ఒకానొక శుభోదయాన నిద్రలేచి నెం.35,ఉస్మాన్ రోడ్ బాల్కనీలోకి వచ్చి చూడగానే రోడ్ కు అవతలవేపున్న ఇంటికి అతిపెద్ద తెలుగు సినీమా కటౌట్ ఒకటి బ్రహ్మాండంగా కనిపించింది. మద్రాస్ లో ఒక తెలుగు సినీమాకు అంత పెద్ద కటౌట్ చూడడం అదే ప్రథమం. అందులోనూ కత్తి పట్టుకున్న ఎన్.టి.రామారావు పోస్టర్. మహా థ్రిల్లింగ్.
నెం.35, ఉస్మాన్ రోడ్ దక్షిణాన వున్న 34 నెంబర్ ఇంటికి ఎదురుగా కెవి రెడ్డిగారి ఇంటి వెనకభాగం. మెయిన్ గేట్ మురుగేశ మొదలియార్ రోడ్ లో వుండేది. ఉత్తరాన ఉన్న 36 నెంబర్ ఇంటికి ఎదురుగా ఉన్న ఇంటికి ఈ సినీమా పోస్టర్.
ఇంతకూ ఆ సినీమా ఏమిటో తెలుసా ! 'కంచుకోట'.
ఆ కటౌట్ లో భారీ ఎన్.టి.ఆర్ తో పాటు సావిత్రి, దేవిక, కాంతారావు కూడా చిన్నగా కనిపించారు. ఎన్.టి.ఆర్ కటౌట్ పూర్తిగా రంగు రంగుల చెమ్కీ బిళ్ళలు అతికించడంతో జిగేల్ జిగేల్మనిపించేవి. రాత్రిపూట అయితే కార్ల లైట్ల వెలుగు ఆ చమ్కీ బిళ్ళలమీద పడి రంగురంగులుగా మిరుమిట్లు గొలుపుతూ ఆ పక్కనుండి వెళ్ళేవారికి మహా ఆకర్షణగా వుండేది. కంచుకోట సినీమా ప్రివ్యూ కానీ, లేక విడుదలైన మొదటి రోజే చూసేయాలన్నంత ఆసక్తితో వుండేవాడిని.
రెండూ జరగలేదు. ఆ ఏడాది మా పబ్లిక్
ఎక్జామ్స్ సమయంలో రిలీజ్ కావడంతో మద్రాస్ లో అటు ప్రివ్యూగానీ మా ఊళ్ళో
సినీమా థియేటర్ లోనూ చూడ్డం అవలేదు. అసలు ఇంతవరకూ కనీసం టివిలో కూడా 'కంచుకోట ' చూడలేదు.
కానీ, ఈ సినీమాలో పి.సుశీల, జానకి పాడిన 'సరిలేరు నీకెవ్వరూ నరపాల సుధాకర సరిలేరు నీకెవ్వరూ' పాట మాత్రం ఈనాటికీ సూపర్ హిట్ సాంగ్. సందేహం లేదు.
విశ్వశాంతి వారి 'కంచుకోట'. దర్శకుడు సి.ఎస్.రావు. సోషల్ సినీమాలకు ఎక్కువగా డైరక్ట్ చేసే సి.ఎస్.రావు ఒక జానపదానికి డైరక్ట్ చేయడం నాకు వింతగా అనిపించింది.
ఆ ఇల్లు చిత్రనిర్మాత U.విశ్వేశ్వరరావుగారిది (అద్దెకే అనుకుంటాను). ఆఫీస్ కమ్ రెసిడెన్స్. సంగీతం కె.వి.మహాదేవన్. ఈ విషయం నాకు మరింత ఆశ్చర్యం కలిగించింది. పామర్తిగారు, విశ్వేశ్వరరావుగారు, దయాసాగర్ గారు మంచి స్నేహితులు. విశ్వేశ్వరరావుగారు అనేక డబ్బింగ్ సినీమాలు తీశారు. వాటన్నిటికీ పామర్తిగారే సంగీతం నిర్వహించారు. విశ్వశాంతిలో దయాసాగర్ గారి పొజిషన్ నాకు సరిగ్గా తెలియదు, కానీ, పామర్తిగారు మాత్రం అది తన సొంత కంపెనీ అన్నట్లుగా వుండేవారు. సింగర్ కమ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ కొమ్మినేని అప్పారావు (తరవాత కాలంలో మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి) కూడా తరచూ అక్కడే వుండేవారు. బహుశా ఆ సినీమాకు ఆయన కె.వి.మహాదేవన్ దగ్గర పనిచేసేవారేమో.
విశ్వేశ్వరరావుగారి భార్య, ఆవిడ పేరు గుర్తుకు లేదు కానీ అందరూ ఆవిడను బేబీ అనేవారు. వారికి ఒక చిన్న బేబి. సావిత్రమ్మగారిని కలుసుకుందుకు అప్పుడప్పుడు ఈ పెద్ద బేబి, చిన్న బేబి వచ్చేవారు. పామర్తిగారి కుటుంబంతో మంచి స్నేహం వుండేది.
విశ్వశాంతి వారు తీసే మొదటి స్ట్రైట్ సినీమాకు తానే సంగీత దర్శకుడనని పామర్తిగారు చాలా నమ్మకంతో వుండేవారు. కంచుకోట తర్వాత అనేక పెద్ద సినీమాలు తీసి అంచెలంచెలుగా లయన్U.విశ్వేశ్వరరావుగారు ఎదిగిపోయారు. (ఆయన లయన్స్ క్లబ్ మెంబర్). తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖ నిర్మాతలలో ఒకరుగా ఉన్నతస్థాయికి చేరుకున్నారు. ఇందుకు అన్నగారి ఆశిస్సులే కారణం. త్రివిక్రమారావు, పుండరీకాక్షయ్య, విశ్వేశ్వరరావుగార్లు రామారావు గారికి అతి సన్నిహితులు. ఎన్.టి.ఆర్ కుటుంబంతో బాంధవ్యం కూడా వుందనుకుంటాను. తర్వాత, తర్వాత విశ్వేశ్వరరావుగారు ప్రొడ్యూసర్స్ గిల్డ్ లో, ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో, ఫిలిం అవార్డ్స్ జ్యూరీలో అనేక ఉన్నత పదవులు నిర్వహించారు. ఉస్మాన్ రోడ్ లో కొన్నేళ్ళు వున్నాక హబీబుల్లా రోడ్ లోని విశ్వశాంతి గార్డెన్స్ లోని సొంత భవనానికి వెళ్ళిపోయారు. వారి కొన్ని సినీమాలకు చక్రవర్తిగారు కూడా సంగీత దర్శకత్వం వహించారు. కానీ, పామర్తిగారికి విశ్వశాంతిలో స్ట్రైట్ పిక్చర్ కు సంగీతం చేసే అవకాశం రాలేదు.
ఈ విశ్వశాంతి కి సంబంధించినదే మరో దుర్ఘటన బాగా గుర్తుండిపోయింది. ఈ ఇంటి మేడ పై భాగంలో ఒక కొబ్బరాకుల శాల 'కొట్టాయ్' ఒకటి వుండేది. (తమిళనాడులో ముఖ్యంగా మద్రాసులో గుడిసెలన్నీ కొబ్బరాకులతో అల్లిన మట్టలతోనే కట్టేవారు. అటువంటి కొట్టాయ్ 35, ఉస్మాన్ రోడ్ ఔట్ హౌస్ మీద కూడా ఉండేది). విశ్వశాంతి వారి కొట్టాయ్ లో వారి సినీమా ప్రొడక్షన్స్ కు సంబంధించిన కార్యకలాపాలు జరుగుతూండేవని చెప్పేవారు. ఎదురిల్లైనా నేను ఎప్పుడూ వెళ్ళలేదు. ఆ శాలలో ఉదయం నుండి రాత్రివరకు పనిచేసుకొని ఇళ్ళకు పోయేవారు. ఫిబ్రవర్లోనో మార్చినెలో - తిరుమల రామానుజకూటంలో పెద్దబాబు ఉపనయనం ముగించుకుని వచ్చినసరికి ఒక దర్వార్త తెలిసింది. ఆ రోజు ఉదయం వచ్చి చూసేసరికి దయాసాగర్ గారు కొట్టాయ్ లో సూయిసైడ్ చేసుకొని శవమై కనిపించారట. కారణం తెలియదు. ఇది చాలా రోజులపాటు అందరి మనసులను కలచివేసిన విషాదకరమైన దుర్ఘటన.
🌹🌹🌹
ఘంటసాల మాస్టారు సినీమాలు తీయొద్దని నిర్ణయించుకున్నాక తమ్ముడు తాత (సదాశివుడు) చేత మాధవరం మిల్క్ ప్రాజెక్ట్ లో పాల వ్యాపారం పెట్టించారని గతవారాలలో చెప్పాను. ఆ పాల వ్యాపారం ఓ మూడేళ్ళపాటు సజావుగానే సాగింది. మేము, పిల్లలం, ప్రతీ శని, ఆదివారాలు మాధవరం వెళ్ళి మిల్క్ కాలనీలో సరుగుడు చెట్లక్రింద తిరుగుతూ అక్కడి షెడ్లలో పశువులకు చేసే సంరక్షణ చూస్తూ బాబాయి, పిన్నిగార్ల ప్రేమాభిమానాలు పొందుతూండేవాళ్ళము.
రోజులు ఎప్పుడూ ఒకలాగే వుంటే మన గొప్పతనం ఏం ఉంది?
ఓ మూడేళ్ళ తర్వాత ఏదో వ్యాధిసోకి మాస్టారి పశువులన్నీ చాలావరకు మరణించాయి. అక్కడితో మాధవరం మిల్క్ బిజినెస్ మూతపడింది. తాత (బాబాయ్)గారు, పాప (పిన్ని)గారు మరల 'నెం.35, ఉస్మాన్ రోడ్' కు చేరుకున్నారు.
"ఆశా దురాశా వినాశానికే ఏలా ప్రయాసా వృధా యాతనే" అని ఘంటసాల మాస్టారు 'టైగర్ రాముడు' లో ఓ పాట పాడారు.
జీవితంలో దురాశకు పోతే వినాశనం చెందడం న్యాయం. కానీ తనకు అయినవారిని ఆదుకొని వారికి ఒక ఆసరా కల్పించాలనే సదాశయం కూడా తనకు వ్యతిరేక ఫలితాలను ఇస్తూంటే ఎంతటివాడైనా ఎన్నాళ్ళు తట్టుకోగలడు. ఘంటసాల మాస్టారు గొప్ప మహర్జాతకుడైనా జీవితంలో కష్టాలు నష్టాలే ఎక్కువగా అనుభవించారు. వీటన్నిటి ప్రభావం ఆయన అనారోగ్యాలకు కారణమనిపిస్తుంది.
తమ్ముడు సదాశివుడు గారు , పాప పిన్నిగారు (సుబ్బలక్ష్మి) ఇద్దరూ చాలా మంచివారు. పిల్లలంటే చాలా ప్రేమ. వారి దురదృష్టమో, అదృష్టమో అంటే చెప్పలేను కానీ వారికి సంతానం కలగలేదు. అయితేనేం, ఇంట్లోని పిల్లల సంరక్షణ చాలావరకు పిన్నిగారే చూసేవారు. ఆవిడలోని సేవాగుణం చెప్పుకోతగ్గది. ఇంట్లో ఎవరికి ఏ అనారోగ్యం వచ్ఛినా ఆవిడ ముందుండి సహాయం చేసేవారు.
నాకు ఒక విషయం బాగా గుర్తు. ఒక సంవత్సరం వేసంగి శెలవులకు సాలూరు నుండి మా తమ్ముడు పి.వి.ఎన్.ఎస్.ప్రసాద్, చెల్లెలు మంగమాంబ, పదకొండేళ్ళది, (మా ప్రభూ చిన్నాన్నగారి అబ్బాయి, అమ్మాయి), మద్రాస్ వచ్చారు.
ప్రసాద్, మంగమాంబ, శిష్యులతో ప్రభూ చిన్నాన్నగారు
చిన్నప్పుడు క్లాస్ పుస్తకాలలో చదివిన ఫ్లారెన్స్ నైటింగేల్ అంటే ఈవిడలాగే వుంటుందేమో అని నాకు అనిపించేది. మాస్టారింటి పిల్లలందరికీ పిన్నిగారి దగ్గర చేరిక ఎక్కువే. అమ్మకు కోపం ఎక్కువ. ఆవిడ చేతివాటానికి భయపడి పిన్ని దగ్గరకో, మా అమ్మగారి దగ్గరకో చేరేవారు. తాతా బాబాయ్ అన్నా అందరికీ ఇష్టమే.
ఘంటసాల మాస్టారి రెండవ పుత్రరత్నం, వెంకట రత్నకుమార్ ఉపనయనం పిన్ని, బాబాయ్ ల చేతులమీదుగానే మాస్టారు జరిపించారు. పీటలమీద తమకు బదులు సదాశివుడుగారిని, పాప పిన్నిగారినే కూర్చోపెట్టి కార్యక్రమం జరిపించారు. ఈ ఉపనయనానికి ఎన్.టి.రామారావుగారు, తన అనుచర బృందంతో వచ్చి ఆశీర్వదించారు. అయితే, ఈ ఉపనయనం తర్వాత ఎప్పుడో 1970 లలో జరిగింది. సందర్భం వచ్చింది కనుక, మాస్టారింటి కుటుంబ సభ్యుల మధ్య గల మమతానురాగాలు ఎలాటివో తెలియడానికి చెప్పాను.
ఈసారి ఇంక ఏ విధమైన వ్యాపారాలు కాకుండా తమ్ముడిని ఏదైనా నిలకడైన ఉద్యోగంలో ప్రవేశపెట్టాలని నిర్ణయించి పెద్దలతో తనకు గల పలుకుబడిని ఉపయోగించి తమ్ముడికి కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని IDPL వారి సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ ప్లాంట్ లో ఒక ఉద్యోగం సంపాదించిపెట్టారు. కంపెనీవారే క్వార్టర్స్ ఇచ్చారు. ఈ ప్లాంట్ నందంబాక్కంలో వుంది. సదాశివుడుగారు తన రిటైర్మెంట్ వరకు అదే కంపెనీలో పనిచేశారు.
మాధవరం ఉత్తరం. నందంబాక్కం దక్షిణం. మా వీకెండ్ వెకేషన్స్ ఉత్తరాయణం నుండి దక్షిణాయనానికి మారాయి.
ఆ సర్జికల్ ప్లాంట్ లో అన్ని భాషలకు చెందిన ఘంటసాల అభిమానులు ఎందరో వుండేవారు. కుటుంబరావు అని ఒకాయన, కృష్ణ అని ఒకాయన ఆ కంపెనీలో పెద్ద పదవులలో వుండేవారు.
అలాగే సెల్వనాయగం అని తాతగారి కొలీగ్ ఒకాయన, వీరందరితో, వారి కుటుంబ సభ్యులతో నాకు పరిచయాలు ఏర్పడ్డాయి. వంశపారంపర్యంగా వచ్చిన మధుమేహ వ్యాధి సదాశివుడు గారిని వదిలిపెట్టలేదు. ఆ కారణంగా చివరలో ఆయన దృష్టి దెబ్బతిన్నది. అప్పుడు కంపెనీలోని ఈ పెద్దలంతా ఆయనకు చాల సహాయ సహకారాలందించి చాలా ప్రేమాభిమానాలు కనపర్చేవారు. దీనికంతటికీ మూలం ఆ దంపతుల మంచితనం. అంతకుమించి వారందరికీ ఘంటసాలవారి మీదున్న అపరిమితమైన భక్తి. ఏ విధమైనటువంటి పబ్లిసిటీలు ఆశించకుండా గోప్యంగా తగిన సమయంలో తగిన సహయ సహకారాలందించేవారే నిజమైన స్నేహితులు.
🌹🌹🌹
నందంబాక్కం అనగానే తమిళనాడునే అట్టుడికించిన ఒక భయంకర సంఘటన ఒకటి 1967 లో జరిగింది. గిండీ కతిపర జంక్షన్ దాటాక ఒక రోడ్ తాంబరం వేపు వెళుతుంది. అది GST - Grand Southern Trunk Road - National Highway No. 45. కుడిచేతివేపు మరో రోడ్ సెయింట్ థామస్ మౌంట్ వేపు వెళుతుంది. అది బట్ రోడ్. ఆ రోడ్ నందంబాక్కం మీదుగా బెంగళూర్ రోడ్ వయా పోరూర్, పూనమల్లి. మధ్యలో ఒక దగ్గర తిరపతి వెళ్ళే రోడ్డు కుడివేపుకి ఉంటుంది. నందంబాక్కం border అడయార్ రివర్. అక్కడున్న బ్రిడ్జ్ దాటాక రామాపురం. ఈ రామాపురంలో 'పురట్చితలైవర్', 'మక్కళ్ తిలగం' ఎమ్.జి.రామచంద్రన్ తోట బంగళా - రామాపురం తోట్టంగా తమిళనాడంతా ప్రసిద్ధిపొంది ఉంది ఇప్పుటికీ. ఎమ్.జి.ఆర్, టి.నగర్ ఆర్కాట్ స్ట్రీట్ లోని సొంత ఇంట్లో కన్నా ఈ రామాపురం బంగళాలోనే ఎక్కువగా వుండేవారు. పార్టీ ప్రముఖులతో సమావేశమైనా, తను నటించే సినీమా కథల మీద చర్చలైనా అంతా ఈ రామాపురంలోనే జరిగేవి.
అది 1967 జనవరి నెల. 13 వ తేదీ పొంగల్ కు ఎమ్.జి.ఆర్ కొత్త సినీమా 'తాయ్ క్కు తలైమగన్' అనే కొత్త సినీమా రిలిజ్ కాబోతున్నది. జయలలిత హీరోయిన్. చిన్నప్ప దేవర్ నిర్మాత. ఎమ్జీయార్ అభిమానులంతా ఈ సినీమా విడుదలకు రాష్ట్రవ్యాప్తంగా చేయవలసిన సంబరాల పనులలో తలమునకలైవున్నారు.
జనవరి 12 వ తేదీ సాయంత్రం సుప్రసిద్ధ తమిళ నటుడు మద్రాస్ రాజగోపాలన్ రాధాకృష్ణన్ aka ఎమ్.ఆర్.రాధా, తన స్నేహితుడైన ఒక నిర్మాతతో కలసి ఎమ్.జి.ఆర్ ను కలవడానికి రామాపురం తోట బంగళాకు వెళ్ళారు. కొంతసేపు వారి మధ్య ఏవో మాటలు సాగాయి. తర్వాత ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. ఎమ్.జి.ఆర్, ఎమ్.ఆర్.రాధా ఇద్దరూ తుపాకీ బుల్లెట్ గాయాలతో రాయపేట గవర్నమెంట్ హాస్పిటల్ కు తరలించబడ్డారు. ఎమ్.జి.ఆర్ ను రాధా తుపాకీ తో కాల్చాడన్న వార్త దావానలంగా ప్రాకిపోయింది. ఎమ్.జి.ఆర్ అభిమానులు ఎమ్.ఆర్.రాధా ఆస్తులను ధ్వంసం చేశారు. ఉళ్ళో విధ్వంసకాండ మొదలయింది. ఈ ఇద్దరు నటులను గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కు తరలించి శస్త్ర చికిత్స చేశారు. ఎమ్.జి.ఆర్ కు ప్రాణాపాయం లేదని డాక్టర్లు చెప్పేవరకు హాస్పిటల్ వద్దకు చేరిన జనాలను అదుపు చేయడానికి పోలీసులు నానా అవస్థలు పడ్డారు.
కణతలమీద రాధాకు తగిలిన బుల్లెట్లను
తొలగించారు కానీ, ఎమ్.జి.ఆర్ గొంతులో దిగిన రెండు బుల్లెట్లను
తొలగించలేకపోయారు.
ఎమ్.జి.ఆర్ ను తానే పిస్టల్ తో కాల్చి తనను
తాను కాల్చుకున్నట్లు ఎమ్.ఆర్.రాధా వాంజ్ములం ఇచ్చినట్లు దాని ఆధారంగా అతనిని
అరెస్ట్ చేసినట్లు ప్రముఖ పత్రికలు వ్రాసాయి. కేస్ కోర్ట్ కు వెళ్ళింది. ఎమ్.ఆర్.రాధాకు ఏడేళ్ళ కారాగార శిక్షపడింది. తర్వాత మద్రాస్ హైకోర్ట్ లో రాధా వయసు
దృష్ట్యా జైలు శిక్షను ఏడేళ్ళనుండి నాలుగేళ్ళకు తగ్గించారు.
ఎమ్.ఆర్.రాధా ఇ.వి.రామస్వామి నాయకర్ యొక్క ద్రవిడ ఉద్యమానికి తీవ్రంగా ప్రభావితుడైన వ్యక్తి. సినీమాల్లోనే కాక రంగస్థలం మీద కూడా ఎమ్.ఆర్.రాధా ప్రతిభ గణనీయంగానే వెలిగింది. 'రక్త కన్నీర్' నాటకాన్ని రాధా తమిళదేశమంతా కొన్ని వేల ప్రదర్శనలు ఇచ్చాడు. నాటకంలో అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేస్తున్న కారణంగా అనేకసార్లు పోలీసులు ఎమ్.ఆర్.రాధాను అరెస్ట్ చేసేవారు. ఈ నాటకం రాధా హీరోగా సినీమా కూడా తీసారు. చాలా పెద్ద హిట్. ఇదే 'రక్త కన్నీర్' డ్రామాను తెలుగులో నాగభూషణం ప్రదర్శించేవారు. ఈ విధంగా, సి.ఎన్.అణ్ణాదురై కాలం నుండి తమిళ రాజకీయాలు, సినీమాలు పరస్పరం ముడిపడివుండేవి.
తరచూ ఏదో సినీమా కంపెనీవాళ్ళు మాస్టారింటికి వచ్చి తమ సినిమా ఫలానా స్టూడియో లో ఫలానా ధియేటర్లో, ఇన్ని గంటలకు ప్రివ్యూ వేస్తున్నాము, అందరూ తప్పక వచ్చి చూడండి అని ఆహ్వానించేవారు. మొదట్లో ఇదొక సంప్రదాయంగా వుండేది. కానీ, 1970 లు వచ్చేసరికి స్టూడియోలలో ప్రివ్యూలు వేయడం, ఆ సినీమాలో పనిచేసినవారందరినీ పిలవడం అనేది క్రమేణా తగ్గిపోయింది. పాత రోజుల్లో ఒక్కో సినీమా మూడేసి నాలుగేసి సార్లు వేసేవారు. ముఖ్య నటీనటులు, దర్శక నిర్మాతల కోసం ఒకసారీ, సాంకేతిక నిపుణుల కోసం ఒకసారి, పాత్రికేయుల కోసం ఒకసారి, జనరల్ గా వారివారి కుటుంబాలకోసం ఒకసారీ అంటూ సినీమాలు వేసేవారు. స్టూడియో థియేటర్లు పబ్లిక్ థియేటర్లంత పెద్దవిగా వుండవు. వాటి సిట్టింగ్ కెపాసిటి వంద లోపలే. పెద్దలకు మాత్రమే కుర్చీలు. పిల్లలు, ఎవరి పిల్లలైనా సరే నేల మీద కూర్చొని చూడవలసిందే.
విజయావారి మాయాబజార్, ఎన్.టి.రామారావుగారి సీతారామ కళ్యాణం వంటి సినీమాలెన్నో పిల్లలందరం క్రింద కూర్చొనే చూసేవాళ్ళం. ఈ ప్రివ్యూలు చూసిన కుటుంబాలు ముందుగా సినీమా చూసి బాగుందని ఆనందిస్తే, ఆనాటి ఆంధ్రదేశంలో ఆ సినీమా తప్పక విజయవంతమౌతుందని అనుకునేవారు. అయితే, నిర్మొహమాటంగా ఒక సినీమాలోని బాగోగులను విమర్శించే అవకాశం తక్కువ. సినీమా పత్రికలవారు తమ మనుగడకోసం చిత్ర సమీక్ష చేసేవారే తప్ప విమర్శించేవారు బహు అరుదు. అలాగే ప్రముఖుల కోసం వేసే ప్రివ్యూలలో కూడా సినీమా పూర్తయాక ఆయా నటీనటులు, దర్శక నిర్మాతలు, సంగీతదర్శకులు, గాయకులు ప్రతి ఒక్కరు ఒకరినొకరు కావలించుకొని, షేక్ హ్యాండ్స్ ఇచ్చుకొని సినీమా అద్భుతంగా వుందని, ఘనవిజయం సాధిస్తుందని, మరల అందరం శతదినోత్సవ సభలో కలుసుకుందామని సంతోషమైన ముఖాలతో పరస్పరం అభినందించుకునేవారు. అది ఒక మర్యాద. సభ్యత. సినీమా బాగా లేదని ఎవరినోటా వినవచ్చేదికాదు. ఆ అభినందనలలో నిజాయితీ కానరాదు. అంతా కృతకమే.
స్టూడియోలలో ఈ మాటలన్నీ విన్న నేను అవే సినీమాలను మా బొబ్బిలి శ్రీరామాలోనో, శ్రీకృష్ణాలోనో చూసినప్పుడు అక్కడి ప్రేక్షకుల రియాక్షన్ మరోలా వుండేది. మావూళ్ళో ఏ సినీమా అయిన నాలుగువారాలపాటు హౌస్ ఫుల్ తో ఆడితే ఘనమైన సినీమాక్రిందే లెక్క.
పొద్దస్తమానం సినీమా లోకంలో అదే ధ్యాసగా వుండడంవలన ఘంటసాల మాస్టారికి కానీ, మా నాన్నగారికి కానీ స్టూడియో ప్రివ్యూలు కానీ, బయట థియేటర్లలో కానీ సినిమాలు చూసే ఆసక్తి వుండేది కాదు. ఆ సమయంలో హాయిగా ఇంట్లో కాలక్షేపం చేయాలని అనుకునేవారు. దాని ఫలితంగా మా ఇళ్ళలోని వారు కూడా సినిమాలు చూడడం తక్కువే. కథాపరంగా, సంగీతపరంగా చాలా బాగుంటాయని నమ్మే సినీమా ప్రివ్యూలు వేస్తే వాటిని మాత్రం చూడాలని సావిత్రమ్మగారికి అనిపించేది. అయితే మారెండిళ్ళలో చంటిపిల్లలు ఎక్కువమంది వుండడంతో ఇంట్లోని ఆడవారికి సినీమాలు చూసేంత సావకాశం దొరికేదికాదు.
"అలాగా! సాయంత్రం ఐదింటికి వచ్చేస్తాను. నువ్వు, పిల్లలు రడిగా వుండండి".
సాయంత్రం ఐదవుతుంది, ఐదున్నర అవుతుంది, ఆరవుతుంది, కానీ, గోవిందు కారు హారన్ మాత్రం వినపడదు. ఏ ఆరున్నరకో మాస్టారు వచ్చి బయల్దేరండి, వెళదామంటూ హడావుడి చేసేవారు. ఆ సమయానికి కోడంబాక్కం స్టూడియోలో సినీమా మొదలెట్టేసివుండేవాళ్ళు.
మేము కోడంబాక్కం లెవెల్ క్రాసింగ్ దగ్గర పడిగాపులు పడి స్టూడియోకు వెళ్ళేసరికి ఓ రెండు రీళ్ళ సినీమా ఓ రెండు పాటలు అయిపోయి వుండేవి. దాదాపు చాలా సినీమాలు సగం నుండి చూసినవే. సినీమా చూసిన తృప్తే ఎవరికీ వుండేదికాదు. అదేదో ఒక సినీమాకు అయితే మేము వెళ్ళిన పావుగంటకే శుభం కార్డ్ వేసేశారు. అయ్యగారిని నమ్ముకుంటే ఏ సినీమా పూర్తిగా చూడలేవనే నిర్ణయానికి అమ్మగారు వచ్చేసారు. అయితే, ఇందులో ఘంటసాల మాస్టారిని తప్పుపట్టడానికి లేదు. మాస్టారు సాంగ్ రిహార్సల్స్ కో, రికార్డింగ్ కో వెళ్ళారంటే ఇంక అదే ధ్యాస. ఇంటి ఇల్లాలికి ఇచ్చిన వాగ్దానం, మిగిలిన విషయాలు, అన్నీ పూర్తిగా మరచిపోయేవారు. ఇప్పటిలాగా, వెంటవెంటనే ఫోన్ చేసి గంటల తరబడి మాట్లాడేందుకు అది సెల్ ఫోన్ల యుగం కాదు కదా! ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే, ఘంటసాల వంటి ఒక గొప్ప గాయకుడు, సంగీత దర్శకుడి ఇంట్లో టెలిఫోన్ లేకపోవడం. ఆ సమయానికి చాలామంది చిన్నా చితకా సినీమావాళ్ళందరికీ ఇళ్ళలో టెలిఫోన్ సౌకర్యం వుండేది.
మాస్టారి సన్నిహిత నిర్మాతల బలవంతం మీద చాలాకాలానికి టెలిఫోన్ పెట్టుకోవడానికి సిధ్ధమయ్యారు. ఆ రోజుల్లో టెలిఫోన్ కనెక్షన్స్ అంత సులభం కాదు. ఘంటసాలవారి హెల్త్ కారణంగా వారింట్లో వెంటనే టెలిఫోన్ అవసరమని అప్లై చేసిన ఎన్నో మాసాలకు 'నె.35, ఉస్మాన్ రోడ్' కు టెలిఫోన్ వచ్చింది. ఆ ఫోన్ నెంబర్ 443773.
ఆనాటికి మద్రాస్ టెలిఫోన్ డిస్ట్రిక్ట్ లో ఆరు నెంబర్లతోనే వుండేవి. తర్వాత ఏడు నెంబర్లు, ఆ తర్వాత మరి కొన్నేళ్ళకు ఎనిమిది నెంబర్లు వచ్చాయి. ఇప్పుడు సరేసరి, ల్యాండ్ ఫోన్లు వున్న ఇళ్ళే అరుదు. ఒక్కొక్కరికి రెండేసి, మూడేసి సెల్ ఫోన్లు. సినీమాలన్నీ మొబైల్ లోనే చూడవచ్చు. లేకపోతే హోమ్ థియేటర్. ఇక స్టూడియోలు ఎందుకు? పబ్లిక్ థియేటర్లెందుకు? కాకపోతే, నాలా సినీమా మోహితులకు స్టూడియోలలో ప్రివ్యూ షోలు చూడడంలో ఓ మజా, కిక్, థ్రిల్లు వుండేవి. Gone are the days.
🌹🌹🌹
అమ్మగారికి (సావిత్రమ్మగారు) పూర్తిగా టైటిల్స్ నుండి చూడాలి చూడాలనుకొని చూడలేకపోయిన (లేక సగం చూసిన) మంచి సినీమాలలో ఒకటి 'మంచి మనసులు' కె.వి.మహాదేవన్ కు తెలుగులో గొప్ప గుర్తింపు తెచ్చిన సినీమా. పాటలన్నీ తమిళం ఒరిజినల్ అయిన 'కుముదం' సినీమాలోవే అయినా తెలుగు ప్రేక్షకులు విశేషంగా ఆదరించారు. అప్పుడు వారికి ఆ పాటలు అరవ వాసన వేయలేదనుకుంటాను.
ఆ పాటల రుచి, వాసన మార్చింది మాత్రం పూర్తిగా ఘంటసాలగారు, సుశీలగారే అని చెప్పాలి. ఆ ఇరువురి గాత్ర మాధుర్యం వలన 'మంచి మనసులు' పాటలు ఈనాటికీ ఆపాతమాధుర్యాలుగానే తెలుగు సంగీతప్రియులను
అలరిస్తున్నాయి.
అలాటి 'మంచి మనసులు' రిలీజ్ అయిన మూడేళ్ళకో, నాలుగేళ్ళకో మద్రాస్ లో ఒకానొక మారుమూల పాత సినీమా హాలుకు వచ్చింది. అది జార్జ్ టౌన్ లో తాతముత్తియప్పన్ వీధిలో వుండిన 'సెలెక్ట్' సినీమా హాలు. మద్రాసులో ఆ ఒక్క హాలులోనే తెలుగు సినీమాలు శుక్రవారం నుండి గురువారం వరకూ రోజుకు మూడాటలు ఆడేవి. ఊళ్ళో మరికొన్ని థియేటర్లు తెలుగు సినీమాలను ఆదివారం ఉదయం ఆటలుగా మాత్రమే వేసేవారు. ఆ హాల్స్ కూడా అంతంతమాత్రమే. అలాటి ఒక పాత హాలులో తను చూడాలనుకున్న 'మంచిమనసులు' సినీమాకు వెళ్ళాలని నిర్ణయించారు. ఆ రోజే ఆఖరి ఆట. మర్నాటినుండి సినీమా మారిపోతుంది. అమ్మగారి ప్రపోజల్ కు అయ్యగారు ఆమోదముద్ర వేశారు. ఆరోజు వారు వేరే ఇతర కార్యక్రమాలు పెట్టుకోలేదు. సెలెక్ట్ టాకీస్ మా ఇంటికి చాలా దూరం. కారు వసతి లేని వారికి మరో ఊరు ప్రయాణంలాటిదే.
సాయంత్రం ఐదింటికల్లా అందరం రెడీ అయి కార్లో బయల్దేరాము. అయ్యగారు, అమ్మగారు, నేనూ. మాతోపాటు పెద్దబాబు కూడా వున్నాడనుకుంటాను. సినీమా వేసే టైమ్ కంటే చాలా ముందుగానే బయల్దేరాము కనుక ముందుగా ఒకసారి మాలతిని (మాలతీచందూర్) కూడా చూసేసి తర్వాత సినీమా మొదలెట్టే సమయానికి థియేటర్ కు వెళదామని కారును పరశువాక్కం వేపు మళ్ళించారు. అప్పట్లో చందూర్ దంపతులు పరశువాక్కం లోని మూకత్తాల్ స్ట్రీట్ (అనే గుర్తు) లో వుండేవారు. చందూర్ గారి 'జగతి' పత్రిక కూడా అక్కడనుండే వెలువడేది. సావిత్రమ్మగారికి మాలతీ చందూర్ గారన్నా, పి.భానుమతిగారన్నా అమితమైన ఇష్టం. ఏమాత్రం అవకాశం వున్నా వాళ్ళిద్దరిని కలుసుకోవడానికి ఇష్టపడేవారు. ఘంటసాలగారి వంటి బిజీ గాయకుడు తమ ఇంటికి రావడంతో చందూర్ దంపతులు మహా సంబరపడిపోయారు. ఘంటసాలవారి కుటుంబంతో చిరకాలమైత్రి వారిది. మాస్టారింటి పిల్లలంతా మాలతీ చందూర్ గారిని 'మాలత్తయ్య' అని ఆప్యాయంగా, గౌరవంతో పలకరించేవారు. చందూర్ దంపతులు, ఘంటసాల దంపతులు లోకాభిరామాయణంలో పడ్డారు. నేను ఒకటికి రెండుసార్లు గుర్తు చేసాక వారింటినుండి బయల్దేరి సెలెక్ట్ కు చేరుకున్నాము.
ఎప్పటిలాగే, టైటిల్స్ నుండి సినీమా చూడాలనే అమ్మగారి కోరిక నెరవేరలేదు. మేము వెళ్ళేసరికి సినిమా మొదలైపోయి అరగంటయింది. టిక్కెట్ కౌంటర్ కూడా మూసేసారు. హౌస్ ఫుల్ కాకపోయినా జనం నిండుగా వున్నారు. ఘంటసాలవారి ని గుర్తుపట్టి అక్కడి మేనేజర్ లోపల ఎలాగో ఓ నాలుగు సీట్లు మేనేజ్ చేశాడు. అలా సెలెక్ట్ లో 'మంచిమనసులు' చూశాము. అయితే ఈసారి ఘంటసాల మాస్టారి తప్పేమీ లేదు. అమ్మగారే మాలతిగారితో మాటల్లోపడి సినిమాకు లేటయిపోయారు. ఏమైతేనేం, మరోసారి కూడా పూర్తి సినీమా చూడ్డం కుదరలేదు.
వచ్చేవారం మరికొన్ని విశేషాలు...
…సశేషం
*With a view to make the narrative more authentic and to corroborate it, images, audio and video clips are attached at appropriate places. If such usage is found objectionable to the copyright holders the same shall be removed if and when notified.
4 comments:
ఈ నాటి మీ జ్ఞాపకాల దొంతర లో నుండి
యు. విశ్వేశ్వరరావు గారి విశ్వశాంతి పతాకంపై నిర్మితమైన సినిమాల గురించి వారి ప్రొడక్షన్ విశేషాలు చాలా చక్కగా వివరించారు ( మీరు విశ్వేశ్వరరావు గారికి ఎన్టీఆర్ గారికి బాంధవ్యం ఉందన్నారు కదా బాబాయ్ గారూ! నాకు తెలిసినంతలో విశ్వేశ్వరరావు గారి అమ్మాయి శాంతి గారిని ఎన్టీఆర్ గారి అబ్బాయి ఛాయాగ్రాహకులు మోహన కృష్ణ గారికిచ్చి పెళ్ళి చేసారు.)
ఇక ఆనాటి మదరాసు నగరంలోని సినిమా ప్రివ్యూల సంస్కృతి గురించి..... ఘంటసాల మాస్టారు గారి తమ్ముడు సదాశివుడు గారి గురించి వారి శ్రీమతి బేబీ గారి మంచితనం గురించి పిల్లల పట్ల వారికున్న ఆపేక్ష గురించి చాలా ఆసక్తికరంగా వివరించారు 👌👌👌👌👌.....
కొసమెరుపు గా అందించిన సావిత్రమ్మ గారి తీరని ' సంపూర్ణ చిత్ర వీక్షణం' ముచ్చట నెరేషన్ చాలా చాలా బాగుంది బాబాయ్ గారూ.....
ఇంత ఓపికగా ఎంతో అనురక్తి తో ఘంటసాల మాస్టారు గారి తో మీకున్న అనుబంధం గురించి వారం వారం మాకు ఎన్నో విశేషాలు అందిస్తున్న మీకు శతాధిక కోటి కృతజ్ఞతాభివందనాలు.... శిరసా నమామి స్వరాట్ బాబాయ్ గారూ 🙏🙏💐😊💐🙏🙏
ఇందాక పోస్ట్ చేసిన కామెంట్ లో ఘంటసాల గారి తమ్ముడు శ్రీ సదాశివుడు గారి శ్రీమతిగారి పేరు పొరబాటున పాప(సుబ్బలక్ష్మి)గారు బదులు బేబీ గారు అని టైప్ చేసాను... ఆ పోస్ట్ ని ఎలా ఎడిట్ చేయాలో అర్థం కాక ఈ పోస్ట్ పెడుతున్నా... క్షంతవ్యుడను స్వరాట్ బాబాయ్ గారూ 🙏🙏
ధన్యవాదాలండి. మీ అనుభవాలను ఇంత ఓపిగ్గా వివరిస్తున్నందుకు
ధన్యవాదాలు
Post a Comment