visitors

Saturday, January 2, 2021

నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 2 - పదమూడవ భాగం

02.01.2021 -  శనివారం భాగం- 13*:
అధ్యాయం 2 భాగం 11 ఇక్కడ

  

నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్

1957వ సంవత్సరం ఘంటసాల మాస్టారికి అత్యంత విజయవంతమైన సంవత్సరం. సంగీత దర్శకుడిగానే కాక గాయకుడిగా కూడా మంచి పేరు ప్రఖ్యాతులు రావడానికి బాగా దోహదపడిన చిత్రం 'పాండురంగమహత్మ్యం' తన ఎన్ఎటి బ్యానర్ మీద ఎన్ టి రామారావు, ఎన్ త్రివిక్రమరావు సోదరులు నిర్మించిన భక్తిరస ప్రధాన చిత్రం. పరిణతి చెందిన నటనతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఎన్ టి రామారావు సంతృప్తిపర్చారు. 'పాండురంగమహత్మ్యం' ఘనవిజయం సాధించింది. ఈ చిత్రంలో సంగీతానిదే ప్రధాన భూమిక. ఎన్ఎటి ఆస్థాన సంగీత దర్శకుడు టి.వి.రాజు అద్భుతమైన సంగీతం అందించారు. ఈ సినీమా ఇంత ఘన విజయం సాధించడంలో ఘంటసాల మాస్టారి పాత్ర ఎంతైనావుంది. నవరసాలను తన గళం ద్వారా పలికించగల అద్వితీయ గాయకుడు ఆయన. ఎన్ టి రామారావు అద్భుత నటనకు దోహదపడినది మాస్టారి గానమే. ఈ సినీమాలో మాస్టారు పాడిన శృంగారగీతాలు, శోక గీతాలు, భక్తిగీతాలు, దండకం, మరాఠీ అభంగాలు, పద్యాలు అన్నీ అజరామరంగా నిల్చిపోయాయి. ముఖ్యంగా, 'హే కృష్ణా ముకుందా మురారే', 'శ్రీ కామినీ కామితాకార', 'అమ్మా అని అరచినా' 'హరహర హర శంభో' ఇలా ఒకటేమిటి, ఈ చిత్రంలోని అన్ని పాటలు పాటలు కేవలం ఘంటసాలవారి గానం వల్లనే చిరంజీవత్వం సంతరించుకున్నాయని చెప్పడం ఏమాత్రం అతిశయోక్తి కాదు. ఈ పాటలన్నీ గ్రామఫోన్ లో ఎన్నిసార్లు విన్నామో లెఖ్ఖేలేదు. 'పాండురంగమహత్మ్యం' ప్రివ్యూ చాలాసార్లే వేశారు. ఈ సినిమా వేసే ముందు టి.వి.రాజుగారి సహాయకుడు కమల్ దాస్ గారు ఒకసారి, ఎన్.టి.రామారావుగారి పెర్సనల్ డ్రైవర్ కృష్ణ ద్వారా, రామారావు గారి బావమరది పుండరీకాక్షయ్య గారి ద్వారా కబురు చేశారు. వాహినీ స్టూడియో లోనే ప్రివ్యూ వేసారు. వారి సంస్థల సినీమా ప్రివ్యూలన్నీ నందమూరి సోదరులు ఆధ్వర్యంలోనే జరిగేవి. వారిద్దరూ రామలక్ష్మణులులాగా ప్రివ్యూ ధియేటర్ ముందు నిల్చొని వచ్చే ఆహ్వానితులందరిని సాదరంగా ఆహ్వానించేవారు. అనుకున్న ముహుర్త సమయానికి సెకెండ్ల తేడా లేకుండా రామారావుగారి సంజ్ఞతో సినీమా ప్రారంభించేవారు. 

పాండురంగమహత్మ్యం సినిమా చూసినవారందరిదీ ఒకే అభిప్రాయం. ఘంటసాల మాస్టారి గానం, రామారావుగారి నటనే ఈ చిత్రానికి ఆయువుపట్టని. అలాగే, చిత్రం ఘనవిజయం సాధించి అందరికీ మహదానందాన్ని కలిగించింది. అయితే చంద్రుడిలో మచ్చలా చిన్న కొరత మిగిల్చింది. ఈ సినిమా ఘనవిజయానికి కారణమైన పాటలను పాడిన ఘంటసాలగారి పేరు సినీమా టైటిల్స్ లో కనపడదు. వారిది మాత్రమే కాదు. ఏ గాయకులది లేదు. నేపథ్యగాయకుల టైటిల్ కార్డ్ మిస్సింగ్. ఈ పొరపాటుకు రామారావుగారు ఘంటసాల మాస్టారికి క్షమాపణ చెప్పారని, మాస్టారు కూడా సహృదయతతో రామారావుగారిని సముదాయించారని విన్నాను.  కారణాల గురించి చర్చించడం వలన ఒరిగేది  ఏమీ లేదు. వేలు ఎవరి వేపు చూపాలో అర్ధంకాదు. అయినా "జగమెరిగిన బ్రాహ్మణునికి జంధ్యమేల?" 

పాండురంగమహత్మ్యం శతదినోత్సవం చాలా ఘనంగానే జరిగింది. ఘంటసాల మాస్టారికి ఒక పెద్ద ఆకర్షణీయమైన షీల్డ్ ను బహుకరించారు. ఓ ఆరంగుళాల  రజత పుండరీక విగ్రహం. విగ్రహం వెనుక రౌండ్ గా "మాతాపిత సేవే మాధవసేవ" అనే అక్షరాలతో అందంగా వున్న ఆ షీల్డ్ మాస్టారి గృహంలో మెయిన్ హాల్ లో ఉన్న అద్దాల బీరువాలో కొలువుతీరింది. ఎన్టీఆర్ పాండురంగమహత్మ్యం సినీమాకు స్ఫూర్తి 1944 లో వచ్చిన ఎమ్.కె.త్యాగరాజ భాగవతార్ నటించిన 'హరిదాస్' చిత్రం. నటగాయకుడిగా  భాగవతార్ అంటే తమిళనాడులో విపరీతమైన క్రేజ్ వుండేది. ఈ సినీమాలో కూడా 'కృష్ణా ముకుందా మురారి' పాట వుంది. ట్యూన్ వేరే. త్యాగరాజ భాగవతారే పాడారు. పాపనాశం శివన్ రచయిత, సంగీతదర్శకుడు. మరొక సహ సంగీత దర్శకుడు జి.రామనాధన్ . ఈ హరిదాస్ ఎంతటి హిట్ అంటే  ఒక్క బ్రాడ్వే ధియేటర్లోనే  ఏకబిగిన రెండున్నర సంవత్సరాలపాటు నిరాటంకంగా ఆడి గొప్ప రికార్డ్ నే స్థాపించింది. ఆ సినీమా పాటలకు, ఎన్టీఆర్ పాండురంగమహత్మ్యం సినీమా పాటలకు ఏవిధమైన పోలిక లేదు.


 త్యాగరాజ భాగవతార్ పాడిన కృష్ణా ముకుందా మురారీ
                        

 ఘంటసాల పాడిన కృష్ణా ముకుందా మురారీ
 
పాండురంగమహత్మ్యం సినీమా విడుదలైన కొద్ది రోజులకే 'నెం.35, ఉస్మాన్ రోడ్' లో మరో  వంశోద్ధారకుడు జన్మించాడు. ఘంటసాలగారికి ద్వితీయ పుత్రోదయం. 


ఏడాది వయసులో ఘంటసాల వెంకట రత్నకుమార్ 

ఘంటసాల మాస్టారు జన్మించిన నెలలోనే వారి ఇద్దరు పుత్ర రత్నాలు కూడా జన్మించడం ఒక విశేషం. పెద్దబాబు పుట్టిన ఆరేళ్ళకు చిన్నబాబు. మా తమ్ముడు గోపి (వేణుగోపాలకృష్ణ)కంటే తొమ్మిది మాసాలు చిన్న. చిన్న బాబుకు వెంకట రత్నకుమార్ అని నామకరణం చేశారు. సాధారణంగా మన కుటుంబాలలో పిల్లలకు పేర్లు పెట్టే విషయంలో అనేక తర్జనభర్జనలు, అలకలు, కోపతాపాలతో ఆ తతంగం జరగుతూంటుంది. చిన్న బాబు పేరు విషయంలో ఏవిధమైనటువంటి అభిప్రాయభేదాలకు తావేలేదు. ఎందుకంటే అందరూ సకుటుంబీకులే. అయ్యగారి తల్లి రత్తమ్మ గారు (వెంకట రత్నమ్మగారు.) అమ్మగారి తండ్రి వెంకట రత్నశాస్త్రిగారు. వీరిద్దరూ రెండు కుటుంబాలలో పరమ పూజనీయులు. పరస్పర ప్రేమాభిమానాలు కలవారు.

ఘంటసాల మాస్టారి ఇంట్లో కర్ర స్టాండ్ తో వుండే ఉయ్యాలవుండేది. అందులోనే చిన్న పరుపు, దిళ్ళువేసి మధ్యన చిన్న బాబును పడుక్కోపెట్టేవారు.

ఇలాటి స్టాండ్ ఉయ్యాలనే నేను 'పెళ్ళి చేసి చూడు' సినీమాలో చూశాను. ఆ సినీమాలో చూసిన మరికొన్ని కూడా మాస్టారింట్లో చూసినప్పుడు నాకు ఆశ్చర్యంగా అనిపించింది. మాస్టారింటి కిచెన్ చిమ్నీ, బాత్ రూమ్ ముందు వాటర్ బాయిలర్, బాత్ రూమ్  లోని షవర్ - ఇవన్నీ పెళ్ళిచేసి చూడు సినీమాలోనూ చూశాను. బహుశా ఆ రోజుల్లో అందరిళ్ళలోనూ ఇలాటివే ఉపయోగించేవారేమో.

1958 లో ఘంటసాల మాస్టారికి ఎనలేని కీర్తిని తెచ్చి పెట్టిన మ్యూజికల్ హిట్ సినీమా ఏ వి మెయ్యప్ప చెట్టిగారి (AVM స్టూడియో) 'భూకైలాస్'. సుదర్శనం, గోవర్ధనం సోదరులు సంగీతం నిర్వహించారు. ఘంటసాల మాస్టారు ఏవిఎమ్ స్టూడియో సినీమాలకు మొదటిసారిగా పాడినది 'భూకైలాస్' అనే నా ఉద్దేశ్యం. ఈ సినీమాలో ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు కలసినటించడం ఒక విశేషం. రావణాసురుని పాత్ర లో ఎన్టీఆర్ మొదటిసారిగా నటిస్తే, నారదుడిగా అక్కినేని తొలిసారిగా నటించారు. అక్కినేని నారదుడిగా నటించిన మరో చిత్రం 'కృష్ణమాయ' కూడా భూకైలాస్ తరువాత అదే సంవత్సరంలో వచ్చింది. ఆ సినిమాలో  కూడా మాస్టారిగానం వల్లనే చిత్రం రాణించింది.

భూకైలాస్ చిత్రంలో శివకేశవులిద్దరినీ స్తుతిస్తూ  "దేవ దేవ ధవళాచల మందిర గంగాధరా హర నమో నమో" అని రావణుడు, "నారాయణ హరి నమో నమో" అని నారదుడు ఒకే సీన్ లో పాడుకుంటూ రావడం ఆ సినీమాలో ఒక విశేషం. ఈ ఒకే పాటను ఇద్దరు నటులకు విభిన్నరీతులలో గానం చేసిన ఘంటసాలవారి కంఠ మాధుర్యం, గంభీరత్వం, భావ ప్రకటన అనన్యసామాన్యం. ఈ సినిమాలోని 'నీలకంధరా', 'రాముని అవతారం', 'తగునా వరమీయ', 'సుందరాంగా అందుకోరా' (పాట నేపథ్యంలో శివ పంచాక్షరీ జపం), పాటలు, పద్యాలు, ఘంటసాలవారి గాన మాధుర్యం వల్లనే రక్తికట్టాయి. ఈనాటికీ సంగీతాభిమానులు ఆ పాటలను పాడుకుంటున్నారు. 

భూకైలాస్ పాటలన్నీ కొలంబియా రికార్డులుగా వచ్చాయి. కొలంబియా రికార్డులను మౌంట్ రోడ్ లోని సరస్వతీ స్టోర్స్ వారు మార్కెటింగ్ చేసేవారు. ఆ సరస్వతీ స్టోర్స్ ఏవిఎమ్ వారిదే. 1958లో గాయకుడిగా మాస్టారి కీర్తి పతాకాన్ని ఎగురవేసిన చిత్రాలనేకం. అందులో "చెంచులక్ష్మి", "శ్రీరామభక్త హనుమాన్", "మంచి మనసుకు మంచి రోజులు", "పెళ్ళినాటి ప్రమాణాలు", "పార్వతీ కళ్యాణం" మొదలైన చిత్రాలు కొన్ని మాత్రమే. ఆఖరి మూడు చిత్రాల సంగీతదర్శకుడిగా ఆణి ముత్యాలవంటి పాటలను మాస్టారు స్వరపర్చారు.

"మంచి మనసుకు మంచి రోజులు" చిత్రంలోని "రావే నాచెలియా" అని కళ్యాణీ రాగంలో స్వరపర్చి గానం చేసిన విధానం ఏనాటికీ గాయకులకు పెను సవాలే. శ్రోతలకు వీనులవిందే. ఈ పాటను అప్పుడే చిత్రరంగంలోకి కొత్తగా ప్రవేశించిన రమణమూర్తి మీద చిత్రీకరించడం, ఆ నటుని భవిష్యత్ కు ఎంతగానో దోహదపడింది. 

అలాగే, ఘంటసాల మాస్టారు అద్భుతమైన సంగీతం అందించిన చిత్రం "పెళ్ళినాటి ప్రమాణాలు". ఇది జయంతి పిక్చర్స్ బేనర్ కింద కెవి రెడ్డిగారి సొంత చిత్రం. జానపద, పౌరాణిక చిత్రాలకే ప్రాముఖ్యత నిచ్చే కెవి రెడ్డిగారు 'పెద్ద మనుషులు" సినీమా తర్వాత దర్శకత్వం వహించిన సాంఘిక చిత్రం "పెళ్ళినాటి ప్రమాణాలే". ఈ సినీమాలో వినోదం వుంది, మంచి సందేశముంది. అన్నిటికీ మించి మనసులను రంజింపజేసే అతి శ్రావ్యమైన ఘంటసాల మాస్టారి సంగీతం వుంది. "శ్రీమంతురాలివై వెలుగొందుమాతా", "ఎదో తెలియక పిలిచితినోయి", "చల్లగ చూడాలి పూలను", "బృందావన చందమామ", "రావే ముద్దుల రాధా", "వెన్నెలలోనే వేడి ఏలనో" "లాలి మా పాపాయి ఆనందలాలి" వంటి పాటలు ఎన్నిసార్లు విన్నామో. అయినా తనివితీరదు. అలాగే , పార్వతీ కళ్యాణంలో పి. లీల పాడిన "జయ జయ సుందర నటరాజా" పాట ఎంత శ్రావ్యంగా వుంటుందో.

చూస్తూండగానే చిన్నబాబు (రత్నకుమార్) పుట్టి ఏడాది అయిపోయింది. అతని మొదటి సంవత్సరం పుట్టినరోజు పండగను ఘనంగానే జరిపారు. చాలామంది ప్రముఖులు వచ్చి చిన్నబాబును ఆశీర్వదించారు. మాస్టారికి సన్నిహితులైన వారందరికీ ఆహ్వానపత్రికలు పంపారు. ఆ ఆహ్వానం, పుట్టినరోజు జరుపుకుంటున్న బాలుడే చేస్తున్నట్లు ప్రింట్ చేయడం నాకు వింతగా తోచింది. ఆ ఇన్విటేషన్లో ఒక ప్రక్క రౌండ్ నెక్ బనీన్, చిన్న నిక్కర్ తో కూర్చొని ఉన్న భంగిమలో రత్నకుమార్ ఫోటో వేసారు. ఆ  బ్లాక్ & వైట్ ఫోటో చాలా బాగుండేది. ఎడిటర్ హరినారాయణ, సుబ్బు కలసి ఒక కమర్షియల్ కెమేరాతో తీశారు. అప్పట్లో కలర్ ఫోటోగ్రఫీ తక్కువ. మాస్టారింట్లో ఒక పాత ఆగ్ఫా డబ్బా కెమేరా వుండేది. మాస్టారింట్లో పెద్దబాబు తొలిరోజుల ఫోటోలన్నీ ఆ కెమేరాతోనే సుబ్బు, రామచంద్రరావు, పామర్తిగార్లు తీస్తూండేవారు. అప్పట్లో అదే ఒక కాలక్షేపంగా వుండేది.

అలాటి ఫోటోలలో నాకు బాగా ఆశ్చర్యం కలిగించిన, గుర్తుండిపోయిన ఫోటో ఒకటి వుండేది. అది పాప పిన్నిగారి ఫోటో. అందులో ఆవిడ ప్యాంట్,ఫుల్ హాండ్ షర్ట్ లతో తలమీద ఒక టోపీతో (మా వైపు సానిటరీ/రెవెన్యూ ఇన్స్పెక్టర్లు పెట్టుకునే టోపీలాటిది) ఉండేది. అప్పట్లో ఆడవాళ్లు మగడ్రెస్ లు వేసుకోవడం నాకు వింత. సంఘం సినీమాలో వైజయంతిమాలను మగడ్రెస్ లో చూసాను. పాప పిన్నిగారి ఫోటో చూసినప్పుడల్లా ఆ సినీమా గుర్తుకు వచ్చేది.  ఆ ఫోటో ఇప్పుడు ఎక్కడుందో. చిన్నబాబు ఎక్కువగా పిన్నిగారి సంరక్షణలోనే పెరిగాడు. ఇంట్లోని పిల్లలందరూ పిన్నిగారంటే చాలా ఇష్టంగా వుండేవారు. అందరికీ ఆవిడ దగ్గరే చేరిక ఎక్కువ.

ఆ రోజుల్లో టి.నగర్ షాపింగ్ హబ్ కాదు. అత్యవసర వస్తువులన్నీ పానగల్ పార్క్, రంగనాధన్ స్ట్రీట్  ప్రాంతాలలో దొరికినా ప్రత్యేకంగా ఖరీదైన నగలు, పెళ్ళిబట్టలు,హోల్ సేల్ లో కూరగాయలు, పువ్వులు, దీపావళీ క్రేకర్స్ మొదలైనవాటికోసం అందరూ చైనాబజార్ ప్రాంతాలకే వెళ్ళేవారు. దానితో చైనాబజార్ ప్రాంతంలో రాకపోకల అంతరాయం రానురానూ ఎక్కువైపోయింది. దానీతో మద్రాస్ కార్పరేషన్ తీవ్రచర్యలు చేపట్టడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఎక్స్ ప్రెస్ బస్ స్టాండ్, ఫ్లవర్ బజార్, కొత్వాల్ బజార్లోని కూరగాయల షాపులన్నీ కోయంబేడుకు, నగలు, బట్టల దుకాణాలన్నీ టి.నగర్ పానగల్ పార్క్ నుండి దాదాపు మౌంట్ రోడ్ వరకు తరలి వచ్చేయడంతో ట్రాఫిక్ ఎక్కువైపోయి స్థానిక ప్రజలు పడరానిపాట్లు పడుతున్నారు. ఎక్కడచూసినా వన్ వే ట్రాఫిక్. నో పార్కింగ్ ప్రోబ్లెమ్. కారులో మూడు నిముషాల్లో చేరుకోవలసిన చోటుకు మరో కిలోమీటర్ దూరం ప్రయాణం చేయవలసిన పరిస్థితి. ఆనాటి ప్రజలెవరూ ఎన్నడూ ఊహించని అభివృద్ధి. ఈ అభివృద్ధికి ఆనందించాలో, ఆందోళన చెందాలో తెలియని పరిస్థితి యీనాటివారిది. 

ఈ రకమైన మార్పులేవీ జరగని రోజుల్లో రోడ్లన్నీ విశాలంగా, ఖాళీగా, ప్రశాంతంగా ఉన్నరోజుల్లో సాయంత్రంపూట బజారుకు సావిత్రమ్మగారు వెళ్ళేవారు. ఆవిడతో కూడా పెద్దబాబు, నేనూ కూడా వెళ్ళేవాళ్ళం. మా ఇంటినుంచి దక్షిణం వేపు శారదా హైస్కూల్ దాటాక పానగల్ పార్క్ గోడను ఆనుకొని దగ్గరగా రెండు వందల మీటర్ల దూరం ప్లాట్ ఫాం మీద రెండు వరసలలో పెద్ద కూరగాయల బజార్ వుండేది. రకరకాల కూరగాయలు, పళ్ళు, పువ్వులు చాలా తాజాగా దొరికేవి. అక్కడి వస్తువులన్నీ చాలా ఖరీదు. మధ్యతరగతి వారు ఆ మార్కెట్లోకి అడుగుపెడితే ఆరిపోతారు. ఆ మార్కెట్ కు బాగా డబ్బున్న మార్వాడీలు, గుజరాతీలు, సినీమావాళ్ళు కార్లలో వచ్చి గంపలు గంపలుతో కూరగాయలు కొనుక్కువెళ్ళేవారు. అప్పట్లో వీధి చివర కూరగాయల షాపులు తక్కువే. ఆ పానగల్ పార్క్ కూరగాయల మార్కెట్ కు ఎదురుగా ఉస్మాన్ రోడ్ మీద కుమరన్ స్టోర్స్ బట్టల దుకాణం. చాలా చిన్నది. దాని పక్కనే యూనివర్శల్ బ్యాకరీ. దాని తర్వాత, N మాస్టర్ టైలర్స్ షాప్. ఆ పక్కనే టి.నగర్ నుంచి వెస్ట్ మాంబళానికి వెళ్ళే దారి, దొరస్వామిరోడ్. ఉస్మాన్ రోడ్ దొరస్వామి రోడ్ కలిసే మొగలో మొదట వేలన్ అంఢ్ కో, హార్డ్ వేర్ షాప్ ఆ తరవాత నాధన్స్ కేఫ్. పానగల్ పార్క్ కు దక్షిణాన నాగేశ్వరరావు (అక్కినేని కాదు, కాశీనాధుని) రోడ్. ఆ రోడ్ మీద ఆ రోజుల్లో చెప్పుకో దగ్గ పెద్ద షాపులు రెండే. ఒకటి తారాచంద్ గలాడా టిబి జ్యూవెలరీ షాపు. దాని పక్కన నల్లి చిన్నస్వామి  చెట్టి బట్టల దుకాణం, పక్కనే పార్క్ లాండ్స్ హోటల్. దానిని ఆనుకొని మెకర్నెట్ బ్యాకరీ చాలా ఫేమస్. ఆ ఆవరణలోనే బి వి కుబేంద్రరావు (కన్నడిగుడు) టైలర్ షాప్. ఘంటసాల మాస్టారి జుబ్బాలు, షర్ట్ లు అతనే కుట్టేవాడు. చాలా మంచివాడు. హుందాగా వుండేవాడు. 

ఒకసారి మేము ముగ్గురం ఆ టిబి జ్యూవెలరీ షాప్ సమీపంగా వెడుతూండగా ఆ షాప్ లో నుండి ఒక ఆడా మగా గట్టిగా నవ్వుకుంటూ బయటకు వచ్చారు. ఎవరో సినీమా వాళ్ళలా అనిపించారు. బాగా దగ్గరగా చూస్తే అప్పుడు గుర్తుకు వచ్చింది, వారిద్దరు సావిత్రి, జెమినీ గణేశన్ అని. వాళ్ళిద్దరు ఒక చిన్న తెల్ల ఫియట్ కార్ లో ఎక్కి వెళ్ళిపోయారు. నటి సావిత్రిని చూడడం అదే మొదటిసారి. మరొకసారి అదే షాపుకు వెళ్ళినప్పుడు లోపల మరొక నటి కనిపించి సావిత్రమ్మగారితో చాలా సేపు ముచ్చట్లాడారు. చాలా ఫెయిర్ గా, గోల్డ్ ఫ్రేమ్ కళ్ళజోడుతో ఉన్నారు. చూసిన వెంటనే గుర్తుపట్టలేకపోయాను. కానీ తర్వత తెలిసింది, ఆవిడే జూనియర్ శ్రీరంజని అని. గుణసుందరి, చంద్రహారం, పరాశక్తి, వంటి పాత చిత్రాలెన్నిటిలోనో నటించారు. 

పెద్దబాబు బజార్ కు వచ్చాడంటే ఆ రోజు యూనివర్శల్ బ్యాకరీకి వెళ్ళడం తప్పనిసరి. అతనికి చిన్నప్పుడు బన్, బట్టర్,జామ్ ఫేవరిట్ఐటమ్. యూనివర్శల్ స్టోర్లో బ్యాకరీ, ఐస్ క్రీమ్స్ తో పాటు స్టేషనరీ ఐటెమ్స్ కూడా అమ్మేవారు. ఆ షాప్ యజమానో, మేనేజరో నాకు తెలియదు. ఒక మలయాళీ నాయర్. నుదుట ఎప్పుడూ చందనం బొట్టు, వేష్టి, హాఫ్ షర్ట్ తో కనిపించేవాడు. అతనికి ఘంటసాలగారన్నా సావిత్రమ్మగారన్నా చాలా గౌరవం. ఎంతో వినయంగా దగ్గరుండి కావలసిన వస్తువులన్నీ తానే ప్యాక్ చేసి ఇచ్చేవాడు. అక్కడే మరో సేల్స్ మేన్ ఉండేవాడు. కుర్రవాడే. బొద్దుగా లావుగా వుండేవాడు. ఈ ఇద్దరూ నాకూ బాగా పరిచయమే. నాకు ఎందుకో చిన్నప్పుడు బ్రెడ్, బన్నులు నచ్చేవికావు. అవి జ్వరంవస్తే తినవలసిన పథ్యపు తిండని నా భావన. విజయనగరం లో ఉన్నప్పుడు ఇంట్లో ఎవరికి జ్వరం వచ్చినా ఈ బన్ను, బ్రెడ్ లు బలవంతాన తినిపించేవారు. యూనివర్శల్ స్టోర్స్ లో పెద్దబాబు బన్ బట్టర్ జామ్ అయ్యాక "అమ్మా! ఐస్క్రీమ్ అనేవాడు". అమ్మగారు మూడ్ బాగుంటే దొరికేది. లేకపోతే ఇంకోసారి వచ్చినప్పుడు కొనిస్తాననేవారు. పెద్దబాబు పెద్ద మొహం చిన్నబుచ్చుకుని కామ్ గా వెంట నడిచేవాడు. రిటర్న్ లో పానగల్ పార్క్ కూరల మార్కెట్లో వంకాయలు, పసుపు పచ్చ దోసకాయలు, సొరకాయల వంటివి కొన్ని కూరలు కొనేవారు. అప్పట్లో కూరలు కొంటే కొత్తిమీర కరివేపాకు ఫ్రీ. ఇటీవలి కాలం వరకు అలాగే ఇస్తూ వచ్చారు. నేను కూడా మా ఇంటికి ఒకటి రెండు కూరలు కొనేవాడిని. వస్తూ, వస్తూ దారిలో మా ఇంటి వరసలోనే వుండే టిప్ టాప్ ఫ్యాన్సీ షాపులో దూరేవాళ్ళం అక్కడ అమ్మగారు బొట్టు, కాటుక, గాజులవంటి వస్తువులు కొనుగోలు చేసేవారు. ఇవన్నీ ముగించుకొని నడుచుకుంటూ ఇంటికి వచ్చేసరికి బాగా చీకటిపడేది. అమ్మగారితో షాపింగ్ లకు వెళ్ళడం వలన త్వరలోనే నేను స్వతంత్రంగా బజారు సామాన్లు కొనుక్కురావడం అలవాటయింది. ఆ అనుభవంతో ఒకసారి, సాలూరులోని మా చిన్నాన్నగారి అమ్మాయి మంగమాంబ కోసం టిప్ టాప్ స్టోర్ లో ఒక  తెల్లటి పూసల హారం ఒకటి కొని తీసుకువెళ్ళి ఇస్తే ఆ పిల్ల చాలా మురిసిపోయింది. మా అన్నయ్య మెడ్రాస్ నుంచి కొని తెచ్చాడని అందరికి చూపించి ఆనందపడడం నాకు బాగా గుర్తు.

ఆనాటి మెడ్రాస్ వాతావరణానికీ, నేటి చెన్నై వాతావరణానికి మధ్య వచ్చిన మార్పులు అనూహ్యం. ఒక చెన్నై యే కాదు భారత దేశంలోని ప్రతీ మహానగరం, పట్టణం, ప్రతీ పల్లే కూడా పూర్తిగా మారిపోయాయి. అలాగే,మానవతా విలువలు కూడా మారిపోయాయి.

ఇంక భవిష్యత్ ఎలా వుంటుందో... నెం.35, ఉస్మాన్ రోడ్ లో...

మరిన్ని విషయాలు... వచ్చే వారం...
                      ...సశేషం

*With a view to make the narrative more authentic and to corroborate it, images, audio and video clips are attached at appropriate places. If such usage is found objectionable to the copyright holders the same shall be removed if and when notified.

1 comment:

Patrayani Prasad said...

👆🙏🙏అన్నయ్యకు నమస్కారములు,🙏🙏,

నెం.35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక ), అధ్యాయం -2 - పదమూడవ భాగం,
02 .01 2021 -
శనివారం భాగం :13*లో

వివరించిన అనుభవాలన్నీ, చాలా ఆసక్తికరంగా సాగాయి. ఎన్నో తెలియని విషయాలు, చక్కగా వివరంగా తెలియ జేసిన శ్రీ పట్రాయని ప్రణవ స్వరాట్ అన్నయ్యకు, ధన్యవాదాలు.

కధ చాలా
బాగా నడుస్తోంది. బాగుంది.
తరువాయి భాగంలో ఏముందా అనే కుతూహలం కలుగుతోంది .

వచ్చే సంచిక కోసం ఎదురుచూస్తూ ఉన్న

పట్రాయని ప్రసాద్, & కుటుంబం.
బెంగుళూరు, తేదీ:06-01-2021, బుధవారం
సమయం:
రాత్రి :గం 06:30ని IST.