visitors

Sunday, October 3, 2021

నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 2 - ఏభైయొకటవ భాగం

03.10.2021 -  ఆదివారం భాగం - 51:
అధ్యాయం 2 భాగం 50 ఇక్కడ

  

నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్

ఇప్పటి చెన్నైలో మౌంట్ రోడ్ స్పెన్సర్స్ ప్లాజాకు ఎదురుగా సిటీ బ్యాంక్ వుంది. ఆ బ్యాంక్ మొదటి పేరు ఫస్ట్ నేషనల్ సిటి బ్యాంకు, ఒక విదేశీ సంస్థ. మద్రాసులో లో కొత్తగా తెరిచారు. ఆ బ్యాంక్ లో స్టెనో టైపిస్ట్ ల ఉద్యోగానికి పత్రికలలో ప్రకటన చేశారు. అది చూసి నేను  నా అప్లికేషన్ ను పంపాను. 

డా. డి.ఎన్.రావు గారి అబ్బాయి  శ్రీనాధ్ అదే ఫస్ట్ నేషనల్ సిటి బ్యాంక్ బొంబాయి బ్రాంచ్ లో ఆఫీసర్ గా పనిచేస్తున్నాడు. కొత్తగా జాయిన్ అయ్యారు. ఒంటరిగా ఉండేవాడు. బొంబాయి మహానగరంలో ఇంటి అద్దెలు చాలా ఎక్కువ. ఇండియాలో ఫ్లాట్స్,అపార్ట్మెంట్స్ సంస్కృతి ముందుగా అభివృద్ధి చెందినది బొంబయిలోనే.  1970ల తర్వాతే మద్రాస్ లో మల్టీస్టోరీడ్  రెసిడెన్షియల్ ఫ్లాట్స్ సిస్టమ్ డెవలప్మెంట్ ప్రారంభమయింది. ఎగ్మూర్ పోష్ లొకాలిటీస్ లో ఈ ఫ్లాట్స్ ఒకటో రెండో వుండేవి. వాటిలో ఎక్కువగా మార్వాడీలు, గుజరాతీలు వుండేవారు. దాక్షిణాత్యులంతా విశాలమైన  కాంపౌండ్ తో ఇండివిడ్యువల్ భవంతులు, ఇళ్ళకే ప్రాధాన్యత ఇచ్చేవారు. మరి మద్రాస్ లో వాళ్ళుండే 'పూర్ణిమ' లాగే బొంబాయిలో శ్రీనాధ్ వుండేది ప్రత్యేకమైన పెద్ద ఇల్లేనా అని అడిగితే అతను చెప్పిన సమాధానం అప్పట్లో షాక్ నే కలిగించింది. ఒక మల్టీస్టోరీడ్ బిల్డింగ్ లో ఒక చిన్న 12'×12' రూమ్ లో మరొకరితో షేర్ చేసుకొని వుంటాడట. ఆ చిన్న రూమ్ కు ఇతని వంతు అద్దె 2500/- రూపాయలని చెప్పిన గుర్తు. అంత అద్దెకు మద్రాస్ లో  నాలుగేసి గదులున్న చాలా పెద్ద ఇళ్ళే అద్దెకు దొరికేవి.  బొంబాయి లైఫ్ స్టైల్ గురించి అతను చెప్పే మాటలను ఆశ్చర్యంగా వినేవాడిని.

అలాటి పెద్ద బ్యాంక్ నుండి నన్ను ఇంటర్వ్యూకు రమ్మని పిలవడం నాకు ఆశ్చర్యమే. మద్రాసులోని ఫస్ట్ నేషనల్ సిటీ బ్యాంక్ అప్పట్లో ప్యారీకార్నర్ వెనక ఆర్మీనియన్ స్ట్రీట్ లో వుండేది. మా పానగల్ పార్క్ బస్ స్టాప్ లో 11 నెంబర్  బస్ పట్టుకొని ఆఖరి స్టాపింగ్  అయిన ప్యారీస్ కార్నర్ లో దిగి ఆర్మీనియన్ స్ట్రీట్ లోని ఫస్ట్ నేషనల్ సిటీ బ్యాంక్ కు నడుచుకుంటూ వెళ్ళాను. అలాటి పెద్ద బ్యాంక్ లకు వెళ్ళడం కొత్త. అక్కడ అందరూ చాలా టిప్ టాప్ గా సూటూ బూట్లతో హైలెవెల్ లో కనిపించారు. ఇంటర్వ్యూ కు వచ్చినవారు కూడా చాలా స్టైలిష్ గా వున్నారు. అందరిలోకి అతి సామాన్యంగా వున్నది నేను మాత్రమే. నేను డి.ఎన్.రావుగారి USEFI లో పనిచేసేప్పుడు నా సర్టిఫికెట్లు అన్ని పెట్టుకోవడానికి అక్కడి సెక్రెటరీ కుప్పుస్వామి ఒక బ్లూకలర్ థిక్ ప్లాస్టిక్ క్లోజ్ట్ ఫోల్డర్ ఒకటి ఇచ్చారు. ముందువేపు స్కైబ్లూ , వెనకవేపు డార్క్ బ్రోన్. నా సర్టిఫికెట్లు అన్నీ ఇంకా అదే ఫోల్డర్ లో నా దగ్గర భద్రంగా వున్నాయి. ఆ ఫోల్డర్ తోనే ఆ రోజు ఇంటర్వ్యూ కు వెళ్ళాను. ప్రతి ఇంటర్వ్యూ లాగే సాగింది.  ఒక  పావుగంటలో ఇంటర్వ్యూ ముగిసింది. ఏ సంగతీ తర్వాత తెలియజేస్తామన్నారు. నేను సరేనని వెనక్కి తిరిగి వచ్చేసాను. 

కొన్నిరోజుల తర్వాత  బొంబాయి నుండి శ్రీనాధ్ వీకెండ్స్ కు మద్రాస్ వచ్చారు. అతని బ్యాంకు లోనే నన్ను ఇంటర్వ్యూకు పిలిచారన్న విషయం శ్రీనాధ్ కు  చెప్పడానికి వెళ్ళాను. అతను నాకంటే వయసులో మరీ పెద్దవాడేమీ కాదు. ఉంటే ఒకటి రెండేళ్ళు పెద్దవాడేమో, తెలియదు. కానీ, చాలా తెలివైనవాడు, చొరవగలవాడు. అతనికి నా ఇంటర్వ్యూ వివరాలన్ని చెప్పాను. అన్నీ విని అతను ఒకే మాటన్నాడు 'ఆ స్టెనోగ్రాఫర్ ఉద్యోగం నీకు రాదు' అని. దానికి శ్రీనాధ్ చెప్పిన కారణం నాకు ఒక గుణపాఠం. ఆ బ్యాంక్ లో నన్ను ఇంటర్వ్యూ చేసిన పెద్దమనిషి అన్ని వివరాలు అడుగుతూ ఆ బ్యాంకు లో నాకు తెలిసినవారెవరైనా ఉన్నారా అని అడిగాడు. నేను మహాగొప్పగా శ్రీనాధ్  పేరుచెప్పి బొంబాయి బ్రాంచ్ లో పనిచేస్తున్నారని చెప్పాను. అదే నా కొంపముంచిందిట. తెలిసినవాళ్ళున్నారని చెప్పడం అలాటి పెద్ద కంపెనీలలో ఒక డిస్క్వాలిఫికేషన్ క్రింద పరిగణిస్తారట. అలాటి అప్లికెంట్స్ ను పూర్తిగా పక్కన పెట్టేస్తారట. కారణాలేమైనా  ఆ తర్వాత మళ్ళీ నేను ఆర్మీనియన్ స్ట్రీట్ ఫస్ట్ నేషనల్ సిటీ బ్యాంక్ ఛాయలకు వెళ్ళనేలేదు. 
🌷

మా ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లయొజన్ ఆఫీస్ మైలాపూర్ నుండి అడయార్ కు మారాక నేను 12B బస్సులకోసం కాచుకోవడం మానేశాను. బస్ లో వెళితే ICF నుండి వచ్చే 47Aలో కానీ, విల్లివాక్కం నుండి వచ్చే 47 బస్ లో కానీ వెళ్ళాలి. ఆ బస్ స్టాప్ లు పానగల్ పార్క్ బస్ స్టాపింగ్ లకు కొంచెం దూరంలో వున్న రామకృష్ణ మెయిన్ స్కూల్ దాకా వెళ్ళాలి. ఆ బస్సులు సరియైన  సమయానికి వచ్చేవి కావు. వచ్చినా ఆ బస్సులు ఫుల్ గా జనాలు వేలాడుతుండేవారు. ఆ స్టాప్ లో ఆగకుండానే వెళ్ళిపోయేవి. ఆ బస్సుల కోసం కాచుకొని కూర్చుంటే ఆఫీసుకు బాగా లేటయిపోయేది. ఎంత నాకు పనిలేని గవర్నమెంట్ ఆఫీసయినా వారిచ్చే జీతానికి విశ్వాసంగా, సక్రమంగా పనిచేయాలనే నియమం నాకు వుండేది. అందువల్ల ఇంక సిటి బస్సులను నమ్ముకోకుండా ఆఫీసుకు సైకిల్ మీద వెళ్ళడం ప్రారంభించాను. వ్యాయామానికి వ్యాయామం. డబ్బుకు డబ్బు ఆదా. దీనివల్ల మా అమ్మగారికి ఆనందమే. బస్సులు వెళ్ళిపోతాయనే నెపంతో తన కొడుకు తాను వండి కట్టిచ్చే టిఫిన్ బాక్స్ పట్టుకెళ్ళకుండా పారిపోయే అవకాశం ఇప్పుడులేదు. మొత్తానికి ఓ నలభైయైదు నిముషాలలో సైకిల్ మీద అడయార్ గాంధీనగర్ లోని ఆఫీసుకు చేరేవాడిని. మా ఇంటినుండి సౌత్ ఉస్మాన్ రోడ్ చివరనున్న మౌంట్ రోడ్ వరకూ ఒకటే తిన్నటి రోడ్. ఇప్పటిలా ఫ్లైఓవర్ లు, వన్ వే ట్రాఫిక్ ల బెడద వుండేది కాదు. టి.నగర్ రంగనాథన్ స్ట్రీట్ నుండి టి నగర్ బస్ స్టాండ్ దాటేవరకే వాహనాల రద్దీ ఎక్కువగా వుండేది. ఆ తర్వాత  ప్రయాణం ఫ్రీగా సాగేది. ఆ తర్వాత మళ్ళి మౌంట్ రోడ్ లో సైదాపేట బ్రిడ్జ్ దాటేవరకు వాహనాల రాకపోక ఎక్కువే. లిటిల్ మౌంట్ దాటి రాజభవన్ రోడ్ ప్రవేశించాక, అడయార్ ఆఫీస్ కు వెళ్ళేవరకు చక్కనీ రాజమార్గమే. చాలా నిర్మానుష్యంగా, చల్లటి సముద్రపుగాలి, ప్రశాంతమైన వాతావరణంతో చాలా ఆహ్లాదకరంగా వుండేది.  రాజభవన్, గిండీ ఇంజనీరింగ్ కాలేజ్, గాంధీ మండపం దాటి IIT క్యాంపస్, క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, దాటేవరకూ రోడ్ కు రెండు ప్రక్కలా దట్టమైన చెట్లతో లోపలనున్న గిండీ ఫారెస్ట్ లోని లేళ్ళు, దుప్పులు రోడ్ ను క్రాస్ చేసుకుంటూ ఛెంగు ఛెంగున దుముకుతూ వచ్చేపోయే వాహనాలకు అడ్డుతగులుతూండేవి. సాయంత్రం ఏడు గంటలు దాటితే ఆ రోడ్ మీద నర సంచారమే వుండేదికాదు, అప్పుడప్పుడు తిరిగే బస్సులు,కార్లు తప్ప. అలా ఆ ఆఫీసుకు ఓ రెండేళ్ళపాటు సైకిల్ మీదే వెళ్ళివచ్చేవాడిని. ఆ ఆఫీస్ లో ఫెర్టిలైజర్స్ షిప్మెంట్ టైములో తప్ప మిగిలిన సమయాలలో పెద్దపని వుండేదికాదు. పని తగినట్లుగానే జీతాలు తక్కువే. అక్కడ పనిచేసేప్పుడు ఖాళి సమయమంతా నా షార్ట్ హాండ్ ప్రాక్టీస్, పుస్తకపఠనం, లంచ్ టైమ్ కునుకుపాట్లతో గడిచిపోయేది. సాయంత్రం ఐదు దాటినదగ్గరనుండీ స్టాఫ్ అంతా ఒక్కొక్కరూ మెల్లగా ఇళ్ళకు జారుకునేవారు. లయొజన్ ఆఫీసర్  బావా, IAS గారి నివాసం కూడా అడయార్ లోనే. కుటుంబం వుండేది కాదు. ఒంటరిగా ఒక గెస్ట్ హౌస్ లో వుండేవారు. మనిషి పొడుగ్గా ఏదో అనారోగ్యంతో వున్నట్లు కనపడేవాడు. ఆయన ఆహారం ముప్పొద్దులా బ్రెడ్, గ్రేప్స్, ఆపిల్స్,ఆరెంజ్ లు తోనే గడిపేవాడు. అప్పుడప్పుడు నన్ను తన రూమ్ కి పిల్చి అక్కడ లెటర్స్ డిక్టేట్ చేసేవాడు. ఆయనా ఆ ఆఫీస్ లో ఎక్కువ రోజులు పనిచేయలేదు. ట్రాన్స్ఫరై వెళ్ళిపోయాడు. Men may come,men may go, but the institutions remain the same. మాలాటివాళ్ళు మాత్రం మరో గత్యంతరం లేక అలాటి ఆఫీసులను పట్టుకు వేళ్ళాడుతుంటారు.

ఒక రోజు ఆఫీసులో పని వుండి సాయంత్రం ఇంటికి బయల్దేరడం ఒక గంట లేటయింది. సైదాపేట బ్రిడ్జి దాటి జయరాజ్ థియేటర్ దగ్గరకు వచ్చేసరికి బాగా చీకటిపడి రోడ్ లైట్లు వెలిగించేసారు. నేను సైదాపేట పోలీసు స్టేషన్ ప్రాంతానికి వచ్చేసరికి ఒక ట్రాఫిక్ పోలిస్ అటకాయించాడు. సైకిల్ కు లైట్ లేదని ఫైన్ కట్టమన్నాడు. ఇప్పుడే కదా లైట్లు వేసారు. మరో పావుగంటలో ఇంటికివెళ్ళిపోతానంటాను నేను. సైకిల్ కు వెనకవేపుండే రెడ్ షేడ్ లేదని మరో అభియోగం. అది కొన్ని రోజులముందే ఏ గోడకో కొట్టుకొని ముక్కలైపోయింది. కొత్తది వేయించడానికి బధ్ధకించడంతో ఆ రోజున పోలీస్ కు బలైపోయాను. సాధారణంగా ఆరు లోపల ఇంటికి చేరుకోవడం వలన ఈ సైకిల్ లైట్, వెనక రెడ్ షేడ్ గురించి ఎవరూ పట్టిచ్చుకునేవారు కాదు. బీట్ కాన్స్టేబుల్ సైకిల్ ను పోలీస్ స్టేషన్ లో పెట్టేసి ఓ రెండురోజుల తర్వాత ఫైన్ కట్టేసి సైకిల్ ను తీసుకుపొమ్మన్నాడు. ఎంత బ్రతిమాలినా కనికరించలేదు. బహుశా చేయి తడిపితే వదిలేసేవాడేమో! అందుకు నేను సిధ్ధంగా లేనే. సైకిల్ అక్కడ వదలేసి అడయార్ నుండి వచ్చే 47A. బస్ పట్టుకొని పానగల్ పార్క్ దగ్గర దిగి మెల్లగా ఇంటికి చేరుకున్నాను.

ఆ మర్నాడు ఆఫీసుకు బస్ లో వెళ్ళవలసి వచ్చింది. పానగల్ పార్క్ దగ్గరకు వచ్చేసరికి 12B స్టాపింగ్ దగ్గర గతంలో కనపడ్డ తెలుగాయన మళ్ళీ కనపడ్డారు. ఆయనతో మా ఆఫీస్ లో పనిచేసే జ్యోతిషం  గోపాలకృష్ణ ఏదో మాట్లాడుతున్నారు. నేను వాళ్ళను దాటుకొని రామకృష్ణా స్కూల్ స్టాపింగ్ కు నడిచాను. నేను వెళ్ళిన కాసేపటికి గోపాలకృష్ణ కూడా నేనున్న బస్ స్టాప్ దగ్గరకే వచ్చారు. ఆ తెలుగాయన గురించి ఈ తెలుగాయనను అడిగాను. ఆయనపేరు సూర్యప్రకాశరావు గారని, ఆలిండియా రేడియో లో పనిచేస్తున్నారని చెప్పారు. అయితే మరో సంగీతం మనిషన్నమాట అని అనుకున్నాను. అప్పుడప్పుడు బస్ స్టాప్ ల దగ్గర కలుసుకున్నా వయోభేదం చేత ఆయనతో నాకు పరిచయం పెరగలేదు. కానీ దాదాపు ఒకటిన్నర దశాబ్దం తర్వాత మా రెండో చెల్లెలు మామగారిగా శ్రీ కొచ్చెర్లకోట సూర్యప్రకాశరావుగారితో పరిచయం ఏర్పడింది. వారి మరో అబ్బాయి రాజేశ్వరశర్మగారే  పానగల్ పార్క్ దగ్గరవున్న  నియో కమర్షియల్ టైప్ రైటింగ్ ఇన్స్టిట్యూట్ లో  నాకు సహాధ్యాయి. నేను శ్రీ సూర్యప్రకాశరావుగారితో స్వయంగా వారింటివద్ద  మాట్లాడింది 1994 లో నేను హైదరాబాద్ కు ట్రాన్సఫర్ మీద వెళ్ళినప్పుడే. మనుషుల మధ్య స్నేహాలు, అనుబంధాలు చాలా చిత్రంగా అనూహ్యంగా ఏర్పడతాయి.

🌺🌿🌺


తిరుపతి వేంకటేశ్వర స్వామివారికి పరమ భక్తుడు ఘంటసాల వేంకటేశ్వరరావుగారు.  పౌరాణిక సినీమాలలో వచ్చే దైవ సంబంధమైన గీతాలెన్నింటికో ఘంటసాలవారు ప్రాణప్రతిష్టచేశారు. వారి కంఠంలోని మాధుర్యం, భావం, భక్తితత్పరతల వలన  అనేక భక్తిగీతాలు ప్రజా బాహుళ్యంలోనికి చొచ్చుకుపోయాయి. అనేకమందికి దేవుడిపట్ల భక్తివిశ్వాసాలు ఏర్పడ్డాయి. వివిధ దేవతామూర్తులమీద ఘంటసాలవారు పాడినన్ని భక్తి గీతాలు, పద్యాలు, శ్లోకాలు, అంత సార్ధకంగా మరే గాయకుడు పాడివుండరు. 

1960ల తర్వాత తిరుపతి వెంకటేశ్వరుడి మీద ఘంటసాలవారు వెలువరించిన గ్రామఫోన్ రికార్డులు పల్లె పల్లెలలా, పట్టణాలలో, నగరాలలో, మహానగరాలలో, విదేశాలలోని తెలుగువారందరికీ  దైవప్రార్ధనా గీతాలు అయినాయి. HMV గ్రామఫోన్ కంపెనీ వారికి విపరీతమైన ప్రచారాన్ని, ధనాన్ని సంపాదించిపెట్టాయి.

తెలుగునాట గల ప్రతీ సినీమా హాలు వాళ్ళు మూడాటలకు  ముందుగా ఘంటసాలవారు పాడిన 'ఏడు కొండలా సామి', 'నమో వెంకటేశా' పాటలను విధిగా వినిపించిన తర్వాతే తమ టిక్కెట్ కౌంటర్లు తెరిచేవారు. అదొక సంప్రదాయంగా, సదాచారంగా మారింది. ఆ తర్వాతే మిగిలిన పాటలను లౌడ్ స్పీకర్లలో వినిపించేవారు. ఘంటసాలవారి భక్తిగీతాలు తెలుగువారిని అంత ప్రభావితులను చేశాయి. శ్రీ వేంకటేశ్వర మహత్మ్యంలో ఘంటసాలవారు తెరమీద కనిపిస్తూ పాడిన ఏకాంతసేవా గీతం 'శేషశైలా వాసా' రంగుల రాట్నంలోని 'నడిరేయి ఏ జాములో' పాటలు తెలుగు హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయే పాటలు.

తిరుపతి వెంకన్న మీద ఘంటసాల పాడిన - 'ఏడు కొండల సామీ', 'నమో వెంకటేశా', 'వేంకటేశ్వర సుప్రభాత పద్యాలు', 'వేంకటేశ్వరుని బుర్రకథ', 'తీయని వెంకని నామామృతం', 'వెంకన్న నామమే భక్తితో కొలిచితే,' 'జయ జయ జయ శ్రీ వేంకటేశా', 'శేషాద్రి శిఖరానా', 'తిరువెంకటాధీశ జగదీశా', 'నీ కొండకు నీవే రప్పించుకో ' 'భువనమోహన నిను పొడగన్న కనులతో'', భక్త జయదేవుని అష్టపదులు, తన జీవిత చరమాంకంలో ఆలపించిన తాత్పర్య సహిత భగవద్గీత  ఘంటసాలవారి భక్తి సంగీతానికి అజరామరత్వం కల్పించాయి.  భక్తికి, ముక్తికీ ఘంటసాల గాన శ్రవణమే పరమావధిగా ప్రతీ తెలుగువారూ భావించారు.ఘంటసాల, జలసూత్రం, దేవులపల్లి, యామిజాలఅటువంటి గానగంధర్వుడిని తిరుపతి వేంకటేశ్వరుడు కరుణించాడు. తన ఏడుకొండలలో ఘంటసాల భక్తిగానం నిరంతరం  ప్రతిధ్వనింపజేస్తూ  తనను చేరవచ్చే భక్తుల అలసటను, అలసత్వాన్ని తొలగించే దివ్యౌషధంగా వరం ప్రసాదించాడు. అంతేకాదు, ఎంతటి పుణ్యమో చేసుకుంటే తప్ప సామాన్యులెవ్వరికీ లభించని పదవిని, తన ఆస్థాన గాయక పదవిని ఘంటసాలవారికి లభించేలా ఆ శ్రీనివాసుడు అనుగ్రహించాడు. తిరుమల- తిరుపతి దేవస్థానం వారు ఘంటసాలవారిని తమ ఆస్థాన గాయకునిగా నియామకం చేసి ఆ భక్తగాయక శిఖామణిని సముచితంగా గౌరవించారు. మూడేళ్ళపాటు అపురూపమైన స్వామివారి సన్నిధిలో గానం చేసే అదృష్టాన్ని ఘంటసాలవారికి కల్పించారు. టి.టి.డి.వారి అత్యున్నత ఆస్థాన గాయక పదవిని పొందిన తొలి లలిత/ సినీమా సంగీత గాయక శ్రేష్టుడు ఘంటసాలవారు. ఇంతకు మించిన ఉన్నత స్థానాన్ని, పదవిని ఏ మానవమాత్రుడు ఇవ్వగలడు? ఇచ్చినా భగవంతుని వరప్రసాదంతో సమానమౌతుందా ? ఘంటసాలవారి సంగీత విద్య, గాన ప్రతిభ సార్ధకత చెందాయి. ధన్యజీవి ఘంటసాల.

తన ఆరాధ్యదైవం తిరుపతి వేంకటేశ్వరుని కరుణా కటాక్షాలతో తన సదాశయాలన్నీ సిధ్ధించాలని నూతనోత్సాహం తో ముందడుగు వేసారు ఘంటసాల. కొత్తగా అజంతా మూవీస్ వారి 'మెరుపువీరుడు', శ్రీ గౌతమీ పిక్చర్స్ వారి 'ఆలీబాబా 40 దొంగలు', రామవిజేతా వారి 'తల్లిదండ్రులు', గిరిధర్ ప్రొడక్షన్స్ వారి 'రెండు కుటుంబాల కధ', రాజ్యం ప్రొడక్షన్స్ వారి 'రంగేళీ రాజా'  తో పాటూ మరో రెండు చిత్రాలకు సంగీత దర్శకుడిగా పనిచేయడానికి ఒప్పుకున్నారు.

ఆ చిత్ర గీతాల విశేషాలు వచ్చేవారం ... అంతవరకూ...

                ...సశేషం

*With a view to make the narrative more authentic and to corroborate it, images, audio and video clips are attached at appropriate places. If such usage is found objectionable to the copyright holders the same shall be removed if and when notified.

2 comments:

Anonymous said...

ఆనాటి చెన్నై నగర ప్రయాణ అనుభూతి విశేషాలు బాగా చెప్పారండి

వేదుల గణేష్

హృషీకేష్ said...

బాగున్నాయి sir నేటి విశేషాలు. 👌👌

అభినందనలు.