visitors

Sunday, March 7, 2021

నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 2 - ఇరవైయొకటవ భాగం

07.03.2021 -  ఆదివారం భాగం - 21:
అధ్యాయం 2 భాగం 20 ఇక్కడ

  

నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్
శౌరిరాజన్, శ్రీనివాసన్. ఈ రెండు పేర్లు విష్ణుమూర్తికే చెందుతాయి. శౌరిరాజన్ డాక్టర్. శ్రీనివాసన్ సివిల్ ఇంజనీర్.

ఘంటసాలవారింట్లో ఎవరికి ఏ అస్వస్థత కలిగినా డాక్టర్ శౌరిరాజన్ ఇంటికి వచ్చి చూసేవారు. మంచి హస్తవాసిగల డాక్టర్ అని పేరు. అందరితో చాలా సౌమ్యంగా కలివిడిగా మాట్లాడేవారు. సాధారణమైన ఎత్తుచాలా సన్నగా వుండేవారు. ఆయన క్లినిక్ సౌత్ ఉస్మాన్ రోడ్ లో రంగనాధన్ స్ట్రీట్ సమీపంలో శ్రీదేవీ హోటల్ పక్కన ఒక మేడమీద వుండేది. క్లినిక్ ఎప్పుడూ కిటకిటలాడుతూవుండేది.

మొదట్లో మేమూ శౌరిరాజన్ దగ్గరకే వెళ్ళేవాళ్ళం. శౌరిరాజన్ చాలా పేద కుటుంబం నుండి రావడం వలన పేదవారికి ఉచితంగా వైద్యం చేసేవారు. మొదట్లో CITనగర్ ప్రాంతంలో గాయకుడు పి.బి.శ్రీనివాస్ ఇంటి పరిసరప్రాంతాలలో ఒక చిన్న ఇంటిలో తల్లి, తమ్ముడుతో నివసించేవారు.

1950లలో శ్రీరామ్ అని ఒక తమిళ నటుడు వుండేవారు. చాలా తమిళం, కొన్ని తెలుగు సినీమాలలో హీరోగా, విలన్ గా నటించినవారు. 


శ్రీరాం సంసారం (తమిళం) చిత్రంలో

శ్రీరాం, వైజయంతీమాల - మర్మవీరన్ చిత్రంలో


ఆయనింట్లో శౌరిరాజన్ తల్లి వంటలక్కగా పనిచేసేవారట. తండ్రిలేని ఈ కుటుంబ దీనస్థితికి జాలిపడి శ్రీరామ్ శౌరిరాజన్ మెడిసిన్ చదవడానికి ఇతోధికంగా ఆర్ధిక సహాయం చేశారట. శౌరిరాజన్ డాక్టరయి కొంత నిలదొక్కుకున్నాక తమ్ముడిని చదివించి ఇంజనీర్ ను చేశారు. హస్తవాసి గల డాక్టర్ గా మంచి పేరు తెచ్చుకున్న శౌరిరాజన్ రాజకీయాలలో ప్రవేశించి కాంగ్రెస్ తరఫున ముందు కౌన్సిలర్ గా, తర్వాత MLAగా ఎన్నికయ్యారు. అప్పుడే ఆయన వివాహం జరిగింది. ఆయన భార్య పేరు రుక్మిణి. జంటకు తగిన పేర్లు అమరినాయి. అంతేకాదు రుక్మిణిగారు గైనికాలజస్ట్.  సమాజంలో అంతస్తు పెరిగింది. ఉస్మాన్ రోడ్ లోని ఆ చిన్న క్లినిక్, టి.నగర్ లోనే దండపాణీ స్ట్రీట్ లో ప్రముఖ నటి కన్నాంబ ఇంటి సమీపానికి మారింది. పెద్ద మెటర్నిటి హాస్పిటల్ వెలసింది. ఘంటసాల మాస్టారి ఆడపిల్లల్లో ఒకరు రుక్మిణీ శౌరిరాజన్ హాస్పిటల్ లోనే పుట్టినట్లుసావిత్రమ్మగారు డిస్ఛార్జ్ అయి ఇంటికి వచ్చిన రోజున నేనూ వున్న గుర్తు. మెటర్నిటి పక్కనే డా. శౌరిరాజన్ రూమ్ కూడా వుండేది. పేషంట్లతో పాటూ వచ్చిపోయే రాజకీయ నాయకుల హడావుడి కూడా ఎక్కువగానే వుండేది. అందువలన ఇళ్ళకు వెళ్ళి పేషంట్లను చూడడం తగ్గించేశారు. కానీ డాక్టర్ గారి తల్లి సావిత్రమ్మగారిని చూసేందుకు వస్తునే ఉండేవారు.

డా.శౌరిరాజన్ తమ్ముడు ఎమ్.కె.శ్రీనివాసన్ ఇంజనీర్ అయ్యాక స్వంతంగా వృద్ధిచెందేరు. ఆయన ఆఫీస్ మా ఎదురు వీధి వ్యాసారావ్ స్ట్రీట్ లో వుండేది. 70లలో 'పరక్కుం పడై' అన్న పేరుతో వినియోగదారుల పరిరక్షణ కోసం ఒక సంస్థని నడిపేవారు. తరవాత కొంత కాలానికి వారమ్మాయి IPSకి ఎంపిక కావాడం, అనంతరం ప్రధాని రక్షణ వ్యవస్థలో ఒక ఉన్నత స్థానాన్ని పొందడం చరిత్ర.

డా.శౌరిరాజన్ వద్దకు వెళ్ళడం తగ్గింది. (ఆయన 2013లో 84 ఏళ్ళ వయసులో కీర్తిశేషులయేరు). డా. జయంతి రామారావు, డా.గోవింద మీనన్ (ఛైల్డ్ స్పెషలిస్ట్), డా.చిట్టూరి సత్యనారాయణ (ఇ.ఎన్.టి స్పెషలిస్ట్), డా. బ్రహ్మానందం, (ఈయన క్లినిక్ 34, ఉస్మాన్ రోడ్ బోర్డ్ మీద మాత్రం Dr.Bhirmananadam, Cardiologist  అని ఉండేది) ఇత్యాది డాక్టర్లతో పరిచయాలు ఏర్పడి ఘంటసాల మాస్టారికి, వారింట్లోవారికి ట్రీట్ చేయడం జరిగింది. వీరందరికీ ఘంటసాల మాస్టారి గానమంటే మహా ప్రీతి.

వీరిలో డా. జయంతి రామారావు ఘంటసాల మాస్టారి కుటుంబానికి అతి సన్నిహితుడిగా మెలిగారు. ఘంటసాల మాస్టారు దివంగతులైన తర్వాత కూడా జయంతి గారి కుటుంబంతో మంచి స్నేహ సంబంధాలు కొనసాగాయి. ఇంట్లోవారికి ఏ అనారోగ్యం వచ్చినా డా.జయంతి రామారావుగారిని సంప్రదించేవారు. పూనమల్లీ హైరోడ్ లోని ఒక పెద్ద అపార్ట్ మెంట్లో వున్నప్పుడు రెండు మూడుసార్లు వెళ్ళాను.  చాలా కాలం తర్వాత అంబత్తూర్ తెలుగు సాంస్కృతిక సంఘంవారి ఉత్సవాలకు డా. జయంతిగారిని ముఖ్య అతిధిగా ఆహ్వానించారు. ఆ కార్యక్రమానికి ఘంటసాల మాస్టారి తమ్ముడు సదాశివుడుగారు, నేనూ కూడా డాక్టర్ గారితో  వెళ్ళడం జరిగింది.

ఘంటసాల మాస్టారు, డా. జయంతి రామారావుగారి మైత్రీ చాలా పాతదే. సదాశివుడిగారికి ఏదో అస్వస్థత కలిగినప్పుడు మింట్ లో ఉన్న స్టాన్లీ మెడికల్ హాస్పిటల్ లో అడ్మిట్ చేశారు. అప్పుడే డా.జయంతి రామారావుగారితో ప్రథమంగా పరిచయం. ఘంటసాలవారి పాటంటే విపరీతంగా అభిమానించే జయంతిగారు సదాశివుడు గారి చికిత్స విషయంలో చాలా శ్రధ్ధ వహించారు.

డా. జయంతి రామారావు ప్రముఖ నెఫ్రాలజిస్ట్. మాస్టారి ప్రోద్బలంతోనే విజయా హాస్పిటల్ లో కన్సల్టెంట్ గా చేరారని విన్నాను. ఆయనను అపోలోలో కూడా చాలాసార్లు చూశాను. భార్యాభర్తలు ఇద్దరూ చాలా మంచివారు. మంచి స్నేహశీలురు. ఘంటసాల మాస్టారు విజయా హాస్పిటల్ లో వున్నప్పుడు డా.జయంతిగారి సేవలు, సహాయం మరువలేనివి.

డా. శౌరిరాజన్ మా అందుబాటులో వుండరని తెలిసాక మా నాన్నగారు పాండీబజార్ పార్థసారధిపురంలోని తణికాచల రోడ్, రాజాచార్ స్ట్రీట్, అగస్త్యర్ గుడి ప్రాంతంలోని  ఎస్.వి.టి.చారీగారి క్లినిక్ కు తీసుకువెళ్ళేవారు. చారీగారి క్లినిక్ మాకు మరీ దూరమైపోవడంతో మరో డాక్టర్ ను చూసుకోవలసిన పరిస్థితి లో ఉస్మాన్ రోడ్ లోనే మా ఇంటికి సమీపంలో ఉస్మాన్ రోడ్ గోవిందన్ స్ట్రీట్ మూలమీద ఉండే ఒక ఇంటి గదీలో క్లినిక్ నడిపే డా.రాఘవన్ అనే ఆయన మా పాలిట ఆపద్బాంధవుడయేరు. కొంచెం వయసు మీరినవాడే. RMPడాక్టరే అయినా చాలా అనుభవజ్ఞుడు. ఎంతో మంచివాడు. ఆ రోజుల్లో ఆయన ఫీజు రెండు రూపాయలో, మూడు రూపాయలో ఉండేది. ఇచ్చేవారి దగ్గర పుచ్చుకునేవారు. పేదలైతే ఉచితంగా చూసేవారు. ఇంజక్షన్లు, మందులు పేషంట్లే కొనుక్కోవాలి. సంగీతం మీద అభిరుచి వుండేదనుకుంటాను, రాఘవన్ డాక్టర్ మా నాన్నగారంటే మంచి అభిమానం చూపేవారు.

డాక్టర్ల ప్రసక్తి వచ్చింది కనుక ఘంటసాలవారి కుటుంబానికి తెలిసిన మరో డాక్టర్ గారి ముచ్చటతో నేటి వైద్య ప్రహసనం ముగిద్దాము. ఈ డాక్టర్ గారి దగ్గరకు వెళ్ళేముందు 'నెం.35, ఉస్మాన్ రోడ్'లోని మరో యిద్దరు వ్యక్తుల గురించి చెప్పక తప్పదు. ఒకరు తాయి. మరొకరు ఆవిడ కొడుకు పయ్యా. (అంటే కుర్రోడు అని చెప్పుకోవచ్చు). పేరు వడివేలు.  తాయి మా లోగిలి పనిమనిషి. తాయి అంటే తల్లి. నిజంగా పిల్లలందరినీ అమ్మలాగే విపరీతమైన అభిమానం చూపేది. తాయి పనిమనిషే అయినా ఏకవచన ప్రయోగం చేయడానికి నాకు మనస్కరించదు. మా ఔట్ హౌస్ పక్కనే ఒక చిన్న గుడిసెలో తల్లీకొడుకులుండేవారు.

మేము ఆ ఇంటికి వెళ్ళేనాటికే తాయికి నలభైఐదేళ్ళు దాటివుంటాయి.వీళ్ళు ఎక్కడివారో, ఎప్పుడు  వచ్చారో నాకు తెలియదు. చాలా నమ్మకస్తురాలు. మొత్తం ఇంటిపని తానే చేసేది. కొడుకు మతిస్థిమితం లేనివాడు. చిన్నవయసులో బాగానే వుండేవాడట. పెద్దగా చదువు సంధ్యలు లేవు. అలాటివాడికి పెళ్ళయింది. వచ్చిన భార్యకు వీడంటే ఇష్టంలేదు. వచ్చిన కొన్నాళ్ళకో, కొన్నేళ్ళకో ఆ పిల్ల నూతిలో దూకడమో, లేక, వేరెవరితోనో వెళ్ళిపోవడమో జరిగింది. ఆ తర్వాతే పయ్యాకు (వడివేలు) మతి తప్పింది. అయితే ఎవరినీ ఏ ఇబ్బంది పెట్టేవాడు కాదు. పొద్దస్తమానం ఆ గుడిసెలోనే స్థబ్దుగా కూర్చోడంతల్లిపెట్టింది తినడం, నిద్రవస్తే పడుక్కోవడం. అప్పుడప్పుడు నాలుగురోడ్లు తిరిగి వచ్చేవాడు. మూడ్ బాగుంటే తల్లితోపాటూ వెత్తలె, పాక్, సీవల్, పుగాకు కాడలు నములుతూ తల్లి పనిపాటల్లో సాయపడేవాడు. ఎవరేది చెప్పినా చేసేవాడు. అలాటి కొడుకుతో ఒక వయసు మళ్ళిన తల్లి జీవితం వెళ్ళదీయడం దుర్భరమే. చుట్టాలో, తెలిసినవాళ్ళో అప్పుడప్పుడు తాయి గుడిసెకు వచ్చేవారు.



35, ఉస్మాన్ రోడ్ సంఘటనలకి సాక్షీభూతంగా నేటికీ అక్కడ నిలబడిన ఉన్నRain Trees - అదే తూంగు మూంజి - నిద్ర గన్నేరు చెట్లు. తాజాగా గత నెల, ఫిబ్రవరి 23, 2021న తీసిన ఫోటో

ఘంటసాలవారింటి లోగిలి చాలా పెద్దది.  పెరట్లో వేపచెట్టు ఆకులు, పక్కింటి మామిడిచెట్టు ఎండుటాకులతో నేలంతా నిండిపోయేది. వాకిట్లో అయితే చెప్పే అక్కరలేదు. రోడ్ మీద వున్న రెండు చెట్ల ఆకులు, ఎండిన పువ్వులతో నిండిపోయేది. మద్రాస్ లోని రోడ్లన్ని అలాటి avenue tressతో దట్టమైన నీడను ప్రసాదించేవి. ఆ చెట్లని మా అమ్మగారు నిద్ర గన్నేరు చెట్లనేవారు. అరవలు వాటిని తూంగుమూంజి (నిద్రముఖం) చెట్లనేవారు. రాత్రిళ్ళు ఆ చెట్ల ఆకులు ముడుచుకుపోయుండేవి. 


  


గుత్తులు గుత్తులుగా నూలుపోగులవంటి పింక్, తెలుపు కలసిన పువ్వులు పూసేవి. కాయలు శీకాయ కాయల్లావుండేవి. ఆ పువ్వులు ఎండి, బ్రౌన్ కలర్ కు మారి జలజలా క్రిందకు కుప్పలు కుప్పలుగా రాలేవి. పక్కన ఆనందన్ స్ట్రీట్ లో ఉండే గుడిసెవాసులు, మేకలు కాచుకునేవాళ్ళు, మేకలు పశువులకి మేపడానికి, చిన్న వంపు కత్తులు కట్టి ఉన్న పొడుగాటి వెదురు కఱ్ఱలతో ఆ కాయలు, ఆకులు, కోసుకోడానికి వస్తుండేవారు. ఎండిపోయి పడిపోయిన ఆకులు, కాయలతో వాకిలి నిండిపోయుండేది తెల్లారేసరికి. వాటన్నిటినీ మహా ఓపికగా ఉదయం ఊడ్చి, కళ్ళాపు జల్లి ఒక చిన్న ముగ్గుపెట్టడంతో తాయి దినచర్య ప్రారంభమయేది. తర్వాతే మాస్టారింటి లోపల పనులకు వెళ్ళేది. మధ్యే మధ్యే పానీయం అన్నట్లు గంటకోసారి తన గుడిసె ముందు కూర్చొని పొగాకుతో కూడిన తాంబూల సేవనం జరిగేది. ఈ ప్రాంతాల్లో చాలామంది సమయానికి అన్నం లేకపోయినా ఫర్వాలేదు, వెత్తలె పాక్ ఉంటే చాలన్నట్లు వుండేవారు. తమిళనాడులో వెత్తలె పాక్ అలవాటులాటిదే మా విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల వాసులు కొందరికి ఒక అలవాటు వుండేది. అది పొగాకు చుట్ట. కొన్ని తెగలవారిలో ఆడ, మగ, వయోభేదం లేకుండా చుట్టలు కాల్చేవారు. కొంతమందికి అడ్డపొగ అలవాటుండేది. అంటే ఆ చుట్టను నిప్పువున్నవేపు నోట్లో పెట్టుకునేవారు. నోరు కాలకుండా ఎలావుండేదో నాకు ఇప్పటికీ అంతుపట్టని మేజిక్కే. మేము మెడ్రాస్ వెళ్ళిన కొత్తలో తాయి చీరకట్టు కూడా వ్యత్యాసంగా వుండేది. మన తెలుగువారి చీరకట్టుకు విభిన్నమైనది. తరవాత అర్ధం అయింది. దక్షిణాది జిల్లాలలో పాతకాలపు స్త్రీల కట్టువ్యవహారం అదని.

అలాటి తాయికి ఒకసారి జ్వరం వచ్చింది. ఒకటి రెండు రోజులైనా తగ్గలేదు. అమ్మగారు తాయిని డాక్టర్ దగ్గరకు వెళ్ళమని చెప్పారు. తోడుగా నన్నుకూడా వెళ్ళమన్నారు రిక్షాలో. నాకు దిక్కు తోచలేదు. ఆ డాక్టర్ తో ఏం చెప్పాలి, ఏ భాషలో చెప్పాలని. అన్నిటికంటే బలహీనత ఏమిటంటే బయటవాళ్ళతో ధైర్యంగా మాట్లాడలేకపోవడం. పాప పిన్నిగారు సలహా ఇచ్చారు. "ఈ అమ్మాయికి జ్వరం వచ్చింది, కొంచెం చూడండి అని చెప్పు చాలు" అని  ఆ డాక్టర్ తో ఎలా మాట్లాడాలో చెప్పారు. ఆ డాక్టర్ గారు తెలుగాయనే సమస్యేంవుండదని ధైర్యం చెప్పారు. తాయి రిక్షా ఎక్కడానికి ఒప్పుకోలేదు. నడిచే వెళ్ళాము. ఆ డాక్టర్ గారు ఒక హోమియోపత్. వుండేది బజుల్లా రోడ్ లో.  

నెం.35, ఉస్మాన్ రోడ్ కు ఎడమవైపు ఫర్లాంగు దూరంలో (సుమారుగా పావు కిలోమీటర్) రోడ్ కు రెండు వైపులా బజుల్లా రోడ్. ఎడమవైపు బజుల్లా రోడ్ మొదట్లో (ఇప్పుడు వివేక్ అండ్ కో బిల్డింగ్ వెనకవేపు ఎడమవేపు మొదట ఉండే ఒక పాత ఇల్లు హాస్యనటుడు కస్తూరి శివరావుగారిది. ఆ ఇంటి పక్కిల్లు 63వ నెంబర్ ఇల్లు. ఎన్.టి.రామారావుగారిది. రామారావుగారింటికి ఎదురుగా పెండ్యాలగారిల్లు. పెండ్యాలగారు ఆ ఇంటిని దాసరి నారాయణరావుగారికి అమ్మేసారు. పెండ్యాలగారు అంతకుముందు నార్త్ ఉస్మాన్ రోడ్ లోని CITనగర్ లో వుండేవారు. పెండ్యాలగారికి ఇళ్ళు కొనడం, లాభసాటిగా అమ్మడం ఒకరకమైన వ్యాపారం కాకపోవచ్చు. వ్యాపకం కావొచ్చు

కుడివేపు బజుల్లా రోడ్ ఒకానొకప్పుడు చాలా ఫేమస్. ఆ రోడ్ లోనే బ్రిటిష్ ప్రభుత్వ ఆఖరి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా డా. చక్రవర్తి రాజగోపాలాచారిగారి స్వగృహం వుండేది.




రాజాజీగారికి నెహ్రూగారికి మధ్య అంత సయోధ్య వుండేదికాదని అనుకునేవారు. ఈయన సొంతంగా స్వతంత్ర పార్టీని స్థాపించారు. ఆ పార్టీ జండా నీలం బాక్ గ్రౌండ్ తో మధ్యలో తెల్లటి నక్షత్రం. 


ఆయన సంపాదకత్వం లో స్వతంత్ర పత్రిక కూడా వచ్చేది. రాజాజీ వ్రాసిన రామాయణం చాలా పేరుపొందింది. రాజాజీ చాలా మంచి వక్త. మాటలతో మనుషులను బోల్తా కొట్టించడంలో రాజాజీ మహా దిట్ట అన్న అభిప్రాయం ప్రముఖ పాత్రికేయుడు, లాయర్, హాస్యనటుడు, తుగ్లక్ సంపాదకుడు 'చో' రామస్వామిది. (భాగీరథన్ రాసిన తేన్ మొழிయాళ్అన్న  నాటకంలో ఆయన నటించిన పాత్ర పేరు చోఅని ఇప్పుడే తెలుసుకున్నాను – సోర్స్ దినమణి). రాజాజీ సూక్తులన్నీ ఇతరులకు చెప్పడానికే, తనకు వర్తించవనే మనస్తత్త్వం రాజాజీదని చో ఒకసారి తన తుగ్లక్ పత్రికలో వ్యంగ్యాత్మకంగా వ్రాశారు.

రాజాజీ ఒకసారి ఒక ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఉపన్యసించారట. భారతదేశ సనాతన ధర్మం గురించి, మన ఆచార వ్యవహారాలగురించి, ప్రతీ పౌరుడు ఆచరించవలసిన నీతి నియమాలగురించి ధారాప్రవాహంగా ప్రసంగించారట. వేల సంఖ్యలో ప్రజలంతా ఆయన పురాణకాలక్షేపాన్ని చాలా భక్తిశ్రధ్ధలతో విని ఆయనను వేనోళ్ళ పొగిడారట. ఆ సభకు రాజాజీ భార్య కూడా వచ్చి భర్త ప్రసంగానికి ముగ్ధురాలయిందట. రాత్రి భార్యాభర్తలిద్దరూ జరిగిన ఆధ్యాత్మిక కార్యక్రమం గురించి ముచ్చటించుకుంటూ భోజనాలు చేస్తున్న సమయంలో రాజగోపాలాచారిగారి భార్య ఆయనకు వేడి వేడి సాంబార్ వడ్డించారట. రాజాజీగారు ఆ సాంబార్ లో ఏవో వెతుకుతున్నారట. ఇది ఏం సాంబారు అని అడిగారట. బెండకాయ  సాంబారు అని చెప్పగానే రాజాజీ చిరాకు పడ్డారట. "శుభ్రంగా చిన్న ఉల్లిపాయలు వేసి చేయవచ్చు కదా" అని గదమాయించారట. అందుకు ఆవిడ "అదేమిటండీ ఇవేళ శనివారం. భోజనంలో ఉల్లిపాయ ఎలా చేరుస్తాము. పైగా ఇవేళ మీరే మన ఆచారవ్యవహారాల గురించి ఆహార నియమాల గురించి ఊరికి ఉపదేశం చేసారు, మర్చిపోయారా!" అని అడిగారట.  అందుకు రాజాజీ నవ్వుతూ "ఓసి పిచ్చిదానా! ఉపదేశాలనేవి ఇతరులకోసం మాత్రమే. మనం శుభ్రంగా ఉల్లిపాయ సాంబార్ లాగించవచ్చును" అని భార్యకు హితబోధ చేసారట. ఇది తుగ్లక్ చో సెటైర్. నిజానిజాలు వాళ్ళకే ఎరుక.

సరే, మన తాయి విషయం చూద్దాము. రాజాజీ యిల్లు దాటాక కొంత దూరంలో రోడ్ కు అవతల ప్లాట్ఫారమ్ మీద డాక్టర్ గారింటి నెంబర్ కనిపించింది. గేట్ తెరుచుకొని లోపలికి వెళ్ళితే ఒక వరండా కనిపించింది. మేము వెళ్ళే సమయానికి ఎవరూ లేరు. తాయిని అక్కడ వుండమని చెప్పి కాలిగ్ బెల్ నొక్కాను. అరవ గుండారు లుంగీ చుట్టుకున్న ఒక ముసలాయన బయటకు వచ్చి ఎవరని అడిగారు. నేను వెంటనే స్పష్టమైన తెలుగులో అమ్మగారు, పాప పిన్నిగారు చెప్పినట్లు "ఈ అమ్మాయికి జ్వరం. చూడండి" అని తడబడుతు చెప్పాను. డాక్టర్ గారూ చుట్టూ చూసి "ఎక్కడ అమ్మాయి"? అని అడిగారు. ఈ అమ్మాయే అని తాయిని చూపించాను.

ఆయన పగలబడి నవ్వడం ప్రారంభించారు. నేను అన్నమాటలో నవ్వేందుకు ఏముందో నాకు అర్ధం కాలేదు. ఆ డాక్టరు గారు "ఈవిడ అమ్మాయా! సరి సరి అంటూ నా అమాయకత్వానికి జాలిపడి, తర్వాత తాయిని పరీక్షించి ఏవో మందుపొట్లాలు ఇచ్చారు. తాయి, నేను ఇంటికి వచ్చేసాము. కానీ మయసభలో పరాభవం పొందిన దుర్యోధన సార్వభౌముడి చెవిలో ప్రతిధ్వనించే ద్రౌపది నవ్వులా, ఈనాటికీ మరిచిపోలేనివి ఆ డాక్టర్ గారి వికటాట్టహాసం, ఈ తాయి-అమ్మాయి సంఘటన. ఇలాటి సంఘటనలు అవమానంగా అనిపించినా తప్పులు చేసే మంచి పాఠాలు నేర్చుకంటామన్నదీ తెలిసిసొస్తుంది. 

ఘంటసాల మాస్టారు కాలంచేసి ఎన్నో దశాబ్దాలు గడిచినా  తమిళనాట ఘంటసాల పేరు చిరస్మరణీయమే. నగరంలోని ఏ హాస్పిటల్ కు వెళ్ళి ఘంటసాల కుటుంబంలోని వారని చెపితే చాలు, ప్రత్యేక శ్రధ్ధతో అభిమానం చూపించి వైద్యం జరిపిన సంఘటనలున్నాయి. ఇంతకూ వారెవరూ ఘంటసాల మాస్టారిని చూసివుండరు. పాటే విని వుంటారు. అయినా గత కాలపు చిత్రాల్లోని ఘంటసాల పాటల ప్రభావం వారి మీద వుందని స్పష్టంగా తెలుస్తోంది.


1962లో ఎన్.టి.రామారావుగారు నటించిన చిత్రలు తొమ్మిది వచ్చాయి. అక్కినేనివారివి ఆరు చిత్రాలు. వీటిలో ఎన్.టి.ఆర్. నటించిన గులేబకావళి కథ, భీష్మ, గుండమ్మ కథ, మహామంత్రి తిమ్మరుసు, రక్తసంబంధం, ఆత్మబంధువు చిత్రాలు, అందులోని పాటలూ బహుళ జనాదరణపొందినవే.

ఇక నాగేశ్వరరావుగారి సినీమాలలో ఆరాధన, మంచిమనసులు, కులగోత్రాలు, సిరిసంపదలు, హిట్ సినీమాలుగా పేరుపొందాయి. అదే సంవత్సరం జగ్గయ్యగారి పదండిముందుకు చిత్రం మంచి పేరు తెచ్చుకుంది.

ఈ సంవత్సరంలో ఘంటసాల మాస్టారి సంగీత దర్శకత్వంలో నాలుగు సినీమాలు వచ్చాయి. కోవెలమూడి భాస్కరరావుగారి మోహినీ రుక్మాంగద, సిఎస్ రావు డైరక్షన్లో టైగర్ రాముడు, విజయావారి గుండమ్మ కథ, సుందర్లాల్ నహతగారి రక్త సంబంధం. వీటిలో గుండమ్మ కథ, రక్త సంబంధం సినీమాలు సిల్వర్ జూబ్లీ చేసుకున్నాయి. గుండమ్మ కథ తమిళం వెర్షన్ "మనిదన్ మారవిల్లై" కు కూడా ఘంటసాల మాస్టారే సంగీతం. ఈ సినీమాలోని కొన్ని పాటల్లో మాస్టారి హమ్మింగ్స్ వినిపించినా జెమినీ గణేశన్ పాటలు శీర్కాళి గోవిందరాజన్, నాగేశ్వరరావు పాటలను ఎ.ఎల్.రాఘవన్ పాడడం ఒక విశేషం. గుండమ్మకథ పాటలు ఎంతటి జనాదరణ పొందాయో ప్రత్యేకించి చెప్పపనిలేదు. అలాగేరక్తసంబంధం పాటలు కూడా. ఈ ఏడాది విడుదలైన ఎఎన్నార్ చిత్రాల పాటలు, ఎన్టీఆర్ గులేబకావళి, మహామంత్రి తిమ్మరుసు, ఆత్మబంధువులో పాటలు, భీష్మలో పద్యాలు ఘంటసాల మాస్టారి కీర్తి ప్రతిష్టలను మరింత పెంచాయి.

ఎన్టీఆర్, ఎఎన్నార్, జగ్గయ్య, కాంతారావు, బాలయ్య, రేలంగిలకు ఘంటసాలవారు పాడిన పాటలు ఎంతో వైవిధ్యంతో కూడుకొని, పాడుతున్నది ఆయా నటులే అన్న భ్రమను శ్రోతలకు కలిగిస్తాయి. ఈ సినీమాలు విడుదలై అరవై సంవత్సరాలైనా ఆ చిత్రాల పాటలు సంగీతాభిమానులను మైమరపిస్తూనే వున్నాయి. గుండమ్మ కథ సినీమాలో ఎల్.విజయలక్ష్మి నృత్యం కోసం మాల్కౌంస్ రాగంలో ఘంటసాల మాస్టారు స్వరపర్చిన నృత్య వాద్య సంగీతం అజరామరంగా నిల్చిపోయింది. ఈ నాటికీ ఆ వాద్యగీతాన్ని నృత్యకళాకారులంతా వేదికలమీద ప్రదర్శిస్తున్నారు.

కొసమెరుపు: "భీష్మ " చిత్రంలో ఎన్టీఆర్ తన నట విశ్వరూపం ప్రదర్శించారనడంలో ఎటువంటి సందేహంలేదు. వృధ్ధుడైపోయిన భీష్ముడి మేకప్, గెటప్ ల గురించి ఎవరో చక్రపాణి గారి దగ్గర చాలా గొప్పగా వర్ణించారట. రామారావుగారి మేకప్ అద్భుతం. మనిషినే గుర్తుపట్టలేము అంటూ పొగిడారట. అందుకు చక్కన్నగారు మహాకూల్ గా "అంత గుర్తు పట్టలేనప్పుడు ఆ వేషం ఆడే ఎందుకెయ్యడం. నువ్వే వెయ్యచ్చు" అని అన్నారట. చక్రపాణి గారి భాష్యమేవేరు.

ఇదే చిత్రంలో, దర్శకత్వపరంగా మరో చిన్న లోపాన్ని కూడా ప్రేక్షకులు ముచ్చటించుకునేవారు.

భీష్ముడు వృధ్ధుడై యుధ్ధరంగంలోకి దిగినప్పుడు ఎన్టీఆర్ మాటలలో, చేతలలో వణుకు ప్రదర్శించగా పద్యాలు పాడేప్పుడు ఘంటసాల స్టోన్ కంచు ఘంటలా దుమ్ము దులిపేసిందని, మాటకు పాటకు మ్యాచ్ కాలేదనే  భావన వినవచ్చేది. ఈ విషయంలో దర్శకుడు, సంగీతదర్శకుడు తగిన శ్రధ్ధ తీసుకోలేదని కొందరి అభిప్రాయం. దిష్టి పరిహారార్ధం చిన్న చిన్న లోపాలుండాలి. ఏమంటారు ?

మరిన్ని విశేషాలతో వచ్చే వారం...  

                    ...సశేషం

3 comments:

చుండి వేంకట రాజు said...

చాలా ఓపికగా ఘంటసాల వారి విశేషాలు తెలియజేస్తున్నారండి. ధన్యవాదాలండి

మహేష్ బాబు సంబటూరి వెంకట said...

అద్భుతమైన మీ జ్ఞాపకాల దొంతర నుండి మరో చకచక్కని సంచిక.....!!!!!!!

అలనాటి చెన్నపట్నం లోని ప్రముఖ వైద్యుల గురించి..... ఘంటసాల గారి ఇంట్లో పని చేసే తాయి గారి కి సంబంధించిన మీ స్మృతుల గురించి.... ఇంకా ఎన్నో చక్కని విషయాలు వివరణాత్మకంగా తెలియజేశారు..... మీ ఓపికకి అనురక్తి కీ శతాధిక కోటి శుభాభినందనలు మరియు హార్ధిక ధన్యవాదములు స్వరాట్ బాబాయ్ గారూ 👏👏👏👏👏👌👌👌👌👌🙏🙏💐💐😊👍🤝💐

P P Swarat said...

కృతజ్ఞతలు.