visitors

Sunday, August 15, 2021

నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 2 - నలభై నాలుగవ భాగం

15.08.2021 - ఆదివారం భాగం - 44*:
అధ్యాయం 2  భాగం 43 ఇక్కడ


నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్


డెబ్భై అయిదవ స్వాతంత్ర్యదినోత్సవ సందర్భంగా స్వతంత్ర భారతావనికి అభినందనలు


35, ఉస్మాన్ రోడ్డు టెర్రస్ మీద ప్రతి స్వాతంత్య్ర దినోత్సవం నాడు మువ్వన్నెల జెండా ఎగిరేది.

ఘంటసాలవారు ఉన్న కాలంనాటికి తెలుగు సినీమాల నిర్మాణం తక్కువగానే ఉండేది. 1970ల నాటికి అధికపక్షంగా సుమారుగా  సంవత్సరానికి 70 సినీమాలు విడుదల అయేవి. వాటిలో ఓ పది డబ్బింగ్ చిత్రాలు. తెలుగు సినీమా మొదటి దశలో ప్రతీ సినీమాలో పాటల సంఖ్య అధికంగానే వుండేది. పౌరాణిక చిత్రాలైతే పాటలు, పద్యాలు అధికసంఖ్యలోనే పెట్టేవారు. ఆనాటి పాటలన్నీ కూడా ఒక్కొక్కటి మూడు నిముషాలలోపే ఉండేవి. 1970లు వచ్చేసరికి తెలుగు సినీమాలలో పాటల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఒక్కో సినీమాకు ఆరేడు పాటలకంటే ఎక్కువ పెట్టడం మానేసారు. 

ఘంటసాల మాస్టారి కాలంనాటికి గాయనీగాయకులు, సంగీతదర్శకులు అధికసంఖ్యలోనే వుండేవారు. ఆనాటి తెలుగు సినీమాలు వీరందరికీ సమానమైన వృత్తి అవకాశాలను, ఆదాయాన్ని కల్పించగలిగినదా అంటే లేదనే చెప్పాలి. ఘంటసాలవారితో పాటు, సర్వశ్రీ - ఎస్.రాజేశ్వరరావు, పెండ్యాల, టి.వి.రాజు, టి.చలపతిరావు, మాస్టర్ వేణు, సుసర్ల దక్షిణామూర్తి, సాలూరి హనుమంతరావు, అద్దేపల్లి, ఓరుగంటి, గాలి పెంచల, పామర్తి, విజయాకృష్ణమూర్తిలతో పాటు పరభాషా సంగీత దర్శకులైన కె.వి.మహాదేవన్, ఎమ్.ఎస్.విశ్వనాథన్-రామమూర్తి, సుదర్శనం-గోవర్ధనం, వేదా, శంకర్-గణేష్, రాజన్-నాగేంద్ర, విజయభాస్కర్, జి.కె.వెంకటేష్, టి.జి.లింగప్ప, శంకర్-జైకిషన్  వంటి సంగీత దర్శకులెందరో ఆనాటి తెలుగు సినీమాలకు సంగీత దర్శకత్వం వహించారు. వీరితో పాటూ ఓ రెండు మూడు సినీమాలకు మాత్రమే పనిచేసి కనుమరుగైన సంగీత దర్శకులు, 1970ల తర్వాత కొత్తగా పరిచయం కాబడిన సంగీత దర్శకులు మరెందరో కనిపిస్తారు. ఈ మ్యూజిక్ డైరక్టర్లందరికీ ఏడాదిపొడుగునా నిశ్చింతగా కాలం గడపడానికి కావలసిన ఆదాయం లభించేలా సంగీతావకాశాలు లభించేవా అంటే అనుమానాస్పదమే. పైన చెప్పిన సంగీత దర్శకులలో సగం మంది మాత్రమే నిరంతరావకాశాలు కలిగినవారు. అందరు సంగీత దర్శకులకు ఒకే విధమైన  పారితోషకాలు ఉండేవికావు. ఒకరికి పదిహేను వేలయితే, మరొకరికి పదివేలు, ఇంకొకరికి ఏడువేల ఐదొందలు, ఐదువేలు, మూడువేలు, రెండువేలు, పదిహేను వందలకు కూడా పనిచేసే సంగీత దర్శకులుండేవారు. వీరిలోకొంతమంది ఆదాయాలకంటే అనేకమంది సంగీత దర్శకుల దగ్గర పనిచేసే వాద్య కళాకారుల ఆదాయమే గణనీయంగా వుండేది.  నేపథ్యగాయకుల పరిస్థితి ఇలాగే వుండేది. 1965ల వరకూ నేపధ్యగాయకుల పారితోషికం   వారి వారి డిమాండ్ ను బట్టిఒక్కొక్క పాటకు అధిక పక్షం 750/- అయితే అధమపక్షం 200/-గా వుండేది. కొరస్ సింగర్స్ కు అయితే వంద రూపాయల లోపే. ఎవరికీ నికరంగా నెలకు ఇంత ఆదాయం వస్తుందని చెప్పుకునే ఆస్కారం లేదు.ఱ

ఇదేవిధంగా వాద్యకళాకారుల ఆదాయం కూడా చాలా దయానీయంగానే వుండేది. వాయించే వాద్యాలను బట్టి నలభై రూపాయలనుండి నూరు, నూట ఏభైవరకు మాత్రమే ఇచ్చేవారు. ఎన్నో వందలమంది ఆర్కెష్ట్రా ప్లేయర్స్ వున్నా రోజూ  పని దొరికేది చాలా కొద్దిమందికే. నెలల తరబడి ఏ పని దొరకని సంగీత దర్శకులు,గాయకులు,వాద్యకళాకారులెందరో మద్రాస్ మహానగరంలో అల్లల్లాడుతూండేవారు. ఒక సంఘటన నాకు బాగా గుర్తు నేను కాలేజీలో చేరేముందు ఒకాయన మా నాన్నగారి దగ్గర అప్పుకు వచ్చారు ఒక ఏభై రూపాయలు ఇవ్వమని. మానాన్నగారూ అంత సొమ్ము అప్పుగా ఇచ్చే స్థితిలో లేరు. ఆ వచ్చినాయన చాలా అత్యవసరమని తన దగ్గరున్న వాచీని మా నాన్నగారి చేతిలోపెట్టి, డబ్బు తిరిగి ఇచ్చేవరకూ వాచీని ఉంచుకోమని బలవంతపెట్టి మొత్తానికి తానడిగిన డబ్బును పట్టుకెళ్ళారు. మళ్ళీ ఆ అప్పు తీర్చనూ లేదు. తన వాచీని పట్టుకెళ్ళనూ లేదు. ఆ వాచి చాలా మంచి వాచి. టైటస్ కంపెనీది. ఇప్పటికీ నా దగ్గర వుంది.  ఔటర్ డయల్ మారింది అంతే. ఆ వాచీ ఇప్పటికీ బాగానే పనిచేస్తూ నా కంటే మంచి కండిషన్ లో వుంది. నాకు మొదట్లో అమరిన సైకిలు అలాటిదే. సెకెండ్ హాండ్ లో వచ్చినదే. చాలా ఏళ్ళు ఆ సైకిల్ నన్ను మోసింది. ఈ విధమైన సంగీత కళాకారుల దుస్థితికి సినీ మ్యుజిషియన్స్ యూనియన్  ఎక్సిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా  ఘంటసాల మాస్టారు చాలా ఆవేదన పడేవారు.

తెలుగు చలనచిత్ర సీమలో నెంబర్ వన్ గాయకుడిగా, సంగీత దర్శకుడిగా ఘంటసాల మాస్టారు తన  సినీమా పాటలతో, లలిత సంగీత కచ్చేరీలతో, హిస్ మాస్టర్స్ వాయిస్ కంపెనీవారి ప్రైవేట్ రికార్డుల గానంతో  నిరంతరం బిజీగానే వుండేవారు. ఆదాయానికీ ఏ కొరతాలేదు. మొదటినుండి వున్న డయబెటిస్, బి.పి.ల వలన అప్పుడప్పుడు అనారోగ్య సమస్యలు ఎదుర్కొనేవారు. వాటికి నిరంతరం ఏవో మందులు, మాత్రలు వాడేవారు. క్రమక్రమంగా ఓపిక తగ్గుతూండడం వలన సంగీత దర్శకత్వం పట్ల ఆసక్తి సన్నగిల్లుతూ వచ్చింది.  కొత్త  నిర్మాత ల సినీమాలకి సంగీత దర్శకత్వం వహించడానికి సుముఖత చూపలేదు. సంగీత దర్శకత్వం వహించే సమయంలో మరిన్ని పాటలు పాడుకుంటే చాలనే అభిప్రాయం లో వుండేవారు. ముఖ్యంగా, ఘంటసాలగారు సినీమా కంపెనీల చుట్టూ తిరుగుతూ పనికోసం ప్రాకులాడడం అనేది 1950 లకు ముందే మానేసారు. ఘంటసాలే తమ సినీమా పాటలు పాడాలి, ఆయనే మా సినీమాకు సంగీతం చేయాలని వచ్చి అడిగే నిర్మాతలకే చివరివరకూ పనిచేసారు. అలాగే, తననే సంగీతదర్శకుడిగా పెట్టుకుంటామని చెప్పి చివరి క్షణాలలో మరొకరిని తీసుకున్నప్పుడు కూడా ఆయన బాధపడలేదు. మరో సంగీత దర్శకుడికి కొంత ఉపాధి లభించిందని భావించేవారు. ఈ విధమైనటువంటి పరిస్థితులు వ్యక్తిగతంగా ఘంటసాల మాస్టారికి ఇబ్బందులు కలిగించకపోయినా, పూర్తిగా ఆయన సంగీత దర్శకత్వం వహించే సినీమాలకు మాత్రమే పనిచేసే మా నాన్నగారికి, మరో ముగ్గురు వాద్యకళాకారులకు నిరంతరాదాయం లభించని దుస్థితులు ఎదురైనాయి. ఘంటసాలవారు, వారి సతీమణి శ్రీమతి సావిత్రమ్మగారి ఔదార్యం వలన మేము నెం.35, ఉస్మాన్ రోడ్ ఔట్ హౌస్ లో ఉన్నంతవరకూ ఇంటద్దె సమస్య లేకుండా తమ ప్రేమాభిమానాలు మా నాన్నగారిపట్ల, మా కుటుంబంపట్ల కనపర్చారు. 

ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో నా డిగ్రీ పూర్తయింది.

తరువాత ఏం చేయాలి. పి.జి. చేయాలా? అంటే మరో రెండేళ్ళు. అప్పుడు కూడా ఫస్ట్ క్లాసు వస్తేనే ఏదైనా ఓ చిన్న కాలేజీలో  ట్యుటర్  ఉద్యోగం. లేకపోతే టీచర్ ట్రైనింగ్ చేసి బడిపంతులుగా తయారవ్వాలి. మా రోజుల్లో 'బ్రతకలేక బడిపంతులు' అనే నానుడి బహుళ ప్రచారంలో వుంది. అలాగే బి.ఎ. చదువు అంటే కూడా ' బి - బొత్తిగా ఎ - అధ్వానం( బి.ఎ. - బొత్తిగా అధ్వానం) అనే చిన్నచూపు అందరిలోనూ వుండేది. అది ఆనాటి పరిస్థితి. మరి ఈనాటి బడి పంతుళ్ళ జీవన ప్రమాణం చాలా బాగుందనే చెప్పాలి. ('పీత కష్టాలు పీతవి' అన్నట్లుగా వారికుండే సాధకబాధకాలు వారికీ ఉంటాయనుకోండి). కానీ రోజులు మారేయి. అందుకే మా ఈశ్వరుడు (మా శారదక్క కొడుకు) తన తండ్రి తాతలు, అమ్మమ్మల వారసత్వాన్ని పుణికి పుచ్చుకోవడమే కాక తన తమ్ముడిని, తన పిల్లలందరినీ కూడా స్కూల్ టీచర్లుగానే తయారు చేసాడు. మావాడిని పెంచి, చదివించి, పెద్దచేసిన అమ్మమ్మ, మాదొడ్డమ్మగారు కూడా తోటపల్లి కొండలు, శాంతి ఆశ్రమం స్కూల్ లోనే టీచర్ గా పనిచేసారు. ఆవిడ ఒక ఆదర్శ మహిళ. ఆవిడ గురించి ఇక్కడ కాదు. మరొక అధ్యాయంలో ప్రత్యేకంగా రాయాలి.

మొత్తానికి నా మనస్తత్త్వానికి నేను ఉపాధ్యాయుడిగా పనికిరానని తలంపు కలిగింది. వీటన్నిటికంటే ముఖ్యంగా, చిన్నదో చితకదో ఏదో ఒక ఉద్యోగంలో చేరి ఏమాత్రం సంపాదించినా నేను మా నాన్నగారికి  బరువు కాకుండా వుంటాననే సంకల్పం కలిగింది. అయితే ఈ భావాలను స్పష్టంగా ఎవరి దగ్గరా (మా అమ్మగారి దగ్గర కూడా) చెప్పలేకపొవడం నా దౌర్బల్యం. అందుకే నా డిగ్రీ అయ్యాక ఎమ్.ఎ. చేస్తావా అని ఘంటసాలవారు అడిగినప్పుడు ధైర్యంగా స్పష్టమైన సమాధానం చెప్పలేకపోయాను.

ఇక, నా ఉద్యోగ ప్రయత్నాలు మొదలయాయి. మా నాన్నగారి వృత్తి ప్రవృత్తి రెండూ సంగీతమే కావడం వలన వారికి మామూలు చదువులు, వాటి వల్ల దొరికే ఉద్యోగాలు, ఆదాయల పట్ల ఏమాత్రం ఆసక్తిగాని, అవగాహన కానీ నా ఉద్యోగ ప్రయత్నాలకాలం నాటికి వుండేది కాదు. నా ఉద్యోగం గురించి తన మిత్రుల దగ్గర ప్రస్తావించడానికి కూడా అంత సుముఖత చూపేవారు కాదు. నాలోనూ తగినంత చొరవ, ధైర్యమూ లేకపోవడంతో నా ఉద్యోగ ప్రయత్నాలు చురుకుగా సాగలేదు. 

🌿


1950లో భారతదేశం గణతంత్ర రాజ్యంగా రూపొందింది. అమెరికా లో లా ఇక్కడ ప్రెసిడెంట్ వుంటారు. గ్రేట్ బ్రిటన్ విధానంలోలా పార్లమెంట్ ఎక్సిక్యూటివ్ గా ప్రైమ్ మినిస్టర్ వుంటారు. 

మన భారత దేశ మూడవ ప్రెసిడెంట్ గా డా.జకీర్ హుస్సేన్ పదవిలో వున్నప్పుడు డా.వి.వి.గిరిగారు (వరహాగిరి వెంకటగిరి) వైస్-ప్రెసిడెంట్ గా వుండేవారు. శ్రీ గిరిగారు లాయర్ గా, ట్రేడ్ యూనియన్ లీడర్ గా చాలా పేరు ప్రఖ్యాతులు సంపాదించిన వ్యక్తి. మన తెలుగువారు, శ్రీ పి.సూర్యారావుగారు శ్రీ గిరిగారి అల్లుడు. శ్రీ గిరిగారికి ఆడ, మగ సంతానం చాలా ఎక్కువే. అందులో ఒక అమ్మాయి భర్త శ్రీ సూర్యారావుగారు. ఆయన మద్రాస్ లో నున్న ఆంధ్రా సిమెంట్స్ కంపెనీ (దుర్గా బ్రాండ్ సిమెంట్) అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ లో డెప్యూటీ ప్లాంట్ మేనేజర్ గా పనిచేసేవారు. మౌంట్ రోడ్ లో  ఈ ఆంధ్రా సిమెంట్స్ ఆఫీస్ పక్కనే  కె.సి.పి. సిమెంట్స్, కె.సి.పి. సుగర్స్ కంపెనీల ఆఫీసులు వుండేవి. ఇవన్నీ రామకృష్ణ బిల్డింగ్స్ ప్రాంగణంలోనే వుండేవి. ఇవి దాటాక అతి పెద్ద  టి.వి.సుందరం మోటార్ కంపెని వుండేది.
 
శ్రీ సూర్యారావుగారి ఆఫీస్ లో తాత్కాలిక టైపిస్ట్ ఉద్యోగం ఖాళీ వుంది, మీ అబ్బాయిని వెళ్ళి ప్రయత్నించమని మా నాన్నగారికి ఆయన స్నేహితులెవ్వరో చెప్పారు. నేను వెంటనే నా దగ్గరున్న ఉద్యోగ అర్హతలన్నిటితో ఆ ఆఫీసుకు వెళ్ళాను. నన్ను ఇంటర్వ్యూ చేసిన ఆయన ఎదో ఒక మ్యాటర్ ను టైప్ చేసి చూపమన్నారు. చేసి చూపించాను. వారికి సంతృప్తి కలిగింది. నాకు ఆ టెంపరరీ టైపిస్ట్ ఉద్యోగం ఇవ్వడానికి అంగీకరించారు. ఆ ఆంధ్రా సిమెంట్స్ లో అనేకమంది షేర్ హోల్డర్స్. వారందరికీ సంవత్సరానికి ఒకసారి షేర్ సర్టిఫికెట్లు పంపుతారు. ఆ షేర్ సర్టిఫికెట్లు టైప్ చేయడానికి వారికి అదనపు టైపిస్ట్ అవసరమయ్యాడు. ఆ పని వరకే ఆ టైపిస్ట్. ఆ తర్వాత అతని అవసరం వుండదు. అలాటి ఉద్యోగం సుమారు నెలో రెండు నెలలో పనిచేశాను. 9 to 5 ఉద్యోగం. ఆ ఆఫీస్ లో శ్రీ సూర్యారావుగారు మేనేజర్. చౌదరి అనే ఆయన ఎక్కౌంటెంట్. శేషసాయి అనే అతను స్టెనో టైపిస్ట్. వీరు చెప్పిన ప్రకారం పాత సర్టిఫికెట్లు ఆధారంగా కొత్త సర్టిఫికెట్లు తప్పులు లేకుండా టైప్ చేయాలి.  అదే నామొదటి ఉద్యోగం. కొత్త అనుభవం. అప్పట్లో 

నా నైజం 'ఇంట్లో పులి వీధిలో పిల్లి' తరహగా వుండేది. తెలియనివారిని కలసుకొని మాట్లాడడానికి ఏదో బెరుకు, భయం. ఈ లక్షణాలతో ఆంధ్రా సిమెంట్ కంపెనీలో ప్రవేశించాను. ఆ ఆఫీస్ లోని నా మొదటి రోజు అనుభవం నా జీవితంలో మరవలేను. అక్కడ ఎక్కౌంటెంట్, స్టెనోలకు పక్కనే నాకు ఒక టేబిల్, టైప్ రైటర్, తదితర టైపింగ్ సామగ్రి ఏర్పాటు చేసారు. నేను ఆఫీసుకు వెళ్ళి నా సీటులో కూర్చున్న కొంతసేపటికి శేషసాయి వచ్చి మేనేజర్ గారు పిలుస్తున్నారని చెప్పారు. నేను భయం భయంగా ఆయన రూమ్ లోకి వెళ్ళాను. లోపల ఒక పెద్ద ఛైర్లో కూర్చున్న ఆయన చాలా సౌమ్యంగా నన్నేవో మామూలు ప్రశ్నలడిగి ఒక చెక్కును నా చేతిలో పెట్టి బ్యాంక్ లో జమచేసి రమ్మన్నారు.  నా అదృష్టం. ఆ ఆ ఫీసులో వున్నవారంతా స్పష్టమైన తెలుగులోనే మాట్లాడుకునేవారు. మేనేజర్ గారు ఇచ్చిన చెక్కు తీసుకొని చౌదరిగారి దగ్గరకు వెళ్ళి చెప్పాను. " వెళ్ళి రండి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ దగ్గరే. మన ఆఫీసుకు ఎదురు వరసలోనే వుంది. వెళ్ళి కట్టేసిరండి" అన్నారు.  నేను ఆ చెక్కును పట్టుకొని బయటకు నడిచాను. మౌంట్ రోడ్ ఎప్పుడూ వాహనాలతో చాలా జన సమర్ధంగానే వుండేది. అయితే ఇప్పుడున్నంతగా కాదు. రోడ్ ఇవతల వేపునుండి అవతలవేపుకు సులభంగానే వెళ్ళగలిగాను. అప్పట్లో IOB మౌంట్ రోడ్ బ్రాంచ్ సామాన్యంగానే వుండేది. వెనకవేపు ఇప్పుడున్న మల్టీస్టోరీడ్  కార్పరేట్ బిల్డింగ్ అప్పుడు లేదు. ఆ చెక్ పట్టుకొని బ్యాంక్ లోపలికి వెళ్ళాను. స్వతంత్రంగా బ్యాంకుకు వెళ్ళడం అదే మొదటిసారి. అంతకుముందు ఈ వూరు వచ్చిన కొత్తల్లో  ఒకసారి మా నాన్నగారి తో పాండీబజార్లోని బరోడా బ్యాంకు వెళ్ళాను. అప్పుడు ఆయన చెక్కు కట్టడానికి వచ్చారా, లేక డబ్బులు తీసుకుందికి వచ్చారా అని కూడా తెలియని స్థితి. ఇప్పుడు ఈ IOB లో బొల్డన్ని కౌంటర్స్. అన్నిటిముందు చాలా మంది జనాలు. ఎక్కడికి వెళ్ళాలో ఎవరికి ఇవ్వాలో తెలియదు. చివరకు ఎవరినో అడిగాను. అతను ఆ పక్కన చలాన్ వుంటుంది అది ఫిలప్ చేసి అక్కడి కౌంటర్లో ఇవ్వండి అని చెప్పి వెళ్ళిపోయాడు. నేను ఆ చలాన్స్ వున్నచోటికి వెళ్ళి చూస్తే అక్కడ సినీమా పాంప్లెట్స్ లా రోస్,బ్లూ,ఎల్లో,వైట్ కలర్స్ లో రంగురంగు కాగితాలు కనిపించాయి. వాటిలో దేనిని తీసుకోవాలో తెలియలేదు. దానికి మళ్ళీ మరొకరిని అడిగాను. కరెంట్ ఎక్కౌంట్ అయితే ఇది, సేవింగ్స్ ఎక్కౌంట్ అయితే ఇది అని ఏవో కాగితాలు చూపి వెళ్ళిపోయాడు. మళ్ళీ నేను అయోమయంలో పడ్డాను. నా దగ్గరి చెక్కు సేవింగ్సా? లేక కరెంట్ ఎక్కౌంటా? అది కూడా తెలియని ప్రాథమికావస్థ. ఈ కాగితాలు పట్టుకొని మరల ఆఫీసుకు వెళ్ళి ఆ శేషసాయి చేతే నింపించి బ్యాంకులో జమ చేస్తే ఎలా వుంటుందని ఒక ఆలోచన. కానీ అలాచేస్తే వీడికి చెక్కు కట్టడం రాదు. ఉద్యోగానికి అన్ఫిట్ అని ఇంటికి పంపించేస్తే ? ఒంటికి చెమటలు పట్టేసాయి. మళ్ళి మరో దగ్గర కొంచెం ఫ్రీగా వున్న మనిషి దగ్గరకు వెళ్ళి సిగ్గువిడిచి అడిగాను ఈ చెక్కు డిపాజిట్ చెయ్యడానికి ఛలాన్ నింపిపెట్టమని. అతను నన్ను ఎగాదిగా చూసి, ఏ కళననున్నాడో మారు చెప్పకుండా ఛలాన్ పూర్తిచేసి క్రిందన నన్ను సంతకం చెయ్యమన్నాడు. తెలుగులో చెయ్యాలా? ఇంగ్లీషులోనా? సందేహం. అతను ఇంగ్లీషు లో రాశాడు కనక ఇంగ్లీష్ లోనే ధైర్యంగా సంతకం చేశాను పట్రాయని ప్రణవ స్వరాట్ అని. ఆ చెక్కును  ఛలాన్ కు గుండుసూదితో జతపర్చి ఏ కౌంటర్లో ఇవ్వాలో చెప్పి పుణ్యం కట్టుకున్నాడు ఆ మహానుభావుడు. నా విషయంలో అలాటి మహానుభావులెందరో. ఆ సమయంలో నాకు ఒక బ్రైటెస్ట్ అవిడియా వచ్చింది. భవిష్యత్ లో ఇలాటి సమస్య ఎదుర్కోకుండా అతను రాసినట్లే ఒక నమూనాను మరో ఛలాన్ మీద వ్రాసి నా జేబులో పెట్టుకొని మొత్తానికి ఆ చెక్కును డిపాజిట్ చేసి స్టాంప్ వేసిచ్చిన కౌంటర్ ఫాయిల్ ను మరో జేబులో భద్రంగా పెట్టుకొని విజయవంతంగా ఆఫీసుకు చేరుకున్నాను. ఒక పది నిముషాలలో చెక్ డిపాజిట్ చేసి రావలసిన మనిషి ఒక గంటైనా తిరిగి రాకపోయేప్పటికి  చౌదరీగారు కాస్తా కంగారుపడి నాకోసం శేషసాయిని పంపే యోచనలో పడ్డారు. నన్ను చూడగానే ఆయన ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నారు. నేను అంతకంటే ఎక్కువగా హాయిగా ఊపిరి పీల్చుకున్నాను.   ఒక నెలకో రెండు నెలలకో   షేర్ సర్టిఫికెట్లు తయారయాయి. ఆంధ్రా సిమెంట్ కంపెనీలో నా ఉద్యోగమూ ముగిసిపోయింది. నా మొదటిరోజు ఆఫీసు అనుభవాన్ని మాత్రం జీవితాంతం మర్చిపోలేను. 

ఆ ఉద్యోగం తర్వాత కొన్నాళ్ళపాటు  మళ్ళీ రికార్డింగులు, రీరికార్డింగ్ లతోనే కాలం గడిపాను. ఎన్ టి రామారావు గారితో 'శకుంతల' సినీమా నిర్మించిన రాజ్యం పిక్చర్స్ వారు ఈ సారి అక్కినేని నాగేశ్వరరావుగారి ద్విపాత్రాభినయం లో ఒక సాంఘిక చిత్రాన్ని మొదలుపెట్టారు. కన్నడంలో రాజ్ కుమార్ హీరోగా ఎంతో విజయం పొందిన 'ఎమ్మె తమ్మన్న' ఈ తెలుగు సినీమాకు మూలం.  కన్నడంలో నటించిన భారతి, రాజశ్రీలు హీరోయిన్లు. వినోదమే ప్రధానంగా గల ఈ సినీమా తర్వాత హిందీలో జితేంద్రతో ' జిగ్రిదోస్త్' గా, తమిళంలో  ఎమ్జీయార్ తో ' మాట్టుక్కార వేలన్' గా ఘన విజయాన్నే సాధించాయి. అదే తెలుగులో 'గోవుల గోపన్న'. ఘంటసాల మాస్టారిదే సంగీతం. డైరక్షన్ సి ఎస్ రావు. కొన్ని పాటల కంపోజింగ్ మాస్టారింట్లోనే జరిగాయి. ఆ సమయంలో దాశరధిగారు,  కొసరాజుగారు, అసిస్టెంట్ డైరక్టర్ జగన్నాధరావు, డైరక్టర్ బాబ్జి మాస్టారింటికి వచ్చేవారు. ఘంటసాలవారు సి.ఎస్ రావు గారిని బాబ్జీ అని ఆప్యాయంగా పలకరించేవారు. రావుగారు అందరిలాగే ఘంటసాలగారిని మాస్టారు అనే గౌరవంగా పిలిచేవారు.

ఈ సినీమాలోని ఎనిమిది పాటలను శ్రీశ్రీ, ఆరుద్ర, కొసరాజు, ఆరుద్ర రాశారు. ఈ పాటలను ఘంటసాలవారితో పాటు సుశీల, ఎస్.జానకి, బెంగుళూరు లత , జె.వి.రాఘవులు పాడారు. పాటల రికార్డింగ్, రీరికార్డింగ్ వడపళని సాలిగ్రామంలో వున్న అరుణాచలం స్టూడియోలో జరిగాయి. దాశరధిగారు వ్రాయగా ఘంటసాలవారు, సుశీలగారు ఆలపించిన  యుగళగీతం 'ఆకాశంలో హంసలమై హాయిగ ఎగిరే జంటలమై', 'కన్నెల వలపుల వెన్నలు దోచే కన్నయ్యా యీ మాయ ఏలా' , శ్రీశ్రీగారు వ్రాసిన ' ఈ విరితోటల లోగిటిలో', కొసరాజు గారు వ్రాసిన 'వినరా వినరా నరుడా తెలుసుకోరా పామరుడా" (ఈ పాట సినీమాలో రెండుసార్లు వస్తుంది. ఒకటి మాస్టారి సోలో. మరొకటి సుశీలగారితో డ్యూయెట్). మరొకటి ఎస్ జానకిగారు పాడిన 'హడావుడి పెట్టకోయ్ బావా'. ఆరుద్ర రచన . కొన్ని పాటల రికార్డింగ్ లకు నేనూ వెళ్ళాను. ఈ చిత్రంలో పాటలన్నీ చాలా మెలోడియస్ గా, హుషారుగా వుంటాయి. ఈ సినీమాలో ఘంటసాలవారు వెస్టర్న్ వాద్యాలను బాగా ఉపయోగించారు. ఓ రెండు డ్యూయెట్లు వెస్టర్న్ వాల్జ్ బాణీలో  శ్రావ్యంగా వినిపిస్తాయి. పాటల మధ్య వైవిధ్యం కనిపిస్తుంది. సి.ఎస్.రావుగారి చాలా సాంఘికాలలో శాస్త్రీయ సంగీత శైలిలో నృత్యగీతాలు కనిపిస్తాయి. ఈ సినిమాలో కూడా హిరో డ్రీమ్ లో రాధాకృష్ణుల రాసలీల పాటను ఎంతో మనోజ్ఞంగా చిత్రీకరించారు అక్కినేని, భారతి నటించిన ఆ పాట 'కన్నెల వలపుల వెన్నలు దోచే' దాశరధిగారి పాట.  హాయినిగొలిపే ఆ పాట నాకెంతో యిష్టం.  
ఈ సినీమా రీరికార్డింగ్ కు నేను వెళ్ళినప్పుడు విలన్ ఇంటిలో, అతని రహస్య స్థావరంలో జరిగిన ఫైట్స్, సీన్స్ కు మ్యూజిక్ పోస్ట్ చేశారు. అలాగే  సినీమా టైటిల్ మ్యూజిక్  కూడా  ఆద్యంతం చాలా ఉత్సాహభరితంగా చేయడం చూశాను. ఎన్నో రకరకాల వాద్యాలు ఒకేసారి లైవ్ లో వాయిస్తుండగా వినడం నాకెప్పుడూ థ్రిల్లింగ్ గా వుండేది. ఈ అనుభవం కోసమే ఘంటసాల మాస్టారు పని చేసిన చాలా చిత్రాల రీరికార్డింగ్ లకు పనికట్టుకు వెళ్ళి చూసి, విని ఆనందించేవాడిని. 

💥కొసమెరుపు💥

గోవుల గోపన్న సినిమా కు సి.ఎస్.రావుగారి దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన జగన్నాధరావుగారు ఆ సినిమా లో కొన్ని సీన్లలో  అక్కినేని డూప్ గా కనిపిస్తారు. 

వచ్చేవారం మరికొన్ని సినిమా విశేషాలతో....
                  ...సశేషం

*With a view to make the narrative more authentic and to corroborate it, images, audio and video clips are attached at appropriate places. If such usage is found objectionable to the copyright holders the same shall be removed if and when notified.