30.01.2022 - ఆదివారం భాగం - 66:
ప్రణవ స్వరాట్
9 టు 9 రీ-రికార్డింగ్ కాల్షీట్. ఆరోజుతో ఎలాగైనా రీరికార్డింగ్ పూర్తిచేసేయాలనే దీక్షతో వచ్చారు ఘంటసాల మాస్టారు. ముందుగా ఆ రోజు చేయవలసిన సీన్స్ తెరమీద వేసి చూపారు. స్టాప్ వాచ్ తో మొత్తం సీన్ ఎన్ని నిముషాలు వుందో అందులో ఎంతమేరకు మ్యూజిక్ అవసరమవుతుందో ఏఏ వాద్యాలు ఉపయోగించాలో నిర్ణయించుకున్నారు. ఆ సీన్ లో ముందు ఛేసింగ్స్, తర్వాత ఒక లెన్తీ ఫైట్ సీక్వెన్స్. మాస్టారు, మా నాన్నగారు హార్మోనియం మీద, జడ్సన్ తబలామీద సహకరిస్తూంటే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కంపోజ్ చేశారు. తనకు తృప్తి కలిగేంతవరకు చేర్పులు , మార్పులు చేసి నోట్స్ ఫైనలైజ్ చేసారు. మధ్యమధ్య ఏ విధమైన సౌండ్ ఎఫెక్ట్స్ ఏ వాద్యం మీద రావాలో తాత్కాలికంగా నిర్ణయించారు. ఓ ముఫ్ఫై నలభైమంది ఆర్కెష్ట్రా. వెస్టర్న్ స్ట్రింగ్, విండ్ ఇన్స్ట్ర్మెంట్స్ ఎక్కువగానే వున్నాయి. హై పిచ్ లో ఫాస్ట్ టెంపో నోట్స్ ను మాస్టారు కంపోజ్ చేశారు. ఒక్కొక్క సెక్షన్ నుండి ఒక్కొక్క ప్రతినిధి వచ్చి మా నాన్నగారు చెపుతూంటే వారి వారి భాషల్లో నోట్స్ రాసుకొని మిగతావారికి అందజేశారు. ముందుగా ఆ నోట్స్ ఒకటి రెండు సార్లు ప్రాక్టీసు చేశాక, తెర మీద సినీమాతో పాటు వాయింపజేసి నాన్ సింక్ లు ఏమైనా వున్నాయేమోనని చెక్ చేసుకొన్నారు. ఫస్ట్ మోనిటర్ లో చిన్న చిన్న మార్పులు అవసరమయాయి. వాటిని సరిచేసి మరో మోనిటర్ పిక్చర్ తో చూశారు. తృప్తికరంగానే వచ్చింది. టేక్ తీద్దామా అని సౌండ్ డిపార్ట్మెంట్ వారిని. ఆడిటోరియంలో ని ఆర్కెస్ట్రాను మైక్ లో అడిగారు మాస్టారు. టేక్ సమయంలో ఏ రకమైన దగ్గులు, తుమ్ములు, ఆవలింతలు, బరబర చప్పుళ్ళు వినపడకూడదనడానికి ఇదొక హెచ్చరిక. సౌండ్ వాళ్ళు తాము రెడీ అని చెప్పాక ఆర్కెస్ట్రాను కండక్ట్ చేసే రాఘవులుగారు సైలెన్స్ అని ఓ అరుపు అరిచి, సీన్ నెంబర్ చెప్పి స్టార్ట్ అనగానే స్క్రీన్ మీద సినీమా ప్రారంభమై ఆడిటోరియంలో వాద్యాల మ్రోత ఆరంభమయింది. అన్ని వాద్యాలు ఒకేసారి జోరుగా మ్రోగుతున్నప్పుడు వినేవారికి చాలా ఉత్కంఠ కలుగుతుంది. వాద్యాలు స్పీడ్ అందుకున్నాయి. సౌండ్ ఇంజనీర్ పక్కనే కూర్చున్న ఘంటసాల మాస్టారు సడన్ గా కట్ అని అరిచారు. ఒక్కసారిగా వాద్యాలన్నీ ఆగిపోయాయి. మాస్టారు ఎందుకు కట్ చెప్పారో ఎవరికీ అర్ధం కాలేదు. మాస్టారికి తెలుసు ఏ సెక్షన్ లో పొరపాటని. అయినా ఒక్కొక్క సెక్షన్ ను మళ్ళీ వాళ్ళ వాళ్ళ నోట్స్ ను వాయించి చూపమన్నారు. అలా మళ్ళీ వాయించేప్పుడు వైలిన్స్ సెక్షన్ లో ఎవరో నోట్స్ తప్పుగా రాసుకోవడం వలన ఒకచోట స్వరం తప్పి అపశ్రుతిగా వినపడింది. ఆ విషయం థియేటర్లో వాయిస్తున్నవారికి తెలియదు . ఏ చిన్న లోపం ఎక్కడ జరిగినా లోపల సౌండ్ కంట్రోల్ రూమ్ లో తెలిసిపోతుంది. మళ్ళీ మొత్తం సీన్ మొదటినుండి ప్రారంభించవలసిందే. ఇలాటి పొరపాట్లు ఎవరు చేసినా దాని ఫలితం అందరూ అనుభవించాలి. అందుకే ఆర్కెస్ట్రాలో బాగా అనుభవం ఉన్నవారిని, ప్రొఫెషనల్స్ ను పిలుస్తారు. ధియేటర్లోకి వచ్చాక ఒక్కొక్క నిముషం ఎంతో విలువైనది. అంతా అణా పైసలతో కూడుకున్నది. అనుకున్న రీతిలో పని సక్రమంగా జరగకపోతే అక్కడ నిర్మాత బిపి రేట్ పెరిగిపోతూంటుంది. అటువంటి దురవస్థ నుండి నిర్మాతకు తప్పించవలసిన బాధ్యత ఇప్పుడు సంగీతదర్శకుడిదే. నిర్ణీత సమయంలో పనిపూర్తి చేయాలి, తను చేస్తున్న సీన్ తనకు ఇతరులకు పూర్తి సంతృప్తిని కలిగించాలి. ఇందుకుగానూ ఘంటసాలగారు ఎంతో శ్రమించేవారు. ఆఖరు నిముషం వరకూ అన్నీ సక్రమంగానే వున్నా టేక్ కు వెళ్ళేప్పటికి ఎదో అంతరాయం. సౌండ్ విభాగంలో కరెంట్ ఫ్లక్చువేషన్ వల్ల మైకులు పనిచేయకపోవడం, శ్రుతుల బిగింపు ఎక్కువై వైలిన్ తీగెలు తెగిపోవడం, తబలా,డ్రమ్ముల శ్రుతులు జారిపోవడం, లేదా హార్మోనియం మెట్లు జామ్ అయి హ్యాంగ్ కావడం,ఆర్కెస్ట్రా రూమ్ లోని కుర్చీలో, టేబిల్సో జరిగి చప్పుడు కావడం ఇత్యాది అనివార్య అవాంతరాలతో టేక్ సగంలో కట్ చేసి మళ్ళీ మొదలుపెట్టవలసి వచ్చేది. ఇప్పటి మోడర్న్ టెక్నాలజీ ఆనాడే వుండివుంటే మరెంతో ఉత్తమ సంగీతం లభించేది. ప్రపంచ సినీమా ఇండస్ట్ట్రీలతో పోలిస్తే భారతీయ చలనచిత్ర సాంకేతిక నైపుణ్యం ఎప్పుడూ ఒక దశాబ్దం వెనకే అని సినీ పండితుల అభిప్రాయం. హాలీవుడ్ లో ఔట్ డేట్ అయిన తర్వాత ఆ సాంకేతికత ఇండియాకు దిగుమతి అవుతుందని మా వీడియో టెక్నిషియన్స్ అనడం నేను విన్నాను. ఈ రకమైనటువంటి పొరపాట్లవలన, లోపాల వలన నిర్ణీత సమయంలో సక్రమంగా పని పూర్తికాదు. అందువల్ల ఏర్పడే స్ట్రెస్, స్ట్రైన్ కళాకారుల మీద చాలా తీవ్రంగా వుంటుంది. ఈ విధమైన ఒత్తిళ్ళు తట్టుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అంత సులభం కాదు.
ఒక సినిమాకు సంగీత దర్శకత్వం వహించి అనుకున్న సమయానికి నిర్మాత, దర్శకుల తృప్తిమేరకు పాటలను, రీరికార్డింగ్, మిక్సింగ్ లను పూర్తి చేయడమనేది ప్రసవ వేదన అనుభవించడంలాటిది. ప్రతి మనిషి జీవితంలో ఏదో దశలో ఏవో అపశ్రుతులు ధ్వనిస్తూనేవుంటాయి. దానికి కారణం స్వయంకృతాపరాధాలు కావచ్చు, లేదా తన చుట్టూవుండే తనవారి పొరపాటు వల్ల కూడా కావచ్చు. కానీ అందువల్ల కలిగే దుష్ఫలితాలు ఆ మనిషి జీవితాంతం వెంటాడుతూనేవుంటాయి. ఆ మనిషిని అన్ని విధాలా భౌతికంగా, మానసికంగా కృంగదీస్తూనేవుంటాయి.
1972 సెప్టెంబర్ లో జరిగిన ఒక సంఘటన ఘంటసాలవారిని మనోవేదనకు గురిచేసింది. సుప్రసిద్ధ దర్శకుడు, నిర్మాత శ్రీ కె.వి రెడ్డిగారు కాలధర్మం చెందారు. విజయా వాహినీ సంస్థల పురోభివృధ్ధికి ఎంతగానో శ్రమించిన వ్యక్తి. ఘంటసాలవారంటే సదా ఎంతో ప్రేమ,అభిమానం కనపరుస్తూ ఆయన సంగీత ప్రతిభను ఎంతగానో గౌరవించిన వ్యక్తి. కె.వి.రెడ్డిగారి ఇల్లు వెనక భాగం మాస్టారింటికి ఎదురుగానే వుండేది. ఇద్దరూ దాదాపుగా ఒకే సమయంలో రాత్రిపూట స్టూడియో నుండి ఇళ్ళకు చేరేవారు. కె.వి.రెడ్డిగారు పోయినరోజు ఆ ఇంట్లోవారిని పరామర్శ చేయడానికి మాస్టారు వెళుతూ నన్ను కూడా వెంట తీసుకువెళ్ళారు. మేము వెళ్ళే సమయానికి బయటవాళ్ళెవరూ పెద్దగా కనపడలేదు. ప్రముఖ నటి వాణిశ్రీ ఉన్నారు. కె.వి.రెడ్డిగారి అబ్బాయిలలో ఒకరు రామకృష్ణ స్కూల్ లో సహధ్యాయే అయినా నేనెప్పుడూ నా చిన్నతనంలో వారింటికి వెళ్ళలేదు. ఒకరకమైన భయం. కె.వి.రెడ్డిగారు పిల్లల క్రమశిక్షణ విషయంలో చాలా కఠినంగా వ్యవహరించేవారని చెప్పుకునేవారు. వారు సొంతంగా చిత్రనిర్మాణం మొదలెట్టి జయంతి పిక్చర్స్ బ్యానర్ మీద 'పెళ్ళినాటి ప్రమాణాలు' తీస్తున్న రోజులలో ఆ ఆఫీసుకు అప్పుడప్పుడు వెళుతూ అక్కడ ఆయనను దూరం నుండి చూసేవాడిని. ఆ మొదటి సినీమాకు ఘంటసాల మాస్టారే సంగీత దర్శకత్వం వహించారు. మా నాన్నగారు సహాయకుడు. కొన్నిపాటలకు వీణ కూడా వాయించారు. మా నాన్నగారు ఎన్నో కంపెనీలకు అసిస్టెంట్ గా పనిచేసినా ఒక్క కె.వి.రెడ్డిగారి జయంతి బ్యానర్లో మాత్రమే ఆ సినీమా అయినన్నాళ్ళు అదనంగా నెల జీతం క్రింద కొంత పైకం ఇచ్చేవారు. అదెన్నడూ మరచిపోలేను. ఇంట్లోగానీ, బయటగానీ ఎటువంటి చెడువార్తలు విన్నా ఘంటసాలవారు అమితంగా చలించిపోయేవారు. ఇంటికి ఎదురుగా వుండే చిరకాల సన్నిహితుడు కె.వి.రెడ్డిగారు పోవడం ఘంటసాల మాస్టారికి ఎంతో ఆవేదన కలిగించింది.
ఘంటసాలవారు ఏభైవపడి చేరేసరికి మనిషిలో వృధ్ధాప్య ఛాయలు, వైరాగ్య ధోరణి కనపడసాగాయి. వంశపారంపర్యంగా వస్తున్న మధుమేహ వ్యాధి వారికి తమ 33వ ఏటనే సంక్రమించింది. అది అంతకుముందే ఎప్పటినుండి వుండేదో తెలియదు. ఈరోజుల్లోలా ఆనాడు ఇళ్ళలో గ్లూకోమీటర్లు, బిపి చెకింగ్ మీటర్లు అందుబాటులో వుండేవికావు. యూరిన్ టెస్ట్ లు చేసుకోవడానికి తగినంత సమయమూ దొరికేదికాదు. బిపి, సుగర్ లు రెండూ బాగా పెరిగిపోయాయి. ఎప్పుడూ అరికాళ్ళ మంటలతో బాధపడేవారు. రికార్డింగ్, రీరికార్డింగ్ సమయాలలో గంటల తరబడి నిలబడే వుండవలసి వచ్చేది. దానితో కాళ్ళమంటలు మరింత ఎక్కువయేది. ఇంటికీ రాగానే తమ్ముడు కృష్ణగానీ , సావిత్రమ్మగారు గానీ అరికాళ్ళకు కర్పూరం వేసిన నూనెతో మర్దనా చేస్తే కొంత సర్దుకునేది.
మిగిలిన రంగాలతో పోల్చి చూస్తే ఆనాడు సినీమావాళ్ళకు ఆహారం విషయంలో కంట్రోల్ వుండేదికాదు. నిర్ణీత సమయానికి భోజనం, నిద్ర వుండేవికావు. ఇవన్నీ కూడా మనిషి ఆరోగ్యాన్ని బాగా దెబ్బతీస్తాయి. అలాగే తీసుకునే ఆహారం విషయంలో కూడా ఎంతో జాగ్రత్త అవసరం. మనిషికి 45 ఏళ్ళ వరకూ మంచి రెసిస్టెన్స్ పవర్ వుంటుంది. ఆ వయసులో ఎలాటి ఆహారనియమాలు పాటించకపోయినా మనిషి దృఢంగానే వున్నట్లు కనిపిస్తాడు. అక్కడనుండే ఆరోగ్య సమస్యలు ప్రారంభమవుతాయి. ఘంటసాల మాస్టారు రుచికరమైన ఆహార పదార్ధాల విషయంలో నిగ్రహం పాటించలేకపోయేవారు. చిన్నవయసులో ఎలాగూ సరైన తిండికి నోచుకోలేదు, ఇప్పుడు బాగా సంపాదిస్తున్న కాలంలో కూడా సుష్టుగా భోజనం చేయకపోతే ఎలా అనేవారు. సాధారణంగా డైబెటిక్స్ అందరూ తీపి పదార్ధాలకు లోబడిపోతారు. ప్రముఖ హాస్యనటుడు రేలంగి గారు కూడా ఇదే మనోస్థితిలో వుండేవారు. చిన్న వయసులో రాళ్ళనైనా హరాయించుకోగల శక్తి వున్నప్పుడు చేతిలో పైసలు లేక అన్నంకోసం మొహంవాచి మంచినీళ్ళతోనే ఆకలితీర్చుకోవలసి వచ్చింది. నాలుగు డబ్బులు సంపాదించి హాయిగా కడుపునిండా తిందామనుకునేసరికి రకరకాల జబ్బులు ఒంటిని పట్టి కావలసినవి తినడానికి నోచుకోలేకపోతున్నాని ఎన్నోసార్లు అందరితో చెప్పి బాధపడేవారు. సుగర్, బిపి రెండూ ఆప్తమిత్రులు. ఎవరికైనా ఒకటుంటే పక్కనే రెండోదికూడా వచ్చి చేరుతుంది. ఈ రెండూ వుంటే మిగిలిన వ్యాధులు ఒక్కొక్కటే కాలక్రమేణా బయటపడతాయి. అందులోనూ ఘంటసాల మాస్టారు కృష్ణాజిల్లా వ్యక్తి. ఆహార పదార్థాలు అన్నిటిలో ఉప్పు కారాలు మరీ మితిమీరకపోయినా బాగానే పడేవి. సావిత్రమ్మగారి నేతృత్వంలో తయారైన రకరకాల ఆవకాయలు, కొరివికారం, దోసావకాయ వంటి ఊరగాయలు సంవత్సరం పొడుగునా వుండేవీ. చిరకాలం నిల్వ వుండే ఊరగాయలు కావాలంటే ఘాటైన గుంటూరు మిరపకాయలు, అక్కడి సన్న ఆవాలు, శుధ్ధమైన నువ్వులనూనె మాత్రమే ఉపయోగించాలని ఊరగాయ శాస్త్రాలు ఘోషిస్తాయి. ఈనాడు మనకు షాపుల్లో దొరికే ఊరగాయలన్నింటిలో వినిగర్ వంటి ప్రిసర్వేటివ్స్ వేసేస్తారు. దానివలన మామిడికాయ, నిమ్మకాయ, ఉసిరికాయ, టొమేటొ, గోంగూర ఇలా ఏ ఊరగాయ చూసినా అన్నిటి రుచులు ఒక్కలాగే వుంటాయి. ఒకదానికొకటి తేడానే తెలియదు. షాపుల్లో దొరికే ఊరగాయలు తెలుగువారి ఊరగాయ సంస్కృతిని ముమ్మాటికి ప్రతిబింబించవు. ఏభై అరవై ఏళ్ళ క్రితం మన బామ్మలు, అమ్మమ్మలు పెట్టే ఊరగాయలు, సీమమిరప పొడి కలిపిన అప్పడాలు, ఒడియాలు ఈనాడు ఏ ఇంటా కనపడవు. శాస్త్రోక్తంగా నిబధ్ధతతో ఇంట్లో ఊరగాయలు పెట్టే ఓపికగానీ, తిని హరాయించుకునే ఆరోగ్యాలు కానీ ఈకాలంలో ఎవరికీ లేవు. ఆనాటి ఆహారపు సంస్కృతే వేరు.
సినీమా రంగంలో అడుగుపెట్టి రెండున్నర దశాబ్దాలుగా సినీ సంగీత సామ్రాజ్యంలో మధురగాయకుడిగా, విశిష్ట సంగీతదర్శకుడిగా కీర్తి పొంది మకుటంలేని మహారాజుగా తెలుగువారందరిచేతా నీరాజనాలు పట్టించుకున్న ఘంటసాల మాస్టారికి నిరంతరంగా కాకపోయినా తగిన విశ్రాంతి పొందేలా తగు మార్పులు చేసుకోవాలని ఆశించారు. వయోధర్మానికి తగిన మంచి సాహిత్యం గల పాటలేవైనా తనకు వస్తే మాత్రమే పాడాలని, ఆకతాయి అల్లరి చిల్లరి పాటలు, ద్వంద్వార్ధాల పాటలు పాడకూడదని, బాగా పాడే కొత్త కుర్రాళ్ళను తన పరిధులమేరకు ప్రోత్సహించాలని అనుకునేవారు. ఘంటసాలవారు మొదటినుండీ లైట్ మ్యూజిక్ కచేరీలతో పాటు ఫక్తు కర్ణాటక సంగీత కచేరీలు దేశవ్యాప్తంగా చేయాలని ఆశపడేవారు. కానీ ఆ ఆశ ఆశగానే మిగిలిపోయినందుకు బాధపడేవారు. గాయకుడిగా సినీమా టెక్నిక్ వేరే, కర్ణాటక సంగీత బాణీ వేరే. రెండింటిని సమన్వయ పర్చి సమన్యాయం చేకూర్చడం అంత సులభమైన పనికాదు. శాస్త్రీయ సంగీత కచేరీ చేయడానికి చాలా సాధన అవసరం. నిరంతరం ఏవో వ్యాపకాలతో క్షణం తీరికలేని ఘంటసాల మాస్టారికి అంత సమయం వుండేది కాదు. తాను ఎంత వద్దనుకున్నా నిర్మాతల ఒత్తిడిని, ఆదరాభిమానాలను త్రోసిపుచ్చలేక అన్ని రకాల పాటలు చివరివరకూ పాడుతూనే వచ్చారు. ఎప్పుడైతే శరీరం విశ్రాంతి కోసం తొందరచేస్తున్నదో అప్పుడే ఆయన తన జీవితంలో సార్ధకత చెందే, చిరస్థాయిగా అందరి మన్ననలు పొందే ఉత్తమ కార్యం ఏదైనా చేసి సినీమా రంగం నుండి విశ్రాంతి పొందాలనే దృఢ నిశ్చయానికి వచ్చారు. గాయకుడిగా సార్ధకత చెందే కార్యం ఏదని తీవ్రంగా ఆలోచిస్తున్న సమయంలో ఘంటసాలవారికి లతామంగేష్కర్ గారి భగవద్గీత గుర్తుకు వచ్చింది. ఆవిడ భగవద్గీత కు భిన్నంగా పండిత పామరులంతా విని, దాని సారాంశం అర్ధం చేసుకొని ఆనందించే రీతిలో రూపొందించాలని తీర్మానించారు.
అందుకు గానూ ఘంటసాలవారు ...
ఏం చేసారో ఎలా ముందుకు సాగారో
వచ్చేవారం 'నెం.35, ఉస్మాన్ రోడ్' లో...
... సశేషం