visitors

Friday, October 23, 2020

నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 2 - మూడవ భాగం

23.10.20 - శుక్రవారం భాగం - 3*:
అధ్యాయం 2 భాగం 2 ఇక్కడ

  

నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్

రంగయ్యర్ స్ట్రీట్ ఇంటికి వెళ్ళిన మొదటివారంలోనే మా నాన్నగారు ఒక సాయంత్రం మా అందరిని చైనాబజార్ కు తీసుకువెళ్ళారు. మెడ్రాసులో అత్యంత ప్రాముఖ్యత సంతరించుకున్న వ్యాపార కేంద్రం చైనా బజార్. చెన్నపట్టణంలో ఫోర్ట్ సెయింట్ జార్జ్ నిర్మించిన కాలంలో దానికి ఉత్తరంలో ప్రస్తుతం మద్రాసు హైకోర్ట్ ఉన్నజార్జ్ టౌన్ ప్రాంతాన్ని బ్రిటీష్ వారు బ్లేక్ టౌన్ అనేవారు. కొంత కాలం ఫ్రెంచ్ వారి అధీనంలో ఉన్నా, Treaty of Aix-la-Chapelle అన్న ఒక ఒడంబడిక ప్రకారం క్విబెక్ ని వారికి అప్పగించేక ఈ చెన్నపట్టణ ప్రాంతం మళ్ళీ బ్రిటిష్ వారి అధీనంలోకి వచ్చింది. పాండీచేరీలో మాత్రం ఇంకా ఫ్రెంచ్ వారి ప్రాభవం, ప్రభావం ఇంకా కనిపిస్తుంటుంది. బ్రిటీష్ వారి అధీనంలోకి తిరిగి వచ్చేక తమ వద్ద పనిచేస్తున్న పనివారు స్థానికంగా నివసిస్తున్న బ్లేక్ టౌన్ ప్రాంతంలో కొంత భాగం నేల మట్టం చేసి పదమూడు స్థంభాలు ఏర్పాటు చేసుకున్నారట. శత్రుదాడిని సమర్ధంగా ఎదుర్కోడానికి. వాటిలో ఒక స్థంభం  పారీ భవన సముదాయంలో నేటికీ Parry Company వారి పరిరక్షణ, పర్యవేక్షణలో ఉంది. పదమూడు స్థంభాలు శత్రుదాడి నుంచి రక్షించుకోడానికి నిర్మించినవని చరిత్రాకారుల అభిప్రాయం అయినా, అవి బ్రిటీష్ వారు కెనడా లో ఫ్రెంచ్ వారికి స్వాధీనం చేసిన క్విబెక్ సహా పదమూడు ప్రావిన్స్ ల జ్ఞాపకార్ధం నిర్మించినవేమో.

ప్రస్తుతం సెంట్రల్ స్టేషన్ పక్కనున్న వాల్ టేక్స్ రోడ్ నుంచి ప్యారీస్ కార్నర్ కి వెళ్ళే దారి NSC Bose Road. అదే ఒకప్పుడు చైనా బజార్ రోడ్. దాన్నే ఈవెనింగ్ బజార్ రోడ్ అని కూడా అనేవారు. చైనా బజార్ రోడ్డు అదే ఇప్పటి NSC Bose Road  హార్బర్ కి వెళ్ళే ఫస్ట్  లైన్ బీచ్ రోడ్డుని కలిసే మూల, మద్రాసు హైకోర్ట్ ఎదురు వేపు ఉన్న ప్యారీ కంపెనీవారి పెద్ద అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ పేరు మీద అది ప్యారీస్ కార్నర్ గా ప్రసిధ్ధికెక్కింది. 

పారి మునై - పారీ మూల - Parry's Corner

ఈ ఈవెనింగ్ బజార్ రోడ్డుని చైనా బజార్ గా పిలవడానికి నాకనిపించే ఒకే కారణం ఆ రోజుల్లో బ్రిటీష్ వారు వారికి కావలసిన వంటింటి క్రోకరీ - పింగాణీ సామగ్రి కొనుగోలు చేయడానికి వీలుగా ఈ ఈవెనింగ్ బజార్ లో చైనా వేర్ (పింగాణీ సామగ్రి) అమ్మే షాపులు ఉండేవి. వాటిలో అతి ప్రముఖమైనది 1889లో పేవ్ మెంట్ షాప్ గా ప్రారంభమైన కరీంభాయ్'స్ ఈనాటికీ ఆ రోడ్డు మీద కనిపిస్తుంది. 

1889లో ఈప్రాంతంలోనే ఒక పేవ్ మెంట్ షాపు ఈ కరీంభోయ్'స్


తరవాత కాలంలో భాయ్స్ కడై అంటే భాయ్స్ కొట్టు, అరవంలో ప, బ లకి తేడాలేకపోడం వల్ల పాయ్ కడై అయింది. పాయ్ అంటే అరవంలో చాపలు (mats) అన్న అర్ధంలో. ఆ తరవాత కొంత కాలానికి ఆ ప్రాంతంలో చాపల కొట్లు కూడా ఉండడంచేత అది పాయ్ (చాపల) కడై అయిపోయింది.  

నాకు తెలిసి అరవై డెబ్భైలలో కూడా పింగాణీ సామగ్రి, బొమ్మల వాడుక ఎక్కువగానే ఉండేది. అంచేత మద్రాసు చైనా బజార్ కి చైనాతో ఏ సంబంధం లేదు, ఎత్తేస్తే ఏడు ముక్కలయ్యే పింగాణీ సంబంధం తప్ప. అలాగే ఈమధ్య హైదరాబాద్ లాంటి నగరాల్లో కనిపిస్తున్న ప్లాస్టిక్, ఫేన్సీ వస్తువులమ్మే చైనా బజార్లకి చైనా-పింగాణీ తో ఏ సంబంధం లేదు, చైనా దేశంతో కూడా. 1960 దశకం చివర బర్మా నుంచి వచ్చిన తమిళ కాందిశీకుల కోసం ఫస్ట్ లైన్ బీచ్ రోడ్ మీద వారు తెచ్చుకున్న వస్తువుల అమ్మకం కోసం వెలసినది బర్మా బజార్. కాలక్రమంలో అది తొంభైలనాటికి contraband, smuggled electronic goods, CDలు DVDలు అమ్మే  గ్రే మార్కెట్ గా మారింది. 

హార్బర్ దారి - ఫస్ట్ లైన్ బీచ్ రోడ్ - కుడివేపు ఇప్పుడు బర్మా బజార్ షాపులు - ఆరోజుల్లో ట్రాం లైన్స్ ఉండేవి 

తరవాత అదే చైనా, మలేషియా, సింగపూర్ ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకున్న వస్తువుల మార్కెట్.  ఫ్లవర్ బజార్ పోలిస్ స్టేషన్ సమీపంలోని కందసామి కోయిల్, మింట్ స్ట్రీట్ మొదలు పారీస్ కార్నర్ లోని ఆర్మీనియన్ స్ట్రీట్, లింగి చెట్టి, తంబు చెట్టి, అంగప్ప నాయకన్మూర్ స్ట్రీట్ లాంటి  వీధులన్నీ వ్యాపార కేంద్రాలే. బ్రాడ్ వే, బందర్ స్ట్రీట్, సుంకురామచెట్టి, తంబుచెట్టి స్ట్రీట్ లలో ఈ చివరి నుండి ఆ చివరివరకు ఒక్కో వీధి సుమారు రెండు, మూడు కిలోమీటర్ల దూరానికి అన్నీ షాపులే. ఈ తంబుచెట్టి వీధిలోనే కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుగారి 'ఆంధ్రపత్రిక' దిన, వార పత్రికల ఆఫీస్, ప్రెస్ వుండేవి. ఆ ప్రాతమంతా మెడ్రాస్ లోని ప్రముఖ వాణిజ్య కేంద్రం. హోల్ సేల్, రీటైల్ వ్యాపార కూడలి. 


ఆసియాలోనే అతి పెద్ద కొత్వాల్ చావడి కూరగాయల బజారు 

ఆసియాలోనే అతి పెద్ద హోల్ సేల్ మార్కెట్ గా పేరు పొందిన కొత్వాల్ చావడి కూరగాయల బజారు, ఫ్లవర్ బజార్ మార్కెట్ ప్రాంతం కూడా అక్కడే. ఈ ప్రాంతమంతా జార్జ్ టౌన్ గా, పాత మెడ్రాస్ గా వుండేది. ఈ ప్రాంతం సూర్యోదయం నుండి అర్ధరాత్రి వరకు జనాలతో కిటకిటలాడుతూంటుంది. తొంభైల దాకా కూడా ఈ వీధుల్లో ఇళ్ళన్నీముందు భాగం షాపులు. వెనకాల వేపు వారి కుటుంబాలు. పెద్ద పెద్ద మేడలే. పాతకాలంవి. ఆ ఇళ్ళలోకి సహజమైన గాలి, వెలుతురు ప్రవేశించే వీలే వుండదు. క్రిక్కిరిసిన వాహనాలు, జనాలతో ఆ ప్రాంతం కొత్తవారికి ఉక్కిరిబిక్కిరిగానే ఉంటుంది. నాకు అలాటి పరిస్థితే ఏర్పడింది. చైనా బజార్ ప్లాట్ ఫారమ్ మీది షాపుల్లోని వింతలన్ని అంతవరకూ నా జన్మలో చూడలేదు. (ప్రస్తుతం మెట్రో రాకతో అధునాతనంగా తయారవుతోంది ఈ ప్రాంతం అంతా). 

ఇరుకు జార్జ్ టౌన్ ప్రాంతం

అవన్నీ చూసుకుంటూ తిరగడంలో టైమే తెలియలేదు. అప్పటికి రాత్రి 8.30 గంటలైపోయింది. జన సంచారం పల్చబడింది. మేము తిరిగి ఇంటికి రావడానికి   బస్ స్టాప్ కు చేరుకున్నాము. విశాలమైన  (జనాలు లేకపోతే) ఆ రోడ్ కు రెండు ప్రక్కలా బ్రిటిష్ కాలం నాటి ఎత్తైన ఎర్రటి భవంతులను చూస్తే   ఎంత పెద్ద ఇళ్ళో అని ఆశ్చర్యం కలిగింది. అంతంత పెద్ద ఇళ్ళు, భవనాలను ప్రత్యక్షంగా చూడడం అదే మొదటిసారి.  మెడ్రాస్ హైకోర్ట్ ప్రాంగణం ఆనుకుని మైన్ రోడ్డు మీద పారీ'స్ కార్నర్ బస్ స్టాండ్. ప్రాంగణం లోపలే లైట్ హవుస్. ఆ ప్రహారీ గోడను ఆనుకొని 11వ నెంబర్ బస్ స్టాప్. మేముండే టి.నగర్ కు వెళ్ళే 11, 11A, 11C బస్సులు అక్కడినుండే బయల్దేరుతాయి. అందులో 11 నెంబర్ బస్సులు అధిక సంఖ్యలో వుండేవి. అప్పట్లో అన్నీ ఎఱ్ఱరంగు ల్యాలెండ్ కంపెనీ బస్సులే వుండేవి. 

ఆరోజుల్లో వీధిదీపాలకి కూడా incandescent బల్బులే ఉండేవి. ఇప్పటిలా ట్యూబ్ లైట్లో, సోడియం వేపరో, ఎల్ఇడి బల్బ్ లో కావు కదా. మామూలు ఇళ్ళలో వాడే బల్బ్ లే. పదిహేను ఇరవై అడుగులు ఎత్తుండే ఆ దీప స్థంభాలు '?' షేపులో పైభాగం వంపు తిరిగి కిందికి చూస్తున్నట్టు నిలబడివుండేవి. 


వాటి డూములు/షేడ్ పైవేపు ఆకుపచ్చగా లోపల వేపు తెల్లగా కోటింగ్ వేసి వుండేవి. 

ఈ లైట్ లకి డూమ్/షేడ్ లు ఎందుకంటేట, ప్రపంచయుధ్ధ కాలంలో రాత్రిపూట శత్రు సైనికుల విమానాలకు క్రింద అక్కడ వూళ్ళున్నాయని తెలియకుండా వుండడానికి వీధి దీపస్థంభాలకు ఆ డిస్క్ లు తగిలించారని అనేవారు!? నిజానికి యుధ్ధవిమానాలు దాడే జరిగితే వీధిలైట్లు, ఇళ్ళలో లైట్లు ఆర్పేసి blackout చేసి పూర్తిగా అంధకారంలోనే గడిపేవారట. అటువంటి యుధ్ధవాతావరణంలో 1942 లో మా నాన్నగారు మెడ్రాస్ లో కొన్ని మాసాలున్నారట. 'అమ్మ బాబోయ్! ఎలా వున్నారో' అని అనుకున్నాను. అయితే, నేను పుట్టిన సంవత్సరంలోనే రెండవ ప్రపంచయుధ్ధం ముగియడం వల్ల నాకు ఆ విషయాలేవీ తెలియవు. కాకపోతే, నాకు కొంత జ్ఞానం వచ్చిన తరువాత కూడా నిత్యవసర వస్తువులకి రేషన్ ఉండడం, సులభంగా దొరకకపోవడమనేది గుర్తుంది. 

ప్యారీస్ కార్నర్ వీధి పొడుగునా దీపాలున్నా దట్టమైన చెట్ల మధ్య ఆ గుడ్డి దీపాలకాంతి అంతగా తెలియలేదు. వుండీ వుడిగీ లైట్ హౌస్ మీది రొటేటింగ్ ల్యాంప్ కాంతి మీద పడేది. (విశాఖపట్నం డాల్ఫిన్స్ నోస్ కొండమీది లైట్ హౌస్ దీపపు కాంతి దీనికంటే చాలా ఎక్కువట. సముద్రంలో చాలా దూరం వరకూ కనిపిస్తుందనుకునేవారు). టూరిస్టులు మద్రాసు లైట్ హౌస్ మీదకు వెళ్ళి వూరంతా చూడడానికి వీలుండేది అప్పట్లో, పగటిపూట. టికెట్ కొనుక్కుని. నేను కూడా చాలాసార్లు అలా  పైకి ఎక్కి చూశాను. ఇరుకు స్పైరలింగ్ మెట్లమీదుగా చుట్టూ తిరుగుతూ పైకి వెళ్ళాలి. అంత ఎత్తునుండి వూరంతా పచ్చని తివాసీ పర్చినట్లు చాలా దూరం వరకూ కనిపించేది. ఆనాటి మెడ్రాస్ దట్టమైన చెట్లమధ్య భవనాలు కనిపించేవికావు. (చల్లని సముద్రపుగాలితో సాయంసమయాలు ఎంతో ఆహ్లాదకరంగా వుండేది. ఆనాటి వాతావరణం పూర్తిగా మారిపోయింది). తూర్పున బంగాళాఖాతంలో కనుచూపు దూరంలో వెళుతున్న స్టీమర్లు కనిపించేవి. ఇప్పుడు నేను చెపుతున్న లైట్ హౌస్ మూడవది. 1894 లో సముద్రమట్టానికి 175 అడుగుల ఎత్తున హైకోర్టు ప్రాంగణంలో కట్టబడినది. రెండవ లైట్ హౌస్ 1841 లో 120 అడుగుల ఎత్తున అదే ప్రాంగణంలో డోరిక్ శిఖరం పైన ఉండేదట. అక్కడ హైకోర్ట్ ప్రాంగణంలోనే పారిస్ కార్నర్ ఎదురు వేపు ప్రస్తుతం రాజాజీ విగ్రహం ఉంది. మరి, మొదటి లైట్ హౌస్ వివరాలు తెలియవు. ఈనాడు అధునాతనంగా, మెరీనా-గాంధీ బీచ్ దగ్గర, ఆలిండియా రేడియో స్టేషన్ కు ఎదురుగా వున్న లైట్ హౌస్ నాలగవది. సాంకేతికంగా ఉన్నతమైనదే కావచ్చు కానీ హైకోర్టు లైట్ హౌస్ అంతా హుందాగా కనపడదు. 

ఈ విధంగా చుట్టూవున్న పరిసరాలను చూస్తూండగా 11 నెంబర్ రావడం, అందులో ఎక్కి టి నగర్ ఉస్మాన్ రోడ్ రాఘవన్ 'నెయ్ కడై' (నేతి దుకాణం) స్టాపింగ్ లో దిగి నడుచుకుంటూ రంగయ్యర్ స్ట్రీట్ లోని ఇంటికి చేరేసరికి రాత్రి 10 గంటలు దాటింది. నాకు గుర్తున్నంతవరకూ మా నాన్నగారితో కలిసి మళ్ళీ అలా విహారానికి వెళ్ళిన సందర్భాలు లేవు. అవకాశం లేకపోడం ఒక కారణం, స్వతహాగా విహారాలంటే ఆయనకుండే అనాసక్తత మరో కారణం కావచ్చు. మానాన్నగారితో కలసి అందరం బయటకు వెళ్ళిన సంఘటనలు చాలా అరుదు. 

మా లోగిట్లో అన్ని భాషలవారూ ఉండేవారు. అందులో చాలామంది సినీమావాళ్ళే. అందులో ఒక కన్నడ సినీమా పాటల రచయిత వుండేవారు. పేరు గుర్తులేదు. ఒంటరిగా ఉండేవారు. ఎప్పుడూ లుంగీ బనీను మాత్రం ధరించి ఇంట్లో చాపమీద గోడకానుకొని కూర్చొని సిగరెట్ల మీద సిగరెట్లు కాలుస్తూ ఏదో రాసుకుంటూ గడిపేవారు. రచయితలకు సిగరెట్ కు ఏవిటో ఆ అవినాభావ సంబంధం?

అప్పుడప్పుడు ఎవరో వచ్చి ఆయనను కారులో బయటకు తీసుకెళ్ళేవారు. వాళ్ళు మాట్లాడేది ఒక్క ముక్క అర్ధమయేదికాదు. అలాగే, కన్నడ సినీమాలకు చెందిన మరో కుటుంబం వుండేది. తల్లి ఒక డాన్స్ మాస్టర్. కూతురు ఒక బాలనటి. మేము ఆ ఇంటిలోనుండి వెళ్ళిపోయాక ఎప్పుడో వచ్చిన 'పిల్లలు తెచ్చిన చల్లని రాజ్యం' డబ్బింగ్ సినీమాలో బాలనటిగా మంచి వేషమే వేసింది. పెద్దయ్యాక  ఏదో సినిమాలో ఎన్ టి రామారావు పక్కన చెల్లెలుగా చూసిన గుర్తు. పేరు సుమ లేక కుసుమ కావచ్చు. నటిగా పెద్ద విజయం సాధించినట్లు కనపడదు. ఆ తల్లీ కూతుళ్ళను షూటింగ్ కు తీసుకువెళ్ళడానికి కారో, వ్యానో వచ్చేది. ఒకసారి ఒక పెద్ద వ్యాన్ వచ్చింది. అందులో ఒకావిడ కూర్చొనివుంది. రంగురంగుల బట్టలతో, ఒళ్ళంతా నగలతో, ముఖమంతా దట్టంగా పౌడర్ పూసుకొని, పెదవులంతా ఎఱ్ఱగా, తలంతా రంగురంగుల గొట్టాలాంటి క్లిప్ లతో వింతగా కనిపించింది. నేను మా కాంపౌండ్ లో వున్న చెట్టుక్రింది చప్టా ఎక్కి చూస్తున్నాను. ఆ వ్యాన్ లో ఉన్నావిడ నిముషానికి ఒకసారి చేతులు, వేళ్ళూ తిప్పుతూ, పెదవులాడిస్తూ, కళ్ళు తిప్పుకుంటూ సంజ్ఞలు చేస్తూంది. ఆ చర్యలు నాకెందుకో వింతగా, భయంగా అనిపించింది. ఇంతలో మా కాంపౌండ్ లోని డాన్స్ మాస్టర్ రావడం, వ్యానెక్కి వెళ్ళడం జరిగింది. తర్వాత తెలిసింది, ఆ రోజు వ్యాన్ లో ఉన్న నటి పేరు అమ్మాజీ అని, ఆ రోజు షూటింగ్ లోని డాన్స్ మూవ్మెంట్స్ ను మననం చేసుకుంటున్నారని. ఆవిడ రోజులమారాయి చిత్రంలో నటించిన విషయం మీకు తెలిసినదే. తరువాత, జయశ్రీగా పేరు మార్చుకొని (అదృష్టం కలిసొచ్చిందో లేదో) 'దైవబలం' లో ఎన్టీఆర్ పక్కన హీరోయిన్ గా నటించారు. ఆ జయశ్రీ కుమార్తే నిన్నటి తరం హీరోయిన్ జయచిత్ర.                                       

ఆ లోగిట్లో నా తెలుగు అర్ధం చేసుకుందుకు ఒక తెలుగు కుటుంబం వుండేది. నడి వయసు దాటిన భార్యభర్తలు. చదువు ముగిసి పెళ్ళికెదిగిన ఒక అమ్మాయి. ఆ అమ్మాయి దగ్గరే అవసరార్ధపు అరవ మాటలు కొన్ని నేర్చుకున్నాను.

అక్కడున్నప్పుడే మా నాన్నగారితో కలసి స్టూడియోలో  రికార్డింగ్ లకు వెళ్ళేవాడిని. అప్పటికింకా స్కూల్లో చేరలేదు. మా నాన్నగారిని స్టూడియోకు తీసుకువెళ్ళడానికి కారో, వ్యానో వచ్చేది. ఆ రోజుల్లో ఆర్కెష్ట్రా వాళ్ళను పికప్ చేసుకోవడానికి సినీమా కంపెనీవాళ్ళే వాహనాలు ఏర్పాటు చేసేవారు. అందుకోసం కార్లు, వ్యాన్లు అద్దెకు తీసుకునేవారు. అలా వచ్చే బళ్ళతో పాటు సినీమా కంపెనీ మనిషికూడా వచ్చేవాడు. అలా వచ్చే కారో, వ్యానో ముందుగా మా ఇంటికే వచ్చేది. ఉదయం 9 గంటలకు రికార్డింగ్ కాల్షీట్ అంటే 6.30 గంటల లోపే మా వాకిట్లో వ్యాన్ వచ్చేసేది. అప్పటికి మా నాన్నగారు సిద్ధమైపోయేవారు. ఆ బండిలో హార్మోనియం ఎక్కించి బయల్దేరేవాళ్ళం. వెళుతూ వెళుతూ దారి మధ్యలో వుండే ఇతర ఆర్కెష్ట్రా వాళ్ళను పికప్ చేసేవారు. వెస్ట్ మాంబళంలోని హుస్సేన్ రెడ్డిగారూ (ఆర్గన్), చిత్తూరు సుబ్రహ్మణ్యం గారు (వైలిన్), యిలా వ్యాన్ నిండేవరకు వాద్యబృందాన్ని ఎక్కించుకొని స్టూడియో రికార్డింగ్ ధియేటర్ వద్ద దింపేసేవారు. మా నాన్నగారు లోపలకు వెళ్ళగానే ఆనాటి పాటకు సంబంధించిన నొటేషన్స్ అంతా అక్కడకు చేరిన ఆర్కెష్ట్రా కు డిక్టేట్ చేసేవారు. ఆర్కెష్ట్రా లో string  instruments, wind instruments, rhythm instruments, వాయించేవాళ్ళంతా విడివిడిగా ఒక గ్రూప్ గా కూర్చోనేవారు. ఏ గ్రూపుకు ఆ గ్రూప్ కు విడిగా మైకులుండేవి. ఈ గ్రూప్ లు వాళ్ళు వాయించవలసిన  బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బిట్స్ నోట్ చేసుకునేవారు. వెస్ట్రన్ instrument players వాళ్ళ వెస్టర్న్ టైప్ లో నొటేషన్స్ రాసుకునేవారు, పాడి వినిపిస్తూంటే. హార్మోనియం, ఆర్గన్, రెండు మూడు వైలిన్స్ మాత్రం పాటంతటినీ, బిజిఎమ్స్ తో సహా పూర్తిగా వాయించేవారు. ఈ నొటేషన్స్ వ్యవహారం పూర్తయే సమయానికి ఘంటసాలవారు రికార్డింగ్ ధియేటర్ కు చేరుకునేవారు. ఆర్కెష్ట్రా అంతా పాటను వాయిస్తూంటే, అవసరమైన చోట తగు సూచనలు మార్పులు చేసేవారు. ఇలా ఒకటికి రెండుసార్లు ప్రాక్టీస్ చేసాక వాయిస్ తో మానిటర్ చూసేవారు. ఆ సమయంలో ఆర్కెష్ట్రాను పామర్తిగారో, రాఘవులుగారో కండక్ట్ చేసేవారు. పాట కంపోజింగ్ నుండి ఆర్కెష్ట్రా కు నొటేషన్స్ ఇచ్చేవరకు సంగీతరావు గారి బాధ్యత. పాట తృప్తికరంగా వుందని భావించాక టేక్ కు వెళ్ళేవారు. సింగర్స్ రూమ్ వేరే. ఆర్కెష్ట్రా రూమ్ వేరే. మొదట్లో అన్నీ ఒకచోటే. మాస్టారు కాకుండా వేరే గాయనీ గాయకులైతే ఘంటసాలవారు సౌండ్ ఇంజనీర్ పక్కనే కూర్చొని వినేవారు. ఆకాలపు పాటలన్నీ లైవ్ రికార్డింగ్ కావడం వలన తీసుకోవలసిన జాగ్రత్తలన్నీ తీసుకునే పాట ఫైనల్ కు వెళ్ళేవారు. అయినా, ఎక్కడో ఏదో లోపం, ఏదో పొరపాటు మరో టేక్ కు దారి తీసేది.  ఏది ఏమైనా నిర్ణీతకాలంలో పాట రికార్డింగ్ పూర్తి అయిపోయేది.  ఆ పాటలో పాల్గొన్న గాయకులు, వాద్యబృందం మరో స్టూడియో లో మరో పాట రికార్డింగ్ కు సిధ్ధమయేవారు. గాయకుల కంఠం బాగుంది, రికార్డింగ్ కు అడ్డంకి రాదని అనుకున్న తరువాతే రికార్డింగ్స్ ఫిక్స్ చేస్తారు. అందువలన సాధారణంగా ఏ రికార్డింగ్స్ కాన్సిల్  చేయడమనేది జరగదు. మరీ ఏవైనా సాంకేతిక లోపాలు అకస్మాత్తుగా ఏర్పడితే తప్ప. ఇవన్నీ ఆనాడు సహజంగానే భావించేవారు. సినీమా అనేది ఒక సమష్టి కృషి. ఏ ఒక్కరి వల్లనో సినీమా విజయం సాధించిందనో, అపజయం పొందిందనో భావించడంలో అర్ధంలేదు. 

ఘంటసాలవారు ఈ ఆర్కెష్ట్రాను సక్రమమైన పధ్ధతిలో, సకాలానికి చేర్చే బాధ్యతను ఫ్లూట్ రాజేంద్రకు, రిధిమ్స్ వాయించే కణ్ణన్ కు అప్పగించేవారు. వాళ్ళే ఆర్కెష్ట్రా వాళ్ళందరికీ రికార్డింగ్ ఏ స్టూడియోలో జరుగుతుందో, కాల్షీట్ టైమింగేమిటో ఒక రెండు రోజులు ముందుగా తెలియజేసేవారు.  షెడ్యూల్ ప్రకారం లిస్ట్ లో వున్న వాద్యగాళ్ళందరు స్టూడియో లో చేర్చవలసిన బాధ్యత వాళ్ళిద్దరిదే. సొంత వాహనాలున్నవాళ్ళు సమయానికి  రికార్డింగ్ ధియేటర్ చేరుకునేవారు. వైలిన్ , ఫ్లూట్ వాయించేవాళ్ళు హాయిగా బస్ లో వచ్చేవారు. మా నాన్నగారిలా హెవీ వాద్యాలవాళ్ళకే ఇబ్బంది. కంపెనీ వాహనాలమీద ఆధారపడక తప్పేదికాదు. పాటల రికార్డింగ్ కాల్షీట్ ప్రకారమే జరుగుతుంది. ఆ టైమ్ షెడ్యూల్ ప్రకారం స్టూడియో ధియేటర్ ను అద్దెకు తీసుకుంటారు. ఆ సమయం ప్రకారం ఆ స్టూడియో కు సంబంధించిన సౌండ్, ఇంజనీర్, రికార్డిస్ట్, ఇతర సౌండ్ డిపార్ట్మెంట్ స్టాఫ్ అంతా వారి వారి సరంజామా ఏర్పాటు చేసుకొని సిధ్ధంగా వుంటారు. నిర్ణీత సమయంలో పాట రికార్డింగ్ పూర్తి కావాలి. లేకపోతే నిర్మాత అదనంగా స్టూడియో వారికి అద్దె చెల్లించుకోవాలి. ఇక ఈ కాల్షీట్ బుక్ చేసే సమయాలు పాట లేదా పాటలను బట్టీ నిర్ణయిస్తారు. 7 to 1  ఒక ఫుల్ కాల్షీట్9 to 1 ఒక హాఫ్ కాల్షీట్;  2 to 9 ఒక ఫుల్ కాల్షీట్రీరికార్డింగ్ లయితే 9 to 9 లు  డబుల్ కాల్షీట్లు పనిచేసేవారు. అదీ చాలదనుకుంటే వరసగా రాత్రిం పగళ్ళు పని చేసి రీరికార్డింగ్ ముగించేవారు. ఆ సమయాలలో ఆర్కెష్ట్రా వారికి కాఫీ టిఫిన్లు, భోజనాలు నిర్మాతలే ఏర్పాటు చేసేవారు.  ఎవరికి వారు బయటకు వెళ్ళి తినిరావడానికి వ్యవధి వుండేది కాదు. అన్ని స్టూడియోలకు అందుబాట్లో హోటల్స్ వుండేవికావు. అందువలన, నిర్మాతలే భోజనపు ఏర్పాట్లు చేసేవారు. పాట రికార్డింగ్ అయ్యాక గాయకులకు, వాద్యబృందానికి క్యాష్ రూపంలోనో, చెక్ రూపంలోనో రెమ్యునరేషన్ చెల్లించేవారు. అయితే, ఇచ్చిన చెక్కులన్నీ పాసవుతాయనే గ్యారంటీ వుండేది కాదు. ఒకటికి పదిసార్లు తమ ఆఫీసులు చుట్టూ తిప్పించుకొని పాట డబ్బులిచ్చేవారు. అందరు నిర్మాతలు అలాటివారని చెప్పడం తగదు. క్రమక్రమంగా ఈ పధ్ధతులన్నీ మారిపోయాయి. ఆ వివరాలు తర్వాత, తర్వాత తెలుస్తాయి.

నాకు గుర్తున్నంతవరకూ  నేను మొదటిసారిగా స్టూడియో కు వెళ్ళినది 'జయంమనదే' రీరికార్డింగ్ కు. తరువాతిది ఘంటసాల మాస్టారి 'సొంతవూరు' లోని 'మన వూరే భారతదేశం 'పాటకు. 

              

అయితే  వివరంగా, బాగా గుర్తుండిపోయిన  మొట్టమొదటి రికార్డింగ్, రీరికార్డింగ్ సినీమా  ఘంటసాల వారింటి ఔట్ హౌస్ లోకి  వెళ్ళిన తరువాతే. అది రాజశ్రీ ప్రొడక్షన్స్ వారి 'సతి అనసూయ' ఘంటసాలవారి సంగీతం. కడారు నాగభూషణంగారి దర్శకత్వం. అంజలి, గుమ్మడి, జమున, కెవిఎస్ శర్మ ముఖ్య పాత్రధారులు. ఎన్ టి రామారావు గెస్ట్ ఆర్టిస్ట్. ఆ సినీమా లో సుశీలగారు పాడి, జమున, కెవిఎస్ శర్మల మీద చిత్రీకరించిన "పోనేల మధుర, పోనేల కాశి ఫలమేమి యాత్రలు చేసి, పతి పద సేవయే నా వారణాశి' అనే శోకగీతం రికార్డింగ్ కు వెళ్ళాను. గుండమ్మకధలోని "ప్రేమ యాత్రలకు బృందావనం" పాటలోని మాటలకు, ఈ పాటలోని మాటల మధ్య ఏదో భావ సామీప్యత గోచరిస్తూంటుంది. ఈ రెంటిలో ఏ పాట విన్నా ఆ రెండో పాట నాకెందుకో చటుక్కున గుర్తుకు వస్తుంది.

అసలు ఒక పాట ఎలా తయారవుతుందంటే ... ఇప్పుడు కాదు మరో సందర్భంలో చూద్దాము.

సతీ అనసూయ రీరికార్డింగ్ లో నాకు బాగా గుర్తుండిపోయినది నాగుపాము సీన్. సినిమాలో ఆ పాము కనిపించినప్పుడల్లా నేపధ్యంలో ఒక వాద్యం వినిపిస్తుంది. అది క్లేవైలిన్. అదే యూనివాక్స్ గా కూడా రూపాంతరం చెందింది.


ఈ నాటి  కొంబో ఆర్గన్స్, సింథసైజర్స్ రావడానికి ముందు సినిమా లలో ఈ యూనివాక్స్ కు చాలా ప్రాధాన్యత వుండేది. సతి అనసూయ లో ఘంటసాలవారు ఆ క్లేవైలిన్ ను సందర్భోచితంగా, సమర్ధవంతంగా ఉపయోగించుకొని మనసులకు హత్తుకుపోయే స్వరాలు వినిపించారు. ఈ క్లేవైలిన్/యూనివాక్స్ ను వాయించడంలో హనుమంతాచారిగారు సిద్ధహస్తులు. ఆయనకు హిందుస్థానీ సంగీతంలో మంచి ప్రవేశముంది. మరాఠీ భజన్స్ చాలా బాగా పాడేవారు. 'శ్రీరామచంద్ర కృపాళు భజమన',  పాటను' త్వమేవ మాతాచ పితా త్వమేవ' శ్లోకాన్ని తరుచూ పాడుతూండేవారు. ఆయన కన్నడం సినీమాలలో చిన్న చిన్న హాస్యపాత్రలు ధరించేవారు. రామానాయుడుగారి ప్రేమ్ నగర్ సినీమా ప్రారంభంలో వచ్చే విమానం సీనులో ఒక తెల్ల టోపీ పెట్టుకొని కనిపించేది ఈ హనుమంతాచారిగారే.


ప్రేమ్ నగర్ చిత్రంలో ANRతో హనుమంతాచారిగారు

తమిళ, తెలుగు భాషల్లో అఖండ విజయం సాధించిన 'రాము' (1966) చిత్రంలో ఉత్తమ బాలనటుడిగా జాతీయ బహుమతి పొందిన మాస్టర్ రాజ్ కుమార్, హనుమంతాచారిగారి కుమారుడే. అప్పుడప్పుడు ఘంటసాల వారింటికి వచ్చేవాడు. ఆ అబ్బాయి అసలు పేరు యోగి(యోగీంద్ర కుమార్). సినీమాల కోసం రాజ్ కుమార్ గా పేరు మార్చినట్లున్నారు. 


వెనక గాంధీ టోపీలో (వై బి చవాన్ లా) ఉన్నవారే హనుమంతాచారిగారు
ఘంటసాలగారి కుడిపక్క ఫ్లూట్ రాజేంద్ర వారిద్దరి మధ్య క్లేరినట్ సుభాన్ తబలా జడ్సన్ వెనక కనబడకుండా ఉన్నది రిథమ్స్ కణ్ణన్. నాన్నగారి కుడిపక్క వయొలిన్స్ చిత్తూరు సుబ్రహ్మణ్యం, భద్రం 

1978లో రావి కొండలరావుగారి  డ్రామా ట్రూప్ తో ఢిల్లీనుంచి తిరిగి వస్తున్నప్పుడు తమిళనాడు ఎక్స్ ప్రెస్ కి నాగపూర్ దగ్గర జరిగిన ఒక ఆక్సిడెంట్ లో రికార్డింగ్ లు, షూటింగ్ లు, కచేరీలు అంటూ క్షణం తీరిక లేని ఆ హనుమంతాచారిగారు హఠాత్తుగా కన్నుమూశారు. ఒక మంచి గాయకుడినీ, ఈనాటి multi-purpose, multi-functional electronic వాయిద్యాలు కాంబో ఆర్గన్, సింతసైజర్ లకి తొలిరూపం యూనివాక్స్ పయొనీర్ వాద్యనిపుణుడు, అనుభవజ్ఞుడైన వాద్యకళాకారుడిని దక్షిణాది సినీమా సంగీతరంగం అర్ధాంతరంగా కోల్పోయింది. (ఆ ప్రమాదంలో గాయపడిన ఈ ట్రూపు సభ్యుడు మరొకరు, టి.వి.రాజుగారి పెద్దబ్బాయి - ప్రముఖ సంగీతదర్శకద్వయం రాజ్-కోటిలలో రాజ్ అన్నగారు.)

మేము రంగయ్యర్ స్ట్రీట్ లో వున్న రోజుల్లో ఒకసారి మా నాన్నగారు  నన్నో పనిమీద ఘంటసాలవారింటికి పంపిచారు.

అది ఎందుకో, ఏమిటో ఆ వివరాలు వచ్చేవారం.

ఈలోగా మీ అందరికీ దసరా శుభాకాంక్షలు.

...సశేషం

*With a view to make the narrative more authentic and to corroborate it, images, audio and video clips are attached at appropriate places. If such usage is found objectionable to the copyright holders the same shall be removed if and when notified.

 

12 comments:

వడ్డాది గోపాలకృష్ణ మూర్తి said...

మద్రాసు గూర్చి ఎన్ని సార్లు వెళ్లినా ముక్కున పట్టిన పేర్ల గుర్తుయెహో ఆ ప్రదేశాలకు వెళ్లి వచ్చేయడం మినహా పెద్దగా ప్రదేశాలు ఆపరిచితమే. ఈ భాగం బట్టి మద్రాస్ లోని చైనా బజారు, పారిస్ కార్నర్, సెంట్రల్ స్టేషన్, NSC బోస్ రోడ్, పింగాణీ ప్లాస్టిక్ cd లు బాక్సర్కు, mint స్ట్రీట్, ఆంధ్రపత్రిక ఆఫీసు, నాటి విద్యుచ్చక్తి సరఫరా, ఆ నాటి యుద్ధ వాతావరణంలోసంఘంలోని రేషన్ వ్యవస్థ మనస్సుకు హత్తుకునేలా చెప్పారు. మొత్తానికి రికార్డింగ్ పరిచయాన్ని అద్భుతంగా విశద పరచారు. అందునా మొదటి సారి ఘంటసాల గారిని మీ వాక్కుల ద్వారా మాకు పరోక్ష పరిచయం చేసారు. ఒక పాట పూర్తి కావడానికి పడే అనుభవాన్ని మాకు మీమాటల్లో పదిలపరచేరు. ధన్యోస్మి.

Pulijalasanthisree said...

పూర్వపు రోజుల్లోని మద్రాసు...పరిసరాలు చదువుతుంటే చాలా బాగుంది... మీ బాల్యం కబుర్లు ఇంకా బాగున్నాయి...ఘంటసాల వారి సంగీత ప్రజ్ఞ...వారి రికార్డింగ్ పద్ధతి ఇంకా బాగుంది..ధన్యవాదాలు ఆర్యా


P P Swarat said...

శ్రీ వడ్డాది వారికి నా ధన్యవాదాలు.

P P Swarat said...

శ్రీమతి శాంతిశ్రీ గారికి ధన్యవాదాలు.

Sumabala said...

పాత మద్రాసు కబుర్లు చాలా బాగున్నాయి. మద్రాసులో మొదటి లైట్ హౌస్ 1796 లో Fort St. George లో స్ధాపించబడింది. ప్రస్తుతం ఉన్న Fort Museum లో మొదటి Light House ఉండేది.1844 వరకు పని చేసింది.
- సుమబాల

P P Swarat said...

మంచి సమాచారం.

హృషీకేష్ said...

పాత చెన్నపట్నం కబుర్లు బాగున్నాయి sir. Time machine ద్వారా మమ్మల్ని కూడా ఆ కాలానికి తీసుకెళ్లారు. రికార్డింగ్ కబుర్లు, మీP పరిసరాల ముచ్చట్లు బాగున్నాయి. మరింత ఆసక్తి గోలుపుతున్నాయి.🙏🙏హృషీకేష్

కోట ప్రసాద్ said...

నేను సర్వీసులో వున్నప్పుడు మద్రాస్ ఆఫీస్ పని మీద చాలా సార్లు వెళ్ళాను. 1985 నుండి 1995 మీరు వివరించిన చాలా వీధుల పేర్లు గుర్తొస్తున్నాయి. అలాగే ఒక పాట వెనక ఎంత మంది సమిష్టి కృషి వుంటుందో చాలా వివరంగా రాశారు. ధన్యవాదాలు. మీకు అభినందనలు. ఇదొక పుస్తకంగా అచ్చు వేయించవచ్చునని అభిప్రాయపడుతున్నాను.

కోట ప్రసాద్ said...

నేను సర్వీసులో వున్నప్పుడు మద్రాస్ ఆఫీస్ పని మీద చాలా సార్లు వెళ్ళాను. 1985 నుండి 1995 మీరు వివరించిన చాలా వీధుల పేర్లు గుర్తొస్తున్నాయి. అలాగే ఒక పాట వెనక ఎంత మంది సమిష్టి కృషి వుంటుందో చాలా వివరంగా రాశారు. ధన్యవాదాలు. మీకు అభినందనలు. ఇదొక పుస్తకంగా అచ్చు వేయించవచ్చునని అభిప్రాయపడుతున్నాను.

P P Swarat said...

శ్రీ హృషికేశ్ గారికి ధన్యవాదాలు.

P P Swarat said...

శ్రీ కోట ప్రసాద్ గారికి కృతజ్ఞతలు.

Patrayani Prasad said...

🙏🙏 శ్రీ అన్నయ్యకు నమస్కారములు.🙏🙏 35 ఉస్మాన్ రోడ్, జ్ఞాపకాల మాలిక అధ్యాయం:2, మూడవ భాగంలో, వ్రాసిన విషయాలు, వివరాలు, సుమారుగా నాకు తెలియనివే. అందువల్ల ఒక్కొక్క విషయం తాపీగా చదివి, తెలుసుకోవడానికి జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నించాను. ఇందులో వివరించిన పేరులు తెలుసు, కానీ వాటి ప్రాముఖ్యతలు, ఇంతకు ముందు తెలియవు. ఈ రచన మూలంగా చాల వివరంగా తెలుసుకో గలిగాను. ధన్యవాదాలు . 🙏🙏-పట్రాయని ప్రసాద్, తేదీ :28-10-2020, బుధవారం. సమయం : సాయంత్రం: గం 04:05 ని. IST.