visitors

Sunday, February 27, 2022

నెం. 35 , ఉస్మాన్ రోడ్ (ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 2 - డెభైయవ భాగం

27.02.2022 - ఆదివారం భాగం - 70:

అధ్యాయం 2  భాగం 69 ఇక్కడ


నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్

కర్ణాటక సంగీత ముమూర్తులలో అగ్రజులు, అగ్రగణ్యులు అయిన సద్గురు శ్రీ త్యాగరాజస్వామివారు 1847 పుష్య మాస బహుళ పంచమి తిథినాడు శ్రీరామునిలో ఐక్యమైనారు. అదే బహుళ పంచమి నాడు (మాఘ మాసం) 1974 లో త్యాగయ్యగారి శిష్య, ప్రశిష్య పరంపర క్రమంలోనుండి వచ్చి కర్ణాటక సంగీతంలో నిష్ణాతుడై, నవ్య లలిత సంగీత నిర్మాతగా సంగీత ప్రియుల హృదయాలలో సుస్థిర స్థానం పొందిన ఘంటసాల వేంకటేశ్వర రావుగారు కలియుగదైవమైన తిరుపతి వేంకటేశ్వరుని స్మరిస్తూనే ఆ దైవంలో కలిసిపోయారు.

భారతీయ చలనచిత్ర వినీలాకాశంలో ఘంటసాల అనే విశిష్ట తార నేల రాలకుండా మింటికెగిసి ధృవతారగా వెలుగొందుతూ తన అపురూప రాగాలను ప్రకృతినంతా నింపుతూ సంగీతప్రియులను అలరిస్తోంది.

1944 నుండి 1974 వరకు సుమారు మూడు దశాబ్దాల కాలం తెలుగు చలనచిత్ర సినీమా సంగీతరంగంలో ఒక స్వర్ణయుగ సృష్టికర్తగా, ఒక శకపురుషునిగా  కోట్లాది ప్రజల ప్రేమాభిమానాలను పొందిన విశిష్ట గాయకుడు, సంగీత దర్శకుడు ఘంటసాలవారు. రెండున్నర దశాబ్దాలకు పైగా  చిత్రసంగీత రంగంలో  అగ్రస్థానం అధిష్టించిన ఘంటసాలవారి సుదీర్ఘ సినీజీవనయానంలో వారితో కలసి పయనించిన కళాకారులు అసంఖ్యాకం.

ఆ కళాకారుల పురోభివృద్ధికి ఘంటసాల మాస్టారి అపూర్వ గాన ప్రతిభ ప్రత్యక్షంగానో లేక పరోక్షంగానో ఎంతో దోహదపడింది.  ఇది అందరూ అంగీకరించిన సత్యం. వివిధ భాషలకు చెందిన ఇన్నివందల మంది   అగ్రశ్రేణి కళాకారులందరితో  సఖ్యతతో అజాతశతృవుగా కలసిమెలసి పనిచేసిన ఏకైక గాయక, సంగీతదర్శకుడు ఘంటసాల అంటే అతిశయోక్తి కానేరదు.  నిజం చెప్పాలంటే ప్రపంచస్థాయిలోనే ఇది ఒక గొప్ప రికార్డ్ గా నమోదు కావలసి వుంది. ఇంతమంది సంగీతదర్శకులతో, గాయనీగాయకులతో, వాద్యకళాకారులతో,  నటీనటులతో, సాంకేతిక నిపుణులతో తలలో నాలుకలా వ్యవహరిస్తూ అందరి మన్ననలు పొందిన సంగీత స్రష్ట ఘంటసాల.

1944 నుండి 1974 వరకు సుమారు 1226 తెలుగు సినీమాలు (డబ్బింగ్ తో సహా) విడుదలైనట్లు ఒక అంచనా. అందులో  గాయకుడిగా, సంగీతదర్శకుడిగా ఘంటసాలవారి భాగస్వామ్యం 656 చిత్రాలు. ఈ సమాచారమే  సంపూర్ణం, సమగ్రం అని చెప్పలేము. దాదాపు మరో 110 చిత్రాలకు సంబంధించిన వివరాలు అలభ్యం. అలాగే, నిర్మాణం మధ్యలో ఆగిపోయినవి,  ఎవరికీ తెలియక కాలగర్భంలో కలిసిపోయిన చిత్రాలు మరెన్నో. ఇవన్నీ లభ్యమైతే ఘంటసాలవారి ఆణిముత్యాలు మరికొన్ని వందలు లభ్యమయ్యేవి.

మూడు దశాబ్దాల కాలంలో ఘంటసాలవారు ఆలపించిన గీతాలు 5000 కు మించి వుండవనే అనిపిస్తుంది. ప్రస్తుతం అందుబాటులో వున్న గణాంకాల ప్రకారం ఘంటసాల మాస్టారికి సంబంధించిన వివరాలు ఈ క్రింద పొందుపరస్తున్నాను. 

నా యీ సేకరణకు (యథాతథంగా మాత్రం కాదు)  శ్రీ చల్లా సుబ్బారాయుడి గారి 'ఘంటసాల గాన చరిత'  పుస్తకం ఎంతగానో సహకరించింది.  శ్రీ చల్లా సుబ్బారాయుడుగారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వారి పుస్తకంలోని అమూల్య సమాచారాన్ని మరింత విస్తృతపర్చడానికి చొరవతీసుకుంటున్నందుకు శ్రీ చల్లా సుబ్బారాయుడు గారు అన్యధా భావించరని తలుస్తాను. 

💐

ఘంటసాలవారి సంగీత దర్శకత్వంలో వచ్చిన తెలుగు 
సినిమాలు:




సంగీత దర్శకుడు సి.ఆర్ సుబ్బురామన్ కు సహాయకుడిగా పనిచేసిన తొలిచిత్రం :
1. రత్నమాల 1948

ఘంటసాలవారు సహ సంగీత దర్శకులుగా పాటలు స్వరపర్చిన చిత్రాలు :
1. బాలరాజు 1948
2. రక్షరేఖ 1949
3. వాలి సుగ్రీవ 1950
4. చంద్రవంక 1951
5. నిర్దోషి 1951
6. పూలమాల 1973
7. సతీ సావిత్రి 1978 (రెండు పాటలు, ఒక శ్లోకం మాత్రం)
8. వస్తాడే మా బావ 1978 (1 పాట మాత్రం)

ఘంటసాల గారు సంగీతం నిర్వహించిన
అనువాద చిత్రాలు :
1. భాగ్యవంతులు 1962
2. మమకారం  1963
3. మహావీర భీమసేన 1963

ఘంటసాలవారి సంగీత దర్శకత్వంలోని తమిళం సినీమాలు :

1. పాతాళ భైరవి
2. కళ్యాణం పణ్ణి ప్పార్
3.  పరోపకారం
4. చంద్రహారం
5.గుణసుందరి
6. కల్వనిన్ కాదలి
7. ఎల్లాం ఇన్బమయమ్
8. నిరపరాధి
9. అమరగీతమ్
10. మాయాబజార్
11. వాళ్కై ఒప్పందం
12. లవకుశ
13. మణిదన్ మారవిల్లై

ఘంటసాలవారు మ్యూజిక్ డైరక్షన్ లో వచ్చిన కన్నడం సినీమాలు :

1. మాయాబజార్
2. గిరిజాకళ్యాణం
3. మోహినీ రుక్మాంగద
4. లవకుశ
5. వాల్మీకి
6. మదువె మాడి నోడు
 7. వీరకేసరి
8.  నన్న తమ్మ 

ఘంటసాల మాస్టారి స్వియ సంగీత దర్శకత్వంలో వచ్చిన మొత్తం సినీమాలు: 
తెలుగు :   76
జంటగా :     8
డబ్బింగ్:      3
తమిళం:    13
కన్నడం :      8

మొత్తం : 108

ఘంటసాలవారు సంగీత దర్శకత్వం వహించిన మొత్తం 108 సినీమాలలో సుమారు 1000 ఆణిముత్యాలవంటి పాటలను స్వరపర్చారు.

స్వీయ సంగీతదర్శకత్వంలో వచ్చిన 86 తెలుగు సినీమాలలో  ఘంటసాలవారు పాడిన పాటలు :                    455
గ్రామఫోన్ కంపెనికి,
ఆలిండియా రేడియోకు
పాడిన పాటలు,పద్యాలు.         90

చరమదశలో భారతజాతికి
పాడి సమర్పించిన భగవద్గీత
శ్లోకాలు.                             .   108

మిగిలిన దాదాపు 400/500 పాటలను
ఇతర గాయనీగాయకులు ఆలపించారు.

ఘంటసాల మాస్టారి సంగీత దర్శకత్వంలో పాడిన గాయకులు :

1.చిత్తూరు వి నాగయ్య; 2.శివరావు; 3.అక్కినేని నాగేశ్వరరావు; 4.ఎమ్.ఎస్.రామారావు; 5.ఎ.ఎమ్.రాజా; 6.మాధవపెద్ది; 7.పిఠాపురం నాగేశ్వరరావు; 8.పి.బి.శ్రీనివాస్; 9.రేలంగి; 10.జె.వి.రాఘవులు; 11.టి.ఎమ్.సౌందరరాజన్; 12.శీర్కళి గోవిందరాజన్; 13.ఎ.ఎల్.రాఘవన్; 14.ఎస్.సి.కృష్ణన్; 15.వి.జె.వర్మ; 16.నల్ల రామ్మూర్తి; 17.కొమ్మినేని అప్పారావు; 18.ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం; 19.పామర్తి; 20.మాస్టర్ రామకృష్ణ (పెళ్ళిచేసిచూడు); 21.కె.ఎస్.వీరరాఘవులు; 22.మంగళంపల్లి బాలమురళీకృష్ణ; 23.మల్లిక్; 24.పద్మనాభం; 25.సి.ఎస్.ఆర్.; 26.రఘురాం; 27.సౌమిత్రి; 28.కె.రఘురామయ్య; 29.అద్దంకి శ్రీరామమూర్తి; 30.మోపర్రుదాసు; 31.కె.జే.ఏసుదాస్.

ఘంటసాలవారి సంగీత దర్శకత్వంలో పాడిన గాయనీమణులు :

1.సి.కృష్ణవేణి; 2.వక్కలంక సరళ; 3.ఎస్ వరలక్ష్మి; 4.శ్రీదేవి; 5.పి.భానుమతి; 6.ఋష్యేంద్రమణి; 7.శాంతకుమారి; 8.బేబి కృష్ణవేణి;  9.పి.లీల; 10.జిక్కి; 11.ఎ.పి.కోమల; 12.పి.సుశీల; 13.ఎస్. జానకి; 14.కె.రాణి; 15.వైదేహి; 16.స్వర్ణలత; 17.బి.వసంత;18. ఉడత సరోజిని; 19.ఎల్.ఆర్. ఈశ్వరి; 20.టి.కనకం; 21.పద్మప్రియ; 22.ఎమ్.ఎల్.వసంతకుమారి; 23.ఎన్.ఎల్.గానసరస్వతి; 24.విజయలక్ష్మి; 25.విజయలక్ష్మీ కన్నారావు; 26.ఆర్.బాలసరస్వతీదేవి; 27.టి.జి.కమలాదేవి; 28.బెంగుళూరు లత; 29.కె.జమునారాణి; 30.రమణ; 31.కె.సుందరమ్మ; 32.ఎ.వి.సరస్వతి; 33.జి.వరలక్ష్మి; 34.జి.భారతి; 35.శకుంతల; 36.సురభి కమలాబాయి; 36.జె.గిరిజ; 37.నటి సావిత్రి; 38.జయలలిత; 39.పద్మ; 40.బెజవాడ రాజరత్నం; 41.సత్యవతి; 42.రాజేశ్వరి; 
వీరు కాక బృందగానాలలో గొంతు కలిపిన గాయనీగాయకులు మరెందరో వున్నారు.

1945 మొదలు 1974 వరకు ఘంటసాలవారు ఆలపించిన వేలాది రసమయ గీతాలకు స్వర రచన చేసిన సంగీత దర్శకులు :

1.చిత్తూరు వి.నాగయ్య 2.గాలి పెంచల నరసింహారావు 3.ఓరుగంటి రామచంద్రరావు 4.అద్దేపల్లి రామారావు 5.సి.ఆర్.సుబ్బురామన్ 6.ఎస్.రాజేశ్వరరావు 7.పెండ్యాల 8.సుసర్ల దక్షిణామూర్తి  9.ఆదినారాయణరావు 10.టి.వి.రాజు 11.టి.చలపతిరావు 12.మాస్టర్ వేణు 13. చెళ్ళపిళ్ళ సత్యం 14.ఎస్.పి.కోదండపాణి 15.రమేష్ నాయుడు 16.కె.వి.మహాదేవన్ 17.ఎమ్.ఎస్.విశ్వనాధన్ 18. వేదా 19.జె.వి.రాఘవులు 20.పామర్తి 21.బి గోపాలం  22.ఎమ్.రంగారావు 23.ఆర్.సుదర్శనం 24.ఆర్.గోవర్ధనం 25. బి.రజనీకాంతరావు 26.పాండురంగన్ 27.జి.రామనాధన్ 28.ఎమ్.ఎస్.జి.మణి 29.దండాయుధపాణి పిళ్ళై 30.సి.మోహన్ దాస్ 31.టి.ఆర్ పాప 32. అశ్వథ్థామ 33. బి.ఎన్.ఆర్ 34.మల్లిక్ 35.ఎల్.మల్లేశ్వరరావు 35.పి.సూరిబాబు 36.కె.ప్రసాదరావు 37.ఎమ్.ఎస్.శ్రీరామ్  38.ఎమ్.ఎస్.రాజు 39.ఎస్.హనుమంతరావు 40.హెచ్.ఆర్.పద్మనాభ శాస్త్రి 41.విజయభాస్కర్ 42. టి.జి.లింగప్ప 43.విశ్వనాధన్-రామమూర్తి 44.రాజన్ నాగేంద్ర 45.బి.శంకర్ 46.శంకర్ జైకిషన్ 47.భానుమతి: 48.ఎ.ఎమ్.రాజా 49. ఎమ్.ఎస్.ప్రకాష్ 50.డి.బాబూరావు 51.విజయా కృష్ణమూర్తి 52.జోసెఫ్-వేలూరి కృష్ణమూర్తి 53.ఎ.ఎ.రాజ్ 54.టి.ఎమ్.ఇబ్రహీం 55.ఎస్.వి.వెంకట్రామన్ 56.ఎస్.ఎమ్.సుబ్బయ్య నాయుడు 57.ఎమ్.బి.శ్రీనివాసన్ 58.చంద్రం-సూర్యం 59.పెండ్యాల శ్రీనివాస్ 60.జి.కె.వెంకటేష్ 61.పి.లీల 62.ఎమ్.పూర్ణచంద్రరావు 63.వి శివారెడ్డి 64.సత్యారావు 65. చక్రవర్తి.

ఇతరుల సంగీత దర్శకత్వంలో ఘంటసాలవారితో కలసి యుగళగీతాలు పాడిన మరికొందరు గాయనీమణులు :
1 ఎమ్.వి.రాజమ్మ 2.కన్నాంబ 3.బొంబాయి శారద 4.జొహ్రాబాయి 5.సత్యవతి 6.పద్మాసిని 7.రేణుక 8.రాధా-జయలక్ష్మి 9.శూలమంగళం రాజలక్ష్మి 10.శ్రీరంగం గోపాలరత్నం 11.నటి సావిత్రి 12.బేబి కౌసల్య 13.శోభారాణి 14.విజయలక్ష్మి 15.తిలకం 16.మాధురీదేవి 17.శరావతి 18.రమోల; 

తెర వెనుక ఘంటసాల మాస్టారి గళానికి తెరపైన పెదవులు కదుపుతూ అభినయించిన ముఖ్య ప్రముఖ నటులు :

1.సి.హెచ్.నారాయణ రావు 2.అక్కినేని నాగేశ్వరరావు 3.ఎన్.టి.రామారావు 4.చిత్తూరు వి.నాగయ్య 5.సి.ఎస్.ఆర్. 6.కాంతారావు 7.జగ్గయ్య 8.కృష్ణ 9.శోభన్ బాబు 10.చంద్రమోహన్ 11.హరనాథ్ 12.కోన ప్రభాకరరావు 13.మోపర్రు దాసు 14.జయసింహ; 15.ముక్కామల 16.రేలంగి 17.రమణారెడ్డి 18.పద్మనాభం 19.మిక్కిలినేని 20.రాజనాల 21.సత్యనారాయణ 22.సి.సీతారాం 23.మంత్రవాది శ్రీరామమూర్తి 24.ఆ‌ర్.నాగేశ్వరరావు 25.వెంపటి చిన సత్యం 26.త్యాగరాజ భాగవతార్ 27.శివాజీ గణేశన్ 28.జెమిని గణేశన్ 29.నాగేష్ 30.రాజ్ కుమార్ 31.ఉదయకుమార్ 32.రామశర్మ 33.జోగారావు  34.మహంకాళి వెంకయ్య 35.బాలయ్య 36.గుమ్మడి 37.చలం 38. అమర్నాధ్ 39.నాగభూషణం 40.ఎమ్.జి.ఆర్ 41.కౌశిక్ 42.కెంపరాజ్ 43.రంజన్ 44.ఎస్.ఎస్త్రిపాఠి 45.జె.వి.రమణమూర్తి 46.తంగవేలు 47.అజిత్ సింగ్ 48.లంక సత్యం 49.త్యాగరాజు 50.రామ్మోహన్ 51.ఎస్.వి.రంగారావు 52.రామకృష్ణ 53.అర్జా జనార్దన్ రావు 54.బి.గోపాలం.

వీరు కాక నృత్యగీతాలకు అభినయించన కళాకారులు, పేరు తెలియని జూనియర్ నటులెందరికో ఘంటసాలవారి గళం తోడ్పడింది. ఘంటసాలవారంటే ప్రజలంతా అంతటి మక్కువ, మమకారం ఏర్పర్చుకోవడానికి కారణం ఆయనలోని అసాధారణ సమ్మోహన గాత్రధర్మం ఒక్కటేకాదు, వారిలోని వినయవిధేయతలు,సౌజన్యం, సేవాగుణం, కృతజ్ఞతాభావం, యివన్నీ ఘంటసాలవారిని ప్రజలకు మరింత దగ్గర చేసాయి. గాయకుడిగా ఎంత ఉన్నతికి చేరినా, ఎంతటి ధనార్జన చేసినా  దర్పానికి పోకుండా చివరివరకూ  అతి నిరాడంబరంగానే జీవించారు. సినీమా ప్రపంచంలో ఈ రకమైన వ్యక్తిత్వం గల వ్యక్తులు బహు అరుదుగా కనిపిస్తారు. ఇంతటి విశిష్టమైన వ్యక్తి కనుకనే ఆ తరంనుండి ఈ తరం వరకు  సంగీతాభిమానులంతా ఘంటసాలను తమ ఆత్మీయగాయకుడిగా భక్తితో ఆరాధిస్తున్నారు. ఆ ప్రజాభిమానమే వేయి పురస్కారాల పెట్టు. 

గత 77 సంవత్సరాలుగా ప్రజలందరిచేతా ఆరాధించబడుతున్న ఈ ప్రజాగాయకుని  సమున్నత బిరుదు ప్రదానం విషయంలో మాత్రం  కేంద్ర , రాష్ట్ర  ప్రభుత్వాలు ఉదాసీనంగా వ్యవహరిస్తూండడం చాలా బాధాకరమైన విషయం.

ఉత్తమ కళాకారులను గుర్తించలేని ప్రభుత్వపు బిరుదులు కన్నా కోట్లాది సంగీతాభిమానులు ఇచ్చిన గౌరవం, అభిమానమే మిన్న. 

ఘంటసాల మాస్టారు ఉన్నకాలంలోనే  అసంఖ్యాకులైన జూనియర్ ఘంటసాలలు దేశమంతా తయారయి ఘంటసాల పాటలను ఘంటసాలగారికే వినిపించేవారు.  వారు భౌతికంగా దూరమైన తర్వాత కూడా జూనియర్ ఘంటసాలల సంఖ్య మరింత పెరిగింది. వారి పాటలు విస్తృతంగా వినిపించసాగాయి.  ఘంటసాల పాటలు పాడడమే వృత్తిగా చేసుకుని వృధ్ధిపొందినవారు,  ఘంటసాల పాటలతో విదేశపర్యటనలు జరిపి ఖ్యాతి పొందుతున్నవారు ఎందరో. 

ఘంటసాల గీతాలతో నాట్యప్రదర్శనలకు శ్రీకారం చుట్టినది మా జంటసంస్థలే. అంతకు ముందు శాస్త్రీయ పధ్ధతిలో పాడిన సినీగీతాలకు నాట్యం చేయడానికి సందేహించిన సంప్రదాయ సంగీత కళాకారులంతా తర్వాత తర్వాత మేము ప్రవేశపెట్టిన బాణీనే అనుసరించారు. ఇంకా కొనసాగిస్తున్నారు. ఘంటసాల జయంతి, వర్ధంతి ఉత్సవాలతో అనేక సాంస్కృతిక సంస్థలు దేశ విదేశాలలో ఘంటసాలవారిపట్ల తమకు గల భక్తిని గౌరవాన్ని చాటిచెపుతున్నారు. దేశంలో మరే సినీ సంగీత కళాకారుడికి దక్కని గౌరవం,  మర్యాద, అభిమానం విగ్రహావిష్కరణ రూపంలో ఘంటసాలవారికి దక్కింది. ఒకప్పుడు సినీరంగానికే పరిమితమైన "మాస్టారు" సంబోధన ఇప్పుడు ప్రపంచవ్యాప్తమయింది.

గాన గంధర్వుడు ఘంటసాలవారి శతజయంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా నిర్వహించబడుతున్న సాంస్కృతికోత్సవాలు ఘంటసాల మాస్టారి ఔన్నత్యాన్ని అఖండ కీర్తిని మరింత చాటిచెపుతాయి.

ఘంటసాల సంగీతం ఒక చైతన్య స్రవంతి. ఒక జీవవాహిని. అనంతంగా ప్రవహిస్తూనే వుంటుంది.

ఈ ప్రపంచంలో తెలుగు భాష ఉన్నంతవరకూ, తెలుగుజాతి ఉన్నంతవరకూ ఘంటసాల పాట, ఘంటసాలను గురించిన మాట వినిపిస్తూనే వుంటాయి. సంగీత వినీలాకాశంలో ఒక ధృవతార మన ఘంటసాల. అమరుడు ఘంటసాల. 

                   💐🙏 ఈ అధ్యాయం ఇక్కడితో సమాప్తం 🙏💐

Sunday, February 20, 2022

నెం. 35 , ఉస్మాన్ రోడ్ (ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 2 - అరవై తొమ్మిదవ భాగం

20.02.2022 - ఆదివారం భాగం - 69*:
అధ్యాయం 2 భాగం 68 ఇక్కడ

  

నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్
1971 లో నేను ప్రవేశించిన కొత్త ఉద్యోగం నిరంతరమని అనిపించుకున్న ఏడాది నుండి కంపెనీవారు నాకు కూడా LTA ( Leave Travel Assistance) రూల్స్ వర్తింపజేశారు. దాని ప్రకారం నేను కూడా సంవత్సరానికి ఒకసారి 5 రోజులకు తక్కువ లేకుండా శెలవు పెట్టి LTA  advance తీసుకొని ఏదైనా ఊరు వెళ్ళి రావచ్చు. వెళ్ళివచ్చిన తర్వాత రైలు టిక్కెట్ల ప్రూఫ్ తో మిగతా ఎలవెన్స్ కంపెనీ నుండి తీసుకోవచ్చును. నేను చేరిన ఒక పదిహేనేళ్ళ వరకు  మా కంపెనీకి శని, ఆదివారాలు శెలవు దినాలుగా వుండేవి.   ఆ కంపెనీ యూరోపియన్స్ కంపెనీ కావడం వలన డిసెంబర్ 25  క్రిస్మస్ కు ఆ మర్నాడు 26 బాక్సింగ్ డే కు శెలవులుండేవి. జనవరి 1 , న్యూ ఇయర్స్ డే కు శెలవు. మా కంపెనీ/ ఫ్యాక్టరీలో తమిళం, మలయాళీ క్రిస్టియన్లు చాలామందే వుండేవారు. వాళ్ళంతా ఈ మూడు రోజులు కలసి వచ్చేలా LTA లీవులో పోతూండేవాళ్ళు. మిగిలినవాళ్ళు దీపావళి, పొంగల్ (సంక్రాంతి) సందర్భంగా శెలవుల్లో వెళ్ళేవారు. ముందువెనకల శని, ఆదివారాలకు ఒక ఐదురోజులు శెలవు జోడిస్తే దాదాపు పదిహేను రోజులు శెలవు హాయిగా అనుభవించే అవకాశం వుండేది. నాకు వివాహమైన మొదటి రెండు  సంవత్సరాలు ఎక్కడికీ బయట వూళ్ళకు వెళ్ళే అవకాశం లభించలేదు.

1974 సంక్రాంతి సమయంలో LTA తో మాకు అత్యంత దగ్గర బంధువుల వూళ్ళకు వెళ్ళాము. సుమారు ఓ పదిహేనురోజుల ట్రిప్. మా ఆవిడతో బయట వూళ్ళకు వెళ్ళడం అదే మొదలు. అత్తవారి వూరు కూడా మద్రాసే కావడం వలన ఆ వంకన బయట ఊళ్ళకు వెళ్ళాల్సిన అవసరం ఎప్పుడూ రాలేదు. మా రెండు తరఫుల దగ్గర చుట్టాల ఇంటికి ఈ ట్రిప్ లో వెళ్ళాలని బయల్దేరాము.

మేము ఓ పదిహేను రోజుల తర్వాత మద్రాసు వచ్చేటప్పటికి నెం. 35,ఉస్మాన్ రోడ్ ఇంటి వాతావరణం ఉద్విగ్నభరితమైవుంది. (ఇప్పుడు నేను చెప్పబోయే కొన్ని విషయాలు నేను మద్రాసు లో లేని సమయంలో జరిగిన సంఘటనలు నా స్వానుభవం కాదు. మా ఇంట్లోవారు  మాస్టారు ఇంట్లోవారు చెప్పగా విన్నవి మాత్రమే). 

ఘంటసాల మాస్టారికి అతి చిన్నవయసులోనే  అంటే ఆయనకు తన ముఫ్ఫై రెండవ ఏటనే మధుమేహ(డయబిటిస్) వ్యాధి బయటపడిందని చెప్పుకోవడం వుంది. ఈ వ్యాధి వారింట్లో మాస్టారి తల్లిగారికి, తమ్ముడు సదాశివుడు గారికి, పెద్దకుమారుడు విజయకుమార్ కు, (చిన్నబాబు రత్నకుమార్ కు కూడా వున్నట్లే గుర్తు) తీవ్రంగానే వుండేది. వంశపారంపర్యంగా సంక్రమించిందనే చెప్పాలి. ఈ లక్షణాల వలన ఘంటసాల మాస్టారు హెచ్చు శ్రుతిలో పైస్థాయిలో ఆలపించేప్పుడు కొంత అయాసం, అలసట కలిగేవి. దాని ప్రభావం వలన అరికాళ్ళ మంటలు ఎక్కువై చాలా అవస్థ పడేవారు. గతవారం చెప్పినట్లు ఘంటసాలవారు సంగీతం విషయంలో గొప్ప నిష్ణాతులు. అనుభవజ్ఞులు. కానీ లౌకిక వ్యవహారాలలో ముఖ్యంగా ఆరోగ్య సమస్యల విషయంలో చాలా అమాయకులు. ఎవరేది చెప్పినా గాఢంగా నమ్మేసి అది పాటించేసేవారు. అలాటి సలహాలు కొన్ని పనిచేసినా మరికొన్ని తీవ్రంగా వికటించేవి.

ముఖ పరిచయం లేని ఒక పత్రికా విలేఖరి ఎవరో వచ్చి  దీర్ఘకాలిక రోగాలకు  చికిత్స చేసే గొప్ప నాటు వైద్యుడు ఎవరో చిత్తూరు లో వున్నడని అతని దగ్గరకు తీసుకు వెడతానని చెప్పాడట. ఆ వైద్యుడు చేసిన వైద్యంతో తన తల్లిదండ్రులకు, ప్రముఖ నటుడు శివాజీ గణేశన్ తల్లిదండ్రులకు ఉన్న జబ్బులు నయమయాయని చెప్పాడట. ఘంటసాల మాస్టారు ఆ వైద్యం తీసుకోవడానికి సిధ్ధపడ్డారట. సావిత్రమ్మగారు ఎంత చెప్పినా వినకుండా  1974 జనవరి 12 వ తేదీన విజయకుమార్ ను తోడుతీసుకొని కారులో చిత్తూరు వెళ్ళారట. ఆ నాటు వైద్యుడు ఒక హోటల్ సర్వర్ కూడా. నాలుగేసి గంటలకు ఒకసారి చొప్పున రెండు డోసుల మందు ఇచ్చాడట. ఆ రెండు డోసులు వేసుకున్న తర్వాత నయంగా అనిపించిందట. ఆ మందుతో కాళ్ళవాపులు తగ్గాయని తిరిగి మద్రాస్ వచ్చేసారట. త‌ర్వాత యథాప్రకారంగా రికార్డింగ్ లకు, రిహార్సల్స్ కు వెళ్ళడం ప్రారంభించారు. ఆ నాటు మందు వేసుకోసాగారు. ఆ మందు ప్రభావంతో కాళ్ళవాపులు కొంత తగ్గాయి కాని గొంతునొప్పి ప్రారంభమై  జనవరి 16 నాటికి అది తీవ్రమయింది. వేసుకున్న నాటుమందు వికటించింది. అలాగే 20వ తేదిన కూడా రెండు పాటలు పాడి వచ్చారట. విజయా హాస్పిటల్ లో కార్డియాలజిస్ట్ గా పనిచేసే వారి కుటుంబ వైద్యుడు డా. జయంతి రామారావుగారు వచ్చి మందులేవో ఇస్తూ వచ్చారు కానీ గుణం కనపడలేదు. మద్రాస్ లోనే అత్యంత ప్రఖ్యాతి పొందిన ENT స్పెషలిస్ట్ డా. చిట్టూరి సత్యనారాయణగారు. మాస్టారిని ఆయన వద్దకు తీసుకువెళ్ళారు. ఆయన అన్ని పరీక్షలు చేసి ఆ నాటు మందు వల్లే గొంతు సెప్టిక్ అయిందని, నయంకావడానికి ఇంజక్షన్లు, మందులు వ్రాసిచ్చారు. గొంతు నొప్పి వలన ఆహారం తీసుకోవడం కష్టమయింది. పూర్తిగా నీరసపడిపోయారు. లేచి నిలుచోలేని స్థితికి వచ్చేసారు. అలా ఓ పదిరోజులు గడిపారు ఇక ఇంట్లో లాభంలేదు హాస్పిటల్ లో జాయిన్ చేయడం మంచిదని డా.జయంతి గారు చెప్పడంతో  జనవరి 30న విజయా హాస్పిటల్ లో అడ్మిట్ చేసారు. ఘంటసాలకు ఏ విధమైన సహాయం కావాలన్నా వెంటనే అమలు పర్చమని  విజయా హాస్పిటల్ అధినేత బి.నాగిరెడ్డి గారు తమ సిబ్బందికి ఉత్తర్వులు ఇచ్చారట.

ఘంటసాల మాస్టారు హాస్పిటల్ లో వున్నప్పుడు ఎంతో మంది నిర్మాతలు వచ్చి ధైర్యం చెప్పేవారట. మాస్టారు పాడవలసిన పాటల కాల్షీట్లు ఇవ్వమని, ముందస్తుగా ఎడ్వాన్స్ గా ఔదార్యంగా మొత్తం డబ్బు ఇవ్వబోయేవారట. కానీ మాస్టారు తాను ఆ పాటలన్నీ పాడిన తర్వాతే డబ్బు తీసుకుంటానని చెప్పారట. అదీ ఘంటసాలవారి వ్యక్తిత్వం.

బి.పి., డయబిటిస్, పైల్స్, హార్ట్ ప్రోబ్లెమ్స్ అన్నీ ఎక్కువై ఘంటసాలవారి పరిస్థితి విషమించింది. చాలా రోజులుగా ఆహారం లేకపోవడంతో విజయా హాస్పిటల్ డాక్టర్లు డ్రిప్స్ ఎక్కించడం మొదలెట్టారు.

వాహినీ స్టూడియోలోని కొన్ని రికార్డింగ్ ధియేటర్లను, షూటింగ్ ఫ్లోర్స్ స్థానే విజయాహాస్పిటల్ ను నిర్మించారు బి.నాగిరెడ్డి.  దాదాపు పాతిక సంవత్సరాల పాటు ఏ స్టూడియోలో నిర్విరామంగా పాటలు పాడారో ఏ సంస్థకోసం అజరామరమైన గీతాలను స్వరపర్చడానికి వెళ్ళేవారో అదే స్థలంలోని ఒక గదిలో ఈ రోజు ఘంటసాల మాస్టారు తీవ్ర అనారోగ్యంతో మంచానబడ్డారు.

సావిత్రమ్మగారు మాస్టారి పక్కనే రాత్రింబవళ్ళు గడపసాగారు. ఇంట్లోని పిల్లలు, పెద్దలూ  భయపడకుండా వుండడానికి మాస్టారికి నయమైపోతుందని  పదకొండవ తేదీన ఇంటికి వచ్చేస్తారని చెప్పడం నేనూ విన్నాను. దానికి తగినట్లుగానే ఆ రోజు ఉదయం ఘంటసాలగారు బాగా మాసిపోయిన గెడ్డం గీయించుకున్నారట. డాక్టర్లు కూడా ఇడ్లీ, జావ పెట్టవచ్చని చెప్పారట.

ఘంటసాలవారి అనారోగ్య పరిస్థితి తెలుసుకున్న పుష్పగిరి పీఠాధిపతి శ్రీ విద్యానృసింహ భారతీ స్వాములు ఘంటసాలవారిని చూడడానికి విజయా హాస్పిటల్ కు వచ్చారట. వారు ధైర్యవచనాలు చెప్పి వెళ్ళిన తర్వాత ఘంటసాలవారు అకస్మాత్తుగా తన చొక్కా, బనీను విప్పేసి, మెడలోని యజ్ఞోపవీతాన్ని కూడా తీసేసి పక్కన పడేసారట.

1974 ఫిబ్రవరి 11 వ తేదీ ఉదయం పది గంటల సమయంలో మాస్టారికి శ్వాస తీసుకోవడం కష్టమైపోయింది. వేరే రూమ్ కు తీసుకువెళ్ళి ఆక్సిజన్ పెట్టారట.  గత కొద్ది రోజులుగా  డ్రిప్స్ మీదే కాలం వెళ్ళబుచ్చుతున్నందున వారి రెండు చేతులు బాగా కమిలిపోయి  డ్రిప్స్ పెట్టడం కష్టమైపోయి కాలికి పెట్టడం ప్రారంభించారట. డ్యూటీ డాక్టర్  తాను ఘంటసాలవారి అభిమానినని ఘంటసాలవారి కచేరీ తిరుపతిలో జరిగినప్పుడు వాళ్ళ ఊరినుంచి సైకిల్ మీద తిరుపతి వెళ్ళి ఘంటసాలవారి కచేరీ విని మురిసిపోయిన సంగతులన్ని చెపుతూ వచ్చేరట. కానీ మాస్టారిలో ఏ స్పందన కనిపించకపోయేసరికి నాడి చూస్తే అందలేదట. వెంటనే డా. జయంతి రామారావుగారు, ఇతర డాక్టర్లు పరుగెత్తుకు వచ్చి తమ ప్రయత్నాలు తామూ చేసారట. కానీ ఫలితం దక్కలేదు.

1974 ఫిబ్రవరి 11 వ తేదిన రెండు గంటల సమయంలో  ఘంటసాలవారి భౌతికకాయం నెం. 35, ఉస్మాన్ రోడ్ కు చేర్చారు.

ఘంటసాలవారి మరణవార్తతో దక్షిణభారత చలనచిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతి చెందింది.  మద్రాసు నగరంలోని సినీమా  కార్యకలాపాలు స్థంభించిపోయాయి. సంతాప సూచకంగా  రెండు రోజులపాటు అన్ని స్టూడియో లలో రికార్డింగ్ లు క్యాన్సిల్ చేసేసారు.

మామూలుగా ఉదయాన్నే ఆఫీసుకు వెళ్ళిపోయిన నాకు మా నాన్నగారు ఘంటసాలవారి మరణవార్తను ఫోన్ చేసి చెప్పారు. నేను వెంటనే రెండురోజులు శెలవు పెట్టి ఇంటికి వచ్చేసాను. నేను ఇంటికి వచ్చేప్పటికి ఇంటి ప్రాంగణమంతా జనసందోహంతో నిండిపోయింది.  అందరి ముఖాలలో తీవ్ర విషాదం అలముకొనివుంది. ఘంటసాల మాస్టారి భౌతికకాయాన్ని పోర్టికో వరండాలో ఉంచారు. ఆ వరండా మీది కుర్చీలోనే కూర్చొని తన కోసం వచ్చే కోరస్ సింగర్స్ తో, బయటిప్రాంతాల అభిమానులతో ఘంటసాలవారు చాలా సంతోషంగా, ఉత్సాహం తో మాట్లాడుతూ వచ్చినవారందరినీ ఆనందపర్చేవారు. అలాటి వ్యక్తి ఈనాడు అచేతనంగా వుండడం మనసుకెంతో కష్టాన్ని కలిగించింది.

ఘంటసాలవారి మరణవార్త వినగానే జాతి, కు‌ల, మత, భాషా తత్త్వాలకు అతీతంగా అసంఖ్యాకమైన జనసందోహం ఆ ప్రజాగాయకుని కడసారిగా చూచి నివాళులు అర్పించేందుకు  తరలివచ్చింది. వచ్చినవారందరిలో తీవ్రమైన దుఃఖం గూడుకట్టుకొనివుంది. ఎవరికి ఎవరు సానుభూతి చెప్పాలో తెలియక విలపించసాగారు. మాస్టారి సతీమణి సావిత్రమ్మగారు, ఘంటసాల మాస్టారి తమ్ముడు సదాశివుడు, ఇతర కుటుంబ సభ్యులు పూర్తిగా నిశ్చేష్ఠులైపోయారు. వారికి ఏవిధంగా సానుభూతి చూపగలము.

ముందుగా ఘంటసాలవారి కి మంచిమిత్రుడు, ప్రముఖ నటుడు కాంతారావుగారు వచ్చి చొరవతీసుకొని అక్కడి పరిస్థితిని సమీక్షించారు. కాంతారావు గారు చిత్రపరిశ్రమలోని ప్రముఖులు అందరికీ టెలిఫోన్ లో సమాచారం అందజేశారు. నేను , నరసింగ పక్కనేవుండి టెలిఫోన్ డైరక్టరీ లోని నెంబర్లను ఒక్కొక్కటిగా అందజేస్తూంటే కాంతారావు గారు అందరికీ ఈ విషాదవార్తను ఫోన్ లో చెప్పారు. ఘంటసాలవారి మరణవార్త వినగానే ఆలిండియా రేడియో వారు విషాద సంగీతం వినిపిస్తూ మధ్య మధ్యలో ప్రముఖుల సంతాపసందేశాలను, మాస్టారి అజరామరమైన మధురగీతాలను ప్రసారం చేస్తూనే వచ్చారు. మద్రాస్ లోని తమిళ సాయంత్రపు పత్రికలన్నీ ఘంటసాలవారి మరణవార్తనే ప్రధానంగా ప్రకటించాయి. సినీ ప్రముఖులతో ఇల్లంతా నిండిపోయింది. అక్కినేని, ఎన్.టి.రామారావు తమ విషాద సంతాపాన్ని, మాస్టారితో తమకు గల అనుబంధాన్ని  తమ గద్గదకంఠాలతో ఆలిండియా రేడియోలో వివరించారు. బి.ఎన్.రెడ్డి, పి.పుల్లయ్య, సి.ఎస్.రావు వంటి ప్రముఖ దర్శక నిర్మాతలు వచ్చి మాస్టారిని చూసి కన్నీరు కార్చారు. ఘంటసాలవారంటే అమితంగా గౌరవించే సంగీతదర్శకుడు టి.చలపతిరావు కన్నీరు ఆపుకోలేక స్పృహకోల్పోయారు.  ఆయనను సముదాయించడమే కష్టమయింది. దక్షిణాది భాషలకు చెందిన సంగీతదర్శకులు, నేపథ్యగాయకులు, వాద్యకళాకారులు తమ ప్రియతమ మాస్టారిని చూసి కంటతడిపెట్టుకున్నారు. దక్షిణ భారత సినీ మ్యుజిషియన్స్ ఎసోసియేషన్ ఆఫీస్ లో  ఘంటసాలవారి చిత్రపటానికి పూలమాలలు వేసి కన్నీటి అంజలి ఘటించారు. రెండురోజులపాటు పాటల రికార్డింగ్ కార్యక్రమాలను బంద్ చేసేసారు. ఇక సామాన్య ప్రజానీకానికి అంతేలేదు. 

సుప్రసిధ్ధ తమిళనటుడు నడిగర్ తిలకం శివాజీ గణేశన్ మాస్టారి పెద్దకుమారుడు విజయకుమార్ ను సముదాయింబోయి తానే గట్టిగా విలపించడం మొదలెట్టారు. అక్కడి వాతావరణం ఉద్వేగభరితమయింది. పెద్దబాబు(విజయకుమార్) అయితే తండ్రిగారి భౌతికకాయం పక్కనే తంబురా పెట్టుకు కూర్చుని విషాదరాగాలను, తండ్రిగారు పాడిన విషాదగీతాలను రాత్రంతా నిర్విరామంగా పాడుతూనే వున్నాడు. మరొకపక్క మాస్టారి దగ్గర పాటలు పాడే కోరస్ సింగర్సంతా భజనగీతాలు ఆలపిస్తూనే వచ్చారు. 

ఆ రాత్రి ఎలా తెలవారిందో ఎవరికీ తెలియదు. మర్నాటి ఉదయానికి ఘంటసాలవారి బంధువులు, సావిత్రమ్మగారి ఆత్మీయులు అందరూ రావడంతో ఇంట్లోవారి దుఃఖానికి అంతేలేదు. పురోహితులు ఘంటసాలవారి భౌతికాయానికి అంతిమ సంస్కారాలు చేయడానికి కావలసిన కార్యక్రమాలు మొదలెట్టారు.  మద్రాసులో సినీ నటీనటులను చూడడానికి వచ్చిన తిరుపతి యాత్రా స్పెషల్ బస్సులన్నీ  నెం.35, ఉస్మాన్ రోడ్ ప్రాంగణానికి వచ్చిచేరాయి. వారంతా తమ ప్రియతమ గాయకుని అంతిమ యాత్రలో భాగమయ్యారు. ఘంటసాలగారి భౌతికకాయం, గాయకులు టి.ఎమ్.సౌందరరాజన్, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, నటుడు కృష్ణంరాజు, మాడా వెంకటేశ్వరరావు, ఏడిద నాగేశ్వరరావు వంటివారు ముందుగా నడుస్తూండగా శ్మశానవాటికకు చేరుకుంది.




టి.నగర్ ఉస్మాన్ రోడ్ దక్షిణాన ఉన్న కన్నమ్మపేట శ్మశాన వాటికకి, ఎక్కడెక్కడినుండో వచ్చిన వేలాది అభిమానులు ఘంటసాల మాస్టారి భౌతికాయం మీద పూలవర్షం కురిపిస్తూ ఘంటసాల అమర్ రహే, ఘంటసాల జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తూ ముందుకు సాగగా, సినీ ప్రముఖుల భుజాలమీదుగా ఘంటసాలవారి భౌతికకాయం తన అంతిమయాత్ర సాగించింది.  కన్నమ్మపేట శ్మశాన వాటికకు చేరేంతవరకు రోడ్ కు ఇరువైపులా ప్లాట్ ఫారమ్ ల మీద, మేడలపైనుండి తమిళ అభిమానులంతా ఘంటసాలవారి కి నివాళులు అర్పించారు. కొందరు తమిళం  వారు దేవదాసు లో మాస్టారు పాడిన 'ఉలగేమాయం వాళ్వే మాయం'  (జగమేమాయా బ్రతుకే మాయా) పాటను పాడుతూ విలపించారు. వేలాది ప్రజలు వెంటరాగా శ్మశానవాటికలో ఘంటసాలవారి భౌతికకాయానికి పెద్దకుమారుడు విజయకుమార్ అగ్నిసంస్కారం చేశాడు.  ఒక సంగీత సామ్రాట్ ఆత్మ అనంతలోకాలకు తరలిపోయింది.  




ఘంటసాలవారు అమరగాయకులుగా మన మనస్సులలో నిల్చిపోయారు. వారు భౌతికంగా మన మధ్యనుండి తొలగి 48 సంవత్సరాలు అవుతున్నావారు పాడిన వేలాది పాటలు సంగీతప్రియులకు అన్నివిధాలా ఉపశమనం కలిగిస్తూనే ఉన్నాయి.

తెలుగు భాష ఉన్నంతవరకూ ఘంటసాలవారు, వారి అమృతతుల్యమైన గానం ఈ ప్రకృతిలో లీనమయేవుంటుంది.

ఘంటసాల చరిత అజరామరం. అంతమనేదే లేదు.
                        ...సశేషం

Sunday, February 13, 2022

నెం. 35 , ఉస్మాన్ రోడ్ (ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 2 - అరవై ఎనిమిదవ భాగం

13.02.2022 - ఆదివారం భాగం - 68:

అధ్యాయం 2  భాగం 67 ఇక్కడ


నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్

"చీకటి వెలుగుల రంగేళీ జీవితమే ఒక దీపావళీ" అన్న ఘంటసాలవారు, ఒక దగ్గర "జీవితమంతా కలయేనా జీవితమంతా భ్రమయేనా" అంటారుమరో చోట" ఇంతేరా ఈ జీవితం తిరిగే రంగులరాట్నం" అంటారు. నిరంతర ఈ చక్రభ్రమణంలో ఏది శాశ్వతం కాదు. నీటిబుడగ వంటి ఈ జీవితంలో ఏ నిముసానికి ఏమి జరుగుతుందో ఎవరూహించలేరు. విధి విలాసాన్నితప్పించడమూ అంతకన్నా  ఎవరివల్లా కాదు. సుఖదుఃఖాలు రెండూ ఒకదాని వెనక ఒకటి అంటిపెట్టుకునే వస్తూంటాయి. మంచి జరిగితే ఆనందించడం చెడు జరిగితే విలపించడమూ తప్ప సామాన్య మనిషి మరేమీ చేయలేడు. చీకటి వెలుగుల్లాటి సుఖదుఃఖాలు అనివార్యమని, మనిషి తన ఉద్వేగాలను తన ఆధీనంలోనే నియంత్రించాలని  వేదాంతులు చెప్పినా వాటి ప్రభావంనుండి మనిషి అంత తొందరగా బయటపడలేడు.  నిగ్రహించుకోనూలేడు. సుఖమూ దుఃఖమూ రెండూ వెంటవెంటనే కలుగుతూంటే ఆనందించాలో లేక బాధపడాలో తెలియని అగమ్యస్థితిలో పడతాడు.

ఏదో ఒక పాత సినీమాలో రేలంగి  ఒక పాటలో "నవ్వుతూ ఏడ్వనా, ఏడుస్తూ నవ్వనా" అని తానేడుస్తూ జనాలను నవ్విస్తారు.  ఒకరికి ఖేదము మరొకరికి మోదమూ అవుతుంది.

క్రిందటివారం నేను దాదాపు అటువంటి అవస్థనే అనుభవించాను.

ఫిబ్రవరి నెల మాకు ఎన్నటికీ మరపురానిది.

 2022 ఫిబ్రవరి 5 వ తేదీన మా 51 వ వివాహవార్షిక దినం. అదేరోజు సాయంత్రం మా పెద్ద చెల్లెలు శ్రీమతి కాకరపర్తి వెంకట రమణమ్మ రెండవ కుమార్తె చి.సౌ. గాయత్రి వివాహపు నిశ్చితార్థం, వెంటవెంటనే ఎదురు సన్నాహాలు, పరిచయకార్యక్రమాలు అన్నీ చాలా వైభవంగా జయప్రదంగా జరిగాయి.  బంధు మిత్రులతో సంతోషంగా గడచింది. మర్నాడు 6 వ తేదీ ఉదయం 8 గంటల తర్వాత సుముహుర్తం. చి.ల.సౌ.గాయత్రి, చి. ఆత్రేయ వివాహమహోత్సవం శుభప్రదంగా ముగిసిన కొంతసేపటికే  ఏడు దశాబ్దాల పాటు సంగీతప్రియులందరినీ తన అసమాన్య గాత్ర మాధుర్యంతో వేలాది పాటలతో కోట్లాది శ్రోతలకు తన్మయత్వం కలిగించిన ఇండియన్ నైటింగేల్, 'భారతరత్న' లతామంగేష్కర్ దివంగతులయారనే దుర్వార్త. గతకొంతకాలంగా పట్టిపీడిస్తున్న అనారోగ్యం, 93ఏళ్ళ వృధ్ధాప్యమే వారి మరణానికి కారణమని తెలిసినా ఆ కోకిల కంఠం శాశ్వతంగా మూగపోయిందనే తలపు మనసుకెంతో ఆవేదనను కలగజేసింది.

ఫిబ్రవరి 6 వ తేదీన వచ్చిన నా 'నెం.35,ఉస్మాన్ రోడ్' ధారావాహిక లో లతామంగేష్కర్ గారి భగవద్గీత గురించి, ఘంటసాల మాస్టారి తాత్పర్యసహిత భగవద్గీత గురించి ప్రస్తావించడం జరిగింది. ఈ ఇద్దరు మహాగాయకులు  సంతానం సినీమాలో 'నిదురపోరా తమ్ముడా' పాటను పాడినా అది ఇద్దరూ  కలసిపాడిన డ్యూయెట్ కాదు.  ఎవరి పోర్షన్ వాళ్ళదే.  అయినా ఆ ఇద్దరి పాటలు ఒకేసారి రికార్డ్ చేయడం, ఒకరికొకరు పరిచయంకాబడడం, ఒకరి పాట మరొకరు వినడం, రికార్డింగ్ పూర్తిఅయేవరకూ ఇద్దరు అక్కడేవుండడం జరిగింది. ఘంటసాలవారంటే  లతామంగేష్కర్ గారు అమితమైన గౌరవమర్యాదలు కనపర్చేవారు.  ఘంటసాలగారితో కలసి పాడాలనే అభిలాషను కనపర్చేవారట. సువర్ణసుందరిలోని "హాయి హాయిగా ఆమని సాగే" పాటలోని గమకస్ఫూర్తి, భావగాంభీర్యం, గాత్రసౌలభ్యం తమ కంఠాలలో తొణికిసలాడలేదని , తెలుగుపాటతో పోలిస్తే హిందీ పాట ఒకింత తేలిపోయిందని లతామంగేష్కర్ భావించినట్లు చెప్పుకునేవారు. పాట రిహార్సల్స్ లో కూడా ఘంటసాల మాస్టారి సహకారం వుంటే బావుంటుందని లతా సలహా ఇచ్చినట్లు, కానీ  తాను అలా జోక్యం చేసుకోవడం మహమ్మద్ రఫీ వంటి గొప్పగాయకుడిని కించపర్చినట్లవుతుందని ఘంటసాల మాస్టారు లతామంగేష్కర్ గారి కోరికను సున్నితంగా తిరస్కరించినట్లు మాస్టారింట్లో  చెప్పుకోగా విన్నాను.

తర్వాత కాలంలో హైదరాబాద్ లో దీనానాధ్ మంగేష్కర్ గారి పేరిట లతామంగేష్కర్ గారు ఘంటసాలవారికి ఘన సన్మానం చేసినప్పుడు సభాముఖంగా కాక, విడిగా సంభాషిస్తున్నప్పుడు లతామంగేష్కర్ మాస్టారితో గాయకులకు తమ గొంతే అత్యంత విలువైనదని దానిని ఎల్లవేళలా ప్రాణప్రదంగా కాపాడుకోవాలని సలహా ఇచ్చారట. సినీమా రంగంలో అసూయాపరులకు కొదవలేదని, స్లోపాయిజన్ తో ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడరని తనకు జరిగిన స్వానుభవాన్ని చెప్పారట. దీనినిబట్టి  చిత్ర విచిత్ర మనస్తత్త్వాలకు ఆలవాలమైన చిత్రసీమలో  తీవ్రమైన పోటీలకు, ఈర్ష్యాద్వేషాలకు కొరతలేదని స్పష్టంగా తెలుస్తుంది.

ఫిబ్రవరి 11 వ తేదీ విషయంలో కూడా మాకు ఓ విధమైన మిశ్రమభావోద్వేగాలే కలుగుతాయి. ఆ రోజు అమరగాయకుడు, గానగంధర్వుడు ఘంటసాలవారి వర్ధంతి. అదే రోజున మా మరదలు( మా ఆవిడ పెద్ద చెల్లెలు) ఆకుండి జయశ్రీ పరబ్రహ్మంగారి వివాహవార్షికోత్సవం. ఒకే రోజు రెండు వైవిధ్యపూరితమైన  కార్యక్రమాలలో పాల్గొనవలసివచ్చేది. ఫిబ్రవరి 20 న మా అమ్మాయి పెళ్ళిరోజు.

🌅🌷

సాధారణంగా ఘంటసాల మాస్టారు ఇంట్లో వుండడం జరగదు. మరీ ఒంట్లో బాగాలేదనిపిస్తే తప్ప ఏవో పనుల మీద బయటకు వెళ్ళి మధ్యాహ్నం భోజనాల సమయానికి వస్తారు. మళ్ళీ సాయంత్రం నాలుగు తర్వాత బయటకు వెళ్ళి రాత్రి ఎనిమిది తర్వాత వస్తారు. రికార్డింగ్ లున్న రోజులైతే రాత్రి తొమ్మిది దాటిపోయేది. ఈ మధ్య తరచూ ఏదో అస్వస్తత కారణంగా ఇంటిపట్టునే ఉంటున్నారు. మ్యూజిక్ కంపోజింగ్ లు కూడా ఇంటి దగ్గరే పెట్టుకుంటున్నారు.
ఖాళీగా ఉన్నరోజుల్లో ఉదయం ఓ అరగంట సాయంత్రం ఓ అరగంట పోర్టికోలోని వరండా మీదున్న కుర్చీలో కూర్చోని ఏవో పత్రికలు తిరగేసేవారు. ఆయనకు పెద్దగా పుస్తకాలు చదివే అలవాటు లేదు. ఆ వరండా మీదనుండి చూస్తే ఎదురుగా వుండే వ్యాసారావు స్ట్రీట్ లో నుండి వచ్చిపోయేవారు, ఉస్మాన్ రోడ్ లో తిరుగాడేవారు స్పష్టంగా కనిపిస్తారు. మాస్టారు ఇంట్లో ఉన్నారని తెలిస్తే  బయట వూళ్ళనుండి వచ్చే అభిమానులు, సినీమాలో పాటల ఛాన్స్ ల కోసం తిరిగే కోరస్ సింగర్స్, లేక ఆర్కెష్ట్రా ప్లేయర్స్ వచ్చి మాస్టారితో మాట్లాడుతూండేవారు. 'సినీమా' ఇంటూరి, 'మధురవాణి' గోటేటి,' కాగడా' శర్మ, 'కొరడా' రమణమూర్తి వంటి చిన్న సినిమా పత్రికలవారు చందాలకోసం , సినీమా రంగం 'జివిజి', 'ఆంధ్రపత్రిక' శ్రీనివాస్, గోపాలకృష్ణ, వి.ఎ.కే.రంగారావు వంటి ప్రముఖ పాత్రికేయులు ఇంటర్వ్యూలకోసం తరచూ వచ్చేవారు. వచ్చినప్పుడల్లా ఆ వారపు/నెల సినీమా పత్రికలు తీసుకువచ్చి మాస్టారుకు ఇచ్చేవారు. వారందరి రాకపోకలతో మాస్టారింటి ప్రాంగణం కళకళలాడేది.

ఆరోజుల్లో పోస్ట్ మెన్  రోజుకు మూడుసార్లు వచ్చేవారు. ఉదయం పది తర్వాత లోకల్ పోస్ట్, మధ్యాహ్నం, సాయంత్రం  బయట వూళ్ళ ఉత్తరాలు వచ్చేవి. ఎక్కువగా అభిమానుల ఉత్తరాలు, వివాహ ఆహ్వాన పత్రికలు రోజూ వచ్చేవి. అందరిళ్ళల్లో శుభకార్యాలు జరిగిపోతున్నాయి, తమ ఇంట్లో ఏది జరగలేదని ఘంటసాలవారికి   ఒక ఆరాటం వుండేది. నిజానికి పిల్లలంతా చాలా చిన్నవాళ్ళు. చదువులే పూర్తికాలేదు. పెద్దబాబు ఒక్కడే అప్పుడప్పుడే జీవితంలో స్థిరపడే ప్రయత్నాల్లో వున్నాడు. కానీ మాస్టారికి తన ఆరోగ్యం విషయంలో ఏదో అభద్రతా భావం వుండేది. కనీసం పెద్దవాడికైనా పెళ్ళి చేసి చూడాలనే కోరిక ప్రబలింది. సావిత్రమ్మగారికి అంత తొందరగా పెద్దబాబుకు పెళ్ళి చేసే ఉద్దేశం లేకపోయినా మాస్టారు ఆ ప్రయత్నాలు చేయడం మొదలెట్టారు. ఎవరిద్వారానో తమ కుమారుడికి మంచి అనుకూలమైన సంబంధం అమరింది.  చిత్రసీమలోని ప్రముఖులందరి సమక్షంలో మహా వైభవంగా వివాహం జరపాలని ఆశించారు. ఈ విషయమై పుట్టపర్తి సాయిబాబా వారిని, కాంచీ మహాస్వాములను దర్శించి వారి సమ్మతిని, ఆశిస్సులను  కూడా పొందారు.  ముహుర్తాలు పెట్టుకోవలసివుంది.

తరచూ జలుబు చేయడం, ఎక్కువసేపు నిలబడి పాడుతూంటే అలసిపోవడం, దానివలన అనుకున్న సమయానికి రికార్డింగ్ లు జరగక క్యాన్సిల్ కావడం జరిగేది.  దానితో ఘంటసాల గొంతు పోయింది ఇక పాడలేడు అనే దుష్ప్రచారం తెలుగు చిత్రసీమలో మొదలయింది. కొందరు సంగీత దర్శకులు పనిగట్టుకుని కొత్త వాయిస్ లను  పైకి తీసుకురావడానికి తీవ్రంగా ప్రయత్నించడం మొదలయింది. మ్యూజిక్ డైరక్షన్ చేసే సినీమా లు తగ్గిపోయాయి.  ప్రముఖ నిర్మాతలు తప్ప చిన్న చిన్న నిర్మాతలు ఇతర గాయకులచేత పాడించి తమ చిత్రాలు ముగించాలనే నిర్ణయానికి వచ్చారు. అగ్ర నటుల పాటల ట్రాక్స్ మాత్రం మాస్టారు  తన గొంతు బాగుందన్నప్పుడు వెళ్ళి పాడివచ్చేవారు.

ఘంటసాలవారు తన సంగీతం విషయంలో తప్ప మిగిలిన విషయాలలో చాలా అమాయకులు. ఎవరేది చెప్పినా నమ్మేసేవారు. తన ఆరోగ్యం విషయంలో ఎవరెవరో ఎవేవో చెప్పేవారు. వాటన్నిటినీ అమలుపర్చమని ఇంట్లోవారికి చెప్పేవారు. ఒకసారి ఎవరో బ్లడ్ సుగర్ తగ్గడానికి పొట్టుతీయని మినపప్పుతో చేసిన  నేతి గార్లను పుట్టతేనెలో ముంచి తినమని సలహా ఇచ్చారు. కొన్నాళ్ళ పాటు ఆ సలహాను తూచ తప్పకుండా పాటించి ఉదయపు అల్పాహారం గా తేనెతో నేతిగార్లు తీసుకోవడం మొదలెట్టారు. ఒకటి రెండు రోజులు బాగున్నట్లనిపించి ఆ చిట్కా బాగా పనిచేస్తోందని అందరికీ చెప్పి ఆనందించేవారు.  ఆ తర్వాత మరికొన్నాళ్ళకి షరా మామూలే. అల్లోపతి చేదుమాత్రలు తప్పనిసరేయేది.

ఈ పరిస్థితులలో ఒంట్లో ఓపిక తగ్గి బయట వరండాలో  ఒంటరిగా కూర్చొనేవారు. ఒక్క శని, ఆదివారాలలో తప్ప మిగిలిన రోజుల్లో నేను మాస్టారిని చూసే అవకాశం వుండేదికాదు. ఆ రెండు రోజులు మాత్రం నేను ఆయన పక్కనే వరండాలో బెంచ్ మీద గడిపేవాడిని. ప్రపంచం ఎంత విచిత్రమైనదంటే, అంతవరకూ ఇంద్రుడు, చంద్రుడూ, మీ అంతవారు మరెవరూ లేరూ, మీరు లేకపోతే ఇండస్ట్రీయే లేదు అని ఇచ్చకాలు పలికినవారంతా ఇంటి ఛాయలకే రావడం మానేసారు. చూస్తే ఎక్కడ లోపలికి వచ్చి మాట్లాడవలసివస్తుందేమోనని కొంతమంది తలదించుకునే ఇంటిముందునుండి వెళ్ళేవారు. కొంతమంది నిర్మాతలు తాము పాడించుకున్న పాటలకు, చేయించుకున్న మ్యూజిక్ డైరక్షన్ కు ఇవ్వవలసిన పైకం సకాలంలో ఇవ్వకుండా సగం సగం ఇచ్చి అప్పుడు, ఇప్పుడు అని మా నరసింగడిలాటివారిని పదేపదే తమ ఆఫీస్ చుట్టూ తిప్పించుకునేవారు. స్వయంగా ఘంటసాలవారే వెళితే తప్ప డబ్బులు వసూలయేవికావు.  ఆయన ముందు ఒకలా , ఆయన  వెనక మరోలా ప్రవర్తించేవారు. సినీమా ప్రపంచం అంతా సప్లై ఎండ్ డిమాండ్  సిధ్ధాంతాన్నే పాటించేది. ఇదంతా చూసి ఘంటసాల మాస్టారు నిర్వేదంగా నవ్వుకునేవారు. 'ఇదేరా నాయనా లోకం తీరు అనేవారు'.
మాస్టారు చెప్పేవన్నీ వినడం తప్ప సానుభూతి గా మాట్లాడడానికి గానీ, సలహా చెప్పడానికి గానీ నాకు సాహసము, అనుభవమూ, వయసూ ఏవీ లేవు. కానీ ఆ పరిస్థితిలో వారిని చూడడానికి ఏదో దిగులుగా అనిపించేది.

1973 లో మాస్టారిని మరింత క్రుంగదీసే విషాద సంఘటనలెన్నో. దాదాపు రెండున్నర దశాబ్దాలపాటు అత్యంత ఆత్మీయంగా కలసి పనిచేసినవారెందరో ఈ లోకాన్ని వదలిపెట్టిపోయారు. మొదట మ్యూజిక్ డైరక్టర్ టి.వి.రాజుగారు.

రాజా మహరాజా - టింగు రంగా

టి.వి.రాజుగారు చిత్రసీమ లోకి వచ్చినప్పటినుండి ఘంటసాలవారి తో మంచి స్నేహం వుండేది. రాజుగారి స్వరరచనలో ఘంటసాలమాస్టారు పాడిన పాటలెన్నో ఇంకా గాయకులంతా పాడుకుంటునే వున్నారు. 

తర్వాత, పామర్తి గారు. ఘంటసాలవారి ప్రోత్సాహం తోనే తబలా వాయించడం నేర్చుకొని మాస్టారి వద్ద సహాయకుడిగా అనుభవం గడించి  మ్యూజిక్ డైరెక్టర్ గా ఏదో సాధించాలని మాస్టారిని వదలి బయటకు వెళ్ళిపోయారు. అయినా ఘంటసాల మాస్టారు బాధపడలేదు. పామర్తిగారి చిత్రాలన్నింటిలోనూ పాడారు.

పూవై విరిసిన పున్నమి వేళ - శ్రీ తిరుపతమ్మ కథ

కానీ, పామర్తిగారు డబ్బింగ్ మ్యూజిక్ డైరక్టర్ గానే మిగిలిపోయారు. కేవలం నాలుగు మాత్రమే స్ట్రైట్ సినీమా లకు పనిచేసారు. అందులో నాల్గవ చిత్రం 'పూలమాల'  సినీమా సగంలో వుండగానే పామర్తిగారు కాలంచేసారు. ఆ సినీమాలోని మిగతా పాటలను  రీరికార్డింగ్ ను ఘంటసాల మాస్టారే పూర్తిచేసి దాని వలన వచ్చిన పైకాన్నంతా పామర్తి గారి కుటుంబానికే ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకున్నారు. 1955 వరకు,  మేము 35, ఉస్మాన్ రోడ్ కు రావడానికి ముందు వరకూ పామర్తి గారి కుటుంబం మేమున్న ఔట్ హౌస్ లోనే వుండేవారు.  అటువంటి ఆత్మీయుడైన పామర్తిగారు పోవడం మాస్టారికి ఒక లోటే. అన్నిటికంటే ఘంటసాలవారిని మరింత బాధించింది చిత్తూర్ వి.నాగయ్యగారి మరణం. మద్రాసులో అడుగుపెట్టి అన్నానికి అవస్థలు పడుతున్న రోజుల్లో ఆదరించి తమ రేణుకా సంస్థలో ఆశ్రయమిచ్చి అన్నం పెట్టి, తమ చిత్రాలలో చిన్నా చితకా వేషాలు, కోరస్ లు ఇచ్చి నాగయ్యగారు చూపిన ప్రేమాభిమానాల గురించి మాస్టారు ఎప్పుడూ తల్చుకునేవారు. 


ఆపరాని తాపమాయెరా - యోగి వేమన

నేపథ్యగానంతో పాటు కూచిపూడి జతులు పలుకుతూ తెరమీద కూడా కనిపిస్తారు ఘంటసాల యోగి వేమనలో. 

ఘంటసాల గారికి తొలిసారిగా పాడే అవకాశం కల్పించిన 'స్వర్గసీమ' సినీమాకు సంగీత దర్శకుడు కూడా చిత్తూరు వి.నాగయ్యగారే. 

ఓ నా రాజా -  స్వర్గసీమ

లక్షలాది రూపాయలు సంపాదించి  మితిమీరిన దాన ధర్మాలకోసం ఉన్న ఆస్తులన్నీ పోగొట్టుకున్న నాగయ్యగారి జీవితం అందరికీ ఒక గుణపాఠం. అటువంటి మహానుభావుడు స్వర్గస్తులైనప్పుడు కూడా సినీమారంగ ప్రముఖులెవరూ ఆయన దహన సంస్కారాలకు రాలేదు. 

బ్రతికి బాగా వున్నంతవరకే మనిషికి విలువ. ఆ తర్వాత ఎవరూ ఎవరినీ పట్టించుకోరు.తర్వాత జరిగిన పరిణామాలు చూస్తే నాగయ్యగారి మరణం ఘంటసాలవారిలో ఒక రకమైన మృత్యుభయాన్ని ఆవహింపజేసిందేమో అనిపిస్తుంది.

ఆ విషయాలన్నీ వచ్చే వారం.....
          ...సశేషం

Sunday, February 6, 2022

నెం. 35 , ఉస్మాన్ రోడ్ (ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 2 - అరవై ఏడవ భాగం

06.02.2022 - ఆదివారం భాగం - 67*:
అధ్యాయం 2 భాగం 66 ఇక్కడ

  

నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్

ప్రపంచ వ్యాప్తంగా వున్న సనాతనధర్మాచరణపరులకు, హిందువులకు పరమ పవిత్ర ఆధ్యాత్మిక గ్రంథం 'భగవద్గీత'. దీనినే గీతోపనిషత్  అని కూడా అంటారు. వేదవ్యాసుడు వ్రాసిన మహాభారత కావ్యంలోని భీష్మపర్వంలో ఈ గీతోపదేశ ఘట్టం వస్తుంది. కర్తవ్యవిమూఢుడైన అర్జునునికి స్ఫూర్తిని, కర్తవ్యాన్ని బోధిస్తూ శ్రీకృష్ణ భగవానుడు చేసిన ఉపదేశ సారమే భగవద్గీత. 18 భాగాలు గల ఈ గీత 700  సంస్కృత శ్లోకాలతో నిండినది. జ్ఞాన, భక్తి, కర్మ, రాజయోగాల గురించి, ధర్మాధర్మ విచక్షణ గురించి కూలంకషంగా చర్చించబడిన అత్యుత్తమ వేదాంత గ్రంధం భగవద్గీత. సంస్కృత భాషలో వున్న ఈ భగవద్గీత ను ప్రపంచ భాషలన్నింటిలోకి విస్తృతంగా అనువదించబడింది. భారతదేశ స్వతంత్ర పోరాట సమయంలో కూడా బాల గంగాధర్ తిలక్, మహాత్మా గాంధి వంటి గొప్ప నాయకులు భగవద్గీత ను ఆదర్శంగా తీసుకొని  నిష్కామంగా, స్వార్ధరహితంగా దేశ స్వాతంత్ర్యం కోసం తమ జీవితాలనే త్యాగం చేసారు. అటువంటి మహోత్కృష్ట భగవద్గీతకు మహామహులెందరో భాష్యాలు వ్రాసారు. గాయకులెందరో గానం చేసారు. సుప్రసిధ్ధ నేపధ్యగాయని లతామంగేష్కర్ గానం చేసిన భగవద్గీత బహుళజనాదరణ పొందింది. ఆమె భగవద్గీతలోని మొత్తం 700ల శ్లోకాలను సుశ్రావ్యంగా భక్తిరస ప్రధానంగా ఆలపించారు. 

అటువంటి భగవద్గీతనే ఘంటసాలవారు తన జీవిత సాఫల్యఫలంగా తెలుగువారందరికీ పంచిపెట్టాలని, తన  జీవితం చరితార్ధం కావాలని ఆశించారు.  సంస్కృత భాష తెలియని సామాన్యుడు కూడా భగవద్గీతను విని, అందులోని సారాంశాన్ని అర్ధం చేసుకోగల రీతిలో సరళమైన తెలుగుభాషలో తాత్పర్యసహిత భగవద్గీతను రూపొందించాలని ఘంటసాల నిర్ణయించారు. భగవద్గీతలోని మొత్తం 700 శ్లోకాలు కాకుండా ఒక నూట ఎనిమిది శ్లోకాలను మాత్రమే తాత్పర్యంతో రికార్డ్ చేయాలని భావించారు. ఈ పవిత్ర బృహత్ ప్రణాళికను  కార్యరూపంలో పెట్టడానికి HMV గ్రామఫోన్ కంపెనీ వారు తమ సంసిధ్ధతను ప్రకటించారు. తెలుగునాట HMV మనుగడకు ముఖ్యకారణం ఘంటసాలవారి భక్తిగీతాలు,  కరుణశ్రీ పద్యాలు, అసంఖ్యాకమైన సినీగీతాలేనన్న విషయం అందరికీ తెలిసిందే. 

కరుణశ్రీ పద్యాలు

ఏడాదికి కనీసం రెండు పాటలైనా  ఘంటసాలవారివి క్రమం తప్పక HMV గ్రామఫోన్ రికార్డ్ లు గా వచ్చేవి. ఆ సంస్థ తెలుగు విభాగపు అధిపతి శ్రీ మంగపతిగారు తరచూ మాస్టారిని కలిసి తమ కంపెనీకి పాడమని బలవంతం చేసేవారు. భగవద్గీతను రికార్డ్ చేద్దామని ఘంటసాల మాస్టారు చెప్పగానే మంగపతి చాలా సంతోషించారు. 

ఘంటసాలవారి భగవద్గీతకు తెలుగు వ్యాఖ్యానాన్ని వ్రాసే భాధ్యత ను శ్రీ కోట సత్యరంగయ్యశాస్త్రిగారికి అప్పజెప్పారు. శ్రీ రంగయ్యశాస్త్రిగారు సంస్కృతాంధ్ర భాషలలో పండితులు. కవిగా పేరు పొందినవారు. టి.నగర్ లోనే రామకృష్ణ మిషన్ మెయిన్ హైస్కూలులో తెలుగు పండితులుగా వుండేవారు. వీరి సోదరుడు కూడా మంచి పండితులే. అన్నదమ్ములిద్దరూ ఒకే రూపం. చాలా పొట్టిగా పిట్టల్లా వుండేవారు. అతి నిరాడంబరంగా కనిపించేవారు. ఘంటసాల మాస్టారు తన భావాలను వారికి తెలియజెప్పి తాను ఎంచుకున్న శ్లోకాలకు వ్యాఖ్యానం చేయమని కోరారు. శ్రీ కోట సత్యరంగయ్యశాస్త్రిగారు కూడా చాలా ఆనందించారు. కొన్నాళ్ళ తర్వాత తాను వ్రాసినది తీసుకువచ్చి ఘంటసాల మాస్టారికి వినిపించారు. అది మాస్టారికి అంత తృప్తి కలిగించలేదు. అక్కడక్కడ భాష మరీ గ్రాంధికమై పామరులకు అర్ధం కాని విధంగా ఉపయోగించారు. వాటన్నిటినీ ఒకటికి రెండుసార్లు సరిచేయించి భగవద్గీత వ్యాఖ్యానం పూర్తిచేయించారు. 



భగవద్గీతా గానాన్ని ఒక పరమ పవిత్రకార్యంగా భావించారు. అందుకోసం మనసా, వాచా, కర్మణేన ఆ భగవద్గీత రికార్డింగ్ జరిగినన్నాళ్ళు చాలా నియమనిష్టలు పాటించారు. ఆహారరీత్యా శాకాహారులే కావడాన ఆహార సమస్య లేదు.  తన వేషాన్ని కొంత మార్చారు. కషాయ రంగు చొక్కా, లుంగీలను ధరించడం మొదలెట్టారు. ఇందుకుగానూ సావిత్రమ్మగారు మాస్టారి తెల్ల దుస్తులనే పానగల్ పార్క్ సమీపంలో దొరైసామీ రోడ్ లో వున్న నల్లీ డైయింగ్ లో  ఇచ్చి ఆ తెల్ల బట్టలకు కాషాయ రంగు వేయించారు. బయట సినీమా పాటల రికార్డింగులకు కాషాయ బట్టలతోనే వెళ్ళేవారు. ఈ విధమైన నియమ నిష్టలను పౌరాణిక సినీమాల విషయంలో  ఎన్.టి.రామారావు పాటించేవారు. ముఖ్యంగా రాముడు, కృష్ణుడు, మహావిష్ణువు, శివుడు వంటి వేషధారణలో వున్నప్పుడు శాకాహారాన్నే తీసుకోవడం, నేలమీదే పడుక్కోవడం వంటివి  ఆచరించేవారు.

ఘంటసాలవారి భగవద్గీత  రికార్డింగ్ అంతా ఒకేసారి జరగలేదు. తన ఇతర సినీమా పాటలకు, ఇతర కార్యకలాపాలకు అడ్డంకి రాకుండా వ్యవధి తీసుకుంటూ రికార్డింగ్ జరిపారు. చాలా శ్లోకాలకు కంపోజింగ్ కూడా రికార్డింగ్ స్పాట్ లనే జరిగిందని మా నాన్నగారు చెప్పగా విన్నాను. 

అప్పటికి నేను నా ఉద్యోగ విధులలో తలమునకలుగా వుండడం వలన మా వాళ్ళ సినీమా  వ్యవహారాలకు చాలావరకు దూరమయ్యాను. రికార్డింగ్ లు, రీరికార్డింగ్ లకు వెళ్ళడం కుదిరేదికాదు. (HMV రికార్డింగ్ స్టూడియో జెమినీ స్టూడియో, సెఫైర్ ధియేటర్ల మధ్య ఒక చిన్న సందులో వుండేది. దానికి ఎదురుగానే ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారి ఆఫీస్, ప్రొజెక్షన్ థియేటర్ వుండేవి.) ఇప్పుడు వాటి ముందట  వుమ్మిడియార్స్ వాళ్ళ హైటెక్  నగల దుకాణాలు దర్శనమిస్తాయి.

భగవద్గీతను ఒక భగవత్కార్యంగా భక్తి శ్రధ్ధలతో రూపొందించారు. సంగీతంలో తనకు గల అనుభవాన్ని, విద్వత్ ను సంపూర్ణంగా ఈ శ్లోకాలలో ఉపయోగించారు.  రసోత్పత్తి కలగడానికి శుధ్ధ శాస్త్రీయ పధ్ధతిలో అనేక హిందుస్థానీ, కర్ణాటక సంగీత రాగాలను సందర్భోచితంగా ప్రయోగించారు. ఒక్కొక్క శ్లోకానికి, తాత్పర్యానికి ముందు వెనుకల సార్ధకత పెంచేలా వాద్యాలను ఉపయోగించారు. భావోద్వేగాల స్ఫూర్తిని కలిగించడంలో ఘంటసాలవారి ప్రతిభ అణువణువునా గోచరించింది.  ఘంటసాలవారి భగవద్గీత గానంలో నిష్ణాతులైన ఉత్తమ వాద్య కళాకారుల  పరిపూర్ణ సహకారం లభించింది. సర్వశ్రీ - మిట్ట జనార్దన్ - సితార్, గుణసింగ్ - ఫ్లూట్, సంగీతరావు - హార్మోనియం, రామసుబ్బు, చిత్తూరు సుబ్రహ్మణ్యం - వైలిన్స్, సుభాన్ - క్లారినెట్, యు. రామచంద్రరావు - డ్రమ్స్, జడ్సన్ - తబలా,  భద్రం - తంబురా, మొదలగు కళాకారుల సహకారంతో ఘంటసాల మాస్టారు తాత్పర్య సహిత గీతాగానాన్ని రికార్డ్ చేసారు.

ఘంటసాలవారి భగవద్గీత రెండు భాగాలుగా జరిగింది. రెండింటికీ మధ్య ఆరు మాసాల కాల వ్యవధి. ఇతర కార్యకలాపాల వలన కొంత ఘంటసాలవారి అనారోగ్యం కారణంగా కొంత జాప్యమయింది. భగవద్గీత వింటున్నంతసేపూ   ఆ రకమైన తేడాలేవీ వారి గాత్రంలో మనకు కనిపించవు. మనకళ్ళెదట శ్రీకృష్ణుడు, అర్జునుడు మాత్రమే కనిపిస్తారు. ఈ ఇద్దరి శ్లోకాలలోని వైవిధ్యం, ఘంటసాలవారిలో దాగివున్న నటనా ప్రతిభ ద్యోతకమవుతుంది. విశ్వరూప దర్శన సమయంలో ఉపయోగించిన వాద్య సమ్మేళనం మనకు ఒక రకమైన జలదరింపు, సంభ్రమం కలిగిస్తుంది. నిజంగానే కురుక్షేత్ర సంగ్రామ భూమిలో వున్నామనే భావన కలుగుతుంది. నరనారాయణులిద్దరూ ఘంటసాలవారి లో కనిపిస్తారు. 


పార్ధాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం...'
అనే శ్లోకం తో మొదలై మరో నూరుకు పైబడిన శ్లోకాలతో ఘంటసాల భగవద్గీతా గాన రసవాహిని శ్రోతలకు గొప్ప భావోద్వేగాన్ని కలుగజేస్తుంది. చివర, ఫలశృతిగా శాంతి శ్లోకాన్ని, అసతోమా సద్గమయా శ్లోకంతో తన భగవద్గీతను ముగించారు ఘంటసాల మాస్టారు. చివరలో వచ్చే ఆ శాంతిశ్లోకంలో తనతో పాటు మరో ఇద్దరు ముగ్గురు కూడా కలసి పాడారు. అందులో ఒక గాత్రం మా రెండవ చెల్లెలు పద్మది కావడం మాకందరికీ ఎంతో ఆనందదాయకం. అప్పటికి ఆమె వయసు 13 మాత్రమే. 

భగవద్గీత శ్లోకాలు పార్థాయప్రతిబోధితాం... శాంతిశ్లోకం    

తాను పాడిన భగవద్గీత ను రికార్డింగ్ సమయంలో వినడమే తప్ప, అది రికార్డ్ గా విడుదలైన తర్వాత సృష్టించిన చరిత్ర, తెచ్చిపెట్టిన పేరు ప్రఖ్యాతులు ఏవీ ఘంటసాలవారికి తెలియనే తెలియవు. అదే దురదృష్టం. 

🙏💐🙏

పంటలు పండని బీడువారిన భూములను వదలి పశుపక్ష్యాదులు పచపచ్చని పచ్చిక మైదానాలను వెతుకుతూ పోయినట్లే తన భవిష్యత్తు కోసం ఘంటసాలవారి దగ్గర సహాయకుడిగా,  వారి పెంపుడు కొడుకులా ఇరవైఏళ్ళపాటు ఇంట్లో మసలిన జె.వి.రాఘవులు 1969లో మాస్టారిని వదలిపెట్టిపోయారు. ఆయనకు డి.రామానాయుడు రూపంలో మంచి ప్రాపకం లభించింది. వారి సంస్థలో సహాయకుడిగా ఎమ్.ఎస్.విశ్వనాథన్, కె.వి.మహాదేవన్ ల వద్ద పనిచేసారు. రామానాయుడు గారురాఘవులు నాయుడు గారికి తమ 'ద్రోహి' చిత్రానికి సంగీత దర్శకుడిగా అవకాశం కల్పించి ప్రోత్సహించారు. అయితే ఆ సినీమా విజయవంతం కాలేదు. పాటలు పెద్దగా బయటకు రాలేదు. 1973 లో వచ్చిన రామానాయుడిగారి  'జీవన తరంగాలు' రాఘవులు గారికి సంగీతదర్శకుడిగా మంచి బ్రేక్ ఇచ్చింది. నేపథ్యగాయకుడిగా రాణించడానికి తగిన గాత్రం కాదు. కేవలం కొన్ని తరహా పాటలకే పరిమితమైన గాత్రం. అందువలన సంగీత దర్శకుడిగా నే తమ అదృష్టాన్ని నమ్ముకొన్నారు. 
తెలుగు సినీమారంగంలో సంగీతం ఎవరు నిర్వహించినా  హీరో పాటలు పాడాలంటే ఘంటసాలే రావాలనే దృష్టిలో ఆనాటి హీరోలు, వారిని అనుసరించే నిర్మాత లు వుండేవారు. 'జీవనతరంగాలు'లో రాఘవులు గారి సంగీత దర్శకత్వంలో ఘంటసాల మాస్టారు మూడు పాటలు పాడారు. అందులో 'ఈ జీవన తరంగాలు'  లో పాటను అసమాన్యం గా పాడారు. 

ఈ జీవనతరంగాలలో

ఆ పాట ఈనాటికీ బహుళ ప్రచారంలో వున్నది. తన శిష్యుడు ప్రయోజకుడైనందుకు ఘంటసాలవారెంతో సంతోషించారు. ఆరోజుల్లోనో అంతకుముందో రాఘవులు  టి.నగర్ లోని త్యాగరాజ గ్రామణి స్ట్రీట్ లో కట్టుకున్న తమ సొంత ఇంటి గృహప్రవేశానికి మాస్టారింట్లోవారిని, మా నాన్నగారినీ కూడా ఆహ్వానించారు. ఇంట్లోకి ప్రవేశించగానే వుండే వరండాలో గోడమీద ఘంటసాలవారి ఫోటోను పెట్టారు. ఆ తర్వాత రాఘవులుగారిని ఘంటసాలవారింట చూడలేదు.

1973లో  మధ్య మధ్య అనారోగ్యంతో బాధపడుతూ  ఒక ఇరవైఐదు సినీమాలలో మాత్రమే ఘంటసాల మాస్టారు దాదాపు 65 పాటలు పద్యాలు పాడారు. కొన్ని పాటలకు జలుబు వలన  గొంతు సహకరించక వేరే వర్ధమాన గాయకుల చేత ట్రాక్ పాడించి షూటింగ్ ముగించేవారు. సినీమా రిలీజ్ లోపల మాస్టారు ఆ పాటలను మళ్ళీ పాడి ట్రాక్ మిక్స్ చేసేవారు. కొన్ని సందర్భాలలో ఆయా నూతన గాయకులు పాడిన పాటలు బాగున్నాయనుకునేప్పుడు వాటిని తాను మళ్ళీ పాడకుండా ఆ గాయకుల గొంతునే ఉంచమని  ఘంటసాలవారు నిర్మాతలను కోరేవారు. ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, వి.రామకృష్ణ, జేసుదాస్‌, జి.ఆనంద్, రమేష్, ఎ.వి.ఎన్.మూర్తి వంటి నూతన గాయకులతో ప్రయోగాలు మొదలుపెట్టి వారిని చిత్రసీమ ప్రోత్సహిస్తున్న రోజులవి. ఎంతమంది నూతన గాయకులు వచ్చినా ఘంటసాలవారి స్థాయికి ఏ ఒక్క గాయకుడు అందుకోలేకపోవడం అటు సంగీత దర్శకులకు, ఇటు నిర్మాతలకు క్లిష్టతరమయింది. 

1973 లో వచ్చిన సినీమా లలో  - 'బంగారుబాబు'లోని  'చెంగావి రంగు చీర', దేవుడు చేసిన మనుషులు' లో ' దేవుడు చేసిన మనుషుల్లారా', పల్లెటూరి బావలో - 'ఒసే వయ్యారి రంగి',  'మైనర్ బాబు'లో 'మోతీ మహల్ లో చూశానా', 'డాక్టర్ బాబు'లో 'విరిసే కన్నులలో', 'మరపురాని మనిషి'లో 'వచ్చింది వచ్చింది లచ్చిమి' వంటి పాటలు మంచి ప్రచారం పొందాయి.

వీటన్నిటిలోకి తలమానికంగా ఈనాటికీ అందరిచేతా పాడబడుతూ అందరి మన్ననలు పొందుతున్న పాటలు 'భక్త తుకారం'లోని పాటలు. ఘంటసాలవారు ఎప్పుడు పాడితే అప్పటివరకు కాచుకునే వుంటామని ఆదినారాయణరావుగారు  ఆ చిత్రంలోని ఆరు పాటలను, మూడు పాటలు ఘంటసాలవారి చేతే పాడించారు. ఆ చిత్రంలోని 'ఘనా ఘన సుందరా', 'భలే భలే అందాలు', 'ఉన్నావా అసలున్నావా', 'చిందులు వేయకురా నరుడా'  పాటలు అజరామరంగా నిల్చిపోయాయి. 

ఘనా ఘనా సుందరా - భక్త తుకారం

భలే భలే అందాలు సృష్టించావు - భక్త తుకారం

ఉన్నావా అసలున్నావా - భక్త తుకారం

ఈ పాటలన్నీ ఘంటసాలవారు అనారోగ్యంతో వున్నప్పుడు పాడినవే. ఈ సినీమాలోని ట్రాక్స్ కొన్ని వి.రామకృష్ణ చేతే పాడించారు. రామకృష్ణ గొంతు చాలా వరకు ఘంటసాలవారి గొంతును అనుకరించి వుండేది.

గాయకుడిగా మద్రాస్ లో  తన ప్రయత్నాలు మొదలెడుతున్న తొలి రోజుల్లో  వి.రామకృష్ణ తన తల్లిగారిని తోడుతీసుకొని ఒకసారి ఘంటసాలవారింటికి వాయిస్ ఆడిషన్ కోసం వచ్చారు. ఘంటసాల మాస్టారు ఎదుట  కొన్ని పాటలు పాడారు. కొత్త గాయకులు ఎవరు వచ్చినా సినీమా పాటలు, తాను పాడిన పాటలు కాకుండా వేరే పాటలు పాడమనేవారు. అప్పుడే వాళ్ళ ఒరిజినాల్టీ తెలుస్తుందని అనేవారు. చాలామంది కొత్త కుర్రాళ్ళు సినీమా పాటలంటే చాలా బాగా పాడేవారు. నాన్ ఫిల్మ్ గీతాలు పాడేప్పటికి తేలిపోయేవారు. అలాటి వారందరికీ ఘంటసాలవారు ఎప్పుడూ ఒకే సలహా ఇచ్చేవారు. ఏ గాయకుడినైనా అనుసరించండి కానీ అనుకరించవద్దనేవారు. అనుకరించేవారికి గాయకుడిగా తాత్కాలిక మనుగడే తప్ప సుదీర్ఘకాలం రాణించలేరనేది వారి నిశ్చితాభిప్రాయం.

రామకృష్ణ వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో మాట్లాడుతూ ఆ కుర్రాడు సుశీల అక్క కుమారుడని పాటలు బాగానే పాడుతున్నా తన గొంతునే, ముఖ్యంగా వయసు దాటాక ఏర్పడిన జలుబు గొంతునే తెలిసో తెలియక అనుకరిస్తున్నాడని అది అతని భవిష్యత్తుకు అంతగా దోహదపడదని అనడం విన్నాను. అది చాలా వరకు నిజమే అయింది. 

ఈ రోజుల్లోలాగా  తమ వారసులను ప్రమోట్ చేసుకోవడమనే సంస్కృతి ఆనాటి సినీమా రంగంలో ఎక్కువగా కనపడదు.  బాగా పాడతాడు పాడించుకోండని రామకృష్ణ  విషయంలో సుశీలగారు కానీ, మా అబ్బాయి పియోనా బాగా వాయిస్తాడు, అవకాశాలు ఇవ్వండని రాజేశ్వరరావుగారో, ఘంటసాలగారో తమ పిల్లలకోసం ఎవరినీ అడిగిన దాఖలాలు కనపడవు. స్వతఃసిద్ధమైన ప్రతిభ వుంటే వాళ్ళకు వాళ్ళే అవకాశాలు సంపాదించుకొని వృధ్ధిలోకి రావాలని ఆనాటి తల్లిదండ్రులు భావించేవారు. 

సినీమా రంగం చిత్ర విచిత్రమైనదని అందరికీ తెలిసిందే.

ఆ విశేషాలు ఏమిటో వచ్చేవారం చూద్దాము.

                   ...సశేషం

Sunday, January 30, 2022

నెం. 35 , ఉస్మాన్ రోడ్ (ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 2 - అరవై ఆరవ భాగం

30.01.2022 - ఆదివారం భాగం - 66:

అధ్యాయం 2  భాగం 65 ఇక్కడ


నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్

9 టు 9 రీ-రికార్డింగ్ కాల్షీట్. ఆరోజుతో ఎలాగైనా రీరికార్డింగ్ పూర్తిచేసేయాలనే దీక్షతో వచ్చారు ఘంటసాల మాస్టారు. ముందుగా ఆ రోజు చేయవలసిన సీన్స్ తెరమీద వేసి చూపారు.  స్టాప్ వాచ్ తో మొత్తం సీన్ ఎన్ని నిముషాలు వుందో అందులో ఎంతమేరకు మ్యూజిక్ అవసరమవుతుందో ఏఏ వాద్యాలు ఉపయోగించాలో నిర్ణయించుకున్నారు. ఆ సీన్ లో ముందు ఛేసింగ్స్,   తర్వాత ఒక లెన్తీ ఫైట్ సీక్వెన్స్. మాస్టారు, మా నాన్నగారు హార్మోనియం మీద, జడ్సన్ తబలామీద సహకరిస్తూంటే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కంపోజ్ చేశారు. తనకు తృప్తి కలిగేంతవరకు చేర్పులు , మార్పులు చేసి నోట్స్ ఫైనలైజ్ చేసారు. మధ్యమధ్య ఏ విధమైన సౌండ్ ఎఫెక్ట్స్ ఏ వాద్యం మీద రావాలో తాత్కాలికంగా నిర్ణయించారు. ఓ ముఫ్ఫై నలభైమంది ఆర్కెష్ట్రా. వెస్టర్న్ స్ట్రింగ్, విండ్ ఇన్స్ట్ర్మెంట్స్ ఎక్కువగానే వున్నాయి. హై పిచ్ లో ఫాస్ట్ టెంపో నోట్స్ ను మాస్టారు కంపోజ్ చేశారు. ఒక్కొక్క సెక్షన్ నుండి ఒక్కొక్క ప్రతినిధి వచ్చి మా నాన్నగారు చెపుతూంటే వారి వారి భాషల్లో నోట్స్ రాసుకొని మిగతావారికి అందజేశారు. ముందుగా ఆ నోట్స్  ఒకటి రెండు సార్లు ప్రాక్టీసు చేశాక, తెర మీద సినీమాతో పాటు వాయింపజేసి నాన్ సింక్ లు ఏమైనా వున్నాయేమోనని చెక్ చేసుకొన్నారు. ఫస్ట్ మోనిటర్ లో చిన్న చిన్న మార్పులు అవసరమయాయి. వాటిని సరిచేసి మరో మోనిటర్ పిక్చర్ తో చూశారు. తృప్తికరంగానే వచ్చింది. టేక్ తీద్దామా అని సౌండ్ డిపార్ట్మెంట్ వారిని. ఆడిటోరియంలో ని ఆర్కెస్ట్రాను మైక్ లో అడిగారు మాస్టారు. టేక్ సమయంలో ఏ రకమైన  దగ్గులు, తుమ్ములు, ఆవలింతలు, బరబర చప్పుళ్ళు వినపడకూడదనడానికి ఇదొక హెచ్చరిక. సౌండ్ వాళ్ళు తాము రెడీ అని చెప్పాక ఆర్కెస్ట్రాను కండక్ట్ చేసే రాఘవులుగారు సైలెన్స్ అని ఓ అరుపు అరిచి, సీన్ నెంబర్ చెప్పి స్టార్ట్  అనగానే స్క్రీన్ మీద సినీమా ప్రారంభమై ఆడిటోరియంలో వాద్యాల మ్రోత ఆరంభమయింది. అన్ని వాద్యాలు ఒకేసారి జోరుగా మ్రోగుతున్నప్పుడు వినేవారికి చాలా ఉత్కంఠ కలుగుతుంది. వాద్యాలు స్పీడ్ అందుకున్నాయి.  సౌండ్ ఇంజనీర్ పక్కనే కూర్చున్న  ఘంటసాల మాస్టారు సడన్ గా కట్ అని అరిచారు. ఒక్కసారిగా వాద్యాలన్నీ ఆగిపోయాయి. మాస్టారు ఎందుకు కట్ చెప్పారో ఎవరికీ అర్ధం కాలేదు. మాస్టారికి తెలుసు ఏ సెక్షన్ లో పొరపాటని. అయినా  ఒక్కొక్క సెక్షన్ ను  మళ్ళీ వాళ్ళ వాళ్ళ నోట్స్ ను వాయించి చూపమన్నారు. అలా మళ్ళీ వాయించేప్పుడు  వైలిన్స్ సెక్షన్ లో ఎవరో నోట్స్ తప్పుగా రాసుకోవడం వలన ఒకచోట స్వరం తప్పి అపశ్రుతిగా వినపడింది. ఆ విషయం థియేటర్లో వాయిస్తున్నవారికి తెలియదు . ఏ చిన్న లోపం ఎక్కడ జరిగినా లోపల సౌండ్ కంట్రోల్ రూమ్ లో తెలిసిపోతుంది. మళ్ళీ మొత్తం సీన్ మొదటినుండి ప్రారంభించవలసిందే. ఇలాటి పొరపాట్లు ఎవరు చేసినా దాని ఫలితం అందరూ అనుభవించాలి. అందుకే ఆర్కెస్ట్రాలో బాగా అనుభవం ఉన్నవారిని, ప్రొఫెషనల్స్ ను పిలుస్తారు. ధియేటర్లోకి వచ్చాక ఒక్కొక్క నిముషం ఎంతో విలువైనది. అంతా అణా పైసలతో కూడుకున్నది. అనుకున్న రీతిలో పని సక్రమంగా జరగకపోతే అక్కడ నిర్మాత బిపి రేట్ పెరిగిపోతూంటుంది. అటువంటి దురవస్థ నుండి నిర్మాతకు తప్పించవలసిన బాధ్యత ఇప్పుడు సంగీతదర్శకుడిదే. నిర్ణీత సమయంలో పనిపూర్తి చేయాలి, తను చేస్తున్న సీన్ తనకు ఇతరులకు పూర్తి సంతృప్తిని కలిగించాలి. ఇందుకుగానూ ఘంటసాలగారు ఎంతో శ్రమించేవారు. ఆఖరు నిముషం వరకూ అన్నీ సక్రమంగానే వున్నా టేక్ కు వెళ్ళేప్పటికి ఎదో అంతరాయం. సౌండ్ విభాగంలో కరెంట్ ఫ్లక్చువేషన్ వల్ల మైకులు పనిచేయకపోవడం, శ్రుతుల బిగింపు ఎక్కువై వైలిన్ తీగెలు తెగిపోవడం, తబలా,డ్రమ్ముల శ్రుతులు జారిపోవడం, లేదా హార్మోనియం మెట్లు  జామ్ అయి హ్యాంగ్ కావడం,ఆర్కెస్ట్రా రూమ్ లోని కుర్చీలో, టేబిల్సో జరిగి చప్పుడు కావడం ఇత్యాది అనివార్య అవాంతరాలతో టేక్ సగంలో కట్ చేసి మళ్ళీ మొదలుపెట్టవలసి వచ్చేది. ఇప్పటి మోడర్న్ టెక్నాలజీ ఆనాడే వుండివుంటే మరెంతో ఉత్తమ సంగీతం లభించేది.   ప్రపంచ సినీమా ఇండస్ట్ట్రీలతో పోలిస్తే భారతీయ చలనచిత్ర సాంకేతిక నైపుణ్యం ఎప్పుడూ ఒక దశాబ్దం వెనకే అని సినీ పండితుల అభిప్రాయం. హాలీవుడ్ లో ఔట్ డేట్ అయిన తర్వాత ఆ సాంకేతికత ఇండియాకు దిగుమతి అవుతుందని మా వీడియో టెక్నిషియన్స్ అనడం నేను విన్నాను. ఈ రకమైనటువంటి పొరపాట్లవలన, లోపాల వలన నిర్ణీత సమయంలో సక్రమంగా పని పూర్తికాదు.  అందువల్ల ఏర్పడే స్ట్రెస్,  స్ట్రైన్ కళాకారుల మీద చాలా తీవ్రంగా వుంటుంది. ఈ విధమైన ఒత్తిళ్ళు తట్టుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అంత సులభం కాదు. 

ఒక సినిమాకు సంగీత దర్శకత్వం వహించి అనుకున్న సమయానికి నిర్మాత, దర్శకుల తృప్తిమేరకు పాటలను, రీరికార్డింగ్, మిక్సింగ్ లను పూర్తి చేయడమనేది  ప్రసవ వేదన అనుభవించడంలాటిది. ప్రతి మనిషి జీవితంలో ఏదో దశలో ఏవో అపశ్రుతులు ధ్వనిస్తూనేవుంటాయి. దానికి కారణం స్వయంకృతాపరాధాలు కావచ్చు, లేదా తన చుట్టూవుండే తనవారి పొరపాటు వల్ల కూడా కావచ్చు. కానీ అందువల్ల కలిగే దుష్ఫలితాలు ఆ మనిషి జీవితాంతం వెంటాడుతూనేవుంటాయి. ఆ మనిషిని అన్ని విధాలా భౌతికంగా, మానసికంగా కృంగదీస్తూనేవుంటాయి.

1972 సెప్టెంబర్ లో జరిగిన ఒక సంఘటన ఘంటసాలవారిని మనోవేదనకు గురిచేసింది. సుప్రసిద్ధ దర్శకుడు, నిర్మాత శ్రీ కె.వి రెడ్డిగారు కాలధర్మం చెందారు. విజయా  వాహినీ సంస్థల పురోభివృధ్ధికి ఎంతగానో శ్రమించిన వ్యక్తి. ఘంటసాలవారంటే సదా ఎంతో ప్రేమ,అభిమానం కనపరుస్తూ ఆయన సంగీత ప్రతిభను ఎంతగానో గౌరవించిన వ్యక్తి. కె.వి.రెడ్డిగారి ఇల్లు వెనక భాగం మాస్టారింటికి ఎదురుగానే వుండేది. ఇద్దరూ దాదాపుగా ఒకే సమయంలో రాత్రిపూట స్టూడియో నుండి ఇళ్ళకు చేరేవారు. కె.వి.రెడ్డిగారు పోయినరోజు  ఆ ఇంట్లోవారిని పరామర్శ చేయడానికి మాస్టారు వెళుతూ నన్ను కూడా వెంట తీసుకువెళ్ళారు. మేము వెళ్ళే సమయానికి బయటవాళ్ళెవరూ పెద్దగా కనపడలేదు. ప్రముఖ నటి వాణిశ్రీ ఉన్నారు. కె.వి.రెడ్డిగారి అబ్బాయిలలో ఒకరు రామకృష్ణ స్కూల్ లో సహధ్యాయే అయినా నేనెప్పుడూ నా చిన్నతనంలో వారింటికి వెళ్ళలేదు. ఒకరకమైన భయం. కె.వి.రెడ్డిగారు పిల్లల క్రమశిక్షణ విషయంలో చాలా కఠినంగా వ్యవహరించేవారని చెప్పుకునేవారు. వారు సొంతంగా చిత్రనిర్మాణం మొదలెట్టి జయంతి పిక్చర్స్ బ్యానర్ మీద 'పెళ్ళినాటి ప్రమాణాలు' తీస్తున్న రోజులలో ఆ ఆఫీసుకు అప్పుడప్పుడు వెళుతూ అక్కడ ఆయనను దూరం నుండి చూసేవాడిని. ఆ  మొదటి సినీమాకు ఘంటసాల మాస్టారే సంగీత దర్శకత్వం వహించారు. మా నాన్నగారు సహాయకుడు. కొన్నిపాటలకు వీణ కూడా వాయించారు. మా నాన్నగారు ఎన్నో కంపెనీలకు అసిస్టెంట్ గా పనిచేసినా ఒక్క కె.వి.రెడ్డిగారి జయంతి బ్యానర్లో మాత్రమే  ఆ సినీమా అయినన్నాళ్ళు అదనంగా నెల జీతం క్రింద కొంత పైకం ఇచ్చేవారు. అదెన్నడూ మరచిపోలేను.  ఇంట్లోగానీ, బయటగానీ ఎటువంటి చెడువార్తలు విన్నా ఘంటసాలవారు అమితంగా చలించిపోయేవారు. ఇంటికి ఎదురుగా వుండే చిరకాల సన్నిహితుడు కె.వి.రెడ్డిగారు పోవడం ఘంటసాల మాస్టారికి ఎంతో ఆవేదన కలిగించింది.

ఘంటసాలవారు ఏభైవపడి చేరేసరికి మనిషిలో వృధ్ధాప్య ఛాయలు, వైరాగ్య ధోరణి కనపడసాగాయి.  వంశపారంపర్యంగా వస్తున్న మధుమేహ వ్యాధి వారికి తమ 33వ ఏటనే సంక్రమించింది. అది అంతకుముందే ఎప్పటినుండి వుండేదో తెలియదు. ఈరోజుల్లోలా ఆనాడు ఇళ్ళలో గ్లూకోమీటర్లు, బిపి చెకింగ్ మీటర్లు అందుబాటులో వుండేవికావు. యూరిన్ టెస్ట్ లు చేసుకోవడానికి తగినంత సమయమూ దొరికేదికాదు. బిపి, సుగర్ లు రెండూ బాగా పెరిగిపోయాయి. ఎప్పుడూ అరికాళ్ళ మంటలతో బాధపడేవారు. రికార్డింగ్, రీరికార్డింగ్ సమయాలలో గంటల తరబడి నిలబడే వుండవలసి వచ్చేది. దానితో కాళ్ళమంటలు మరింత ఎక్కువయేది. ఇంటికీ రాగానే తమ్ముడు కృష్ణగానీ , సావిత్రమ్మగారు గానీ అరికాళ్ళకు కర్పూరం వేసిన నూనెతో మర్దనా చేస్తే కొంత సర్దుకునేది.

మిగిలిన రంగాలతో పోల్చి చూస్తే ఆనాడు సినీమావాళ్ళకు ఆహారం విషయంలో కంట్రోల్ వుండేదికాదు. నిర్ణీత సమయానికి భోజనం, నిద్ర వుండేవికావు. ఇవన్నీ కూడా మనిషి ఆరోగ్యాన్ని బాగా దెబ్బతీస్తాయి. అలాగే తీసుకునే ఆహారం విషయంలో కూడా ఎంతో జాగ్రత్త అవసరం. మనిషికి 45 ఏళ్ళ వరకూ మంచి రెసిస్టెన్స్ పవర్ వుంటుంది. ఆ వయసులో ఎలాటి ఆహారనియమాలు పాటించకపోయినా మనిషి దృఢంగానే వున్నట్లు కనిపిస్తాడు. అక్కడనుండే ఆరోగ్య సమస్యలు ప్రారంభమవుతాయి. ఘంటసాల మాస్టారు రుచికరమైన ఆహార పదార్ధాల విషయంలో నిగ్రహం పాటించలేకపోయేవారు.  చిన్నవయసులో ఎలాగూ సరైన తిండికి నోచుకోలేదు, ఇప్పుడు బాగా సంపాదిస్తున్న కాలంలో కూడా సుష్టుగా భోజనం చేయకపోతే ఎలా అనేవారు. సాధారణంగా డైబెటిక్స్ అందరూ తీపి పదార్ధాలకు లోబడిపోతారు. ప్రముఖ హాస్యనటుడు రేలంగి గారు కూడా ఇదే మనోస్థితిలో వుండేవారు. చిన్న వయసులో రాళ్ళనైనా హరాయించుకోగల శక్తి వున్నప్పుడు చేతిలో పైసలు లేక అన్నంకోసం మొహంవాచి మంచినీళ్ళతోనే ఆకలితీర్చుకోవలసి వచ్చింది. నాలుగు డబ్బులు సంపాదించి హాయిగా కడుపునిండా తిందామనుకునేసరికి రకరకాల జబ్బులు ఒంటిని పట్టి కావలసినవి తినడానికి నోచుకోలేకపోతున్నాని ఎన్నోసార్లు అందరితో చెప్పి బాధపడేవారు. సుగర్, బిపి రెండూ ఆప్తమిత్రులు. ఎవరికైనా ఒకటుంటే పక్కనే రెండోదికూడా వచ్చి చేరుతుంది. ఈ రెండూ వుంటే మిగిలిన వ్యాధులు ఒక్కొక్కటే కాలక్రమేణా బయటపడతాయి. అందులోనూ ఘంటసాల మాస్టారు కృష్ణాజిల్లా వ్యక్తి. ఆహార పదార్థాలు అన్నిటిలో ఉప్పు కారాలు మరీ మితిమీరకపోయినా బాగానే పడేవి. సావిత్రమ్మగారి నేతృత్వంలో తయారైన రకరకాల ఆవకాయలు, కొరివికారం, దోసావకాయ వంటి ఊరగాయలు సంవత్సరం పొడుగునా వుండేవీ. చిరకాలం నిల్వ వుండే ఊరగాయలు కావాలంటే ఘాటైన గుంటూరు మిరపకాయలు, అక్కడి సన్న ఆవాలు, శుధ్ధమైన నువ్వులనూనె మాత్రమే ఉపయోగించాలని ఊరగాయ శాస్త్రాలు ఘోషిస్తాయి. ఈనాడు మనకు షాపుల్లో దొరికే ఊరగాయలన్నింటిలో వినిగర్ వంటి ప్రిసర్వేటివ్స్ వేసేస్తారు. దానివలన  మామిడికాయ, నిమ్మకాయ, ఉసిరికాయ, టొమేటొ, గోంగూర ఇలా ఏ ఊరగాయ చూసినా అన్నిటి రుచులు ఒక్కలాగే వుంటాయి. ఒకదానికొకటి తేడానే తెలియదు. షాపుల్లో దొరికే ఊరగాయలు తెలుగువారి ఊరగాయ సంస్కృతిని ముమ్మాటికి ప్రతిబింబించవు. ఏభై అరవై ఏళ్ళ క్రితం మన బామ్మలు, అమ్మమ్మలు పెట్టే ఊరగాయలు, సీమమిరప పొడి కలిపిన అప్పడాలు, ఒడియాలు ఈనాడు ఏ ఇంటా కనపడవు.  శాస్త్రోక్తంగా నిబధ్ధతతో ఇంట్లో  ఊరగాయలు పెట్టే ఓపికగానీ, తిని హరాయించుకునే ఆరోగ్యాలు కానీ ఈకాలంలో  ఎవరికీ లేవు. ఆనాటి ఆహారపు సంస్కృతే వేరు.

సినీమా రంగంలో అడుగుపెట్టి రెండున్నర దశాబ్దాలుగా  సినీ సంగీత సామ్రాజ్యంలో  మధురగాయకుడిగా, విశిష్ట సంగీతదర్శకుడిగా కీర్తి పొంది మకుటంలేని మహారాజుగా తెలుగువారందరిచేతా నీరాజనాలు పట్టించుకున్న ఘంటసాల మాస్టారికి నిరంతరంగా కాకపోయినా తగిన విశ్రాంతి పొందేలా తగు మార్పులు చేసుకోవాలని ఆశించారు. వయోధర్మానికి తగిన మంచి సాహిత్యం గల పాటలేవైనా తనకు వస్తే మాత్రమే పాడాలని, ఆకతాయి అల్లరి చిల్లరి పాటలు, ద్వంద్వార్ధాల పాటలు పాడకూడదని, బాగా పాడే కొత్త కుర్రాళ్ళను తన పరిధులమేరకు ప్రోత్సహించాలని అనుకునేవారు. ఘంటసాలవారు మొదటినుండీ లైట్ మ్యూజిక్ కచేరీలతో పాటు ఫక్తు కర్ణాటక సంగీత కచేరీలు దేశవ్యాప్తంగా చేయాలని ఆశపడేవారు. కానీ ఆ ఆశ ఆశగానే మిగిలిపోయినందుకు బాధపడేవారు. గాయకుడిగా సినీమా టెక్నిక్ వేరే, కర్ణాటక సంగీత బాణీ వేరే. రెండింటిని సమన్వయ పర్చి సమన్యాయం చేకూర్చడం అంత సులభమైన పనికాదు. శాస్త్రీయ సంగీత కచేరీ చేయడానికి చాలా సాధన అవసరం.  నిరంతరం ఏవో వ్యాపకాలతో క్షణం తీరికలేని ఘంటసాల మాస్టారికి అంత సమయం వుండేది కాదు. తాను ఎంత వద్దనుకున్నా నిర్మాతల ఒత్తిడిని, ఆదరాభిమానాలను  త్రోసిపుచ్చలేక అన్ని రకాల పాటలు చివరివరకూ పాడుతూనే వచ్చారు. ఎప్పుడైతే శరీరం విశ్రాంతి  కోసం తొందరచేస్తున్నదో అప్పుడే ఆయన తన జీవితంలో సార్ధకత చెందే, చిరస్థాయిగా అందరి  మన్ననలు పొందే ఉత్తమ కార్యం ఏదైనా చేసి సినీమా రంగం నుండి విశ్రాంతి పొందాలనే దృఢ నిశ్చయానికి వచ్చారు.  గాయకుడిగా సార్ధకత చెందే కార్యం ఏదని తీవ్రంగా ఆలోచిస్తున్న సమయంలో ఘంటసాలవారికి లతామంగేష్కర్ గారి భగవద్గీత గుర్తుకు వచ్చింది.  ఆవిడ భగవద్గీత కు భిన్నంగా పండిత పామరులంతా విని,  దాని సారాంశం అర్ధం చేసుకొని ఆనందించే రీతిలో రూపొందించాలని తీర్మానించారు. 
 
అందుకు గానూ ఘంటసాలవారు ...
ఏం చేసారో ఎలా ముందుకు సాగారో
వచ్చేవారం 'నెం.35, ఉస్మాన్ రోడ్' లో...

                   ... సశేషం

Sunday, January 23, 2022

నెం. 35 , ఉస్మాన్ రోడ్ (ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 2 - అరవై ఐదవ భాగం

23.01.2022 - ఆదివారం భాగం - 65*:
అధ్యాయం 2 భాగం 64 ఇక్కడ

  

నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్

1970లో ఘంటసాలవారికి భారత ప్రభుత్వం 'పద్మశ్రీ' బిరుదుప్రదానం చేసింది. ఆ మరుసటి నెల ప్రారంభంలోనే ఆయన సినీ జీవిత రజతోత్సవం సినీమా ప్రముఖుల, రాజకీయ నేతల సమ్మేళనంతో హైదరాబాద్ లో అతివైభవంగా జరిగింది. ఆ మరుసటి సంవత్సరం అదే హైదరాబాద్ లో సుప్రసిధ్ధ హిందీ నేపధ్యగాయని లతామంగేష్కర్ ఆధ్వర్యంలో ఘంటసాలవారి సంగీత కచేరీ, వారికి ఘన సన్మానం జరిగింది. తన తండ్రిగారి పేరు మీద ఏర్పాటు చేసిన ప్రతిష్టాత్మక 'దీనానాధ్ మంగేష్కర్' పురస్కారాన్ని ఘంటసాలవారికి ఇచ్చారు. ఆ సందర్భంగా లతామంగేష్కర్ తాను గానం చేసిన 'భగవద్గీత' ఎల్.పి.రికార్డులను ఘంటసాల మాస్టారికి బహుకరించారు. ప్రపంచ ప్రఖ్యాతి పొందిన గాయని చేతుల మీదుగా ఒక ఉత్తమ పురస్కారం అందుకోవడం ఘంటసాలవారికి చాలా ఆనందం కలిగించింది.

లతామంగేష్కర్ భగవద్గీత ఘంటసాల మాస్టారి మరో నూతన ఆశయానికి బీజం వేసింది. 1972 వచ్చేసరికి తెలుగు సినిమా రంగంలో అనేక మార్పులు వచ్చాయి కొత్త కొత్త నటీనటులు రాసాగారు. నూతన సంగీత దర్శకులు అవకాశాలు పొందసాగారు. సాంకేతికంగా కూడా మార్పులు చోటుచేసుకోవడం ప్రారంభమయింది. కలర్ సినిమాలు ఎక్కువైనాయి. చిత్రనిర్మాణం అధికమయింది. ఈ రకమైన నూతన పరిణామాలు సంగీత రంగంలోనూ కనిపించాయి.  సంగీత సరళి మారుతూ వచ్చింది. మల్టీ ఛానల్ రికార్డింగ్ సిస్టమ్ వచ్చింది. దానితో లైవ్ రికార్డింగ్ తో పాటూ ట్రాక్ మిక్సింగ్ సౌకర్యాలు ఎక్కవయాయి.  ట్రాక్ సింగర్స్ కు కొత్త జీవనోపాధి కలిగింది. ఆర్కెస్ట్రేషన్ లో కూడా ధ్వని ప్రధాన వాద్య పరికరాల ప్రాముఖ్యత పెరిగింది.

1972లో ఓ 25 సినీమాలలో ఘంటసాల మాస్టారు దాదాపు నూరు పాటలు, పద్యాలు పాడారు.  వాటిలో ముఖ్యమైనవి - భార్యాబిడ్డలు, సంపూర్ణ రామాయణం, వంశోవధ్ధారకుడు, మంచోరోజులొచ్చాయి, శ్రీకృష్ణాంజనేయ యుధ్ధం, దత్తపుత్రుడు, మేనకోడలు, పండంటి కాపురం, విచిత్రబంధం, కులగౌరవం, బడిపంతులు, కాలంమారింది, బాలభారతం, కొడుకు కోడలు, వంటి చిత్రాలలో పాడిన పాటలు ఘంటసాలవారికి మంచి పేరునే తెచ్చిపెట్టాయి. ఈ నాటీకీ ఆ పాటలు ప్రచారంలోనే వున్నాయి. 

ఆ సంవత్సరంలో ఘంటసాల మాస్టారి సంగీత దర్శకత్వంలో వచ్చిన చిత్రాలు  రెండు. అవి - వంశోధ్ధారకుడు, మేనకోడలు, మొదటి చిత్రంలో శోభన్ బాబు , రెండవచిత్రం లో కృష్ణ హీరోలు. వంశోధ్ధారకుడు సినీమా మాధవీ ప్రొడక్షన్ ఆంజనేయులుగారిది. ఈ చిత్రంలోని 'నువ్వు నవ్వు జతగా', 'నానీ నా పేరును నిలపాలి' పాటలు అందరినోటా వినిపించాయి.

నానీ నా పేరును నిలపాలి - వంశోద్ధారకుడు

ఈ 'నానీ నా పేరును నిలపాలి' పాటను తననుద్దేశించే పాడినట్లుగా భావించుకుంటూ ఘంటసాలవారి రెండవ కుమారుడు ఘంటసాల రత్నకుమార్ తన ప్రతీ సంగీత కార్యక్రమంలో ఈ పాటను పాడుతూ తండ్రిగారిని గుర్తుచేసుకునేవాడు. ఘంటసాలగారు మాధవీ ప్రొడక్షన్స్ కు చేసిన ఆఖరి చిత్రం ఇదే. 

మేనకోడలు చిత్రంలో దాశరధి వ్రాసిన ' 'తిరుమల మందిర సుందరా' పాట ఘంటసాలవారికి గాయకుడిగా , సంగీతదర్శకుడిగా మంచిపేరునే తెచ్చిపెట్టింది. సినీమాలో ఈ పాటను సుశీలగారు పాడగా జమున మీద చిత్రీకరించారు. 

తిరుమల మందిర సుందరా - మేనకోడలు

తిరుపతి వెంకటేశ్వరుడికి సంబంధించిన గీతం కావడం వలన ఇదే పాటను ఘంటసాలగారు కూడా పాడేందుకు ఆసక్తి చూపారు. ఆ పాటను సినీమాతో సంబంధం లేకుండా  రికార్డు చేసి విడుదల చేసారు. ఈనాటికీ ఆ  రెండు పాటలు  అందరూ పాడుతూనే వున్నారు. 1960లకు ముందెప్పుడో పాడిన 'ఏడుకొండల సామీ ఎక్కాడున్నావయ్యా' మొదలుకొని 'తిరుమల మందిర సుందరా' వరకు తిరుపతి వేంకటేశ్వరుని మీద ఘంటసాల వెంకటేశ్వరుడి గానాభిషేకం కొనసాగుతూనే వచ్చింది.  నాటి నుండి నేటివరకూ ఆ భక్తి సంగీతామృతంతో తెలుగు శ్రోతలంతా పరవశత్వం చెందుతూనే వున్నారు.

సుప్రసిధ్ధ దర్శకుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి దాసరి నారాయణ రావు గారు, ఘంటసాలగారు కలసి పనిచేసిన ఏకైక చిత్రం మేనకోడలు. దాసరి నారాయణరావుగారు ఈ చిత్రానికి సహాయ దర్శకుడు. డైరెక్టర్ బి.ఎస్.నారాయణగారికి అసిస్టెంట్. ఆ హోదాలో ఆయన పాటల కంపోజింగ్ సమయంలో మాస్టారిని కలసి సన్నివేశాల గురించి క్షుణంగా వివరించేవారు. దాసరి కథ, సన్నివేశం చెప్పే తీరుకు, అత్యుత్సాహానికి ఘంటసాలవారు ముచ్చటపడి ఆసక్తిగా వినేవారు.   ఈ సినీమా విడుదలకు ముందే దాసరి దర్శకత్వంలో 'తాతా మనవడు' చిత్రం విడుదలై ఘనవిజయం సాధించింది. రాజబాబును హీరోను చేసింది. ఈ రెండు సినీమాలు 1972 లోనే రిలీజ్ అయాయి. మేనకోడలు తర్వాత దాసరి నారాయణరావు, ఘంటసాల కలయిక లో మరే సినీమా రాలేదనే అనుకుంటున్నాను.

1972 లో రిలీజైన వంశోధ్ధారకుడు, మేనకోడలు చిత్రాల తర్వాత ఘంటసాల మాస్టారి చేతిలో రామవిజేతా వారి 'రామరాజ్యం' తప్ప వేరే సినీమాలు లేవు. గౌతమీ రామబ్రహ్మంగారు, లలితా శివజ్యోతి శంకరరెడ్డిగారు, టి.గోపాలకృష్ణగారి సినీమాలు రావచ్చని అనుకునేవారు. 

గౌతమీ రామబ్రహ్మంగారు ఆలీబాబా 40 దొంగలు చిత్రం తర్వాత ఒక క్రైమ్ సబ్జెక్ట్ మొదలెట్టారు. కారణాలేమిటో నాకు తెలియవు కానీ, ఆ సినిమాకు సంగీత దర్శకుడిగా సత్యంగారిని నియమించుకున్నారు. ఎవరు ఎవరిని సంగీతానికి పెట్టుకున్నా, ఆయనే వద్దంటే తప్ప, పాటలు పాడించుకోవడానికి ఘంటసాల మాస్టారి వద్దకే రావాలి.  ఆనాటికి నూతనగాయకుల ఉనికి అంతంతమాత్రంగానే వుండేది.

ఘంటసాలవారు సంగీత దర్శకత్వం చేయకపోతే ఇబ్బందులపాలయేది మా నాన్నగారిలాటి ఒకరిద్దరు మాత్రమే.

టి.గోపాలకృష్ణగారు 'వస్తాడే మా బావ' చిత్రానికి ప్రారంభోత్సవం చేసి మాస్టారి చేత కంపోజింగ్ మొదలెట్టారు. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు వ్రాసిన పాట 'వాగూ ఓ కొండ వాగూ' అనే పి.సుశీలగారితో పాడిన  యుగళగీతం మాత్రం మాస్టారు రికార్డు చేసారు. తర్వాత నిర్మాణ కార్యక్రమాలు అంత చురుకుగా సాగలేదు. 

వాగు ఓ కొండవాగు - వస్తాడే మా బావ

రహస్యం' అపజయం తర్వాత మరో సినీమా మొదలెట్టడానికి శంకరరెడ్డి గారికి మరో ఐదేళ్ళు పట్టింది. ఆయన సినీమాలన్ని భారీగా పంచవర్ష ప్రణాళికలా తాపీగా సాగుతాయి. ఈసారి ఆయన ఒక పౌరాణిక వర్ణచిత్రం మొదలెట్టారు. అదే 'సతీ సావిత్రి' . విభిన్న తరహా పాత్రలంటే మోజుపడే ఎన్.టి.ఆర్ ఈ చిత్రంలో యమధర్మరాజు. వాణిశ్రీ, సావిత్రిగా, కృష్ణంరాజు సత్యవంతుడిగా నటిస్తారని తెలిసింది. ఘంటసాల మాస్టారే సంగీతం. అయితే ఈ సినీమాలలోని పాటలేవీ వెంటవెంటనే రికార్డ్ చేయబడలేదు. మధ్యమధ్యలో మాస్టారికి సైనస్ కారణంగా చిన్న చిన్న అనారోగ్యాల వలన  ఎప్పుడు  ఏ పనులుంటాయో తెలియని స్థితి ఏర్పడింది. సతీ సావిత్రి సినిమా కోసం ఓ రెండు పాటలను ఒక శ్లోకాన్ని ఘంటసాలమాస్టారు కంపోజ్ చేసివుంచారు. బయటవూళ్ళ కచేరీలు కూడా ఏవీ వుండేవి కావు. 

ఇటువంటి ఇబ్బందికర సమయంలో మా నాన్నగారు జీవనోపాధికి మార్గాలు ఇతరత్రా, ఘంటసాలవారి అనుమతితోనే, అన్వేషించక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఢిల్లీలో జరిగే తమ కూచిపూడి నాట్య కార్యక్రమంలో పాడడానికి  రమ్మని డా.వెంపటి చిన సత్యం కోరారు. అప్పటికి రికార్డింగ్ పనులేవి లేక,  ఆయన మాటను కాదనలేక  వారి బృందంతో ఢిల్లీ వెళ్ళి మొదటిసారిగా నృత్యకార్యక్రమంలో పాడారు. ఘంటసాలవారి దగ్గర సహాయకుడిగా చేరిన తర్వాత ఇతరుల వద్ద పనిచేయడం అదే మొదటిసారి. మా నాన్నగారు ఢిల్లీ వెళ్ళి వచ్చేసరికి 'సతీ సావిత్రి' కోసం కంపోజ్ చేసిన పాట 'ఓం నాదబిందు కళాధరీ' పాట ' శ్రీవాగ్దేవీ మహాకాళీ' శ్లోకం  రికార్డింగ్ పూర్తి అయపోయింది. 

నాద బిందు కళాధరీ - సతీ సావిత్రి

ఆ రికార్డింగ్ లలో పాల్గొనే అవకాశం మా నాన్నగారు కోల్పోయారు. ఆ తర్వాత ఆ సినీమా నిర్మాణ కార్యక్రమాలు మూలబడ్డాయి. 

ఈ సందర్భాన్ని అవకాశంగా తీసుకొని తాను చేయాలనుకున్న బృహత్ ప్రణాళిక గురించి ఘంటసాల మాస్టారు తీవ్రంగా ఆలోచించడం మొదలెట్టారు.

ఆ విశేషాలేమిటో వచ్చే వారం చూద్దాము ... 
                                ...సశేషం

Sunday, January 2, 2022

నెం. 35 , ఉస్మాన్ రోడ్ (ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 2 - అరవైనాలుగవ భాగం

02.01.2022 - ఆదివారం భాగం - 64:

అధ్యాయం 2  భాగం 63 ఇక్కడ


నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్


"ఏ దేశమేగినా ఎందు కాలిడినా... పొగడరా నీ తల్లి భూమి భారతిని"

1971 అక్టోబర్ 9న వెస్ట్ జర్మనీ చేరిన ఘంటసాలవారి బృందం తమ  విదేశీయానంలోని మొదటి సంగీత కచేరీని పదవ తారీఖున గొటింజెన్ నగరంలోని పెడగోగియా ఇన్స్టిట్యూట్ ఆడిటోరియంలో జరిపారు. జర్మన్ శ్రోతలే అధిక సంఖ్యలో హాజరయి ఘంటసాలవారి సంగీతాన్ని ఆద్యంతం ఆస్వాదించి ఆనందించారు. భాష తెలియకపోయిన భారతీయ సంగీతంలోని భావం, శ్రుతి లయలు, ఘంటసాలవారి గాత్రంలోని మార్దవం, గంభీరత అక్కడి శ్రోతలనెంతో ఆకట్టుకున్నాయి. అనుకున్న సమయం కంటే ఎక్కువసేపు కచేరీ జరిపారట. ఈ సంగీత కచ్చేరీ ద్వారా వచ్చిన మొత్తాన్ని ఒక సత్కార్యం కోసం ఉపయోగించారు.

ఈస్ట్ పాకిస్థాన్ నుండి తరలివచ్చిన శరణార్ధుల సంక్షేమం కోసం వెస్ట్ బెంగాల్ ప్రభుత్వానికి తమ విరాళంగా కార్యనిర్వాహకులు, ఘంటసాల బృందం సమర్పించడం అందరికీ ఎంతో ఆనందాన్ని కలిగించింది. స్వదేశంలోనే కాక విదేశాలలో కూడా ఘంటసాలవారు తన ఔదార్యాన్ని సత్కార్యాలపట్ల తనకు గల భక్తి శ్రధ్ధలను చాటిచూపారు. అక్కడ ఘంటసాలవారికి జర్మన్ సంగీతాభిమానులు ఏర్పడి తర్వాత కాలంలో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపేవారు. ఘంటసాలవారి బృందం గొటింజెన్ నుండి ఫ్రాంక్ఫర్ట్ వెళ్ళేప్పుడు అనేకమంది జర్మన్ విద్యార్ధులు రైల్వే స్టేషన్ కు వచ్చి ఉత్సాహంగా వీడ్కోలు చెప్పి ఘంటసాలవారి ని తిరిగి జర్మనీలో పాడాలని మరీమరీ కోరారట. అలాగే ఫ్రాంక్ఫర్ట్ ఎయిర్ పోర్ట్ లో కూడా అధిక సంఖ్యలో అక్కడి భారతీయులు వచ్చి వీడ్కోలు పలకడం, తన తొలి విదేశీ కచేరీ ఎటువంటి అవాంతరాలు లేకుండా దిగ్విజయం గా జరగడం ఘంటసాలవారికి, ఇతర బృందానికి ఎంతో ఆనందం కలిగించింది.

ఫ్రాంక్ఫర్ట్ నుండి లండన్ వచ్చిన ఘంటసాల మాస్టారికి, వారి బృందానికి శ్రీమతి టంగుటూరి సూర్యకుమారిగారు  తన మిత్రులతో వచ్చి ఘనస్వాగతం ఇచ్చారు. అక్టోబర్ 11న లండన్ లో శ్రీమతి సూర్యకుమారి నిర్వహిస్తున్న నృత్య కళాశాలలో ఘంటసాలవారి గౌరవార్థం ఒక అభినందన సభను, సంగీత కచేరీని ఏర్పాటు చేశారు.  ఆ సభకు సంగీత నృత్యాభిమానులే హాజరు కావడం వలన వారంతా  భారతీయ సంగీతాన్ని గురించి కొంత అవగాహన కలిగినవారే కావడంతో వారంతా ఘంటసాలవారి సంగీతం వారిని అమితంగా ఆకర్షించింది. పదే పదే అడిగి మరీ పాడించుకున్నారట. అక్కడి వారి సంగీతాభిలాషకు, ప్రశంసలకు ఘంటసాలవారు ఎంతగానో చలించిపోయారట. తరచూ లండన్ వచ్చి మరింత పెద్ద బహిరంగ స్థలాలలో పాడాలని మరీ మరీ కోరడం ఘంటసాలవారి కి రెట్టింపు ఉత్సాహాన్ని కలిగించింది. లండన్ లో తనకు, తన వాద్య బృందానికి లభించిన ఆదరణతో పొంగిపోయిన ఘంటసాలవారు రెట్టింపు ఉత్సాహంతో యునైటెడ్ స్టేట్స్ వేపు పయనించారు. ఈ పర్యటనలో అధిక సంఖ్యలో కచేరీలు ఏర్పాటు అయినవి యునైటెడ్ స్టేట్స్ లోనే. 

ఘంటసాలవారు తమ విదేశీ పర్యటనలో ఎటువంటి సంగీతాన్ని వినిపించాలనే విషయంలో చాలా స్పష్టంగానే వున్నారు. భారతీయ సంగీతం, ముఖ్యంగా మన తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు దర్పణం పట్టే కర్ణాటక, హిందుస్థానీ సంగీత రీతులలో చేయబడిన గీతాలను, లలిత, శృంగార, జానపద రీతులలో బహుళ జనాదరణ పొందిన తెలుగు చిత్రగీతాలను,  అన్నమయ్య, జయదేవ, రామదాసు భక్తి సంగీత గీతాలను తన విదేశీ కచేరీలలో సమయ సందర్భాలననుసరించి గానం చేశారు. వివిధ ప్రక్రియలతో కూడిన ఘంటసాలవారి సంగీతం వారు వెళ్ళిన ప్రతీ స్థలంలోనూ అక్కడి సంగీతాభిమానులను విశేషంగా ఆకర్షించింది. అలాగే  తన వాద్యబృందంలోని సితార్ జనార్దన్, ఫ్లూట్ నంజప్ప, సంగీతరావు హార్మోనియం, ప్రసాద్-మురుగేశన్ల తాళ వాద్య ప్రతిభ రసజ్ఞుల మెప్పులను, ప్రశంసలందుకున్నట్లు చెప్పారు. 

ఈ బృందానికి మరొక ముఖ్య ఆకర్షణ నేరెళ్ళ వేణు మాధవ్ గారి మిమిక్రి. మన తెలుగు, హిందీ నటుల, గాయకుల గాత్రాలనే కాక హాలీవుడ్ నటుల గాత్రాలను అనుకరించి  బెన్ హర్ , టెన్ కమాండ్మెంట్స్, క్లియోపాట్రా  వంటి భారీ చిత్రాలలో వచ్చే యుధ్ధ సన్నివేశాలలోని వినవచ్చే డైలాగ్స్, వాద్యాల ధ్వనులను ఏకకాలంలో పలికించి  వెళ్ళిన చోటల్లా విదేశీ ప్రేక్షకులను ఆశ్చర్యసంభ్రమాలలో ముంచెత్తేవారని చెప్పేవారు. 

🌅

1971 అక్టోబర్ 31న ఘంటసాల మాస్టారు తన బృందంతో న్యూయార్క్ చేరుకున్నారు. ఘంటసాలవారి నార్త్ అమెరికా పర్యటనను పురస్కరించుకొని అక్కడి స్టూడియోలో మాస్టారి తొలి పలుకులతో పాటు  మరో ఎనిమిది పాటలను పాడగా రికార్డ్ చేసారు. అవి తర్వాత లాంగ్ ప్లేయింగ్  " గోల్డెన్ రికార్డ్" గా  విడుదలయింది. ముందుగా, శ్రీ రాయప్రోలు సుబ్బారావుగారి "ఏ దేశమేగినా, ఎందుకాలిడినా, ఏ పీఠమెక్కినా, ఎవ్వరెదురైనా పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గర్వమ్ము..."అన్న రాయప్రోలువారి మాటలను తలచుకుంటూ అమెరికాలోని తెలుగు సోదరులకు ఆవేశపూరితమైన స్ఫూర్తిని కలుగజేశారు. 

"అమెరికాలో ఉన్న తెలుగువారికి ఘంటసాలవారి సందేశం" 

ఆ తర్వాత పాడిన ఎనిమిది గీతాలు తన స్వంత స్వర రచనలో చేసిన పాటలనే ఎన్నుకున్నారు.  ఇతర సంగీత దర్శకుల పాటలేవీ ఈ రికార్డ్ లో లేకుండా చూసి జాగ్రత్త వహించారు.  ఆ గోల్డెన్ రికార్డ్ ఒక ప్రక్క - *వినాయక చవితి చిత్రం నుండి తన ఫేవరిట్ గీతం 'దినకరా శుభకరా',

"దినకరా శుభకరా"

*జయదేవుని అష్టపది 'యారమితా వనమాలినా', 

"యారమితా వనమాలినా"

*అన్నమాచార్యులవారి 'కొలనిదోపరికి గొబ్బిళ్ళో,

"కొలని దోపరికి గొబ్బిళ్ళో"

*కంచెర్ల గోపన్న( భక్త రామదాసు) గారి 'నను బ్రోవమని చెప్పవే' పాటలు వున్నాయి. 

"నను బ్రోవమని చెప్పవే"

అదే రికార్డ్ లో రెండవ ప్రక్క - *త్యాగరాజకీర్తన 'చలమేలరా సాకేతరామా', *జరిగిన కథ' చిత్రంలోని 'భలేమంచి రోజు', *'నిర్దోషి' చిత్రంలోని 'సింగారి చెకుముకి రవ్వ',

"సింగారి చెకుముకి రవ్వ"

*'బ్రతుకు తెరువు' లోని 'అందమె ఆనందం' పాటలు వున్నాయి.

వినాయక చవితి సినిమా విడుదలైన నాటినుండి తన ఆఖరి కచేరీ వరకూ ప్రతీసారి తన కచేరిని 'దినకరా శుభకరా' తో ప్రారంభించి 'బ్రతుకు తెరువు' లోని 'అందమె ఆనందం' పాటతో ముగించేవారు. ఈ మధ్యలో మరెన్నో పాత,  కొత్త సినీమా పాటలు పాడినా ఈ రెండు పాటలు లేకుండా వారి కచేరీ ఏది జరగలేదు. ఆ సంప్రదాయాన్నే ఘంటసాల మాస్టారు అమెరికాలో కూడా అనుసరించారు.

"రాధికా కృష్ణా రాధికా"

అమెరికా, కెనడా దేశాలలోని ప్రముఖ నగరాలన్నింటిలో అక్టోబర్ 13 నుండి నవంబర్ 1వ తేదీ వరకు వరసగా దాదాపు పదిహేను కచేరీలు బహిరంగ స్థలాలోను, స్థానిక  భారతీయుల గృహాలలోనూ చేసి ఘంటసాలవారు అక్కడి భారతీయులందరికీ మరింత ఆప్తుడు, ఆత్మీయుడు అయ్యారు. 

"ఉలగే సమాదాన ఆలయమా"

వారంతా ఘంటసాలవారిని, వారి బృందాన్ని చిరుకానుకలతో సత్కరంచారు. 

ఘంటసాలవారి బృందం తొలిసారిగా విదేశాలంటే వెళ్ళింది కానీ ఆ పర్యటన లో వారెవరికీ తగినంత ఫారిన్ కరెన్సీ లభ్యపడలేదు. ఒక్కొక్క సభ్యుడికి కేవలం ఎనిమిది డాలర్లు మాత్రమే ఇచ్చారు. ఆ ఎనిమిది డాలర్లతో ఆ యా దేశాలలోని వింతలే చూస్తారా ? లేక ఆనాటికి ఇండియా లో దొరకని అపురూప వస్తవులే కొంటారా ? వెళ్ళినచోట్లలోని వింతలు విశేషాలు చూసి ఆనందించడం వరకే వీరంతా చేయగలిగారు. అయితే అక్కడి కళాభిమానులు కొందరు బృంద సభ్యులకు విడివిడిగా తమకు తోచినంత డాలర్ల రూపంలో ఇచ్చి సహకరించారు. అలాంటి కానుకలతో ఏవో చిన్న చిన్న వస్తువులు  ఇండియా లోని తమవారికోసం కొనుక్కోగలిగారు.  స్థానిక నిర్వాహకులు వీరందరినీ నయగారా ఫాల్స్, డిస్నీలాండ్, రేడియో హాల్   వంటి ఎన్నో పర్యాటక కేఃద్రాలను సందర్శించే ఏర్పాట్లు చేసారు. నిర్దిష్టమైన ప్రణాళికలతో ఎక్కడా ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఘంటసాలవారి విదేశీ పర్యటన జరగడానికి అందరూ కలసికట్టుగా కృషిచేసారు.  ఈ దేశాలలో జరిగిన ప్రతీ సంగీత కచేరీ విదేశీ శ్రోతలకు, మన భారతీయులకు చాలా తృప్తిని కలిగించింది. వారందరూ కూడా ఘంటసాలవారు మరల మరల తమ దేశాలలో సంగీత కచ్చేరీ చేయాలని కోరుకుంటూ హృదయపూర్వకంగా ప్రశంసలందించారు. 

ప్రపంచ దేశాల దౌత్య ప్రతినిధులతో  నిండిన యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్లో తమ ప్రతిభను చాటుకునే అవకాశం అతికొద్దిమందికే లభిస్తుంది. అటువంటి అరుదైన  గొప్ప అవకాశం ఘంటసాల మాస్టారికి, ఆయనతో వున్న కళాకార బృందానికి  లభించింది. UNO లో జరిగిన ఘంటసాలవారి కచ్చేరికి దేశదేశాల ప్రతినిధులంతా విచ్చేసి వారి అద్భుత గానాన్ని విని ఆనందించారు. ఘంటసాలవారి గాన ప్రతిభను ప్రశంసిస్తూ వారికి అతి ప్రతిష్టాత్మకమైన  'శాంతి పతకం' బహుకరించారు.  వాద్యబృందాన్ని కూడా సముచితంగా సత్కరించి కానుకలు అందజేశారు. ఈ సంఘటన తన జీవితంలో మరువలేని మధురక్షణంగా ఘంటసాలవారు భావించేవారు. యునైటెడ్ స్టేట్స్ లో ఆఖరుగా నవంబర్ ఒకటవ తేదిన  న్యూయార్క్ లోని తెలుగు సాంస్కృతిక సంఘంవారు ఘంటసాలవారికి, వారి  వాద్యబృందానికి ఒక ఘనమైన సన్మాన సభ ఏర్పాటు చేసి తమ కృతజ్ఞతలు తెలియజేశారు. అమెరికాలో జరిగిన ఘంటసాల వారి కచ్చేరీలు అన్నింటికి స్థానిక భారతీయులే కాక మూడు వందలు,  నాలుగువందల మైళ్ళ దూరంలో వున్న తెలుగువారంతా తమ కుటుంబ సభ్యులతో ఎంతో ఉత్సాహంతో వచ్చి విని ఆనందించారట.

నవంబర్ 1న పారిస్  బయల్దేరిన ఘంటసాలవారికి న్యూయార్క్ తెలుగువరాంతా ఎయిర్ పోర్ట్ కు వచ్చి ఘంటసాలవారికి, వారి బృందానికి ఘనమైన విడ్కోలు పలికారు. పారీస్ లో ఘంటసాలవారి కచేరీలు ఏవీ ఏర్పాటు చేయబడలేదు. కేవలం రెండురోజులు విశ్రాంతి, ఆ సమయంలో  ఈఫిల్ టవర్  వంటి ముఖ్యమైన పర్యాటక స్థలాలు సందర్శన కోసం మాత్రం కేటాయించారు. 

ఘంటసాలగారు ఏ దేశం వెళ్ళినా ఎంతటి ఉన్నత వ్యక్తులను కలసినా తన సహజ వేష భాషలను మార్చుకోలేదు. ఎక్కడికి వెళ్ళినా తన తెల్ల లుంగీ, తెల్ల చొక్కాతోనే హుందాగా వెళ్ళేవారు. అలాగే కచ్చేరీలు చేసేప్పడు కూడా. సూటూ బూట్లతో వేదికల మీదకు వెళ్ళడమనేది ఆయనకు అలవాటులేదు. సశాస్త్రీయంగా వేదిక మీద కూర్చోనే తన సంగీత కచేరీలు చేసారు. మన సంస్కృతి సంప్రదాయాలను తూచ పాటించేవారు.

ఘంటసాలగారి వంటి అపురూప మధురగాయకుడిని చూడడానికి వచ్చేవారు వారిచేత పాడించక వదులుతారా? మాస్టారిని తమ తమ ఇళ్ళకు విందుకు ఆహ్వానించి వారిళ్ళలోనే చిన్నపాటి కచేరీలు చేయించారట. అభిమానుల సంతృప్తికోసం పాడేందుకు మాస్టారు ఎప్పుడూ సిధ్ధమే.

ఎయిర్ ఇండియా సంస్థలో శ్రీ డి.ఎన్.లింగం ఉన్నతాధికారిగా వుండేవారు. ఆయన, ఆయన మిత్ర బృందం అంతా కలసి  ఘంటసాలవారి కచ్చేరీని కువైట్ లో నవంబర్ 5 వ తేదీన ఏర్పాటు చేసారు. వారి విదేశీ పర్యటనలో ఇదే చివరి కచేరీ. కానీ దురదృష్టవశాత్తు వీరు బయల్దేరే సమయానికి పారీస్ లో దట్టమైన మంచు కురిసి విమానాల రాకపోకలకు అంతరాయం కలిగింది. సకాలానికి కువైట్ ఫ్లైట్ అందుకోలేక పోవడంతో కువైట్ కచేరీ కాన్సిల్ చేయవలసి వచ్చింది. నిర్వాహకులు , ఘంటసాల మాస్టారు చాలా నిరాశచెందారు.  కువైట్ లోని ఘంటసాలవారి అభిమానులంతా ఎయిర్ పోర్ట్ కు వచ్చి 5వ తేదీ రాత్రి బొంబాయి ఫ్లైట్ ఎక్కేంతవరకు వారితోనే వుండి ఉత్సాహంగా వీడ్కోలు పలికారు. కువైట్ వాసులకోసం మరల మరొకసారి పర్యటన జరపి సంగీత కచేరీ చేయాలనే ఘంటసాలవారి కోరిక మరింక నెరవేరలేదు.

కువైట్ నుండి బయల్దేరి మర్నాడు ఉదయానికి ఘంటసాలవారి బృందం బొంబాయి చేరుకున్నారు. 1971 నవంబర్ 6 మధ్యాహ్నానికి ఘంటసాలవారు, వారి బృందం సురక్షితంగా మద్రాస్ వచ్చి చేరారు. ఘంటసాలవారికి ఘన స్వాగతం పలకడానికి సినీ ప్రముఖులెందరో మద్రాస్ విమానాశ్రయానికి వచ్చారు.

పదిమంది సభ్యులతో అమెరికాలో లలిత సంగీత కచేరీ జరిపిన తొలి భారతీయ గాయకుడిగా ఘంటసాలవారి గురించి చెప్పుకునేవారు. విదేశాలలో తెలుగు సంగీతాన్ని వినిపించాలనే ఘంటసాల వారి కోరిక సాఫల్యం చెందింది. మాస్టారు కూడా చెప్పలేనంత ఆనందాన్ని పొందారు. 

"అందమే ఆనందం ఆనందమె జీవిత మకరందం"

ఇప్పుడు రోజులు మరిపోయాయి. విదేశాలలో పర్యటించడానికి ప్రతిభావ్యుత్పత్తుల అవసరమేలేదు. ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళి తన గొంతు వినిపించే సౌకర్యాలు వచ్చేసాయి.

నాలుగు వారాల విదేశ యాత్ర ముగించుకు వచ్చిన ఘంటసాల మాస్టారు తన వృత్తి వ్యాపకాలు మొదలెట్టారు. తన కోసం ఎదురు చూస్తున్న నిర్మాతలకు ఒక్కొక్కరికీ కాల్షీట్లు ఇచ్చి తాను పాడవలసిన పాటల ట్రాక్ మిక్సింగ్ లకు, రికార్డింగులకు హాజరుకావడం మొదలెట్టారు.

ఆ విశేషాలన్నీ వచ్చే వారం 'నెం.35, ఉస్మాన్ రోడ్' లో చూద్దాము.

              ...సశేషం