visitors

Sunday, February 6, 2022

నెం. 35 , ఉస్మాన్ రోడ్ (ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 2 - అరవై ఏడవ భాగం

06.02.2022 - ఆదివారం భాగం - 67*:
అధ్యాయం 2 భాగం 66 ఇక్కడ

  

నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్

ప్రపంచ వ్యాప్తంగా వున్న సనాతనధర్మాచరణపరులకు, హిందువులకు పరమ పవిత్ర ఆధ్యాత్మిక గ్రంథం 'భగవద్గీత'. దీనినే గీతోపనిషత్  అని కూడా అంటారు. వేదవ్యాసుడు వ్రాసిన మహాభారత కావ్యంలోని భీష్మపర్వంలో ఈ గీతోపదేశ ఘట్టం వస్తుంది. కర్తవ్యవిమూఢుడైన అర్జునునికి స్ఫూర్తిని, కర్తవ్యాన్ని బోధిస్తూ శ్రీకృష్ణ భగవానుడు చేసిన ఉపదేశ సారమే భగవద్గీత. 18 భాగాలు గల ఈ గీత 700  సంస్కృత శ్లోకాలతో నిండినది. జ్ఞాన, భక్తి, కర్మ, రాజయోగాల గురించి, ధర్మాధర్మ విచక్షణ గురించి కూలంకషంగా చర్చించబడిన అత్యుత్తమ వేదాంత గ్రంధం భగవద్గీత. సంస్కృత భాషలో వున్న ఈ భగవద్గీత ను ప్రపంచ భాషలన్నింటిలోకి విస్తృతంగా అనువదించబడింది. భారతదేశ స్వతంత్ర పోరాట సమయంలో కూడా బాల గంగాధర్ తిలక్, మహాత్మా గాంధి వంటి గొప్ప నాయకులు భగవద్గీత ను ఆదర్శంగా తీసుకొని  నిష్కామంగా, స్వార్ధరహితంగా దేశ స్వాతంత్ర్యం కోసం తమ జీవితాలనే త్యాగం చేసారు. అటువంటి మహోత్కృష్ట భగవద్గీతకు మహామహులెందరో భాష్యాలు వ్రాసారు. గాయకులెందరో గానం చేసారు. సుప్రసిధ్ధ నేపధ్యగాయని లతామంగేష్కర్ గానం చేసిన భగవద్గీత బహుళజనాదరణ పొందింది. ఆమె భగవద్గీతలోని మొత్తం 700ల శ్లోకాలను సుశ్రావ్యంగా భక్తిరస ప్రధానంగా ఆలపించారు. 

అటువంటి భగవద్గీతనే ఘంటసాలవారు తన జీవిత సాఫల్యఫలంగా తెలుగువారందరికీ పంచిపెట్టాలని, తన  జీవితం చరితార్ధం కావాలని ఆశించారు.  సంస్కృత భాష తెలియని సామాన్యుడు కూడా భగవద్గీతను విని, అందులోని సారాంశాన్ని అర్ధం చేసుకోగల రీతిలో సరళమైన తెలుగుభాషలో తాత్పర్యసహిత భగవద్గీతను రూపొందించాలని ఘంటసాల నిర్ణయించారు. భగవద్గీతలోని మొత్తం 700 శ్లోకాలు కాకుండా ఒక నూట ఎనిమిది శ్లోకాలను మాత్రమే తాత్పర్యంతో రికార్డ్ చేయాలని భావించారు. ఈ పవిత్ర బృహత్ ప్రణాళికను  కార్యరూపంలో పెట్టడానికి HMV గ్రామఫోన్ కంపెనీ వారు తమ సంసిధ్ధతను ప్రకటించారు. తెలుగునాట HMV మనుగడకు ముఖ్యకారణం ఘంటసాలవారి భక్తిగీతాలు,  కరుణశ్రీ పద్యాలు, అసంఖ్యాకమైన సినీగీతాలేనన్న విషయం అందరికీ తెలిసిందే. 

కరుణశ్రీ పద్యాలు

ఏడాదికి కనీసం రెండు పాటలైనా  ఘంటసాలవారివి క్రమం తప్పక HMV గ్రామఫోన్ రికార్డ్ లు గా వచ్చేవి. ఆ సంస్థ తెలుగు విభాగపు అధిపతి శ్రీ మంగపతిగారు తరచూ మాస్టారిని కలిసి తమ కంపెనీకి పాడమని బలవంతం చేసేవారు. భగవద్గీతను రికార్డ్ చేద్దామని ఘంటసాల మాస్టారు చెప్పగానే మంగపతి చాలా సంతోషించారు. 

ఘంటసాలవారి భగవద్గీతకు తెలుగు వ్యాఖ్యానాన్ని వ్రాసే భాధ్యత ను శ్రీ కోట సత్యరంగయ్యశాస్త్రిగారికి అప్పజెప్పారు. శ్రీ రంగయ్యశాస్త్రిగారు సంస్కృతాంధ్ర భాషలలో పండితులు. కవిగా పేరు పొందినవారు. టి.నగర్ లోనే రామకృష్ణ మిషన్ మెయిన్ హైస్కూలులో తెలుగు పండితులుగా వుండేవారు. వీరి సోదరుడు కూడా మంచి పండితులే. అన్నదమ్ములిద్దరూ ఒకే రూపం. చాలా పొట్టిగా పిట్టల్లా వుండేవారు. అతి నిరాడంబరంగా కనిపించేవారు. ఘంటసాల మాస్టారు తన భావాలను వారికి తెలియజెప్పి తాను ఎంచుకున్న శ్లోకాలకు వ్యాఖ్యానం చేయమని కోరారు. శ్రీ కోట సత్యరంగయ్యశాస్త్రిగారు కూడా చాలా ఆనందించారు. కొన్నాళ్ళ తర్వాత తాను వ్రాసినది తీసుకువచ్చి ఘంటసాల మాస్టారికి వినిపించారు. అది మాస్టారికి అంత తృప్తి కలిగించలేదు. అక్కడక్కడ భాష మరీ గ్రాంధికమై పామరులకు అర్ధం కాని విధంగా ఉపయోగించారు. వాటన్నిటినీ ఒకటికి రెండుసార్లు సరిచేయించి భగవద్గీత వ్యాఖ్యానం పూర్తిచేయించారు. 



భగవద్గీతా గానాన్ని ఒక పరమ పవిత్రకార్యంగా భావించారు. అందుకోసం మనసా, వాచా, కర్మణేన ఆ భగవద్గీత రికార్డింగ్ జరిగినన్నాళ్ళు చాలా నియమనిష్టలు పాటించారు. ఆహారరీత్యా శాకాహారులే కావడాన ఆహార సమస్య లేదు.  తన వేషాన్ని కొంత మార్చారు. కషాయ రంగు చొక్కా, లుంగీలను ధరించడం మొదలెట్టారు. ఇందుకుగానూ సావిత్రమ్మగారు మాస్టారి తెల్ల దుస్తులనే పానగల్ పార్క్ సమీపంలో దొరైసామీ రోడ్ లో వున్న నల్లీ డైయింగ్ లో  ఇచ్చి ఆ తెల్ల బట్టలకు కాషాయ రంగు వేయించారు. బయట సినీమా పాటల రికార్డింగులకు కాషాయ బట్టలతోనే వెళ్ళేవారు. ఈ విధమైన నియమ నిష్టలను పౌరాణిక సినీమాల విషయంలో  ఎన్.టి.రామారావు పాటించేవారు. ముఖ్యంగా రాముడు, కృష్ణుడు, మహావిష్ణువు, శివుడు వంటి వేషధారణలో వున్నప్పుడు శాకాహారాన్నే తీసుకోవడం, నేలమీదే పడుక్కోవడం వంటివి  ఆచరించేవారు.

ఘంటసాలవారి భగవద్గీత  రికార్డింగ్ అంతా ఒకేసారి జరగలేదు. తన ఇతర సినీమా పాటలకు, ఇతర కార్యకలాపాలకు అడ్డంకి రాకుండా వ్యవధి తీసుకుంటూ రికార్డింగ్ జరిపారు. చాలా శ్లోకాలకు కంపోజింగ్ కూడా రికార్డింగ్ స్పాట్ లనే జరిగిందని మా నాన్నగారు చెప్పగా విన్నాను. 

అప్పటికి నేను నా ఉద్యోగ విధులలో తలమునకలుగా వుండడం వలన మా వాళ్ళ సినీమా  వ్యవహారాలకు చాలావరకు దూరమయ్యాను. రికార్డింగ్ లు, రీరికార్డింగ్ లకు వెళ్ళడం కుదిరేదికాదు. (HMV రికార్డింగ్ స్టూడియో జెమినీ స్టూడియో, సెఫైర్ ధియేటర్ల మధ్య ఒక చిన్న సందులో వుండేది. దానికి ఎదురుగానే ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారి ఆఫీస్, ప్రొజెక్షన్ థియేటర్ వుండేవి.) ఇప్పుడు వాటి ముందట  వుమ్మిడియార్స్ వాళ్ళ హైటెక్  నగల దుకాణాలు దర్శనమిస్తాయి.

భగవద్గీతను ఒక భగవత్కార్యంగా భక్తి శ్రధ్ధలతో రూపొందించారు. సంగీతంలో తనకు గల అనుభవాన్ని, విద్వత్ ను సంపూర్ణంగా ఈ శ్లోకాలలో ఉపయోగించారు.  రసోత్పత్తి కలగడానికి శుధ్ధ శాస్త్రీయ పధ్ధతిలో అనేక హిందుస్థానీ, కర్ణాటక సంగీత రాగాలను సందర్భోచితంగా ప్రయోగించారు. ఒక్కొక్క శ్లోకానికి, తాత్పర్యానికి ముందు వెనుకల సార్ధకత పెంచేలా వాద్యాలను ఉపయోగించారు. భావోద్వేగాల స్ఫూర్తిని కలిగించడంలో ఘంటసాలవారి ప్రతిభ అణువణువునా గోచరించింది.  ఘంటసాలవారి భగవద్గీత గానంలో నిష్ణాతులైన ఉత్తమ వాద్య కళాకారుల  పరిపూర్ణ సహకారం లభించింది. సర్వశ్రీ - మిట్ట జనార్దన్ - సితార్, గుణసింగ్ - ఫ్లూట్, సంగీతరావు - హార్మోనియం, రామసుబ్బు, చిత్తూరు సుబ్రహ్మణ్యం - వైలిన్స్, సుభాన్ - క్లారినెట్, యు. రామచంద్రరావు - డ్రమ్స్, జడ్సన్ - తబలా,  భద్రం - తంబురా, మొదలగు కళాకారుల సహకారంతో ఘంటసాల మాస్టారు తాత్పర్య సహిత గీతాగానాన్ని రికార్డ్ చేసారు.

ఘంటసాలవారి భగవద్గీత రెండు భాగాలుగా జరిగింది. రెండింటికీ మధ్య ఆరు మాసాల కాల వ్యవధి. ఇతర కార్యకలాపాల వలన కొంత ఘంటసాలవారి అనారోగ్యం కారణంగా కొంత జాప్యమయింది. భగవద్గీత వింటున్నంతసేపూ   ఆ రకమైన తేడాలేవీ వారి గాత్రంలో మనకు కనిపించవు. మనకళ్ళెదట శ్రీకృష్ణుడు, అర్జునుడు మాత్రమే కనిపిస్తారు. ఈ ఇద్దరి శ్లోకాలలోని వైవిధ్యం, ఘంటసాలవారిలో దాగివున్న నటనా ప్రతిభ ద్యోతకమవుతుంది. విశ్వరూప దర్శన సమయంలో ఉపయోగించిన వాద్య సమ్మేళనం మనకు ఒక రకమైన జలదరింపు, సంభ్రమం కలిగిస్తుంది. నిజంగానే కురుక్షేత్ర సంగ్రామ భూమిలో వున్నామనే భావన కలుగుతుంది. నరనారాయణులిద్దరూ ఘంటసాలవారి లో కనిపిస్తారు. 


పార్ధాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం...'
అనే శ్లోకం తో మొదలై మరో నూరుకు పైబడిన శ్లోకాలతో ఘంటసాల భగవద్గీతా గాన రసవాహిని శ్రోతలకు గొప్ప భావోద్వేగాన్ని కలుగజేస్తుంది. చివర, ఫలశృతిగా శాంతి శ్లోకాన్ని, అసతోమా సద్గమయా శ్లోకంతో తన భగవద్గీతను ముగించారు ఘంటసాల మాస్టారు. చివరలో వచ్చే ఆ శాంతిశ్లోకంలో తనతో పాటు మరో ఇద్దరు ముగ్గురు కూడా కలసి పాడారు. అందులో ఒక గాత్రం మా రెండవ చెల్లెలు పద్మది కావడం మాకందరికీ ఎంతో ఆనందదాయకం. అప్పటికి ఆమె వయసు 13 మాత్రమే. 

భగవద్గీత శ్లోకాలు పార్థాయప్రతిబోధితాం... శాంతిశ్లోకం    

తాను పాడిన భగవద్గీత ను రికార్డింగ్ సమయంలో వినడమే తప్ప, అది రికార్డ్ గా విడుదలైన తర్వాత సృష్టించిన చరిత్ర, తెచ్చిపెట్టిన పేరు ప్రఖ్యాతులు ఏవీ ఘంటసాలవారికి తెలియనే తెలియవు. అదే దురదృష్టం. 

🙏💐🙏

పంటలు పండని బీడువారిన భూములను వదలి పశుపక్ష్యాదులు పచపచ్చని పచ్చిక మైదానాలను వెతుకుతూ పోయినట్లే తన భవిష్యత్తు కోసం ఘంటసాలవారి దగ్గర సహాయకుడిగా,  వారి పెంపుడు కొడుకులా ఇరవైఏళ్ళపాటు ఇంట్లో మసలిన జె.వి.రాఘవులు 1969లో మాస్టారిని వదలిపెట్టిపోయారు. ఆయనకు డి.రామానాయుడు రూపంలో మంచి ప్రాపకం లభించింది. వారి సంస్థలో సహాయకుడిగా ఎమ్.ఎస్.విశ్వనాథన్, కె.వి.మహాదేవన్ ల వద్ద పనిచేసారు. రామానాయుడు గారురాఘవులు నాయుడు గారికి తమ 'ద్రోహి' చిత్రానికి సంగీత దర్శకుడిగా అవకాశం కల్పించి ప్రోత్సహించారు. అయితే ఆ సినీమా విజయవంతం కాలేదు. పాటలు పెద్దగా బయటకు రాలేదు. 1973 లో వచ్చిన రామానాయుడిగారి  'జీవన తరంగాలు' రాఘవులు గారికి సంగీతదర్శకుడిగా మంచి బ్రేక్ ఇచ్చింది. నేపథ్యగాయకుడిగా రాణించడానికి తగిన గాత్రం కాదు. కేవలం కొన్ని తరహా పాటలకే పరిమితమైన గాత్రం. అందువలన సంగీత దర్శకుడిగా నే తమ అదృష్టాన్ని నమ్ముకొన్నారు. 
తెలుగు సినీమారంగంలో సంగీతం ఎవరు నిర్వహించినా  హీరో పాటలు పాడాలంటే ఘంటసాలే రావాలనే దృష్టిలో ఆనాటి హీరోలు, వారిని అనుసరించే నిర్మాత లు వుండేవారు. 'జీవనతరంగాలు'లో రాఘవులు గారి సంగీత దర్శకత్వంలో ఘంటసాల మాస్టారు మూడు పాటలు పాడారు. అందులో 'ఈ జీవన తరంగాలు'  లో పాటను అసమాన్యం గా పాడారు. 

ఈ జీవనతరంగాలలో

ఆ పాట ఈనాటికీ బహుళ ప్రచారంలో వున్నది. తన శిష్యుడు ప్రయోజకుడైనందుకు ఘంటసాలవారెంతో సంతోషించారు. ఆరోజుల్లోనో అంతకుముందో రాఘవులు  టి.నగర్ లోని త్యాగరాజ గ్రామణి స్ట్రీట్ లో కట్టుకున్న తమ సొంత ఇంటి గృహప్రవేశానికి మాస్టారింట్లోవారిని, మా నాన్నగారినీ కూడా ఆహ్వానించారు. ఇంట్లోకి ప్రవేశించగానే వుండే వరండాలో గోడమీద ఘంటసాలవారి ఫోటోను పెట్టారు. ఆ తర్వాత రాఘవులుగారిని ఘంటసాలవారింట చూడలేదు.

1973లో  మధ్య మధ్య అనారోగ్యంతో బాధపడుతూ  ఒక ఇరవైఐదు సినీమాలలో మాత్రమే ఘంటసాల మాస్టారు దాదాపు 65 పాటలు పద్యాలు పాడారు. కొన్ని పాటలకు జలుబు వలన  గొంతు సహకరించక వేరే వర్ధమాన గాయకుల చేత ట్రాక్ పాడించి షూటింగ్ ముగించేవారు. సినీమా రిలీజ్ లోపల మాస్టారు ఆ పాటలను మళ్ళీ పాడి ట్రాక్ మిక్స్ చేసేవారు. కొన్ని సందర్భాలలో ఆయా నూతన గాయకులు పాడిన పాటలు బాగున్నాయనుకునేప్పుడు వాటిని తాను మళ్ళీ పాడకుండా ఆ గాయకుల గొంతునే ఉంచమని  ఘంటసాలవారు నిర్మాతలను కోరేవారు. ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, వి.రామకృష్ణ, జేసుదాస్‌, జి.ఆనంద్, రమేష్, ఎ.వి.ఎన్.మూర్తి వంటి నూతన గాయకులతో ప్రయోగాలు మొదలుపెట్టి వారిని చిత్రసీమ ప్రోత్సహిస్తున్న రోజులవి. ఎంతమంది నూతన గాయకులు వచ్చినా ఘంటసాలవారి స్థాయికి ఏ ఒక్క గాయకుడు అందుకోలేకపోవడం అటు సంగీత దర్శకులకు, ఇటు నిర్మాతలకు క్లిష్టతరమయింది. 

1973 లో వచ్చిన సినీమా లలో  - 'బంగారుబాబు'లోని  'చెంగావి రంగు చీర', దేవుడు చేసిన మనుషులు' లో ' దేవుడు చేసిన మనుషుల్లారా', పల్లెటూరి బావలో - 'ఒసే వయ్యారి రంగి',  'మైనర్ బాబు'లో 'మోతీ మహల్ లో చూశానా', 'డాక్టర్ బాబు'లో 'విరిసే కన్నులలో', 'మరపురాని మనిషి'లో 'వచ్చింది వచ్చింది లచ్చిమి' వంటి పాటలు మంచి ప్రచారం పొందాయి.

వీటన్నిటిలోకి తలమానికంగా ఈనాటికీ అందరిచేతా పాడబడుతూ అందరి మన్ననలు పొందుతున్న పాటలు 'భక్త తుకారం'లోని పాటలు. ఘంటసాలవారు ఎప్పుడు పాడితే అప్పటివరకు కాచుకునే వుంటామని ఆదినారాయణరావుగారు  ఆ చిత్రంలోని ఆరు పాటలను, మూడు పాటలు ఘంటసాలవారి చేతే పాడించారు. ఆ చిత్రంలోని 'ఘనా ఘన సుందరా', 'భలే భలే అందాలు', 'ఉన్నావా అసలున్నావా', 'చిందులు వేయకురా నరుడా'  పాటలు అజరామరంగా నిల్చిపోయాయి. 

ఘనా ఘనా సుందరా - భక్త తుకారం

భలే భలే అందాలు సృష్టించావు - భక్త తుకారం

ఉన్నావా అసలున్నావా - భక్త తుకారం

ఈ పాటలన్నీ ఘంటసాలవారు అనారోగ్యంతో వున్నప్పుడు పాడినవే. ఈ సినీమాలోని ట్రాక్స్ కొన్ని వి.రామకృష్ణ చేతే పాడించారు. రామకృష్ణ గొంతు చాలా వరకు ఘంటసాలవారి గొంతును అనుకరించి వుండేది.

గాయకుడిగా మద్రాస్ లో  తన ప్రయత్నాలు మొదలెడుతున్న తొలి రోజుల్లో  వి.రామకృష్ణ తన తల్లిగారిని తోడుతీసుకొని ఒకసారి ఘంటసాలవారింటికి వాయిస్ ఆడిషన్ కోసం వచ్చారు. ఘంటసాల మాస్టారు ఎదుట  కొన్ని పాటలు పాడారు. కొత్త గాయకులు ఎవరు వచ్చినా సినీమా పాటలు, తాను పాడిన పాటలు కాకుండా వేరే పాటలు పాడమనేవారు. అప్పుడే వాళ్ళ ఒరిజినాల్టీ తెలుస్తుందని అనేవారు. చాలామంది కొత్త కుర్రాళ్ళు సినీమా పాటలంటే చాలా బాగా పాడేవారు. నాన్ ఫిల్మ్ గీతాలు పాడేప్పటికి తేలిపోయేవారు. అలాటి వారందరికీ ఘంటసాలవారు ఎప్పుడూ ఒకే సలహా ఇచ్చేవారు. ఏ గాయకుడినైనా అనుసరించండి కానీ అనుకరించవద్దనేవారు. అనుకరించేవారికి గాయకుడిగా తాత్కాలిక మనుగడే తప్ప సుదీర్ఘకాలం రాణించలేరనేది వారి నిశ్చితాభిప్రాయం.

రామకృష్ణ వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో మాట్లాడుతూ ఆ కుర్రాడు సుశీల అక్క కుమారుడని పాటలు బాగానే పాడుతున్నా తన గొంతునే, ముఖ్యంగా వయసు దాటాక ఏర్పడిన జలుబు గొంతునే తెలిసో తెలియక అనుకరిస్తున్నాడని అది అతని భవిష్యత్తుకు అంతగా దోహదపడదని అనడం విన్నాను. అది చాలా వరకు నిజమే అయింది. 

ఈ రోజుల్లోలాగా  తమ వారసులను ప్రమోట్ చేసుకోవడమనే సంస్కృతి ఆనాటి సినీమా రంగంలో ఎక్కువగా కనపడదు.  బాగా పాడతాడు పాడించుకోండని రామకృష్ణ  విషయంలో సుశీలగారు కానీ, మా అబ్బాయి పియోనా బాగా వాయిస్తాడు, అవకాశాలు ఇవ్వండని రాజేశ్వరరావుగారో, ఘంటసాలగారో తమ పిల్లలకోసం ఎవరినీ అడిగిన దాఖలాలు కనపడవు. స్వతఃసిద్ధమైన ప్రతిభ వుంటే వాళ్ళకు వాళ్ళే అవకాశాలు సంపాదించుకొని వృధ్ధిలోకి రావాలని ఆనాటి తల్లిదండ్రులు భావించేవారు. 

సినీమా రంగం చిత్ర విచిత్రమైనదని అందరికీ తెలిసిందే.

ఆ విశేషాలు ఏమిటో వచ్చేవారం చూద్దాము.

                   ...సశేషం

No comments: