మరోటి కుడి����) మొన్న మొన్న రిటైర్ అయ్యేవరకు కంప్యూటర్ టైపింగ్.....భలే అనుభవాలు! ఓరకంగా టైపిస్ట్ కన్న వేగంగానే టైప్ చేయగలిగాను!!
�� ఇక సంగీత, సాహిత్య విషయాలతో పరిపుష్టంగా వున్న ‘ రహస్యం’ సినిమా పుట్టు పూర్వోత్తరాలన్నీ మా కళ్ళకు కట్టారు! ఈ సినిమా రిలీజ్ ఐనపుడు నేను ఎనిమిదో తరగతి చదువుతున్నా! బహుశః అప్పటి సగటు ప్రేక్షకునికి ..పన్నెండేళ్ళ కుర్రాడిగా నాకున్న పరిజ్ఞానం కూడ లేకపోవడం వల్లనేమో...అంత గొప్ప చిత్రం పరాజయం పొందింది! మీరన్నట్లు తెలుగు ప్రేక్షకుని నాడి తెలుసుకోవడం....అతని అభిరుచిని అంచనా వేయడం కష్టమేమేమో....ఎందుకంటే అదంతా ఓ రహస్యం కాబట్టి! ��
కాని హేమాహేమీలు కలసి పనిచేసిన ఈ చిత్రరాజం ఇప్పుడు అలభ్యమవడం తెలుగు వారిగా మన దురదృష్టం! ఇప్పటికీ మేము ఆ సినిమా పాటలు, గిరిజాకళ్యాణం విని ఆస్వాదిస్తూనే వున్నాం! మీరు చివర్లో ఇచ్చిన “ కంచి పరమాచార్యుల వారి సమక్షంలో” గిరిజాకళ్యాణం ఆలాపన వీడియో బహు అరుదైనది. ఈ వీడియో చూడగలగడమూ మా అదృష్టమే!
��వచ్చే మీ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తూ....ధన్యవాదాలతో������
నా ఈ ధారావాహిక ను చదువుతూ ప్రోత్సహిస్తున్న మీ అందరకూ నా కృతజ్ఞతాభివందనాలు.
చాలా చక్కగా వ్రాశారు.మా తాతగారు భళ్ళ మూడి గోపాలరావు గురించి చాలా బాగా వ్రాశారు..మాకు బొబ్బిలి తో వున్న అనుబంధం పాత జ్గ్యాపకాలను బాగా గుర్తు చేసినందుకు ధన్యవాదాలు...🙏🙏🙏
మీరు ఈ వ్యాసం లో అన్నట్టు గిరిజా కళ్యాణం కూచిపూడి నృత్య నాటకాన్ని విస్తృతంగా ప్రదర్శించి, రానున్న ఘంటసాల గారి శత జయంతి ఉత్సవాలలో గిరిజా కళ్యాణానికి సమున్నత స్థానం కల్పించేలా చేయగలిగితే అటు కూచిపూడి నాట్యానికి, ఇటు ఈ శతాబ్ది గాయకుడు ఘంటసాలగారికి మనం న్యాయం చేసినవారమౌతాము. ఆ దిశగా పెద్దలు, కళాకారులు తమ ప్రయత్నం మొదలుపెడతారని ఆశిద్దాం.
Post a Comment