visitors

Sunday, November 28, 2021

నెం. 35 , ఉస్మాన్ రోడ్ (ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 2 - ఏభై తొమ్మిదవ భాగం

28.11.2021 - ఆదివారం భాగం - 59*:
అధ్యాయం 2 భాగం 58 ఇక్కడ

  

నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్

ప్రధమంగా ఎవరైనా వోటర్ల లిస్ట్ లోకి ఎక్కేరంటే ఆ యువతీ యువకులు పెళ్ళీడుకు వచ్చినట్లే. 1970ల నాటికి బాల్య వివాహాలనేవి రూపుమాసిపోయినా ఉత్తర భారత దేశంలోని అనేక మారు మూల గ్రామాలలో ఇంకా  అక్కడక్కడ ఈ బాల్య వివాహాల జాడ్యం కనిపిస్తూనే వుంటుంది. ఇరవై ఏళ్ళు వచ్చేసరికే పెళ్ళిళ్ళు అయి వారికి పిల్లలూ పుట్టేస్తారు. సంసార జంఝాటంలో ఇరుక్కుపోతారు. ఎవరికైనా  ఏ కారణం చేతైనా ఇరవైయైదేళ్ళలోపు పెళ్ళి కాకపోతే వాళ్ళు ముదురు బెండకాయలక్రిందే లెఖ్ఖ. నేను ఆ కేటగిరిలోకి చేరకముందే పెళ్ళిచేసి చూడాలని మా పెద్దలు సంకల్పించారు. ఔననడానికి కానీ, కాదనడానికి కానీ కావలసిన మనస్థైర్యం,మనో పరిపక్వత ఆనాటికి నాకు ఏర్పడలేదు.

మా ఇంటికి వచ్చి వెళ్ళిన ఆ ద్విభాష్యం సుబ్బారావుగారి పెద్దమ్మాయి నాకు తగినదనే భావన మా నాన్నగారికి అమ్మగారికి కలిగింది. శ్రీ సుబ్బారావు గారి కోరికకు అంగీకారం తెల్పారు. సమానవియ్యం, సమాన కయ్యం అనే సిధ్ధాంతాన్ని మా పెద్దలు పాటించినట్లున్నారు.  సుబ్బారావు గారిది సంగీత కులం కాదు. మద్రాస్ అంబత్తూర్ లో వున్న టి.ఐ. సైకిల్స్ ఫ్యాక్టరీలో చిరుద్యోగి. అయితే వారి కుటుంబానికి మా కుటుంబానికీ కొన్ని సారూప్య సామీప్యతలున్నాయి. వారిదీ మామూలు మధ్యతరగతి కుటుంబం. వారికీ ఐదుగురు సంతానం. మాఇంట్లోలాగే ముగ్గురు ఆడపిల్లలు, ఇద్దరు మగపిల్లలు. ఆర్ధికంగా కూడా సరిసమానమే. అయితే ఈనాటికీ నాకు ఆశ్చర్యం కలిగించే విషయం -  ఏ విధమైన ప్రత్యేకతా కనపడని నాలాటి సగటు నిరుద్యోగికి ఏ ధైర్యంతో  ఆ పెద్దమనిషి  తన కూతురిని నాకిచ్చి పెళ్ళి చేయాలనుకున్నారో నాకు అర్ధం కాని విషయం. నాకు ఓ డిగ్రీ, స్టెనోగ్రఫీ సర్టిఫికెట్ తప్ప కళ్యాణానికి కావలసిన మరే  పెద్ద అర్హతలు లేవు. పైగా అమ్మాయి ఆసరికే బ్రిటానియా బిస్కట్ ఫ్యాక్టరీలో చిన్నో చితకో ఉద్యోగంలో వున్నది. ఈ వివాహం విషయం లో ద్విభాష్యం వారు తొందరపడడానికి,  తర్వాత నేను గ్రహించిన, నాకు కనిపించిన కారణం ఒక్కటే.  అదే కొన్ని మాసాలకు ముందు వారింట జరిగిన ఒక విషాద సంఘటన. చదువు ముగించి, ఉద్యోగానికి సిధ్ధమై చేతికి అందివచ్చిన తమ పెద్దకొడుకు అర్ధాంతరంగా తనువు చాలించడం ఆ కుటుంబానికి ఒక పెద్ద అశనీపాతం. ఆ దుఖం నుండి, మనోవేదననుండి బయట పడడానికి ఆరుమాసాలలోపు ఇంట్లో శుభకార్యం జరిపించి ఆనందించాలనే తపనతో వారి పెద్దమ్మాయికి వరుని వెతికే  తీవ్ర ప్రయత్నాలలో భాగంగా  మా నాన్నగారి గురించి విని  వేదుల సుబ్బారావుగారితో మా ఇంటిని వెతుక్కుంటూ వచ్చారు. అయితే ఈ విషాద నేపథ్యం ఏమి అప్పట్లో చెప్పినట్లు లేదు. నిజానికి చెప్పవలసిన అవసరం కూడా లేదు. ఏది ఏమైతేనేం ఉద్యోగం, సద్యోగం లేకుండా హాయిగా కాలక్షేపం చేస్తున్న నాకు ముందరి కాళ్ళ బంధాలు వేయ నిశ్చయించారు మా పెద్దలు.

ఈ పరిణామాలేవీ ఆనాడు నాలో ఎలాటి ఆసక్తిని, స్పందన, ప్రతిస్పందనలు కానీ నాలో రేకెత్తించలేదు. After all, marriages are made in heaven. నమ్మక తప్పదు మరి.

ఈ సంబంధం విషయం మా నాన్నగారు  ఘంటసాల మాస్టారికి, సావిత్రమ్మగారికి తెలియజేయడంతోనే వారంతా చాలా సంతోషించారు. శుభస్యశ్రీఘ్రం అన్నారు. నిజంగానే రెండు మాసాల వ్యవధిలో నా పెళ్ళి నిశ్చయమైపోయింది. ఘంటసాల మాస్టారు మా పెళ్ళి రిసెప్షన్ లో తన వాద్యబృందంతో వచ్చి కచేరీ చేస్తానని ఆ రోజు మరే ఇతర కార్యక్రమాలు పెట్టుకోనని ఇంట్లోవారికి చెప్పారు. అంతా బాగానే వుంది. పెళ్ళంటే మాటలా! ఆడపిల్లకైనా, మగపిల్లాడికైనా పెళ్ళంటే ఖర్చుతో కూడిన వ్యవహారం. ఆర్ధికస్తోమతు గలవారి విషయం వేరే. ఏ తాడూ బొంగరం లేని సామాన్యుల విషయంలో పెళ్ళిళ్ళు ఒక పెద్ద  ప్రతిబంధకమే. కానీ, చూద్దాము, కానున్నది కాకమానదు అనే కర్మసిధ్ధాంతాన్ని మా నాన్నగారు అనుసరించారేమో.

ఘంటసాల మాస్టారు, సావిత్రమ్మగారు కలసి నాకు పెళ్ళి బట్టలు కొనివ్వాలని నిశ్చయించారు. ఒకరోజు  మాస్టారు నేనూ  వారి కారులో పాండీబజార్ రాజకుమారి ధియేటర్ ఎదురుగా వున్న కైలాష్ టెక్స్ టైల్స్ షోరూముకు తీసుకువెళ్ళి నాకు నచ్చిన రంగుల్లో మంచి బట్టలను సెలెక్ట్ చేసుకోమన్నారు. నాకు చాలా మొగమాటమనిపించింది. అన్నిటినీ చూస్తూనే వున్నా ఎలాటివి ఎంచుకోవాలో తెలియలేదు. నా తడబాటు చూసి చివరకు మాస్టారే ఓ మూడు జతల బట్టలను ఎంపికచేసారు. వాటిని ఇంట్లో చూపించి వెంటనే కుబేంద్రరావుకు కుట్టడానికి ఇవ్వమని చెప్పారు.  ఘంటసాలవారి చొక్కాలు, జుబ్బాలు చాలాకాలంగా ఆ కుబేంద్రరావే కుట్టేవాడు. ఆయన ఒక కన్నడిగుడు. పానగల్ పా‌ర్క్ పార్క్ లాండ్స్ హోటల్ పక్కన వున్న మెకర్నెట్ బ్యాకరీ వెనకవేపు కుబేంద్రరావు టైలరింగ్ షాపు. మంచి పేరున్న బిజీ టైలర్. మాకు అలవాటుగా బట్టలు కుట్టే ఎన్. మాస్టర్ టైలర్ కొంతకాలంగా మాకు దూరమవడంతో (అన్నివిధాలా)  కేశవన్ ఎమ్.ఎ. మా ఆస్థాన టైలర్ అయ్యాడు. మనిషి చాలా మంచివాడు. మాకు తగినవాడు. అతనివల్ల భరించలేని నశ్యం వాసన తప్ప మరే ఇబ్బంది వుండేది కాదు. పైగా అతని టైలరింగ్ షాపు మా ఇళ్ళ వరసలోనే. పానగల్ పార్క్ కూరగాయల షాపుకు ఎదురుగా వుండే జైన్ స్టోర్స్ ప్రాంగణంలో ఒక చిన్న కొట్లో వుండేది. ఆ కేశవన్ నా పెళ్ళిబట్టలు కుట్టడానికి మహదానందం తో ఒప్పుకున్నాడు. అయ్యగారు బట్టలు కొనిస్తున్నారు కదా, రిసెప్షన్ కోసం ఒక మంచి సూట్ తీసుకోలేకపోయావా అని  మా నరసింగడు ఒక ఉచిత సలహా పారేసాడు. నేనేమీ మాట్లాడలేదు. నా వరకు పెళ్ళిపేరుతో జరిగే ప్రతి పైసా ఖర్చు శుధ్ధ దండగమారి వ్యవహారం. నాకు ఆదాయం లేకపోయినా కనీసపు అవసరాలు తీరడానికి మా నాన్నగారిలాటి కుటుంబీకులు పడే కష్టం నాకు తెలుసు. తెలిసి తెలిసి నా మూలంగా మరింత వృధా వ్యయం చేయించడానికి మనసు రాలేదు. అయితే ఈ భావాలన్నీ మనసులోనే. బయట వ్యక్తీకరించే ధైర్యం నాకేనాడూ అలవడలేదు.

పెళ్ళి ఇన్విటేషన్ల కోసం నేనూ నరసింగ కలసి 11వ నెంబర్ బస్ లో బయల్దేరి పారీస్ కార్నర్ సమీపంలోని ఫ్లవర్ బజార్ పోలీస్ స్టేషన్ కు ఎదురుగా వుండే బందర్ స్ట్రీట్ లోకి వెళ్ళాము. దాని పక్కపక్కనే వుండే సుంకురామ చెట్టి స్ట్రీట్  వంటి వీధులన్నిటిలో ఎన్నో స్టేషనరీ షాపులు, వెడ్డింగ్ ఇన్విటేషన్ల్ దొరికే షాపులు వుండేవి. అలాటి ఒక షాపులో   మరీ ఆడంబరంగా, డాంబికంగా లేకుండా సింపుల్ వుండే కార్డ్ గా చూసి కొన్నాము. వాటిని పాండీబజార్లో నారాయణన్ కేఫ్ ఎదురుగా వుండే ఒక ప్రింటింగ్ ప్రెస్ లో ఇచ్చాము. ఆ ప్రెస్ లో మాకు తెలిసిన ఒక తెలుగాయన ఉండేవారు. పేరు పంచాది అప్పలస్వామి. సినీమాలలో చిన్న చిన్న ఎక్స్ ట్రా వేషాలు వేసేవారు మనిషి పొట్టిగా పంచెకట్టుతో వుండేవారు. ఆయన ఘంటసాలవారు తీసిన 'భక్త రఘునాధ్' లో కూడా ఏదో వేషం వేసారు. వేషాలకోసం తిరుగుతూ మాస్టారిని చూడడానికి వచ్చేవారు. ఆ పరిచయంతో ఆ ప్రెస్ లో ఇన్విటేషన్ల ప్రింట్ కు ఇచ్చాము.  సింపిల్ గా వుండే ఆ ఆహ్వాన పత్రికలో ఘనంగా అందరినీ ఆకర్షించే విషయం  ఘంటసాల వారి కచ్చేరీ ఒక్కటే. 

ఒక పెళ్ళి పేరిట ఇద్దరు మనుషులను కలపడానికి ఇంత ఖర్చు, యాతనా, కాలాయాపనా అవసరమా? అనే భావన నాకు ఎప్పుడూ కలుగుతూంటుంది. కట్నకానుకల విషయంలో, మర్యాదల విషయంలో, మ్యారేజ్ హాల్స్  విషయంలో, భోజనాలలోని ఆహార పదార్ధాల విషయంలోనూ, ఊరేగింపులు, బ్యాండ్ మేళాలు, విడియో కవరేజ్ ల విషయంలో  ఏర్పడే తగాదాలు, కొట్లాటలతో ఎన్నో వివాహాలు, ఎంతోమంది ఆడపిల్లల జీవితాలు నాశనం కావడం ఈనాటికీ మనం చూస్తూనే వున్నాము. ఇలాటి స్వల్ప విషయాలలో నేటి మన నాగరికత, విద్య, వివేకం ఏమైపోతాయో అర్ధంకాదు.

ఈ రకమైనటువంటి ఏ బాదరబందీ లేకుండా మా పెళ్ళి మద్రాస్ కీల్పాక్ గార్డెన్స్ లోని ఒక కమ్యునిటీ హాల్ లో ఉన్నంతలో హుందాగా, పెద్దల సమక్షంలో  ప్రశాంతంగా జరిగింది. పెళ్ళికి ముందు జరిగే తతంగమంతా కూడా ఘంటసాల మాస్టారింటి చిన్న హాలులోనే  వారి కుటుంబ సభ్యులు, కొల్లూరి వెంకటేశ్వరరావుగారి కుటుంబ సభ్యుల సమక్షంలో వారి ఆశిస్సులతో జరిగింది. (అదే హాలులో తర్వాత కాలంలో రత్నకుమార్ ఉపనయనం కూడా జరిగింది). సరిగ్గా ఓ ఏడాది క్రితం రతన్ (ఘంటసాల రత్నకుమార్) ఫోన్ చేసి మా పెళ్ళి రిసెప్షన్ లో జరిగిన  నాన్నగారి (ఘంటసాల మాస్టారి) కచేరీ ఫోటోలు పంపమని అడిగాడు. చిత్రం ఏమంటే ఆ నాడు ఎవరికీ పెళ్ళనే ఓ సంఘటనను భవిష్యత్తు లో గుర్తుచేసుకునేలా ఫోటోల ద్వారానో, 16 mm సినీమా ద్వారానో భద్రపర్చుకోవాలనే ధ్యాసే ఎవరికీ లేకపోయింది. ఎందుకంటే, సింపుల్, అదంతా ఖర్చు వ్యవహారం.

మా పెళ్ళికి ఫోటోగ్రాఫర్ లేడు. ఎవరు వ్యక్తిగతంగా కూడా ఫోటోలు తీయలేదు. అలాగే ఘంటసాల మాస్టారి కచ్చేరీ ఫోటోలు కూడా తీయబడలేదు. ఈ రకమైనటువంటి సరదాలు మా నాన్నగారికి తక్కువ. అదే అలవాటు నాకు వచ్చింది. నాకు నేనుగా ఫోటోల కోసం నిలబడిన సంఘటనలు చాలా తక్కువ.

తమిళనాడులో పెళ్ళి ముహుర్తాలన్ని దాదాపు ఉదయం పూటే జరుగుతాయి. అది కూడా ఏడు నుండి పదిన్నర గంటలలోపే వుంటాయి. పెళ్ళి భోజనాలు కూడా పన్నెండు లోపల ముగిసి రెండయేసరికి కళ్యాణమండపాలను ఖాళీ చేసి వెళ్ళిపోతారు. పెళ్ళికి వచ్చినవారు కూడా  తమ తమ ఆఫీసులలో ఓ రెండు గంటలు పర్మిషన్ తీసుకొని పెళ్ళికి వచ్చి, వధూవరులను అభినందించేసి, పెళ్ళి భోజనాలు చేసేసి, పెళ్ళివారిచ్చే తాంబూలం కవరు తీసుకొని డైరక్ట్ గా ఆఫీసులకు వెళిపోతారు. 
ఇందువల్ల ఎవరి సమయమూ వృథాకాదు. ఎవరికీ ఏ రకమైన ఇబ్బంది కలగదు. బహుశా తమిళులు సౌరమానాన్ని పాటించడంవల్లకావచ్చు. వారికి విరుధ్ధంగా మన తెలుగువారి పెళ్ళిళ్ళన్నీ చాలావరకు అర్ధరాత్రి దాటాక, తెల్లవారుజామున జరుగుతూండేవి. ఇప్పుడు రోజులు మారి తెలుగువారు కూడా ఉదయం ముహుర్తాలకే మొగ్గు చూపుతున్నారు. 

మా పెళ్ళి ముహూర్తం ఉదయాన్నే కుదిరింది. తొమ్మిది నుండి పదిముప్పావు. మా సమీప బంధువులు, ఆత్మీయులైన ఘంటసాలవారి కుటుంబం, కొల్లూరి వెంకటేశ్వరరావుగారి కుటుంబం, మా నాన్నగారికి సన్నిహితులైన సాహితీ మిత్రుల సమక్షంలో  వారి శుభాశిస్సులతో శ్రీ ద్విభాష్యం సుబ్బారావు గారి జ్యేష్ట కుమార్తె శేషశ్రీతో  నా వివాహం నిర్విఘ్నంగా శుభప్రదంగా జరిగిపోయింది.




అదే సాయంత్రం అదే కీల్పాక్ హౌసింగ్ బోర్డ్ కమ్యునిటీ హాలులో జరిగిన  ఘంటసాల మాస్టారి కచేరీ ఆహుతులందరికీ షడ్రసోపేత విందుగా అమరింది. ఆ రిసెప్షన్ కు ప్రముఖ రచయిత  మా నాన్నగారికి మంచి మిత్రుడైన శ్రీ కొడవటిగంటి కుటుంబరావు గారు కుటుంబ సమేతంగా వచ్చారు.

ఆడపెళ్ళివారి తరఫున బ్రిటానియా కంపెనీ, టిఐ సైకిల్స్ ఉద్యోగులు తరలి వచ్చి మమ్మల్ని అభినందించారు. ఆనాటి ఘంటసాలవారి సంగీత కచేరీ వారందరికీ అపురూపమైన వరంగా అమితానందాన్ని కలగజేసింది. మాస్టారు దాదాపుగా రెండు గంటలసేపు ఆనాటికి బహుళ ప్రచారంలో వున్న  తన తెలుగు, తమిళ సినీమా పాటలను మృదుమధురంగా ఆలపించి శ్రోతలను మైమరపింపజేశారు. నా  పెళ్ళి కచేరీలో మా నాన్నగారు యథావిధిగా తన హార్మోనియంతో  ఘంటసాల మాస్టారికి సహకరించారు. ఆనాడు కచేరీలో పాల్గొన్న ఇతర వాద్యబృందం మా నాన్నగారు యథాశక్తి ఇచ్చిన పారితోషికాన్ని సంతోషంగా "ఇది మా ఇంట్లో పెళ్ళి" అని స్వీకరించారు. 

ఆప్త స్నేహితులు, బంధువుల పట్ల ఘంటసాల వారికి గల ఔదార్యానికి, ప్రేమాభిమానాలకు మా ఇంటి వివాహం ఓ చిన్న ఉదాహరణ మాత్రమే.

కొత్తకోడలు వచ్చిన వేళావిశేషం అంటారు. అలాటిదేదో నావిషయంలో జరిగిందని చెప్పక తప్పదు. ఆనాటి రిసెప్షన్ కు మానాన్నగారి మరో విజయనగరం స్నేహితుడు బి.డి.రావుగారు భార్యా సమేతంగా వచ్చారు. ఆయనా మానాన్నగారు చిన్నప్పుడు హైస్కూలు లో సహాధ్యాయులని చెప్పిన గుర్తు. ఆయన తండ్రి భాగనారపు సంజీవరావుగారు విజయనగరంలో హెడ్మాస్టర్ గా పనిచేసేవారు. బి.డి.రావుగారు మద్రాసు లో ఒక మల్టీనేషనల్ కంపెనీకి సంబంధించిన ఫ్యాక్టరీలో రీజినల్ మేనేజర్. మా నాన్నగారిని తరచూ చూడకపోయినా మంచి అభిమానం గల వ్యక్తి. ఆయన మా పెళ్ళి రిసెప్షన్ కు వచ్చారు. ఆయనకు నా గురించి అంతకుముందే డా. డి.ఎన్.రావుగారి ద్వారా వినివున్నారు. ఆయన ఈ రిసెప్షన్ లో నన్ను అభినందిస్తూ  ఒక మంచి రోజు చూసుకొని తనను తమ రాయపురం ఫ్యాక్టరీ లో కలుసుకొమ్మని తన విజిటింగ్ కార్డ్ ఇచ్చారు. అంతా మంచే జరుగుతుందని భరోసా ఇచ్చారు.

పట్రాయని వారింటి వివాహానికి రాలేకపోయిన బి.ఎన్.రెడ్డిగారు, పాలగుమ్మి పద్మరాజుగారు, మల్లాది రామకృష్ణశాస్త్రిగారు, డా.డి.ఎన్.రావు దంపతులు ఆశీఃపూర్వక ఉత్తరాలు పంపారు. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారైతే ఒకనాటి ఉదయాన్నే మా ఇంటికి వచ్చి కొత్తకోడలిని చూసి స్వయంగా ఆశీర్వదించారు. కృష్ణశాస్త్రిగారు మా ఇంటినుండి తిరిగివెళ్ళబోయే ముందు మా ఇద్దరిని తప్పక వారింటికి పంపమని మా నాన్నగారిని కోరారు. మా నాన్నగారు సంతోషంగా సమ్మతించారు. నాకు తగిన ఇల్లాలే మా ఆవిడ. మా ఇద్దరికీ సంగీతం రాదు. సాహిత్యం అంటే ఏమిటో తెలియదు. అలాటి మేము కృష్ణశాస్త్రిగారి వంటి ప్రసిధ్ధ కవి సమక్షంలో ఏం మాట్లాడగలము, ఎలా మసలగలము? వారింటికి వెళ్ళడానికి సంకోచమే. కానీ వెళ్ళకతప్పదు. ఒక రోజు మేమిద్దరం కృష్ణశాస్త్రిగారింటికి వెళ్ళాము. అప్పట్లో కృష్ణశాస్త్రి గారు టి.నగర్ తిరుమలపిళ్ళై రోడ్ సమీపంలో వాల్మీకి స్ట్రీట్ లో వుండేవారు. మేము వెళ్ళినందుకు తాను ఎంతో సంతోషిస్తున్నట్లు పలకమీద వ్రాసి చూపారు. ఇంట్లోని తమ కోడలుకు, కుమారునికి మమ్మల్ని పరిచయం చేసారు. దాదాపు ఒక అరగంటకు పైగా వారు  మా స్థాయికి దిగివచ్చి సరదా కబుర్లు చెప్పి వాతావరణాన్ని మార్చివేసారు.  తన వాక్చాతుర్యంతో నాలోని బెరుకుతనం కొంతవరకు తొలగించారు. మేము తిరిగి వస్తున్నప్పుడు కృష్ణశాస్త్రిగారు మా ఆవిడకు తన కోడలిచేత పసుపుకుంకుమ, ఓ జత దీపపు కుందులు కానుకగా ఇప్పించారు. వారి కవితా సంపుటులు నాలుగు పుస్తకాలను నాకు బహుకరించారు. దేవులపల్లి కృష్ణశాస్త్రిగారింట్లో వారి సమక్షంలో  గడపిన ఆ క్షణాలు ఏనాటికి మరపురాని మధుర స్మృతులు. చూస్తూండగానే, నిన్న మొన్న జరిగినట్లనిపించే మా వివాహానికి స్వర్ణోత్సవం అయిపోయింది.

🌺

1971 జనవరిలో  నాలుగు సినీమా లు రిలీజయ్యాయి. రెండు రామారావు గారు నటించినవి; మరో రెండు నాగేశ్వరరావు గారివి. అవి - శ్రీకృష్ణ విజయం, 

అనరాదే బాలా... శ్రీకృష్ణవిజయం

దసరాబుల్లోడు, నిండు దంపతులు, మనసు మాంగల్యం.

ఆవేశం రావాలి ఆవేదన కావాలి ... మనసు మాంగల్యం

అగ్రనటుల సినీమాలంటే మాస్టారి పాటలు లేకుండా వుంటాయా? ఈ నాలుగు సినీమాలలో మొత్తం ఇరవైఐదు పాటలు పద్యాలు ఘంటసాల మాస్టారు పాడినవే. ఆ పాటల విశేషాలేమిటో వచ్చే వారం...

నెం.35, ఉస్మాన్ రోడ్ కు వస్తే తెలుస్తాయి...

      ...సశేషం

*With a view to make the narrative more authentic and to corroborate it, images, audio and video clips are attached at appropriate places. If such usage is found objectionable to the copyright holders the same shall be removed if and when notified.

4 comments:

Hrishikesh Sharma said...

మీ వివాహ విషయాలు చక్కగా ఆసక్తికరంగా వ్రాశారు. మాస్టారి కచేరీ హైలైట్. మీ స్వర్ణత్సవ వివాహ బంధానికి హృదయపూర్వక అభినందనలు. కానీ ప్రతీ వ్యక్తినీ ఇంతలా ఇప్పటికీ గుర్తు పెట్టుకోవటం అద్భుతం. మరోసారి అభినందనలు అండి.🙏🙏

Agasthyeswar Dwibhashyam said...

మా అక్క శేషశ్రి పెళ్ళి విషయములు బావ గారు తనకు తెలిసిన రీతి లో కళ్ళకు కట్టినట్లు వ్రాశేరు ����ఘంటశాల కచ్చెరి ముఖ్య ఘట్టం ����నాటి పాట భలే మంచి రోజు ... ఇప్పుడు కూడా నా హ్రుదయం లో మెదులు తోంది ����చాలా బాగా వర్నించారు ����మధుర స్మ్రుతులకు ధన్యవాదములు ����ద్విభాష్యం అగస్థ్యెశ్వర్

మహేష్ బాబు సంబటూరి వెంకట said...

మీ వివాహ ఘట్టం పూర్వాపరాలన్నీ చాలా చాలా చక్కగా పుసగుచ్చినట్లు ఎంతో ఆసక్తిదాయకంగా వివరించారు.... నాటి కాలమాన పరిస్థితులు, మీ మనోభావాలు.... మీ వివాహానికి సంబంధించిన ప్రతి ముఖ్యమైన వ్యక్తి నీ మా కళ్ళ ముందు నిలిపారు... ఈ ఏడాది ఫిబ్రవరి 5న వివాహ స్వర్ణోత్సవం జరుపుకున్న మీ అపురూపమైన జంటకు మరోమారు మా హృదయపూర్వక శుభాభినందనలు తెలుపుకుంటూ ఇంత చక్కని వివరాలు మాతో ఓపికగా ప్రతి వారం పంచుకుంటున్నందుకు మీకు హార్ధిక శతకోటి ధన్యవాదపూర్వక కృతజ్ఞతాభివందనాలు స్వరాట్ బాబాయ్ గారూ 💐💐🌹🌹🙏🙏🙏🙏😊😊👍👍

చుండి వేంకట రాజు said...

ధన్యవాదాలండి