visitors

Sunday, April 18, 2021

నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 2 - ఇరవై ఏడవ భాగం

18.04.2021 -  ఆదివారం భాగం - 26*:
అధ్యాయం 2 భాగం 25  ఇక్కడ

  

నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్

1963 నాటికి "చచ్చి చెడి సాయంగల విన్నపాలు" అనే నానుడిని నిజంచేస్తూ ఘంటసాలవారి కాంపౌండ్ లో మొట్టమొదటి SSLC (అప్పట్లో అదే 12th Standard), స్కూల్ ఫైనల్ సర్టిఫికెట్ సంపాదించిన ఘనుడిని నేనే అయ్యాను. అంతవరకూ అందరూ SSLC లోపు చదివినవారే తప్ప అంతకుమించి పైకిపోలేదు. అందుకు మా ఇంట్లోనూ, ఘంటసాల మాస్టారింట్లోనూ అందరూ సంతోషించారు. అయితే, నాలో ఏ గొప్ప విజ్ఞానమూ పెరగలేదు. SSLCలో నాకు వచ్చిన మార్క్ లకు ఏ కాలేజీలో ఏ సీటు వస్తుందో తెలియదు. మెడిసిన్ లు, ఇంజినీరింగ్ లు చదివే తెలివితేటలు గానీ, చదివించే స్థోమతగాని లేదు. బాపట్లలో అగ్రికల్చర్ బి.ఎస్.సి కి సీట్ కోసం అప్లికేషన్ పంపాను. ఆ కాలేజీవారు కూడా ఇంటర్వ్యూకు రమ్మని ఆహ్వానించారు. అయితే ఆ ఉత్తరం మా బొబ్బిలి ఎడ్రస్ కు వెళ్ళింది. అప్పటికి నేను మద్రాస్ వచ్చేసాను. మా బొబ్బిలి తాతగారు వెంటనే ఆ ఉత్తరాన్ని మద్రాసుకు పోస్ట్ చేశారు. ఆ ఉత్తరం మాకు చేరిననాడే ఇంటర్వ్యూ. ఎక్కడ? తిరుపతిలో. ఆనాటికి బాపట్ల, తిరుపతిలలో మాత్రమే అగ్రికల్చర్ డిగ్రీ కాలేజీలు వుండేవి. ఆ రెండుకాలేజీల ఇంటర్వ్యూలు తిరుపతిలో జరిగాయి. అదే రోజు ఇంటర్వ్యూకు ఎలా వెళ్ళాలో తెలియలేదు. ఘంటసాల మాస్టారిని మా నాన్నగారు సంప్రదించారు. ఆయన వెంటనే ఎదో బస్సు పట్టుకొని తిరుపతి వెళ్ళమని సలహా ఇచ్చారు. నేనూ, మానాన్నగారు బస్ లో బయల్దేరాము. ఆ బస్ 'తడ 'మీదుగా తిరుపతి వెళ్ళే బస్ . అప్పటికి తిరుపతి బస్ రూట్లుగానీ రోడ్లుగానీ  అంత అభివృధ్ధి చెందలేదు. కొండల్లో కోనల్లో మట్టిరోడ్ల మీద ప్రయాణం చేస్తూ, తిరుపతి చేరుకొని, ఆ ఇంటర్వ్యూలు జరిగే స్థలాన్ని వెతికిపట్టుకొని మేము అక్కడికి చేరేసరికి పుణ్యకాలం కాస్తా గడిచిపోయింది. మేము ఆ ఆఫీసుకు వెళ్ళేసరికి ఐదున్నర దాటిపోయింది. అప్పటికే ఇంటర్వ్యూలు ముగిసిపోయాయి. మేము చేయగలిగింది ఏమీలేదు, వచ్చే ఏడాదికి మళ్ళా అప్లై చేసుకోమని ఒక మంచి ఉచిత సలహా ఇచ్చేరు. ఇక ఆ రాత్రికి ఎక్కడ వుండాలో తెలియలేదు. వెంటనే మద్రాసు వెళ్ళే అవకాశమూ లేదు. కనీసం అంతదూరం వచ్చినందుకు కొండమీది వేంకటేశ్వరస్వామి దర్శనమైనా చేసుకుందామని తిరుమల కొండమీదకు బస్ లో వెళ్ళాము. అయితే చిత్రంగా, ఇన్ని విషయాలు గుర్తున్న నాకు కోవెల లోపలకు వెళ్ళామా లేదా? దైవదర్శనం జరిగిందా, లేదా, అనే విషయాలే జ్ఞాపకంలేవు. కానీ, కొండమీద చెట్లక్రింద అక్కడి సిమెంట్ చప్టాలమీద చాలామంది యాత్రీకులులాగే ఆ రాత్రి గడిపాము. చల్లటి కొండగాలి, కప్పుకోవడానికి సరియైన దుప్పట్లవంటివి తీసుకువెళ్ళక ఆ రాత్రంతా సరియైన నిద్రేలేదు. మర్నాటి ఉదయాన్నే మరల బయల్దేరి మద్రాస్ చేరుకున్నాము. జరిగిన విషయం తెలిసి ఘంటసాల మాస్టారు చాలా విచారించారు. వెంటనే, గుంటూరు లోని తన మిత్రుడు, గొప్ప పలుకుబడిగల  శ్రీ వడ్డె శోభనాద్రిగారికి  నా సీట్ విషయంలో తగు సహాయం చేయమని సిఫార్సు ఉత్తరం రాశారు. ఆ ఉత్తరం నేనే రాసాను. మాస్టారు సంతకం చేశారు. కొన్నిరోజుల తర్వాత శోభనాద్రిగారు సమాధానం వ్రాసారు. ఆ ఏడాదికి కాలేజీ సీట్ల ఇంటర్వ్యూలన్నీ ముగిసి సెలక్షన్ కూడా పూర్తికావడం వలన తగిన సహాయం చేయలేకపోతున్నందుకు విచారిస్తున్నట్లు, వచ్చే సంవత్సరం అప్లైచేసి ముందుగా తనకు తెలియజేయమని ఆ ఉత్తర సారాంశం. వచ్చే ఏడాదివరకూ ఆగడమంటే ఒక ఏడాది చదువు వృధా అయినట్లే. ఆ తర్వాత కూడా అనుకున్న ఆ సీటు వస్తుందో లేదో గ్యారంటీ లేదు. ఉన్న ఆర్ధిక పరిస్తితుల దృష్ట్యా ఏదో ఒక డిగ్రీ వస్తే చాలనిపించింది. వెంటనే, మళ్ళా మా బొబ్బిలికే చేరాను. అప్పటికి రెండు మూడేళ్ళ క్రితమే బొబ్బిలి రాజావారి డిగ్రీ కాలేజీ ప్రారంభించారు. అక్కడ ఇంచుమించు ఒకేసారి విద్య, వినోదాలకోసం ఒక కాలేజీ, ఒక సినీమా హాలు (శ్రీకృష్ణా టాకీస్) వచ్చేయి. (తొలి సినీమా 'శాంతినివాసం').

బొబ్బిలిలోని సంస్థానం హైస్కూల్, సినీమా హాల్, సుగర్ ఫ్యాక్టరీ, రైస్ మిల్స్, వేణుగోపాలస్వామి వారి ఆలయం, ఇలా అన్నిటిలోను ముఖ్య భాగస్వామ్యం బొబ్బిలి రాజావారిదే. బొబ్బిలి కాలేజీ స్థాపనలో స్థానిక, చుట్టుప్రక్కల గ్రామ ప్రజల సహకారం, డబ్బు కూడా వుందని చెప్పుకుంటారు. సుగర్ ఫ్యాక్టరీకి వచ్చే ప్రతీ చెరుకు బండికీ టన్నుకు ఇంత అని, కాలేజీ నిర్మాణానికి డబ్బు వసూలు చేసేవారని అనుకోవడంవుంది. నవంబర్ నుండి మార్చ్ వరకూ సుగర్ ఫ్యాక్టరీ ముమ్మరంగా పనిచేసేది. రాత్రి తెల్లార్లు చెరుకు బళ్ళు చుట్టుపక్కల ఊళ్ళనుండి బొబ్బిలి చేరేవి. ఎడ్లబళ్ళమీద చెరుకు మోపులు కట్టి వచ్చేవారు. రాత్రిపొడూగునా లొల్లాయిపాటలు, కురుక్షేత్రం  నాటక పద్యాలు పాడుకుంటూ చెరుకుబళ్ళు తోలుకువచ్చేవారు. పాడినంతసేపు ఊరంతటికీ వినిపించేలా పాడి అలసిపోయి అలాగే నిద్రపోయేవారు. కానీ, అలవాటు పడిన ఆ ఎడ్లు మాత్రం బండిని సురక్షితంగా సుగర్ ఫ్యాక్టరీకి తీసుకువెళ్ళిపోయేవి. ఈలోగా చాలామంది ఆకతాయిలు బండిమీద, చేతికి అందినంతవరకు చెరుకుగడలు తస్కరించేవారు. పొరపాటున పట్టుబడ్డారా... ఆ బళ్ళవాళ్ళు నోటికి వచ్చిన బండబూతులు తిట్టేవారు. పాపం! వాళ్ళు కూడా అంతకుమించి ఏం చేయలేకపోయేవారు. ఇది ప్రతీరోజూ క్రమం తప్పక జరిగే వ్యవహారమే. 

అలాటి కొత్తగా తెరిచిన కాలేజీలో బి.ఏ. (ఆనాటికే బి.ఏ. అంటే 'బొత్తిగా అధ్వానం' అనే చిన్నచూపు వచ్చేసింది) డిగ్రీలో చేరాను. ఏడాది మొత్తానికి చాలా శెలవు రోజులుండేవి. ఆ కాలమంతా మద్రాస్ లో 'నెం.35, ఉస్మాన్ రోడ్' లోనే అందరిమధ్యా  సత్కధాకాలక్షేపం.

ఒకరోజు ఉదయం పది పదకొండు గంటల మధ్య రాజగోపాల్ వచ్చి మేడమీది తన ఆఫీసు రూములో తన పని మొదలెట్టాడు. అరవతెలుగు. ఘంటసాల మాస్టారు చిత్రనిర్మాణం ఆపేసినా వాటి ఎక్కౌంట్స్కు సంబంధించిన లావాదేవీలు, ఇన్కంటాక్స్ లెఖ్ఖలు చూడడానికి ఒక సమర్ధుడైన క్లర్క్ గా రాజగోపాల్ వచ్చి చేరాడు. నరసింగ, రాజగోపాల్ కలసి పనిచేసేవారు. నరసింగ ఉస్మాన్ రోడ్ లోని ఘంటసాల వెంకటేశ్వరరావు గారి దగ్గర ఇంట్లో వ్యక్తిగా, హబిబుల్లా రోడ్ లోని గుమ్మడి వెంకటేశ్వరరావు గారి దగ్గర పార్ట్ టైమ్ క్లర్క్ గా పనిచేసేవాడు. 

రాజగోపాల్ రోజూ తనతో కూడా హిందూ పత్రికో, ఇండియన్ ఎక్స్ప్రెస్ పత్రికో తీసుకువచ్చేవాడు. 
అది రాగానే అందులో ఆఖరి పేజీలలోని సిటీ ఎంటర్టైన్మెంట్ లో ఊళ్ళో ఉన్న సినీమాలు, శుక్రవారం అయితే రివ్యూలు చూసి తర్వాత హెడ్లైన్స్ చూడడం నా అలవాటు. వారపత్రికలైనా కూడా వెనకనుండి ముందుకు వెళ్ళేవాడిని. ఆ తర్వాతే వరసగా  నచ్చిన సీరియల్స్ చదవడం. ఆ రోజు అలా ఆ న్యూస్ పేపర్ వెనకనుంచి ముందు పేజీకి వచ్చి చూస్తే ఒక మహా దారుణమైన,్ దేశ విదేశ ప్రజలందరినీ దిగ్భ్రాంతికి గురిచేసిన వార్త తలకాయంత అక్షరాలతో ప్రకటించారు. భారత ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూగారు స్వర్గస్తులయ్యారన్న వార్తతోపాటు ఆయనకు సంబంధించిన అనేక ఫోటోలు, విశేషాలతో వుంది. 

నేను, నరసింగ రాజగోపాల్ ను అడిగాము పేపర్ చదివావా?' అని. 'చదివానే'. ఇంతే సమాధానం. 'నెహ్రూగారు పోయారట'!
'అవును. పోయారు.'
'మరి నువ్వేం చెప్పలేదే'
'ఏముంది చెప్పడానికి'.

That is Rajagopal. సన్నగా పొడుగ్గా, చామనచాయగా కళ్ళజోడుతో చాలా నిదానంగా, కామ్ గా వుండేవాడు. ఏ హడావుడి వుండేదికాదు. వచ్చేదీ తెలియదు, వెళ్ళేదీ తెలియదు. అతను అలాగే రెండేళ్ళో, మూడేళ్ళో పనిచేసి వెళ్ళిపోయాడు.

1964 చివర్లోనో, 1965 ప్రారంభంలోనో సరిగా గుర్తులేదు, మా రావమ్మ పెళ్ళిజరిగింది. రావమ్మ ఘంటసాల మాస్టారికి ఆప్తుడు, సంగీత సహాయకుడు అయిన పామర్తి వెంకటేశ్వరరావుగారి ప్రధమ సంతానం. నా వయసే. ఆ పెళ్ళి టి.నగర్ బోగ్ రోడ్ లో జరిగింది. ఆరోడ్ లోనే 'మల్లీశ్వరి' బి.ఎన్.రెడ్డిగారు వుండేవారు. (జాతీయస్థాయి ప్రముఖ చిత్ర నిర్మాతాదర్శకుడు బి.ఎన్.రెడ్డిగారి గౌరవార్ధం తమిళనాడు ప్రభుత్వం ఒకప్పుడు ఆ ప్రాంత బోగ్ రోడ్ కు బి.ఎన్. రెడ్డి రోడ్ అని పేరుపెట్టారు. ఆ తరువాత వచ్చిన మరో పార్టీ ప్రభుత్వం కులాలు , జాతులు , మతాలు నిర్మూలించి నవసమాజ నిర్మాతలం అనిపించుకునే క్రమంలో ముందుగా  రోడ్లకు పెట్టిన పేర్లలో వుండే కులం, జాతుల పేర్లమీద నలుపు రంగు పూయడం మొదలెట్టారు. దానితో బి.ఎన్ రెడ్డి రోడ్ లో రెడ్డి పోయి బి.ఎన్. మాత్రం మిగిలింది. జి.ఎన్.చెట్టి లో చెట్టి పోయి, జి.ఎన్. రోడ్ అయింది. నాగేశ్వరరావు రోడ్ లో రావు కులం పేరుగా కనిపించి రావు తీసేసి నాగేశ్వర రోడ్ అన్నారు. డాక్టర్ నాయర్ రోడ్ లో నాయర్ ను లాగి పారేయగా ఒక్క డాక్టర్ మిగిలి డాక్టర్ రోడ్ అన్నారు. తిరుమలపిళ్ళై లో పిళ్ళై పోయి తిరుమల మిగిలింది. మహమ్మద్ ఉస్మాన్ రోడ్ ఉస్మాన్ రోడ్ అయింది. ఇలా మద్రాస్ లోని రోడ్ల పేర్లన్నీ మార్చి పోస్టల్ డిపార్ట్మెంట్ కు కొత్త తలనొప్పి తెచ్చారు. కృష్ణమాచారి, కృష్ణారావు, కృష్ణారావు నాయుడు లలో జాతి ప్రక్షాళన తో ఒక్క కృష్ణ రోడ్, కృష్ణా స్ట్రీట్ మిగిలి ఎడ్రస్ దార్లను కనుక్కోవడంలో, ఉత్తరాల బట్వాడా చేయడంలో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. ఎంతవరకు జాతి, కుల నిర్మూలనం జరిగిందో నవ సమానత్వ సమాజం ఎంతవరకు నిర్మించబడిందో ఆ దేవుడికే తెలియాలి. అదంతా ఒక రాజకీయం. కొన్నాళ్ళకు ఆ పార్టీ పోతుంది. మరొకపార్టీ గద్దె ఎక్కుతుంది. మరో నవసమాజ స్థాపనకు మరేవో మార్పులు చేస్తారు. 'ఇంతేరా జీవితం తిరిగే రంగులరాట్నం'  అంటారు బి.ఎన్.లాటి అనుభవజ్ఞులు.)

మళ్ళీ, రావమ్మ పెళ్ళికి వద్దాము. పెళ్ళి ఉదయం ముహుర్తం. తమిళనాడు లో 90 శాతం పెళ్ళిళ్ళన్నీ ఉదయం ముహుర్తంలోనే జరుగుతాయి. పెళ్ళి చూడ్డానికి వచ్చేవారికి చాలా అనుకూలం. పది పదిన్నర లోపల పెళ్ళయిపోతుంది. వధూవరులకు గిఫ్ట్ ఇచ్చేసి, శుభాకాంక్షలు తెలిపి, పన్నెండులోపల పెళ్ళివారి విందు భోజనంచేసి, వారిచ్చిన తాంబూలం సంచీ పట్టుకొని  ఓ రెండు గంటలు లేట్ పర్మిషన్ తీసుకొని ఆఫీసులకు వెళ్ళిపోతూంటారు. ఇరువర్గాల పెళ్ళివారు మధ్యాహ్నం రెండులోపల కళ్యాణమండపాలు ఖాళీచేసి వెళ్ళిపోతారు. మ్యారేజ్ రిసెప్షన్ లాటివి వుంటే, ముందో, వెనకో ఏర్పాటు చేసుకుంటారు. 

తమిళనాడులో కొన్ని వర్గాలలో జరిగే పెళ్ళి తంతులు వింతగానూ, నవ్వు తెప్పించేవిగాను వుంటాయి. పెళ్ళికొడుకుకు, పెళ్ళికూతురికి చదివించే కానుకలన్నీ, ఇంట్లో వున్న మాకు లౌడ్ స్పీకర్లలో  స్పష్టంగా వినపడేవి. వధూవరులకు వారి దగ్గర చుట్టాలు ఇచ్చే కానుకలన్నీ పేరు పేరునా చదువుతూంటే మరొకరు వాటన్నింటినీ కాగితం మీద రాస్తూంటారు. అందులో కాస్ట్లీ రాయల్ ఎన్ఫీల్డ్ మోటర్ సైకిల్ నుండి కిలో రెండు కిలోల బియ్యం, కందిపప్పు వరకు 'కాదేది కానుకలకనర్హం' అన్నట్లు అనేక రకమైన వింత వింత వస్తువులెన్నో మా చెవినిపడేవి. పెళ్ళనేది ఆనాడూ, ఈనాడూ కూడా ఆర్ధికస్తోమతు లేనివారికి తలకుమించిన కార్యంగానే మిగిలిపోతోంది.

పామర్తి రామలక్ష్మి(రావమ్మ)ని చేపట్టిన వరుడు కృష్ణప్రసాద్. మాధవపెద్దివారు. మాధవపెద్ది సత్యంగారు, మాధవపెద్ది గోఖలేగారి తమ్ముడే. స్టేట్ బ్యాంక్ ఉద్యోగి.


నవ వధూవరులతో వరుడి తలిదండ్రులతో పామర్తి, ఘంటసాల దంపతులు

మంచి ఈడూజోడూ. ఈ పెళ్ళి నిర్విఘ్నంగా, జయప్రదంగా జరిపించడంలో ఘంటసాల మాస్టారు, సావిత్రమ్మగారు ఎంతో తోడ్పడ్డారు. పామర్తిగారికి సగం భారం తగ్గింది. అప్పటికే స్వతంత్రంగా సంగీత దర్శకత్వం చేయాలనే కోరికతో మాస్టారి దగ్గర సహాయకుడిగా పాల్గొనడం తగ్గించేసారు. అయినా ఇరుకుటుంబాల మధ్య గల పరస్పర ప్రేమాభిమానాలు, ఆప్యాయతలు ఏమాత్రం తగ్గలేదు. మరల కొన్నేళ్ళ గ్యాప్ తో ఘంటసాల మాస్టారి చిత్రాలు కొన్నిటికి సహాయకుడిగా పనిచేయడం జరిగింది. ఘంటసాల మాస్టారి స్వభావం లో ఏ మార్పురాలేదు. ఆనాటి వివాహ కార్యక్రమం శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రిగారి మేనకోడళ్ళు, వింజమూరి సోదరీమణులు సీత, అనసూయ ద్వయంలో అనసూయగారి తనయ,  అప్పట్లోనే రంగప్రవేశం చేసిన  రత్నపాప కూచిపూడి నృత్యప్రదర్శనతో ముగిసింది. 

దేవత సినీమా వచ్చిన తర్వాత ఎప్పుడో ఒకసారి రావమ్మను మాస్టారింట్లో చూసాను. దేవతలోని డ్యూయెట్లు పాడి తన వైవాహిక జీవితం ఎంత సంతోషంగా గడుస్తోందో, సత్యం బావగారు, గోఖలే బావగారు(మాధవపెద్ది), తన తోటికోడళ్ళు ఎంత మంచివారో, ఎంత సఖ్యంగా వుంటారో లాటి అత్తింటి విషయాలన్నీ సావిత్రమ్మగారి దగ్గర, పాప పిన్నిగారి దగ్గర కథలు కథలుగా చెప్పింది. రావమ్మ, ఆమె చెల్లెలు శారద కూడా చాలా బాగా పాడేవారు. మాస్టారు దగ్గర కొన్ని కోరస్ లు పాడారేమో కూడా. రావమ్మ కబుర్లు అప్పట్లో నాకు వింతగాను, ఆశ్చర్యంగానూ అనిపించాయి. ఎక్కడా తన అమ్మ, నాన్నల ప్రసక్తేలేదు. పెళ్ళయిన వెంటనే అంతలా మరిపోతారా అనుకునేలా ఆడపిల్లలు అత్తింటి వాతావరణానికి అలవాటు పడిపోతారు. అది సహజం. అవసరం కూడానేమో!

1974 తర్వాత  అప్పుడప్పుడు కొన్ని విషయాలు వినడం తప్ప పామర్తి కుటుంబంతో అనుబంధం తగ్గిపోయింది. రావమ్మను మరల ఒకటి రెండుసార్లు మా మద్రాస్ తెలుగు అకాడెమీ ఉత్సవాలకు వచ్చినప్పుడు చూశాను. తిరుమల కొండమీద మా ఉత్సవాలలో మాధవపెద్ది మూర్తి కూచిపూడి నృత్యం చేసినప్పుడు ఆ గ్రూప్ తో వచ్చి పలకరించింది. అలాటి చిరపరిచితురాలు కొన్నేళ్ళక్రితం తన మనవరాలితోనో/మనవడితోనో సరదాగా ఆటలాడుకుంటూనే చాలా సునాయాసంగా, ఏ బాధపడకుండా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిందని విన్నప్పుడు కొంచెం బాధ కలిగినా, చాలా అదృష్టవంతురాలనే భావన కలిగింది. 'జాతస్య మరణం ధృవం' అనేది నిజమైనప్పుడు అందుకు తగిన మనోపరిపక్వత అలవర్చుకోవడమే మంచిది అనిపిస్తుంది.

ఒకరోజు ఉదయం ఘంటసాల మాస్టారు మా నాన్నగారితో "గురువుగారూ! మనకు ఒక కొత్త కంపెనీ వస్తోంది. ప్రొడ్యూసర్ కొత్తవాడు. ఒక భారీ పౌరాణికం సినీమా తీస్తున్నారు. ఆచారిగారే రాస్తున్నారు. కామేశ్వరరావుగారు డైరక్టర్. మ్యూజిక్ కు మంచి స్కోప్ ఉన్న సినీమా. మనమే సంగీతం చేయబోతున్నాము" అని చెప్పారు. అదే ఎ.ఎస్.ఆర్ ఆంజనేయులు నిర్మాతగా మాధవీ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద వచ్చిన 'పాండవ వనవాసము' సినీమా.

ఎన్.టి.రామారావు, సావిత్రి, ఎస్.వి.రంగారావు, గుమ్మడి, కాంతారావు, రాజనాల, రాజసులోచన, వాణిశ్రీ, బాలయ్య, హరనాథ్, ఎల్.విజయలక్ష్మి, ముక్కామల, నాగయ్య, పద్మనాభం, లింగమూర్తి, అందరూ ఆనాటికి గొప్ప పేరుప్రఖ్యాతులు పొందిన పెద్ద తారాగణంతో మొదలుపెట్టారు. తమ ఆఫీసును కూడా నార్త్ ఉస్మాన్ రోడ్ లో హబిబుల్లా రోడ్ కు సమీపంలో ఒక పెద్ద భవనంలో ఏర్పాటు చేసారు. ఖర్చుకు వెనకాడకుండా ఒక బ్రహ్మాండమైన, మంచి సినీమా తీయాలని లక్ష్యంగా మొదలుపెట్టారు. పాటల కంపోజింగ్ ప్రారంభమయింది. నిర్మాత మంచి సహృదయుడు. సంగీతం విషయంలో పూర్తి స్వేచ్ఛనిచ్చారు. ఏం చేసినా, ఎలా చేసినా పాటలన్నీ జనరంజకంగా వుండాలి అనేదే వారి కోరిక. నిర్మాత అభిరుచులమేరకు మంచి సంగీతాన్ని సమకూర్చడానికి ఘంటసాల మాస్టారు, సముద్రాల రాఘవాచార్యులవారు కష్టపడి పనిచేశారు. అందుకు తగినట్లుగానే పాటలు, పద్యాలు సన్నివేశపరంగా, సందర్భోచితంగా అమరాయి.

పాండవ వనవాసం చిత్రానికి సంబంధించినంత వరకూ ఓ మూడు విశేషాలున్నాయి. మొట్టమొదటిసారిగా సుప్రసిద్ధ కర్ణాటక సంగీత విద్వాంసుడు డా.మంగళంపల్లి బాలమురళీకృష్ణగారు ఘంటసాల మాస్టారి సంగీత దర్శకత్వం లో పాడారు. అదొక సూర్యస్తవం. ధర్మరాజు పాత్రధారి గుమ్మడి మీద చిత్రీకరించారు. రెండవది ఆలిండియా డ్రీమ్ గర్ల్ గా, గ్లామర్ క్వీన్ గా  హిందీ రంగాన ఒక వెలుగు వెలిగిన తమిళుల అమ్మాయి  హేమామాలిని మొదటిసారిగా తెరపై కనిపించిన తెలుగు చిత్రం.దర్శకేంద్రుడిగా ఎన్నో హిట్ సినీమాలందించిన కె. రాఘవేంద్రరావు మొదటిసారిగా ఈ సినీమకు సహాయదర్శకుడిగా కమలాకర కామేశ్వరరావుగారి దగ్గర పనిచేసారు. 

పాటలు, పద్యాలను ఘంటసాల, మాధవపెద్ది, పి.బి.శ్రీనివాస్, సుశీల, లీల, ఎస్.జానకి, ఎల్.ఆర్.ఈశ్వరి పాడారు. ఈ సినీమాలో ఘంటసాల మాస్టారు, మాధవపెద్దిల మధ్య సాగిన సంవాద పద్యాలు పల్లెప్రాంత ప్రేక్షకులకు మృష్టాన్న భోజనమే. ఎస్.జానకి పాడిన 'ఓ వన్నెకాడా నిన్ను చూసి నా మేను పులకించెరా' పాట చాలా నిడివైన పాట. నృత్యగీతం. మూడు కట్స్ గా వస్తుంది. శాస్త్రీయ జానపద రీతులలోసాగుతుంది. ఈ పాటను మాస్టారు చాలా అద్భుతంగా స్వరపర్చారు. జానకి కూడా చాలా బాగా పాడారు. రాజసులోచన, ఎన్టీఆర్ లమీద చిత్రీకరించారు.


 
ఈ చిత్రంలో ఘంటసాల మాస్టారు భీమునికి, అభిమన్యునికి, ఒక నర్తకునికి పాడి ఆయా పాటల్లో, పద్యాలలో తన గాత్ర వైవిధ్యాన్ని, ప్రతిభను అనితరసాధ్యంగా కనపర్చారు. ఆ విషయం  భీముడి పద్యాలలో, హిమగిరి సొగసులు పాటలో, ఆంజనేయ దండకంలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆంజనేయ పాత్రధారి సుప్రసిధ్ధ  పంజాబీ రెజ్లర్ అజిత్ సింగ్ తన మీద చిత్రీకరించిన ఈ దండకానికి దాసుడై తాను వెళ్ళిన ప్రతీచోటా మాస్టారు పాడిన ఈ ఆంజనేయ దండకాన్ని అందరికీ వినిపించి ఆనందించేవాడట.
               


భీముడి వంటి ధీరోద్ధత నాయకుడి చేత ఒక శృంగార యుగళగీతాన్ని ఆలపింపజేయడం సామాన్య విషయంకాదు. ఈ పాట విషయంలో అనేక తర్జనభర్జనలు జరిపి, నాలుగైదు పల్లవులు అనేక రాగాలలో అనుకొని చివరకు 'హిమగిరి సొగసులు' పాటను ద్విజావంతి/ జైజైవంతి రాగంలో మాస్టారు స్వరపర్చారు. 

ఇదే రాగంలో ఎస్.రాజేశ్వరరావుగారు చేసి, మాస్టారు పాడిన ఒక సూపర్హిట్ సోలో డాక్టర్ చక్రవర్తి లో వుంది. 'మనసున మనసై' అక్కినేని పాట. ఈ రెండు పాటలకు రాగం ఒకటే అయినా స్వరరచనలో రెండింటిమధ్య ఎంతో వైవిధ్యం కనిపిస్తుంది. 'హిమగిరి సొగసులు' పాటను కాశ్మీర్ వ్యాలీలో హిమాలయా పర్వతాలు నేపథ్యంగా ఔట్ డోర్లో షూటింగ్ జరుపుతారని ముందుగా అనుకున్నారని వినికిడి. కానీ ఎన్.టి.రామారావు తన షెడ్యూల్స్ దృష్ట్యా ఎక్కువగా దూరప్రాంత ఔట్ డోర్లకు రోజులతరబడి వెళ్ళి పనిచేయడానికి ఇష్టపడేవారు కాదని కూడా అనుకునేవారు. ఏది ఏమైనా మొత్తం మీద ఈ పాట ఇన్ డోర్ సెట్ లోనే షూట్ చేసారు. పాట సూపర్ హిట్ అయింది. ఈ సినీమా రీరికార్డింగ్ విషయంలో కూడా ఘంటసాల మాస్టారి ప్రతిభ అడుగడుగునా కనిపిస్తుంది. భీముడి నడక మీద వినవచ్చే గిటార్ వ్యాంపింగ్ లు, పాచికలాటమీద వినవచ్చే మ్యూజిక్, ఆంజనేయుడు, భీముడి మధ్య జరిగే కామెడీ సీన్ లోని మ్యూజిక్, ఇలా ఆద్యంతం రీరికార్డింగ్ ప్రేక్షకులను ఉర్రూతలూగించింది.

విడుదలైన అనేక కేంద్రాలలో 'పాండవ వనవాసం'  శతదినోత్సవాలు, రజతోత్సవాలు, కొన్ని చోట్ల 175 రోజుల వరకూ విజయవంతంగా ప్రదర్శించబడి ఘంటసాలవారి కీర్తికిరీటంలో ఒక కలికితురాయిగా మిగిలిపోయిన చిత్రం 'పాండవ వనవాసం'. ఘంటసాల మాస్టారు సంగీత దర్శకత్వంలో వచ్చిన ఉత్తమ పౌరాణిక చిత్రాలలో పాండవ వనవాసం ఒకటి.

1965 లో విడుదలైన మరో మాస్టారి సంగీతభరిత చిత్రం 'సిఐడి' విజయావారి చిత్రం. విజయావారి ట్రాక్ కు విభిన్నమైన క్రైమ్ స్టోరీ. ఈ సినీమాను ఎమ్.జి.రామచంద్రన్ ను తృప్తి పర్చడానికి అతను నటించిన 'దైవత్తాయ్' అనే తమిళ చిత్రం రైట్స్ కొని తెలుగులో 'సిఐడి' గా నిర్మించారని చెప్తారు. తెలుగు రాముడు భీముడు చిత్రాన్ని విజయావారు అత్యంత భారీగా తమిళంలో ఎమ్.జి.ఆర్. సరోజాదేవి, నంబియార్లతో 'ఎంగవీట్టు పిళ్ళైగా' తీస్తున్న సమయంలో ఎమ్జీయార్ డేట్లకోసం అతన్ని సంతృప్తి పర్చడానికి తెలుగు లో ఒక క్వికీగా ఈ సినిమా తీసినట్లు తోస్తుంది. కళ్యాణి రాగంలో 'నాసరి నీవని', సింధుభైరవిలో 'నిను కలసిన నిముసమున' వంటి పాటలు ఘంటసాల మాస్టారి ముద్రను స్పష్టం చేస్తాయి. ఈ చిత్రంలోని పాటలన్నీ బహుళజనాదరణ పొందాయి. ఈ చిత్రంలో రమణారెడ్డి నాట్యాచార్యుడిగా, హాస్యనటి మీనాకుమారి మీద చిత్రీకరించిన ఒక సుప్రసిధ్ధ తిల్లానా బహు ప్రాచీనమైనది. పట్నం సుబ్రమణ్య అయ్యర్ వ్రాసిన ' సుదతి నీకు తగిన చిన్నదిరా' అనే తిల్లానాను ఘంటసాల మాస్టారు తన మొదటి చిత్రమైన 'లక్ష్మమ్మ' చిత్రంలో ఫరజ్ రాగంలో చేసారు. నటి రుక్మిణి నాట్యానికి పామర్తి వెంకటేశ్వరరావు నట్టువాంగంచేస్తూ ఘంటసాల వెంకటేశ్వరరావు గారి పాటకు అభినయిస్తారు.
 

ఈ వెంకటేశ్వరరావు ద్వయం 1949ల నుండే ఆత్మీయంగా వుండేవారు. అదే తిల్లానాను మరల ఒకటిన్నర దశాబ్దాల తర్వాత 'సిఐడి' సినీమాలో పెట్టారు. ఎందుచేతనో  అన్ని హంగులూ వున్నా 'సిఐడి' సినీమా విజయావారి ఖ్యాతిని పెంచలేకపోయిందనే అనిపిస్తుంది.

అలాగే, నాగిరెడ్డి-చక్రపాణిల విజయా ప్రొడక్షన్స్ కు ఘంటసాల మాస్టారు సంగీత దర్శకత్వం వహించిన ఆఖరి సినిమా 'సిఐడి'.  తర్వాత, ఆ సంస్థ నిర్మించిన మరికొన్ని సినిమాలకు పాటలు మాత్రమే పాడారు.  ఘంటసాల మాస్టారి విజయా స్వర ప్రస్థానం 'షావుకారు' తో ప్రారంభమై 'సిఐడి'  తో ముగిసింది.

నాకు తెలిసిన ఇద్దరు వర్థమాన సంగీత దర్శకులు. అందులో ఒకాయన ఒకరి దగ్గర సహాయకుడిగా పనిచేస్తూ  అవకాశం దొరికినప్పుడు డబ్బింగ్ సినీమాలు చేస్తూ ఒక స్ట్రైట్ సినీమాకు అవకాశం పొందారు. ఆ సమయంలో శాంతారాంగారి సినీమా ఒకటి విడుదలై పాటలన్నీ సంగీతప్రియులను సమ్మోహనపర్చాయి. ఆ సమయంలో ఒకసారి నేను ఈ నూతన సంగీతదర్శకుడిని అడిగాను ఫలానా శాంతారాంగారి సినీమా చూశారా? పాటలన్ని చాలాబాగా చేశారు కదా! అని. అందుకు ఆయన సమాధానం. 'ఏమో నాయనా ! నేను ఇతరులు చేసిన పాటలు వినడం లేదు. వినను. వాటి ప్రభావం నేను చేసే సినీమా మీద పడే అవకాశం వుంది'.

నా బుర్ర తిరిగిపోయింది. 

మరి ఆయన సహాయకుడిగా పనిచేస్తున్న సినీమా పాటల సంగతేమిటి? అవేవీ చెవినపడకుండానే కంపోజింగ్ లు, రికార్డింగ్ లు జరిగిపోతున్నాయా? 
ఆయన వయసునుబట్టి  నేను ఆమాటను ధైర్యంగా అడగలేకపోయాను.

మరొకాయన ఉండేవాడు. 

తాను చేస్తున్న సినీమాలేవీ లేకపోయినా మూడు కలర్, ఒక స్కోప్, రెండు బ్లాక్ ఎండ్ వైట్ సినీమాలకు సంగీతం చేస్తున్నట్లు చెప్పేవాడు. ఒకరిద్దరు బొంబాయి నిర్మాతలు కూడా లైన్లో వున్నారనేవాడు. అందరితో ఇదే ధోరణి. ఒకసారెవరో ఒక పెద్ద నిర్మాత ఇతనికి సహాయం చేయాలని పిలిపిస్తే ఆయన దగ్గరా ఇలాగే గొప్పలుపోయాడట. మరి ఇంత బిజీ సంగీతదర్శకుడు తనకు వద్దులెమ్మని మరెవరికో తన సినీమా సంగీత దర్శకత్వం అప్పగించాడట. సినీమారంగంలో హిపోక్రసి ఈ లెవెల్ లో వుంటుంది. ఇది ముమ్మాటికి నిజం.

"ఆదివారం పని చెయ్యం. రాత్రి పూట పని చేస్తే డబుల్ రెమ్యునరేషన్ పే చేయాలి" ఈ కండిషన్స్ పెట్టినవారెవరు? 

అప్పుడేం జరిగింది !
వచ్చే వారం చూద్దాము.....
...సశేషం

*With a view to make the narrative more authentic and to corroborate it, images, audio and video clips are attached at appropriate places. If such usage is found objectionable to the copyright holders the same shall be removed if and when notified.

4 comments:

చుండి వేంకట రాజు said...

మీ అనుభవాలు చక్కగా వివరిస్తున్నారు. ధన్యవాదాలండి

P P Swarat said...

Thank you very much.

ameerjan said...

�� రాను రాను మీ జ్ఞాపకాలమాలిక మా జ్ఞాపకాలనూ రిఫ్రెష్ చేస్తోంది స్వరాట్ గారు! డెబ్భైల వద్దకొచ్చేసరికి మీ జ్ఞాపకాల్లోకీ మమ్మల్నీ ఇన్వాల్వ్ చేసేస్తున్నారనిపిస్తోంది. ఆనాటి మధ్యతరగతి పిల్లల చదువులు, కుటుంబ పెద్దల పాట్లు ఎంతో సహజంగా వర్ణిస్తూ కళ్ళకు కట్టేశారు!

�� కులం పేర్లంటూ కురచగా మార్చేసిన రోడ్ల పేర్లు; పామర్తి రామలక్ష్మి గారి పెళ్ళి ముచ్చట్లు; వరుడు కృష్ణప్రసాద్ స్టేట్ బ్యాంకు ఉద్యోగి అనడంతో...బీచ్ రోడ్ లోని SBI మెయిన్ బ్రాంచ్, హెడ్డాఫీస్ మరోసారి మదిలో మెదిలాయి. “పెళ్ళయిన వెంటనే అంతలా మారిపోతారా అనుకునేలా ఆడపిల్లలు అత్తింటి వాతావరణానికి అలవాటు పడిపోతారు. అది సహజం. అవసరం కూడానేమో!” - అప్పటి పరిస్థితుల చక్కటి వివరణ! ఏమో...అంటూ మీరు వ్యక్తపరచినట్లు...ఇప్పుడైతే అలా లేదు... అవసరమూ లేదనుకుంటా!����

�� ఇక పాండవ వనవాసం; సి.ఐ.డి సినిమాల సంగీత ప్రాభవం బహు చక్కగా విశదీకరించడం మాకు భలేగా నచ్చేసింది. మొగలి రేకుల చినవాడా....ఓ వన్నెకాడ...పాటల బాణీల్లో మాస్టారు కనబర్చిన వైవిధ్యం; పద్యాలు, దండకం కూర్చడంలో, పాడడంలో చూపిన ప్రజ్ఞా పాటవాలు అనితరసాధ్యమనిపిస్తూంది. అలాగే ఎపిసోడ్ చివరల్లో “సినిమా రంగంలో హిపోక్రసీ” గురించి చాల బాగా చెప్పారు. ఇన్నిన్ని విషయాలు వారం వారం అందిస్తూన్న మీకు అనేక ధన్యవాదాలు స్వరాట్ గారు! మహాభినందనలు!!����������

P P Swarat said...

మీ అభినందనలకు ధన్యవాదాలు.