visitors

Friday, August 14, 2020

నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 1 - పన్నెండవ భాగం

15.08.20 - శుక్రవారం భాగం - 12:
పదకొండవ భాగం ఇక్కడ:
నెం.35, ఉస్మాన్ రోడ్


      ప్రణవ స్వరాట్

నెం. 35, ఉస్మాన్ రోడ్ ధారావాహిక - ఘంటసాలగారి జీవిత చరిత్ర కాదు.

ఆంధ్రరాష్ట్రంలో ఎక్కడో మారుమూల ప్రాంతాలైన కలివరం, విజయనగరం, బొబ్బిలి వంటి చిన్న ఊళ్ళలో పుట్టి పెరిగి ఒకేసారి మద్రాస్ మహానగరంలోకి వచ్చిపడిన  ఒక సగటు కుర్రవాడి మనోభావాలు, అవస్థలు చూపే ప్రయత్నమే ఈ నెం.35, ఉస్మాన్ రోడ్. 

ఒక డెభ్భై ఏళ్ళక్రితం మన ఊళ్ళు ఎలా ఉండేవో, సామాజిక, సాంస్కృతిక పరిస్థితులు, అగ్రహారాలలో ఆనాటి ఆచార వ్యవహారాలు పరిపూర్ణంగా కాకపోయినా సూచనప్రాయంగానైనా ఈ తరంవారికి తెలియజెప్పే ప్రయత్నమే నెం.35, ఉస్మాన్ రోడ్. ఇందులో వచ్చే అన్ని భాగాలతోనూ ఘంటసాలగారికి ప్రత్యక్ష సంబంధం ఉండవచ్చును. ఉండకపోవచ్చును. కానీ, ఆ నాటి పరిస్థితులన్నీ ఘంటసాలగారి సంగీత విద్యమీద, పురోభివృద్ధి మీద, వ్యక్తిత్వ వికాసం మీద ప్రభావం చూపాయనే నేను భావిస్తున్నాను.  వయసు మీరుతున్న కారణంగా గత జ్ఞాపకాలు పూర్తిగా మరుగున పడిపోకముందే వాటిని అక్షరరూపంలో పెట్టే ప్రయత్నమే ఈ నెం.35, ఉస్మాన్ రోడ్. ఈ విషయాలన్నీ ఘంటసాలవారి అభిమానులకు ఆసక్తికరంగా తోచకపోయినా, మా పట్రాయని కుటుంబంలో మా తర్వాతి తరంవారికి, వారి పూర్వీకుల గురించి తెలుసుకోవాలనే ఆకాంక్ష వుంటే ఈ వ్యాసాలు కొంత ఉపయోగిస్తాయి. ఈ వ్యాసాలలో అవాస్తవాలకు, అతిశయోక్తులకు చోటులేదు.  నాకు జ్ఞాపకమున్నంతవరకు ఔచిత్యం పాటిస్తూ ఉన్న విషయాన్ని చెప్పడమే నా ముఖ్యోద్దేశం.

ఇక మన కథలోకి వెళదాం.

ఘంటసాల అనే ఆయన తమ కుటుంబంతో మా తాతగారింటికి వచ్చి వెళ్ళాక ఆయన సినీమా లలో పాటలు పాడతారని, మా తాతగారింట్లోనే వుంటూ సంగీతం నేర్చుకున్నారని తెలిసింది. అప్పటినుండి రేడియోలో కానీ, సినీమాల ప్రచారం కోసం జట్కా బళ్ళలోనూ, సైకిల్ రిక్షాలలో లౌడ్ స్పీకర్లు పెట్టి గ్రామఫోన్లలో వచ్చే పాటల్లోకానీ ఘంటసాల పాట వస్తే గుర్తు పట్టడం తెలిసింది. పెద్దవాళ్ళతో సినీమాలకెడితే అందులో వచ్చే పేర్లలో ఘంటసాల అనే పేరుందో లేదో చూడడం మొదలయింది. 

అప్పట్లో సంసారం, మల్లీశ్వరి,  పరోపకారం, దేవదాస్ వంటి సినీమా పాటలు తరుచూ లౌడ్ స్పీకర్లలో వినిపించేవి. పరోపకారం సినీమా ఘంటసాల వారిదేనని చెప్పుకోవడం విన్నాను. ఆ సినీమాను ధియేటర్లో  చూసిన గుర్తుంది. ఘంటసాల పాటలు జనాలు బాగా పాడుకోవడం మొదలయింది. ముఖ్యంగా దేవదాసు వచ్చాక ఎక్కడ చూసినా అవే పాటలు. 

ఊళ్ళో జరిగే పాటల పోటీలలో కూడా ఔత్సాహిక గాయకులు ఘంటసాల పాటలు పాడడం ఆరంభమయింది. ఘంటసాల పుష్పవిలాపం పద్యాలు చదివే గాయకులు ఎక్కువగా తయారయ్యారు. అలాటి  ఔత్సాహిక గాయకుల పాటల పోటీ ఒకటి సింహాచలం చౌల్ట్రీలో జరిగింది. ఆ పాటల పోటీలలో ముగ్గురు జడ్జీలలో మా నాన్నగారు - శ్రీ సంగీతరావుగారు ఒకరు. ఆ పోటీలో మా నాన్నగారి కజిన్ గుమ్మా మార్కేండేయ శర్మ కూడా పాల్గొని ఘంటసాలగారి 'హృదయమా సాగిపోమ్మా' (పరోపకారం) పాట పాడారట. ఈ విషయాలు పెద్దయ్యాక తెలిసినవి.
  హృదయమా సాగిపొమ్మా"పాటను ప్లేబటన్ నొక్కి వినవచ్చు

రోడ్లమీద తాగుబోతు వాళ్ళ నోట్లో దేవదాసు పాటలే.  మా తాతగారికి రోడ్లమీద తూలుతూ నడిచే తాగుబోతులంటే మహాభయం. దానితో పిల్లలను బయటకు వదిలేవారు కాదు. అలాగే  వీధుల్లో గాడిదలు విపరీతంగా తిరిగేవి. వాటి ముందరి కాళ్ళు రెండూ కట్టేసే ఉంచేవారు వాటి యజమానులు. అయినా అవి అలాగే గెంతుకుంటూ తిరుగాడుతూండేవి. ఆయనే ఎప్పుడైనా పిల్లలను తీసుకొని నల్లచెఱువు మెట్టలవేపు తీసుకువెళ్ళేవారు. అక్కడికి వెళ్ళాలంటే మహదానందం. అక్కడ చాలా ఈతచెట్లుండేవి. చేతికందేలా గుత్తులు గుత్తులుగా ఎర్రటి పళ్ళుండేవి. వాటికోసం ఆయన వెంటపడేవాళ్ళం. ఆ ఈతపళ్ళు, నేరేడు పళ్ళు వీధుల్లోకి తెచ్చి అమ్మేవారు. అవి కొనుక్కోవాలంటే గుప్పెడు నూకలో, బియ్యమో ఇవ్వాలి డబ్బులకు బదులుగా.(అంటే బార్టర్ పద్ధతిలో (barter system) వంగ, దొండ, బెండ, చిక్కుడు, అరటి దవ్వ(దూట), అరటిపువ్వు వంటి కూరగాయలు పాతిక, ఏభై, వందల లెఖ్ఖన అమ్మేవారు.  తూనికతో అమ్మకాలు తక్కువ. వాటికి కూడా డబ్బులకు బదులు నూకలే తీసుకునేవారు. తాటి ముంజెలు, మామిడిపళ్ళ సీజన్ లో  ఆ పళ్ళన్ని చాలా విరివిగా అమ్మకానికి వచ్చేవి.  పెద్ద రసాల మామిడిపళ్ళు వంద పళ్ళు ముఫ్పై, నలభై రూపాయలలోపే వుండేవి. వాటిని బేరం చేసి, ఎంచి, కొని డబ్బులు ఇచ్చే వ్యవహారమంతా మా పెద్దమ్మమ్మగారిదే (మా తాతగారి అక్కగారు). ఆవిడ దగ్గర మూరెడు పొడుగున ఒక పాత పెద్ద తోలు పర్స్  మూడు నాలుగు మడతల్లో ఉండేది.  అప్పట్లో కరెన్సీ నోట్లకన్నా  నాణేల చెలామణియే ఎక్కువుండేది.  ఆవిడ పర్స్ లో ఒక మడతలో రూపాయి నాణేలు, ఒక దాంట్లో అర్ధలు, పావలాలు, ఒక దాంట్లో బేడలు, అణాలు, మరొక మడతలో అర్ధణాలు, కాన్లు వుండేవి. వాటన్నిటితో ఆవిడ పర్స్ బరువుగానే వుండేది.  మొత్తం అంతా కలిపి  ఓ పాతిక రూపాయలుంటే ఎక్కువేనేమో.
                        1950ల నాటికి చలామణీలో ఉన్న నాణాలు

 ఒకసారి మా నాన్నగారు ఏదో ఊరు సంగీత కచేరీకి వెళ్ళి వచ్చి అక్కడి వారిచ్చిన పారితోషకపు మూటను  మా తాతగారికి ఇవ్వమని నా చేతిలో పెట్టారు. నేను మోయలేనంత బరువుంది. ఆ మూట తాళ్ళు విప్పి చూస్తే అందులో అన్నీ  జార్జ్ బొమ్మ (V or VI అనేది గుర్తులేదు) ఉన్న పెద్ద ఇచ్చు రూపాయి నాణేలు. వాటిని నేను లెఖ్ఖపెట్టగా సరిగ్గా ఏభై ఉన్నాయి. నేను మా తాతగారికి ఇవ్వగా ఆయన అమ్మీ అంటూ తన అక్కగారిని పిలిచి ఆ డబ్బు ఆవిడ చేతికిచ్చారు. తన జీతం కూడా ఆవిడకే ఇచ్చేవారు. ఇంటి యాజమాన్యం ఆవిడదే. ఆవిడ ఆ డబ్బులను ఆ మూరెడు తోలు పర్స్ లో పెట్టేది. ఆవిడను ఇంట్లోని మగాళ్ళు అత్తా అని, మా అమ్మ, పిన్ని గార్లు అమ్మన్న అని పిలిచేవారు. 


ఆనాడు రూపాయికి ఉండే విలువ ఈనాడు ఊహించలేము. ఒక రూపాయి ఒక తులం బరువుండేది. బంగారం తూచడానికి ఒక వెండి రూపాయి నాణేన్నే ఉపయోగించేవారు.

   1906నాటి వెండి రూపాయి నాణెం
నేను పుట్టడానికి ముందు ఒక రూపాయికి తులం బంగారం వచ్చేదని చెప్పుకునేవారు. కానీ ఆ రూపాయి దొరకడమే బహు దుర్లభంగా వుండేది. దీపావళి  మతాబాలు, చిచ్చుబుడ్లు, తారాజువ్వలు, చిచింద్రీల వంటి బాణసంచా తయారుచేసేప్పుడు వాటిలో ఉపయోగించే పదార్థాలను తూచడానికి ఈ రూపాయి నాణేన్నే ఉపయోగించేవారు.

నేను విజయనగరం లో ఉన్నప్పుడు యాచక వృత్తి వుండేది. మాతాతగారికి  మ్యూజిక్ కాలేజీ లేని రోజుల్లో వీధి వరండాలో కూర్చొని వచ్చిపోయేవారిని కుశలప్రశ్నలు వేసి పలకరించేవారు. ఒక రోజు  ఒక ముష్టివాడు ఏవో పాటలు పాడుకుంటూ ఆ వీధిలోకి వచ్చాడు. అతని పాట మా తాతగారికి నచ్చిందనుకుంటాను. అతనిని అరుగుమీద కూర్చోపెట్టి అతనిచేత పాడిస్తూ తాను అగ్గిపెట్టెమీద పాటకు తగ్గట్టు తాళం వేస్తూ ఆనందించారు. అంతా అయిపోయాక అమ్మిగారిచేత డబ్బులు ఇప్పించి పంపేరు. తానొక గొప్ప వాగ్గేయకారుడైనా, ఎటువంటి భేషజం, దర్పం లేకుండా ఒక సామాన్య యాచకుని గానాన్ని మెచ్చుకున్నారంటే ఆయన ఎంతటి విశాలహృదయం గలవాడో, నేను పెద్దయ్యాక అర్ధమయింది. 

అలాటిదే, మరో సంఘటన నేనెన్నటికీ మరువలేనిది. రోజు ఉదయాన్నే ఆరు గంటల ప్రాంతంలో మా ఇంటికి ఎదురింట్లో ఉండే ఒక ముసలి ఆయవారం బ్రాహ్మడు వచ్చి తిధి, వార, నక్షత్రాల వివరాలు చెప్పి ఇంట్లోవారిచ్చే గుప్పెడో, దోసెడో బియ్యం తన ఇత్తడి చెంబులో వేయించుకొని మరో ఇంటికి వెళ్ళేవారు. వేసేవారు వేస్తారు. లేనివారు లేదు. తిధి వార నక్షత్రాలు చెప్పి ఓ రెండు మూడు నిముషాలు చూస్తాడు. ఎవరైనా వస్తే సరే, లేకపోతే మరో గడప ఎక్కేవాడు. చూడడానికి చాలా దీనంగా అనిపించేది. ఆయనకు ఇద్దరు కొడుకులు. ఒక కోడలు. పెద్దకొడుకు టీచర్ గా పనిచేసేవాడని గుర్తు. రెండోవాడు చదువుకుంటూ, యాచనకు వెళ్ళేవాడు. వారెవరి పేర్లు గుర్తులేవు. ఒక రోజు  మా అమ్మగారు  ఒక బేడ నా చేతిలోపెట్టి  ఒక ప్లాస్టిక్ పన్ని(దువ్వెన) ఒకటి  కొనమని చెప్పింది. ఆ డబ్బులు చొక్కా జేబులో పెట్టుకొని బజారు వేపు వెళ్ళి దారిలో ఒక పార్క్ లో  స్పీకర్ లో నుండి పాటలు వినిపిస్తూంటే అవి వింటూ అక్కడి పచ్చికలో కూర్చొని అక్కడ ఆడుకుంటున్న పిల్లలను చూస్తూ కాలక్షేపం చేశాను . కొంతసేపు అలా గడిచాక షాపుకెళ్ళి దువ్వెన కొనడానికి బయల్దేరాను. పార్క్ బయటకు వచ్చి జేబులో చెయ్యి పెట్టి చూస్తే డబ్బులు లేవు. గుండెలు గుభేలుమన్నాయి. పరిగెత్తుకుంటూ మళ్ళీ పార్క్ లో నేను కూర్చున్న చోటికి వచ్చి చూస్తే అక్కడేమీ కనపడలేదు. ఏంచేయాలి. డబ్బులు పోయాయని ఇంటికి వెళ్తే అమ్మ తిడుతుందని భయం. అంతటా వెతకడం మొదలెట్టాను. ఏడుపు తన్నుకొస్తోంది. ఏంచేయాలో తెలీక అక్కడే బిక్కమొహం వేసుకొని దిక్కులు చూడ్డం మొదలెట్టాను. కొంచెం చీకటి పడుతోంది. ఇంతలో, మా ఎదురింటి ఆయవారం బ్రాహ్మడి రెండో కొడుకు అటు పక్క వెళుతూ కనపడ్డాడు. నన్ను చూసి ఒంటరిగా ఇక్కడేం చేస్తున్నావని అడిగాడు. పన్ని కొనాలని వచ్చానని చెప్పాను. సరే, కొనేసావుగా, ఇంటికి పద పోదామని అన్నాడు. అప్పుడు ఏడుపు గొంతుతో జరిగింది చెప్పాను. ఇంటికెళ్తే అమ్మ తిడుతుందని భయం. అతను తన జేబులు చూసి తన దగ్గరా డబ్బులు లేవని చెప్పి. భయపడకు ఇప్పుడే వస్తాను, అక్కడే వుండమని చెప్పి ఒక పావుగంట అయ్యాక వచ్చి నా చేతిలో పన్ని పెట్టి ఇంటికి పదమన్నాడు. డబ్బుల్లేవన్నావు, పన్ని ఎలా కొన్నావని అడిగాను. అదంతా నీకెందుకు.  పన్నిని తీసుకువెళ్ళి అమ్మకు ఇవ్వు. డబ్బులు పోయిన సంగతి, నేను కొనిచ్చానన్న సంగతి ఎవరికి చెప్పద్దని మరీ మరీ చెప్పాడు. అలాగే ఇంటికి వచ్చి ఆ పన్నిని అమ్మగారి చేతికిచ్చాను. అక్కడితో ఆ సంఘటన ముగిసింది. ఈ విషయం నేను తరువాత మా అమ్మగారికి చెప్పానా లేదా పాపం! ఆ డబ్బులు ఆ ఎదురింటి కుర్రవాడికి తిరిగి ఇచ్చానా లేదా? ఆ విషయాలేవీ నాకు గుర్తులేవు. మేము ఆ ఊరొదిలి వెళ్ళాక, నాకు బాగా జ్ఞానం వచ్చాక, ఈ సంఘటన తల్చుకుంటే ఏదో తప్పు చేసిన గిల్టీనెస్ కలుగుతుంది. ఆర్ధిక ఇబ్బందులతో యాచన చేసుకునే కుర్రాడి సహాయం పొందవలసి వచ్చిందే, అతని డబ్బులు అతనికి ఇవ్వకుండా తప్పు చేసాననే  భావం ఇప్పటికీ నన్ను వదలలేదు. విజయనగరం, ఆ పార్క్ తలచుకున్నప్పుడల్లా ఆ సంఘటన గుర్తుకు వచ్చి మనసంతా వికలమౌతుంది.

నేను విజయనగరంలో ఉన్న నాలుగు సంవత్సరాలలో నాకు బాగా గుర్తుండిపోయినవి ఆటలు తప్ప స్కూల్ కు వెళ్ళి చదవడం, అక్కడి విషయాలేవీ గుర్తులేవు. అరటిచెట్ల బడిలో దసరా ఉత్సవాలప్పుడు పప్పుబెల్లాలకోసం తిరగడం. పండగలప్పుడు స్కూల్ లో పెట్టే ప్రసాదాలు తప్ప. ఏవో పండగలయ్యాక ఒక రోజు నేను స్కూలుకు వెళ్ళలేదు. మర్నాడు వెళ్ళినప్పుడు నన్ను మాత్రం టీచర్స్ రూమ్ కు తీసుకుపోయి అక్కడ నాకు ఏదో స్వీటు, పులిహోర పెట్టడం జ్ఞాపకముంది. ఆ మూడో క్లాసు మాస్టారు తెల్లటి పంచే చొక్కా వేసుకొని, భుజంమీద కండువాతో, ఒక బెత్తం పట్టుకొని వచ్చేవారు. ఆయన రామాయణ, భారత కధలను చాలా ఉత్సాహంగా రసవత్తరంగా చెప్పేవారు. పిల్లలంతా నోళ్ళు తెరుచుకొని ఆ కధలు వినేవారు. ఆయన పేరు తెలియదు. ఆ మాస్టారు మా ఇంటికి అప్పుడప్పుడు బియ్యం కొనుక్కునేందుకు వచ్చేవారు. మా ఇంట్లో బియ్యపు వ్యాపారమేమిటని సందేహం కలగవచ్చును. కలివరం నాయుడు గారి బియ్యపు బస్తాలు కొన్నాళ్ళు  విజయనగరంలో మా ఇంట వుంచి అమ్మకానికి పెట్టారు. దానిమీద వచ్చే ఆదాయం ఎవరికోసం అనే విషయం నాకు తెలియదు. ఆ బియ్యాన్ని కొనుక్కునేందుకు ఆ మాస్టారు మా ఇంటికి రెండు మూడుసార్లు రావడం గుర్తుంది. ఒక శేరో, రెండు శేర్లో ఒక గోనె సంచిలో వేయించుకొని వెళ్ళేవారు. అదెన్నాళ్ళు సాగిందో తెలియదు. బియ్యం పప్పులు కొలిచేందుకు కుంచం, అడ్డ‌, శేరు, తవ్వ, సోల, గిద్దెలు ఉపయోగించేవారు. కుంచం హైయ్యస్ట్. గిద్దె లోయస్ట్ కొలమానం. అలాగే, బెల్లం, చింతపండు వంటి ఘన పదార్థాలు తూచడానికి వీశె, మణుగు, బారువ వంటి కొలమానాలుండేవి. ఈ సిస్టమ్ అంతా 1956 లో మారిపోయింది నయాపైసలు, కిలోగ్రాములు, కిలో మీటర్ల మానాలు అమల్లోకి వచ్చాయి. 

ఇందాక  భారత, రామాయణాలంటే ఒక విషయం గుర్తుకువచ్చింది.

ఒకసారి మా ఇంట్లో అర్ధరాత్రి దాటాక, తెల్లవారుజామున గట్టిగా అరుపులు, కేకలు వినిపించాయి. ఎందుకో ఏమిటో తెలియదు. మా తాతగారు, పెద్దమ్మమ్మగారు తీవ్రంగా వాదించుకుంటూ, అరుపులు వినపడ్డాయి. మాతాతగారు కోపంతో బయటకు వెళ్ళిపోయారు. ఆవిడ తన తమ్ముడిని 'మూర్ఖపు గాడిదకొడుకు' అని అనడం గుర్తు. ఆయన కోపంతో నల్లచెఱువు మెట్టలవేపో, వ్యాసనారాయణ మెట్టలకో వెళ్ళి కోపం తీరేవరకు అక్కడే కాలక్షేపం చేసి తెల్లారక నెమ్మదిగా ఇంటికి వచ్చేవారు. 'అమ్మీ! ఆలోచించి చూస్తే నువ్వు చెప్పిందే రైట్ సుమీ' అని సమాధానపడేవారు. ఇంతకూ దెబ్బలాటకు కారణం తెలిస్తే విస్తుపోతారు. గొడవలు వాళ్ళిద్దరి మధ్యాకాదు. ఏ మహాభారతం గురించో మొదలయి ఒకరు పాండవుల పక్షాన, ఒకరు కౌరవుల పక్షాన సమర్ధించుకుంటూ మాటకు మాటా పెరిగి తీవ్రరూపం దాల్చేది. ఇలాటి దెబ్బలాటలు ఆర్నెల్లకో, ఏడాదికో జరగడం పరిపాటని తరువాత పెద్దయ్యాక ఇంట్లోవారు అనుకోగా అర్ధమయింది. 

మా తాతగారు తెల్ల ఖధ్ధరు పంచెలు, తెల్ల చొక్కా, కండువా, గొడుగేసుకొని మ్యూజిక్ కాలేజీకి వెళ్ళేవారు. భోజనాల సమయానికి వచ్చేవారు. భోజనం చేసేప్పుడు కాశీ పంచె కట్టుకొని, చొక్కా లేకుండా ఒళ్ళంతా గంధం పూసుకొని నుదుట నల్లటి పెద్ద బొట్టు పెట్టుకొని భోజనానికి వచ్చేవారు. ఆయనకు కావలసిన గంధం అరగదీయడంలో, ఆ నల్లటి బొట్టు తయారుచేయడంలో మాకు చేతనైన పనులు మేము చేసేవారం. ఆ నల్లబొట్టు తయారీలో అరటిపువ్వు దొప్పలు ఉపయోగపడేవి. లేత పువ్వుల్లో ఒకరకమైన తేనెలాటిది ఉంటుంది. దానికోసం పిల్లలం ఎగబడేవాళ్ళం. పువ్వంతా రెలిచిన తరువాత, అరటిపువ్వు డొప్పలను మండుటెండలో ఎండబెట్టి వాటిని ఒక తాడులో గుచ్చేవాళ్ళం. అవసరమైనప్పుడు ఆ ఎండు డొప్పలను నల్లగా కాల్చి ఆ నుసిని ఒక భరిణలోవేసి అందులో మంచికర్పూరంపొడి, ఏదో నూనె వేసి గట్టిగా కలియబెట్టేవారు ఇంట్లోని ఆడవారు. దానిని ఆయన నుదుట అడ్డంగా గంధం రాసుకొని దానిపైన ఈ నల్లబొట్టు పెట్టుకునేవారు. ఈ కార్యక్రమం సుమారు పావుగంట పట్టేది. తరువాత భోజనాలకు కూర్చునేవారు. ముందు మగవారు, పిల్లల భోజనాలు. తరువాత ఆడవారి భోజనాలు. రెండు బ్యాచ్ లుగా అయేవి. భర్తలు లేచాక వదిలిన ఆ కంచాలలోనే ఆ ఇంటికోడళ్ళు భోజనం చేయడం ఆనవాయితి. అదేం ఆచారమో? ఈ రోజుల్లో అలాటివి ఎవరు ఆచరించరు. చెపితే, కనీసం నమ్మను కూడా నమ్మరు. కాని, ఇది నిజం. మా తాతగారికి చిన్నతనంలోనే ఆస్థ్మా వచ్చింది. ఎప్పుడూ దగ్గుతూండేవారు. ఆయనకు చుట్టకాల్చే అలవాటు ఉండేది. ఇదే అలవాటు, బహుశా, శిష్యుడైన ఘంటసాలకు అబ్బిందేమో!

పట్రాయని సీతారామశాస్త్రి గారికి బొట్టు అలవాటు విజయగరం వచ్చిన కొత్తల్లో లేదేమో. ఎందుకంటే, ఈయన, తమ తండ్రిగారి కంటే పెద్దైన శ్రీ ఆదిభట్ల నారాయణ దాసుగారిని చూడడానికి వెళ్ళినప్పుడు, ఆయన ఈయనను చూసి 'ఏమిరా, పేరా సాహేబూ! నువ్వు మా నరసింహ కొడుకువి కదూ' అంటూ పలకరించారట. ఆ పేరా సాహేబ్ అనే ఆయన ఆ రోజుల్లో గొప్ప హిందుస్థానీ గాయకుడట. 
Peara Saheb (పేరా సాహెబ్)
 
ఆయన పాడిన గ్రామఫోన్ రికార్డులు బహుళ ప్రచారంలో ఉండేవి. ఆ పేరా సాహేబ్ ఫోటోలు కూడా చాలామంది కళాకారుల ఇళ్ళలో ఉండేవట. మాతాతగారికి ఆయనకు ఏవో పోలికలుండేవట. ముఖ్యంగా,  మాతాతగారు పచ్చని లుంగీ కట్టుకు తిరగడం, హార్మోనియం వాయిస్తూ పాడడం కూడా, ఆయన అలా పిలవడానికి కారణం కావచ్చు. మా తాతగారు విజయనగరం మ్యూజిక్ కాలేజీలో చేరడానికి ముందు, ఒక యోగ్యతా పత్రం కావలసివచ్చి నారాయణ దాసుగారిని చూసేందుకు వెళ్ళారు. దాసుగారు మా తాతగారిని చూసి "ఒరే, నీకెందుకురా ఆ బాడుఖావు ఉద్యోగం. సలక్షణంగా పాఠశాల కట్టేవు. స్వతంత్రంగా ఉన్నావు అని, నీ ప్రారబ్ధం అలా ఉంది తప్పదు' అని యోగ్యతా పత్రం రాసి ఇచ్చేరట. పక్కనున్నవాళ్ళతో అన్నారట 'ఆ హార్మోనియం లేదూ అదొక కొయ్య. దానిలోంచి అమృతం పిండుతాడు వీడు' అని. (శ్రీ పట్రాయని సంగీతరావు గారి - 'చింతాసక్తి' నుండి). హార్మోనియం విషయంలో ఆ తండ్రిగారి వారసత్వమే శ్రీ సంగీతరావు గారికీ సంక్రమించి వుండవచ్చును. నాకు ఆనాడు ఆ సంగీతపు విలువలు తెలియదు. ఆ వ్యక్తుల ఔన్నత్యం అర్ధమయే వయసుకాదు.

మా తాతగారికి నడుము నొప్పులు, కాళ్ళనొప్పులు వుండేవనుకుంటాను. ఆయన మంచంమీద బోరిగిళ్ళా పడుకొనివుంటే నేను, మా ప్రసాద్ ఇద్దరం గోడ ఆసరాతో ఆయన కాళ్ళమీద, నడుము మీద నిలబడి నెమ్మదిగా తొక్కేవాళ్ళం. ఆయనకు ఆ సేవ చేయడానికి మేమిద్దరం కాట్లాడుకునేవాళ్ళం. అది తల్చుకున్నప్పుడల్లా పరమానందయ్య శిష్యుల కధలో నాగయ్యగారి పాట్లే గుర్తుకు వస్తాయి.

మా నారాయణ మూర్తి చిన్నాన్నగారు వారి పెద్దమ్మాయి జ్యోతిర్మయి పుట్టిన కొన్ని నెలలకు సంగీత పాఠాలు చెప్పడానికి తన నివాసం విశాఖపట్నానికి మార్చారు. మా సీత పిన్ని, చెల్లి మా తాతగారితోనే వుండేవారు. మా తాతగారింట్లో ఎప్పుడూ బంధు, మిత్రుల రాకతో కళకళలాడుతూ వుండేది. ఇంట్లో ముగ్గురు కోడళ్ళు. వాళ్ళ పుట్టింటినుండి అన్నదమ్ములో, అక్కచెల్లెళ్ళో ఎవరో ఒకరు ఇంట్లో ఉండేవారు. వైద్యంకోసం విజయనగరం వచ్చే బంధువులు కూడా మా తాతగారింటికి వచ్చేవారు. కుటుంబం పెద్దదవుతూవుంది. ఆర్ధికపరిస్థితి అంతంతమాత్రం. కళాకారులకు పేరు వచ్చినంతగా ఆదాయం వచ్చేది కాదు. 'బయట పల్లకీలమోత, ఇంట్లో ఈగలమోత' అనే సామెత సంగీతంవాళ్ళకే వర్తిస్తుంది.
 
ఇంట్లోని పిల్లలకెప్పుడూ అనారోగ్యాలు, దగ్గులు, జ్వరాలు. అప్పట్లో మలేరియా జ్వరాలతోపాటు 'కోరింత' దగ్గు అని ఒకటి వచ్చి పిల్లలను బాగా ఇబ్బంది పెట్టేది. ఆ కోరింత దగ్గు వస్తే మాత్రం ఒక పట్టాన వదిలేదికాదు. కనీసం మూడుమాసాలైనా పడుతుంది తగ్గడానికి. ఇలాటి పరిస్థితులలో మా చెల్లెలు రమణమ్మ నెలలపిల్ల. పెరట్లో ఉసిరిచెట్టుక్రింద చాపమీద పడుక్కోపెట్టారు. నిద్రలో దొర్లుకుంటూ పోయి పక్కనున్న చిన్న రాతికాలువలో పడి అక్కడున్న సూదైన రాయి తలవెనక తగిలి బాగా రక్తంకారడం మొదలయింది. వెంటనే ఫస్ట్ ఎయిడ్ గా మా కమల పిన్నిగారు (ప్రసాద్ తల్లి)  పంచదార, పసుపులాటివేవో అద్ది కట్టుకట్టారు. తరువాత, సుసర్ల వెంకట్రావు గారి హాస్పిటల్ కు తీసుకు వెళ్ళగా ఆయన చూసి తలవెనుక మూడు కుట్లు వేశారు. కొన్నాళ్ళకు గాయంమానింది. మచ్చ ఉండిపోయింది. 

ఏ కారణం చేతనో నా ప్రాధమిక చదువు సక్రమంగా సాగలేదు. ఇంట్లోనే చదివించి, తరువాత సంవత్సరం ఆరోక్లాసులో బ్రాంచ్ కాలేజీ లో చేర్పించడానికి ఏర్పాట్లు చేశారు. మా ఇంటికి కొంచెం దూరంలో, ఇస్మైల్ కాలని అని గుర్తు. ఆ వీధిలో  పప్పు అప్పలనరసింహంగారని మా నాన్నగారికో, తాతగారికో మిత్రులు. ఉపాధ్యాయులు. ఆయన దగ్గరకు ప్రైవేటుకు పంపారు. ఆయన ఏంచెప్పారో, నేను ఎన్నాళ్ళు,  ఏం నేర్చుకున్నానో నాకైతే తెలియదు. నేను చదువు విషయంలో ఎప్పుడూ అంతంత మాత్రంగానే వుండేవాడిని. కొంచెం వయసు వస్తే సరిపోతుందని అనేవారు. కానీ, ఏమీ సరికాలేదు. గ్రాహ్యశక్తి తక్కువ కావడం వలన స్కూల్ పాఠాలు అర్ధమైనట్లే వుండేవి కాని అవి పరీక్షల్లో మార్కులు తెచ్చుకోవడానికి పనికివచ్చేవి కాదు. ఇంట్లో మా ప్రభూ చిన్నాన్నగారు మా ఇద్దరిని కూర్చోబెట్టి చదివించేవారు. ఒకసారి ఆయన కూడికలు, తీసివేతలు లెఖ్ఖలు ఇచ్చారు వాటిలో నూటికి తొంభై రెండు మార్కులు వచ్చాయి.  నా చదువు జీవితంలో అదో నోబెల్ ప్రైజ్ తెచ్చుకున్నంత ఘనత. అదే ఫస్ట్ ఎండ్ లాస్ట్. ఆ తరువాత అందులో సగం మార్కులే నా హైయ్యస్ట్ ర్యాంక్. ఇందుకు, నా పనికిరాని సినీమా పరిజ్ఞానమే కారణమని అనేవారు. ఆటలమీదున్న శ్రధ్ధ చదువుమీద ఉండేది కాదు. మా ప్రసాద్ నాకంటే రెండేళ్ళు చిన్న. నాకు పసుపురంగులో, నీలం కలర్ లో రెండు బుష్ కోట్లు ఉండేవి. వాటికి కాంట్రాస్ట్ కలర్స్ లో బటన్లు. వేసవికాలమైనా అవే వేసుకు తిరిగేవాడిని. నేను కొంచెం బొద్దుగా ఉండేవాడిని, ప్రసాద్ చాలా సన్నగా, వాళ్ళ నాన్నగారిలానే ఉండేవాడు. నాకు బాగా టైట్ అయిపోయిన బట్టలు వాడికి తొడిగితే చాలు. మా ఇద్దరి మధ్యా రామరావణ యుధ్ధమే. మా పిన్నిగారు వచ్చి కోపంగా గుడ్లురిమి చూస్తే చాలు పరుగో పరుగు. ఒక సారి వీధులన్ని చెక్కరకొట్టి మెల్లగా ఇంట్లోకి దూరేవాడిని. ఎప్పుడో తప్ప నేనూ ప్రసాద్ చాలా స్నేహంగానే ఉండేవాళ్ళం.

ఒకసారి మా నాన్నగారు మెడ్రాస్ నుంచి వస్తూ రెండు కీ బస్సులు, రెండు పేము కలర్ స్టిక్స్ తెచ్చారు. ఆ బస్సులు ఒకటి నీలం, ఒకటి ఆకుపచ్చ. చెరొకటి ఇచ్చారు. అంతవరకూ బాగే. వాటితో ఆడేప్పుడే తంటా. నా దగ్గరున్నది వాడికి నచ్చేది. వాడి దగ్గరున్నది నాదైతే బాగుండునని నాకుండేది. అందుకోసం పోట్లాట. మా నాన్నగారు తెచ్చిన స్టిక్స్ తో ఫైటింగ్. అప్పటికి ఎన్ టి రామారావు, నాగేశ్వరరావు జానపద సినీమాలు చూస్తుండడం వలన ఇంట్లో ఆ యుధ్ధాలు మొదలెట్టేవాళ్ళం. నేను ఎన్ టి రామారావును. వాడు నాగేశ్వరరావు. ఆ ఎన్ టి రామారావు పోస్ట్ కోసం ఇద్దరం ఫైటింగ్. నువ్వు సన్నగా నాగేశ్వరరావులా ఉంటావు. అందుచేత నువ్వే నాగేశ్వరరావు, నేను ఎన్ టి రామారావు అని నేను, ఎప్పుడూ నువ్వే ఎన్  టి రామారావు అంటావు‌ ఇవేళ నేనే ఎన్ టి రామారావుని అని మా ప్రసాద్ ఇలా ఇద్దరం  కీచులాడుకునేవాళ్ళం. అదెప్పటికీ తేలేదికాదు. ఈలోగా చేతిలోని స్టిక్స్ వాడికి తగలడమో, నాకు తగలడమో జరిగేది. ఏడుపులు లంకించుకునే సమయంలో మా అమ్మో, వాళ్ళ అమ్మో ఎంట్రీ ఇచ్చి ఆ స్టిక్స్ మా చేతిలోంచి లాక్కొనేవారు. అప్పటికా ఫైటింగ్ సీన్ ముగిసేది. ఇలావుండగా, ఒకసారి మా నాన్నగారు సాలూరు వెళుతూ నన్నూ తీసుకువెళ్ళారు. అంతవరకు కలివరం, విజయనగరం, బొబ్బిలి పేర్లు మాత్రమే తెలుసుకున్న నేను సాలూరు అనే మరో ఊరిపేరు తెలుసుకున్నాను. 

ఆ విశేషాలన్నీ వచ్చేవారం.....(సశేషం)
                                                         -   ప్రణవ స్వరాట్,

9 comments:

గణేష్ said...

మీ ఆనాటి మధురాలు చాలా బాగున్నాయండి

P P Swarat said...

Thank you Ganesh.

P P Swarat said...

Thank you Ganesh.

వేదుల శ్రీ రామ సూర్య నారాయణ సోమయాజులు కవి ,ప్రయోక్త,విమర్శకలు,నాటకరంగ గుణ నిర్ణేత said...

బాల్యం మధుర స్మృతులు బహు జీవన మూల్యాలు. యదార్ధంగా ఆత్మ గతాల కాలం సంపుటాల్లో కి సహానుభూతుల్ని ఇస్తుంటాయి. జీవన భావనలు అక్షర బద్ధం గా ఆత్మీయ స్పర్శల గత జలసేతుబంధనాలు కదా౼. జీవన శైలిలో అక్షర బంధనాలు బహుళంగా విస్తరిస్తూ మరో తరానికి అందించే యత్నం సఫలం, సాకారం కావాలని ఆకాక్షిస్తున్నాను.

అభి వాదాలతో

వేదుల శ్రీ రామ సూర్య నారాయణ సోమయాజులు
కవి ,ప్రయోక్త,విమర్శకలు,నాటకరంగ గుణ నిర్ణేత

P P Swarat said...

మీ వంటి రచయిత ల ప్రశంసలు మరింత ప్రోత్సాహాన్ని అందిస్తున్నాయి. ధన్యవాదాలు.

Unknown said...

స్వరాట్ గారికి నమస్సులు. అబ్బురపరిచే విషయాలను కళ్లకు కట్టినట్లు విస్తరిస్తున్న మీ రచన అద్భుతం. ఉన్నత స్థాయిలో నడుస్తోంది. శుభాభివందనాలు. ధన్యవాదాలు

Muralidhar ayapilla said...

ఇన్ని విషయాలు పూసలు కూర్చినట్లు అందరికీ ఆసక్తి కలిగేవిధంగా రాస్తున్నారు. చాలా బాగుంది.

Pulijalasanthisree said...

ఈ విశేషాలసమాహారం చదువుతుంటే ఇక్కడే ఈ అక్షరాల మధ్యే ఉండిపోవాలనిపిస్తోంది ఆర్యా...ఎంత అందంగా రాస్తున్నారో...భాషాసౌందర్యం మరింత ఇనుమడించింది...ధన్యవాదాలు మీకు

చుండి వేంకట రాజు said...

మీ బాల్యస్మృతులు ఆసక్తికరంగా ఉన్నాయి. పుస్తక రూపంలో వచ్చాయా అండి