visitors

Sunday, December 12, 2021

నెం. 35 , ఉస్మాన్ రోడ్ (ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 2 - అరవైయొకటవ భాగం

12.12.2021 - ఆదివారం భాగం - 61*:
అధ్యాయం 2 భాగం 60 ఇక్కడ

  

నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్


ఒకప్పుడు మద్రాసు  దక్షిణ భారతదేశ చలనచిత్ర పరిశ్రమకు ముఖ్య కేంద్రంగా వుండేది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్రాలన్నీ మద్రాస్ లోనే నిర్మించబడేవి. సినిమా స్టూడియోలు, సినీమా కంపెనీలు అన్నీ మద్రాసు లోనే వుండేవి. హైదరాబాద్ లో సారధీ స్టూడియో, మైసూర్ లో ప్రీమియర్ స్టూడియో వంటివి కొన్ని వున్నా చిత్ర నిర్మాణం అంతంత మాత్రమే. అక్కినేని నాగేశ్వరరావుగారు మద్రాస్ వదలి హైదరాబాద్ లో స్థిరపడిన తర్వాత క్రమక్రమంగా తెలుగు సినీమాలు హైదరాబాద్ లో తీయడం మొదలెట్టారు. అయినా చాలా కాలం వరకు సినీసంగీత విభాగం మాత్రం మద్రాసులోనే వుండేది. అధిక సంఖ్యాకులైన సంగీత దర్శకులు, గాయనీగాయకులు మద్రాసులోనే వుంటూ అక్కడి నాలుగు భాషలలో తమ ప్రతిభను చాటుకునేవారు.  తర్వాత తర్వాత అందరిలో స్వరాష్ట్రాభిమానం అధికమై తమ సొంత రాష్ట్ర రాజధానులలో చిత్రసీమను తరలించుకున్నారు. హాలీవుడ్ బాణీలో బాలీవుడ్ వస్తే దాన్ని అనుకరిస్తూ ఈనాడు టాలీవుడ్, కోలివుడ్, సాండల్ వుడ్,  అంటూ వివిధ నిర్మాణ కేంద్రాలు వెలిసాయి.

పర్వతనేని గంగాధరరావు హైదరాబాద్ కేంద్రంగా తమ హైదరాబాద్ మూవీస్/నవశక్తి ప్రొడక్షన్స్ బ్యానర్ ల మీద కొన్ని చిత్రాలు నిర్మించారు. ఆయన సోదరుడు సాంబశివరావు అనేక సినీమాలకు దర్శకత్వం వహించారు. ప్రముఖ రాజకీయ నేత పి.ఉపేంద్ర కూడా వీరి సోదరుడేనని ఎవరో అనగా విన్నాను. అంతగా తెలియదు.

పి. గంగాధరరావు, డైరెక్టర్ సి.ఎస్.రావు దర్శకత్వంలో 'జీవితచక్రం' అనే సినీమా మొదలెట్టారు. ఎన్.టి.రామారావు, జగ్గయ్య, వాణిశ్రీ, శారద, రేలంగి, రమణారెడ్డి వంటి భారీ తారాగణం ఈ సినీమాలో వున్నారు. ఈ సినీమాకు సంగీత దర్శకులుగా శంకర్ జైకిషన్ల ను ఎన్నుకోవడం ఒక విశేషమైతే ఈ చిత్రంలోని పాటలన్నీ బొంబాయి స్టూడియోలోనే  రికార్డ్ చేయాలని సంకల్పించడం మరో పెద్ద వార్తగా ప్రచారమయింది. ఈ చిత్రంలో ఎన్.టి.ఆర్ కు వున్న నాలుగు పాటలను ఘంటసాల మాస్టారిచేత పాడించడానికి నిర్ణయించారు. రెండు సోలోలు, రెండు డ్యూయెట్లు. ఈ రెండు డ్యూయెట్లను సుశీలగారి చేత కాకుండా బొంబాయి గాయని శారద పాడతారని అనుకున్నారు. ఈ నాలుగు పాటలు ఆరుద్రే వ్రాసారు. గతంలో శంకర్ జైకిషన్ల సంగీతంలో వచ్చిన 'ప్రేమలేఖలు' హిందీ డబ్బింగ్ సినీమా పాటలన్నీ ఆరుద్రగారే వ్రాసారు. ఈ సినీమాలో సి.నారాయణరెడ్డిగారు వ్రాసిన రెండు పాటలను పి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం; పి.సుశీల, బి.వసంత పాడతారని అనుకున్నారు.

నాకు తెలిసి ఘంటసాలవారు పాటల రికార్డింగ్ లకోసం మద్రాసు వదలి బయట ఊళ్ళకు వెళ్ళడం చాలా అరుదు. ఒకసారి మాత్రం తన సంగీత దర్శకత్వంలో వచ్చిన 'సతీ సుకన్య' పాటల రికార్డింగ్ కోసం మైసూర్ వెళ్ళారు. మైసూర్ ప్రీమియర్ స్టూడియో లోనే ఆ సినిమా షూటింగ్ లు, రికార్డింగ్/రీరికార్డింగ్ జరిగాయి. ఆ సినీమా పాటల కంపోజింగ్ విశేషాల గురించి గతంలో 'నెం.35, ఉస్మాన్ రోడ్' లో పేర్కొనడం జరిగింది.

జీవితచక్రంలోని నాలుగు పాటలు పాడడానికి ఒక వారం బొంబాయి లో వుండేలా ఏర్పాట్లు చేసుకోమని నిర్మాతలు అడుగుతున్నారని దానికి తగ్గట్లుగా మద్రాస్ లోని  తన షెడ్యూల్స్ ఎడ్జస్ట్ చేసుకోవాలని ఘంటసాల మాస్టారు ఇంట్లో అనేవారు. ఘంటసాలవారికి బొంబాయి  సినీమా వాతావరణం క్రొత్త. అలాగే అక్కడివారికీ ఘంటసాల అంటే ఏమిటో తెలియదు. అక్కడ మాస్టారికి తెలిసిన తెలుగు వ్యక్తి సి.వెంకటేశ్వరరావు. ఆయన బొంబాయి లో డాన్స్ డైరక్టర్ గా పనిచేసేవారు. ఆయనకు ఘంటసాలగారి పాటలంటే విపరీతాభిమానం. ఘంటసాలవారి పాత గ్రామఫోన్ రికార్డులను తన వర్క్ స్పాట్ కు తీసుకువెళ్ళి ఖాళీ సమయాలలో వింటూండేవారట. అక్కడివారందరికీ మాస్టారి పాటలు వినిపించి ఘంటసాలవారి గురించి గొప్పగా వివరించేవారట. ఆయన తర్వాత ఎప్పుడో మద్రాసు వచ్చి ఘంటసాల మాస్టారు సంగీతదర్శకత్వం  వహించిన ఒకటి రెండు సినిమా లకు నృత్య దర్శకత్వం వహించారు.

బొంబాయి చిత్రసీమ జీవన శైలికి, మద్రాస్ చిత్రసీమ జీవనరీతులకు చాలా తేడావుంది. మద్రాసు  చిత్ర నిర్మాణంలో వుండే క్రమపధ్ధతి, నిబధ్ధత, సమయపాలన మొదలైన అంశాలు బొంబాయి లో తక్కువ. అనుకున్న షెడ్యూల్స్ లో పని  సక్రమంగా పూర్తికాదని అనుకోవడం విన్నాను. ఇవే నాలుగు పాటలు మద్రాసులో అయితే రెండు కాల్షీట్లు లో ముగించేయవచ్చు. దానికోసం వారం రోజులు అవసరమా అని అనుకుంటూ ఘంటసాల మాస్టారు బొంబాయి వెళ్ళారు. శంకర్ జైకిషన్ల్ అప్పటికే అంతర్జాతీయ స్థాయిలో పేరెన్నిక పొందిన సంగీత దర్శకులు. తమ పాటలకు వందకు తక్కువ లేకుండా వెస్టర్న్  ఆర్కెష్ట్రాను భారీగా ఉపయోగిస్తారనుకునేవారు. వాళ్ళ బాణీకి ఘంటసాలవారి బాణికి చాలా తేడా వుంది. వారి పాటలలో గమకాలు ఎక్కువ వుండవు. ఆ విషయం ముఖేష్, శారద వంటి గాయకులు పాడిన పాటలు వింటే అర్ధమవుతుంది.

ఈ సినీమా నాటికే శంకర్ జైకిషన్ల్ విడాకులు పుచ్చుకున్నారు. ఎవరి సినీమాలు వారివే. కానీ, రాజ్ కపూర్ లాటి ఆప్తమిత్రుల కోసం ఇద్దరూ సంయుక్తంగానే పనిచేస్తున్నట్లు కనిపించేవారు. ఈ ఇద్దరిలో ఎవరు ఏ సినీమాకు పనిచేసినా శంకర్ జైకిషన్ల సంగీతంగానే ప్రచారం జరిగేది.

జీవితచక్రం సినీమా సంగీతం శంకర్ ది. ఈయన స్వస్థలం కూడా హైదరాబాద్. తెలుగువాడే. అయితే ఆయనకు ఎంతవరకూ తెలుగు గుర్తుందో నాకు తెలియదు. బొంబాయిలో దిగిన ఘంటసాల మాస్టారిని  గౌరవప్రదంగా స్వాగతించి తీసుకువెళ్ళారు.

సామాన్య దాక్షిణాత్యుల మాదిరిగా మామూలు  తెల్లలుంగీ, తెల్ల షర్ట్ లో కనిపించే ఈ గాయకుడు బొంబాయి వాద్యగాళ్ళనేమీ పెద్దగా ఆకర్షించలేదట ఏదో సాదాసీదా గాయకుడిగా భావించారు. రిహార్సల్స్ జరిగాయి. పాడడానికి కష్టమనుకుంటే బిట్ బై బిట్ రికార్డ్ చేద్దామన్నారట. అలాటి అలవాటే ఘంటసాలవారికి లేదు. మొత్తం పాటంతా ఒకేసారి పాడేయాల్సిందే. మోనిటర్ చూడడానికి మైక్రోఫోన్స్ ఆన్ చేయగానే అప్పుడు తెలిసింది ఘంటసాల అంటే ఎవరో. ఆ గళంలోని స్థాయికి , గాంభీర్యానికి వైబ్రేషన్స్ తో రికార్డింగ్ ధియేటర్ దద్దరిల్లిందట. అక్కడున్న మ్యుజిషియన్స్ అందరూ ఒక్కసారిగా ఎలర్ట్ అయ్యారట.  ఈ గాయకుడెవరో సామాన్యుడు కాడని అర్ధమయింది. ఒకటి రెండు టేకులలో పాట అంతా ok.  శంకర్ జైకిషన్ల ఆర్కెష్ట్రా అంతా ఒక్కుమ్మడిగా లేచి నిలబడి  చప్పట్లతో తమ హర్షధ్వానాలు తెలియజేసారట. అలాగే మొత్తం నాలుగు పాటలను రెండు రోజుల్లో ముగించేసి మూడోరోజు సాయంత్రానికి ఘంటసాల మాస్టారు తిరిగి మద్రాసు వచ్చేసారు. వారం రోజులన్నది మూడు రోజుల్లోనే వచ్చేసరికి అందరికీ ఆశ్చర్యం, ఆందోళన కలిగింది బొంబాయి రికార్డింగ్ లు ఏమైనా క్యాన్సిల్ అయ్యాయేమోనని. అదేంలేదు, నాలుగు పాటల రికార్డింగ్ లు ముగించే వచ్చానని చెప్పారు.  ఈ పాటలు పాడడంలో పెద్దగా కష్టపడలేదని ఈ రకమైన పాటలు రోజుకు మూడు నాలుగైనా సునాయాసంగా పాడవచ్చని చెప్పారు. పనిలేకుండా వారంరోజులు హోటల్లో గడపడం తనకు ఇష్టంలేదని, దానివల్ల నిర్మాత కు అనవసరపు ఖర్చు తప్ప ఇంకేమీ వుండదని, అదే ఇంటికి వచ్చేస్తే ఇక్కడి పనులు చూసుకోవచ్చని వచ్చేసినట్లు చెప్పారు. బొంబాయి శంకర్ తనను ఎంతో గౌరవించారని, తనను బొంబాయి వచ్చేయమని తాను  మ్యూజిక్ చేసే హిందీ సినీమాలలో, లాటిన్, ఫ్రెంచ్ భాషలలో ఆల్బమ్స్  పాడిస్తానని బలవంతపెట్టారట. అందుకు ఘంటసాల మాస్టారు వినయంగా తాను తెలుగు చిత్రసీమలో దాదాపు రెండున్నర దశాబ్దాలుగా పాడుతున్నాని, అక్కడ వున్న స్థానము, పొందుతున్న గౌరవము, ప్రజాభిమానమే చాలని, తెలియని భాషలు కొత్తగా నేర్చుకొని పాడేంత ఆసక్తి, సమయమూ తనకు లేవని తెలియజేసారట. తాను అక్కడున్న మూడు రోజులలో సాయంత్రం పూట ఎంతో మంది సంగీతప్రియులు మాస్టారి రూమ్ కు వచ్చి ఆయనచేత పాడించి విని ఆనందించేవారట. మాస్టారు చెప్పిన అనేకమంది పేర్లలో ఈనాడు నాకు గుర్తున్నది మాలాసిన్హా పేరు మాత్రమే. 

అది ఘంటసాలవారి వ్యక్తిత్వం.

అందుకే  ఆకారాన్ని, వేష భాషలను చూసి మనిషిని అంచనా వేయకూడదంటారు.

జీవితచక్రం శంకర్ జైకిషన్ల మొదటి తెలుగు చిత్రం. (ప్రేమలేఖలు డబ్బింగ్). ఈ చిత్రంలోని పాటలన్నీ గతంలో శంకర్ జైకిషన్ల్ చేసిన పాటల ధోరణిలోనే వినిపిస్తాయి. దానికి కారణం బహుశా, తమ పాటల మీద తమకున్న మమకారం, మక్కువ కావచ్చు, అవే ట్యూన్స్ తిరిగి తిరిగి శ్రోతలకు వినిపిస్తాయి. ఇది రాజ్ కపూర్ ప్రభావం అని నాకనిపిస్తుంది. రాజ్ కపూర్ తీసిన మొదటి తరం సినీమాలోని పాటల బిట్లు తర్వాత వచ్చిన సినీమాలన్నిటిలో ఎక్కడో దగ్గర అంతర్లీనంగా నేపథ్య సంగీత రూపంలో సుశ్రావ్యంగా వినిపిస్తూంటాయి. 'తినగ తినగ వేము తియ్యగుండు' అన్నట్లు పాత పాటలైనా పదేపదే వినిపిస్తూంటే శ్రోతల హృదయాలకు మరింత చేరువ అవుతాయి.

ఆ విధంగా జీవితచక్రంలోని ఏడు పాటలు ప్రేక్షకులకు ఆహ్లాదాన్ని కలిగించేవే, ఒక్క 'సుడిగాలి లోన దీపం కడవరకు వెలుగునా' పాట తప్ప. ఇది విషాదగీతం. ఈ పాటలో ఘంటసాలగారి  గళంలో వినపడే విషాద భావోద్రేకాలు, గాంభీర్యం ఎలాటివారినైనా కరిగిస్తాయి. 'కంటి చూపు చెపుతోంది', హిందీ గాయని శారదతో  పాడిన  " కళ్ళల్లో కళ్ళుపెట్టి చూడు", "మధురాతి మధురం మన ప్రేమ మధురం" పాటలు   అన్ని వర్గాల శ్రోతలచేత స్టెప్ లు వేయించేలా ఉత్సాహభరితంగా మాస్టారు పాడారు.


కంటి చూపు చెబుతోంది - జీవితచక్రం

1971 లో వచ్చిన చాలా సినీమాలలోని పాటలు ఘంటసాలవారికి మంచి కీర్తి ప్రతిష్పలనే సంపాదించి పెట్టాయి. 'పదిమందిలో పాట పాడినా' (ఆనందనిలయం), "మొదటి పెగ్గులో మజా" (శ్రీమంతుడు) పాటలు ఈనాటికీ వినిపిస్తున్నాయి. 


పదిమందిలో పాట పాడినా - ఆనందనిలయం


ఆ సంవత్సరంలో అతి ఘన విజయం సాధించిన సినీమా 'ప్రేమ నగర్'. వరస పరాజయాలతో బాగా కృంగిపోయి ఇక మద్రాసు వదలి పోవడం తప్ప  వేరే మార్గంలేదని నిశ్చయించుకున్న తర్వాత ఆఖరు ప్రయత్నంగా డి.రామానాయుడుగారు నిర్మించిన చిత్రం 'ప్రేమనగర్'. దేవదాసు టైప్ సినీమా. దేవదాసు పాటల్లాగే కె.వి.మహాదేవన్ చేసిన ప్రేమనగర్ పాటలన్నీ సూపర్ హిట్ అయాయి.  దేవదాసుకు వచ్చినంత పేరు ఘంటసాలవారికి ఈ సినీమా పాటలతో వచ్చింది. ఈ సినీమాకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. తమిళ, హిందీ భాషలలో కూడా ప్రేమనగర్ బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టింది. ఈ సినీమా తర్వాత రామానాయుడు శతాధిక సినీమాలు తీసి,  సొంత స్టూడియో కట్టి 'మూవీ మొఘల్' అనే కీర్తిపొందారు. తెలుగు సినీమా ప్రముఖులలో ప్రముఖుడిగా వెలుగొందారు.

ప్రేమనగర్ లో ఘంటసాల మాస్టారి పాటలు ఎనిమిది వున్నాయి. "అంతము లేని ఈ భువనమంత" పద్యం, "మనసు గతి ఇంతే", "ఎవరి కోసం , ఎవరికోసం", "నేను పుట్టాను లోకం మెచ్చింది', "తేట తేట తెలుగులా", "నీకోసం వెలిసింది ప్రేమ మందిరం", "కడవెత్తుకొచ్చింది కన్నెపిల్ల' పాటలన్నీ ఒక నూతన చరిత్ర సృష్టించాయి. ప్రేమనగర్ సినీమా రామానాయుడుగారి జీవితంలో ఒక అనూహ్యమైన మలుపు.

మనసు గతి ఇంతే - ప్రేమనగర్


1971 వ సంవత్సరం ఆఖరులో వచ్చిన మరో భారీ చిత్రం ఎన్.టి.రామారావు గారి సొంతచిత్రం ' శ్రీకృష్ణ సత్య'. పేరుకు డైరెక్టర్ గా కె.వి.రెడ్డిగారిని నియమించినా నిర్మాణ భాధ్యత అంతా రామారావుగారిదే.

దేశరక్షణనిధి కోసం రామారావుగారి నేతృత్వంలో సినీ పరిశ్రమ అంతా రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు, సాంస్కృతికోత్సవాలు నిర్వహించింది. అ సందర్భంలో రామారావుగారు శ్రీకృష్ణుడిగా ఈ కథను నాటకంగా ప్రదర్శించారు. దానికి ఘంటసాల మాస్టారే సంగీత భాధ్యతలు వహించారు. ఆ సమయంలో రామారావుగారు  ఇదే కథను సినీమాగా తీస్తానని ఆ సినీమాకు మీరే సంగీతం చేపట్టాలని ఘంటసాల మాస్టారిని అడిగారట. మాస్టారు సరేనన్నారు. రక్షణనిధి కార్యక్రమాలు విజయవంతంగా ముగిసాయి. ఎవరి పనుల్లో వారు పడ్డారు. త‌ర్వాత ఎన్.టి.ఆర్ 'కృష్ణసత్య' ను ప్రారంభించారు. కానీ సంగీత దర్శకుడిగా ఘంటసాలవారిని తీసుకోలేదు. ఎన్.ఎ.టిలో పెండ్యాల గారు ప్రవేశించారు. అయినా ఘంటసాలవారు బాధపడలేదు. తను పాడవలసిన పాటలుంటే అవి ఎలాగూ పాడిస్తారు అనే భావనలో వుండేవారు. కానీ నేను మాత్రం, వస్తాయనుకున్న కొన్ని సినీమాలు చేజారిపోతూంటే, కొన్ని కారణాల వల్ల  బాగా నిరాశ చెందుతూండేవాడిని. సినీమా పూర్తి పౌరాణికం కావడం వలన పద్యాలు పాటలు సమృధ్ధిగానే వుంటాయి. ఈ సినీమాలో తిరుపతి వెంకటకవులు వ్రాసిన పద్యాలు, భగవద్గీత శ్లోకాలు,  ఓ రెండు పాటలు మొత్తం ఓ పదమూడు వరకూ  మాస్టారు పాడారు. 'ప్రియా ప్రియా మధురం', "అలుకమానవే చిలకల కొలికిరో" పాటలను పెండ్యాల గారు మధురంగా స్వరపర్చారు. 

1970లో  ప్రారంభమై  1971లో విడుదలైన  ఘంటసాలవారి సంగీత దర్శకత్వంలో వచ్చిన సినీమాలు నాలుగు అవి, గత వారంలో చెప్పిన
'రంగేళీరాజా', 'పట్టిందల్లా బంగారం', ఎడిటర్ హరినారాయణ సినీమా 'పట్టుకుంటే లక్ష'. ఈ  రెండు సినీమాలలో సంగీతానికి పెద్ద ప్రాధాన్యం లేదు. 'పట్టుకుంటే లక్ష' క్రైమ్ సినీమా. కొమ్మూరి సాంబశివరావుగారి డిటెక్టివ్ నవల ఆధారంగా తీసినది.

ఆ సంవత్సరం ఆఖరులో  రామవిజేతా బాబూరావు సినీమా 'రామాలయం'. ఇందులోని పాటలన్నీ జనరంజకంగా అమరాయి. ముఖ్యంగా మాస్టారు పాడిన 'జగదభిరామా రఘుకుల సోమా', జిక్కి, జానకి పాడిన 'చిన్నా‌రి మరదలికి పెళ్ళవుతుంది", 'మముగన్న తల్లిరా భూదేవి', ఎల్.ఆర్.ఈశ్వరి పాడిన 'మదనా మదనా యనుచును' పాటలు మరింత వినసొంపుగా వుంటాయి.

జగదభిరామ - రామాలయం


'రామాలయం' చిత్రం రీరికార్డింగ్ జరిపే సమయానికి ఘంటసాలవారు తన బృందంతో విదేశీ పర్యటనకు వెళ్ళవలసి వచ్చింది. అప్పుడు మాస్టారి కోరికను మన్నించి ఎస్.రాజేశ్వరరావుగారు రీరికార్డింగ్ పోర్షన్ కు సంగీతం నిర్వహించారు. మాస్టారి పెద్ద కుమారుడు ఘంటసాల విజయకుమార్ సంగీత సహాయకుడిగా రాజేశ్వరరావు గారికి సహకరించాడు.

ఘంటసాలవారి విదేశీయానం కార్యక్రమాలన్ని ఒక కొలిక్కి వచ్చినట్లే. ఒక శుభ ముహుర్తం చూసుకొని బయల్దేరడమే తరువాయి.

ఆ విశేషాలన్ని వచ్చే వారం...

               ...సశేషం

*With a view to make the narrative more authentic and to corroborate it, images, audio and video clips are attached at appropriate places. If such usage is found objectionable to the copyright holders the same shall be removed if and when notified.

4 comments:

చుండి వేంకట రాజు said...

ధన్యవాదాలండి చాలా ఓపికగా వివరిస్తున్నందుకు

P P Swarat said...

ప్రతీవారం క్రమం తప్పకుండా ఈ ధారావాహిక ను చదివి అభినందిస్తున్న మీకు నా ధన్యవాదాలు.

మహేష్ బాబు సంబటూరి వెంకట said...

ఘంటసాల మాస్టారు గారి సీంప్లిసిటీ.....

మూలాలను నిర్లక్ష్యం చేయకుండా ఎదిగిన కొద్దీ ఒదిగిన తత్వం.....

తనని పెంచి పోషించిన భాషల పట్ల కడదాకా అవ్యాజమైన ప్రేమ & గౌరవం చూపడం....

ఇత్యాది ఎన్నో సుగుణాలే ఘంటసాల గారిని ఈ శతాబ్ది గాయకుడిగా ప్రేక్షక శ్రోతల గుండెల్లో చిరస్థాయిగా నిలిపాయనడానికి మీరు వారం వారం చెబుతూన్న ఈ దృష్టాంతాలే నిదర్శనం స్వరాట్ బాబాయ్ గారూ.....

ఘంటసాల గారి గురించి ఎన్నో తెలియని విషయాలు చక్కగా వివరిస్తూ వారి పట్ల మీకున్న ప్రేమాభిమానాలను ఇంత చక్కగా అక్షరీకరిస్తున్న మీకు.... మీ జ్ఞాపకశక్తి కి శతకోటి ధన్యవాదపూర్వక కృతజ్ఞతాభివందనాలు స్వరాట్ బాబాయ్ గారూ 👏👏👏👏👏👌👌👌👌👌😊😊🙏🙏💐💐

P P Swarat said...

కృతజ్ఞతలు.