visitors

Sunday, May 30, 2010

పట్రాయని సీతారామ శాస్త్రి- సాలూరు చినగురువుగారు

సంగీత సాహిత్యరచన చేసి గాత్రజ్ఞులై దానిని గానం చేసేవారు వాగ్గేయకారులు. ఎందరో వాగ్గేయకారులు మన సంగీత సాహిత్యాలకు ఉత్కృష్ట స్థాయిని కల్పించారు. ఇరవయ్యవ శతాబ్దపు ఉత్తరార్థానికి చెందిన సంగీత విద్వాంసుడు, రసవద్గాయకుడిగా ప్రజామోదం పొందిన పట్రాయని సీతారామశాస్త్రిగారు అటువంటి వాగ్గేయకారుల కోవకు చెందుతారు.

గేయకర్తయై, ఒక గొప్ప సంగీత విద్వాంసుని కుమారుడై, స్వయంగా గొప్ప సంగీత స్రష్టయై, ఒక సుప్రసిద్ధ గాయకుడికి  గురువర్యుడై  సంగీత సాహిత్యాలను సుసంపన్నం చేసిన పట్రాయని సీతారామశాస్త్రి గారి 110 వ జయంతి సందర్భంగా పొద్దు సమర్పిస్తున్న కానుక – పట్రాయని సుధారాణి రచించిన వ్యాసం “సాలూరు చినగురువుగారు”



సాలూరు చినగురువుగారు


పట్రాయని సుధారాణి
సంగీత సాహిత్యరచన చేసి గాత్రజ్ఞులై దానిని గానం చేసేవారు వాగ్గేయకారులు. తెలుగు సాహిత్యచరిత్రలో వాగ్గేయకారులకు ఎంతో ప్రాధాన్యం ఉంది. క్షేత్రయ్య, అన్నమయ్య వంటివారు శృంగార భక్తిరస ప్రధానములైన రచనలు చేసి, గానం చేయడంలో ప్రసిద్ధులైన వారు. అలాగే జయదేవుడు, నారాయణ తీర్థులు, ముత్తుస్వామి దీక్షితులు, త్యాగరాజస్వామి వంటి ఎందరో మహానుభావులు మన సాహిత్యాన్ని, సంగీత శాస్త్రాన్ని ఉత్కృష్టమయిన స్థితిలో నిలిపిన వాగ్గేయకారులు.


ఇరవయ్యవ శతాబ్దపు ఉత్తరార్థానికి చెందిన సంగీత విద్వాంసుడు, రసవద్గాయకుడిగా ప్రజామోదం పొందిన పట్రాయని సీతారామశాస్త్రిగారు అటువంటి వాగ్గేయకారుల కోవకు చెందుతారు.


పట్రాయని  సీతారామశాస్త్రిగారిని గొప్ప సంగీత విద్వాంసుడిగా, సాలూరు చినగురువుగారు అనే పేరుతో ఉత్తరాంధ్ర ప్రాంతాలలో చాలామంది ఎరుగుదురు. మధుర గాయకుడు ఘంటసాల వేంకటేశ్వరరావుగారికి విజయనగరంలో సంగీతవిద్య నేర్పిన గురువుగారిగా  మరికొంత మందికి తెలుసు. 2010 సంవత్సరం సీతారామశాస్త్రిగారి 110వ జయంతి సందర్భంగా మే 24వ తేదీన మద్రాసు మ్యూజిక్ అకాడెమీ మినీహాల్ లో శాస్త్రిగారికి స్వరనివాళినర్పిస్తూ జయంత్యుత్సవ సభను నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. శాస్త్రిగారి స్వరరచనలకు ప్రాచుర్యం కల్పించడం ఈ కార్యక్రమం ఉద్దేశం. ఈ నేపథ్యంలో సీతారామశాస్త్రిగారికి సంబంధించిన జీవితవిశేషాలను, రచనలను ఈ తరం వారికి పరిచయం చేసే ఉద్దేశంతో ఈ వ్యాసరచన సాగింది.


సీతారామశాస్త్రిగారి జీవన రేఖలు

పట్రాయని సీతారామశాస్త్రిగారు పట్రాయని నరసింహశాస్త్రిగారి కుమారుడు. 


ఉత్తరాంధ్ర ప్రాంతాలకు చెందిన సాలూరు, విజయనగరం సంస్థానాలలో, ఒరిస్సారాష్ట్రంలోని బరంపురం, పర్లాకిమిడి వంటి ప్రాంతాలలో దాక్షిణాత్య సంగీత విద్వాంసులుగా ప్రసిద్ధి పొందిన పట్రాయని నరసింహశాస్త్రిగారు ‘సాలూరు పెదగురువుగారు’ గాను, పట్రాయని సీతారామశాస్త్రిగారు ‘సాలూరు చిన గురువుగారు’ గాను ఉత్తరాంధ్ర ప్రజల ఆదరాన్ని పొందారు.


సీతారామ శాస్త్రిగారి బాల్యం

పట్రాయని సీతారామశాస్త్రిగారు 1900 సంవత్సరం మార్చి 20న (ఫాల్గుణశుద్ధ విదియ, ఆదివారం) జన్మించారు. అతి చిన్న వయసులోనే మాతృవియోగం కలగడం వల్ల మాతామహుల ఇంటిలోనే పది సంవత్సరాలపాటు పెదతల్లి చెల్లమ్మగారి సంరక్షణలో పెరిగారు.


మాతామహులు మధురాపంతుల కూర్మన్నగారు. మానాపురం దగ్గర గుడివాడ అగ్రహారంలో వ్యవసాయవృత్తి ఆధారంగా జీవిస్తూ ఉండేవారు. సీతారామశాస్త్రిగారిని బాల్యంలో చిట్టిబాబు అని పిలిచేవారుట. తాతగారు కూర్మన్నగారు ఇసుకలో ఓం నమః వ్రాయించి అక్షరాభ్యాసం చేయించారు. బాలరామాయణం కంఠస్థం చేయించారు. అంతకుమించి సీతారామశాస్త్రిగారు ఏ బడిలోనూ చదువుకోలేదు. ఆవులు కాస్తూ, గాలిపాటలు పాడుకుంటూ, తాతగారికి పూజాపునస్కారాలలో సహాయం చేస్తూ పదిసంవత్సరాలు వచ్చేవరకు స్వేచ్ఛామయ జీవితం గడిపారు.


పట్రాయని నరసింహశాస్త్రిగారికి ముగ్గురుపిల్లలు. వారిలో ఒక కుమారుడు, కుమార్తె చనిపోగా మిగిలిన పుత్రుడు, సీతారామశాస్త్రిగారు. కొంతకాలానికే భార్య సూరమ్మగారు కూడా స్వర్గస్థులు కావడం నరసింహశాస్త్రిగారిని తీవ్ర మానసికవేదనకు గురిచేసింది. కుమారుడిని గుడివాడ అగ్రహారంలో మామగారు కూర్మన్నగారి సంరక్షణకు వదిలి దేశాటనం ప్రారంభించారు. అత్యంత శ్రద్ధాసక్తులతో నేర్చుకొని, అప్పటికే ప్రావీణ్యం సంపాదించిన దాక్షిణాత్య సంగీతం ఆయన జీవికకు ఆధారం అయింది. ఒరిస్సాలో జమీందారీ ఆస్థానాలకు చెందిన రాజుల ఆదరణలో చాలాకాలం గడిపారు. ఘనమైన సన్మానాలను అందుకున్నారు. జరడా, పర్లాకిమిడి, చినకిమిడి, ధారాకోట, చీకటికోట ఇంకా అనేక చిన్న చిన్న సంస్థానాలు నరసింహశాస్త్రిగారిని ఆదరించాయి.


పిల్లవాడు తండ్రిదగ్గరే పెరగడం మంచిదన్న అభిప్రాయంతో మాతామహులు పదిసంవత్సరాల వయసుగల సీతారామశాస్త్రిగారిని తండ్రికి అప్పగించారు. నరసింహశాస్త్రిగారు అప్పటికి బరంపురంలో సంగీత శిక్షకులుగా కొంత మానసికంగా, ఆర్థికంగా స్థిరపడ్డారు. బరంపురంలో త్రిపాసూరి ముఖ్యప్రాణరావు, చక్రవర్తిపంతులుగారు వీరిరువురినీ అత్యంత ప్రేమానురాగాలతో ఆదరించారు.


సీతారామశాస్త్రిగారు తండ్రివెంట తిరుగుతూ ఆయన సంగీతం చెప్పుకొనే ఇళ్ళలోని విద్యార్ధులతో పాటుగా సంగీతం నేర్చుకున్నారు. ప్రత్యేకంగా తండ్రిగారు సంగీత శిక్షణ అంటూ ఇవ్వలేదు. తండ్రి చెప్పిన పాఠాలన్నీ వారి విద్యార్థులతో పాటు నిత్యపారాయణ చేసేవారు. సంవత్సరం తిరిగే సరికి సంగీత గ్రంథం కంఠస్థం అయింది. తరువాత స్వయంగా పాఠాలు చెప్పడం ప్రారంభించారు. పన్నెండవ ఏడు వచ్చేసరికి సహజమయిన ప్రతిభా వ్యుత్పత్తుల వలన బాలగురువుగా పేరు సంపాదించుకున్నారు.


బాలుడైన సీతారామశాస్త్రిగారి మీద ఏదో అవ్యాజమైన అనురాగం ఏర్పరచుకున్న ఒక వంటబ్రాహ్మణుడు, నరసింహశాస్త్రిగారికి నచ్చచెప్పి తను పనిచేసే నాళంవారి సత్రానికి తీసుకొని పోయి, తల్లికన్నా ఎక్కువగా సంరక్షించేవాడుట.


బరంపురం మంగళవారప్పేటలోని విద్యార్థి బృందంతో సీతారామశాస్త్రిగారికి అనుబంధం ఉండేది. ఒక దేవాలయంలో ఆ బృందం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తొలి కచేరి చేసి స్వర్ణ కంకణం అందుకున్నారు.


ఆ రోజుల్లో బరంపురం గొప్పవిద్యాకేంద్రం. గొప్పసాహిత్యవేత్తలు, సంగీత విద్వాంసులకు నిలయం. ఆ వాతావరణంలో ఏ మహాపండితుల, విద్వాంసుల ప్రభావం పడిందో తెలియదుకానీ, పదహారు సంవత్సరాల వయసు వచ్చేసరికి ప్రత్యేకమైన విద్యాభ్యాసం చేయకపోయినా, స్వయంగా పద్యాలు వ్రాయడం, స్వతంత్రంగా సంగీత రచన చేయడం అలవోకగా అలవడ్డాయి సీతారామశాస్త్రిగారికి.


తండ్రీకొడుకులు ఇద్దరూ ఎవరికి వారే ధనసంపాదన చేసేవారు. ఒరిస్సాలో చాలా జమీందారీలలో తండ్రి, కొడుకు కలిసి కచేరీలు చేసారు. జరడా, చీకటి కోట, చినకిమిడి, పెదకిమిడి వంటి చిన్నచిన్న సంస్థానాలు వీరిరువురినీ సన్మానించాయి. బరంపురం, జయపురం, ధారాకోట, విజయనగరం, తణుకు మొదలైన ప్రదేశాలలో అనేక సంగీత కచేరీలు చేసి ఘనసన్మానాలు, మెడల్స్ అందుకున్నారు.


సాలూరు జీవితం


నరసింహశాస్త్రిగారు, కుమారుడు సంపాదించిన ధనంలో రూపాయికి కాణీ వంతున అతని ఖర్చుకి ఇచ్చి మిగిలినసొమ్మును ఆదా చేసేవారుట. ఆవిధంగా మిగిల్చిన ధనంతో బొబ్బిలి సమీపంలోని ఆనవరం అగ్రహారం దగ్గర కొద్దిగా భూమిని కొన్నారు. వృద్ధురాలైన నరసింహశాస్త్రిగారి తల్లి ఆనవరంలోనే తన కుమార్తె వద్ద ఉండేవారు. ఆమెని చూడడానికి వెళ్లినపుడే సాలూరు, బొబ్బిలి రాజాస్థానాలను దర్శించడం, వారి కోరిక మీద సాలూరులో స్థిరపడడం జరిగింది. సాలూరులో తండ్రీ కొడుకుల సంగీత శిక్షణలో ఎందరో, గొప్ప సంగీత విద్వాంసులుగా రూపుదాల్చారు. అలనాటి ప్రముఖ చలనచిత్ర సంగీత దర్శకుడు ఆదినారాయణరావు నరసింహశాస్త్రిగారి శిష్యులే. సాలూరులో స్థిరపడేనాటికి సీతారామశాస్త్రిగారు నవ యువకులు.


సాలూరు రాజులు సవరలు. సాలూరు, ఒరిస్సా రాష్ట్రంలోని జయపురం ప్రాంతంలో ఉండేది. రాజుల భాష ఒరియా అయినా తెలుగు భాషా సాహిత్యాలమీద సంగీతం మీద చాలా అభిమానం ఆదరణ చూపేవారు. సాలూరు చిన్న సంస్థానమే అయినా కళలను ఎంతగానో ఆదరించింది. సాలూరు అధిపతులలో పదవతరానికి చెందిన లక్ష్మీనరసింహ సన్యాసిరాజు కళలకు మంచి ప్రోత్సాహం ఇచ్చాడు. అతని భార్య కృష్ణపట్ట మహాదేవి కూడా సంగీత కళానిధి. ఈ రాజుగారు సంగీతసాహిత్యాలకే గాక నాటకాలకు కూడా ప్రోత్సాహం ఇచ్చినవారు. అంతేకాక స్వయంగా నాటకాలలో వేషాలు కూడా వేసేవారు. రాజుగారు మంచి మార్దంగికులు కూడా. రాజకుటుంబాలన్నిటి తోటి శాస్త్రిగారికి ఆత్మీయమైన అనుబంధం ఉండేది.


సాలూరు రాజావారికి, సీతారామశాస్త్రిగారికి మంచి స్నేహం. రాజుగారికి నాటకాల సరదా ఉండేది. నాటకం రిహార్సులకు ఒక సమయం అంటూ ఉండేది కాదు. ఆ నాటకాలకు చినగురువుగారు హార్మోనియం వాయిస్తూ ఉండేవారు. వేళాపాళా అంటూలేని ఈ కార్యక్రమాల వల్ల ఆరోగ్యం చెడిపోతుందని తండ్రి నరసింహశాస్త్రిగారు ఆందోళన పడేవారు. ఆనాటికి ఆయన ఒకయోగిలాగ, సన్యాసి జీవితం గడిపేవారు. సాలూరులో స్థిరపడేనాటికి తండ్రీ కొడుకుల జీవన విధానంలో చీలిక వచ్చింది.


సాలూరులో కళావంతుల కుటుంబాలు ఎక్కువ. అందువల్ల అక్కడ నాట్య, సంగీత శిక్షణకు అవకాశం చాలా ఉండేది. గృహస్తుల కుటుంబాల పిల్లలకు పెదగురువుగారు, భోగంకుటుంబాల ఆడపిల్లలకు చినగురువుగారు సంగీతం చెప్పేవారు. ఏ సంఘటనల ప్రభావమో కానీ కొంతకాలానికి వేశ్యలకు సంగీతం చెప్పనని శపథం చేసుకున్నారట సీతారామశాస్త్రిగారు.


సాలూరులో స్థిరపడిన వెంటనే చినగురువుగారికి కిండాం అగ్రహారానికి చెందిన ఆయపిళ్ల లక్ష్మీనారాయణ గారి కుమార్తె మంగమ్మగారితో వివాహం జరిగింది. స్వేఛ్ఛామయ జీవితం గడుపుతున్న చినగురువుగారికి సంసారబంధం కళ్ళెం వేసింది. మానసికంగా, ఆర్థికంగా జీవితానికి కట్టుబాటు ఏర్పడింది.
జీవనభృతి కోసం పాటుపడుతున్న రోజులలో ఫీల్కానా శివరావు పంతులుగారి ఆహ్వానంపై శ్రీకాకుళంలో నివాసం ఏర్పఱచుకున్నారు. గుడివీధిలో కొంతకాలం, పాలచెట్టువీధిలో కొంతకాలం నివసించారు. అప్పటికి ముగ్గురు మగపిల్లలు సంతానం. పెద్దకుమారుడు సంగీతరావు, రెండవకుమారుడు నారాయణమూర్తి, మూడవకుమారుడు ప్రభాకరరావు. ఆఖరిపిల్లవాడు రెండు సంవత్సరాల వయసులో ఉండగా మంగమ్మగారు స్వర్గస్థులయేరు. అప్పటికి చినగురువుగారికి ఇరవై ఎనిమిది సంవత్సరాలు. పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పునర్వివాహం తలపెట్టలేదు. తల్లిలేని పిల్లలు ఒక్కొక్కరుగా మాతామహుల దగ్గరనుండి సీతారామశాస్త్రిగారి దగ్గరకు చేరారు.


శాస్త్రిగారి తండ్రి నరసింహశాస్త్రిగారు సాలూరులో లూథరిన్ చర్చి వెనక, చిన్న ఇంట్లో ఉండేవారు. సీతారామశాస్త్రిగారు పిల్లలతో పాటుగా తండ్రి వద్దకు వచ్చి సాలూరులో స్థిరపడ్డారు. ఆయన పెదతల్లిగారి కూతురు అయిన నరసమ్మగారు వీరందరి సంరక్షణభారం వహించారు.


దేశాన్ని ఆర్థిక మాంద్యం కుదిపేస్తున్న కాలం అది. ప్రజలకు గడ్డు రోజులు. చెప్పుకోదగ్గ ఆస్తిపాస్తులులేవు. డబ్బు ఖర్చుచేసి సంగీత కళని సాధన చేసేవారు అప్పటి ఆంధ్ర దేశంలో తక్కువ. అందువల్ల ధనసంపాదనకు సంగీత శిక్షణ ఇవ్వడమో, కచేరీలు చేయడమో తప్ప వేరే మార్గం లేక, దేశాలు పట్టుకుని తిరగవలసి వచ్చింది చినగురువుగారికి. రెండు మూడు మాసాల గ్రాసానికి సరిపడా డబ్బు సంపాదించి సాలూరుకు తిరిగివచ్చేవారు. సాలూరులో ఉన్న సమయంలో విద్యార్థులకు ఉచితంగా సంగీత పాఠాలు చెప్తూ ఉండేవారు.


పెదగురువుగారు నరసింహశాస్త్రిగారు సంగీతాన్ని సంప్రదాయానుసారం ఎంతో క్రమశిక్షణతో నేర్చుకున్నారు. సంప్రదాయానికి ఏ మాత్రం భంగం ఏర్పడినా ఆయన తట్టుకోలేక పోయేవారు. కానీ చినగురువుగారిది సృజనాత్మకమైన స్వతంత్రమార్గం. గానసభలలో దాక్షిణాత్య సంగీత విద్వాంసుల కచేరీలలో గాయకులు పాడిన కీర్తనలు విని, తనకి రానివి ఉంటే తన పద్ధతిలో వాటికి రాగతాళాలతో స్వంతంత్రంగా స్వరరచన చేసేవారు. సంప్రదాయమైన కీర్తనలతో పాటు తన అభిప్రాయాలను వెల్లడించే విధంగా పద్యరచనలు చేసి వాటిని ఎంతో మధురంగా గానం చేస్తూ తన సభలను జనరంజకం చేసేవారు. ఈవిధంగా చినగురువుగారి కచేరీ పద్ధతి జనాకర్షణ కలిగి, ఎంతో ప్రజాదరణకు నోచుకున్నా పెదగురువుగారికి మాత్రం అసంతృప్తి కలిగించేది. 


సంప్రదాయహాని జరుగుతోందని వ్యాకులపడేవారు. చినగురువుగారు దీన్ని పట్టించుకునేవారు కాదు. తండ్రి మరణించిన తరువాత చినగురువుగారిలో సంప్రదాయం పై కొంత అభిమానం కలిగింది.




సాలూరులోని శ్రీ శారదా గాన పాఠశాల గురించి ఇక్కడ చెప్పుకోవాలి. 


నరసింహశాస్త్రిగారు, సీతారామశాస్త్రిగారు కలిసి 1919 లోనే విద్యార్థులకు ఉచితంగా సంగీతబోధ చేయాలనే ఆశయంతో సాలూరులో శ్రీ శారదా గాన పాఠశాలను ప్రారంభించారు. పాఠశాలలో చాలామంది విద్యార్థులు ఆంధ్రదేశంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చి, సంగీతం నేర్చుకుంటూ ఉండేవారు. నరసింహశాస్త్రిగారు మరణించాక సీతారామశాస్త్రిగారు పాఠశాలను అభివృద్ధి చేయాలని సంకల్పించారు.


 పూరిల్లులా చుట్టూ వెదురు మణిగింపుతో పర్ణశాల రూపంలో ఉండేది పాఠశాల. రంగారావు పంతులుగారి సహకారంతో పర్ణశాల రూపం నుండి భవనంగా మార్చడానికి ప్రయత్నం చేసారు. కానీ ఆ ప్రయత్నం పునాదులతో ఆగిపోయింది. సీతారామశాస్త్రిగారి అనారోగ్యం వంటి కొన్ని అవాంతరాలు ఏర్పడ్డాయి. కానీ రెండేళ్ళ తరువాత శాస్త్రిగారు స్వయంగా పూనుకొని కొందరు పురప్రముఖుల సహాయంతో సాలూరు తాలూకాలోని వివిధ గ్రామాలలో పాఠశాల నిమిత్తం కచేరీలు చేసి, సాలూరు ప్రజలు ఇచ్చే అతి చిన్న మొత్తాలను విరాళాలుగా స్వీకరించి పాఠశాలను భవనరూపంలోకి మార్చారు. మొత్తానికి 1936 నాటికి సాలూరు గ్రామస్థుల సహకారంతో, చుట్టుపక్కల గ్రామాలలోని ప్రజల అండదండలతో, శాస్త్రిగారి దేశాటనలో వివిధ ప్రాంతాలలో చేసిన కచేరీలతో సంపాదించిన సొమ్ముతో పాఠశాల నిర్మాణం పూర్తయింది.





 ఆంధ్ర దేశం, ఒరిస్సా ప్రాంతాలనుంచి ఎందరో విద్యార్థులు ఎంతో శ్రద్ధగా సంగీతం నేర్చుకోవడానికి వచ్చేవారు. సంగీత విద్యార్థులలో వయోభేదం కాని, జాతి భేదాలు కాని ఉండేవికావు. అనేక వృత్తులకు చెందినవారు విద్యార్థులుగా వచ్చేవారు. పాఠాలకి ప్రత్యేకమైన వేళలు కూడా ఉండేవికావు. ఇలా నేర్చుకోవడానికి వచ్చిన విద్యార్ధులలో చాలామంది నిర్థనులే. సాలూరు ప్రజలు ఈ విద్యార్థులకు సహాయం చేసేవారు. ఇతర ప్రాంతాలనుండి వచ్చే విద్యార్థులకు  వచ్చే విద్యార్థులకు సంగీత పాఠాలు ఉచితంగా చెప్పినా, వారికి భోజన సౌకర్యాలు కల్పించడం చిన గురువుగారికి తలకు మించిన భారం అయేది.


సాలూరులో ఉన్న చిన్న ఇల్లు తప్ప వేరే ఆస్తిపాస్తులు కాని ఆధారం కానీ లేవు. గోదావరి, కృష్ణా జిల్లాల ప్రాంతాలలో గురువుగారికి చాలామంది అభిమానులు ఉండేవారు. వివాహాలకు, ఉత్సవాలకు గురువుగారు చేసే కచేరీలే జీవికకు ఆధారం.


జయపురం మహారాజు విక్రమ దేవవర్మ గారు దసరా ఉత్సవాలను అత్యంత వైభవంగా జరిపేవారు. ఉత్సవాలకు వచ్చే కళాకారులు, కవులు అందరికి సాలూరులోనే మకాం. సాలూరు రాజుగారి సహాయం, పౌరుల సహాయంతో వారందరినీ చినగురువుగారు ఆదరించేవారు. సాలూరుకు వచ్చే హరిదాసులకు కార్యక్రమాలు ఏర్పాటుచేసి, వారికి హార్మోనియంతో పక్క వాయిద్య సహకారం ఇచ్చేవారు


 
పాఠశాలను అభివృద్ధి చేయాలని, సంగీత విద్యార్థులకు ఉచిత శిక్షణతో సహా సకల సౌకర్యాలు కల్పించాలని, అనేక మంది పండితులను అధ్యాపకులుగా రప్పించి బోధన చేయాలని, భక్తి, జ్ఞాన వైరాగ్యాల ఆదర్శంలో సంగీత విద్యా ప్రచారం చెయ్యాలని సీతారామశాస్త్రిగారు ఎన్నెన్నో కలలు కన్నారు. కానీ భగవత్సంకల్పం వేరుగా ఉంది.
ఆర్థికంగా గురువుగారి కుటుంబం పడుతున్న ఇబ్బందులు తెలిసిన ఆయన శిష్యులు విజయనగరం సంగీత కళాశాలలో వోకల్ పండితుడి పదవికి దరఖాస్తు పంపించారు. తరువాత ఆ పదవిని కాదనుకోవడం చినగురువుగారి ఆత్మగౌరవానికి పరీక్షగా తయారయింది. విజయనగరంలో జరిగిన విద్వత్పరీక్షలో నెగ్గి ఆ పదవిని దక్కించుకున్నారు. 


తాను అమితంగా ప్రేమించిన తన పాఠశాలను, తనను ఆదరించిన సాలూరును వదిలివెళ్ళవలసి వచ్చింది. తన శిష్యులకు పాఠశాలను అప్పగించి విజయనగరం వెళ్లి వోకల్ ప్రొఫెసర్ ఉద్యోగంలో చేరారు. ఉద్యోగంలో ప్రవేశించడానికి సాలూరు విడిచి వెళ్లిన సందర్భంలో సాలూరు ప్రజలు శాస్త్రిగారికి ఘనసన్మానం జరిపి అశ్రు నయనాలతో ఆత్మీయమైన వీడ్కోలు పలికారు
                                                సాలూరు విద్యార్థులతో సీతారామ శాస్త్రిగారు


సాలూరులో ఆర్థికంగా ఏమాత్రం ఆసరా లభించినా శాస్త్రిగారు సాలూరు ప్రజలను, తను ప్రాణప్రదంగా భావించే పాఠశాలను విడిచి వెళ్ళేవారు కాదు. 1946 సంవత్సరంలో సాలూరు శారదా గాన పాఠశాలకు రజతోత్సవం జరిపించారు శాస్త్రిగారు. ఈ ఉత్సవాలకు ద్వారం వెంకటస్వామి నాయుడుగారు అద్యక్షత వహించారు. “పరమోత్కృష్టమయిన సంగీతవిద్యను ఉచితముగా బోధింపగల ధర్మపాఠశాలను నెలకొల్పి, ఇప్పటికి ఇరువది ఐదు సంవత్సరములనుండి అవిచ్ఛిన్నముగ నిర్వహించుచు కళోపాసకులను తయారుచేయుచు..” – అంటూ సీతారామశాస్త్రిగారి ఉన్నతాశయాలను ప్రశంసించారు పారుపల్లి రామకృష్ణయ్య పంతులుగారు. 


సీతారామశాస్త్రిగారి శిష్యులు, వారి ఆఖరి కుమారుడు ప్రభాకరరావుగారు సాలూరు పాఠశాలను కొంతకాలం నిర్వహించారు. ప్రస్తుతం సాలూరులో జరజాపు ఈశ్వరరావుగారి సారధ్యంలో జరజాపు రమేష్ మెమోరియల్ ట్రస్టు, సాలూరు రాజేశ్వరరావు మెమోరియల్ ట్రస్టు సంయుక్తంగా శ్రీ పట్రాయని సీతారామశాస్త్రి సంగీత పాఠశాల పేరుతో శారదా గాన పాఠశాలను నిర్వహిస్తున్నాయి.


విజయనగరం జీవితం
విజయనగరం సంగీత కళాశాలలో చినగురువుగారి ప్రవేశం నాటకీయంగా జరిగింది. ఎస్టేట్ కలెక్టర్ డబ్ల్యు.ఆర్.ఎస్.సత్యనాధన్, ఐ.సి.ఎస్.తో పాటుగా గొప్ప సంగీత వేత్తలెందరో ఆ కార్యక్రమానికి అతిథులు. కళాశాల భవనం ఆహూతులతో క్రిక్కిరిసిపోయింది. ఆదిభట్లనారాయణదాసుగారు అప్పటికే పదవీ విరమణ చేయడం వల్ల ద్వారం వెంకటస్వామి నాయుడుగారు ప్రిన్సిపాల్ గా ఉన్నారు. ఓకల్ ప్రొఫెసర్ పదవికి పోటీపడే అభ్యర్దులకు విద్వత్పరీక్ష జరిగింది. స్వకీయమైన రచనతో, కళ్యాణి రాగంలోని క్లిష్టతను అసాధారణరీతిలో ప్రదర్శించిన చినగురువుగారు సంగీత విద్వాంసులతో పాటు సామాన్యులను కూడా సూదంటు రాయిలా ఆకర్షించేరు. సీతారామశాస్త్రిగారు ప్రథమ స్ధానంలో ఎన్నికయినట్టు ఎస్టేటు కలెక్టరుగారు ప్రకటించారు.



విజయనగరంలో 1936లో గెడ్డవీధిలో కాపురం ప్రారంభించారు సీతారామశాస్త్రిగారు. పగలు ఉద్యోగం, సాయంత్రాలు మిత్రులతో సాహితీ సమావేశాలతో విజయనగరంలో శాస్త్రిగారి జీవితం సంగీత సాహిత్య సమ్మేళనంగా ఉండేది. ఈ సమావేశాలే తదనంతరం కౌముదీ పరిషత్తుగా పరిణామం చెందాయి. బుఱ్ఱా శేషగిరిరావుగారు ఈ కౌముదీ పరిషత్తును శ్రీ భారతీ తీర్థ అనుబంధ సంస్థగా గుర్తించడం వల్ల మరెందరో విద్వాంసులు దీనిలో సభ్యులుగా చేరారు. ఆకుండి సత్యనారాయణగారు, పంతుల లక్ష్మీ నారాయణశాస్త్రిగారు, నల్లాన్ చక్రవర్తుల వెంకట చక్రవర్తి, రంగాచార్యులు సోదరులు, భళ్ళమూడి నరసింహశాస్త్రిగారు, కొల్లూరు ధర్మారావుగారు, తంపెళ్ల సత్యనారాయణగారు, మూర్తిరాజుగారు, క్రొవ్విడి రామంగారు, మరెందరో సంస్కృతాంధ్ర భాషలలో నిష్ణాతులైనవారు, సంగీత విద్వాంసులు ఈ పరిషత్తులో సభ్యులు. 


తరచుగా సంగీత సాహిత్య రంగాలకు సంబంధించిన చర్చలు, కవి సమ్మేళనాలు, కావ్య పఠనాలు జరుగుతూ ఉండేవి. సున్నితమయిన హాస్యధోరణితో, చెరగని చిరునవ్వుతో గురువుగారు ప్రసంగాలు చేస్తూ స్వవిరచితమయిన గేయాలు, పద్యాలు ఆలపిస్తూ ఉండేవారు.



భారతీతీర్థ వారు నిర్వహించిన దసరా సభలలో 1939లో కౌముదీ పరిషత్తువారు సీతారామశాస్త్రిగారిని సంగీత విద్యా భూషణ బిరుదుతో సత్కరించారు. ఈ కౌముదీ పరిషత్తుకు, ప్రారంభించినది మొదలు 1957లో మరణించేవరకు సీతారామశాస్త్రిగారే శాశ్వత అధ్యక్షుడిగా ఉన్నారు. మహాకవులు, సంగీతవిద్వాంసులు, ప్రాక్పశ్చిమభాషా పండితులు సభ్యులుగా గల పరిషత్తును చినగురువుగారు అంతకాలం అధ్యక్షుడిగా నిర్వహించడంలో ఆయన ప్రతిభతో పాటు ప్రసన్నమయిన వ్యక్తిత్వం, సమయస్ఫూర్తితో కూడిన సభారంజకమైన వాక్శక్తి కూడా వెల్లడవుతాయి.


వేదవిజ్ఞాన వర్ధనీ పరిషత్తువారు, జ్ఞానానందాశ్రమం వారు, చుట్టుపక్కల గ్రామాలవారు నిర్వహించిన సభలలో, మహారాజ సంగీత కళాశాలవారు నిర్వహించే సిద్ధి గణపతి నవరాత్రి ఉత్సవాలలో -ఇలా అనేక సందర్భాలలో గురువుగారు చేసిన సంగీతకచేరీలు సభ్యులను బ్రహ్మానందపరిచేవి.


సంగీత కచేరీలు చేయడంతో పాటు కౌముదీ పరిషత్తు అధ్యక్షుడిగా అనేక సందర్భాలలో శాస్త్రిగారు సంస్కృతంలో, తెలుగులో అనేక పద్యరచనలు చేసి వెలువరించారు. విజయనగరం చుట్టుపక్కల ప్రాంతాలలో జరిగే సంగీత సభలలో నాదోపాసన, సంగీత సాహిత్య సమ్మేళనం వంటి శీర్షికలతో సంగీతం సాహిత్యపోషకంగా ఏవిధంగా ఉండాలో నిరూపిస్తూ ప్రసంగాలు చేసేవారు


 
సహజమయిన ప్రతిభా వ్యుత్పత్తులతో ఎన్నో పద్యాలు, గేయాలు మొదలైన రచనలు చేశారు శాస్త్రిగారు. ఈ రచనలన్నీ ప్రాచీన వాగ్గేయకారుల రచనలతో సమంగా సంగీతసాహిత్య పరిపుష్టంగా, రక్తికట్టించేవిగా ఉన్నాయని సంగీతవిద్వాంసుల మన్ననలు పొందాయి.


త్యాగయ్య చెప్పిన సంగీత పరమైన మోక్షం కేవలం శాస్త్రసమ్మతంగా గానం చేసినప్పుడు మాత్రమే లభించదని, శ్రవణానందదాయకంగా గానం చేస్తేనే సిద్ధిస్తుందని నమ్మేవారు శాస్త్రిగారు. .శ్రవణానందము, శాస్త్ర సమ్మతము సమ్యక్ గీతము సంగీతమని, రాగభావ, స్వరరసపోషణ గాత్ర సంగీత ధర్మమని భావించేవారు. ఆయన స్వరపరచిన గీతాలలో ఈ భావాన్ని పదే పదే ప్రకటించడం కనిపిస్తుంది.


శాస్త్రిగారి ప్రత్యేకత హార్మోనియం వాయిద్యం. ఆనాడు భారతీయ సంగీత సంప్రదాయానికి పొసగదు అంటూ ప్రభుత్వంవారు హార్మోనియం వాయిద్యాన్ని నిషేధించారు. చినగురువుగారి కచేరీలో హార్మోనియం వాయిద్యానికి చాలా ప్రాముఖ్యం ఉంది. పండితులు, ప్రభుత్వం చిన్నచూపు చూసినా శాస్త్రిగారు హార్మోనియంను తన కచేరీలలో తప్పనిసరిగా ఉపయోగించేవారు. ఆ కారణంగా అంతటి మహా విద్వాంసుడూ, ఆకాశవాణికి దూరంగా ఉండిపోయారు. 


హార్మోనియంపై అతి సున్నితమయిన సంగతులను పలికిస్తూ, ప్రదర్శించగలిగే కళానైపుణ్యం, ఆనందించగల రసార్ద్ర హృదయం ఉన్నప్పుడు రసోత్పాదనకు, రసాస్వాదనకు హార్మోనియం ఎంత చక్కగా సహకరిస్తుందో, సోదాహరణంగా నిరూపించారు చినగురువుగారు. వారి చేతిలో హార్మోనియం సూక్ష్మాతిసూక్ష్మమైన, అతి సున్నితమైన సంగతులను, మూర్ఛనాది ధ్వనులను వెలువరిస్తూ, పరోక్షంగా విన్నవారికి అది హార్మోనియం అని తెలిసేది కాదట. హార్మోనియం వాయించడంలో గురువుగారికి గల అసాధారణమైన ప్రతిభ, సభలలో శ్రోతలను అమితంగా ఆకట్టుకునేది. పరసీమ యంత్రాన వరగాన మొలికించు మిన్న పట్రాయని చిన్న గురువుఅన్నారందుకే ఆరుద్రగారు- శాస్త్రిగారి హార్మోనియం ప్రతిభ గురించి.


విజయనగరం సంగీత కళాశాలలో వోకల్ పండితుడి ఉద్యోగం కోసం దరఖాస్తు చేసినప్పుడు సీతారామశాస్త్రిగారికి యోగ్యతాపత్రం అవసరమైంది. దానికోసం ఆయన ఆదిభట్ల నారాయణదాసుగారి దగ్గరకు వెళ్ళారుట. పెదగురువుగారు నరసింహశాస్త్రిగారు దాసుగారికి మంచి మిత్రులు. ఒరే నీకెందుకురా ఆ బాడుఖావు ఉద్యోగం. సలక్షణంగా పాఠశాల కట్టేవు. స్వతంత్రంగా ఉన్నావు. నీ ప్రారబ్థం అలా ఉంది. తప్పదు అని అంటూనే దాసుగారు సీతారామ శాస్త్రిగారికి యోగ్యతా పత్రం రాసి ఇచ్చారుట. పక్కనున్న వాళ్ళతో హార్మోనియం లేదూ, అదొక కొయ్య. దాని నుండి అమృతం పిండుతాడు వీడుఅన్నారుట. హార్మోనియం వాదనలో సీతారామశాస్త్రిగారి నైపుణ్యం గురించి ఆదిభట్ల నారాయణ దాసుగారిచ్చిన యోగ్యతా పత్రం అది.


గాయకులు సాహిత్యభావాన్ని పోషిస్తూనే, నాదంలో లీనమై గానం చేయాలని, ఆదర్శాన్ని త్రికరణశుద్ధిగా నమ్మిన శాస్త్రిగారు జీవితపర్యంతం దాన్ని ప్రచారం చేసారు. దాక్షిణాత్య సంగీతపు ప్రభంజనంలో కొట్టుకుపోతున్న సమకాలికులైన విద్వాంసులకు ఆయనపట్ల ఈ విషయంలో విభేదం ఉన్నా ఆయనకి సంగీతంలో గల అసాధారణ ప్రజ్ఞతో, శ్రవణపేయమైన తన గాంధర్వ గానంతో, స్వకీయ స్వరకల్పనలతో సాధారణ జనసమూహంలో రససిద్ధికి నిర్వచనం అనిపించేలా కచేరీలు చేసి, గొప్ప విద్వాంసుడిగా జనామోదం పొందారు. ఒక్కొక్క పద్యం అరగంట సమయమైనా రాగాలాపన చేస్తూ చదివేవారు.

సీతారామశాస్త్రిగారు- ఘంటసాల



                        విజయనగరంలో గురువుగారు శిష్యులతో కలిసి ఉన్న ఫోటో ఇది.
                      గురువుగారి ఎడమ వేపు మొదటి వ్యక్తి ఘంటసాల.
విజయనగరంలో ఆయన విజయరామరాజ సంగీత కళాశాలలో అధ్యాపకుడిగా ఉన్నపుడు శిష్యులను కన్నబిడ్డలతో సమానంగా ఆదరించి ఆప్యాయతను పంచేవారు. విజయనగరంలో సంగీతం నేర్చుకోవడానికి వచ్చిన శిష్యులెందరో ఆర్థికపరిస్థితులు సహకరించని పరిస్థితులలో గురువుగారి ఇంటిలోనే బస చేసేవారు. ఆవిధంగా వచ్చిన శిష్యులలో ఘంటసాల వెంకటేశ్వరరావు ముఖ్యులు.


శిష్యులలో నిగూఢంగా ఉన్న సంగీత కళాసంపదను పసిగట్టి ప్రోత్సహించేవారు సీతారామశాస్త్రిగారు. గురువుగారి దగ్గర సంగీతగ్రంథం నేర్చుకోవడంతో పాటు ఆయన వ్యక్తిత్వాన్ని ఆదర్శంగా చేసుకున్నారు ఘంటసాల. సంగీత దర్శకుడిగా, గాయకుడిగా ఆయన జీవితంలో గురువుగారి ప్రభావం ఎంతో ఉంది. ఆయనకు గురువుగారి పట్ల అమితమైన ప్రేమ, అనురాగం ఉండేవి. శ్రీ గురువుగారిని దర్శించిన ఆ క్షణమే వారి మూర్తిమంతం, ప్రియభాషణ, నన్ను పరవశుణ్ణి చేసేయి. వారి గురుత్వం ఆజన్మ సిద్ధమయినదనిపించిందిఅన్న ఘంటసాల మాటలలో గురుశిష్యులిద్దరికీ ఒకరిపట్ల ఒకరికి కల ఆత్మీయత కనిపిస్తుంది. గురువుగారి గురించి ఘంటసాల ఇంకా ఇలా అన్నారు-


సంగీత శాస్త్రమూ, లక్ష్య గ్రంథమూ నేను ఇతర పండితులనుండి గ్రహించగలిగే వాణ్ణేమో కాని గురువుగారు నాకు ప్రసాదించినది అనితర దుర్లభమైనదని నా విశ్వాసం. ముఖ్యంగా గాత్రసాధన చేయడంలో అలవర్చుకోవలసిన శ్రుతి శుద్ధి, నాద శుద్ధి, గమక శుద్ధి, తాళగత స్వరగత లయశుద్ధి, శిష్యులకు బోధించడంలో ఆ మహానుభావుడు సిద్ధుడు. వారు ఈ నాదానుభవాన్ని సాంబసదాశివ సాంబసదాశివ అనే నామ సంకీర్తనంతో మంత్రవత్ గా నాలో ప్రసరింపచేసారు. కీర్తనలోని రసభావములకు అనుగుణ్యంగా పట్టువిడుపులతో గమకాలను సార్థకంగా ప్రయోగించడం గురువుగారి వంటి నాదసిద్ధులకు మాత్రమే సాధ్యమని నా నమ్మకం. గురువుగారి పద్యాలలోను, కీర్తనలలోను గల భావోద్రేకము, చిత్తశుద్ధి అస్మదాదులను తాత్త్వికోన్ముఖులను చేయగలిగినవి“.
ఘంటసాల సినీరంగంలో స్థిరపడకముందు ఎన్నో సంగీత కచేరీలు చేసారుట. వాటన్నిటిలోను గురువుగారి పద్యాలు, స్వరపరచిన కీర్తనలు గానం చేసేవారుట. ప్రతి కచేరీలోను గురువుగారు రచించిన లలితే సరసగాన కళాశ్రితే కీర్తనను ప్రార్థనగా ఆలపించేవారుట.



ఘంటసాల తెలుగు చిత్రసంగీతంలో ప్రవేశించే నాటికి చిత్రసీమ పై మహారాష్ట్ర సంగీత ప్రభావం కనిపించేది. ఘంటసాల సంగీతదర్శకుడిగా, గాయకుడిగా తెలుగు సినిమాలలో తెలుగు పాటను తెలుగు నుడికారంతో వినిపించారు. ముఖ్యంగా తెలుగు చిత్రాలలో ఘంటసాలకు ముందు పద్యపఠనంలో మహారాష్ట్ర ప్రభావం, స్టేజినాటకాల ప్రభావం కనిపిస్తుంది. సాహిత్యంలోని మాటలన్నీ గబగబ అనేసి తీరిగ్గా రాగాలాపన చేయడం అనేది ఘంటసాలకు ముందున్న పద్యపఠన శైలి. ఘంటసాల సంగీతంలో వచ్చిన ప్రైవేటు రికార్డులు సాహిత్యానికి సంబంధించి తెలుగు నుడికారం ఎక్కడా జారిపోకుండా, సంభాషణాత్మకంగా, వర్ణనాత్మకంగా రాగభావం మొత్తం పద్యాన్నంతా ఆవరించి ఉండడం కనిపిస్తుంది.
 

సంగీతానికి సాహిత్యానికి సమన్వయం ఉండాలని, సాహిత్య పోషకంగా సంగీతం ఉండాలని భావించి, ఆ ఆశయాన్ని ప్రచారం చేసారు శాస్త్రిగారు. పద్యపఠనంలో సాహిత్యానికి తగిన స్వరకల్పన చేస్తూ, తెలుగు నుడికారంతో తెలుగుపాట వినిపించాలని భావించేవారు శాస్త్రిగారు. ఘంటసాల ప్రైవేటు రికార్డులుగా ఇచ్చినవాటిలో పద్యపఠనంలో గురువుగారి ప్రభావంతో ఏర్పరుచుకున్న ఒక నూతన శైలి కనిపిస్తుంది. తమ తండ్రి గారి ప్రభావం, తమ పైన కన్నా శిష్యుడు ఘంటసాలగారి పైనే ఎక్కువ అని, ఆయన ఆశయం ఘంటసాల రూపంలో వ్యక్తం అయిందని భావిస్తారు గురువుగారి కుమారుడు, సంగీతరావుగారు. భాషలోని సాహిత్యభావానికి తగిన సంగీతకల్పన చేయడంలో, తెలుగుపాటలో మాట తెలుగుమాటగా వినిపించాలన్న గురువుగారి ఆదర్శాన్ని ఘంటసాలగారు అక్షరాలా ఆచరించారు.

సీతారామశాస్త్రిగారు విద్యార్థులకు సంగీతం నేర్పినప్పుడు కేవలం సంగీతగ్రంథం బోధించడమే కాక విద్యార్థులలోని భావనా శక్తిని, నిర్మాణాత్మకమైన శక్తిని, స్వాతంత్ర్యాన్ని, రసదృష్టిని ప్రోత్సహించేవారు. గురువుగారి ప్రభావం వలననే భవిష్యత్తులో నా సంగీతానికి ఒక విశిష్టత, ప్రత్యేక వ్యక్తిత్వం ఏర్పడ్డాయి’ – అన్నారు ఘంటసాల.
నేను ఎక్కడ, ఎప్పుడు ఏ పరిస్ధితులలో ఉన్నా గురువుగారి పవిత్రాత్మ నన్ను వెంట అంటి ఉంటుందని నమ్ముకొంటున్నాను‘ – అన్న ఘంటసాల పలుకుల్లో సీతారామశాస్త్రిగారిని కేవలం విద్యనేర్పిన గురువుగానే కాక ఆత్మీయతానురాగాలతో ఒక ఆత్మబంధువుగా ఆరాధించడం కనిపిస్తుంది.


1950లో మద్రాసు టి.నగర్ లో ఘంటసాలగారి నూతన గృహ ప్రవేశ సందర్భంగా గురువుగారిని మద్రాసుకు ఆహ్వానించి ఘనంగా సన్మానించారు. ఇది గురువుగారి పట్ల ఘంటసాలకుగల గౌరవాభిమానాలకు తార్కాణం. ఈ శుభసందర్భంలో గురువుగారి కచేరీ కూడా ఏర్పాటు చేసారు.
                     మద్రాసు టి.నగర్ నం.35,ఉస్మాన్ రోడ్ లో ఘంటసాలగారి ఇల్లు




              1951 జూన్ 21న    ఘంటసాలగారి గృహప్రవేశం సందర్భంగా ఆహ్వాన పత్రిక, కార్యక్రమంలో భాగంగా గురువుగారి కచేరీ . 

సీతారామశాస్త్రిగారు సాలూరులోను, విజయనగరంలోను ఇచ్చిన సంగీత శిక్షణ ఎందరి జీవితాలకో రాచబాటను పరిచింది. కేవలం సంగీతపాఠాలను చెప్పే గురువుగానే కాక నిర్మలమయిన, మందస్మిత పూర్వకమయిన ఆత్మీయదృక్కులతో మధురమైన సంభాషణతో కూడిన మూర్తిత్వంతో శిష్యుల కళాజీవితంతో పాటు, వారి వ్యక్తిత్వాలను కూడా ప్రభావితం చేసి, వారిని ఆదర్శమయంగా తీర్చిదిద్దారు సీతారామశాస్త్రిగారు. శాస్త్రిగారిలో వ్యుత్పత్తి కన్నా ప్రతిభ, ప్రతిభ కన్నా వ్యక్తిత్వమూ ఘనమైనవి అని సంగీతరావుగారి(సీతారామ శాస్త్రిగారి పెద్దకుమారుడు) భావన.


విజయనగరం మహారాజా సంగీత కళాశాలలో గాత్రపండితులుగా 1936నుంచి 1956 వరకు పనిచేసారు శాస్త్రిగారు. ఆయన శిష్యులు గాయకులుగా, అధ్యాపకులుగా, మరికొంత మంది సినిమా సంగీతరంగంలో కళాకారులుగా రాణించారు. శాస్త్రిగారు అథ్యాపకుడిగా మహత్తరమయిన బాధ్యతను నిర్వర్తించారు.



కానీ సీతారామశాస్త్రిగారి లోని కళాకారుడు రసవద్గాయకుడిగా, వాగ్గేయకారుడిగా రూపొందే వ్యక్తిత్వాన్ని పొందినది సాలూరు జీవితంలో చినగురువుగారుగా మాత్రమే. తన స్వేచ్ఛాప్రకృతికి విరుద్ధంగా ఉద్యోగధర్మం అనే పంజరం ఆయనను చిలుకను చేసి బంధించింది. అత్యంత ప్రాణప్రదంగా నిర్మించుకొన్న తన పాఠశాలలో తన అభిమాన శిష్యుల మధ్య సాలూరులోనే ఉండి ఉంటే, ఈనాటి సంగీత కచేరీ విధానం ఎంతో రసస్ఫూర్తిగా రూపొంది ఉండేదని, ఎన్నో విశిష్టమయిన ఆయన సంగీత రచనలతో కర్ణాటక శాస్త్రీయ సంగీతం సుసంపన్నం అయివుండేదని భావిస్తారు సంగీతరావుగారు.
 
 సీతారామశాస్త్రిగారు ఏనాడూ ప్రత్యేకంగా పూనుకొని కవిత్వం వ్రాయలేదు. ఆయన రచించిన పద్యాలు, కీర్తనలు ఎక్కడా అచ్చుకాలేదు. రోజూ గంటల తరబడి భగవంతుడి సన్నిధిలో గానంచేసేవారు. ఆ గాన తన్మయత్వంలో వచ్చిన పద్యాలను, కీర్తనలను వారి శిష్యులు అప్పుడప్పుడు రాసుకున్నవి ఇప్పుడు లభ్యం అవుతున్నాయి. తన స్వర రచనలను తాను పాడుకోవడం కోసమే అని భావించేవారు. శిష్యులకు ప్రత్యేకంగా ఎప్పుడూ పాఠంగా చెప్పేవారు కాదు. వోకల్ పండితుడిగా పాఠం చెప్పినపుడు కూడా సంగీత సంప్రదాయం ప్రకారమే సంగీత శిక్షణ ఇచ్చేవారు. తన రచనలను పాఠంగా చెప్పలేదు.
విజయరామరాజ సంగీత కళాశాల సహోద్యోగులతో
1937 ప్రాంతాల తీసిన అరుదైన ఫోటోలో ఉన్నవారు ముందువరసలో ఎడమనుంచి శ్రీపాద సన్యాసిరావు (మృదంగ విద్వాన్‌), వాసా వెంకటరావు(ప్రఖ్యాత వైణికుడు కృష్ణమూర్తిగారి తండ్రి), ద్వారం వెంకటస్వామినాయుడు, పట్రాయని సీతారామశాస్త్రి, మునుస్వామి (నాదస్వర విద్వాన్‌). రెండో వరసలో ఎడమ నుంచి మునుస్వామిగారి ఒక శిష్యుడు, అయ్యగారి సోమేశ్వరరావు (వీణ విద్వాన్‌), చాగంటి గంగబాబు (అంధుడైన వయొలిన్‌ విద్వాన్‌), అవధానుల సూర్యనారాయణ (పట్రాయని సీతారామశాస్త్రిగారి శిష్యుడు), లోవదాసు (మునుస్వామిగారి కుమారుడు). మూడో వరసలో వాసా వెంకటరావుగారి మనమడు(దౌహిత్రుడు), ప్యూన్‌ రామస్వామి.
శాస్త్రిగారి పద్యాలు, గేయాలు గానానికి అనుగుణంగా, గాయక దృష్టితో రచించినవి. రచనలో, భావంలో సూటిదనం, ఆవేశం, అమాయకత్వం, భక్తిభావం, వాటి ప్రదర్శనలో భావానికి అనుగుణ్యమైన సంగీతం ప్రేక్షకులను ఆకర్షించిన లక్షణాలు అని శ్రీ సంగీతరావుగారి అభిప్రాయం.

1957 సంవత్సరం ప్రారంభంలో విజయనగరం సంగీత కళాశాలలో ఉద్యోగవిరమణ పొందారు. మరి కొద్ది కాలంలోనే ఆరోగ్యం క్షీణించి, హేవిళంబి నామ సంవత్సరం 1957 ఏప్రెల్ నెల 17 వ తేదీన కన్నుమూసారు.

వాగ్గేయకారుడుగా సీతారామశాస్త్రిగారు :

సీతారామశాస్త్రిగారు అతి చిన్నవయసులోనే సంగీతవిద్వాంసుడిగా ప్రజామోదాన్ని, గౌరవాలను అందుకున్నారు. బరంపురం ఆనాటి తెలుగుసంస్కృతీ కేంద్రంగా ఉండేది. సాహిత్యగోష్టులు తరచుగా జరిగేవి. తండ్రి నరసింహశాస్త్రిగారి వెంట ఉంటూ ఈ సాహిత్యసభలలో పాల్గొనడం ఆనాటి సాహితీవేత్తలతో పరిచయం సీతారామశాస్త్రిగారికి సంగీతంలోనే కాక, సాహిత్యంలోనూ పట్టు సాధించడానికి దోహదపడింది. క్రమమైన విద్యాభ్యాసం లేకపోయినా అతి చిన్నవయసులోనే ఛందోబద్ధంగా పద్యరచన చేయడం అలవడింది.

సీతారామశాస్త్రిగారి పద్యరచన:

సీతారామశాస్త్రిగారికి పదిహేను సంవత్సరాల వయసులో ఒకసారి శ్రీకాకుళంలో సంగీత కచేరీ నిమిత్తం తండ్రిగారితో కలిసివెళ్ళారు. తండ్రి గానం పూర్తి కాగానే సీతారామశాస్త్రిగారు కూడా పాడారు. సభలోనివారు కుర్రవాని సంగీత జ్ఞానానికి ఎంతో ముగ్థులయేరు. సభాసదులలో ఒకరు బాబూ ఒక పల్లవి పాడు అని అడిగారుట.
శాస్త్రిగారు వెంటనే సద్యస్ఫూర్తితో ఒక పల్లవిని కల్పించి పాడేరుట. అది ఇలా ఉంటుంది.
తిన్న చిలుకా…..
కాయలు తిన్న చిలుకా,
కాకర కాయలు తిన్న చిలుకా,
మా దొడ్లో కాకర కాయలు తిన్న చిలుకా

అంటూ ఈ సాహిత్యాన్ని పల్లవిగా ఆలపించి శ్రోతలతో శహబాసులు పొందారుట. తన చిన్ననాట మిత్రులతో స్పర్థ వచ్చినప్పుడు వారిని అధిక్షేపిస్తూ కొన్ని పద్యాలు చెప్పారు.
తే.గీ.

ఈ వసంతంబునందు నీ యిచ్ఛకొలది
కోకిలా కూయుమా నీవు కోకొ యంచు
కాకి పెంపకమౌట ఆ కారుకూత
కూయబోకుమా నైజంబు కూలిపోవ

కాకి, కోకిల చూడడానికి ఒకే రూపంలో ఉండే పక్షులు. వాటి గుణాలు మాత్రం వ్యతిరేకం. మధురమైన కంఠస్వరానికి కోకిల, వికృతశబ్దాలకు కాకీ, పేరు పొందాయి. కోకిల తనగుడ్లను పొదగడం చేతకాక, కాకి గూటిలో పెట్టి వెళ్తుందని, కాకి ఆ గుడ్లను పొదిగి తన పిల్లలతో పాటు పెంచుతుందని, కూత నేర్చిన తర్వాత నిజం గ్రహించి కోకిల పిల్లలను తరిమేస్తుందని కవిసమయం. దీన్ని శాస్త్రిగారు కొత్తగా ప్రయోగించారు. కోకిల వసంతంలో మధురంగా కూ కూ అని కూయాలి కాని, కాకి తనను పెంచింది కదా అని కఠోరమైన శబ్దాలతో కాకిలా కూయకూడదని, తన సహజమయిన గుణాన్నివదలకూడదని అంటారు. దుష్టసాంగత్యం వలన తన మంచిలక్షణాన్ని పోగొట్టుకోవద్దని తన మిత్రుడిని పరోక్షంగా హెచ్చరించారు శాస్త్రిగారు.
తే.గీ


కీరమనుకొని మురిసి స్వకీయ వాక్య
ములను ముద్దుగ పలికింప దలచుచుండ
కాల గతి చేత ప్రారబ్ద కర్మ వశత చేత
తెలిసి కూసెను కాకి కూతలనె యకట


కాకి తన పిల్లను చిలుక అనుకుని ముద్దుముద్దు మాటలను ఎంతో ముద్దుగా నేర్పించినా కొంత కాలానికి అది జాతి ధర్మము ప్రకారము కాకి కూతలనే కూసిందని, తల్లి కాకి తన ప్రారబ్థ వశాత్తూ తెలుసుకుంది అని కల్పించడంలో కొత్తదనం కన్పిస్తుంది.
ఎంత ప్రయత్నం చేసినా సహజమయిన జాతి గుణాలు మారవని కాకి చిలుకలా మధురంగా పలకలేదని, కాలక్రమంలో సహజమయిన జాతి లక్షణాలు బయటపడతాయని అంటారు శాస్త్రిగారు. తన స్నేహితుడి పైన ప్రేమతో మంచి విషయాలు నేర్పించడానికి ప్రయత్నిస్తే, అతను తనను పట్టించుకోక నిర్లక్ష్యం చేసినపుడు అతన్ని మందలిస్తూ చెప్పారట ఈ పద్యం.
అలాగే తనకు నచ్చని ఒక విద్వాంసుడిగురించి తన అభిప్రాయాన్ని ఇలా వ్యక్తంచేసారు-
తే.గీ.
మశకమా నీవు రొద జేసి మధురమైన
కోకిల ధ్వనియంచు వాకొనెదవేల
గీయనెడి యొక్క రొదయె సంగీతమగునె
కోకిలమ్మేడ నీవేడ కోర్కెలేడ

దోమ గీయనే శబ్దం చేస్తూ తను సృష్టించిన ధ్వని గొప్పసంగీతమని, కోకిల ధ్వనివంటిదని భావించినా అది నిజానికి సంగీతమవుతుందా. శ్రుతిపక్వంగా తనువును పులకింపచేసే సంగీతమే సంగీతం కాని, మిగిలినవన్నీ కేవలం అరుపులతో సమానం అని పరోక్షంగా ఆ విద్వాంసుని సంగీతంపై తన అభిప్రాయాన్ని ప్రకటించారు. ఇలాంటిదే మరొక పద్యం -
తే.గీ.

మించి కృష్ణుడు మురళి వాయించుచుండ
కోయనుచు కూయు కోకిల కూతలేల
పాంచజన్యపు నాదంబు ప్రబలుచుండ
పృథుల భీకర ధ్వనుల కల్పింపనేల




యవ్వనంలో సీతారామశాస్త్రిగారిని అడిదం సూరకవి రచించిన పద్యాలు చాలా ఆకర్షించాయి. లౌకిక విషయాలను వస్తువులుగా తీసుకొని పద్యరచన చేసిన ఈ కవి శైలి, శాస్త్రిగారి మీద ప్రభావం చూపింది. కచేరీలలో కూడా అడిదం సూరకవి పద్యాలను గానం చేస్తూ ఉండేవారుట.
శాస్త్రిగారు రచించిన పద్యాలలో చాలా పద్యాలు లౌకికమయిన విషయాలు వస్తువులుగా ఉండడంతో పాటు, భాషలో ప్రయోగించిన పదాలు అప్పటి వ్యవహారంలో ఉండడం గమనించగలం.
ప్రాసకోసం సరదాగా చెప్పిన పద్యాలు రెండు కనిపిస్తాయి.
తే.గీ.

పురుషుడిటుమిండ యింటిలో పొలతి రండ
తగవులిలునిండ చేసొమ్ము తరుగుచుండ
మనసు కడుమండ పాపకర్మములు పండ
కలియుగపు జెండ ఎగురును తెలియకుండ

అటు ఇల్లాలు ఇటు ప్రియురాలు ఇద్దరి మధ్య నలిగే వాడి బాధ ఎలా ఉంటుందో చెప్పే పద్యం. ఇంటిలో ఎప్పుడూ తగవులు, చేతిలో సొమ్ము తరిగిపోవడం వంటి కష్టాలతో ఆఖరికి పాపం పండుతుందని చమత్కరిస్తారు. ఘనుల తలవంపు వారకామినుల సొంపు, కులటల తలంపు కులవధూటుల చలింపు, కలికి మనసింపు సొగసరి కౌగలింపు అంటూ ఇల్లాలిని వదలిన మగవాడి వేశ్యా ప్రియత్వాన్ని వెల్లడిస్తూ, .కామియై స్త్రీలోలత్వం చూపి, ఆడదాని కటాక్ష వీక్షణాల కోసం ప్రయత్నం చేస్తే అధమగతి తప్పదని లోకంలోని మగవారిని హెచ్చరిస్తారు.
ఇదే వస్తువుతో మరొక పద్యం-
చం.

మదన వికార సంజనిత మాధురికిన్ మనసొగ్గి కామినీ
ముదిత కటాక్షవీక్షణల మోహముకున్ కనులూగి యెప్పుడున్
మదగజయాన పై మెరగు మాటలకున్ చెవియొగ్గియున్
అథమ గతిన్ చరించెదవురా మగవాడవురా తలంపరా



సాలూరులో కళావంతుల కుటుంబాలు ఎక్కువ. అందువల్ల నృత్య, సంగీత శిక్షకులకు అవకాశం ఎక్కువగా ఉండేది. పెదగురువుగారు గృహస్థుల కుటుంబాలలోని వారికి పాఠాలు చెప్తే, చినగురువుగారు ఊళ్ళోని కళావంతుల కుటుంబాలకు చెందిన ఆడపిల్లలకు పాఠాలు చెప్పేవారు. చిన్న వయసులోనే వేశ్యలతో గల పరిచయం వల్ల సంసారజీవితంపై వేశ్యాప్రియత్వం, విచ్చలవిడి శృంగార జీవనం చూపే చెడు ప్రభావం వంటి విషయాలన్నీ శాస్త్రిగారికి అవగతం అయిఉంటాయి. పై పద్యాలలోని భావాలు, మగవాడికి హెచ్చరికలు ఈ విషయాన్ని నిరూపిస్తాయి.



సాలూరులో చినగురువుగారి వద్ద ఎందరో విద్యార్థులు సంగీతం నేర్చుకోవడానికి వచ్చారు. ప్రముఖ సంగీత విద్వాంసుడు, రేడియో కళాకారుడు తంపెళ్ళ సత్యనారాయణగారు, శాస్త్రిగారి తొలితరం శిష్యవర్గంలోని వారు. 



ద్దరికీ వయోభేదం ఎక్కువ లేకపోవడం వలన స్నేహంతో పాటు స్పర్థ కూడా ఉండేదట.
తంపెళ్ళ సత్యనారాయణగారు గ్రామఫోను రికార్డులు కూడా ఇచ్చారు. ఒక రికార్డులో కొన్ని పాటలు సీతారామశాస్త్రిగారి రచనలే. సింహేంద్ర మధ్యమంలో ధవళ మృదుతర, చక్రవాకంలో భావమెరిగిన, కాపిరాగంలో భజరే గురు చరణం శాస్త్రిగారి రచనలు.
             తంపెళ్ళ సత్యనారాయణగారితో సీతారామ శాస్త్రిగారు   





సాలూరు జమీందారు సన్యాసిరాజుగారి స్నేహం, ఆదరణలతో తనలోని కళాకారుడిని బహుముఖంగా ప్రదర్శించిన శాస్త్రిగారి స్వేచ్ఛామయ కళా జీవితానికి కుటుంబ బాధ్యతలు సంకెళ్ళు వేసాయి. కుటుంబ పోషణార్థం దేశసంచార బాట పట్టారు. కొంతకాలం కలకత్తా, ఖరగ్ పూర్ వంటి ప్రాంతాలలో ఉత్తరదేశ సంచారం చేసారు. ఈ విధంగా హిందుస్తానీ సంగీతంలోని లోతుపాతులను కూడా గ్రహించే అవకాశం ఆయనకి కలిగింది. కొంత సొమ్ము సంపాదించుకొని సాలూరు వచ్చి సంగీత పాఠాలు చెప్తూ జీవిక సాగించేవారు. ఆ డబ్బు అయిపోతే తిరిగి దేశాటన!


 కానీ కాలక్రమంలో కుటుంబ పోషణతో పాటు, పాఠశాల నిర్వహణ భారంగా మారి, డబ్బుకు కటకట పడవలసిన పరిస్థితిలో విజయనగరం విజయరామ సంగీత కళాశాలలో అథ్యాపకుడిగా స్థిరపడవలసి వచ్చింది. విజయనగరంలో సీతారామశాస్త్రిగారు సంగీత సాహిత్యాలు రెండిటిలోను అసమానప్రజ్ఞ కనపరిచారు. తన సంగీత విద్యా ప్రదర్శనతో సంగీత విద్వాంసులతో పాటు, సాహిత్య రచనలతో పండితులనుకూడా మెప్పించారు. విభిన్నమయిన వస్తువుతో అనేక పద్యరచనలు చేసి వాటిని స్వరపరచి సభలలో వాటిని ఆలపించేవారు.

సంగీత సంప్రదాయం-శాస్త్రిగారి ప్రయోగాలు

పండు తమలపాకు వంటి శరీరం, విశాలమైన నుదురు, వంగి కొనతేలిన నాసిక, అమాయకంగా ఆకర్షణీయంగా ఉండే నేత్రాలు, అర్భకంగా కనిపించే నాజూకైన రూపం సీతారామ శాస్త్రిగారిది. రూపంలోనే కాక, సంగీత ప్రదర్శనలోను జనరంజకంగా ఉండే ప్రత్యేకతను ప్రదర్శించిన వ్యక్తిత్వం ఆయనది.
కర్ణాటక సంగీతంలోని కచేరీ పద్ధతిలో విద్వాంసులు చేసే రాగాలాపనలో సంగీత శాస్త్ర విషయంలో నిష్ణాతులైన వారికి కలిగే శాస్త్రానందం తప్ప సాధారణమైన ప్రజానీకానికి కలిగేది పరోక్షానందమే. అటువంటి సంగీత కచేరీలలో సాధారణమైన భాషలో లలితమైన పదాలతో, సమకాలీన వస్తువుతో చమత్కారంగా చేసిన రచనలను సీతారామశాస్త్రిగారు సభలలో పాడేవారు. సామాన్య ప్రజానీకానికి సంగీతంలో రససిద్ధి కలిగించే అనుభవాన్ని రుచిచూపడానికి శాస్త్రిగారు ఎన్నుకున్న మార్గం ఇది. సుందరమైన మందస్మిత వదనంతో ఎంతో తన్మయంగా గానం చేస్తున్న శాస్త్రిగారి పాటకు సభలో యావన్మందీ రసానుభూతిని పొందేవారుట.
ఆనాడు కచేరీలలో సంప్రదాయంగా మారిన కొత్త పద్ధతి ప్రతి సంగీత కచేరీలోను త్యాగరాజకీర్తన పాడి తీరాలి అనేది. అందువల్ల సంగీత విద్వాంసులందరూ తప్పనిసరిగా త్యాగరాజ కీర్తనలు నేర్చుకోవలసిన అవసరం, అదీ గురుముఖతః నేర్చుకోవలసిన అగత్యం ఉండేది. తెలుగువారు చాలామంది దక్షణదేశం వెళ్లి త్యాగరాజ సంప్రదాయంలో కీర్తన గ్రంథం నేర్చుకునేవారు. కర్ణాటక సంగీతం తెలుగువారిదే అయినా అత్యంత భక్తిశ్రద్ధలతో అభ్యసించి ప్రచారం చేసినవారు తమిళులు. అందువల్ల తమిళభాష ప్రభావం త్యాగరాజుగారి తెలుగుకీర్తనలపై కనిపించేది. తమిళుల సంగీతానికి సాహిత్యం ఒక ఉపకరణం మాత్రమే.
త్యాగరాజస్వామి విరచిత కీర్తనలను తెలుగువారు తమిళయాసతో పాడడం, సాహిత్యంలో ఔచిత్యభంగం కలిగే విధంగా పదాలను విరవడం ఆయనను చాలా బాధించేది. అందువల్ల వివిధ ప్రాంతాలలో తాను విన్న త్యాగరాజ కృతులకు, విన్న సాహిత్యానికి స్వతంత్రంగా స్వరకల్పన చేసి రాగాలాపన చేస్తూ సాహిత్యానికి తగిన రాగాన్ని, సంగతులను ప్రదర్శిస్తూ కచేరీలలో గానం చేసేవారు శాస్త్రిగారు. దాక్షిణాత్య సంగీత సంప్రదాయం పేరున సంగీత విద్వాంసులు కచేరీలలో పాడే త్యాగరాజు కీర్తనలలో సాహిత్యపోషణకు ఔచిత్యభంగం కలుగుతోందని గురువుగారు అభిప్రాయపడేవారు. రామ నన్ను బ్రోవరా, ప్రక్కల నిలబడి వంటి త్యాగరాజకృతులు పాడినప్పుడు సంగీత విద్వాంసులు సాహితీ భంజకంగా సంగతులు వేస్తున్న విధానం ప్రదర్శిస్తూ, సాహిత్య భావానుగుణంగా సంగతులువేసి ఔచిత్యానికి భంగం కలుగకుండా ఏ విధంగా పాడవచ్చునో నిరూపిస్తూ గానం చేసి సభలలో జనాకర్షణ పొందేవారు.


సీతారామశాస్త్రిగారు సంగీత సాహిత్యాలు రెండూ సమానమైన తూకంలో ఉంటేనే ఆ కృతి రాణిస్తుందని నమ్మేవారు.భాష భావం కలిస్తేనే రాగరసస్ఫూర్తి కలుగుతుందని భావించారు. ఆనాటి కచేరీలలో సంగీత విద్వాంసులు సంప్రదాయంగా భావించే పద్ధతిలో సీతారామశాస్త్రిగారి కచేరీలు ఉండేవి కావు. ముందు శృంగార రసభావాన్ని వెల్లడించే వర్ణం పాడడం, వెంటనే భక్తిరసప్రధానమైన కృతిని పాడడం అనే ఆనాటి కచేరీ సంప్రదాయం ఆయనకు నచ్చేదికాదు.


సీతారామశాస్త్రిగారిది మొదటి నుంచి సంప్రదాయంలో ఒదిగిన ధోరణి కాదు. శుద్ధసంప్రదాయవాది యైన తండ్రిగారితో ఆయన కొంత విభేదించవలసి వచ్చినా, తను నమ్మిన మార్గంలోనే శాస్త్రిగారు జీవించారు. శాస్త్ర సమ్మతమైన సంప్రదాయమార్గంలో ప్రయాణిస్తూనే స్వతంత్ర మార్గంలో ప్రయోగాలు చేయడం శాస్త్రిగారి ప్రత్యేకత. ఆవిధంగా ఆయన చేసిన ప్రయోగం తెలుగు సంగీత కచేరీలలో పద్యాలు, లలితగేయాలు పాడడం. సంగీత కచేరీలలో సంప్రదాయంగా వస్తున్న వర్ణం, కీర్తనలు, కృతులు మొదలైనవి పాడుతూనే, తన స్వీయరచనలైన పద్యాలు గానంచేసేవారు. సమకాలీన వస్తువుతో రచించిన పద్యాలు సామాన్యుడిని సైతం ఆకట్టుకునేవి. సంగీతం మీద కంటే సాహిత్యం మీద మక్కువ ఎక్కువగా ఉన్న సభికులు ఉన్న సభలలో స్వీయ రచనలతో పాటు ప్రబంధాలలోని పద్యాలు, చాటుపద్యాలను జనరంజకంగా గానం చేసేవారు. వనజాతాస్త్రకుడేయు సాయకములన్ వారింపగా రాదు” “ఏ వనితల్ మముందలఁపనేమి పనో, తమరాడువారుకారో, వలపించు నేర్పెరుగరో” “వరబింబాధరమున్మొదలైన పద్యాలను సంగీతపు సొబగులద్ది ఆలపించి సభికులను అలరించేవారు.



కేవలం రాగప్రదర్శనకు, తన వాక్పటిమ ప్రదర్శనకు కాక సంగీతాన్ని ఆయా పద్యభావానికి తగ్గట్టుగా కూర్చి ప్రదర్శించేవారు.
జనరంజకమైన సంగీతానికి ముఖ్యస్థానం ఇస్తూ కచేరీ సంప్రదాయంలో శాస్త్రిగారు చేసిన ప్రయోగం ఆయనకి సంగీత విద్వాంసులలో ఒక ప్రత్యేకస్థానాన్ని కల్పించడమే కాక, తదనంతర కాలంలో సంగీత కచేరీ అంటే పద్యాలు, భావగీతాలు, లలితమైన సంగీతం వినిపించడం కూడా అన్న మరో కొత్త సంప్రదాయానికి నాంది పలికింది. ఘంటసాల వంటి గాయకులు ఆకాలంలో భావగీతాలతో కచేరీలు చేయడం మనం గమనించవచ్చు. శాస్త్రీయ సంగీత కచేరీలపై ఉన్న తీవ్ర అసంతృప్తితో ఆయన రకరకాల ప్రయోగాలు చేసారు. ఆ అసంతృప్తిని వెల్లడిస్తూ ఆయన రచించిన పద్యం స్టేజి సంగీతమే శ్రేష్ఠమంచును నెంచి” -.బహుళ జనాదరణ పొందినది.


ఆనాటి తెలుగు పౌరాణిక నాటకాలలో చదివే పద్యాలపై మరాఠీ సంగీత ప్రభావం ఉండేది. దాక్షిణాత్య సంగీత ప్రదర్శనలలో విద్వాంసుల కీర్తనలపై తమిళయాస ప్రభావం ఎక్కువగా ఉండి, కేవలం రాగ ప్రదర్శనకు మాత్రమే ప్రాధాన్యం ఇచ్చి తెలుగు భాషా సాహిత్య మర్యాదలను పక్కన పెట్టడం చాలా ప్రముఖంగా కనిపిస్తుంది. దీనిని గురించి సీతారామశాస్త్రిగారు స్వయంగా రచించి సభలలో గానం చేసిన ఈ పద్యం చాలా ప్రాచుర్యం పొందింది. ఈ పద్యాన్ని ఓడియన్ గ్రామఫోన్ కంపెనీ వారు ఒక రికార్డుగా విడుదల చేసారు.
సీ.

స్టేజి సంగీతమే శ్రేష్ఠమంచును నెంచి పరవశత్వముఁజెందు సరసులార
అరవనొక్కులె శాస్త్రమంచు నెంచి దాని భావమే యెరుగని ప్రాజ్ఞులార
మహరాష్ట్ర గానంపు మహిమ చూపెదనంచు గళము గిర్గిర త్రిప్పు ఘటికులార
మూలనుండిన వీణ ముందరకున్ లాగి తంత్రులంద్రెంపు విద్వాంసులార

తే.గీ
కాలగతి చేత ప్రస్తుత కాలమందు
ఆంధ్ర సంగీతమిన్ని విధంబులాయె
గాన శాస్త్రజ్ఞులార సుజ్ఞానులార
గాన శాస్త్రజ్ఞులార అజ్ఞానులార

ఎన్నెన్నో తెన్నులుగా చీలిపోయి ఎందునా రససిద్ధి పొందలేకపోయిన నాటి ఆంధ్ర సంగీతాన్ని గురించి విమర్శించిన పద్యం ఇది. ఆంధ్రసంగీతం ఈ విధమైన అధ్వాన్న స్ధితిని పొందడానికి కారకులు తాము గాన శాస్త్రజ్ఞులమనుకుని భాషని అలక్ష్యం చేసే గాయకులేనని శాస్త్రిగారి అభిప్రాయం. ఆ భావానికి తగినట్టు శాస్త్రిగారు పద్యంలో మాటలను మహారాష్ట్ర ప్రభావం కనిపించే విధంగా గళము గిరగిరా త్రిప్పడం, అరవనొక్కులే అన్న చోట తమిళయాసతో పలుకుతూ ఒక కొత్త పద్ధతిలో గానంచేసేవారుట. అది ఆనాటి శ్రోతలను ఎంతగానో ఆకర్షించింది. అందువల్లనే సమకాలీన విద్వాంసులలో వెలిపడ్డ వారిగా కనిపించినా అత్యంత జనాదరణ పొందిన మేటి విద్వాంసులుగా జనుల హృదయాల్లో సుస్థిరస్థానం పొందారు
శాస్త్రిగారు శిష్యులకు పాఠం చెప్పిన తర్వాత రోజులో చాలాసేపు గానం చేస్తూనే ఉండేవారుట. ఆ గానం కూడా కేవలం పాటలా కాక పరమేశ్వరుడికి సమర్పించుకునే హృదయ నివేదనలా ఉండేదట. అలాంటి భక్తి, జ్ఞాన యోగాలను ప్రదర్శించే పద్యాలను కీర్తనలను శాస్త్రిగారు స్వయంగా రచించి అమృతమయంగా గానం చేసేవారుట.
అతిబాల్యంలోనే తల్లిని పోగొట్టుకొని సహజమయిన ప్రతిభతో సంగీతంలోను, సాహిత్యంలోను నవనవోన్మేషమయిన ప్రజ్ఞా పాటవాలను చూపి సంగీతంతో నాదోపాసన చేసి, సరస్వతీ పుత్రులుగా ఆనాటి ప్రజల అభిమానాన్ని పొందారు శాస్త్రిగారు. తనకు ఈ విద్యను ప్రసాదించిన సరస్వతీదేవిని తల్లిగా, పుత్రుడి లాగే ఆరాధించారు శాస్త్రిగారు. తన ఆనందాన్ని, దుఃఖాన్ని కూడా సరస్వతి అమ్మవారితో పంచుకున్నారు.
సంగీతకళా మూర్తి శారదాదేవిని తల్లిగా భావించి ఆమెకు చేసుకున్న నివేదన-
సీ.
రాగమందనురాగ రసమునొల్కించుటే అమ్మరో నీ మందహాసమమ్మ
గడియారమునకె సద్గతి జూపు లయతాళ గతులెన్న నీ మందగమనమమ్మ
పూలమాలికల కూర్పును బోలు స్వరకల్ప నలు నీదు మృదుల భాషలు గదమ్మ
శ్రుతి యందు లీనమౌ గతి మది నిల్పుటే భారతీ నీ శాంత భావమమ్మ

నవరసంబుల సముద్భావమంద జేయుటే శారదా నీ కటాక్షము గదమ్మ
తే.గీ.
భావ రాగంబులను, తాళ ఫణితి, శ్రుతియు
గలియ గానంబు చేసెడి గాయకునకును
శ్రుతి పుటంబుల నీ నృత్య గతులు నిండ
కున్న ఆ గాయకుడు గాయకుండె జనని
శరణు ముఖజిత శశి బింబ శారదాంబ

పద్యంలో కనిపిస్తుంది. ఇందులో వస్తువు సరస్వతిని స్తుతించడం. రాగమందు అనురాగ రసమునొల్కించుట ఆమె మందహాసమని, గడియారమునకే గతులు చూపే లయతాళగతులు ఆమె మందగమనమని, పూలమాలికలవలె కూర్చిన స్వర కల్పనలు ఆమె భాషలని, ఈ విధంగా చేసే నవరస సముద్భవం ఆమె కటాక్షమని, భావరాగ తాళాలతో శ్రుతిపక్వంగా పాడి ఆమెను ఆనందింపచేయని గాయకుడు గాయకుడే కాదని వర్ణించారు.




సీ.
సరస సంగీత ప్రసారమొల్కుచు వీణ మృదుపాణి తలమున గదిసి మెరయ
పరభృతి ధ్వని కంఠమొరసి తంత్రీ స్వనం బున లీనమై ప్రతి ధ్వనులు నింప
ముంజేతి కంకణంబులు తాళగతితోడ కలిసి చివరను ముక్తాయి తెలుప
సకల చరాచరాత్మక ప్రమోదాలవా లంబులై నాట్య క్రమంబులొనర

తే.గీ
నాదరూపిణి, నాదాత్మ, నాద వంద్య
నాద భాసిని నా వేల్పు నాదు భక్తి
సకల భూత ప్రచారిణి, సర్వలోక
జనని యైనట్టి శారదాంబను నుతింతు

అనే పద్యంలో సరస్వతీదేవి చేతిలో ఆభరణంగా భాసించే వీణ సరససంగీత ప్రసారములు చేయుచుండగా, కోయిల తీయని కంఠస్వరం వీణానాదంలో లీనమై ప్రతిధ్వనులు నింపుతోందని, ఆమె ముంజేతి కంకణములు తాళగతితో ముక్తాయి తెలుపుతున్నాయని నాద రూపిణి, నాద వంద్య, నాద భాసిని అయిన సకల లోక జనని -సరస్వతిదేవిని స్తుతించారు.
ఉ.

మంజులగాత్రమాధురి సమంజసమై శ్రుతియందు లీనమై
రంజిల తాళ జాతులు తిరంబగు మార్గమునం జెలంగ ర
క్తింజెలువార నెమ్మనము కీర్తనలన్ స్వరరాగ భావయు
క్తింజిలుకంగ బాడెద నుతింపుచు నిన్ను, మదంబ శారదా

పద్యంలో సరస్వతిని తల్లిగా భావించి మదంబ శారదాంబ అని సంబోధించి మనోహరమైన మృదుమధురమైన గాత్రంతో శ్రుతిపేయంగా తాళం స్థిరమైన విధంగా, స్వరరాగ భావయుక్తంగా ఉండే కీర్తనలతో నిన్ను స్తుతిస్తానని అని ఆమెకు వాగ్దానం చేసారు. గాయకులైనవారు శృతి, లయ, భావం అన్నిటినీ స్పష్ట పరిచేలా పాడాలని ఆయన భావించారు.
సీ.

కోకిలాలాపంబు కొమరుగాదనిపించు తులలేని గాత్ర మాధుర్యమొసగి
శ్రావ్యంబులై సుధాసారంబు చిప్పిల్లు మృదుభాషణంబుల మెరుగులొసగి
పాల సంద్రంపు జంభాటమాయను దొడ్డ హృదయ భావంబులుప్పొంగ నొసగి
నవరసంబుల సిగ్గు నాణెంబులొల్కింప కుదురైన మోము సంపద నొసంగి
కడు దయారసము చిల్కగ కళల్ తిలకింప కనుల సౌభాగ్య సంగతులొసంగి
తే.గీ
గాయకునిజేసి జ్ఞాన భాస్కరుని జేసి
కవివరుని జేసి కడువన్నెకాని జేసి
రసికవరుజేసి సాత్విక ప్రవరు జేసి
ఒక్కొకని గారవించెదవో మదంబ
శరణు ముఖ జిత శశిబింబ శారదాంబ

పద్యంలో సరస్వతీ దేవి తన సృష్టిలో ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రత్యేకతనిచ్చి ఎలా గౌరవిస్తుందో వర్ణించారు శాస్త్రిగారు. రూపానికి సంబంధించిన సొగసుల గురించి వర్ణించిన తర్వాత గాయకుని జేసి జ్ఞానభాస్కరుజేసి, కవివరుని జేసి సాత్విక ప్రవరుజేసి.. అని ఒక్కొక్కరి వ్యక్తిత్వాన్ని ఆమె ఎలా తీర్చుతుందో చెప్పి అట్టి దేవిని శరణు కోరుతూ శరణు ముఖజిత శశిబింబ శారదాంబ అని శరణా గతి మార్గాన్ని అవలంబించారు.
తన అనుభవసారంగా బ్రతుకు భారమయిన విధాన్ని వర్ణిస్తూ
చం.

ఫల మిసుమంత లేదు సరివారల పిల్వరు హార్మొనీయ మం
దలి సుఖమింత లేదిక, మృదంగమునంతకు తీసిపోదుగా
తలపగ రాని యిట్టి దశ దాపురమయ్యె కదమ్మ ఎట్లు నన్
తలపడి బ్రోతువో యిక సుధామధురోక్తులొసంగి శారదా
అని తన వేదనను తల్లిగా నమ్మిన దేవితో తలపోసుకుంటారు. ఆనాటి విద్వాంసులు కర్ణాటక సంగీతాన్ని హార్మోనియం అనుసరించదని భావించేవారు. ప్రభుత్వం కూడా హార్మోనియం ప్రయోగాన్ని ఆకాశవాణి కార్యక్రమాలలో నిషేధించింది. శాస్త్రిగారికి హార్మోనియం అత్యంత ప్రియమైనది. హార్మోనియంని తాము నిరసించినా శాస్త్రిగారు దానిని విడవక పోవడం కొందరు విద్వాంసులు ఈసడించారు.
సరస్వతీదేవి తరువాత ఆయన పద్యాలలో ప్రధాన వస్తువుగా హరిభజన కనిపిస్తుంది. హరిభజన చేయడంలో కలిగే గొప్ప ఆనందాన్ని సౌఖ్యాన్ని వర్ణిస్తూ అందరు సంతోషం కలిగిస్తాయని అనుకునే వస్తువులను ఉపమానాలుగా పేర్కొంటూ, నిజానికి వాటినుంచి కలిగే సుఖం కన్నా హరిభజనలోనే హాయి హాయి అనిపించే ఆనందం ఉందని వర్ణిస్తారు.
సీ.
ఇండియా సామ్రాజ్యమేలగల్గుట కన్న గాంధీ మహాత్ము ధీగరిమకన్న
అల అప్పరావు కన్యాశుల్కమున కన్న వరకాళిదాసు కావ్యములకన్న

తిరుపతి కవుల వాక్సరళి మాధురి కన్న వనజాక్షి పాడు జావళుల కన్న
రమణీయమౌ గోహర్జాన్ గాత్రమున కన్న త్యాగయ్యగారి కీర్తనల కన్న

తే.గీ. మోహనమ్మగు ప్రియురాలి మోవికన్న
      పడతి యందించు కప్పుర విడెము కన్న
      మానితంబగు చిన్ని పూదేనెకన్న
      హరిభజనమోయి మనసుకు హాయి హాయి

మనసుకు ఎంతో ఆనందాన్ని, సుఖపారవశ్యాన్ని కలిగించే విషయాలను ఉపమానాలుగా తీసుకొని నిజానికి ఇవన్నీ ఇచ్చే సుఖం కన్నా హరిభజనే మనసుకు హాయినిచ్చేది అని నిర్ణయిస్తారు. అలాగే-
సీ.
ప్రియురాలితోడి సంప్రీతి క్రీడలకన్న షడ్రసోపేత భోజనము కన్న
మేల్మి కుమారుల మృదు భాషణలకన్న సొగసు నద్దములోన జూచుకన్న
అభ్యంగన స్నానమాచరించుట కన్న బల్ హుషారైన గాలి షికారు కన్న
సరసమైనట్టి వాక్సందర్భముల కన్నసకల శాస్త్రంబుల చదువుకన్న

హరిభజన గొప్పదని చెప్పడం కోసం ఎంచుకున్న ఉపమానాలలో ఎంతో కొత్తదనం కనిపిస్తుంది. ఇవి శాస్త్రిగారి కల్పనా చతురతకు నిదర్శనాలు.
తే.గీ.
తల్లిసంరక్షణముకన్న తండ్రి పాద
సేవకన్నను హితుల వీక్షించుకన్న
సర్వసౌఖ్యాల కన్న యిజ్జగము కన్న

హరి భజనమోయి మనసుకు హాయిహాయి
ఈ జగములో గొప్పధర్మాలని చెప్పబడేవాటి అన్నిటి కన్నా, ఆఖరుకు ఈ జగమంతటికన్నా హరిభజనకు మాత్రమే మనసుకు సాంత్వనం కలిగించి హాయి హాయనిపించేలా చేయగలిగే శక్తి కలిగినదని నమ్మే పరమ భక్తుడిగా సీతారామశాస్త్రిగారు ఈ పద్యంలో కనిపిస్తారు.


భక్తితోపాటు వైరాగ్య భావాలు కూడా శాస్త్రిగారి రచనలలోకనిపిస్తాయి. ఎంతో గాఢమైన జీవితానుభవంతో తీవ్రమైన అంతస్సంఘర్షణ పొంది జీవితం పట్ల వైరాగ్యం ప్రదర్శించిన ఒకయోగిలా, ఒక ప్రవక్తలా ఆయన కనిపించేవారని, మహా సిద్ధుల సమక్షంలో కలిగే ఒకమహదానందం ఆయనని దర్శించడంలో కలిగేదని ఆయన శిష్యులు, సన్నిహితులు భావించారు. ఆయనలోని ఈ వేదాంత ధోరణి కనిపించే పద్యాలు కొన్ని ఇక్కడ చూడవచ్చు.


కేవలం లౌకికమయిన సుఖాలకోసం, ఎంత సంపాదించినా చేత నిలువని ధనార్జన కోసం, కళల విలువ తెలియని మూర్ఖులను ఆశ్రయించవలసిన స్ధితిని, సుఖసంతోషాలకు దూరమై, దేశాలు పట్టుకొని తిరుగుతూ కుటుంబజీవనానికి దూరం కావలసి వచ్చిన తన దుర్గతిని ఛీ అని ఖండిస్తూ రచించిన పద్యం ఇది -
శా.
ఆదాయంబిసుమంత నిల్వదు కదా హా ఎంత యార్జించినన్,
మోదంబించుక కల్గనేరదు కదా మూర్ఖాళినాశించుటన్,
ఖేదంబే అనిశంబు నిల్చును కదా, క్షేమంబులేదాయె ఛీ
ఛీ దేశాటనమా గృహస్థునకు యోచింపంగదే డెందమా

తన జీవితంలో అనుభవించిన సుఖదుఃఖాలను వర్ణిస్తూ, లౌకికమయిన ఈ జీవితంలోనుండి శాశ్వతానందం పొందే అవకాశం జార విడుచుకొని, యవ్వనకాలం అంతా వృధాగా గడిపి ఆ పరలోకంలో ఏమి ఫలితం పొంద దలచుకున్నావు అంటూ -
సీ. అనుకూలవతి కాని అతివతో కొన్నాళ్ళు కోర్కెచే పరసతుల్ కొన్నినాళ్లు
    ధనము తేలేని విద్యల చేత కొన్నాళ్ళు ఉన్నది తినలేక కొన్ని నాళ్ళు
    దేశ బంధుల వీడి తిరుగుట కొన్నాళ్ళు ఉన్న వారల బాధ కొన్ని నాళ్ళు
  తనసాటి వారి పంచను జేరి కొన్నాళ్ళు కుత్సితోద్యోగంబు కొన్నినాళ్ళు

తే.గీ  ఎన్నినాళ్ళిట్లు గడుపుటకెంచినావొ
       శాశ్వతానంద కందంబు జారవిడిచి
       ప్రాయమంతయు వృధ చేసి పరమునందు
        ఏమనుభవింపనెంచితి వెరుగ చెపుమ



తన జీవితం మొత్తాన్ని తననుండి దూరంగా వీక్షిస్తూ పరమాత్మలో లీనం కావడానికి కావలసిన అర్హత సంపాదించుకొనే ప్రయత్నం చేయకుండా మంచి వయసు, శక్తి ఉన్న ప్రాయంలో కేవలం లౌకికసుఖాలకే ప్రాధాన్యం ఇచ్చిన తన ప్రవర్తనకు బాధ పడుతూ, దీనివలన సాధించినదేమిటని తనను తానే ప్రశ్నించుకోవడంలో ఆ శాశ్వతానందాన్ని పొందడానికి చేయవలసిన ప్రయత్నం గురించి వివేచించడం కనిపిస్తుంది.


ఏ జీవికైనా జన్మము, మృత్యువు అనే దశలు తప్పవు. కానీ జీవి తనకు తానై జీవితం నుండి, అది అందించే సుఖాలనుండి దూరంగా తొలగి పోవాలని మృత్యువును ప్రేమగా ఆహ్వానించాలని ప్రయత్నం చేసినప్పుడు ఆ జీవి మానసిక వేదనని గమనించిన వారికి ఎంతో దుఃఖం, బాధ కలుగుతాయి. వైరాగ్యానికి పరాకాష్టగా కనిపించే శాస్త్రిగారి ఈ పద్యం జీవుని వేదనని శోక రసంతో ఆవిష్కరిస్తుంది.
సీ.  ధన ధాన్య భోగ వర్తనము బాయకమున్నె భ్రామికంబులు                                                          వీడబడకమున్నె
దారపు త్రాది బంధనము ద్రెంపకమున్నె సంఘ సంపర్కముల్                                                             సనకమున్నె
కరుణార్ద్ర హృదయంబు కఠినమొందకమున్నె కోర్కెలెల్లను

                                            కోసి కొనకమున్నె
అంత్రేంద్రియములెల్ల నణగి చావకమున్నె కష్టకాలమ్మును

                                               గనక మున్నె
తే.గీ.   దుష్టజాలంబు లెల్లను దొలగి పోవ
        పాపకర్మంబులెల్లను బడలిపోవ
        శాంతరసమెల్ల కాలంబు స్ధాయి గొనఁగ
        మృత్యువా వేగవచ్చి కాన్పింపుమమ్మ


ప్రముఖ గాయకుడు, శాస్త్రిగారి శిష్యుడు ఘంటసాలగారిపై గురువుగారి ప్రభావం అపారం. ఘంటసాల జీవిత పర్యంతం ఆయన ప్రవర్తనలో నడవడికలో మాటతీరులో గురువుగారిని స్మృతికి తెచ్చే ఏవో లక్షణాలు కనిపించేవని ఇద్దరినీ ఎరిగినవారు భావించేవారు. పై పద్యాన్ని ఘంటసాలగారు తన కచేరీలలో తరచు ఆలపించేవారుట.
తరువాతి కాలంలో ఘంటసాల ప్రైవేటు రికార్డుగా ఇచ్చిన తన స్వీయరచన -మృత్యువంటే భయంలేని ఒక వ్యక్తి పాడుకున్న పాట అంటూ ఆలపించిన బహుదూరపు బాటసారీ గేయం పైన గురువుగారి గేయం ప్రభావం ఉందేమో అనిపిస్తుంది.
ఇలాటి వైరాగ్యమే కనిపించే మరొక పద్యంలో మానవులను సృష్టించిన బ్రహ్మ ఏప్రాణికి ఏ సుఖదుఖాఃలను రాసిపెట్టాడో తెలియదుకదా అని అంటారు శాస్త్రిగారు.
తే.గీ.  ఏ స్థలమ్మున ఏ ప్రాణికెప్పుడెట్టి
       కష్టసుఖములు గలుగునో కమలభవుడె
       వ్రాసి నుదురను పెట్టెలో భద్రపఱచె
       వెలుపలను తోలు సీలుంట తెలియరాదు



 బ్రహ్మ తాను ప్రాణుల నుదురుమీద వ్రాసిన విషయాలను నుదురు అనే పెట్టెలో పెట్టి బయట తోలుతో సీలు చేసాడట. అందుకే ప్రాణులకు ఎక్కడ సుఖం, దుఃఖం కలుగుతాయనే సంగతిని ముందుగా ఎవరూ తెలుసుకోలేముట. ఎంత చమత్కారమయిన భావం!


బతుకు గడపడంకోసం, కుటుంబాన్ని పోషించుకోవడం కోసం ధనసంపాదన చేయవలసిరావడం, అందుకు ఉద్యోగమనే బానిస జీవితం గడపడం, తుచ్ఛమైనదని తెలిసినా డబ్బు కోసం వెంపర్లాడక తప్పని స్థితి సీతారామశాస్త్రిగారికి దుర్భరమైన వేదన కలిగించేవేమో! ఆయన పద్యాలలో ఈ వేదన కనిపిస్తుంది.
చం.   అనుభవమింత లేని పరిహాస విధాయక నీచకార్య సా
       ధన రచనాదులన్ కుజన దాస్యముతో జతచేసి లోకమో
       హనకర గానశాస్త్రమకటా వికటంబుల పాలు జేసి జీ
       వనమును బుత్తువా దురిత భారము నెత్తిని మోసి మూర్ఖుడా

అని ఒక పద్యంలో స్వీయనిందకు పాల్పడతారు.
మరొక పద్యంలో సొత్తు కోసం తాను ఇంతగా పాటుపడవలసిన పరిస్థితి కల్పించిన భగవంతుడిని ఆక్షేపిస్తారు. అంతూ, దరీ కనిపించని దుఃఖసాగరంలో తనను తోసేసి, బాధలనే అగ్నులతో కాల్చేసి తనని పరీక్షిస్తున్న భగవంతుడిని కరుణతో దయచూసి రక్షించి చేరదీయవలసినదిగా ప్రార్థిస్తూ శరణు వేడుతారు.
మ. 
దరిలేనట్టి విచార సాగరమునందా ద్రోసి బాధించి నా
     చరితంబింతయు దుఃఖ వహ్నినిడి వ్రేల్చన్ జూచితే సొత్తుకై
     అరరే యింతటి ద్రోహచింత తగునా హా పాహిమాం పాహిమాం
     కరుణా సాగర మమ్ము బ్రోవుమిల రంగా దీన సంరక్షకా

ఉద్యోగధర్మం శాస్త్రిగారి ప్రవృత్తికి వ్యతిరేకం. స్వేచ్ఛగా, సంతోషంగా జీవితం గడపాలని ఆశించే తనలోని కళాకారుడిని ఉద్యోగం, కుటుంబం వంటి సంకెళ్ళతో బంధించడానికి చూడడం భగవంతుడి ద్రోహచింతనగా భావిస్తారు.
అంతలోనే-
శా. శరణంటిన్ కడు దీనుడన్ జడుడనాశాపాశ బద్ధుండ వేరొ
    క్కరు లేని దుఃఖితాత్ముడను నీవే నన్ను రక్షింపగా
    తెరవూహింపకయున్నవే మరి ఏదీ దిక్కు తర్కింపగా
     కరుణా సాగర మమ్ము బ్రోవుమిల రంగా దీన సంరక్షణా


అంటూ నీవేతప్ప ఇతఃపరంబెరుగ అనే శరణాగతి మార్గాన్ని అవలంబించి రక్షించమని ప్రార్థిస్తారు.
చం. సరసత లేని కీర్తనలసంఖ్యలు పాడి సునాదలీననం
     బెరుగక కంఠనాళముల నెత్తి బిగింపగనేల, భక్తితో
      హరహర పాపనాశ భవహారి శివా మహదేవ శంకరా
     సరగున బ్రోవుమంచు మనసా హరునెంచి తరింప జూడుమా


అంటూ ఆ పరమేశ్వరుని అత్యంత భక్తితో కీర్తిస్తారు. గానానికి పరమావధి సంగీతంతో మహాదేవుని స్మరించడంలోనే ఉందని గుర్తుచేస్తారు.

సీతారామశాస్త్రిగారి కృతులు -కీర్తనలు

సీతారామశాస్త్రిగారు అనేక కీర్తనలు రచించారు. కృతి, కీర్తన రెండూ కర్ణాటకసంగీత ప్రక్రియలే. అయితే కృతులు సంగీత ప్రధానంగాను, కీర్తనలు సంగీతంతో పాటు సాహిత్యం కూడా ప్రధాన భూమికగా ఉండి భావ ప్రధానంగా భక్తిరసంతో కూడి భగవంతుడిని కీర్తించేవిగా ఉంటాయి.


శాస్త్రిగారు భగవంతుడిని భక్తి, జ్ఞాన, వైరాగ్య మార్గములలో కీర్తిస్తూ అనేక కీర్తనలు రచించారు. వాటిని స్వరపరిచేరు. వీటిలో కొన్ని శ్రీరాముడిని ఆరాధిస్తూ పరమ భక్తుడుగా కీర్తనలు రచించడం చూడవచ్చు. అంతేకాక వీటిలో సంగీత సంబంధమయిన లక్షణాలను వివరించే లక్ష్యరచనలు కూడా ఉన్నాయి. సంగీతంలో స్వరజతులు, వర్ణాలు, కీర్తనలు, కృతులు వంటి ప్రక్రియలలో రచనలు చేసారు.
సంగీతంలోనూ, నాట్యంలోను వర్ణం అనే ప్రక్రియకు చాలా ప్రాముఖ్యం ఉంది. రాగ స్వరూపాన్ని నేర్చుకోవడం కోసం సంగీతంలో వర్ణం ఉపయోగిస్తుంది. వర్ణాలు తానవర్ణాలు, పదవర్ణాలు ఉంటాయి. పదవర్ణాలు నాట్యంలో ఎక్కువగా కనిపిస్తాయి. తాన వర్ణాలలో పల్లవి, అనుపల్లవి, చరణం ఉంటాయి.


వీణకుప్పయ్యర్ వంటి విద్వాంసులతో ప్రసిద్ధి చేయబడిన వర్ణ సంప్రదాయాన్ని అనుసరిస్తూనే మరిన్ని క్లిష్ట నియమాలను ఏర్పరుస్తూ కళ్యాణి రాగం ఆదితాళంలో శాస్త్రిగారు ఒక వర్ణ రచన చేసారు. షడ్జమ పంచమాలను విడిచి త్రిస్థాయిలలో రాగసంచారము చూపి, ఆవృత్తి చివర ఖండ మొదలైన జాతిమోరాలను అమర్చినట్టు చెప్పారు. చరణంలో మాత్రం షడ్జపంచమములను ఉపయోగించి రాగము సంపూర్ణము చేసి, రాగనామము చెప్పి, జంత్రగాత్రములు సాధన చేసే ప్రాజ్ఞులకు ఈ వర్ణము మిక్కిలి ఉపకరించునని తలచెదను అని ఈ వర్ణం గురించి చెప్పారు శాస్త్రిగారు. ఈ వర్ణాన్ని స్వరపరచి ఎందరో రసికులైన ప్రేక్షకులకు పరవశమయిన స్థితిని కలిగించి నాదానందములో కరిగించారు.
ఈ వర్ణం లోని సాహిత్యం -
పల్లవి
నెఱజాణవని సామి నెఱ నమ్మినది నీకై
అనుపల్లవి
మరుని బారికోర్వలేక సరసిజేక్షణ నిను రమ్మనె జగన్మోహనా
చరణం
నిండు జవ్వని సుమా కళ్యాణి
సంప్రదాయాన్ని అనుసరిస్తూనే క్లిష్టమయిన నియమాలను విధించుకొని త్రిస్థాయిలలో రాగసంచారం చేస్తూ శాస్త్రిగారు ఈ వర్ణం ఆలపిస్తే సంగీత ప్రియులంతా ఆనందంతో పరవశించి పోయేవారు.


సీతారామశాస్త్రిగారు అమ్మవారిని స్తుతిస్తూ సంస్కృతంలో ఒక స్వర జతిని వ్రాసారు. స్వరజతిలో పల్లవి, అనుపల్లవి, చరణం అంగాలుగా ఉంటాయి.
ఆ స్వరజతి -

పల్లవి
లలితే సరసగాన కళాశ్రితే సలలిత స్వరాంచితే
పంచమ స్వర రహితే సుచరితే 

భక్తగాయకాళి కంఠసహితే
సూర్యకాంత నామ రాగ జనితే సుందర షాడవ శ్రుతి ప్రకాశికే

అనుపల్లవి
మృదుల శృంగార రూప సహితే 
సదమలానంద భావపూరితే
సకల కళ్యాణ భాసురాయితే సరస భావరాగ ప్రసారితే

చరణం
మంజుల పుష్ప విరాజిత కేశే
మంజీరారవ రంజిత పాదే
మణిమయ సువర్ణ భూషిత దేహే

 మామక మానసికాధివాసే
లక్షణగీతంలో చెప్పబడినట్టే ముందు రాగలక్షణం, అందులోని స్వరాలు, జన్యరాగం, ఔడవ షాడవ సంపూర్ణములలో జీవస్వరం దేనిని సూచిస్తోంది అన్న విషయాలను సాహిత్యంలో పల్లవిలో చెప్పారు. అనుపల్లవి చరణాలలో దేవి రూపాన్ని వర్ణిస్తూ కీర్తించారు. ఈ సాహిత్యాన్ని స్వరపరిచారు శాస్త్రిగారు.
శాస్త్రిగారి శిష్యుడు ఘంటసాలకు సంగీత సాహిత్య పరిపోషకమైన ఈ స్వరజతి అత్యంత ప్రియమైనది. ఘంటసాల ప్రప్రథమంగా మద్రాసు ఆకాశవాణి కేంద్రంలో గురువుగారి ఈ కీర్తననే ఆలపించారు. అంతేకాక, తాను సంగీత దర్శకత్వం వహించినసారంగధరచిత్రానికి టైటిల్స్ ప్రదర్శించేటపుడు నేపథ్యంగా కూడా ఈ కీర్తననే ఉపయోగించుకున్నారు. ఆయన శాస్త్రీయ సంగీత కచేరీలు చేసే రోజుల్లో కూడా ప్రార్థనా గీతంగా ఈ గీతాన్నిపాడి అమ్మవారిని స్తుతించి కార్యక్రమం ప్రారంభించేవారుట.
సంగీత శాస్త్రంలోని రాగాలలో బేగడరాగంపై తన ప్రియత్వాన్ని శాస్త్రిగారు ఒక పద్యంలో చెప్పారు.
తే.గీ.
ఎన్ననగు రాగజాతములెన్నొ రాగ
మండలమ్మున నుండిన నుండవచ్చు
గాక, రుచిమీరి జిగిమించు కళల నించు
బేగడా రాగమన పాలమీగడ కద

అని రాగాలన్నిటిలో అత్యంతమధురంగా పాలమీగడ వంటి రుచిని తలపించేదిగా బేగడ రాగాన్ని వర్ణించారు. ఈ రాగంలోనే శాస్త్రిగారు ఒక వర్ణాన్ని కూడా రచించారు. ఆ వర్ణంలో సాహిత్యం:
పల్లవి
నిన్నే కోరి యున్నదిర

అనుపల్లవి

చిన్నారి చిలుక
కన్నెడ సేయకా గోపాలా

చరణం

సరసకురా చలమేల తాళ జాలదుర
సాధారణంగా తానవర్ణములు చతుశ్రజాతి త్రిపుట తాళమునందుకాని, మిశ్రజాతి ఝంప తాళమునందు కాని, ఖండజాతి అటతాళములో మాత్రమే పూర్వులచే ప్రసిద్ధి చేయబడినవని, చతుశ్రజాతి రూపక తాళమందు వర్ణగ్రంథము కనిపించకపోవుట చేత, సాహిత్యానికి అనుకూలమైన తాళమగుట వలన ఈ వర్ణము రూపక తాళములో తాను రచించినట్టు శాస్త్రిగారు చెప్పారు.
శాస్త్రిగారి విరచితమయిన ఇతర కీర్తనలు-


హంసధ్వని ఆదితాళంలో రచించినగణనాథ స్మరణా పావనా
శంకరాభరణం ఆదితాళంలో కరుణించరా కరుణానిధే రామ’ ,
గౌరీమనోహరి ఆదితాళంలో రచించిన గానము సేయరాదా ప్రణవగానము సేయరాదా’,
పంతువరాళి ఆదితాళంలో జగదానందకరా శ్రీరామ’,
మధ్యమావతి ఆదితాళంలో ప్రేమలేదా ఉమా సరస్వతి’,



వకుళాభరణం ఆదితాళంలో దరిసెనమిడరాదా 


పరమ భాగవతోత్తముడైన త్యాగరాజస్వామి ఒరవడిలో సీతారామశాస్త్రిగారు శ్రీరాముడి గురించి రచించిన కీర్తనలు ఇవి.
సింహేంద్ర మధ్యమం చాపు తాళంలో రచించిన సుగుణ మణి గణ ఖచిత వీణా సుగుణ గాన వినోదినీ
ముఖారిఆదితాళంలో నాదానందమురా ఆహత నాదానందమురా’,
నాదచింతామణి ఆదితాళంలో రాగభావ స్వర రస పోషణ


మొదలైన రచనలలో శాస్త్రిగారి భక్తి జ్ఞాన వైరాగ్యభావాలను దర్శించగలం. ఈ కీర్తనలన్నీ త్యాగరాజువారి కీర్తన సంప్రదాయమును అనుసరించి సంగీత శాస్త్ర సమ్మతమయన పద్ధతులలో రచించినట్టు శాస్త్రిగారు ప్రకటించారు.
1937 సెప్టెంబరులో వేదవిద్యా పరిషత్ వారి ఆంధ్రాంగ్ల పత్రిక వేదిక్ రీసెర్చి శ్రీ ఆకెళ్ళ సత్యనారాయణరావుగారి సంపాదకత్వంలో వెలువడింది. 1938 ఫిబ్రవరి నుండి, 1938 అక్టోబరు వరకు వెలువడిన 9 సంచికలలో శాస్త్రిగారు సంగీత సాహిత్య సమ్మేళనం అనే శీర్షికలో కొన్ని రచనలను ప్రకటించారు. సంగీత లక్ష్య, లక్షణ విశేషాలతో కూర్చబడి, స్వరపరచిన వర్ణ, కృతి, గేయ, స్వరజతి ప్రక్రియలలో తాను స్వయంగా రచించిన ఈ రచనలలోని గుణదోషములను విమర్శించి ప్రోత్సహించవలసినదిగా గానశాస్త్ర పరిశోధకులను అభ్యర్థించారు.


1934 లో ఓడియన్ గ్రామఫోన్ కంపెనీ వారు చినగురువుగారి కీర్తనలను రికార్డుచేసి విడుదల చేసారు.


వకుళాభరణంలో గానం చేసిన దరిసెనమిడరాదా నీదగు దరిసెనమిడరాదా‘, మధ్యమావతి రాగంలో స్వరపరచినప్రేమలేదా ఉమా సరస్వతి‘, కీర్తనలు ఈ రికార్డులో ఉన్నాయి. స్టేజి సంగీతమే శ్రేష్ఠమనుచు నెంచిఅంటూ సభలలో గురువుగారు ఆ రోజులలో తరచుగా ఆయన పాడిన పద్యం, రెండువేపులా చేయబడిన రికార్డు. నేడు అది అలభ్యం.
సంగీతం ఎలా ఉండాలని ఆయన భావిస్తున్నారో చెప్పే కీర్తన ఒకటి శాస్త్రిగారు రచించారు. రాగ భావ స్వర రసపోషణ అనే కీర్తనలో శ్రవణానందం, శాస్త్రసమ్మతం కలిగిన సమ్యక్ గీతంగా సంగీతం ఉండాలని నిర్వచించారు.
ఇదివరకు ప్రసిద్ధమై ఉన్న రాగాలలోనే కాక ఒక కొత్తరాగాన్ని కూడా వేదిక్ రీసెర్చి పత్రికలోప్రకటించారు శాస్త్రిగారు.
స్మృతి రంజని రాగం అనే కొత్తరాగం 22మేళకర్త అయిన ఖరహరప్రియ జన్యమని, భాషాంగ రాగమని, ఔడవ సంపూర్ణరాగం మూర్ఛన సగమపనిస సనిదనిపమగరిస గా ఈ రాగలక్షణాలను చెప్పారు. దీనికి లక్ష్యంగా శాస్త్రిగారు రచించిన కీర్తన -
పల్లవి


ఇహపర సాధనమే ఓ మనసా
అను పల్లవి
విహితకర్మ బంధమున చరించుట
వేదస్వరూపునిగన మదినెంచుట
చరణం -
రక్తి రాగ సాగరము తరించి వి
రక్తి యోగ మార్గము దరిచేరుట
శక్తిహీన మానవుదయ చూచుట
యుక్తి సాధనుని యొద్ద చేరుటయ
ఈ కీర్తన కొత్తరాగంలో కూర్చబడడమే కాక భావగాంభీర్యంతో, ఆధ్యాత్మికానందాన్ని వర్ణించిన గొప్ప సాహిత్యంతో రచించబడింది.
గానరసాన్ని ఏరీతిగా అనుభవించాలో అందులో గల ఆనందం ఎలా ఉంటుందో వర్ణించే గేయం -
పల్లవి
సరసగాన సుధా సరసిని బడివడి
జలకములాడగరారా
అనుపల్లవి
హాసముతో సువిలాసముతో ఉ
ల్లాసముతో -దరహాసముతో పరిహాసముతో
మిసిమి జవ్వనుల మేళనతో బల్
సరసగానసుధాసరసిని బడివడి
చరణం
తొలకరి మెరపుల తళుకుల కళలను
కలకలరవముల నింపరా ఆహా
పులకలతో మైపులకలతో మరు
ములుకులతో సరి పలుకులతో
నెలతల కనుగవ మెలపులతో
వయ్యా రముతో సయ్యాటలతో
సరసగానసుధాసరసిని బడివడి
కాపిరాగంలో చతురశ్రంలో కూర్చబడిన రక్తిని కలిగించే గేయం ఇది. భావగీతం వలె హుషారును కలిగిస్తుంది. దీనిని స్వరపరిచారు శాస్త్రిగారు. పల్లవి, అనుపల్లవి, చరణం ఈ గేయంలో ఉన్నాయి. జావళీ వలె కూర్చబడిన రక్తి గేయం ఇది.
సాధారణంగా జావళీ రచనలు శృంగార రస ప్రధానములై ఉంటాయి. ప్రేయసీ ప్రియుల శృంగారానికి సంబంధించినవిగా ఉంటాయి. గ్రామ్యభాషలో సుళువుగా పాడుకోవడానికి వీలయిన సాహిత్యంతో ఉంటాయి. ఆది, రూపక, చాపు తాళములతో రచింపబడినవిగా ఉంటాయి. పరకీయ అయిన నాయికకి సంబంధించినవిగా ఉంటాయి జావళీలు. సీతారామశాస్త్రిగారు స్వకీయ అయి గృహిణిగా ఉండే నాయికకు సంబంధించిన అంశాలతో సాహిత్యాన్ని కూర్చి జావళీ వంటి రచన చేసారు. జావళీలో ఒక కొత్త ప్రయోగం ఇది.
వగల వయ్యారి అదిరా
ఆ చిన్నారి వగల వయ్యారి అదిరా
సొగసరి జవరాలు తగినింటి మగనాలు
మురిపాల హొయల మైమరపించు ప్రియురాలు
అత్తమామల వదిన బావా మరదుల మగని
చిత్తమెరిగిన నెరజాణయదిరా
సరసా సరాగాల చనవైన నయగారాల
హితులు సన్నిహితులోహోయని మెచ్చే
వగలవయ్యారి అదిరా....

ఆచిన్నారి వగల వయ్యారి అదిరా
ఇంపైన మాటల సొంపైన మాటల
తీరైన నడతల తీయని వలపుల 
నెనరైన పెనిమిటి మనసును దోచి
తనువు నెమ్మనము తనివోవజేసే
వగల వయ్యారి అదిరా

అంటూ సాగే ఈ గీతంలో సాహిత్యం సంసార జీవితంలో స్త్రీ గృహిణిగా భర్తను, అత్తమామలను, మరుదులను, ఆడపడచులను ఏవిధంగా ఆదరిస్తూ, అందరి అభిమానానికి పాత్రమవుతూ వ్యవహరిస్తుందో చమత్కారంగా వివరిస్తుంది.



జ్ఞానానందాశ్రమంవారి పత్రిక అమృతవాణిలో శ్రీ పోతనామాత్యుడు-త్యాగబ్రహ్మఅనే వ్యాసాన్ని 1947లో వెలువరించారు. పోతనకు, త్యాగయ్యకు రచనలో ఉన్న భావసామ్యాన్ని చక్కగా వివరించిన వ్యాసం ఇది. సంగీత శాస్త్రానికి సంబంధించి శాస్త్రిగారు రచించిన వ్యాసాలు ఆనాటి పత్రికలలో ప్రకటించబడ్డాయి.


1957 సంవత్సరం ప్రారంభంలో విజయరామా సంగీత కళాసాల నుండి పదవీ విరమణ చేసారు సీతారామ శాస్త్రిగారు.


1957 ఏప్రెల్ నెలలో   57సంవత్సరాల వయసులోనే మరణించారు.


శాస్త్రిగారి మరణానంతరం ఆయన కుమారుడు ప్రభాకరరావుగారు సాలూరులో శ్రీ పట్రాయని సీతారామ శాస్త్రిగారిని సంస్మరిస్తూ  శ్రీ శారదా గణపతి  నవరాత్రి ఉత్సవాలు నిర్వహించారు. కొన్ని సంవత్సరాల పాటు శాస్త్రిగారి సంస్మరణ పేరుతో సంగీత సభలు జరిగాయి. 


1970లో సాలూరులో శ్రీ సీతారామ త్యాగరాజ నారాయణదాస మహోత్సవ కమిటీ ఏర్పడింది. శ్రీ పట్రాయని సీతారామ శాస్త్రిగారి పేరు మీద ఆయన జన్మదినం సందర్భంగా ప్రతి సంవత్సరం  సాలూరులో అనేక సంగీతసంబంధమయిన ఉత్సవాలను ఈ కమిటీ నిర్వహించింది. హరికథలు, బుర్రకథలు,గాత్ర సంగీత కచేరీలను, పేదలకు అన్నదానాలను నిర్వహించారు.


1970 లో శ్రీ ఘంటసాల గారిని, 1972 లో శ్రీ సాలూరు రాజేశ్వరరావుగారిని ఈ కమిటీ వారు సన్మానించారు.ఈ సన్మానాల అనంతరం ఘంటసాలగారి, సాలూరు రాజేశ్వరరావుగారి ఆర్కెష్ట్రాతో సంగీతకచేరీలు జరిగాయి.  

                                  శాస్త్రిగారి స్మారక సంచిక విడుదల కార్యక్రమంలో పాల్గొన్న
                                  ఘంటసాల, ప్రసంగిస్తున్న శాస్త్రిగారి కుమారుడు సంగీతరావు

1972 లో ఈ కమిటీ శ్రీ పట్రాయని సీతారామశాస్త్రిగారి జయంతి సంచికని వెలువరించారు.
సీతారామ శాస్త్రిగారి రచనలను లభ్యమయినంత వరకు సేకరించి సంపుటీకరించి దానిని శ్రీ పట్రాయని సీతారామశాస్త్రిగారికే అంకితంగా వెలువరించారు. ఈ సంపుటికి శ్రీ పంతుల లక్ష్మీ నారాయణ శాస్త్రిగారు గౌరవ సంపాదకులు. శ్రీ ఆకుండి నారాయణమూర్తి వంటి శాస్త్రిగారి ప్రియశిష్యులెందరో ఈ మహత్కార్యాన్ని నిష్కామకర్మగా నిర్వహించారు. శ్రీ పట్రాయని సీతారామశాస్త్రి జయంత్యుత్సవ సంచిక పేరుతో వెలువడిన ఈ గ్రంథంలో శ్రీ ఘంటసాల, శ్రీ ఆకుండి నారాయణమూర్తి, శ్రీ పంతుల శ్రీరామ శాస్త్రి వంట  ప్రసిద్ధులెందరో  శాస్త్రిగారి తో తమ అనుభవాలను వివరించారు. ప్రముఖులు వ్రాసిన వ్యాసాలతో పాటు శాస్త్రిగారి శిష్యులు అలిఖితంగా, చాటువులుగా ఉన్న శాస్త్రిగారి రచనలను ఎంతో శ్రమదమాదులను ఓర్చుకొని ఒకచోట చేర్చి సంపుటీకరించారు. 
1972 లో నవంబరు 1న ఈ జయంత్యుత్సవ సంచికను విడుదల చేసారు.




ఉపసంహారం

పరమ భాగవతోత్తములుగా భాసించే మన వాగ్గేయకారులు ఎంతో చక్కని రచనలు చేసి గానకళను అభివృద్ధి చేసారు. అటువంటివారి రచనలను అభ్యసించి, పదిమందికీ చెప్పి, సాధనతో వాటి మర్మాలను, సంగీతశాస్త్ర రీతులను గ్రహించి తనదైన శైలిలో సంగీత ప్రక్రియలలో ఇన్ని విధాలుగా రచనలు చేసారు సీతారామశాస్త్రిగారు. ఈ రచనలను కేవలం సాహిత్యంగా లిఖించడమే కాక, వాటిని సుస్వరంగా స్వరపరచి స్వయంగా సభలలో పాడి జనావళికి తన్మయత్వాన్ని, నాదానందములోని రససిద్ధిని అనుభవానికి తెచ్చారు.


చినగురువుగారు ఒకపద్యంలో సరస్వతీ దేవి ఒక్కొక్కరిని కవివరుని చేసి, గాయకప్రవరుజేసి గారవిస్తుందని అన్నారు. దేవి ఆయనకి ఆ రెండు వరాలు ఇచ్చి కటాక్షించింది. ఆ శారదాంబను శాస్త్రిగారు తల్లిగా భావించి నాదోపాసన అనే తపస్సు చేత మెప్పించి సంగీతామృతంతో పాటు, సారస్వత మకరందాన్ని కూడా వరప్రసాదంగా పొందారు. తన కవితా మకరందాన్ని, సంగీతామృతంతో కలిపి రసజ్ఞులైన శ్రోతలకు పంచిపెట్టారు. శరణాగతి మార్గాన్నివరించి శరణు ముఖజిత శశిబింబ శారదాంబ అని ఆ దేవిని స్తుతించారు. భక్తి జ్ఞాన వైరాగ్యమార్గంలో రచనలు చేసి, గానం చేసి పరమ యోగిలా జీవించారు.


అద్వితీయమైన గాయకుడిగా, అసమాన ప్రజ్ఞాశీలి అయిన సంగీత విద్వాంసుడిగా భక్తి, జ్ఞాన, వైరాగ్య భావాలను ప్రకటించే కీర్తనలు రచించి రసభావములకు అనుగుణ్యమైన తాళగత, స్వరగతులతో లయశుద్ధితో స్వరపరిచి ఒక నాదసిద్ధుడిగా భాసించి రసికులైన ప్రజల హృదయాలను గెలుచుకున్న సంగీతకారుడు శాస్త్రిగారు.


సంప్రదాయాన్ని గౌరవిస్తూనే, స్వరరచనలో స్వాతంత్ర్యాన్ని ప్రకటిస్తూ పద్య, గేయరచనలు చేస్తూ, వాటిని పారవశ్యంతో గానంచేస్తూ వాగ్గేయకారుడిగా రామభక్తిలో తరించిపోయిన ఒక పోతన, ఒక త్యాగయ్య కలిసిన మూర్తిమంతంగా సంగీత సాహిత్య మేళవింపుగా కనిపిస్తారు -సాలూరు చినగురువుగారు, పట్రాయని సీతారామశాస్త్రిగారు.
 
 
 
 
 






8 comments:

Rao S Lakkaraju said...

ప్రపంచములో మహానుభావులు జన్మిస్తూ ఉంటారు, వారి వారి పనులు చేసి నిష్క్రమిస్తూ ఉంటారు. కాని ఆ పరిమళాలు కలకాలం ప్రభావిస్తూనే ఉంటాయి. చక్కగా జీవిత చరిత్ర చెప్పినందుకు థాంక్స్.

Lakshman .M. V. said...

excellently written. wonderful photographs of another era. painstaking effort. an article written with both the mind and the heart. keep writing. Kudos for bringing to light the greatness of 'Patrayani'.

sudha said...

@సంఘమిత్ర,
నా రచనపై మీ స్పందనకు ధన్యవాదాలు.
మీవంటి వారి ప్రోత్సాహం నన్ను ముందుకు నడిపిస్తుంది.

Unknown said...

సుధగారూ! మీరు మామూలు మనుషులు కారండోయ్!! ఏం సేకరణ? అంతా చదవలేకపోయాను కానీ, మీరు గృహిణేనా...? అయితే ఇంత ఓపిక ఎక్కడిది మీకు. ఇదంతా చూస్తుంటే మీకు గొప్ప అభిరుచి ఉందని తెలుస్తోంది. థాంక్స్ ఫర్ విజిటింగ్ మై బ్లాగ్.

seshagirirao_vandana@yahoo.com said...

వంశ చరిత్రను చాలా చక్కగా వ్రాసారు . మధురమైన మీ భాషా సరళి నాకు నచ్చినది .
డా.వందన శేషగిరిరావు (Dr.vandana seshagirirao-MBBS)

Unknown said...

sudharani gaaru meeru sekarimchina photos adhbutham.. mee krushiki naa joharlu.

Unknown said...

ఒక కారనజన్ముని,శారదాదేవి ముద్దుబిడ్డను గురించి ఎంతో మేటర్ కలెక్ట్ చేసి ఎంతో చక్కగా ,ఇన్ఫర్మేటివ్ గా వ్రాసినందుకు అభినందనలు.సంగితరావు గారి అభిప్రాయంతో ఏకిభవించకుండా ఉండలేము.ఆ చిరస్మరనియునికి చిరు కానుకగా మీరు వ్రాసిన వ్యాసం కూడా చిరస్మరనియం.మీరు పడిన శ్రమ ,తీసుకున్న ఇంటరెస్ట్,మీరు అందించిన సమాచారం చూస్తుంటే.ఆ శారదా పుత్రున్ని గురించి,ఆ శారదా దేవే మీ చేత ఈ వ్యాసం వ్రాయిన్చిందేమో అన్నంత గొప్పగా వుంది.మీ రచనలలో ఇది ఒక ఆణిముత్యం..టీవీఎస్ రావు

Rama Chaganti said...

Wonderful to see these posts and blog Sudha garu. It's a treasure for me for a fact.
I am a student of Patrayani Narayanamurthy garu who is my first Veena and Vocal Guru. Definitely brilliant family of Self-less Guruvus.