visitors

Wednesday, January 7, 2026

రాల్గరగించు విమల గాంధర్వం



                                                             



పుష్య బహుళ పంచమి

శ్రీ త్యాగరాజ ఆరాధన


అరవైయేళ్ళ క్రితం నాన్నగారు వ్రాసిన "రాల్గరగించు విమల గాంధర్వం" అన్న వ్యాసం చూసిన జ్ఞాపకం. బహుశః 'ఆంధ్రమహిళ' లో కావచ్చు. కానీ ఆ వ్యాసం నాన్నగారి 'చింతాసక్తి' పుస్తకంలో పొందుపరచలేకపోయాను. ఆంధ్రమహిళ ప్రతులు ఏవీ నాకు దొరకలేదు. హఠాత్తుగా ఈ మధ్య నాన్నగారి పుస్తకాలలో ఈ వ్యాసం దొరికింది. అది అరవైయేళ్ల క్రితం ముద్రింపబడినదో, మరొకటో నాకు తెలీదు. శ్రీ త్యాగరాజస్వామి ఆరాధన సందర్భంగా ఆ వ్యాసం పంచుకొనే సదవకాశం సద్వినియోగం  చేసుకోవలనే సత్సంకల్పంతో ... 

పట్రాయని వేణు గోపాలకృష్ణ

శ్రీ త్యాగరాజస్వామి - రాగయోగము

(అను రాల్గరగించు విమలగాంధర్వం)

పి.సంగీతరావు

కంచి కామకోటి పీఠాధిపతులు ఒక సందర్భంలో శ్రీ త్యాగరాజస్వామి కీర్తనల ప్రాశస్త్యాన్ని ఉగ్గడిస్తూ స్వామి సంకీర్తనము త్యాగోపనిషత్తు అని సెలవిచ్చేరు. దివ్యభావవిలసితములగు ఆ కీర్తనల విషయంలో అంతకంటే ఉచితంగా చెప్పలేము.

దక్షిణ భారత దేశంలో త్యాగరాజస్వామి కీర్తనలు నిరంతర పారాయణచేయబడుతూ ఉన్నాయి. ఇతర మహా భక్తుల కీర్తనలు అపారంగా ఉన్నా, సంగీతరచనలుగా శ్రీవారి కీర్తనలకున్న ఘనతను బట్టి సంగీత ప్రదర్శనలలోను, రేడియో కార్యక్రమాలలోనూ అఖండ గానం చేయబడుతూనే ఉన్నాయి. సంగీతాభ్యాసకులు ఆయా కీర్తనలను ఎన్నో ఆవర్తములు పునశ్చరణ చేస్తూ ఉన్నారు. కొన్ని తరాలుగా దక్షిణ భారత ప్రజలు గానస్రవంతిలో మునకలిడుతూ ఉన్నారు.

అయితే అయ్యగారి కీర్తనల సంగీతంలో అంతటి ఆనందం కలగడానికి కారణం ఆయా కీర్తనలు భక్తిభావోద్దీపితములు కావడమే. అందుచేతనే సంగీతజ్ఞానము భక్తి వినా సన్మార్గము కలదేఅని స్వామివారు అన్నారు. అయితే కేవలం శ్రవణానందకరములుగా ఉంటూ అశేష ప్రజలను అకర్షించినంత మాత్రముననే త్యాగోపనిషత్తుఅని మతాచార్యుల మన్ననలను ఆ కీర్తనలు పొంది ఉండవు. స్వామివారి కీర్తనలు ఆధ్యాత్మిక ప్రబోధము కలిగి ముముక్షువులకు ఆత్మతేజము కలిగించుచుండుటచేతనే శ్రీవారు ఆవిధంగా ప్రశంసించుట జరిగినదని గ్రహించవలసి ఉంటుంది. ఈ సందర్భంలో నాకు కలిగిన ఒక అనుభవం చెప్పవలసి ఉంది.

కొంత కాలం క్రితం ఒక కార్ఖానలో పనిచేస్తున్న ఒక ఉద్యోగికి నేను పరిచయం చేయబడ్డాను. ఆయన నన్ను వారి గృహానికి ఆహ్వానించేరు. వారి గృహవాతావరణం పరమ ప్రశాంతంగా పవిత్రంగా గోచరించింది. ఇంట్లో పెద్ద పూజా పీఠం ఉంది. వివిధ దేవతామూర్తుల చిత్రపటాలతో దీపధూపనైవేద్యాలతో శోభాయమానంగా ఉంది. పూజాపీఠంపై ఒక ప్రక్క శ్రీ త్యాగరాజస్వామి పెద్ద చిత్రం పటం పుష్పమాలలంకృతమై ఉంది. పూజాపీఠంపై భాగవత రామాయణాది గ్రంథములతో శ్రీ త్యాగరాజస్వామి కీర్తనల గ్రంథం కూడా ఉంది. ఆ దృశ్యం నాకు ఆనందబాష్పములు కలిగించింది. అయ్యగారి కీర్తనలు వారి పేరున గానం చేస్తూ జీవితం గడుపుతూ ఉన్నా స్వామికి భక్తిశ్రద్ధలతో పూజాపుష్పములు సమర్పించే అలవాటు నాకు లేకపోయింది. ఎంతో సిగ్గుపడ్డాను మనస్సులో.

శ్రీ త్యాగరాజస్వామి యడల అంతటి భక్తి గౌరవములు కలిగిన ఆ గృహస్తు స్వామివారి కీర్తనలు గానం చేస్తే వినాలనే సంకల్పం కలిగింది. వారిని అర్ధించేను. పాడడానికి ఆయన ఏమీ ఉత్సాహం చూపించలేదు. చివరకి ఆయన చెప్పిన సమాధానం యిది – బాబూ, నాకు సంగీతం ఏమీ రాదు. ఆఖరికి సరిగమలు కూడా నేను నేర్చకొనలేదు. నేను ఆ కీర్తనలు పాడడం అయ్యగారికి అపచారం చేయడమే అవుతుంది. తమబోటి విద్వాంసులు పాడుతుంటే వింటాను. ఆ కీర్తనలలోని భక్తిరసం నాలోని సర్వకల్మషాన్ని హరింపచేయబడినంతటి ఆనందాన్ని పొందుతాను. స్వామివారి కీర్తనలు ఎన్నో కంఠస్థంగా వచ్చును. ఆ మాటలు విద్వాంసులు పాడుతుంటే హృదయం ఉప్పొంగుతుంది.

కేవలం సంగీతం వృత్తిగా జీవితం గడుపుతున్నవారికి ఇటువంటి అనుభవం కలిగినప్పుడు అయ్యగారి కీర్తనలు గానం చేయడంలో తాము అందుకోలేని పరమార్థం ఎంతో ఉందనే విషయం స్ఫురించకమానదు.

సంగీతరసికులలోనే కాకుండా అయ్యగారి కీర్తనల యడ గల తాత్పర్యం మరో సందర్భంలో తెలుసుకొన్నాను.

కలకత్తా సమీపంలో ఉండే ఒక వైష్ణవాశ్రమానికి చెందిన బాబాగారి దర్శనం చేసేను ఒకప్పుడు. ఆయన అప్పటికి అరవై సంవత్సరాల వృద్ధు. బాబాగారికి తెలుగు భాష రాదు. వారి దర్శనానికి వచ్చిన భక్తబృందం అందరూ కలిసి సంకీర్తనం చేసేరు. చివర బాబాజీ వివిధ భక్తివరేణ్యుల గీతాలు వివిధ భాషలలో పాడేరు. తుకారాం అభంగాలు, జయదేవుని అష్టపదులు, సదాశివ బ్రహ్మేంద్రుల కీర్తనలు, కబీరుదాసు భజనలు, మీరాబాయి భజనలు చివరకు బాబాజీ త్యాగయ్యగారి కీర్తనలు పాడేరు. ఆ కీర్తనలు నాకు రావు. ఎవరూ పాడగా కూడా వినలేదు. తరవాత పుస్తకాలలో చూస్తే అవి అయ్యగారి ఉత్సవ సాంప్రదాయ కీర్తనలుగా తెలుసుకొన్నాను.

క్రమక్రమంగా మనలో భక్తులను, భక్తి మార్గాన్నీ ఆధ్యాత్మిక జీవన దృక్పథాన్నీ అవగాహన చేసుకోవాలనే శ్రద్ధ, తృష్ణ, సానుభూతి సన్నగిల్లుతున్నవేమో అనిపిస్తోంది.         

మేధావులు తమ మనోబుద్ధులను భౌతికతత్త్వ పరిశీలనలోనూ ఉత్తమ పరిపాలనా వ్యవస్థ నిర్మించడంలోనూ సంపూర్ణంగా కేంద్రీకరించి ఉన్నారు. కళాకారులు చిత్తచాంచల్యంతో ఉన్నత లక్ష్యాలను సాధించలేకపోతున్నారు. జనసామాన్యంలో సుఖాలాలసత్వం, ధనప్రలోభం పెచ్చుపెరిగిపోతున్నాయి. ఆత్మస్వాతంత్రయం, హేతువాద దృష్టి, జిజ్ఞాస భౌతిక పరిమితులను అతిక్రమించలేకపోతున్నాయి. దేశకాలాతీతము, నిత్యమూ, సచ్చిదానంద రూపమయినదాని అన్వేషణ సాధన, చిత్త విభ్రమంగానూ, గగనకుసుమంగానూ భావింపబడి ఉపేక్షవహింపబడుతూ ఉంది.

భారతీయ తత్త్వవేత్తలు వివిధ ప్రాతిపదికలపై వివిధ దర్శనముల ద్వారా సత్యాన్వేషణము చేసి త్రికాలాబాధితము, అవఙ్మానస గోచరము సచ్చిదానంద రూపమైన పరమాత్మతో అద్వైత స్థితిని పొందియున్నారు. ఆనందోపలబ్దే మానవుని చరమలక్ష్యంగా నిర్ణయించి భిన్న సంస్కారములు కలిగిన మానవులకు భిన్న మార్గములనేర్పరిచింది.

పరమ సుఖప్రాప్తికి ఏర్పరుపబడిన మార్గములలో భక్తిమార్గము చక్కని రాజమార్గమని త్యాగయ్యగారి అనుభవము. భక్తుని అనుభవంలో తత్వవేత్తలచే పరమాత్మనుద్దేశించి చెప్పబడిన ప్రజ్ఞానం బ్రహ్మమొదలగు వాక్యములు, వ్యాకరణ సూత్రములవలెగాని, పదార్థవిజ్ఞాన సూత్రముల వంటివిగాని గావు. భక్తుడు తర్కవితర్కములతో కాక తన హృదయగత ప్రేమతోనే పరమాత్మోపలబ్దిని పొందుచున్నాడు. నామరూపాత్మకమైన సర్వజగత్తులో.

నేడు భారతదేశంలో ఒక అవ్యవస్థ ఏర్పడి ఉంది. ప్రాచీన వ్యవస్థ నుండి తప్పుకొన్నా నూతన వ్యవస్థ ఏర్పడలేదు. ప్రాచీన భారతధర్మంలో మనకు ప్రగతి లేదని నమ్ముతున్నాం. పూర్తిగా భౌతికదృష్టిని అలవరచుకోలేకపోతున్నాం. ప్రతి యింటిలోను, ప్రతి వ్యక్తిలో కూడా ఈ భావసంఘర్షణ తప్పలేదు. నేటి భారదేశంలో అణుయుగ మానవుని నుండి ఆదిమానవుని వరకూ నమూనాలు కనిపిస్తాయి. పాశ్చాత్య ప్రభావంతో మన వేషభాషలు, మన మనస్సులు సగం సగం మారి ఏ రూపం పూర్తిగా ఏర్పడక వికృత పరిస్థితి ఏర్పడింది.

మానవ సర్వ సమస్యలు ధర్మాచరణంతో పరిష్కరించే వ్యవస్థ కదిలిపోయింది. మన ప్రగతి భౌతిక దృక్పథంలో మాత్రం చూడగలుగుతున్నాం. ఈ పరిస్థితులలో సర్వమానవులనూ సమైక్య పరిచే విశ్వాసం, ఆదర్శం లేకుండాపోయింది. దేముడు, మతమూ, భక్తీ, వైరాగ్యము ఈ మొదలైన మాటలు మేధావులనాకర్షించలేదు. జనసామాన్యం అఖండ సచ్చిదానందరూపుని హృదయగత ప్రేమచేతనే పొందగలుచున్నాడు. పరిమితములును, అనిత్యములును అయిన సర్వమానవ సంబంధముల మూలమునను, అనంతమును, నిత్యమును, ఆనందమయుడైన పరమాత్మను చూడగలుగుచున్నాడు. ఆ కారణముచేతనే భక్తుడు పరమాత్మను తండ్రిగా, తల్లిగా, నెచ్చెలిగా, ప్రియునిగా భావన చేయడం జరుగుతున్నది. సచ్చిదానంద రూపమును అనురాగ రూపమున కాంచనలేనప్పుడు ఆ జ్ఞానము శుష్కము నిష్ఠురము మాత్రమే అవుతుంది. ఈ అభిప్రాయాన్నే త్యాగరాజస్వామి అంటారు అనురాగములేని మనసున సుజ్ఞానము రాదుఅని.

భారతీయ సంస్కృతి పరమోత్కృష్ట మానవుని తత్త్వవేత్తగానూ, మహాభక్తునిగా మాత్రమే భావనచేసుకొంది. అంతమాత్రమేకాక అట్టి పరతత్త్వ సాధనకు అనుకూలమైన సాంఘిక వ్యవస్థను రూపొందించుకొంది. పరతత్త్వసాధనలో సిద్ధిపొందిన తత్త్వవేత్తలు, మహాభక్తులు, యోగులు, భారతభూమిలో పురాణ యుగములోను, చారిత్రిక యుగములేనే కాకుండా ఆధునిక యుగంలో కూడా అవతరించి తమభావనచేతను, వాక్కుచేతను, ఆచరణచేతను జగత్కల్యాణకారకులై యున్నారు. వారి పవిత్ర చరిత్రములు మానవోన్నతికి మార్గదర్శకములై ధృవతారలై నిలిచి ఉన్నాయి.   

శ్రీ త్యాగరాజస్వామి శ్రీ రామచంద్ర పరబ్రహ్మ సాక్షాత్కారము పొందిన మహనీయుడు. తొంభైయారు కోట్ల రామనామము జపించిన తపస్వి. పరమేశ్వర సాక్షాత్కారము పొందే పర్యంతము ఆ మహనీయుడు తన సాధనలో, భావనలో సాంఘికముగ, మానసికముగ పొందిన సర్వసంఘర్షణమును సంగీతమయముగ తన యిష్టదైవమునకు నివేదించియున్నారు. హృదయోద్వోగములు, రాగమయములగు శ్రీవారి సంకీర్తనలు జగదానందకారకమై, సంగీత సంప్రదాయమునకు మూలస్థంభములై నిలిచి ఉన్నాయి.

శ్రీ త్యాగరాజస్వామి తాత్త్వికసాధనా క్రమము వారి కృతులనుండి మనం అవగాహన చేసుకోగలం. జనన మరణములతో పునరావృతమౌతున్న సంసార చక్రభ్రమణంలో చిక్కుకొని తపించి ముముక్షువైన మానవుడు, నాడు గజేంద్రునకు ఎదురైన సమస్య కలడు కలండనెడివాడు కలడో లేడోఅనేదానికి పరమ విశ్వాసంతో సూటిగా భావించిన రీతియిది. నీవు లేక ఏ తనువులు నిరతముగా నిలచును. నీవు లేక ఏ తరువులు నిక్కముగా మొలచును. నీవు లేక త్యాగరాజు నీ గుణములు ఎటు పాడును.

ఈ విషయంలో త్యాగరాజస్వామి తన వ్యక్తిగత తర్కాన్ని,  అనుభవాన్నే వినకుండా కద్దను వారికి కద్దుకద్దానెడి పెద్దల మాట నేడబద్ధమౌనా” (ఏతావునరా నిలకడ నీకు”) అని ఆప్తవాక్య ప్రామాణ్యమును గ్రహించేరు. ఈ విధమైన తాత్విక జిజ్ఞాసలో తపించిన స్వామి చివరకు బుద్ధిరాదు పెద్దల సుద్దులు వినకఅని గ్రహించి శృతిస్మృతి దర్శన రూపమైన పరోక్షజ్ఞానమును పొందేరు.

ఎంత శాస్త్రీయ పరిజ్ఞానము పొందినా పెద్దలు పొందిన నిశ్చయాత్మక బుద్ధిని పొందలేకపోయాననే వేదనతో వేదశాస్త్ర తత్వార్థములు తెలిసి, భేదరహిత వేదాంతములు తెలిసి, నాదవిద్య మర్మంబులను తెలిసినను నాద త్యాగరాజనుత ఎందుకు పెద్దల వలె బుద్ది యివ్వవు, ఎందు పోదునయ్యా రామయ్యాయని వేదన చెందేరు.

పరోక్షజ్ఞానము కలిగినా ఆత్మోపలబ్ధికి అనుష్టానక్రమంతో విధివిధానము తెలిసి ఆచరించవలసి ఉంటుంది. ఈ విషయంలో పరమాత్మభావనను శివుడనో, మాధవుడనో, పరబ్రహ్మమనో ఎవరిని నిర్ణయించడమనే సందిగ్ధస్థితిని, శివమంత్రమునకు జీవము, మాధవమంత్రమునకు జీవము, శివకేశవ మంత్ర బీజాక్షర సంపుటియే రామనామమనే వివరము తెలిసిన ఘనులకు మ్రొక్కుతూ తన ఉపాస్యవస్తువు రామ నామమనే నిశ్చయంపొందేరు.

చీమలో బ్రహ్మలో ప్రేమమీర చెలగుచుండే రాముడు, చండమార్తాండమండల మధ్యమున వెలుగుచుండేవాడు. తామసాది గుణరహితుడై జగము నిండి ఉండేది రాముడొకడేయని సర్వదేవతలు, సర్వనామములు ఆయనవేయని అతడు వినా యితరము లేదనే నిశ్చయబుద్ధిని పొందేరు.

చివరకు ఆదికవి చేత అవతార పురుషునిగా కీర్తింపబడి సహస్రాబ్దులుగా భారత ప్రజలకు యిష్ట దైవమైన దశరథ రాజనందనకు దివ్యమంగళ విగ్రహము, సకల కల్యాణ గుణ సంశోభితమై రామచంద్ర పరబ్రహ్మముగా తన హృదయమునందు ప్రతిష్ఠించుకొన్నారు. అంతటి నుండి రాముని సొగసు అయ్యగారి కనులకు కమ్మి ఎచట జూచినా రామమయముగా గోచరించింది.

శ్రీరామచంద్రుని దివ్యచరిత్రమునందు అనేక ఘట్టములు అయ్యగారి హృదయమున ప్రతిఫలించి పరవశత్వము కలిగించసాగేయి. చెలువుమీర మారిచుని మదమణచే వేళ, మునికనుసైగ తెలిసి శివధనువును విరిచే సమయమున, శ్రీరామచంద్రమూర్తి మోమున అలకలు అల్లలాడగ గని, మహిమాన్వితుడగు విశ్వామిత్రుని మదినుప్పొంగే ఆనందమును భావించేరు.     

కనులార సేవించి కమ్మని ఫలములనొసగి తనువు పులకరింప పాదయుగమునకు మ్కొక్కి యినకులపతి సముఖంబున పునరావృత్తి రహిత పదమును పొందిన ధన్యురాలు శబరి భగ్యము ఎంతని విర్ణింతునని కీర్తించేరు.

వేరొక సమయంలో గిరిపై నెలకొన్నరాముని తప్పక కనుగొని పులకాంకితులయేరు. సీతమ్మతల్లిగా, శ్రీరాముడు తండ్రిగా, వాతత్మజుడ సౌమిత్రి, భరతాదులు సోదరులు, ధరనుగల్గు సమస్త భాగవతాగ్రేసరులెల్లరికి పరమబాంధవ్యమునెరపుకొన్నత్యాగరాజస్వామి ఆనందమునకు పారమెక్కడ?

శ్రీరామచంద్రుని గుణగానం చేయడమే కాకుండా శ్రీరాముని స్వయముగా సేవించే భాగ్యము కోసం బంటురీతి కొలువియ్యవయా రామా అని యాచిస్తారు. బంగారు మేటి పాన్పు పై భామామణి శ్రీ జానకి శృంగారించుకొని చెలువొందే సమయంలో సంగీతము పాడుమని నన్ను ఆజ్ఞాపించి నా ముచ్చటతీర్చరాదా అని వేడుకొంటారు. తనువుచే వందనమొనర్చుట, మనసున నామసంకీర్తనముచే మైమరచుట, యిదియే శ్రీరామచంద్రునికి ఇరుప్రక్కల నిలబడి కొలిచే ముచ్చట యొక్క పరమార్థమని భావిస్తారు.

హృదయంలో రామభక్తి సామ్రాజ్యం నెలకొని ఉన్నా వ్యక్తిగత జీవితంలోని లౌకిక సమస్యలను త్యాగరాజస్వామి అతి తేలికగా చిరునవ్వుతో పరిష్కరించుకొన్నారు. ఉంఛవృత్తిచే జీవిస్తూ అతి నిరాడంబర జీవితం గడుపుతున్న అయ్యగారిని చూసి కలినరాధములు అనాధుడని చిన్నచూపు చూస్తే, ఆయన అంటారు, రామా, నా హృదయాధినాధుడవు నీవుంటే నేను అనాధుడను కావడం ఎలాగ? అనాధుడవు నీవని నీగమజ్ఞులు సనాతనులు చెప్పి ఉన్నారే, అంటారు. భక్తునిగా ప్రజలు అయ్యగారిని ప్రశంసించే సందర్భంలో భరించలేక అంటారు, రామా అవివేక మానవులు కోరి కోరి అడ్డత్రోవ తొక్కుతున్నానేమో, నీ దాసుడనని బొంకులాడుతున్నానా, ఏమైనా సరే, నన్ను పాలముంచినా, నీట ముంచినా నీ పదములే గతియని సంపూర్ణముగా శరణాగతిని పొందుతారు.

శరభోజ మహారాజు ఎర చూపిన భోగభాగ్యములను ఒకటే మాటతో నిశ్చయించుకొని ఆ ప్రలోభములనుండి విముక్తులయేరు. నిధి చాలా సుఖమా, రాముని సన్నిధి చాలా సుఖమా, త్యాగరాజనుతని కీర్తనము సుఖమా”, అని ప్రశ్నించుకొని , రామనామామృతపానములో మైమరచిన స్వామి దివ్యానుభూతిని శంకించిన పండితమ్మన్యుల విషయంలో అయ్యగారికి ఒకటే చింత. రామా నీయడ ప్రేమరహితులకు నీ నామ రుచి తెలియదు కదాఅంటారు.

జిజ్ఞాసువులకు, ముముక్షువులకు, సాధకులకు అయ్యగారు ప్రవచించిన సూక్తులు శిరోధార్యములై ఉంటాయి.

సంతతంబు శ్రీకాంత స్వాంత సిద్ధాంతమైన చింతలేని వారలు ఎంత నేర్చినా, ఎంత చూచినా కాంతా కనకములకా దాసులయేప్రమాదం ఉందని సెలవిచ్చేరు. దాంతునివైనా వేదాంతునివైనా శాంతము లేనిదే సౌఖ్యము లేదట.

కుతర్కముతో భగవద్భజనామృత రసహీనమైన దుడుగుతనము గల మానవుడు ఉద్ధరింపబడడం అసాధ్యము అంటారు.

లోకంలో ఎంతటి మహత్కార్యములు సాధించి, ఎంతటి ఘనతనైనాసంపాదించవచ్చును. విద్య, ధనము, కీర్తి చివరకు తపస్సు, యోగము సాధించినా కామ మోహ దాసులై శ్రీరాముని కట్టు తెలియని వారలు శ్రీరామస్వామి కరుణ లేక ఏమి చేసినను ధన్యతగాంచలేరు.

మనసు స్వాధీనమైన యా ఘనునికి మరి మంత్రతంత్రములతో పని లేదట.

ఉపనిషద్ మహాకావ్యములకు అయ్యగారు తన అనుభవంతో పలికిన మాట – తత్వమసియను వాక్యార్థము నీవను పరతత్వమెరుగతరమా అంటారు.

పంచ మహాభూతములలోనూ, సురేంద్రాది సురలలోనూ, భగద్భక్తాగ్రేసరులలోనూ బాగా రమించేవానిని, చైతన్యరూపుని, సర్వసాక్షిని ద్వైతము సుఖమా, అద్వైతము సుఖమా అని ప్రశ్నించి హరిహరాదులలోనూ, సురలలోనూ, నరులలోనూ గగనానిల తేజో జల భూమయమగు మృగ ఖగ నగ తరుకోటులోను, సగుణములోను విగుణములోను పరమాత్ముడు వెలిగే ముచ్చట తెలిసి బ్రహ్మానుభూతిని బడసిన మహితాత్ములు త్యాగరాజస్వామి.

శ్రీ త్యాగరాజస్వామి అనుసరించిన భక్తిమార్గములో ప్రధానమైన అంశము ఒకటి మనం అవగాహన చేసుకొనవలసి ఉంది. మహితాత్ములగు మహాభక్తివరేణ్యులు అనుసరించిన భక్తి యోగము వివిధ సంప్రదాయములగానుంది. పరమపురుష సాక్షాత్కారమునకు శ్రీ త్యాగరాజస్వామి అనుసరంచిన భక్తిమార్గము విశిష్టమైనది. గానయోగము భక్తియోగము సమ్మిళితముచేసి వారు బ్రహ్మానుభూతి పొందియున్నారు. భక్తిని గానమును విడిగా వారు చూడలేదు.

సంగీతశాస్త్రజ్ఞానము సారూప్య సౌఖ్యదమని సెలవిచ్చియున్నారు. సంగీతజ్ఞానమునకు భక్తి వినా సన్మార్గము లేదని నిశ్చయించినారు. పరమ భక్తి, సంగీతజ్ఞానముతో జీవన్ముక్తులుకానివారికి మోక్షము ఎట్లు కల్గునని నుడివియున్నారు.

గానమునకు వలయు హృదయరంజనము మాత్రమే కాక అంతకన్న ఉన్నత లక్ష్యము కలదా అనే శంకకు, నాదోపాసన చేతనే శంకరనారాయణులు వెలసిరని, శ్రీ విశ్వనాథ, శ్రీకాంతులు పరబ్రహ్మమును రాగ లయాదుల భావించి తరించిరని  సప్రమాణముగ పలికి ఉన్నారు. శ్రీ నారద మునీంద్రులు, జయదేవులు, నారాయణతీర్థులు, భక్త కబీరు, మీరాబాయి మొదలగు భక్తశిఖామణులందరు గాన భక్తి యోగముల సమ్మేళన చేత తరించినవారే.

అయినా శ్రీ త్యాగరాజస్వామి నాదరూపముననే బ్రాహ్మానుభూతిని పొందిన మహనీయుడు. శ్రీ రామచంద్ర పరబ్రహ్మము నాదరూపముననే అయ్యగారికి అనుభూతయినది. ఈ అనుభూతిని స్వామి వేదాగమశాస్త్ర పురాణాదులకు ఆధారమైన నాదసుధారసంబిలను నరాకృతి ఆయెఅని అంటూ స్వరములారునొకటి గంటలుగా వరరాగము కోదండముగా దుర నయ దేశ్యములు త్రిగుణముగా నిరతగతి శరముగా ధరభజనే భాగ్యముగా నాదసుధారసంబు శ్రీరామచంద్ర పరబ్రహ్మముగాసాక్షాత్కారమైనదని వర్ణించి ఉన్నారు

శ్రీ త్యాగరాజస్వామి గానరూపముగ భక్తియోగముతో భజించి, ధ్యానించిన భగవానుని నామరూపములకు పవమానసుతుడు పట్టు పాదారవిందములకు నిత్యజయమంగళమగుగాక.

=+=


No comments: