visitors

Sunday, June 20, 2021

నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 2 - ముఫ్ఫై ఆరవ భాగం

20.06.2021 - ఆదివారం భాగం - 36:
అధ్యాయం 2  భాగం 35 ఇక్కడ


నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్

1957 - 2021
🌿

మా ఆత్మీయ కుటుంబ సభ్యుడుఅభిమానులను, సన్నిహితులను దుఃఖంలో ముంచి అర్ధారంతరంగా వెళ్ళిపోయిన శ్రీ ఘంటసాల వెంకట రత్నకుమార్ కు మా హార్దిక శ్రధ్ధాంజలి.

💐💐💐

మా పక్కిల్లు, నెం.36, ఉస్మాన్ రోడ్, రాజగోపాలన్ మామా ఇంటి మేడమీదకు ఒక తెలుగు కుటుంబం అద్దెకు వచ్చారు. ఆ కుటుంబ పెద్ద పేరు మండా బుచ్చి రామారావుగారు. ఆర్మీ ఇంజనీర్. ఎక్కడో నార్త్ నుండే ట్రాన్సఫరై మద్రాసు వచ్చారు. వారికి ఇద్దరు ఆడపిల్లలు. పెద్దమ్మాయి బి.ఎస్.సి.  తిరుపతిలో, చిన్నమ్మాయి పి.యు.సి మద్రాస్  కాలేజీలో  జాయిన్ అయ్యారు. మాకు ప్రక్కనే మరో తెలుగు కుటుంబం రావడం మా అందరికీ ఆనందం కలిగించింది. ఆ కుటుంబంలోని వారంతా చాలా కలివిడిగా, స్నేహపూర్వకంగా వుండడంతో ఆ అక్కచెల్లెళ్ళిద్దరూ నెం.35, ఉస్మాన్ రోడ్ లోనే వుండేవారు. ఘంటసాల మాస్టారు ఇంట్లో లేని సమయంలో వచ్చి అమ్మగారితో కబుర్లు చెప్పేవారు. వాళ్ళకు సావిత్రమ్మగారితో మంచి స్నేహం కుదిరింది. 

 

పెద్దమ్మాయి తిరుపతిలో హాస్టల్ లో వుండి చదువుకుంటూ శని ఆదివారాలలోశెలవుల్లో మద్రాసు వచ్చేది. ఆ అమ్మాయితో పాటూ అక్కడ ఎమ్.బి.బి.ఎస్ చేస్తున్న ఆమె స్నేహితురాలు కూడా మద్రాసు వచ్చి శెలవులన్నీ వీరితో గడిపేది. ఆ అమ్మాయిది విజయనగరం. మా విజయనగరానికి సంబంధించిన అమ్మాయే అనేసరికి, వాళ్ళెవరో నాకు తెలియకపోయినా  నాకు చాలా సంతోషం కలిగింది. తండ్రి విజయనగరంలో ఓ సినీమా హాలు' ఓనర్ అని చెప్పిన గుర్తు. రాజకీయ పలుకుబడి కూడా వుందనుకుంటాను. ఆ ముగ్గురికి అన్నదమ్ములు లేకపోవడం వలన నన్ను, పెద్దబాబు విజయకుమార్ ను, మాస్టారింట్లోని నరసింగని తమ అన్నదమ్ముల్లాగనే అభిమానంతో చూసుకునేవారు. మేమూ తరచు వాళ్ళ మేడమీద క్యారమ్స్ లాటి గేమ్స్ ఆడేవాళ్ళం.


రామారావు గారిని ఆఫీస్ కు తీసుకువెళ్ళడానికి ఆర్మీ వ్యాన్ వచ్చేది. ఫోర్ట్ సెయింట్ జార్జ్ లో ఆఫీస్. సాయంత్రం ఆరు లోపలే ఇంటికి చేరేవారు. ఆ దంపతులిద్దరూ కూడా మేమంటే ఎంతో ప్రేమ చూపించేవారు. ఆయన ఆదివారం శెలవు రోజున ఘంటసాల మాస్టారితోనూ, సావిత్రమ్మగారితోనూ ముచ్చటించేవారు.

 

మండా బుచ్చి రామారావు గారితో మొదట్లో మాకు కలిగిన ఒక అనుభవం ఎప్పటికీ మర్చిపోలేను. అదేమిటంటే ---

 

రామారావు గారికి అరవం మట్లాడడం రాకఒక రోజు నన్ను, నరసింగడిని పిలిచి ఒక నలభై పేజీల రూల్డ్ నోట్ బుక్ కొనితెమ్మని డబ్బులు ఇచ్చారు.  వారింటి తర్వాత రెండిళ్ళకు ఎదురుగా ఒక ప్రొవిజన్ స్టోర్ వుండేది. అందులో స్టేషనరీ ఐటెమ్స్ కూడా దొరికేవి. మేము ఐదు నిముషాలలో ఆయన అడిగిన పుస్తకం కొని తెచ్చి ఇచ్చాము. ఆయన ఆ పుస్తకాన్ని నాలుగు పక్కలా చూసి అట్ట నలిగిపోయిందయ్యా అంటూ ఒక్కొక్క పేజీ లెఖ్ఖపెట్టడం మొదలుపెట్టారు. అన్ని పేజీలు లెఖ్ఖపెట్టి ఇందులో నలభై పేజీలు పూర్తిగాలేవు, ముఫ్ఫైఎనిమిదే వున్నాయి. ఇది ఇచ్చేసి పూర్తిగా నలభై పేజీలున్న పుస్తకం పట్రండి. వెళ్ళండి అన్నారు. మళ్ళీ ఆ పుస్తకం ఇచ్చేసి మరో మంచి పుస్తకం ఇవ్వమని అడిగాము. ఆ దుకాణం చెట్టియార్ మాకు పరిచయం వుండడం వలన మరో పుస్తకం ఇచ్చాడు. మేము అక్కడే ముందునుంచి చివర వరకు అన్ని పేజీలు లెఖ్ఖపెట్టాము. అందులోనూ ముఫ్ఫైఎనిమిది పేజీలే వున్నాయి. నలభైపేజీలు లేవు. ఆ కొట్టతను చెప్పిందేమిటంటే ముందు వెనక అట్టలకి అంటించిన పేజీలతో కలిపి నలభై పేజీలుగా పుస్తకాలు వేస్తారు.  అరవై పేజీలంటే ఏభై ఎనిమిది, ఎనభై పేజీలంటే డెభ్భై ఎనిమిది పేజీలుంటాయనిమీరే పుస్తకం కొన్నా అంతేనని చెప్పాడు. కావాలంటే మరో షాపులో కొనమని డబ్బులు తిరిగి ఇచ్చేసాడు. అదే విషయాన్ని రామారావు గారికి చెప్పాము. మిమ్మల్ని వాడు మోసం చేస్తున్నాడు. నేను రేపు ఆఫీస్ నుండి వచ్చేప్పుడు పూర్తిగా నలభై పేజీలున్న పుస్తకం కొని తెస్తాను చూడండని ఇచ్చిన డబ్బులు జేబులో వేసుకున్నారు. ఆ తర్వాత రామారావుగారు కొన్న పుస్తకము మాకు చూపించనూ లేదుమేము అడగనూ లేదు.

 

ఆయనకు శెలవు దినాలలో వచ్చి సావిత్రమ్మగారితో మాట్లాడేవారు. తన కుటుంబ కష్ట సుఖాలుసమస్యలు ఆవిడతో చెప్పేవారు. "ఇందిరాగాంధీ, లిండన్ జాన్సన్ల (అప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్ గా లిడన్ జాన్సన్, భారతదేశ ప్రధానమంత్రిగా శ్రీమతి ఇందిరాగాంధీ వుండేవారు) శిఖరాగ్ర సమావేశం జరుగుతోంది ఎవరూ డిస్టర్బ్ చేయకండని ఇంట్లోవాళ్ళు సరదాగా అనుకునేవారు.  


మండావారి కుటుంబం మా పక్కింట్లో సుమారు మూడేళ్ళపాటు వున్నారనుకుంటాను. తర్వాత మళ్ళీ వేరే చోటికి ట్రాన్స్ఫరై వెళ్ళిపోయారు.

 

ఆ తర్వాత కొన్నేళ్ళకు 1972 లో నేనుమా ఆవిడా  మా దొడ్డమ్మగారి అమ్మాయి శారదక్కను చూడడానికి ఒరిస్సా బోర్డర్ లోని పాతపట్నం వెళ్ళినప్పుడు అక్కడ అనుకోకుండా రోడ్ మీద రామారావు గారుఆయన భార్య కనిపించారు. ఆ ఇద్దరూ అలాగే వున్నారుఏ మార్పులేదు. అదే ఆప్యాయతతోఅభిమానంతో  పలకరించి మట్లాడారు. ఆ పాతపట్నంలో వారికేవో పంట భూములున్నాయని వాటి వ్యవహారాలు చూసుకుందుకు వచ్చామని చెప్పారు. పెద్దమ్మాయి పెళ్ళయి బొంబాయిలో వుందని, అల్లుడు ఏదో బ్యాంకులో మేనేజర్ అని చెప్పారు. రెండో అమ్మాయి పూనాలో వుంటోందని అన్నారు. వివరాలు ఆయన చెప్పనూలేదు. మేమూ అడగలేదు. అంతే ఆ తర్వాత వారిని మళ్ళీ చూడడం జరగలేదు. కానీమరికొన్నేళ్ళకు వారమ్మయిలను మాత్రం ఘంటసాలవారింట్లో ఒక అమ్మాయి పెళ్ళికి వచ్చినప్పుడు చూశాను. అక్కడితో ఆ కుటుంబంతో స్నేహం ముగిసింది.


ఘంటసాల మాస్టారు చాలా సహృదయులు. తనకు చేతనైనంత వరకూ ఇతరులకు సహాయంచేసేవారు. 'నెం.35,ఉస్మాన్ రోడ్' మేడమీది భాగం పునర్నిర్మాణం జరుగుతున్నప్పుడే మేముంటున్న ఔట్ హౌస్ డాబా మీద ఒక 'కొట్టాయ్వేయించారు. (కొబ్బరాకులశాల. ఆంధ్రా ప్రాంతాలలో ఇళ్ళకు తాటాకు లేదా చొప్ప వాడతారు. ఇక్కడ దక్షిణాదిన కొబ్బరాకుల మట్టలు అల్లి వాటిని పైకప్పుగా వేస్తారు)

 

నాకు తెలిసి మా డాబామీది కొట్టాయిలో ముందుగా భద్రంగారి కుటుంబం ప్రవేశించింది.  భద్రంగారు విజయనగరం మ్యూజిక్ కాలేజీలో మా తాతగారి శిష్యుడు. స్వస్థలం కొవ్వూరు అనుకుంటాను. గాయకుడు కావాలని మద్రాసు వచ్చి అందులో తగిన ప్రోత్సాహం లభించక ఘంటసాల మాస్టారి సలహాప్రోద్బలం మేరకు వైలిన్ ప్రాక్టీసు చేసి మాస్టారి ఆర్కెష్ట్రాలో, కచేరీలలో చోటు సంపాదించారు. తన భార్యముగ్గురు చిన్న పిల్లలతో ఆ కొట్టాయిలో కాపురం వుండేవారు. 35, ఉస్మాన్ రోడ్ రాశి ఏమిటో కానీ, ఆ భవనం ఎప్పుడు పిల్ల పాపల కేరింతలతో, ఆటపాటలతో మహా సందడిగా వుండేది. భద్రంగారికి ఒక ఆడపిల్ల? ఇద్దరు మగపిల్లలు - బాలచంద్ర, జయచంద్ర అని గుర్తు. పిల్లలిద్దరూ సినీ ఆర్కెస్ట్రాలలో వైలనిస్ట్లుగా స్థిరపడ్డారు. వీళ్ళంతా వయసులో నాకంటే బాగా చిన్నవాళ్ళు.


భద్రంగారు పొగచుట్టలు చుట్టడంలో సిద్ధహస్తులు. అయితే ఆయనకు పొగత్రాగే అలవాటు లేదు. ఘంటసాల మాస్టారికి నెలకు సరిపడా భద్రంగారే చుట్టలు చుట్టేవారు. మాస్టారి స్నేహితుడు గోసాల రామదాస్ వచ్చినప్పుడల్లా చేబ్రోలు పొగాకు తెచ్చేవారు. దానితోనే మాస్టారి చుట్టలు తయారయేవి. రోజుకు మూడు మాత్రమే కాల్చేవారు. 


ఒకసారి ఎప్పుడో ఇంట్లోని చుట్టలు అయిపోతే పాండీబజార్ ఆంధ్రా కిల్లీ షాప్ నుండి  దొరలు కాల్చే స్పెన్సర్ చుట్టలు కొన్ని కొని తెచ్చాను. కానీ అవి మాస్టారికి అంతగా నచ్చలేదు. 

 

భద్రంగారు వైలిన్ సాధన మొదలుపెట్టిన కొత్తల్లో తన చేతి వ్రేళ్ళకు ఏ కష్టమైన పని పెట్టేవారు కాదు. చాలా సుకుమారంగా జాగ్రత్తగా చూసుకునేవారు. వైలినిస్ట్ కు తన వేళ్ళే ప్రధానం అని చెప్పేవారు. భద్రంగారు వైలినిస్ట్ అయ్యారు కానీ ఏస్ వైలినిస్ట్ కాలేకపోయారు. కొన్నేళ్ళ తర్వాత భద్రంగారు నెం. 35, ఉస్మాన్ రోడ్ వదలి వళసరవాక్కం వెళ్ళిపోయారు.

 

మా ఔట్ హౌస్మీది కొట్టాయిలోకి బలి నారాయణ వచ్చారు. బలి పామర్తిగారి అన్నకొడుకు. పామర్తిగారు అతని సంరక్షణ భారం వహించి మద్రాసు తీసుకువచ్చారు. పామర్తిగారు అతనికి ఒక డోలక్ కొనిచ్చి శిక్షణ ఇచ్చారు. బలి గంటల తరబడి ఆ డోలక్ మీద సాధన చేయడం గుర్తుంది. వారికీ ఇద్దరు పిల్లలు. బలి మామగారు వెంపటి ముక్తేశ్వరరావుగారు మార్దంగీకుడు. ప్రముఖ కూచిపూడి కళాకారుల నృత్యాలకు మృదంగం వాయించేవారు. అలాగేసినీమాలలో వచ్చే కూచిపూడి నృత్య దృశ్యాలలో మృదంగం వాయిస్తూ కనపడేవారు. బలి ఒక మరదలి కొడుకు కొన్నేళ్ళక్రితం వరకూ తెలుగు టివి సీరియల్స్ లో నటించేవాడు. పేరు రాజేష్ అనుకుంటాను. బలి మొదట్లో మాస్టారివద్ద, పామర్తిగారివద్ద రిథిమ్ సెక్షన్లో  పనిచేసేవారు. క్రమేపి బలి నారాయణగారికి  అప్పారావుతో స్నేహం పెరిగింది. ఎప్పుడైతే అప్పారావు చక్రవర్తిగా మారారో అప్పుడే బలి నారాయణ దశ కూడా తిరిగింది.  చక్రవర్తి ఆర్కెష్ట్రా అరేంజర్గా బలి బాగా అభివృధ్ధిలోకి వచ్చారు. 


నెం.35, ఉస్మాన్ రోడ్ మేడ మీది భాగం పూర్తి అయ్యాక మాస్టారి కుటుంబం అంతా మేడమీదకు షిప్ట్ అయ్యారు. మా ఔట్ హౌస్ వేపునుండి కూడా మేడమీదకు వెళ్ళడానికి మెట్లు పెట్టించారు. బయటనుండి వచ్చేవారికి ముందువేపు మెట్లు, ఇంట్లోవారికి వెనకవేపు మెట్లు ఉపయోగంలో వుండేవి. అప్పుడే  రికార్డ్ ర్యాక్స్ తో కొత్త రేడియోగ్రామ్, కొత్త సోఫా సెట్ వంటివి ఇంట్లో అమరాయి. ఘంటసాల మాస్టారు ఆడంబరం, ఆర్భాటాలకు దూరం. ఆయనను అనుసరించే సావిత్రమ్మగారు కూడా తమ కుటుంబాన్ని నిరాడంబరంగా సామాన్య మధ్య తరగతి కుటుంబంలా నిర్వహించేవారు. గృహాలంకరణ, పిల్లల వేషభాషలు అన్ని సామాన్యంగానే వుండేవి. ఇతర సినిమా వాళ్ళ ఇళ్ళలో వుండే హంగుఆర్భాటాలు ఏవీ ఘంటసాలవారింట్లో కనపడేవికావు. అందువల్లనే నాలాటివాడు ఆ ఇంట్లో చనువుగా మసలడానికి వీలయింది.

 

మాస్టారి కుటుంబం మేడమీదకు వెళ్ళాక క్రింది పోర్షన్ లో ముందుగా ఒక మార్వాడి కుటుంబం అద్దెకు వచ్చారు. అప్పటినుండి నేను పోర్టికోలో కాలక్షేపం చేయడం తగ్గిపోయింది. 

నేను ఒక వేసవి శెలవులకు మద్రాసు వచ్చేప్పటికి ఘంటసాల మాస్టారింటి క్రింది పోర్షన్ లో నుండి తెలుగు మాటలు వినవచ్చాయి. అప్పుడే నాకు తెలిసింది, అంతవరకు వున్న మార్వాడీ కుటుంబం ఖాళీచేసి వెళ్ళిపోయారని. ఒక తెలుగు కుటుంబం వచ్చింది. వారు ఆ ఇంటికి వచ్చిన వేళా విశేషం, ఈ నాటి వరకు ఆ కుటుంబంతో మాకు స్నేహ బాంధవ్యం నిరాటంకంగా కొనసాగుతూవుంది. వారే కొల్లూరి వెంకటేశ్వరరావుగారు. వారు ఆ ఇంటికి వచ్చేసరికి మా లోగిట్లో పిల్లల సంఖ్య మరో ముగ్గురికి పెరిగింది. ముగ్గురూ ఆరేళ్ళ నుండి మూడేళ్ళ లోపువారే. వీరంతా మా కుటుంబాలతో ఏ అరమరిక లేకుండా కలసిపోయి తమ మమతానురాగాలను సరిసమానంగా పంచుకున్నారు.

 

వెంకటేశ్వరరావుగారు విద్యాధికుడు. ఛార్టర్డ్ ఎక్కౌంటెంట్కాస్ట్ ఎక్కౌటెంట్ వంటి అనేక విద్యార్హతలుండేవి. అంబత్తూర్  ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో వుండే 'వావిన్ ఇండియా' ప్లాస్టిక్ పైప్స్ లో కంపెనీ సెక్రెటరి. రావుగారి తమ్ముడిని వాళ్ళ పిల్లల్లాగే శాస్త్రిబాబు అని మేమంతా పిలిచేవాళ్ళం. అతను అన్నగారి వద్ద వుంటూ మద్రాస్ లో సి.ఎ. కోర్స్ చదువుతూండేవాడు. మనిషి దబ్బపండు రంగులో చాలా హ్యాండ్సమ్ గా వుండేవాడు. చిన్న పిల్లలను ఎలా హ్యాండిల్ చేయాలో అతనికి బాగా తెలుసు. కొల్లూరివారు వచ్చాక పోర్టికో మళ్ళీ నా సొంతమయింది.


"దేశభాషలందు తెలుగు లెస్స" అనే నానుడి శ్రీనాథుడి కాలంనుండే ప్రచారంలో వున్నా కన్నడ ప్రభువు, 'ఆంధ్రభోజ', 'మూరురాయయగండరుబిరుదాంకితుడైన కవిదిగ్గజం శ్రీకృష్ణ దేవరాయలు మరొక్కసారి తెలుగు భాషా ఔన్నత్యాన్ని నొక్కి వక్కాణించాడు. కళాపోషకుడిగా దిగ్గజాలవంటి ఎనిమంది ఉత్తమ కవులను తన కొలువులో వుంచి సాహిత్యాభివృధ్ధికి ఎనలేని సేవచేశాడు. భారతావనిలోనే అతి పెద్ద సామ్రాజ్యాన్ని విస్తరింపజేసిన గొప్ప చక్రవర్తి శ్రీకృష్ణ దేవరాయలు. ఆ కృష్ణదేవరాయలు ఔన్నత్యానికి అడుగడుగునా కృషి చేసిన స్వామిభక్తి పరాయణుడు సాళువ తిమ్మరుసు. రాయలవారి ప్రధానమంత్రి. తెలుగువాడు. నియోగి బ్రాహ్మణుడు. తిమ్మరుసు మంత్రాంగమే లేకుంటే కృష్ణదేవరాయల చరిత్రే లేదు. అటువంటి గొప్ప రాజతంత్రవేత్త  తిమ్మరుసు కధ 1962 లో "మహామంత్రి తిమ్మరుసు" పేరిట గౌతమీ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద నర్రా రామబ్రహ్మం, అట్లూరి పుండరీకాక్షయ్యలు నిర్మాతలుగా విడుదల చేశారు. టైటిల్ రోల్ ను గుమ్మడి, కృష్ణదేవరాయలుగా ఎన్.టి.రామారావు అత్యద్భుతంగా నటించి తెలుగులో ఒక గొప్ప కళాఖండాన్ని సృష్టించారు. కమలాకర కామేశ్వరరావు దర్శకుడు. పెండ్యాల నాగేశ్వరరావు సంగీతదర్శకుడు. సంగీత సాహిత్యాల కలబోతగా తయారైన ఈ చిత్రం ఘన విజయంలో  గాయకుడిగా ఘంటసాల మాస్టారి పాత్ర కూడా వుంది. ఈ చిత్రానికి  ఉత్తమ తెలుగు చిత్రంగా నేషనల్ అవార్డ్ కూడా లభించింది. ఈ చిత్రం తర్వాత నిర్మాతలు ఎన్.రామబ్రహ్మం, ఎ.పుండరీకాక్షయ్య మరల కలసి మరే చిత్రమూ నిర్మించినట్లు లేదు. ఐదేళ్ళ తర్వాత 1967లో ఈ ఇద్దరు నిర్మాతలు వేరే వేరే కుంపట్లు పెట్టుకొని రామబ్రహ్మంగారు 'నిర్దోషి' చిత్రాన్ని, పుండరీకాక్షయ్యగారు 'శ్రీకృష్ణావతారం' చిత్రాలను విడుదల చేసారు. ఒకటి సాంఘికం. మరొకటి పౌరాణికం. ఈ రెండు చిత్రాలకు అన్నగారే హీరో. రెండూ ఘనవిజయం సాధించాయి. ఈ నిర్మాతలు ఇద్దరూ పోటీలు పడి ఒకేసారి విడుదల చేయకుండా  తెలివిగా ఆరు మాసాల వ్యవధిలో విడుదల చేసారు. నిర్దోషికి ఘంటసాల మాస్టారు సంగీత దర్శకుడు. శ్రీకృష్ణావతారం సినీమాకు టి.వి. రాజుగారు సంగీత దర్శకుడు. ఈ రెండు చిత్రాల విజయానికి ఘంటసాలవారి గాన ప్రతిభ ఎంతగానో దోహదం చేసింది.

నిర్దోషి , శ్రీకృష్ణావతారం సినీమా పాటల ముచ్చట్లు...

ఇప్పుడు కాదు.... వచ్చేవారమే...

...సశేషం




2 comments:

Patrayani Prasad said...

🕉🙏🙏శ్రీ అన్నయ్యకు నమస్కారములు🙏🙏, ఈ భాగం లో, నాకు ఇప్పటివరకు తెలియని అనేక విశేషాలు తెలుసో గలిగాను. చాలా బాగా వివరంగా చదువరులకు ఆకర్షణీయంగా ఉండే విధంగా వ్రాయ గలుగుతున్నావు.చాలా బాగుంది. తరువాయి భాగం చదవడానికి ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తున్నాను. ధన్యవాదాలు- పట్రాయని ప్రసాద్. గురుగ్రామం.హర్యానా రాష్ట్రం, తేదీ:20-06-2021,ఆదివారం.🔯

ameerjan said...


నోటు బుక్కుల పేజీల సంఖ్య వ్యవహారం మనందరికీ బాల్యంలో అనుభవైకవేద్యమే! భలే పాయింటు గుర్తు పెట్టుకుని...మమ్మల్ని అలరించారు! అలాగే శ్రీమతి ఇందిరాగాంధీ, లిండర్ జాన్సన్ల వ్యవహారమూనూ. పాత స్నేహాలు, పాత ఫ్యామిలీ ఫ్రెండ్స్ తలపుల్లోకి వస్తే...అదో మధురానుభూతి. మీ బ్లాగు ద్వారా మాకునూ అవే అనుభవాలు!

మాస్టారి మూడు చుట్టల సంగతి...మా నాన్న గారి మూడు చుట్టల విషయాన్ని గుర్తుకు చేసింది. మూడు పూటలా తిన్న తరువాత పడక కుర్చీలో చేరగిలా పడి “లంగరు” చుట్టలు కాల్చడం నాకు బాగా గుర్తు....అవీ రోజుకు మూడు మాత్రమే!!

“ కొల్లూరివారు వచ్చాక పోర్టికో మళ్ళీ నా సొంతమయింది”- ఇది మీ శైలి-మమ్మల్నిలా మీ బ్లాగు నుండి పక్కకు మరల్చనీకుండ చేసే…మీ సహజ శైలి. మళ్ళీ వచ్చే వారం మరిన్ని సినిమా ముచ్చట్ల కోసం ఎదురు చూస్తూ …ధన్యవాదాలు మాస్టారూ!!🙏🙏