visitors

Sunday, September 19, 2021

నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 2 - నలభై తొమ్మిదవ భాగం

19.09.2021 -  ఆదివారం భాగం - 49:
అధ్యాయం 2 భాగం 48  ఇక్కడ

  

నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్

ఘంటసాలగారు ప్రజల మనిషి. ప్రజాగాయకుడు. స్టూడియో మైక్రోఫోన్ ల ముందుకంటే ప్రజాబాహుళ్యంలో వారి ప్రశంసాపూర్వకమైన కరతాళధ్వనుల మధ్యనే పాడడానికి ఎక్కువ ఉత్సాహం చూపేవారు. ఘంటసాలవారు తిరిగినన్ని పల్లెటూళ్ళు ఆయన స్థాయిలో వున్న మరే గాయకుడు తిరిగివుండడు. తమ అంతస్తుకు తగ్గ పెద్ద పెద్ద హోటల్స్ లో బస చేస్తూ మహా నగరాలలోనే స్టేజ్ షోలు చేయడానికి సిధ్ధపడతారు. కానీ ఘంటసాలగారు ప్రయాణ సౌకర్యాలు లేని కుగ్రామాలకు కూడా వెళ్ళి అక్కడ కచేరీలు చేసేవారు.

ఒక సంవత్సరం ఆగస్ట్ 15 భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవంనాడు అప్పటి విశాఖపట్నం జిల్లాలోని కిండాం అగ్రహారం అనే కుగ్రామంలో  స్థానిక ప్రజల మధ్య పతాకావిష్కరణోత్సవంలో పాల్గొన్నారు. ఆ సందర్భంగా రెండు మూడు గ్రూపులుగా విడిపోయిన ఆ చిన్న గ్రామంలోని పెద్ద మనుషులు, ఒకటిగా కలసిమెలసివుంటామనే కండిషన్ మీద ఘంటసాలవారు ఆ స్వాతంత్ర్య దినోత్సవంలో పాల్గొన్నారు. అంతకు ముందు రోజు తనకెంతో ఆప్తుడు, కీర్తిశేషుడు అయిన ముద్దు పాపారావు గారి కుమార్తె వివాహాన్ని తన చేతులమీదుగా  జరిపించడానికి ఘంటసాలవారు కిండాం అగ్రహారం వెళ్ళారు. ఆ వివాహానికి అయిన ఖర్చంతా దివంగత మిత్రుడి మీది ప్రేమతో ఘంటసాలవారే భరించారు. తన మిత్రుడు కొడుకు ముద్దు నరసింగరావు అప్పటికే ఘంటసాలవారి పంచనజేరాడు.

ముద్దు పాపారావుగారు విజయనగరం మహారాజావారి సంగీత కళాశాలలో ఘంటసాలవారికి సహాధ్యాయి. మా తాతగారి శిష్యుడే. పాపారావుగారు, ఘంటసాలవారు మంచిమిత్రులు. సంగీత విద్య నేర్చుకోవడానికి అష్టకష్టాలు పడ్డారు. ఆ సమయంలో పాపారావుగారు ఘంటసాలవారికి ఆధరవుగా వుండేవారట. తమ మైత్రి ఎప్పటికి విడరానిదిగా వుండాలని ఈ ఇద్దరు మిత్రులు అనుకునేవారట.

సంగీతశిక్షణ పూర్తయాక ఎవరిదారులు వారివి అయాయి. ఇద్దరికీ కుటుంబ పోషణ ప్రధాన సమస్యగా మారింది. ఎవరికెవరూ సంబంధం లేకుండా పోయింది.  తాను నేర్చుకున్న సంగీతాన్నే నమ్ముకొని ఘంటసాలవారు పొట్టచేతబట్టుకొని దక్షిణాన ఉన్న మద్రాసు చేరుకున్నారు. పాపారావుగారు కూడా అదే సంగీతాన్ని నమ్ముకొని ఒరిస్సా రాష్ట్రం గుణుపూర్ లో స్థిరపడి అక్కడ సంగీత శిక్షణలు ఇస్తూ అతి సామాన్యంగా జీవితం సాగించారు. అప్పట్లో గుణుపూర్ చాలా చిన్న ఊరు. సంపాదన అంతంతమాత్రంగానే వుండేదట. ముద్దు పాపారావు గారి స్వస్థలం కిండాం అగ్రహారం. పాపారావుగారి పెద్దతండ్రి ముద్దు నారాయణ మూర్తిగారు గొప్ప పలుకుబడిగల భూ కామందు. జమీందారీ ఫాయిదాలో చాలా దర్జాగా, దర్పంగా ఒక వెలుగు వెలిగిన వ్యక్తి. ఆనాటి సంస్థానాధీశులులాగా గుర్రపు బగ్గీలలో మందీ మార్బలంతో వుండేవారట. తుపాకీ చేతబట్టి వేటకు వెళ్ళే బ్రాహ్మణుడిగా ముద్దు నారాయణమూర్తిగారికి ఘనమైన కీర్తి ఆ వూళ్ళో వుండేది. ఆయన దేవిడి ముందునుండి  ఆ వీధిలో ఎవరు చెప్పులతో వెళ్ళడానికి సాహసించేవారు కాదంటే ఆయన రాజసం ఎంతటిదో ఊహించుకోవచ్చును. జమిందారీ ఆక్ట్ అమలుపర్చిన తర్వాత అందరి జమిందార్లు లాగే కిండాం ముద్దు నారాయణమూర్తిగారి భూములన్నీ ప్రభుత్వపరమైపోయాయి. ఆయన కొడుకులు, మనవల కాలానికి చాలా ఆస్తులు హరించుకుపోయాయి. ఉన్న భూములను ముందుచూపుతో అభివృధ్ధి పర్చుకున్నవారు బాగుపడ్డారు.  ఆ ముందు ఛూపు లేనివారు ఉన్న ఆస్తంతా సంపెంగి నూనెలకు, నేతి ఖర్చులకే ఉపయోగించి అనామకులయ్యారు. ముద్దు నారాయణమూర్తిగారి తమ్ముడు కొడుకే ముద్దు పాపారావుగారు. ఆయన కాలానికి, ఆయన భాగంగా ఏమీ మిగలలేదు. పాపారావుగారు మా తాతగారు పట్రాయని సీతారామశాస్త్రిగారి శిష్యుడు. ఘంటసాలగారి సహాధ్యాయి.


ఈ ఫోటోలో సరిగ్గా గురువుగారి వెనుక నించునున్నది ముద్దు పాపారావుగారు 
ఫోటోకి ఎడమవేపు కింద కూర్చునున్నది ఆయన మేనల్లుడు

మా నాన్నగారు (పట్రాయని సంగీతరావుగారి) జన్మస్థలం కూడా కిండాం అగ్రహారమే. మా నాన్నగారి మాతామహుల ఊరు. ఈ కిండాం అనే పాతకాలపు అగ్రహారం విజయనగరం జిల్లాలోని బొండపల్లి నుండి మూడుమైళ్ళ దూరంలో, గజపతినగరం నుండి పదిమైళ్ళ దూరంలోను వుందట. నేనెప్పుడూ ఆ వూరు వెళ్ళలేదు. ఇప్పుడు అన్ని ఊళ్ళలాగే ఆ వూరు కూడా కొంత అభివృద్ధి చెందిందని విన్నాను. (ఈ కిండాం కు సంబంధించిన వివరాలు కొన్ని మా నాన్నగారి ద్వారా విన్నవి, మరికొన్ని మా శర్మ బాబు (గుమ్మా మార్కండేయశర్మ, మా నాన్నగారి పినతల్లి కొడుకు) ద్వారా తెలుసుకున్నవి.)

ఘంటసాలవారి స్నేహితుడు ముద్దు పాపారావుగారికి వివాహం జరిగి సంసారం పెరిగింది. కాని ఆర్ధిక స్థితి అంతగా పెరగలేదు. ఆయన ఒక కొడుకు  నరసింగరావు అని పేరు.  విజయనగరంలో రాజావారి సింహాచలం సత్రవులో భోజనం చేస్తూ  చదువుతూవుండేవాడు. ఇలాటి పరిస్థితులలో ముద్దు పాపారావుగారు కాలం చేశారు. సంసారం రోడ్ న పడింది. నరసింగరావు చదువు అర్ధాంతరంగా ఆగిపోయింది. ఈ విషయం ఘంటసాలవారికి తెలిసింది. ఆయన వెంటనే తన స్నేహితుడు కొడుకైన నరసింగరావును తన దగ్గరకు పిలిపించుకున్నారు. ఇకపైన ఆ కుర్రవాడి బరువు భాధ్యతలు మనవేనని, మన సొంత మనిషిలానే అందరూ ఆదరించాలని, తనంతట తానుగా వెళ్ళిపోతానంటే తప్ప అతనిని ఎవరూ ఆ ఇల్లువదలి పొమ్మనకూడదని ఘంటసాల మాస్టారు తమ ఇంట్లోవారందరికీ చెప్పారు. 

ఆనాటి నుండి ముద్దు పాపారావుగారి కుమారుడు ముద్దు నరసింగరావు (మా నరసింగ) ఘంటసాలవారింటి కుటుంబసభ్యుడయాడు. చదువు సరిగా సాగనందున పెద్ద ఉద్యోగాలు దొరికే అవకాశంలేక  తమ ఇంటికి సంబంధించిన చిన్న చిన్న పనులకు వినియోగించేవారు. ఘంటసాలవారి సొంత నిర్మాణ సంస్థకు సంబంధించిన ఎకౌంట్స్ చూసే క్లర్క్ కు సహాయకారిగా వుంటూవుండేవాడు. 

కొన్నాళ్ళకు కొంచెం అనుభవం వచ్చాక ప్రముఖ నటుడు గుమ్మడిగారి ఇన్కమ్ టాక్స్ లెక్కలు రాయడానికి వెళ్ళేవాడు. అలాగే, ప్రముఖ స్టిల్ ఫోటోగ్రాఫర్ జి.ఎన్.భూషణ్, 'ది మెయిల్" మద్రాసులోని ప్రముఖ ఇంగ్లీష్ eveninger లో సబ్ ఎడిటర్ జి.వి.రామారావుగారు (గిడుగు వెంకట రామారావు) కలసి ఏర్పాటు చేసిన కల్పన పబ్లిసిటిస్ లో పార్ట్ టైమ్ టైపిస్ట్ గా పనిచేసేవాడు. ఆ ఇంటి మేడమీదే బేబి శ్రీదేవి కుటుంబం వుండేది. ఆ ఆఫీసుకు రెండుమూడుసార్లు వెళ్ళాను. బాపు రమణల సినీమాలన్నిటికి పబ్లిసిటీ వ్యవహారం అంతా ఈ కల్పనా పబ్లిసిటీ యే చూసేది. ఆ ఆఫీస్ టైపింగ్ శైలి నాకు వింతగా వుండేది. ఇంగ్లీష్ లోని కరస్పాడెన్స్ లో ఎక్కడా కాపిటల్ లెటర్సే ఉపయోగించేవారు కాదు. అంతా స్మాల్ లెటర్సే. అందరు ఎడమవేపు మార్జిన్  సెట్ చేస్తే వాళ్ళు కుడివేపున మార్జిన్ సెట్ చేసేవారు. అంతా తమాషాగా వుండేది. ఇదంతా సినిమా పబ్లిసిటీలో ఒక నావెల్టీ అనేవాడు. కొన్నాళ్ళపాటు ఒక స్నేహితుడు (సుధాకర్)తో కలసి 16 mm సినీమాలు డిస్ట్రిబ్యూషన్ కు తీసుకొని ఆంధ్రాలోని పల్లెటూళ్ళలో, స్కూళ్ళలో, పెళ్ళిళ్ళలో  ప్రదర్శిస్తూ ఓ చిన్నపాటి వ్యాపారం సాగించాడు. అవన్నీ మూన్నాళ్ళ ముచ్చటగానే సాగాయి. 

అయ్యగారిలా సంగీతం అబ్బలేదు కానీ వారిలా చుట్టకాల్చడం మాత్రం అబ్బింది. ఉదయం పూట చుట్టలు కాలిస్తే ఆ వాసనకు ఇంట్లోవారు తిడతారని రాత్రి పదయ్యాక  అందరూ పడుకున్నాక గేట్ బయటకు వచ్చి ఓ గంటసేపు చుట్టకాలుస్తూ అనేక  సినీమా కంపెనీల కబుర్లు చెపుతూండేవాడు.

ఘంటసాల మాస్టారి అభిమతం ప్రకారం ముద్దు నరసింగరావు చివరివరకూ ఘంటసాలవారింటి బిడ్డగానే బ్రతికాడు. ఘంటసాలవారు స్వర్గస్తులైన తర్వాత కూడా  ఆ కుటుంబానికి సంబంధంలేని కొమరవోలు వెంకట కృష్ణారావు అనే తమ్ముడు కృష్ణ ఉరఫ్ గుండు మామయ్య, ఈ ముద్దు నరసింగరావు ఈ నెం.35, ఉస్మాన్ రోడ్ లోనే వుండిపోయారు. ఘంటసాలవారి సతీమణి సావిత్రమ్మగారు ఈ ఇద్దరినీ కూడా తన పిల్లలతో సమానంగా చూసారు. నిజానికి తమ్ముడు కృష్ణ సావిత్రమ్మగారికంటే  వయసులో బాగా పెద్ద. అయినా అతన్ని తమ్ముడూ అనే పిలిచేవారు.  35, ఉస్మాన్ రోడ్ ఇల్లు అమ్మిన తర్వాత కూడా ఈ ఇద్దరూ అమ్మగారినే అంటిపెట్టుకొని ఆవిడకు సహాయంగా ఆవిడ ఉన్నచోటే  ఉంటూ ఈ ఇద్దరూ తమకంటూ ఏ కుటుంబమూ లేకుండా గడిపారు.  ఇద్దరికీ పెళ్ళి కాలేదు. తమ్ముడు కృష్ణ తన 90వ ఏట, ముద్దు నరసింగరావు తన 80వ ఏట  ఘంటసాల కుటుంబ సభ్యులుగానే తమ అంతిమశ్వాస విడిచారు. ఘంటసాలవారి కుటుంబ సభ్యులంతా వీరిద్దరి మరణానికి ఎంతగానో ఆవేదనపొందారు. ఘంటసాలవారి కుటుంబంతో మెలిగినవారంతా కూడా అంతటి ఆత్మీయతనే పొందారు. దీనంతటికీ కారణం ఘంటసాలవారి ఔదార్యం, మానవతా దృక్పధమే కారణం. 

🌺


చూస్తూండగానే వరసగా రెండు 12Bలు ఖాళీగా వెళ్ళిపోయాయి. నేనింకా కోట్స్ రోడ్ కూడా దాటలేదు. తర్వాతి బస్ ఎంతసేపటికి వస్తుందో ఇవేళ ఆఫీస్ కు లేటయలే వుంది అనుకుంటూ పానగల్ పార్క్ వేపు నడిచాను. నేను శారదా స్కూల్ ఎదురుగా వున్న పెట్రోల్ బంక్ దగ్గరకు వెళ్ళేసరికి 12 నెం. కూడా ఒకటి నాముందు నుండే వెళ్ళిపోయింది. నాలుగడుగులలో బస్ స్టాప్. బస్ స్టాప్ లో ఆపకుండా కొంచెం ముందుకు పోయి ఆపాడు. జనాలు పొలోమంటూ ఆ బస్ వెనక పరుగులు తీసారు. స్కూళ్ళు, కాలేజీలు, ఆఫీసుల టైముల్లో ఇది సర్వసాధారణం. నా 12B. రాలేదు. దానికోసం ఎదురుచూస్తున్నవారు చాలామందే ఉన్నారు. ఈలోగా ఒకాయన వడవడిగా వచ్చి 12B. వెళ్ళిపోయిందా అని అరవంలో అడిగారు. నేనూ అదే అరవంలో ఐదునిముషాలముందే రెండు బస్సులు వెళ్ళిపోయాయని  చెప్పాను. ఆయన రిలాక్స్డ్ గా ఒక చెట్టును ఆనుకొని ఏవో కూనిరాగాలు తీస్తున్నారు. ఆయన వేషధారణ చూస్తే తెలుగాయనేమో అనిపించింది. పంచెకట్టు, పైన తెల్లటి జుబ్బా, భుజంమీద కండువా చూసి అనిపించింది. మరో పావుగంట తర్వాత 12B. కొంచెం ఖాళీగా వచ్చింది. వెంటనే ఎక్కేశాను. నాతోపాటే ఆయనా బస్ ఎక్కారు.  నాకు లక్కీగా పాండీబజార్లోని రాజకుమారి ధియేటర్ స్టాపింగ్ దగ్గర కిటికీ వేపు సీట్ దొరికింది. అక్కడ నుండి లజ్ కు వెళ్ళడానికి ఒక అరగంటైనా పడుతుంది. బయటనుండి వచ్చే చల్లటిగాలికి నాకళ్ళు మూతలుపడ్డాయి. ఎంతసేపు అలా పడుకున్నానో తెలియదు. ఇదే లాస్ట్ స్టాప్ అందరూ దిగండి దిగండనే బస్ కండక్టర్  తమిళ అరుపులతో నాకు తెలివి వచ్చింది. అప్పుడే లజ్ కార్నర్ వచ్చేసిందా అనుకుంటూ బస్ దిగి చూశాను. అది నాకు పరిచయమున్న లజ్ కార్నర్ కాదు. ఏదో కొత్త ప్రదేశం అంతకుముందెప్పుడు చూడలేదు. చుట్టూ కొబ్బరి చెట్లు. వాటి మధ్య ఎత్తైన ఒక రాజగోపురంతో ఒక పెద్ద శివాలయం కనిపించింది.  కంగారుగా వచ్చిన బస్ వేపు పరీక్షగా చూస్తే అది 12E. బస్. నేను దిగింది తిరువాన్మియూర్ లో. నా అదృష్టం బాగుంది. స్టాండ్ కండక్టర్లు ఎవరూ దిగినవాళ్ళ దగ్గర టిక్కెట్లు చెక్ చేయలేదు. అలాచేసివుంటే  కొన్న టిక్కెట్టు కంటే ఎక్కువ దూరం ప్రయాణం చేసినందుకు చీవాట్లు, దానితోపాటూ ఫైన్ కట్టవలసి వచ్చేది. ఆ ప్రాంతానికి వెళ్ళడం అదే మొదటిసారి. చాలా నిర్మానుష్యంగా ప్రశాంతంగా వుందా స్థలం. మహాబలిపురానికి బస్ లు  ఆ రోడ్ మీద నుండే వెళతాయని తర్వాత తెలిసింది. అదే ఈనాడు ఈస్ట్ కోస్ట్ రోడ్ గా దట్టమైన చెట్లతో, కాదు భవనాలతో, ట్రాఫిక్ జామ్ లతో  బ్రహ్మాండంగా అభివృద్ధిచెందింది.

నేను మళ్ళీ ఆ బస్ స్టాండ్ లో లజ్ కు వెళ్ళే బస్ నెంబర్ తెలుసుకొని, అది వచ్చేవరకు కాచుకొనివుండి ఆ బస్ లో బయల్దేరి ఒళ్ళు దగ్గరపెట్టుకొని  బుధ్ధిగా లజ్ లో దిగి కపాలేశ్వరాలయం దగ్గరకు వెళ్ళేసరికి 12 దాటింది. మెల్లగా మరో ఐదునిముషాల తర్వాత ఆఫీసుకు చేరుకున్నాను. ఎందుకు లేటయిందని ఎవరూ నన్నడగలేదు. పాత ఆఫీసర్ గారు ట్రాన్స్ఫరై వెళ్ళిపోయారు. క్రొత్తగా వచ్చిన లయొజన్ ఆఫీసర్ గారు  ఆరోజు ఆఫీసుకు రాకుండా డైరక్ట్ గా హార్బర్ లో చెకింగ్ కు వెళ్ళారట. ఆయన పేరు వి.కె.బావా (వసంతకుమార్ బావా). ఈయన కూడా IAS ఆఫీసరే. పంజాబీ. సూటు, బూట్ లతో ఒక పెద్ద ఎక్సిక్యూటివ్ కు వుండే లక్షణాలన్నీ వుండేవి. ఆయనకు తెలుగురాదు. ఇంగ్లీష్, హిందీలలోనే వ్యవహారమంతా.  ఈయన వచ్చాక నాకు పని ఎక్కువయింది. ఈయన హయాంలో ఎక్కువగా లెటర్ కరస్పాన్డెన్స్ జరిగేది. నేను మొదటిసారిగా ఫాక్స్ మిషన్ ను, సైక్లొస్టైల్ మిషన్ ను చూసింది ఆ ఆఫీసులోనే. 

మద్రాస్ లోని ఈ లయొజన్ ఆఫీస్  నడపాలా, వద్దా అని ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వం వారు ఏడాదికొకసారి ఆర్డర్స్ జారి చేసేవారు. ఆ ఆర్డర్స్ రావడం లేటయితే ఉద్యోగస్తుల జీతాలు రావడం కూడా లేటయేది. ఆంధ్రాలోని డీలర్లకు ఎరువులు ఏ పోర్ట్ ద్వారా ఎలా సరఫరా అవుతాయో తెలియని అసందిగ్దత ఏర్పడేది. అలాగే ఆ లయొజన్ ఆఫీస్ మద్రాస్ లో కొనసాగింది. మైలాపూర్ లో వున్న ఆ ఆఫీస్ తర్వాత కొన్నాళ్ళకు అడయార్ కు మారింది. 
🌺
              
కె.వి.రెడ్డిగారి దగ్గర సహాయకుడిగా పనిచేసి సంపాదించిన అనుభవంతో బాబూరావు అనే కొత్త కుర్రవాడు సినీమా తీస్తున్నాడు. అతనే డైరక్షన్ . మనమే ఆ సంగీతం చేస్తున్నామని  ఒకరోజు ఘంటసాల మాస్టారు చెప్పారు. అప్పటికి ఆయన చేతిలో రెండు మూడు సినీమాలకంటే ఎక్కువలేవు. 

1952 నుండి ఘంటసాల మాస్టారినే అంటిపెట్టుకొని అన్నిచోట్లకు కూడా తిరిగే జె.వి.రాఘవులుగారు కూడా మాస్టారింటికి రావడం తగ్గించేసారు. ప్రతీరోజూ ఉదయం ఎనిమిది గంటలకంతా వచ్చే రాఘవులుగారు లేకుండానే మాస్టారు బయట రికార్డింగ్ లకు రిహార్సల్స్ కు వెళ్ళడం సాగించారు. ఆ సమయంలోనే మొవ్వ జనార్దనరావు,  మూడవ రాఘవులు ఘంటసాలవారి దగ్గర చేరారు. ఈ ఇద్దరూ కూడా మంచి గాయకులే. ఆ తర్వాత,  అంతకుముందే  మాస్టారి అనేక సినీమాలకు సహాయకుడిగా పనిచేసిన పామర్తిగారు మరల వచ్చిచేరారు. రాఘవులుగారికి గాయకుడిగా రాణించే అవకాశాలు తక్కువనే విషయం ఆయనకు అవగతమయింది. స్వతంత్రంగా సంగీత దర్శకత్వం చేయాలనే కోరికా పెరిగింది. నూతనావకాశాలకోసం చేసే ప్రయత్నాలలో రాఘవులు ఘంటసాలవారి కి క్రమక్రమేణా దూరమయ్యారు. తన దగ్గర వున్న మనిషి అభివృద్ధి పథంలోకి అడుగుపెడుతున్నందుకు ఘంటసాల మాస్టారు ఆనందించారు.

మాస్టారి దగ్గర పనిచేసిన మాస్టర్ వేణు, విజయాకృష్ణమూర్తి, ఎమ్.రంగారావు, బి.గోపాలం, పామర్తి వంటివారెందరో అవకాశాలు లభించినప్పుడు సంగీతదర్శకులుగా వెళ్ళిపోయారు. వారెవరూ తనకు పోటీయని మాస్టారు భావించనూలేదు. వారందరి సినీమాలలో ఘంటసాలగారే ప్రధాన గాయకుడు.

ఘంటసాలవారు అప్పటికే సంగీత దర్శకుడిగా అగ్రస్థానాన ఉన్నారు. ఆయనుండే కాలానికి తెలుగు సినీమాలలో ఎక్కువ సంఖ్యలో సంగీత దర్శకత్వం వహించింది వారే. అనేక చిత్రనిర్మాణ సంస్థలకు రిపీటెడ్ గా సంగీత దర్శకత్వం వహించింది ఘంటసాలవారే. గాయకుడిగా, సంగీతదర్శకుడిగా గల ప్రతిభతో పాటు ఆయనకు గల వినయ విధేయతలు, నిర్మాతా దర్శకులతో గల స్నేహ సత్సంబంధాల వలన ఒకే నిర్మాత తీసిన అనేక చిత్రాలకు ఆయనే సంగీతదర్శకుడిగా చివరవరకూ కొనసాగారు. ఒక చిత్రం ఒప్పుకున్న తర్వాత ఆయనంతట ఆయనగా  ఆ చిత్రం మధ్యలో తప్పుకున్న సందర్భాలే లేవు. ఘంటసాల మాస్టారిని సంగీత దర్శకుడుగా రిపీటెడ్ గా వినియోగించుకున్న అనేక చిత్రనిర్మాణ సంస్థలలో ముఖ్యమైనవి -

సి.కృష్ణవేణి&మీర్జాపూర్ రాజావారి ఆధ్వర్యంలోని శోభనాచల, నాగిరెడ్డి&చక్రపాణిల విజయా ప్రొడక్షన్స్, సుందర్లాల్ నహతాగారి రాజశ్రీ/శ్రీ/రాజలక్ష్మీ ప్రొడక్షన్స్, డి.ఎల్ నారాయణగారి వినోదా పిక్చర్స్, కోవెలమూడి భాస్కరరావు గారి భాస్కర్ ప్రొడక్షన్స్, దోనేపూడి కృష్ణమూర్తి గారి గోకుల్ పిక్చర్స్, లక్ష్మీరాజ్యం గారి రాజ్యం ప్రొడక్షన్స్, నర్రా రామబ్రహ్మంగారి గౌతమీ పిక్చర్స్, ఎ.ఎస్.ఆర్.ఆంజనేయులు గారి మాధవీ పిక్చర్స్, తోట సుబ్బారావు గారి శ్రీదేవి ప్రొడక్షన్స్, కె.ఎ.ప్రభాకర్&కె.బాబూరావ్ సోదరుల రామ విజేతా ఫిలింస్ వంటి సంస్థలకు వరసగా ఘంటసాలవారు సంగీత దర్శకత్వం వహించడం ఒక ఘనచరిత్రగానే భావించవచ్చును. 

సాటిలేని గాయకలక్షణాలు, సంగీతంలో పరిణితిచెందిన సంగీతదర్శకత్వపు లక్షణాలు ఒకే వ్యక్తి కలిగివుండడం అరుదైన విషయం. అటువంటి గొప్పకళాకారుడు మన ఘంటసాల. రెండున్నర దశాబ్దాల పాటు గాయకుడిగా , సంగీతదర్శకుడిగా కోట్లాది తెలుగువారి పరిపూర్ణాభిమానాన్ని చూరగొన్న ఘంటసాలవారి చలనచిత్ర జీవిత రజతోత్సవాన్ని ఘనంగా జరపాలని ఆయన అభిమానులంతా కోరుకున్నారు. ఆ గంధర్వగాయకుని సంగీత రజతోత్సవం చేయడానికి ప్రణాళికలు వేయడం మొదలయింది.

ఆ విశేషాలేమిటో రాబోయే వారాలలో మీరే తెలుసుకుంటారు...
 
                 ...సశేషం



*With a view to make the narrative more authentic and to corroborate it, images, audio and video clips are attached at appropriate places. If such usage is found objectionable to the copyright holders the same shall be removed if and when notified.

3 comments:

మహేష్ బాబు సంబటూరి వెంకట said...

అద్భుతమైన మరో సంచిక....

ఘంటసాల మాస్టారు గారి మంచి మనసు కి నిదర్శనంగా నిలిచిన కిండాం అగ్రహారం లో గ్రామ పెద్దలందరినీ సమైక్యపరచిన మాస్టారు గారి కచేరీ.....

ముద్దు నరసింగారావు గారు & కొమరవోలు వెంకట కృష్ణారావు గారిని తమ కుటుంబ సభ్యులు గా మాస్టారు గారు ఆదరించిన తీరు....

తన దగ్గర శిష్యులుగా మెలిగి సంగీత దర్శకులు గా మారినా వారిని తనకు పోటీగా భావించని మాస్టారు గారి ఔదార్యం....

ఇత్యాది అంశాలన్నీ చాలా ఆసక్తికరంగా మరియు ఎంతో విపులంగా వివరించారు....
ఇంత ఓపికగా మాస్టారు గారి జ్ఞాపకాలని మాతో పంచుకుంటున్నందుకు మీకు హార్ధిక ధన్యవాదపూర్వక కృతజ్ఞతాభివందనాలు స్వరాట్ బాబాయ్ గారూ 👌👌👌👌👌😊🙏🙏👏👏💐💐😊

చుండి వేంకట రాజు said...

ధన్యవాదాలండి

హృషీకేష్ said...

చాలా బాగున్నాయి ఇందలి విశేషాలు. Interesting గా నడిపిస్తున్నారు sir.👌👌🙏🙏