visitors

Sunday, September 26, 2021

నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 2 - ఏభైయవ భాగం

26.09.2021 - ఆదివారం భాగం - 50*:
అధ్యాయం 2  భాగం 49 ఇక్కడ


నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్

ఒకసారి ఘంటసాలవారు తలపెట్టిన  ఏదో ఒక  కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వానపత్రికలను పలువురు ప్రముఖులకు స్వయంగా అందజేసే భాధ్యతను నరసింగకు, నాకు అప్పజెప్పారు. మేము  స్వయంగా చెప్పి ఆహ్వనపత్రికను అందజేసేవారిలో వి.ఎ.కె.రంగారావుగారు కూడా వున్నారు. అందజేయవలసిన వారందరి ఎడ్రస్ లు సినీమా డైరక్టరీ నుండి సేకరించి వాటి ప్రకారం వెళ్ళి యివ్వాలని నిశ్చయించాము. ఆ ఎడ్రెస్సులలో చాలాభాగం టి.నగర్, కోడంబాకం, తేనాంపేట‌, ఆళ్వార్ పేట, మైలాపూర్, ట్రిప్లికేన్ ప్రాంతాలలోనివారే. అందువలన సైకిళ్ళమీద వెళ్ళి యిద్దామని నరసింగ సలహా యిచ్చాడు. అప్పటికి నాకు సైకిల్ తొక్కడం వచ్చును కానీ మౌంట్ రోడ్ వంటి భారీ ట్రాఫిక్ లో బస్సులు, లారీలమధ్య నుండి సైకిల్ తొక్కడానికి భయంగా వుండేది. దూరంగా సిటీ బస్సులు రావడం కనిపిస్తే ఇక్కడ నేను సైకిల్ దిగి మరల ఆ బస్ వెళ్ళిపోయాక సైకిల్ ఎక్కేవాడిని. మరొక పెద్ద సమస్య నేను ఆ సైకిలంత ఎత్తు కూడా లేకపోవడం వలన సైకిల్ ఎక్కడం, దిగడం చాలా ఇబ్బందికరంగా తోచేది. అసలు నేను సైకిల్ నేర్చుకున్నది మెడ్రాస్ లో కాదు. బొబ్బిలి హైస్కూలులో చదువుతున్న రోజుల్లో అందరి పిల్లల్లాగే నేను సైకిల్ నేర్చుకోవాలని ఉబలాటపడ్డాను. మా ఊళ్ళో గంటకు ఇంతని వసూలు చేసి అద్దెకు సైకిళ్ళు ఇచ్చే షాపులుండేవి. సొంత సైకిళ్ళు లేనివారు తమ అర్జంట్ పనులకు, కొత్తగా సైకిళ్ళు తొక్కడం నేర్చుకునే పిల్లలు ఈ అద్దె సైకిళ్ళనే ఆశ్రయించేవారు. మా సామవేదుల వారి సందులో, అగ్రహారం వీధిలో ఆ రోజుల్లో ఎక్కువ వాహన సంచారం వుండేదికాదు, సాయంత్రం పూట పూల్ బాగ్ కు వెళ్ళి వచ్చే బొబ్బిలి రాణీ గారి కారు తప్ప. అందుచేత మా సైకిల్ సాధన నిరాటంకంగా సాగేది. బాగా పొడుగున్న పిల్లలైతే సీటు మీద కూర్చొని వెనకాల మరొకరి సాయంతో నేర్చుకునేవారు. కొందరు హాఫ్ పెడల్ పధ్ధతిలో నేర్చుకునేవారు. నాకు ఈ రెండు పధ్ధతులు అనుకూలపడేవికావు. అందువలన ఎవరి సాయంలేకుండా వెనక కారియర్ మీద కూర్చొని అతికష్టం మీద బ్యాలన్సింగ్ అలవాటు చేసుకొని సైకిల్ నడపడం అలవాటు చేసుకున్నాను. అయితే సీటుమీద కూర్చొని దిగడానికి ఏవైనా అరుగులు,  వసారాలు చూసుకోవలసి వచ్చేది. మొత్తానికి కాలేజీలో ప్రవేశించేనాటికి బాగా సైకిల్ తొక్కడం వచ్చేసింది. కాకపోతే బొబ్బిలిలో నేను సైకిల్ ఉపయోగించవలసిన అవసరమేపడలేదు. ఒకసారి మాత్రం సరదాగా ఇంట్లోవారికి తెలియకుండా, బస్ లో సాలూరులో మా చిన్నాన్నగారింటికి వెళుతున్నాని చెప్పి , ఒక అద్దె సైకిల్ మీద ఓ పది,పన్నెండు మైళ్ళ దూరంలో వున్న సాలూరు ఉదయం వెళ్ళి, సాయంత్రానికి తిరిగి వచ్చేశాను.  ముందుగా చెప్పినట్లు దూరాన బస్సులు, లారీలు కనిపిస్తే అవి నన్ను దాటి వెళ్ళేవరకు సైకిల్ దిగిపోయేవాడిని. అప్పట్లో నాకది ఒక ట్రావెల్ ఎడ్వంచర్. 

అలాటి అనుభవంతో ప్రక్కన నరసింగ ఉన్నాడనే ధైర్యంతో సైకిల్ మీద వెళ్ళి ఇన్విటేషన్లు ఇవ్వడానికి అంగీకరించాను. నిజానికి నరసింగ నాకంటే పొట్టివాడే. అయినా సైకిల్ సీటు మీదకు సులభంగానే ఎక్కగలిగేవాడు. అది నాకు చేతనయ్యేదికాదు. మొత్తానికి  సొంత సైకిళ్ళమీద  ట్రిప్లికేన్ లో వున్న పైక్రాఫ్ట్స్ రోడ్ లో వుండే వి.ఎ.కె.రంగారావుగారింటికి మేమిద్దరం బయల్దేరాము. టి.నగర్ నుండి గోపతినారాయణస్వామి చెట్టి రోడ్ (జి.ఎన్.చెట్టి రోడ్) చివరనున్న సన్ ధియేటర్ (బండి సుందర్రావు నాయుడుగారి సినీమా హాలు. సుందర్రావులోని మొదటి మూడు ఇంగ్లీష్ అక్షరాలతో SUN Theatre గా పేరు పెట్టారు) దాటిన తర్వాత మౌంట్ రోడ్ వస్తుంది. అక్కడ ఎడమవేపు జెమిని స్టూడియో వేపునుండి నుంగంబాక్కం  హైరోడ్,  కుడివేపు  అమెరికన్ కాన్స్యులేట్, చర్చ్ ల వేపునున్న కెథెడ్రల్ రోడ్ వచ్చి కలుస్తాయి. అక్కడ నుండి కొంచెం దూరంలో ఎడమ వేపు వీకంసీస్ డైమండ్ కంపెనీవాళ్ళ సెఫైర్, బ్లూడైమండ్, ఎమరాల్డ్ సినీమా ధియేటర్ల కాంప్లెక్స్, అది దాటాక కుడివైపున చర్చ్ పార్క్ కాన్వెంట్. దాని దగ్గర ముందు పీటర్స్ రోడ్, కాన్వెంట్ దాటాక లాయడ్స్ రోడ్, వైట్స్ రోడ్, పటుల్లోస్ రోడ్, జనరల్ ప్యాటర్స్ రోడ్, వాలాజా రోడ్, ఏడమ్స్ రోడ్ అన్ని వరసగా మౌంట్ రోడ్ లో కుడివేపు వుండే రోడ్లు. సకల నదులు సముద్రంలోనే కలుస్తాయన్నట్లుగా మౌంట్ రోడ్ మీద కుడిచేతివేపున్న రోడ్లన్నీ తూర్పునున్న బంగాళాఖాత సముద్ర తీరానికే చేరుస్తాయి. ఈ పైక్రాఫ్ట్స్ రోడ్ చివరనే ట్రిప్లికేన్ బీచ్. అక్కడే సంగం కాలంనాటి మదురై నగరాన్ని తన శాపంతో దహించివేసిన మహా పతివ్రత, స్త్రీ శక్తి కణ్ణగి విగ్రహం రౌద్రంగా దర్శనమిస్తూంటుంది.

మేము ముందు చర్చ్ పార్క్ కాన్వెంట్ ముందున్న పీటర్స్ రోడ్ మీద (అంతగా బస్సుల రద్దీ వుండని కారణంగా) రాయపేట వరకు వెళ్ళి అక్కడ ఎడమవేపు తిరిగి "కేసరి కుటీరం", "గౌడీయమఠ్" దాటుకొని రాయపేట పోలిస్ స్టేషన్, పాత ఉడ్ ల్యాండ్స్ హోటల్ (ఇప్పుడు ఉడ్ లాండ్స్ సింఫనీ సినీమా థియేటర్ వుంది), రాయపేట గవర్నమెంట్ హాస్పిటల్ దాటాక నాలుగు రోడ్ల కూడలి. అక్కడ ఎడమవేపు మౌంట్ రోడ్ వెళ్ళే వైట్స్ రోడ్‌, తిన్నగాగా వెడితే (అది కూడా మౌంట్ రోడ్ లో బుహారీ హోటల్ దగ్గరకు వెళుతుంది) జనరల్ పాటర్స్ రోడ్ లోని ఓడియన్, మిడ్ ల్యాండ్ (తర్వాత  జయప్రదగా మారింది. సినీనటి జయప్రద తన తమ్ముళ్ళ కోసం కొనుగోలు చేసారని వార్త. కుడి వేపు తిరిగితే ట్రిప్లికేన్ లోని పైక్రాఫ్ట్స్ రోడ్. ఆ ప్రాంతమంతా ఈనాటికీ ముస్లిముల నివాసాలు, వ్యాపారాలు, మసీదులు, దర్గాలతో వారి ప్రాబల్యంతోనే నిండి వుంటుంది.

మొత్తానికి పైక్రాఫ్ట్స్ రోడ్ లోకి ప్రవేశించి కుడి ఎడమలు చూసుకుంటూ రంగారావుగారి ఇల్లు వెతకడం ప్రారంభించాము. అంతకుముందు మాలో ఎవరు వారింటికి వెళ్ళింది లేదు. సినీమా డైరక్టరీ ఆధారంతో ఇంటివేట మొదలెట్టాము. 'రామ్ మహల్' పేరిట  ఏ భవంతీ కనపడలేదు. ఇప్పటిలా అప్పుడు సెల్ ఫోన్లో, విరివిగా లోకల్ టెలిఫోన్ బూత్ లో వుండేవికావు. అలా కుడి ఎడమల కుసుమపరాగం అనుభవిస్తూ పైక్రాఫ్ట్స్ చివర వరకు వెళ్ళిపోయాము. అక్కడొక పెద్ద రావిచెట్టు. దానికి సమీపంలోనే టి.నగర్ నుండి వచ్చే 13 వ నెంబర్ బస్ ల చివరి స్టాప్. అక్కడ నుండి రోడ్ దాటి అవతలివేపుకు వెళితే ట్రిప్లికేన్ బీచ్. మాకు కావలసిన  'రామ్ మహల్' తప్ప అన్నీ కనిపిస్తున్నాయి. అడ్రస్ లో ఉన్న నెం.1 (అనే గుర్తు) లో ఒక చిన్న ఉడిపి హోటల్ వుంది. వి.ఎ.కె.రంగారావుగారి ఇల్లు మాత్రం కనపడలేదు. ఇక వెతికే ఓపికలేక ఆ చిన్న హోటల్ లోకి వెళ్ళాము. హోటల్ చిన్నదే అయినా శుభ్రంగా వుంది. ఫలహారాలు రుచికరంగా వున్నాయి. ఆ సమయంలో ఆవిర్లు వస్తున్న వేడివేడి ఇడ్లీలు, తెలుగువారిష్టపడే కారపు చట్నీ మాకెంతో ఆనందం కలిగించింది. ఆ హోటల్లో ఉదయం నుండి రాత్రి హోటల్ మూసేవరకూ ఏ సమయంలోనైనా వేడివేడి ఇడ్లీలు లభిస్తాయని తెలిసింది. తర్వాత నేను ఎప్పుడు బీచ్ కు వెళ్ళినా 13 నెంబర్ బస్ దిగి ముందు ఆ హోటల్లో రెండు వేడివేడి ఇడ్లీలు తిని మరీ బీచ్ కు వెళ్ళేవాడిని. 
 
ఇక ఆవేళకి వెతుకులాట కార్యక్రమానికి స్వస్తి చెప్పి కాళ్ళీడ్చుకుంటూ.... కాదు సైకిళ్ళు తొక్కుకుంటూ ఇంటికి చేరుకున్నాము. 

ఆ తరువాత తీరుబడిగా మరోసారి సినీమా డైరక్టరీలో వి.ఎ.కె.రంగారావుగారి ఎడ్రస్ తీసి చూశాము. తీరా చూస్తే అది పైక్రాఫ్ట్స్ రోడ్ కాదు. పైక్రాఫ్ట్స్ గార్డెన్స్.   హడావుడిలో  గార్డెన్స్ అనే మాటను వదిలేసి రోడ్ అని ఎడ్రస్ రాసుకోడంతో అంతా తారుమారు అయింది. పైక్రాఫ్ట్స్ రోడ్ ట్రిప్లికేన్ లో వుంది. పైక్రాఫ్ట్స్ గార్డెన్స్. ఇప్పుడు కాలేజ్ రోడ్ మీదున్న విమెన్స్ క్రిస్టియన్ కాలేజ్ కి, శంకర్ నేత్రాలయాకి ముందు ఇండియన్ మిటియెరోలాజికల్ సంస్థ దగ్గరలో ఉండే ప్రాంతం. నుంగంబాకంలో హేడోస్ రోడ్ మీదున్న శాస్త్రీ భవన్ ఎదురువైపు ఉండే రోడ్డు పైక్రాఫ్ట్స్ గార్డెన్ రోడ్. ఆ తర్వాత మరో రోజు సరైన ఎడ్రస్ కు వెళ్ళి అందజేయవలసిన ఆహ్వానం సక్రమంగా అందజేశాము. అది వేరే సంగతి. 

పరమానందయ్య శిష్యుల పనితనం ఇలాగే ఉంటుంది.

ఘంటసాల మాస్టారింటి క్రింది పోర్షన్లో కొల్లూరి వారి కుటుంబం వుండేది. మంచి స్నేహపాత్రులు. వెంకటేశ్వరరావుగారు (ఆయన పేరు కూడా మాస్టారి పేరే) అంబత్తూర్ లోని ఒక ఫ్యాక్టరీలో ఒక పెద్ద పదవిలోనే వుండేవారు.

వెంకటేశ్వరరావుగారు ఘంటసాలవారింట్లోకి రాకముందు  పాండీబజార్లో హరిబాబు అనే సుప్రసిధ్ధ మేకప్ మెన్  ఇంట్లో అద్దెకు వుండేవారు. వెంకటేశ్వరరావు దంపతులు నేనంటే ఎంతో అభిమానంగా వుండేవారు. నా ఉద్యోగం విషయంలో మంచి అక్కర చూపేవారు. ఒక రోజు ఆయన తన కారులో  అంబత్తూర్  ఇండస్ట్రియల్ ఎస్టేట్ లోని తమ ఆఫీసుకు తీసుకువెళ్ళి అంతా చూపించారు. వాళ్ళ ఆఫీసులో నాకు తగిన ఖాళీలు లేవని చెప్పారు. ఏదో లీవ్ వేకన్సీలో ఒక పది పదిహేను రోజులు అక్కడ నాకు అవకాశం కల్పించారు. తర్వాత,  పాడీలో వున్న బ్రిటానియా బిస్కెట్ ఫ్యాక్టరీకి తీసుకువెళ్ళారు. ఆ కంపెనీ కూడా అప్పటికి కొద్ది సంవత్సరాలముందే బిస్కట్ల తయారీ ప్రారంభించింది. అక్కడ కోటేశ్వరరావు అనే తెలుగాయన  ఒక డిపార్ట్మెంట్ కు మేనేజర్ గా వుండేవారు. మా వెంకటేశ్వరరావురావుగారూ ఆయనా స్నేహితులు. నన్ను పరిచయంచేసి విలయిన సహాయం చేయమని అడిగారు. ఫ్యాక్టరీ సైడ్ ఉద్యోగమైతే వెంటనే ఏర్పాటు చేయవచ్చని, అడ్మినిస్ట్రేషన్ సైడ్ అంటే  వెంటనే అవకాశం లేదని, నా బయోడాటా తనకు ఇవ్వమని, అవకాశాలు వచ్చినప్పుడు తప్పక ఇంటర్వ్యూకు పిలుస్తామని హామీ ఇచ్చారు.  అక్కడితో సరి.  కాకపోతే నాకు కాబోయే సతీమణి బ్రిటానియా బిస్కట్ల ఫ్యాక్టరీలోనే పనిచేస్తూవుండడం యాదృఛ్ఛికం.

అలాగే డి.ఎన్.రావుగారి స్నేహితుడు బి.డి.రావుగారి సిఫార్సుతో మెడ్రాస్ ఎనామిల్స్ అనే కెమికల్స్ కంపెనీకీ వెళ్ళాను.  అది సెంట్రల్ స్టేషన్ పక్కనున్న సిడెన్హామ్స్ రోడ్ చివరలో వుండేది. ఆ కంపెనీకి అధిపతి కానూరి రంజిత్ కుమార్ గారు. ఆయన, తమ కంపెనీ జీతాలు తక్కువని, వాళ్ళిచ్చే జీతం రెండు బస్సుల్లో వచ్చి వెళ్ళడానికే సరిపోతుందని చెప్పారు. ఆ ప్రాంతంలోనే ఉండేవాళ్ళకైతే అనువుగా వుంటుందని అందుచేత ఆ కంపెనీలో చేరి టైము వృధా చేసుకోవద్దని సలహా ఇచ్చారు. ఆ కానూరి రంజిత్ కుమార్ గారు ఒక దశాబ్దం తర్వాత  చిత్ర నిర్మాత గా కొన్ని తెలుగు  రంగుల సినీమాలు కూడా తీశారు.

కొల్లూరి వెంకటేశ్వరరావుగారు నాలాగే పొట్టిగా బొద్దుగా వుండేవారు. కానీ ఆయన పేరు వెనక పల్నాటి చేంతాడంత డిగ్రీలుండేవి. చాలా తెలివైన వాడు. ఆయన తమ్ముడిని పిల్లలంతా శాస్త్రిబాబు అనేవారు. అతను అప్పట్లో అన్నగారి వద్ద వుంటూ ఛార్టర్డ్ ఎక్కౌంటెన్సీ చదివేవాడు.  వీరిది రాజమండ్రి. రావుగారి సతీమణిది కాకినాడ, భమిడిపాటివారి ఆడపడుచు. వారు ఘంటసాలవారింట్లోకి వచ్చేనాటికి ముచ్చటగా  ముగ్గురు చిన్నపిల్లలు. ఒక అబ్బాయి, ఇద్దరమ్మాయిలు. గతంలో చెప్పినట్లుగా వారందరితో నెం. 35, ఉస్మాన్ రోడ్ 'పిల్లలు తెచ్చిన చల్లని రాజ్యం' లా పిల్లలతో  కళకళలాడుతూ వుండేది.

ఒక  ఆదివారం రోజు రావుగారి పిల్లలంతా 'చిన్నా బాబు వచ్చాడు, చిన్నాబాబు వచ్చాడంటూ' గోలగా అరవడం వినిపించింది. ఎవరా చిన్నా బాబు అని చూశాను. అంతకుముందెప్పుడూ చూడలేదు. ఆయన రావుగారికి తమ్ముడట. పెత్తండ్రి కొడుకు. మద్రాసులోనే అనుకుంటాను ఏదో ఒక జాపనీస్ కంపెనీలో  ఇంజనీర్ ట.  అతని తమ్ముడు కూడా IIT లో చదివేవాడట, అతనిని వీళ్ళంతా పండుబాబు అని పిలిచేవారు. అప్పుడప్పుడు వీళ్ళు విడివిడిగా శెలవు రోజుల్లో రావుగారింటికి వస్తూండేవారు.  చిన్నాబాబు చాలా హాండ్సమ్ గా రేమండ్ సూటింగ్, రెబొన్ గ్లాసెస్ మోడల్ లా చాలా స్టైల్ గా వుండేవాడు.  టైట్ ప్యాంట్, టక్ చేసిన టైట్ షర్ట్, నడుముకి బెల్ట్ , కోటెడ్ కూలింగ్ గ్లాసెస్ తో ఏదో కంపెనీ మోడల్ లా కనిపించాడు అప్పటి నా కళ్ళకు. అతని స్కూటర్ కూడా ఇతర వెస్పా, లాంబ్రెట్టాలకు భిన్నంగా వుండేది. అలాటి స్కూటర్లు చాలా అరుదుగా రోడ్లమీద కనపడేవి. మనిషి అతి చురుకు అనిపించేది. స్కూటర్ స్టార్ట్ చేసిన మరు సెకెండ్ లోనే మనిషి మాయమయ్యేవాడు. 

అలాగే కొల్లూరివారి బావమరదులు భమిడిపాటి బాపయ్యపంతులుగారు ఆయన సొదరుడు రామ్మోహన్, రావుగారి వదినగార్లు,మరదళ్ళ రాకపోకలతో నెం.35, ఉస్మాన్ రోడ్ నిత్యమూ కలకలలాడుతూవుండేది.

భమిడిపాటి బాపయ్య పంతులుగారి తండ్రిగారు సత్యనారాయణ గారనే గుర్తు. వారిది కాకినాడ. ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టు బిజినెస్ అనే విన్నాను. బాపయ్యపంతులుగారి సోదరులు రామ్మోహన్ కంటే పైన మరొకాయన వుండేవారు, పేరు గుర్తులేదు. రామ్మోహన్ బ్రిడ్జ్ ఆటలో ఎక్స్పర్ట్. మద్రాసు లోని  జింఖానా వంటి ప్రముఖ క్లబ్ లలో జరిగే బ్రిడ్జ్ టోర్న్ మెంట్లలో పాల్గొనేవారు. 

బాపయ్యపంతులుగారు చిత్రనిర్మాత. భాగస్తులతో కలసి కొన్ని సినీమాలు తీసి అవి కలసి రాక స్వతంత్రంగా  'మాయని మమత' అనే సినీమా తీయాలని తలపెట్టారు. డైరక్టర్ కమలాకర కామేశ్వరరావుగారు. ఎన్.టి.రామారావు, బి.సరోజాదేవి నాయికా నాయకులు.  సంగీత దర్శకుడిగా ఘంటసాలవారనే అనుకున్నారు. వారి ఆఫీసులోని ప్రారంభోత్సవానికి మేమంతా వెళ్ళాము. పాండీబజార్ వెనక ప్రాంతాల్లో ఆ ఆఫీసు వుండేది. ఒక రోజు రాత్రి ఆ కార్యక్రమం జరిగింది. త్వరలోనే  పాటల కంపోజింగ్ ప్రారంభించాలని మాస్టారితో చెప్పడమూ జరిగింది. ఈలోగా కొన్ని అనివార్య మార్పులు జరిగి ఘంటసాల మాస్టారు చేయవలసిన ఆ  'మాయని మమత ' సినీమా అశ్వథ్థామగారికి వెళ్ళింది. ఘంటసాలవారి నేపథ్య గానంతో దేవులపల్లివారు వ్రాసిన పాటలు చాలా చక్కగా అమరాయి. సినీమా కూడా చాలా బాగా తీశారు. కానీ డిస్ట్రిబ్యూషన్ సమస్యలు, లోపాలకారణంగా  నిర్మాత బాపయ్య పంతులు మాత్రం నష్టాలనే చవిచూసారని అనుకోవడం విన్నాను.

చిత్రం ఏమంటే 'మాయని మమత' వచ్చిన ఆరేళ్ళకు, ఘంటసాలవారు కాలం చేసాక వారి రెండో అమ్మాయి భమిటిపాటివారింటి కోడలు కావడం.  అప్పటికి కొల్లూరి వెంకటేశ్వరావుగారు వేరే ఇంటికి మారిపోయారు. అప్పుడు టేలర్స్ రోడ్ లో వుండేవారనుకుంటాను. లేదా జాంబియావో, కెన్యావో ఉద్యోగరీత్యా వెళ్ళిపోయారా ? గుర్తు లేదు. ఒకప్పటి కుటుంబ మిత్రులే బంధువులు కూడా కావడం ఎంతో విశేషం. చాలా ఆనందదాయకం. ఆ కుటుంబాలతో ఇంకా మా స్నేహం చెక్కుచెదరకుండా కొనసాగడం మరింత సంతోషకరం.

🌿🌷🌿


1969 లో ఘంటసాల మాస్టారు పాడిన పాటలెన్నో హిట్ గా ప్రజాదరణ పొందాయి. అందులో కొన్ని పాటలు  --

అదృష్టవంతులు చిత్రంలోని "అయ్యయ్యో బ్రహ్మయ్యా", "ముముముద్దంటే చేదా", వరకట్నం లోని "ఇదేనా మన సంప్రదాయమిదేనా", శ్రీ రామకధలో "మాధవా నను లాలించరా", మూగనోములో "ఈ వేళలో నాలో ఎందుకో", "నిజమైనా కలయైనా", సప్త స్వరాలులో "యదుబాలా శ్రితజనపాలా", "హాయిగా పాడనా గీతం", బందిపోటు దొంగలులో "విరిసిన వెన్నెలవో", "విన్నానులే ప్రియా", గండికోట రహస్యంలో "నీలాల నింగి మెరిసిపడే", విచిత్ర కుటుంబంలో "ఆడవే జలకమ్ములాడవే", సత్తెకాలపు సత్తెయ్యలో "నన్ను ఎవరో తాకిరి", ఆదర్శకుటుంబంలో "బిడియమేలా ఓ చెలి"

ఆత్మీయులు లో "కళ్ళల్లో పెళ్ళిపందిరి", "చేమంతి ఏమిటే ఈ వింత", బుధ్ధిమంతుడులో "నను పాలింపగ నడచి వచ్చితివో", "భూమ్మీద సుఖపడితే", "గుట్టమీద గువ్వ కూసింది", "బడిలో ఏముంది", "టాటా వీడుకోలు గుడ్ బై". ఈ పాటలలో ఘంటసాలవారు ఇద్దరు అక్కినేనిలకు మధ్య గల  వైరుధ్యభావాలకు తగినట్లుగా తన గాత్రంలో మార్పును సుస్పష్టంగా వినిపించారు. 


నను పాలింపగ నడచీ వచ్చితివా

మాతృదేవతలో "విధి ఒక విషవలయం".

ఆ సంవత్సరంలో అజరామరంగా, ఆపాతమాధుర్యాలుగా నిలచిపోయే పాటలను ఘంటసాల మాస్టారు ఏకవీర చిత్రంలో పాడారు. "తోటలో నా రాజు", "ఒక దీపం వెలిగింది", ఎస్.పి.బి.తో పాడిన "ప్రతీరాత్రి వసంతరాత్రి", పాటలు ఈనాటికీ శ్రోతలను అలరిస్తూనే వున్నాయి.


ఒక దీపం వెలిగింది

ఆ ఏడాది మాస్టారి సంగీత దర్శకత్వంలో రెండే సినీమాలు వచ్చాయి. ఒకటి భలే అబ్బాయిలు, మరొకటి‌ జరిగినకధ.

పేకేటి డైరక్షన్ లో తోట సుబ్బారావుగారి శ్రీదేవీ కంబైన్స్ నిర్మించిన "భలే అబ్బాయిలు" "వక్త్" అనే హింది సినీమాకు తెలుగు రూపం. " గులాబీలు పూసే వేళ", "కలగన్నానే తీయని కలగన్నానే", "ఆనాటి మధుర వసంతం" వంటి పాటలు వీనులవిందు చేసాయి. 


ఆనందం నాలో పొంగేను

నాగావళి రామవిజేతా బ్యానర్ మీద నిర్మాత దర్శకుడు కె.బాబురావు ప్రథమ ప్రయత్నం "జరిగిన కథ" ఈ సినీమా తర్వాత తీసిన మరో నాలుగు చిత్రాలకు ఘంటసాలవారే సంగీతం నిర్వహించారు. సంగీతం విషయంలో పూర్తి స్వేఛ్ఛనిచ్చే నిర్మాత బాబూరావు. అందుకే ఆయన చిత్రాలలోని పాటలన్నీ సన్నివేశపరంగా అందరి ప్రశంసలు పొందాయి.

జరిగినకథ చిత్రంలోని "భలేమంచి రోజు" పాట ఎంతటి సూపర్ హిట్టో అందరికీ తెలిసినదే. ఇదే చిత్రంలోని "ఏనాటికైనా ఈ మూగవీణ", "చినవాడ మనసాయెరా", "లౌ లవ్ లవ్ మి నెరజాణ", "ఇదిగో మధువు ఇదిగో సొగసు", "తోడుగ నీవుంటే నీ నీడగ నేనుంటే" అన్ని పాటలు ఈనాటికీ అన్ని వేదికలమీదా వినిపిస్తునేవున్నాయి.


చినవాడ మనసాయెరా


లౌ లౌ లౌ మీ నెరజాణా

కవి యిచ్చిన మాటలకు వరస కట్టాలన్నా, లేక ఇచ్చిన ట్యూన్ కూ సరిపడిన సాహిత్యం అమరాలన్నా సంగీతదర్శకుడు, గీత రచయిత ఇద్దరూ సమర్థులైవుండాలి. వీరిచ్చిన పాటను సమర్థవంతంగా తెరకెక్కించే నైపుణ్యం, ప్రతిభ చిత్ర దర్శకుడికి వుండాలి. వీరందరిని అర్ధం చేసుకొని నటీనటులు సందర్భోచితంగా నటించాలి. వీరందరి సమిష్టి కృషిని తెరమీద చూసే ప్రేక్షకుడు అవునని అనాలి అప్పుడే ఆ  సినీమా విజయం పొందుతుంది. ఆ సినీమా లోని పాటలు ప్రచారంపొంది పదికాలాలపాటు ప్రేక్షకుల మనసులలో నిలచిపోతాయి. కానీ సినీమా చూసే ప్రేక్షకుడికి  ఎప్పుడు ఏ సినీమా ఎందుకు నచ్చుతుందో ఇంతవరకు వారిని సృష్టించిన బ్రహ్మదేవుడికి కూడా తెలియని పరమ రహస్యం. అందువల్లనే సరైన ప్రచారం లేక మాణిక్యాలవంటి పాటలు ఎన్నో మట్టిలో కలసి మరుగునపడిపోయాయి. 

🌺

ఘంటసాల మాస్టారికి ఆశ్చర్యాన్ని ఆనందాన్ని కలిగించే విషయాలెన్నో వచ్చే వారాలలో...

మళ్ళీ వచ్చేవారం మరికొన్నివిశేషాలతో...
                      ...సశేషం

*With a view to make the narrative more authentic and to corroborate it, images, audio and video clips are attached at appropriate places. If such usage is found objectionable to the copyright holders the same shall be removed if and when notified.

2 comments:

చుండి వేంకట రాజు said...

ధన్యవాదాలండి

హృషీకేష్ said...

చక్కగా వివరణాత్మకoగా ఉంది sir మీ వ్యాసం. మద్రాస్ పరిచయం చేసారు. చదవడానికి కుతూహలం గా ఉంది. అభినందనలు. హృషీకేష్🙏🙏