visitors

Friday, July 10, 2020

నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 1 - ఏడవ భాగం

భాగం - 7*
ఆరవభాగం ఇక్కడ

నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్




నాటకాలు వేసుకుంటూ తిరగడం, ఏవో సంగీతకచేరీలు చేసుకోవడంలో కాలం గడుస్తోందే తప్ప చెప్పుకోతగ్గ  ఆదాయం, అభివృధ్ధి కనపడలేదు. ఇది ఘంటసాల తల్లిగారికి ఒక వేదనగా తయారయింది. ఎప్పుడు ఇంటిపట్టున ఉండక, ఇల్లు పట్టని కొడుకుకు ఒక కాలికట్టు (పెళ్ళి)  వేస్తే బాధ్యత తెలిసి, కుదురుగా ఉంటాడనే తల్లి ప్రేమతో అతనికి పెళ్ళిచేయాలని సంకల్పించారు. 


ఈ విషయంగా తన వరస సోదరుడైన కొడమంచిలి వెంకటరత్నశాస్త్రిగారిని సంప్రదించారు. ఆయన పెదపులివర్రు వాస్తవ్యులు. స్థానిక బాలాత్రిపురసుందరి ఆలయంలో అర్చకులు. ఊళ్ళో మంచి పేరున్న పెద్దమనిషి. ఆయనకు ఆడా, మగా పదిమంది సంతానం. ఆయన రెండవ కుమార్తె సావిత్రిని తన కొడుకుకి యిచ్చి పెళ్ళి జరిపించమని కోరడం , ఆయన సమ్మతించడం జరిగింది.  దైవసంకల్పం కూడా తోడవడంతో సావిత్రి, ఘంటసాల ల వివాహం 1944 లోమార్చ్ మూడవ తేదీన జరిగింది.



ఘంటసాల  బాల్యావస్థ, యువ దశదాటి ఒక గృహస్తుడయ్యాడు. ఇక, ఘంటసాలను బహువచనంతో సంబోధించడం సముచితం.

సావిత్రిగారితో వివాహం ఘంటసాల వారి జీవితంలో ఒక గొప్ప మలుపుకు నాంది పలికింది.
                 

తెలుగు సినీమా ప్రపంచంలో లబ్దప్రతిష్టులైన  కవి శ్రీమాన్ సముద్రాల రాఘవాచార్యులు, సినీ డైరక్టర్ కాశీనాధుని విశ్వనాథ్, స్వస్థలం పెదపులివర్రు. ఘంటసాలవారి అత్తవారి ఊరు కూడా అదే పెదపులివర్రు. వారంతా ఒకరికొకరు బాగా పరిచయస్తులు.

ఘంటసాలవారి పెళ్ళైన కొద్ది రోజులకు సముద్రాల రాఘవాచార్యులవారు పెదపులివర్రు వెళ్ళడం జరిగింది. అప్పుడు, ఘంటసాలగారు ఆచార్యులవారిని కలసి తన మంచిచెడ్డలు చెప్పుకున్నారు. తాను నేర్చుకున్న సంగీతాన్ని సముద్రాలవారికి వినిపించారు. ఆయన విని చాలా సంతోషించారు. ఇలాటి పల్లెటూళ్ళలో కన్నా మద్రాస్ వంటి నగరాలలో వృధ్ధిచెందే అవకాశాలు ఎక్కువని, అందుచేత మద్రాస్ లో తనను కలిస్తే తగు ప్రయత్నాలు చేయవచ్చని ఘంటసాలగారిలో ఆత్మస్థైర్యం కలిగించారు. ఆచార్యులవారి మాటలు ఘంటసాల తన ఆశల, ఆదర్శాల సాఫల్యానికి తొలిమెట్టుగా భావించారు. 


వివాహం జరిగిన రెండు మాసాలకు ఘంటసాలగారు ఒంటరిగా తన మకామును మద్రాసుకు మార్చారు. 

సముద్రాల రాఘవాచార్యులవారు ఘంటసాలగారికి తన ఇంటనే ఆశ్రయమిచ్చి, తను పని చేస్తున్న, తెలిసిన సినీమా కంపెనీలన్నింటికీ తిప్పుతూ ప్రతీ చోటా ఘంటసాల పాటను అందరికీ వినిపింపజేసేవారు. ఈ విధంగా ఘంటసాల సముద్రాలవారింట కొన్నిమాసాలు గడిపారు. ఆ క్రమంలో నాగయ్యగారి దగ్గర, బి.ఎన్. రెడ్డిగారి వద్దా తన పాట వినిపించి వారిని మెప్పించారు. కానీ వెనువెంటనే ఏ అవకాశాలు దొరకలేదు.
ఈ అవకాశాల వేటలో తిరుగాడుతూ  టి.నగర్ లోని పానగల్ పార్క్ లోనే  కొన్ని రోజులపాటు అక్కడివారి దయాధర్మంతో రాత్రింబవళ్ళు గడిపారట.

కొన్నాళ్ళకు, ముందుగా ఘంటసాల బలరామయ్యగారి ఆఫీసులో ఉంటూ వారు తీసిన 'సీతారామ జననం' లో కోరస్ లు పాడి, ఎక్స్ట్రా వేషాలు వేసినందుకు నెలకు 75 రూపాయలందుకున్నారు.
(ఘంటసాలగారి సినిమారంగ ప్రవేశం తొలిరోజులగురించి  శ్రీ పేకేటి శివరాంగారు -)


అక్కినేని నాగేశ్వరరావు అదే సీతారామజననంలో రాముడిగా తొలిసారి హీరోగా నటించారు. అక్కినేని, ఘంటసాలల మధ్య మైత్రి బలపడింది అప్పుడే.


నాగయ్యగారి రేణుకా ఆఫీస్ లో ఉండేందుకు అవకాశం దొరికింది. నాగయ్యగారు తీస్తున్న త్యాగయ్య సినీమాలో కోరస్ పాడడం, నాగయ్యగారి శిష్యుడిగా వేషం కట్టడం వంటివి జరిగాయి. 

  ( ఈ వీడియోలో నాగయ్యగారికి ఎడమవైపు ఉన్న శిష్యుడు ఘంటసాల)

వాహినీ వారి 'స్వర్గసీమ' లో తొలిసారిగా భానుమతి గారితో కలసి  ఒక డ్యూయెట్ ను సి.హెచ్. నారాయణరావుకు పాడించారు బి.ఎన్. రెడ్డి. 


అక్కడ    బాలాంత్రపు రజనీకాంతరావుగారు ఘంటసాలను చూసి ఆలిండియా రేడియోకు సిఫార్సు చేసి ఘంటసాల గొంతును తెలుగు శ్రోతలకు వినిపించేలా  చేశారు . నెలకు ఆరేడు ప్రోగ్రాములు ఇప్పించి భుక్తికి లోటులేకుండా ఆదుకున్నారు.  

ఇదే క్రమంలో, HMV గ్రామఫోన్ కంపెనీకి వెళితే వారు ఘంటసాల కంఠం మైకుకు పనికిరాదని తిరస్కరించారు. (అలా తిరస్కరించిన అక్కడి ఆఫీసరే మరో 18 ఏళ్ళ తర్వాత  తాను నిర్మించిన చిత్రానికి ఘంటసాలను సంగీతదర్శకుడిగా, చిత్రంలో పాటల గాయకుడిగా నియమించుకున్నారు.
ఆయనెవరనేది తరువాయి భాగాలలో చూద్దాము) .

ఆ తరువాత, ఘంటసాల పాటను విన్న పేకేటి శివరాం  HMVలో ప్రవేశించిన వెనువెంటనే ఘంటసాలగారిచేత 'నగుమోమునకు' అనే చాటు పద్యం, 'గాలిలో నా బ్రతుకు' పాటను తొలిసారిగా పాడించారు.


 అయితే అవి కలకత్తా వెళ్ళి అక్కడ రికార్డులుగా మారి ప్రజలలోకి వెళ్ళేలోగా 'స్వర్గసీమ' సినీమా ముందు విడుదలై ఒక కొత్త గాయకుడి గురించి అందరికి తెలిసింది. తరువాత, 
క్రమక్రమంగా, గృహప్రవేశం, త్యాగయ్య, యోగి వేమన (ఇందులో ఒక నాట్య సన్నివేశంలో నట్టువాంగం చేసే కళాకారుడిగా కూడా కనిపిస్తారు).



           (ఈ వీడియోలో నర్తకి పక్కన నట్టువాంగం చేస్తున్న ఘంటసాల)
పల్నాటియుధ్ధంలో నాలుగు పాటలు పాడారు. రెండు అక్కినేనితో, ఒకటి కన్నాంబతో, ఒకటి సోలోగా పాడారు.
భరణీ వారు తీసిన 'రత్నమాల' సినీమాలో భానుమతి తో రెండు డ్యూయెట్లు, ఒక సోలో పాడడమే కాక, భానుమతి, రామకృష్ణగార్ల ప్రోత్సాహంతో సి ఆర్ సుబ్బురామన్ కు సహాయకుడిగా పనిచేయడంతోపాటు స్వతంత్రంగా కొన్ని పాటలను స్వరపర్చడం జరిగింది. 
ఇక, ఘంటసాల పేరు సినిమా రంగంలోనూ, ప్రేక్షకులలోనూ బాగా వినిపించడం ప్రారంభమయింది.

బాలరాజు ' చెలియా కనరావా' పాటతో ఘంటసాల పేరు ఆంధ్రదేశమంతా మార్మోగింది.



బాలరాజు సినీమాయే సంగీత దర్శకుడిగా తన తొలి సినీమాగా ఘంటసాల చెపుతారు.
ఘంటసాల బలరామయ్యగారి బలవంతంమీద, సంగీతదర్శకుడు గాలి పెంచల నరసింహారావుగారి ప్రోద్బలంతో, సహ సంగీతదర్శకుడి హోదాలో 11 పాటలను స్వరపర్చారు.
ఇందులో అక్కినేని పాడిన 'చెలియా కనరావా' పాట గ్రామఫోన్ రికార్డ్ లో ఉంటే, ఘంటసాలగారు పాడిన అదే పాట సినీమాలో ఉంటుంది. 
అక్కినేని నాగేశ్వరరావు పాడిన పాట సినిమాలో లేదు కనుక   ఆ అరుదైన పాట రికార్డు ఇక్కడ వినండి :
ఈ చిత్రంలో వక్కలంక సరళతో పాడిన 'నవోదయం శుభోదయం' పాటే తన తొలి సినీమా పాట స్వరరచనగా ఘంటసాల పేర్కొంటారు.


 ఘంటసాలగారు, అక్కినేని నాగేశ్వరరావుగారు ఇద్దరూ సినీరంగప్రవేశం ఒకేసారి చేసారు.ఘంటసాలగారితో తన తొలినాళ్ళ స్నేహం గురించి ఏఎన్నార్ ఏమన్నారో ఈ ఆడియో ఫైల్ లో వినవచ్చు.
ఘంటసాలగారి సినీజీవితానికి ఒక గొప్ప మలుపు 'కీలుగుఱ్ఱం' సినిమా. ఇందులోని 'కాదుసుమా కలకాదు సుమా' పాటతో గాయకుడిగా, సంగీత దర్శకుడిగా ఘంటసాల పేరు మార్మోగింది. ఈ సినీమా తమిళంలో కూడా అత్యంత  విజయవంతమై తమిళనాట కూడా ఘంటసాల పేరు అందరికీ తెలియడం ప్రారంభించింది.
ఈ సినీమా గురించి మరింత చెప్పవలసి ఉంది.
కీలుగుఱ్ఱం చిత్ర నిర్మాత దర్శకుడు మీర్జాపురం రాజావారు. ఆయన సతీమణి సి. కృష్ణవేణి ప్రముఖ నటి, గాయని. వీరు స్థాపించిన శోభానాచల, ఎమ్.ఆర్.ఎ. ప్రొడక్షన్స్ ద్వారా తమ సొంత స్టూడియో లో ఒకేసారి మూడు సినీమాలకు శ్రీకారం చుట్టారు. ఈ మూడింటికి సంగీతం సమకూర్చే బాధ్యతను యువ సంగీత దర్శకుడైన ఘంటసాలకు అప్పగించారు. ఘంటసాలగారు మొట్టమొదట స్వతంత్రంగా సంగీతం చేయడానికి ఒప్పందం చేసుకున్న చిత్రం 'లక్ష్మమ్మ', తరువాత, 'మనదేశం', తరువాత 'కీలుగుఱ్ఱం'. అయితే, ఈ మూడింటిలో  1949 లో ముందుగా 'కీలుగుఱ్ఱం', అదే సంవత్సరం ఆఖరులో 'మనదేశం' చిత్రాలు విడుదలై కొత్త సంగీతదర్శకుడిగా, గాయకుడిగా ఘంటసాల పేరు తెలుగు వారందరికీ చిరపరిచితమయింది. తాను ముందుగా ఒప్పుకున్న మొదటి చిత్రం 'లక్ష్మమ్మ' 1950 లో రిలీజయింది. ఈ లక్ష్మమ్మ కు పోటీగా ఘంటసాల బలరామయ్యగారు, అంజలీదేవి, అక్కినేని లతో 'లక్ష్మమ్మ కథ' సినీమా తీశారు, కానీ, విజయవంతం కాలేదు.
కృష్ణవేణి, సి.హెచ్. నారాయణ రావు నటించి త్రిపురనేని గోపీచంద్ దర్శకత్వంలో వచ్చిన 'లక్ష్మమ్మ' గొప్ప హిట్ అయింది. రెండింటి కథా ఒకటే.
ఇక, అక్కడ నుండి ఘంటసాల రక్షరేఖ, లైలామజ్ను, ధర్మాంగద, మనదేశం వంటి చిత్రాలలో తన పాటలతో ఆంధ్రదేశాన్ని ఉర్రూతలూగించారు.

భానుమతిగారి సూపర్ హిట్ విషాద ప్రేమగాథ 'లైలామజ్ను'. ఇందులో  ఘంటసాలగారు పాడిన తొమ్మిది పాటలు చిత్రానికి జీవం పోసాయి. తమిళంలో కూడా లైలామజ్ను,  పాటలవల్లే సూపర్ హిట్ అయింది. 
1949 లో 'మనదేశం'
1950 లో 'షావుకారు' చిత్రాల సంగీతదర్శకుడిగా ఘంటసాల అగ్రశ్రేణి సంగీతదర్శకుల జాబితాలోకి ఎక్కారు. 
ఇక అక్కడ నుండి గాయకుడిగా, సంగీతదర్శకుడిగా ఘంటసాల సినీ ప్రస్థానం రెండున్నర దశాబ్దాల పాటు నిరాటంకంగా  కొనసాగింది. 
ఒక ప్రక్క సినీమాలలో పాడుతూనే, ఓ మూడేళ్ళపాటు  మరో ప్రక్క ఆలిండియా రేడియోలో  శాస్తీయ, లలిత  సంగీతం, నాటకాలు, రూపకాలు అంటూ అన్ని రకాల కార్యక్రమాలలో  పాల్గొనేవారు.

ఘంటసాలగారిని ఆదిలో తిరస్కరించిన హిస్ మాస్టర్స్ వాయిస్ (HMV) వారు, తమ నిరంతర గాయకుడిగా నియమించుకున్నారు .

తెలుగువారి సొత్తుగా చెప్పుకునే పద్యపఠన ప్రక్రియను, నూతన శైలిలో తెలుగువారికి అందించిన ఘనత ఘంటసాలకే దక్కుతుంది. తెలుగులో సుప్రసిధ్ధ కవులందరి పద్యాలను గ్రామఫోన్ రికార్డ్ లు గా విడుదల చేసి దేశమంతా సంచలనం సృష్టించారు.  అలాగే, తిరుపతి వేంకటేశ్వరుని మీద లెఖ్ఖకు మించి భక్తిగీతాలను, ప్రబోధగీతాలను, దేశభక్తి గీతాలను ఆలపించి  తెలుగునాట ఒక ప్రభంజనంలా సంచలనం సృష్టించారు.

పద్య పఠనం విషయంలో ఘంటసాలవారు తమ గురుదేవులైన శ్రీ పట్రాయని సీతారామశాస్త్రి గారినే స్ఫూర్తిగా, ఆదర్శంగా తీసుకున్నారు.  గురువుగారి ప్రభావం ఘంటసాలగారి మీద చాలానే ఉంది.
కేవలం ఘంటసాల పాటలతోనే హెచ్.ఎమ్.వి. వారు ఆంధ్రదేశంలో నిలదొక్కుకున్నారంటే ఏమాత్రం అతిశయోక్తి కానేరదు.

చలన చిత్రసీమలో ఘంటసాలగారు సాధించిన విజయాలు అనన్యసామాన్యం, అనితరసాధ్యం. 

1950 ల తర్వాత, ఘంటసాల సినీ సంగీత చరిత్ర ఒక తెఱచిన పుస్తకం. ఆ విషయాలు నేను చెపితేనే మీరు తెలుసుకోవాలని లేదు.
ఇంటింటా ఒక ఘంటసాల వెలయడానికి కారణభూతులైన తెలుగు ప్రజలందరికీ ఘంటసాల తమ మనిషే. ఈనాటికీ చాలా తెలుగు లోగిళ్ళలో ఘంటసాల పాటతోనే సూర్యోదయమై, ఆయన జోలపాటతోనే నిద్రపోతారు.

ఈవిధంగా విజయపథంలో పయనిస్తున్న ఘంటసాలగారు విజయనగరం వదలి వెళ్ళిన మరో ఐదారేళ్ళకు మరల తమ గురువుగారైన శ్రీ పట్రాయని సీతారామశాస్త్రిగారిని విజయనగరంలో దర్శించారు.
ఆ విశేషాలన్నీ.....
వచ్చేవారం....   (సశేషం)
*With a view to make the narrative more authentic and to corroborate it, images, audio and video clips are attached at appropriate places. If such usage is found objectionable to the copyright holders the same shall be removed if and when notified. 


3 comments:

శివరామి రెడ్డి said...

Excellent narration of Ghantasala life.💐🙏💐

sumabala said...

ఫోటోలు, ఆడియోలు , విడియోలతో ముస్తాబయిన ఈ వ్యాసం వీనుల విందుగా, కన్నుల కింపుగా, హృద్యంగా ఉంది. తరువాతి భాగం కోసం ఎదురుచూస్తున్నాం

P P Swarat said...

Thanks for your encouraging words.