visitors

Friday, September 4, 2020

నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 1 - పదిహేనవ భాగం

04.09.20 - శుక్రవారం భాగం - 15:
పధ్నాలుగవ భాగం ఇక్కడ


నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్

"శ్రీమతి లీలమ్మ గారికి,
అంటూ తన కృతులను రేడియోలో, కచేరీలలో పాడేందుకు తన అనుమతి పత్రాన్ని ఒక పోస్ట్ కార్డ్ మీద మా తాతగారి తరఫున మా ప్రభూ చిన్నాన్నగారు ముత్యాలకోవ వంటి దస్తూరీతో తన దగ్గరున్న మెరూన్ కలర్ 'రత్నం' పాళీ పెన్ తో వ్రాసి చదివి వినిపించగా, ఆ బరువైన లావుపాటి పెన్ తో మా తాతగారు ఉత్తరం క్రింద 'పట్రాయని శీతారామశాస్త్రి' అని సంతకం చేశారు. 

ఆ తరువాత, ఆ ఉత్తరాన్ని, అప్పటికే సినీమాలలో పాడుతూ మంచి పేరు తెచ్చుకుంటున్న గాయని శ్రీమతి పి.లీల గారి మెడ్రాస్ ఎడ్రస్ కు  మా చిన్నాన్నగారు పోస్ట్ చేశారు. ఆయన  తెల్ల చొక్కాజేబులు చాలా పెద్దవి. అందులో మనీపర్స్, పద్దులపుస్తకం, కాగితాలు, పోస్ట్ కార్డులు‌, పెన్నులు, ఇలా ఎన్ని వస్తువులైనా పట్టేవిగా ఉండేవి. 

నాకు మా తాతగారు తన సంతకాన్ని తప్పుగా పెడుతున్నారనిపించింది. 'సీతారామశాస్త్రి' కి బదులుగా 'శీతారామశాస్త్రి' అని వ్రాయడం  ఒక ఆశ్చర్యం. అయితే, 'శీ' అని వ్రాయడం ఆయన అలవాటని తెలిసింది.

మా తాతగారు, పట్రాయని సీతారామ శాస్త్రిగారు ఒక వాగ్గేయకారుడు. భావప్రాధాన్యమున్న ఎన్నో కృతులు వ్రాశారు. చందోబధ్ధంగా పద్యాలు వ్రాసారు. సంగీత సాహిత్యాలు రెండింటిలోనూ తనదైన బాణీని వినిపించిన శాస్త్రిగారే 'కౌముదీ పరిషత్' కు ఉచితమైన అధ్యక్షుడిగా ఇతర కవులందరిచేత ఎన్నుకోబడి తన జీవితాంతం ఆ పదవిలో కొనసాగారు. ఇంతకూ సీతారామశాస్త్రిగారికి ఏ స్కూల్ చదువులేదు. వారి తాతగారు (తల్లిగారి తండ్రి) ఇసకలో దిద్దించిన ఓనామాలు తప్ప ఎక్కడా ఏ పాఠశాల గడప తొక్కలేదు. 

మా ముందు తరంలోని పెద్దలెవరికీ హైస్కూలు, కాలేజీ సర్టిఫికెట్లు లేవు. అందువలన వారందరూ పూర్తిగా తమ సంగీతాన్నే నమ్ముకొని జీవించవలసివచ్చింది. చదువుకు సంబంధించిన సర్టిఫికెట్ లేని కారణంగా మా తాతగారికి రావలసిన మ్యూజిక్ కాలేజీ ప్రిన్సిపాల్ పదవి రాలేదు. ఆ పదవి దక్కకపోవడానికి గల అనేక కారణాలలో ఇది కూడా ఒక కారణంగానే ఒప్పుకోవాలి. కారణాలేవైనా ఉద్యోగ విరమణానంతరం రావలసిన పెన్షనూ రాలేదు. 

పూర్వజన్మ సుకృతం, స్వయంకృషి సీతారామ శాస్త్రిగారిని ఒక ఉన్నత వాగ్గేయకారుడిని చేసింది. ఒక విలక్షణ వ్యక్తిగా నిలబెట్టింది. సర్వశ్రీ - పంతుల లక్ష్మీనారాయణ శాస్త్రి, క్రొవ్విడి రామం, క్రొవ్విడి లక్ష్మణ్, నల్లాన్ చక్రవర్తుల సోదరులు, భళ్ళమూడి నరసింహం, ఆకుండి వెంకటశాస్త్రి, బుర్రా శేషగిరి రావు, జీవన ప్రభాత వంటి లబ్ధప్రతిష్టులైన సాహితీవేత్తలతో పాటు మా తాతగారి శిష్యులందరూ, ఘంటసాల సహా, కౌముదీ పరిషత్ సభ్యులే. మా నాన్నగారి ముఖ్యస్నేహితులు జీవన ప్రభాత, పంతుల శ్రీరామశాస్త్రి, భట్టిప్రోలు కృష్ణమూర్తి, మంథా వెంకట రమణారావు. వీరంతా కౌముదీ పరిషత్ కార్యకలాపాలలో పాల్గొనేవారు. వీరు అప్పటికే రచయితలుగా పేరుపొందివున్నారు. వీరి రచనలు 'భారతి' లో వస్తూండేవి. కౌముదీ పరిషత్  సంస్థ రాజమండ్రిలో కూడా జీవన ప్రభాత ఆధ్వర్యంలో నడిచింది. మా తాతగారి ఆధ్వర్యంలోని 'కౌముదీ పరిషత్', 'భారతీ తీర్థ' (ఆంధ్రా వేదిక్ రీసెర్చ్ యూనివర్సిటీ)కు అనుబంధ సంస్థగా మారి కవి, గాయక, పండితుల సమ్మేళనంతో ఒక ప్రముఖ వేదికగా అందరి మన్ననలు పొందింది. తరుచూ, సంగీత, సాహిత్య గోష్టులు జరిపేవారు. 

పండగలు పబ్బాలు వస్తే విజయనగరం సంగీత, సాహిత్యగోష్టులతోనే కాదు, పేకాటలతోనూ హోరెత్తేది. మా నాన్నగారి సాహితీ మిత్రబృందం అంతా ఒరిస్సాలోని రాయగఢా, జయపూర్ రూర్కెలా ఇతర ప్రాంతాలనుంచి వచ్చి  కౌముదీ పరిషత్ సభలలో పాల్గొనడంతో పాటు మా ఇంట్లో నిర్విరామ చతుర్ముఖ పారాయణం నిర్వహించేవారు. నిరంతర శ్వేతకాష్టాల ధూపం ఇంట్లో ఆడవాళ్ళను ఇబ్బంది పెట్టేది. 'ఇస్తోకు రాణి' అనే మాట  వాళ్ళ ఆటలో తరుచూ వినపడేది. ఎత్తడం, అడ్డాట, నేషనల్ బ్రిడ్జ్, మూడు ముక్కలాట వంటి పేర్లు అప్పుడే తెలిసింది. రాత్రుళ్ళు హరికేన్ లాంతర్ వెలుగులోనే పేకాడడం గుర్తు. పిల్లల కోసం చిన్న సైజ్ పేకదస్తాలు వుండేవి. వాటితో 'తరగనితంపి' అనే ఆటను  పిల్లలం ఆడేవాళ్ళం. వీరందరి భోజనాలు, బసలు మా ఇంట్లోనే. సందట్లో సందడిగా చామలాపల్లి, డొంకాడ , భీమవరం, పెంట, గుడివాడ, బొబ్బిలి ప్రాంతాల నుండి  వచ్చి పోయే బంధువుల రాకపోకలతో పండుగలు, వేసవి శెలవుల హడావుడి అంతా మా ఇంట్లోనే కనిపించేది.

మా తాతగారికి దిన పత్రికల్లో వచ్చే దినసరి రాశి ఫలాలాను చదివి వాటిని ఆచరించడం ఒక సరదా. 'అమ్మీ! ఇవేళ నా రాశికి ప్రయాణం అని రాశారు. అందుచేత ఒకసారి బొబ్బిలి వెళ్ళి వస్తానని చెప్పి వెళ్ళిపోయి ఆ మర్నాటికి చక్కా తిరిగి వచ్చి దినఫలాలను నిజం చేసేవారు. బొబ్బిలిలో ఆయన తమ్ముడు (పెత్తల్లి కొడుకు) సామవేదుల నరసింహంగారు (బొబ్బిలి కోపరేటివ్ బేంక్ సింహాలుగారు), ఆయన చెల్లెలు అప్పలనరసమ్మగారు, ఆవిడ పెద్దకూతురు చెళ్ళపిళ్ళ వరహాలమ్మ - ఆయన పెద్ద మేనకోడలు, ఆవిడ కూతురు శారద ఉండేవారు. మా అమ్మగారు సామవేదుల నరసింహంగారి రెండో మేనకోడలు. వీళ్ళందరినీ ఒకసారి చూసేసి ఒక రోజుండి విజయనగరం వచ్చేస్తూండేవారు. ఆయన అక్కగారు, మా తాతగారి కూడా అక్కగారే అయిన ఓలేటి వెంకట నరసమ్మగారే విజయనగరంలో ఇంటి కేర్ టేకర్. ఇంటి సంరక్షణ పర్యవేక్షణ ఆవిడదే. ఆవిడనే మా తాతగారు అమ్మీ అని పిలిచేవారు. ఆవిడే మా పెద్దమ్మమ్మ.

అలాగే, చోడవరం. ఆ ఊళ్ళో ఆయనకో  చెక్క భూముండేది. అది పేరుకే సొంతం. దానిని కౌలుకు తీసుకున్నవారెవరో కానీ ఆ భూమి మీద ఏవిధమైన ఆదాయం ఇచ్చేవారు కాదని వినికిడి. ఎప్పుడో ఒకసారి చోడవరం రావడం ఆ వ్యక్తిని చూడడం, అతను చెప్పే తీపి కబుర్లకు లొంగి అయ్యో పాపం! అని జాలిపడి తిరిగిరావడం జరిగేది. బస్సు ఖర్చులు, అలసట తప్ప ఒరిగిందేఁవీఁ లేదు. ఆ విషయం ఆయనకూ తెలుసు. ఆ తరువాత, ఆ చోడవరం భూమి కూడా సంసారం కొసం హరించుకుపోయింది.

నా విజయనగరం చదువు, బ్రాంచ్ కాలేజీకి మారింది. ఫస్ట్ ఫారమ్ లో జాయిన్ చేశారు. కొత్త స్కూలు, కొత్త వాతావరణం,కొత్త టీచర్లు, కొత్త స్నేహితులు. అలవాటు పడేందుకు టైమ్ పట్టింది. ఆ బ్రాంచ్ కాలేజీలో చేరినప్పుడే బాల్ పెన్ తో వ్రాయడం మొదలయింది. నాకు ఒక  రోస్ కలర్ టిప్, రోస్ కలర్ బాటమ్ ఉండే తెల్లటి బాల్ పెన్ కొనిచ్చారు. దానితో రాయడానికి కష్టపడవలసి వచ్చేది. అప్పుడే, మొదటిసారిగా చెప్పులు వేసుకోవడం మొదలయింది. బాటా చెప్పులు. పది రూపాయల లోపే. అంతవరకు ఎలాటి రోడ్లమీదైనా చెప్పుల్లేకుండానే తిరిగేవాడిని. కొత్త చెప్పులు అలవాటులేక వేళ్ళమధ్య కరవడం, దానికి మందు పూయడం ఒక పని. ఆ బ్రాంచ్ కాలేజీ, పొడుగాటి వరండాలతో, పెద్ద పెద్ద గదులతో బాగానే ఉండేది. ఆగస్ట్ 15 కి తరగతి గదులు అందంగా రంగు కాగితాలతో అలంకరించేవారు.  ఫస్ట్ ఫారమ్ తరగతిలోఉన్న పిల్లలందరిని స్క్వాడ్ ల క్రింద విభజించారు. నేను నెహ్రూ స్క్వాడ్. కొందరు గాంధీ స్క్వాడ్. మరికొందరు నేతాజీ స్క్వాడ్. అప్పుడే, మన దేశ నాయకుల ఫోటోలు చూడడం, వారి పేర్లు తెలుసుకోవడం. నేను నెహ్రూ స్క్వాడ్ లో ఉన్నందుకు ఒక నెహ్రూ ఫోటోను తీసుకురావాలని చెప్పారు. మా చిన్నాన్నగారి సాయంతో ఒక పేపర్ లోని ఫోటో కట్ చేసి దానిని అదే సైజ్ అట్టమీద అంటించి మధ్యలో ఒక కన్నంపెట్టి దారంతో కట్టి, ఆ నెహ్రూను మా క్లాస్ లో మేము కూర్చుండే చోట గోడకు మేకు కొట్టి తగిలించాము. ఆ పనులు వేరే పిల్లలు చేసారు. ఈ స్కూలుకు వెళ్ళాక విజయనగరంలో కొత్త వీధుల పేర్లు తెలిసాయి. పాలేపువారి వీధి, బొంకులదిబ్బ,  కానుకుర్తివారి వీధి , గుండాలవారి వీధి , లక్కపందిరివీధి , లంకవీధి, మూడు లాంతర్ల వీధి, గంటస్థంభం, కొత్తపేట వంటి పేర్లు తెలిసాయి. అయితే అవెక్కడున్నాయో ఇప్పటికీ నాకు తెలియదు. అప్పుడే బొడ్డువారి హాలని ఒక సినీమా హాలు తయారయింది. అదే శ్రీరామా టాకీసేమో గుర్తులేదు. (ఆ ధియేటర్ ఓనర్ గారి అమ్మాయి ఓ పుష్కరం తరువాత తిరుపతిలో మెడిసిన్ చేస్తూ మెడ్రాస్ మా ఉస్మాన్ రోడ్ ఇంటి పక్కింటి అరవాళ్ళ మేడమీద అద్దెకుండే తెలుగువారింటికి శెలవుల్లో వచ్చి గడపడం ఓ గొప్ప థ్రిల్లు. 

కృష్ణాహాలులో మా వాళ్ళతో కలసి 'పెళ్ళిచేసి చూడు' వంటి సినీమాలు చాలానే చూశాను. అయితే ఆ హాలులో ఇనప స్థంబాలు ఎక్కువగావుండి సినీమా సరిగా కనపడేదికాదు. అలాగే ఆ సీట్లు కూడా. ముందువాళ్ళ తలలు తప్ప సినీమా కనపడదు. అప్పట్లో చాలా సినీమా హాల్స్ సీట్లు అలాగే ఉండేవి. 

ఒక రోజు స్కూల్ కు వెడుతున్నప్పుడో, వస్తున్నప్పుడో ఒక సైకిల్ వాడు స్పీడ్ గా వచ్చి నన్ను గుద్దేశాడు. కంటి మీద గాయమయింది. తెలిసినవాళ్ళెవరో  ఇంటికి చేర్చారు. తరువాత, సుసర్ల వెంకట్రావుగారి క్లినిక్, గాయానికి మందులు, మాకులు, స్కూలుకు డుమ్మా తప్పనిసరి. అదృష్టం ఏమంటే ఆ సైకిల్ బ్రేక్ రాడ్ ఎడమ కనుబొమ్మమీద గుచ్చుకుంది. అది ఏమాత్రం క్రిందికి తగిలినా ఎడమకన్నే పోయుండేదని డాక్టర్ గారు చెప్పారు. ఆ గాయం మచ్చ చాలా సంవత్సరాలవరకూ అలాగే వుండిపోయింది.

మా చిన్నప్పుడు మా ఇళ్ళలో ఎక్కడా గోడ గడియారాలు, చేతి వాచీలు లేవు. టైమ్ తెలుసుకోవాలంటే మా వీధిలో నాలుగైదు ఇళ్ళ తరువాత ఉండే పెద్దమ్మి - చిన్నమ్మి ఇంట్లో వుండే గోడ గడియారాన్ని బయటనుండే కటకటాల తలుపులుగుండా చూసి వచ్చేవాళ్ళం. ఒకరోజు ఉదయం టైమ్ చూడడానికి వెళుతూండగా ఏదో జరిగింది.  ఎవరో ముందుకు త్రోసినట్లయింది. ఒక వారగా నడుస్తున్న నేను రోడ్ అవతల వేపుకు జరిగిపోయాను. అదెలా జరిగిందో నాకే తెలియదు. ఆ సమయంలో ఏదో చిన్న ఉరుము లాటి శబ్దం వినిపించింది. అది కొద్ది క్షణాలు మాత్రమే. తర్వాత ఏమీ లేదు. ఇంటికి వచ్చాక తెలిసింది భూమి కంపిస్తే అలా జరుగుతుందట. విజయనగర ప్రాంతాలలో చాలాకాలం ముందు భూకంపాలు తరచూ వచ్చేవిట. అందుకు కారణం, హెర్కులిస్ భూమిని మోస్తూ ఒక భుజం మీదనుండి మరో భుజానికి మార్చుకోడమేనట. మా మిత్రబృందం చెప్పింది.

తరువాత, తెలిసిన విషయం ఏమంటే విజయనగరానికి సమీపాన రామతీర్థం అనే ఊరుంది. ఆ వూళ్ళోని కోదండ రామస్వామివారి ఆలయం చాలా పురాతనమైనది, ప్రసిధ్ధిచెందినదీను. ఈ ప్రాంతమంతా కొండలు. అవి ఒకప్పుడు గంధకం కొండలట. వాటిలోని గంధకం  లోపల్లోపల మండడం వలన ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో భూకంపాలు ఏర్పడేవట. ఇదంతా శతాబ్దాలకాలం నాటి మాట. వాటిమీద ఎక్కడా ఒక చెట్టుకానీ, పచ్చని మొక్కకానీ కనపడదు. ఆ ప్రభావం వల్లనే అప్పుడప్పుడు భూమి కంపిస్తుందని అనేవారు.




(రామతీర్థంలో కోదండరామస్వామి కోవెల)

మా ఫ్రెండ్స్ లో రీల్ మాస్టర్లు (సింపుల్ గా కోతలరాయుళ్ళు)‌ ఎక్కువే. విజయనగరం ఊళ్ళోనుండి ఎక్కడనుండి చూసినా ఊరి పొలిమేరల్లో ఉన్న మచ్చకొండ, సూదికొండ కనిపించేవి. ఆ మచ్చకొండ మీద ఏదో పాడుపడిన కట్టడం ఉండేది. అదేమిటో స్పష్టంగా గుర్తులేదు. అలాగే, మచ్చకొండకి మచ్చ ఎలా వచ్చిందంటే, విజయనగరం మహారాజావారు కోటలో నుండి కొండమీదున్న ఒక పక్షిని తన పొడుగాటి తుపాకీతో గురిచూసి కొట్టడంతో ఆ గుండు తాకిడికి పక్షితోపాటూ ఆ కొండ పెళ్ళకూడా రాలి మచ్చపడిందట. ఈ విషయాలు మా స్నేహితులు చెపుతూంటే నోరెళ్ళబెట్టుకొని మహా ఆసక్తిగా వినేవాడిని. విజయనగరం మహారాజావారు ఎంత గొప్పవారో అనిపించేది. 

ఇలాటి విషయాలన్నీ మంత్రిప్రగడ నాగభూషణం నోటమ్మట వినపడేవి. మంత్రిప్రగడ వారింటి పక్కనే మల్లాప్రగడవారు. ఆ ఇంటావిడ మా అమ్మగారి స్నేహితురాలు. ఈ నాగభూషణం చిన్నప్పుడే ముదిరిపోయాడు. అప్పుడు జగ్గయ్య నటించిన 'ప్రియురాలు' అనే సినీమా వచ్చింది. ఆ సినీమాలో హీరో సిగరెట్లు కాలుస్తూంటాడు. ఈ కుర్రాడు ఆ సినీమా చూసొచ్చి అందులో జగ్గయ్యలాగే సిగరెట్ కాలుస్తున్నట్లు నటిస్తూ ఆ డైలాగ్ లతో నటించి చూపేవాడు. అతనంటే ఎందుకో నాకు ఎక్కువ పడేదికాదు. కొంచెం దూరంగానే ఉండేవాడిని.

మా ఇంటి దగ్గరనుండి అయ్యకోనేరు గట్టుకు వెళ్ళాలంటే సుబ్రమణ్యంపేట వీధిలోనుండి తురకల చెరువు మీదుగా వెళ్ళాలి . ఆ వీధిలో అయ్యకోనేరు గట్టుకు ముందు కుడివేపు ఒక పెద్ద తెల్లటి మేడ వుండేది. ఆ ఇంటి వరండాలో పెద్ద పెద్ద డూమ్ లు, రంగురాళ్ళ షాండ్లియర్లు వుండేవి. ఆ ఇంట్లో ఎవరో పట్నాయక్ ఉండేవారు.  రంగురాళ్ళు సేకరించడం ఓ సరదా. మా పక్క వీధిలో ఒకరింట్లో అలాటి రాళ్ళను  మా యింట్లోని వారపత్రికలు ఇచ్చి సంపాదించినట్లు గతంలో చెప్పాను. వాళ్ళింటికి వెళ్ళి చాలారోజులయింది. కోటలోనుండి వచ్చే  కొత్త రంగురాళ్ళేమైన దొరుకుతాయేమోనని వాళ్ళింటికి వెళ్ళాను. నేను ఆ ఇంటి వాకిట్లోకి వెళ్ళేప్పటికి ఎవరెవరో చాలామంది మనుషులు గుమిగూడి వున్నారు. లోపలనుండి ఎవరో ఏడవడం వినిపించింది. నాకు భయంవేసి, ఒకే పరుగున ఇంటికి చేరుకున్నాను. తరువాత, మా చిన్నాన్నగారి మాటల్లో తెలిసిన విషయం ఏమంటే ఆ యింటివారి కొడుకుల్లో ఒకడు విశాఖపట్నం ఏవిఎన్ కాలేజీలో చదువుతూ శెలవులకి రైల్లో విజయనగరం వస్తున్నాడట. అతను రైల్లో చల్లగాలికోసం తలుపు దగ్గర కూర్చున్నాడట. రైలు స్టేషన్లోకి రావడం నిద్రమత్తులో గమనించలేదట. రైలుకి ప్లాట్ ఫారమ్ కి మధ్య కాళ్ళు ఇరుక్కుపోయి అతను పట్టాల మధ్య పడి అక్కడికక్కడే చచ్చిపోయాడట. ఆ సంఘటన వినడానికే చాలా భయంకరంగా అనిపించింది. చిన్నతనం కావడంవలన నేను మళ్ళీ ఆ యింటిలోకి వెళ్ళడానికి మనసురాలేదు.

ఒక రోజు మా ఇంటి వరండాలో కూర్చొని ఫ్లోర్ క్యారమ్స్ ఆడుతూంటే ఒక పెద్ద సినీమా వ్యాన్ వచ్చింది. సాధారణంగా, సినీమాల ప్రచారమంతా జట్కా బళ్ళకు, రిక్షాలకు సినీమా పోస్టర్లు అంటించి "నేడే చూడండి మీ అభిమాన పూర్ణా ధియేటర్లో" అని స్పీకర్లో అరుస్తూ సినీమా కాగితాలు పంచిపెట్టేవారు. వాటిని పేపర్ బండి అనేవారు. ఆ సినీమా పేంప్లట్స్ చాలా చీప్ పల్చటి కాగితాలమీద ఎరుపు, పసుపు, పచ్చ, నీలం రంగులలో పంచేవారు. వాటిమీద సినీమా వివరాలు, కధా సంగ్రహం ఉండేవి. ఆ కాగితాలకోసం పిల్లలంతా ఆ జట్కా ల వెనక, రిక్షాలవెనుక పరిగెత్తి వాటిని సంపాదించేవారు. అలాటిది, ఒక సినీమా ఎడ్వర్టైజ్మెంట్ కోసం ఒక పెద్ద వ్యాన్ లాటిది మా వీధిలోకి రావడం మహదానందం కలిగించింది. ఆ వ్యాన్ కు మూడు పక్కలా పూర్తిగా  బల్బులతో అలంకరించి పోస్టర్లు తగిలించారు. దానిమీద "చంద్రహారం" అని రాసివుంది. నాకు బాగా తెలిసిన ఎన్ టి రామారావు బొమ్మవుంది. వేరెవరి బొమ్మలో కూడా ఉన్నాయి. నాకెందుకో ఆ సినీమా పేపర్ సంపాదించాలనిపించి ఆ వ్యాన్ వెనకాల పడ్డాను.  ఆ వీధిలో కొంత దూరం వెళ్ళాక ఎలాగో ఒక పాంప్లెట్ నాకు దొరికింది. అలాటి సినీమా పేపర్ అంతవరకూ నేను చూడలేదు. మల్టీ కలర్స్ లో  గ్లేజ్డ్ పేపర్ మీద వీక్లి పత్రికల సైజ్ లో ఉంది. ఆ పేపర్ నాకెంతో అమూల్యమైనదిగా తోచింది. దానిని జాగ్రత్తగా మా అమ్మగారిచేతికిచ్చాను. చంద్రహారం సినీమా పెళ్ళి చేసి చూడు తీసినవాళ్ళదని ఇందులో కూడా ఘంటసాల పాటలున్నాయని తెలిసింది. ఆ పోస్టర్ మీద ఎన్ టి రామారావుతో పాటు శ్రీరంజని, ఎస్వీరంగారావు, సావిత్రి, రేలంగీ, మరెవరో ఉన్నారని తెలిసింది. నేను  ఆ రంగుల సినీమా పోస్టర్ ను నా పరీక్షల అట్టమీద అంటించి చాలా జాగ్రత్తగా చూసుకునేవాడిని. నేను విజయనగరంలో ఉన్నంతకాలం చంద్రహారం పోస్టర్ నా దగ్గరే ఉండేది. తరువాత, ఆ చంద్రహారం సినీమా వ్యాన్ మరో రెండుసార్లు రాత్రిపూట పూర్తి లైట్ల వెలుగుతో మా వీధిలోనుంచి వెళ్ళింది. అప్పటికీ, ఇప్పటికీ కూడా నాకు చంద్రహారం అంటే చాలా ఇష్టం. అందులోని మాలిగా ఎస్వీరంగారావు పాడిన 'ఏనాడు మొదలిడితివో ఓ విధి' పాట నాకు చాలా ఇష్టం. ఆ సీన్ లో మాలిని చూస్తే జాలిగా ఉండేది. కారణం తెలియదు. ఆ సినీమాలో  మిగిలిన పాటలంటే కూడా మహా ఇష్టం. కారణం, ఆ పాటలు పాడింది మా తాతగారి శిష్యుడని తెలియడం వలన. ఆ సినీమా చూసి వచ్చిందగ్గర్నుంచి పిల్లలంతా సావిత్రిలాగా కళ్ళు పెట్టి చేతివేళ్ళూపూతూ ఒకళ్ళనొకళ్ళు భయపెట్టుకునేవాళ్ళు. అలా చేస్తే ఎన్ టి రామారావు లాగా కళ్ళు తిరిగి పడిపోవాలని. కానీ, ఏ ఒక్కడూ కళ్ళు తిరిగి పడిపోలేదు. కానీ, మాలో మేము కాట్లాడుకోవడానికి కారణమయింది 'నువ్వు నన్ను శాపం పెట్టాలని చూస్తున్నావా' అని.
                       
(ఏ నాడు మొదలెడితివో పాట - చంద్రహారం లో మాలి పాడే పాట)

విజయావారు చంద్రహారం కోసం చాలానే కష్టపడ్డారు. భారీగా ఖర్చుపెట్టారు. కానీ, ప్రజలకే నచ్చలేదు. కారణం వాళ్ళ పాతాళభైరవి సినీమా. అందులోని నటులే ఇందులో ఉన్నా అందులోని మాయలు, మంత్రాలు, హాంఫట్, జై పాతాళభైరవి, కాపాలికా, నరుడా ఏమి నీ కోరికా వంటి మాటలు, గాలిలో ఎగిరే మహల్స్ లేకపోవడమే. అందులోనూ ఎన్ టి రామారావు యుధ్ధం చేయకుండా ఎప్పుడూ నిద్రపోతూండడం  సాదా ప్రేక్షకులకు తీరని ఆశాభంగం. అందులోనైతేనేం, చంద్రహారంలో అయితేనేం, ఘంటసాలవారి సంగీత ప్రతిభే ఈనాటికీ ఆ సినీమాల గురించి తల్చుకునేట్లు చేస్తోంది.)

పిల్లల ఆటలు సీజనల్. ఒక సీజన్ లో మా వీధిలో పిల్లలంతా ముమ్మరంగా బొంగరాలాటలో మునిగి వుండేవారు. వాళ్ళతో సమానంగా ఆడాలని నా కోరిక. నా పోరుపడలేక ఒక బొంగరం కొనిచ్చారు. అయితే దానికి తాడేసి చుట్టడం చేతనైయ్యేదికాదు. తోటిపిల్లలు దానిని తీసుకొని దానికి ముల్లులేదు, ఆటకు పనికిరాదని చెప్పడంతో కోపం వచ్చి ఒక రోజంతా బయటకు వెళ్ళకుండా ఇంట్లోనే కూర్చున్నాను. తర్వాత, మా చిన్నాన్నగారు ముల్లున్న బొంగరం కొనిచ్చి అదెలా తిప్పాలో నేర్పారు. బొంగరం నేలమీద పడకుండా అరచేతిమీద త్రిప్పడం సర్కస్ చూస్తున్న ఆనందం. (మరోచరిత్ర లో కమలహాసన్, సరితల బొంగరం సీన్ మరో సర్కస్). ఇలా రెండు మూడు రోజులు ఆడేనో లేదో పిల్లల్లో ఒకడు ఆడిస్తానని చెప్పి దానిని రెండు ముక్కలు చేసి చేతికిచ్చాడు. కొత్తది కొనిస్తానన్న వాగ్దానంతో.

ఇలా మూడు బొంగరాలు, ఆరుచెక్కలుగా కాలక్షేపం జరుగుతున్న సమయంలో మా శారదక్క పెళ్ళి నిశ్చయమయింది. శారద మా దొడ్డమ్మగారి అమ్మాయి. నాకంటే ఏడేళ్ళు పెద్దది. బొబ్బిలిలో మా తాతగారింట్లో వుంటుంది. పెళ్ళి కుద్దిగాం అనే ఒక పల్లెటూళ్ళో. (ఆ ఊరు ఆంధ్రా, ఒరిస్సా సరిహద్దులలో వంశధారా నదీ తీరాన ఉంది).

ఆ పెళ్ళి విశేషాలు....
వచ్చే వారమే....
                   ....సశేషం

*With a view to make the narrative more authentic and to corroborate it, images, audio and video clips are attached at appropriate places. If such usage is found objectionable to the copyright holders the same shall be removed if and when notified.

Friday, August 28, 2020

నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 1 - పధ్నాలుగవ భాగం

28.08.20 - శుక్రవారం భాగం - 14*:
పదమూడవ భాగం ఇక్కడ


నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్

సాలూరు పెద గురువుగారు - మా ముత్తాతగారు, శ్రీ పట్రాయని నరసింహ శాస్త్రిగారి - దగ్గర్నుంచి సంక్రమించిన చిన్న స్థలం పక్కనే సాలూరు చిన గురువుగారు - మా తాతగారు, శ్రీ పట్రాయని సీతారామశాస్త్రిగారు సాలూరులో మరికొంత స్థలంకొని ఏడాదికో ఇటికా గోడా అంటూ నిర్మాణం ప్రారంభించి క్రమ క్రమంగా ఒక పదేళ్ళనాటికి కట్టడం పూర్తిచేసి అప్పటికే తాను ప్రారభించిన  'శారదా గాన పాఠశాల'ను తమ సొంత కట్టడంలోనే నిర్వహించడం ప్రారంభించారు.


సాలూరులో ఈనాటికీ నిలిచివున్న 1930ల నాటి పెంకుల కట్టడం

ఆ కాలంలో  ఏవిద్యార్ధియైనా అభిలాషతో విద్య నేర్చుకోవాలని వస్తే వారికి ఉచితంగానే బోధించేవారు.  ఈ రోజుల్లోలాగా గంటకు ఇంత ఫీజ్ అని సంగీతం వ్యాపారం కాని రోజులవి. విద్యార్ధుల తల్లితండ్రులే వారి వారి స్తోమతును బట్టి గురుదక్షిణ ఏదో ఇచ్చేవారు. ఇవ్వగలిగినవారు ఇస్తారు లేనివారు లేదు. కానీ, గురువులు శిష్యులందరినీ సమాన దృష్టితో చూసి విద్య నేర్పేవారు. మా నాన్నగారు, మా తాతగారు, వారి తండ్రిగారు  వివిధ ప్రాంతాలలో కచేరీలు చేసి అక్కడి సంగీత పోషకులు ఇచ్చిన పారితోషకాలతో జీవనం చేసేవారు. అయితే ఆరోజుల్లో ఏర్పడిన మొదటి, రెండవ ప్రపంచ యుధ్ధాల కారణంగా జనజీవనం స్థంభించి, ఆర్ధిక మాంద్యం వలన మన దేశంలో  పేదరికం ఎక్కువయింది. అప్పుడూ, ఇప్పుడూ కూడా శాస్త్రీయ సంగీతానికి ఆదరణ ఆంధ్రదేశంలో కన్నా దక్షిణాదినే ఎక్కువ. అలాటి పరిస్థితులలో సాలూరు లో సంగీత పాఠశాల నెలకొల్పడం గొప్ప సాహసమే. ఆ పాఠశాల మెల్లగా అభివృద్ధి పొందుతున్నతరుణంలో, కుటుంబపోషణకోసం చినగురువుగారు సాలూరు విడిచిపెట్టక తప్పలేదు. సాలూరు వదిలి విజయనగరం మహారాజా సంగీత కళాశాలలో నెల జీతానికి కొలువుకి కుదిరి సంగీతాచార్యునిగా రెండు దశాబ్దాలు పాటు పనిచేశారు. అప్పటికి మా నాన్నగారి వయసు పదిహేను సంవత్సరాలు. తన పదకొండవ ఏట నుండే తండ్రిగారి వెనకాల పాడుతూ పదహారు సంవత్సరాలు వచ్చేప్పటికి స్వతంత్రంగా హార్మోనియం వాయిస్తూ కర్ణాటక సంగీత కచేరీలు చేయడం ప్రారంభించారు.


1971లో అమెరికా ప్రయాణం కోసం తీసిన ఫోటో

మా తాతగారు ఉద్యోగనిమిత్తం విజయనగరం మకాం మార్చేక కొన్నాళ్ళు సాలూరు పాఠశాలను నిర్వహించారు. సంగీతరావు గారికి సాలూరులో పెద్ద మిత్రబృందమే ఉండేది. గాయకుడిగానూ మంచి గుర్తింపు పొందారు. ఆయనా అక్కడనుండి వెళ్ళక తప్పలేదు. అప్పుడు, సాలూరిలోని సంగీత పాఠశాల నిర్వహణ బాధ్యతను మా తాతగారి శిష్యులు మానం అప్పారావు, దుంప నరసింహారెడ్డి మొదలైనవారు తీసుకున్నారు. గణపతి నవరాత్రులు, శారదా నవరాత్రులు సాలూరులో చాలా ఘనంగా చేసేవారు . సాలూరు లారీ ట్రాన్స్పోర్ట్ కు  ముఖ్య కేంద్రం. ఒరిస్సాలోని జైపూర్ వంటి ఘాట్ ప్రాంతాలకు సాలూరు నుండి వర్తక వ్యాపారాలు జరిగేవి. ఆ లారీ ట్రాన్స్పోర్ట్సంతా విడివిడిగా, సామూహికంగా ఈ సాంస్కృతిక ఉత్సవాలు తొమ్మిదిరోజులూ ఏవో సంగీత, నృత్య, నాటక, హరికధా, బుర్రకధా కాలక్షేపాలతో ఎంతో ఉత్సాహాంతో నిర్వహించి రాష్టంలోని పలుప్రాంతాల కళాకారులను ఇతోధికంగా పోషించేవారు. 

అలాటి ఏదో ఒక ఉత్సవం సమయంలోనే మా నాన్నగారు - సంగీతరావుగారి - సాలూరు ప్రయాణం జరిగిన గుర్తు. విజయనగరం నుండి మా నాన్నగారు, నేను బస్సులో సాలూరు బయల్దేరాము. ఈనాటి రవాణా సౌకర్యాల దృష్ట్యా ఒక గంటన్నర ప్రయాణం. కానీ ఆరోజుల్లో ఒక పూట ప్రయాణం.ఆనాటి బస్సులన్నీ ఫ్రంట్ బోనెట్ తో ఉండేవి.  నలుపు, ముదురాకు పచ్చ రంగుల్లో చూసిన గుర్తు.


ఆనాటికి ఆంధ్రదేశంలో ప్రజారవాణాకి ఉపయోగించిన ''డాడ్జ్" బస్సులు ఇలాగే ఉండేవి

ఇప్పటిలాగా బస్సు స్టార్ట్ చేయడానికి సెల్ఫ్ ఇగ్నిషన్ ఉండేదో లేదో, లేక పనిచేసేదికాదో నాకు తెలియదు కానీ ఆ బస్సులన్నిటినీ  ముందు భాగంలో హేండీల్ పెట్టి తిప్పుతూ ఒక ఐదారు నిముషాలు కష్టపడి కుస్తీపట్టాక  ఇంజన్ స్టార్ట్ అయేది. 'అప్పన్న బస్సు రైట్ రైట్' అంటూ బయల్దేరదీసేవారు. 

ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో ఆ రోజుల్లో ప్రతి ఐదుగురిలో ఇద్దరన్నా అప్పన్నలు, అప్పారావులు, అప్పలకొండలు ఉండేవారు. కారణం, విశాఖపట్నం పట్నం సమీపంలోని సింహాచలం కొండమీది దేవుడు. సింహాచలం కొండమీద వెలసిన శ్రీ వరహ నరసింహస్వామి వారిని సింహాద్రి అప్పన్న అని కూడా పిలుస్తారు. మా ప్రాంతాల్లో ఆనాడు అప్పన్న, సింహాద్రి, అప్పలకొండ, వరహాలు, నరసింహం పేరు లేని వాళ్ళు చాలా అరుదు. 

"ఒరే అప్పన్నా పొరపాట్న కూడా ఇంజనీ ఆపుచేయకురోయి. మళ్ళీ హేండిలెయ్యాలంటే నా వల్లకాదు" అని మరో అప్పన్న గోల. అలాటి ఒక బస్సు వెనకవేపు డోర్ లోంచి ఎక్కబోతూంటే "బాబూ! మీరు మధ్యలో కూకోండని " మమ్మల్ని మధ్య కంపార్ట్మెంట్లో కూచోపెట్టారు. బండి ఓనర్  దొరగార్లు లైన్లోకొస్తే వాళ్ళు డ్రైవర్ పక్కన కూర్చుంటారు. లేదా దారి మధ్యలో ఏ పోలీసులో,  రెవెన్యూఆఫీసర్లో చేయూపితే అలాటివారికి మధ్యభాగం. మామూలు పాసెంజర్లకి వెనకాల భాగం. ఇలా రెండు మూడు భాగాలుగా ఆనాటి బస్సులుండేవి. బస్సు ఆపనివాళ్ళది పాపం. బస్సు టాప్ మీద కూడా సామాన్లతో పాటు పేసంజర్లని ఎక్కించేసేవారు. వీళ్ళందరినీ ఎక్కిచ్చుకొని నిండు గర్భిణీలా ఆ బస్ బయల్దేరి తన గమ్యం చేరేప్పటికి 'చాలులే ఇటువంటి సేవా' అనిపించేది. మధ్య గదిలో కూర్చోడం వలన మాకు అంత శ్రమ తెలియలేదు. విజయనగరం-సాలూరుల మధ్య మానాపురం, గజపతినగరం, మరడాం, రామభద్రపురం అంటూ చాలా జంక్షన్లే వచ్చేవి. ఒక్కోక్క జంక్షన్లో కనీసం పావుగంటైనా ఆపేసి టీలు, సోడాలు తాగడానికి పోయేవారు. అలాటి సమయాలలో ఇంజన్ ఆగిందంటే ఇంతే సంగతులు. మళ్ళీ హేండిల్ తిప్పాల్సిందే. ఇలా మానాపురం, గజపతినగరం, ఆరికతోట దాటి రామభద్రపురం జంక్షన్ లో బస్ ఆపేప్పటికి అమ్మకాలవాళ్ళు తమ జంగిడీలతో ఈగల్లా బస్ చుట్టూ మూగేవారు. "సిక్కోలు, బొబ్బిలి, పార్తీపురం పేసంజర్లు ఇక్కడ దిగడిపోయి వేరే బస్సు ఎక్కండహో" అని  ఒక అప్పన్న గాఠిగా హుకూం జారీ చేసేవాడు. దిగేవాళ్ళు దిగగా మరికొందరు కొత్త  పేసంజర్లు బస్ ఎక్కేవారు. అప్పట్లో ప్రత్యేకించి బస్ స్టాండ్ లేదు. రోడ్ మీదే ఒక సైడ్ కి బస్సులు ఆపేవారు. ఒకడిని మించి మరొకడు ఓవర్ టేక్ చేసి బస్సులు ఆపడంతో ముందు వెళ్ళవలసిన బస్సువాడు వెళ్ళడానికి చోటులేక ఆ రెండు బస్సుల డ్రైవర్లు కీచులాడుకోవడం ఒక దినసరి చర్య.

బస్సు కిటికీలోంచి చూస్తే పక్కనుంచి వరసగా కావిళ్ళు మోసుకుపోతూ  రైతులు, కూలీలు కనిపించారు. ఆ కావిళ్ళలో కట్టెలమోపులు, పచ్చగడ్డి మోపులు, పాలు, పెరుగు కుండలు, నీళ్ళ బిందెలు, కోళ్ళు, కూరగాయలతో పాటూ  కావిడిలో మరోపక్క చంటిపిల్లలను కూడా  కూర్చో పెట్టుకొని ఆడంగుల సహా పొలాలకో, సంతలకో,  ఇళ్ళకో పోతూ కనిపిస్తుండేవారు.

ఆ కావిళ్ళు చూస్తే నాకు కలివరంలో జరిగిన ఒక పాత సంఘటన గుర్తుకు వచ్చింది.

ఒకసారి కలివరం గంగుల అప్పల నాయుడు గారింట్లోని భోషాణం రేడియోకి జబ్బుచేసింది. దానిని జీప్ బ్యాటరీ దిమ్మలకు  కనెక్ట్ చేసి ఉపయోగించేవారు. అలాటి ఆ రేడియోలో జుయ్యిమని గాలివాన గాలి తప్ప పాటాలేదు, మాటాలేదు.  ఒక చేత సిగరెట్ పీలుస్తూ మరొక చేతితో ఆ రేడియో నాబ్ ని  మహా స్పీడ్ గా ఆపరేట్ చేసే నాయుడిగారి బావగారు అనకాపల్లి రంగారావుగారు ఇంక ఆ రేడియో పనిచేయదని డయాగ్నైజ్ చేయగా దానిని విజయనగరం పెద్ద షాపులకి రిపేరుకి ఇచ్చారు. దానిని విజయనగరం తీసుకువెళ్ళే బాధ్యత మా నాన్నగారిదయింది. దూసి స్టేషన్ వరకు వెళ్ళేప్పుడో, వచ్చేప్పుడో సరిగా గుర్తులేదు ఆ రేడియోను ఒక కావిడిలో పెట్టుకు రావడం జరిగింది. కూడా మా నాన్నగారు, నేనూ కూడా ఆ మూడు నాలుగు మైళ్ళ దూరం నడిచాము. దారిమధ్యలో ఆ రేడియో ఉన్న కావిడిని మోసే కంబారి (ఇళ్ళలోని పనివాళ్ళను కంబార్లు అనేవారు. కంబారి అనగానే నాకు అంబారి గుర్తుకు వస్తుంది, రెండింటికీ ఏ సామీప్యం లేకపోయినా) నేను చిన్నపిల్లాడినవడం వలన అంత దూరం నడవలేనని నన్ను కూడా ఆ కావిడిలో మరో పక్క కూర్చోపెట్టాడు. కానీ, కాళ్ళు ముడుచుకొని కూచోవడం నాకంత సౌకర్యం అనిపించలేదు. కొంత దూరం వెళ్ళాక అందులోనుంచి దిగి నడిచే వెళ్ళాను. 

రామభద్రపురం జంక్షన్లో ఆ కావిళ్ళ గుంపును చూస్తే ఆ పాత సంఘటన గుర్తుకు వచ్చింది.

రామభద్రపురం జంక్షన్ తీపి తీపి కోవాబిళ్ళలకు చాలా ప్రసిధ్ధి . వాటి రుచి మాటల్లో చెప్పలేము. ఆ క్వాలిటీ మన ఫైవ్ స్టార్ స్వీట్ స్టాల్స్ లో కూడా వుండదు. అతిశయోక్తి కాదు. ఒక్కొక్క బిళ్ళ కనీసం డెభ్భై గ్రాములన్నా ఉంటుంది. అలాగే  జీళ్ళు, జంతికలు కూడా. ఈ రెండింటినీ తిని ఓ గోలీ సోడా లాగించే సమయానికి బస్సు బయల్దేరేది. బస్సుల రాకపోక ఉన్నంతసేపు ఈ వ్యాపారం నిరాటంకంగా సాగేది. సీజన్ బట్టి మామిడిపళ్ళు, తాటిముంజెలు, జామిపళ్ళు అంటూ బస్సులొచ్చే సమయానికి సిధ్ధమైపోయేవారు. అంతవరకూ నిర్జనంగా ఉండే ఆ రోడ్ ఒక్కసారిగా బస్సుల రాకతో కోలాహలంగా వుండేది.

ఇలా కొన్ని గంటలు ప్రయాణం చేసిన తరువాత సాయం సమయానికి సాలూరు  శారదా సంగీత పాఠశాలకు చేరుకున్నాము. అక్కడ మా నాన్నగారి చిరకాల మిత్రుల రాకతో, ముచ్చట్లతో సమయమే తెలియలేదు. కొంతసేపటికి మా నాన్నగారి  సంగీత కచేరీ ప్రారంభమయింది. ఆహుతులందరూ ఆ గానంలో లీనమైపోయారు. కచేరీ చాలా అద్భుతంగా సాగింది. రెండు మూడు గంటలన్నా పాడివుంటారు. హర్మోనియం ఒక్కటే పక్కవాద్యం. మృదంగం కూడా ఎవరో వాయించిన గుర్తు. 

ఆ కచేరి ముగిసి బయటికి వచ్చి చూస్తే విపరీతమైన వర్షం పడి రోడ్లన్ని చిత్తడిగా వున్నాయి. మేము వెళ్ళినప్పుడు ఏ వర్ష సూచనా లేదు. ఒక్క మేఘమూ లేదు. "సంగీతరావుగారు "ఆనందామృతకర్షిణి" కీర్తన పాడేరు. ఆయన గాత్రం మహిమ, మంచి వర్షం కురిసింది అని అక్కడివారు మా నాన్నగారిని మెచ్చుకోవడం జరిగింది. పాటలు పాడితే వర్షాలు ఎలా పడతాయని నాకు ఒకటే ఆశ్చర్యం.

తర్వాతి కాలంలో, తాన్సేన్ మేఘ్ మల్హర్ రాగం గానం చేస్తే వర్షించిందని పుస్తకాలలో చదివాను. మద్రాస్ లో వర్షాలు లేక మంచినీటి చెరువులు పూర్తిగా చుక్కనీరు లేకుండా ఎండిపోతే సుప్రసిధ్ధ కర్ణాటక వాయులీన విద్వాంసుడు కున్నక్కుడి వైద్యనాదన్  రెడ్ హిల్స్ చెరువులో నిలబడి "అమృతవర్షిణి" రాగంలో దీక్షితర్ కృతి "ఆనందామృతాకర్షిణి" ని గంటల తరబడి వైలిన్ మీద వాయించినట్లుగా పత్రికలలో ఫోటోలు చూశాను. సంగీతానికి ఉన్న మహిమ మాటలకు అతీతం. సంగీతం ద్వారా సత్ఫలితాలు సాధించడం ఒక్క గానయోగులకే సాధ్యం.

ఆ సంగీత కార్యక్రమం అనంతరం రాత్రి భోజనానికి ఎవరింట్లోనో ఏర్పాటు చేశారు. నేను ముందే చెప్పినట్లు మా నాన్నగారికి మొగమాటం ఎక్కువ. అందువల్ల తాను భోజనం చేయనని పాలు, పళ్ళుంటే చాలని చెప్పడంతో నన్ను మాత్రం పంపారు. ఆ ఇల్లు  మా సంగీత పాఠశాలకు సమీపంలోనే ఏటికి వెళ్ళే త్రోవలో ఉంది. నేను వెళ్ళినప్పుడు ఎవరో ఒక అవ్వగారు మాత్రమే ఉన్నారు. నన్ను చూసి "సంగీతరావు కొడుకువా! రా నాయనా, మనమందరం కావలసినవాళ్ళమే, మొహమాటపడకు" అంటూ లోపలికి తీసుకువెళ్ళి భోజనం వడ్డించారు. మావాళ్ళెవరూ పక్కన లేకుండా పరాయివాళ్ళ ఇళ్ళలో భోజనం చేయడం అదే మొదటిసారి. నా శౌర్యమంతా మా ఇంట్లో నాలుగు గోడలమధ్యే. బయటకు వెళితే బెదురుగొడ్డునే. ఇప్పటికి కూడా. ఆ ఇల్లు చాలా సామాన్యంగానే ఉంది. ఒక చమురు (కిరోసిన్) బుడ్డి దీపం వెలుతురులో భోజన కార్యక్రమం. వాళ్ళకోసం చేసుకున్నదే పెట్టారు. వేడి వేడి అన్నం, కటిక పెసర పచ్చడి, ఇంగువ చారు, మజ్జిగ, ఇవే పదార్ధాలు. ఆ అవ్వగారు పక్కన కూర్చొని ఏవేవో విషయాలు చెప్పారు. అవేవీ నాకు అర్ధం కాలేదు. కానీ ఆవిడ చూపిన ఆదరణ మరువలేను. అలాగే ఆవిడ చేసిన కటిక పెసర పచ్చడి రుచి అమోఘం. నేను అంతకుముందు ఎక్కడా అంత రుచికరమైన పెసర పచ్చడి తినలేదు. నిజం చెప్పొద్దూ... నాకు కారంగా వుండే పదార్థాలు ఏవైనా ఇష్టమే. ఆవిడ చేసిన ఆ రోటి పచ్చట్లో ఇంగువ, ఉప్పు, కారాలు కొంచెం ఎక్కువగానే పడ్డాయేమో నాకు ఆ పచ్చడి కారామృతంగా అనిపించింది. ఇది నా  జీవితంలో ఎన్నటికీ మరువలేని సంఘటనగా మిగిలిపోయింది.

మేము మద్రాస్ 35, ఉస్మాన్ రోడ్ లో ఉన్నప్పుడు,  ఒకసారి మా కుటుంబం బొబ్బిలి వెళ్ళారు. అప్పుడు  స్వయంపాకం మొదలెట్టి  మొదలెట్టి తరుచూ ఈ కటిక పెసరపచ్చడిని అన్నంలోకి చేసేవాడిని. ఒకసారి సావిత్రమ్మగారు నేను చేసిన పచ్చడి రుచి చూసి "ఓర్నాయనో! ఇంత కారంగా ఉందేవిట్రా! "అంటూ రెండు గ్లాసుల మంచినీళ్ళు త్రాగారు. నాకు మాత్రం ఆ సాలూరు పెసరపచ్చడి  స్ఫూర్తితో చేసినందువల్ల అద్భుతంగా వుండేది. ఇప్పటికీ నేను కనిపించినప్పుడల్లా సావిత్రమ్మగారు "ఏరా, ఇంకా పెసరపచ్చడి చేస్తున్నావా" అని అడుగుతూంటారు. అలా అని నేను పెద్ద భోజనప్రియుడిని కాను.ఏదుంటే దానితోనే సద్దుకుపోయే రకం. కానీ, ఆ పాతకాలపు అవ్వగారి ప్రేమపూర్వక భోజనం ఎప్పటికీ మరువలేను. 

ఇక్కడ, విజయనగరం మహారాజా వారి ఔదార్యం గురించి చెప్పే కధ ఒకటి గుర్తుకు వస్తుంది.

విజయనగరం మహారాజావారు ఒకసారి వేటకు వెళ్ళి మధ్యాహ్నం వరకు వేటాడి బాగా డస్సిపోయారు. ఆకలి దంచేస్తోంది. చుట్టుపక్కల గ్రామాలేవీ లేవు. అలాటిచోట వెడుతూండగా ఒక చిన్న పూరి గుడిసె కనిపించింది.  అందులో ఒక ముసలామె ఉంది. అవసరార్ధం తప్పులేదనుకున్నారో ఏమో, నోరు విడిచి, తినడానికి ఏదైనా పెట్టమని అడిగారట.
ఎవరో డాబూ, దర్పంగా ఉన్న మనిషి తన వంటి పేదరాలిని తినడానికి ఏదైనా పెట్టమని అడగడం ఏమిటని ఆ ముసలామె వణికిపోయింది. వచ్చిందెవరో ఆమెకు తెలియదు. కానీ బాగా ఆకలిమీదున్నాడని అర్ధమయింది. రాజుగారిని బయట చెట్టునీడలో కూర్చోమని చెప్పి ఆదరాబాదరా కాస్తా అన్నం ఉడికించి, ఏదో ఒక పచ్చడి నూరి ఆ రెంటినీ ఒక ఆకులో పెట్టి రాజుగారి ముందు ఉంచింది. ఆయన ఆకలిమీద వుండి ఆ ముసలామె పెట్టిన ఆహారాన్ని సంతుష్టిగా తినడమే కాక ఆవిడ చేసిన పచ్చడిని ఆయన అమితంగా ఇష్టపడ్డాడు. తన జన్మలో ఇంత రుచికరమైన పచ్చడి తినలేదని అదేమి పచ్చడో చెప్పమని అడిగాడు. ఆ ముసలామె భయంతో వణికిపోయింది. వచ్చినవాడు మెచ్చుకుంటున్నాడో, ఎగతాళి చేస్తున్నాడో తెలియలేదు నిజం చెపితే ఏం ప్రమాదం ముంచుకు వస్తుందోనని భయపడింది. రాజుగారు అదే ప్రశ్నను పదే పదే వేయడంతో ఆ పేదరాలికి చెప్పకతప్పలేదు. భయపడుతు మెల్లిగా చెప్పింది అది గరికతో (గడ్డి) చేసిన పచ్చడి అని. రాజుగారు నిర్ఘాంతపోయాడు, 
తాను అంతగా మెచ్చుకొని తిన్నది గడ్డి పచ్చడా అని. అందుకు ఆయన ఆగ్రహించలేదు. గరికతో కూడా అంత రుచికరమైన వంట పదార్ధంచేసి పెట్టిన ఆ ముసలామె పరిస్థితిని, ఆమె ఆదరణను అర్ధం చేసుకొని ఆమెకు మనసారా నమస్కరించి వెళ్ళిపోయారు. తరువాత, కోటకు వెళ్ళిపోయిన మహారాజావారు ఆ ముసలామె ఉన్న చుట్టుప్రక్కల ప్రాంతాన్నంతా ఆమెకు దానంగా రాసిచ్చారు. అదే నేటి 'గరికవలస' ప్రాంతమనే కధ ప్రచారంలో వుండేది.

దీనిని బట్టి మనకు అర్ధమయేదేమిటి? మనిషి విలువ వాళ్ళకుండే సిరి సంపదలను బట్టి కాదు. వారిలోని సద్గుణాలే వారికి ఔన్నత్యాన్ని కల్పిస్తాయి. 

ఈ రెండు సంఘటనలు ఆనాటి మంచితనం, ప్రేమాభిమానాలు, ఆదరణకు దర్పణం పడతాయి.

ఈ రకమైన గతకాలపు అనుభావాలు, ఈ ధారావాహిక చదివే ఆధునిక తరానికి తెలియాలనే నెం.35, ఉస్మాన్ రోడ్ లో పొందుపరుస్తున్నాను. ఈ రకమైనటువంటి అనుభవాలెన్నిటినో ఘంటసాల తన ప్రారంభ దశ జీవితంలో చవిచూశారు. మనిషెప్పుడూ గతాన్ని గౌరవిస్తూ వర్తమానకాల పరిస్థితులకు అనుగుణంగా జీవించాలి.
                   ...సశేషం

*With a view to make the narrative more authentic and to corroborate it, images, audio and video clips are attached at appropriate places. If such usage is found objectionable to the copyright holders the same shall be removed if and when notified.