visitors

Saturday, November 28, 2020

నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 2 - ఎనిమిదవ భాగం


28.11.2020 - శనివారం భాగం - 8*:
అధ్యాయం 2  భాగం 7 ఇక్కడ


నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్


మెడ్రాస్ లో మళ్ళీ నా స్కూల్ జీవితం ప్రారంభమయింది. 1956 లో టి.నగర్ పానగల్ పార్క్ కు ఎదురుగా వున్న 'శ్రీ రామకృష్ణా మిషన్ హైస్కూల్' లో III ఫారమ్ (8వ తరగతి) లో చేర్చారు. త్యాగరాయనగర్ మెయిన్ బ్రాంచ్ అది. రామకృష్ణ మిషన్ స్కూల్స్ చక్కటి చదువు, క్రమశిక్షణలకు చాలా ప్రసిధ్ధి. ఆ హైస్కూల్ కు  టి.నగర్ లో చాలానే బ్రాంచ్ లు ఉండేవి. బజుల్లా రోడ్, గ్రిఫిత్ రోడ్, రామనాధన్ స్ట్రీట్, బర్కిట్ రోడ్ లలో  ఎలిమెంటరీ /మిడిల్ క్లాస్ స్కూల్స్ వుండేవి. మెయిన్ స్కూల్ కు సంబంధించిన ఆటస్థలాలు జి.ఎన్.చెట్టి రోడ్ లో, గ్రిఫిత్ రోడ్ ముప్పత్తమ్మా ఆలయం దగ్గర ఉండేవి. రామకృష్ణా మిషన్ బాయ్స్ హాస్టల్ ఈ ప్లేగ్రౌండ్ కు ఆనుకొని వుంటుంది. హాస్టల్ విద్యార్ధులు గ్రౌండ్ లోకి వెళ్ళే మార్గమూ వుంది. ఆ హాస్టల్ ప్రధాన ద్వారం దొరైసామీ రోడ్ వేపు వుంటుంది. రామకృష్ణా మిషన్ శారదా గర్ల్స్ హైస్కూల్  ఉస్మాన్ రోడ్ లో పానగల్ పార్క్ దగ్గర వుంది. ఆ స్కూల్ లో రోడ్ వేపు ప్రహారీలో చాలా పెద్ద నాగమల్లి చెట్టుండేది. ఆ చెట్టు, నాగమల్లి పుష్ప సౌరభం ఆ స్కూలుకు ఒక ప్రత్యేక ఆకర్షణ. నేను, మా తమ్ముడు గోపి, చెల్లెళ్ళు రమణమ్మ, పద్మ, లలిత,  సుమబాల అంతా రామకృష్ణా మిషన్ విద్యార్ధులమే.

ఘంటసాల మాస్టారి ముగ్గురు ఆడపిల్లలు శ్యామల, సుగుణ, శాంతి(రాధ) కూడా  రామకృష్ణ మిషన్ శారదా గర్ల్స్ హైస్కూల్ లోనే చదువుకున్నారు. ఎలిమెంటరీ క్లాసులు జిఎన్ చెట్టి రోడ్ లోని కమలాబాయి స్ట్రీట్ లో వున్న 'బాల గురుకుల్' లో చదువుకున్నారు. ఆ స్కూల్ ప్రిన్సిపాల్ ఒక యూరోపియన్. పేరు డంకన్. అప్పుడప్పుడు మాస్టారి పిల్లలను దింపడానికి, తీసుకురావడానికి వెళ్ళేప్పుడు చూసేవాడిని. ఆయనకు పిల్లలంటే చాలా ఇష్టం. గేట్ ముందు నిల్చొని వచ్చే పోయే పిల్లలకు షేక్ హాండ్స్ ఇస్తూ ప్రేమగా పలకరించేవారు. 

మైలాపూర్ లోని వివేకానంద కాలేజి కూడా రామకృష్ణ మిషన్ వారిదే. రామకృష్ణ మిషన్ ప్రధాన ఆశ్రమం, మైలాపూర్ కపాలేశ్వరాలయం పుష్కరిణి పక్కనుంచి  మందవళ్ళి వెళ్ళే రోడ్ మీద వుంది. రామకృష్ణ ఆశ్రమ ప్రధాన కార్యనిర్వాహక స్వామీజీలంతా అక్కడే వుంటారు. చాలా విశాలమైన కట్టడం. నిత్యమూ ఏవో ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతూనేవుంటాయి. నేను రామకృష్ణా మిషన్ హైస్కూల్ లో మూడు సంవత్సరాలు చదివినా ఒక్కసారి కూడా, ఆ తరువాతికాలంలో కూడా ఆ ఆశ్రమంలోకి వెళ్ళే అవకాశం దొరకలేదు, బయటనుండి చూడడమే తప్ప. వయసు ప్రభావం కావచ్చును. మద్రాస్ సైట్ సీయింగ్ కు వచ్చే బంధువులను, మిత్రులను నేనే దగ్గరుండి మద్రాసులోని అన్ని ఆలయాలకు, విహార ప్రదేశాలకు తీసుకువెళ్ళేవాడిని. కానీ, ఎవరూ కూడా రామకృష్ణ పరమహంసకు, స్వామీ వివేకానందకు చెందిన ఈ ఆశ్రమాన్ని దర్శించాలని ఎప్పుడూ అనుకోలేదు. బహుశా, సాధవులు, సన్యాసాశ్రమం లోని వారే అక్కడకు వెళ్ళాలనే భావనేమో? తెలియదు. పాండిచ్చేరి అరబిందో ఆశ్రమానికైతే చాలా సార్లే వెళ్ళాను. అలాగే ఆరోవిల్ మెడిటేషన్ సెంటర్ నిర్మాణంలో వున్నప్పుడు చూడడం జరిగింది. (మా జ్యోతి, శశి శేఖర శాస్త్రి గార్ల సౌజన్యంతో).

టి.నగర్ లో రామకృష్ణా మిషన్ స్కూల్సే కాకుండా తెలుగు విద్యార్ధుల సౌకర్యార్ధం, పాండీబజార్ చివర్లో మౌంట్ రోడ్ జంక్షన్ కు ముందు బోగ్ రోడ్ దాటాక ఎడమచేతివేపు గిరియప్పా రోడ్ మీద ఉన్న స్కూలు 'కేసరి హైస్కూల్'. ఈ హైస్కూల్ కు మెయిన్ స్కూల్ మైలాపూర్ లో వుంది. నాకు ఆ స్కూల్ చూసిన గుర్తులేదు. మా ఆవిడ ఆ స్కూల్ విద్యార్ధినే.

కేసరీ హైస్కూల్స్ వ్యవస్థాపకుడు డా. కె.ఎన్. కేసరి. సుప్రసిధ్ధ ఆయుర్వేద వైద్యాలయం కేసరీ కుటీరమ్ అధినేత. ఈ సంస్థ తయారు చేసే 'లోధ్ర' దేశవ్యాప్తంగా చాలా ప్రసిధ్ధి పొందిన ఔషధం. మా చిన్నప్పుడు అన్ని వార్తా పత్రికలలో  మహిళలకు ఉద్దేశించిన ఈ లోధ్ర ప్రకటనలు విరివిగా కనపడేవి.

డా. కేసరిగారు  మన తెలుగు వెలుగులలో ఒకరు. ఒంగోల్ జిల్లాకు చెందిన వ్యక్తి. గొప్ప వైద్యుడు, విద్యావేత్త, దాత, గృహలక్ష్మి పత్రిక స్థాపకుడు. ఈతరంవారికి ఇంకా బాగా అర్ధంకావాలంటే, సుప్రసిధ్ధ బహుభాషా గాయకుడు ఉన్నికృష్ణన్ ముత్తాతగారాయన . 

అలాగే, విల్లివాక్కంలోని ఎస్ కే పి డి - శ్రీ కనకదుర్గ హైస్కూల్ తెలుగు పిల్లలకోసం స్థాపించబడింది. ఇలాటి తెలుగు స్కూల్స్ పరశువాకం, ముత్యాలపేట (జార్జ్ టౌన్) మొదలైన ప్రాంతాల్లో వుండేవి. నా దురదృష్టంకొద్దీ ఈ తెలుగు స్కూల్స్ అన్నీ మేముండే నెం. 35, ఉస్మాన్ రోడ్ కు చాలా దూరం. సిటి బస్సులో ఒక్కొణ్ణే పంపడానికి సిద్ధంగా లేరు మావాళ్ళు. పాండీ బజార్ చివరున్న కేసరి హైస్కూల్ కూడా నడకకు చాలా దూరం. బస్సు లో వెళ్ళాలంటే అప్పట్లో వడపళని నుండి శాంథోమ్ వెళ్ళే 12B రూట్ బస్ ఒక్కటే ఉండేది . అందుకు బజుల్లా రోడ్ బస్ స్టాపింగ్  వరకూ వెళ్ళాలి. బస్సులకోసం పడిగాపులు పడాలి. అందుచేత, కేసరీ స్కూల్ లో చేరే విషయం రూల్డౌట్. తెలుగు సినిమా రంగానికి చెందిన చాలామందికి పనగల్ పార్క్, పాండీబజార్ కేర్ ఆఫ్ అడ్రస్. అలాగే తెలుగు సినిమా రంగానికి చెందిన చాలామంది సాంకేతిక నిపుణుల పిల్లలందరూ ఈ ప్రాంతంలో తెలుగు మీడియం ఉన్న ఈ  కేసరీ హైస్కూల్ లో నే చదువుకునేవారు. అనంతరం కాలంలో తమ తమ రంగాల్లో ప్రసిద్ధులయ్యేరు. అంతేకాక ఈ స్కూలు ప్రత్యేకత ఏమిటంటే ఆ స్కూలు టీచర్లు, ఆఫీసుస్టాఫ్ చాలామంది తెలుగు సినిమా రంగంతో సంబంధం ఉన్నవారే. మన తెలుగు సినీమాలలో అడపాతడపా కనపడేవారు. ఆ కేసరీ హైస్కూల్ లో డ్రిల్ మాస్టర్ గా పనిచేసిన భక్తవత్సలం నాయుడు నటుడిగా, నిర్మాతగా, విద్యాలయాల స్థాపకుడిగా తెలుగు సినీమా ప్రేక్షకులందరికీ చిరపరిచితుడు. ఆ ప్రముఖుడెవరో నాకన్నా మీకే బాగా తెలుసు. 

తెలివైన విద్యార్థులు ఎక్కడ చదివినా రాణిస్తారు. పురోభివృద్ధి చెందుతారు. నా వరకూ, అన్నిటికంటే ముఖ్యమైనది రామకృష్ణా స్కూల్ మా ఇంటికి చాలా దగ్గర. నడిచి వెళ్ళి రావచ్చును. రామకృష్ణ మిషన్ హైస్కూల్ లో ఆరవ తరగతి నుండి SSLC వరకు వుంది. అందులో  'A' సెక్షన్ పూర్తిగా తెలుగు మీడియం విద్యార్ధులకు కేటాయించబడింది. 'B' నుండి ఐదారు సెక్షన్లు తమిళ విద్యార్ధుల కోసం. ఒక్కో సెక్షన్ లో ముఫ్ఫైమంది విద్యార్ధులు. దాదాపు వెయ్యిమంది విద్యార్థులతో రామకృష్ణా మిషన్ బోయ్స్ మెయిన్ హైస్కూల్ రెండు అంతస్థుల విశాల భవనంలో కళకళలాడుతూ వుండేది. ఆ స్కూలే కాదు, స్కూల్ కు ఎదురుగా వున్న పానగల్ పార్క్ కూడా. స్కూల్ ప్రారంభం కావడానికి గంట ముందు, స్కూలు వదిలాక సాయంత్రం ఐదున్నర వరకూ సగంమంది పిల్లలు ఆ పార్క్ లోనే ఆటలాడేవారు. హాస్టల్ విద్యార్ధులు మాత్రం ఇలాటి ఆటపాటలకు దూరం. బోయ్స్ హాస్టల్ దొరైసామీ రోడ్ లో వుండేది. ఆ హాస్టల్ వుండి చదువుకునే విద్యార్ధులకు కట్టు, బొట్టు, కట్టుబాట్లు చాలానేవుండేవి. అప్పట్లో చాలామంది తమిళ విద్యార్ధులు తెల్ల వేష్టీ (లుంగీ), తెల్ల చొక్కాలు ధరించేవారు. నుదుట విబూదిరేఖలతో గురుకులం విద్యార్ధుల్లా సంప్రదాయబధ్ధంగా వుండేవారు. తెలుగు సెక్షన్ పిల్లలు నిక్కర్లు, ప్యాంట్ షర్ట్ లతో వచ్చేవారు. చాలామంది తమిళ అయ్యర్, అయ్యంగార్ల పిల్లలు తల ముందుభాగం గుండుతో, వెనుక శిఖలతో  వచ్చేవారు. అది ఆనాటి ఆచారవ్యవహారాలకు ఇచ్చే గౌరవమర్యాదలు.  ఈ వాతావరణం అంతా నాకు చాలా కొత్త , ఎంతో వింత.

ఆ స్కూల్ లో చేరాక నా చదువు కష్టాలు ఇంకా ఎక్కవైయాయి. మా తెలుగు మాస్టారి పేరు వేదం వెంకటరాయ శాస్త్రిగారు. ఈయన, ప్రముఖ వేద పండితులు, కవి అయిన వేదం వెంకటరాయ శాస్త్రిగారి కుటుంబం వాడని చెప్పుకునేవారు. ఆయన తప్ప ఇంకెవరు తెలుగు మాట్లాడినా నా చెవులకు అరవంలాగే వినపడేది. తెలుగు విద్యార్థులు కూడా వాళ్ళలో వాళ్ళు తమిళంలోనే మాట్లాడుకునేవారు. మొదట్లో నాకేమీ అర్ధమయేదికాదు. అందుచేత స్కూల్ లేని సమయాలలోఎప్పుడూ ఘంటసాలవారింట్లో పెద్దబాబు తో కాలక్షేపం చేయడం, గ్రామఫోన్ లో వేసే పాటలు వినడం పట్ల మహా ఆసక్తిగా వుండేది. అయ్యగారు ఇంట్లో వున్నంతసేపు ఇల్లంతా మహా నిశబ్దంగా వుండేది. ఆయన బయటకు వెళ్ళిన తరువాతే గ్రామఫోన్ లో పాటలు, రేడియో వినడం. తిరిగి ఆయన కారు గేట్లోకి రాగానే గోవింద్ హారన్ మ్రోగించేవాడు. దానితో ఎక్కడివారక్కడే ఎవరి పనుల్లో వారు నిమగ్నమైపోయేవారు. రికార్డింగ్ లలో, రిహార్సల్స్ లో పాడి పాడి వచ్చాక తిరిగి తన పాటలు తాను వినడానికి అయ్యగారు పెద్దగా ఇష్టపడేవారు కాదు. రాత్రి తొమ్మిది తర్వాత  శనివారం నాడు ఆలిండియా రేడియో  ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమయే నేషనల్ ప్రోగ్రామ్స్ కచేరీలు కొంతసేపు వినేవారు. ఆ సమయంలో ప్రాంతీయ కేంద్రాలకు కూడా అవే కచేరీలు ప్రసారం చేసేవారు.

అప్పట్లో ఆకాశవాణివారు 'వాణి' పత్రిక ప్రచురించేవారు. అందులో ఆ నెలలో వివిధ కేంద్రాలు  ప్రసారం చేసే కార్యక్రమాల వివరాలుండేవి. అందులో ప్రముఖ సంగీత విద్వాంసుల ఫోటోలు, వారి వివరాలు కూడా ఇచ్చేవారు. 

ఘంటసాలవారు తాను ఎంత గొప్పగాయకుడైనా, ప్రతిభ కలిగిన సంగీత దర్శకుడైనా ఎక్కడ ఏమంచి పాట వినపడినా అది కర్నాటిక్ అయినా, హిందుస్థానీ అయినా సినీమా పాట అయినా విని ఆనందించేవారు. ఆయా గాయకుల ప్రతిభను గుర్తించి అభినందించేవారు. తాను తప్ప వేరే గొప్ప గాయకులు లేనే లేరనే భావన, ఆ విధమైన అహంకారం  ఏనాడూ వారిలో వుండేదికాదు. 

అదేవిధంగా, శృతిలయలకు ప్రాధాన్యత ఇవ్వకుండా, భావ రహితంగా, లోపభూయిష్టంగా పాడే పాటగాండ్రను ఏమాత్రం ఉపేక్షించేవారు కాదు. 

ఒకరోజు ఉదయం, ఆనాటి సాయంత్రం ఆరుగంటలకు ఏదో స్టూడియో లో 'చిరంజీవులు' సినీమా ప్రివ్యూ వేస్తున్నారని ఆ కంపెనీకి సంబంధించిన వ్యక్తి వచ్చి చెప్పి వెళ్ళారు. ఆ సినీమాకు ఘంటసాలవారిదే సంగీతం. మా నాన్నగారు అందులోని పాటలకు హార్మోనియం వాయించారు. అందుచేత, అందరూ ఆ ప్రివ్యూకు వెళ్ళవచ్చును. సాయంత్రం వేసే ప్రివ్యూను తల్చుకొని నాకు ఉదయంనుండి మహా ఆనందం. అయితే, మా నాన్నగారు అందరిని తీసుకువెళతారా? ఎవరితో ఎలా వెళ్ళాలి అనే ఆలోచనలతోనే గడిచిపోయింది. మొత్తానికి మా ఇంట్లోవారంతా కూడా స్టూడియో లో వేసే 'చిరంజీవులు' సినీమాకు వెళ్ళడం జరిగింది. కోడంబాక్కం రైల్వే లెవెల్ క్రాస్ దాటి వడపళని వేపు వెళ్ళడమనేది బ్రహ్మయత్నం. ఏనాడు వెళ్ళగానే రైలుగేట్ తెరిచి వుండదు. కనీసం, పావుగంటసేపైనా వచ్చేపోయే లోకల్ ట్రైన్స్, సౌత్ కు వెళ్ళే రైళ్ళు చూడడంతోనే  కాలం గడిచిపోయేది. 

స్టూడియోలలో వేసే ఏ ప్రివ్యూ సినీమాలు కూడా పూర్తిగా టైటిల్స్ నుండి చూడడం బహు అరుదు. మేము వెళ్ళేప్పటికి ఎప్పుడూ ఒకటి రెండు రీళ్ళు తర్వాత నుండే చూసేవాళ్ళం. సినిమా చూసిన తృప్తి వుండేదికాదు. ఒక సినీమాకైతే మేము వెళ్ళి కూర్చున్న ఐదు నిముషాలకే ఇంటర్వెల్ కార్డ్ వేసేసారు.

టైటిల్స్ తో సహా పూర్తి సినీమాలు చూడలేకపోయిన కొరత అమ్మగారి (సావిత్రమ్మగారు)లోను వుండేది. సినీమా ప్రొజెక్షన్ రోజున "సాయంత్రం అందరూ రెడీగా వుండండి,నేను వచ్చి తీసుకువెళతాను, లేదా కారు పంపిస్తాను మీరు వెళ్ళండి" అనేవారు. రెండోదే ఎక్కువగా జరిగేది. మాస్టారు చాలా అరుదుగా, బయటవారి సినీమా ల ప్రివ్యూకు హాజరయ్యేవారు. అందుకు కారణం ఆ రోజుల్లో అంత బిజీగా వుండేవారు. 

పోనీ మనసుకు నచ్చిన తెలుగు సినీమాలు బయట ధియేటర్స్ లో చూద్దామంటే మద్రాస్ లో తెలుగు సినీమాలే రావు. సినీమాలు తీసేది మెడ్రాస్ లో నైనా ఆ వూళ్ళో తెలుగు సినీమాలు ఆడవు. జార్జ్ టౌన్ తాతముత్తియప్పన్ వీధిలోని సెలెక్ట్ ధియేటర్లో మాత్రం తెలుగు సినీమాలు ఆడుతాయి. శుక్రవారం నుండి గురువారం వరకు ఒక్కవారం మాత్రమే. కానీ మేముండే టి.నగర్ నుండి ఆ సినీమా ధియేటర్ కు వెళ్ళిరావడమంటే ఒక ఊరినుండి మరోవూరు వెళ్ళడమే. ఆ సెలక్ట్ ధియేటర్ కూడా అంత పెద్దదికాదు. పాతకాలం హాలు. తెలుగు సినీమా మీది వ్యామోహంతో స్థానిక తెలుగులు ఆ ధియేటర్ కు వెళతారు.

అలాటి సెలెక్ట్ టాకీస్ కు అమ్మగారు, అయ్యగారు, నేను మాత్రమే  ఒక సినీమా చూడ్డానికి వెళ్ళాము. ఆ విశేషాలు మరోభాగంలో ముచ్చటిస్తాను.

మద్రాసులో  కొన్ని తెలుగు సాంస్కృతిక సంస్థలు 1970 తరువాత ఆవిర్భవించాయి. అప్పటినుండి ఆ సంస్థలు తమ సభ్యుల వినోదం కోసం పాతవో, కొత్తవో నెలకు ఒకటి రెండు తెలుగు సినిమాలు ఆదివారం ఉదయం 10 గంటలకు ఏదో ధియేటర్ లో వేసేవారు. ఆ సినిమా లు చూడడం కోసం తెలుగు ప్రజలు చందాలు కట్టి సభ్యులయేవారు. 

చిరంజీవులు చిత్రం లోని సంగీతం, సాహిత్యం విలువలు పెద్దయ్యాక తెలుసుకున్నవే. ఆ సినీమా ప్రివ్యూ చూసినప్పుడు అవేవీ తెలియదు. పైగా 'చిరంజీవులు' సినీమా లో వినోదం పాలు తక్కువ. చిత్రం విషాదాంతం. ఆ సినీమా లోని అన్ని పాటలు వీనులవిందే . నాకు బాగా ఇష్టమైనది మనసునీదే మమత నాదే' ఎడ్లబండిపాట. అందులోని రిథిమ్ , మాస్టారి వాయిస్ ఎఫెక్ట్స్ ఎన్నటికి మరపురావు.
 


అలాగే‌, 'కనుపాప కరువైన కనులెందుకు' పాట బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ లో వినవచ్చే తబలా, డ్రమ్స్, వీణ, వైలిన్  బిట్స్ ఇప్పటికీ చెవుల్లో మారు మోగుతూనే వుంటాయి. 



'తెల్లవార వచ్చె తెలియక నా సామీ' లీల పాడిన సుప్రభాత గీతం. ఎంతో మనోజ్ఞం. 



ఈ పాటను  సుప్రసిధ్ధ హిందీ గాయని లతా మంగేష్కర్ చేత పాడించాలని అనుకున్నారనే వార్త గురించి  నాకు తెలియదు. సినీమా ఆఖరులో రెండు బొమ్మలు నీటిలో తేలుకుంటూ పోవడం ఒకటి బాగా గుర్తుండి పోయింది. ఈ సినిమాలో గుడ్డివాడిగా నటించిన ఎన్ టి రామారావుకు, షూటింగ్ సమయంలో నిరంతరం వాడిన కృత్రిమ కనుగుడ్ల వల్ల నిజంగానే కొంతకాలం కంటిసమస్య ఏర్పడిందని, అయినా రామారావు లెఖ్ఖచేసేవారు కాదని చెప్పుకునేవారు. 

దేవదాసు, కన్యాశుల్కం సినీమా లు తీసిన వినోదా పిక్చర్స్ డి.ఎల్ నారాయణ గారిదే ఈ చిరంజీవులు సినీమా కూడా. ఈ సినీమా లోని ఘంటసాలవారి సంగీతం గురించి,పాడిన పాటల గురించి పత్రికలలో చాలా గొప్పగా రాశారు. స్టూడియోలలో చూసిన చాలా సినీమాలు పెద్దయ్యాక టివి ఛానల్స్ లో చూసాను. రెండుగంటలలో సినీమాలు పూర్తిచేయడంకోసం కొంత సినీమా కట్ చేసేస్తారు. కొన్ని మంచిపాటలు కూడా కనపడవు. ఒరిజినల్ సినీమా చూసిన ఆనందం, తృప్తి టివి సినీమా లలో వుండదు.

మా నాన్నగారు, అమ్మగారు కూడా పిల్లలతో ఏ విషయంలో కఠినంగా వ్యవహరించేవారు కాదు.  కొట్టి తిట్టడం ద్వారా పిల్లలు బాగా చదువుతారు, క్రమశిక్షణతో వుంటారనే విషయంలో మా పెద్దలకు నమ్మకం లేదు. 

ఘంటసాలవారి పెద్దబాబు (విజయకుమార్)ను కూడా స్కూల్లో చేర్చారు. పాండీబజార్ లోని హోలీ ఏంజెల్స్ కాన్వెంట్. అతనికి చిన్నతనం కావడం వలన  రోజూ స్కూలుకు వెళ్ళడానికి చాలా మారాం చేసేవాడు. నేను శెలవుదినాలలో పాప పిన్నిగారితో కలసి ఆ నాష్ కారులో వెళ్ళి కాన్వెంట్ లో దింపడం, తిరిగి తీసుకురావడం జరిగేది. చదువు, తెలివితేటల విషయంలో పెద్ద బాబు, నేనూ సేమ్ టు సేమ్. 

బాబూ వాళ్ళమ్మగారు పిల్లల పెంపకం విషయంలో మా అమ్మగారికి పూర్తి విరుధ్ధం. కోపం వస్తే చాలా కఠినంగానే వుండేవారు. ఆవిడ గట్టిగా అరిచారంటే పిల్లల లాగూలు తడిసిపోయేవి. వారి పిల్లలందరికీ ఆవిడ పెట్టే తొడపాశాలు అనుభవమే. అలాటి సందర్భాలలో పిల్లలను అనునయించి, సముదాయించడం మా అమ్మగారు, పాప పిన్నిగారి వంతు. అయితే ఈ రకమైన థర్డ్  డిగ్రీ పనిష్మెంట్లు అన్నీ అయ్యగారు ఇంటిలో లేనప్పుడే. ఆయన పిల్లలను ముద్దుగానే చూసుకునేవారు. కానీ, పెద్దబాబుకు కూడా నాలాగే వాళ్ళ నాన్నగారి దగ్గర చనువు తక్కువే. సాధ్యమైనంతవరకూ మాస్టారి ఎదుటపడేవాడు కాదు. 

విజయకుమార్ కు చదువు చెప్పడానికి ఇంటికి ఒక ముసలి అయ్యవారు వచ్చేవారు. స్కూల్ లో చదువు చెప్పే మాస్టర్లను అయ్యవారని పిలవడం పరిపాటి. ఆ ముసలి అయ్యవారి దగ్గర పెద్దబాబు చదువు చాలా వినోదాత్మకంగా వుండేది. 

ఆ విశేషాలన్నీ వచ్చేవారం.....
                    ...సశేషం


*With a view to make the narrative more authentic and to corroborate it, images, audio and video clips are attached at appropriate places. If such usage is found objectionable to the copyright holders the same shall be removed if and when notified.

Saturday, November 21, 2020

నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 2 - ఏడవ భాగం

20.11.20 - శుక్రవారం భాగం - 7*:
అధ్యాయం 2 భాగం 6 ఇక్కడ

  

నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్

35, ఉస్మాన్ రోడ్ లో దీపావళి పండగ చాలా సంతోషంగా దేదీప్యమానంగా జరిగేది. దీపావళీ అమావాస్య మర్నాడు ఉత్తర భారతదేశంలో లక్ష్మీపూజ చాలా ఘనంగా జరుపుతారు. అదేరోజున కార్తీకమాసం ప్రారంభం. కార్తీకమాసమంతా పూజలు, వ్రతాలు, దానధర్మాలు, సంతర్పణలు జరిపే మాసం. ఉత్తరాది వ్యాపారస్తులంతా దీపావళీ మర్నాడు లక్ష్మీకుబేర పూజలు చేసి కొత్త పద్దులకు శ్రీకారం చుట్టుతారు. వ్యాపారానికి కొత్త సంవత్సరం ఆనాటినుండే ప్రారంభం. గవర్నమెంట్ ఫైనాన్షియల్ ఇయర్ ఏప్రిల్1-మార్చ్31. కానీ చాలా మంది వ్యాపారస్తులు నవంబరు1-అక్టోబర్31 పరిగణిస్తారు. గతంలో నేను పనిచేసిన  కంపెనీలో కూడా నవంబర్-అక్టోబర్ ఎక్కౌంటింగ్ ఇయర్ గా పనిచేసేవారు. వర్కర్లకు, ఉద్యోగస్తులకు అక్టోబర్ లోనే దసరా, దీపావళీ సందర్భంగా బోనస్ లు బట్వాడా చేసేవారు.

రాజశ్రీ/శ్రీ/రాజలక్ష్మీ ప్రొడక్షన్స్ అన్న మూడు సినిమా నిర్మాణ సంస్థల అధినేత సుందర్లాల్ నహతా ప్రముఖ మార్వాడీ వ్యాపారవేత్త. ఆయనకు చిత్రనిర్మాణం, సినీమాల డిస్ట్రిబ్యూషన్లతో పాటూ సినీమాలకు ఫైనాన్స్ చేయడం వంటివి ఉండేవి. సుందర్లాల్ నహతాగారికి ఘంటసాలవారంటే చాలా గౌరవం, మంచి స్నేహం వుండేవి. దీపావళీ మరుసటిరోజు సాయంత్రం సుందర్లాల్ గారు తమ స్వగృహంలో జరిగే లక్ష్మీపూజకు ఘంటసాలవారిని ప్రత్యేకంగా ఆహ్వానించి గౌరవించి సత్కరించడం ఒక ఆనవాయితి. ఘంటసాల మాస్టారు సర్వసాధారణంగా అరవవాళ్ళ పద్ధతిలో తెల్ల వేష్టీ - లుంగీ ధరించేవారు. కొన్ని ప్రత్యేక సందర్భాలలో మాత్రం  పంచె కట్టుకునేవారు. సుందర్లాల్ గారింటి లక్ష్మీపూజలకు సంప్రదాయబధ్ధంగా తెల్లటి పంచె, తెల్లటి అరచేతుల చొక్కా ధరించి వెళ్ళడం బాగా గుర్తు.

సుందర్లాల్ నహతా నిర్మించిన మొట్టమొదటి తెలుగు చిత్రం 'జయం మనదే' మొదలు 'సతీ అనసూయ', మంచి మనసుకు మంచిరోజులు', 'శభాష్ రాముడు', 'రక్తసంబంధం', 'శాంతినివాసం', 'అభిమానం', 'శభాష్ రాజా', 'బందిపోటు', 'వీర కేసరి' (కన్నడం) చిత్రాల వరకూ వరసగా ఘంటసాలవారే సంగీత దర్శకత్వం నిర్వహించారు. ఈ చిత్రాలన్నిటికీ మా నాన్నగారు కూడా సహాయ సంగీత దర్శకులలో ఒకరుగా పనిచేశారు. కానీ, సినీమా టైటిల్స్ లో పేరు వేయడమనేది 'అభిమానం' చిత్రంతోనే ప్రారంభమయింది. 1955 నుండీ ఘంటసాలవారి వద్ద సంగీత సహాయకుడిగానే పనిచేస్తున్నా కొన్ని సినీమాలలో పేర్లు వేయడానికి, మరికొన్ని సినీమాలలో పేరు కనపడకపోవడానికి కారణమేమిటో నాకు అర్ధం కాదు. 'అభిమానం' సినీమాకు పూర్వం సినీమా టైటిల్స్ లో 'సంగీతరావు' అనే పేరు చూసిన గుర్తు లేదు.


శాంతినివాసం చిత్రంలో మా నాన్నగారు తొలిసారిగా వీణ వాయించిన గుర్తు. అలాగే అదే సంవత్సరం విడుదలైన 'భక్త రఘునాధ్' చిత్రం లో కూడా వీణవాయించేరు. అప్పటినుండి అవసరాల మేరకు హార్మోనియంతో పాటూ వీణను కూడా సినీమాలలో వాయించేవారు.

అసలు సినిమాలలో టైటిల్స్ కు అథారిటీ ఎవరో? అసిస్టెంట్ డైరక్టరా? ప్రొడక్షన్ మేనేజరా? నిర్మాత? సంగీత దర్శకుడా? ఎవరు ఎవరిని సంప్రదించి  నటీ నటులు, ఈ సాంకేతిక నిపుణుల పేర్లు టైటిల్స్ వేస్తారు? ఎందుకంటే 'పాండురంగ మహత్యం' సినీమాలో నేపధ్యగాయకునిగా ఘంటసాలవారి పేరు లేదు. ( సింగర్స్ కార్డే మిస్సింగ్).

సినీమా టైటిల్స్ లోని పేర్ల విషయంగా మా నాన్నగారిని అడిగితే, సమాధానం 'తెలియదు'. అంటే ఆ విషయం పట్ల ఆసక్తి లేదని అర్ధం. బందిపోటు/వీరకేసరి చిత్రాల తరువాత ఘంటసాల మాస్టారు సుందర్లాల్ నహతాగారి సొంత చిత్రాలకు సంగీత దర్శకుడిగా పనిచేయలేదు. కానీ, తాము డిస్ట్రిబ్యూషన్ చేస్తున్న కొన్ని సంస్థలకు ఘంటసాలవారే సంగీత దర్శకుడిగా నియమించబడేందుకు ప్రోత్సహించేవారని వినికిడి. 

ఇంక, దీపావళీ ముచ్చట్ల నుండి అసలు కథలోకి వద్దాము. 

ఘంటసాలవారింట్లో చాలామంది వ్యక్తులుండేవారు. ఎవరు ఎవరో తెలిసేది కాదు. తరుచూ, 'తాతా', 'పాపా' అనే పేర్లు వినబడేవి. కానీ, ఆ వయసువాళ్ళెవరూ కనపడేవారు కాదు. ఒకరోజు ఆ గుట్టు తెలిసిపోయింది. పక్కపాపిడి, వంకీల ఒత్తైన నల్లటి జుత్తు సాఫీగా దువ్వుకున్న ఒక పాతికేళ్ళ యువకుడినే ఈ పెద్దవాళ్ళందరూ తాతా అని పిలుస్తున్నారు. ఆయనే పిల్లలందరూ బాబాయి అని పిలిచే ఘంటసాలగారి తమ్ముడు సదాశివుడుగారు. నాన్నగారు కూడా ఆయన్ని తాతగారనే అనేవారు. ఇక పాప అంటే చిన్నపాపేంకాదు. ఆయన భార్య, పిల్లలందరికీ పిన్ని, ఘంటసాలవారి మేనకోడలు, వాళ్ళ అక్కగారు జయప్రద, బావగారు ర్యాలి పిచ్చిరామయ్యగారి పెద్దకుమార్తె, సుబ్బలక్ష్మి.  తాత, పాప జోడీ అప్పట్లో వింతగా అనిపించేది. వీరు కాక రామచంద్రరావు. మెడ్రాస్ హార్బర్ లో పనిచేసేవారు. మొదట్లో బంధువేమో అనుకునేవాడిని. కారణం, ఆయన ఇంట్లో వారందరితో చాలా చనువుగా ఉండేవారు. ఒక్క ఘంటసాలవారిని మాత్రం 'అయ్యగారు' అని పిలిచేవారు. మిగతావారందరినీ ఏకవచన ప్రయోగమే. ఆయనకి ఘంటసాలవారికి పానగల్ పార్క్ కాలంనుండీ స్నేహం. ఆయనకు సంసారం లేదు. ఘంటసాలవారి కుటుంబమే తన కుటుంబం. ఆ ఇంట్లో ఇద్దరు కృష్ణులు. ఒకరు తమ్ముడు కృష్ణ. పిల్లలందరికీ గుండుమాఁవయ్య, బందరువాసి కొమరవోలు కృష్ణారావు.  వాళ్ళ సొంతవూరు బందరు గురించి ఎప్పుడూ చెప్పేవారు. ఊరు ప్రయాణాల్లో ఘంటసాలవారి పర్సెనల్ అసిస్టెంట్. మరొకరు మామయ్య కృష్ణ, సావిత్రమ్మగారి మేనమామ. కేరళ పాలక్కాడుతో సంబంధం ఉన్న వ్యక్తి. తమ్ముడు కృష్ణ సావిత్రమ్మగారిని, పాపగారిని అక్కయ్య అని పిలిచేవారు.  వాళ్ళ మధ్య ఏ రకమైనా పోలికలు వుండేవికావు. ఇదంతా, 35, ఉస్మాన్ రోడ్ ఇంట్లోని వ్యక్తుల గురించి ఏమాత్రం అవగాహన లేని రోజుల్లో నాలో మెసిలే ఆలోచనలు. 

తమ్ముడు కృష్ణ ఇంటిపనుల్లో చేదోడువాదోడుగా ఉండేవారు. సదాశివుడుగారు, మామయ్య కృష్ణ జివిఎస్ ప్రొడక్షన్స్ నిర్మాణ కార్యకలాపాలు చూసేవారు. ఉదయం తొమ్మిది గంటలు అయేసరికి ఆ ఇల్లంతా వచ్చేపోయే జనాలతో కలకలలాడూతూండేది. పామర్తిగారు, రాఘవులుగారు (మాస్టారి సహాయకులు), సుబ్బు (ప్రొడక్షన్ మేనేజర్), బి.హరినారాయణ, దేవేంద్ర (ఫిల్మ్ ఎడిటర్స్) తరుచూ కనిపించేవారు. ప్రొడక్షన్ ఆఫీస్ కూడా మేడమీదే కావడంవలన వీళ్ళంతా సాయంత్రం వరకూ అక్కడే వుండి ఆ వ్యవహారాల గురించి చర్చించుకునేవారు. షూటింగ్ రోజుల్లో లొకేషన్స్ కు వెళ్ళి ఏ రాత్రికో తిరిగి వచ్చేవారు. వీళ్ళే కాక సినీమాలలో పాటలు పాడే కోరస్ ఆర్టిస్ట్ లు, కొంతమంది టెక్నిషియన్స్ వస్తూండేవారు. వీళ్ళలో చాలామంది ఘంటసాలవారిని 'అయ్యగారూ' అని, సావిత్రమ్మగారిని 'అమ్మగారూ' అని పిలిచేవారు. దీనివల్ల నాకు ఒక క్లూ దొరికింది. అవసరమైనప్పుడు నేను కూడా అయ్యగారు, అమ్మగారు అని పిలవడం అలవాటు చేసుకున్నాను. వారిని ఎలా పిలవాలి అనే ప్రశ్నకు సమాధానం దొరకడంతో చాలా రిలీఫ్ గా అనిపించింది. 

అయ్యగారు సాధారణంగా ఉదయం ఎనిమిది గంటలకు రెడీ అయిపోయేవారు. ఈలోగా రాఘవులుగారు వచ్చేవారు. ఆయన, పామర్తిగారూ కూడా అయ్యగారు, అమ్మగారు అనే పిలిచేవారు. మా నాన్నగారు మాత్రం ఘంటసాలవారిని మాస్టారు అని పిలిచేవారు. ఆయన 'సంగీతబాబూ' అని సంబోధించేవారు. సావిత్రమ్మగారు, పాపగారు, మొదలైన వారంతా  'సంగీతం'గారు అని పిలిచేవారు.  మాస్టారితో కూడా తోడుగా రికార్డింగ్ లకు, రిహార్సల్స్ కు రాఘవులుగారు మాత్రమే వెళ్ళేవారు. మాస్టారి సంగీత దర్శకత్వం వహిస్తున్న సినీమాల కంపోజింగ్, రిహార్సల్స్, రికార్డింగ్, రీరికార్డింగ్ ల సమయంలో మాత్రమే మా నాన్నగారు, పామర్తిగారు, రాఘవులుగారు కలిసి పనిచేసేవారు. మిగతా సమయాలలో మాస్టారు  పిలిపిస్తేనే తప్ప మా నాన్నగారు వెళ్ళేవారు కాదు. మేముండే ఔట్ హౌస్ లోనే సంగీత సాధనలోనో, గ్రంధపఠనంలోనో, రచనా వ్యాసాంగంలోనో నిమగ్నమైవుండేవారు. ఆయనకు ఇతరుల విషయాల్లో అనవసర జోక్యం, హస్కు, గాలికబుర్లు అంటే ఇష్టముండేదికాదు. పిల్లలం మాకూ  కూడా తరవాత అదే అలవాటయింది. 

పామర్తిగారి సతీమణి రాజమ్మగారు (రాజ్యలక్ష్మి), వారి అమ్మాయి రావమ్మ (రామలక్ష్మి) తరుచూ మాస్టారింటికి వచ్చేవారు. చాలా చనువుగా వుండేవారు. ఆ అమ్మాయి సావిత్రమ్మగారిని, పాపగారిని అక్కయ్యా అని పిలిచేది. ఘంటసాలవారిని మావయ్యా అనేది. సదాశివుడిగారిని తాత అనేది. వారంతా ఒకరికొకరు బంధువులనుకునేవాడిని చాలా రోజులు. కానీ కాదు. పక్క పక్క గ్రామాలవారు. ఈ వరసలు నాకు వింతగావుండేవి. అక్కయ్య భర్త బావ అవుతారు. మావయ్య భార్య అత్త కదా! ఈ రకమైన చుట్టరికాలు నాకు కొత్త. అర్ధం చేసుకోవడానికి చాలాకాలమే పట్టింది. రావమ్మ నాకంటే కొంచెం పెద్దది. అప్పటి నా దృష్టిలో చాలా ధైర్యస్థురాలు. ప్రాథమికదశలో స్పోకెన్ తమిழ்కి నాకు కోచ్. అప్పట్లో పామర్తిగారి కుటుంబం జి.ఎన్.చెట్టి రోడ్ లో వాణీమహల్ దగ్గర నార్త్ క్రిసెంట్ రోడ్ లో వుండేవారు. సంగీత దర్శకుడు టి.చలపతిరావుగారు, దర్శకుడు టి. ప్రకాశరావుల ఇళ్ళుకూడా ఆ ప్రాంతమేనని గుర్తు. ఆ రోడ్ మీదే మరికొంచెం ముందుకు వెళితే ఎడమవేపు లక్ష్మీ కాలనీ. అందులో మాధవపెద్ది సత్యం, మాధవపెద్ది గోఖలే, పింగళి నాగేంద్రరావుగార్ల ఇళ్ళుండేవి. 

ఘంటసాలవారింటి పోర్టికోలో ఎప్పుడూ రెండు మూడు కార్లుండేవి. ఒకటి వాక్సాల్ కారు. ఒకటి ముదురాకుపచ్చ రంగులోని మారీస్ మైనర్. మూడవది నాష్  కారు. నలుపు రంగు కారు. పాతకాలం మోడల్. పెద్దదిగా సోఫాలాంటి సీట్లతో కుటుంబం అంతా ఒకేసారి వెళ్ళడానికి అనువుగా వుండేది. ఆ కారుకు రెండు పక్కలా ప్లాట్ ఫారమ్ లాటిది వుండేది. కిందకు దిగడానికి. కారు డిక్కీ కూడా విశాలంగా వుండేది. అయితే ఆ కారుకు స్టార్టింగ్ ట్రబుల్ . హేండిల్ వేసి స్టార్ట్ చేయడానికి  తెగ యాతన పడేవారు. ఆ కారును సుబ్బు (బి.సుబ్బారావు) అవసరానికి ఉపయోగించేవారు. మాస్టారు వాక్సాల్ కారులో వెళ్ళేవారు. డ్రైవర్ పేరు గోవిందు. అరవ తెలుగులో మాట్లాడేవాడు. 

ఆ నాష్ (Nash) కారు పెద్ద బాబుకు, నాకు ఆటస్థలం. అతను స్టీరింగ్ వీల్ ముందు కూర్చొని దాన్ని అటు యిటూ తిప్పుతూండేవాడు. నేను పక్కన కూర్చొని గట్టిగా అరుచుకుంటూ ఆడేవాళ్ళం. నాకు ఈ కార్లు పేర్లు కొన్ని తెలిసాయంటే దానికి కారణం పెద్దబాబే. ఇద్దరం వీధి గేటు బయట నిలబడి వచ్చేపోయే కార్లను చూస్తూండేవాళ్ళం. ఎక్కడో బజుల్లా రోడ్ దగ్గర కారుకు హారన్ వేస్తే ఆ కారు పేరు ఏమిటో చెప్పేసేవాడు. ఏ కారు హారన్ ఎలావుంటుందో చెప్పేవాడు. చాలావరకు నిజమే అయివుండేవి. అంతవరకూ నేను విన్న కారు పేరు ఫోర్డ్ మాత్రమే. బొబ్బిలి రాణీగారిది. ఈ ఉస్మాన్ రోడ్ ఇంటికి వచ్చాక పెద్దబాబు ద్వారా ప్లిమత్, డాడ్జ్, కాడిలాక్, ఆస్టిన్ ఇంగ్లాండ్, ఫియట్, మారీస్ మైనర్, ల్యాండ్ మాస్టర్ వంటి కొన్ని కార్ల పేర్లు తెలిసాయి. అలాగే, ఆకాశంలో ఎక్కడో ఎగిరే ఏరోప్లేన్ల గురించి కూడా వర్ణించేవాడు. వాళ్ళ నాన్నగారు ఏరోప్లేనులో ప్రయాణం చేసినప్పుడు ఆయనతోపాటూ ఏర్ పోర్ట్ దాకా వెళ్ళిన అనుభవం కావచ్చును. డకోటా అని, బోయింగ్ అని, జెట్ అని ఏవేవో పేర్లు చెప్పేవాడు. కనీకనిపించకుండా ఆకాశంలో ఎగిరే ఆ ప్లేన్ లు ఎక్కడినుండి ఎక్కడికి వెడుతున్నాయో కూడా వివరించి చెప్పేవాడు. అయితే ఆ మాటలు నిజంకావని అతని ఊహాగానం అని తరువాత తెలుసుకున్నాను. 

పెద్దబాబుకు పామర్తి గారి దగ్గర చాలా చనువుండేది. మావయ్యా అని పిలిచేవాడు. (నాకు ఈ వరస కూడా తికమకగానే వుండేది). ఆయన వచ్చినప్పుడల్లా కార్ల గురించే ఏవో ప్రశ్నలు వేసేవాడు. ఆయన కూడా మరింత ఉత్సహాంతో మౌంట్ రోడ్ ఖివ్ రాజ్ మోటార్స్ లో కొత్త మోడల్ కారు చూశానని అది బుక్ చేద్దామనుకుంటున్నాని అనేవారు. సావిత్రమ్మగారితో కూడా ఆ కొత్త కార్లు వాటి రేట్ల గురించి వివరించి చెప్పేవారు. 

ఒకరోజు నేనూ, పెద్దబాబు ఆ నాష్ కారులో కూర్చొని ఆటలు మొదలెట్టాము. కొంతసేపు అయ్యాక పెద్దబాబు ఇప్పుడే వస్తాను కూర్చోమని చెప్పి కారు దిగి కారు డోర్ గట్టిగా మూసి లోపలకు వెళ్ళాడు. ఆ అదురుకి ఈ కారు సడన్ గా 'బొయ్'మని హారన్  మ్రోగడం మొదలెట్టింది. నాకు కంగారు పుట్టింది. ఆ హారన్ ఎలా ఆపాలో ఏమిటో ! ఎక్కడ ఏమయిందో తెలీదు. ఆ సౌండ్ కు ఇంట్లోవారంతా బయటకు వచ్చేసారు. ఈలోగా సుబ్బు వచ్చి ఏవో రెండు వైర్లను విడదీయడంతో హారన్ మ్రోగడం ఆగింది. పెద్దవాళ్ళెవరూ లేకుండా కారులో ఆడకూడదని, కారు గేర్ సరిగాలేకపోతే ముందుకెళ్ళి దేన్నైనా గుద్దేస్తుందని మందలించారు. నాకు అవమానంగా తోచింది. నేనుగా ఆ కారు ఎక్కలేదని, అంతవరకు పెద్దబాబు కూడా అక్కడే ఉన్నాడని చెప్పలేకపోయాను. అలా చెపితే అతనిమీద పితూరీలు చెప్పినట్లవుతుందని నా భావన. పిల్లల్లో complaining nature వుండకూడదని, సద్దుకుపోయే స్వభావం వుండాలని మా నాన్నగారు చేసే హితబోధలవలన నేను నోరు మెదపలేదు. ఆ సంఘటన జరిగాక నేను అక్కడున్న ఏ కారువైపుకి తిరిగి చూడలేదు. పెద్దవాళ్ళెవరైనా పిల్చి కారు ఎక్కమనేదాకా ఎక్కేవాడిని కాదు. 

తర్వాత, మా ఆట స్థలం  మేడమీదికి మారింది. అక్కడ ఒక గదిలో బోల్డెన్ని రంగు రంగుల చమ్కీల ముఖమల్, సాటీన్ బట్టలు పడివుండేవి. అవన్నీ సినీమాలో ఉపయోగించడానికని చెప్పాడు.  ఆ రంగు రంగుల బట్టలు సినీమాలలో తెలుపు, నలుపు రంగులలోనే ఎందుకు కనిపించేవో తెలిసేది కాదు. అక్కడే ఒక తోరణానికి ఒక పెద్ద గంట వేలాడుతూండేది. ఆ తోరణానికి క్రింద 'GVS PRODUCTIONS' అని ఇంగ్లీష్ లో రాసివుండేది. గుడిగంటలా కనపడే ఆ పెద్ద గంటను మ్రోగించి చూసాను. దేవాలయం గంటలా మ్రోగనేలేదు. 'డబ్ డబ్ డబ్' మనేది. నాకు చాలా విచిత్రమనిపించింది. అక్కడే కొన్ని ఫోటో ఆల్బంలు వుండేవి. అందులో ఎన్.టి.రామారావు, జానకి, రాజసులోచన, సిఎస్ఆర్, మొదలైనవారి ఫోటోలుండేవి. 

అప్పట్లో 'సొంతవూరు' సినీమా నిర్మాణంలో వుంది. ఈ సినీమాను ఘంటసాల వారే నిర్మించారు. ఇది వారి రెండవ చిత్రం. మొదటి చిత్రం 'పరోపకారం'. 

ఈ సొంతవూరు  సినీమాలోని 'మనవూరే భారతదేశం మనమంతా భారతీయులం' పాట రికార్డింగ్ కు వెళ్ళాను. మాస్టారు పాడిన ఈ కోరస్ పాటలో  రావూరి వీరభద్రం కూడా కోరస్ పాడారు. భద్రంగారు కూడా విజయనగరం మ్యూజిక్ కాలేజీలో మా తాతగారి దగ్గరే సంగీతం నేర్చుకున్నారు. 


తాతగారితో ఆర్.వి. భద్రం ఇతర శిష్యులు

పైనున్నగ్రూప్ ఫోటోలో తాతగారికి ఎడమవైపు కింద కూర్చునున్నాయన. సినిమాలలో పాటలు పాడాలని మద్రాస్ వచ్చి  పాపం చాలా అవస్థలే పడ్డారు. కొన్నాళ్ళు కోరస్ లు పాడాక, గాయకుడిగా మనుగడ సాగించడం కష్టమని గ్రహించి ఘంటసాలవారి సలహాతో వైలిన్ సాధన ప్రారంభించి ఎట్టకేలకు ఘంటసాల ఆర్కెష్ట్రా లో స్థానం సంపాదించారు. సొంతవూరు సినీమా పాటల రికార్డ్ లు 78 RPM నల్లటి రికార్డులు కావు. నేను చూసినప్పుడు అవి తెల్లగా చిన్నవిగా వుండేవి. అవి వినైల్ రికార్డ్ లని బాబూ వాళ్ళమ్మగారు చెప్పారు. ఈ సినిమా పాటలు ఎందుకనో HMVకి గాని, కొలంబియాకు గాని ఇవ్వలేదు. వేరెవరో రిలీజ్ చేశారు. 
                        


ఎన్ టి రామారావు శ్రీకృష్ణుడి వేషంలో మొట్టమొదటిసారిగా తెరపైన కనిపించింది ఈ సొంతవూరు చిత్రంలోనే ఒక (డ్రీమ్ సాంగ్ కావచ్చును. గుర్తులేదు). నటి రాజసులోచనకు తెలుగులో హీరోయిన్ అంతస్తు కల్పించినది కూడా ఈ సొంతవూరు చిత్రమేనని అనుకునేవారు.



1956 వేసవి శెలవులు తర్వాత నన్ను పనగల్ పార్క్ ఎదురుగా పాండీబజార్ రోడ్ దగ్గర రామకృష్ణ మిషన్ హైస్కూల్ మెయిన్ బ్రాంచ్ లో 8 వ తరగతిలో చేర్పించారు.

ఆ విశేషాలన్నీ..... వచ్చేవారం... 
...సశేషం

*With a view to make the narrative more authentic and to corroborate it, images, audio and video clips are attached at appropriate places. If such usage is found objectionable to the copyright holders the same shall be removed if and when notified.