visitors

Saturday, February 6, 2021

నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 2 - పద్ధెనిమిదవ భాగం

07.02.2021 - ఆదివారం భాగం - 18*:
అధ్యాయం 2  భాగం 17 ఇక్కడ


నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్

ఘంటసాలవారి 'భక్త రఘునాధ్' చిత్రంలో ఎన్.టి.రామారావు, గుమ్మడి, అంజలీదేవి కూడా నటించారు. అని చెప్పడం సమంజసం కాదు. మాస్టారి మీద వున్న గౌరవం, ప్రేమాభిమానాలతో, చిత్రం చివరలో ఎన్.టి.రామారావు శ్రీకృష్ణుడిగా, గుమ్మడి బలరాముడిగా, అంజలీదేవి (అనే గుర్తు) సుభద్రగా కొన్ని సెకెండ్లు గౌరవ నటుల హోదాలో తెరపై కనిపిస్తారు. వారికి ఏవైనా డైలాగులు వున్నాయా అంటే సందేహమే.

నెం.35, ఉస్మాన్ రోడ్ లో 'కృష్ణ ద్వయం' ఉండేది. ఒకరు 'మామయ్య' కృష్ణ. మరొకరు 'తమ్ముడు' కృష్ణ ఉరఫ్ 'గుండు మావయ్య'.

మావయ్య కృష్ణ సావిత్రమ్మగారికి మేనమామ.  వయసులో ఆవిడ కంటే చిన్నే. మాస్టారి ఇంట్లోనే వుంటూ  జివిఎస్ ప్రొడక్షన్ లో  పని చేసేవాడు. సుమారైన ఎత్తులో నొక్కుల జుత్తు మధ్యపాపిడి, ఫుల్ హాండ్స్ షర్ట్, వేస్టి (తెల్ల లుంగీ) ధరించేవాడు. మనిషి సౌమ్యంగానే వుండేవాడు. అయితే అతను మాట్లాడే తెలుగు నాకు అర్ధమయేది కాదు. ఇంట్లో పిల్లలందరినీ చేరదీసి ఆడించడం, సైకిల్ మీద బయటకు తీసుకువెళ్ళడం చేసేవాడు. ఆ క్రమంలో ఒకసారి మా పెద్ద చెల్లెలు రమణమ్మను సైకిల్ మీద వెనక క్యారియర్ మీద కూర్చోపెట్టుకొని స్కూలుకు (గ్రిఫిత్ రోడ్ రామకృష్ణా ఎలిమెంటరీ స్కూల్ బ్రాంచ్) తీసుకువెడుతూండగా, పొరపాటున మా రమణమ్మ కాలు వెనక చక్రం స్పోక్స్ లో ఇరుక్కుపోయి గొల్లుమంది. కృష్ణ మావయ్య కంగారుపడి క్రిందికి దింపి తనను ఇంటికి తీసుకు వచ్చేసాడు. మా చెల్లెలి కాలు బాగా వాచిపోయి నొప్పి చేసి రెండు మూడురోజులు అవస్థపడింది. కృష్ణ అజాగ్రత్తకకు  సావిత్రమ్మగారు బాగా చిరాకు పడ్డారు. 

ఒక సంవత్సరం, వేసవి శెలవులనే జ్ఞాపకం, మావయ్య కృష్ణ అన్నగారు, అమ్మగారు వచ్చి మాస్టారింట్లోనే కొన్నాళ్ళున్నారు. అప్పుడు సావిత్రమ్మగారి తల్లి కూడా అక్కడే ఉన్న గుర్తు. ఇల్లంతా చాలా హడావుడి గా ఉండేది. వాళ్ళంతా చాలా గాఠిగా మాట్లాడుకునేవారు. వారి సంభాషణలలో సావిత్రమ్మగారు పాలు పంచుకునేవారు. అయితే వచ్చిన అతిథుల భాష మాత్రం తెలుగు కాదు. అరవంలాగా వినపడలేదు. నాకు తెలియని భాష. తర్వాత తెలిసింది వారు మాట్లాడేది మలయాళం అని. క్రమక్రమంగా వారి సంబంధ బాంధవ్యాలు అర్ధమయ్యాయి. మావయ్య కృష్ణ అక్కగారు సావిత్రమ్మగారి తల్లి. కృష్ణ మావయ్య తల్లి సావిత్రమ్మగారి అమ్మమ్మగారు. సావిత్రమ్మగారి పెద మేనమామ కృష్ణ అన్నగారు. తమ్ముడిది నొక్కుల జుట్టయితే అన్నగారిది పూర్తి బట్టతల. నిరంతర తాంబూల సేవనప్రియుడు. మా పిల్లలందరితో సరదగా మాట్లాడేవారు. నాకు సరిక్రొత్త చిక్కు వచ్చిపడింది. ఘంటసాల  అయ్యగారు తెలుగువారు, అమ్మగారు తెలుగు వారు, వారి అమ్మగారూ తెలుగువారే. కానీ మావయ్యలు, అమ్మమ్మగారు మాత్రం మలయాళం. అదెలా సాధ్యం. ఒకటే సందేహం. ఎవరినైనా అడిగితే చెప్పేవారేమో. కానీ, ఏ విషయంలోనూ నోరు తెరచి ధైర్యంగా మాట్లాడలేక పోవడమనేది మొదటినుంచి నాకున్న పెద్ద బలహీనత. ఈ చిక్కు ప్రశ్నకు సమాధానం తర్వాత ఎప్పుడో తెలిసింది. సావిత్రమ్మగారి తాతగారు, ఆంధ్రదేశంలో తనకు నచ్చిన, తగిన పెళ్ళికూతురు దొరకకపోతే చివరకు మలబార్ (కేరళ) లోని పాల్ఘాట్ వరకు వెళ్ళి ఒక బ్రాహ్మణులింటి వధువు నచ్చి వివాహం చేసుకొని ఆంధ్రాకు తీసుకువచ్చేసారట. బాల్యవివాహమే. ఆ విధంగా  అమ్మమ్మగారికి తప్ప మిగిలిన  ఎవరికీ మలయాళం తెలియదు. ఎప్పుడైనా అమ్మమ్మ తరఫు బంధువులు కలుసుకున్నప్పుడు మలయాళంలో  మాట్లాడుకునేవారు. అమ్మగారి అమ్మమ్మగారు, పెద మావయ్య అక్కడ ఉన్న సమయంలోనే ఒకసారి పి.లీల, ఆవిడ తండ్రి మీనన్  మాస్టారింటికి వచ్చారు కారులో. వాళ్ళది ఆస్టిన్ ఇంగ్లాండ్ కారు. నల్లగా, నిగనిగలాడుతూ ఎప్పుడు చూసినా సరికొత్తగా చాలా క్యూట్ గా వుండేదా కారు. లీల గారు ఆ కారును చాలా ఏళ్ళు ఉపయోగించారు. ఆవిడదీ పాల్ఘాట్ (ఇప్పుడు పాలక్కాడ్) ప్రాంతమే కావడంతో ఇల్లంతా మలయాళంతో ప్రతిధ్వనించేది. ఘంటసాల మాస్టారు వీరందరి సంభాషణలను సరదాగా నవ్వుతూ వినేవారు. ఒకరిపట్ల ఒకరు ప్రేమాభిమానాలతో ఆప్యాయంగా వుండేవారు.

అదీ సంగతి! అందుకే నాకు మావయ్య కృష్ణ తెలుగు అర్ధమయ్యేది కాదు. మావయ్య కృష్ణకు చాలా లేటుగా వివాహం జరిగింది. జివిఎస్ ప్రొడక్షన్స్ సినీమాలు తీయొద్దని నిర్ణయించుకన్నాక మావయ్య కృష్ణ భరణీ స్టూడియో లో చేరారు. అలాగే ఎడిటర్ హరినారాయణ కూడా భానుమతీగారికి సహాయకుడిగా భరణీ స్టూడియోకు వెళ్ళిపోయారు. ఆ తర్వాతే  కృష్ణ నెం.35, ఉస్మాన్ రోడ్ ను విడచి వేరే చోట కాపురం పెట్టారు. ఆ తర్వాత నాకు మావయ్య కృష్ణ గురించి గానీ , ఆయన కుటుంబం గురించి గానీ ఏ అవగాహన లేదు. ఆయనను సావిత్రమ్మగారింట్లోనూ చూసిన గుర్తు లేదు. ఎడిటర్ హరినారాయణ కూడా ఒక ఐదేళ్ళక్రితం కాలంచేసినట్లు అతని దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన మా వీడియో ఎడిటర్ గోవిందరాజన్ తెలిపాడు.

పుష్పక విమానంలాంటి ఘంటసాల మాస్టారి లోగిలి ఎప్పుడూ బంధుమిత్రులతో కలకలలాడుతూండేది.

అదీ కృష్ణద్వయంలోని మరో కృష్ణ. 'తమ్ముడు' కృష్ణ. మొత్తం పిల్లలందరికీ 'గుండు మామయ్య'. (ఒకసారి తిరుపతికెళ్ళి గుండుతో వచ్చినప్పుడు రతన్ గుండుమాఁవయ్యా అని పిలవడంతో పిల్లలందరికి, పిల్లల పిల్లలకి కూడా "గుండుమాఁవయ్య"గా స్థిరపడిపోయాడు కృష్ణ).


మనవరాలితో (రత్తన్ కూతురు) గుండు మాఁవయ్య

సావిత్రమ్మగారి కన్నా వయసులో పెద్ద. ఆవిడను, పాప పిన్నిగారిని "అక్కయ్యా"  అని నోరారా పిలిచేవాడు. ఆ ఇద్దరూ కూడా వయసులో పెద్దైనా అతనిని తమ్ముడిలా ఆదరించారు. అసలు ఎవరీ తమ్ముడు కృష్ణ? ఎక్కడనుండి వచ్చాడు? ఆయనది బందరు. మొదట్లో ఘంటసాలవారి బంధువుల ఇంట్లో పనిచేసేవాడట. అప్పుడు మాస్టారింట్లో నమ్మకస్తుడైన మంచి పనివాడికోసం ప్రయత్నిస్తున్నారని తెలిసి ఇతనిని మాస్టారింటికి తీసుకువచ్చారు. అతనికి సినీమాలలో చేరిపోవాలనే ఆశ వుండేదట. అయితే ఓనామాలు కూడా తెలియవు. ఏ స్కూలు గడప తొక్కలేదు. ఘంటసాల మాస్టారి హోమ్ డిపార్ట్మెంట్ లో హెల్పర్ గా అమ్మగారికి (సావిత్రమ్మగారు), పాప పిన్నిగారికీ  సహాయ పడుతూండేవాడు. 

కొమరవోలు వెంకట కృష్ణారావు, ఉరఫ్ తమ్ముడు కృష్ణ అను గుండుమామయ్య త్వరలోనే ఘంటసాల కుటుంబ సభ్యుడయ్యాడు. ఘంటసాల మాస్టారికి సుగర్ కంప్లైంట్, బిపి వుండడంవలన తరుచు అరికాళ్ళమంటలతో బాధపడేవారు. రికార్డింగ్ ల సమయంలో గంటలతరబడి నిలబడివలసి వచ్చేది. అలాటిరోజుల్లో కాళ్ళమంటలు మరింత ఎక్కువగా ఉండేవి. అలాటప్పుడు ఈ కృష్ణే మాస్టారి అరికాళ్ళకు కర్పూరం కలపిన మంచినూనెతో మర్దనా చేసేవాడు. ఆయనా ఉపశమనం పొందేవారు. ఆ సమయంలో కృష్ణ ఏవేవో కబుర్లు చెప్పేవాడు. మాస్టారు శ్రధ్ధగా వినేవారు. అది చూడడం వినడం నాకు ఒక కాలక్షేపం. 

అలాగే, కచేరీలకు ఘంటసాల మాస్టారు బయట ఊళ్ళకు వెళ్ళేప్పుడు ఆయనకి 'ADC - Aide de Camp' గా వెంటవెళ్ళేవాడు. ట్రైన్ లోను, ఆయా ఊళ్ళలోనూ టైమ్ ప్రకారం మాస్టారికి మాత్రలు తీసి యివ్వడం, భోజనం వడ్డించడం వంటి పనులన్నీ దగ్గరుండి చేసేవాడు. ఇవన్నీ ఒక యజమానికి నౌకర్ చేస్తున్నట్లు కాక, భక్తితో ప్రేమానురాగాలతో సేవ చేసేవాడు. చాలా నమ్మకస్తుడు. నిజాయితీపరుడు. చాలా సౌమ్యుడు. అందరితోనూ సఖ్యంగా వుండేవాడు. అతనికి అక్కన్నా, అమ్మన్నా, తండ్రి అన్నా, అంతా అమ్మగారు, అయ్యగారు మాత్రమే. తన జీవితాన్ని ఆ కుటుంబానికే అంకితం అన్నట్లుండేవాడు. 

కృష్ణ మా అమ్మగారిని కూడా అక్కయ్యగారూ అని పిలిచేవాడు. అతనికీ మా అమ్మగారిలాగే ఒక్క అరవముక్కా వచ్చేదికాదు. ఎవరితోనైనా తెలుగులోనే మాట్లాడేవాడు. అందుకే ఇంట్లోని అరవ పనివాళ్ళకు, పక్కిళ్ళవారికి తెలుగు వచ్చేసింది. 


(కుడి నుండి ఎడమకు) మా అమ్మగారు, రాజేశ్వరమ్మగార్లతో కొమరవోలు కృష్ణారావుగారు
అదే మా గుండుమాఁవయ్య

మలేషియా, సింగపూర్, శ్రీలంక వంటి దేశాలలో ప్రసిధ్ధిపొందిన గోపాల్  పళ్ళపొడినే వాడమని రేడియో సిలోన్ వాడు అస్తమానూ ఊదరగొడుతున్నా మేము మాత్రం మా ఇంట్లో నంజన్ గూడు ఎర్ర పళ్ళపొడినే వాడేవాళ్ళం. పేపర్ ప్యాకెట్ లో వచ్చేది. అన్ని షాపుల్లోనూ సులభంగా దొరికేది. టూత్ బ్రష్ లకు, కాల్గెట్ టూత్ పౌడర్లకీ, టూత్ పేస్ట్ లకీ ఎప్పుడు మారామో తెలియదు కానీ, ప్రామిస్, క్లోజప్, పెప్సోడెంట్ అంటూ  చాలా రకాల పేస్ట్ లనే నా తళతళ మెరిసే పళ్ళకు ఉపయోగించాను. ఇప్పుడు ఒక పదేళ్ళుగా సెన్సోడైన్ టూత్ పేస్ట్ కు పరిమితమయ్యాను. మా ఇంటిల్లిపాదీ టూత్ పౌడర్ నే వాడినా మా అమ్మమ్మగారికి మాత్రం పలుతోము పుల్లలే కావలసి వచ్చేవి. మా ఇంటి వెనకాల నూతి దగ్గర ఒక వేపచెట్టు వుండేది. కృష్ణ ఆ  వేపచెట్టు ఎక్కి కొమ్మలు విరిచి ఆ పుల్లలను, వేప గింజలను సేకరించి మా అమ్మమ్మగారికి ఇచ్చేవాడు. ఈ విషయంలో నేను అతనికి సాయం చేసేవాడిని.  ఆ సమయంలో అతను చెప్పినదానికి విరుధ్ధంగా ఏదో పనిచేసి అతనికి చిరాకు తెప్పించడం నాకు ఒక ఆనందం. మా ఇద్దరికీ నూతి గట్టు మీద నీళ్ళకోసం గొడవ వచ్చేది.  అయితే బయటవాళ్ళకు తెలిసేది కాదు. ఉదయాన్నే పళ్ళుతోముకునేప్పుడు అతను పెట్టుకున్న నీళ్ళను నేను కావాలనే వాడేసేవాడిని. తన నీళ్ళే ఎందుకు వాడడం  వేరే తెచ్చుకోవచ్చు కదా అనేవాడు. నేనేదో అనేవాడిని. అతనేదో అనేవాడు. సరే నేనే నూతిలోంచి నీళ్ళు తోడిస్తానని చేద( బకెట్) నూతిలో వేయబోతే అడ్డుకునేవాడు. నూతిగట్టంత ఎత్తైనా లేనివాడివి నువ్వేం నీళ్ళు తోడుతావు, ఏం అక్కరలేదని తానే తోడుకునేవాడు. అంత ప్రేమగా వుండేవాడు. నాకు కొంచెం జ్ఞానం వచ్చాక ఇలాటి చిలిపి చేష్టలకు స్వస్తి చెప్పాను. 

రీరికార్డింగ్ ల సమయంలో మాస్టారికి, మా నాన్నగారికి మధ్యాహ్నం ఇళ్ళకు వచ్చే అవకాశం ఉండేది కాదు. మేమిద్దరం కలసి  12బి బస్సులో వడపళనిలో వుండే స్టూడియోలకు మధ్యాహ్నం భోజనం క్యారియర్ లు పట్టుకు వెళ్ళేవాళ్ళం (నా స్కూల్ శెలవు దినాలలో). మాస్టారి భోజనం అయి మాత్రలు వేసుకున్నాక కృష్ణ తిరిగి ఇంటికి వెళ్ళిపోయేవాడు. నేను మాత్రం రీరికార్డింగ్ చూస్తూ రాత్రి మా నాన్నగారితోనో లేక ఘంటసాల మాస్టారితోనో ఇంటికి చేరేవాడిని.

మరి, కృష్ణ సినీమా సరదా ఎలా తీరింది? 

కృష్ణ చాలా సాదాసీదాగా వుండేవాడు. ఇంట్లో వుంటే నిక్కర్, పైన ఒక మల్లు బనీన్ తోనే గడిపేవాడు.ఆ నిక్కర్ టైట్ గా వుండడానికి ఏదో వెండి తావీదు వున్న ఎర్ర  మొలతాడుతో బిగించి కట్టేవాడు.  బజారుకో, స్టూడియోలకో వెళ్ళేప్పుడు మాత్రమే చొక్కా వేసుకునేవాడు.

కృష్ణకు ఎలా అబ్బిందో కానీ యోగాసనాలు వేసే విద్య అబ్బింది. ఆసనాలు బాగా వేసేవాడు. చాలా క్లిష్టమైన ఆసనాలన్నీ సునాయాసంగా వేయగలిగేవాడు. ఈ విషయాలు గ్రహించిన ఘంటసాల మాస్టారు భక్త రఘునాధ్ లో కృష్ణకు అవకాశం కల్పించారు. కధానాయకుడు కాంతారావు దేశద్రిమ్మరిలా తిరుగుతూ ఒక యోగి ఆశ్రమానికి చేరుకుంటాడు. ఆ యోగి చిత్తూరు నాగయ్యగారు. ఆయనకు అనేకమంది శిష్యులు. అందులో యోగాసనాలు వేసే ఒక శిష్యుడిగా మన  కొమరవోలు కృష్ణారావు కనిపిస్తాడు. కొన్ని క్లోజప్ లలో కూడా కనిపించాడు. ఈ సినీమానాటికి అతనిని తెరమీద చూసి గుర్తుపట్టి ఆనందించగలిగేది మాస్టారి పెద్దబ్బాయి విజయకుమార్, నేనూ మాత్రమే. మిగతా పిల్లలెవరికీ గుండు మావయ్య సత్తా తెలియదు.

నిజానికి కృష్ణకు ఏ విధంగానూ సినీమాలకు పనికివచ్చే ముడిసరుకు లేదు. ఆ విషయం ఘంటసాల మాస్టారికి బాగానే తెలుసు.

తర్వాత, మరో సందర్భంలో (రికార్డింగో లేక కచేరీయో) పి.లీల పక్కన తంబురా శృతి వేసే అవకాశాన్ని మాస్టారు కృష్ణకు కల్పించారట. అతని జన్మ ధన్యమైపోయింది. తను పి.లీలకు వాయించాడు. అప్పటినుండీ అందరితోనూ లీలకు వాయించానని చెప్పుకుంటూ తెగ మురిసిపోయేవాడు.

సాంస్కృతికాలయంలాటి నెం.35, ఉస్మాన్ రోడ్ కు ఎంతోమంది వచ్చారు కొందరు కొన్నాళ్ళున్నారు.  కొందరు కొన్నేళ్ళున్నారు. వారి వారి కార్యక్రమాలు పూర్తి చేసుకొని వెళ్ళిపోయారు. ఘంటసాల మాస్టారు అయితే చిన్న వయసులోనే పిల్లలు యింకా ఎదగకుండానే అర్ధాంతరంగా ఈ లోకాన్నే వదలిపెట్టి వెళ్ళిపోయారు. 

కాలం కలసిరాక ఘంటసాలవారి కుటుంబం తమ ప్రాణప్రదమైన నెం.35 ఉస్మాన్ రోడ్ నే వదులుకోవలసి వచ్చింది. అటువంటి క్లిష్ట సమయాలలో కూడా కృష్ణ అమ్మగారినే అంటిపెట్టుకున్నాడు. ఆవిడ ఉన్నచోటే  సేవ చేస్తూ అతనూ కాలం గడిపాడు. 


మా నాన్నగారు, సావిత్రమ్మగార్లతో గుండు మామాయ్య

కృష్ణకు పెళ్ళి, సొంత సంసారం ఏదీ లేదు. ఉపనయనం అయింది. బ్రహ్మచారిగానే బ్రతికాడు. ఘంటసాల మాస్టారి జీవితంలోని అన్ని దశలు కృష్ణకు బాగా తెలుసు. ఘంటసాలవారి అందరి పిల్లలను తన చేతులతో ఎత్తుకు ఆడించాడు. ఆ పిల్లల చదువులు, పెళ్ళిళ్ళు, పేరంటాలు అన్నీచూశాడు. వాళ్ళకూ తనకు చేతనైన  సేవచేశాడు. తన సొంత బిడ్డల్లా సాకాడు. వాళ్ళంతా పెరిగి పెద్దకావడం , పెళ్ళిళ్ళు చేసుకోవడం అన్నీ చూశాడు. వాళ్ళకు సంతానం కలిగి వారంతా పెరిగి పెద్దై పెళ్ళిళ్ళు చేసుకోవడం కూడా కళ్ళారా చూసి సంతోషించాడు. 

కొన్నేళ్ళ క్రితం వరకూ ఘంటసాలవారి రెండవకుమారుడు రత్నకుమార్ ఇంటనే సావిత్రమ్మగారితో వుంటూ తన వయసుకు తగిన పనులు చేస్తూవుండేవాడు. రత్నకుమార్ పార్థసారధి పురంలో ఇల్లుకొన్నాడు. అదే వీధిలో ఒక చివర నటి ఆమని ఇల్లుండేది. వీళ్ళిద్దరి ఇంటి నెంబర్లూ ఒక్కటే. పాత, కొత్త  నెంబర్లని తప్ప. ఈ తేడా తెలియనివారు రతన్ కోసం ఆమని ఇంటికి, ఆమనిని చూడాలని వచ్చేవారు రతన్ ఇంటికీ వచ్చేవారు. నేను మొదటిసారి రతన్ ఇంటికి  వెళ్ళినప్పుడు ఆమని ఇంటి తలుపే తట్టాను. అక్కడెవరో మళ్ళీ గైడ్ చేసి వెనక్కి పంపారు. రతన్ ఇంటికి వెళ్ళినప్పుడల్లా తమ్ముడు కృష్ణ కనిపించి ఆప్యాయంగా పలకరించి మావాళ్ళందరి గురించి అడిగేవాడు. మనిషిలో వృధ్ధాప్యం బాగా వచ్చేసింది. తరచూ ఏదో అనారోగ్యం చోటుచేసుకునేది.

తమ్ముడు కృష్ణ 2016 ఫిబ్రవరి తొమ్మిదిన కాలం చేశాడు. ఆ సంవత్సరం ఆ దినాన ఘంటసాల మాస్టారి ఆబ్దికం. తొలిరోజు రాత్రి కూడా కృష్ణ ఆ విషయం చెపుతూ అయ్యగారి గురించే తలచుకున్నాడట. ఘంటసాల మాస్టారి తిధిరోజునే, ఆయన్నే నమ్ముకు బ్రతికిన కృష్ణ ఈ లోకాన్ని వదిలిపెట్టడం ఆశ్చర్యమనిపిస్తుంది. అటువంటి తమ్ముడు కృష్ణ, మా గుండు మావయ్య తన 90 ఏట (వయసు నిర్ధారణగా తెలియదు) రత్నకుమార్ ఇంటనే తన తుదిశ్వాస విడిచాడు.  రత్నకుమారే జరిపించవలసిన కర్మకాండ జరిపించాడు.

కృష్ణకు తనవాళ్ళనేవారు ఎవరైనా ఉండేవారా? ఇతనెప్పుడైనా తన సొంతవూరు వెళ్ళాడా? వాళ్ళెప్పుడైనా ఇతనిని చూడ్డానికి వచ్చేవారా? నాకు తెలిసినంతవరకూ లేదు. అతని సర్వస్వము ఘంటసాలవారి కుటుంబమే. ఈ కలియుగంలో ఇటువంటి వ్యక్తులుంటారా అని అనుకునే వాళ్ళకి ఈ కృష్ణే సాక్ష్యం. అందుకు ఘంటసాలవారి/వారి కుటుంబ  ఔదార్యమే సాక్ష్యం.  ఇలాటి వ్యక్తులను మరచిపోగలమా ?

1959లో మొదలయి 1960 లో విడుదలైన అనేక సినీమాలు ఘంటసాల మాస్టారికి ఎనలేని కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టాయి. అందులో ముఖ్యమైన సినీమాలు (శ్రీ చల్లా సుబ్బారాయుడిగారి "ఘంటసాల గాన చరిత" ఆధారంగా) చూద్దాము.

నమ్మినబంటు, శ్రీ వేంకటేశ్వర మహత్మ్యం, శాంతినివాసం, శ్రీకృష్ణరాయబారం (సినీమా అంతా పద్యాలే), రాజమకుటం, మహాకవి కాళిదాసు, రాణి రత్నప్రభ, భక్త శబరి, దేవాంతకుడు (పద్యాలు మాత్రం), విమల, అభిమానం, దీపావళి, భట్టి విక్రమార్క, భక్త రఘునాధ్, కుంకుమరేఖ, కనకదుర్గ పూజామహిమ, చివరకు మిగిలేది. ఆ సంవత్సరంలో విడుదలైన అనేక చిత్రాలలో ఇవి కొన్ని మాత్రమే. ఈ చిత్రాలలోని పాటలన్నీ సూపర్ హిట్స్ గా నమోదు అయాయి. 

ఘంటసాల మాస్టారికి విపరీత జనాదరణ పెరగడానికి కారణమైన మరో ముఖ్య చిత్రం ఎన్.టి.రామారావు, సావిత్రి, ఎస్.వరలక్ష్మి నటించిన అత్యద్భుత పౌరాణిక చిత్రం శ్రీ వేంకటేశ్వర మహత్మ్యం'. ఈ చిత్రంలో ఘంటసాల మాస్టారు పాట పాడుతూ తెరపై కనిపించి అశేష తెలుగు ప్రజానీకంలో ఒక సంచలనం సృష్టించారు. 

ఆ వివరాలు...  వచ్చే వారమే...           
...సశేషం

5 comments:

చుండి వేంకట రాజు said...

ధన్యవాదాలండి

Mahesh babu sambaturi venkata said...

నెంబర్ 35, ఉస్మాన్ రోడ్ లోని 'కృష్ణ' ద్వయం గురించి.... చిన్న నాటి మీ చిలిపి చేష్టల గురించి చాలా చాలా చక్కగా కళ్ళకు కట్టినట్లు వర్ణించారు స్వరాట్ బాబాయ్ గారూ.....

తమ్ముడు కృష్ణ @ గుండు మామయ్య గారి లాగా అంకితభావం తో కుటుంబానికి సేవకులు గా ఉంటూనే కుటుంబం నుండి విడదీసి చూడలేని వారుగా పరిగణింపబడే వ్యక్తులు చాలా చాలా అరుదుగా కనిపిస్తారు... అంతటి మహోన్నతమైన వ్యక్తి కీ.... అంతే చక్కగా ఆదరించిన ఘంటసాల మాస్టారు గారి కుటుంబ సభ్యులకు అందరికీ 🙏🙏🙏🙏

ఇంత చక్కని సమాచారం వారం వారం మాతో ఓపికగా పంచుకుంటున్న మీకు మా హార్ధిక ధన్యవాదపూర్వక నమస్సులు స్వరాట్ బాబాయ్ గారూ 😊🙏🙏😊👍👍😊💐💐

హృషీకేష్ said...

వివరణాత్మక సమాచారం మరియు మంచి అనుభూతులను పంచుతున్న మీకు అభివాదం, కృతజ్ఞతలు.🙏🙏

Patrayani Prasad said...

🕉🙏🙏శ్రీ పట్రాయని ప్రణవ స్వరాట్ అన్నయ్యకు నమస్కారములు🙏🙏, ఈ సంచికలో, మద్రాసులో, శ్రీ ఘంటసాల వారి ఇంట్లో నీ పరిచయాలు, వారితో నీ చిన్నప్పటి విషయాల వివరాలు తెలుసుకుంటూ ఉంటే ఎంతో ఆనందమనిపించినా, చివరకు " తమ్ముడు కృష్ణ గారి చివరిరోజుల పరిస్థితి చాలా ఆర్ద్రత కలిగించింది. ఆయన ఆత్మ శివైక్యం చెంది శాంతి పొందిందని తలుస్తాను🙏🙏- పట్రాయని ప్రసాద్ , బెంగుళూరు, తేదీ:08-02-2021, సోమవారం, సమయం: సాయంత్రం గంటలు04:00 నిమిషములు.

P P Swarat said...

ధన్యవాదాలు.