visitors

Sunday, October 17, 2021

నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 2 - ఏభై మూడవ భాగం

17.10.2021 -  ఆదివారం భాగం - 53*:
అధ్యాయం 2 భాగం 52 ఇక్కడ

  

నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్

మన జీవితంలో జరిగే కొన్ని సంఘటనలు, వ్యక్తులతో పరిచయాలు, తిరిగే పరిసరాలు యాదృఛ్ఛికంగా జరిగేవే అయినా వాటితో అనుబంధం, మమకారం మనలను అంటిపెట్టుకునే వుంటాయి.

మేము నెం.35, ఉస్మాన్ రోడ్ లో 28 సంవత్సరాలున్నాము. అలాగే ఆ ఇల్లు వదలిపెట్టి కూడా 38 సంవత్సరాలయింది. ఆ ఇల్లు మన్నందర్నీ వదిలి 20 ఏళ్ళైంది. అయినా, ఆ యింటితో, ఉస్మాన్ రోడ్ తో, టి.నగర్ ప్రాంతంతో వున్న అనుబంధం, మమకారం నన్ను అంటిపెట్టుకునేవున్నాయి. ఆనాటి జ్ఞాపకాలు సదా మదిలో మెదులుతూనే వుంటాయి. 

అలాగే  మా లయొజన్ ఆఫీస్ ఉన్న అడయార్ ప్రాంతం. మైలాపూర్ నుండి ఆఫీస్ షిప్ట్ చేసేనాటికి ఆ ప్రాంతం ఎక్కడ వుందో,ఎలా వుంటుందో నాకు తెలియదు. టి.నగర్ నుండి  47, 47A బస్ లలో వెళ్ళడం మొదలు పెట్టినా సరిగ్గా మా ఆఫీస్ వీధికి దగ్గరలో వున్న స్టాపింగ్ లో దిగడం గాంధీనగర్ ఫోర్త్ క్రాస్ స్ట్రీట్ లో వుండే ఆఫీస్ కు వెళ్ళడం మళ్ళా మెయిన్ రోడ్ కు వచ్చి బస్ ఎక్కి పానగల్ పార్క్ దగ్గర దిగడం, ఇదే దినచర్యగా వుండేది. అడయార్ లోని మిగిలిన ప్రాంతాలగురించి ఏ అవగాహన వుండేదికాదు. కానీ, ఎప్పుడైతే మా లయొజన్ ఆఫీసర్ వసంతకుమార్ బావా గారు నన్ను తానుండే ఇంటికి ఆఫీస్ పనిమీద రమ్మనడం మొదలెట్టారో అప్పటినుండి అడయార్ ప్రాంతం గురించి తెలియడం ప్రారంభించింది. అప్పట్లో ఆయన ఉండే ఫ్లాట్స్  లోనే  ఇప్పుడు అతిపెద్ద సూపర్ స్పెషాలిటీ  'మలర్' హాస్పిటల్ వుంది. ఆ ప్రాంతంలోనే శ్రీ అనంతపద్మనాభ స్వామి వారి ఆలయం వుంది. స్వామివారు శయనభంగిమలో చాలా పెద్ద విగ్రహం. అప్పటికి ఆ ఆలయం కట్టి ఆరేడు సంవత్సరాలు మాత్రమే. త్రివేండ్రమ్ ఆలయంలోని మూలవిరాట్ లానే వుంటుంది. ఆ ఆలయనిర్మాణానికి స్థలాన్ని దానం చేసింది కూడా త్రివాన్కూర్  ఆఖరి మహారాజే. ఎప్పుడైతే బస్ లో  మానేసి సైకిల్ మీద వెళ్ళడం ప్రారంభించానో అప్పుడే అడయార్ ఎంత పెద్ద ప్రాంతమో తెలియడం ఆరంభమయింది. 1970ల నాటికి నేను ఆ ఆఫీస్ వదిలేశాను.  కానీ  ఓ దశాబ్దంన్నర తర్వాత మళ్ళీ అదే గాంధీనగర్ కు మా టివికె శాస్త్రిగారితో వెళ్ళవలసి వచ్చేది.  ఆదినుండి మా సాంస్కృతిక కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించే శ్రీమతి జయలక్ష్మి తన తల్లిదండ్రులతో అదే గాంధీనగర్ లో మా ఆఫీస్ వుండిన వీధిలోనే వుండేది. 

ఇప్పటికీ ఆ అడయార్ తో నా అనుబంధం ముగియలేదు. ఇప్పుడు మేముంటున్న OMR (IT Express way) కు కూడా అడయార్ మీదుగానే రావాలి. ఏ పెద్ద షాపింగ్ చేయాలన్నా అడయార్ గాంధీనగర్ మెయిన్ రోడ్ కు వెడుతూనేవుంటాము.
అలా అడయార్ కూడా మా జీవితంలో ఒక భాగమైపోయింది.

అసలు ముఖ్యమైన విషయం ఒకటి ఇక్కడ చెప్పవలసివుంది. 

నేను ఈ అడయార్ ఆఫీస్ కు రావడానికి ఓ రెండేళ్ళముందే మా నాన్నగారి తో కలసి ఒకసారి ఈ అడయార్ గాంధీనగర్ కు వచ్చాను. అప్పుడు అడయార్ ప్రాంతం చాలా ప్రశాంతంగా  వుండేది. ఇప్పుడు వున్నంత జనసమర్దత కానీ, షాపింగ్ మాల్స్ కానీ, ఫ్లై ఓవర్స్ కానీ ఏవీ లేవు. రోడ్లకు రెండుప్రక్కలా పెద్ద పెద్ద చెట్లతో  చాలా చల్లగా వుండేది. పూర్తిగా రెసిడెన్షియల్ ఏరియాగా వుండేది. అప్పట్లో శ్రీ వి.జి.కె.చారి (వింజమూరి గోపాలకృష్ణమాచారి)గారు ప్రముఖ కర్నాటక సంగీత విద్వాంసులు శ్రీ వింజమూరి వరదరాజయ్యంగార్ గారి సోదరుడి కుమారుడు,  అడయార్ గాంధీనగర్ లో  వుండేవారు. వరదరాజయ్యంగార్ గారి కుమార్తె మా పెద్దచెల్లెలు డాక్టర్ కె.వి.రమణమ్మకి కాలేజీలో ఒక సంవత్సరం సీనియర్. వి.జి.కె.చారిగారు వృత్తిరీత్యా ఛార్టర్డ్ ఎక్కౌంటెన్సీ కన్సల్టెంట్. మా నాన్నగారికి అంతవరకూ లేదు కానీ ఆ  ఒక్క ఏడాది మాత్రం  ఆదాయం పన్ను కట్టవలసిన పరిస్థితి ఏర్పడింది. ఆ లెక్కల వ్యవహారాలు సరిచూడడానికి మా నాన్నగారు చారీగారి వద్దకు వచ్చారు. ఆయన తెలుగువారే. వృత్తిరీత్యా ఆడిటర్  అయినా ప్రవృత్తి భక్తిగీత రచనలు. సంగీతం పట్ల మంచి ఆసక్తి వుండేది. 


వి.జి.కె. చారిగారు


వింజమూరి వరదరాజ అయ్యంగార్ గారు

ఆయన మా నాన్నగారి ఆదాయ వ్యయాలు సరిచూసి చివరకు ఒక నూరు రూపాయలు టాక్స్ కట్టాలని తేల్చి 'are you happy?' అని నన్ను అడిగారు. ఈ సందర్భంగా నేను మాత్రం ఆయన వద్దకు రెండుసార్లు వెళ్ళాను. ఈ వ్యవహారం చూసేందుకు మా నాన్నగారు ఆయనకు ఫిజు ఎంత ఇచ్చారో తెలియదు. ఇవన్నీ మా నాన్నగారున్న స్థితిలో మూలిగే నక్కమీద తాటిపండు పడ్డ చందమయింది.
 
ఈ టాక్స్ ల వ్యవహారం అయిన తర్వాతే అని గుర్తు వి.జి.కె.చారిగారు వ్రాసిన రెండు పాటలను శ్రీ ఘంటసాలవారు ప్రైవేట్ రికార్డ్ లుగా పాడారు. అవే తిరుపతి వేంకటేశ్వర స్వామి వారి మీద పాడిన 'శేషాద్రి శిఖరాన', 'తిరువెంకటాధిశ జగదీశా' పాటలు. 

ఈ రెండు పాటలు బహుళ జనాదరణ పొందాయి. ఈ పాటలు ఈనాటికీ తిరుమల శిఖరాలలో నిత్యమూ ప్రతిధ్వనిస్తూ యాత్రికులలో భక్తిభావాన్ని పెంపొందిస్తూనేవున్నాయి.

🌿🌺🌿


ఒకరోజు శ్రీమతి ద్వివేదుల విశాలాక్షి గారు నన్ను వారింటికి రమ్మని కబురుచేశారు. అప్పటికి USEFI  అమెరికన్ కాన్స్యులేట్ కి వెళ్ళడం వల్లనో లేక డి.ఎన్ రావుగారు USEFI వదలి ఇండో-కెనెడియన్ ఫౌండేషన్ లో రీజినల్ డైరెక్టర్ గా చేరడం వల్లనో తెలియదు, మొత్తానికి వారిల్లు విజయరాఘవాచారి రోడ్  'పూర్ణిమ' నుండి బజుల్లా రోడ్ - తిరుమలపిళ్ళై రోడ్ జంక్షన్ లోని ఇంటికి మారింది. ఆ కొత్త ఇంటికి వెళ్ళగానే విశాలాక్షి గారు తాను వ్రాసిన ఒక పుస్తకాన్ని నా చేతిలో పెట్టారు. ఆ నవలను ఎవరో నిర్మాత తెలుగులో సినీమాగా తీయాలని సంకల్పించారని, ఆ నవలకు ఒక సినాప్సిస్ వ్రాయాలని , ఆ పనిని నేను చేయాలని అడిగారు. పుస్తకాలు సరిగా చదవడమే రాదు, వాటికి సినాప్సిస్ నేను రాయడమా? అలవాటు లేని ఔపాసన అని అనుకున్నాను. కానీ, ఆవిడ ధైర్యం చెప్పి ఎలా రాయాలో చెప్పి నాలో ఒక కొత్త ఉత్సాహాన్ని పురిగొల్పారు. ఆవిడ చెప్పిన పధ్ధతులలోనే ఆ నవలకు కావలసిన సినాప్సిస్ తెలుగులో వ్రాసి ఆవిడ చెప్పిన గడువుకు ముందే వ్రాసి ఇచ్చేశాను. ఆవిడ అది చదివి చాలా సంతోషించారు. నేను వ్రాసినదానికి ఏ మార్పులు చేయకుండా యథాతథంగా ఆ నిర్మాతకు అందజేసినట్లు తర్వాత చెప్పారు. ఆ నిర్మాత దర్శకులకు కూడా ఆ కథాసంగ్రహం నచ్చిందని దానినే సినిమా గా తీయడానికి విశాలాక్షి గారితో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ నవలే ' వారధి'. ఆ సినీమాయే 'రెండు కుటుంబాల కథ'.  ఈ నవలకు సినాప్సిస్ వ్రాసినందుకు నాకు కొంత పారితోషికం కూడా లభించింది. ఈ సినీమాకు సంబంధించిన మిగిలిన వివరాలు తర్వాత చూద్దాము. 

🌿🌺🌿


ఘంటసాలవారు చలనచిత్ర సీమకు వచ్చి 25 సంవత్సరాలు అవుతున్నది. గాయకుడిగా, సంగీతదర్శకుడిగా, స్వాతంత్య్ర పోరాటంలో తన పాటలతో ప్రజలను ఉత్తేజపర్చి తనవంతు పాత్రను పోషించిన ఒక ఉత్తమ పౌరుడిగా, ఆంధ్రరాష్ట్ర అవతరణ కోసం తన ప్రాణాలనే ఒడ్డిన పొట్టి శ్రీరాములుగారి నిరాహారదీక్షలో తనవంతు చేయూతనిచ్చి ప్రవాసాంధ్రులలో చైతన్యం తెచ్చిన ప్రజాగాయకుడిగా ఘంటసాలవారి కృషి, చేసిన సేవ నిరుపమానం.

అటువంటి ఘంటసాల చలనచిత్ర రజతోత్సవాన్ని ఘనంగా జరపాలని దేశవ్యాప్తంగా వున్న ఘంటసాల అభిమానులంతా కోరుకున్నారు. అందుకు ఆనాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని పెద్దలంతా కూడా సహకరించడానికి తమ సంసిధ్ధతను తెలియజేశారు. దక్షిణ చలనచిత్ర సీమలలోని ప్రముఖులంతా కూడా  ఘంటసాల చలనచిత్ర రజతోత్సవ సంగీత సంబరాలలో పాల్గొనడానికి తమ పరిపూర్ణ సహకారాన్ని ప్రకటించారు.

ఘంటసాలవారు తన 25 సంవత్సరాల సినీ సంగీత యానంలో తన పురోభివృద్ధికి ఎంతగానో తోడ్పడ్డ నిర్మాత, దర్శకులు, సంగీతదర్శకులు, నేపథ్యగాయనీగాయకులు, వాద్యకళాకారులు, అంతకు మించి తాను పాడిన పాటలను, స్వరపర్చిన గీతాలను మెచ్చుకుంటూ తమ ప్రశంసలతో, అభిమానంతో ప్రోత్సహిస్తూ వస్తున్న అశేష ప్రజానీకానికి కృతజ్ఞతలు తెలుపుకునే విధంగా అందరి సమక్షంలో ఈ బ్రహ్మాండమైన ఉత్సవం జరగాలని  ఘంటసాలగారు కోరుకున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్రసీమ అంతా ఒకే కుటుంబమని, వారందరి సహాయ సహకారాలతోనే తాను వివిధ భాషలలో ఎన్నో పాటలు పాడే అవకాశం లభించిందని, అందువలన ఈ రజతోత్సవం కళాకారులందరి ఉత్సవంగా అందరూ పదికాలాలపాటు తలచుకునేలా భాసిల్లాలని ఆశించారు. 

1944 లో మద్రాసు సినీమా రంగంలో అడుగుపెట్టిన ఘంటసాల సినీ సంగీత ప్రస్థానం 1969 నాటికి 25 సంవత్సరాలు  పూర్తి చేసుకున్నది. 

"శ్రీ ఘంటసాల వేంకటేశ్వరరావు చలనచిత్ర జీవిత రజతోత్సవ సంఘం " (Sri Ghantasala Venkateswara Rao Movie Career Silver Jubilee Celebrations Committee) పేరిట ఒక కార్యనిర్వాహక సంఘాన్ని ఏర్పర్చారు.

ఘంటసాల ప్రజల మనిషి గా అందరి ఆదరాభిమానాలు పొందిన వ్యక్తి కావడంతో ఆనాటి రాజకీయ ప్రముఖులు ఈ ఉత్సవ నిర్వహణలో ఉత్సాహం కనపర్చారు.

శ్రీ ఘంటసాల వేంకటేశ్వరరావు చలనచిత్ర జీవిత రజతోత్సవ సంఘం -

అధ్యక్షులు :  గౌ. శ్రీ పెద్దిరెడ్డి తిమ్మారెడ్డిగారు (ఆనాటి ఆంధ్రప్రదేశ్  రెవెన్యూ శాఖామాత్యులు);

ప్రధాన కార్యదర్శి : గౌ.శ్రీ అక్కిరాజు వాసుదేవ రావు గారు (ఆనాటి ఆంధ్రప్రదేశ్ సమాచార శాఖామాత్యులు);

ఉపాధ్యక్షులు : శ్రీ పి. రామచంద్రా రెడ్ఠి, B.A.B.L;

కోశాధికారి : శ్రీ రాజా ఎ. రామచంద్రారెడ్డి (ఆనాటి ఆంధ్రప్రదేశ్ క్రీడామండలి అధ్యక్షులు);

కార్యదర్శి : శ్రీ ఆర్ వి రమణమూర్తి

🌷రిసెప్షన్ కమిటీ మెంబర్స్ గా - సర్వశ్రీ - గౌరవనీయులు -
జె.వి. నరసింగరావు (డెప్యూటీ చీఫ్ మినిస్టర్),
కె. విజయభాస్కర రెడ్డి (మినిస్టర్ ఫర్ ఫైనాన్స్),
ఆర్. రామలింగరాజు (మినిస్టర్ ఫర్ ఎండోమెంట్స్),
పి.వి. నరసింహారావు (మినిస్టర్ ఫర్ ఎడ్యుకేషన్),
వాసిరెడ్డి కృష్ణమూర్తి నాయుడు (మినిస్టర్ ఫర్ పవర్),
ఎ. భగవంతరావు (మినిస్టర్ ఫర్ హ్యాండ్ లూమ్స్), 
ఎమ.ఎన్. లక్ష్మీనరసయ్య (మినిస్టర్ ఫర్ ట్రాన్స్ పోర్ట్),
రోడా మిస్త్రి (మినిస్టర్ ఫర్ టూరిజం),
వి.పురుషోత్తమ రెడ్డి (మినిస్టర్ ఫర్ మైనర్ ఇరిగేషన్);

🌺రిసెప్షన్ కమిటీలో చలనచిత్ర సీమ ప్రముఖులు:

సర్వశ్రీ - బి.ఎన్.రెడ్డి, ఎ వి మెయ్యప్పన్, డి.మధుసూదనరావు,
ఎ.ఎల్.శ్రీనివాసన్, సుందర్లాల్ నహతా, జి. కామరాజు, అక్కినేని నాగేశ్వరరావు, ఎన్.టి.రామారావు, కె.జగ్గయ్య, వి.నాగయ్య, శివాజీ గణేశన్, ఎమ్.జి.రామచంద్రన్, పి.పుల్లయ్య, టి.ఎల్.కాంతారావు, రేలంగి, సావిత్రి గణేష్, షావుకారు జానకి, అంజలీదేవి, కె.శ్రీనివాసరావు, ఎన్,త్రివిక్రమరావు, డి.రామానాయుడు; డా.సి.నారాయణరెడ్డి, రావూరు వెంకట సత్యనారాయణ, వి.వి.మాణిక్యాలరావు, ఎ.కెచెలువరాజు, జి.హనుమంతరావు, పోతుకూచి సాంబశివరావు, జి.ఎస్.వరదాచారి, పి.ఎస్.ఆర్.ఆంజనేయశాస్త్రి, బాసాని సుదర్శనరెడ్డి, కె. సుబ్రహ్మణ్యం, ఎ.ఆర్ కృష్ణ, బి.కృష్ణంరాజు. (సేకరణ : ఘంటసాల రజతోత్సవ ప్రత్యేక సంచిక)

ఈ రజతోత్సవ ప్రత్యేక కమిటీలు ఏర్పడకముందు, ఏర్పడిన తర్వాత కూడా ఆర్.వి.రమణమూర్తి తరచూ మద్రాస్ వచ్చి ఘంటసాలవారి తో సంప్రదించేవారు. కమిటీ అధ్యక్షుడు గౌ. మంత్రివర్యులు శ్రీయుతులు పి. తిమ్మారెడ్డిగారు, అక్కిరాజు వాసుదేవరావు గారు కూడా  ఓ రెండుసార్లు మద్రాస్ వచ్చి  ఘంటసాల మాస్టారింట్లో చాలా సేపు ఈ ఉత్సవ విషయమై చర్చించేవారు. వీరితోపాటు మరికొందరు రాజకీయనాయకులు కూడా వచ్చేవారు. వీరందరి చర్చలతో మాకు పొద్దే తెలిసేదికాదు. స్థానికంగా వున్న దక్షిణాది సినీ ప్రముఖులందరిని కలిసి ఈ బ్రహ్మండమైన రజతోత్సవంలో పాల్గొనేలా సమ్మతింపజేశారు. వాసుదేవరావుగారు వచ్చినప్పుడల్లా ఆయనతో నటుడు కాంతారావు కూడా వచ్చేవారు. వారిద్దరూ కోదాడకు చెందినవారు కావడాన ఆ స్నేహం కావచ్చు. వారిద్దరూ బంధువులని కూడా విన్నాను. ఎంతవరకూ నిజమో నాకు తెలియదు. రమణమూర్తిగారికి ఘంటసాల మాస్టారంటే చాలా గౌరవం, అభిమానం వుండేవి. 

ఘంటసాల చలనచిత్ర జీవిత రజతోత్సవాన్ని ఆనాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యపట్టణం హైదరాబాద్ లాల్ బహదూర్ స్టేడియంలో లక్షలాది చలనచిత్రాభిమానుల సమక్షంలో జరపడానికి పెద్దలంతా కలసి నిర్ణయించారు.

రజతోత్సవ సంఘం కార్యదర్శిగా ఆర్.వి.రమణమూర్తిగారు చేసిన కృషి, పడిన శ్రమ అసమాన్యం. ఈ ఉత్సవం చేయాలని సంకల్పించినది మొదలు అది  'నభూతో నభవిష్యతి' అనే రీతిలో ముగిసేవరకు ఒక్క క్షణం కూడా విశ్రమించలేదు. కాలికి చక్రాలు కట్టుకున్నట్లుగా హైదరాబాద్ మద్రాసుల మధ్య ఎన్నిసార్లు తిరిగారో లెఖ్ఖలేదు. రమణమూర్తి చాలా ఉత్సహవంతుడు. హైదరాబాద్ లో అనేక సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడంలో ఆరితేరిన వారు. రాజకీయ రంగంలో, సినీమా రంగంలో గల ప్రముఖులందరితో మంచి పరిచయాలు గల వ్యక్తి. అందరిళ్ళలో  వాళ్ళ వంటింటి వరకూ వెళ్ళి  కబుర్లు చెప్పేంత చొరవగల మనిషి అని ఘంటసాల మాస్టారు చెప్పేవారు. అతనితో రెండుసార్లు తిరిగాక ఆ మాట నిజమే అనిపించింది. ఒకసారి మద్రాస్ వచ్చి ఈ రజతోత్సవం తిరుపతి వేంకటేశ్వరుడి ఆశిస్సులు తోనే జరగాలి. అందువల్ల  వెంటనే తిరుపతి వెళ్ళి రాత్రికి వచ్చేస్తానని, నరసింగడిని, నన్ను కూడా తనతో బయల్దేరదీసాడు. అప్పుడే నేను ఒక నిర్ణయానికి వచ్చాను, నేను కూడా ఎలాగైనా ఏదో రకంగా  ఘంటసాలవారి రజతోత్సవం లో పాలుపంచుకోవాలని. ఆరోజు మధ్యాహ్నం సమయాన మేము ముగ్గురం కారులో తిరుపతి బయల్దేరాము. ముందుగా దారిలో వచ్చే తిరుత్తణి కొండమీద వున్న సుబ్రమణ్యేశ్వర స్వామిని దర్శించుకున్నాము. మేము వెళ్ళిన సమయానికి ఆలయంలో పెద్ద రద్దీలేదు. దర్శనం బాగా జరిగింది. రమణమూర్తి అక్కడ ఏవో అర్చనలు జరిపించారు. నేను తిరుత్తణి వెళ్ళడం అదే మొదలు, ఆఖరు కూడా. ఆ తర్వాత ఎన్నోసార్లు వెళ్ళాలని ప్రయత్నించినా కుదరనేలేదు. ఈ సదవకాశం రమణమూర్తి పుణ్యమే అని చెప్పాలి. అక్కడ నుండి బయల్దేరి సాయంత్రం చీకటి పడే సమయానికి తిరుమలలో వేంకటేశ్వర సన్నిధికి చేరుకున్నాము. అక్కడ ఎంతసేపు క్యూలో నిలబడాలో, ఎంత సమయం పడుతుందోనని నేను భయపడ్డాను. కానీ రమణమూర్తి డైరక్ట్ గా ప్రధాన ద్వారం లోపలనుండే మమ్మల్ని గర్భగుడిలోకి తీసుకువెళ్ళిపోయారు. ఎవరూ అడ్డగించలేదు. లోపల దేవుడికి అతి చేరువలో నిలబడి దర్శనం చేసుకున్నాము. అంత దగ్గరలో, అంత ఎక్కువసేపు వెంకన్న సన్నిధిలో నేను ఏనాడు గడపలేదు. (కానీ అలాటి సదవకాశం మరల కొన్ని దశాబ్దాల తర్వాత వరసగా ఐదురోజులపాటు లభించింది. ఆ వివరాలు వేరే అధ్యాయంలో).

రమణమూర్తి కోరిక నెరవేరింది. వచ్చిన పని సక్రమంగా ముగించుకొని అర్ధరాత్రి కి మద్రాసు చేరుకున్నాము. ఆ మర్నాడు ఉదయం ఫ్లైట్ లో రమణమూర్తి తిరిగి హైదరాబాద్ వెళ్ళిపోయారు.

ఈ తిరుపతి ప్రయాణంలో కలిగిన పరిచయమే. ఈ ఉత్సవం జరిగిన మధ్యకాలంలో చాలా తరచుగానే కలిసి తిరిగేవాళ్ళం. మాట్లాడుకునేవాళ్ళం. హైదరాబాద్ లో జరిగిన రజతోత్సవం తర్వాత నేను రమణమూర్తి గారిని మళ్ళీ  ఘంటసాలవారి విదేశ యాత్ర సమయంలో చూసాను. ఆ తర్వాత మరల ఎక్కడా కలవనూ లేదు, చూసిన గుర్తూ లేదు. పత్రికలలో చూడడం తప్ప. ఆంధ్రప్రదేశ్ స్టేట్ కల్చురల్ కౌన్సిల్ కు చైర్మన్ గా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి చాలా పేరుపొందారు. సినీమా నిర్మాతగా కూడా 'నీరాజనం', 'అభినందన' వంటి చిత్రాలు నిర్మించి ఎన్నో నందీ అవార్డులు, ఫిల్మ్ ఫేర్ అవార్డులు  కూడా పొందారు. ఈ చిత్రాలలో నీరాజనం చిత్రానికి O.P.నయ్యార్, అభినందన చిత్రానికి ఇళయరాజా వంటి  జాతీయస్థాయి సుప్రసిధ్ధ సంగీత దర్శకులు పనిచేయడం ఒక విశేషం.

ఘంటసాల సినీ జీవిత రజతోత్సవానికి ఇంకా చాలా సమయం వుంది. ఇందుకు సంబంధించిన మరెన్నో విశేషాలు వచ్చేవారాలలో ....అంతవరకూ.....
                      ...సశేషం

*With a view to make the narrative more authentic and to corroborate it, images, audio and video clips are attached at appropriate places. If such usage is found objectionable to the copyright holders the same shall be removed if and when notified.

2 comments:

హృషీకేష్ said...

రెండు కుటుంబాల కధ చిత్రం మొన్ననే చూశాను sir. మీ హస్తం కూడా ఉందని తెలిసి, సంతోషం వేసింది. మాష్టారి రజతోత్సవ కబుర్లు బాగున్నాయి. అభినందనలు. రెండు కుటుంబాల కధ తర్వాత ఇంకా ఏమి చిత్రాలకు పని చేశారు sir? హృషీకేష్🙏🙏

P P Swarat said...

వేరేవీ లేవు. ఇది కూడా శ్రీమతి విశాలాక్షి గారి బలవంతపు ప్రోత్సాహం మీద ఉన్న కధనే సంక్షిప్తం చేయడం జరిగింది అంతే.
మీకు నా ధన్యవాదాలు.