visitors

Friday, July 3, 2020

నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 1 - ఆరవ భాగం


 
35, ఉస్మాన్ రోడ్.-  ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) -  ఆరవ భాగం
మొదటిభాగం  ఇక్కడ
రెండవ భాగం   ఇక్కడ
మూడవభాగం  ఇక్కడ
నాలుగవభాగం ఇక్కడ
ఐదవభాగం      ఇక్కడ
భాగం - 6. 

*నెం.35 ఉస్మాన్ రోడ్*

                🌳
                    ...స్వరాట్

విజయనగరంలో సంగీతశిక్షణ పూర్తి చేసుకొని స్వగ్రామమైన చౌటపల్లి చేరుకున్న ఘంటసాల జీవితంలో చోటుచేసుకున్న అనేక సంఘటనలు , విశేషాలు అన్నీ , అనేక పత్రికలలో , పుస్తకాల రూపంలో వెలువడ్డాయి . ఆ విషయాలన్నీ  ఆ తరం తెలుగువారందరికీ అవగతమే. అయినా ఈ తరంవారు  ఘంటసాల గురించి మరింత తెలుసుకునేందుకు , ఘంటసాల తన జీవితచరిత్రలో చెప్పుకున్న విశేషాలను సంక్షిప్తంగా , ఈ 6వ భాగంలో మీముందుంచే ప్రయత్నం చేస్తున్నాను.

కర్ణాటక సంగీత విద్యలో పట్టభద్రుడైన ఘంటసాల తన స్వగ్రామమైన చౌటపల్లి చేరుకున్నాడు. తన కుటుంబాన్ని పోషించుకునేందుకు ఆంధ్రదేశంలో అనేక చోట్ల శ్రీరామనవమి , గణపతి నవరాత్రులు , శారదా నవరాత్రులు , మొ.ఉత్సవ కార్యక్రమాలలో , పెళ్ళిళ్ళలో అనేక సంగీత కచేరీలు చేశాడు. అటువంటి సమయంలోనే ఆంధ్రదేశంలో సుప్రసిధ్ధ సంగీత విద్వాంసులు, వాగ్గేయకారులైన సర్వశ్రీ హరినాగభూషణంగారు , పారుపల్లి రామకృష్ణయ్య పంతులు గారు , వారణాసి బ్రహ్మయ్య శాస్త్రిగారు , క్రోవి సత్యనారాయణ గారు
మొదలైనవారి ఆశిస్సులు లభించాయి. 

అయితే  ఘంటసాలకు కేవలం సంగీత కచేరీలపైన వచ్చే ఆదాయంతోనే జీవించడం సాధ్యం కాదనిపించింది. 
ఆంధ్రదేశంలో సంగీత కచేరీలకన్నా నాటక ప్రదర్శనలు , హరికధా కాలక్షేపాలే ఆర్ధికంగా లాభదాయమనిపించింది. నాటక కళ మీద మొదటినుంచి అభిరుచి ఉండడంవలన తానే స్వయంగా ఒక నాటక సంస్థను స్థాపించి నాటక ప్రదర్శనలు ఇవ్వడం మొదలుపెట్టాడు. 
అలాటప్పుడే ప్రముఖ రంగస్థల నటులైన అద్దంకి ,పారుపల్లి , సూరిబాబు , రఘురామయ్య, పులిపాటి , పీసపాటి 
మొ.వారి పరిచయాలు ఏర్పడ్డాయి. తరువాతి కాలంలో వీరిలో కొందరితో కలసి స్టేజ్ మీద నటించే అవకాశమూ లభించింది. ఆ తరుణంలోనే ఒకసారి ఆంధ్రనాటక కళాపరిషత్ లో కూడా పాల్గొన్నా ఏవిధమైన గుర్తింపు లభించలేదు. 
(అయితే మరో పుష్కరం తరువాత అదే ఆంధ్రనాటక కళా పరిషత్ వారు ఘంటసాలను ఘనంగా సన్మానించడం జరిగింది. )

ఈ విధంగా ఉదరపోషణకోసం సంగీత కచేరీలతో , నాటకాలతో దుర్భరంగా బండిలాగిస్తున్న సమయంలో పులిమీద పుట్రలా మరో విపరీతం వచ్చిపడింది.

 రెండవ ప్రపంచ యుధ్ధ ప్రభావం మన దేశం మీద కూడా పడింది. బ్రిటిష్ వారి బానిసగా మన దేశం దాస్యం చేస్తోంది. బ్రిటిష్ ప్రభుత్వానికి ఎదురు తిరిగిన నాయకులందరిని జైళ్ళలో పెట్టారు. 1942 ఆగస్ట్ లో  జాతీయ కాంగ్రెస్ 'క్విట్ ఇండియా' తీర్మానం చేసింది. రాజకీయంగా దేశమంతటా ఉద్రేక పరిస్థితి నెలకొన్నది. విప్లవోద్యమం దేశవ్యాప్తంగా కార్చిచ్చులా చెలరేగింది.

రాజకీయాలగురించి గానీ , దేశ పరిస్థితి గురించి గానీ , ఉద్యమాల గురించి గానీ ఏమీ తెలియని ఘంటసాలలో ఒక అమాయక ఆవేశం ఉవ్వెత్తున తలయెత్తింది. స్కూల్ చదువు కూడా అంతంతమాత్రమే.
అతను తన పదవ ఏట , హరిజనోధ్ధరణ ప్రచారం కోసం జాతిపితగా పేరొందిన మహాత్మాగాంధీ తమ ప్రాంతాలకు వచ్చినప్పుడు చూసిన సంఘటన గుర్తుకు వచ్చింది. భారతదేశ  స్వాతంత్రోద్యమ సూత్రధారి కూడా అదే గాంధీయని తెలిసింది. దేశంకోసం , భారత పౌరుడిగా  తాను కూడా త్యాగం చేయవలసిన సమయం ఆసన్నమైయిందని సహ మిత్రులతో కలసి స్థానికంగా జరుగుతున్న ఉద్యమంలో పాల్గొని వీధులలో దేశభక్తి గీతాలు ఆలపించడం మొదలెట్టాడు. ఇది చూసిన తెల్ల దొరల ప్రభుత్వం అందరితోపాటు ఘంటసాలకు కారాగార శిక్ష విధించింది.


ఘంటసాలకు జైలు జీవితం ఎంతగానో సహకరించింది. 
నియమబధ్ధమైన జీవితం , కర్తవ్యం , స్థిర సంకల్పం మొదలైన విషయాల లో మంచి అవగాహన ఏర్పడింది. 
అందరితో కలివిడిగా మెలిగే నైజం ఉండడం వలన జైలులో వీరూ వారు అనక అందరికీ స్నేహపాత్రుడయ్యాడు. 
ఆనాటి ప్రముఖ రాజకీయ నాయకులైన సర్వశ్రీ - బెజవాడ గోపాలరెడ్డి , పొట్టి శ్రీరాములు , బి ఎస్ మూర్తి , ఎర్నేని సుబ్రహ్మణ్యం వంటి వారి సహచర్యం ఘంటసాలకు లభించింది. ఘంటసాల తన పాటలు , పద్యాలతో జైల్లోని అన్ని వర్గాలవారిని ఉత్సాహపరచి , ఉత్తేజితులను చేశాడు. 
అయితే , జైలునుండి విడుదల పొందిన తరువాత ఘంటసాలలో ఆ రాజకీయ ప్రభావం ఏదీ మిగలలేదు. మళ్ళా యధాప్రకారంగా నాటకాలతో , సంగీత కచేరీలతో రోజులు గడపసాగాడు.

అటువంటి సందర్భంలో ఘంటసాలకు పెదపులివర్రుకు చెందిన కొడమంచిలి వెంకట రత్న శాస్త్రి గారి రెండవకుమార్తె సావిత్రి తో వివాహం నిశ్చయమయింది.

ఆ పెళ్ళి విశేషాలు....
వచ్చేవారం....
                        సశేషం.

6 comments:

శ్రావణ్ said...

ఎంతో సంతోషంగా ఉంది చదివి. నీ శ్రమకు జోహార్లు.

ameerjan said...

Superintendent, Central Jail, Bellary వారిచ్చిన సర్టిఫికెట్ లో కూడ ఘంటసాల మాస్టారి చిరునామా...”నెం.35, ఉస్మాన్ రోడ్” చూసి చాల excite అయ్యానండీ!!🙏🙏🙏

P P Swarat said...

చాలా సంతోషం. ధన్యవాదాలు.

P P Swarat said...

మీ స్పందనకు అభివాదాలు.

S v మహేష్ బాబు said...

విజయనగరం లో విద్యాభ్యాసం తరువాత జీవితం లో స్థిరపడేందుకు ఘంటసాల గారు పడ్డ కష్టాలు కళ్ళకు కట్టినట్లు వర్ణించారు స్వరాట్ మాస్టారు గారూ....పూజ్యులు ఘంటసాల గారి గురించి ఎంతో అరుదైన సమాచారాన్ని ఎంతో శ్రమకోర్చి ఓపికగా మాకు అందిస్తున్న మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు మరియు శుభాభినందనలు స్వరాట్ మాస్టారు గారూ😊🙏🙏🙏🙏🙏😊👌👌👌👌👌😊

S v మహేష్ బాబు said...

విజయనగరం లో విద్యాభ్యాసం తరువాత జీవితం లో స్థిరపడేందుకు ఘంటసాల గారు పడ్డ కష్టాలు కళ్ళకు కట్టినట్లు వర్ణించారు స్వరాట్ మాస్టారు గారూ....పూజ్యులు ఘంటసాల గారి గురించి ఎంతో అరుదైన సమాచారాన్ని ఎంతో శ్రమకోర్చి ఓపికగా మాకు అందిస్తున్న మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు మరియు శుభాభినందనలు స్వరాట్ మాస్టారు గారూ😊🙏🙏🙏🙏🙏😊👌👌👌👌👌😊