ప్రణవ స్వరాట్
ఒకానొకప్పుడు అంటే 1970లకు ముందు దక్షిణాది సినీమా పరిశ్రమ యావత్తు మెడ్రాస్ లోనే వుండేది. (క్రమేణా, తెలుగు సినిమా హైదరాబాద్ కు, కన్నడ సినీమాలు మైసూర్, బెంగుళూర్ కు, మలయాళం సినీమా త్రివేండ్రమ్ కు తరలి వెళ్ళిపోవడంతో మెడ్రాస్ సినీ పరిశ్రమ కాంతిహీనమైపోయింది.)
జెమినీ, AVMలు తీసే హిందీ సినీమాలు కూడా మెడ్రాస్ లోనే. జెమినీ, జూపిటర్ వంటి సినీమా స్టూడియోలు తప్ప మిగిలినవన్నీ కోడంబాక్కం, వడపళని చుట్టుపక్కల ప్రాంతాల్లో వుండేవి. అయితే సినీమా నిర్మాణ సంస్థలు అధిక భాగం టి.నగర్ ఏరీయాలోనే వుండేవి. అందుచేత సినీమాలలో హీరోలైపోదామని వచ్చే ఔత్సాహిక నటులు, ఎప్పుడో ముగిసిపోయిన తమ పనికి రావలసిన పారితోషికం కోసం సినీమా ఆఫీసులు చుట్టూ తిరిగే జూనియర్ నటీనటులు, సాంకేతిక నిపుణులు తరచు మా ఉస్మాన్ రోడ్ లో కనిపించేవారు.
నేను చిన్నప్పుడు మా ఇంట్లో ఉన్న సమయం కన్నా పోర్టికోలోనో లేక గేటు బయట గడిపే సమయమే ఎక్కువ. అలాటి సమయంలో మా రోడ్ లో ఎంతోమంది సినీమా నటులు కనిపించేవారు. కొంతమంది నటులు ఎన్నో సినీమాల్లో సూట్, బూట్లతో దర్జాగా పైపులు, సిగరెట్లు కాలుస్తూ లక్షాధికారులు లాగా కనిపిస్తారు. వారి నిజజీవితంలో కూడా అలాగే వుంటారనే భ్రమలో వుండేవాడిని. అలాటివారంతా పానగల్ పార్క్ ఏరియాలో చాలా సాదా సీదాగా నడిచిపోతుంటే ఎంతో ఆశ్చర్యంగా అనిపించేది. టి.ఆర్.రామచంద్రన్, వి.కె.రామస్వామి, సహస్రనామం వంటి తమిళనటులూ కనిపించేవారు. ఒక సాదా పంచె, మల్లు బనీన్ లాటి చొక్కా, చంకన గొడుగుతో, కాలినడకన బడుగు బాపనకు దర్పణంగా వంగర వెంకట సుబ్బయ్య కనిపించేవారు. సినీమాలో ఎలావుండేవారో, బయటా అలాగే వుండేవారు. సీతారాం, నల్లరామ్మూర్తి, జి.ఎన్ స్వామి కనిపించేవారు. ఒక పెద్ద స్టార్ హీరోకు మామగారు, తెలుగు సినీపరిశ్రమనే అజమాయిషీ చేసే స్థితికి ఎదిగిన అనేక సూపర్ హిట్ సినీమాల నిర్మాతకు తండ్రి, అంతకుమించి వందలాది సినీమాలలో హాస్యనటుడిగా పేరు పొందిన అల్లు రామలింగయ్య తన తొలిరోజులలో చాలా సామాన్యంగా సైకిల్ మీద వెడుతూ కనిపించేవారు. అప్పట్లో చిన్న చిన్న సినిమా వేషాలతోపాటు హోమియో వైద్యం కూడా చేసేవారట. అన్నిటికంటే నాకు ఆశ్చర్యం కలిగించినది ఒకప్పటి నెంబర్ వన్ కమేడియన్ కస్తూరి శివరావు. హీరోలతో సమానమైన హోదాను అనుభవించిన నటుడు. ఒక పెద్ద బ్యూక్ సొంతదారుడు. చిత్రనిర్మాత కూడా.
కొంతమంది జీవితాలు ఎందరికో ఆదర్శంగానూ గుణపాఠాలు గానూ అమరుతూంటాయి. అలాటివారిలో ఉదాహరణగా కస్తూరి శివరావును, చిత్తూర్ వి.నాగయ్యగారిని సినీమాలోకం లో చెప్పుకుంటారు.
1950 -60 ల మధ్య అనేక హిట్ సినీమాలలో నటించి ఒక ఐకాన్ గా గుర్తింపు పొందిన నటుడు కస్తూరి శివరావు. ఆయన అంతిమ జీవితం చాలా దుర్భరంగా సాగింది. ఎన్.టి.రామారావు ఇంటికి పక్కన ఒక పాత ఇంటిలో చాలా దీనస్థితిలో వుండేవారు. కాలం ఖర్మం కలసిరాకపోతే కోటీశ్వరుడు కూడా పూరి గుడిసెల్లో వుండవలసినదే. శివరావు పరిస్థితి అదే. మాసిపోయిన షెరాయి, జుబ్బాతో, చింపిరిజుట్టుతో ఒక పాత పాడైపోయిన సైకిల్ మీద మా ఇంటిమీదుగా వెళ్ళడం చాలాసార్లు చూశాను. మా ఇంటి సమీపంలోనే సైకిల్ టైర్ పంచర్ అయి ఒకసారి, చైన్ ఊడిపోయి మరొకసారి, సైకిల్ ను తోసుకుంటూ వెళ్ళడం నా కళ్ళారా చూశాను. అప్పట్లో చిన్నతనం కారణంగా నాకేమీ అనిపించలేదు. కానీ ఒక వయసు వచ్చాక, ఆ నటుడి గత వైభవం గురించి తెలిసాక మాత్రం, అతని గురించి తల్చుకుంటే మనసు బరువెక్కిపోతుంది.
'ఇండియన్ పాల్ముని' గా ప్రసిధ్ధి పొందిన బహుభాషా చిత్రనటుడు, సంగీత దర్శకుడు, నిర్మాత, దర్శకుడు, ఎంతో మంది నటీనటులకు మార్గదర్శి చిత్తూర్ వి.నాగయ్య చలనచిత్ర జీవిత చరిత్ర అందరికీ తెలిసినదే. ఎంత వైభవంగా జీవించారో, అంత దైన్యంగా అంతిమ జీవితం గడచింది. తాను చిత్రనిర్మాతగా వున్నప్పుడు ఆయన రేణుకా ఆఫీస్ ఒక ధర్మసత్రంలా వుండేదట. ఆయన సినీమాతో సంబంధం వున్నవారూ, లేనివారూ కూడా అక్కడకు వచ్చి ముప్పొద్దులా సుష్టుగా భోజనం చేసి వెళ్ళేవారట. ఆకలితో ఎవరు వచ్చినా ఆదరించిపంపేవారట. నాగయ్యగారు నటించిన పాత్రల ప్రభావం ఆయనమీదే వుండేదనిపిస్తుంది. నాగయ్యగారు అందరిమీదా అమితమైన జాలి, ప్రేమ కనపర్చేవారు. తనకు మాలిన ధర్మంగా అప్పులు చేసి అన్నదానాలు చేసారు. ఆయన చేపట్టిన 'రామదాసు' చిత్రనిర్మాణం ఆర్ధిక ఇబ్బందులవల్ల పూర్తయి విడుదల కావడానికి అనేక సంవత్సరాలు పట్టింది. ఎన్.టి.ఆర్, ఎ.ఎన్.ఆర్, శివాజీ గణేశన్, అంజలీదేవి నాగయ్యగారి మీద గౌరవాభిమానాలతో ఉచితంగా నటించి చిత్రం పూర్తికావడానికి ఇతోధిక సహాయం చేసారు. కానీ, రామదాసు చిత్రం పరాజయం పొందడంతో నాగయ్యగారి పరిస్థితి మరింత దిగజారింది. నిజజీవితంలో కూడా 'ఏ తీరున నను దయ చూచెదవో ఇనకులోత్తమ రామా' అని అతి దైన్యంగా పాడుకోవలసిన స్థితికి దిగజారిపోయారు. పైగా వృధ్ధాప్యం. చేతిలో తగినన్ని మంచి వేషాలు లేకపోవడంతో మా ఇంటి ఎదురు వీధైన వ్యాసారావు స్ట్రీట్ లోని నెం. 11 ఇంటిని అమ్మివేసి (నటుడు రమణారెడ్డి కొనుకున్నారు).
పానగల్ పార్క్ సమీపంలోని దొరైసామీ రోడ్ కు ఆనుకొనివుండే ఒక చిన్న సందులోని అద్దె ఇంటికి మారారు. వారు ఆ యింటిలో వున్నప్పుడు ఏవో సందర్భాలలో రెండు మూడుసార్లు వెళ్ళి కలియడం జరిగింది. వ్యక్తిగా, నటుడిగా నాగయ్యగారి మీది గౌరవంతో సాటి నటులు, దర్శక నిర్మాతలు తమ చిత్రాలలో తండ్రి పాత్రలకు తీసుకొని ఆదుకునేవారు. అలాటి పరిస్థితులలో కూడా కొందరు ఆయనను అవాంఛనీయ అవమానాలకు గురిచేసేవారని చెప్పుకోవడం వుంది. ఘంటసాల మాస్టారి ఆర్కెష్ట్రాలో పనిచేసే ప్రముఖ వైలినిస్ట్ వై.ఎన్.శర్మగారి (సంగీత దర్శకుడు మణిశర్మ తండ్రి) ఇల్లు కూడా నాగయ్యగారింటి సమీపంలోనే వుండేది. శాస్త్రీయ సంగీత కచేరీలకు, సాంస్కృతికోత్సవాలకు ప్రసిధ్ధిపొందిన 'వాణీ మహల్' ఆడిటోరియంను, శ్రీ త్యాగబ్రహ్మ గాన సభను స్థాపించినది నాగయ్యగారే. నాగయ్యగారు దివంగతులైనాక ఆయనంటే విపరీతమైన అభిమానం చూపించే ప్రముఖ జర్నలిస్ట్ ఇంటూరి వెంకటేశ్వరరావు ('సినీమా' వార పత్రిక) మరికొంతమంది పాత్రికేయులు, ప్రముఖులు కలసి నాగయ్య విగ్రహ ప్రతిష్టాపన చేసారు. ఆ విగ్రహ ప్రతిష్టాపన అంత సజావుగా సాగలేదు. ఆ విగ్రహం కొన్నాళ్ళు పానగల్ పార్క్ లో ఈశాన్యమూలన ఉండేది.
1935-57 మధ్య కాలంలో తన హాస్య నటనతో, వ్యంగ్యాత్మక, సందేశాత్మక గీతాలతో తమిళదేశాన్ని ఒక ఊపు ఊపిన 'కలైవానర్' ఎన్.ఎస్.కృష్ణన్ విగ్రహం విషయంలో కూడా ఎన్నో స్థల మార్పులు జరిగాయి.
చెప్పాలంటే నాగయ్య, శివరావుగార్ల వంటి దుర్భర జీవితాన్ని గడిపిన, గడుపుతున్న కళాకారులెందరో చిత్రసీమలో కనిపిస్తారు.
కొంతమంది నటీనటుల దుర్భర జీవితానికి కారణం కాలమా? స్వయంకృతాపరాధమా? ఎవరికి తోచిన వ్యాఖ్యలు వారు చేస్తారు. కానీ ఒక్కటి మాత్రం నిజం. సినీమాలోకంలో ఉఛ్ఛస్థితిలో వుంటూ, వరస విజయాలతో ప్రజలలో గ్లామర్, పాప్యులారిటీ వున్నంతవరకే నటులకైనా, నటీమణులకైనా, మరే ఇతర సాంకేతికనిపుణులకైనా రాచమర్యాద. ఆహా! ఓహో! అంటూ భజనదాసులు చుట్టూ చేరుతారు. ఆ దశ కాస్తా దాటితే ఆ వ్యక్తి ఎంతటి ప్రతిభావంతుడైనా ఎవరూ కన్నెత్తి చూడరు. ఆపదలో ఆదుకోవడం మాట ఎలావున్నా పలకరించను కూడా పలకరించరు. ఇందుకు ఎవరూ అతీతులు కారు. అదే సినీమా లోకం.
సినీమా పరిశ్రమ అంటారు, కానీ, ఆ మాట తప్పని నా ఉద్దేశ్యం.
ఈనాటి సినీమా నిర్మాణ స్థితిగతుల గురించి నాకేమీ తెలియదు. కానీ, 1970లకు ముందువరకు దక్షిణాది సినీమా పూర్తిగా unorganized sector గానే వుండేది. డబ్బున్న నిర్మాతల మాటే శాసనం. పొగాకు, మిరపకాయల వ్యాపారం మీద వచ్చిన లాభాలతో సినీమా వ్యామోహంతో సినీమాలు తీద్దామని వచ్చే నిర్మాతలు కొంతమంది. ఉన్న డబ్బు కాస్తా రెండు రీళ్ళతోనే ఖర్చయిపోగా, భార్య పేరునున్న పొలమేదో కూడా అమ్మేసి సగం సినీమా తీసి తర్వాతి సినిమాకు డబ్బు ఎలా సద్దుబాటు చేయాలో తోచక సమయానికి డిస్ట్రిబ్యూటర్ లు దొరకక ఫైనాన్షియర్స్ చేతుల్లోబడి అష్టకష్టాలుపడి సినీమా పూర్తయిందనిపించేవారే ఎక్కువమంది వుండేవారు. ఇక సినీమా రిలీజ్ అయ్యాక జయపజయాలు నిర్ణయించేది A,B,C సెంటర్ ప్రేక్షకులే. వారు ఎప్పుడు, ఎందుకు, ఏది నచ్చుతారో అనేది అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ కూడా మిలియన్ డాలర్ ప్రశ్నగానే మిగిలింది. రిలీజైన కొన్ని సినీమాలు బాగున్నా, బాగున్నాయని టాక్ వచ్చినా కలెక్షన్ షీట్స్ మాత్రం డల్ అని నిల్ చూపించి నిర్మాతకు ఒట్టి చేతులు చూపేవారు. ఈ రకమైన లాలూచీ థియేటర్ యాజమాన్యం, డిస్ట్రిబ్యూటర్ ల ప్రతినిథులు చాకచక్యంగా పనిచేసి డైలీ కలెక్షన్ రిపోర్ట్ లను నిల్ గా చూపేవారూ ఉన్నారు. ఘంటసాల మాస్టారి 'భక్త రఘునాధ్' మరీ ప్లాప్ కాదు. కొన్ని సెంటర్స్ లో నాలుగైదు వారాలాడింది. అయితే కొన్ని సెంటర్స్ నుండి వచ్చే డైలీ కలెక్షన్ రిపోర్ట్ లో 'rain effected no show' అనో లేక 'no audience, Second show cancelled' అని రిపోర్ట్స్ వచ్చేవి. అయితే అవన్నీ అన్నివేళలా కరెక్ట్ కాదని తేలేది. ఎవరినీ ఏమీ అనలేని, చేయలేని పరిస్థితి చిన్న నిర్మాతలది. ఈ పరిస్థితిలో వారు చాలామంది చిన్న నటులకు, సాంకేతిక నిపుణులకు బకాయి పెడుతూంటారు. ఇవ్వవలసిన చాలా చిన్న మొత్తానికి కూడా ఇవేళా, రేపూ అంటూ తమ ఆఫీసుల చుట్టు తిప్పించుకొని చివరకు ఒక చెక్ ఇస్తారు. బ్యాంక్ లో బేలన్స్ వుండదు. చెక్ బౌన్స్ అవుతుంది. దాన్ని పట్టుకొని నిర్మాత ఆఫీసుకు పరుగుపెడతారు. నిర్మాత ఎప్పుడూ చిన్న చిన్న వాళ్ళకు కనపడడు. ఆఫీస్ మేనేజర్ వుంటాడు. అన్ని రకాలవారిని మేనేజ్ చేయగలవాడే మేనేజర్ . ఏదో చెప్పి మరల చెక్ ప్రజంట్ చేయమని బుజ్జగించి పంపేస్తారు. ఇలా రెండుమూడుసార్లు చెక్ బౌన్సయాక ఒక శుభ ముహుర్తాన చెక్ పేమెంట్ కు బదులు క్యాష్ ఇచ్చి పంపుతారు. అలా ఏ పేమెంట్ ఇవ్వని కేస్ లు చాలానే వుంటాయి. నేను ముందు చెప్పిన చాలా మంది చిన్న నటులు తమ బకాయిలు వసూలు చేసుకోవడానికి కాలినడకన, సైకిళ్ళ మీద వెడుతూ ఎదురు పడేవారు. రావలసిన డబ్బులు చేతిలో పడిన రోజు వారికి పండగే. ఇవన్నీ మా నాన్నగారికీ అనుభవైకవేద్యమే. తగినంత ఆదాయం లేకపోయినా, అవసరం లేకపోయినా తప్పనిసరిగా బ్యాంకు ఎక్కౌంట్ తెరవవలసి వచ్చేది.
మా నాన్నగారి బ్యాంక్ ఎక్కౌంట్ మొదట్లో పాండీబజార్ బరోడా బ్యాంక్ లో వుండేది. ఒకటి రెండుసార్లు చెక్ వేయడానికో, డబ్బులు తీయడానికో వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళాను. ఏదో చలాన్ రాసిచ్చారు. అదెందుకో, ఎలా రాయాలో నాకు తెలిసేది కాదు. (ఇది నా ఫస్ట్ ఎంప్లాయ్మెంట్ లో ఫస్ట్ డేనే నన్ను మహా ఇరకాటంలో పెట్టి నాకు మనశ్శాంతి లేకుండా చేసింది. ఆ వివరాలు మరోసారి). బరోడా బ్యాంకులో కొందరు తెలుగువారుండేవారు. ఈ బ్యాంక్ పాండీబజార్ లో ఇప్పుడు పోలిస్ స్టేషన్ కు పక్కన రెండో బిల్డింగ్ లో వుండేది. ఈ రెండింటికి మధ్య ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఉండేది. పాండీబజార్ కి వెళ్ళే దారిలో పనగల్ పార్క్ కి ఉత్తరం వేపు ప్రకాశం రోడ్ మీద, శారద విద్యాలయా ఎదురుగా మూలమీద బర్మా షెల్ పెట్రాల్ బంక్ పక్కన ఇండియన్ బ్యాంక్ ఉండేది. బరోడా బ్యాంక్ కు ఎదురుగా బ్రదర్స్ డయరీ Dr.గాలి బాలసుందర్రావుగారి ఇంటి పక్కన ఆంధ్రా బ్యాంక్ ఉండేది. అందులో పనిచేసే విశ్వనాధంగారు మా నాన్నగారికి మంచి స్నేహితుడు. నాకు కొన్ని రోజుల ట్యూషన్ మాస్టర్.
పాండీబజార్ ఆంధ్రా బ్యాంక్ పక్కనుండి వెళుతున్నప్పుడల్లా ఒక భయంకర సంఘటన గుర్తుకు వచ్చి ఒడలంతా కంపిస్తుంది.
'శ్రీ రామాంజనేయ యుధ్ధం' సినిమా మీకు గుర్తుండే వుండాలి. బాపు, ఎన్.టి.ఆర్, బి.సరోజాదేవిల రంగుల సినీమాకాదు. 1958ల నాటి తెలుపు నలుపు సినీమా. ఆ సినీమాయే ప్రముఖ నటి చంద్రకళకు మొదటి తెలుగు సినీమా. అప్పటికి చాలా చిన్నపిల్ల. యయాతి మహారాజు కుమార్తెగా ఒక భక్తి నృత్యగీతంలో కనిపిస్తుంది. ఆ అమ్మాయి. ఎమ్.ఎస్.నాయక్ గారి కూతురు. నాయక్ గారు ఆ రోజుల్లో పేరుమోసిన ఫిలిం డిస్ట్రిబ్యూటర్. కృష్ణా పిక్చర్స్ అధినేత. ఘంటసాలవారి సొంత సినీమాలకు కృష్ణా పిక్చర్స్ వారే పంపిణీదారులు. ఈ 'శ్రీరామాంజనేయ యుధ్ధం' లో ఘంటసాల మాస్టారు పాడిన పద్యాలు చాలా పాప్యులర్ అయాయి. ఈ నాటికీ అందులోని "శ్రీ రఘురామచంద్ర మది చింతన" అనే పద్యం వినవస్తూంటుంది. ఈ సినీమాలో అమర్నాథ్ రాముడు. జూ.శ్రీరంజని సీత. సూర్యనారాయణ లక్ష్మణుడు. రాజనాల ఆంజనేయుడు. మిక్కిలినేని యయాతి మహారాజు.
లక్ష్మణుడు వేషం వేసిన సూర్యనారాయణ ఆంధ్రా బ్యాంక్ పాండీబజార్ బ్రాంచ్ లో క్యాషియర్. తెలుగువాడు. సినీమాలలో నటించాలనే కాంక్షతో చిన్నా చితకా వేషాలు వేసేవారు. జోగీందర్, విజయకుమార్ అనే ఇద్దరు సూర్యనారాయణకు మంచి స్నేహితులు.
ఒకరోజు ఉదయం సూర్యనారాయణ ఎప్పటిలాగే బ్యాంక్ లావాదేవీలకోసం రిజర్వ్ బ్యాంక్ నుండి కొన్ని లక్షలమొత్తం డ్రా చేసి బయటకు వచ్చిన ఆయన్ని విజయకుమార్, జోగీందర్ లు ఆపి మాట్లాడుతూ దారి మధ్యలో ఎక్కడో ఆ డబ్బు లాక్కునే ప్రయత్నంలో వారిమధ్య తీవ్ర ఘర్షణ జరిగి ఆ ఇద్దరూ సూర్యనారాయణను ఆ ఘోరంగా చంపేసినట్టు పత్రికల్లో వచ్చింది. పట్టపగటిపూట ఆ శవాన్ని ఎలా వదిలించుకోవాలో తెలియక, కారులో శవంతో సాయంత్రం దాకా ఊరంతా తిరుగుతూ చీకటిపడే సమయానికి చెంగల్పట్ వెళ్ళే దారిలో అక్కడవున్న పెద్ద చెఱువులోనో, నిర్మానుష్యంగా వున్న ప్రాంతంలోనో శవాన్ని విసిరేసి డబ్బుతో అక్కడనుండి పారిపోయారని తెలిసింది.
రిజర్వ్ బ్యాంక్ కు వెళ్ళిన సూర్యనారాయణ ఎంతకీ బ్యాంకుకు తిరిగిరాకపోవడం, తన ఇంటికీ చేరకపోవడంతో బ్యాంక్ అధికారులు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. చెంగల్పట్టు దగ్గర దొరికిన శవం సూర్యనారాయణదిగా పోలీసులు గర్తించి, హత్యగా నిర్ధారించి హంతకుల కోసం వేట మొదలెట్టారు. కొంతకాలానికి అసలు హంతకులు జోగిందర్, విజయకుమార్ లేనని తేల్చి వారిని అరెస్ట్ చేసారు. చాలా నెలలు ఈ కేసు హైకోర్టులో విచారణ జరిపిన తరువాత నిందితులైన విజయకుమార్, జోగీందర్ లకు ఉరిశిక్ష వేశారు. కోర్టులో ఆ కేస్ విచారణ జరుగుతున్నంతకాలం తెలుగు, తమిళ, ఇంగ్లీషు దినపత్రికలలో వివరాలన్నీ ధారావాహికగా ప్రచురించారు. ఈ ఆంధ్రా బ్యాంక్ హత్య ఆనాటికి యువకులుగా ఉన్నవారికి, మద్రాసులో ఉన్నవారికి గుర్తుండే అవకాశం వుంది. పాండీబజార్ ఆంధ్రాబ్యాంక్, రిజర్వ్ బ్యాంక్, బీచ్ రోడ్, చెంగల్పట్ చెరువు చూసినప్పుడల్లా నాకు ఈ భయంకర సంఘటన గుర్తొస్తూంటుంది.
1962లో ప్రారంభమై 1963లో విడుదలైన సినీమాలన్నీ ఘంటసాల వారి గాన ప్రతిభకు పట్టం గట్టినవే. వారి కీర్తి కిరీటంలో కలికితురాయిలెన్నో. 1963లో కూడా ఎన్.టి.ఆర్ హవా బాగానే వీచింది. ఎ.ఎన్.ఆర్ తో నటించిన శ్రీకృష్ణార్జునయుధ్ధం, పెంపుడుకూతురు, వాల్మీకి, సవతికొడుకు, లవకుశ, పరువు ప్రతిష్ట, ఆప్తమిత్రులు, బందిపోటు, లక్షాధికారి తిరుపతమ్మ కథ, నర్తనశాల, మంచి చెడులాంటి 12 సినీమాలతో ముందంజలో ఉన్నారు. అక్కినేని వారివి నాలుగు మాత్రమే. అందులో ఒకటి డబ్బింగ్ - శ్రీకృష్ణార్జునయుధ్ధం, చదువుకున్న అమ్మాయిలు, పునర్జన్మ, నిరపరాధి. జగ్గయ్య ఈడూజోడూ, కాంతారావు తోబుట్టువులు కూడా ఈ సంవత్సరంలోనే విడుదలయ్యాయి. ఈ సినీమాలలో ఘంటసాలగారు పాడిన పాటలన్నీ ఆపాతమధురాలుగా ఈ నాటికీ సంగీతాభిమానులను అలరిస్తూనే వున్నాయి.
1945 నుండి 1974 వరకు ఏ రకమైన పోటీకి సాటిలేని గాయకుడు ఘంటసాల మాస్టారేనని పదేపదే నొక్కివక్కాణించ పనిలేదు. గాయకుడిగా వారిదే అగ్రస్థానం. మకుటంలేని మహారాజు.
1963లో ఘంటసాలగారు సంగీత దర్శకత్వంలో వచ్చిన నాలుగు సినిమాలు వాల్మీకి, లవకుశ, ఆప్తమిత్రులు, బందిపోటు. ఈ సినీమాలలోని సంగీతం చిరస్థాయిగా మిగిలిపోతుందున్న విషయంలో ఎవరికీ ఏ సందేహము అవసరంలేదు.
ఈ నాలుగు సినీమాల విశేషాలు వచ్చే సంచికలో...
...సశేషం
2 comments:
ధన్యవాదాలండి. చాలా ఓపికగా వ్రాస్తున్నారు
Thank you .
Post a Comment