visitors

Sunday, March 25, 2012

ఉగాది పాట


శ్రీ సంగీతరావుగారు  రచించి స్వరపరిచిన ఓ ఉగాది పాటను ఇక్కడ  పరిచయం చేయబోతున్నాను.

ఆకాశవాణి మద్రాసుకేంద్రంలో  చిన్న పిల్లలు ఉగాది సందర్భంగా పాడడం కోసం సంగీతరావుగారు ఓ గేయం రచించారు. ఆనందనామ సంవత్సరం (బహుశ 1975) ఉగాది సందర్బంగా ఈ గేయం ఆకాశవాణి లో ప్రసారమయింది.

మరోసారి ప్రభవ నామ సంవత్సరం ఉగాదినాడు మద్రాసు తెలుగు అకాడమీ వారి ఉగాది ఉత్సవాలలో ఉగాదికి ఆహ్వానగీతంగా ఒక పాటను స్వరపరచవలసిన సందర్భం వచ్చినపుడు సంగీతరావుగారు బాలాంత్రపు రజనీకాంతరావుగారు రచించిన గేయాలనుంచి ఒక గేయాన్ని ఎత్తుగడ గా తీసుకుని తన గేయాన్ని కూడా కలిపి స్వరపరిచారు. రజనీకాంతరావుగారి శతపత్రసుందరి గేయసంపుటిలో నుంచి ఈ గేయాన్ని తీసుకున్నారు

(శ్రీ బాలాంత్రపు రజనీకాంతరావు సంగీతం, సాహిత్యం ఉభయరంగాలలోను లబ్ధ ప్రతిష్టులైన ప్రతిభా మూర్తి. లలితసంగీత రీతులను తెలుగు ప్రజలకు రేడియో మీడియా ద్వారా ప్రసారం చేస్తూ, తన రచనలతో, సంగీతంతో ప్రచారం చేస్తూ పరిపూర్ణమైన సహకారం అందించిన గొప్ప సంగీతమూర్తి. రజని పేరుతో తెలుగువారికి సుపరిచితులు.)

కొత్త సంవత్సరం ఆలయంలో మ్రోగిన ఘంటానాదంలా, ఆకాశంలో  మెరిసిన ఆశా జ్యోతిలా ఆగమిస్తోందని భావించారు రజనీకాంతరావుగారు.
గడిచిపోయిన సంవత్సరం లోని చేదు జ్ఞాపకాలు, మనస్సులోని పాపపుటాలోచనలు అన్నీ పటాపంచలైపోయి మనసులోని బాధనంతటినీ తుడిచేసి ఆ విశ్వ విభుడైన పరమేశ్వరుని కరుణా కటాక్షాలు జడివానగా కురుస్తుండగా ప్రక్షాళితమైన మనస్సులతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలకాలని ఆశించారు రజనీకాంతరావుగారు. 
వసంత ఋతువులో చెట్లు పండిన సారంలేని ఆకులను రాల్చేసి కొత్తచిగుళ్లను తొడుగుతాయి. జగమంతా పచ్చదనం వెల్లివిరుస్తూ మనసులను ఉల్లాసపరుస్తుంది. అటువంటి శుభోదయం సమయంలో ఈ జగత్తులోని సర్వసౌభాగ్యాలకు కారణమైన ప్రభువును కీర్తించుదామని తనతో గొంతు కలపమని పిలుస్తారు రజనీకాంతరావుగారు.
ఆ గేయం యొక్క సాహిత్యం ఇది.

ఆలయమున వినబడునదిగో
ఆకసమున కనబడునదిగో
నవవర్షపు ఘంటానినదం
నవ్యాశా జ్యోతీ... నవ్యాశా జ్యోతీ...
ప్రాతయేటి పెను తమస్సులూ
పాప కలితములు మనస్సులు
పటాపంచలే
క్షుభిత హృదయములపై విరిసి
విభుని కరుణ జడులై కురిసే
నవవసంతమై నవవసంతమై
శుభోదయోత్సవ సమయమునా
ప్రభూయనుచు మధుర రవమునా
కీర్తించుదమా - కీర్తించుదమా                       
ఆలయమున వినబడునదుగో.....
ఇక్కడివరకు ఈ ఉగాది పాటలో రచన బాలాంత్రపు రజనీకాంతరావుగారిది. ఇక ఇక్కడ నుంచి సాహిత్యం సంగీతరావుగారిది.
అటువంటి నవ వసంతం ఆగమించిన కొత్త సంవత్సరానికి ఈ విధంగా స్వాగతం పలికారు సంగీతరావుగారు.
ముందుగా-
నవయుగం అంటే కొత్తసంవత్సరం ఆగమించిన వేళ ప్రకృతి ఎలా ఉంటుందో వివరించారు. వసంతకాలం హృదయాలను పులకింపజేసే సమ్మోహనకరమైన కాలం. వసంతానికి మరోపేరు ఆమని. వసంతకాలంలో తొలిసంజె వేళలో విరిసే వెలుగులు, ఆహ్లాదపరిచే వెన్నెలవేళలు అనుభవైకవేద్యమే.  వసంతకాలం అనగానే  మధురమైన సువాసనతో   విరిసే మల్లెపూలు, చవులూరించే  మధురమైన మామిడిపళ్ళు అందరికీ గుర్తొస్తాయి. అంతే కాక కొత్త మామిడిచిగుళ్ళను మేసి కలకూజితం చేసే కోయిలమ్మ కూడా వసంతానికి ప్రతినిధి కదా. అందుకే ఇన్ని అందమైన అనుభూతులనిచ్చే ఆమనికి, కొత్త సంవత్సరపు తొలిరోజుకి ఈ విధంగా స్వాగతం చెప్పారు.
ఆ.... ఆ....ఆ...
స్వాగతమిదె స్వాగతమిదే వత్సరాదికి
స్వాగతమిదె స్వాగతమిదె నవయుగాదికి

తొలిసంజ వెలుగులు పులకించే వెన్నెలలు
మధురమైన ఫలములను మరుమల్లే విరులను
కొసరి కొసరి వినిపించే కోయిలమ్మ పాటను
హాయిగా తీయగా అందిచే ఆమనికి
స్వాగతమిదె స్వాగతమిదే వత్సరాదికి
స్వాగతమిదె స్వాగతమిదే నవయుగాదికి
కవులు - కొత్తసంవత్సరానికి కేవలం స్వాగతం చెప్పి ఊరుకుంటే ఎలా.
అందుకే  సమాజాభ్యుదయానికి తాను ఆశించే విలువలను కూడా ప్రస్తావించి ఈ గేయాన్ని ముగించారు.
అనుమానం అసహనం అపరిమిత ద్వేషం
మటుమాయం కాగా మమకారం సహకారం
సమరసభావం శాంతి సౌభాగ్యం 
వర్థిల్లే నవ ప్రభవ వత్సరాదికి

స్వాగతమిదె స్వాగతమిదె వత్సరాదికి

స్వాగతమిదె స్వాగతమిదెనవయుగాదికి

పాటను స్వరపరుస్తుండగా రికార్డు చేసినందువల్ల  పాతికసంవత్సరాలకు పైబడి పోయినందువల్ల, సాంకేతికంగా కొంత సౌలభ్యం తక్కువగా ఉన్నా పాట వరుసను సంగీతరావుగారి స్వరంలో వినడం కోసం దాన్ని కూడా జతపరుస్తున్నాను 
ఇక్కడ.
https://soundcloud.com/sudha-sudha-1/ugadi-pata-swagathamide-vatsaraadiki-nava-yugadiki
 
ఈ పాటకు వీడియో దృశ్యరూపం కల్పించి అందించిన శ్రీ శివ(ఎందుకో ఏమో బ్లాగ్)   గారికి ధన్యవాదాలు. ఆ వీడియో ఇక్కడ

https://www.youtube.com/watch?feature=player_embedded&v=OhaZ5Xvjibs

ఈ ఇద్దరు ప్రతిభామూర్తుల గురించి శ్రీ కొడవటిగంటి రోహిణీ ప్రసాద్ గారు రచించిన వ్యాసం ఈమాట- వెబ్ పత్రికలో ప్రచురించబడింది. ఈ ఇద్దరితోనూ ఎంతో ఆత్మీయమైన స్నేహానుభవం ఉన్న రోహిణీ ప్రసాద్ గారు చెప్పిన ఎన్నో విశేషాలతో కూడిన వ్యాసాన్ని (88 ఏళ్ళ యువకులు) ఆసక్తి ఉన్నవారు ఇక్కడ చూడవచ్చు. .
http://eemaata.com/em/issues/200807/1296.html






Saturday, February 25, 2012

ఆంధ్రమాతకు కృష్ణ శాస్త్రిగారి గీతార్చన



(చాలామంది తెలుగువారికి తెలియని ఓ చక్కని,  కొత్తపాటని ఇక్కడ పరిచయం చేయబోతున్నాను)

1897లో ఆంధ్రదేశంలో జన్మించిన దేవులపల్లి కృష్ణశాస్త్రిగారి మీద ఆ కాలంలోని అనేక ఉద్యమాల ప్రభావం కనిపిస్తుంది. ఆంధ్రదేశంలో భాష, సంస్కృతి, సమాజం ఈరంగాలలో అనేక మార్పులు చోటుచేసుకున్న కాలంలో దేవులపల్లి కృష్ణశాస్త్రి కలం పట్టారు. ఆనాటి సాహిత్యంలో ప్రధాన మైన ధోరణి, ఉద్యమ స్థాయినందుకున్న కవితా పద్ధతి భావకవిత్వం.  గురజాడ, రాయప్రోలు సుబ్బారావుగారు తో ప్రారంభమై భావకవిత్వం శాఖోపశాఖలుగా విస్తరించింది. కవిత్వం చెప్పడంలోనే కాక ఆ కవిత్వం చెప్పేవారి రూపురేఖావిలాసాలు కూడా  కొత్తపోకడలు సంతరించుకుని భావకవులల్లిన కవిత్వం ప్రజా బాహుళ్యంలో విశిష్టమైన స్థానం సంపాదించింది.

ఆ భావకవిత్వ యుగంలోని అచ్చమైన భావకవి, దేవులపల్లి కృష్ణశాస్త్రి. భావకవితా యుగంలోని అన్ని లక్షణాలు దేవులపల్లి కవిత్వంలో కనిపిస్తాయి. ప్రణయం, ప్రకృతి, దేశ భక్తి, ఆథ్యాత్మికత, సంఘ సంస్కరణ, మానవత్వం, కాల్పనికత, మార్మికత ఇలా భావకవులు  ఆ కాలంలోని  ఇతర భాషా సాహిత్యాల ప్రభావంతో చేసిన రచనలలోని ప్రధానమైన వస్తువులు. దేవులపల్లి కవిత్వంలో  ఈ అంశాలకు చెందిన గేయాలెన్నో కనిపిస్తాయి.

దేవులపల్లి గీతాలలో దేశ భక్తి గీతంగా ఎంతో ప్రసిద్ధి పొందిన గీతం -జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ దివ్యధాత్రి. 

భారతదేశాన్ని తల్లిగా భావించి దేవులపల్లిగారు రాసిన ఈ గేయం జాతీయపండుగల సందర్భాలలో  తెలుగు వాళ్ళ నోట పారాయణంగా మ్రోగుతుంది.

అయితే  దేశభక్తి అనే ఛాయతోనే ఆంధ్రదేశాన్ని తల్లిగా ఆరాధిస్తూ  దేవులపల్లి కష్ణశాస్త్రిగారు రచించిన మరొక గేయం చాలామంది తెలుగు వారికి తెలియదు.  ఆంధ్రదేశ వైభవాన్ని వర్ణిస్తూ సాగే గేయం జయ జయ ప్రియాంధ్ర జనయిత్రీ . 


 జయ జయ జయ ప్రియభారత జనయిత్రీ గేయం పూర్తిగా సంస్కృత పదాలతో కూర్చిన గేయం అయితే, ఈ "జయ జయ మహాంధ్ర జనయిత్రీ  గేయంలో ఎక్కువగా తెలుగు పదాలను కూర్చడమే కాక తెలుగు దేశంలోని ప్రకృతి వర్ణన కూడా చేసారు కృష్ణశాస్త్రిగారు.

పట్రాయని సంగీతరావుగారు మద్రాసు కూచిపూడి ఆర్ట్ ఎకాడమీ - రూపొందించిన ఎన్నో నృత్యనాటకాలకు సంగీతం సమకూర్చారు. ఆ సమయంలో  మాష్టరు గారు వెంపటి  చినసత్యంగారి వద్ద నాట్యం నేర్చుకున్న అనేకమంది ప్రముఖ నర్తకీమణులలో సినీనటి కాంచన ఒకరు.   ఆమె తన నాట్యం లో   ప్రదర్శించడంకోసం   దక్షయజ్ఞం అనే రచన ప్రారంభించారట కృష్ణశాస్త్రిగారు. దక్షయజ్ఞం రచన కొసవరకు సాగలేదు, కానీ ఆసమయంలోనే కృష్ణశాస్త్రిగారు, " ప్రతిదినము నీ గుణకీర్తనమే పారవశ్యమున పాడెదమూ", 
" పూవులేరి తేవే చెలి"  అనే లలితగేయాలను రచించారుట.    అప్పుడు  కూచిపూడి నాటకాలకు సంగీత దర్శకుడిగా ఉన్న   పట్రాయని సంగీతరావుగారు   కృష్ణశాస్త్రిగారిని తరచు కలుసుకుంటూ ఉండేవారు. ఆ సందర్భంలోనే ఈ గేయాలను సంగీతరావుగారు  స్వరపరిచారు.  ప్రతిదినమూ నీ గుణకీర్తనమే గేయాన్ని శహనా రాగంలోను, పూ లేరి తేవే చెలి పోవలె గేయాన్ని యదుకుల కాంభోజి రాగంలోను, ఈ "జయ జయ మహాంధ్ర జనయిత్రీ " పాటను  కల్యాణి, మధ్యమావతి రాగాలలోను కూర్చారు సంగీతరావుగారు.

ఈ క్రమంలో దేవులపల్లివారు రాసుకున్న పాట  వారి స్వహస్తాలతో ఇదిగో ఇది.


ఈ పాట సాహిత్యం ప్రారంభం  ఇలా ఉంటుంది.
జయ జయ మహాంధ్ర జనయిత్రీ
జయ జయ ప్రియాంధ్ర జనయిత్రీ
జయ జయ ప్రియతమ భారతధాత్రీ  ప్రియపుత్రీ శుభ ధాత్రీ

భారతదేశాన్ని తల్లిగా భావించి జయజయప్రియభారత జనయిత్రీ అని రాసిన కృష్ణశాస్త్రిగారు, ఆ భారతదేశంలో ఒక భాగమైన ఆంధ్ర దేశాన్ని భారతధాత్రీ ప్రియపుత్రీ  అంటూ  ఆ భారతమాత పుత్రికగా ఊహించారు ఈ పాటలో.

మొదటి చరణంలో పచ్చని పంటపొలాలతో సస్యాలతో కొత్త చిగుళ్ళు వేసి పచ్చగా ఉన్న ఆంధ్ర దేశాన్ని, అరటి, మామిడి,  కొబ్బరి మొదలైన వృక్షచ్ఛాయలతో నిండి వాటినుండి వచ్చే మృదువైన గాలులు  వింజామర వీచగా అతి సుందరంగా శోభిల్లే భూమిగా ఆంధ్రదేశాన్ని ఊహించారు.

రెండవ చరణంలో ఆంధ్రదేశానికి చెందిన ఘనమైన చరిత్రను స్మరించి, రాబోయే కాలాన్ని మరింత ఘనంగా ఊహించి ఇటు మంజీరా నది, అటు వంశధార నదులు ఆ తల్లిని ఘనంగా కీర్తిస్తూ ఉన్నాయట. కబరీ కాశ కదంబములూగ అంటే కొబ్బరిచెట్ల కొమ్మలు, రెల్లు పొదలు, కడిమిచెట్లు వంటి అంగాలతో చలిస్తూ ఉండగా  శబరీ, పెన్నా మొదలయిన నదులు సంతోషంతో నృత్యం చేస్తాయట. ఈ సంబరమంతా చూసి గోదావరి, కృష్ణా నదులు తమ ప్రవాహాలనే తలలను ఊపుతూ సంతోషాన్ని తెలియజేస్తాయని వర్ణిస్తారు కృష్ణశాస్త్రి.

మూడవ చరణం లో  ఈ ఆంధ్రదేశంలో వసించే వారి అన్ని కోరికలు తీరాలని, ఇటు తెలంగాణలోను, అటు కళింగదేశమయిన ఉత్తర ప్రాంతంలోను, రాయలసీమ లోను మొత్తం తెలుగు ప్రాంతాలన్నిటా వేల వేల గుమ్మాలలో మంగళనాదంగా ఆంధ్రగానం మోగాలని కోరుకుంటారు.

పాట ముగింపులో  కవి తన ప్రబోధాన్ని తెలియజేస్తారు. జగమంతా తన కుటుంబమే అని నమ్మే విశాలహృదయం కవిది. అందుకే విశాల మానవతా సమతా వాదమే మా మనోరథం అంటూ ఏ కులమతాలు, వైషమ్యాలు లేని సమానత్వంతో మానవత్వాన్ని సాధించి మనుషులంతా ఒకే కుటుంబంగా జీవించే ఆశయాన్ని సాధించాలంటారు. అందుకోసం నడుం కట్టాలంటారు. 

లోక కల్యాణం కోసం భావితరాల సౌభ్రాతృత్వం కోసం, స్వేచ్ఛకోసం ధృఢమైన శపథం తీసుకోవాలని బోధిస్తారు. ఒక్క క్షణకాలం కూడా వృథా చేయకుండా ఈ ఆశయసాధనకోసం అంకితం అవుతామని, గమ్యంకోసం సాగే ప్రయాణంలో తమ అడుగులు చెదరవని  సంకల్పాన్ని వెల్లడిస్తారు. ఇటువంటి మహదాశయంతో సాగిపోయే తమను తల్లిగా ఆశీర్వదించమని శుభము, శాంతి కలగాలని దీవించమని కోరుతారు.

సకల మానవకల్యాణమే విశ్వకవి కోరుకునే ఆశయం.
ఆ లోకకల్యాణంకోసమే కవి పూరించే ఈ మంగళకాహళి.

పాట సాహిత్యం :

          జయ జయ మహాంధ్ర జనయిత్రీ
          జయ జయ ప్రియాంధ్ర జనయిత్రీ
          జయ జయ ప్రియతమ భారతధాత్రీ 
          ప్రియపుత్రీ శుభ ధాత్రీ


1 చరణం.    శ్యామల నవ సస్యాంబరా
              కోమల సుమవల్లీ చికురా
              కదళీ రసాల లాంగలీ ఛలచ్ఛద
              మృదులానిల జామరా
              సుందరాతి సుందర వసుంధరా 
                                            "జయ జయ మహాంధ్ర"
2 చరణం.    నీ పూర్వ చరిత స్మరియించి
               నీ భావి ఘనత దర్శించి
               ఇటు మంజీర అటు వంశధార 
               ఎలుగెత్తి నిన్ను కీర్తించూ
               కబరీ కాశ కదంబములూగ 
               శబరీ పెన్నలు నర్తించు
               మరి మరి కృష్ణా గోదావరి 
               ఝరులు తలలూపి హర్షించు
                                              "జయ జయమహాంధ్ర"
 3 చరణం   ఎల్లర కోర్కులు నిండునని 
              మనమెల్లరమొక సంసారమని
              ఇటు తెలంగాణ  అటు కళింగాన
              అట నట కోస్తా రాయలసీమల
              సహస్ర సహస్ర మందిర గేహళి
              సదా మ్రోగు నీ మంగళ కాహళి  "జయ                                                                                జయమహాంధ్ర"
  ముగింపు:     శ్రీ విశాల మానవతా సమతా
                     సాధనమే మా మనోరథం
                      భావిలోక కల్యాణ సుస్థిర  
                      స్థాపనమే మా దృఢ శపథం
                      ఒక క్షణమేని వృథ పోనీము
                      ఒక అడుగేని చెదరనీయము
                      శ్రీరస్తు శుభమస్తని శాంతి రస్తని దీవించు  
                                               

    ( జయ జయ మహాంధ్ర జనయిత్రీ  వినడానికి వీడియో పైన  క్లిక్ చేయండి)