visitors

Sunday, August 22, 2021

నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 2 - నలభై అయిదవ భాగం

22.08.2021 -  ఆదివారం భాగం - 45*:
అధ్యాయం 2 భాగం 44  ఇక్కడ

  

నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్

నేను పుట్టాను. ఈ లోకం నవ్వింది. నిజం. మనసారా నవ్వుకోవడమే కాదు, సంబరాలు జరుపుకుంది. నేను పుట్టిన మూడు వారాలకు ప్రపంచాన్నే అతలాకుతలం చేసిన రెండవ ప్రపంచయుధ్ధం ముగిసింది. శాంతియుత వాతావరణానికి శుభోదయమయింది.

నేను పుట్టిన కొన్ని మాసాలకు ముందే లలితసంగీత వినీలాకాశంలో మహాకాంతివంతమైన తార దర్శనమిచ్చింది.  తన విలక్షణమైన కంఠస్వరంతో, అనితరసాధ్యమైన గానప్రతిభతో రసహృదయులను తన్మయులనుజేసింది. ఆనంద పరవశులనుజేసింది. ఈనాటికీ లలిత సంగీతప్రపంచంలో సాటిలేని మేటి ధృవతారగా వెలుగొందుతూనేవుంది.

ఎవరా ధృవతార? 

ఇంటింటా గంట గంటకూ కంచుఘంటలా మార్మోగే కంఠస్వరం కలిగిన గాన గంధర్వుడు ఘంటసాలే ఆ ధృవతార. అటువంటి మహోన్నతగాయకుని ఇంటి ప్రాంగణంలో వారి కనుసన్నలలో రెండు దశాబ్దాల కాలం సన్నిహితంగా మెలగిన అదృష్టవంతుడిని నేను. 

నేను పుట్టాక, నాకు ఊహ తెలిసాక నేను విన్న మొట్టమొదటి పాట ఘంటసాలవారిదే. అదే "పలుకరాదటే చిలకా". కలివరం గంగుల అప్పలనాయుడుగారింటి బాకా గ్రామఫోను లోనుండి వెలువడి నాగావళీ ఏటి గాలి తరంగాలలో తేలియాడుతూ నా చెవులకు సోకిన తొలి మధురగీతం. ఈ పాట పాడేనాటికి గాయకుడిగా ఘంటసాల వయసు ఐదేళ్ళే. నా వయసు ఐదేళ్ళే. 

1944 లో ఒక అనామక గాయకుడిగా చిత్ర రంగప్రవేశం చేసిన వామనమూర్తి (కొందరికి) ఘంటసాల వెంకటేశ్వర్లుగా, ఘంటసాల వెంకటేశ్వరరావుగా, జి.వి.రావుగా, అంచెలంచెలుగా ఎదిగి ఘంటసాల అనే గాన త్రివిక్రముడిగా దిగంతాలకెదిగి అక్కడే ధృవతారగా స్థిరపడి అక్కడినుండే  తన గానామృతాన్ని ఈలోకంలో ఈనాటికి పంచిపెడుతూ గానప్రియులకు మహదానాందాన్ని, రసానుభూతి ని కలిగిస్తున్నాడు.

ఘంటసాల ఈ స్థితికి చేరుకోవడానికి కారణకర్తలైన మహానుభావులెందరో.

జన్మనిచ్చిన ఘంటసాల సూర్యనారాయణ, రత్తమ్మ దంపతులు, పెరిగి పెద్దవడానికి దోహదపడిన మేనమామ ర్యాలి పిచ్చిరామయ్యగారు, నాలుగైదేళ్ళపాటు తన సొంత బిడ్డలా సాకి సంగీత విద్యను నేర్పిన గురువర్యులు పట్రాయని సీతారామశాస్త్రి గారు, తన విద్యాకాలంలో అన్నం పెట్టి ఆదుకున్న విజయనగరం అన్నదాతలు,  మద్రాస్ చలనచిత్ర రంగంలో కాలూనడానికి చేయూతనిచ్చిన మాన్యశ్రీ - సముద్రాల రాఘవాచార్యులవారు, బృందగానాలలో పాడడానికి, తన సినీమా లో చిల్లర వేషాలు వేయడానికి అవకాశం కల్పించి, నెల జీతమిచ్చి ఆదుకున్న ప్రతిభా బలరామయ్యగారు (ఘంటసాల) (ఇద్దరిదీ వేర్వేరు కులం. కానీ ఇద్దరిదీ ఒకటే కులం - సినీమా కులం),  రేణుకా కంపెనీ చిత్తూరు వి నాగయ్య, ఆలిండియా రేడియో ద్వారా తన కంఠాన్ని తెలుగువారికి పరిచయం చేసి నిరంతర జీవనోపాధి కల్పించిన బాలాంత్రపు రజనీకాంతరావుగారు, గాయకుడిగా సినీమాలలో తొలి అవకాశం కల్పించిన దర్శకనిర్మాత శ్రీ బి ఎన్ రెడ్డి , సంగీత దర్శకుడు శ్రీ చిత్తూరు వి.నాగయ్య, సహాయ సంగీతదర్శకుడిగా పరిచయం చేసిన భరణీ భానుమతి, రామకృష్ణారావు దంపతులు - వీరు చూపించిన ఆదరణ, సహాయ సహకారాలు, ప్రేమానురాగాల గురించి ఘంటసాలవారు తలచుకోని క్షణమేలేదు. తన ప్రతీ ఇంటర్వ్యూలలో వీరందరికి తన కృతజ్ఞతలు తెలుపుకున్న గొప్ప సహృదయుడు శ్రీ ఘంటసాల.

వీరితోపాటూ తన పురోభివృద్ధికి ఇతోధికంగా తోడ్పడిన మరో ప్రముఖ వ్యక్తి పేకేటి శివరాం. ప్రతిభా పిక్చర్స్ ప్రొడక్షన్ మేనేజర్ గా ఘంటసాల వెంకటేశ్వరరావును తమ యజమాని ఘంటసాల బలరామయ్యగారికి పరిచయం చేసి అక్కడ ఒక చోటు లభించేలా తోడ్పడిన సహృదయుడు. 



మరాఠీ బాణి రంగస్థల నాటక పద్యాలకు, దాక్షిణాత్య యాసతో కూడిన సంప్రదాయ సంగీత విద్వాంసుల పాటలకు అలవాటు పడ్డ హిస్ మాస్టర్స్ వాయిస్ (HMV) కార్యక్రమ నిర్వాహకుల చెవులకు ఘంటసాల యొక్క వైవిధ్యభరితమైన, విలక్షణమైన పాట, పద్యం నచ్చలేదట. ఘంటసాలను తిరస్కరించారట. సహజమే. అక్కడున్నవారి సంగీత సంస్కారం అంతవరకే. తర్వాత, ప్రతిభాలో పనిచేసిన పేకేటి హెచ్.ఎమ్.వి.కి ప్రోగ్రామ్ ఎక్సిక్యూటివ్ గా రావడం జరిగింది. వెంటనే, పేకేటి శివరాంగారు శ్రీఘంటసాలగారిని పిలిపించి 'నగుమోమునకు నీ నిశాబింబము' అనే పద్యాన్ని, 'గాలిలో నా బ్రతుకు' పాటను రికార్డ్ చేయించారు. అవే ఘంటసాలవారి రికార్డైన మొదటి పాట, పద్యము. 


కానీ ఇవి ప్రజల మధ్య రావడానికి ముందేస్వర్గసీమ సినీమా విడుదలై భానుమతి గారితో కలసి పాడిన గాజులపిల్ల పాట తెలుగు జనాలకు చేరింది.  ఇదంతా నేను పుట్టిన సంవత్సరంలోనే జరిగింది. 


ఆ రోజుల్లో హెచ్.ఎమ్.వి.వారి పాటలు మెడ్రాస్ లోనే రికార్డ్ చేసినా వాటి ప్రాసెసింగ్, ఫైనల్ రికార్డ్ గా విడుదల కావడం అంతా కలకత్తా డమ్ డమ్ లో జరిగేది. ఆ కారణంగా ఘంటసాలగారి మొదటి పాట, పద్యం ఆ మరుసటి సంవత్సరం తెలుగు శ్రోతల శ్రవణాలకు చేరింది. అంతే, గాయకుడిగా ఘంటసాల పేరు మార్మోగింది. ప్రతీ మూడు మాసాలకు ఒకసారి ఘంటసాల ప్రైవేట్ రికార్డ్ లను విధిగా విడుదల చేయడం మొదలుపెట్టారు. ఘంటసాలవారి కరుణశ్రీ పద్యాలు, తిరుపతి వెంకటేశ్వరుడిమీద భక్తిగీతాలు తెలుగునాట ఎంతటి సంచలనం సృష్టించాయో, ఎంతటి ప్రజాదరణ పొందాయో జగమంతటికి తెలుసు.

ఈ విధంగా ఆదిలో ఘంటసాలవారి గానవిశిష్టత ను ప్రజలకు చేరవేయడంలో  పేకేటి ప్రముఖ పాత్ర వహించారని చెప్పాలి.

తర్వాతి కాలంలో పేకేటి నటుడిగా మారారు. ఘంటసాల గాయకుడిగా, సంగీత దర్శకుడిగా ఉన్నతశిఖరాలకు ఎదిగిపోయారు. పేకేటి నటించిన సినిమాలలో ఘంటసాల మాస్టారు పాడిన పాటలు ఏవీ లేవనే అనుకుంటాను. విన్న గుర్తులేదు. 

పేకేటి నటుడిగా కన్నా కార్యనిర్వాహకుడిగా బహు ప్రజ్ఞావంతుడు. ఈనాడు అందరూ అనే పబ్లిక్ రిలేషన్స్ లో అందెవేసిన చేయి. సినీమారంగం, ముఖ్యంగా ఎన్.టి.రామారావు నిర్వహించిన అనేక సంక్షేమ కార్యక్రమాలలో పేకేటి ప్రముఖ పాత్ర వహించేవారు. విదేశాలలో ఆయనకు మంచి పరిచయాలుండేవంటారు. ఫారిన్ లొకేషన్స్ లో సినీమా ఔట్ డోర్ షూటింగ్ లు నిర్విఘ్నంగా జరగాలంటే పేకేటిని సంప్రదిస్తే సునాయాసంగా జరిగిపోతాయనే ఖ్యాతి ఆయనకు వుండేది. ఘంటసాలవారు నిర్మాతగా తాను తీసిన 'భక్త రఘునాథ్' చిత్రంలో పేకేటి కూడా నటించారు. ఇటీవలే దివంగతురాలైన సుప్రసిధ్ధ బహుభాషా నటీమణి జయంతిని కమలకుమారిగా ఉన్న రోజులలో సినీమా రంగానికి పరిచయం చేసినది పేకేటి శివరామే. ఆమె తొలి చిత్రాలలో ఘంటసాలవారి 'భక్త రఘునాథ్' కూడా ఒకటి. ఆ తర్వాత ఘంటసాల, పేకేటి కలసి పనిచేసే అవకాశమే రాలేదు.

🌿


శ్రీదేవీ ప్రొడక్షన్స్ తోట సుబ్బారావు గారి కోట్స్ రోడ్ ఆఫీసులో తమ కొత్త సినీమా పాటల కంపోజింగ్ మొదలయింది. ఆ బ్యానర్ తీసిన అన్ని సినీమాలకు ఘంటసాలవారే సంగీత దర్శకత్వం వహించారు. ఆ పాటల కంపోజింగ్ సమయంలో పేకేటి శివరాంగారిని అక్కడ చూడడం జరిగింది. ఆయన ఆ సినీమాలో ఏక్ట్ చేస్తున్నారేమోనని భావించాను. కాని రెండు మూడుసార్లు వరసగా ఆయన అక్కడ కనిపించి పాటల కంపోజింగ్ లో పాల్గొని ఆ సినిమా గురించి వివరించినప్పుడు తెలిసింది ఆ సినీమాకు డైరక్టర్ పేకేటి అని. అదొక కన్నడ సినిమాకు రీమేక్. రాజ్ కుమార్, జయంతిలతో వచ్చిన ఒక నవలా చిత్రం ' చక్రతీర్థ'. ఆ సినీమాకు కూడా పేకేటి శివరామే డైరక్షన్. ఆ సినీమా రైట్స్ కొని శ్రీదేవి తోట సుబ్బారావుగారు తెలుగులో 'చుట్టరికాలు' గా మొదలుపెట్టారు. జగ్గయ్య జయంతి ఒక జంట. గుమ్మడి, హేమలత ఒక జంట. కాంతారావు, కృష్ణకుమారి ఒక జంట.  

సెకెండ్ హీరో శోభన్ బాబుకు జోడీగా ఒక కొత్త అమ్మాయిని పరిచయం చేశారు. ఆ అమ్మాయే లక్ష్మి. తర్వాతి కాలంలో  సర్వ సమర్థురాలైన బహుభాషానటిగా పేరు పొందారు.  నిన్న మొన్నటి 'మిథునం' సినీమాలో కూడా లక్ష్మి అసామాన్యమైన నటనతో ప్రేక్షకుల మన్ననలు పొందారు. ఆమె తండ్రి వై.వి.రావు, తల్లి రుక్మిణి కూడా మొదటి తరం తారలు. లక్ష్మి (భర్తలు కూడా సినీమా నటులే.) కుమార్తె ఐశ్వర్య కూడా అనేక తమిళ, తెలుగు చిత్రాలలో నటించింది.

నవలలు ఆధారంగా తీసుకొని తీసే చిత్రాలలో ఎక్కువగా మెలోడ్రామా, ఫ్యామిలీ సెంటిమెంట్స్ ఎక్కువుంటాయి.  ఆనాటి మహిళా ప్రేక్షకులు అలాటి కుటుంబ కధా చిత్రాలనే ఆదరించేవారు. అలాటి చిత్రమే ' చుట్టరికాలు'. ఈ సినిమాలో పాటలను ఆనాటి మేటి గీత రచయితలైన దాశరధి, సి.నారాయణరెడ్డి, కొసరాజు, శ్రీశ్రీ వ్రాసారు. ఈ పాటల రికార్డింగ్, రీరికార్డింగ్ కూడా విజయాగార్డెన్స్ లో సౌండ్ ఇంజనీర్ ఆర్.స్వామినాథన్ పర్యవేక్షణలోనే జరిగాయి. స్వామినాథన్ తమిళుడు. ఎక్కువగా మాట్లాడరు. ఎప్పుడూ మూతి బిగించుకునేవుంటారు. కారణం సదా ఆయన నోటినిండా తాంబూలం ఉంటుంది. నోరు విప్పరు. ఐదేసి నిముషాలకు ఒకసారి లేచి బయటకు వెళ్ళి నోరు కడుక్కొని వచ్చేవారు. మరల మరో రెండు మూడు నిముషాల్లో మళ్ళీ తమలపాకులు నోటినిండా దట్టించేవారు. ఆయన పక్కనే ఘంటసాల మాస్టారు కూర్చొని ఆడిటోరియంలోని ఆర్కెష్ట్రావారికి సూచనలు ఇచ్చేవారు. చుట్టరికాలు సినీమాలోని పాటలు గొప్ప హిట్సని చెప్పలేము. కానీ, ఘంటసాల సుశీల పాడిన 'నీవే నా కనులలో',

'అందాల అలివేణివి' 



పి.బి.శ్రీనివాస్, సుశీల పాడిన 'ఏమిటో ఈ వింత ఎందుకో పులకింత', 

ఘంటసాలగారు పాడిన సోలో "గాలి వీచెను అలలు లేచెను", 

ఎల్లారీశ్వరి , సుశీల "ఆడవా ఆటాడవా ఎగిరి ఎగిరి గంతులేసి..." వంటి పాటలు ఘంటసాలవారి మినిమమ్ గ్యారెంటీతో శ్రావ్యంగా వినసొంపుగా వుంటాయి. సినీమా అంటే కేవలం వినోదం మాత్రమేనని ఆశించి వెళ్ళే ప్రేక్షకులకు  నచ్చని అంశం ఈ సినీమాలోని మూడు ప్రధాన పాత్రలను చంపేసి సినీమాను శోకమయం చేయడం. సమైక్యాంధ్రదేశంలో తెలుగు ప్రేక్షకులు 'చుట్టరికాలు' ను ఎంతవరకు ఆదరించారో తెలుసుకునే అవకాశం, ఉద్యోగాల వేటలో పడిన,  నాకు కలగలేదు. తోట సుబ్బారావుగారు మాత్రం తమ చిత్ర నిర్మాణం కొనసాగించారు.

🌺

' పి బి టి డి చె జె కె గె '

పై అక్షరాలు మీకు ఏమైనా గుర్తు చేస్తున్నాయా ?

నేను ఆంధ్రా సిమెంట్స్ లో పనిచేసిన నెల రోజులలో నాకు ఒక విషయం అర్ధమయింది. ఒక సుమారైన ఉద్యోగం దొరకాలంటే నాకున్న అర్హతలు చాలవు. మరింకేదైనా సర్టిఫికెట్లు సంపాదించాలి. టైపిస్ట్ ఉద్యోగానికి ఇంటర్వ్యూకు వెళ్ళితే బుక్కీంపింగ్ తెలుసా? షార్ట్ హ్యాండ్ తెలుసా? అని అడిగేవారు. ఒకసారి IDPL-SIP (Surgical Instruments Plant-Chennai)లో పనిచేస్తున్న మాస్టారి తమ్ముడు సదాశివుడుగారు వీకెండ్స్ కు టి.నగర్ అన్నగారింటికి వచ్చినప్పుడు మౌంట్ రోడ్ లో శ్రీరామ్ గ్రూప్ వాళ్ళు కొత్తగా ఏదో ఆఫీసు తెరిచారట, అందులో ఏవో ఉద్యోగాలకు ఖాళీలున్నాయట, వెళ్ళి చూడమని సలహా ఇచ్చారు. పూర్తి వివరాలు ఆయనకు తెలియవు. మౌంట్ రోడ్ ఎల్.ఐ.సి.కి దగ్గరలో వుందని మాత్రం చెప్పారు. సరేనని ఒక రోజు ఉదయం తొమ్మిది తర్వాత పానగల్ పార్క్ దగ్గర 11వ నెంబర్ బస్ పట్టుకొని మౌంట్ రోడ్  ఆర్ట్స్ కాలేజ్ స్టాపింగ్ లో దిగి రోడ్ క్రాస్ చేసి ఎల్.ఐ.సి. బిల్డింగ్ వరసలో ఎక్కడైనా శ్రీరామ్ పేరిట ఏవైనా కంపెనీలు వున్నాయేమోనని తెగ వెతికాను. ఎక్కడా ఆ పేరుతో ఏ ఆఫీసు బోర్డ్  కనపడలేదు. ఆ చుట్టుపక్కలున్న రోడ్లన్నీ గాలించినా ఆ పేరుతో ఏదీ కనపడలేదు. ఇక విసుగెత్తి తిరిగి ఎల్.ఐ.సి. దగ్గర టి.నగర్ బస్ పట్టుకుందామని గోవ్ బిల్డింగ్ పక్కనుండి వస్తూంటే ఒక దగ్గర ఉషా కంపెనీ బోర్డ్ కనిపించింది. "ఉష" అంటే ఆ రోజుల్లో కుట్టుమిషన్లకు, ఫ్యాన్లకు చాలా ప్రసిధ్ధి. ఆ ఆఫీసు ఒక మేడమీద వుండేది. అందులో పనిచేసే వాళ్ళెవరో ఇద్దరు క్రింద నిలబడి మాట్లాడుకుంటున్నారు. వాళ్ళదగ్గరకు వెళ్ళి అడిగాను ఈ శ్రీరామ్ వినైల్స్ కంపెనీ ఎడ్రస్ గురించి. నా అదృష్టం. ఆ కంపెనీ ఆ మేడ మీదే వుందని చెప్పారు. మెల్లగా మెట్లెక్కి పైకి వెళ్ళాను. ఆ ఆఫీసు ఒక మూలగా ఒకే ఒక పాతగదిలో వుంది. అక్కడ ఎవరూ కనపడలేదు. కొంతసేపు అక్కడే తచ్చాడుతుండగా ఎవరో ఒక వ్యక్తి వచ్చి నన్ను ఏం కావాలని అడిగాడు. అతను తెలుగో, తమిళియనో కాదు. నార్త్ ఇండియన్. అతనే ప్రస్తుతం అక్కడి ఆఫీస్ ఇన్ ఛార్జ్. స్టాఫ్ ఇంకా నియమించబడలేదు. వచ్చిన విషయం తడబడుతూ ఇంగ్లీష్ లో చెప్పాను. తమకు ప్రస్తుతం వెంటనే ఒక స్టోర్ కీపర్ కావాలని, అందులో నా అనుభవం గురించి అడిగాడు. పైగా ఆ ఉద్యోగంలో చేరిన వెంటనే 7000 రూపాయలు సెక్యూరిటి డిపాజిట్ కట్టాలని ఏవో రూల్స్, కండిషన్స్ చెప్పడం మొదలెట్టాడు. స్టెనోగ్రఫీ వచ్చా అని అడిగాడు.  అతను అడిగిన అనుభవమూ లేదు, ఏడువేలు డిపాజిట్ కట్టే స్థోమతాలేదు. కిక్కురుమనకుండా  అతనికి ఒక ధ్యాంక్స్ చెప్పేసి తిరిగి చూడకుండా ఇంటిమార్గం పట్టాను. 

🍀

ధైర్యం చేసి ఏదైనా మంచి  సినీమా కంపెనీలో ఏ అసిస్టెంట్ గానైనా చేరితే ఎలావుంటుంది అనే ఆలోచన పురుగులా నా మెదడును దొలచడం మొదలెట్టింది. ఇందుకు ఘంటసాల మాస్టారితో మాట్లాడమని మా నాన్నగారిని అడిగితే... ఒప్పుకుంటారా? ఇద్దరూ ససేమిరా ఒప్పుకోరు. వేరే మార్గాలు చూడవలసిందే. ఏ ఉద్యోగం రావాలన్నా మరేవైనా క్వాలిఫికేషన్లు సంపాదించాలి. ఇక ఆ ప్రయత్నాలు మొదలెట్టాలనే నిర్ణయానికి వచ్చాను. 

పానగల్ పార్క్ దగ్గర ఇప్పుడున్న నల్లీస్ 100, పోతీస్, ఫ్లైఓవర్  ఆ రోజుల్లో లేవు. దొరైసామి రోడ్ కు మంగేష్ స్ట్రీట్ కు మధ్య సలామ్ స్టోర్స్, రామన్స్ కాఫీ వర్క్స్, పార్క్ హెయిర్ డ్రెసెస్ వంటివి వుండేవి. ఆ పక్కనే ఒక మేడ మీద 'నియో కమర్షియల్ ఇన్స్టిట్యూట్' అని ఎర్రటి బోర్డ్ మీద తెల్లటి అక్షరాలతో వ్రాసి వుంది. అక్కడ టైప్ రైటింగ్, షార్ట్ హ్యాండ్, బుక్ కీపింగ్ వంటి కోర్స్ లకు కోచింగ్ ఇస్తారని వ్రాసి వుంది.  అందులో చేరి షార్ట్ హ్యాండ్, బుక్ కీపింగ్ కోర్స్ లు చేయాలనే నిర్ణయానికి వచ్చి నియో కమర్షియల్ ఇన్స్టిట్యూట్ లో చేరాను. వాళ్ళు షార్ట్ హ్యాండ్ కు పిట్స్మన్ బుక్,  లాంగ్ నోట్ బుక్, పెన్సిల్, ఎక్కౌంట్స్ కు మరేవో పుస్తకాలు కొనుక్కోమని ఒక లిస్ట్ ఇచ్చారు. రోజుకు రెండు గంటలు. ఇదో గంట, అదో గంట. ఇంటికి దగ్గరే కావడం వలన వెళ్ళి రావడం సమస్య కాదు. ముందుగా కోచింగ్ సెంటర్లో కొనమన్న పుస్తకాలు సంపాదించాలి. అందుకు ముందుగా మా నరసింగడిని సంప్రదించాను. నా అదృష్టం. అతను తన దగ్గరున్న పిట్స్మన్ షార్ట్ హాండ్ టెక్స్ట్ బుక్ ఉదారంగా ఉచితంగా ఇచ్చేసాడు. అతను కొన్నాళ్ళు  షార్ట్ హ్యాండ్ ప్రాక్టీసు చేసి అతనివల్ల కుదరక స్వస్తి చెప్పేసాడట. అతనిచ్చిన ఆ పుస్తకం పట్టుకొని ఓ మంచిరోజు చూసి నియో కమర్షియల్ ఇన్స్టిట్యూట్ లో చేరాను.

మొదటిరోజు క్లాసుకు నాలాటివారే నలుగురైదుగురు కొత్తవాళ్ళు వచ్చారు. మధ్య వయసులో వుండే ఒకాయన టీచర్ .  ఆయన  బోర్డ్ మీద కొన్ని గీతలు నిలువుగా, అడ్డంగా, వంపుగా, లైట్ గా,థిక్ గా వ్రాసి  pee bee tee dee che jay kay gay అంటూ వ్రాసి చూపించి పెన్సిల్ తో అలాగే వ్రాయడం ప్రాక్టీసు చేయమన్నారు. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ a b c d లు కాకుండా ఈ పీ బీ టీ డీల వరసేమిటో అర్ధం కాలేదు. షార్ట్ హాండ్ అంతా సింబల్స్ కోడ్స్ తోనే నిండివుంటుంది. అవన్నీ అర్ధం చేసుకోవడానికే నాకు చాలా రోజులు పట్టింది. అలాగే, బుక్ కీపింగ్ అంతా లెఖ్ఖల మయంగా కనిపించింది. డెబిట్, క్రెడిట్, ప్రాఫిట్, లాస్, ఇన్కమ్, ఎక్స్ పెండిచర్, ఎస్సెట్స్, లయబిలిటీస్, జర్నల్ ఎంట్రీస్, బ్యాలన్స్ షీట్ -- ఇవేవీ నా బుర్రకెక్కలేదు.  కొన్నాళ్ళు కష్టపడి ప్రయత్నించినా నాకంతా అయోమయంగానే వుండిపోయింది. దానితో బుక్కీపింగ్ కు స్వస్తిపలికి షార్ట్ హాండ్ ప్రాక్టీస్ చేయడం మొదలెట్టాను. అలాగే టైప్ రైటింగ్ 100 వర్డ్స్ టెస్ట్ కు వెళ్ళడానికి టైప్ రైటింగ్ మొదలెట్టాను. కనీసం ఒక ఏడాదైనా బాగా ప్రాక్టీస్ చేస్తే తప్ప పరీక్షలకు వెళ్ళే అర్హత రాదు. 

ఇలా షార్ట్ హాండ్, హైస్పీడ్ టైపింగ్ లతో కాలం వెళ్ళదీస్తున్న కాలంలో ఒక రోజు మా నాన్నగారు నన్ను డా.డి.ఎన్.రావుగారిని వెళ్ళి కలవమని చెప్పారు. నా గుండెల్లో రాయి పడింది.

ఆ విశేషాలేమీటో వచ్చేవారం ... 

             ... సశేషం

*With a view to make the narrative more authentic and to corroborate it, images, audio and video clips are attached at appropriate places. If such usage is found objectionable to the copyright holders the same shall be removed if and when notified.

No comments: