visitors

Tuesday, March 17, 2020

కూచిపూడి రత్న - పట్రాయని సంగీతరావు





1920, నవంబరు 2న జన్మించిన పట్రాయని సంగీతరావుగారు 100వ సంవత్సరంలోకి ప్రవేశించిన సందర్భం ఇది. 

జీవిత గమనంలో అర్థ శతాబ్దం పైగా కూచిపూడి నాట్యరంగంతో ఆయన సంగీత జీవితం ముడిపడి ఉంది. శ్రీ వెంపటి చినసత్యంగారి ఆహ్వానం మేరకు కూచిపూడి ఆర్ట్ అకాడెమీ లో సంగీత బోధకులుగా ప్రవేశించినా, అచిరకాలంలోనే సత్యంగారి నృత్యరూపకాలకు సంగీత దర్శకులుగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు.

 వెంపటి చినసత్యంగారి నాట్యం, భుజంగరాయశర్మగారి సాహిత్యం, సంగీతరావుగారి సంగీతం అద్భుతంగా మేళవించి కూచిపూడి నాట్యానికే మహోన్నతమైన దశ పట్టింది. 

భుజంగరాయశర్మగారి సాహిత్యానికి అద్భుతమైన అపురూపమైన రాగాలతో సంగీతబాణీలను కూర్చడంతో పాటు గాత్రసహకారాన్ని, వీణతో వాద్యసహకారాన్నిఅందించేవారు. సత్యంగారు రూపొందించిన నృత్యనాటికలన్నీ దేశ విదేశాలలో అత్యంత ప్రజాదరణ పొంది విజయం సాధించాయి. సంగీతరావుగారు అందించిన తోడ్పాటును కూచిపూడి అకాడెమీ ఎప్పుడూ మరిచిపోలేదు. 

2006 లో స్వర స్వారాట్ - వైణిక ప్రవాదక మణి పేరుతో శ్రీ వేదాంతం లక్ష్మీ నారాయణ శాస్త్రిగారి పేరుమీద జీవనసాఫల్యత అవార్డును బహూకరించారు కూచిపూడి అకాడెమీ. 

2012 లో శ్రీ సత్యంగారు దివంగతులయ్యారు. శ్రీ సత్యంగారి 84వ జన్మదినోత్సవం సందర్భంగా విశాఖపట్నంలో అప్పటి మానవవనరుల శాఖా మంత్రి శ్రీమతి పురంధరేశ్వరిగారి చేతులమీదుగా డాక్టర్. వెంపటి చినసత్యం  పురస్కారాన్ని ప్రకటించి సంగీతరావుగారికి బహూకరించారు సత్యంగారి కుటుంబం. సత్యంగారు 2012 లోను, అంతకుముందే శ్రీ భుజంగరాయశర్మగారు కూడా గతించారు.


 కూచిపూడి త్రయంలో  ఒకరైన తమ గురువుగారు, శతవార్షికోత్సవం జరుపుకుంటున్నసందర్భంలో తమ సంగీతరావు మాస్టరుగారిని సన్మానించి తమ ఆత్మీయతను చాటుకున్నారు శ్రీ వెంకట్ వెంపటి - శ్రీ చినసత్యంగారి పెద్దకుమారుడు, వారి శ్రీమతి శ్రీమయి.

  ఈ కార్యక్రమంలో  సంగీతరావుగారికి
కూచిపూడి రత్నఅనే అవార్డుతో పాటు, గండపెండేరము తొడిగి, కనకాభిషేకము జరిపించి గురువుగారిని సన్మానించారు, మార్చి 15, 2020 తేదీన. చెన్నెలో కూచిపూడి అకాడెమీ భవనంలో ఆత్మీయ విద్యార్థులు, కుటుంబసభ్యుల మధ్య శ్రీ వెంపటి వెంకట్ దంపతులు ఈ సన్మాన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్బంలో శ్రీ సంగీతరావుగారి ఆత్మీయ, ఆశీర్వచనాలను వారి పెద్దకుమార్తె శ్రీమతి రమణమ్మగారు సభాసదులకు చదివి వినిపించారు. ఆ ఉపన్యాసం ఇది.

 “ సంగీత కళకీ, నాట్యకళకీ రాజధాని చెన్నై. తరతరాలుగా దాక్షిణాత్య కళలన్నీ, తమిళనాడు ప్రభుత్వం చేత దోహదం పొందుతూ ఉన్నవే. కూచిపూడి నాట్య అకాడెమీ విషయంలోనూ వారు అద్వితీయమైన ప్రోత్సాహాన్ని బహుకాలంగా అందిస్తూ ఉండడం చాలా ముదావహమైన విషయం.

మాన్యులు తమిళనాడు ప్రభుత్వం వారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
చెన్నైలో సార్థకంగా నిలబడడానికి నాకు ఆధారమైనవారు - ఇద్దరు కళామూర్తులు. ఒకరు సినీ సంగీత లాక్షణికుడు శ్రీ ఘంటసాల. 

కూచిపూడి నాట్య దార్శనికుడు శ్రీ వెంపటి చిన్న సత్యం. కూచిపూడి నాట్య అకాడెమీ టి.నగర్, పానగల్ పార్కు ఎదురుగా ప్రారంభించారు ఆ రోజుల్లో. శ్రీ వెంపటి సత్యంఅకాడెమీలో సంగీతం కూడా పాఠ్యాంశంగా ప్రారంభించాలని సంకల్పించారు. సంగీతం క్లాసులు నన్ను తీసుకోమని అడిగారు.

ఆ సమయంలో - శ్రీ ఘంటసాల గారు అమెరికా సంచారం విజయవంతంగా పూర్తి చేసుకుని వచ్చిన తరువాత, ఆయన ఆరోగ్యం నిలకడగా ఉండేది కాదు. నేను చేయవలసిన పనీ ఎక్కువ ఉండేది కాదు. ఆ కారణంగా, శ్రీ ఘంటసాల అనుమతితో, అకాడెమీలో సంగీతం క్లాసులు ప్రారంభించడం జరిగింది.

ఆనాడు గౌన్లు, పరికిణీలు, నిక్కర్లు వేసుకున్న పిల్లలుగా పరిచయమైన ఆ పిల్లలు – ఈనాడు కూచిపూడి నాట్యకళామూర్తులుగా, ప్రసిద్ధ నాట్యవేత్తలుగా, నాట్యకళా గురువులుగా, మాననీయ మహిళా మూర్తులుగా రూపొంది రాణిస్తున్నారు. కానీ నా కంటికి వాళ్ళందరూ, నేటికీ కూచిపూడి స్కూలు పసిపిల్లలుగానే కనిపిస్తున్నారు. 

కూచిపూడి అకాడెమీతో నాకున్న అనుబంధం చాలా ఆత్మీయమైనది. కూచిపూడి నాట్యానికి అకాడెమీ చేసిన సేవ అపూర్వమైనది. నాట్యవేత్తలకు మార్గదర్శకమైనది.

అకాడెమీలో ప్రవేశించిన కొద్దిరోజుల్లోనే  ఢిల్లీ కార్యక్రమానికి నేను పాడవలసి వచ్చింది. కూచిపూడి కార్యక్రమాల్లో  మగవాళ్ళకి రేడియో మల్లిక్, సంగీతదర్శకుడు బి గోపాలం పాడుతూ ఉండేవారు. వాళ్ళు పాడిన పాటలు – రికార్డు చేసినవి వినినేను ఢిల్లీ కార్యక్రమంలో పాడ్డం జరిగింది.
సంగీత విమర్శకుడు శ్రీ సుబ్బుడు చేసిన కార్యక్రమ సమీక్ష చూసిన తర్వాత ధైర్యం కలిగింది.
శ్రీ కృష్ణ పారిజాతం, శాకుంతలం, క్షీరసాగరి మధనం ఈ నృత్య నాటికలకు కొన్ని సంవత్సరాలు గాత్ర సహకారం అందించడం జరిగింది. ఆనాటికి వాద్య  బృందంలో -  శర్మ బ్రదర్స్ గా పిలవబడిన గాయకుల్లో కామేశ్వర శర్మగారు – వైణికులు. ఆయన మా నాన్నగారి(శ్రీ పట్రాయని సీతారామశాస్త్రి) సమకాలికులు. గోవిందరాజన్  మృదంగం, నాగరాజన్ ఫ్లూటు, ఎం. ఎస్. రావు వయొలిన్ తో వాద్యబృందం ఉండేది. గోవిందరాజన్ లో మంచి హాస్యస్ఫూర్తి ఉండేది. అందరినీ హాస్య ఛలోక్తులతో నవ్విస్తూ, వాతావరణం ఉత్సాహ భరితంగా ఉంచేవారు. నాగరాజన్ – ఆనాటి సుప్రసిద్ధ విద్వాంసులు. అలత్తూరు బ్రదర్స్ శిష్యుడు. సినిమా వాద్య బృందంలో ఫ్లూటు వాయించేవారు. తరువాత కూచిపూడి వాద్య బృందంలో చేరారు.
ఎం. ఎస్. రావుగారు మా విజయనగరం వారు. రావుగారి అన్నయ్య నా క్లాసుమేట్. ఆ రోజుల్లో నాకాయన వయొలిన్ వాయించేవారు.

ఆనాటి మా బృందంలో సదా స్మరించదగిన వ్యక్తి శ్రీ భుజంగరాయ శర్మగారు. మధురకవి, పండిత వరేణ్యుడు, మరపురాని ఎన్నో నృత్య రూపకాలను రచించిన మహాకవి.

ఈనాడు వాళ్ళెవరూ లేరు. ఆత్మీయులైన వారి మధుర స్మృతులతోను, శుభాకాంక్షలతోను ఈ కార్యక్రమం సక్రమంగా విజయవంతంగా నడవాలని కోరుకుంటున్నాను.

కూచిపూడి అకాడెమీలో నా సేవ గాయకునిగా, వైణికుడిగా, హార్మోనిస్టుగా, సంగీత దర్శకుడిగా ఇలా అనేక రూపాల్లో నడిచింది.

నన్ను వైణికుడిగా, సంగీతదర్శకుడిగా లోకానికి పరిచయం చేసిన సహృదయం శ్రీ వెంపటి సత్యంగారిదే.
శాకుంతలం రెండోభాగం, పద్మావతీ శ్రీనివాసం, కల్యాణ రుక్మిణి, హరవిలాసం, అర్థ నారీశ్వరం, శ్రీ పద పారిజాతం, గోపికా కృష్ణ ఇలా అనేక నృత్య రూపకాలకి సంగీత దర్శకత్వ బాధ్యత వహించే అవకాశం కలిగింది.

ఆనాడు సినిమాల్లో సుప్రసిద్ధులైన వేదాంతం రాఘవయ్య, పసుమర్తి కృష్ణమూర్తి , వెంపటి పెదసత్యం, వెంపటి చినసత్యం నాట్య దర్శకులుగా ఉండేవారు. అయితే సంప్రదాయ కూచిపూడి నాట్యాన్ని మద్రాసులో నిలపాలి అన్న కోరిక శ్రీ చినసత్యం గారికే కలిగింది. కూచిపూడి అకాడెమీకి ఆయనే సంచాలకులుగా నిలబడ్డారు.

 కూచిపూడి నాట్యానికి అకాడెమీ ద్వారా శ్రీ సత్యంగారు చేసిన సేవ  అపురూపమైనది, అద్వితీయమైనది. వివిధ నాట్యరీతుల్లో ఉత్తమ లక్షణాలన్నీ సేకరించి, అనేక కూచిపూడి నాట్యాంశాలు రూపొందించారు. ఒక్కమాటలో చెప్పాలంటే కూచిపూడి నాట్యానికి ఆయన చేసిన సేవ ఒక శతాబ్దానికి చాలింనంత.

ఆయన పెద్ద కుమారుడు వెంకట్ కార్యదక్షత మీద, చిన్న కుమారుడు రవిశంకర్ అసాధారణ నాట్య ప్రజ్ఞ మీద విశ్వాసంతో, ఏ సమస్యా లేదన్న ధీమాతో ఉండేవారు సత్యంగారు. అకాడెమీ దురదృష్టం -2012 లో శ్రీ వెంపటి చినసత్యం నిర్యాణం చెందారు. తరువాత కొద్ది కాలానికే చిన్నకుమారుడు రవిశంకర్ అనూహ్య అకాల మరణం పాలయ్యారు.

ఈనాడు అకాడెమీ బాధ్యత వహించి సంచాలకుడుగా సమర్థంగా నడిపిస్తున్నారు  సత్యంగారి పెద్దకుమారుడు వెంకట్, వారి కోడలు శ్రీమయి నాయందు ప్రేమతో , ఈ సత్కార కార్యక్రమానికి పూనుకున్న వీరిద్దరికీ శుభాభినందనలు, శుభాశ్శీసులు తెలుపుతున్నాను.  వారి కుమార్తె చిరంజీవి లక్ష్మీ కామేశ్వరి కూచిపూడి నాట్య సంప్రదాయాన్ని అంది పుచ్చుకుని కొనసాగించాలి. పిల్లవాడు మృదంగం వాదకుడిగా శిక్షణ పొందుతున్నాడని , పిల్లలిద్దరూ నాట్య సంగీతాల్లో అభిరుచి కలిగి ఉన్నారని చెప్పారు. చాలా సంతోషం కలిగింది. ఆ చిరంజీవులిద్దరికీ ఉజ్జ్వలమైన భవిష్యత్తు ఉన్నది.
కూచిపూడి నాట్య సంప్రదాయ శైలిని చెక్కు చెదరకుండా కాపాడే బాధ్యతను శ్రద్ధతో వహించి, సత్యంగారి కుటుంబం అఖండంగా కూచిపూడి నాట్య సేవను చేయగలిగే అవకాశాన్ని  ఆ నటరాజస్వామి  వారికి కలిగించాలని ప్రార్థిస్తున్నాను.


15.3.2020






















No comments: