visitors

Friday, August 21, 2020

నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 1 - పదమూడవ భాగం

21.08.20 - శుక్రవారం భాగం - 13*:
పన్నెండవ భాగం ఇక్కడ:
నెం.35, ఉస్మాన్ రోడ్
               
               ప్రణవ స్వరాట్

మా ఇంటికి సంగీతం నేర్చుకోవడానికి ఇద్దరమ్మాయిలు వచ్చేవారు. మా వీధి వాళ్ళే. వడ్లమాని నారాయణ మూర్తిగారి అమ్మాయిలు. చిన్న బజార్లో ఆయనకో స్టీల్ సామాన్ల షాపుండేది. ఆ అమ్మాయిలు మాకంటే వయసులో బాగా పెద్ద. వాళ్ళకు మా ఇంట్లో ఎవరికి అవకాశం వుంటే వాళ్ళు పాఠం చెప్పేవారు. మా అమ్మ, సీత పిన్నిగారు ఇద్దరూ బాగానే పాడేవారు. వీణ వాయించడంలో కూడా ప్రవేశముంది. గీతాలు, వర్ణాలు, స్వరజతుల వరకు పిల్లలకు చెప్పగల సమర్ధత గలవారే. ఆ ఇద్దరమ్మాయిల పేర్లు గుర్తులేవు. కానీ, అందరూ వాళ్ళను పెద్దమ్మి, చిన్నమ్మి అని పిలిచేవారు. వాళ్ళు వస్తే మా పిల్లలకి కావలసినంత కాలక్షేపం. వాళ్ళ సంగీత పాఠం ఎప్పుడు పూర్తవుతుందా అని ఎదురు చూసేవాళ్ళం. వాళ్ళ సంగీత పాఠం పూర్తికాగానే పెరట్లోకి దారి తీసేవాళ్ళం. వాళ్ళు అక్కడున్న రాచఉసిరి కొమ్మలు పట్టుకొని గట్టిగ ఊపేసరికి కాయలన్నీ జలజలా నెత్తిమీద పడేవి. వాటిని తింటూ, వెనకవేపున్న జామిచెట్టు క్రిందకు చేరేవాళ్ళం. చాలా పెద్ద చెట్టు. కర్రకు అందనంత ఎత్తులో పెద్ద పెద్ద ముగ్గిన జామికాయలు, పళ్ళు ఉండేవి. ఈ పెద్దమ్మి, చిన్నమ్మి ఎలాటి చెట్లైనా ఎక్కడంలో ఆరితేరిపోయారు. క్షణాలమీద చెట్టు చివరదాకా ఎక్కి ఒకటి, రెండూ చెట్టంతా దుళ్ళగొట్టేసేవారు. క్రింద పడిన వాటిలో మంచివన్నీ ఏరి పెట్టడం నాపని. మా తాతగారు చూస్తే మాత్రం, 'ఆడపిల్లలు అలా చెట్లెక్కి కాళ్ళు విరగొట్టుకుంటే మీకు పెళ్ళిళ్ళు కావర్రా, దిగండి, దిగండి' అని అదిలించేవారు. ఆయన చూస్తే మాత్రం రాచ ఉసిరికాయలను తిననిచ్చేవారు కాదు. జలుబు చేసి, గొంతు పట్టేస్తుంది అని పిల్లలను తిననిచ్చేవారు కాదు. ఆ అక్కచెల్లెళ్ళిద్దరూ మాకంటే ఎంతో పెద్దైనా మాతో సమానంగా ఆటలాడేవారు. కొబ్బరాకులతో బూరాలు చేయడం వాళ్ళ దగ్గరే నేర్చుకున్నాను. 
కొబ్బరి ఆకుతో బూర

మా ఇంటి పెరటి తలుపు తీస్తే వెనక రోడ్. అక్కడే వీధి కొళాయి. అందులో నీళ్ళు వచ్చేసమయానికి ఇళ్ళలోని ఆడవారంతా బిందెలతో సిధ్ధమయేవారు. నీళ్ళ దగ్గరకు వచ్చేసరికి అంతవరకు ఉన్న స్నేహాలేవి పనిచేయవు. రోజూ ఎవరో ఒకరు కీచులాడుకోకతప్పదు. అక్కడ మాత్రం నోరున్నవాళ్ళదే రాజ్యం. పెరటి తలుపుకు కుడిప్రక్క ఒక ఇల్లుండేది. అందులో తల్లి, కొడుకు, కోడలు వుండేవారు. అతనికి కొత్తగా పెళ్ళయిన గుర్తు. ఆ అత్తాకోడళ్ళు ఇద్దరు నీళ్ళకొళాయి దగ్గర కనిపించేవారు. తమాషా ఏమిటంటే వాళ్ళిద్దరి పేర్లూ కాంతమే. కోడలిపేరు సూర్యకాంతం. అత్తగారు మరేదో కాంతం. అత్తగారిలాగే నేనుకూడా ఆ కొత్త కోడలిని సూరీడు అనే పిలిచేవాడిని, మా అమ్మగారు  పెద్దవాళ్ళని అలా పేరు పెట్టి పిలవడం తప్పని వారిస్తున్నా. 

ఈ రోజుల్లోలా అప్పుడు గ్యాస్ స్టౌవ్ లు, గీజర్లు వంటివి ఏవీ లేవు. ఎంతటి ధనవంతులైనా వండుకోవడానికి కట్టెల పొయ్యిలు, బొగ్గుల కుంపట్లు ఉపయోగించవలసిందే. ఏ కారణం చేతనో విజయనగరంలో వీటికి ప్రత్యామ్నాయంగా పొట్టు పొయ్యిలను కూడా వాడేవారు. ఆ పొట్టుపొయ్యిని ప్రిపేర్ చేయడానికి చాలా ఓర్పు, నేర్పు అవసరమయేవి. నాలుగు ప్రక్కలా మూసివుండే మట్టి కుంపటిలో మధ్యలో ఒక సన్నపాటి రోకలిలాటిది పెట్టి, ఆ కుంపట్లో ధాన్యపు పొట్టును పొసి రూళ్ళకర్రతోనో, అప్పడాల కర్రతోనో గట్టిగా దట్టించి, ఆ పొట్టు దిట్టంగా ఉందనే నమ్మకం కలిగాక నెమ్మదిగా అందులోంచి రోకలిని బయటకు తీయాలి.   ఈ ప్రోసెస్ ఏమాత్రం అజాగ్రత్త జరిగినా దట్టించిన పొట్టంతా కూలిపోయేది. మళ్ళీ మొదటినుంచి ప్రారంభించాల్సిందే. అందుచేత‌, ఆ పొట్టుపొయ్యి ఉపయోగించే స్థానమేదో ముందే నిర్ణయించుకొని ఈ  పొట్టు దట్టింపు వ్యవహారం మొదలెట్టాలి. ఈ పనిని చేయడంలో మా ప్రభు చిన్నాన్నగారు సిధ్ధహస్తులు. ఆ పొయ్యిలోని రోకలి కదలకుండా గట్టిగా పట్టుకునే పని నాది. ఆ రూళ్ళకర్ర, అప్పడాలకర్ర మరో సందర్భంలో కూడా ఉపయోగించేవారు. భోజనాల సమయంలో మా చిన్నాన్నగారి పక్కన ఇవి ఉండేవి.            
                      
ప్రతిరోజూ భోజనాల దగ్గర నేను కాని, ప్రసాద్ కానీ ఏదో విషయానికి తిక్కపెట్టి, అన్నం తినడానికి మారాము చేయడం పరిపాటి. అప్పుడు ఈ రూళ్ళకర్రే మా చిన్నాన్నగారి వజ్రాయుధం. దానిని పట్టుకొని ఒకసారి ఆయ్! అని గర్జించేప్పటికి మా అంత అల్లరి బంద్. భోజనాల కార్యక్రమం ప్రశాంతంగా ముగిసేది. ఆవిర్లు గ్రక్కే అన్నం, పప్పు వెంట వెంటనే తినేయాలనేది నా పంతమైతే, ఆవకాయ ముక్కలాటివాటిని కడిగి వేయలేదని ప్రసాద్ అల్లరి. వీటన్నిటికీ మందు ఆ రూళ్ళకర్రే. మా ప్రభూ చిన్నాన్నగారికి పిల్లలను అదుపు చేయడం మా బాగా తెలుసు. మా నారాయణ మూర్తి చిన్నాన్నగారు ఇలాటివేవి పట్టించుకునేవారే కాదు. ఆయనకెప్పుడైనా సరదా పుడితే మమ్మల్ని ఎత్తుకొని ఉసిరి చెట్టు ఎక్కించి వదిలేస్తాను , గోడవతలకి విసిరేస్తాను అంటూ ఆటలు పట్టించేవారు. ఇక మా నాన్నగారితో కలిసి విజయనగరం లో గడిపిన రోజులేవీ అంతగా గుర్తులేవు. కానీ, ఆయన తీక్షణంగా చూస్తేమాత్రం నేనూ, ప్రసాద్ ఆ చుట్టుపక్కల చేరేవాళ్ళం కాదు. మా అమ్మ, కమల పిన్ని అవసరమైతే చేయిచేసుకోవడం గుర్తుంది. మా తాతగారు మాకు శ్రీరామ రక్ష. ఆయన పిల్లలను ఏమీ అననిచ్చేవారు కాదు. ఆయనది భయంతో కూడిన ప్రేమ. 

మాగెడ్డవీధి మొదటింటి వరండా నేల అంతా నల్లసేనపు పలకలతో ఉండేది. ఎత్తైన అరుగులు ఆనాటికి. (2008 లో వెళ్ళి చూసినప్పుడు ఇంటి రూపురేఖలే పూర్తిగా మారిపోయాయి. ఎత్తు అరుగులే లేవు. శిథిలావస్థకు వచ్చింది. ఇల్లంతా రోడ్ లెవల్ కు దిగువుగా కనిపించి చూసేందుకే మనసుకు కష్టమయింది.) వరండా నేల నల్లటి పలకలతో ఉండేది. కొన్ని చతురస్రంగా, కొన్ని నలుచదరంగంగా ఉండేవి. అలాటి నలుచదరపు పలకలు మాకు క్యారమ్ బోర్డ్. ఆ  ఆట మా పిల్లలకి కాలక్షేపం. ఆ క్యారమ్ ఆట  అంత తేలిక కాదు.  పలకమీద నాలుగు పక్కలా సుద్దముక్కతో పోకెట్స్ గీసి , మధ్యలో ఒక రౌండ్ వేసి , మూలలంటా ఏరోలు పెట్టి నిజమైన బోర్డ్ గా చేసేవారు. స్ట్రైకర్, రెడ్, 18 కాయిన్స్ తయారు చేయడం ఒక పెద్ద తతంగం. అందుకోసం పిల్లలంతా ఇటికలను, పెంకులను తెచ్చి వాటిని గుండ్రంగా అరగదీసి వాటితో క్యారమ్ బోర్డ్ ఆడేవాళ్ళం. మాకంటే పెద్ద పిల్లలు ఈ బోర్డ్ చేయడంలో సహాయపడేవారు. అయితే వారానికో, పదిరోజులకో వరండా అంతా నీళ్ళుపోసి కడిగేప్పటికి మా క్యారమ్ బోర్డ్ గాయబ్. మళ్ళీ  అంత శ్రమ పడవలసిందే. గవ్వలతో, అవి లేకపోతే చింతపిక్కలను ఒక పక్క అరగదీసి తెల్లగా చేసి అష్టా చెమ్మాలు ఆటలు ఆడేవాళ్ళం.

మా అందరికీ బాగా ఇష్టమైన ఫేవరేట్ కాలక్షేపం సినీమా చూడడం. మా వీధిలో మార్కస్ బార్ట్ లీలు, కమల్ ఘోష్ లు, పి. శ్రీధర్ వంటి కేమెరామెన్లు (కేమెరామెన్ ఇంగ్లీషు, కేమెరామెన్లు తెలుగు) చాలామందే ఉండేవారు. వాళ్ళు సిగరెట్ పేకట్ల అట్టలతో కేమెరాలు చేసి ఫోటోలు తీసేవారు. ఆ అట్టలను మడవడంలో ఒక టెక్నిక్ ఉండేది. దానితో కెమెరా షట్టర్ ఓపెన్ అయేది. అదే ఫోటో తీయడం. అలాగే తరుచూ, మధ్యాహ్నం పూట ఇంట్లో వారంతా విశ్రాంతి తీసుకునే సమయంలో, సినీమా మ్యాట్నీ షో వేసేవారు. ఆ ధియేటర్ మా ఇంట్లోని ముందుగది. దాని కిటికి రోడ్ వేపు ఉండేది. సినీమా హాల్స్ దగ్గర బోల్డెన్ని ఫిలిమ్ ముక్కలు పడి ఉండేవి. వాటిని ఎవరో ఏరుకు వచ్చేవారు. గది కిటికీ కవర్ చేసేలా ఒక అట్టను కత్తిరించి, మధ్యలో ఫిలిమ్ ముక్క పట్టేలా నలుచదరంగా కన్నం చేసి దాని మధ్య ఈ ఫిలిమ్ పెడితే ప్రొజెక్టర్ రెడీ. గది బయట రోడ్ మీద ఎండలో ఒక అద్దం పెట్టి ఆ సూర్యకిరణాలు గదికి పెట్టిన ఫిల్మ్ మీద సోకేలా ఎక్స్పర్ట్ కెమెరామెన్లు చూసేవారు. గదంతా చీకటి చేయడంలో బయటి సూర్యకాంతి ఫిల్ము మీద పడి దాని ప్రతిబింబం తెల్లటి గోడమీద పడేది. సినీమా స్టార్టయేది. అందులో, ఎన్ టి రామారావు కనపడేవాడు. దిలీప్ కుమార్ కనపడేవాడు. నర్గీస్, అంజలి కూడా కనపడేవారు.  ఉన్న ఫిల్మ్ ముక్కలు అయేవరకు సినిమా సాగేది. ఈలోగా రోడ్ మీద రిక్షా వచ్చినా, జట్కా వచ్చినా అద్దం తీసేయాలి. అప్పుడు ఇంటర్వెల్. మళ్ళా, అంతా ఎరేంజ్ చేసి సినీమా వేసేవారు. నేనూ ప్రసాద్ ఎప్పుడూ ప్రేక్షకులమే. ఈ విషయాలేవీ ప్రసాద్ కు గుర్తులేవు. అతను నాకంటే రెండేళ్ళు చిన్న. ఇంతలో మరో కొత్త టెక్నిక్ వచ్చింది . పాడైపోయిన ఎలక్ట్రిక్ బల్బ్ లోని ఫిలమెంట్ తీసేసి అందులో సగానికి పైగా నీరుపోసి ఆ గాజు బుడ్డీని ఫిల్మ్ కు అడ్డంగా పెడితే గోడమీది సినీమా మరింత క్లియర్ గా కనపడేది. ఇలా బోల్డ్ సినీమాలు మా హోమ్ ధియేటర్లో, ఎదిరిళ్ళలో చూసేవాళ్ళం. ఈ పాడైపోయిన బల్బ్ లు కావాలంటే కరెంట్ ఉన్న ఇళ్ళవారిని అడగాలి. మా ఇంట్లో కరెంట్ దీపాలు లేవు. అందుకోసం, పక్కవీధిలో ఒకరింటికి వెళ్ళేవాళ్ళం. ఆ ఇంటి అబ్బాయి, మా ఇంట్లో ఉండే ఆంధ్రపత్రికలు చదవడానికిస్తే ఈ పాడయిపోయిన బల్బ్ లకు బేరం పెట్టేవాడు. అలాగే, ఆ పాత పత్రికలు ఇంట్లోవాళ్ళకు చెప్పి ఇచ్చేవాడిని. అయితే బల్బ్ లకోసం కాదు. వారింట్లో ఢిఫరెంట్ సైజుల్లో ప్రిజమ్స్ ఉండేవి. వాటిల్లోంచి చూస్తే ఎన్నో రంగులు కనిపించేవి. వాళ్ళకు ఆ రంగురాళ్ళు కోటలోంచి వస్తాయని చెప్పేవాడు. నిజమో, అబధ్ధమో నాకు తెలియదు. అలా ఈ బార్టర్ పధ్ధతిలో ఈ రంగురాళ్ళు కొన్ని నాదగ్గరుండేవి.నేను ఒంటరిగా ఆడే ఆట ఒకటుండేది. అది సైకిల్ టైర్ ఆట. ఎక్కడికైనా కొట్టుమీదకెళ్ళాలంటే ఆ టైర్ ను తోసుకుంటూ పరిగెత్తుకు వెళ్ళడం. ఆ టైర్ ను తొయ్యడానికి ఒక చిన్న కర్ర. అలా వెళ్ళడం సైకిల్ తొక్కుతూ వెళుతున్న ఆనందం.  నాకు పోటీగా మరికొందరు పిల్లలు సైకిల్ వీల్ రిమ్ తో వచ్చేవారు. ఆ రిమ్ మధ్య కర్రపెడితే ఆ వీల్ ఆటోమెటిక్ గా నడిచేది.  తొయ్యక్కరలేదు. టైరు చక్రం కన్నా, రిమ్ చక్రాన్ని తోలడంలో బ్రహ్మాండమైన ఆనందం ఉండేది. అలాటి రిమ్ నా దగ్గర లేనందుకు అవమానకరంగా ఉండేది.మా ప్రభూ చిన్నాన్నగారు చదరంగంలో ఆరితేరినవారు. ఊళ్ళోని పెద్ద పెద్ద ప్లేయర్సంతా ఆయన దగ్గర ఓడినవారే. అయితే ఆయన  ఏనాడూ ఏ పోటీలకు వెళ్ళినట్లులేదు. ఇంట్లో చదరంగం బల్ల నలుపు తెలుపు రంగులలో ఉండేది. పావులన్నీ కర్రతో చేసినవే పసుపు, ఎరుపు రంగుల్లో ఉండేవి. ఒకటి రెండుసార్లు ఆయనతో కలసి చిన్నబజార్లో (అనే గుర్తు) ఒక మేడమీద రీడింగ్ రూములో చదరంగం ఆటకు వెళ్ళాను. అదే వరసలో మినర్వా టాకీస్ ఉండేదనుకుంటాను. మా చిన్నాన్నగారికి ఆ వీధిలో వారంతా పరిచయస్తులే. ఒక్కో షాప్ దగ్గరా పదేసి నిముషాలు కూచోపెట్టి బాతాఖానీ మొదలెట్టేవారు. అలా ఒక షాప్ దగ్గరకు వెళ్ళగా అక్కడ వరస స్టాండ్లలో రంగు రంగు నీళ్ళున్న సీసాలు వరసగా ఉండేవి ఎవరెవరో వచ్చి ఆ రంగునీళ్ళలో నిమ్మరసం, పంచదార వేయించుకొని త్రాగేవారు. వాటిని షర్బత్ లు అంటారని తెలిసింది. లైట్లవెలుగు ఆ రంగునీళ్ళ సీసాల మీదపడి చూడ్డానికి అదేదో ఇంద్రలోకం లా అనిపించింది 

మా వీధుల్లోకి రంగు రంగుల పాకం మిఠాయి అమ్మకానికి వచ్చేది. ఆ పాకపు ముద్ద ఒక పెద్ద లావాటి వెదురుకర్రకు అంటించివుండేది. అది అమ్మేవాడు ఒకచేత్తో గంట మోగించుకుంటూ వచ్చేవాడు. మనం ఇచ్చే డబ్బులను బట్టి ఆ రంగు పాకాన్ని రెండు చేతుల మణికట్టుల దగ్గర వాచీలా, దండకడియాల్లా కట్టేవాడు. అది కొంచెం కొంచెంగా తీసుకు తినడం మహదానందం. 
అలాగే, నాన్ రొట్టి, రస్క్ లు బిస్కట్లు అమ్మవచ్చేవి. కాఫీలో నాన్ రొట్టి ముంచుకు తినడం మా ప్రసాద్ అలవాటు. ఈ వస్తువులన్నింటిమీద చాలా ఈగలు వాలేవి. అమ్మేవాళ్ళు ఎంత శుభ్రంగా ఉంచినా ఈగలు మూగేవి. అలాగే ఇంట్లో త్రాగేసి వదిలేసిన కాఫీ గ్లాసులలో  కూడా ఈగలు ముసిరేవి. ఆ గ్లాసులు వెంటవెంటనే ఎందుకు కడిగేవారు కాదో నాకు తెలియదు. ఆ పనులు ఏ టైముకైనా ఆడవాళ్ళే చేయాలి. మగాళ్ళు ఇంటి పని చేయడం నామోషి .  ప్రతీ పనికి ఒక టైమ్ టేబుల్. దాని ప్రకారం పనులు జరపడంలో ఇలాటి ఇబ్బందులు తప్పవేమో. అప్పట్లో, మూడో క్లాస్ తెలుగు వాచకంలో ఈగ మీద  ఒక పాఠం ఉండేది. అందులో ఈగ వల్ల వచ్చే హాని గురించి ఈగల వల్ల వచ్చే రోగాల గురించి రాసుండేది. ఆ పాఠాన్ని ఇంట్లోవారెందుకు చదవరో తెలిసేదికాదు. 

టైమ్ టేబిల్ అంటే గుర్తుకు వచ్చింది. భోజనపు మెనును మా పెద్దమ్మమ్మగారే డిసైడ్ చేసేవారు. అన్నంలోకి ఏ పప్పు వండాలి(కంది, పెసర), ఏ పప్పుకు ఏ కూర ఉండాలి. వేడి చేసే కందిపప్పైతే చలవ చేసే బీర, దొండ, బెండవంటి కూరలు, పెసరపప్పైతే వేడిచేసే కూరలు, ఏ రకమైన చారు పెట్టాలి, రాత్రి అయితే ఏ పప్పు పచ్చళ్ళు చేయాలి, ఏ పొడులు వేసుకోవాలి, శని ఆదివారాలలో ఒంటిపూట ఉపవాసం వాళ్ళకి ఏం టిఫెన్లు చేయాలి, వాటికి ఎలాటి సైడ్ డిషెస్ వుండాలి అనే విషయాలను కూలంకషంగా పరిశీలించి ఆరోగ్యాలకు తగినట్లు ఆవిడ వంటను నిర్ణయించేవారు. ఆ విధంగానే  ఆ ఇంటి కూతుళ్ళు  చేసేవారు. మా తాతగారి ముగ్గురు కొడుకులు ఆవిడకు మేనల్లుళ్ళు కావడం వలన వారి భార్యలు ఆవిడకు కూతుళ్ళే. 

ఒక రోజు మా నాన్నగారు సాలూరు వెళ్ళబోతున్నట్లు చెప్పారు.  తనతో కూడా నన్నూ తీసుకువెళ్ళడానికి నిశ్చయించడం అపూర్వమే. ఆయన చాలా మొహమాటస్తుడు. తనవల్ల ఇతరులకు ఏవిధమైన అసౌకర్యం, ఇబ్బంది కలగకూడదని ఆయన ఆశయం. అందుకే ఎక్కడికి వెళ్ళినా తనొక్కరే వెళ్ళడం అలవాటు. ( ఇది నాకు కలిగిన అవగాహన).
సాలూరు ప్రయాణ విశేషాలు వచ్చేవారం.

           ...సశేషం
*With a view to make the narrative more authentic and to corroborate it, images, audio and video clips are attached at appropriate places. If such usage is found objectionable to the copyright holders the same shall be removed if and when notified.

6 comments:

Unknown said...

అద్భుతమైన అనుభూతులు. మా చిన్నప్పటి అనుభూతులు కూడా గుర్తుకు వచ్చాయి. ధన్యవాదాలు, కృతజ్ఞతలు.

Patrayani Prasad said...

శ్రీ అన్నయ్యకు ధన్యవాదాలు . విషయాలన్నీ చక్కగా ఏర్చి కూర్చి వ్రాసావు . కొన్ని విషయాలు జ్ఞాపకం ఉన్నాయి. కొన్ని విషయాలు మరచి పోయినవి, తెలియనివి ఉన్నాయి. మన పెరటిలో పొరుగు వారు పేరి వారా ? ద్రావిడులు అనుకుంటాను . శ్రీ పేరి శాస్త్రి గారని అనేవారు అనుకుంటాను . ఆయనకూడా స్కూల్ లోనో . కాలేజీ లోనో పని చేసేవారా ? నీకు జ్ఞాపకం ఉందా ? కథనం చాల చక్కగా, చాలా చురుకుగా,సాగింది . నాకు ముఖ్యము గా చదివించేలాగ సాగింది . చాల బాగుంది. ధన్యవాదాలు- పట్రాయని ప్రసాద్ , బెంగుళూరు , 21-8-2020, శుక్రవారం. సాయంత్రం 04:15 IST.

Sumabala said...

మాకు తెలీని చాలా సంగతులు కళ్ళకు కట్టినట్లు చెప్తున్నావు పెద్దన్నయ్యా... చదవడానికి చాలా బాగుంది. Thank you

P P Swarat said...

ఈ ధారావాహిక కు సదభిప్రాయాలతో ప్రోత్సహిస్తున్నందులకు అందరికీ ధన్యవాదాలు.

అమీర్ జాన్ said...

మహత్తరమైన మీజ్ఞాపకాలతో పాటూ...మా బాల్య స్మృతులూ గుర్తుకు తేవడం మీ బ్లాగు విశేషం స్వరాట్ గారు! అమ్మాయిలు పెరట్లో చెట్లెక్కడం, చిన్నపిల్లలకు కావలసిన పిందెలు, దోరకాయలు కోసివ్వడం, పొట్టు పొయ్యి కూరడం, దానికోసం చిన్న రోకలిని వాడడం, ఆ బ్రహ్మ విద్య నేర్చుకొమ్మని అమ్మ పోరడం; కర్రకు చుట్టిన పీచు మిఠాయి తో వాచీలు చేయించుకోడం, నీళ్ళ బల్బు, భూతద్దంతో మేటీనీ షో, ఇంకా ఇలాంటి చిన్ననాటి అనుభూతులని సింహావలోకం చేసుకున్నట్లనిపించింది స్వరాట్ గారు!! మీరన్నట్లు..ఇంట్లో కూడ చిన్న చిన్న పనులు చేయడం మగవాళ్ళు నామోషీగా తలచేవారేమో....అన్నీ ఆడవాళ్ళే చేస్తూండేవారు!
ఇక మీ అక్షర కూర్పు ఎంతో ఆసక్తికరంగాను, సహజంగానూ సాగుతోంది. ఆ శైలి పూర్తిగా మీ స్వంతంగా ...మీదైన పద్ధతిలో సాగుతోంది. అభినందనలు మీకు!!💐💐💐💐💐 ప్రసాద్ గారు, సుమబాల గారు కూడ మాతోపాటు ఈ విషయాలన్నీ cherish చేయడం బావుంది!

P P Swarat said...

అమీర్జాన్ సాబ్ , మీ అభినందనలకు ధన్యవాదాలు.