ప్రణవ స్వరాట్
ఘంటసాలవారు గాయకుడిగా, సంగీత దర్శకుడిగా రాణిస్తున్నకాలంలో తెలుగు సినీమాలలో కథకు, కథకుడికి కూడా ప్రాధాన్యత వుండేది. ఒక సినీమా విజయవంతం కావాలంటే కథ, మాటలు, పాటలు, నేపథ్యసంగీతం, దర్శకత్వ, సాంకేతిక వర్గ నైపుణ్యం, అన్నీ సమపాళ్ళలో వుండాలి. అప్పుడే ఆ సినీమా ప్రజారంజకమవుతుంది. ఆ చిత్రంలోని పాటలు ప్రజల హృదయాలలో నిలిచిపోతాయి.
మల్లీశ్వరి, పాతాళభైరవి కాలంలో, సినీమా పరిభాషలో చెప్పాలంటే, కథ మీద కూర్చునే (చర్చలు జరపడం) సమయమే ఎక్కువగా వుండేది. ఆ కథకు పకడ్బందీగా కథా సంవిధానం తయారు చేసుకొని, మాటలు వ్రాయించి, ఆ తర్వాతే సందర్భోచితంగా పాటల దృశ్యాలను నిర్ణయించి సంగీతదర్శకుడిచేత వరసలు కట్టించి, ఆ పాటలు పాడగల సమర్థులైన గాయకులచేత పాడించి రికార్డింగ్ చేయించేవారు. కథలో సన్నివేశబలం గల చోట్ల వచ్చిన పాటలు తప్పక బహుళ జనాదరణ పొందేవి.
1960లు దాటేవరకు మన తెలుగు సినిమా నిర్మాతలు, దర్శకులు చాలావరకు తమ కథల కోసం పరాయి భాషల మీదే ఆధారపడేవారు. బెంగాలి శరత్ బాబు, ఆశాపూర్ణాదేవి, షేక్స్పియర్, అలెగ్జాండర్ డ్యూమాస్, అరేబియన్ నైట్స్ కథల ఆధారంగానే మన తెలుగు సినీమాలు వుండేవి. గుణసుందరి కథ, మనదేశం, పాతాళభైరవి, మిస్సమ్మ, బాటసారి, మాంగల్యబలం, ఆరాధన, వెలుగునీడలు వంటి ఎన్నో కథలు పరాయి భాషలనుండి దిగుమతి చేసుకొని మన తెలుగు వాతావరణానికి తగినట్లుగా ఆ కథలను మలచుకొని తెరకెక్కించారు. తెరానువాదం సక్రమంగా జరిగిన సినీమాలు కొన్ని విజయంపొందాయి. మరికొన్ని ప్రేక్షకుల ఆమోదం పొందలేదు. ఎందుకంటే మరేవో లోపాలు. ప్రేక్షకులు ఏ సినిమాలు నచ్చుతారు ఏ సినిమాలు నచ్చరు అన్నదానికి సినిమా విశ్లేషకులు, విమర్శకుల 'సహేతుక' వివరణలన్నీ కాయితాలకి పరిమితమైన థియొరీలే. పాండిబజార్ లో సినిమా సారాన్నంతా గ్రహించి రోడ్డుమీదే అందరికీ పంచే తత్త్వజ్ఞానులూ ఉండేవారు.
తెలుగు సినీమా స్వర్ణయుగంలో తెలుగు కథకు పట్టాభిషేకం చేసి శిఖరాగ్రాన కూర్చోబెట్టిన మహాకథకులెందరో వుండేవారు. సినీమారంగంతో సంబంధం లేని కథా రచయిత లెందరో తమ అద్భుత రచనా చాతుర్యంతో తెలుగు రచనా ప్రాభవాన్ని చాటిచెప్పారు. ఆరోజుల్లో ఇప్పటికన్నా ప్రజలలో పఠనాసక్తి ఎక్కువగానే వుండేది. నిత్యజీవితంలోని సమస్యలనే ప్రధానాంశాలుగా తీసుకొని వాటిని విభిన్నకోణాలలో విశ్లేషించి రచయితలు తమ రచనలు కొనసాగించారు. ఉత్తమ సాహిత్యానికి విలువనిచ్చే తెలుగు దిన, వార, పక్ష, మాస పత్రికలెన్నో మంచి మంచి కథలను, నవలలను తమ తమ పత్రికలలో ప్రచురించేవారు.
నాకు కొంత ఊహ తెలిసేనాటికి నేను చూసిన మొదటి వార పత్రిక 'ఆంధ్రపత్రిక', అలాగే 'ఆంధ్రపత్రిక' దిన పత్రిక. 'దేశోధ్ధారక' నాగేశ్వరరావు పంతులుగారు స్థాపించినది. వారి స్థాపనంలో వచ్చిన మరో అద్భుత మాస పత్రిక 'భారతి'. భారతి విద్యావేత్తల, సాహితీ మేధావుల పత్రిక. కవిత్వంలో ఆరితేరిన మహామహుల రచనలు, విమర్శలు, విశ్లేషణలు, చర్చలు, వాదోపవాదాలుతో నిండివుండేది. విశ్వనాథ సత్యనారాయణ, తిరుపతి వెంకటకవులు, శ్రీపాదకృష్ణమూర్తి, గురజాడ, శ్రీశ్రీ, చలం వంటి గొప్ప కవుల రచనలు ఆ భారతిలో వచ్చేవి. 'భారతి'లో ఎవరి కథైనా, వ్యాసమైనా ప్రచురించబడితే ఆ రచయిత ఒక విశిష్ట రచయితగా సాహితీలోకంలో గుర్తింపబడి గౌరవించబడేవాడు. ఆ స్థాయిని అందుకోవడం కోసం ఆనాటి రచయితలంతా తపించేవారు. అలాటి 'భారతి' లో మా నాన్నగారి స్నేహితులు - పంతుల శ్రీరామశాస్త్రి, భట్టిప్రోలు కృష్ణమూర్తి, మంథా రమణరావుగార్ల కథలు, చందోభధ్ధ కవితలు ప్రచురించబడేవి. భారతిలో వచ్చిన మంథా రమణరావుగారి 'మంటలు' నేనూ చదివాను. ఆయన వ్రాసిన మరో నవల 'చలిచీమలు' ను సినీమాగా కూడా తీసారు. మంథా రమణరావు తాను వ్రాసిన ఒక పుస్తకాన్ని మా నాన్నగారికి అంకితం కూడా చేశారు. మంథా రమణరావు వృత్తిరీత్యా రూర్కెలా స్టీల్ ఫ్యాక్టరీ ఉన్నతోద్యోగి. ప్రవృత్తి రచనా వ్యాసాంగం. భట్టిప్రోలు కృష్ణమూర్తిగారు ఒరిస్సా అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ లో ఉన్నతాధికారి. జయపూర్, జునాఘడ్, కెయింఝోర్ లోని ప్రవాసాంధ్ర కవి, రచయిత. పంతుల శ్రీరామశాస్త్రి రాయఘడా హైస్కూలులో మాస్టర్. చందోబధ్ధంగా కవిత్వం రాసేవారు. ఈ ఇద్దరూ, మా నాన్నగారు కలసి వ్రాసిన గొలుసుకట్టు కథలు 1950లలో ఆంధ్రపత్రికలో ప్రచురించబడ్డాయి. అయితే కథలు చదివేంత వయసు ఆనాడు నాకు లేదు.
మేము విజయనగరంలో వుండేనాటికి ఆనాటి ప్రముఖ పత్రికలుగా ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ, కృష్ణాపత్రిక, విశాలాంధ్ర, ప్రజామాత, జాగృతి, గృహలక్ష్మి కనిపించేవి. ఇందులో కొన్ని దినపత్రికలు, కొన్ని వార, పక్ష మాస పత్రికలు. వీటన్నిటిలో చాలా మంచి కథలు, నవలలు, వ్యాసాలు వచ్చేవి. ఈ పత్రికలన్నింటిలో కొన్ని పేజీలు సినీమా వార్తలకోసం ఫోటోల కోసం కేటాయించేవారు.అప్పుడు ఇప్పుడూ కూడా వారపత్రికల ముఖచిత్రాలుగా సినీమా తారల బొమ్మలే వేయడం ఆచారంగా వస్తోంది.
మేము విజయనగరం లో వుండేప్పుడు ఆంధ్రపత్రికలో వచ్చిన ఒక సీరియల్ పేరు మాత్రం బాగా గుర్తుండిపోయింది. ఆ సీరియల్ పేరు 'మంచి-చెడు' రచయిత శారద. ఆ పేరు వల్లే నాకు ఆ సీరియల్ పేరు గుర్తుండిపోయింది. కారణం 'శారద'. శారద మా దొడ్డమ్మగారి ఏకైక కుమార్తె. ఆమె నన్ను ఎప్పుడూ తమ్ముడూ అని ప్రేమతో లాలించి పిల్చినా నేను మాత్రం శారద అనే పిలిచేవాడిని 'అక్క' అని ఎప్పుడూ పిలవలేదు. నాకు ఎవరిని వరసలు పెట్టి పిలిచే అలవాటు అలవడలేదు.
శారద పేరు ఇంతగా గుర్తుండిపోవడానికి మరో కారణం. 1930లలో మా తాతగారు సాలూరులో నెలకొల్పిన సంగీత పాఠశాల పేరు 'శారదా గాన పాఠశాల'.
ఇంతకూ ఈ 'మంచి-చెడు' శారద ఎవరు? విజయనగరంలో ఉన్నంతకాలం పత్రికలలో కనపడే శారద మహిళా రచయితనే అనుకునేవాడిని. శారద అనేది మగ రచయిత కలం పేరని, ఏదో ఊళ్ళో ఒక హోటల్ లో సర్వర్ అని మెడ్రాస్ వచ్చాకే తెలిసింది. ఈమధ్య కాలం వరకూ శారద పూర్తి చరిత్ర నాకు ఏమాత్రం తెలియదు. తెలుగు కథకు వందేళ్ళు పూర్తయిన సందర్భంగా వెలువడిన ఒక వీడియోలో 'పిరికి ప్రియుడు' అనే కథను పరిచయం చేసారు శ్రీగొల్లపూడి మారుతీరావుగారు. ఆ కథను వ్రాసింది శారద. శారద గురించి శ్రీ మారుతీరావుగారు చెప్పింది విన్నాక మనసు వికలమయింది.
శారద తెలుగువాడు కాదు. ఒక తమిళుడు. పేరు నటరాజన్. అతి పేద కుటుంబంలో పుట్టాడు. పుట్టినగెడ్డమీద బ్రతికే ఆస్కారం లేక పొట్ట చేతబట్టుకొని తండ్రితో ఆంధ్రదేశంలోని తెనాలి చేరుకున్నాడు. అప్పటికి అతని వయసు 13 సంవత్సరాలు మాత్రమే. పరాయి రాష్ట్రంలో భాష తెలియని ప్రాంతంలో తండ్రీ కొడుకులు ఇద్దరూ నానా అవస్థలు పడ్డారు. నటరాజన్ కు తమిళ సాహిత్యం మీది మక్కువతో ఆ వయసుకే కథలు వ్రాసేవాడట. తెనాలి వచ్చాక తండ్రి మరణించాడు. శారద అనాథయ్యాడు. తెలుగు భాష మీద మక్కువ పెంచుకొని, నోటు బుక్కులు కొనే స్థోమత లేక రోడ్లమీద దొరికే సిగరెట్ ప్యాకెట్లు ఏరుకొని వాటి వెనక తెలుగు మాటలకు అర్ధం తెలుసుకొని వాటిని వ్రాసుకొని తెలుగు నేర్చుకొని తెలుగులో వ్రాసిన అద్భుతమైన కధలు ఆనాటి ప్రముఖ తెలుగు రచయితలను, పాఠకులను ఉలిక్కిపడేలా చేశాయి.
విజయవాడలో జరిగిన ఒక సాహితీ సదస్సులో విశ్వనాథ, జాషువా వంటి మహా రచయితలను చూసి వారి స్ఫూర్తితో తెలుగు భాషమీద పట్టును సాధించినవాడు శారద. తమ హోటల్ కు వచ్చిన ప్రతీ ఒక్కరిని వారికి పుస్తకపఠనాభిలాష వుందా అని అడిగి తెలుసుకొని వారి వద్దనుండి తెలుగు పుస్తకాలు అడిగి పుచ్చుకొని విస్తృతంగా చదివేవాడట. శారద హోటల్ లో సర్వర్ గా పనిచేస్తున్న రోజులనుండి అంటిపెట్టుకున్న ఆయన స్నేహితుడు ఆలూరి భుజంగరావు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిననాడు శారద, భుజంగరావు, అతని తల్లి తినేందుకు తిండి దొరకక పస్తుండి మంచినీళ్ళతో కడుపునింపుకున్నారట. శారదకు మూర్ఛ జబ్బు. నయం చేసుకునే ఆర్థిక స్తోమత లేదు. అప్పుడప్పుడు నడిరోడ్ మీదే మూర్ఛ వచ్చి పడిపోతూండేవాడట. చివరకు ఆ మూర్ఛ జబ్బు వల్లనే శారద తన 30వ ఏట 1955లో అతి పిన్న వయసులో ఈ లోకాన్ని విడిచిపోయాడట. శారద తన జీవితకాలంలో చిల్లర నాణేలు, రూపాయి, ఐదు, పది రూపాయల నోటు తప్ప నూరు రూపాయల నోటు ఎలా వుంటుందో తెలియదట. 'మంచి- చెడు', 'అపస్వరాలు', ఏది సత్యం' వంటి అధ్భుతమైన తెలుగు నవలలు వ్రాసిన తమిళుడు శారద అనబడే ఎస్.నటరాజన్ దుర్భర లేమిలో కనుమూసాడు. ఎంతటి దౌర్భాగ్యస్థితి. సామాన్య ప్రజల జీవితం నుండి, మనచుట్టూ వున్న సమాజం నుండే తన కథలను, కథాపాత్రలను ఎంచుకొని సహజమైన కథలను వ్రాసిన ప్రతిభాశాలి శారద. ఆయన వ్రాసిన 'ఏది నిజం' నవల పబ్లిష్ అయిన రెండు నెలలలోనే అన్ని పుస్తకాలు అమ్ముడుపోయి ద్వితీయ ముద్రణ వేయవలసి వచ్చిందట.
ఈ రచయిత విషాద గాధలో ఒక సినీమాకు సరిపడేంత జీవిత సత్యాలు నిండివున్నాయి.
మా నాన్నగారికి వున్న సాహిత్యాభిలాషతో ఆయన చాలా మంచి పుస్తకాలనే సేకరించారు. టాగోర్, శరత్, మున్షీ ప్రేమ్ చంద్, విశ్వనాధ, గురజాడ, చలం, కొడవటిగంటి, రావూరి భరద్వాజ వంటి ప్రముఖుల పుస్తకాలతోపాటూ మాక్సిమ్ గోర్కి, టాల్ స్టాయ్, సోమర్సెట్ మామ్, మార్క్ ట్వైన్ వంటి విదేశీ రచయితల అనువాద సాహిత్యం, సంగీత నృత్యాలకు సంబంధించిన ప్రాచీన గ్రంథాలు అంతా మా నాన్నగారు కొనేవారు. ఈ ఉత్తమ సాహిత్యంలోని చాలాభాగం పాండీబజార్లో రాజకుమారి థియేటర్ ముందున్న ప్లాట్ ఫారమ్ బుక్ షాపులో సెకెండ్ హ్యాండ్ లో కొన్నవే. ఎంతో విలువైన పుస్తకాలు. పుస్తకాలకు మించిన మంచి స్నేహితులుండరని మా నాన్నగారి అభిప్రాయం. రికార్డింగ్ ల విరామ సమయంలో, ఘంటసాలవారితో బయట వూళ్ళు కచేరీలకు వెళ్ళేప్పుడు ప్రయాణాలలో ఈ పుస్తక పఠనంతోనే కాలక్షేపం చేసేవారు.
మా ఇంట్లోని ఈ సాహిత్యం పూర్తిగా కూలంకషంగా చదివేంత విజ్ఞానం నాకు లేకపోయింది. వార పత్రికలలో వచ్చే కధలతోటే నాకు గడచిపోయేది. అప్పుడే నాకు చాలామంది రచయితలు, రచయిత్రుల పేర్లు తెలిసాయి. ఆనాటి పత్రికలలో ఎక్కువగా చక్రపాణి, గోపీచంద్ (అసమర్ధుని జీవిత యాత్ర), కొడవటిగంటి కుటుంబరావు (చదువు), బలివాడ కాంతారావు, మధురాంతకం రాజారామ్, కొమ్మూరి వేణుగోపాలరావు (పెంకుటిల్లు), మద్దిపట్ల సూరి, బుచ్చిబాబు (చివరకు మిగిలేది), ధనికొండ హనుమంతరావు, ఎన్.ఆర్.నంది, కొండముది హనుమంతరావు, మహీధర రామ్మోహనరావు, పిలకా గణపతిశాస్త్రి (విశాలనేత్రాలు), తిరుమల రామచంద్ర (హంపీ నుండి హరప్పా దాకా), రాచకొండ విశ్వనాధ శాస్త్రి (ఆరు సారా కథలు, రాజు-మహిషి, గోవులొస్తున్నాయి జాగ్రత్త), ముళ్ళపూడి వెంకట రమణ (ఋణానందలహరి), పోలాప్రగడ సత్యనారాయణ (దీపశిఖ ) వంటి చేయి తిరిగిన రచయితలెందరో తెలుగు కథాధా ప్రపంచాన్ని ప్రభావితం చేశారు.
పురుష రచయితలకు సమానంగా స్త్రీ రచయితలు కూడా ఎంతోమంది వినూత్న పంథాలో రచనలు సాగించారు. కొమ్మూరి పద్మావతి , ఇల్లిందల సరస్వతీ దేవి, భానుమతి, లత (ఊహాగానం), మాలతీ చందూర్ (చంపకం-చెదపురుగులు, ప్రమదావనం), కె. రామలక్ష్మి, ద్వివేదుల విశాలాక్షి (వైకుంఠపాళి, గ్రహణం విడిచింది, వారధి), వేల్పూరి సుభద్రాదేవి (మంచుబొమ్మలు), డా.త్రివేణి (వెండిమబ్బు), ముప్పాళ రంగనాయకమ్మ (బలిపీఠం, కృష్ణవేణి ,పేకమేడలు), కోడూరి కౌసల్యాదేవి (చక్రభ్రమణం, ప్రేమ నగర్), యద్దనపూడి సులోచనారాణి (సెక్రెటరి, జీవన తరంగాలు, మీనా), డా.శ్రీ దేవి (కాలాతీత వ్యక్తులు), డి. కామేశ్వరి, పవని నిర్మలా ప్రభావతి, సి. ఆనందారామం మొదలైన రచయిత్రులు తెలుగువారి సాహితీ వికాసానికి ఇతోధికంగా తోడ్పడ్డారు.
(బ్రాకెట్లలో ఉన్నవి నేను చదివిన వారి వారి పుస్తకాలు).
ఒక దశలో తెలుగు సినిమా నిర్మాతాదర్శకులు ఆనాటి పత్రికలలో వచ్చిన నవలలు, సీరియల్స్ ఆధారంగా ఎన్నో విజయవంతమైన సినీమాలను తీశారు. తమ కథల ద్వారా ముప్పాళ రంగనాయకమ్మ, కోడూరి కౌసల్యాదేవి, యద్దనపూడి, ద్వివేదుల విశాలాక్షి, పోలాప్రగడ ఇత్యాదులు సినీప్రేక్షకుల ఆదరాభిమానాలు కూడా చూరగొన్నారు. 1980ల తర్వాత వచ్చిన యండమూరి వీరేంద్రనాధ్, మల్లాది వెంకట కృష్ణమూర్తి, కొమ్మనాపల్లి గణపతిరావు వంటి ప్రముఖ పత్రికా రచయితలు కూడా సినీమా కథకులుగా లబ్దప్రతిష్టులు.
నాతరం వారందరికీ కూడా బాగా తెలిసిన పాల మనసులు (డా.త్రివేణి వెండిమబ్బు), డా.చక్రవర్తి, ప్రేమనగర్, సెక్రెటరి, చదువుకున్న అమ్మాయిలు, మీనా, జీవన తరంగాలు, బలిపీఠం, భార్యాభర్తలు (డా.లక్ష్మి అనే తమిళ రచయిత్రి నవల), తల్లిదండ్రులు, రెండు కుటుంబాల కథ, చలి చీమలు వంటి సినీమాలన్నీ సినీమా రంగానికి సంబంధంలేని పత్రికా రచయితల కథల ఆధారంగా తీసినవే.
సినీమా నిస్సందేహంగా వినోదం ముడిసరుకుగా ఉన్న వ్యాపారం. ఏ నిర్మాత సినీమా తీసినా ముఖ్యోద్దేశం సినీమా వ్యాపారం ద్వారా ధనార్జనే. అందుకే ఈ నాటి సినీమాలలో వాసి కంటె రాశికే ప్రాధాన్యత. నిర్మాతలంతా వివిధ ప్రసార ప్రచార సాధనాలతో తమకు గల వ్యాపార దక్షత అంతా ఉపయోగించి వందల కోట్ల బడ్జెట్ తో ప్రేక్షక వినోదమే ప్రధాన లక్ష్యంగా, సంచలనమే ముఖ్యాకర్షణగా సినీమాలు నిర్మిస్తున్నారు. అయితే విజయవంతమయ్యేవి పది సినీమాలలో ఏ రెండో మూడో. మిగిలినవన్నీ మఖలో పుట్టి పుబ్బలో గిట్టే సినీమాలే. వందలాది కోట్ల రూపాయలు బూడిదలో పోసిన పన్నీరే. ఆ సినీమాలలోని కథ, మాటలు, పాటలు, నటీనటులు, ఏ అంశమూ ప్రేక్షకులకు జ్ఞాపకమే వుండవు.
ఈ రకమైన ఫక్తు వ్యాపార దృక్పథం గడచిన తరం నిర్మాతా దర్శకులలో తక్కువ. అధిక లాభాలు రాకపోయినా తాము ఆ సినీమా మీద పెట్టిన సొమ్ము తిరిగి వస్తే చాలని ఆనందంగా సినీమాలు తీసేవారు. తమ సినీమాల ద్వారా సమాజానికి ఏదో ఒక మంచిని చేయాలని, ఆదర్శ ప్రాయమైన సందేశాన్ని వినిపించాలని తలచేవారు. అందుకే కథ విషయంలో, సభ్యత గల భాషను వాడే విషయంలో, వీనులకు విందు చేసే శ్రావ్యమైన సంగీతం విషయంలో, సందర్భోచిత నటన విషయంలో ఎంతో జాగ్రత్తలు వహించేవారు.
ఆ రోజుల్లో ఒక సినీమా వరసగా 50 రోజులు ఆడితే వారి పెట్టుబడి వారికి వచ్చి రెండవ సినీమా తీయడానికి కావలసిన డబ్బు చేతికందే పరిస్థితి. ఆనాడు గోల్డెన్ జూబ్లీలు చేసుకున్న చిత్రాలు వచ్చాయి. కేవలం వారం, రెండు వారాలలోనే ఫిలిం డబ్బాలు వెనక్కి తిరిగి వచ్చినవీ ఉన్నాయి. నాటికీ నేటికీ సినీమా నిర్మాణ దృక్పథంలో ఎంతో తేడా వచ్చింది. ప్రేక్షకుల అభిరుచిలోనూ మార్పువచ్చింది.
ఈనాటి సినీమాలలో ఉత్తమ సాహిత్యాన్ని, సుశ్రావ్యమైన మనసులను పరవశింపజేసే సంగీతాన్ని ఆశించడమనేది నేతి బీరకాయలో నేయికోసం వెతకడంలాటిదే అవుతుంది.
💐
మాస్టారుగా తెలుగు చిత్ర పరిశ్రమలోని వారందరిచేత ఆప్యాయంగా గౌరవింపబడిన సుప్రసిధ్ధ గాయకుడు, సంగీత దర్శకుడు ఘంటసాల వేంకటేశ్వరరావుగారు చలనచిత్రసీమకు వచ్చి 25 సంవత్సరాలు అయింది. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ఘంటసాల సినీ జీవిత రజతోత్సవాన్ని(ఆనాటి) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానియైన హైదరాబాద్ లో అత్యంతభారీగా, వైభవోపేతంగా జరపడానికి నిశ్చయించబడింది. అందుకుగాను వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులతో ఒక ఉత్సవ కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది.
ఆ మహోత్సవ విశేషాలు... వచ్చే వారం...
...సశేషం
4 comments:
చాలా ఓపికగా వివరిస్తున్నారు. ధన్యవాదాలండి
ధన్యవాదాలు.
శారద గారి మీ వివరాలు తెలుసుకొని బాధ వేసింది. చిన్న వయసులోనే మంచి రచనలు చేసిన వారికి ఆత్మ శాంతి కలగాలని కోరుకుంటున్నాను. అప్పట్లో పుస్తక పఠనం మంచి వ్యాపకంగా ఉండేది. మీ శైలికి అభినందనలు sir.
అభివాదాలు.
Post a Comment