14.11.2021 - ఆదివారం భాగం - 57*:
అధ్యాయం 2 భాగం 56 ఇక్కడ
నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్
తమిళ రంగస్థల నాటకం దేదీప్యమానంగా వెలుగొందుతున్న రోజులవి. రంగస్థలం నుండి సినీమాకు వచ్చిన అనేకమంది నటీనటులు మధ్యాహ్నం వరకు స్టూడియోలలో పనిచేసి సాయంత్రం అయేసరికి విధిగా ఏదో సభలో ఏదో నాటకంలో నటిస్తూ నాటక కళ మీద తమకు గల వ్యామోహాన్ని, భక్తిని చాటుకుంటూవుండేవారు.
ఒక శివాజీ గణేశన్, ఆర్.ఎస్.మనోహర్, పూర్ణం విశ్వనాధన్, మనోరమ, నాగేష్, సహస్రనామం, మేజర్ సుందరాజన్, చో రామస్వామి, వి.కె.రామస్వామి వంటి ప్రముఖ నటులెందరో విరివిగా విధిగా తమిళ నాటక ప్రదర్శనలలో పాల్గొనేవారు. వీరంతా నాటకాలాడేది ధనార్జన కోసం కాదు. వీరంతా సినీమాలలో బిజీగా పనిచేసేవారే. కానీ వారికి రంగస్థలం మీద గల మక్కువ అలాటిది. అలాటి కళాతృష్ణ తెలుగు సినీమా నటీనటులలో కనపడకపోడానికి కారణం వారిలో నాటకరంగ నేపథ్యం ఉన్నవారు క్రమంగా తగ్గిపోడమే. అలాగే తెలుగు ప్రజలు సినీమాకు ఇచ్చిన ప్రాధాన్యం తెలుగు నాటకానికి ఇవ్వలేదు. అందుకే 60ల తరవాత తెలుగు నాటకం తమిళ, కర్ణాటక, మహరాష్ట్రలలో వృధ్ధి చెందినంతగా తెలుగునాట మహోజ్జ్వలంగా ప్రకాశించలేదు. మిణుకుమిణుకుమంటూనే మనుగడ సాగించింది.
ఒకప్పుడు తమిళనాట నలభై శాతం మంది ప్రజలు తెలుగువారే అయినప్పటికీ వారిలో అధికశాతం తమిళ సంస్కృతి సంప్రదాయాలకు అలవాటు పడిపోయారు. ఇప్పటికీ కొన్ని జిల్లాలలో ఇళ్ళలో తెలుగులో మాట్లాడుకుంటున్నా వారి యాస, ఆచారవ్యవహారాలు తమిళ సంప్రదాయానికి దగ్గరలో వుంటాయి.
మద్రాసులో తెలుగువారి కళాతృష్ణను తీర్చేవిధంగా, తెలుగు సంస్కృతికి దర్పణం పట్టేలా పెద్దగా ఏ సాంస్కృతిక సంస్థలు ఉండేవికావు. మద్రాసులో ని అతి ప్రాచీనమైన తెలుగువారి సాంస్కృతిక సంస్థ చెన్నపురి ఆంధ్ర మహాసభ మాత్రమే. ఆ సంస్థే అప్పడప్పుడు ఏవో కార్యక్రమాలను నిర్వహించేది. అయితే అవి నగరంలో వివిధ మారుమూల ప్రాంతాలలో వుండే తెలుగువారందరికీ తెలిసి, వెళ్ళి చూసే అవకాశముండేది కాదు.
అలాటి వాతావరణం లో 1967 తర్వాత మెల్ల మెల్లగా తెలుగు సాంస్కృతిక సంస్థలు ఒక్కొక్కటిగా మొలకెత్తాయి. మద్రాస్ నగరంలో వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థలలో పనిచేసే తెలుగువారు కొందరు ఔత్సాహిక సాంస్కృతికోత్సవాలు జరిపేవారు. వారిలో కార్యక్రమాలు నిర్వహించాలనే ఆసక్తి,అభిలాష మెండుగానే వున్నా వారికి తగినంత ఆర్ధిక వనరులు, నిర్వహణా సామర్థ్యం వుండేవికావు. అందువలన ఏడాదికి ఒకమారో రెండుమార్లో ఉగాదికో, దసరాలకో వారు నిర్వహించే సాంస్కృతికోత్సవాలు అంత జనాకర్షణీయంగా వుండేవికావు. పేలవంగానే నడిచేవి. ఇలాటి వాతావరణంలో తెలుగువారికోసం ఫుడ్ కార్పరేషన్ లో, అనే గుర్తు, పనిచేసే తాతా సోమయాజులుగారు, మద్రాస్ టెలిఫోన్స్ లో పనిచేసే గుడిపూడి శ్రీనివాసరావుగార్ల ఆధ్వర్యం లో ఉగాది కల్చరల్ అకాడెమీని ఏర్పాటు చేసి ఉగాది పండగల సమయంలో తెలుగువారి కోసం సాంస్కృతికోత్సవాలు చేయడం మొదలుపెట్టారు. అయితే జనాలను ఆకర్షించాలంటే వివిధ రంగాలలో నిష్ణాతులైన ప్రముఖులను ఆహ్వానించాలి. ఆ ఉత్సవాలలో వారి కళను ప్రదర్శించేలా సంగీత కచేరీయో, నృత్యమో, నాటకాలో ప్రదర్శించాలి. ఇవన్నీ అంత తేలికగా జరిగేవికావు. స్వలాభాపేక్ష లేకుండా ఇలాటి ప్రజారంజిత కార్యక్రమాలకు అందరూ సానుకూలంగా స్పందించరు. అందరికీ అనువుగా సానుభూతితో స్పందించే వ్యక్తిగా ఘంటసాలవారు పేరుపొందారు. గుడిపూడి శ్రీనివాసరావు గారు ఒకరోజు మాస్టారిని కలసి తమ ఉగాది ఉత్సవాలలో కచేరీ చేయవలసిందిగా కోరారు. ఘంటసాల మాస్టారు వారి కార్యకలాపాల గురించి తెలుసుకొని నవ్వుతూ ప్రోత్సాహకరంగా మాట్లాడి పంపించేసారు. అయితే అది అంగీకారసూచకమా కాదా అని కార్యకర్తలకు తెలియలేదు. మరల వచ్చారు, అయితే ఈసారి ఘంటసాలవారికి బదులుగా హోమ్ డిపార్ట్మెంట్ హెడ్ నే కలిసి తమ కోరికను వెలిబుచ్చి సహాయం అర్ధించారు. సావిత్రమ్మగారు వారి అభ్యర్థనలను కాదనలేక మాస్టారిని ఒప్పించే భారం తన భుజాన వేసుకున్నారు. ఏదో ఓ ఉగాది పండగ రోజున ఘంటసాలవారి సంగీత కచేరీని ఏర్పాటు చేసారు. మాస్టారు కూడా వాళ్ళకు ఎక్కువ ఆర్థికభారం పెట్టకుండా అతి స్వల్ప వాద్యబృందంతో ఉచితంగా కచేరీ చేసారు. ఘంటసాలవారి కచేరీ అంటే శ్రోతలకు కొదవేముంది. జనాలు బాగానే వచ్చారు. నిర్వాహకుల ఆశయం నెరవేరింది.
అలాగే దసరా ఉత్సవాల సమయంలో ఒక సాంస్కృతిక సంస్థవారు మా నాన్నగారి సంగీత కచేరీని కోరారు. అందుకు మా నాన్నగారు సమ్మతించారు. తేదీ, సమయం, వేదిక నిర్ణయించబడింది.
పానగల్ పార్క్ కు ఉత్తర దిశలో అంటే ప్రకాశం రోడ్ చివర, గోపతి నారాయణ చెట్టి స్ట్రీట్ మొదట్లో ఎడమవేపు శ్రీ వెంకటేశ్వర కళ్యాణమండపం, దక్షిణాన వుమ్మిడి బంగారు చెట్టి జువెలరీ షాపుకు, కుమరన్ బట్టల కొట్టుకు మధ్యలో సుగుణ్ విహార్ కళ్యాణ మండపం వుండేవి. ఇప్పుడు సుగుణ్ విహార్ అంతా కూడా కుమరన్ సిల్క్స్ గా మారిపోయింది. చిన్న చిన్న సాంస్కృతికోత్సవాలు ఈ రెండు కళ్యాణ మండపాలలో జరిగేవి. ఈ కళ్యాణమండపాల పరిసరాలన్నీ పెళ్ళిళ్ళ సీజన్ లో రంగురంగుల దీప కాంతులతో, నాదస్వర మేళ తాళ మంగళధ్వనులతో, పట్టుచీరల రెపరెపలతో, రకరకాల సెంట్ వాసనల గుబాళింపులతో కళకళలాడుతూవుండేవి. మిగిలిన రోజుల్లో ఆ మండపాలు వెలవెలబోతూ కనిపించేవి. అలాటప్పుడు ఏవేవో ఇతర కార్యక్రమాలకు ఉపయోగించేవారు.
అలాటి శ్రీ వేంకటేశ్వర కళ్యాణమండపంలో జరుగుతున్న దేవీ నవరాత్రి ఉత్సవాలలో ఒక రోజు ఉదయం పది గంటలకు మా నాన్నగారు శ్రీ పట్రాయని సంగీతరావు గారి కచేరీ. పక్క వాద్యాలున్నాయో లేదో గుర్తులేదు. సాధారణంగా దసరాల సమయంలో వానలు పడడం అలవాటు. ఆయన కచేరీ జరిగిన రోజు ఉదయం కూడా ఒక పెద్ద వర్షం పడి వెలసింది. ఉదయం 9.30 గంటలకే వచ్చి తీసుకువెళతామన్న కార్యనిర్వాహకుల జాడలేదు. మా నాన్నగారే ఒక రిక్షాలో తన హార్మోనియంను పెట్టుకొని పానగల్ పార్క్ దగ్గరున్న కచేరీ వేదిక వద్దకు వెళ్ళిపోయారు. వెనకాలే నేనూ, మరికొంతమందిమి అక్కడికి చేరుకున్నాము.ఆ కళ్యాణ మండపం బయట ఆవరణలో ఒక నల్లబల్లమీద ఒక సుద్దముక్కతో ఆనాటి కార్యక్రమ విశేషాలు వ్రాసిపెట్టారు. అందులో మా నాన్నగారి పేరు వుంది. అప్పటికింకా ఉత్సవనిర్వాహకులు ఎవరూ రాలేదు. సమయం పది గంటలు కాగానే మా నాన్నగారు హార్మోనియం తెరచి తన సహజధోరణిలో గానం చేయడం మొదలెట్టారు. ఆయన గాత్రం విని సంగీతాభిలాష గల కొంతమంది చుట్టుపక్కల తమిళ శ్రోతలు వచ్చి చేరారు. సుమారు ఒక గంటసేపు పాడి మా నాన్నగారు తమ కచేరీని ముగించి తిరిగి ఇంటికి వెళదామనుకుంటున్న సమయంలో ఆ ఉత్సవ నిర్వాహకులు కొందరు వచ్చి ఆలస్యం జరిగినందుకు విచారం వెలిబుచ్చి కచేరీని ప్రారంభించమని మా నాన్నగారిని కోరారు. ఆయన ఏమాత్రం అసహనం కనపర్చకుండా తన సంగీత కచేరీ ముగిసిందని చెప్పారు. అది విని ఆ నిర్వాహకులు నిర్ఘాంతపోయారు. సంగీతసభలో స్వాగతం, పరిచయాలు, ఉపన్యాసాలు, సత్కారాలవంటి తతంగం ఏమీ జరగకుండానే కచేరీ ఎలా జరుగుతుంది. పైగా వర్షం వలన శ్రోతలు ఎక్కువగా రాలేదని, ఏవేవో కారణాలతో సంజాయిషీలు మొదలెట్టారు. మా నాన్నగారు అతి శాంతంగా కార్యనిర్వాహకులు ఏమాత్రం బాధపడవలసిన అవసరం లేదని, తాను రోజూ ఆ సమయంలో ఇంట్లో పాడుకుంటూనే వుంటానని, అలాటిది ఈ రోజు అమ్మవారి సన్నిధిలో పాడానని, శ్రోతలు వున్నారా లేదా అనేది తనకు ముఖ్యం కాదని వినయంగాచెప్పి ఇంటికి వెళ్ళిపోయారు.
సంగీతరావుగారు సంగీతాన్ని తన ఆత్మానందం కోసం వినియోగించుకున్నారే కానీ పేరు ప్రఖ్యాతులు కోసమో, కచేరీలకోసమో లేక అందువల్ల లభించే ఆదాయం కోసమో కాదు. ఒక అరడజన్ పక్కవాద్యగాళ్ళతో, సంగీతం తెలియకపోయినా పక్కనున్న జనాలనాకర్షించడానికి తలలూపుతూ, ఆహా! ఓహో! అనే శ్రోతలకోసం ఆయన ఏనాడు పాడలేదు. పెద్ద పెద్ద సభలలో కచేరీల కోసం వెంపర్లాడలేదు. ఈ విషయంలో ఆయన మార్గం సద్గురు త్యాగబ్రహ్మంగారి మార్గమే. అందుకే సంగీతరావు గారు మద్రాసు వచ్చాక చేసిన సంగీత కచ్చేరీలు వ్రేళ్ళమీద లెఖ్ఖపెట్టవచ్చును.
తమ గురుపుత్రులు సంగీతరావు గారి ఈ విలక్షణ వ్యక్తిత్వానికే శ్రీ ఘంటసాలవారు ఆకర్షితులై అమితమైన గౌరవాన్ని, స్నేహానురాగాలను చివరివరకూ కనపర్చేవారు.
అదీ శ్రీ పట్రాయని సంగీతరావు గారు.
ఒకసారి మద్రాస్ లో ఒక సంగీత కచేరీ జరిగింది. బహుశా టి.నగర్ లోని సుగుణ విహార్ లోనే జరిగిన జ్ఞాపకం. కచేరీ ఘంటసాల మాస్టారిది కాదు వేరెవరో పాడారు. ఆ కచేరీకి మాస్టారితో కూడా నేను వెళ్ళడం జరిగింది. కచేరీ ముగిసిన తర్వాత మాస్టారు కొంచెం సేపు మాట్లాడారు. మాట్లాడవలసిన పరిస్థితిని ఆ కచేరీ నిర్వాహకులు కల్పించారు. నిర్వాహకులు ప్రధాన గాయకుడితోపాటు కచేరీకి సహకరించిన ఇతర వాద్యగాళ్ళను కూడా సభాముఖంగా సముచితంగా పరిచయం చేసి సత్కరించి గౌరవించారు. కానీ ఆ కచేరీలో తంబురా శ్రుతి వేసి సహకరించిన కళాకారుడిని పూర్తిగా విస్మరించారు. ఇది ఘంటసాలవారి మనసుకు బాధ కలిగించింది. ఆయన వెంటనే స్టేజిమీదకు వెళ్ళి గాయకుడిని అభినందిస్తూ, సంగీతం గురించి రెండు మాటలు చెప్పారు. సంగీతంలో శ్రుతి లయలు రెండూ ప్రధానాంగాలు. శ్రుతి లయలను అనుసరించి పాడగలిగినప్పుడే ఆ గాయకుడి పాట ఆమోదయోగ్యమవుతుంది. గాయకుడిని సదా అంటిపెట్టుకొని వుండేవి శ్రుతి లయలే. అటువంటి శ్రుతి లయలలో శ్రుతిని నిర్వాహకులు నిర్లక్ష్యం చేసారు. తంబురా శ్రుతి వేసిన కళాకారుడిని పరిచయం చేయడం మరచిపోయారు. వైలిన్, మృదంగం, ఘటం వాద్యాలతో సహకరించిన కళాకారులు కచేరీకి ఎంత ప్రధానామో అలాగే తంబురా శ్రుతి వేసేవారు కూడా కచేరీలకు అంత ప్రధానం. అలాటివారిని మరవడం భావ్యం కాదని ఘంటసాల మాస్టారు సన్న సన్నగా చీవాట్లు పెట్టి తాను ఆ తంబురా శ్రుతి వేసినవారిని వేదిక మీదకు పిలచి తాను యధారీతిని గౌరవించారు. ఆనాడు ఘంటసాలగారి వంటి మహాగాయకుడి చేత గుర్తింపబడి సత్కారం అందుకున్న ఆ చిరు కళాకారుడి ఆనందం వర్ణనాతీతం.
అది ఘంటసాలవారి ఔన్నత్యం.
ఇలాటి వైఖరులు గల సాంస్కృతిక సంస్థలు అప్పుడూ వున్నాయి, ఇప్పుడూ వున్నాయి. సాంస్కృతిక సంస్థలను నెలకొల్పడం కష్టమేమీకాదు. కానీ వాటిని నిర్దిష్టమైన ప్రణాళికలతో, క్రమశిక్షణతో, భక్తిశ్రధ్ధలతో నిర్వహించగలిగినప్పుడే ఆ కళా సంస్థలు ప్రజల ఆదరాభిమానాలు పొందుతాయి, పదికాలాల పాటు మనుగడ సాగిస్తాయి. అయితే ఏవిధమైన స్వలాభాపేక్ష లేకుండా నిస్స్వార్ధ చింతనతో కళాసేవ చేసే సాంస్కృతిక సంస్థలు దేశంలో చాలా అరుదుగా కనిపిస్తాయి.
1970 ల నుండి మద్రాస్ మహా నగరంలో మెల్లమెల్లగా తెలుగు సాంస్కృతిక సంస్థల ఆవిర్భావం మొదలయింది. అలాటివాటిలో ప్రధానమైనవి మూడు. అవి, కళాభారతి, కళావాహిని, కళాసాగర్. కళాభారతి ప్రారంభం ఘంటసాల మాస్టారి చేతులమీదుగానే జరిగిన గుర్తు. కళాసాగర్ సంస్థను నటసామ్రాట్ శ్రీ అక్కినేని నాగేశ్వరరావు ప్రారంభించారు. ఈ మూడు సంస్థలు చాలా సంవత్సరాలు మంచి మంచి సాంస్కృతిక కార్యకలాపాలతో తెలుగువారిని అలరించాయి. నగరంలోని తెలుగు ప్రముఖులంతా సమిష్టిగా సమైక్యతా దృక్పధం లేకుండా తలో కుంపటి వెలిగించి 'కళ' తో పోటీలు పడ్డారు. తమ తెలుగు నైజం నిరూపించుకున్నారు.
మద్రాస్ లో బెంగాల్ అసోసియేషన్ వుంది. కర్ణాటక అసోసియేషన్ వుంది. మలయాళం అసోషియేషన్ వుంది. అయితే నగరంలో ఏ బెంగాలీ కార్యక్రమాలు జరిగినా, కన్నడ ఉత్సవాలు జరిగినా, లేదా కేరళ పండగలు జరిగినా వాటన్నిటినీ ఆయా భాషలవారంతా కలసి సమిష్టిగా ఐకమత్యభావంతో జరుపుకునేవారు. కాలక్రమేణా ఆయా అసోసియేషన్ లు మద్రాసులో తమకంటూ ప్రత్యేకంగా ఒక గుర్తింపును పొందాయి.. కానీ స్థానిక తెలుగు సాంస్కృతిక సంస్థలలో అలాటి సమిష్టి భావన ఉన్నట్లు తోచదు.
మద్రాసులోని సాంస్కృతిక వైభవం గురించి మరో అధ్యాయంలో వివరంగా చూద్దాము.
🌿🌷🌿
1970లో ఘంటసాలవారికి 'పద్మశ్రీ' బిరుదు లభించాక వారు పాడిన పాటలు గల చిత్రాలు విడుదలైనవి 38. ఆ సినీమాలలో వారు మొత్తం 90 పాటలు, పద్యాలు, శ్లోకాలు పాడారు. వారి స్వీయ సంగీత దర్శకత్వంలో వచ్చిన సినీమాలు ఐదు - 'మెరుపు వీరుడు', ' ఆలీబాబా 40 దొంగలు', 'విజయం మనదే', 'తల్లిదండ్రులు' 'రెండు కుటుంబాల కథ' చిత్రాలు.
'పద్మశ్రీ' ఘంటసాల అని టైటిల్స్ లో వేసిన సినీమాలు కొన్ని వున్నాయి. 'పద్మశ్రీ' బిరుదును తమ పేర్లముందు ఉపయోగించరాదనే నియమం ఏదో వుందనుకుంటాను. ఘంటసాలగారు తన లెటర్ హెడ్స్ లో 'పద్మశ్రీ' అని పేరుకు ముందు వేసుకోలేదు. సినీమా టైటిల్స్ లో కూడా వేయాలని ఆశించలేదు. వారిమీది గౌరవంతో నిర్మాతలే కొందరు తమ చిత్రాలలో పద్మశ్రీ ఘంటసాల అని ప్రకటించేవారు. ఇంతకంటే మరెన్నో ఉన్నత పురస్కారాలకు అర్హుడైన ఘంటసాలవారిని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఉపేక్షించడం చాలా దురదృష్టకరం.
ఆ సంవత్సరం గాయకుడిగా మంచి పేరును తెచ్చిపెట్టిన - అక్కాచెల్లెలు,
చిటా పటా చినుకులతో - అక్కా చెల్లెలు
తల్లా? పెళ్ళామా?, లక్ష్మీ కటాక్షం, జైజవాన్, కధానాయిక మొల్ల, ఆలీబాబా 40 దొంగలు, పెత్తందార్లు, ధర్మదాత,
జో... లాలీ... ధర్మదాత
విజయం మనదే, తల్లిదండ్రులు, చిట్టిచెల్లెలు, మాయని మమత,
రానిక నీకోసం - మాయని మమత
మొదలైన సినీమాలలోని పాటలు ఈనాటికీ మనకు వినిపిస్తున్నాయి.
ఆ పాటల వివరాలేమిటో వచ్చే వారం చూద్దాము.
...సశేషం
*With a view to make the narrative more authentic and to corroborate it, images, audio and video clips are attached at appropriate places. If such usage is found objectionable to the copyright holders the same shall be removed if and when notified.
2 comments:
To day it happened to read the post and felt happy to remember and get information of those golden days.
Good writing by Mr. Swaratt.
Keep writing.
ANRAO
ధన్యవాదాలు
Post a Comment