visitors

Sunday, May 30, 2021

నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 2 - ముఫ్ఫై మూడవ భాగం

30.05.2021 -  ఆదివారం భాగం - 33*:
అధ్యాయం 2 భాగం 32  ఇక్కడ

  

నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్

'గొట్టం గొట్టై గొట్టహ టం టై టహఅంటూ చక్కిలిగింతలు పెట్టేప్పటికి అప్పటివరకున్న కన్నీటి ప్రవాహానికి ఆనకట్టపడి కిలకిలనవ్వుతూ నాన్న పొట్టమీద కూర్చొని కేరింతలు కొట్టేవారు పిల్లలు. రత్నకుమార్శ్యామలసుగుణశాంతి అంతా ఘంటసాలమాస్టారి పొట్టమీద కూర్చొని స్వారీ చేసినవారే. ఆయనకు ఇంట్లోవున్నప్పుడు బనీనుషర్ట్ వేసుకునే అలవాటు లేదు. భుజం చుట్టూ ఒక పెద్ద తువ్వాలు కప్పుకొని హాల్ లోని పొడుగాటి చేతుల వాలుకుర్చీలో విశ్రాంతిపొందేవారు. అదే సమయంలో అమ్మమీద పితూరీలు చెప్పడానికి పిల్లలు ఒక్కొక్కరుగా నాన్న దగ్గరకు చేరేవారు. వారిని సముదాయించి మంచి మూడ్ లో పెట్టడం మాస్టారికి బాగానే తెలుసు. మాస్టారు తరచు ఉపయోగించే ఈ 'టం టై టహాకు మూలం మాయాబజారే అని నా భావన. అందులో చిన్నమయ (రమణారెడ్డి) తన మంత్రదండంతో 'అం అహః', ఇం ఇహీః ఉం ఉహూఃఅని చదివే మంత్రాలు. వాటినే మార్చి మాస్టారు పిల్లలమీద ప్రయోగించేవారేమో అనిపిస్తుంది. పిల్లలందరికీ మాస్టారి దగ్గర చేరిక ఎక్కువే. విజయకుమార్ (పెదబాబు)కి తప్ప. ఆ విషయంలో నేను, పెదబాబు ఒకటే.  

 

ఘంటసాల మాస్టారు ఇంట్లోనే కాదుతాను పనిచేసే ప్రతీచోట వాతావరణం ఆహ్లాదకరంగాఅనుకూలంగా వుండేలా చేసేవారు. రకరకాల సరదా కబుర్లతో తన చుట్టూవుండేవారిని సంతోషపర్చేవారు.

 

ఒకసారి విజయాగార్డెన్స్ లో ఏదో సినిమా రీరికార్డింగ్ జరుగుతోంది. ఉదయం 9 నుండి రాత్రి 9 వరకూ కాల్షీట్. లంచ్ బ్రేక్ లో ఆర్కెస్ట్రా వారు కొంతమంది బయటకుపోయారు. మాస్టారి లంచ్ ఇంటిదగ్గరనుండి తమ్ముడు కృష్ణ తెచ్చేవాడు. లేకపోతే కంపెనీవారు తెప్పించిన భోజనం చేసేవారు. మాస్టారు లంచ్ ముగించుకొని తర్వాతి సీన్ మ్యూజిక్ గురించి ఆలోచిస్తూ హార్మోనియం మీద ఏవో chords పడుతున్నారు. కొంచెం దూరంగా ఒక కుర్చీలో మా నాన్నగారు ఏదో పుస్తకం చదువుకుంటున్నారు. ఆయనకు లంచ్ బ్రేక్ సమయంలో పుస్తకాలతో కాలక్షేపం చేయడం అలవాటు. కొందరు ఒకపక్కగా కునుకుతీస్తారు. మరికొందరు చతుర్ముఖ పారాయణంతో అదనపు కాసులు సంపాయిస్తారుపోగొట్టుకుంటూనూ వుంటారు.  మాస్టారి పక్కనే తబలా ప్రసాద్ కూర్చొని వున్నాడు. మాస్టారు అనుకున్న విధంగా సరైన బిట్స్ అమరడం లేదు. వాతావరణం కొంచెం బోరింగ్ గా మారింది.


ఈలోగా బయటనుండి ఆర్కెస్ట్రా లోని ఆచారిత్రయం ఒక్కొక్కరుగా లోపలకు అడుగుపెట్టారు. వారిని చూడగానే మాస్టారు చటక్కున 'శఠకోపచారీగారూఅంటూ హార్మోనియం మీద ఒక స్థాయిలో ఒక కార్డ్ వాయించారు. దానికి వెంటనే తబలా డక్క మీద ప్రసాద్ ఒక దరువు వేసాడు. వెంటనేమాస్టారు 'హనుమంతాచారిగారుఅని మరో స్థాయిలో మరో కార్డ్ పట్టారు. దానికి కూడా ప్రసాద్ జవాబు ఇచ్చాడు. ముచ్చటగా మూడవసారి 'నరేంద్రాచారిగారుఅని మరోస్థాయిలో పాడి మరో కార్డ్ వాయించారు. దానికీ ప్రసాద్ ధాటీగానే డక్క మీద ముక్తాయింపు ఇచ్చాడు. అందరూ ఒకటే నవ్వులు. ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. స్థబ్దుగా ఉన్నవారందరిలో చైతన్యం పుట్టి హుషారుగా   ఎవరిచోట్లకు వారు చేరుకున్నారు. రికార్డింగ్ థియేటర్లో వివిధ వాయిద్యాలకు ప్రత్యేక స్థలాలు కేటాయిస్తారు. స్ట్రింగ్ ఇన్స్ట్ర్ మెంట్స్ వారు ఒక గ్రూపుగావిండ్ ఇన్స్ట్రమెంట్స్ వారు ఒక గ్రూప్ గారిథిమ్ సెక్షన్ వేరేగా కూర్చుంటారు. ఒక్కొక్క గ్రూప్ కు రెండేసిమూడేసి మైకులు ఉండేవి.  

ముందుగాఈ ఆచారి త్రయం గురించి చెప్పాలి కదా! 

శఠకోపచారిగారు వైలినిస్ట్. సముద్రాల రాఘవాచార్యులవారి అల్లుడు. నరేంద్రాచారి గారు కూడా వైలినిస్టే. విజయనగరం మ్యూజిక్ కాలేజీలో సంగీతం నేర్ఛుకున్నారు. మాస్టారికి విజయనగరం అన్నామ్యూజిక్ కాలేజీ విద్యార్ధులన్నా ఒక మమకారం వుండేది. వారందరికి తగిన అవకాశాలు కల్పించేవారు. రావూరి వీరభద్రం (మొదట్లో కోరస్ లు పాడేవారు)నరేంద్రాచారిమొసలికంటి సన్యాసిరావు (ముగ్గురూ వైలినిస్ట్ లే). ఇక ఇంతకు మునుపు చెప్పుకున్న హనుమంతాచారిగారు యూనివాక్స్ ప్లేయర్మంచి గాయకుడు కూడా. హిందుస్థానీ సంగీతంలో ప్రవేశముంది. అభంగాలుహిందీ భజన్స్ చాలా బాగా పాడేవారు. 'శ్రీరామచంద్ర కృపాళు భజమనఅనే గీతాన్ని మొదటిసారిగా ఆయన నోటే విన్నాను. హనుమంతాచారిగారు మంచి హాస్యనటుడు కూడా. చాలా కన్నడం సినీమాలలో నటించారు. 'ప్రేమ్ నగర్సినీమా మొదట్లో వచ్చే ఏరోప్లేన్ సీన్ లో కనిపిస్తారు. 



ఈ సీన్లో గాంధీ టోపీలో కనిపిస్తారు హనుమంతాచారిగారు

నాలుగు భాషల ప్రముఖ సీనీ సంగీత దర్శకులందరి దగ్గరా పనిచేసేవారు. మంచి వ్యక్తి. హనుమంతాచారి గారు కర్ణాటకమహారాష్ట్ర అంటూ బయట కచేరీలు ఎక్కువచేసేవారు. అలాటిచోట్లనుండి ఏవేవో వస్తువులు కొని ఘంటసాలమాస్టారికి ఇస్తూండేవారు. హనుమంతాచారి గారు తీసుకు వచ్చే సుగంధ వక్కపొడి ఎంతో బాగుండేది. ఒక్క పలుకు నోట్లో వేసుకుంటేచాలుఆ సువాసన ఎంతోసేపు వుండేది.

 

హనుమంతాచారి గారి అబ్బాయి రాజ్ కుమార్ (యోగి అసలు పేరు యోగీంద్రకుమార్). 'రాముతెలుగుతమిళ చిత్రాలలోని బాలనటుడు. ఆ సినీమాలోని నటనకు నేషనల్ అవార్డు కూడా వచ్చింది. అలాంటి సహృదయుడైన మంచి కళాకారుడు రావి కొండలరావుగారి ట్రూప్ తో 1981 లో  ఢిల్లీ నుండి మద్రాసు వస్తున్న తమిళనాడు ఎక్స్ప్రెస్ ట్రైన్ కు జరిగిన ఘోర విపత్తులో దుర్మరణం పొందారు. హనుమంతాచారి గారు అన్న కొన్ని మాటలు నాకు ఇంకా జ్ఞాపకం ఉన్నాయి. ఆయనను మాస్టారోఅమ్మగారో అడిగారుహాయిగా టి.నగర్ ఏరియాలో ఒక మంచి ఇల్లు కొనుక్కొని వచ్చేయచ్చు కదా అని ?

 

అందుకు హనుమంతాచారిగారు "ఎందుకమ్మా సొంత ఇల్లు. ఎప్పుడు ఎక్కడుంటామో తెలియదు. ఇవేళ మద్రాసురేపు బెంగుళూరు తర్వాత బొంబాయి.  సొంతిల్లంటే మనకు ఇష్టం వున్నా లేకపోయినా బలవంతంగా అదే ఇంట్లో పడివుండాలి. అదే అద్దె ఇల్లైతే దర్జాగా మనకు కావలసిన ఏరియాలో కావలసిన వసతులన్నీ అడిగి చేయించుకొని హాయిగా గడిపేయొచ్చు. స్థలం కొనడంఎవరినో నమ్మి ఇల్లు కట్టడంఅది మనకు నచ్చడంనచ్చకపోవడంఈ గొడవలన్నీ ఎందుకమ్మాఅద్దె ఇల్లే హాయి అని తన కన్నడ తెలుగు యాసతో అన్నారు. హనుమంతాచారి గారి మాటలు నాకు ఒక ఇంగ్లీష్ సామెతను గుర్తుకు తెస్తుంది. 'వెర్రి వెంగళప్పలు ఇళ్ళు కడతారుతెలివైనవారు వాటిలో నివసిస్తారుఅని తాత్పర్యం.

 

సొంతిల్లు కట్టడంలోని సాధకబాధకాలుకష్టనష్టాలు తెలియాలంటే చూడుడు బాలు మహేంద్ర తీసిన  నేషనల్ అవార్డ్ తమిళ ఆర్ట్ ఫిలిం  'వీడు' ( ఇల్లు) . ఈ సినీమాలో హీరో భానుచందర్ కు మన రత్నకుమారే డబ్బింగ్ చెప్పారు. ఏ గూడూ మన శాశ్వతం కాదు. దేవుడిచ్చిన గూడే (దేహం) శాశ్వతం కానప్పుడుమనం కట్టుకునే గూడు మాత్రం శాశ్వతమానిరంతరం నివసించడానికి.

 

హనుమంతాచారిగారు అప్పుడు ఎక్కడవుండేవారో కానీతర్వాత నాకు తెలిసేనాటికి కృష్ణవేణీ ధియేటర్ పక్క వీధి దామోదర్ రెడ్డి స్ట్రీట్ లో ఒక మేడమీద అద్దె ఇంట్లో ఉండేవారు. 

 

'ఏస్తబలిస్ట్ ప్రసాద్ ఘంటసాల ఆర్కెష్ట్రాకు ఒక లైవ్-వైర్. వురిమి జగన్నాథంగారు 1940-50 ప్రాంతాలలో జెమినీ స్టూడియో లో స్టాఫ్ తబలిస్ట్ గా పనిచేసేవారు. వారి స్వస్థలం సాలూరు . సాలూరి రాజావారి (జమీందారు) నాటకశాలలో సీనరీ తెరలు పెయింటింగ్ చేసేవారు. మా తాతగారికీ స్నేహితుడు. ఆయన పెద్ద కొడుకు రామలింగం ఆయన కూడా పేరు మోసిన తబలిస్ట్. ఎస్.రాజేశ్వరరావుకె.వి.మహాదేవన్ వంటి ప్రముఖ సంగీతదర్శకుల వద్ద పనిచేసేవారు. జగన్నాథంగారి మరో కొడుకు ప్రసాద్. అతను ఘంటసాలవారి ఆర్కెస్ట్రాలో సుమారు పదిహేడేళ్ళ వయసులోనే వచ్చి చేరాడు. ఆనాటికినాకు తెలిసీలక్ష్మణరావు గారురామలింగంగారు కూడా మాస్టారి దగ్గర అడపాదడపా పనిచేసేవారు.

 

విజయా సినీమాలకైతే అక్కడ భోగీలాల్ అనే ఆయన పెర్మనెంట్ తబలిస్ట్ గా వుండేవారు. ఆయన మాస్టారి పార్టీతో కచేరీలకు బయట వూళ్ళకు వెళ్ళేవారు. ఆ భోగీలాల్ అనే ఆయన మాస్టారి కచేరీకి ఏదో వూరు వెళుతూ రాత్రికి రాత్రి ట్రైన్ లోనే హార్ట్ అటాక్ తో మరణించారు. ట్రైన్ ఉదయం బెజవాడ చేరేవరకూ ఎవరికీ తెలియలేదు. మా నాన్నగారు కూడా వేరే కంపార్ట్మెంట్ లో ప్రయాణం చేస్తున్నారు. బెజవాడ స్టేషన్ లో మాస్టారు దగ్గరుండి ఆ బాడీని మద్రాస్ తరలించడానికి కావలసిన ఏర్పాట్లు చేయించారట.

 

తబలా ప్రసాద్ మాస్టారి దగ్గర చాలా కాలమే పనిచేశాడు. కంపోజింగ్ లు రిహార్సల్స్ బయట ఊళ్ళ కచేరీలు అన్నిటికీ వచ్చేవాడు. మాస్టారి పార్టీలో అతి చిన్న కుర్రవాడు ప్రసాద్. చాలా ఛలాకీగాఅందరినీ తన చిలిపి చేష్టలతో ఏడిపిస్తూ అల్లరి చేసేవాడు. తన సెన్స్ ఆఫ్ హ్యూమర్ తో అందరినీ తెగ నవ్వించేవాడు. అతని అరవ తెలుగు వినడానికి తమాషాగా వుండేది. కానీ తబలా వాద్యం విషయానికొచ్చేసరికి తెగ విజృంభించేవాడు. ఆ వేళ్ళలోని స్పీడ్పట్టుహావభావాలు సామాన్య శ్రోతలకు బహు ఆకర్షణగా వుండేది. ప్రసాద్ గురుముఖతా ఎవరి దగ్గరా తబలా నేర్చుకోలేదనే విన్నాను. తండ్రిఅన్నలే అతని గురువులు. అతని తబలా వాదనానికి అందరూ ముచ్చటపడేవారు.

 

ప్రసాద్  ఘంటసాల మాస్టారి కంపోజింగ్ లకు వచ్చేవాడు. కంపోజింగ్రిహార్సల్స్ వరకు బాగా వాయించేవాడు. మాస్టారు కూడా మెచ్చుకునేవారు. అతను వెంటనే రెండు చేతులూ జోడించి మాస్టారితో గుసగుసగా "ప్రొడ్యూసర్ కు చెప్పి మరో పది రూపాయలు ఎక్కువచేసి ఇవ్వండి" అనేవాడు. అందరూ అతని మాటలకు పగలబడి నవ్వేవారు. అలాగేమాస్టారి దగ్గర ఎక్కువ చీవాట్లు తినేది అతనే.  రికార్డింగ్ థియేటర్లో మానిటర్ చూసే సమయానికి నడక మార్చేసేవాడు. కంపోజింగ్ రిహార్సల్స్ లో వాయించింది కాకుండా మరేదో కొత్త నడక వాయించేవాడు. "ఒరే నాయనా ! ఇది కాదురాముందు అనుకున్నది వాయించరా ! టైమ్ వేస్ట్ చేయకురా!" అని మాస్టారు సౌండ్ ఇంజనీర్ రూమ్ లో నుండి గట్టిగా కేకెట్టేవారు.  బదులుగా "ఆ నడకే మాస్టారుఇది" అంటూ దబాయించేవాడు. కొంతసేపు పక్కనున్న డోలక్ వాళ్ళోరిథిమ్ ప్లేయర్సో వాయించి చూపాక ఒరిజినల్ నడకకు వచ్చేవాడు. ఇది అల్లరివల్ల కొంత, శ్రుతజ్ఞానంతో సంపాదించిన విద్యవల్ల కొంత అని పెద్దలు అభిప్రాయపడేవారు. కానీ ప్రసాద్ తన తబలా వాదనంతో పాటలకు ప్రత్యేక సొబగులు తెచ్చినమాట మాత్రం ఖాయం. మాస్టారిలాగే ప్రసాద్ వున్నచోట వాతావరణం చాలా లైవ్లీగా వుండేది.  ప్రసాద్ మీది ఆకర్షణతోనే నేను చాలా రికార్డింగ్ లకు రీరికార్డింగ్ లకు వెళ్ళాను. అతనికి ఘంటసాల మాస్టారంటే విపరీతమైన భక్తి వుండేది. క్రమక్రమేణా ప్రసాద్ చాలా బిజీ అయిపోయాడు. నాలుగు భాషల మ్యూజిక్ డైరక్టర్స్ అంతా ప్రసాద్ లేకుండా రికార్డింగ్ లు చేసేవారు కాదు. రోజుకు మూడు కాల్షీట్లు పనిచేసేవాడు. దీనివలన ఘంటసాలవారి కంపోజింగ్ లకురిహార్సల్స్ కు సమయానికి రాలేకపోయేవాడు. రికార్డింగ్ లకు మాత్రం హాడావుడి హడావుడి గా వచ్చిపోయేవాడు. అతను తబలా ముందు కూర్చుంటే మాత్రం పులే. తర్వాతఅతని స్థానంలోకి జడ్సన్ తబలాకుసుబ్బారావు డోలక్ కు వచ్చారు. ఆ ఇద్దరు కూడా మాస్టారి దగ్గర చాలా ఏళ్ళే పనిచేశారు.


మా నాన్నగారు తబలా ప్రసాద్ ను దృష్టిలో పెట్టుకొని రాసిన ఒక పెద్ద కథ "వాద్యగోష్ఠి"  చందూర్ గారి 'జగతిపత్రిక లో ప్రచురితమైంది. ప్రసాద్ కు తెలుగు చదవడంరాయడం తెలియదు. మా నాన్నగారు ఇచ్చిన ఆ పుస్తకాన్ని తాను వెళ్ళిన ప్రతీ చోటా చూపించి 'సంగీతరావుగారు నా మీద కథ వ్రాసారుఅని అందరికీ చెప్పి తెగ మురిసిపోయాడు.

 

అలాటి తబలా ప్రసాద్ ను 1974 తర్వాత కొన్ని దశాబ్దాల పాటు చూడనేలేదు. తర్వాతనా ప్రోద్బలంతో టివికె శాస్త్రిగారు మా మద్రాస్ తెలుగు అకాడెమీ వేదికల మీద రెండుసార్లు  ప్రసాద్  తబలా సోలో ప్రోగ్రామ్స్ పెట్టించారు. అప్పుడే అతనిని చూడడం. మనిషి బాగా మారిపోయాడు. చాలా సన్నగా వుండే మనిషి కొంచెం లావయ్యాడు. పట్టు లుంగీపట్టు షర్ట్నాలుగు వేళ్ళకూ ఉంగరాలు,మెడలో చైన్లుకున్నక్కుడి వైద్యనాథన్ స్టైల్ లో నుదురంతటికీ పెద్ద కుంకుమ బొట్టుతో వచ్చాడు. మనిషిలో అదే చైతన్యం. ముఖంలోమాటలో అదే చైతన్యం. అతనికి ప్రజలను ఎలా ఆకర్షించాలోవారికి ఏది వినిపిస్తే మెస్మరైజ్ అవుతారో ఆ పట్లన్నీ బాగా తెలుసు. మా వేదిక మీద పాల్గొన్నరెండు సార్లూ ప్రసాద్ ఘంటసాల మాస్టారు చెప్పిన ఒక ఉదంతాన్నే తబలామీద వాయించి చూపించి ప్రేక్షకులను తెగ నవ్వించాడు. దీనిని తన టివి షోలలో కూడా ప్రదర్శించేవాడు.

 ఆ కథ ఏమిటంటే -

 ఘంటసాల మాస్టారు 1958-59 లలో 'సతీ సుకన్యఅనే సినిమా కు సంగీతం నిర్వహించారు. ఆ సినిమాషూటింగ్పాటలు కంపోజింగ్ అన్నీ మైసూర్ ప్రీమియర్ స్టూడియోలోనే జరిగాయి. ఆర్కెష్ట్రా కూడా అక్కడివారేనని విన్న గుర్తు. పాటల కంపోజింగ్ కు ఘంటసాల మాస్టారు మైసూరు వెళ్ళినప్పుడు పాటల కంపోజింగ్ కు ఒక తబలా విద్వాంసుడిని ఏర్పాటు చేసారట. కానీ ఆయనకు సినీమాలలో పాటలకు వాయించే అలవాటుఅనుభవం లేదని తెలిసిందట. ఎలాగో అతనితోనే గడుపుకున్నారట. పాటల కంపోజింగ్ సమయంలో మాస్టారి ట్యూన్స్ కు ఆ తబలా విద్వాంసుడు ఎలాటి  హావభావాలతో వాయించాడో అవన్నీ చాలా స్వారస్యంగా మాస్టారు మద్రాసు వచ్చాకతన కంపోజింగ్ ల సమయంలో నటించి చూపించి అందరినీ వినోదపరిచారట. ఆ సంఘటననే ప్రసాద్ మా వేదికమీద తన తబలా సహాయం తో మిమిక్రీ చేసి చూపించాడు. ఏ హాస్యనటుడికి దొరకనంత రెస్పాన్స్ తబలా ప్రసాద్ కార్యక్రమానికి లభించింది.

 

అలాగే రీరికార్డింగ్ల సమయంలో ప్రసాద్, చిదంబరం  ఎస్.జయరామన్ అనే తమిళ గాయకుడిని మహాబాగా ఇమిటేట్ చేసి చూపేవాడు. అందుకోసం ముందుగా వైలినిస్ట్ చిత్తూర్ సుబ్రమణ్యంగారి స్టీల్ డబ్బాలోని తామలపాకులుసీవల్ అన్నీ నోటినిండా దట్టించి నములుతూ ఆ లాలాజలం నిండిన నోటితో సి.ఎస్.జయరామన్ పాత పాటలు పాడేవాడు. జయరామన్ గొంతు తాంబూలం వేసుకొని పాడినట్లుగా వుండేది. విశ్వనాథన్ రామ్మూర్తి సంగీతంలో శివాజీ గణేశన్ కు 'పుదయల్ అనే సినీమాలోని ఒక హిట్ సాంగ్ ను ప్రసాద్ మిమిక్రి చేస్తూ అందరినీ తెగ నవ్వించేవాడు.

 

తబలా ప్రసాద్ కు దాదాపు 77 ఏళ్ళు వచ్చేసాయి. అయినా మనిషిలోని ఆ పాత ఉత్సాహం అలాగే వుంది. ఘంటసాల మాస్టారి మీది భక్తితో ఇప్పటికీ అప్పుడప్పుడు రతన్ను కలియడంలేదా ఫోన్ లో మాట్లాడడం చేస్తూంటాడు.


మార్చ్ 7, 2019
 

తబలా ప్రసాద్ అనే ఉరిమి లలితా ప్రసాద్

సినీమాలకు ఏనాడో దూరమైపోయిన మానాన్నగారిని ఆమధ్య తబలా ప్రసాద్  కలుసుకొని ఆప్యాయంగా మట్లాడి కొంతసేపు గడిపాడు. అది ఆనాటి వ్యక్తుల మధ్య వుండే స్నేహానురాగాలుభక్తి విశ్వాసాలు అవన్నీ  ఈ తరం వారికి రుచి చూపించడం కోసమే ఈ 'నెం.35ఉస్మాన్ రోడ్'.

 💥కొసమెరుపు💥

ఘంటసాల సావిత్రమ్మగారికి అక్క చెల్లెళ్ళు చాలామందే వుండేవారు. తోడబుట్టినవారు కొందరైతే ఆవిడ సాన్నిహిత్యంతోరావమ్మలాటి  చెల్లెళ్ళు మరి కొందరు.  ఆ జాబితాలోకి కొత్తగా మరో ఇద్దరు - అక్కాచెల్లెలు వచ్చి చేరారు. మోహినికుమారి. తెలుగువారే. సావిత్రమ్మగారి స్నేహ బృందమూ పెద్దదే. బెంగుళూరు సరోజినిగారి కుటుంబంనెల్లూరి పవని నిర్మల ప్రభావతి (ప్రముఖ రచయిత్రి)గారి కుటుంబం ఘంటసాల కుటుంబానికి మంచి ఆప్తులు. వీరందరి రాకపోకలతో 'నెం.35, ఉస్మాన్ రోడ్సదా కళకళలాడుతూవుండేది. 

ఆ విశేషాలన్నీ వచ్చే వారమే...

 🌿

ఆ ఇద్దరూ మంచి మిత్రులే. అన్నగారి అనుయాయులే. ఘంటసాల మాస్టారికీ సన్నిహితులే. ఆ ఇద్దరూ కలసి అన్నగారితో ఒక మంచి చిత్రం తీసి రాష్ట్రపతి బహుమానం కూడా పొందారు. ఆ తర్వాత ఆ ఇద్దరూ విడిపోయి వేర్వేరు కుంపట్లు పెట్టుకున్నారు.

ఆ విశేషాలన్నీ వచ్చే వారం...

ఈలోగా  ఆ రెండు కుంపట్ల వారెవరో మీరూ కాస్తా ఆలోచించండి....

 

              సశేషం...


*With a view to make the narrative more authentic and to corroborate it, images, audio and video clips are attached at appropriate places. If such usage is found objectionable to the copyright holders the same shall be removed if and when notified.

2 comments:

S v మహేష్ బాబు said...

ఘంటసాల మాస్టారు గారి సంగీత ప్రయాణంలో వారితో కలిసి నడిచిన ఎందరెదరో కళాకారుల గురించి.... వారందరికీ పరస్పరం ఉండిన ఆదరాభిమానాల గురించి.... ఆచారి త్రయం గారి గురించి... తబలా ప్రసాద్ గారి గురించి ఎన్నో విషయాలు చాలా చక్కగా వివరించారు..... ఇన్ని సంవత్సరాలు గడిచిన తరువాత కూడా ఇంత మంది పేర్లు గుర్తు పెట్టుకుని ఇంత విపులంగా ఓపికగా మాతో ఈ విషయాలన్నీ పంచుకుంటున్నందుకు మీకు శతకోటి ధన్యవాదములు మరియు కృతజ్ఞతాభివందనాలు స్వరాట్ బాబాయ్ గారూ 👏👏👏👏👏👌👌👌👌👌🙏🙏😊😊💐💐🍉

P P Swarat said...

ధన్యవాదాలు