visitors

Sunday, January 23, 2022

నెం. 35 , ఉస్మాన్ రోడ్ (ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 2 - అరవై ఐదవ భాగం

23.01.2022 - ఆదివారం భాగం - 65*:
అధ్యాయం 2 భాగం 64 ఇక్కడ

  

నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్

1970లో ఘంటసాలవారికి భారత ప్రభుత్వం 'పద్మశ్రీ' బిరుదుప్రదానం చేసింది. ఆ మరుసటి నెల ప్రారంభంలోనే ఆయన సినీ జీవిత రజతోత్సవం సినీమా ప్రముఖుల, రాజకీయ నేతల సమ్మేళనంతో హైదరాబాద్ లో అతివైభవంగా జరిగింది. ఆ మరుసటి సంవత్సరం అదే హైదరాబాద్ లో సుప్రసిధ్ధ హిందీ నేపధ్యగాయని లతామంగేష్కర్ ఆధ్వర్యంలో ఘంటసాలవారి సంగీత కచేరీ, వారికి ఘన సన్మానం జరిగింది. తన తండ్రిగారి పేరు మీద ఏర్పాటు చేసిన ప్రతిష్టాత్మక 'దీనానాధ్ మంగేష్కర్' పురస్కారాన్ని ఘంటసాలవారికి ఇచ్చారు. ఆ సందర్భంగా లతామంగేష్కర్ తాను గానం చేసిన 'భగవద్గీత' ఎల్.పి.రికార్డులను ఘంటసాల మాస్టారికి బహుకరించారు. ప్రపంచ ప్రఖ్యాతి పొందిన గాయని చేతుల మీదుగా ఒక ఉత్తమ పురస్కారం అందుకోవడం ఘంటసాలవారికి చాలా ఆనందం కలిగించింది.

లతామంగేష్కర్ భగవద్గీత ఘంటసాల మాస్టారి మరో నూతన ఆశయానికి బీజం వేసింది. 1972 వచ్చేసరికి తెలుగు సినిమా రంగంలో అనేక మార్పులు వచ్చాయి కొత్త కొత్త నటీనటులు రాసాగారు. నూతన సంగీత దర్శకులు అవకాశాలు పొందసాగారు. సాంకేతికంగా కూడా మార్పులు చోటుచేసుకోవడం ప్రారంభమయింది. కలర్ సినిమాలు ఎక్కువైనాయి. చిత్రనిర్మాణం అధికమయింది. ఈ రకమైన నూతన పరిణామాలు సంగీత రంగంలోనూ కనిపించాయి.  సంగీత సరళి మారుతూ వచ్చింది. మల్టీ ఛానల్ రికార్డింగ్ సిస్టమ్ వచ్చింది. దానితో లైవ్ రికార్డింగ్ తో పాటూ ట్రాక్ మిక్సింగ్ సౌకర్యాలు ఎక్కవయాయి.  ట్రాక్ సింగర్స్ కు కొత్త జీవనోపాధి కలిగింది. ఆర్కెస్ట్రేషన్ లో కూడా ధ్వని ప్రధాన వాద్య పరికరాల ప్రాముఖ్యత పెరిగింది.

1972లో ఓ 25 సినీమాలలో ఘంటసాల మాస్టారు దాదాపు నూరు పాటలు, పద్యాలు పాడారు.  వాటిలో ముఖ్యమైనవి - భార్యాబిడ్డలు, సంపూర్ణ రామాయణం, వంశోవధ్ధారకుడు, మంచోరోజులొచ్చాయి, శ్రీకృష్ణాంజనేయ యుధ్ధం, దత్తపుత్రుడు, మేనకోడలు, పండంటి కాపురం, విచిత్రబంధం, కులగౌరవం, బడిపంతులు, కాలంమారింది, బాలభారతం, కొడుకు కోడలు, వంటి చిత్రాలలో పాడిన పాటలు ఘంటసాలవారికి మంచి పేరునే తెచ్చిపెట్టాయి. ఈ నాటీకీ ఆ పాటలు ప్రచారంలోనే వున్నాయి. 

ఆ సంవత్సరంలో ఘంటసాల మాస్టారి సంగీత దర్శకత్వంలో వచ్చిన చిత్రాలు  రెండు. అవి - వంశోధ్ధారకుడు, మేనకోడలు, మొదటి చిత్రంలో శోభన్ బాబు , రెండవచిత్రం లో కృష్ణ హీరోలు. వంశోధ్ధారకుడు సినీమా మాధవీ ప్రొడక్షన్ ఆంజనేయులుగారిది. ఈ చిత్రంలోని 'నువ్వు నవ్వు జతగా', 'నానీ నా పేరును నిలపాలి' పాటలు అందరినోటా వినిపించాయి.

నానీ నా పేరును నిలపాలి - వంశోద్ధారకుడు

ఈ 'నానీ నా పేరును నిలపాలి' పాటను తననుద్దేశించే పాడినట్లుగా భావించుకుంటూ ఘంటసాలవారి రెండవ కుమారుడు ఘంటసాల రత్నకుమార్ తన ప్రతీ సంగీత కార్యక్రమంలో ఈ పాటను పాడుతూ తండ్రిగారిని గుర్తుచేసుకునేవాడు. ఘంటసాలగారు మాధవీ ప్రొడక్షన్స్ కు చేసిన ఆఖరి చిత్రం ఇదే. 

మేనకోడలు చిత్రంలో దాశరధి వ్రాసిన ' 'తిరుమల మందిర సుందరా' పాట ఘంటసాలవారికి గాయకుడిగా , సంగీతదర్శకుడిగా మంచిపేరునే తెచ్చిపెట్టింది. సినీమాలో ఈ పాటను సుశీలగారు పాడగా జమున మీద చిత్రీకరించారు. 

తిరుమల మందిర సుందరా - మేనకోడలు

తిరుపతి వెంకటేశ్వరుడికి సంబంధించిన గీతం కావడం వలన ఇదే పాటను ఘంటసాలగారు కూడా పాడేందుకు ఆసక్తి చూపారు. ఆ పాటను సినీమాతో సంబంధం లేకుండా  రికార్డు చేసి విడుదల చేసారు. ఈనాటికీ ఆ  రెండు పాటలు  అందరూ పాడుతూనే వున్నారు. 1960లకు ముందెప్పుడో పాడిన 'ఏడుకొండల సామీ ఎక్కాడున్నావయ్యా' మొదలుకొని 'తిరుమల మందిర సుందరా' వరకు తిరుపతి వేంకటేశ్వరుని మీద ఘంటసాల వెంకటేశ్వరుడి గానాభిషేకం కొనసాగుతూనే వచ్చింది.  నాటి నుండి నేటివరకూ ఆ భక్తి సంగీతామృతంతో తెలుగు శ్రోతలంతా పరవశత్వం చెందుతూనే వున్నారు.

సుప్రసిధ్ధ దర్శకుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి దాసరి నారాయణ రావు గారు, ఘంటసాలగారు కలసి పనిచేసిన ఏకైక చిత్రం మేనకోడలు. దాసరి నారాయణరావుగారు ఈ చిత్రానికి సహాయ దర్శకుడు. డైరెక్టర్ బి.ఎస్.నారాయణగారికి అసిస్టెంట్. ఆ హోదాలో ఆయన పాటల కంపోజింగ్ సమయంలో మాస్టారిని కలసి సన్నివేశాల గురించి క్షుణంగా వివరించేవారు. దాసరి కథ, సన్నివేశం చెప్పే తీరుకు, అత్యుత్సాహానికి ఘంటసాలవారు ముచ్చటపడి ఆసక్తిగా వినేవారు.   ఈ సినీమా విడుదలకు ముందే దాసరి దర్శకత్వంలో 'తాతా మనవడు' చిత్రం విడుదలై ఘనవిజయం సాధించింది. రాజబాబును హీరోను చేసింది. ఈ రెండు సినీమాలు 1972 లోనే రిలీజ్ అయాయి. మేనకోడలు తర్వాత దాసరి నారాయణరావు, ఘంటసాల కలయిక లో మరే సినీమా రాలేదనే అనుకుంటున్నాను.

1972 లో రిలీజైన వంశోధ్ధారకుడు, మేనకోడలు చిత్రాల తర్వాత ఘంటసాల మాస్టారి చేతిలో రామవిజేతా వారి 'రామరాజ్యం' తప్ప వేరే సినీమాలు లేవు. గౌతమీ రామబ్రహ్మంగారు, లలితా శివజ్యోతి శంకరరెడ్డిగారు, టి.గోపాలకృష్ణగారి సినీమాలు రావచ్చని అనుకునేవారు. 

గౌతమీ రామబ్రహ్మంగారు ఆలీబాబా 40 దొంగలు చిత్రం తర్వాత ఒక క్రైమ్ సబ్జెక్ట్ మొదలెట్టారు. కారణాలేమిటో నాకు తెలియవు కానీ, ఆ సినిమాకు సంగీత దర్శకుడిగా సత్యంగారిని నియమించుకున్నారు. ఎవరు ఎవరిని సంగీతానికి పెట్టుకున్నా, ఆయనే వద్దంటే తప్ప, పాటలు పాడించుకోవడానికి ఘంటసాల మాస్టారి వద్దకే రావాలి.  ఆనాటికి నూతనగాయకుల ఉనికి అంతంతమాత్రంగానే వుండేది.

ఘంటసాలవారు సంగీత దర్శకత్వం చేయకపోతే ఇబ్బందులపాలయేది మా నాన్నగారిలాటి ఒకరిద్దరు మాత్రమే.

టి.గోపాలకృష్ణగారు 'వస్తాడే మా బావ' చిత్రానికి ప్రారంభోత్సవం చేసి మాస్టారి చేత కంపోజింగ్ మొదలెట్టారు. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు వ్రాసిన పాట 'వాగూ ఓ కొండ వాగూ' అనే పి.సుశీలగారితో పాడిన  యుగళగీతం మాత్రం మాస్టారు రికార్డు చేసారు. తర్వాత నిర్మాణ కార్యక్రమాలు అంత చురుకుగా సాగలేదు. 

వాగు ఓ కొండవాగు - వస్తాడే మా బావ

రహస్యం' అపజయం తర్వాత మరో సినీమా మొదలెట్టడానికి శంకరరెడ్డి గారికి మరో ఐదేళ్ళు పట్టింది. ఆయన సినీమాలన్ని భారీగా పంచవర్ష ప్రణాళికలా తాపీగా సాగుతాయి. ఈసారి ఆయన ఒక పౌరాణిక వర్ణచిత్రం మొదలెట్టారు. అదే 'సతీ సావిత్రి' . విభిన్న తరహా పాత్రలంటే మోజుపడే ఎన్.టి.ఆర్ ఈ చిత్రంలో యమధర్మరాజు. వాణిశ్రీ, సావిత్రిగా, కృష్ణంరాజు సత్యవంతుడిగా నటిస్తారని తెలిసింది. ఘంటసాల మాస్టారే సంగీతం. అయితే ఈ సినీమాలలోని పాటలేవీ వెంటవెంటనే రికార్డ్ చేయబడలేదు. మధ్యమధ్యలో మాస్టారికి సైనస్ కారణంగా చిన్న చిన్న అనారోగ్యాల వలన  ఎప్పుడు  ఏ పనులుంటాయో తెలియని స్థితి ఏర్పడింది. సతీ సావిత్రి సినిమా కోసం ఓ రెండు పాటలను ఒక శ్లోకాన్ని ఘంటసాలమాస్టారు కంపోజ్ చేసివుంచారు. బయటవూళ్ళ కచేరీలు కూడా ఏవీ వుండేవి కావు. 

ఇటువంటి ఇబ్బందికర సమయంలో మా నాన్నగారు జీవనోపాధికి మార్గాలు ఇతరత్రా, ఘంటసాలవారి అనుమతితోనే, అన్వేషించక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఢిల్లీలో జరిగే తమ కూచిపూడి నాట్య కార్యక్రమంలో పాడడానికి  రమ్మని డా.వెంపటి చిన సత్యం కోరారు. అప్పటికి రికార్డింగ్ పనులేవి లేక,  ఆయన మాటను కాదనలేక  వారి బృందంతో ఢిల్లీ వెళ్ళి మొదటిసారిగా నృత్యకార్యక్రమంలో పాడారు. ఘంటసాలవారి దగ్గర సహాయకుడిగా చేరిన తర్వాత ఇతరుల వద్ద పనిచేయడం అదే మొదటిసారి. మా నాన్నగారు ఢిల్లీ వెళ్ళి వచ్చేసరికి 'సతీ సావిత్రి' కోసం కంపోజ్ చేసిన పాట 'ఓం నాదబిందు కళాధరీ' పాట ' శ్రీవాగ్దేవీ మహాకాళీ' శ్లోకం  రికార్డింగ్ పూర్తి అయపోయింది. 

నాద బిందు కళాధరీ - సతీ సావిత్రి

ఆ రికార్డింగ్ లలో పాల్గొనే అవకాశం మా నాన్నగారు కోల్పోయారు. ఆ తర్వాత ఆ సినీమా నిర్మాణ కార్యక్రమాలు మూలబడ్డాయి. 

ఈ సందర్భాన్ని అవకాశంగా తీసుకొని తాను చేయాలనుకున్న బృహత్ ప్రణాళిక గురించి ఘంటసాల మాస్టారు తీవ్రంగా ఆలోచించడం మొదలెట్టారు.

ఆ విశేషాలేమిటో వచ్చే వారం చూద్దాము ... 
                                ...సశేషం

5 comments:

చుండి వేంకట రాజు said...

అమరగాయకుడు ఘంటసాల గారి మధురస్మృతులు చాలా ఓపికగా వివరిస్తున్నందుకు ధన్యవాదాలండి

P P Swarat said...

మీకు నా ధన్యవాదాలు.

Anonymous said...

మేనకోడలు,వంశోద్ధారకుడు విజయం సాధించ లేదు కదా sir. మీ వివరాలకు ధన్యవాదాలు.

Hrishikesh Sharma said...

1972 లో వచ్చిన రెండు చిత్రాలు విజయం సాధించ లేదు కదా sir.

P P Swarat said...

లేదనుకుంటాను. కొన్ని పాటల రికార్డింగ్ల కు వెళ్ళాను కానీ , ఆ సినిమా లు చూసే అవకాశం రాలేదు.