visitors

Sunday, February 13, 2022

నెం. 35 , ఉస్మాన్ రోడ్ (ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 2 - అరవై ఎనిమిదవ భాగం

13.02.2022 - ఆదివారం భాగం - 68:

అధ్యాయం 2  భాగం 67 ఇక్కడ


నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్

"చీకటి వెలుగుల రంగేళీ జీవితమే ఒక దీపావళీ" అన్న ఘంటసాలవారు, ఒక దగ్గర "జీవితమంతా కలయేనా జీవితమంతా భ్రమయేనా" అంటారుమరో చోట" ఇంతేరా ఈ జీవితం తిరిగే రంగులరాట్నం" అంటారు. నిరంతర ఈ చక్రభ్రమణంలో ఏది శాశ్వతం కాదు. నీటిబుడగ వంటి ఈ జీవితంలో ఏ నిముసానికి ఏమి జరుగుతుందో ఎవరూహించలేరు. విధి విలాసాన్నితప్పించడమూ అంతకన్నా  ఎవరివల్లా కాదు. సుఖదుఃఖాలు రెండూ ఒకదాని వెనక ఒకటి అంటిపెట్టుకునే వస్తూంటాయి. మంచి జరిగితే ఆనందించడం చెడు జరిగితే విలపించడమూ తప్ప సామాన్య మనిషి మరేమీ చేయలేడు. చీకటి వెలుగుల్లాటి సుఖదుఃఖాలు అనివార్యమని, మనిషి తన ఉద్వేగాలను తన ఆధీనంలోనే నియంత్రించాలని  వేదాంతులు చెప్పినా వాటి ప్రభావంనుండి మనిషి అంత తొందరగా బయటపడలేడు.  నిగ్రహించుకోనూలేడు. సుఖమూ దుఃఖమూ రెండూ వెంటవెంటనే కలుగుతూంటే ఆనందించాలో లేక బాధపడాలో తెలియని అగమ్యస్థితిలో పడతాడు.

ఏదో ఒక పాత సినీమాలో రేలంగి  ఒక పాటలో "నవ్వుతూ ఏడ్వనా, ఏడుస్తూ నవ్వనా" అని తానేడుస్తూ జనాలను నవ్విస్తారు.  ఒకరికి ఖేదము మరొకరికి మోదమూ అవుతుంది.

క్రిందటివారం నేను దాదాపు అటువంటి అవస్థనే అనుభవించాను.

ఫిబ్రవరి నెల మాకు ఎన్నటికీ మరపురానిది.

 2022 ఫిబ్రవరి 5 వ తేదీన మా 51 వ వివాహవార్షిక దినం. అదేరోజు సాయంత్రం మా పెద్ద చెల్లెలు శ్రీమతి కాకరపర్తి వెంకట రమణమ్మ రెండవ కుమార్తె చి.సౌ. గాయత్రి వివాహపు నిశ్చితార్థం, వెంటవెంటనే ఎదురు సన్నాహాలు, పరిచయకార్యక్రమాలు అన్నీ చాలా వైభవంగా జయప్రదంగా జరిగాయి.  బంధు మిత్రులతో సంతోషంగా గడచింది. మర్నాడు 6 వ తేదీ ఉదయం 8 గంటల తర్వాత సుముహుర్తం. చి.ల.సౌ.గాయత్రి, చి. ఆత్రేయ వివాహమహోత్సవం శుభప్రదంగా ముగిసిన కొంతసేపటికే  ఏడు దశాబ్దాల పాటు సంగీతప్రియులందరినీ తన అసమాన్య గాత్ర మాధుర్యంతో వేలాది పాటలతో కోట్లాది శ్రోతలకు తన్మయత్వం కలిగించిన ఇండియన్ నైటింగేల్, 'భారతరత్న' లతామంగేష్కర్ దివంగతులయారనే దుర్వార్త. గతకొంతకాలంగా పట్టిపీడిస్తున్న అనారోగ్యం, 93ఏళ్ళ వృధ్ధాప్యమే వారి మరణానికి కారణమని తెలిసినా ఆ కోకిల కంఠం శాశ్వతంగా మూగపోయిందనే తలపు మనసుకెంతో ఆవేదనను కలగజేసింది.

ఫిబ్రవరి 6 వ తేదీన వచ్చిన నా 'నెం.35,ఉస్మాన్ రోడ్' ధారావాహిక లో లతామంగేష్కర్ గారి భగవద్గీత గురించి, ఘంటసాల మాస్టారి తాత్పర్యసహిత భగవద్గీత గురించి ప్రస్తావించడం జరిగింది. ఈ ఇద్దరు మహాగాయకులు  సంతానం సినీమాలో 'నిదురపోరా తమ్ముడా' పాటను పాడినా అది ఇద్దరూ  కలసిపాడిన డ్యూయెట్ కాదు.  ఎవరి పోర్షన్ వాళ్ళదే.  అయినా ఆ ఇద్దరి పాటలు ఒకేసారి రికార్డ్ చేయడం, ఒకరికొకరు పరిచయంకాబడడం, ఒకరి పాట మరొకరు వినడం, రికార్డింగ్ పూర్తిఅయేవరకూ ఇద్దరు అక్కడేవుండడం జరిగింది. ఘంటసాలవారంటే  లతామంగేష్కర్ గారు అమితమైన గౌరవమర్యాదలు కనపర్చేవారు.  ఘంటసాలగారితో కలసి పాడాలనే అభిలాషను కనపర్చేవారట. సువర్ణసుందరిలోని "హాయి హాయిగా ఆమని సాగే" పాటలోని గమకస్ఫూర్తి, భావగాంభీర్యం, గాత్రసౌలభ్యం తమ కంఠాలలో తొణికిసలాడలేదని , తెలుగుపాటతో పోలిస్తే హిందీ పాట ఒకింత తేలిపోయిందని లతామంగేష్కర్ భావించినట్లు చెప్పుకునేవారు. పాట రిహార్సల్స్ లో కూడా ఘంటసాల మాస్టారి సహకారం వుంటే బావుంటుందని లతా సలహా ఇచ్చినట్లు, కానీ  తాను అలా జోక్యం చేసుకోవడం మహమ్మద్ రఫీ వంటి గొప్పగాయకుడిని కించపర్చినట్లవుతుందని ఘంటసాల మాస్టారు లతామంగేష్కర్ గారి కోరికను సున్నితంగా తిరస్కరించినట్లు మాస్టారింట్లో  చెప్పుకోగా విన్నాను.

తర్వాత కాలంలో హైదరాబాద్ లో దీనానాధ్ మంగేష్కర్ గారి పేరిట లతామంగేష్కర్ గారు ఘంటసాలవారికి ఘన సన్మానం చేసినప్పుడు సభాముఖంగా కాక, విడిగా సంభాషిస్తున్నప్పుడు లతామంగేష్కర్ మాస్టారితో గాయకులకు తమ గొంతే అత్యంత విలువైనదని దానిని ఎల్లవేళలా ప్రాణప్రదంగా కాపాడుకోవాలని సలహా ఇచ్చారట. సినీమా రంగంలో అసూయాపరులకు కొదవలేదని, స్లోపాయిజన్ తో ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడరని తనకు జరిగిన స్వానుభవాన్ని చెప్పారట. దీనినిబట్టి  చిత్ర విచిత్ర మనస్తత్త్వాలకు ఆలవాలమైన చిత్రసీమలో  తీవ్రమైన పోటీలకు, ఈర్ష్యాద్వేషాలకు కొరతలేదని స్పష్టంగా తెలుస్తుంది.

ఫిబ్రవరి 11 వ తేదీ విషయంలో కూడా మాకు ఓ విధమైన మిశ్రమభావోద్వేగాలే కలుగుతాయి. ఆ రోజు అమరగాయకుడు, గానగంధర్వుడు ఘంటసాలవారి వర్ధంతి. అదే రోజున మా మరదలు( మా ఆవిడ పెద్ద చెల్లెలు) ఆకుండి జయశ్రీ పరబ్రహ్మంగారి వివాహవార్షికోత్సవం. ఒకే రోజు రెండు వైవిధ్యపూరితమైన  కార్యక్రమాలలో పాల్గొనవలసివచ్చేది. ఫిబ్రవరి 20 న మా అమ్మాయి పెళ్ళిరోజు.

🌅🌷

సాధారణంగా ఘంటసాల మాస్టారు ఇంట్లో వుండడం జరగదు. మరీ ఒంట్లో బాగాలేదనిపిస్తే తప్ప ఏవో పనుల మీద బయటకు వెళ్ళి మధ్యాహ్నం భోజనాల సమయానికి వస్తారు. మళ్ళీ సాయంత్రం నాలుగు తర్వాత బయటకు వెళ్ళి రాత్రి ఎనిమిది తర్వాత వస్తారు. రికార్డింగ్ లున్న రోజులైతే రాత్రి తొమ్మిది దాటిపోయేది. ఈ మధ్య తరచూ ఏదో అస్వస్తత కారణంగా ఇంటిపట్టునే ఉంటున్నారు. మ్యూజిక్ కంపోజింగ్ లు కూడా ఇంటి దగ్గరే పెట్టుకుంటున్నారు.
ఖాళీగా ఉన్నరోజుల్లో ఉదయం ఓ అరగంట సాయంత్రం ఓ అరగంట పోర్టికోలోని వరండా మీదున్న కుర్చీలో కూర్చోని ఏవో పత్రికలు తిరగేసేవారు. ఆయనకు పెద్దగా పుస్తకాలు చదివే అలవాటు లేదు. ఆ వరండా మీదనుండి చూస్తే ఎదురుగా వుండే వ్యాసారావు స్ట్రీట్ లో నుండి వచ్చిపోయేవారు, ఉస్మాన్ రోడ్ లో తిరుగాడేవారు స్పష్టంగా కనిపిస్తారు. మాస్టారు ఇంట్లో ఉన్నారని తెలిస్తే  బయట వూళ్ళనుండి వచ్చే అభిమానులు, సినీమాలో పాటల ఛాన్స్ ల కోసం తిరిగే కోరస్ సింగర్స్, లేక ఆర్కెష్ట్రా ప్లేయర్స్ వచ్చి మాస్టారితో మాట్లాడుతూండేవారు. 'సినీమా' ఇంటూరి, 'మధురవాణి' గోటేటి,' కాగడా' శర్మ, 'కొరడా' రమణమూర్తి వంటి చిన్న సినిమా పత్రికలవారు చందాలకోసం , సినీమా రంగం 'జివిజి', 'ఆంధ్రపత్రిక' శ్రీనివాస్, గోపాలకృష్ణ, వి.ఎ.కే.రంగారావు వంటి ప్రముఖ పాత్రికేయులు ఇంటర్వ్యూలకోసం తరచూ వచ్చేవారు. వచ్చినప్పుడల్లా ఆ వారపు/నెల సినీమా పత్రికలు తీసుకువచ్చి మాస్టారుకు ఇచ్చేవారు. వారందరి రాకపోకలతో మాస్టారింటి ప్రాంగణం కళకళలాడేది.

ఆరోజుల్లో పోస్ట్ మెన్  రోజుకు మూడుసార్లు వచ్చేవారు. ఉదయం పది తర్వాత లోకల్ పోస్ట్, మధ్యాహ్నం, సాయంత్రం  బయట వూళ్ళ ఉత్తరాలు వచ్చేవి. ఎక్కువగా అభిమానుల ఉత్తరాలు, వివాహ ఆహ్వాన పత్రికలు రోజూ వచ్చేవి. అందరిళ్ళల్లో శుభకార్యాలు జరిగిపోతున్నాయి, తమ ఇంట్లో ఏది జరగలేదని ఘంటసాలవారికి   ఒక ఆరాటం వుండేది. నిజానికి పిల్లలంతా చాలా చిన్నవాళ్ళు. చదువులే పూర్తికాలేదు. పెద్దబాబు ఒక్కడే అప్పుడప్పుడే జీవితంలో స్థిరపడే ప్రయత్నాల్లో వున్నాడు. కానీ మాస్టారికి తన ఆరోగ్యం విషయంలో ఏదో అభద్రతా భావం వుండేది. కనీసం పెద్దవాడికైనా పెళ్ళి చేసి చూడాలనే కోరిక ప్రబలింది. సావిత్రమ్మగారికి అంత తొందరగా పెద్దబాబుకు పెళ్ళి చేసే ఉద్దేశం లేకపోయినా మాస్టారు ఆ ప్రయత్నాలు చేయడం మొదలెట్టారు. ఎవరిద్వారానో తమ కుమారుడికి మంచి అనుకూలమైన సంబంధం అమరింది.  చిత్రసీమలోని ప్రముఖులందరి సమక్షంలో మహా వైభవంగా వివాహం జరపాలని ఆశించారు. ఈ విషయమై పుట్టపర్తి సాయిబాబా వారిని, కాంచీ మహాస్వాములను దర్శించి వారి సమ్మతిని, ఆశిస్సులను  కూడా పొందారు.  ముహుర్తాలు పెట్టుకోవలసివుంది.

తరచూ జలుబు చేయడం, ఎక్కువసేపు నిలబడి పాడుతూంటే అలసిపోవడం, దానివలన అనుకున్న సమయానికి రికార్డింగ్ లు జరగక క్యాన్సిల్ కావడం జరిగేది.  దానితో ఘంటసాల గొంతు పోయింది ఇక పాడలేడు అనే దుష్ప్రచారం తెలుగు చిత్రసీమలో మొదలయింది. కొందరు సంగీత దర్శకులు పనిగట్టుకుని కొత్త వాయిస్ లను  పైకి తీసుకురావడానికి తీవ్రంగా ప్రయత్నించడం మొదలయింది. మ్యూజిక్ డైరక్షన్ చేసే సినీమా లు తగ్గిపోయాయి.  ప్రముఖ నిర్మాతలు తప్ప చిన్న చిన్న నిర్మాతలు ఇతర గాయకులచేత పాడించి తమ చిత్రాలు ముగించాలనే నిర్ణయానికి వచ్చారు. అగ్ర నటుల పాటల ట్రాక్స్ మాత్రం మాస్టారు  తన గొంతు బాగుందన్నప్పుడు వెళ్ళి పాడివచ్చేవారు.

ఘంటసాలవారు తన సంగీతం విషయంలో తప్ప మిగిలిన విషయాలలో చాలా అమాయకులు. ఎవరేది చెప్పినా నమ్మేసేవారు. తన ఆరోగ్యం విషయంలో ఎవరెవరో ఎవేవో చెప్పేవారు. వాటన్నిటినీ అమలుపర్చమని ఇంట్లోవారికి చెప్పేవారు. ఒకసారి ఎవరో బ్లడ్ సుగర్ తగ్గడానికి పొట్టుతీయని మినపప్పుతో చేసిన  నేతి గార్లను పుట్టతేనెలో ముంచి తినమని సలహా ఇచ్చారు. కొన్నాళ్ళ పాటు ఆ సలహాను తూచ తప్పకుండా పాటించి ఉదయపు అల్పాహారం గా తేనెతో నేతిగార్లు తీసుకోవడం మొదలెట్టారు. ఒకటి రెండు రోజులు బాగున్నట్లనిపించి ఆ చిట్కా బాగా పనిచేస్తోందని అందరికీ చెప్పి ఆనందించేవారు.  ఆ తర్వాత మరికొన్నాళ్ళకి షరా మామూలే. అల్లోపతి చేదుమాత్రలు తప్పనిసరేయేది.

ఈ పరిస్థితులలో ఒంట్లో ఓపిక తగ్గి బయట వరండాలో  ఒంటరిగా కూర్చొనేవారు. ఒక్క శని, ఆదివారాలలో తప్ప మిగిలిన రోజుల్లో నేను మాస్టారిని చూసే అవకాశం వుండేదికాదు. ఆ రెండు రోజులు మాత్రం నేను ఆయన పక్కనే వరండాలో బెంచ్ మీద గడిపేవాడిని. ప్రపంచం ఎంత విచిత్రమైనదంటే, అంతవరకూ ఇంద్రుడు, చంద్రుడూ, మీ అంతవారు మరెవరూ లేరూ, మీరు లేకపోతే ఇండస్ట్రీయే లేదు అని ఇచ్చకాలు పలికినవారంతా ఇంటి ఛాయలకే రావడం మానేసారు. చూస్తే ఎక్కడ లోపలికి వచ్చి మాట్లాడవలసివస్తుందేమోనని కొంతమంది తలదించుకునే ఇంటిముందునుండి వెళ్ళేవారు. కొంతమంది నిర్మాతలు తాము పాడించుకున్న పాటలకు, చేయించుకున్న మ్యూజిక్ డైరక్షన్ కు ఇవ్వవలసిన పైకం సకాలంలో ఇవ్వకుండా సగం సగం ఇచ్చి అప్పుడు, ఇప్పుడు అని మా నరసింగడిలాటివారిని పదేపదే తమ ఆఫీస్ చుట్టూ తిప్పించుకునేవారు. స్వయంగా ఘంటసాలవారే వెళితే తప్ప డబ్బులు వసూలయేవికావు.  ఆయన ముందు ఒకలా , ఆయన  వెనక మరోలా ప్రవర్తించేవారు. సినీమా ప్రపంచం అంతా సప్లై ఎండ్ డిమాండ్  సిధ్ధాంతాన్నే పాటించేది. ఇదంతా చూసి ఘంటసాల మాస్టారు నిర్వేదంగా నవ్వుకునేవారు. 'ఇదేరా నాయనా లోకం తీరు అనేవారు'.
మాస్టారు చెప్పేవన్నీ వినడం తప్ప సానుభూతి గా మాట్లాడడానికి గానీ, సలహా చెప్పడానికి గానీ నాకు సాహసము, అనుభవమూ, వయసూ ఏవీ లేవు. కానీ ఆ పరిస్థితిలో వారిని చూడడానికి ఏదో దిగులుగా అనిపించేది.

1973 లో మాస్టారిని మరింత క్రుంగదీసే విషాద సంఘటనలెన్నో. దాదాపు రెండున్నర దశాబ్దాలపాటు అత్యంత ఆత్మీయంగా కలసి పనిచేసినవారెందరో ఈ లోకాన్ని వదలిపెట్టిపోయారు. మొదట మ్యూజిక్ డైరక్టర్ టి.వి.రాజుగారు.

రాజా మహరాజా - టింగు రంగా

టి.వి.రాజుగారు చిత్రసీమ లోకి వచ్చినప్పటినుండి ఘంటసాలవారి తో మంచి స్నేహం వుండేది. రాజుగారి స్వరరచనలో ఘంటసాలమాస్టారు పాడిన పాటలెన్నో ఇంకా గాయకులంతా పాడుకుంటునే వున్నారు. 

తర్వాత, పామర్తి గారు. ఘంటసాలవారి ప్రోత్సాహం తోనే తబలా వాయించడం నేర్చుకొని మాస్టారి వద్ద సహాయకుడిగా అనుభవం గడించి  మ్యూజిక్ డైరెక్టర్ గా ఏదో సాధించాలని మాస్టారిని వదలి బయటకు వెళ్ళిపోయారు. అయినా ఘంటసాల మాస్టారు బాధపడలేదు. పామర్తిగారి చిత్రాలన్నింటిలోనూ పాడారు.

పూవై విరిసిన పున్నమి వేళ - శ్రీ తిరుపతమ్మ కథ

కానీ, పామర్తిగారు డబ్బింగ్ మ్యూజిక్ డైరక్టర్ గానే మిగిలిపోయారు. కేవలం నాలుగు మాత్రమే స్ట్రైట్ సినీమా లకు పనిచేసారు. అందులో నాల్గవ చిత్రం 'పూలమాల'  సినీమా సగంలో వుండగానే పామర్తిగారు కాలంచేసారు. ఆ సినీమాలోని మిగతా పాటలను  రీరికార్డింగ్ ను ఘంటసాల మాస్టారే పూర్తిచేసి దాని వలన వచ్చిన పైకాన్నంతా పామర్తి గారి కుటుంబానికే ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకున్నారు. 1955 వరకు,  మేము 35, ఉస్మాన్ రోడ్ కు రావడానికి ముందు వరకూ పామర్తి గారి కుటుంబం మేమున్న ఔట్ హౌస్ లోనే వుండేవారు.  అటువంటి ఆత్మీయుడైన పామర్తిగారు పోవడం మాస్టారికి ఒక లోటే. అన్నిటికంటే ఘంటసాలవారిని మరింత బాధించింది చిత్తూర్ వి.నాగయ్యగారి మరణం. మద్రాసులో అడుగుపెట్టి అన్నానికి అవస్థలు పడుతున్న రోజుల్లో ఆదరించి తమ రేణుకా సంస్థలో ఆశ్రయమిచ్చి అన్నం పెట్టి, తమ చిత్రాలలో చిన్నా చితకా వేషాలు, కోరస్ లు ఇచ్చి నాగయ్యగారు చూపిన ప్రేమాభిమానాల గురించి మాస్టారు ఎప్పుడూ తల్చుకునేవారు. 


ఆపరాని తాపమాయెరా - యోగి వేమన

నేపథ్యగానంతో పాటు కూచిపూడి జతులు పలుకుతూ తెరమీద కూడా కనిపిస్తారు ఘంటసాల యోగి వేమనలో. 

ఘంటసాల గారికి తొలిసారిగా పాడే అవకాశం కల్పించిన 'స్వర్గసీమ' సినీమాకు సంగీత దర్శకుడు కూడా చిత్తూరు వి.నాగయ్యగారే. 

ఓ నా రాజా -  స్వర్గసీమ

లక్షలాది రూపాయలు సంపాదించి  మితిమీరిన దాన ధర్మాలకోసం ఉన్న ఆస్తులన్నీ పోగొట్టుకున్న నాగయ్యగారి జీవితం అందరికీ ఒక గుణపాఠం. అటువంటి మహానుభావుడు స్వర్గస్తులైనప్పుడు కూడా సినీమారంగ ప్రముఖులెవరూ ఆయన దహన సంస్కారాలకు రాలేదు. 

బ్రతికి బాగా వున్నంతవరకే మనిషికి విలువ. ఆ తర్వాత ఎవరూ ఎవరినీ పట్టించుకోరు.తర్వాత జరిగిన పరిణామాలు చూస్తే నాగయ్యగారి మరణం ఘంటసాలవారిలో ఒక రకమైన మృత్యుభయాన్ని ఆవహింపజేసిందేమో అనిపిస్తుంది.

ఆ విషయాలన్నీ వచ్చే వారం.....
          ...సశేషం

4 comments:

చుండి వేంకట రాజు said...

ధన్యవాదాలండి

Voleti Srinivasa Bhanu said...

బాగున్నప్పుడు బాకా పట్టిన వాళ్లే తేడా వస్తే మొహం చాటేస్తారు.ఇది చేదు నిజం. ఎంతో బాధాకరం

మహేష్ బాబు సంబటూరి వెంకట said...

సినీ పరిశ్రమ లోకంలో ఓ భాగమే కదా.... అవసరం ఉన్నన్ని రోజులూ చుట్టూ తిరిగి అవసరం తీరేక ముఖం చాటేసే ఈ సమాజం తీరే సినీ పరిశ్రమలోనూ ఘంటసాల మాస్టారు, చిత్తూరు వి నాగయ్య గారు లాంటి మహా మహులకి చేదు అనుభవాలను రుచి చూపింది అని భావించాలి.
ఘంటసాల గారి చివరి రోజుల్లో వారి పరిస్థితి గురించి చదువుతూంటే మనసు భారమై పోయింది.... చాలా చక్కగా కళ్ళకు కట్టినట్లు వర్ణించారు ఆనాటి పరిస్థితులను.... వచ్చే వారం సంచిక కోసం ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటాము స్వరాట్ బాబాయ్ గారూ 🙏🙏💐💐🙏🙏

P P Swarat said...

అందరికీ అభివాదాలు.