visitors

Sunday, September 12, 2021

నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 2 - నలభై ఎనిమిదవ భాగం

12.09.2021 - ఆదివారం భాగం - 48*:
అధ్యాయం 2  భాగం 47 ఇక్కడ


నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్

ఘంటసాల మాస్టారు తెలుగు సినీమా సంగీతానికి, లలిత సంగీతానికి చేసిన సేవలు అసమాన్యం, గాయకులకు మార్గదర్శకం. తాను నేర్చుకున్నది శుధ్ధ కర్నాటకమే అయినా లలిత సంగీతాభివృధ్ధికి, ఆ లలితసంగీతం సామాన్య శ్రోతల హృదయాలలోనికి చొచ్చుకుపోవడం కోసం కొన్ని కర్నాటక సంగీత రాగాలలో అన్యస్వర ప్రయోగం చేసి ఆయా పాటలకు జీవాన్ని, రసానుభూతిని ఘంటసాల కల్పించారు. ఆ రకమైన పాటలు బహుళజనాదరణ పొందాయి. ఈ రకమైన మార్పులు ఛాందసవాదులైన సంగీత విద్వాంసుల కనుబొమ్మల ఎగురవేతకు, కన్నెర్రకు కూడా గురి అయినాయి. కానీ, ఘంటసాల అలాటివారిని పట్టించుకోలేదు. తను సరియని నమ్మిన మార్గాన్నే అనుసరించారు. తాను రాగాలలో చేసిన మార్పులు తెలియకనో, పొరపాటునో చేసినవికావు. తిరిగి అదే రాగం మరో దగ్గర ఉపయోగించవలసివచ్చినప్పుడు కూడా అదే అన్యస్వర ప్రయోగాన్ని అదే రీతిలో ఉపయోగించేవారు.
 
తర్వాతి కాలంలో వచ్చిన 'శంకరాభరణం' సినీమాలోని 'సామజవరగమన' పాట సన్నివేశానికి (హిందోళ రాగంలో  అన్యస్వరం రిషభం ఉపయోగించడం) వెనుక ఘంటసాలవారి అన్యస్వర సంగీత ప్రభావం, స్ఫూర్తి వుందేమోనని నాకనిపిస్తుంది.

ఘంటసాలవారికి రోజూ అధిక సంఖ్యలో అభిమానుల దగ్గరనుండి ఉత్తరాలు వచ్చేవి. అవన్నీ ఆయన పాడిన పాటలను మెచ్చుకుంటూ పొగుడుతూ వ్రాసినవే. కొంతమంది నిష్కర్షగా విమర్శిస్తూ వ్రాసినవారూ వుండేవారు. కానీ ఘంటసాలవారు పొగడ్తలకు పొంగిపోనూలేదు. విమర్శలకు కుంగిపోనూలేదు. రెంటినీ సమానంగానే స్వీకరించేవారు.

1968 లో వచ్చిన ఒక ఉత్తరం నాకు కోపాన్ని, ఆవేశాన్ని కలిగించింది. ఆ ఉత్తరాన్ని అక్కడకక్కడే చింపిపారేయాలాన్నంత కోపం కలిగించింది. నిగ్రహం లేకపోవడమంటే అదే. ఆ ఉత్తరాన్ని చదివిన ఘంటసాల మాస్టారు, పనుల ఒత్తిడి మూలంగా వెంటనే సమాధానం రాయలేక ఆ ఉత్తరానికి సమాధానాన్ని మా నాన్నగారిని వ్రాసిపెట్టమన్నారు. మా నాన్నగారు చెప్పిన సమాధానం నేనే ఒక పోస్ట్ కార్డ్ మీద వ్రాసి మాస్టారికి చూపించాను. అది చూసి ఆయన చాలా తృప్తిగా బాగుందని చెప్పి ఆ కార్డ్ మీద సంతకం చేసారు. ఆ ఉత్తరం పోస్ట్ చేయడమూ జరిగింది.  ఇంతకూ ఘంటసాల మాస్టారిని విమర్శిస్తూ వ్రాసినవారు మరెవరో కాదు. 'సరాగమాల' శీర్షిక నిర్వాహకుడు, ప్రముఖ చిత్రసంగీత సమీక్షకుడు శ్రీ విఎకె రంగారావు గారే. ఆ కథ అక్కడితో ఆగిపోలేదు.

1971 లో ఘంటసాల మాస్టారు తన వాద్యబృందంతో ఒక నెల రోజుల విదేశీ పర్యటన చేసి వచ్చిన సందర్భంలో మాస్టారి గౌరవార్ధం శ్రీ విఎకె రంగారావు 'ఘంటసాల భువనవిజయం' అనే పుస్తకాన్ని ప్రచురించారు. అందులో శ్రీ రంగారావు గారు వ్రాసిన 'నేనెరిగిన ఘంటసాల' వ్యాసం ఆఖరి పేరాలో యిలా వుంది. 

"రెండేళ్ళక్రితం ఘంటసాల సంగీత దర్శకత్వం వహించిన ఒక చిత్రం విడుదలైనది. మద్రాసులో చూడడానికి వీలుపడక ఘంటసాల చేసిన పాటలు ఎనిమిది వున్నాయని ఆశపడి పనిగట్టుకొని తిరుపతి వెళ్ళి చూశాను. ఘంటసాల సంగీతంలో ఎప్పుడూ అంతర్లీనంగా ప్రవహించే మార్దవం ఆ చిత్ర సంగీతంలో పూర్తిగా మృగ్యం. వెంటనే అక్కడినుండే ఘంటసాలగారికి ఒక కార్డ్ వ్రాసి పడేసాను. "అయ్యా! ఫలానా చిత్రంలో తమ సంగీతం ఒక్క పాట దక్క దుర్భరము అని. దానికి పర్యవసానం ఏమిటి జరిగిందనుకున్నారు? 

"నన్నేం చేయమంటారు నిర్మాతలలా చేయించుకున్నారని యెదురు పడినప్పుడు కుంటిసాకులు చెప్పలేదు. మీరన్నది నిజమేనని అతి వినయం చూపలేదు, మనసులో వీడికేం తెలుసు అనుకుంటూ. నేను మద్రాసుకి తిరిగి వచ్చిన మూడవనాటికి యీ విధంగా కార్డ్ వచ్చింది.

"రంగారావుగారు! సినీమా సంగీతం పట్ల మీ అభిప్రాయం స్వీకారయోగ్యము, సృజనాత్మకము, ఎంతైనా సమంజసము. అభినందనలతో - ఘంటసాల".

ఘంటసాల  వినయానికి అంతకంటే వేరే నిదర్శనం కావాలా ! "
                  
ఈ సంఘటన ఘంటసాలవారి విచక్షణకు, పరిణితికి ఒక దర్పణం. 

🌺


ఎక్కిరాల వేదవ్యాస్ గారు ఒక IAS ఆఫీసర్. డా.డి.ఎన్.రావుగారు ఢిల్లీలో ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజీలో పనిచేసేప్పుడు  వేదవ్యాస్ ఆయన స్టూడెంట్ అని చెప్పగా విన్నాను. ఆయన మద్రాసులో వుండిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కు లైజన్ ఆఫీసర్ గా వచ్చారు. డి.ఎన్.రావుగారు నన్ను వెళ్ళి ఆయనను కలవమని చెప్పారు. అప్పట్లో ఆ ఆఫీస్ మైలాపూర్ కపాలేశ్వరాలయం తూర్పు వేపు వీధుల్లో ఒక మేడమీద వుండేది. ఒక మంచి ముహుర్తాన ఆ ఆఫీసులో అడుగుపెట్టాను. నా గురించి అంతకుముందే డా.రావుగారి ద్వారా వినడం వలన పెద్దగా ప్రశ్నలేం వేయకుండా ఒక టెంపరరీ టైపిస్ట్ పోస్ట్ లో నాకు ఉద్యోగం ఇచ్చారు. ఆ ఆఫీసులో పనిచేసే నలుగురూ  తెలుగువాళ్ళే. అందరూ ఆనాటి ఆంధ్రప్రదేశ్ నుండి ట్రాన్స్ఫరై వచ్చిన గవర్నమెంట్ ఉద్యోగులే. విదేశాల నుండి మద్రాస్ పోర్ట్ కు షిప్ లలో వచ్చే ఫెర్టిలైజర్స్ ను ఈ ఆఫీస్ ద్వారా  ఆనాటి ఆంధ్రప్రదేశ్ లోని వివిధ జిల్లాలలోని ఆథరైజ్డ్  డీలర్లకు లారీలలోనో లేక గూడ్స్ వ్యాగన్స్ లోనో సరఫరా అయేవి. మెడ్రాస్ పోర్ట్ కు  ఫెర్టిలైజర్స్ షిప్ వస్తున్నదనే వార్త తెలిసినప్పటినుండి ఈ లయొజన్ ఆఫీస్ లో ఒకటే హడావుడి, పని ఒత్తిడి అధికమయేది. ఆంధ్రానుండి అన్ని జిల్లాల్లోని డీలర్స్ తమకు కావలసిన యూరియా, అమోనియంసల్ఫేట్, నైట్రేట్   వంటి ఎరువులకోసం టన్నుల లెఖ్ఖన తమ ఇండెట్లను  తీసుకు వచ్చేవారు. వచ్చే సరుకును బట్టి అందులో ఆంధ్రా కోటా ఎంత వస్తుందో చూసి ఈ డీలర్లకు ఆ ఎరువులు పంపిణీ జరిగేది. ఒక్కొక్క డీలర్ కు ఈ ఆఫీసు ద్వారా రిలీజింగ్ ఆర్డర్స్ ఇచ్చేవారు.  డీలర్లు వాటిని పట్టుకొని మెడ్రాస్ హార్బర్ లో తమకు రావలసిన ఎరువులను రిలీజ్ చేసుకొని తమ తమ ఊళ్ళకు లారీలలోనో , లేక రైలు వాగన్స్ లోనో పంపుకునేవారు.  నెలలో ఒక వారం, పది రోజులు ఈ హడావుడి సాగేది. ఇదంతా సక్రమంగా, క్రమశిక్షణతో ఎటువంటి అవకతవకలు జరగకుండా లయొజన్ ఆఫీసర్ గారి పర్యవేక్షణలో జరిగేది. అటువంటి ఆఫీసులో నా కొత్త ఉద్యోగం. అక్కడ నేను కాక పనిచేసే మరో ముగ్గురిలో ఇద్దరి పేర్లే గుర్తున్నాయి. ఒకతని పేరు అబ్దుల్ సలామ్. నెల్లూరు ప్రాంతంవాడు. మెడ్రాస్ లో ముస్లింలు ఎక్కువగా వుండే ట్రిప్లికేన్ లో వుండేవాడు. మరొకాయన మంథా గోపాలకృష్ణ. వారిది విశాఖపట్నం.  మా టి. నగర్ నుండే వచ్చేవాడు. ఈ సలామ్, పేరు గుర్తు లేని మరొక క్లర్క్ వీళ్ళిద్దరితోనే ఆఫీస్ వ్యవహారమంతా నడిచేది. పేరుకు టైపిస్ట్ ఉన్నా చాలా భాగం  ఉత్తర ప్రత్యుత్తరాలు ఎక్కువ చేతితోనే వ్రాసేవారు. ఒక్క ఆఫీసర్ గారు డిక్టేట్ చేసే లెటర్స్ మాత్రమే టైపింగ్ కు వచ్చేవి.  షిప్ లు వచ్చే సమయంలో తప్ప ఆఫీసులో నాకు పెద్దగా పనేమీ వుండేదికాదు. మా జీతాలన్నీ కూడా హైదరాబాద్ లోని మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుండే వచ్చేవి. ఆ డబ్బు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా మాకు బట్వాడా అయేది. ఆ వ్యవహారమంతా సలామ్ అనే ఆయనే చూసేవాడు. మనిషి సన్నగా షెరాయి,చొక్కాలో చాలా సామాన్యంగా వుండేవాడు. నేను లయొజన్ ఆఫీసర్ గారి మూలంగా వచ్చినందున నాతో ఫ్రీగా మాట్లాడడానికి , ఏదైనా పని చెప్పడానికి సంకోచించేవారు. నాకు ఈ వాతావరణం కొత్తగా అనిపించింది. 
మా ఆఫీసర్ వేదవ్యాస్ గారు బయట వ్యవహారాలు చక్కబెట్టడంలోనే ఎక్కువగా నిమగ్నమైవుండేవారు. ఆఫీసులో వుండే సమయం తక్కువ. వారి దర్శనం కోసం ఆంధ్రా నుండి వచ్చే డీలర్లతో నిండివుండేది. వాళ్ళంతా ఎప్పుడు ఆఫీస్ స్టాఫ్ తో ఏదో గొడవపడుతూండేవారు. కారణం ఏమీ లేదు. వాళ్ళు అడిగినంత పెద్ద మొత్తంలో ఎరువులు దొరికేవి కావు. సప్లై, డిమాండ్ ప్రొబ్లం. ఆ విషయాలన్నీ లయొజన్ ఆఫీసర్ తప్ప మరెవరూ పరిష్కారం చేయలేరన్న విషయం అందరికీ తెలుసు. 

ఇలాటి షిప్మెంట్ జరుగుతున్న రోజుల్లోనే ఒక రోజు మా ఆఫీసుకు అల్లు రామలింగయ్య, వారి పెద్దబ్బాయి మా ఆఫీసుకు కొంచెం వేడిగానే వచ్చారు. ఈయనకు ఈ ఆఫీసులో ఏం పని అని అనుకుంటున్న సమయంలో అక్కడున్న సలామ్ ఆయనతో రెండు మూడు రోజుల్లో సరుకు వచ్చేస్తుంది. అందులో మీ ఇండెంట్ వుంది. ఈ వారంలో మీ పనయిపోతుందని సర్ది చెప్పడంతో కొంచెం చల్లబడ్డారు. తర్వాత తెలిసింది, అల్లు రామలింగయ్యగారికి పాలకొల్లులో ఫెర్టిలైజర్స్ డీలర్షిప్ వుందని ఆ సంబంధంగా ఆయన ఈ ఆఫీసుకు వస్తూంటారని. ఆయన ఎప్పుడు వచ్చినా వేదవ్యాస్ గారిని చూసే అవకాశం దొరికేదికాదు. అందుకు ఆయన కొంత చిరాకు చిత్తగించేవాడు. తర్వాత ఎప్పుడో ఆఫీసర్ గారు వచ్చి ఆ రోజు జరిగిన విషయాలన్నీ అడిగి తెలుసుకొని హైదరాబాద్ లోని ఎగ్రికల్చర్ డిపార్ట్మెంట్ తో సంప్రదింపులు, చర్చలు, రగడలు ఇత్యాదులన్నీ రొటీన్ గా సాగిపోతూండేవి. వేదవ్యాస్ గారు ఆఫీసులో ఉన్న సమయంలో వాతావరణం అంతా చాలా ప్రశాంతంగా మారిపోయేది. అందరూ నిశబ్దంగా ఎవరి పనులు వాళ్ళు చేసుకునేవారు. 

లంచ్ టైమ్ లో గోపాలకృష్ణ గారు ఆఫీసర్ గారి రూములో విధిగా ఓ రెండు గంటలు గడిపేవాడు. ఒకరోజు ఏదో పనుండి నేను లోపలికి వెళ్ళిచూస్తే వేదవ్యాస్ గారు,  గోపాలకృష్ణ జ్యోతిషం గురించి తీవ్రంగా చర్చిస్తున్నారు. టేబిల్ మీద పెద్ద పెద్ద పుస్తకాలు వున్నాయి. తర్వాత తెలిసింది వేదవ్యాస్, IAS గారు జ్యోతిష్య శాస్త్రంలో ఆరితేరిన పండితులని. ఈ గోపాలకృష్ణ గారికి కూడా జ్యోతిషం, హస్త సాముద్రికంలో మంచి ప్రవేశం వుందని. గోపాలకృష్ణ గారు స్టెనోగ్రాఫర్. అయితే ఆయన పనిచేయగా నేను ఎప్పుడూ చూడలేదు. ఎవరూ ఆయనకు ఏ పని చెప్పేవారు కాదు. కారణం ఆయన ఆఫీసర్ గారి క్యాంప్ స్టెనోగ్రాఫరట. ఆఫీసర్ గారు బయటవూళ్ళు క్యాంప్ లకు వెళ్ళేప్పుడు మాత్రమే ఈయన ఆయనతో కూడా వెళ్ళి అక్కడి పనులు చక్కబెడతాడని చెప్పగా తెలిసింది. ఊళ్ళో వుంటే ఆయనకు పనేమీ వుండేదికాదు.  ఆఫీసుకు వచ్చే డీలర్లతో ఏవో కబుర్లు చెపుతూ, సలహాలు ఇస్తూ కాలక్షేపం చేసేవాడు. అందరిలాగే టంచన్ గా పది పదిన్నరకు ఆఫీసు కు వచ్చి తన సీట్ లో కూర్చొని తనతో కూడా తెచ్చుకున్న జ్యోతిషం పుస్తకాలను,  హోమియోపతి పుస్తకాలను చాలా సీరియస్ గా చదువుతూ కూర్చునేవాడు. టంచన్ గా లంచ్ టైమ్ లో లజ్ కార్నర్ వరకు వెళ్ళి హోటల్ లో భోజనంచేసి హాయిగా వచ్చేవాడు. కాసేపు విశ్రాంతి తీసుకొని మళ్ళీ గ్రంధపఠనం సాగించేవాడు. ఐదు గంటలు దాటితే చాలు. పుస్తకాలు లోపల పెట్టేసి చక్కా ఇంటికి వెళ్ళిపోయేవాడు. దీనంతటినీ అక్కడివారు చాలా సహజంగానే తీసుకునేవారు. నాకు మాత్రం ఇబ్బందికరంగా వుండేది ఏ పని లేకుండా గంటలతరబడి ఒకే చోట కూర్చోవడానికి. ఆ డిపార్ట్మెంట్ లో అతనికి తగినంత పని లేదని వేరో ఊరికి ట్రాన్సఫర్ చేస్తూ ఆర్డర్లు వచ్చినా వెళ్ళి జాయిన్ అయేవాడు కాదు. ఆయన మద్రాస్ కు బాగా అలవాటు పడిపోయాడు. 

నేను అక్కడ పనిచేసిన రెండున్నర ఏళ్ళూ గోపాలకృష్ణ కూడా అదే ఆఫీస్ లో పనిచేసేవాడు. మనిషి  భుజాల వరకు దిగిన గిరజాల జుత్తుతో పాంట్, పైన ఖధ్ధర్ జుబ్బా, మెడలో ఒక సంచీ నిండా పుస్తకాలతో కనిపించేవాడు. ఎప్పుడో మాటల సందర్భంలో చెప్పాడు తన హెయిర్ కటింగ్ కు ఫోర్ షోర్ ఎస్టేట్ లో వున్న ఓషియానిక్ హోటల్ లోని సెలూన్ కే వెడతానని. నాకు ఆశ్చర్యం వేసింది. ఇతని జీతం అంత కాస్ట్లీ హోటల్ కు వెళ్ళడానికి సరిపోతుందా అని. ఆ రోజుల్లో ఓషియానిక్ కు రిచ్ పీపుల్ హోటల్ గా పేరు.

ఆ తర్వాత కొన్ని దశాబ్దాలకు గోపాలకృష్ణ చెట్టుక్రింద డాక్టర్ గా ప్రజాసేవ చేస్తూ కనపడ్డారు.  గవర్నమెంట్ వారి ట్రాన్సఫర్స్  బెడద పడలేక ఆ జాబ్ కు రాజీనామా చేసేసారట. పానగల్ పార్క్ దగ్గర ఇప్పుడు ఇండియన్ బ్యాంక్ వుండే చోట వెంపటి చిన సత్యంగారి కూచిపూడి ఆర్ట్ అకాడమీ, ఆ పక్కన కార్పరేషన్ స్కూలో, ఆఫీసో వుండేది. దాని పక్కన వెంకటేశ్వరా కళ్యాణ మండపం.  ఈ గోపాలకృష్ణగారు కూచిపూడి ఆర్ట్ అకాడమీలోనే ఒక చిన్న గదిలో వుంటూ బయట ఒక చెట్టుక్రింద తన హోమియో వైద్యం చేసేవాడు. జ్యోతిషాలు చూసేవాడు. కూచిపూడి ఆర్ట్ అకాడమీ టి.నగర్ నుండి రాజా అణ్ణామలైపురంలోని గ్రీన్ వేస్ రోడ్ కు వెళ్ళిపోయాక నేను పానగల్ పార్క్ వేపు వెళ్ళడం తగ్గిపోయింది.కొన్నేళ్ళ తర్వాత గోపాలకృష్ణ ఆ చెట్టు క్రింద కనపడలేదు. ఏమయ్యారో తెలియదు.

కొంతమంది వ్యక్తుల గొప్పతనం, ఔన్నత్యం వారితో పనిచేసేటప్పుడు కానీ, వారి సాంగత్యంలో వున్నప్పుడు కానీ తెలియవు. ఎందుకంటే అలాటివారు తమ గురించి తాము డబ్బా వాయించుకోరు నేనింత సేవచేసానని, తానెంతో గొప్పవాడినని. అలాటి వ్యక్తే శ్రీ వేదవ్యాస్. నేను ఆయన ఆఫీసులో పనిచేసినా ఆయనతో మాట్లాడింది తక్కువే. ఒకసారి మాత్రం తనతోపాటూ కార్లో తీసుకువెళ్ళారు. అయితే అది ఆఫీసు పనిమీద కాదు. తన మిత్రులను కలుసుకోవడం కోసం. తీరా ఆ వెళ్ళిన స్థలం చూస్తే నాకు బాగా పరిచయమున్న స్థలమే. నెం.1, కచేరీ రోడ్. శాంథోమ్ హైరోడ్. చందూర్ దంపతుల ఇల్లు. ఆ ఇద్దరూ నాకు చిరపరిచితులే. ఆ రోజు అక్కడ చాలా విషయాలమీద ఆ ముగ్గురి మధ్య చర్చలు సాగాయి. నేను కేవలం శ్రోతను మాత్రమే. ఒక ఏడాది లోపలే వేదవ్యాస్ గారిని మద్రాస్ లయొజన్ ఆఫీసు నుండి వేరే డిపార్ట్మెంట్ కు ట్రాన్స్ఫర్ చేసేసారు. వేదవ్యాస్ గారి విశిష్టత గురించి  మానాన్నగారి ద్వారా, తర్వాత పత్రికలలోని వ్యాసాల ద్వారానే నాకు అర్ధమయింది. వేదవ్యాస్ గారు కేవలం IAS అధికారిగానే కాక భారతీయ సంస్కృతి పరిరక్షణకు కూడా ఎంతో సేవచేసారు. ఆధ్యాత్మిక గురువుగా, యోగ, జ్యోతిష్య శాస్త్ర పండితునిగా అనేక ఉత్తమ గ్రంథాలెన్నో వ్రాసారు. దేశంలోని అనేక దేవాలయాల ప్రతిష్టాపనకు, వాటి ఔన్నత్యానికీ నిరవధిక కృషిచేసిన వ్యక్తి. అలాటి విశిష్టవ్యక్తి గురించి ఏమీ తెలుసుకోకుండానే ఆయన దగ్గర పనిచేయడంలో నేను గర్వపడాలా ! నా అదృష్టంగా భావించి సంతోషపడాలా ! ఏదీ తేల్చుకోలేకపోతున్న స్థితి నాది.  వేదవ్యాస్ గారు మద్రాస్ నుండి వెళ్ళిపోయాక తిరిగి నేను మరల ఎక్కడా కలుసుకోలేదు. ఆ సత్సాంగత్యం అక్కడితో సరి. 

💐🙏💐


భాగ్యనగరంలో, ఆనాటి ఆంధ్రప్రదేశ్ కు రాజధాని యైన హైదరాబాద్ లో 'పంచశీల సాంస్కృతిక సమితి' అనే సంస్థ వుండేది. ఆ సంస్థయొక్క అద్యక్షుడు శ్రీ పి.వి.రంగారావుగారు. ఆయన మాజీ ప్రధాని శ్రీ పివి నరసింహారావు గారి కుమారుడు. శ్రీ కోట్ల విజయభాస్కరరెడ్డిగారి కాబినెట్లో మినిస్టర్ గా కూడా పనిచేశారు. ఆ పి.వి.రంగారావుగారు కళాభిమాని. సాంస్కృతిక ఉత్సవాల నిర్వహణలో మంచి ఆసక్తి కలవారు. ఆయన తన పంచశీల సాంస్కృతిక సమితి ద్వారా ఘంటసాల మాస్టారిని ఘనంగా సత్కరించాలని సంకల్పించారు. సన్మాన కార్యక్రమం లో భాగంగా మాస్టారి సంగీత కచేరీ కూడా ఏర్పాటు చేసారు. ఘంటసాల మాస్టారు తన వాద్యబృందంతో ఆ ఉత్సవంలో పాల్గొనడానికి హైదరాబాద్ వెళ్ళారు. వాద్యబృందం వుందంటే మా నాన్నగారు కూడా తప్పనిసరి. అందరూ సంతోషంగా తరలివెళ్ళారు.

ఆ రోజున మా ఇంట్లో మా మూడవ చెల్లెలు లలిత, ఆరేడేళ్ళది, నలతగా కనిపించింది. మా నాన్నగారు ఉన్నప్పుడే వచ్చిందో లేక ఊరెళ్ళాక వచ్చిందో గుర్తులేదు కానీ జ్వరం కూడా వచ్చింది. అది ఒక రాత్రివేళ ఎక్కువై ఆందోళన పెట్టింది. ఇంట్లో వున్న మందులు ఇచ్చి చూసారు కానీ జ్వరం తగ్గే సూచనలు కనపడలేదు. రాత్రి మూడు గంటలు దాటేసరికి  ఫిట్స్ రావడం మొదలయింది. పరిస్థితి విషమంగా వుందని వెంటనే మాస్టారింట్లో సావిత్రమ్మగారిని లేపి విషయం చెప్పాము. ఆవిడ వెంటనే నన్ను డ్రైవర్ గోవింద్ ఇంటికి వెళ్ళి పిల్చుకు రమ్మని చెప్పారు. నేను వెంటనే గోవింద్ ఇంటికి పరిగెత్తాను. మూడుగంటల వేళ .అందరూ గాఢంగా నిద్రపోయేవేళ. ఆ ఇంటి ప్రాంతమంతా చీకటిగా నిర్మానుష్యంగా వుంది. ఎలాగో గోవింద్ ను లేపి విషయం చెప్పగానే అతను కంగారుపడుతూ మొహం కడుక్కొని బట్టలు వేసుకు వచ్చాడు. అంతరాత్రి వేళ ఏ డాక్టర్ వద్దకు వెళ్ళాలో తెలియలేదు. సావిత్రమ్మగారికి  నుంగంబాక్కం లో వుండే తమ ఛైల్డ్ స్పెషలిస్ట్ డాక్టర్ గోవిందమీనన్ దగ్గరకు తీసుకువెడదాం పదమన్నారు. గోవిందమీనన్ వుండేది ఒక పెద్ద భవంతి. మెయిన్ గేట్ కు లోపలి భవనానికి చాలా దూరం. గేట్ తాళంవేసి వుంది. ఎంత పిలచినా , బయట గేట్ కు వున్న కాలింగ్ బెల్ నొక్కినా ఎవరూ పలకలేదు. ఇక్కడ పరిస్థితి విషమిస్తోంది. ఇంక అక్కడ వుండడం శ్రేయస్కరం కాదని రాయపేట గవర్నమెంట్ హాస్పిటల్ కు తీసుకువెళ్ళాము. వాళ్ళు  చెక్ చేసి సీరియస్ కండిషనేనని వెంటనే అడ్మిట్ చేసుకొని ట్రీట్మెంట్ ప్రారంభించారు. లోపల ట్రీట్మెంట్ ప్రారంభమైన తర్వాత  తెల్లవారుతుండగా సావిత్రమ్మగారు ఇంటికి వెళ్ళిపోయారు. నేనూ, మా అమ్మగారు మాత్రమే హాస్పిటల్ లో వున్నాము. ఆ రోజంతా ఏవో మందులు, ఇంజక్షన్స్ ఇస్తూనే వున్నారు. సాయంత్రం నాలుగు గంటల సమయంలో మా చెల్లెలు లలిత ఈ లోకం వదిలింది.  సెరెబ్రల్ హెమరేజ్ అని హాస్పిటల్ డాక్టర్లు డిక్లేర్ చేశారు. వెంటనే హాస్పిటల్ బయట ఆవరణలో వున్న లోకల్ టెలిఫోన్ బూత్ నుండి సావిత్రమ్మగారికి ఫోను చేసి చెప్పాను. ఆవిడతో పాటు మా కుటుంబ శ్రేయోభిలాషి డి.ఎన్.రావుగారికి కూడా తెలియజేశాను.  ఆయన వెంటనే వచ్చి హాస్పిటల్ వాళ్ళతో మాట్లాడి తదుపరి కార్యక్రమాలు ముగించారు. తమాషా ఏమంటే ఆ తర్వాత జరిగిన విషయాలు నా జ్ఞాపకాలలో నుండి జారిపోయాయి. ఆ పాప బాడీని ఇంటికి తీసుకువచ్చామా? లేక హాస్పిటల్ నుండే శ్మశానానికి తీసుకువెళ్ళారా అనే విషయాలేవీ నాకు గుర్తులేవు.  ఈలోగా సావిత్రమ్మగారు హైదరాబాద్ కు ఫోన్ చేసి ఘంటసాల మాస్టారితో జరిగిన విషయం చెప్పినట్లున్నారు. ఆ మర్నాటికి హైదరాబాద్ నుండి మా నాన్నగారు, మాస్టారు మద్రాస్ చేరుకున్నారు. పంచశీల సాంస్కృతిక సమితివారు ఘంటసాలవారికి బహుకరించిన నిలువెత్తు సన్మాన పత్రం, అన్ని మెమెంటోలతోపాటూ ఈనాటికీ మాస్టారి రెండవ కుమారుడు కీ.శే. రత్నకుమార్ ఇంటి మేడమీద రూమ్ లో గోడను అలంకరించివుంది. ఆ సన్మాన పత్రాన్ని చూసినప్పుడల్లా ఈ విషాద సంఘటన గుర్తుకు వస్తుంది. 

వెలుగు పక్కనే చీకటి ; 

సంతోషాన్ని అంటిపెట్టుకునే దుఃఖం.  ప్రతీ మనిషికి ఈ రెండూ దశలూ ఒకాదానివెంట మరొకటి వస్తూనే వుంటాయి. 

🔔


1968లో ఘంటసాల మాస్టారు సంగీత దర్శకత్వం వహించిన సినీమాలలోని పాటలు విన్నాము. గాయకుడిగా కూడా ఆ ఏడాది చాలా మంచి పాటలే పాడారు. వాటిలో ముఖ్యమైనవి మాత్రమే చూద్దాము.

ఉమ, చండి, గౌరీ, శంకరుల కథలో మాస్టారు, ఎస్.జానకి పాడిన తిల్లానా

'మాస్టారు పాడిన 'కలగంటినా చెలి' పాట; బ్రహ్మచారి లో సుశీలగారితో డ్యూయెట్' ఏ తోటలో విరబూసెనో'; రణభేరిలో శ్రీశ్రీ గారి ' మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది'; వీరాంజనేయలోని పద్యాలు; రాము సినీమాలోని రెండు సోలోలు ఘంటసాలవారి ఖ్యాతిని ఇనుమడింపజేసిన పాటలే. ఒకటి 'మంటలు రేపే నెల రాజా'; మరొకటి 'రారా కృష్ణయ్యా' ఈ పాటను వేర్వేరు ట్రాక్స్ లో పాడించి తర్వాత ఒకే ట్రాక్ లో మిక్స్ చేశారు. ఈ పాటలో నాగయ్యగారికి, రామారావుగారికి మాస్టారు పాడిన తీరు అనితరసాధ్యం. ఆ వైవిధ్యం మరొకరికి సాధ్యం కాదు. 


అమాయకుడు కృష్ణకు పాడిన 'మనిషైతే మనసుంటే';  సుశీలగారితో పాడిన 'చందమామ రమ్మంది చూడు'; లక్ష్మీ నివాసం లో రంగారావు గారికి పాడిన 'ధనమేరా అన్నిటికీ మూలం'; బాంధవ్యాలులో అదే రంగారావు గారికి పాడిన మరో మంచి పాట 'మంచితనానికి ఫలితం వంచనా'; బంగారు గాజులలో  డ్యూయెట్ 'విన్నవించుకోనా చిన్న కోరికా'; భాగ్యచక్రంలో  డ్యూయెట్ 'నీవులేక నిముసమైనా నిలువజాలనే'


నేనే మొనగాణ్ణిలో, 'వయసు పిలిచింది ఎందుకో'


బాగ్దాద్ గజదొంగ లో 'రావే ఓ చినదానా' వంటి పాటలు ఈనాటికీ మనకు వీనులవిందు చేసే పాటలే. అందరూ తరచూ పాడుకుంటూ ఆనందించేవే.
                                       
                                      రావే ఓ చినదానా....

మనిషిలో సాత్విక లక్షణాలు, సమాజంలో మంచితనం  బ్రతికి వున్నంతకాలం ఘంటసాల పాట వినిపిస్తూనే వుంటుంది. ఇది సత్యం.

నెం. 35, ఉస్మాన్ రోడ్ లో మరికొన్ని జ్ఞాపకాలతో...

వచ్చేవారం...
                      ...సశేషం

*With a view to make the narrative more authentic and to corroborate it, images, audio and video clips are attached at appropriate places. If such usage is found objectionable to the copyright holders the same shall be removed if and when notified.3 comments:

Patrayani Prasad said...

🙏🙏 శ్రీ ప్రణవ స్వరాట్ అన్నయ్యకు నమస్కారములు 🙏🙏అన్నీ కూడా మాకు తెలియని సంగతులు . ఈ రూపంలో ఈ నాటికైనా నీ ద్వారా తెలిసినందుకు, ధన్యవాదాలు. లలితా విషాద మరణం,మమ్ములనందరిని కలచి వేసి, ఎంతో విషాదాన్ని మిగిల్చింది. అలా పరిణమించడానికి కారణం అనూహ్యమే కదా ? చాలా విచారం కలిగింది. ఈ విషాదాంతం చాల కాలమే బాధించింది. దైవలీలను ఎవరం మార్చలేము కదా. మిగిలిన విషయాలతో కొంత సాంత్వన పొందాము.

P P Swarat said...

ధన్యవాదాలు.

హృషీకేష్ said...

వేదవ్యాస్ గారి గురించి చక్కటి వివరాలు అందించారు sir. మాష్టారి మంచి పాటలు కొన్ని పేర్కొన్నారు. మీ చెల్లిని కోల్పోవటం బాధాకరం. ప్రతీ కార్యంలో మీరు అన్ని రకాల అనుభవాలు పొందారు.🙏🙏