visitors

Sunday, November 21, 2021

నెం. 35 , ఉస్మాన్ రోడ్ (ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 2 - ఏభై ఎనిమిదవ భాగం

21.11.2021 - ఆదివారం భాగం - 58*:
అధ్యాయం 2  భాగం 57 ఇక్కడ


నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్

"రామం! ఇవేళ పిల్లల్ని ప్రసాద్ కి తీసుకురావే, పిల్లల  పాటను షూట్ చేస్తున్నాము. సరదాపడతారు. సరోజాదేవి, రామారావుగారి కాంబినేషన్" అని చెపుతూ అక్కడే వున్న "నన్ను చూసి నువ్వు కూడా రావోయి" అని ఓ మాట అనేసి వెళ్ళిపోయారు నిర్మాత భమిడిపాటి బాపయ్యపంతులుగారు. మా క్రిందింటి వెంకటేశ్వరరావు గారి బావమరది. షూటింగ్ ఏ.వి.ఎమ్.లోనో, ప్రసాద్ లోనో జరిగింది. ప్రసాద్ స్టూడియోవే కావచ్చు. ఒకప్పుడు వాహినీలో ఒక  వెనక భాగం విజయా స్టూడియోస్. దానిని ఎల్.వి.ప్రసాద్ గారు లీజ్ కు తీసుకొని ప్రసాద్ స్టూడియో గా మార్చారు. ఆ స్టూడియో లో ఈ పాట షూటింగ్.  రావుగారి కార్లో మేము స్టూడియో ఫ్లోర్ లోకి అడుగుపెట్టేప్పటికి "ఎవరో వచ్చే వేళాయే ఎదురై కాస్త చూస్తారా! వాకిలి తీసే ఉంచారా మరి ఒకసారి చూస్తారా" అనే పాట పల్లవి వినిపిస్తోంది.  మా కోసమే పాడుతున్నారా అనిపించింది. ఈ పాట ఏ సినీమాలోదో మీకందరికీ తెలిసేవుంటుంది. 'మాయని మమత' సినీమా లోనిది. దేవులపల్లి కృష్ణశాస్త్రిగారి ముద్రగల పాట. అశ్వత్థామగారి సంగీతం. శ్రీమతి పి.సుశీల, బి.వసంత గార్లగానం. 

ఎవరో వచ్చే వేళాయె - మాయని మమత

పదమూడేళ్ళ వయసు నుండి ఆరేళ్ళ వయసులోపలి మూడు జతల ఆడపిల్లలతో సరోజాదేవి ఆడుతూ పాడే పాట షూటింగ్. షూటింగ్ అనేది నావరకు  చాలా విసుగెత్తించే విషయం. నత్త నడకలా సాగుతుంది వ్యవహారం. జైంట్ లైట్ల వెలుగు,  సెట్ లోపలి వేడి చాలా చికాకుగా వుంటుంది. అందులోనూ డాన్స్ సాంగ్. వెళ్ళిన కొంతసేపువరకు ఉత్సాహంగానే వుంటుంది. ఒక పల్లవి షూటింగ్ అవడానికి ఒక పూట పట్టింది. మొత్తం పాట అవడానికి ఎన్ని కాల్షీట్లు అయాయో? ఇంతకూ ఆ రోజు షూటింగ్ కు రామారావు గారు రానేలేదు. ఆయన షాట్స్ మరోరోజు , కంబైన్డ్ షాట్స్ మరో రోజు తీస్తారని అనుకున్నారు. ఈ పిల్లలతో ఉన్న భాగం పూర్తికావడానికే రెండురోజులు పడుతుందని అన్నారు. ఈలోగా లైట్లు, కెమేరాల సెట్టింగ్ కోసం బ్రేక్ ఇచ్చారు. ఆ గ్యాప్ లో ప్రొడక్షన్ ఇన్ఛార్జ్ శాస్త్రిగారు వచ్చారు.  మర్నాటి షూటింగ్ గురించి ఆర్టిస్ట్ లతో చర్చలు. ఈ ఆడపిల్లల గ్రూప్ లో ఉండే ఒక పెద్ద అమ్మాయి, జయ కౌసల్య (అనే గుర్తు) కు డేట్స్ క్లాష్. మర్నాడు మరేదో తమిళ్ మూవీ షూటింగ్. ఆ అమ్మాయికి వీలయిన రోజున హీరోయిన్ సరోజాదేవికి అవకాశం లేకపోవడం వంటి విషయాలన్నో చర్చకు వచ్చి చివరకేదో సద్దుబాటు చేసుకున్నారు.  ఈ శాస్త్రిగారిని తెలిసినవారంతా నక్షత్రక శాస్త్రి అనేవారు. ఏ కార్యం సాధించాలన్నా పట్టినపట్టు వదలకుండా అవతల వాళ్ళ చుట్టూ వదలకుండా తిరుగుతూ  పనులు సాధించేవారు. అలాటివారే సినీమా రంగంలో ప్రొడక్షన్ మేనేజర్లుగా రాణిస్తారు. కెమెరా ఏంగిల్స్ అన్ని చూసి మరో షాట్ కు రెడి అనడానికి  ఇంకా చాలా సమయం పట్టేలా కనిపించింది. ఇంక ఆ వేడిలో కూర్చొనే ఓపిక మా రావుగారి పిల్లలలో నశించింది. మెల్లగా అక్కడనుండి బయటపడి ఇంటికి చేరుకున్నాము.

'మాయని మమత' సినీమా టైటిల్స్ లో గాయకుడిగా ఘంటసాలవారి పేరు ముందు ' పద్మశ్రీ' అని వేసారు.  అందులో మాస్టారు పాడిన 'రానిక నీకోసం రాదిక వసంతమాసం' పాట ఈనాటికీ సంగీతాభిమానుల ను అలరిస్తూనేవుంది. 'మాయని మమత'  సినీమా బాగానే వచ్చింది.  పెద్ద నటులు,  పేరున్న డైరక్టర్, మంచి సంగీతం, అంతా బాగుంది కానీ, ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. నిర్మాతకు మాత్రం  సినీమా లంటే మమతను మిగల్చకుండా నిరాశాజనక మచ్చగా మిగిలిపోయింది. 

🌿


1970లో ముగ్గురు 'పద్మశ్రీ'లతో విడుదలైన మరో చిత్రం 'విజయం మనదే'. ఇందులోని హీరో ఎన్.టి.రామారావు, హీరోయిన్ బి.సరోజాదేవి, గాయక సంగీత దర్శకుడు ఘంటసాల - ముగ్గురు 'పద్మశ్రీ' గ్రహీతలే. బి.విఠలాచార్య దర్శకత్వంలో ఘంటసాలవారి సంగీతంతో వచ్చిన ముచ్చటైన మూడవ ఆఖరి చిత్రం. ఈ చిత్రం తర్వాత వారిద్దరూ కలసి పనిచేయలేదు. ఈ చిత్ర నిర్మాత నందమూరి సాంబశివరావుగారు  ఎన్.టి.రామారావుగారి కజిన్. ఆయనకు ఘంటసాల గారంటే మంచి గౌరవం, అభిమానం. 'విజయం మనదే' సినీమాకు మూలం 'అరసిలన్ కుమారి' అనే ఒక ఎమ్.జి.ఆర్. సినీమా. ఆ సినీమాను 'కత్తి పట్టిన రైతుగా' డబ్ చేసారు. ఆ సినిమా రీమేక్ 'విజయం మనదే'.
 
ఈ చిత్రంలోని ఘంటసాలవారు పాడిన 'శ్రీరస్తు శుభమస్తు' పాట, సుశీలగారితో పాడిన యుగళాలు - 'ఓ దేవి ఏమి కన్నులు నీవి', ' నా మదిలో ఉందొక మందిరము', ఎస్ జానకి గారి సోలో 'ఎవ్వరో పిలిచినట్టుట్టుంది' వంటి పాటలన్నీ సుశ్రావ్యమే. ఈ సినీమా కంపెనీ ఆఫీస్ సౌత్ ఉస్మాన్ రోడ్ చివరలోని సి.ఐ.టి.నగర్ లో వుండేది. కొన్ని పాటల కంపోజింగ్ కు వెళ్ళాను. ఈ చిత్రంలో దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు ఒక పాట రాసారు 'శ్రీరస్తు శుభమస్తు చిన్నారి నా చెల్లికి - కొంచెం కొంచెం బిడియాలు పాట' వారు వ్రాసిందే.  

కొంచెం కొంచెం బిడియాలు - విజయం మనదే

వారి సినీ గీతాల రచనా శైలి గురించి గతంలో ముచ్చటించడం జరిగింది.  ఒకపట్టాన వారి కలం నుండి అక్షరరూపంలోకి వచ్చేవికావు. ఆయన అలా చిద్విలాసంగా అందరి ముఖాలు చూస్తూ నవ్వుతూ కూర్చునేవారు. ఎంతసేపైనా సంగీత దర్శకుడు  'తననాలు' పలుకుతూండవలసిందే, పల్లవి మాత్రం కాగితం మీదకు ఎక్కేది కాదు. ఇక అందరికీ విసుగు పుడుతున్నదన్న సమయంలో తన మనసులోని మాట పల్లవిగా వెలువడేది. అవి శిలాక్షరాలే. ఆణిముత్యాలే. ఈ పాట చరణంలో 'పుట్టినింట మహరాణి, మెట్టినింట యువరాణి' అనే పద ప్రయోగం ఆ సినీమా యువ అసిస్టెంట్ డైరక్టర్ కు అర్ధం కాలేదు. అందులో ఏదో తప్పును కనిపెట్టబోయాడు. అప్పుడు కృష్ణశాస్త్రి గారు వ్రాసి చూపించారు 'ఆడపిల్ల పుట్టింటిలో వున్నంతవరకూ మహా స్వేఛ్ఛగా మహారాణీ లా వుంటుంది, అదే కొత్తగా వివాహమై అత్తవారింటికి వెడితే అక్కడ అత్తగారిదే మహారాణి హోదా. కోడలు యువరాణిగానే పరిగణింపబడుతుంది' అంటూ  కోడలి స్థాయి గురించి  చక్కగా విశ్లేషించారు. అనుభవంలేని ఆ అత్యుత్సాహ సహాయదర్శకుడు వెనక్కి తగ్గాడు. ఏ కారణం చేతనో 'విజయం మనదే' సినీమాకు ఘంటసాలవారికి సహాయకుడిగా పనిచేసినా మానాన్నగారి పేరు సినీమా టైటిల్స్ లో వేయలేదు. ఒక్క పామర్తి గారి పేరు మాత్రమే కనిపిస్తుంది. ఆ సినీ మాయేమిటో నాకు అర్ధం కాదు. 

🌿🌺🌿


గతంలో ఒకసారి చెప్పాను, నాకు ఘంటసాల మాస్టారింట్లో వింతగా అనిపించిన విషయం, ఒకే పేరుతో ఇద్దరేసి వ్యక్తులు ఆ ఇంటితో అతి సన్నిహితంగా మెలగడం. ఇద్దరు వెంకటేశ్వర రావులు (ఘంటసాల, పామర్తి), ఇద్దరు కృష్ణలు (తమ్ముడు కృష్ణ మావయ్య కృష్ణ),  ముగ్గురు రాఘవులులు (సంగీత సహాయకుడు జె.వి.రాఘవులు, కచేరీలలో సహగాయకుడు కె.ఎస్. (తిరపతి) వీర రాఘవులు, దోభీ రాఘవులు, అలాగే  ఇద్దరు హరినారాయణలు (ఒకరు ఎడిటర్ బి.హరినారాయణ, మరొకరు సావిత్రమ్మగారి తమ్ముడు కె.హరినారాయణ (అసిస్టెంట్ కెమెరామెన్).

ఎడిటర్ హరినారాయణ గారిని నేను మద్రాస్ వెళ్ళినప్పటినుండి మాస్టారింట్లో చూసేవాడిని. లావుగా, పొడుగ్గా సగం నెరిసిన ఉంగరాల జుత్తుతో నీలం రంగు కళ్ళతో భారీగా కనిపించేవారు. మాస్టారింట్లోని పిల్లలందరికీ తన కెమేరాతో ఫోటోలు తీసేవారు. ఘంటసాలగారి సొంత సినీమాలకు అసిస్టెంట్ ఎడిటర్ గా,  దర్శకుడిగా పనిచేసేవారు. ఘంటసాలవారంటే చాలా గౌరవాభిమానాలుండేవి. ఆ కుటుంబంతో చాలా ఆత్మీయంగా వుండేవారు. తర్వాత భానుమతి గారి భరణీ స్టూడియోలో ఆవిడకు అసిస్టెంట్ గా, ఎడిటర్ గా మంచి అనుభవం సంపాదించారు. ఆ బి. హరినారాయణ తన సోదరుడితో కలసి 'మెరుపు వీరుడు'  అనే జానపద సినీమా ను కాంతారావు, రాజశ్రీ,రాజనాల, లక్ష్మి, విజయలలితలతో  తన స్వీయ దర్శకత్వంలో  ప్రారంభించారు. ఆ సినీమాకు ఘంటసాలవారే సంగీతం. 1970 లోనే విడుదలయింది. అంతకుమించి ఈ సినీమా గురించి ఎక్కువగా చెప్పడానికి ఏమిలేదు. చిత్రం జయాపజయాల గురించి పెద్దగా అవగాహన లేదు. అయితే హరినారాయణ సోదరులు తర్వాత మరో క్రైమ్ థ్రిల్లర్ తీసారు. దానికీ ఘంటసాలవారే సంగీత దర్శకులు. ఆ సినీమా గురించి తర్వాత చెపుతాను.

🍀

రామవిజేతా బాబూరావు నిర్మించిన ' తల్లిదండ్రులు'  సినీమాకు ఘంటసాలవారే సంగీత దర్శకత్వం వహించారు. ఈ సినీమా లోని ఏడు పాటలలో ఓ నాలుగు పాటలను ఎంతో చక్కగా స్వరపర్చారు మాస్టారు. సుశీలగారు పాడిన 'పాట పాడనా ప్రభూ పాట పాడనా', ఎస్.జానకి బృందం పాడిన 'గొబ్బియళ్ళో  కొండామల్లెకు గొబ్బిళ్ళు', ఘంటసాల-జానకి యుగళగీతం 'మనిషిని చూశాను ఒక మంచి మనిషిని చూశాను', 'ముద్దులు కురిసే ఇద్దరి మనసులు', పాటలు ఎంతో బాగుంటాయి. కుటుంబగాధా చిత్రాలను తెరకెక్కించడంలో బాబూరావు చాలా సమర్ధుడు.

'తల్లిదండ్రులు' సినీమా రీరికార్డింగ్ కు ముందు రష్ వేసి చూపించారు. మాస్టారు, మా నాన్నగారితో పాటూ నేనూ వెళ్ళాను. ఆ రష్ మూవీ చూడడానికి జగ్గయ్య, శోభన్ బాబు, రాజబాబు, అల్లు రామలింగయ్యగార్లు కూడా వచ్చారు. సినీమా ప్రారంభించడానికి వ్యవధి వుండడంతో వీరంతా కబుర్లలొ పడ్డారు. ఆ సందర్భంలో జగ్గయ్య, శోభన్ బాబు గార్ల సంభాషణ 'విగ్గు'ల మీదకు వెళ్ళింది. జగ్గయ్యగారు తనకైతే విగ్గు తప్పనిసరని, మంచి తలకట్టు గల శోభన్ విగ్గులు లేకుండా సహజమైన జుట్టుతో కనిపిస్తే బాగుంటుందని తన నిర్మాతలకు నచ్చజెప్పమని సూచించారు. అందుకు దర్శకులు, నిర్మాతలు సహకరించడంలేదని చెపుతూండగా విన్నమాటలు బాగా గుర్తుండిపోయాయి. రాజబాబు గారైతే తన సీటులోంచి లేచివచ్చి ఘంటసాల మాస్టారి కాళ్ళ దగ్గర కూర్చొని ఆయన చేతులు పట్టుకొని 'బాబాయ్' అంటూ వినయంగా, ఆప్యాయంగా మాట్లాడడం నాకు ఆశ్చర్యం కలిగించింది. అల్లు రామలింగయ్యగారైతే ఈ లోకంలో వున్నట్లే కనపడలేదు. తనలో తాను ఏదో పాడుకుంటూ కూర్చొనివున్నారు. కొంతసేపటికి సినీమా వేయడం ఔట్ పుట్ బాగానే వచ్చిందని అందరూ అనుకోవడం జరిగింది. 

💥

ఘంటసాల మాస్టారి స్వీయసంగీతంలో పాటలేవీ పాడని సినీమాలు ఏవైనా వున్నాయా అంటే సందేహా స్పదమే. కానీ గిరిధర్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద వచ్చిన 'రెండు కుటుంబాల కథ' లో మాస్టారి పాటలు లేవు. లీల, సుశీలగార్లు పాడిన ఒక పాట ప్రారంభంలో ఒక చిన్న సాకీలాటిది మాత్రమే పాడారు. 

జగతికి జీవము నేనే - రెండు కుటుంబాల కథ

ఆ సినీమాలో ఉన్నవి ఆరే ఆరు పాటలు. సుశీల, లీల, ఎల్.ఆర్.ఈశ్వరి, స్వర్ణలత, పిఠాపురం పాడారు. ఈ  సాంఘిక సినీమా లోని మూడు పాటలు ఘంటసాలవారి శాస్త్రీయ సంగీత విద్వత్తుకు దర్పణం పట్టేవిగా వుంటాయి. అవి - 'వేణుగాన లోలుని గన', 'జగతికి జీవము నేనే', 'మదిలో విరిసే తీయని రాగం' పాటలు. ఈ పాటలు ఎన్ని దశాబ్దాలైనా నిత్యనూతనంగా శ్రవణానందకరంగానే వుంటాయి. ఈ సినీమా నిర్మాత వి.ఎస్.గాంధి. కాస్ట్యూమ్స్ గాంధిగా చిత్రసీమలో చాలా అనుభవం, పేరు గడించారు. ఆయన ఇంటిపేరు వృధ్ధులవారు. ఆ ఇంటిపేరు గలవారు బొబ్బిలిలో వుండేవారు. ఈ గాంధీగారి స్వస్థలం కూడా బొబ్బిలేనని మా నాన్నగారు అనడం గుర్తు. ఆయన మానాన్నగారు కలిసినప్పుడు ఆ బొబ్బిలి విషయాలు జ్ఞప్తికి తెచ్చుకునేవారు.

ఈ సినీమా కథకు మూలం ద్వివేదుల విశాలాక్షిగారి 'వారధి' నవల. సినీమా స్క్రిప్ట్ కోసం కావలసిన సినాప్సిస్ నాచేతే వ్రాయించారు విశాలాక్షిగారు. ఆ కారణం చేతనేమో తెలియదు. ఈ సినీమా నిర్మాణ సమయంలో సినీమాలలో ఏదో శాఖలో చేరితేనో అనే చిన్న దురద నాకు పుట్టిన మాట వాస్తవం. అయితే అందుకు మానాన్నగారి, ఘంటసాల మాస్టారి ఆమోదమూ లభించదని నాకు బాగా తెలుసు. అసలు సినీమాలకు కావలసిన ఏ అర్హత నాకు లేదని తెలిసికూడా దురదపుట్టిందంటే అది శుధ్ధ అవివేకమే. 

🔔


1970లో సంగీత దర్శకుడిగా, గాయకుడిగా మంచి పేరును తెచ్చిపెట్టిన సినీమా 'ఆలీబాబా 40 దొంగలు'. ఈనాటి పరిభాషలో ఒక పెద్ద బ్లాక్ బస్టర్. వినోదమే ప్రధానంగా తీయబడిన సినీమా. ఈ సినిమా ఘంటసాల మాస్టారి పరిచయ వాక్యాలతో ప్రారంభమవుతుంది. సినీమా లోకంతో సంబంధంలేని, బొబ్బిలి పట్టణానికి సమీపంలోని పిరిడి అనే చిన్న గ్రామంలో కొలువైవున్న వీరభధ్రస్వాములు, చండికా అమ్మవారి అనుగ్రహంతో ఈ జానపద సినీమాను విడుదల చేస్తున్నామని ప్రకటించడం, పరిత్రాణాయ సాధూనాం అని భగవద్గీత శ్లోకం వినిపించడం  నాలాటి కుర్రకారుకు తమాషాగా అనిపించిన  విషయం. ఏమైనా సినీమా బాగా విజయం సాధించింది. ఈ సినీమాలో సి.నా.రె., దాశరథి, కొసరాజుగార్లు వ్రాసిన 10 పాటలను ఘంటసాలవారి సుశ్రావ్య స్వరరచనలో ఆయనతో పాటు సుశీల, ఎల్.ఆర్.ఈశ్వరి, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యంలు మృదుమధురంగా ఆలపించారు. ఈ సినీమా హీరోయిన్ జయలలిత కూడా సొంతంగా ఒక పాటను పాడారు. ఆ పాట విశేషాలు గతవారాలలో చెప్పడమయింది. 

ఆలీబాబా 40 దొంగలు సినీమా లోని అన్ని పాటలు మంచి మనసుకు పట్టేవిగానే వుంటాయి. వాటిల్లో - 'మరీ అంతగా బిడియమైతే', 'సిగ్గు సిగ్గు చెప్పలేని సిగ్గు', 'నీలో నేనై  నాలో నీవై', 'లేలో దిల్బహార్ అత్తర్', 'రావోయి రావోయి రాలుగాయి', 'చల్ల చల్లనీ వెన్నెలాయె' పాటలు ఈనాటికీ అందరికీ గుర్తుండిపోయిన పాటలు. 

మరీ అంతగా బిడియమైతే - ఆలీబాబా 40 దొంగలు

గౌతమీ రామబ్రహ్మంగారికి ఘంటసాలవారు సంగీత దర్శకుడిగా పనిచేసిన రెండవ ఆఖరు చిత్రం. ఈ సినీమా తర్వాత తీసిన 'వాడే వీడు' లో మాస్టారు పాటలు మాత్రమే పాడారు. ఆ సినీమా తర్వాత రామబ్రహ్మంగారు మరే సినీమాలు తీసినట్లు లేదు. మనిషి చాలా నిరాడంబరంగా వుండేవారు. 

🌿🌿

1970 చివర నాటి వరకూ నిరంతరాదయం వచ్చే ఉద్యోగమేదీ దొరకలేదు. చేస్తూ వచ్చిన తాత్కాలిక ఉద్యోగమూ పోయింది. చేస్తున్న ప్రయత్నాలేవీ ఫలించడంలేదు. ఇలాటి పరిస్థితులలో కొన్ని అనూహ్యమైన విషయాలు జరిగాయి.

ఒకరోజు ఓ ఇద్దరు వ్యక్తులు మా నాన్నగారిని వెతుక్కుంటూ వచ్చి తమను తాము పరిచయం చేసుకున్నారు. ఒకరు వేదుల సుబ్బారావుగారు, మరొకాయన ద్విభాష్యం సుబ్బారావు గారు. మళ్ళీ, ఇద్దరు సుబ్బారావులు. వేదులవారు, ద్విభాష్యంవారూ మా స్వశాఖీయులే. పరరాష్టంలో వున్న తెలుగువారంతా ఒకరినొకరు కలుసుకుంటూ స్నేహాలు కలుపుకోవడం పరిపాటే. ఆ విధంగానే ఈ సుబ్బారావు ద్వయం మా నాన్నగారితో మాట్లాడేందుకు వచ్చారనుకున్నాను. ఇద్దరిలో ఒకరు నాలాగే పొట్టిగా వున్నాయన ద్విభాష్యం సుబ్బారావుగారు. మద్రాస్ అంబత్తూర్ లోని టి.ఐ.సైకిల్స్ ఫ్యాక్టరీలో ఉద్యోగం. విల్లివాక్కం  నివాసం. ఆ ఇద్దరూ మా నాన్నగారి తో కాసేపు మాట్లాడి వెళ్ళిపోయారు.

ఈ నూతన పరిచయస్థుల రాకకు కారణమేమిటో తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే... వచ్చే వారమే...

            ...సశేషం

*With a view to make the narrative more authentic and to corroborate it, images, audio and video clips are attached at appropriate places. If such usage is found objectionable to the copyright holders the same shall be removed if and when notified.

1 comment:

Patrayani Prasad said...

ఆనాటి విషయాలన్నీ చాల వివరంగా విపులంగా వ్రాస్తున్న అన్నయ్యకు ధన్యవాదాలు. పట్రాయని ప్రసాద్ .