visitors

Saturday, December 5, 2020

నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 2 - తొమ్మిదవ భాగం

05.12.20 - శుక్రవారం భాగం - 9*:
అధ్యాయం 2 భాగం 8 ఇక్కడ

  

నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్

1956 లో అశ్వరాజ్ ప్రొడక్షన్స్ వారు 'వినాయకచవితి' సినీమా నిర్మించబోతున్నారని, ఆ సినీమాకు ఘంటసాలవారే సంగీతం సమకూరుస్తారని తెలిసింది. నిర్మాత కె.గోపాలరావు. దర్శకత్వం సముద్రాల రాఘవాచార్యులవారు. కధ, మాటలు, పాటలు కూడా వారివే. ఎన్ టి రామారావు, జమున, కృష్ణకుమారి, గుమ్మడి, రాజనాల, ఆర్ నాగేశ్వరరావు,  మొదలగువారు నటిస్తారని తెలిసింది. ఈ సినీమా ప్రారంభోత్సవం అశ్వరాజ్ ప్రొడక్షన్స్ ఆఫీస్ లో జరపడానికి ముహుర్తం నిర్ణయించారు. ఆ ప్రారంభోత్సవానికి వెళ్ళడానికి సిధ్ధంగా వుండమని మా నాన్నగారికి కబురు అందింది. ఆ ఫంక్షన్ కు వెళ్ళడానికి అందరికంటే ముందు నేను సిధ్ధమైపోయాను. ఈ చిత్రంలో నటించేవారంతా వస్తారని నా ఉద్దేశం. 

ఆ కార్యక్రమం సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో. ఆ రోజు వినాయకచవితి పండగరోజు కూడానేమో. సరిగా గుర్తులేదు. కానీ, ఆ సమయంలో అప్పుడప్పుడు వానలు పడేవి. 

అశ్వరాజ్ ప్రొడక్షన్స్ ఆఫీస్ కోడంబాక్కం యునైటెడ్ ఇండియా కాలనీలో ఫాతీమా చర్చ్  కు సమీపంలో ఒక మేడ మీద వుండేది. ముహూర్తం సమయం లోపునే మాస్టారు, మా నాన్నగారు, వారితో పాటు పామర్తిగారు, నేను ఆ ఆఫీస్ కు చేరుకున్నాము. అక్కడ ఒక హాల్ లో ఒక గోడవారగా పెద్ద టేబిల్ మీద పెద్ద వినాయకుడి విగ్రహం పెట్టి పువ్వుల దండలతో అనేక రకాల పళ్ళతో సకల అలంకారాలు చేసారు. ఆ విగ్రహమే వినాయకచవితి సినీమా టైటిల్స్ లో కనిపిస్తుంది. నిలువెత్తు విగ్రహం. చాలా ఆకర్షణీయంగా కనిపించింది. ఈ ప్రారంభోత్సవ పూజను  (తాండ్ర) సుబ్బయ్యశాస్త్రి గారు నిర్వహించారు. ఆయనను సినీమా శాస్త్రులుగారు అనేవారు. కొత్త సినీమా ప్రారంభోత్సవాలు, సినీమాలలో పెళ్ళిళ్ళకు పౌరాహిత్యం, అలాగే సినీమా వారిళ్ళలో పెళ్ళిళ్ళు, పేరంటాలు, ఇతర శుభకార్యాలు అన్నీ ఆయన చేతులమీదుగా, మంత్రోచ్ఛాటనతోనే జరిగేవి. అన్నిరకాల కార్యక్రమాలు జరపడానికి కావలసిన మందీ మార్బలం ఆయనకు వుండేది. పాండీబజార్ చెరియన్ బ్రదర్స్ వెనకవేపు వారిల్లుండేది. ఘంటసాలవారింటి కార్యక్రమాలకు సుబ్బయ్యశాస్త్రి వచ్చేవారు. చాలా బిజీ పురోహితుడు. ఆ రోజుల్లోనే ఒక పురోహితుడు కారు, టెలిఫోన్ ఉపయోగించేవారంటే ఆయన కీర్తి ప్రతిష్టలు ఊహించుకోవచ్చును. (సుబ్బయ్య శాస్త్రిగారి వారసత్వాన్ని వారి ఇద్దరి కుమారులు ఆశ్వినిశాస్త్రి, రోహిణీశాస్త్రులు అందిపుచ్చుకొని తండ్రికి  తగ్గ తనయులుగా పేరుపొందారు. ఈ సోదరుల ఇల్లు మా ఔట్ హౌస్ గోడకు ఆనుకొని ఆనంద్ స్ట్రీట్ లో ఉండేది. నటుడు, నిర్మాత కృష్ణంరాజు, నిర్మాత ఏడిద నాగేశ్వరరావు, మాడా వెంకటేశ్వరరావుల తొలి రోజులు ఆ వీధిలోనే గడిచాయి.)

అశ్వరాజ్ ప్రొడక్షన్స్ వినాయకచవితి సినీమా ప్రారంభోత్సవానికి చాలామందే వచ్చారు. నటీనటులలో ఒక్క కృష్ణకుమారి తప్ప మిగిలినవారెవరిని చూసిన గుర్తులేదు. నిర్మాత కె. గోపాలరావు, డైరెక్టర్ సముద్రాల,  అసిస్టెంట్ డైరక్టర్ జి.ఎన్ స్వామి (ఆయనే ఆ సినిమాలో శివుడు కూడా), సంగీత దర్శకుడు ఘంటసాల, మరికొందరు సాంకేతిక నిపుణులు హాజరయ్యారు. సినీమా ప్రారంభోత్సవం రోజున వచ్చిన ముఖ్యులంతా దేవుడి ముందు కొబ్బరికాయ కొట్టడం ఆనవాయితి.  ఘంటసాలవారు, సముద్రాల గారు, కొబ్బరికాయలు కొట్టారు. మొదటి దెబ్బకే కొబ్బరికాయ సమానంగా రెండు ముక్కలుగా విరిగిందంటే ఆ సినీమా హిట్టవుతుందని సినీమా సెంటిమెంట్. ఈ విధమైన ఉత్సాహభరిత విషయాలు చెప్పడంలో సుబ్బయ్యశాస్త్రిగారు దిట్ట. అదే సమయంలో వానపడింది. అదీ శుభసూచకమే అని చెప్పారు. 

నేను చూడాలని ఆశించిన నటులు కనపడలేదనే కొరత మిగిలిపోయినా, అక్కడి వినాయకచవితి పండగ వాతావరణం నాకు చాలా సంతోషం కలిగించింది. కొన్నాళ్ళకు, వినాయకచవితి సినీమా పాటల రికార్డింగ్ జరిగింది. సినీమా షూటింగ్ మొదలయింది

వినాయకచవితి చిత్రం ప్రారంభంలో ఆలయంలో వినాయక చతుర్ధి కథను బోధించె సాధువు వేషంలో మోపర్రు దాసు కనిపిస్తారు. ఆయన ఘంటసాల మాస్టారి చిరకాల మిత్రుడు. అసలు పేరు బసవలింగాచారి. ఆంధ్రదేశంలో హరికథకుడిగా మంచిపేరు వుండేది. అప్పుడప్పుడు సినీమాలలో హరికథకుడుగా నటించేవారు. షావుకారు, రోజులు మారాయి (ఏరువాక సాగాలోయ్ లో ఒక డప్పులవాడు), విప్రనారాయణ, వినాయకచవితి మొదలైన పాత సినీమాలు చాలా వాటిలో హరికథలు,  చిన్న చిన్న వేషాలలో కనిపించేవారు. అలాటి సమయాలలో సినిమా షూటింగ్ లకు మద్రాస్ వస్తే మాస్టారింటి మేడ మీదే బస చేసేవారు. బయట షూటింగ్ లు చూసుకొని ఏ రాత్రికో ఇంటికి వచ్చేవారు. మర్నాటి ఉదయం మిత్రులు ఇద్దరూ చుట్టలు కాల్చుకుంటూ కారు షెడ్  దగ్గర  కబుర్లు చెప్పుకునేవారు. 

మోపర్రు దాసుగారు ఆజానుబాహువు, గిరజాల జుత్తు. పచ్చటి శరీరం. చాలా మంచి గాత్రం. ఆ వయసులో నాకు ఆయన దగ్గరకు వెళ్ళాలన్నా, మాట్లాడలన్నా భయం భయంగా వుండేది. ఉదయాన్నే లేచినప్పుడు చూస్తే ఆయన కళ్ళు చాలా ఎ‌ర్రగా ఉండేవి.  

వినాయక చవితి పాటల కంపోజింగ్ అప్పుడప్పుడు మాస్టారి ఇంట్లోనే జరిగేది. అలాటి సమయాలలో సముద్రాల రాఘవా చార్యులుగారితో పాటు  ఆ సినీమా అసోసియేట్ డైరెక్టర్ జి.ఎన్. స్వామి, నిర్మాత కె. గోపాలరావు సోదరుడు, ప్రొడక్షన్ మేనేజర్ కె. హనుమంతరావు కూడా  మాస్టారింటికి వచ్చేవారు.  


జి.ఎన్ స్వామి  గడచిన తరం నటుడు. కొన్ని సినీమాలలో హీరోగా కూడా నటించారు. ఆయన వచ్చినప్పుడల్లా పెద్దబాబును చూసి బాల వినాయకుడి వేషం మన బాబు చేత వేయిస్తే బాగుంటుంది. చాలా ముద్దుగా వున్నాడు, నేను డైలాగ్స్ నేర్పుతాను, మేకప్ టెస్ట్ చేద్దాం అంటూ హడావుడి చేసేవారు. పెద్దబాబు (విజయకుమార్)ను ఇంటి వెనకవేపు కారు షెడ్ దగ్గర నిలబెట్టి, ఇలా నడు, అలా పక్కకు తిరుగు, చెయ్యి ఇలాపెట్టు, ఈ కర్ర యిలా పట్టుకో అంటూ హంగామా చేసేవారు. పెద్దబాబు చేత అలా చేయిస్తూంటే నాకు చాలా ఉత్సాహంగా వుండేది.  ఇంకేముంది, మర్నాటి నుండే షూటింగ్ కు పిల్చుకుపోతారని, నిజంగానే ఆ వేషం పెద్దబాబే వేస్తాడనుకునేవాడిని. అయితే ఈ విషయంలో అయ్యగారు కానీ, అమ్మగారు కానీ పెద్ద ఆసక్తి చూపలేదు. 

వినాయకచవితి సినిమా పూర్తి అయి రీరికార్డింగ్ స్టేజ్ కు వచ్చింది. ఒక రోజు మాస్టారి కోసం సినీమా ప్రొజెక్షన్ వేసారు. అలాటప్పుడు  నిర్మాత, దర్శకుడు, సంగీతదర్శకుడు, వారి సహాయకులు మాత్రమే హాజరవుతారు. నాకు మొదటినుండి సినీమా షూటింగ్ లు చూడడం కన్నా పాటల రికార్డింగ్, రీరికార్డింగ్ చూడడంలోనే చాలా ఆసక్తిగావుండేది. ఆవిధంగా ఘంటసాల మాస్టారు సంగీత దర్శకత్వం వహించిన అనేక సినీమాల రికార్డింగ్ లకు, ప్రొజెక్షన్లకు, రీరికార్డింగ్ లకు వెళ్ళేవాడిని. రీరికార్డింగ్ కోసం ఒక రష్ ప్రింట్ ను తయారుచేస్తారు.  దానిని చూసి  ఏ ఏ సందర్భాలలో నేపథ్యసంగీతం అవసరమౌతుంది, ఒక్కొక్క సన్నివేశం ఎంతసేపు సాగుతున్నది, ఏ రకమైన వాద్యాల అవసరం వుంటుంది, రీరికార్డింగ్ కు ఎన్ని రోజులు తీసుకుంటుందనే విషయాలమీద సంగీత దర్శకుడు ఒక అవగాహనకు వస్తారు. దాని ప్రకారం నిర్మాత ధనం సేకరించుకొని స్టూడియో లో రికార్డింగ్ ధియేటర్ బుక్ చేసి ఆర్కెష్ట్రా వారికి టైమ్  తెలియజేస్తారు. 

రీరికార్డింగ్ జరిపేప్పుడు ముందు  సీన్ బై సీన్ స్క్రీన్ మీద ప్రొజెక్ట్ చేస్తారు. ఆ సమయంలో డైలాగ్స్ మీద ఆడియో వుండదు సైలంట్ గా వుంటుంది. ఆ సైలంట్ సీన్ ఎంతసేపు జరుగుతున్నదో  స్టాప్ వాచ్  చూస్తూ ఎన్ని నిముషాలు, ఎన్ని సెకెండ్ల  టైమ్ పడుతున్నదో నోట్ చేసుకుంటారు. తరువాత, మాస్టారు హార్మోనియం మీద సందర్భోచితంగా మ్యూజిక్ కంపోజ్ చేయడం మొదలెడతారు. (హర్మోనియం వాయించడంలో అంత  అనుభవం లేదు) ఈలోగా వచ్చిన ఆర్కెష్ట్రా ప్లేయర్స్ ధియేటర్ బయట కులసాగా పేకాటతో, కబుర్లతో  కాలక్షేపం చేస్తూంటారు. థియేటర్లో మాస్టారు హార్మోనియం వాయిస్తూ పాడుతూండగా మా నాన్నగారు నోటేషన్స్ వ్రాయడం జరుగుతుంది. ఆ నొటేషన్స్ ను మా నాన్నగారు హార్మోనియం మీద వాయిస్తూండగా స్టాప్ వాచ్ సాయంతో టైమ్ నోట్ చేసి చూస్తారు. అనుకున్న టైముకు మ్యూజిక్ సెట్ అవగానే ఆ బిట్ కు ఏ ఏ వాద్యాలు అవసరమౌతాయో, ఎవరెవరు ఏ బిట్స్ వాయించాలో నిర్ణయించి వారికి ఆ నొటేషన్స్ చెపుతారు. ఎప్పటికప్పుడు వెంటవెంటనే నొటేషన్ చూసి వాద్యాలను నిర్దిష్టంగా వాయించాలంటే ఎంతో ప్రతిభ, అనుభవం కావాలి. అలాటివారే సినీమారంగంలో రాణించగలుగుతారు. సంగీతంలో నిష్ణాతులైనా సినీమా సంగీతం టెక్నిక్ కు అలవాటు పడకపోతే వాద్యకారులుగా నిలదొక్కుకోలేరు. గుంపులో గోవిందాగా కాకుండా సోలో స్పెషలిస్ట్ ప్లేయర్స్ గా రూపొందడానికి చాలానే కష్టపడాలి. కృషి చేయాలి. అలాటి వాద్యగాళ్ళకు మంచి డిమాండ్, రాబడి వుంటుంది.  ఓ పదిమంది వైలినిస్ట్ లు ఛిన్ క్రింద వైలిన్ ను నిటారుగా పెట్టి మహాస్పీడ్ గా వాయిస్తూంటే చాలా థ్రిల్ గా వుండేది. కర్నాటిక్ కచేరీలలో లా వైలిన్ ను కాలిమీద ఆన్చిపెట్టుకొని వాయించే పధ్ధతి సినీమా ఆర్కెష్ట్రా లో కుదరదు. ఒక్క రిధిమ్స్ సెక్షన్ తప్ప మిగిలిన వారంతా కుర్చీల మీద కూర్చునే వాయించాలి. ఎదురుగా నొటేషన్ స్టాండ్స్, మైకులు విడివిడిగా ఏర్పరుస్తారు. ఆర్కెష్ట్రా నొటేషన్స్ వ్రాసుకున్నాక ఒకసారి ప్లే చేస్తారు. అవసరమైన మార్పులు చేర్పులు జరుగుతాయి. ఒకటికి రెండు సార్లు రిహార్సల్ చేసి పిక్చర్ ను చూస్తూ  ప్రొజెక్షన్ మీద ఆ మ్యూజిక్ ను ప్లే చేస్తారు. తృప్తికరంగా అనిపిస్తే ఒకటి రెండు రిహార్సల్స్ చూసి ఫైనల్ టేక్ కు వెళతారు. ఆ సీన్ కు సింక్ అయేలా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అమరుస్తారు. ఈ క్రమంలో ఒక్క సెకెండ్ తేడా వచ్చినా సన్నివేశంలో అనుకున్న ఎఫెక్ట్ రాదు. అలాగే, డైలాగ్స్ పోర్షన్స్ మీద రీరికార్డింగ్ మ్యూజిక్ వాల్యూమ్  ఎంత లెవెల్ వుండాలి, సైలెంట్ షాట్లమీద ఎంత వాల్యూమ్ వుండాలనే విషయం మీద సంగీతదర్శకుడికి పూర్తి అవగాహన వుండాలి. మంచి సంగీతం అమరిందని హై వాల్యూమ్ లో మిక్స్ చేస్తే మాటలు సరిగా వినపడక గోలగోలగా వుంటుంది. రీరికార్డింగ్ మ్యూజిక్ సన్నివేశానికి బలం చేకూర్చడానికి, రసోత్పత్తిని కలిగించడానికి మాత్రమే అని గాఢంగా విశ్వసించే సంగీత దర్శకుడు ఘంటసాల. తన సంగీత ప్రతిభను చాటుకోవడానికి సన్నివేశాన్ని ఏనాడూ ఖూనీచేయలేదు. అలాగే, ఘంటసాలవారి టైటిల్ మ్యూజిక్ కాంపొజిషన్ కూడా చాలా విశిష్టంగా వుండేది. ఘంటసాలగారి సంగీతంలో వచ్చిన అనేక చిత్రాలలో నేపథ్య సంగీతం ఒక ప్రత్యేకత కలిగివుండి ప్రేక్షకులకు వీనులవిందు చేసేవి. జానపదం సినీమాలలో కత్తియుద్ధాలైనా, సాంఘిక సినీమా ఫైట్లయినా ఘంటసాలవారి సంగీతం సరళంగానే సాగేది. వక్ర స్వరాల సమ్మేళనం చాలా అరుదుగా వినిపించేవి. కత్తియుద్ధాల మీద వినిపించే నేపథ్యంలో కూడా అంతర్లీనంగా ఒక శ్రావ్యమైన పాట వింటున్న అనుభూతి నాకు కలిగేది.

ఇలా మొత్తం సినీమా అంతా పూర్తికావడానికి కనీసం మూడు నాలుగురోజులైనా పడుతుంది. అందుకోసం డబల్ కాల్షీట్లు (9 to 9) పనిచేస్తారు. పాతరోజులలో ఒక్కోసారి నైట్ కాల్షీట్లు కూడా పనిచేయవలసి వచ్చేది. మ్యుజీషియన్స్ యూనియన్ ప్రాబల్యం ఎక్కువైనాక ఆదివారాల రోజున, రాత్రి 10 గంటల తరువాత రికార్డింగ్ లు, రీరికార్డింగ్ లు జరపడం మానేసారు. ఈ విషయంలో కూడా ఘంటసాల మాస్టారి చొరవ, కృషి ఎంతో వుంది. ఆ విషయాలు మరోసారి చూద్దాము.

వినాయకచవితి రీరికార్డింగ్ చూచేందుకు నేనూ వెళ్ళేవాడిని. ప్రసేనుడు(రాజనాల), శతధ్వనుడు( ఆర్ నాగేశ్వరరావు) సత్యభామ అంతఃపురంలోకి వచ్చిన కృష్ణుడిని (ఎన్.టి.రామారావు) బంధించడానికి పడే పాట్లమీద వచ్చే నేపధ్య సంగీతం, ప్రసేనుడు వేటకోసం గుర్రం మీద వెళ్ళేప్పుడు వినవచ్చే సంగీతం, కృష్ణుడు ప్రసేనుడిని వెతుకుతూ రథం మీద వెళ్ళేప్పుడు వినపడే సంగీతం; జాంబవంతుని గుహలో కృష్ణుడు , జాంబవంతుని గదాయుధ్ధం సీన్ లో వినపడే సంగీతం; ఇవి రీరికార్డింగ్ జరిపినప్పుడు దగ్గరుండి చూశాను. పౌరాణికం సినీమా కావడం వలన చాలా హుషారుగా, సరదాగా గడిచిపోయేది. ఒక్కోసారి లంచ్ కూడా స్టూడియో లోనే జరిగేది. కృష్ణుడు, జాంబవంతుని గదాయుద్ధంలో గదల చప్పుడు వినపడేదికాదు. యుధ్ధం మ్యూజిక్ మాత్రమే రికార్డ్ చేశారు.ఎందువలన అలాజరిగింది? ఎందుకు గదలు మ్రోగడం లేదు అని అనిపించేది. ఆ గదల చప్పుడు ఎఫెక్ట్స్ అన్నీ ట్రాక్ మిక్సింగ్ టైమ్ లో వేస్తారని తరువాత తెలిసింది.

వినాయక చవితి సినీమాలోని పాటలు పద్యాలు ఈనాటికీ అజరామరం. 'దినకరా శుభకరా', 'రాజా ప్రేమ చూపరా' (హిందోళం), 'కలికి నే కృష్ణుడినే', 'హరే నారాయణ', 'చిన్ని కృష్ణమ్మ చేసిన వింతలు', 'నలుగిడరే నలుగిడరే' ఈ పాటలన్నీ బహుళజనాదరణ పొందాయి.

'నలుగిడరె నలుగిడరే' అనే నలుగు పాటకు స్ఫూర్తి సావిత్రమ్మగారు వినిపించిన ఒక నలుగు పాట. ఈ తరహా స్త్రీల పాటలు గత తరంలో పల్లెటూళ్ళలో మహిళ నోట వినవచ్చేవి  అని మా నాన్నగారు (శ్రీ సంగీతరావు గారు) ఘంటసాల మాస్టారి సంగీత విశిష్టత గురించి తెలియజేసే వ్యాసాలలో రాయడం జరిగింది.

"దినకరా శుభకరా" పాట జగద్విఖ్యాతి పొందిన అద్భుత గీతం. కామవర్ధని (పంతువరాళి)/పూర్యాధనశ్రీ (హిందుస్థానీ) రాగంలో స్వరపర్చారు. వినాయకచవితి సినిమా తర్వాత ఘంటసాల మాస్టారు తమ కచేరీలన్ని 'దినకరా శుభకరా' పాటతోనే ప్రారంభించేవారు. గతంలో కూడా చెప్పాను, ఘంటసాలవారి సంగీత కచేరీ వినడం ఒక గొప్ప అనుభూతి. అక్కడ సినిమా పాటలు వింటున్నామని అనిపించదు. సశాస్త్రీయమైన సంగీతానుభూతి ఘంటసాలవారి కచేరీలలో కలిగేది. ఈ 'దినకరా' పాట ఒక్కటే దాదాపు పది పన్నెండు నిముషాల పాటు రాగాలాపనలతో, నెరవల్ తో ఆలపించి శ్రోతలను తన్మయులను చేసేవారు. 

ఈ పాటకు మొదట్లో సముద్రాల వారు ఒక అనుపల్లవి కూడా రాసారు. 'సకలభువన సుఖకారణ కిరణా మౌనిరాజ పరిపూజిత చరణా నీరజాత ముఖ శోభన కారణ...దినకరా" ఏ కారణం చేతనో ఈ అనుపల్లవి సినీమాలో పెట్టలేదు. అలాగే, గ్రామఫోన్ రికార్డ్ లో కూడా వుండదు. కానీ, ఘంటసాల మాస్టారి కచేరీలలో మాత్రం విధిగా పాడేవారు. ఘంటసాలవారి విదేశాలలో జరిగిన కచేరీలలో కూడా ఈ అనుపల్లవితో కూడిన 'దినకరా శుభకరా' పాట పాడడం జరిగింది
సినీమా పూర్తయింది. ఈ చిత్రంతో సంబంధమున్న వారందరి కుటుంబాలకోసం స్టూడియో లో ప్రివ్యూ వేసారు. సినీమా చాలా బాగుంది. శ్రీకృష్ణుడిగా ఎన్ టి రామారావు చాలా అందంగా కనిపించారు. చాలా మంచి నటన ప్రదర్శించారు, సినిమాకు ఘంటసాలవారి సంగీతం హైలైట్  అనే టాక్ సర్వత్రా వినిపించింది. ఈ వినాయకచవితి సినిమా విషయంలో ఒక విమర్శకూడా వచ్చింది. పౌరాణికం సినీమాలో టెలిగ్రాఫ్ స్థంభాలు , వై‌ర్లు ఔట్ డోర్లో చూపించారని, ద్వాపరయుగంలో టెలిఫోన్ స్థంభాలు , వైర్లు ఎక్కడినుండి వచ్చాయనే వ్యంగ్య వ్యాఖ్యలు పత్రికా సమీక్షలలో వచ్చాయి. అయినా, ప్రేక్షకులు ఆ విమర్శలగురించి పెద్దగా పట్టించుకోలేదు. 1957లో విజయవంతమైన సినీమాలలో 'వినాయకచవితి' చిత్రం కూడా ఒకటి.


వినాయకచవితి ప్రివ్యూ చూశాక, జి ఎన్ స్వామిగారు చెప్పినట్లుగా బాలగణపతి రూపంలో  పెద్దబాబు కనపడకపోవడం నాకు కొంత నిరాశ కలిగించింది.

నెం.35, ఉస్మాన్ రోడ్ పోర్టికో లో నుండి మెట్లెక్కి వరండాలోకి రాగానే కుడిచేతి వేపు ఒక గది వుండేది. అలాటి గదే పైన మేడమీద కూడా ఒకటి వుండేది. ఈ క్రింది గదికి వరండాలోనుండి ప్రవేశం, పక్కనున్న సందులోనుండి మేడమీదికి ఒక ద్వారం. అక్కడ కూడా గదిలోకి ద్వారం వుండేది. ఈ క్రింది మీది గదులు ఆఫీసు రూమ్ లు గాను ఎవరైనా గెస్ట్ లకోసం ఉపయోగించేవారు. పెద్దబాబు ట్యూషన్ క్రింది రూమ్ లో జరిగేది. ఆ ట్యూషన్ చెప్పే మాస్టారు ఒక ముసలాయన, అరవై ఏళ్ళు దాటివుంటాయి. పేరు రంగయ్య పంతులు అని గుర్తు. ఎప్పుడూ చేతిగొడుగుతో వచ్చేవారు. పెద్దబాబు ను ఆ మాస్టారి ఎదుట కూర్చోపెట్టడానికి అమ్మగారు, పిన్నిగారు చాలానే కష్టపడవలసి వచ్చేది. రంగయ్య పంతులుగారు చాలా ఓపికగా అల, వల, తల అని, ఎబిసిడి అంటూ ఇంగ్లీష్ అక్షరాలు ఒకటి నుండి వంద వరకు, రెండో ఎక్కం వంటివి పుస్తకం చూపి చదివించేవారు. ఆయన చదివి వినిపించినవాటిని అలాగే చదివేవాడు. మధ్యలో నుండి అక్షరం అడిగినా, అంకెలు అడిగినా సమాధానం వచ్చేదికాదు. అలాగే తలదించుకొని మారుమాట లేకుండా కూర్చొనేవాడు. పాపం! రంగయ్యగారు ఓపికగా మళ్ళీ పుస్తకం చూపి ఒక్కొక్క అక్షరం, అంకె చెపితే వాటిని రిపీట్ చేసేవాడు. ఇలా ఒక గంట అయాక ట్యూషన్ ముగిసేది. మరల మర్నాడు సాయంత్రం ఇదే పధ్ధతి. మధ్య మధ్య అమ్మగారో, మాస్టారో వచ్చి పెద్దబాబు ప్రోగ్రెస్ గురించి అడిగేవారు. ఆ పంతులుగారికి ఏం చెప్పాలో తెలిసేదికాదు. ఎలాగైనా అడిగిన ప్రశ్నలకు పెద్దబాబు చేత సమాధానం చెప్పించాలని నానా యాతనా పడేవారు. ఇంగ్లీషు అక్షరాలన్నీ వరసపెట్టి చదివించేవారు. వాటిలో నుండి ఏదైనా ఒక అక్షరం చూపి అదే అక్షరమో చెప్పమంటే నోరు మెదిపేవాడు కాదు. అందులోనూ నాన్నగారు, అమ్మగారి సమక్షంలో అయితే ఒక్కమాట పెగిలేదికాదు. ఆ మస్టారికి ఎలాగైన సమాధానం చెప్పించాలి. P అక్షరం చూపి ఇదేం అక్షరం అని అడిగి ఆయనే సైలంట్ గా పెదవులతో ప్రామ్టింగ్ చేసేవారు. బాబు పంతులుగారి పెదవులు చూసి టక్కున 'B' అనేవాడు. ఆయన 'P' అని సైలంట్ గా చెప్పేవారు. అయినా సరైన సమాధానం వచ్చేది కాదు. అలాగే అంకెలు. 'నాలుగు తర్వాత ఎంత? అని అడిగి ఐదువేళ్ళు చూపి ఎంత చెప్పు అనేవారు. ఇతను నోటితో చెప్పకుండా ఐదువేళ్ళు తిరిగి చూపేవాడు. ఈ విధంగా పెద్దబాబు ట్యూషన్ ప్రహసనం కొన్నాళ్ళు సాగింది. ఆ రంగయ్య పంతులుగారు ఎన్నాళ్ళు చదువు చెప్పారో గుర్తులేదు. 

అయితే కాలం ఎప్పుడూ ఒకేలా వుండదు. కొన్నాళ్ళపాటు స్కూలుకు వెళ్ళిరావడం అలవాటు అయాక స్కూల్ లో టీచర్లు చెప్పేవి వినగా వినగా అన్నీ ఒంటబడతాయి. పెద్దబాబు అంతే.

పెద్దబాబు ట్యూషన్ గుర్తు చేసుకున్నప్పుడల్లా నాకు మరో ట్యూషన్ గుర్తుకు వస్తుంది. అది నటి శ్రీదేవి తమ్ముడు సతీష్ (పిన్ని కొడుకు, నటి మహేశ్వరి తమ్ముడు)కు నేను చెప్పిన ట్యూషన్. ఆ విశేషాలు తెలియాలంటే మరో అధ్యాయం దాకా ఆగాలి. 

నెం.35, ఉస్మాన్ రోడ్ లో మరికొన్ని జ్ఞాపకాలు... వచ్చేవారం.....
             ...సశేషం

*With a view to make the narrative more authentic and to corroborate it, images, audio and video clips are attached at appropriate places. If such usage is found objectionable to the copyright holders the same shall be removed if and when notified.

6 comments:

ameerjan said...

💎మీ బ్లాగు లో నేటి ఎపిసోడ్ చాల బాగుంది స్వరాట్ మాస్టారూ! రికార్డింగ్ థియేటర్ కి మమ్మల్నీ మీతో పాటు తీసికెళ్ళి అన్నీ వివరంగా చూపినట్లు రాశారు! వినాయక చవితి పాటలు, మాస్టారి సంగీత పాటవం వల్ల ఈ చిత్ర విజయం గురించి వినివుండడం వల్ల ఈ ఎపిసోడ్ మరింత ఆసక్తి కరంగా సాగింది.

💎ఇక “దినకరా శుభకరా” గీతం ...మేము ఇంతకు ముందు వినని అనుపల్లవితో పాడి వినిపించిన ఆడియో ఇప్పుడు వినడం మాకు మరోసారి వీనుల విందే అయింది!

💎పనిలో పనిగా అన్నట్లు...విజయ్ బాబు ట్యూషన్ సంగతులు ఈ ఎపిసోడ్ కు కొసమెరుపులా మృదు హాస్యాన్ని చిలికించాయి.

💎ఇలాంటి మధుర జ్ఞాపకాలు మాతో పంచుకుంటున్మ మీకు మరోసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ వచ్చేవారం మీ బ్లాగు సందర్శనకై వేచివుంటాం!🙏🙏

P P Swarat said...

మీకు నా కృతజ్ఞతలు.

చుండి వేంకట రాజు said...

ఘంటసాల గారి గురించి చాలా వివరంగా తెలియజేస్తున్నారు ధన్యవాదాలండి

P P Swarat said...

చాలా సంతోషం. మీకు నా ధన్యవాదాలు.

హృషీకేష్ said...

వినాయక చవితి చిత్రం ప్రారంభం, రీ రికార్డింగ్, ప్రివ్యూ... అన్నీ చూపించారు మాకు. స్వరాట్ గారికి చాలా ధన్యవాదాలు. మరిన్ని మాష్టారి కబుర్లకోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము. అన్నీ వివరంగా తెలియపరుస్తున్నందుకు ధన్యవాదాలు. అభివాదములు🙏🙏 హృషీకేష్

Patrayani Prasad said...

👆🙏🙏పి పి స్వరాట్ అన్నయ్యకు నమస్కారములు,🙏🙏, జ్ఞాపకాల మాలిక , అధ్యాయం -2 - తొమ్మిదవ భాగంలో వివరించిన అనుభవాలన్నీ, చాలా ఆసక్తికరంగా సాగాయి. ఎన్నో తెలియని విషయాలు, చక్కగా వివరంగా తెలియ జేసిన శ్రీ పట్రాయని ప్రణవ స్వరాట్ అన్నయ్యకు, ధన్యవాదాలు.కధ చాలా
బాగా నడుస్తోంది. బాగుంది.-
పట్రాయని ప్రసాద్, బెంగుళూరు, తేదీ:09-12-2020, బుధవారం.
సమయం:
సాయంత్రం: గం 06:30ని IST.