visitors

Sunday, July 25, 2021

నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 2 - నలభై ఒకటవ భాగం

25.07.2021 -  ఆదివారం భాగం - 41*:
అధ్యాయం 2 భాగం 40  ఇక్కడ

  

నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్

"అందరూ పది కాలాలపాటు పచ్చగా, చల్లగా వుండాలి"; "పది కాలాల పాటు నే పాడిన పాటలు ప్రజల హృదయాలలో నిలిచిపోవాలి"; "ప్రజాభిమానంతో పదికాలాల పాటూ పాడుతూనే వుండాలి"; "పాడగలిగినంత కాలమే బ్రతికి వుండాలి". ఈ "పది కాలాల పాటు" అనే మాట తరచూ  ఘంటసాలవారి సంభాషణలలో దొర్లేది. 

ఒక్క ఆయుర్దాయం విషయంలో తప్ప మిగిలినవి మాస్టారు కోరుకున్నవి నెరవేరాయి. ఘంటసాలవారి దేవగానం శతాధిక వర్షాలు ప్రజల చెవులలో మార్మోగుతూనే వుంటాయి. కాలానికి కనీసం పది సంవత్సరాలు చొప్పున పది కాలాలకు పది పదులు నూరు సంవత్సరాలైనా వారు మన మధ్యలో వుండివుండాల్సింది. కానీ ఆ భగవంతుడు ఈ లోకంలో సగం ఆయుర్దాయమే యిచ్చి ఇక నిరంతరం నా సమక్షంలోనే గానం చేయమని తీసుకుపోయాడు.

ఘంటసాల అనే గాన గంధర్వుడు మన కోసం పాడింది సుమారు నాలుగు దశాబ్దాలే అయినా అనిర్వచనీయమైన అనుభూతిని మనకు మిగిల్చి వెళ్ళిపోయారు. 

1967 లో ఘంటసాల మాస్టారు పాడిన అజరామర గీతాలెన్నో. అవి స్వీయ సంగీతంలో కావచ్చు, లేదా ఇతర సంగీత దర్శకులకు కావచ్చు, ఏక గళం కావచ్చు, యుగళం కావచ్చు లేదా బృందగానాలు కావచ్చు. ఆ పాటలన్నీ ఈ నాటివరకు మనలో ఉత్తేజాన్ని, చైతన్యాన్ని, స్ఫూర్తిని కలిగిస్తున్నాయి. కొన్ని పాటలు గిలిగింతలు పెట్టి కవ్విస్తాయి. మరికొన్ని ఉదాత్తమై మనలో ఆలోచనలు రేకిత్తిస్తాయి. మరెన్నో పాటలు లాలించి, బుజ్జగించి జోకొడతాయి. ఒక గాయకుడు ఇన్ని రకాలుగా ప్రజా హృదయాలలో ఇన్ని కాలాలపాటు నిలిచిపోవడమనేది ఘంటసాలగారి వంటి దైవాంశసంభూతులకే సాధ్యం. స్థలాభావం వలన అన్నీ కాకపోయినా కొన్నిటిని, (గత వారాలలో తలచుకున్నవి కాకుండా) ఘంటసాలవారు 1967 చిత్రాలలో పాడిన పాటలు నా మనస్సుకు హత్తుకుపోయినవి మీ ముందు వుంచుతున్నాను. 

'గృహలక్ష్మి' లో భానుమతి గారితో పాడిన పాట 'వినవే ఓ ప్రియురాలా';

ఉమ్మడి కుటుంబం - సుశీలగారితో ' చెప్పాలని వుంది';
ఆ సినీమాలోనే తిలకం, మాధవపెద్దిలతో పాడిన సతీ సావిత్రి, లంకా దహనం  నాటకంలో పద్యాలు. వీధి నాటకాలు, వీధి భాగవత ప్రక్రియలలో ఘంటసాల మాస్టారికి గల పరిపూర్ణ అవగాహన మనకు తెలుస్తుంది.

'ప్రాణమిత్రులు' - సుశీల గారితో 'ఈ పాపం ఫలితం ఎవ్వరిది'

'చదరంగం' - ' బంగరు బొమ్మ సీతమ్మా';  అందులోనిదే మరో పాట సుశీల గారితో 'నవ్వని పువ్వే నవ్వింది';

'సరస్వతి శపధం' - 'రాణి మహారాణి రాశి గల రాణి'; 'విద్యయా, విత్తమా, వీరమా';

'భామా విజయం' - సుశీలగారితో ' రావే చెలీ నా జాబిలీ'

'మరపురాని కథ' - 'నూటికొక్క మనసే కోవెల'

'పెళ్ళంటే భయం' -  సుశీల గారితో ' చంద్రోదయం ఒక పిల్లయినదో'; 

'అగ్గిదొర' లో' సుశీల గారితో 'ఎందున్నావో ఓ చెలీ';
'పూలరంగడు' లో - ' నీతికి నిలబడి'; 'వినరా భారత వీరసోదరా' బుర్రకధ;

'ఆడపడుచు' లో పద్మనాభానికి పాడిన 'రిక్షావాలాను నేను పక్షిలాగ';

అల్ట్రా మోడర్న్ సినీమా 'అవే కళ్ళు' లో' - 'మా వూళ్ళో ఒక పడుచుంది'; ' ఎవరు నీవారో తెలుసుకోలేవో'; 'ఎంతటి అందం విరిసే ప్రాయంలో'; 'ముద్దులొలుకు చిన్నది'

(ఈ చిత్రంలోని పాటలను, తర్వాత వచ్చిన మరికొన్ని చిత్రాలలోని పాటలను ఘంటసాల మాస్టారు కొంత అయిష్టతతోనే పాడారు. రికార్డింగ్ ముగిసి ఇంటికి రాగానే ఆ పాటల కాగితం చివరను రెండు వేళ్ళతో  పట్టుకొని సావిత్రమ్మగారికి అందించిన తీరు నాకెందుకో బాగా గుర్తుండిపోయింది.   ట్రెండ్ మారుతోందని సినీమా సంగీతంలో, సాహిత్యంలో మార్పులొస్తున్నాయని బాధపడేవారు. ఈ రకమైన పాటలు కొత్త గాయకులు చేత పాడిస్తే బాగుండునని అనేవారు.);

'చిక్కడు దొరకడు' - పిబి శ్రీనివాస్ గారితో 'ఔరా వీరాధివీరా'; సుశీల గారితో 'పగటిపూట చంద్రబింబం';  విడతోనే మరో డ్యూయెట్ 'దోర నిమ్మపండులాగా' వంటి పాటలు మనకింకా వీనులవిందు చేస్తూనే వున్నాయి.ఆ సంవత్సరంలోనే వచ్చిన మరో మహత్తర పౌరాణిక చిత్రం - 'శ్రీకృష్ణావతారం' - గాయకుడిగా ఘంటసాలవారి విశ్వరూప దర్శనం ఈ చిత్రంలో కలుగుతుంది. దాదాపుగా నలభై వరకు పాటలు, పద్యాలు, శ్లోకాలు గల ఈ చిత్రంలో ప్రధాన పాత్ర ఘంటసాల మాస్టారిదే. 'జయహే కృష్ణావతారా'; 'నీ చరణ కమలాల నీడయే చాలు';  'జగములనేలే గోపాలుడే'; వంటి యుగళగీతాలు వైవిధ్యం తో కూడిన పాటలు.


'తాళలేనే నే తాళలేనే ' అనే కూచిపూడి దరువు వింటూవుంటే నిజంగా కూచిపూడి భాగవతులే వచ్చి పాడుతున్న అనుభూతిని ఘంటసాలవారు కలిగించారు. కూచిపూడి శైలి పట్టు, విరుపులు వారి కంఠంలో చాలా ఖచ్చితంగా ఒదిగిపోయాయి. ఏ ప్రక్రియను చేపట్టినా అది వారికే సొంతం అనే భ్రమను ఒక్క పామరుల్లోనే కాక సంగీతపు లోతుపాతులు తెలిసిన రసజ్ఞులలోనూ కలిగించిన అపూర్వ గాయకుడు మన ఘంటసాల.

శ్రీకృష్ణావతారం చిత్రంలో ప్రముఖ పాత్ర పద్యాలదే. అందుకుగాను తిరుపతి వెంకటకవులు వ్రాసిన 'పాండవోద్యోగవిజయాలు' నాటకంలోని పద్యాలనే ఉపయోగించారు. పాండవోద్యోగవిజయాలు రంగస్థల నాటకం తెలుగువారికి అత్యంత ప్రీతిపాత్రమైనది. సినీమాలు అభివృద్ధి చెందడానికి ముందు తెలుగువారిని అత్యంత ప్రభావితులను చేసింది పౌరాణిక నాటకం , పౌరాణిక నాటక నటులే. మరాఠీ రంగస్థల బాణీనే ఎక్కువగా అనుకరించేవారు. తిరుపతి వెంకట కవుల నాటక పద్యాలు చదవని తెలుగువాడే ఉండేవాడు కాదు. ఘంటసాల రంగప్రవేశం చేసేవరకూ నాటక నటులే సినీమాలలో కూడా ఆయా పాత్రలు ధరించి రంగస్థల నాటకశైలిలోనే పద్యాలు చదివేరు. ప్రజలంతా కూడా తన్మయులై విన్నారు. ఎప్పుడైతే ఘంటసాల నోట నవ్యత్వంతో కూడిన శ్రావ్యమైన, భావయుక్తమైన పద్యం వెలువడిందో అప్పటినుండి నవశకం ఆరంభమయింది. అదే ఘంటసాల యుగం. ఘంటసాల పాట పాడినా, పద్యం పాడినా, హరికథ చెప్పినా, బుర్రకథ చెప్పినా, కూచిపూడి దరువులు పలికినా అది అద్వితీయంగా, అప్రతిహతంగా తెలుగువారిని పరవశులనుజేసింది. ఘంటసాలకు ప్రత్యమ్నాయ గాయకుడు లేడు, రాబోడు అనే ఖ్యాతిని ఘంటసాల మూటకట్టుకున్నారు.

అందుకే, శ్రీకృష్ణావతారం వంటి భారీ పౌరాణిక చిత్రంలోని ముఖ్యమైన పద్యాలన్నీ కోరి మరీ ఘంటసాలవారిని వరించాయి. 

శ్రీకృష్ణావతారం చిత్ర నిర్మాత అట్లూరి పుండరీకాక్షయ్యగారు. ఎన్.టి.రామారావుగారి బావమరది. గతంలో నర్రా రామబ్రహ్మంగారితో కలసి 'మహామంత్రి తిమ్మరుసు' వంటి బ్రహ్మాండమైన చారిత్రాత్మక చిత్రం నిర్మించి చరిత్ర సృష్టించారు. ఆ చిత్ర విజయంలోనూ ఘంటసాలవారికి భాగస్వామ్యం వుంది.

పుండరీకాక్షయ్యగారు స్వయంగా మాస్టారింటికి వచ్చి తాను సొంతంగా 'శ్రీకృష్ణావతారం' చిత్రం నిర్మిస్తున్నానని అందులో సంగీతానిదే, ముఖ్యంగా, పద్యాలదే ప్రముఖ పాత్రయని, ఆ ప్రముఖ పాత్రను మాస్టారే వహించాలని కోరారు. ఆయన మాస్టారి కాల్షీట్లు అడిగిన సమయానికి మాస్టారికి కొంచెం జలుబు చేసి గొంతు సరిలేకుండా వుంది. అందువలన ఆ డేట్స్ లో కాక మరికొన్నాళ్ళ తర్వాత ఆ పద్యాలన్నీ బాగా రిహార్స్ చేసి మొత్తం పాటలు, పద్యాలన్నింటిని అత్యద్భుతంగా నభూతో నభవిష్యతి అనే రీతిలో రెండు మూడు కాల్షీట్లలో  పాడి ముగించారు. ఈ చిత్రం క్లైమాక్స్ లోని భగవద్గీత ను శ్లోకరూపం లో కాక వచనంగా (తనువుతో కలుగు బాంధవ్యమ్ములెల్ల) ఘంటసాలవారు గంభీరమైన కంఠస్వరంతో పలుకుతూంటే ప్రేక్షకులు తన్మయులయ్యారు.
అలాగే కృష్ణరాయబారం సీన్ లో ని పద్యాలు వింటూంటే ఈ చిత్రంలో శ్రీకృష్ణుడు ఎన్టీఆర్ గారా లేక  ఘంటసాల గారా అనే అనుమానం వస్తుంది. అంతలా ఆయన తదాత్మ్యం చెంది ఆ పద్యాలను ఆలపించారు. తిరుపతి వెంకటకవులు వ్రాసిన ఈ పద్యాలన్నీ ఘంటసాల సృష్టించిన పద్యాల బాణిలోనే స్వరపర్చారు టి.వి.రాజు. ఎక్కడా పాతకాలపు రంగస్థల నాటక పద్య బాణీ వినపడదు. సంగీత నిర్వహణ టి.వి.రాజుగారు చేపట్టారు. చిత్రంలో గల దాదాపు ముఫ్ఫై పద్యాలు, శ్లోకాలలో ఇరవై ఘంటసాలవారి కంఠం నుండే వెలువడ్డాయి.

తర్వాతి కాలంలో ఘంటసాల పద్యాలు లేని  అనేక పౌరాణిక చిత్రాలు కొన్ని వచ్చాయి. కానీ ఈ సినీమాలన్నింటిలోనూ ఘంటసాల లేని లోటు కొట్టచ్చినట్లు కనపడింది. ఎందరిచేతనో పద్యాలు పాడించ ప్రయత్నించారు. కానీ  ఘంటసాల లేని లోటును భర్తీ చేసే గాయకులు మరి కానరారు. ఘంటసాలవారితోనే తెలుగు సినిమాలలో పద్యమూ అంతరించింది.

🌿🌺🌿


ఘంటసాలవారికి తీరిన కోరికలతో పాటూ తీరని కోరికలు కూడా ఎన్నో. అందులో ప్రధానమైనవి - దేశవ్యాప్తంగా కర్ణాటక సంగీత కచ్చేరీలు చేసి తాను విజయనగరంలో నేర్చుకున్న సంగీతవిద్యకు సార్ధకత చేకూర్చుకోవాలనే కోరిక వుండేది. అయితే సినీమాలలో పాడుతున్నంతకాలం కచేరీ బాణికి అలవాటు పడితే ఒకదాని ప్రభావం మరొకదానిపై పడే ప్రమాదముందనే అభిప్రాయం వారికివుండేది. ఏకకాలంలో జోడు గుర్రాల మీద స్వారి చేసే ఉద్దేశం వారికి లేదు. సినిమా సంగీతరంగం నుండి పూర్తి విశ్రాంతి తీసుకున్నాక శాస్త్రీయ సంగీత కచ్చేరీల మీద దృష్టి సారించాలనే తపన వుండేది. 

అలాగే, తన పేరు మీద సంగీత కళాశాలలు నిర్మించి అందులో క్రమ పధ్ధతిలో సిలబస్ రూపొందించి లలిత సంగీతానికి ప్రాధాన్యత కల్పించాలని ఆశించారు. ముందుగా తిరుపతిలో ఒక సంగీత కళాశాల నిర్మించాలని తలిచారు. తిరుపతిలో అలిపిరికి సమీపంలో  రోడ్ కు ఎడమవైపు కొన్ని కుంటల స్థలం కొన్నారు. అదే సమయంలో మా నాన్నగారు కొంత స్థలం కొనడం జరిగింది. కానీ ఇరువురి ఆశయం తీరలేదు. సరైన రక్షణ లేక చెట్లు చేమలతో నిండిన ఆ స్థాలాలను  నేను కూడా ఒకసారి తిరుపతి వెళ్ళినప్పుడు చూశాను. ఇద్దరి స్థలాలు కూడా తర్వాత ఎప్పుడో  హరించుకుపోయాయి.

ఘంటసాల మాస్టారికి ఆరు ఋతువుల మీద ఒక వాద్యసంగీత దృశ్య రూపకాన్ని నభూతో నభవిష్యతి అనే రీతిలో తయారు చేసి భారతీయ సంగీత వైశిష్ట్యాన్ని విదేశాలలో చాటిచెప్పాలని  ఆశించారు. వసంత, గ్రీష్మ, వర్ష, శరత్, హేమంత, శిశిర ఋతువులలో ప్రకృతి ఎలా వుంటుంది; మానవులు జంతువులు ఎలా సంచరిస్తారు వంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని ఒక్కొక్క ఋతువుకు పదిహేను నిముషాల చొప్పున ఆయా ఋతువులకు అనుగుణ్యమైన రాగాలతో పూర్తిగా భారతీయ వాద్యసంగీతం సమకూర్చి వాటికి సినెమేటిక్ సౌండ్ ఎండ్ లైట్ ఎఫెక్ట్స్ జతపర్చి బ్రహ్మాండంగా 'ఋతు సంగీతాన్ని' రూపొందించాలని భావించారు. ఆ విషయంగా మా నాన్నగారితో కూడా  అప్పుడప్పుడు ముచ్చటించేవారు. ఆ కోరిక కూడా తీరలేదు.

ఈ కోరికలన్నీ నెరవేరకపోవడానికి కారణం సినీమా పాటలు; స్వీయ సంగీత దర్శకత్వం; కచేరీలు; మ్యుజిషియన్స్ యూనియన్ భాధ్యతల  మధ్య తగినంత సమయం లభించకపోవడమే కారణమని నాకు అనిపిస్తుంది. దానికి తోడు అప్పుడప్పుడు కలిగే అనారోగ్యం కూడా మరొక కారణమై తాను చేపట్టిన కార్యక్రమాల పట్ల ఎక్కువ శ్రధ్ధవహించలేకపోయేవారు.

చివరగా ఒక చిన్న విషయంతో ఈ భాగం ముగిస్తాను.

💥కొసమెరుపు💥

నిత్య కార్యక్రమాల ఒత్తిడి భరించలేక కనీసం ఒక వారమైనా పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని ఘంటసాల మాస్టారు భావించారు. కానీ ఇంటివద్ద ఆ విశ్రాంతి తీసుకుందామన్నా ఎవరో ఒకరు  వచ్చి ఇబ్బంది కలిగించారు. ఇక ఇది మార్గంకాదని ఒక్క సావిత్రమ్మగారికి మాత్రమే చెప్పి కెథెడ్రల్ రోడ్ లో మ్యూజిక్ అకాడమీ పక్కనున్న న్యూ ఉడ్ ల్యాండ్స్ హోటల్ లో ఒక కాటేజి తీసుకొని అక్కడికి వెళ్ళిపోయారు. మిగతావారికి ఎవరికీ తెలియదు. సాయంత్రం సమయాలలో అమ్మగారు పిల్లల్ని తీసుకొని హోటల్ కు వెళ్ళేవారు. ఆవిడ మాస్టారి దగ్గర కూర్చొని  మాట్లాడుతూంటే మేము పిల్లలందరం పక్కనున్న రెస్టారెంట్ నుండి తెప్పించిన స్నాక్స్ ను లాగిస్తూ, సరదాగా కాటేజ్ ముందునున్న  చల్లటి చెట్లక్రింద కాలక్షేపం చేసేవాళ్ళం. ఆనాటికి చోళా షెరాటన్లు, సవేరా, తాజ్ కోరమండల్ వంటి స్టార్ హోటల్స్ రాలేదు. ఉన్నవాటిలో డీసెంట్ గా ప్రశాంతంగా వుండే పెద్ద హోటల్ న్యూ ఉడ్ ల్యాండ్స్ హోటలే. రాయపేటలో ఒల్డ్ ఉడ్ ల్యాండ్స్ వుండేది. తర్వాత ఆ స్థానంలో  ఉడ్ ల్యాండ్స్ సినిమా ధియేటర్ వచ్చింది. ఈ న్యూ ఉడ్ ల్యాండ్స్ హోటల్ మాత్రం బాగా నడుస్తోంది.

ఇలా ఘంటసాల మాస్టారు ఒక రెండు రోజులు ప్రశాంతంగా హోటల్ కాటేజ్ లో వుంటూ ఆ సమయాన్ని తన పాటల కంపోజింగ్ కు వినియోగించున్నారు. ఘంటసాలగారు ఉడ్ ల్యాండ్స్ లో రెస్ట్ లో ఉన్నారనే విషయం ఎలాగో బయటకి వచ్చింది. ఒక్కొక్క సినిమా కంపెనీవాళ్ళు వరసగా మాస్టారు దగ్గరకు వచ్చి చాలా మంచి పనిచేసారని అభినందిస్తూనే హీరో హీరోయిన్ ల డేట్లు కుదిరాయని అర్జంట్ గా పాట షూటింగ్  ముగించక తప్పదని, ఎలాగైనా  తమకు మాత్రం పాడిపెట్టమని ఒత్తిడి చేస్తూ రికార్డింగ్ డేట్లను అడిగి తీసుకోవడం మొదలెట్టారు.  మళ్ళీ రికార్డింగ్స్ కు, రిహార్సల్స్ కు వెళ్ళక తప్పలేదు. ఈ మాత్రం భాగ్యానికి హోటల్ రెంట్ దండగ కూడా ఎందుకని ఒకరోజు సాయంత్రం ఇంటికి చక్కా వచ్చేసారు. 

సినీమా రంగంలో ఒక అంతస్థుకు చేరాక  ఉన్న స్వేఛ్ఛా స్వాతంత్ర్యాలను కూడా కోల్పోతారు. 

💐


మరికొన్ని విశేషాలతో... వచ్చే వారం...
                        ...సశేషం


*With a view to make the narrative more authentic and to corroborate it, images, audio and video clips are attached at appropriate places. If such usage is found objectionable to the copyright holders the same shall be removed if and when notified.

3 comments:

Patrayani Prasad said...

🕉శ్రీ స్వరాట్ అన్నయ్యకు 🙏🙏ఎన్నో తెలియని విశేషాలు తెలియని విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. కథా కధనం చాలా బాగుంది .🙏🙏

Unknown said...

ఈవారం చాలా మంచి విషయాలు తెలియజేశారు. ఎన్నో కొత్త సంగతులు తెలిసాయి. మీకు ధన్యవాదాలు.🙏🙏🙏

P P Swarat said...

ధన్యవాదాలు