visitors

Friday, July 17, 2020

నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 1 - ఎనిమిదవ భాగం

ఏడవ భాగం     ఇక్కడ.

17.7.2020 - శుక్రవారం: భాగం : 8.

నెం.35,ఉస్మాన్ రోడ్.  


ఘంటసాలగారి సంస్కారం

                                            
మద్రాస్ లో చిత్రసీమలో కొంత నిలదొక్కుకున్న తర్వాత , విజయనగరం వదలి వెళ్ళిన మరికొన్నేళ్ళకు ఘంటసాల మరల విజయనగరం వెళ్ళి తమ గురువులైన శ్రీ పట్రాయని సీతారామశాస్త్రి గారిని కలిసారు. సినీమాలలో తన పురోభివృద్ధి ని గురించి గురువుగారికి చెప్పి వారి ఆశీస్సులు పొందారు. ఆ సందర్భంలో , మద్రాస్ లో మంచి గాయకులకు తగిన అవకాశాలున్నాయని , అందువల్ల , వారి పెద్దబ్బాయి సంగీతరావు ను తన దగ్గరకు పంపమని కోరారు. కానీ అప్పట్లో అది సాధ్యపడలేదు. అందుకు కొన్ని కారణాలు లేకపోలేదు.

1942 లో తొలిసారిగా మా నాన్నగారు - శ్రీ సంగీతరావు గారు ఒక స్నేహితుడి ఆహ్వానం మీద మద్రాస్ వెళ్ళారు. అప్పటికింకా ఘంటసాల మద్రాసు వెళ్ళలేదు. మద్రాసులో ఆలిండియా రేడియో , జెమినీ స్టూడియో   
ప్రారంభమైన తొలిరోజులు.

      
                                                                      
ఆ జెమినీ స్టూడియో లో సాలూరుకు చెందిన మా తాతగారి మిత్రుడు శ్రీ ఉరిమి జగన్నాధం ( ప్రముఖ తబలిస్ట్ వి. లలిత్ ప్రసాద్ తండ్రి) అనే ఆయన జెమినీ స్టూడియోలో తబలిస్ట్ గా పనిచేశేవారు. ఆయన సాలూరులో రాజావారి నాటక సంస్థలో తబలిస్ట్ గా , స్క్రీన్స్ పెయింటర్ గా ఉండేవారు. ఆ జగన్నాధంగారు మా నాన్నగారిని కలుసుకొని తనతో కూడా మద్రాసులో అనేక సినీమా కంపెనీలకు , నాటక సంస్థలకు తీసుకువెళ్ళి మా నాన్నగారి పాటను అందరికీ వినిపించేవారు. 

ఆ క్రమంలో మా నాన్నగారు శ్రీచిత్తూరు వి. నాగయ్యగారిని కూడా కలసి తన పాట వినిపించారు. ఆ సమయంలో నాగయ్యగారు భక్త పోతన సినీమాకు పని చేస్తున్నారు. అక్కడ , " మాతా పితా గురుదేవా " అనే పాట రిహార్సల్స్ జరుగుతున్నాయి. సినీమాలో పోతనగారి కూతురు పాడే పాట. ఆ పాట విని అదే పాటను సంగీతరావు గారు నాగయ్యగారికి వినిపించారు. ఆయన అది విని చాలా సంతోషించారు. సుసర్ల దక్షిణామూర్తి వంటివారు కుర్రవాళ్ళుగా తిరుగాడుతూ కనిపించేవారు. 

ఈ విధంగా మద్రాస్ లో కొన్నాళ్ళు గడిపాక సంగీతరావు గారికి బాగా అనారోగ్యం చేసింది. అదే సమయంలో రెండవ ప్రపంచయుధ్ధం యొక్క ప్రభావం మన దేశం మీద కూడా పడుతుందనే భయంతో సీతారామశాస్త్రి గారు తమ కుమారుడిని మద్రాసు వదలి రమ్మని కబురు పంపించడంతో , సంగీతరావు గారు మద్రాసు విడిచిపెట్టి వెళ్ళిపోయారు. శ్రీకాకుళానికి సమీపంలో దూసి స్టేషన్ . ఆ స్టేషన్ కు ఓ నాలుగు మైళ్ళ దూరంలో కలివరం అనే ఒక చిన్నగ్రామం.ఊరిని ఆనుకొని నాగావళి ఏరు. ఏటికి అవతలి ఒడ్డున తొగరాం అనే ఊరు ఉండేది. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ స్పీకర్ శ్రీ తమ్మినేని సీతారాం గారి తండ్రిగారిది ఆ వూరే.

 ఈ కలివరంలో శ్రీగంగుల అప్పలనాయుడు గారని పెద్ద భూస్వామి. ఆయనకు సంగీతమంటే చాలా ఇష్టం. ఆయన మా నాన్నగారిని తన ఆస్థానగాయకుడిగా పెట్టుకున్నారు. శ్రీ సంగీతరావు 1944 నుండి ఆరేళ్ళపాటు ఆయన ఆదరణలో ఉన్నారు. అప్పలనాయుడు గారికి ముగ్గురో , నలుగురో చెల్లెళ్ళు. వారందరికీ మా నాన్నగారు -సంగీతరావు గారు సంగీతం నేర్పేవారు.

 1952 లో మరల శ్రీ ఘంటసాలవారి ఆహ్వానం మేరకు మా నాన్నగారు మద్రాసు బయల్దేరి వెళ్ళారు. వెళ్ళే సమయంలో భయంకరమైన గాలివాన వచ్చి రైల్వే ట్రాక్ లు దెబ్బ తినడంతో రైలును గూడూరు నుండి రేణిగుంట మార్గంగా నడిపి మద్రాస్ చేర్చారు. అక్కడ సెంట్రల్ స్టేషన్ పక్కన ఒక హోటల్ లో దిగి ,తన పెట్టె అక్కడుంచి ఘంటసాలవారి ని చూడ్డానికి మాంబళం ( అదే త్యాగరాయనగర్ లేదా టి.నగర్) లోని నెం.35 , ఉస్మాన్ రోడ్ కు వెళ్ళారు. ఆ రోజు ఘంటసాలగారి తండ్రి తిధి. ఆయన ఆ కార్యక్రమంలో మునిగిఉన్నారు. మ నాన్నగారు వచ్చిన సంగతి మోపర్రు దాసుగారి ద్వారా విని , ఘంటసాలగారు లోపలనుండి బయటకు వచ్చి మా నాన్నగారిని ఆప్యాయంగా పలకరించి ఇంటిలోపలికి తీసుకువెళ్ళారు. ఆ సంస్కారం , గౌరవం మరెవరికీ రావని మా నాన్నగారు ఎప్పుడూ తల్చుకుంటూంటారు. 

అప్పట్లో ఘంటసాలగారు కొత్తగా ' వాక్సాల్' (vauxhall) అనే కారు కొన్నారు. ఆ రోజు సాయంత్రం , ఆ కారులో ఘంటసాలగారు తనను హొటల్ కు తీసుకువెళ్ళి అక్కడున్న పెట్టితో సహా ఇంటికి తీసుకువచ్చారు. ఆ సమయంలో ఘంటసాల గారు పరోపకారం సినీమా తీస్తున్నారు.

(ఆడియో వినడం కోసం పరోపకారం పోస్టర్ మీద క్లిక్ చేయండి)

 అందులో ఆరుద్ర వ్రాసిన 'పదండి ముందుకు-పదండి తోసుకు ' అనే గీతాన్ని సంగీతరావు గారిచేత పాడించారు. అది శ్రీ శ్రీ రాసిన " పదండి ముందుకు " పాటకు పేరడీ లాటిది. అలాగే , ' పల్లెటూరు ' చిత్రంలో అనేక బృందగానాలుండేవి. మాధవపెద్ది , పిఠాపురం , గోపాలం వీరందరితో కలసి మా నాన్నగారు కూడా ఆ పాటలను పాడారు. అయితే తను నేర్చుకున్న సంగీతం వేరు , సినీమాల్లోని సంగీతం వేరని , ఆ వ్యవహారం మనసుకు నచ్చక మా నాన్నగారు సంగీతరావు గారు మరొకసారి మద్రాసు వదలి వెళ్ళిపోయారు. యధాప్రకారంగా తను , తన కచేరీలంటూ కాలం గడపసాగారు. 

కానీ , విజయనగరంలో, పెరుగుతున్న కుటుంబభారం , ద్వివేదుల నరసింగరావు ( డా.డి.ఎన్ రావు , ద్వివేదుల విశాలాక్షి) వంటి మిత్రులు ఇక్కడే ( విజయనగరం) లోనే వుంటూ తనలో వుండే సంగీత ప్రతిభను వృధా చేసుకోవద్దనే స్నేహపూర్వకమైన ఒత్తిడులు ఎక్కువై వృత్తిరీత్యా విజయనగరం విడిచిపెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. 


 1954 లో కలివరం గంగుల అప్పలనాయుడు గారి కోరిక మేరకు వారితో కలసి తిరుపతియాత్ర వెళ్ళారు. అక్కడికి ఆ నాయుడి గారి బంధువు ప్రముఖ డైరెక్టర్ బి.ఎ. సుబ్బారావు , వారి సోదరుడు బి.ఎ. రామారావు వచ్చారు. వారంతా కలసి మద్రాసు వచ్చి ఘంటసాలవారి ని చూచేందుకు వెళ్ళారు. అప్పుడు ఘంటసాలగారు కన్యాశుల్కం రికార్డింగ్ కు వెళ్ళారు. సంగీతరావు గారు తెల్లారి తిరిగి వెళ్ళిపోతారనే సమయానికి ఘంటసాలవారు వచ్చి " ఇప్పుడు మన చేతిలో చాలా సినీమాలున్నాయి. మీరు వెళ్ళడానికి వీలులేదని" బలవంతపెట్టి ఉంచేశారు. నాయుడు గారి కుటుంబం మాత్రం వెనక్కి వెళ్ళిపోయారు.


 అలా 1954 నుండి 1974 వరకు రెండు దశాబ్దాల వరకు ఘంటసాలగారి దగ్గరే సంగీతరావు గారు పనిచేశారు. ఘంటసాల వారి సంగీత సహాయకుడిగా ఘంటసాలగారు స్వరపర్చిన పాటలకు స్వరాలు వ్రాస్తూ వాటిని ఆర్కెష్ట్రా కు , గాయకులకు నేర్పడం , ఆర్కెష్ట్రా లో హార్మోనియం , వీణ వంటివి వాయించడం చేశేవారు. సినీమా లలో పాడడం విషయంలో ఏమాత్రం ఆసక్తి  కనపర్చలేదు. ఘంటసాల గారితో కలసి అనేక కచేరీలలో పాల్గొని హార్మోనియం వాయించారు. అవసరమనుకున్నప్పుడు ఘంటసాలవారి తో కలసి కచేరీలలో పాడేవారు.

 1971 లో ఘంటసాలవారి తో కలసి విదేశాలు పర్యటించారు. ఆ తర్వాత క్రమక్రమంగా ఘంటసాలవారి కి అనారోగ్యం కారణంగా సంగీత దర్శకత్వం వహించే సినీమా ల సంఖ్య తగ్గిపోయింది. కానీ , ఘంటసాలవారి ని వదలిపెట్టి వేరే సంగీతదర్శకులను ఆశ్రయించడానికి మనస్కరించలేదు. ఘంటసాలవారి కోరిక మీద వచ్చిన తను చివరవరకూ ఆయనతోనే ఉండాలనే ఒకరకమైన కృతజ్ఞతాభావం , ఒకరిపట్ల ఒకరికి గల సోదరభావం , పరస్పర మైత్రీ భావంతో , ఆర్ధికంగా ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా మా నాన్నగారు మాత్రం ఘంటసాలవారికి మాత్రమే సహాయకుడిగా ఉండిపోయారు.

 1972 నుండి ఘంటసాలవారి అనుమతితో శ్రీ వెంపటి చిన సత్యంగారి కోరిక మీద వారి కూచిపూడి స్కూల్ లో పిల్లలకు సంగీతం చెప్పడానికి ప్రవేశించారు. అలాగే , సినీ నటి కాంచనకు గాత్రం , వీణ నేర్పించారు . అలాగే ఆత్రేయ గారి అమ్మాయికి నాలుగేళ్ళు సంగీతం నేర్పారు. 1974 తర్వాత , డా. వెంపటి చినసత్యంగారితో ఏర్పడిన మైత్రి కారణంగా మరో పాతిక సంవత్సరాలు కూచిపూడి ఆర్ట్ ఎకాడెమీ కి మా నాన్నగారు తన సేవలందించారు. 1983 వరకు అదే నెం.35 ఉస్మాన్ రోడ్ ఘంటసాలగారింటి చిన్న ఔట్ హౌస్ లో నే తన ఐదుగురు పిల్లలతో కాలం గడిపారు. తన భవిష్యత్ పట్ల ఆదినుండి ఎంతో అక్కర చూపిన ఘంటసాలగారంటే మానాన్నగారికి ఎంతో గౌరవం. కుచేలుడు , కృష్ణుడు వంటి భావం ఉండేదేమో తెలియదు. ఘంటసాలవారి తో కలసి పనిచేస్తున్నా తన పరిధులు దాటి తనెలాటి అతి చొరవ తీసుకోలేదు. తన పిల్లలూ అలాగే ఉండాలని కోరుకున్నారు.
ఆ విషయాలన్నీ .... వచ్చే వారమే... 

(సశేషం)

8 comments:

sumabala said...

చాలా బాగుంది.

P P Swarat said...

Thank you.

Patrayani Prasad said...

చాలా బాగుంది . సంతోషం

Muralidhar ayapilla said...

విషయాలన్నీ బాగా వ్రాస్తున్నారు.చాలా బాగుంది.

Padma said...

నాన్నగారి సంగీత ప్రయాణంలో 1954కి పూర్వం విశేషాలమీద నాకు స్పష్టత లేదు.ఈ వ్యాసం ఆలోటు తీర్చింది.పెద్దన్నయ్యా విషయాలన్నీ ఆసక్తి కరంగా చెప్తున్నావు.అభినందనలు

P P Swarat said...

ధన్యవాదాలు.

P P Swarat said...

Thank you very much.

P P Swarat said...

సాధించావు. బ్లాగ్ ను పట్టుకున్నావు.