visitors

Sunday, August 29, 2021

నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 2 - నలభై ఆరవ భాగం

29.08.2021 - ఆదివారం భాగం - 46*:
అధ్యాయం 2  భాగం 45 ఇక్కడ


నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్

"పూర్ణిమ" - విజయరాఘవాచారి రోడ్ లోకి ప్రవేశించగానే కుడిచేతివేపున ఆకుపచ్చ,పసుపురంగుల మిశ్రమంలో వచ్చే పచ్చ రంగులో కనిపించే అతి పెద్ద భవనం. అందులోనే USEFI (United States Education Foundation in India) ఆఫీస్. అప్పటికి మద్రాస్ మౌంట్ రోడ్ లో ఆక్స్ ఫర్డ్   ప్రెస్ కు , కెథెడ్రల్ చర్చ్ కు మధ్యనున్న అమెరికన్ కాన్స్యులేట్ బిల్డింగ్, ఆఫీసులు లేవు. అప్పుడు అక్కడ చెప్పుకోదగ్గ మాన్యుమెంట్ జెమినీ స్టూడియో ఒక్కటే. తర్వాత సఫైర్ మల్టీ థియేటర్ కాంప్లెక్స్, ఆ తర్వాత పెద్ద ఫ్లై ఓవర్ వచ్చింది. అమెరికన్ కాన్స్యులేట్ భవంతి ఏర్పడ్డాక డి.ఎన్.రావుగారి ఆధ్వర్యంలోని USEFI కూడా అందులోకి మారిపోయింది. అయితే ఆ భవంతితో నాకు ఏ అనుభవమూ లేదు.

"పూర్ణిమ"  డా.డి.ఎన్.రావుగారి ఆఫీస్ కమ్ రెసిడెన్స్.  చెట్పట్ ప్రాంతంలోని హారింగ్టన్ రోడ్ లోనుండి ఈ భవంతికి మారిపోయారు. ఈ భవంతి ప్రముఖ నిర్మాత దర్శకుడు బి.ఎన్.రెడ్డిగారి అల్లుడిదని విన్న జ్ఞాపకం. ఆ విజయరాఘవాచారి రోడ్ లో వై.ఎస్.శాస్త్రిగారి వంటి తెలుగు ప్రముఖులుండేవారు. తెలుగువారంతా ఎక్కువగా కనపడే ఆంధ్రా క్లబ్ (మర్యాదపూర్వకంగా చెప్పాలంటే  ఆంధ్రా సోషల్ & కల్చురల్ అసోసియేషన్- ఆస్కా)  ఆ రోడ్ లోనే. ఆ రోడ్ చివరకు వెళ్ళి ఎడమకు తిరగగానే బోగ్ రోడ్ లో బి.ఎన్.రెడ్డిగారి యిల్లు. టి.నగర్ లో అతి పెద్ద రోడ్లలో బోగ్ రోడ్ ఒకటి. బోగ్ రోడ్, నార్త్ బోగ్ రోడ్, సౌత్ బోగ్ రోడ్ (శివాజీ గణేశన్ భవంతి), సౌత్-వెస్ట్ బోగ్ రోడ్ అంటూ సుమారు రెండు-రెండున్నర కిలోమీటర్ల పొడుగున ఉత్తర దక్షిణాలలో వున్న మౌంట్ రోడ్ కు సమాంతరంగా అటు జి.ఎన్.చెట్టి రోడ్డు, సర్ త్యాగరాయ రోడ్డు నుంచి ఇటు వెంకట నారాయణారోడ్, సౌత్ ఉస్మాన్ రోడ్, సి.ఐ.టి.నగర్ లను కలిపే అతి పెద్ద లింక్ రోడ్. కొన్ని దశాబ్దాల క్రితం బి.ఎన్.రెడ్డిగారిని గౌరవార్ధం ఆయన ఇల్లున్న ప్రాంతానికి బి.ఎన్.రెడ్డి రోడ్ అని పేరుపెట్టారు ఆనాటి సర్కారువారు. కొన్నేళ్ళకు కొత్త సర్కారు వచ్చింది. కులాలు, మతాలు 'కడియాదు' అంటూ రోడ్ల పేర్లలోని కులాలని, మతాలని కడిగేసారు. ఆ దుమారంలో 'బి.ఎన్.రెడ్డి రోడ్' లో 'రెడ్డి' చెరిగిపోయి 'బి.ఎన్.రోడ్' మిగిలింది.  ఇప్పుడు ఆ బి.ఎన్. ఎవరన్నా కావచ్చు. ఆ రోడ్ కు ఆ పేరు పెట్టడానికి గల ఉద్దేశమే ఇప్పుడెవరికీ అక్కర్లేదు. అదే రాజకీయం.

మళ్ళీ, వెనక్కి తిరిగి 'పూర్ణిమ' లోకి వెడదాము.

USEFI భారత్- యునైటెడ్ స్టేట్స్  దేశాల విద్యార్థుల పాలిటి ఒక కల్పతరువు. ఈ రెండు దేశాలలో ఉన్నత విద్యలు అభ్యసించాలనుకునే  ఉత్తమ విద్యార్థులకు ఫుల్బ్రైట్ స్కాలర్షిప్ లను ఇచ్చి ప్రోత్సహించే సంస్థ. ఆ సంస్థ సదరన్ రీజియన్ కు డైరక్టర్ డా.డి.ఎన్.రావు. ఆయనకు డెప్యూటీ డా.(మిసెస్)షెట్టి. దక్షిణ కర్ణాటకకు చెందిన మహిళ.  ఇద్దరు సెక్రెటరీలు. ఒకరు కుప్స్ అనబడే కుప్పుస్వామి. మరొక లేడీ సెక్రటరి. ఈ USEFI సంస్థ విదేశాలలో మెడిసిన్, ఇంజనీరింగ్, సైన్సెస్ కోర్స్లు చదవాలని ఆశించే విద్యార్ధులకు  టోఫెల్, జి.ఆర్.ఇ, తో పాటు మరో రెండు మూడు టెస్ట్ లు నిర్వహించేది. ఆ పరిక్షల సమయంలో ఇన్విజిలేటర్ గా పనిచేయడానికి, మిసెస్.షెట్టికి ఆఫీస్ ఫైలింగ్ సిస్టమ్ లో సహాయకారిగా వుండడానికి తాత్కాలికంగా నన్ను తీసుకోవాలనే ఉద్దేశ్యంతో డి.ఎన్.రావుగారు నన్ను వారి ఆఫీసుకు రమ్మని మా నాన్నగారి ద్వారా కబురుపంపారు. ఈ సంగతి వినగానే నా గుండెల్లో రాయిపడింది. కారణం నాకు తెలుగు, కొంచెం కొంచెం తమిళం తప్ప మరే భాషరాదు. ఇంగ్లీషు రాయడం చదవడం తప్ప స్వేఛ్ఛగా ఇంగ్లీష్ లో మట్లాడడమనేది అసలు చేతకాదు. ఒక వాక్యం ఇంగ్లీష్ లో మాట్లాడడానికి ఓ పది నిముషాలు తెలుగులో ఆలోచించాల్సివచ్చేది. ఈ పరిస్థితులలో నేను ఆ ఫారిన్ ఆఫీస్ లో పనిచేయగలనా అనే సంకోచం. గతానుభవాన్ని బట్టి డి.ఎన్.రావుగారి ఫారిన్ స్టైల్ వేషభాషలు, ఆయన గాంభీర్యం, నిజం చెప్పాలంటే ఆయనతో మట్లాడడానికి జంకుగానే వుండేది. వాళ్ళ సంభాషణ అంతా ఎక్కువగా ఇంగ్లీష్ లోనే సాగేది. నాకు ఇండియన్స్ మాట్లాడే ఇంగ్లీష్ అయితే కొంత అర్ధమౌతుంది. ఫారినర్స్ మాట్లాడే ఇంగ్లీష్ స్లాంగ్  ఇప్పటికీ నాకు అర్ధంకాదు. గొప్పలు చెప్పుకోవడం కోసం హాలీవుడ్ సినీమాలు చూడడమే తప్ప అందులో ఒక్కమాటా ఇప్పటికీ అర్ధమై చావదు. ఈ నేపథ్యంలో నేను వాళ్ళ తృప్తిమేరకు పనిచేయగలనా? ఈ బాధలు ఎవరితో చెప్పుకోవాలి? అయినా తప్పదు. 

వెళ్ళి రావు గారిని కలిసాను. ఆయన చెప్పినవాటన్నిటిని శ్రధ్ధగావిని తలూపడం తప్ప మరేం చేయలేదు. మిసెస్ షెట్టి  చెప్పినవి చేస్తూ ఆఫీసు విధానాలు నేర్చుకోమన్నారు. అది మరో ఇబ్బంది నాకు. మా ఇళ్ళలో వుండే ఆడవారితో తప్ప బయట ఆడవారితో మాట్లాడిన సందర్భాలే లేవు. హైస్కూలులో చదివిన నాలుగేళ్ళలో, కాలేజీలో చదివిన మూడేళ్ళలో, కో-ఎడ్యుకేషనే అయినా ఏ ఒక్క ఆడపిల్లతో కలసి మాట్లాడిందేలేదు. అలాటి అవసరమూ రాలేదు. అలాటి నేను మిసెస్ షెట్టి దగ్గర ఎలా మాట్లాడి పని చేయడం. కానీ తప్పదు. ఒక పదిరోజులకు అక్కడి వాతావరణానికి అలవాటు పడ్డాను. ఇప్పటిలా ఆ రోజుల్లో కంప్యూటర్ లు లేవు. అంతా మాన్యువల్ గానే జరిగేవి. 

యూసెఫీలో  వారు కండక్ట్ చేసే పరీక్షలకు సహాయకుడిగా, డా.షెట్టి దగ్గర పని నేర్చుకుంటూ కొన్ని మాసాలు పనిచేశాను. USEFI నిర్వహించే ఫుల్ బ్రై ట్ స్కాలర్ షిప్ టెస్ట్ లు మౌంట్ రోడ్ లోని ఎడిసన్స్ కంపెనీ వారి కాన్ఫరెన్స్ హాల్ లో జరిగేవి. ఈ ఎడిసెన్స్ పక్కనే హిగిన్ బాదమ్స్, మరోపక్క గవర్నమెంట్ పబ్లికేషన్స్, ఎదురుగా రోడ్ కు అవతలవేపు ఓరియెంట్ లాంగ్మెన్స్, ఆ పక్కనే పటుల్లాస్ రోడ్ లో మాక్మిలన్ పబ్లికేషన్స్ వుండేవి. ఈ ఎడిసన్స్ ఆడిటోరియంలో పరిక్షలు వ్రాయడానికి అనువుగా  ఒక్కోక్క విద్యార్ధికి రైటింగ్ టేబిల్ అటాచ్డ్  ఛైర్స్ వుండేవి. అక్కడికి పరీక్షలు వ్రాయడానికి వచ్చేవారంతా బాగా విద్యాధికులు. ఉన్నత వర్గాలనుండి వచ్చినవారుగా ఉండేవారు. అప్పటి ఆ టెస్ట్ లన్ని అప్టిట్యూడ్ టెస్ట్లు.  పెన్సిల్ తోనే సమాధానాలు వ్రాయాలి. ఆ పరిక్షలకు హాజరయేవారికి కావలసిన ప్రశ్నా పత్రాలు అందివ్వడం చివరలో వారి దగ్గరనుండి ఆ పేపర్లు తీసుకొని నెంబర్ వారీగా సార్టౌట్ చేసి కుప్పుస్వామి కి అప్పజెప్పడం, ఇదే నా పని. విద్యార్ధులెవరితో నేనేమీ మాట్లాడకూడదు. వారేమి అడిగినా చెప్పకూడదు. ఇదొక నిబంధన.  నాకు మహదానందం.  Of course అంతకంటే కావలసింది ఏముంది. అప్పట్లో నాకు of course అనే మాట ఊతపదం గా వుండేది. ఆ మాట అవసరమున్నా లేకపోయినా Of courseగా ఉపయోగించే వాడిని. దీనితో  తికమకపడిన కొంతమంది స్టూడెంట్స్ నన్నేమీ అడిగేవారు కాదు. ఈ పరీక్షలు ఉదయం పది తర్వాత గానీ, మధ్యాహ్నం రెండు తర్వాత గానీ జరిగేవి. ఒక్కోసారి రెండు పూటలా జరిగేవి.  విద్యార్ధులు వ్రాసిన ఈ పరీక్షల సమాధాన పత్రాలను నలగకుండా, మడతపెట్టకుండా ఒక పెద్ద పసుపుపచ్చని కవర్ లో సీల్ చేసి యూసెఫీ అహ్మదాబాద్ ఆఫీస్ కు పంపేవారు. అక్కడినుండే రిజల్ట్స్ వచ్చేవి. ఆ తర్వాత అర్హత పొందిన విద్యార్ధులకు విదేశాలలో చదువుకోవడానికి అవకాశాలు వచ్చేవి. ఈ పరిక్షల నిర్వహణలో సహాయపడినందుకుగాను నాకు  కొన్ని రోజుల తర్వాత సగం రోజుకైతే 8 డాలర్లు, పూర్తిరోజుకైతే 15 డాలర్లు ఇచ్చేవారు. దానిని మన కరెన్సీలోకి మార్చి  మద్రాస్ ఆఫీస్ వారు రూపాయలలో ఇచ్చేవారు. నాకు అప్పటికి బ్యాంక్ ఎకౌంట్ లేదు. అందువల్ల క్యాష్ గానే పే చేసేవారు. మొదటిసారి పైకం తీసుకున్నప్పుడు వోచర్ మీద సంతకం పెట్టమన్నారు. నేను పూర్తిగా పట్రాయని ప్రణవ స్వరాట్ అని పేరు రాసాను. అది చూసి డిఎన్ రావుగారు "ఇది సంతకం కాదు. వీళ్ళెవ్వరికీ ద్వివేదుల నరసింగరావు, పట్రాయని ప్రణవ స్వరాట్ అంటే నోరు తిరగదు, పలకలేక ఛస్తారు. అందుచేత అందరూ పిలవడానికి వీలుగా పేరును సంతకాన్ని మార్చుకోమని ఇక పై కేవలం స్వరాట్ అని మాత్రం సంతకం పెట్టమని సలహా ఇచ్చారు. అప్పటినుండే నాపేరు పి.పి.స్వరాట్ గా మారింది. అలాగే ప్రతిరోజూ ఉదయం ఇండియన్ ఎక్స్ప్రెస్ డైలీ పేపర్ చదివితే మంచి ఇంగ్లీషు ఒంటబడుతుందని సలహా ఇచ్చేరు. ఆ రోజుల్లో  ఇండియన్ ఎక్స్ప్రెస్ దినపత్రిక భాషా స్థాయి అంత ఉన్నతంగా వుండేదని అర్ధం చేసుకోవచ్చును.

సాయంత్రం ఐదున్నర దాటేసరికి 'పూర్ణిమ' లో వాతావరణం పూర్తిగా మారిపోయేది. ఆఫీస్ స్టాఫ్ అంతా వెళ్ళిపోయాక డి.ఎన్.రావుగారు లోపలికి వెళ్ళి ఆరులోపల ఫ్రెషప్ అయి తెల్లటి పైజమా, జుబ్బా లేదా , హాఫ్ హాండ్ షర్ట్ వేసుకొని మళ్ళీ బయటకు వచ్చేవారు. ఈలోగా వారి కారు డ్రైవర్  బాలకృష్ణన్ లోపల్నుండి బయట వున్న లాన్స్ లోకి పేము కుర్చీలు తీసుకువచ్చి వేసేవాడు. రావుగారికి ఒక గ్రేకలర్ అంబాసిడర్ కారు వుండేది. MSV6799 అనే గుర్తు. మనిషి రంగు కొంచెం తక్కువే అయినా బాలకృష్ణన్  తెల్లటి యూనిఫామ్ లో అందంగా వుండేవాడు. చాలా మంచివాడు. 

పోకచెట్లు, అశోక చెట్లతో 'పూర్ణిమ'  ప్రాంగణం చల్లగా ఆహ్లాదకరంగా వుండేది. లోపలనుండి వారి సతీమణి  విశాలాక్షిగారు కాఫీ, టిఫెన్లు తీసుకువచ్చేవారు. వాటిని తింటూ తెలుగులో లోకాభిరామాయణం ప్రారంభించేవారు. అలాటి సందర్భాలలో ఇంట్లో వుంటే వారి అబ్బాయి అమ్మాయికి కూడా వచ్చి కబుర్లు చెప్పేవారు. 

ఒకరోజు ఇలాటి సంభాషణలు జరుగుతున్నప్పుడు విశాలాక్షిగారు "నిన్న రాత్రి ఆ వెధవలు ఏంచేసారో తెలుసునా..." అంటూ మొదలెట్టారు. అందరూ ఆసక్తిగా వినడం మొదలెట్టారు. కొంతసేపయ్యాక నాకు అర్ధమయింది, ఆ వెధవలని ప్రేమతో సంభోదించింది "పిక్సీ" అనే తెల్లటి పొమేరియన్ కుక్కపిల్ల , మరో పిల్లిపిల్లని. ఆ రెండూ ఒక రాత్రివేళ తమ చోట్లలో పడుక్కోకుండా విశాలాక్షిగారి బెడ్ ఎక్కి దుప్పట్లో దూరి వెచ్చగా పడుకున్నాయట. ఈ విషయాన్ని ఆవిడ ఎంతో మురిపెంగా చెపుతూంటే రావుగారు, వారి పిల్లలు ఆసక్తిగా వినేవారు. 

రావుగారి అబ్బాయి చేత కుప్స్ అని పిలవబడే సెక్రెటరీ కుప్పుసామి ఒకరోజు కంగారుపడుతూ వచ్చాడు. అతను వుండేది నంగనల్లూరు.  రోజూ అతనే వచ్చి ఆఫీస్ తలుపులు తెరుస్తాడు. ఆరోజు ఆఫీస్ తాళాలు కనపడలేదు. ఎక్కడైనా వదిలేసాడా, లేక మరెక్కడైనా జారిపోయాయో తెలియలేదు. వెంటనే డూప్లికేట్ తాళాలతో ఆఫీస్ తెరచి వెంటనే లోకల్ పేపర్లలో  ఎడ్రస్ తో సహా ఒక ప్రకటన వేయించారు " తాళాలు తెచ్చి ఇచ్చినవారికి తగిన నగదు బహుమానం ఇస్తామని". అలాగే ఆ ప్రకటన వచ్చిన మర్నాటి సాయంత్రానికల్లా ఎవరో ఒకతను వచ్చి ఏదో హోటల్ టేబిల్ మీద కనిపించాయని ఆ తాళాలు తిరిగి ఇచ్చేశాడు. విశేషం ఏమంటే వీరిస్తామన్న నగదు బహుమానం ఆ వ్యక్తి పుచ్చుకోలేదు.

సాయంత్రాల పూట "పూర్ణిమ" ఒక సాహితీ కేంద్రం.  రచయిత పాలగుమ్మి పద్మరాజుగారు, అమెరికన్ రిపోర్టర్ ఎడిటర్ బి.ఎస్.ఆర్ కృష్ణగారు, సోవియట్ ల్యాండ్ శెట్టి ఈశ్వరరావుగారు, మా నాన్నగారు సంగీతరావుగారు, ఎన్నార్. చందూర్ గారు, ఇలా ఎవరో కొంతమంది సాహితీప్రియులు అక్కడకు చేరి రాత్రి తొమ్మిదివరకు అనేక విషయాలమీద ముచ్చటించేవారు. డి.ఎన్.రావు కుటుంబం మద్రాస్ లో వున్నంతకాలం ఈ సంగీత సాహిత్య సమ్మేళనం కొనసాగిందనే చెప్పాలి.

మీలో ఎవరికైనా సుప్రసిధ్ధ తమిళ నటుడు రంజన్ గుర్తున్నారా? జెమినీ వారి పాత అపూర్వ సహోదరులు, చంద్రలేఖ వంటి చిత్రాల్లో నటించారు. మనందరికీ బాగా గుర్తున్న "కొండవీటి దొంగ" చిత్రంలో ఘంటసాలవారు పాడిన "సాహసమే జీవిత పూ బాటరా" పాటను డూప్ లేకుండా గుర్రపుస్వారి చేస్తూ నటించిన ఇండియన్ రాబిన్ హుడ్ ఈ రంజనే. 


ఈయనను మొదటగా తెరమీద కాక బయట చూసింది డి.ఎన్.రావుగారి ఆఫీసులోనే. సూటుబూట్ తో చాలా రాజసంగా కనపడ్డారు. అప్పట్లో ఆయనకు సొంత విమానం, రేసు గుర్రాలు వుండేవని అనుకునేవారు.

ఒకరోజు మాలతీచందూర్ గారు, కె.రామలక్ష్మిగారు విశాలాక్షిగారిని చూడడానికి  వచ్చారు. ఈ ముగ్గురు మహిళలు ఇంటిలోపల ముచ్చట్లు మొదలెట్టారు. అసలు సిసలు తెలుగింటి ఆడపడుచులుగా వారి టాపిక్ చీరలు, నగలు మీదకు మళ్ళింది. ఆ సమయంలో నేను అనుకోకుండా లోపలికి వెళ్ళవలసి వచ్చింది. నన్ను చూసి విశాలాక్షిగారు "స్వరాట్ ఈ చీరల్లో ఏది బాగుంది కొంచెం చూసి చెప్పు" అన్నారు. నాకు కంగారుపుట్టింది. ఇంతలో మాలతిగారు కలగజేసుకొని "మగపిల్లాడు అతనికేం తెలుస్తాయి ఆడవాళ్ళ చీరల సంగతి" అని తేల్చేశారు. అదే నాకు కావలసింది. వెంటనే అక్కడనుండి బయటకు వచ్చేశాను. మాలతీచందూర్ గారి ఈ వ్యాఖ్య విన్నాక నాకు ఒక విషయం గుర్తుకు వచ్చింది. ఏదో సందర్భంలో దొరైసామి రోడ్ చివర ఒక మేడమీద పోర్షన్ లో వుండే పామర్తిగారింటికి వెళ్ళాను. ఆ సమయంలో ఆయనలేరు. ఆయన సతీమణికి అర్జంటుగా ఒక జాకెట్ గుడ్డ కావలసివచ్చి నన్ను కొనుక్కొని తేగలవా అని అడిగారు. ఏ రంగైనా, ఏ వెరైటీ అయినా ఫర్వాలేదు అంటూ కొంత పైకం ఇచ్చారు. నేను పానగల్ పార్క్ దగ్గర వుండే పాత కుమరన్ స్టోర్ లో ఒక అరగంటసేపు ఆడవాళ్ళలాగే ఇదికాదు అది, అదికాదు ఇదని అన్ని బిట్స్ లాగించి చివరకేదో నాకు బాగుందనిపించినదానిని కొని తీసుకువెళ్ళి ఆవిడకు ఇచ్చాను. ఆవిడ నేను కొన్న బట్ట చూసి "నీకొచ్చే భార్య ఎవరోకానీ మహా అదృష్టవంతురాలయ్యా! ఆ పిల్ల బజార్ కు వెళ్ళే పనేలేదు" అంటూ మెచ్చుకున్నారు. ఇప్పుడు మాలతీచందూర్ గారి వ్యాఖ్య విన్నాక ఆ పాత సంఘటన గుర్తుకు వచ్చింది.

డి.ఎన్.రావుగారు USEFI డైరక్టర్ గా వున్నరోజుల్లోననే జ్ఞాపకం, జాన్ బి. హిగిన్స్ అనే అమెరికన్ ఫుల్ బ్రైట్ స్కాలర్ షిప్ లో మద్రాసులో కర్ణాటక సంగీతం నేర్చుకోవడానికి వచ్చారు. ఆయన అప్పటికే వెస్టర్న్ మ్యూజిక్ లో పిజి చేసారు. ఆయన మద్రాస్ లో తంజావూరు విశ్వనాథన్. అతని సోదరి ప్రముఖ భరతనాట్య కళాకారిణి టి.బాలసరస్వతి శిష్యరికంలో కర్ణాటక సంగీతంలో నిష్ణాతుడై డాక్టరేట్ పొందారు. జాన్ హిగిన్స్ గాత్రం విన్నవారెవరూ అతను ఒక విదేశీయుడనుకోరు. పూర్తి దక్షిణాది సంప్రదాయపధ్ధతి వేషధారణ తో వేదిక మీద పద్మాసనం వేసుకొని అతను మూడు గంటల సేపు కర్ణాటక సంగీత కచ్చేరీ చేస్తూంటే అందరూ ఆశ్చర్యపోయేవారు. మానాన్నగారు అతని పట్టుదలకు, మన సంగీతం పట్ల అతనికి వున్న శ్రధ్ధాభక్తులకు ఎంతగానో ముచ్చటపడేవారు. ఆ శ్రధ్ధాభక్తులు మనవాళ్ళలో కనిపించడంలేదని కూడా అనేవారు. జాన్ హిగిన్స్ దక్షిణాదిన ఉన్న ప్రఖ్యాత సంగీత సభలన్నిటిలో కచేరీలు చేశారు. తమిళ సంగీత రసికులంతా ఆయనను 'హిగిన్స్ భాగవతార్' అని ప్రేమతో పిలిచేవారు. 

🌅🌿🌄

ఘంటసాలవారు బయట ప్రపంచానికి ఎంతటి పేరుప్రఖ్యాతులు గల గాయకుడైనప్పటికీ ఆయన చాలా నిరాడంబంరంగా వుండేవారు. నెం.35, ఉస్మాన్ రోడ్ ఇంటి వాతావరణం అలాగేవుండేది. ఏవిధమైన ఆడంబరం, డాంబికం కనిపించేవికావు. ఇంటి పైన మరో అంతస్తు కట్టించినా అదీ క్రిందింటిలాగే వుంచారు తప్ప ఏవిధమైన ఇంటీరియర్ డెకరేషన్స్ జోలికి పోనేలేదు. మెయిన్ హాల్లో మాత్రం తూర్పు దక్షిణాలు కలిసే గోడ దగ్గర అర్ధచంద్రాకారంలో ఒక చిన్న వుడెన్ టీపాయ్ చేయించిపెట్టారు. క్రింది హాల్లో ఉండే జలాల్ కంపెనీవారి సిల్వర్ డయల్ చైమింగ్ గోడగడియారం పై హాలు గోడను అలంకరించింది. ఆ గడియారం ప్రతీ పావుగంటకు బకింగ్ హాం పేలస్ బిగ్ బెన్ చైమింగ్ గంటలతో మ్రోగేది. ఒకసారి మ్రోగితే పావుగంట, అరగంటఅయితే రెండుసార్లు, ముప్పావు గంట అయితే మూడుసార్లు, గంట అయితే, అప్పుడు ఎన్నిగంటలో అన్నిసార్లు ఘంటసాలవారి గళంలాగే ఆ గంట మ్రోగేది. 

గోడకు మరోవైపు G.K.Vale&Co వారు తీసిన ఘంటసాలవారు, సావిత్రమ్మగార్ల జంట ఫోటోలు పెద్దవి ఉండేవి. ఇవికాక కొత్తగా మాస్టారి ఆయిల్ పెయింట్ ఫోటో ఒకటి వచ్చింది. అది బహుశా ప్రముఖ చిత్రకారుడు గెనిసెట్టి వేసిన చిత్రమే అయ్యుండాలి. మాస్టారి అభిరుచుల మేరకు గెనిసెట్టిగారు వేసినవే శ్రీ రామకృష్ణ పరమహంస, స్వామీ వివేకానంద, రవీంద్రనాథ్ టాగూర్, ఆయిల్ పెయింట్స్ తో పాటు మరో పెద్ద సీనరీ పటం కూడా మేడమీది హాలులోకి అదనంగా వచ్చి చేరాయి. పెద్దబాబు పుట్టినప్పుడెప్పుడో కొన్నఆకుపచ్చ తెలుపు చారల దూది సోఫాసెట్లు మేడమీదిల్లు కట్టాక మారాయి. పాతవాటికి బదులు  పేమ్ తో అల్లిన వుడెన్ సోఫాసెట్ స్కైబ్లూ కలర్ మెత్తలు, గలీబులతో గోడ రంగులతో పోటీపడుతూ కనిపించేవి. రెండుగోడల కార్నర్ లో వుండే ఆ కొత్త టీపాయ్ మీద ఓ చిన్న ఫ్లవర్ వాజ్, దానికి రెండుప్రక్కలా ఓ రెండు ఏనుగు బొమ్మలు వుండేవి. అందులో ఒక ఏనుగుకు ఒక పక్క దంతం విరిగిపోయివుండేది.

ఘంటసాలవారింటికి వాచ్ మేన్, గూర్ఖా అంటూ ఎవరినీ నియమించుకోలేదు. మాస్టారిని చూడ్డానికి సినీమా కంపెనీలవాళ్ళో, కోరస్ పాడేవాళ్ళో, ఆర్కెస్ట్రావాళ్ళో, అభిమానులో, ఎవరో ఒకరు  నిరంతరం వస్తూనే వుంటారు. తనకు వాళ్ళకు మధ్య ఒక అడ్డుగోడలా ఒక గూర్ఖాను పెట్టుకోవడం మాస్టారికి ఇష్టంవుండేదికాదు. 

ఒకరోజు సాయంత్రం ఆరు గంటల వేళ ఒకతను వచ్చాడు. బయటవూరినుంచి వచ్చానని, ఘంటసాలవారి అభిమానినని ఆయనను చూడాలని అడిగాడు. ఆ సమయంలో మాస్టారు ఇంట్లోలేరు. ఆ విషయమే ఎవరో చెప్పి చూడాలనుకుంటే మర్నాటి ఉదయం రమ్మన్నారు. చాలా దూరంనుండి వస్తున్నానని దాహంగా వుంది. కొంచెం మంచినీళ్ళివ్వమని అడిగాడు. గుండుమామయ్య మంచినీళ్ళు తెచ్చేలోపు ఆ మనిషి మాయమయ్యాడు. కొన్ని క్షణాల తర్వాత క్రింద గేట్ దగ్గర గోల వినపడింది. ఏమిటాని వెళ్ళి చూశాము. ఎవరో ఒక మనిషిని మావయ్యకృష్ణో లేక సుబ్బారావో సరిగా గుర్తులేదు, పట్టుకొని గదమాయిస్తున్నారు. ఆ మనిషి చేతిలో మేడమీది హాలులోని ఒక ఏనుగు బొమ్మ కనిపించింది. మంచినీళ్ళని అడిగి తెచ్చేలోగా ఆ బొమ్మతో ఉడాయించాలని చూశాడు. ఈ ఏనుగు ఒక్కటే అందుబాటుగా దొరికింది. వాడిని నాలుగు తన్ని టి.నగర్ బస్ స్టాండ్ దగ్గర మాడ్లీ రోడ్ పోలిస్ స్టేషన్ కు లాక్కెళ్ళారు. నరసింగ, నేనూ కూడా వెళ్ళాము. అక్కడ మావాళ్ళకు తెలిసిన  బీట్ కానిస్టేబుల్ కనపడ్డాడు. పండగలకు పబ్బాలకు ఇంటికొచ్చినప్పుడు చూసేవాడిని.  అతను జరిగిన విషయం తెలుసుకొని ఆ వచ్చినవాడిని గదమాయించేప్పటికి ఏనుగు బొమ్మను తీసినట్లు ఒప్పుకున్నాడు. ఆ సమయానికి ఎస్.ఐ లేడు. ఒక గంటసేపు వాడిని లాకప్ లో వుంచి ఎస్.ఐ వచ్చాక విషయమంతా చెప్పి మరో రెండు లాగించారు.

💥కొసమెరుపు:
చివరకు జరిగిందేమిటంటే దొంగలింపబడిన వస్తువు విలువ దృష్ట్యా వాడిని ఒదిలేయడమే ఉత్తమమని లేకపోతే వాడిని లాకప్ వుంచినంతకాలం వాడి భోజనవసతులు వంటి ఖర్ఛులన్నీ  మనమే భరించవలసి వుంటుందనేలాటి కబుర్లేవో చెప్పి ఆ ఏనుగు బొమ్మను దొంగలించినవాడికి గట్టిగా బుధ్ధి చెప్పి వదిలేశారు. ఇది జరిగేకే అని గుర్తు, మరింత భద్రతకోసం మేడమీది ఇంటి ప్రధాన ద్వారానికి అదనంగా ఒక గ్రిల్  డోర్ అమర్చడం జరిగింది.

మరికొన్ని విషయాలతో... వచ్చే వారం.....
       ...సశేషం

*With a view to make the narrative more authentic and to corroborate it, images, audio and video clips are attached at appropriate places. If such usage is found objectionable to the copyright holders the same shall be removed if and when notified.

4 comments:

ameerjan said...

�� ఈ 46 వ ఎపిసోడ్ పూర్తిగా నా స్వీయానుభవాలని పోలివుంది స్వరాట్ మాస్టారూ! బి.ఎన్.రోడ్ గురించి గతంలోనూ చెప్పినట్లు గుర్తు! ముడియాదు విన్నాం సర్...కడియాదు విన్లేదు.�� బయటి లేడీస్ తో మాట్లాడడం; హాలీవుడ్ సినిమాలు చూడడం; ఇంగ్లీషులో మాట్లాడే ప్రహసనం; ఇవన్నీ స్వీయానుభవాలే నాకున్నూ!

�� అన్నట్లు ofcourse లాగే...కొందరు I mean అని కూడ ఊతపదంగా వాడుతుంటారు కదూ! ఓసారి మా బ్యాంకు ఆఫీసర్స్ ఇంటర్వ్యూల్లో ఇంగ్లీషులో మాట్లాడవలసి వస్తే...మధ్య మధ్యలో “అంటే” అన్న ఊత పదం వచ్చేస్తూండేది మా ఫ్రెండుకి. నేనొక ఉపాయం చెప్పా! ‘అంటే’ ...అనే పదాన్ని I mean తో రిప్లేస్ చేసి ప్రాక్టీస్ చేయమన్నా! ఆ చిట్కా బాగా పనిచేసింది. అలాగే....చీరల షాపింగ్! మొన్నమొన్నటి వరకు మా ఇళ్ళల్లో నా సెలక్షనే most preferred గా వుండేది! మొత్తానికి మమ్మల్ని మద్రాసు రోడ్లలో తిప్పేస్తూ...అప్పుడప్పుడు ఘంటసాల మాస్టారి వారింట్లో సేద తీరుస్తూ...చకచకా సాగిపోతున్నది...మీ జ్ఞాపకాల పరంపర! మరో ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ…��������

P P Swarat said...

ధన్యవాదాలు.

చుండి వేంకట రాజు said...

ధన్యవాదాలండి. చాలా ఓపికగా రాస్తున్నారు

sumabala said...

USEFI గురించి చాలా వివరంగా చెప్పేవు పెద్దన్నయ్యా ... TOEFL, GRE exams కి నువ్వు Invigilator గా ఉండేవాడివని ఇప్పుడే తెలిసింది నాకు... పూర్ణిమ లో నాన్నగారు, జి.ఎన్.రావుగారు, విశాలాక్షిగారు, ఛాయ చాలా విషయాలు గురించి మాట్లాడుకుంటూ ఉంటే ... పిక్సీతో నేను, పద్మా ఆడుకోవడం గుర్తుంది. ... పద్మ చేత తరుచూ పాడిస్తూ ఉండేవారు .... నీ జ్ఞాపకాల మాలిక చాలా బాగా గుబాళిస్తోంది .... మాతో పంచుకుంటున్నందుకు ధన్యవాదాలు....

సుమబాల