visitors

Saturday, February 11, 2012

ఇద్దరు మిత్రులు

ఇక్కడ చెప్పబోతున్న ఇద్దరు మిత్రులు, మన మధురగాయకుడు ఘంటసాల, కలైమామణి పట్రాయని  సంగీతరావూను.

పట్రాయని సీతారామశాస్త్రిగారు ఘంటసాలకి విజయనగరంలో  సంగీతవిద్య నేర్పిన గురువుగారు .గురువుగారి నుండి సంగీత విద్యను గ్రహించడమే కాకుండా ఆయన  వ్యక్తిత్వాన్ని జీవితాదర్శంగా చేసుకున్న గొప్ప శిష్యుడు ఘంటసాల. 

భాషలోని సాహిత్యభావానికి తగిన సంగీతకల్పన చేయడంలోతెలుగుపాటలో మాట తెలుగుమాటగా వినిపించాలన్న గురువుగారి ఆదర్శాన్ని ఘంటసాలగారు అక్షరాలా ఆచరించారు. గురువుగారి ప్రభావం వలననే భవిష్యత్తులో నా సంగీతానికి ఒక విశిష్టతప్రత్యేక వ్యక్తిత్వం ఏర్పడ్డాయి’ – అన్నారు ఒకచోట ఘంటసాల.

సీతారామశాస్త్రిగారు సంగీతాన్ని ఒకయోగంగా సాధనచేసిన గొప్ప సాధకులు. అనేకగీతాలను రచించి స్వరపరచి గానం చేసిన వాగ్గేయకారుడు.  గురువుగారి పట్ల ఎంతో వినయంతో పాటు అత్యంత ఆత్మీయతానురాగాలను చూపేవారు ఘంటసాల. 

గురువుగారి  ప్రథమ పుత్రులు సంగీతరావుగారు. పట్రాయని వంశంలోని తాతగారి, తండ్రిగారి సంగీత సాహిత్య స్వరసంపదను వారసత్వంగా అందుకున్నారు. అతి చిన్నవయసునుండే సంగీతకచేరీలు చేస్తూ ప్రముఖుల మన్ననలు పొందారు. 

ఘంటసాల విజయనగరంలో కొంతకాలం గురువుగారి ఆశ్రయంలో ఉండవలసిన పరిస్థితిలో వయసు తేడా ఎక్కువగా లేని సంగీతరావుగారు, ఘంటసాల మధ్య మైత్రి చిగురించింది. తరువాత ఘంటసాల మద్రాసుచేరి మంచి సంగీత దర్శకుడుగా స్థిరపడ్డారు. 1954 లో అనుకోకుండా మద్రాసు కి వచ్చిన  సంగీతరావుగారు ఘంటసాలగారి ఆహ్వానం మేరకు వారి ఆర్కెష్ట్రాలో హార్మోనియం వాయిద్యకారుడుగా, ఘంటసాలగారికి స్వరసహచరుడిగా మద్రాసులో ఉండిపోయారు.


1955లో ఘంటసాల  స్వంత ఆర్కెష్ట్రాని ప్రారంభించారు. అప్పటినుండి  ఘంటసాల  సంగీత దర్శకత్వం వహించిన చిత్రాలు అన్నిటిలోనూ సంగీతరావుగారు తనవంతు సహకారం అందించారు.ఘంటసాల స్వరపరుస్తూన్నప్పుడు వాటికి  నోట్స్ రాసి ఇవ్వడం, ఆర్కెష్ట్రాకి సూచనలు ఇవ్వడం  చేసేవారు సంగీతరావుగారు. పాట స్వరపరచినప్పుడు స్వరాలు రాసి ఇవ్వడం అనేది సులభమైన పని కాదు. చాలా శ్రమతో కూడుకున్నది.
పాట కంపోజ్ చేస్తున్నప్పుడు ఘంటసాల అలా పాడుకుంటూ వెళ్ళిపోతూ ఉండడమే కాని స్వరాలు రాసుకోవడానికి టైం ఉండేది కాదు. అప్పుడా స్వరాలను గుర్తుపెట్టుకొని హార్మోనియం మీద నోట్ చేసుకోవడం సంగీతరావుగారు చేసేవారు. అలాగే  పాటలను కర్ణాటక సంగీతపరంగా ప్రయోగాత్మకంగా కూర్చినప్పుడు  సంగీతరావుగారికి గల అపారమైన సంగీత ప్రతిభ తెలిసిన ఘంటసాల సందర్భానుసారంగా ఉపయోగించుకునేవారు.


ఘంటసాల సంగీతరావుగారిని సంగీతం బాబూ అని పిలిచేవారుట. ఒక్కోసారి మేష్టారూ అని కూడా సంబోధించేవారట. శ్రీ ఘంటసాలగారి విద్యార్ధి దశనుంచి ఆయన జీవితకాల పర్యంతం అనేక దశలలో సంగీతరావుగారు ఆయన మిత్రుడిగా, సహచరుడిగా మెలిగారు. అటువంటి తన గురుపుత్రుడుగా, ఓమంచి మిత్రుడిగా సంగీతరావుగారిని ఘంటసాలగారు తన జీవితాంతం కూడా ఎంతో ఆదరాభిమానాలు కనపరిచి గౌరవించారు. 
మొదటిసారి ఈ ఇద్దరూ కలుసుకున్న ముహూర్తబలం ఎటువంటిదోకాని ఘంటసాలగారి మరణ పర్యంతం సుమారు పాతిక సంవత్సరాలపాటు  ఇద్దరూ కలిసి ఎంతో ప్రియమిత్రులుగా చరించారు. వృత్తిలోను, ప్రవృత్తిలోను మమేకమైనారు.  ఘంటసాలగారి ఇంటి వెనుక భాగంలోనే సంగీతరావుగారి కాపురం.  రికార్డింగులకి కలిసే వెళ్ళేవారు. ఇరువురి కుటుంబాలు ఎంతో అన్యోన్యంగా ఉండేవి. పిల్లలంతా కలిసి పెరిగారు.  ఘంటసాల విదేశీయాత్ర చేసినా, ఎక్కడ కచేరీలు చేసినా  పక్కనే ఉండేవారు సంగీతరావుగారు. స్వర కల్పన చేసినప్పుడు స్వరాలు రాయడం,హార్మోనియంతో వా                   ద్య సహకారం చేసేవారు. 


ఈ విధంగా పాతిక సంవత్సరాలకు పైగా స్వరమైత్రితో, పవిత్రమైన  స్నేహబంధంతో  చిరమిత్రులుగా ఎంతో ఆత్మీయతానురాగాలతో ముడిపడిన                                    
బంధం  వీరిద్దరిదీ.

ఆ బంధానికి గుర్తుగా  డిసెంబరు 4, 2006 న  అప్పటి ముఖ్యమంత్రి డా.రాజశేఖరడ్డి  ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తరఫున  ఘంటసాల అవార్డ్              పేరుతో సంగీతరావుగారిని సత్కరించారు. 


మళ్ళీ ఈరోజు ఫిబ్రవరి 11, 2012 న ఘంటసాలగారి స్మృత్యర్థం ప్రతి           సంవత్సరం  ఇచ్చే  ఘంటసాల ప్రతిభా పురస్కారం అవార్డును  శ్రీ సంగీతరావుగారు అందుకోనున్నారు.  ఘంటసాల, సంగీతరావుగారి మధ్యగల మధురమైన స్నేహానుబంధానికి గుర్తుగా, సంగీత కళకు, నాట్యకళకు సంగీతరావుగారు అందించిన సేవలను గుర్తించి  ఈ అవార్డును 
సంగీతరావుగారికి లైఫ్ టైమ్ అఛీవ్ మెంట్ అవార్డు రూపంలో ఇచ్చి సన్మానించనున్నారు.

ఘంటసాలగారు మరణించి 38 సంవత్సరాలు గడిచింది. అయినా తెలుగు హృదయాలలో చిరంజీవి ఆయన.

పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు. ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపిగురుతులు - అన్నాడు మనసుకవి ఆత్రేయ. ఘంటసాలగారు మనకి వదిలి వెళ్ళిన తీపిగురుతు అయిన  ఈ ఇద్దరు మిత్రుల అనుబంధాన్ని మరోసారి గుర్తుచేసే సందర్బం ఇది.

శ్రీ సంగీతరావుగారికి అభినందనలు.


ప్రియమిత్రులు ఘంటసాలగారి గురించి సంగీతరావుగారి మాటల్లో తెలుసుకోవాలంటే ఇక్కడ వినవచ్చు.


11 ఫిబ్రవరి, 2012నాటి సన్మాన సభ వివరాలు :

11 comments:

Unknown said...

ఇద్దరు మిత్రులు శీర్షికన శ్రీ ఘంటసాల మరియు శ్రీ సంగీత రావు గారి సానిహిత్య పరిచయం చాల బాగుంది. కొన్ని విషయాలు మాకు తెలియనివి చెప్పారు. మీకు ధన్యవాదాలు. శ్రీ ఘంటసాల గారి 38 వ వర్ధంతి నాడు, ప్రతిభా పురస్కారం, శ్రీ సంగీత రావు గారికి ఇవ్వడం చాల సంతోషకరమైన విషయం.......వెంకోబ రావు కాశి.

www.apuroopam.blogspot.com said...

ఇద్దరు మిత్రుల కథని హృద్యంగా చెప్పారు.సంగీతరావు గారికి రావలసినంత గుర్తింపు రాలేదని ఆయన ప్రతిభని తెలిసిన వారందరూ అనుకుంటారు. ఇటువంటి సమయంలో మొన్న సంగీత నాటక అకాడమీ అవార్డు, నేడు ఘంటసాల ప్రతిభా పురస్కారం అవార్డును లైఫ్ టైమ్ అఛీవ్మెంట్ అవార్డు రూపంలోవారికి అందజేస్తున్న శుభ సందర్భంలో సంగీతరావుగారికి హృదయ పూర్వక శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాను. వారికి భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్యాలను ఇవ్వాలని కోరుకుంటున్నాను.

buddhamurali said...

మనిషి ఏ నాటికైనా మరణాన్ని జయిస్తాడని, సైన్స్ అంతగా పురోగతి సాధిస్తుందని అంటారు . అది ఎప్పుడు సాధ్యమో తెలియదు కానీ శాశ్వతంగా జీవించ వచ్చునని ఘంటసాల తన గాత్రం ద్వారా నిరూపించారు. ఘంటసాలకు సంబంధించి అప్పుడప్పుడు తెలియని విషయాలు చెప్పండి సుధ గారు

Voleti Srinivasa Bhanu said...

Sri Sangeetarao gaariki hridaya poorvaka abhinandanalu..paadaabhivandanalu..

కథా మంజరి said...

శ్రీయుతులు సంగీత రావు గారికి హృదయ పూర్వక అభినందనలు. ఇద్దరి మిత్రుల కథ ఎంత బాగా చెప్పావమ్మా , సుధా.

Anonymous said...

ఘంటశాలగారి వర్ధంతి సందర్భంగా నువ్వు తెలియజేసిన ఇద్దరు మిత్రుల కధ ఘంటశాల మధురస్వరంలొ రమణీయమైన పాట విన్నంత సంతోషంగా వుంది.

మంచి స్నేహం గుబాళించే పరిమళాలని పంచినట్టు ఈ ఇద్దరు సంగీతపరమైన మిత్రులు చిరస్మరణీయమైన రాగాలని మనకి పంచిపెట్టేరు. ఇద్దరు కళాకారులమధ్య స్నేహం ఇంతకాలం బతికిబట్ట కట్టిందంటే అది ఆ స్నేహితుల అనుబంధాన్ని తెలియజేస్తుంది. సంగీతం జీవించివున్నంతవరకు ఈ మిత్రుల స్వరగాత్ర సంగమంలో వచ్చినపాటలు గుర్తుంటాయి.

కళాకారులకి ఎన్ని సత్కారాలు జరిపినా పురస్కారాలు ఇచ్చినా వాటికి అవధులు లేవు. ఉండకూడదు. ఎందుకంటే అవన్నీ మనల్ని మనం సత్కరించుకోవడం లాంటివి. సంగీతరావుగారికి పురస్కారాలు కొత్తకాదు. అయినా ఘంటశాల ప్రతిభా పురస్కారానికి వారిని గౌరవపూర్వకంగా ఎన్నుకోవడం సహజమైనా బహు ప్రశంసనీయం.

సంగీతరావుగారికీ, వారి కుటుంబానికీ మా హృదయపూర్వక శుభాభినందనలు సగౌరవంగా తెలియజేసుకుంటూ వారికి భగవంతుడు సంపూర్ణంగా ఆయురారోగ్యాలని ప్రసాదించాలని ప్రార్ధిస్తున్నాము.
================================
కొల్లూరు కోటేశ్వరరావు

Sudha Rani Pantula said...

కె.కె.ఆర్ గారు, మీ అభిమానానికి, శుభాకాంక్షలకు ధన్యవాదాలు.

Sudha Rani Pantula said...

మూడు తరాలు గడిచినా ఘంటసాల జ్ఞాపకాల గుబాళింపుని ఆస్వాదిస్తున్నారంటే అది ఆయన శాశ్వతత్వానికి నిరూపణే. ధన్యవాదాలు మురళీగారు.

Tulasidas Konduru said...

అమ్మా సుధ గారూ
నా మిత్రుడు చి.గోపాలకృష్ణ వయసులో నాకంటే చిన్నవారు.వారి అర్ధాంగి మీరు. నాకు అత్యంత ప్రీతిపాత్రులైన సంగీతజ్ఞులు శ్రీ సంగీతరావు గారి కోడలు. నా కుమార్తె పేరు 'సుధ'. ఈ విధంగా మీరు పుత్రికా సమానురాలు. అయినా 'మీరు' అని సంబోదిస్తున్నాను. అందుకు కారణం మీ బ్లాగు. ఎన్ని విషయాలు చెప్పారమ్మా! చదువుతుంటే ఘంటసాల గారి సమక్షంలో కూర్చుని నాన్నగారి మాటలు వింటున్నట్టుగా నిలువెల్లా పులకింతలు కలిగాయి.
అభివందనాలు, అభినందనలు.
తులసీదాస్ కొండూరు

Unknown said...

విజయనగర సంగీతపు సౌరభాలు జగద్విదితమే అందునా ఘంటసాల సాలూరి పట్రాయని ద్వారం సుదర్శనం వారు చేసి అందించిన సేవలు మరువలేనివి.

Unknown said...

స్వరశాల ఘంటసాల అనేది నానుడి ఆంధ్ర దేశాన.
విజయనగర సంగీత నృత్య కళాశాలకు వలసిన వసతులు బోధనా సిబ్బందిని నియామకం జరగాలి.చాలా విభాగాలకు బోధించే వారు లేరు.ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలి.
విద్యార్ధులు చేరిక ఉపాధ్యాయ సిబ్బందిని బట్టీ ఉండేది.