visitors

Friday, August 25, 2017

అచ్చెరువుగొలిపే అఖండ జ్ఞాపకశక్తి!!


పట్రాయని సంగీతరావు గారి జ్ఞాపకశక్తి గురించి :

నిండా ముప్ఫయి ఏళ్ళు రాకుండానే ఏదీ జ్ఞాపకం ఉండడంలేదంటూ బాధపడుతుంటాం. చదవడానికేం - వందల పుస్తకాలు చదువుతాం కానీ రచయిత అభిప్రాయాన్ని లక్ష్యాన్ని గ్రహించడంలో చాలాసార్లు తికమక పడుతుంటాం. కానీ 97 సంవత్సరాల ముది వయసులో తాను ఎప్పుడో ఇరవయ్యేళ్ళ వయసులో చదివిన పుస్తకంలోని వ్యాసాన్ని, అందులోని శ్లోకభావాలను సంగీతరావుగారు ఉదహరించడం వింటుంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది.


1935 అంటే సరిగ్గా 82 ఏళ్ళ క్రితం ఉదయిని అన్న పత్రికలో విశ్వనాథ సత్యనారాయణగారు సీత(కుందమాల) అనే వ్యాసం రాసారు. సంస్కృత కవులు మళ్ళీ మళ్ళీ రామాయణమే రాయడం గురించి చెబుతూ అదే విషయాన్ని కవి మురారి భట్టు అనర్ఘ రాఘవంలో రాసిన శ్లోకాన్ని ప్రస్తావించారుట. ఏదో మాటల సందర్భంలో చిన్నప్పుడు చదివిన ఆ వ్యాసం గురించి ఇన్నేళ్ళ తర్వాత గుర్తుంచుకొని చెబుతున్నారు సంగీతరావుగారు.


యదిక్షుణ్ణం జహతి రామస్య చరితం


గుణైరేతావర్భిర్జయతి జహతి జగదన్యో జగతికః

తమాత్మానం తత్తత్ గుణగరిమ గంభీర మధుర స్ఫురద్వాగ్బ్రహ్మాణః

కథముపకరిష్యన్తి కవయః


శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు ఉదయిని అనే సాహిత్య పత్రిక (దసరా -నాలుగవ సంచిక) లో సీత (కుందమాల) అనే శీర్షిక తో రాసిన వ్యాసం లో ఉదాహరించిన శ్లోకం ఇది.


మురారి భట్టు చెప్పిన శ్లోక భావం :


అనేక మంది కవుల చేత నలగ గొట్టబడిన రామ చరిత్రనే తిరిగి నువ్వెందుకు రాస్తున్నావు అంటే కవి మురారి భట్టు చెప్పిన సమాధానం :


కవుల యొక్క మృదు మధుర గంభీర స్ఫురద్వాక్కులు శ్రీరామచంద్రుని వంటి నాయకుని వర్ణించినపుడు కాక తమకు తాము సార్థక మవడం మరెలాగ? - ఇదీ భావం.


భవభూతి ఉత్తర రామ చరిత్ర లో శ్రీరామ చంద్రుణ్ణి ఉత్తమ నాయకుడిగా ఎలా అయితే చిత్రించాడో అదే విధంగా దిఙ్నాగాచార్యుడు కుందమాల అనే ప్రాకృత నాటకంలో సీత పాత్రను మహోన్నతంగా చిత్రించాడు. అదీ ' "సీత - కుందమాల" శీర్షిక తో ఉన్న విశ్వనాథ వారి వ్యాసం నేపథ్యం.


సంగీత రావుగారు చెప్పిన ఉదయిని 1935 నాటి (దసరాసంచిక) దొరికింది. అందులో సీత (కుందమాల) పేరుతో శ్రీ విశ్వనాథ సత్యనారాయణగారి వ్యాసం ఉంది. సంస్కృత కవులలో సగానికి పైగా అందరూ రామాయణాన్నే తిరిగి రాసారని చెప్తూ ఈ మురారి భట్టు శ్లోకాన్ని ఉదహరించారు. అది అనర్ఘ రాఘవంలోనిది అని సంగీత రావుగారుచెప్తే తెలిసింది కానీ వ్యాసంలో ఆ విషయం లేదు. శ్లోకం మాత్రమే ఉంది. రామకథలోని గొప్పదనం ఏమిటంటే దిఙ్నాగుడనే బౌధ్ధునిచేత అద్వైత మతము, కర్మ సిద్ధాంతం వ్రాయించింది అన్నారు విశ్వనాథ. మురారి భట్టు శ్లోకం ఉదయినిలో ఉన్నది ఇది -


యదిక్షుణ్ణం పూర్వై రితి జహతి రామస్య చరితం

గుణై రేతావద్భిర్జయతి పునరన్యో జగతికః

స్వమాత్మానం తత్తద్గు ణగరిమ గంభీర మధుర స్ఫురద్వాగ్బ్రహ్మాణః

కథ ముప కరిష్యన్తి కవయః


(ఉదయిని పత్రిక గురించి- ఈ పత్రిక కొంపెల్ల జనార్దనరా‌వు సంపాదకత్వంలో 1934లో ద్వైమాసిక పత్రిక గా ప్రారంభమయింది. ఆరు సంచికలు మాత్రమే వెలువడి ఆయన అకాలమరణంతో ఆగిపోయింది.ఉదయిని వెలువడింది స్వల్పకాలమే అయినా సాహిత్యచరిత్రలో గణనీయమైన పత్రిక గా నిలిచింది. కొంపెల్ల మరణానంతరం శ్రీ శ్రీ మహాప్రస్థానం రచనను ఆయనకు అంకితం చేస్తూ ఆ అంకితాన్ని కూడా గేయరూపంలోనే..

తలవంచుకు వెళ్ళిపోయావా, నేస్తం!

సెలవంటూ ఈ లోకాన్ని వదిలి... అనే ఎలిజీ కవితను రాసారు. శ్రీశ్రీ మహాప్రస్థానం సంకలనంలో ఈ కవిత ను చూస్తాం)













No comments: