visitors

Sunday, September 5, 2021

నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 2 - నలభై ఏడవ భాగం

05.09.2021 -  ఆదివారం భాగం - 47*:
అధ్యాయం 2 భాగం 46  ఇక్కడ

  

నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్

ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరిని అనేక రకాల వ్యామోహాలలో ముంచెత్తుత్తున్న సినీమా అనే మాయా ప్రపంచం పుట్టి అప్పుడే 130 సంవత్సరాలు అవుతోంది. 1891 లో మాటలు , పాటలు రాని మూకీగా పుట్టిన సినీమా ఒకరెండు దశాబ్దాల తర్వాత 1920 లో ఫ్రాన్స్ రాజధాని పారీస్ మహానగరంలో తొలిసారిగా గొంతువిప్పింది. అయితే మొట్టమొదటిగా వ్యాపార సరళిలో ప్రజల ముందుకు వచ్చిన విదేశీయ సినీమా ' జాజ్ సింగర్' 1927 లో. 

మన దేశంలో తయారైన మొదటి మూకీ రాజా హరిశ్చంద్ర. ఈ చిత్ర నిర్మాతా దర్శకుడు దాదా సాహేబ్ ఫాల్కే. ఈయన గౌరవార్ధం ఆయన పేరిట మన దేశంలోని అత్యుత్తమ కళాకారులకు? దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ ఇవ్వడం జరుగుతోంది. 

1931 లో మన దేశంలో మొట్టమొదటి టాకీ 'ఆలం ఆరా' తయారయింది. అర్దేషిర్ ఇరానీ నిర్మాత దర్శకుడు.  తమిళంలోని మొదటి టాకీ 'కాళిదాసు' కూడా అదే సంవత్సరం. తెలుగులో మొట్టమొదటి చలనచిత్రం 1932 లోని 'భక్త ప్రహ్లాద'. ఈ రెండు చిత్రాలకు నిర్మాత దర్శకుడు హెచ్.ఎమ్.రెడ్డి. ఈయన 1951 లో నిర్మించిన 'నిర్దోషి' కి ఘంటసాలవారు కూడా సంగీత దర్శకుడిగా పనిచేసారు. భారత దేశంలో వచ్చిన మొదటి  మూడు భాషా చిత్రాలలోనూ సుప్రసిధ్ధ దర్శకుడు ఎల్.వి.ప్రసాద్ నటించడం ఒక విశేషం.

తెలుగు సినీమా తొలి రోజులలో ఆయా సినిమాలలో నటించే నటీనటులే తమ పాటలు, పద్యాలు పాడుకునేవారు. అంద చందాలతోపాటు పాడగల సమర్ధులతోనే మొదటి రెండు దశకాల సినీమాలు వచ్చాయి. రికార్డింగ్ సిస్టమ్ సాంకేతికంగా వృద్ధి చెందని రోజులలో వాద్యబృందాన్ని కూడా షూటింగ్ జరిగే సమయంలోనే ఒక ప్రక్కగా కూర్చోబెట్టి పాట, నటన రెండు ఒకేసారి జరిపేవారట. ఆ తర్వాత సాంకేతిక పరిజ్ఞానం పెరిగాక ముందుగా పాటలు రికార్డింగ్ చెయ్యడం అలవాటయింది. రికార్డింగ్ కోసం వేరే థియేటర్ లు నిర్మించడం అనివార్యమైంది. సింగిల్  ఛానల్ సౌండ్, డబుల్ ఛానల్ సౌండ్ సిస్టమ్ నుండి ఈనాడు మల్టీ ఛానల్ సిస్టమ్ లో సినీమా మాటల పాటల ధ్వని ముద్రణ జరుగుతున్నది. 

1944లో ఘంటసాలవారు చిత్రరంగ ప్రవేశం చేసేనాటికే కొంత సాంకేతిక పరిజ్ఞానం పెరిగి సినీమాలలో నేపథ్యగానం అనే ప్రక్రియ మొదలయింది. చిత్రంలో నటీనటులకు వేరే వారిచేత పాటలు పాడించే నూతన ప్రక్రియ ప్రారంభమయింది. దీనితో  సంగీతం తెలియని కొత్త కొత్త నటులకు, గాయకులకు ఈ రంగంలో అవకాశాలు దొరకడం మొదలయింది. శ్రీమతి రావు బాలసరస్వతి  తెలుగులో మొదటి నేపథ్యగాయనిగా చెపుతారు. బెజవాడ రాజరత్నం, గాలి పెంచలనరసింహారావు, మోపర్తి సుందర రామారావు (ఎమ్.ఎస్.రామారావు) ఆనాటి నేపథ్యగాయకులుగా కొన్నేళ్ళపాటు తమ గానప్రతిభను ఒక వెలుగు వెలిగారు. 

1945 లో 'స్వర్గసీమ' సినీమాతో నేపధ్యగాయకునిగా ఘంటసాల అవతరించడంతో తెలుగు సినీమా పాట యొక్క రుచి, వాసన పూర్తిగా మారిపోయాయి.  ఒక నూతన  సంగీత శకం ప్రారంభమయింది. అదే ఘంటసాల శకం. గత 75 సంవత్సరాలుగా ప్రపంచ వ్యాప్తంగా వున్న తెలుగువారంతా ఘంటసాల గానవాహినిలోనే తన్మయత్వంతో ఓలలాడుతున్నారు. గాయకుడిగా, సంగీత దర్శకుడిగా  ఒక నూతన ఒరవడిని సృష్టించి ఘంటసాల పండిత, పామర హృదయాలో సుస్థిర స్థానం పొంది చెరగని ముద్రవేశారు. ఈనాటి వరకూ లలిత సంగీత గాయకులందరికీ ఆదర్శం, మార్గదర్శకం ఘంటసాల పాట, పద్యమే. ఘంటసాల గళానికి ప్రత్యమ్నాయం లేదనేది నిర్వివివాదాంశం.

ఘంటసాలవారితో పాటే చలనచిత్రసీమలో కథానాయకుడిగా అక్కినేని నాగేశ్వరరావుగారు రంగప్రవేశం చేసారు. ఈ ఇద్దరూ ఘంటసాల బలరామయ్యగారి ప్రతిభా ఆఫీసులో కలిసే వుండేవారు.  సీతారామ జననంలో అక్కినేని రాముడుగా నటిస్తే ఘంటసాలవారు కోరస్ గీతాలలో పాల్గొని ఏవో  చిన్న వేషాలు వేసారట. అక్కినేని వారు మొదట్లో తన పాటలు తానే పాడుకునేవారు. అలా వచ్చినవే పల్నాటి యుధ్ధంలో, బాలరాజు లో వచ్చిన పాటలు. ఎప్పుడైతే ఘంటసాల కంచుకంఠం దశదిశాలా వ్యాపించడం మొదలయిందో అప్పుడే అక్కినేని నాగేశ్వరరావు తనకు ఒక నేపథ్యగాయకుడు అవసరమనే సత్యాన్ని గుర్తించారు. అందుకే 'బాలరాజు' సినీమాలోని 'చెలియాకనరావా' పాట అటు అక్కినేని వారి గాత్రంతో, ఇటు ఘంటసాలవారి గళంతో ప్రజలను అలరించాయి. సినీమాలో మాత్రం ఘంటసాలవారి గాత్రమే అక్కినేని వారి కంఠంలోనుండి వినిపిస్తుంది. 


ఆనాడు మొదలైన వారి స్వరసహచర్యం మూడు దశాబ్దాలపాటు నిరాటంకంగా సాగి తెలుగు ప్రేక్షకులకు మహదానందం కలిగిచింది. తర్వాత వచ్చిన ఎన్.టి.రామారావు, జగ్గయ్య, కాంతారావు, శోభన్ బాబు, కృష్ణ ఆదిగాగల 1970ల నాటి హీరోల వరకు ఘంటసాలవారి నేపథ్యగానమే విజయాలకి ఆలంబలమైంది. వారికే కాదు ఇతర ప్రధాన భూమికలు పోషించే నటగాయకులు నాగయ్య, ధూళిపాళలకు, ఎస్.వి.రంగారావు, గుమ్మడి, మిక్కిలినేని, రాజనాల, ముక్కామలవంటి వారికి, హాస్య నటగాయకులు రేలంగి, కస్తూరి శివరావులకు, రమణారెడ్డి, పద్మనాభం, చలం వంటి హాస్యనటులకు కూడా తమ పాటలను ఘంటసాలవారి చేత పాడిస్తేనే రాణిస్తాయని ఆశించి ఆయనచేతనే పాడించమని కోరేవారు. తెలుగు సినీమాను ఘంటసాలవారి గాత్రం అంతటి ప్రభావితం చేసింది. ఘంటసాలగారు సినీమాలలోకి వచ్చాక మాధవపెద్ది, పిఠాపురం నాగేశ్వరరావు, బి.గోపాలం, ఎ.ఎమ్.రాజా, పి.బి.శ్రీనివాస్, మోహన్ రాజ్, చిత్తరంజన్, బసవేశ్వర్, టి.ఆర్.జయదేవ్ వంటి ఎంతోమంది ఉత్తమగాయకులు నేపథ్యగాయకులుగా వచ్చారు. వీరిలో కొందరు బహుభాషా చిత్రగాయకులుగా మంచి పేరుపొందారు. కానీ నేపథ్యగాయకులుగా ఈ గాయకులంతా ఘంటసాలవారిలా  గాత్రవైవిధ్యాన్ని, రసభావాలను సమర్ధవంతంగా పలికించడంలో, రసజ్ఞుల ఆమోదాన్ని పొందడంలో సఫలీకృతులవలేదనే అనుకోవలసివస్తుంది. పాటలోని పరిపూర్ణ తృప్తి, రసానందం ఒక్క ఘంటసాల గాత్రంలోనే ధ్వనించిందని ఈనాటివరకూ తెలుగువారంతా అనే మాట. ఒక్క తెలుగునాటే కాక తమిళ, కన్నడ భాషా చిత్రాలలో కూడా ఘంటసాల చెరగని ముద్ర వేసారు.

బొంబాయి చలనచిత్ర సీమలో వుండే సాంకేతిక పరిజ్ఞానం అంతా మద్రాస్ లో తయారయే దక్షిణాది సినీమాలన్నిటిలో కనిపించేవి. 1960ల తర్వాత మల్టీట్రాక్ ఛానల్ సిస్టమ్ వచ్చినా 70ల వరకు పెద్దగా ఎవరూ ఉపయోగించలేదు. సినీమా పాటలన్నీ లైవ్ లోనే రికార్డింగ్ జరిపేవారు. అలాగే పాతకాలపు ఎన్.టి.ఆర్., ఎ.ఎన్,ఆర్., ఎమ్.జి.ఆర్., శివాజీ గణేశన్ల సినీమాల ఆడియో అంతా షూటింగ్ సమయంలోనే రికార్డ్ చేసేవారు. నటీనటులు డబ్బింగ్ చెప్పుకోవడమనేది ఇటివల 80లలో వచ్చిన నవీన పంథా. దానికి కారణం భాష తెలియని నటీనటులు ప్రాంతీయ చిత్రాలలో నటించడం. షూటింగ్ సమయంలో ఆ గాజు బొమ్మలు  డైలాగ్స్ పేరిట ఎ టు జెడ్ ఆల్ఫాబెట్స్ వల్లిస్తే తర్వాత ఎప్పుడో డబ్బింగ్ ఆర్టిస్ట్ లు వచ్చి అసలు డైలాగ్స్ చెపితే ఎడిటర్లు వాటిని లిప్ సింక్ చేసుకుంటారు.  అలాగే పాటల విషయానికొస్తే లైవ్ రికార్డింగ్ విధానం పోయి ట్రాక్ సింగింగ్, ట్రాక్ మిక్సింగ్ విధానం వచ్చింది. విదేశాలలో కూర్చొని మ్యూజిక్ డైరక్టర్ ట్యూన్ పంపిస్తాడు. దానికి రచయితలేవో మాటలందిస్తాడు. ఇక్కడి అరేంజర్లు కంప్యూటర్ లోకి ఎక్కిస్తారు. ఎవరికి వారే వారి స్థావరాలలో కూర్చొని మైక్రోఫోన్ ల ద్వారా   పాడేవారు పాడేస్తారు. వాద్యగాళ్ళు ఎవరికి వారే వారికిచ్చిన బిట్లు వాయించేస్తారు. ఎవరు ఏ సినీమాకి ఎందుకు పాడుతున్నారో ఒకరితో ఒకరికి సంబంధం లేకుండానే పాటాల కార్ఖానాలో పుంఖానుపుంఖాలుగా పాటల మాన్యుఫేక్ఛరింగ్ జరిగిపోతుంది. తెరమీద ఎవరికి కావలసిన పధ్ధతిలో ఆ పాటలను ఎక్కడో దగ్గర వినిపించి చూపిస్తారు. 

ఘంటసాలవారు తనకు అనారోగ్య సమయాలలో తప్ప ట్రాక్ మిక్సింగ్ కు ఇష్టపడేవారు కాదు. పాటల రికార్డింగ్ లు లైవ్ గా జరిగితేనా పాటకు జీవం, అందం, ఆనందం అని భావించేవారు. ఘంటసాలవారి కాలంలో ఆయనే కాదు, సంగీత దర్శకులందరూ లైవ్ రికార్డింగ్ చేయడానికే ఇష్టపడేవారు.

రోజులు మారాయి. సాంకేతిక విజ్ఞానమూ పెరిగింది. చిత్రనిర్మాణ విధానాలు మారాయి. విడియో ఆవిర్భావం తర్వాత ట్రెండ్ మారిపోయింది. గత కాలంలోలా హిందుస్థాన్ ఫోటో ఫిలిం కంపెనీ,  లేదా కోడక్ వారి ముడి ఫిలిం తో షూటింగ్ లు జరిపి ఆ ఫిల్మ్ రీళ్ళను డబ్బాల్లోకి ఎక్కించి ఆ నెగెటివ్ లకు పాటల ఆడియో జతచేసి వాటిని పాజిటివ్ ఫిల్మ్ కాపీలుగా తీసి సినీమా హాల్స్ లో ప్రొజెక్టర్లలో ఆ 15-20 రీళ్ళ సీనీమాలను వెండితెరపై చూపించడమనే కాలమే పోయింది. ఒకప్పుడు ముడి ఫిల్మ్ కోసం పడరానిపాట్లు పడేవారు. ప్రతీ నిర్మాత తమకు కావలసిన ఫిల్మ్ కోసం ముందుగానే అప్లై చేసుకోవలసి వచ్చేది. అలాగే ఈస్ట్ మన్ కలర్, టెక్నికలర్ ఫిల్మ్ కోసం ఇంకా ఎక్కువకాలం ఎదురుచూడాల్సి వచ్చేది. బాగా ఆర్థిక స్థోమతకల నిర్మాతలైతే తప్ప చిన్న చిన్న నిర్మాతలకు సినీమా తీయడమంటే రోట్లో తలదూర్చటమే. అందుకే తెలుగులో మంచి కలర్ సినీమాల నిర్మాణం చాలా ఆలస్యంగా అభివృద్ధి చెందింది. సినీమా పూర్తయ్యాక అన్ని థియేటర్లకు సరిపడా ప్రింట్ల్ తీసే అవకాశం వుండేదికాదు. ఏ ఇరవై ప్రింట్లో తీయించి వాటినే ఆంధ్రా, నైజాం, సీడెడ్ ప్రాంతాలలో అక్కడక్కడ ప్రదర్శించేవారు. మద్రాస్ వంటి పెద్ద నగరాలలో ఒకే  సినీమా ప్రింట్ ను  ఒకేసారి దూరం దూరంగా వున్న సినీమాహాల్స్ లో వేసేవారు. ఒక అరగంట వ్యవధిలో సినీమా షోలు మొదలెట్టేవారు. ఒక థియేటర్లో అరగంట సినీమా అయ్యేప్పటికి ఆ రీళ్ళ డబ్బాను ఆటోలోనో, చెమటలు కక్కుకుంటూ సైకిళ్ళమీదో ఆఘమేఘాల మీద మరో థియేటర్ కు చేర్చేవారు. ఈలోగా ఏ కారణం చేతైనా ప్రింట్ చేతికి అందకపోతే ఎక్స్ట్రా ఇంటర్వెల్ స్లైడ్ పడేసేవారు. ఈ విధంగా ఒకే ప్రింట్ ను రెండు మూడు థియేటర్లలో ఆడిన ఎన్నో సినీమాలు నేను చూశాను.

ఇప్పుడు సినీమా టెక్నాలజీ యే మారిపోయింది. ఇప్పుడు ఎవరూ పాత కెమెరాలు, పాత ముడి ఫిల్మ్  వాడడం, సినిమా హాల్స్ లో ప్రొజెక్టర్లు లోకి ఆ మొత్తం రీళ్ళను రెండు మూడు సార్లు మాన్యువల్ గా ఎక్కించి స్క్రీన్ మీద చూపడం ఆ పధ్ధతులన్నీ ఔట్ డేట్ అయిపోయాయి. ఆ నాటి సినీమా పరికరాలు అన్నీ మ్యూజియంలకు చేరాయి. గత పదేళ్ళుగా అంతా డిజిటల్ మయం. డిజిటల్ కెమెరాలు. డిజిటల్ సౌండ్ సిస్టమ్ . మొత్తం 15  రీళ్ళ రెండు గంటల సినీమాను  ఒక చిన్న డిస్క్ లో లేదా పెన్ డ్రైవ్ లో బంధించి  డిజిటల్ ప్రొజెక్టర్ల మూలంగా 70 mm, వైడ్ స్క్రీన్ , స్కోప్ అంటూ రకరకాల సౌండ్ సిస్టమ్స్ తో 3D, 4D  ఎఫెక్ట్స్ తో ప్రజలను వింత వింత లోకాలకు తీసుకుపోయి వినోదాన్ని కల్పిస్తున్నారు.

సినీమా ధ్యాసలో పడి షార్ట్ హాండ్ క్లాసుల గురించే మర్చిపోయాను. పానగల్ పార్క్ దగ్గరలోని నియో కమర్షియల్ ఇన్స్టిట్యూట్ కు నాతో పాటు మా బ్యాచ్ లో మరో నలుగురైదుగు తెలుగువారుండేవారు. అందరితో పెద్ద స్నేహం ఏర్పడలేదు కానీ కొందరితో ముఖపరిచయం, కొందరితో పలకరించడం వరకు స్నేహరికం ఏర్పడింది. వారిలో ఒక ప్రముఖ నటి  మేనకోడలు వరస బంధువు ఒకమ్మాయి. ఏదో పేరంటానికి వెడుతున్నట్లుగా ఎప్పుడూ పట్టుబట్టలు, నగలు అలంకరించుకు  దండపాణి వీధి నుండి వచ్చేది. మరొకామె మా ఇంటి దగ్గరి మురుగేశ మొదలియార్ వీధిలోనుండి  వచ్చేది. ఎప్పుడు తెల్లని డిజైన్డ్ ఖటావ్ వాయిల్ చీరలనే కడుతూ చాలా హుందాగావుండేది. సాయంత్రం వేళల్లో తన మూడేళ్ళ చిన్న పాపను నడిపించుకుంటూ పానగల్ పార్క్  కూరల బజారు కు వెడుతూ కనిపించేది. మొదట్లో ఆవిడ  ఆ వీధిలోనే వుండే ఒక తెలుగు నిర్మాత భార్య అని అనుకునేవాడిని. కాని కాదు. ఆవిడ పేరుతో అప్పట్లో కొన్ని పత్రికల్లో కథలు వచ్చేవి. మరి ఆ రచయిత్రి, ఈవిడా ఒకటేనా కాదా అనేది ఇప్పటిదాకా వీడని చిక్కు ప్రశ్నగానే మిగిలిపోయింది. మరొక అమ్మాయి కోడంబాక్కం నుండి తన అన్ననో తమ్ముడినో తోడు తీసుకు వచ్చేది. ఆ అమ్మాయి తండ్రి సినీమా ఆర్కెష్ట్రా లలో హార్మోనియం వాయించేవారు. కొన్ని డబ్బింగ్ సినీమాల మ్యూజిక్ డైరెక్టర్ గా ఒకటి రెండుసార్లు ఘంటసాల మాస్టారి ఇంటిదగ్గర చూశాను. ఆయన పేరు వేలూరి కృష్ణమూర్తి. ఎన్.టి.రామారావుగారి 'గులేబకావళి కథ' జంట సంగీత దర్శకులలో ఒకరు. 

ఇక మగవాళ్ళలో భరణీ కోటేశ్వరరావు గా పేరుపొందిన భరణీ స్టూడియో సౌండ్ ఇంజనీర్ పి.వి.కోటేశ్వరరావు గారు. ఆయనే తర్వాతి కాలంలో జెమినీకి మారి జెమినీ కోటేశ్వరరావుగా అనేక సినీమాలకు పనిచేశారు. వారి అబ్బాయి ఈ నియో కమర్షియల్ క్లాసులకు వచ్చేవాడు. మరొక అబ్బాయి నారాయణమూర్తి. కోడంబాక్కం నుండి వచ్చేవాడు. సరదాగా మాట్లాడేవాడు. అతనిని మళ్ళా ఒక ఐదేళ్ళ తర్వాత సెంట్రల్ స్టేషన్ పక్కన వాల్టాక్స్ రోడ్ లో ఒక రియల్ ఎస్టేట్ కంపెనీలో పనిచేస్తూ కనిపించాడు. అతని ప్రోద్బలం మీద నెలకు 15/- రూపాయలు చొప్పున 20 మాసాలు  ఇన్స్టాల్ మెంట్ లో మహాబలిపురానికి ఏడు కిలోమీటర్ల ఇవతల ఓల్డ్ మహాబలిపురం రోడ్ లో ఓ రెండు ప్లాట్ లు కొనవలసి వచ్చింది. అదొక కాశీమజిలీ కధ. ఆ గాధ వచ్చే అధ్యాయంలోనే. ఇక్కడ కాదు. ఆ నారాయణ మూర్తి పరిచయం అక్కడితో సరి. రాజేశ్వరశర్మ అని మరో అబ్బాయి వెస్ట్ మాంబళం వేపునుండి వచ్చేవాడు. ఫైవ్ ల్యాంప్స్ ఏరియాలో వుండేవారనుకుంటాను. మనిషి చాలా సౌమ్యుడు. మా ఇద్దరికి కొంత స్నేహం ఏర్పడింది.  ఆ ఇన్స్టిట్యూట్ తోనే మా పరిచయం కూడా ముగిసింది. కానీ ఓ పుష్కరం తర్వాత ఆ రాజేశ్వరశర్మగారు మా రెండవ చెల్లెలు  వివాహ సందర్భంలో  మా రెండవ బావగారు కొచ్చెర్లకోట కృష్ణప్రసాద్ గారి అన్నగారిగా పునఃపరిచయం కావడం అనూహ్యం. ఆశ్చర్యదాయకం. ఈ స్నేహాలు, బంధాలు, అనుబంధాలు ఎప్పుడు, ఎవరితో, ఎలా ఏర్పడుతాయో చెప్పలేము. 

నియో కమర్షియల్ లో క్లాసెస్ టైమింగ్స్  లో క్లాష్ రావడంతో అక్కడ మానేసి మా ఉస్మాన్ రోడ్ మీద గ్రిఫిత్ రోడ్ కి వాసన్ స్ట్రీట్ కి మధ్య బస్ స్టాప్ దగ్గర మేడ వున్న పార్థసారధి టైప్ రైటింగ్ ఇన్స్టిట్యూట్ లోని షార్ట్ హాండ్ క్లాసులో జాయిన్ అయ్యాను. అది నెం. 25 లేక 26 ఉస్మాన్ రోడ్. మా ఇంటికి ఓ పదిళ్ళు అవతల. ఆ ఇన్స్టిట్యూట్ హెడ్ ఒక మధ్య వయస్సు విడో. మేడమీద క్లాసులు, క్రింద భాగంలో ఇల్లు. తల్లి, ఇద్దరు అక్కచెల్లెళ్ళు వుండేవారు. చెల్లెలు AG ఆఫీసులో అనుకుంటాను పనిచేసేది. ఆవిడ కూడా అప్పుడప్పుడు షార్ట్ హాండ్ క్లాసెస్ తీసుకునేది. అలాటి కుటుంబాలను చూసాక జీవితం పట్ల నాలో ఒక రకమైన భయం, భాధ్యతల్లాంటివి అలవడడం మొదలయ్యాయి. 

మేడ మీద ఉన్న ఇన్స్టిట్యూట్ కి వెళ్ళడానికి ఉన్న మెట్లను ఆనుకునే  తర్వాత కొన్నేళ్ళకు బస్ స్టాపువార TMS Stores, 'సమద్' ప్రొవిజన్ స్టోర్స్ వచ్చేయి. ఈ రెంటి మధ్యా పాలంకి సూర్యనారాయణగారి శ్రీ సూర్య ఆయుర్వేద నిలయం. సమద్ భాయి వచ్చాక, పార్క్ దగ్గరి 'సలామ్' భాయికి తాత్కాలికంగా బైబై చెప్పడం జరిగింది. ఆ సలామ్ భాయ్ కొన్నేళ్ళ క్రితం వడపళని ఆర్కాట్ రోడ్  'సలామ్' లో కనపడి, నన్ను గుర్తుపట్టి  పలకరించడం, మా నాన్నగారి యోగక్షేమాలు అడగడం నన్ను ఆశ్చర్యపరిచాయి. మా చిన్నప్పుడు ఉస్మాన్ రోడ్ 'సలామ్' లో సామాన్లు కొన్నప్పుడల్లా ఆ భాయి ఓ నూరు గ్రాముల పచ్చి వేరుశనగ పప్పులు విధిగా వేరేగా  పొట్లం కట్టి  ఉచితంగా ఇచ్చేవాడు. ఆ భాయికి తెలుగురాదు,  నాకు అరవం రాదు, అయినా మా మధ్య సఖ్యత పెరిగింది. ఇప్పుడు ఆ షాపులు లేవు, ఆ వ్యక్తులు ఎక్కడున్నారో తెలియదు. ఈ కాల చక్రభ్రమణంలో ఎవరెవరో తారసపడతారు, మనతోనే వుంటూంటారు. కొన్నాళ్ళకు అదృశ్యమైపోతూంటారు. వారి జ్ఞాపకాలు క్రమేపీ మనలోనుండి తొలగిపోతూంటాయి. 

🌺💐🌺

ఘంటసాల మాస్టారి సంగీత దర్శకత్వంలో 1967 లో ప్రారంభమై 1968లో రిలీజైన నాలుగు సినీమాలలో రెండు సినీమాలు 'గోవుల గోపన్న', 'చుట్టరికాలు' సినీమా పాటల గురించి ముచ్చటించడం జరిగింది.

కాంతారావు నటించిన 'వీరపూజ', ' జీవితబంధం' కూడా ఆ సంవత్సరమే విడుదలయ్యాయి. వీరపూజ లో మాస్టారు పాడిన 'అద్దరిని వున్నాడు అందగాడు', 'కానరావయ్య కావరావయ్య గౌరీశ కైలాసవాసా', పి.సుశీలగారు పాడిన 'కొనుమా సరాగమాల' వంటి  మంచి పాటలు మరో నాలుగు కూడా ఉన్నాయి. 

'సరాగమాల' పేరు వినగానే వి.ఎ.కె.రంగారావుగారి ఆంధ్రపత్రిక శీర్షిక 'సరాగమాల' గుర్తుకువస్తుంది. ఆ శీర్షికలో శ్రీ రంగారావుగారు ఎన్నో సినీమా పాటల మీద సమీక్షలు వ్రాశారు. ఆ శీర్షికను వారికి సూచించింది శ్రీ మల్లాది రామకృష్ణశాస్త్రిగారే అని విన్న గుర్తు.

ఎమ్.ఎస్.గోపీనాథ్ నిర్మాత దర్శకుడిగా మొదలైన చిత్రం 'జీవితబంధం'. ఇది రివైజ్డ్ టైటిల్. ముందు ఇంకేదో పేరు పెట్టారు. ఆర్థిక ఇబ్బందులవల్ల సినీమా చాలాకాలం ఆగిపోయింది. ఆ తర్వాత మరెవరో రైట్స్ కొనుక్కొని అదే దర్శకుడితో ముగించారు. అందులో మాస్టారు పాడిన 'తెగిపోయిన గాలి పటాలు', 'లేత హృదయాలలో విరిసె ఆనందమూ'  డ్యూయెట్  వినసొంపుగా వుంటాయి. మిగతా పాటల గురించి గుర్తులేదు. తర్వాత కాలంలో ఈ ఎమ్.ఎస్.గోపీనాథ్ మరికొన్ని తమిళ, తెలుగు సినీమాలు తీశారు. ఈయన కుమారుడే గడచిన తరం యువహీరో సురేష్. రత్నకుమార్ తీసిన 'తేన్ కూడు' తమిళ చిత్రంలో హీరో. అనేక తెలుగు, తమిళం సినీమాలలో హీరోగా నటించిన అతను ఈమధ్య వయసుమళ్ళిన పాత్రల్లో అడపదడపా కనిపిస్తున్నాడు.  

మరికొన్ని సినీమాల గురించి.... వచ్చేవారం....
                     ...సశేషం


*With a view to make the narrative more authentic and to corroborate it, images, audio and video clips are attached at appropriate places. If such usage is found objectionable to the copyright holders the same shall be removed if and when notified.

2 comments:

చుండి వేంకట రాజు said...

ధన్యవాదాలండి

హృషీకేష్ said...

చిత్ర పరిశ్రమ లో వచ్చిన మార్పులు చక్కగా చెప్పారు sir. చాలా ఉత్సుకతతో చదివాను. బాగున్నాయి. ధన్యవాదాలు.హృషీకేష్