visitors

Friday, October 16, 2020

నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 2 - రెండవ భాగం


16.10.2020 - శుక్రవారం భాగం - 2*:
అధ్యాయం 2  భాగం 1 ఇక్కడ


నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్



మెడ్రాస్ సెంట్రల్ స్టేషన్ లో రైలు దిగి ప్లాట్ ఫారమ్ మీద అడుగుపెట్టగానే, నిజంగానే, మరేదో లోకానికి వచ్చినట్టయింది. నాకు తెలిసిన విజయనగరం స్టేషన్ కు రెండే ప్లాట్ ఫారమ్ లు. మెడ్రాస్ స్టేషన్ లో వరసగా ఆరో, ఏడో వున్నాయి. అన్నింటిమీదా రైళ్ళు నిలబడివున్నాయి. రైల్వే స్టేషన్లు ఇంత పెద్దవిగా , ఇంత పొడుగ్గా వుంటాయా అనిపించింది. బొబ్బిలి స్టేషన్ కంటే విజయనగరం స్టేషనే పెద్దదనుకుంటే  దానికంటే మరెన్నో రెట్లు పెద్ధదిగా మెడ్రాస్ స్టేషన్ కనిపించింది. స్టేషనంతా కూలివాళ్ళ కేకలు, అదలింపులతో, వేలాది( నాకప్పుడు అలా అనిపించింది) మనుషుల ఉరుకులు పరుగులతో, వచ్చీపోయే రైళ్ళ కూతలతో ఎక్కడ నిలబడాలో ఎటుపక్క వెళ్ళాలో తెలియక భయం భయంగా తోచింది. మా నాన్నగారి వెనకాలే ప్లాట్ ఫారమ్ మీద చాలాసేపు నడిచి బయటకు వచ్చాము. మేము రైలు దిగింది మధ్యాహ్నం అయినా చల్లటి గాలి వీస్తూంది. మా నాన్నగారు మమ్మల్ని (అమ్మగారు, అమ్మమ్మగారు, నేను, చెల్లెలు రమణమ్మ) ఒక కారులో ఎక్కించారు. (అంతకుముందు, మొదటిసారి, విజయనగరంలో ఘంటసాలగారు వచ్చినప్పుడు వాళ్ళతోపాటూ కారులో బయటకు వెళ్ళిన గుర్తుంది.)

మేము ఎక్కిన కారు చాలా చాలా దూరం వెళ్ళి ఒక దగ్గర ఆగింది. కారులోంచి దిగి చూస్తే ఒక పెద్ద రాజమహల్ లాంటి భవనం ముందు  ఉన్నాము. అది ఎవరిదో, అక్కడ ఎందుకు దింపారో అర్ధంకాలేదు. అంత పెద్ద మేడలో మేముంటామని ఊహించలేదు. కారువాడికి డబ్బులిచ్చేసి మమ్మల్ని లోపలికి తీసుకువెళ్ళారు. ఇంటిలోపలికి వెళ్ళాక, లోపలున్న మనుషులను చూసాక తెలిసింది అదే ఘంటసాలవారి ఇల్లని. వాళ్ళే మా తాతగారిని చూడ్డానికి విజయనగరం వచ్చేరని. ఆ ఇంట్లో వున్నవారంతా చాలా అభిమానంతో పలకరించారు మమ్మల్ని. అక్కడి వాతావరణం, మరికొంతమంది మనుషులు పూర్తిగా కొత్త కొత్తగా అనిపించింది. భయం భయంగా మా అమ్మగారి వెనకే నక్కడం బాగా గుర్తుంది. 

ఆ రోజు సాయంత్రం ఘంటసాలగారింట్లో వారంతా తమ స్నేహితుల ఇంట్లో పెళ్ళికో, లేక, పెళ్ళి విందుకో వెళుతూ మా అందరినీ కూడా తీసుకువెళ్ళారు. మేము వెళ్ళిన పెళ్ళివారిల్లు చాలా పెద్దదిగా విశాలంగా వుంది. అంత విశాలమైన గదిలో పెళ్ళి కార్యక్రమం చూడడం అదే ప్రధమం. అంతకు ముందు మా శారద పెళ్ళి చూసినా అదంతా తాటాకు పందిళ్ళ క్రింద జరిగింది. ఈ పెళ్ళికి వచ్చినవారిలో ఎక్కువగా తెలుగు మాట్లాడినవారే కనిపించారు. అయితే, మెడ్రాస్ తెలుగు ఊరే అని అనుకున్నాను. అక్కడివారంతా మాకు తెలియనివారు కావడం చేత వారి మాటలు వింటూ ఓ పక్కన కూర్చుండిపోయాము.  ఊరు కొంత అలవాటుపడిన కొన్నాళ్ళకు తెలిసింది - అది పెళ్ళి వారి సొంతిల్లు కాదని, అక్కడ అలాంటి పెళ్ళిళ్ళు, విందులు, వినోదాలు‌, సభలు, సమావేశాలు జరుగుతూంటాయని, వాటిని కళ్యాణమండపాలని అంటారని. అలాటి అద్దె విడిదుల్లోనే పెళ్ళిళ్ళు జరుపుతారని తెలుసుకున్నాను. మేము వెళ్ళిన కళ్యాణ మండపం నుంగంబాక్కం స్టెర్లింగ్ రోడ్, స్పర్ టాంక్ రోడ్ బ్రిడ్జ్ దాటాక చెట్ పట్ లెవెల్ క్రాస్ కు ముందు ఎడమవేపు బాగా లోపలకు వుండేది. (అప్పటికి చెట్ పట్ ఫ్లైఓవర్ కట్టలేదు). ఇప్పటికీ ఆ కళ్యాణమండపం మూడు పెళ్ళిళ్ళు ఆరు రిసెప్షన్లంటూ  నిత్యకళ్యాణం పచ్చతోరణంగా కలకలాడుతూనే  ఉంది ఈ మధ్యకాలం వరకూ 'కుచలాంబాళ్ కళ్యాణ మండపం' పేరిట. (ఇప్పుడూ ఉందనుకుంటాను. అటుపక్కకి వెళ్ళలేదు ఈమధ్య.) 

ఆ విధంగా మా మెడ్రాస్ జీవితం శుభప్రదంగా ఒక పెళ్ళి శుభకార్యంతో ప్రారంభమయింది. 

ఆరోజు రాత్రి ఘంటసాల వారింట్లోనే గడిపి ఆ మర్నాడు ఉదయం మేము వుండవలసిన ఇంటికి చేరుకున్నాము. అదొక పెద్ద లోగిలి. వీధివేపు ప్రహారీగోడ, లోపలికి వెళ్ళడానికి చిన్న గేటు.లోపలికి ప్రవేశించగానే ఎడమవేపు చిన్న చప్టాతో ఒక పెద్ద చెట్టు - అదేం చెట్టో గుర్తులేదు, కానీ చల్లదనం ఇచ్చే చెట్టు. కుడి, ఎడమల వేపు చిన్న చిన్న పెంకుటిళ్ళు. నడవడానికి మధ్య దారి. ఒక వంద గజాల తర్వాత ఎదురు వరసలో మరికొన్ని ఇళ్ళు. మొత్తానికి ఆ లోగిట్లో ఓ పదిహేను ఇళ్ళవరకు ఉండవచ్చును. ఆ ఇళ్ళ కప్పుల మీదున్న పెంకులు నేను విజయనగరంలో, బొబ్బిలిలో చూసిన ఇళ్ళపెంకులకు విరుధ్ధంగా ఉన్నాయి. అవి వంపు తిరిగి డొప్పల్లా వుంటే, మెడ్రాస్ ఇళ్ళ పెంకులు ఎర్రగా పలకల్లా పెద్దవిగా వున్నాయి. వాటినే బంగళా పెంకులంటారని తెలిసింది. బొబ్బిలి, విజయనగరం ప్రాంత పెంకుటిళ్ళు మెడ్రాస్ లో కూడా వున్నాయని కొన్నేళ్ళకు తెలిసింది. కచాలేశ్వర అగ్రహారం, పరశువాకం విల్లివాక్కం, ట్రిప్లికేన్, మైలాపూర్, సైదాపేట్, ఆలందూర్, వెస్ట్ మాంబళం వంటి పాత మెడ్రాస్ ప్రాంతాలలో అలాటి అప్పటికింకా ఉండేవి. అయితే ఎనభైలకి అవి శిధిలావస్థకి చేరుకున్నాయి. మేమున్న వీధి పేరు 'రంగయ్యర్ స్ట్రీట్. మెడ్రాస్ లో ప్రతీ ఇంటికీ విధిగా ఒక నెంబరు ఉండి తీరాలట, ఉంటున్న ఇంటిని ఇతరులకు చెప్పడానికి, పోస్ట్ మేన్ తిన్నగా ఉత్తరాలు తెచ్చివ్వడానికి. మా వూళ్ళలో ఏ ఇంటికీ ఏ నెంబర్ వుండేదికాదు. ఫలానా వారిల్లంటే చాలు జట్కావాళ్ళు, రిక్షావాళ్ళు  సరిగ్గా ఇంటిదగ్గర దింపేసేవారు. మెడ్రాస్ మహానగరం కావడాన ప్రతీ వీధికీ పేరు, ఇంటికి నెంబరు తప్పనిసరి. రంగయ్యర్ స్ట్రీట్ లో మేముండిన ఇంటి నెంబర్ '11'.

ఆ లోగిట్లో కుడివైపున్న నాలుగైదు ఇళ్ళలో ఆఖరిది. ఇల్లంతటికి ఒకటే గది. గుమ్మం దాటగానే ఎడమవేపు చిన్న వంటిల్లు, పక్కన చిన్న వరండా. అది దాటితే ఒక గది.  అంతే మొత్తం ఇల్లు. కరెంట్ దీపాలున్నాయి. ఇంటంతటికీ రెండే కాంతి తక్కువ బల్బులు, వంటింట్లో ఒకటి, గదిలో ఒకటి. ఇంటి బయట  ఒక కొళాయి, ఒక బాత్ రూమ్, ఒక టాయిలెట్ ఆ వరసలోని ఇళ్ళన్నిటికీ కామన్. వాటి శుభ్రత విషయం అంతంత మాత్రమే. అద్దె నెలకు ఇరవయ్యో, ముఫ్ఫైయో. మధ్య తరగతివాళ్ళకు అలాటిచోట్ల ఇల్లు దొరకడమే గొప్పని అనేవారు. ఆ లోగిలి సొంతదారుడు ఒక గుజరాతీ సేఠ్ అట. మా ఇంటికి ఎదురుగానే పెద్ద బంగళాలో వుంటారట. ఇంటికి చాలా పెద్దగేటు, లోపల పెద్ద పెద్ద కార్లు మాత్రమే కనిపించేవి. మనుషులు కనిపించేవారు కాదు. ఎప్పుడేనా కారు బయటకు వెళ్ళినా, లోపలికి వచ్చినా ౠఎవరో తోటమాలి తలుపు తెరిచేవారు. వెంటనే తలుపులు మూసుకునేవి. అలాటప్పుడు ఒకసారి లోపలకు తొంగి చూసాను. వీధి వాకిట్లోనే చాలా పెద్ద కొలనులా వుంది. దాని మధ్య ఒక  పెద్ద రంగుల సిమెంట్ తామర మొగ్గ. కొలను చుట్టూ రౌండ్ గా సిమెంట్ తొట్టి. అలాటి కొలను  పాతాళభైరవి సినిమాలో 'ఎంత ఘాటు ప్రేమయో' పాటప్పుడు చూసిన గుర్తు. దానిని వాటర్ ఫౌంటెన్ అంటారట. అందులోనుండి నీళ్ళు చిమ్ముతాయట. అయితే, ఆ వింత ఆ ఇంట్లో ఉన్న రోజుల్లో చూడ్డం అవలేదు. 









ఏది ఏమైనా ఈ బంగళాపెంకుటింటి కంటే మా బొబ్బిలి పూరిల్లే విశాలంగా చాలా బాగుండేదనిపించింది. 

ఇంటిలోనుండి వీధిలోకి వచ్చి కుడివైపు కొంత దూరం వెడితే అడ్డంగా ఒక మెయిన్ రోడ్. దాని పేరు 'సర్ మహమ్మద్ ఉస్మాన్ రోడ్'. అక్కడ ఎడమ వేపు తిరిగి ఒక పది నిముషాల పాటు నడిస్తే 35 ఉస్మాన్ రోడ్ వస్తుందని మా నాన్నగారు చెప్పారు. అదే ఘంటసాలవారిల్లు.

ఘంటసాల అంటే గుర్తుకు వచ్చింది. మా లోగిట్లో కూడా ఒక ఘంటసాల వుండేవారు. అయితే జూనియర్ ఘంటసాల. పేరు బాగేపల్లి సుబ్రమణ్యం. భార్య, ఒక చంటిపిల్లవాడు వారి కుటుంబం. మా ఇంటికి ఎదురు వరసలో ఇల్లు. వారు కన్నడిగులే  అని గుర్తు. కానీ తెలుగు బాగా తెలుసు.  ఆయన దగ్గర ఒక గ్రామఫోన్ మూడో నాలుగో రికార్డ్లు ఉండేవి. ఆయన 'ఉమాసుందరి' సినీమాలో పిఠాపురం తో కలసి ఒక పాట పాడారట. కానీ ఇప్పుడు నెట్ లో ఆ సినిమా టైటిల్స్ లో ఆయన పేరులేదు. మరేవో మూడు పాటలు ఆయనవే, గ్రామఫోన్ లో వేసి వినిపిస్తూండేవారు ఎవరొచ్చినా. అలాగే,  'జూనియర్ ఘంటసాల 'బాగేపల్లి సుబ్రహ్మణ్యంగారి గాన కచేరీ  అని ప్రింట్ చేయబడిన లైట్ మ్యూజిక్ ప్రోగ్రామ్ పాంప్లెట్స్ చూపించేవారు. కానీ, ఆ గ్రామఫోన్ లో వారిగొంతు ఘంటసాలగారి గొంతులా నాకనిపించలేదు. నా గ్రహణశక్తి లోపం కావచ్చు. మేము ఆ ఇల్లు వదలి వెళ్ళాక మళ్ళీ ఆ బాగేపల్లి సుబ్రమణ్యంగారిని నేను చూడడం తటస్థించలేదు. గాయకుడిగా కూడా ఆయన పేరు విన్న గుర్తులేదు. మెడ్రాస్ లో  తాము నేర్చుకున్న విద్యకు తగ్గ గుర్తింపు, అవకాశం లభించక కనుమరుగైపోయిన ఇలాటి సినీ కళాకారులెందరో.



తెలుగు, ఇంగ్లీషు, హిందీయే కాకుండా ఇంకా చాలా భాషలే వున్నాయని రంగయ్యర్ స్ట్రీట్ ఇంటికి వెళ్ళేకే నాకు తెలిసింది. అదొక మిని భారత దేశం. రకరకాల మనుషులు. అధిక సంఖ్యలో తమిళులు, స్వల్ప సంఖ్యలో తెలుగు, కన్నడ, మలయాళ, గుజరాతీ, మరాఠీ కుటుంబాలు ఆ వీధిలో వుండేవి. 

ఆ ప్రాంతంలోని అన్ని వీధులలో ఇలాటి లోగిళ్ళు రెండో మూడో వుండడం తర్వాతి కాలంలో గమనించాను. మా లోగిట్లో వారు మాట్లాడేది తమిళం, కన్నడం, మలయాళం భాషలంటారని క్రమక్రమంగా అర్ధమయింది. ఏ భాష ఏదో తెలిసేది కాదు, తెలుగు తప్ప. తెలుగులో మాట్లాడేవాళ్ళు తక్కువే. అక్కడి వాళ్ళు మాట్లాడే తెలుగుకి, నాకు తెలిసిన తెలుగుకి చాలా తేడావుంది. అరవం ఒక్క ముక్క అర్ధమయేది కాదు. (తమిళాన్ని అరవం అని అనడానికి కారణం ఏమిటో ? ఎవరైనా భాషా చరిత్రకారులు చెప్పాలి).

'మా తెలుగు తల్లికి మల్లె పూదండ' తో పాటూ ఇతర భాషామ తల్లులని కూడా మల్లెపూదండలతో గౌరవించాలని రంగయ్యర్ స్ట్రీట్ లో నాకు బాగ అర్ధమయింది. 

నెం.11, రంగయ్యర్ స్ట్రీట్ లోగిట్లోవారంతా ఎవరి భాషలో వారు పలకరించేవారు. నాచేత మాట్లాడించడానికి ప్రయత్నించేవారు. అసలు బయట జనాలంటేనే భయం. అందులో ఏవేవో భాషలవారితో నేనేం మాట్లాడగలను. అందుకే, నా నైజం అర్ధం చేసుకున్న మా పెద్దమ్మమ్మగారు 'వీడు ఇంట్లో పులి, వీధిలో పిల్లి' అని అనేవారు.

రంగయ్యర్ స్ట్రీట్ ఇంటికి వెళ్ళిన కొద్దిరోజులకే బోల్డు కష్టాలలో ఇరుక్కున్నాను, భాషాపరంగా. ఒక రోజు మా అమ్మగారు పక్కవీధిలోని దుకాణానికి వెళ్ళి కాఫీగుండ తెమ్మని పురమాయించారు. ఆ దుకాణం మా ఇంటికి ఎడమవేపునున్న మాంబళం రైల్వే స్టేషన్ రోడ్ లో వుండేది. ఆ రోడ్ మీద ఎడమవేపు కొంత దూరం వెడితే  లోకల్ రైల్వే స్టేషన్, కుడివేపు వెళితే  దొరస్వామిరోడ్ లెవెల్ క్రాస్. ఒక పక్క పానగల్ పార్క్ రోడ్. లెవెల్ క్రాస్ కు అవతల వేపు వెస్ట్ మాంబళం. వెస్ట్ మాంబళం అతి ప్రాచీనం. మేముండేది కొత్త మాంబళం. దానినే త్యాగరాయనగర్ (టి.నగర్) అంటారట. 

నేను మా అమ్మగారు చెప్పిన కొట్టుకి (షాపు)వెళ్ళాను కాఫీగుండ కొనడానికి. అప్పట్లో ఆ షాప్ కు  ఏ పేరుండేదో గుర్తులేదు కానీ, తర్వాతి కాలంలో TUCS(ట్రిప్లికేన్ అర్బన్ కోపరేటివ్ స్టోర్)గా, ఆ ప్రాంతపు రేషన్ షాప్ గా వృధ్ధి చెందింది. సరే, ఆ షాపుకు వెళ్ళేను. పెద్దగా జనాలు లేరు అప్పటికి. కౌంటర్లో వున్నవాడితో  మా అమ్మగారు చెప్పినట్లుగా తూచా తప్పకుండా 'కాఫీగుండ' కావాలని అడిగాను శుధ్ధ తెలుగులో. నేనడిగింది అతనికి అర్ధమైనట్లులేదు. 'ఎన్నా వేణుం' అని అతనన్నది నాకర్ధంకాలేదు. మళ్ళీ 'కాఫీగుండ' అన్నాను. ఆ షాపువాడికి కాఫీ అన్నమాట ఒక్కటే తెలిసింది. అదిక్కడ దొరకదు హోటల్ కు పో అన్నాడు అరవంలో.  నాకు కావలసింది హోటల్ కాఫీ కాదు. అక్కడే నిలబడ్డాను జెండా కొయ్యలాగ. జనాలు వస్తున్నారు, పోతున్నారు. మరికొంతసేపటికి మరొకడు వచ్చి అడిగాడు ఏం కావాలని. మళ్ళీ అదే పాట 'కాఫీగుండ'. వీడికి నా మాట అర్ధమైనట్లుంది. లోపలికి వెళ్ళి పొట్లం కట్టి తీసుకువచ్చి నా దగ్గర డబ్బులు తీసుకొని, ఆ పొట్లాం చేతిలో పెట్టాడు. అమ్మయ్య! మొత్తానికి సాధించానని సంతోషంగా ఇంటివేపు లగెత్తాను. ఇంట్లోకి వచ్చి ఆ పొట్లాన్ని మా అమ్మగారికి ఇచ్చేను. 'ఇదేమిటి? కాఫీగుండ ఏది? ప్రశ్న. 'అదే ఇది' సమాధానం. పొట్లం విప్పి చూస్తే లోపల కాఫీ గుండ లేదు. వేయించని కాఫీ గింజలు.  అమ్మక్కోపం వచ్చింది. నేను గుండ అన్నది షాపు వాడికి కాఫీ గుండుగింజలుగా అర్ధమయింది. మా నాన్నగారే మళ్ళీ ఆ షాపుకు వెళ్ళి ఆ కాఫీ గింజలు మార్చి కావలసిన కాపీ తూళ్ అదే కాఫీ పొడి కొనుక్కువచ్చారు. అమ్మ చెప్పిన కాఫీగుండ తేలేకపోయినందుకు నాకు ఘోర అవమానంగా తోచింది. నా తెలుగు తెలియని ఆ అరవ్వాళ మీద కోపం వచ్చింది. 

అదే, మెడ్రాస్ లో నా మొట్టమొదటి షాపింగ్ అనుభవం.
ఇలాటి అరవంపు బాధలు మరిన్ని ...
వచ్చే వారం ....
                      ...సశేషం

*With a view to make the narrative more authentic and to corroborate it, images, audio and video clips are attached at appropriate places. If such usage is found objectionable to the copyright holders the same shall be removed if and when notified.


7 comments:

Hrishikesh Sharma said...

బాగేపల్లి వారిని మొదటిసారి పరిచయం చేసారు. ధన్యవాదాలు. వారి గొంతు, కన్నడ పాట బాగున్నాయి. మీ మద్రాస్ అరంగేట్రం బాగుంది. మాష్టారి ఇంటికి చేరారని తెలిపినప్పుడు, నేను కూడా అడుగుపెట్టినట్టు అనిపించింది. ముందు ముందు మరిన్ని ఉత్కంఠ పరిచే విషయాలు ఉంటాయి కాబట్టి, మరింత ఉద్విజ్ఞులం అవుతామేమో. నమో నమః👌👌🙏🙏

వడ్డాది గోపాలకృష్ణ మూర్తి said...


క్రొత్త అధ్యాయం ఉన్నట్లుండి క్రొత్తగానే ఉంది. ఇంకా గ్రామీణ వాతావరణం నుండి మద్రాసు మహానగరం చేరిన వయనం కళ్ళకి కట్టించేరు గదూ! ఔను.
ఒక విషయం అర్ధం కావటం వయసుల మీద ఆధారపడి ఉంటుంది. చిన్నప్పుడే చదువుకొనే రోజుల్లో తలిదండ్రులతో కలసి ఆ వాతావరణం లో అందరితో సర్దుకుపోవడం గొప్ప జీవితానుభవమే సుమా! ప్రణవ స్వరాట్ గారికి వారి మద్రాసు తొలి పరిచయం అందునా అప్పటి సంగీతజ్ఞులు, జూ ఘంటసాల @ శ్రీ బాగేపల్లి సుబ్రహ్మణ్యం గారి గ్రామోఫోన్ రికార్డులు వినడం, ఆ అనుభవాన్ని వారితో పదిలంగా ఈ నాడు మా వరకు సాక్షార రూపంలో ప్రత్యక్ష / పరోక్షంగా మా చెవులకు, కనులకు తీసుకు వచ్చిన మీకు కృతజ్ఞతతో! మరిన్ని మదిని ఊరించే జ్ఞాపకాల పరoపర కోసం ఆశావహంగా ఎదురుచూస్తూ!☺️💐

P P Swarat said...

విజికె గారికి ధన్యవాదాలు.

P P Swarat said...

శ్రీ హృషికేశ్ గారికి శుభోదయం. మీ అభినందనలకు ధన్యవాదాలు.

Patrayani Prasad said...

🙏🙏శ్రీ అన్నయ్యకు నమస్కారములు 🙏🙏, ఈ సంచికలో, నీవు వ్రాసిన విశేషాలన్నీ, నాకు క్రొత్తవే. ఇంతకు ముందు ఎప్పుడూ కూడా ఈ విషయాలు మన మధ్య ప్రస్తావనకు వచ్చినట్లు, గుర్తు లేదు. ఈ వ్యాస పరంపర రూపంలో తెలిసినందుకు,నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సంచికలో నీవు పరిచయం చేసిన శ్రీ బాగేపల్లి సుబ్రహ్మణ్యం గారి పాట, నాకు శ్రీ ఏ ఎం రాజా గారి పాటల వరుసలలో ఉన్నట్లుగా అనిపించింది . వాటిని భద్రపరచి స్పష్టముగా వినిపించి నందుకు సంతోషముగా కూడా ఉంది . ధన్యవాదాలు. నీ జ్ఞాపకానికి జోహార్లు. చాలా చక్కగా, వివరంగా, అన్ని విషయాలు జ్ఞాపకంగా వ్రాశావు . ధన్యవాదాలు 🙏🙏-
పట్రాయని ప్రసాద్ , బెంగుళూరు,.తేదీ :17-10-2020, శనివారం , సమయం: ఉదయం:గం.09:20ని.IST.

సంబటూరి వెంకట మహేష్ బాబు said...

మదరాసు మహానగరంలో కాలు మోపినది లగాయతు మీ పరిశీలనాత్మక దృష్టి తో పోగు చేసుకున్న చిన్ననాటి జ్ఞాపకాలు అన్నీ చక్కగా పంచుకున్నారు.... మీ జ్ఞాపకాలు చదువుతూంటే మీ చేయి పట్టుకుని మదరాసు మహానగరంలో కలయతిరిగిన అనుభూతి కలిగింది మాస్టారు గారూ....

కుచలాంబాళ్ కళ్యాణ మండపం కబుర్లు మరియు మీరు నివసించిన లోగిలి ముచ్చట్లు చాలా ఆసక్తికరంగా చదివింపజేసాయి...

మదరాసు మహానగరంలో మీ తొలి షాపింగ్ అనుభవం భలే భలే ఉంది...��... అమ్మగారు చెప్పిన కాఫీగుండ సవ్యంగా తీసుకురాలేక పోవడానికి కారణం ఐన తమిళ భాష సమస్య తరువాత కాలంలో మీరు తమిళం లో పట్టు సాధించేందుకు ఉపకరించి ఉంటుందని భావిస్తాను����

మీ రైటప్ ఎప్పటిలాగే పరమాద్భుతమ్స్వరాట్ మాస్టారు గారూ.... తెలుగు భాష మాత్రమే కాకుండా ఇతర భారతీయ భాషలకూ మల్లెపూదండ లు వేయాలని తెలిసింది అని ఓ చోట భలే రాసారు ����������������������������������������

వచ్చే శనివారం మరిన్ని మీ మధుర స్మృతులు చదివేందుకు ఆసక్తి గా ఎదురు చూస్తూ ఉంటాము మాస్టర్ గారూ ��������

P P Swarat said...

సునిశితంగా ఈ వ్యాసాన్ని చదివి అభిప్రాయం తెలియజేసినందుకు ధన్యవాదాలు.