visitors

Sunday, December 19, 2021

నెం. 35 , ఉస్మాన్ రోడ్ (ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 2 - అరవైరెండవ భాగం

19.12.2021 - ఆదివారం భాగం - 62:

అధ్యాయం 2  భాగం 61 ఇక్కడ


నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్

విదేశాలలో మన తెలుగు సంగీతాన్ని ప్రచారం చేయాలన్న కాంక్ష అయితే బలంగా ఘంటసాల మాస్టారిలో వున్నా వాటిని సఫలీకృతం చేయడానికి చాలానే కృషిచేయవలసివచ్చింది. తన గాత్ర సంగీతంతో పాటు మన భారతీయ సంగీతాన్ని లైట్ ఎండ్ సౌండ్ ఎఫెక్ట్స్ తో బ్రహ్మాండమైన  వాద్య సంగీత రూపకాలుగా ప్రదర్శించాలని ఘంటసాల తపించారు. పాతికమంది బృందంతో  ప్రపంచమంతా పర్యటించాలనేది వారి చిరకాల వాంఛ. అయితే అందుకు కావలసిన ఆర్థిక వనరులు సమకూర్చుకోవడం అంత సులభంకాలేదు.   కేంద్ర, రాష్ట్ర పభుత్వాల తరఫునుండి ఇంత పెద్ద  సాంస్కృతిక బృందాన్ని విదేశాలకు పంపడానికి తమ సుముఖత కనపర్చలేకపోయింది.  విదేశాలలోని స్థానిక సాంస్కృతిక సంస్థలు చొరవ తీసుకుంటే ఈ సత్కార్యం సానుకూల పడుతుందని అందరూ సలహా ఇచ్చారు. USEFI/కెనెడియన్ ఫౌండేషన్ రీజనల్ డైరెక్టర్  గా పనిచేసిన డా.డి.ఎన్.రావు తన వ్యక్తిగత హోదాలో అమెరికాలోని సాంస్కృతిక సంస్థలకు, మిత్రులకు ఉత్తరాలు వ్రాసారు. కొందరు సానుకూలంగా స్పందించారు. అలాటి పరిస్థితులలో వెస్ట్ జర్మనిలోని గొటింజెన్ లో కచేరీ జరపడానికి ఆహ్వానం వచ్చింది. అలాగే నార్త్ అమెరికా లోని భారతీయ సాంస్కృతిక సంఘాలవారు యునైటెడ్ స్టేట్స్, కెనడాలలో సంగీత కచేరీలు ఏర్పాటు చేయడానికి అంగీకరించారు.

పాతిక మంది బృందం అనుకున్నది పదిమందికే పరిమితమయింది. వీరందరి రానుపోను టిక్కెట్లు, విదేశాలకు తగిన దుస్తులు, వారు మద్రాసులో లేనప్పుడు వారి కుటుంబాల జీవనభృతి, ఇత్యాది అనేక ఖర్చులకు కావలసిన ధనం ఎవరిస్తారు? ఎలా సమకూర్చాలనేది ప్రధాన సమస్యగా మారింది. 

ఈ విషయం ప్రజలలోకి వెళ్ళింది. ముందుగా నెల్లూరు జిల్లా ప్రముఖులు ఘంటసాలవారి విదేశీ పర్యటనకు తగు ఆర్థిక సహాయం చేస్తామని ఘంటసాల మాస్టారిని నెల్లూరుకు ఆహ్వానించి నెల్లూరు జిల్లా పరిషత్ ఆధ్వరంలో ఒక బ్రహ్మాండమైన సన్మాన సభ ఏర్పాటు చేసారు. స్థానిక ప్రముఖులు శ్రీ ఆనం సంజీవరెడ్డి, శ్రీ రేబాల లక్ష్మీనరసారెడ్డిగార్ల చేతుల మీదుగా ఘంటసాలవారికి పదివేల రూపాయలను బహుకరించి ఘంటసాల విదేశ సంగీతయాత్ర దిగ్విజయం కావాలాని అభినందనలు తెలియజేసారు. ఈ శుభపరిణామంతో మద్రాసులోని సినీవర్గాలు కూడా ముందుకు వచ్చాయి. అగ్రనటులైన ఎన్.టి.రామారావుగారు, అక్కినేని నాగేశ్వరరావుగారు, భానుమతిగారు వంటి ప్రముఖ నటులు కొందరు ధన సహాయం చేసారు. అనేక మంది నిర్మాతలు తమ చిత్రాలలో పాడబోయే పాటల పారితోషకాన్ని ఎడ్వాన్స్ గా ఇచ్చి ఆదుకున్నారు.  ఈవిధంగా అనేక రూపాలలో ధనసేకరణ చేసి, మిగిలిన ఖర్చులన్నీ తన సొంత నిధులనుండి ఉపయోగించాలనే దృఢ నిశ్చయానికి వచ్చారు ఘంటసాలవారు.

ఘంటసాల మాస్టారి విదేశీ పర్యటన 1971 అక్టోబర్ 7వ తేదీ ఉదయం ప్రారంభమై 1971 నవంబర్  6వ తేదీ మధ్యాహ్నానికి ముగిసింది. మొత్తం నాలుగు వారాల పర్యటన. ఘంటసాల మాస్టారు తన విదేశీ సంగీత జైత్రయాత్ర కోసం వాద్యబృంద కళాకారులుగా సౌత్ ఇండియన్ సినీ రంగంలోని ఏస్ మ్యుజిషియన్స్ నే ఎన్నుకున్నారు.  వారు - సర్వశ్రీ - మిట్టా జనార్దన్-సితార్, నంజప్ప-ఫ్లూట్, పి.సంగీతరావు-హర్మోనియం, షేక్ సుభాన్-క్లారినెట్, వి.ఎల్.ప్రసాద్-మృదంగం/డోల్కి, పాల్ జడ్సన్-తబలా, మురుగేష్-ఘటసింగారి/ఇతర తాళ వాద్యాలు.

మురుగేశన్, సంగీతరావు, నరసింగ, ఘంటసాల సావిత్రి, ఘంటసాల, సుభాన్, జడ్సన్, జనార్దన్, ప్రసాద్, నంజప్ప, 'ఎమెస్కో కృష్ణమూర్తి

ఈ సప్తస్వరాలతో పాటు  తన మిమిక్రీతో ప్రేక్షకులను రంజిపజేయడానికి శ్రీ నేరెళ్ళ వేణూ మాధవ్ ను కూడా తన బృందంలో చేర్చారు ఘంటసాల. వీరందరికీ అన్నివిధాలా సహాయ సహకారాలందించే బృంద నాయకుడి భాధ్యతలను శ్రీ  'ఎమెస్కో' కృష్ణమూర్తిగారికి అప్పగించారు. 

ఈ నాలుగు వారాల పర్యటనలో వెస్ట్ జర్మని (గొటింజన్), లండన్, న్యూయార్క్, వాషింగ్టన్, లాస్ ఏంజెలిస్, శాన్ ఫ్రాన్సిస్కో, డెట్రాయిట్, చికాగో, టొరెంటో, బోస్టన్, UNO, పారిస్, కువైట్ నగరాలలో ఘంటసాల మాస్టారి సంగీత కచేరీలు జరుగుతాయని నిర్ణయించారు. ఈ విషయాలన్నీ ఘంటసాలవారితో వెళ్ళబోయే బృంద సభ్యులందరికీ తెలియపర్చడం జరిగింది. నెలరోజులపాటు విదేశీ పర్యటన అంటే సామాన్యమా!  అలాటి అవకాశం లభించడమే కష్టం. విదేశీయ ప్రేక్షకుల సమక్షంలో   తమ  కళాప్రతిభను చాటుకోవాలంటే అందరికీ మహదానందమే.  కళాకారులంతా తమ ప్రయాణానికి సంసిధ్ధం కావడం ప్రారంభించారు. 
💐💐

మద్రాస్ వాసులకు రెండే కాలాలు. తొమ్మిది మాసాలు ఎండాకాలం. మూడు మాసాలు అందరి కొంపలు ముంచే వర్షాకాలం. 'వాన రాకడ ప్రాణం పోకడ ఎవరికి తెలియదు' అనే సామెత ఇక్కడివారికి బాగా అనుభవమే. ఆ వర్షాలు ఎప్పుడైనా సైక్లోన్ రూపంలో వచ్చి జనజీవితాలను అతలాకుతలం చేస్తుంది. మిగతా రోజులంతా ఎండలతో ఉక్కపోత వాతావరణం. మద్రాసులో పుట్టిపెరిగిన వారెవరికీ చలి అంటే ఏమిటో తెలియదు. అది అనుభవించాలనుకునేవారు ఏ ఊటీకో, కొడైకెనాల్ కో పనిగట్టుకు వెళ్ళాలి. అందుచేత మద్రాసు వాళ్ళకి చలి దుస్తుల అవసరమేమీ అసలు వుండదు. అందుచేత మాకెవరికీ వులెన్ స్వెట్టర్లు, ఓవర్ కోట్లు, మఫ్లర్స్ వంటివి లేవు. ఇప్పుడదే మా నాన్నగారికి సమస్య అయింది. ఆయనకు మొదటి నుండీ అంటే విజయనగరం వచ్చినప్పటినుండీ బెంగాలీబాబుల్లా తెల్లటి పైజమా, జుబ్బాలే అలవాటు. ఇప్పుడు ఈ విదేశీ ప్రయాణం లో కొన్ని దేశాలలో అక్టోబర్/నవంబర్ ల నాటికి బాగా చలివుండే అవకాశం వుందని అందుకు తగ్గట్టుగా అందరూ కోట్లు, సూట్లు, చలి దుస్తులతో  ప్రయాణానికి సిధ్ధంగా వుండమని బృంద కళాకారులందరికీ ఆదేశాలు అందాయి. మా నాన్నగారికిదో కొత్త బెడద. మూలిగే నక్కమీద తాటిపండు. అలవాటు లేని ఔపాసన. ఈనాడు కొత్తగా పాంట్, షర్ట్ లు, సూట్లు ధరించడం, ముఖ్యంగా వాటిని సంపాదించడమే సమస్య. కొత్తవి కొనాలంటే వందలో, వేలో ఖర్చుపెట్టాలి. ఈ విదేశీయానం తర్వాత వాటి అవసరమే వుండదు. మూలన పడేయాల్సిందే. తరచూ విదేశాలలో తిరిగేవాళ్ళకు తప్పదు. ఎప్పుడో పున్నమికో, అమావాస్యకో వెళ్ళేవాళ్ళకు ఈ జంఝాటం అవసరమా? ఈ సమస్యను ఎలా సానుకూలపర్చడమా అనే ఆలోచనలో పడ్డారు మా నాన్నగారు.

అలాటి సమయంలో ఒకరోజు నాన్నగారి మిత్రుడు మధురకవి శ్యామలరావుగారు మా ఇంటికి వచ్చారు.  అప్పట్లో ఆయన ONGC లో జియోఫిజిస్ట్ గా పనిచేసేవారు. శ్యామలరావుగారితో మా పరిచయం మా నాన్నగారి మరో స్నేహితుడు ఆయపిళ్ళ రామారావుగారి ద్వారా జరిగిన గుర్తు. రామారావుగారు మద్రాసు శివార్లలో ఉన్న తిరువెట్రియూర్ (ఇప్పుడు సిటీలో కలసిపోయింది)లో వుండిన మద్రాస్ షీట్ గ్లాస్ ఫ్యాక్టరీలో మేనేజర్ గా పనిచేసేవారు. ఆయన మా నాన్నగారిని ఒకరోజు శ్యామలరావు గారింటికి తీసుకువెళ్ళేవారు. అప్పుడు ఆయన ఎగ్మూర్ ప్రాంతం పుదుప్పేటలో ఒక బజార్ వీధిలో ఒక మేడమీద పోర్షన్ లో అద్దెకు దిగారు. మద్రాస్ కు కొత్తగా వచ్చారు. భార్య, ఇద్దరు చిన్న పిల్లలతో కాపురం. ఆయపిళ్ళ రామారావు గారు, శ్యామలరావుగారు ఇద్దరూ మా ప్రాంతంవారే. స్వశాఖీయులే. శ్యామలరావు గారి తండ్రి బొబ్బిలి-విజయనగరం  లైన్లో వుండే కోమటిపల్లి అనే అతి చిన్న రైల్వేస్టేషన్ లో స్టేషన్ మాస్టర్ గా పనిచేసేవారని ఆయన తనకు తెలుసని మా నాన్నగారు చెపుతూండేవారు. ఆ రోజుల్లో ఆ లైన్ లో ఒక్క విశాఖపట్నం - రాయపూర్ ప్యాసెంజర్ రైలు మాత్రమే తిరిగేది. ఇప్పుడంటే అనేకమైన ఎక్స్ ప్రెస్ రైళ్ళు వచ్చాయి. ONGC వారు కావేరీ బేసిన్ లో ఎస్కవేషన్స్ మొదలెట్టిన సమయంలో శ్యామలరావుగారు ట్రాన్స్ఫర్ మీద  మద్రాసు వచ్చారు. ఆయన నెలలో ఇరవై రోజులు కాంప్ ల్లోనే వుండేవారు. ఆయన ఒక్క సౌత్ లోనే కాక హిమాలయ ప్రాంతాలలోని డెహ్రాడూన్ లో క్యాంప్ ల్లో చిన్న చిన్న టెంట్లలో తమ కార్యకలాపాలు సాగించేవారు. భార్య, ఇద్దరు పసి పిల్లలు మెడ్రాస్ లో వుండేవారు. వారెవరికి అప్పట్లో అరవ భాష రాదు. చాలా ఇబ్బందిపడేవారు. శ్యామలరావు గారు మా నాన్నగారిని అప్పుడప్పుడు వచ్చి తన కుటుంబాన్ని గమనించమని కోరారు. మా నాన్నగారు ఆ భాధ్యతను నాకు అప్పగించారు. నేను  అప్పుడప్పుడు శని ఆదివారాలలో పుదుప్పేటలో వారికి తోడుగా ఉండేవాడిని.  అప్పటినుండీ శ్యామలరావుగారితో మంచి స్నేహం పెరిగింది. శ్యామలరావుగారిలో ఒక మంచి రోల్ మోడల్ కు కావలసిన లక్షణాలన్నీ పుష్కలంగా వున్నాయి. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన ఒక్క జియోఫిసిస్ట్ మాత్రమే కాదు. వంటలు, కుట్లు, అల్లికలు, చిత్రలేఖనం వంటి అనేక కళలలో కూడా నైపుణ్యం సంపాదించారు. క్యాంప్ లలో వున్నప్పుడు ఏ మాత్రం ఖాళీ దొరికిన ప్రతి వస్తువుతో ఏదో రకమైన బొమ్మలు చేసేవారు.

 


హిమాలయాలలో దొరికే రాళ్ళతో, తాటి టెంకలతో, పూసలతో, మిగిలిపోయిన సబ్బుబిళ్ళలతో రకరకాల వస్తువులు తయారు చేసి మాలాటి వారికి బహుకరించేవారు. ఆయన వేసిన అసంఖ్యాకమైన ఆయిల్ పెయింటింగ్ లు వారింటి గోడలను అలంకరించి వుంటాయి. శ్యామలరావుగారు ONGCలో డైరెక్టర్ హోదా వరకు వెళ్ళినా కూడా ఈ హ్యాండీక్రాప్ట్స్ తయారు చేయడం, పెయింటింగ్ చేయడం మానలేదు. ఆయన ఇల్లు ఒక చిన్న మ్యూజియంలా వుంటుంది. శ్యామలరావుగారు రేకీ లో గ్రాండ్ మాస్టర్. రేకి థెరపితో అనేకమందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా చికిత్సలు చేస్తూవుంటారు. అలా శ్యామలరావుగారి సలహాలు పొందినవారిలో ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.పి.శైలజ వంటి మద్రాస్ పుర ప్రముఖులెందరో వున్నారు. ఈ రేకీ విద్యకు సంబంధించిన అనేక వ్యాసాలను ఆయన "ఋషిపీఠం" పత్రికలో వ్రాసేవారు. ఇప్పటికీ, ఎనభై ఐదేళ్ళ వయసులో కూడా ఈ కళలను ఎంతో  ఉత్సాహం గా కొనసాగిస్తున్నారు. అప్పటికి శ్యామలరావుగారు రెండిళ్ళు మారారు. పుదుపేట నుండి మహాలింగపురంలో రాజుబాబు ఇంటి పక్కింటిలో ఉన్న రోజుల్లోనే మా నాన్నగారి అమెరికా ప్రయాణం. ఈ విషయం తెలిసి మా నాన్నగారిని అభినందించడానికి మా ఇంటికి వచ్చారు. మాటల సందర్భంలో మా నాన్నగారు తన చలి దుస్తుల సమస్య గురించి శ్యామలరావుగారికి చెప్పడం జరిగింది. ఆయన వెంటనే, తన దగ్గర చాలా రకాల శీతాకాలపు దుస్తులున్నాయని వాటిలో కొన్నిటిని ఇస్తానని వాటిని అవసరం మేరకు టైలర్ దగ్గర ఆల్టర్ చేయించుకోమని కొన్ని వులెన్ పాంట్లు, ఫుల్ హ్యాండ్ షర్ట్ లు, స్వెట్టర్లు, ఒవర్ కోటు, ఇత్యాదులు చాలా ఇచ్చారు. వాటిని మా కేశవన్ టైలర్ మా నాన్నగారి సైజ్ కు తగినట్లుగా ఆల్టర్ చేసి ఇచ్చాడు. మానాన్నగారికి ఒక పెద్ద బెడద వదిలింది. శ్యామలరావుగారు ఆ రోజు ఆపధ్బాంధవుడిలా వచ్చి ఆదుకున్నారు.  1971లో అలా ఉపయోగించిన ఆ డ్రెస్ లు తర్వాత ఓ పుష్కరం తర్వాత  కూచిపూడి బృందంతో వరసగా మొదలైన విదేశపర్యటనలో కూడా ఉపయోగించిన గుర్తు. అందులో ఒకటి రెండు  BCIC  ఉత్సవాలకోసం వెళ్ళినప్పుడు ఢిల్లీ  చలిని తట్టుకోడానికి నాకు కూడా ఉపయోగపడ్డాయి. పదేళ్ళ క్రితం వరకు ఆ ఓవర్ కోట్ నా దగ్గర వుండేది.

💐💐


అక్టోబర్ 7, 1971 ఘంటసాలవారి జీవితంలో మరపురాని మధురఘట్టం. అన్ని అడ్డంకులను తొలగించుకొని తన చిరకాల వాంఛను సఫలీకృతం చేసుకోబోతున్న రోజు. ఆ రోజు ఉదయం తన బృందంతో విదేశీ పర్యటన ప్రారంభించడానికి ఘంటసాల మాస్టారు విమానాశ్రయానికి బయల్దేరారు. వారికి వీడ్కోలు చెప్పడానికి కుటుంబ సభ్యులంతా ఉత్సాహంగా ఎయిర్ పోర్ట్ కు తరలివెళ్ళారు.

తర్వాత...వచ్చే వారమే...

                     ...సశేషం

2 comments:

మహేష్ బాబు సంబటూరి వెంకట said...

ఈ నాటి సంచికలో ఘంటసాల మాస్టారు గారి చిరకాల వాంఛ (విదేశాల్లో తెలుగు సంగీతాన్ని ప్రాచుర్యం లోకి తేవడం) తీర్చుకునే క్రమంలో ఎదురైన పరిణామాలు.... పూజ్యులు మీ నాన్న గారికి ఎదురైన ఉన్ని బట్టలు సమకూర్చుకునే సమస్య & ఈ విషయం లో శ్యామల రావు గారు చేసిన సహాయం ఇత్యాది అంశాలన్నీ చాలా ఆసక్తికరంగా కళ్ళకు కట్టినట్లు వర్ణించారు..... మరెన్నో ఆసక్తికరమైన విషయాల కోసం వచ్చే వారం సంచిక కోసం నిరీక్షిస్తూ ఉంటాను బాబాయ్ గారూ😊👌👌👌👌👏👏👏👏😊....

ఇంత ఓపికగా మీ జ్ఞాపకాలను మాతో పంచుకుంటున్నందుకు మీకు హార్ధిక శతకోటి ధన్యవాదపూర్వక కృతజ్ఞతాభివందనాలు🙏🙏💐💐😊😊

చుండి వేంకట రాజు said...

చాలా ఓపికగా ఘంటసాల గారి జీవిత విశేషాలు వివరిస్తున్నందుకు ధన్యవాదాలండి