visitors

Sunday, June 6, 2021

నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 2 - ముఫ్ఫై నాలుగవ భాగం

06.06.2021 - ఆదివారం భాగం - 34*:
అధ్యాయం 2  భాగం 33 ఇక్కడ




నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్

నెం.35, ఉస్మాన్ రోడ్ మెయిన్ గేట్ మీద అర్ధచంద్రాకారంలో ఒక ఇనప ఆర్చ్. ఆ ఆర్చ్ మీద బోగన్విల్లా క్రీపర్. మెజెంటా కలర్ లో గుత్తులు గుత్తులుగా ఏ వాసనా వుండని పువ్వులు. జాగ్రత్తగా వుండకపోతే  అప్పుడప్పుడు గుచ్చుకునే ముళ్ళుఎండిపోయిన సన్నపాటి మోళ్ళు.  ఆ గేటు దాటి లోపలికి ప్రవేశిస్తే ఒక పెద్ద కారు పట్టేంత పోర్టికో. ఆ పోర్టికో దక్షిణం పిల్లర్ ముందు ఒక పూలమొక్క. గుత్తులు గుత్తులుగా సన్నటి తెల్లటి పూవులు పూసేది. రాత్రిపూట చాలా సువాసనలు వెదజల్లేది. అందువల్ల అది నైట్ క్వీన్  అని అనుకునేవాడిని. మా పెద్దలు అలాగే చెప్పారేమో కూడా. ఆ పూలమొక్క కాయలు మిరియం గింజలులా ఆకుపచ్చగా మెరుస్తూవుండేవి. అవి పండిపోయేసరికి బచ్చలిపండులా తయారయేవి. వాటిని పట్టుకోగానే చిట్లిపోయి లోపలినుండి పింక్ కలర్ ద్రవం వచ్చేది. అది బట్టలమీద పడితే ఎన్ని ఉతుకులు ఉతికినా ఆ పింక్ రంగు పోయేదికాదు. ఏప్రిల్ ఫూల్ చేయడానికిహోలీ సమయాలలో ఆ నైట్ క్వీన్ పళ్ళు మాకు ఉపయోగపడేవి. ఆ పోర్టికో ఎడమవేపు ఇంటివెనక వెళ్ళడానికి ఒక సందు. ఆ సందులో కాంపౌండ్ వాల్ ను ఆనుకొని ఒక దానిమ్మచెట్టు. అనార్కలీ అనీ ప్రేమతో పిలచుకోవడానికి ఎర్రటి పువ్వులు మాత్రం చక్కగా పూసేది. ఆశగా కోసుకుతినేలాటి పళ్ళుమాత్రం కాసిన గుర్తులేదు. మా ఔట్ హౌస్ ఆనుకొని ఒక జామిచెట్టు. పళ్ళుతోముకుందుకు ఉపయోగపడేది. దానిపక్కనే ఒక మునగచెట్టు. పాపందాని వంతుకు అది బాగానే కాచేది కానిఆ చెట్టు మొదట్లో విపరీతమైన తెల్లగొంగళీలు చేరేవి. అవి ఒంటిమీద ప్రాకితే విపరీతమైన దద్దుర్లు. ఆ గొంగళీలను తొలగించడానికి పొగపెట్టేవారు. మాకు దగ్గువచ్చి ఉక్కిరిబిక్కిరి అయ్యేవాళ్ళమేతప్ప గొంగళీలు పోయేవికావు. చివరకు ఆ మునగచెట్టునే సమూలంగా నరికిపారేసారు. నూతివేపు ఒక వేపచెట్టు. చల్లటిగాలిమంచి నీడతో అక్కడ హాయిగా వుండేది. అక్కడే బట్టలు ఉతికడానికి రెండు బండలు. అవి వాషింగ్ మెషిన్లుసర్ఫ్, ఎక్సెల్ వాషింగ్ పౌడర్లులిక్విడ్ లు లేని రోజులు. కొంత స్థోమత కలిగినవారు  పసుపురంగు  'సన్ లైట్వాషింగ్ సోపును వాడేవారు. 501 బార్ సోప్ కూడా అధికంగా అమ్ముడుపోయేది. ఆ సోప్ వాటరంతా అరటి చెట్టు మొదట్లోకి చేరేది. ఆ చెట్టుకు ఎదురుగా ఇంట్లోకి వెళ్ళడానికి ఒక దవ్వారం. దాని తర్వాత  మేడ మీదకు వెళ్ళే మెట్లగది. అది దాటి ముందుకు వెడితే మెయిన్ గేట్. నెం. 35, ఉస్మాన్ రోడ్ కు ఒక ప్రదక్షణం కొట్టడమయింది. 

ఇంటికి నాలుగు ప్రక్కలా మంచి గార్డెన్ పెంచాలని అమ్మగారికి (సావిత్రమ్మగారికి) కోరిక. కానీ మంచి పూలమొక్కలు పెంచడానికి తగిన భూసారం ఆ స్థలంలో లేకుండా నానారకాల సిమెంట్ఇటికకాంక్రీట్ వంటి రబిష్ తో మొదట్లో నింపారట. అందువలన సుందరమైనసువాసనలు వెదజల్లే సున్నితమైన మొక్కలు పెంచుకోవాలనే ఆశ నెరవేరలేదు.

 

కారు పోర్టికోలో నుండి వరండా మెట్లెక్కి వస్తే అక్కడ ప్రధాన ద్వారం. రోస్ వుడ్ కలర్ తలుపు. సగం నాన్ ట్రాన్సపెరెంట్ మ్యాటీ అద్దంతో  వుండేది. (ఇప్పుడు అదే తలుపు పార్థసారధిపురంలోని రత్నకుమార్ ఇంటికి అమర్చినట్లుగావుంది) ఆ తలుపు తెరవగానే ఒక పెద్ద హాలు ఆ హాలు దాటగానే ఎడమవైపుకు బయటకు వెళ్ళడానికి ఒక ద్వారం. కుడివేపు మరో చిన్న హాలు అక్కడో ద్వారం. పక్కనే ఒక బెడ్ రూమ్. చిన్నహాలు దాటాక స్టోర్ రూము లాటి గది. కుడివైపు వంటగది. ఆ స్టోర్ రూమ్ దాటాక కుడివేపు బాత్ రూము. ఎడమవేపు టాయిలెట్ వుండేది. ఘంటసాల మాస్టారు 1950 లలో ఆ ఇల్లు కొనడానికి ముందెప్పుడో   ఆ భవనం ఒక దొరదే అయినా ఆ ఇంటికి ఎటాచ్డ్ బాత్ సంస్కృతి ఏర్పడలేదనుకుంటాను. అక్కడ ఒక ద్వారం. అది  దాటితే చిన్న ఖాళీ ప్రదేశం. ఎదురుగా ఔట్ హౌస్. ఆ ఔట్ హౌస్ లో పామర్తిగారుకుటుంబం సుమారుగా ఓ ఐదేళ్ళుమేము ఓ 28 సంవత్సరాలు నివసించాము. నేనూమా పెద్ద చెల్లెలు రమణమ్మ తప్ప మిగిలిన నలుగురు పిల్లలు ఆ ఇంట్లోనే పుట్టిపెరగడం విద్యాబుధ్ధులన్నీ ఆ చిన్ని ఔట్ హౌస్ లోనే జరిగాయి.

 

నెం. 35 ఉస్మాన్ రోడ్ లో కొట్టచ్చేలా ప్రామినెంట్ గా కనపడేది మెయిన్ హాలు మాత్రమే. మిగిలిన గదులన్నీ చిన్నవే.  ఘంటసాల మాస్టారు తన కంపోజింగ్ కు రిహార్సల్స్ కోసం కావలసినంత పెద్ద హాలున్న ఇంటినే ఎన్నుకున్నారు తప్ప ఇతర వసతుల సంగతి పట్టించుకోలేదని అమ్మగారు అంటూ వుండేవారు. తర్వాత మేడమీది ఇల్లు కట్టినప్పుడు మరికొంత విశాలంగా కట్టించారు. అలాటి నెం.35,ఉస్మాన్ రోడ్ మెయిన్ హాల్ లో ఎన్నో కంపోజింగ్ లుమ్యూజిక్ రిహార్సల్స్సినీ మ్యుజిషియన్స్ యూనియన్ మీటింగ్ లుసాహితీ సదస్సులు  జరిగాయి. దేశంలోని ప్రముఖ వ్యక్తులెందరో ఆ హాలులో సమావేశమయ్యారు. కవులుగాయకులు ఎందరో ఆ హాలులో కూర్చొని పాటలు వ్రాసారు. ప్రముఖ గాయనీ గాయకులెందరో పాటలు నేర్చుకున్నారు. అలాటి సరస్వతీ నిలయం ఒక అరవై ఏళ్ళ కాల వ్యవధిలో కనుమరుగైపోవడం తీరని వేదనగా అనిపిస్తుంది. కానీ ఆ జ్ఞాపకాలు ఏనాటికీ మరపురానివి.

🌿

నెం.35,ఉస్మాన్ రోడ్ ఇంటి మెయిన్ హాల్ లో పడమటవేపు గోడంతటికి ఒక పెద్ద అద్దాల బీరువా. దానినిండా ఘంటసాల మాస్టారి గాన ప్రతిభకు నిదర్శనంగా వివిధ ఆకారాలలో దర్శనమిచ్చే జ్ఞాపికలు అసంఖ్యాకం. కొత్తవి రాగానే పాతవి అటకెక్కేవి. ఒక్క మద్రాస్ ఫిలిం ఫ్యాన్స్ అసోసియేషన్ వారి మెమెంటోలే వరసగా ఏడాదికి ఒకటి చొప్పున పదిపన్నెండు ఉండేవి. ఆ సంస్థ నిర్వహించిన బ్యాలట్స్ లో ప్రతీ సంవత్సరం ఘంటసాలవారే ఉత్తమ గాయకుడిగా ఎన్నికవుతూ వచ్చారు. ఆ తర్వాత మాస్టారే ఆ బ్యాలట్స్ లో ఇక తన పేరును చేర్చవద్దని ఇతర గాయకులను ప్రోత్సహించే విధంగా ఏర్పాటుచేయమని కోరడం జరిగింది.  

ఒక సముద్రాల వారినిఒక మల్లాదివారినిఒక కృష్ణశాస్త్రి గారిని,ఆరుద్రగారినికొసరాజుగారినిశ్రీశ్రీ గారిని సి.నారాయణరెడ్డి గారినిదాశరధిగారిని,  పినిశెట్టి గారినిజరుక్ శాస్త్రిగారినియామిజాల వారినిరావులపర్తి భద్రిరాజుగారినిఇదే హాలులో చూసే అవకాశం నాకు కలిగింది. అలాగే లీలసుశీలకోమలజానకిపి.బి.ఎస్.మాధవపెద్దిపిఠాపురంపాణిగ్రాహిమల్లిక్ వంటి గొప్ప గాయకుల పాటను వినే అదృష్టం ఆ హాలు నాకు కలిగించింది. సినీమాలలో పాటలుడ్యాన్స్ లు అనేవి ఎక్కువగా భారతదేశపు సినీమాలలోనే కనిపిస్తాయి. హాలీవుడ్ సినీమాలలో ఈ ప్రక్రియ చాలా అరుదుగా కనిపిస్తుంది. పాశ్చాత్య సినీమాలలో సంగీతభరిత చిత్రంనృత్యభరిత చిత్రం అంటూ ప్రత్యేకించి ఎక్కువగా ఉండవు. కథతో సంబంధం లేకపోయినా రెండేసి రీళ్ళకు ఒక పాటడ్యాన్స్రీలున్నర ఫైట్స్ అనే   సినీమా ఫార్ములా సంస్కృతి  మన భారతదేశపు సినీమాలలోనే కనిపిస్తుంది.  సినీమా అంటే కేవలం ఒక వినోదసాధనంగా మనవాళ్ళకు అలవాటయిపోయింది. అందుకే ఇండియాలో ఆస్కర్ కి అర్హమైన ఆర్ట్ ఫుల్ సినీమాలకి ఆస్కారంలేదు.  


భారతదేశపు సినిమా ప్రపంచంలో వుండేంతమంది కవులుగాయకులుమ్యూజిక్ కంపోజర్స్ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్ మరే ఇతర సినీమాలలోనూ కనపడరు. ముఖ్యంగామన తెలుగు టాకీ పుట్టినప్పటినుండీ కడుపునిండా పాటలతోనే పుట్టింది. పాటలుడాన్స్ లు లేని తెలుగు సినీమాలను ప్రస్తుతానికైతే ఊహించనేలేము. మారుతున్నకాలాన్నిబట్టి సినీమా పాటల ధోరణి మారుతుంది. దానిని ఎవరూ ఆపలేరు. 

 

ఇక మన సినీమాలలో ఇన్ని రకాల పాటలెందుకు అని ఆలోచించి చూస్తేనాకు కలిగిన అభిప్రాయం ఏమంటే  - మాటద్వారా వ్యక్తీకరించలేని మనోభావాలను బయటకు చెప్పడానికి పాట ఒక సాధనం. మనలోని నవరస భావాలను పాటలో చెప్పినంత బాగా మాటలో చెప్పడం సాధ్యంకాదు. అందుకు సన్నివేశానుసారం పాటలువినోదాన్ని పంచే నృత్యాలువాటి ఆలంబనతో సాగే పాటలు మన సినీమాలకు అనివార్యం అయాయేమో అని అనిపిస్తుంది. నా యీ అభిప్రాయంలోవ్యక్తీకరణలో లోటుపాట్లు వుండవచ్చు.

 

కానీఒక్కటి మాత్రం నిజం. మన సినీమాల ద్వారా ఎన్నో వేలమంది సాహితీకారులకుసంగీత కళాకారులకు భుక్తి లభిస్తున్నది. వారి వారి ప్రతిభను బట్టి సమాజంలో గొప్ప గుర్తింపుకీర్తి ప్రతిష్టలుఆర్ధికోన్నతి లభిస్తున్నాయి. ఇప్పుడు ఘంటసాల మాస్టారి కాలంలో  తెలుగు సినీమాలలో  పాటలు  ఎలా రూపొందేవో నాకున్న కొద్దిపాటి పరిజ్ఞానంతో చెప్పడానికి ప్రయత్నిస్తాను.

 

ఒక శుభోదయాన  ఫలానా నిర్మాత ఆఫీసులోఫలానా టైములో  పాట కంపోజింగ్ పెడుతున్నారని,దానికి రావలసిందిగా ఆ చిత్ర సంగీతదర్శకునికవిగారినిచిత్రదర్శకుని ఆహ్వానిస్తారు. మ్యూజిక్ డైరక్టర్ తో పాటు ఒక తబలిస్ట్ ఒక హార్మనిస్ట్ (సాధారణంగా) కూడా వస్తారు. అలాగేడైరక్టర్ తో పాటూ అసిస్టెంట్ డైరక్టర్ వుంటారు. వారందరిని అనుకున్న సమయానికి ఆఫీసుకు తీసుకువచ్చే బాధ్యత మొదటిరోజుల్లో నిర్మాత యొక్క ప్రొడక్షన్ మేనేజరే చూసుకునేవాడు. వీరంతా అక్కడికి చేరగానే ఒకరినొకరు పలకరించుకొని ముచ్చట్లాడుతూంటారు. ఈలోగా కాఫీ టిఫిన్ కార్యక్రమం. ఉదయంపూట కంపోజింగ్ అయితే ఇడ్లీవడ లేదా పొంగల్వడవేడి వేడి కాఫీసాయంత్రం సమయమైతే బోండా లేదా బజ్జీవేడి వేడి కాఫీ. ఈ కాఫీ టిఫిన్లు సాధారణంగా పానగల్ పార్క్ దగ్గరలో వున్న  ఉడిపీ పార్క్ ల్యాండ్స్ హోటల్ లేదా పాండీబజార్ నారాయణన్ కేఫ్లేకపోతే గీతా కేఫ్ లనుండి తెప్పించేవారు. (గీతా కేఫ్ ఇంకా బాగానే నడుస్తోంది. నారాయణన్ కేఫ్ ప్రముఖ నటుడు  సి.ఎస్.ఆర్ గారి ఫేవరేట్ స్పాట్. ఇప్పుడు ఆ హోటల్ స్థానంలో అడయార్ ఆనందభవన్ స్వీట్స్ షాప్ వెలసింది. పార్క్ ల్యాండ్స్ హోటల్ ను నల్లీవారు ఒక పెద్ద జ్యువెలరీ షాప్ గా మార్చేశారు.)

 

ఈ టిఫిన్కాఫీల సెషన్ అయిన వెంటనే తాంబూల సేవనంలేదా తమకు ఇష్టమైన బ్రాండ్  శ్వేతకాష్టాలను ప్రత్యేకంగా తెప్పించుకొని మనసారా ఆస్వాదించుట. ఈ దినుసులన్నీ నిర్మాతగారి పద్దులోనే. ఈ పద్దులన్నీ ఏ విధంగా సద్దుబాటు చేయాలో చూసుకోవడానికి వేరే ఎక్కౌంటెంట్ వుంటాడు. ముందు ఆత్మారాముడిని సంతృప్తిపర్చాక అప్పుడు అసలు విషయం మీద కూర్చుంటారు. సీనీమా పరిభాషలో కథమీద 'కూర్చోవడంఅంటే పని ప్రారంభించడం. నిర్మాత గారి ఆదేశంతో డైరక్టర్ గారు తాము తీయబోతున్న సినీమా కథను సంక్షిప్తంగా వివరిస్తారు. చిత్రంలో నటిస్తున్న ప్రధాన పాత్రధారులుముఖ్యంగాపాటలు పాడే నటీనటులు గురించి చెపుతారు. ఈలోగా ఆయన అసిస్టెంట్ స్క్రీన్ ప్లే బుక్ తిరగేసి ఈ సినీమాకు ఎన్ని పాటలు అవసరమౌతాయోఎక్కడెక్కడ పాట వస్తుందో వంటి విషయాలను డైరెక్టర్ గారికి అందజేస్తాడు. ఆయన సభాముఖంగా అందరికీ తెలియజేస్తారు. ఎవరి లిమిట్స్ లో వారు వుండాలనే ఎథిక్స్ ను ఆనాటి వారు సక్రమంగా పాటించేవారు. అనవసర విషయాలలో జోక్యం చేసుకోవడంఅనుచిత సలహాలు ఇవ్వడం వంటివి వుండేవికావు. ఒకవేళ ఎవరైనా ఏదైనా చెప్పదలిస్తే ప్రాపర్ ఛానల్ లోనే జరగాలి. నిర్మాతదర్శకులే కీ హెడ్స్. వారి నిర్ణయమే తుది నిర్ణయం. అందువలన ఒక సినీమా ఫేటు డైరక్టర్ తెలివితేటలమీదనిర్మాత విజ్ఞత మీద ఆధారపడివుంటుంది. మిగిలిన శాఖలవారంతా ఎవరి పనిని వారు బాధ్యతాయుతంగా చేసుకుంటూపోతారే తప్ప ఇతరములైన వ్యాఖ్యలు ససేమిరా చేయరు. అది ఆనాటి వృత్తి శైలి.

 

డైరక్టర్ మొట్టమొదటగా పాట యొక్క సన్నివేశాన్నితెరమీద నటించబోయే నటీనటుల గురించిఆ సీనుకు ముందు జరిగిన కథతర్వాతి సీన్ లో కథ క్లుప్తంగా వివరిస్తారు. ఆ పాట ఏ లొకేల్ లో షూట్ చేయాలనుకుంటున్నారో ఊహామాత్రంగా చెపుతారు. ఈలోగా నిర్మాత కూడా తన మనోభావాలు వెల్లడిస్తారు. ఇక అక్కడినుండి బంతి సంగీత దర్శకుడుకవిగార్ల కోర్ట్ లో వుంటుంది. పాటకు మాటామాటకు పాటాఅనేది ఆలోచిస్తారు. మామూలుగా వినోదాత్మక గీతాలకుశృంగార గీతాలకు మెట్టుకు మాటలు వ్రాస్తారు. లేదూ పాట సన్నివేశానికి పరిపుష్ఠిని చేకూరుస్తూ సాహిత్యపరంగా వుండాలీ అంటే పాట ముందు వ్రాసి దానికి వరస కూరుస్తారు. మాటకు పాటపాటకు మాట ఈ రెండు శైలులకు అందరు కవులుసంగీత దర్శకులు సిద్ధంగానే ఉంటారు. ఘంటసాల మాస్టారు సవ్యసాచి. ఏ పధ్ధతిలో పాటను చేయాలన్నా ఆయన సంసిధ్ధంగానే వుండేవారు. సంగీత దర్శకుడేగాయకుడు అయితే కవిగారి పని సులభతరం. ఇప్పుడుకొంతమంది ప్రముఖ కవుల రచనా శైలి ఎలావుంటుందో చూద్దాము.

శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు భావుకతకుపద లాలిత్యానికి ప్రాధాన్యమిచ్చే మనిషి. ఏ బి.ఎన్. రెడ్డిగారిలాటి దర్శకుడో తప్ప ఆయన చేత పాటలు వ్రాయించలేరు. కాగితం మీద అక్షరం పెట్టడానికే రోజంతా పడుతుంది. అయితే ఆయన పలికించే ప్రతీమాట  మనసుకు హత్తుకుపోతుంది. వారు ఘంటసాల మాస్టారి సంగీత దర్శకత్వంలో ఎక్కువ పాటలు వ్రాయలేదు. ఈ ఇద్దరు ప్రముఖులు కలసి పనిచేసినది 'విజయం మనదేసినీమాలో పాట శ్రీరస్తు శుభమస్తుపాట. మాస్టారే పాడారు. రామారావు గారుదేవిక గార్ల మీద చిత్రీకరణ. రామారావు గారి కజిన్ సాంబశివరావు గారు నిర్మాత. బి. విఠలాచార్య దర్శకుడు. సిస్టర్ సెంటిమెంట్ పాట. ఈ నిర్మాత ఆఫీస్ సౌత్ ఉస్మాన్ రోడ్ లో CIT నగర్ లో వుండేది. ఈ పాట కంపోజింగ్ అప్పుడు ఒక రోజు నేనూ వెళ్ళాను. ఘంటసాల మాస్టారు తన పాటల కంపోజింగ్ కు విధిగా మానాన్నగారిని హార్మోనియం వాయించడానికిలయకోసం ఒక తబలిస్ట్ ను తీసుకువెళ్ళేవారు. వీరిద్దరు తమ వాద్యాలతో సహకరిస్తుండగా మాస్టారు తననాలతో అలా పాడి వినిపిస్తూండేవారు. కృష్ణశాస్త్రి గారు అలా తదేకంగా చిరునవ్వుతో మాస్టారు పాడింది వింటూవుండేవారే తప్ప ఒక్కమాట కూడా కాగితంమీద పెట్టేవారు కాదు. గంటలు గడిచేవి. మాస్టారు పల్లవి వరసను పాడుతూనే వుండేవారు. ఇక అక్కడ వున్నవారందరికీ విసుగుపుడుతోందని అనిపించే సమయానికి కృష్ణశాస్త్రి గారు కాగితం మీద వ్రాసి చూపించేవారు 'పాట మెదడులో వుంది. వ్రాసి పంపిస్తానుఅని. అప్పటికే ఆయన గళం మూగపోయింది. ఏది చెప్పాలన్నా కాగితం మీదే. ఇక ఆ రోజుకు కంపోజింగ్ ముగిసినట్లే. ఇలా ఒకటి రెండు సిట్టింగ్ ల తర్వాత ఆణిముత్యంలాటి పాట వెలువడేది. కృష్ణశాస్త్రి గారి పాట కావాలంటే  మంచి ఓపికాసహనం కావాలి. రాశికంటే వాసిని చూసే కవి కృష్ణశాస్త్రి గారు.


శ్రీ సముద్రాల రాఘవాచారిగారితో ఘంటసాల మాస్టారు చాలా సినీమాలకే పనిచేశారు. సారంగధర మొదలు రహస్యం వరకు చాలా సినీమాలలో ఘంటసాలవారి సంగీతదర్శకత్వంలో అనేక పాటలు వ్రాశారు. మాస్టారు తాను చేసిన పల్లవి తననాలు పాడుతూంటారుఆచార్యులవారు  తన స్టీల్ పాన్దాన్ లో నుండి  రెండో మూడో తామలపాకులు తీసి తాపీగా వాటిని తన పై కండువాతో తుడిచివాటికి సువాసన సున్నం పూసిఈనెలు తీసి వాటిమీద వక్క ,కొంచెం సీవల్ పెట్టి తాంబూల సేవనం మొదలెట్టేవారు. మాస్టారి పాట సాగుతూనే వుండేది. నోట్లోని తాంబూలం అయ్యాక బయటకు వెళ్ళి మంచినీళ్ళతో నోరు కడుక్కొని వచ్చి మరల కూర్చొనేవారు. "ఒరే నాయనా! నీ తననాలు మరోసారి చెప్పు రాసుకుంటాను" అని కాగితం మీద వ్రాసుకొని "నాకు మరో కంపెనీలో కంపోజింగ్ కు వెళ్ళాలి. రేపు మళ్ళీ కలుద్దాము. పల్లవి ఇచ్చేస్తాను. ఈలోగా నువ్వు చరణాలు తయారు చేసుకో" అని లేచి చక్కాపోయేవారు. అనుకున్నట్లుగానే మర్నాటికి పల్లవిచరణాలు రెడిగా పట్టుకువచ్చేవారు. వాటిని దర్శక నిర్మాతలు విని ఓకె అంటే పాట కంపోజింగ్ పూర్తయినట్లే. లేకపోతే మరో కొత్త పల్లవికి వరసమాటలు కూర్చడం మళ్ళీ మొదలయేది. ఈ తతంగమంతా చాలా సహజసిధ్ధంగానే ప్రశాంత వాతావరణంలో నే జరిగేది.




కొసరాజు రాఘవయ్య చౌదరీగారి పాటలు చాలావరకు జానపదవరసలుతోనే వుండేవి. ఆయన సిట్యుయేషన్ వినగానే  పాటను వ్రాయడం మొదలెట్టేవారు. ఆయన స్వతహాగా కొంత పాడతారు. తాను వ్రాసిన పాటను తానే తన ధోరణిలో పాడివినిపించేవారు. కొసరాజు గారు పాడింది బాగానేవుండేది. దానికి మాస్టారు సంగీతపరంగా మరింత పదునుపెట్టి పాడి వినిపించేవారు.ఆ పాట అందరి ఆమోదం పొందేది.


శ్రీ మల్లాది రామకృష్ణ శాస్త్రిగారు కూడా పాటలు వెంటవెంటనే వ్రాసే మనిషికాదు. చాలా టైమ్ తీసుకుంటారు. సంగీతదర్శకుడు వినిపించే ట్యూన్ కు ఏవో ప్యారడీలు రాసి ఇవేకదా మీ పాట పెరామీటర్లు. రాసిస్తాను అనేవారట. రామకృష్ణ శాస్త్రిగారు 14 భాషలలో నిష్ణాతుడు. అలాగే సంగీతశాస్త్రంలో కూడా మంచి అవగాహన వుండేది. "రహస్యం" చిత్రం లోని కొన్ని పాటల సాహిత్యానికి సరిపడేలా రాగనిర్దేశనం కూడా శాస్త్రిగారే చేయడందానిని ఘంటసాల మాస్టారు అత్యంత ప్రతిభావంతంగా ప్రయోగించి అత్యద్భుతమైన పాటలను సమకూర్చడం జరిగింది.


ఇక, డాక్టర్ సి.నారాయణరెడ్డిగారైతే ప్రొడ్యూసర్స్ కుడైరక్టర్లకు  అందరికీ  ఫేవరిట్ సాంగ్ రైటర్. ఆయన ఉస్మానియా యూనివర్సిటీ లో పనిచేస్తూవుండడం వలన హైదరాబాద్ లో వుండేవారు. పదిహేను రోజులకు ఒకసారి మద్రాసు వచ్చి మూడేసి రోజులు హోటల్ లో మకాం పెట్టేవారు. తాను వచ్చేముందు ప్రొడ్యూసర్లకు ఫోన్ చేసి రాయవలసిన పాటల సన్నివేశాన్ని అడిగి తెలుసుకునేవారు. ఎప్పుడు వచ్చినా ఫ్లైట్ లో వచ్చేవారు. ఎయిర్ పోర్ట్ లోఫ్లైట్ లో కూర్చొని తాను వ్రాయవలసిన పాటలకు పల్లవులుచరణాలు వ్రాసి తయారుగానే మద్రాసు లో అడుగెట్టేవారు. ఒక్కొక్క కంపెనీకి వెళ్ళి సంగీత దర్శకుడితో కూర్చొని వారి పాట విని తన సాహిత్యాన్ని తగినవిధంగా మార్పులు చేర్పులు చేసి ప్రొడ్యూసర్ చేత ఓకె అనిపించుకొని తనకు రావలసిన పైకం వసూలు చేసుకొని వేరే కంపెనీ కి వెళ్ళిపోయేవారు. ఇలా వున్న మూడు రోజుల్లో ఓ పదిహేను పాటలకు తక్కువలేకుండా వివిధ సినీమాలకు వ్రాసేసి హైదరాబాద్ వెళ్ళిపోయేవారు.

 

ఇక ఆరుద్రగారికైతే వరస దమ్ములాగనిదే పాట వ్రాయడానికి ఇన్స్పిరేషనే రాదనేవారు. రెండువేళ్ళ మధ్య సిగరెట్ పెట్టి గంజాయి పీల్చినట్లుగా సిగరెట్ల మీద సిగరెట్లు కాలుస్తూ పాట వ్రాసేవారు. ఒక పాట పూర్తయేసరికి ఎన్నో పెట్టెలు ఖాళీ అయేవి.  

 

ఇక ఆత్రేయగారి సంగతి లోకవిదితమే. నేను కొత్తగా చెప్పడానికి ఏంలేదు. రాయక నిర్మాతలనురాసి ప్రేక్షకులను తెగ ఏడిపించిన కవిగా కీర్తిపొందారు.

 

ఈ విధంగా సినీమా లోకంలో వివిధ కవులది వివిధ రకాల అలవాట్లు. వివిధరకాల బాణివాణి. వీరందరి ధోరణికనుగుణంగా మాటకు మెట్టు కూర్చడంలోలేదా తన మెట్టుకు  తగిన మాటలు రాబట్టుకోవడంలో ఘంటసాల మాస్టారు కృతకృత్యులే అయ్యారు. నిర్మాత,దర్శకులు సంగీత దర్శకునికిపాటల కవికి సంపూర్ణమైన స్వేచ్ఛ ఇచ్చినప్పుడు సంగీతపరంగాసాహితీపరంగా సన్నివేశానికి తగిన అజరామరమైన గీతాలు రూపొందుతాయి. అలా ఎన్నో మధురాతిమధురమైన పాటలు రూపొందాయి కూడా.

 

కానీ ఈ రకమైన సుహృద్భావ వాతావరణం అన్నివేళలాఅన్నిచోట్లా అమరడం కష్టం. కొంతమంది నిర్మాతలు వుంటారు. వారికి సంగీతంతోనూసాహిత్యం తోనూ పరిచయం లేకపోయినా అన్నీ తెలిసినట్లుగా జోక్యంచేసుకొని పనికిరాని సలహాలు ఇస్తూంటారు. ఎన్ని మంచి పల్లవులు ఇచ్చినా బాగులేదంటూ కొత్తవి కావాలనడం.ఆ పల్లవిలో కొంత ఈ పల్లవిలో కొంత చేర్చి మరేదో ట్యూన్ చేయమనడంకవిగారి మాటలకు వంకలుపెట్టడం చేస్తూంటారు. డబ్బు పెట్టుబడి పెట్టి సినీమా తీస్తున్న నిర్మాతలమనే అభిజాత్యంతో ప్రవరిస్తారు. మరికొందరు నిర్మాతలైతే తమకు పాట నచ్చినాతమ పక్కనుండే కారు డ్రైవర్ కుఆఫీస్ బోయ్ కు సంగీత దర్శకుడు ఇచ్చిన పాట తృప్తికరంగా లేదంటున్నారు కనుక మరో పల్లవి అంటే బాగుంటుందని కవిగారినిసంగీతదర్శకుడిని ఇరకాటంలో పెట్టడమూ వుంది. ఒక స్థితిలో సహనం కోల్పోయి నువ్వూ వద్దూ నీ సినీమా వద్దు అంటూ లేచి చక్కాపోయే సర్వ స్వతంత్రులైన సంగీత దర్శకులు వున్నారుసాలూరు రాజేశ్వరరావు గారిలాటివాళ్ళు. ఎంత గొప్ప నిర్మాతైనా వారి ధోరణి నచ్చకపోతే వద్దని మధ్యలో మానేసిన సినీమాలెన్నో రాజేశ్వరరావుగారికి. నిర్మాతలు ఈ రకమైన వంకలను బొంబాయి నౌషద్ ఆలి దగ్గరోశంకర్ జైకిషన్ దగ్గరో మదన్ మోహన్ దగ్గరో పెట్టగలరాపెట్టి వాళ్ళచేత ఒక్క పాటైనా చేయించుకోగలరా! ఇలాటి విభిన్న మనస్తత్త్వాలు కలిగిన వ్యక్తులందరినీ సమన్వయపర్చుకుంటూసామరస్యభావంతో మెలగుతూ అందరిపట్ల వినయవిధేయతలు కనపరుస్తూఅందరిచేత గౌరవింపబడుతూ ఘంటసాల మాస్టారు  దాదాపు మూడు దశాబ్దాలపాటు తెలుగు చలనచిత్ర రంగంలో అజాతశత్రువుగా మనుగడ సాగించారు. ఇదేమంత సామాన్య విషయం కానేకాదు.

 

💥కొసమెరుపు💥

 

"మాస్టారూ! అన్నపూర్ణా లోకి కొత్త సంగీత దర్శకుడు వచ్చారట!" అని ఎవరో రాజేశ్వరరావు గారి దగ్గర వత్తి వెలిగించారట.

అందుకు ఆయన "ఏం చేస్తాం! సార్మధుసూదనరావు గారు

మన దగ్గర మోహన రాగం స్టాక్ అయిపోయిందని  అనుకున్నట్లున్నారు." అని అన్నారట మహా కూల్ గా.

 

💐

 

మరికొన్ని విశేషాలతో వచ్చేవారం.....

...సశేషం


*With a view to make the narrative more authentic and to corroborate it, images, audio and video clips are attached at appropriate places. If such usage is found objectionable to the copyright holders the same shall be removed if and when notified.

Sunday, May 30, 2021

నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 2 - ముఫ్ఫై మూడవ భాగం

30.05.2021 -  ఆదివారం భాగం - 33*:
అధ్యాయం 2 భాగం 32  ఇక్కడ

  

నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్

'గొట్టం గొట్టై గొట్టహ టం టై టహఅంటూ చక్కిలిగింతలు పెట్టేప్పటికి అప్పటివరకున్న కన్నీటి ప్రవాహానికి ఆనకట్టపడి కిలకిలనవ్వుతూ నాన్న పొట్టమీద కూర్చొని కేరింతలు కొట్టేవారు పిల్లలు. రత్నకుమార్శ్యామలసుగుణశాంతి అంతా ఘంటసాలమాస్టారి పొట్టమీద కూర్చొని స్వారీ చేసినవారే. ఆయనకు ఇంట్లోవున్నప్పుడు బనీనుషర్ట్ వేసుకునే అలవాటు లేదు. భుజం చుట్టూ ఒక పెద్ద తువ్వాలు కప్పుకొని హాల్ లోని పొడుగాటి చేతుల వాలుకుర్చీలో విశ్రాంతిపొందేవారు. అదే సమయంలో అమ్మమీద పితూరీలు చెప్పడానికి పిల్లలు ఒక్కొక్కరుగా నాన్న దగ్గరకు చేరేవారు. వారిని సముదాయించి మంచి మూడ్ లో పెట్టడం మాస్టారికి బాగానే తెలుసు. మాస్టారు తరచు ఉపయోగించే ఈ 'టం టై టహాకు మూలం మాయాబజారే అని నా భావన. అందులో చిన్నమయ (రమణారెడ్డి) తన మంత్రదండంతో 'అం అహః', ఇం ఇహీః ఉం ఉహూఃఅని చదివే మంత్రాలు. వాటినే మార్చి మాస్టారు పిల్లలమీద ప్రయోగించేవారేమో అనిపిస్తుంది. పిల్లలందరికీ మాస్టారి దగ్గర చేరిక ఎక్కువే. విజయకుమార్ (పెదబాబు)కి తప్ప. ఆ విషయంలో నేను, పెదబాబు ఒకటే.  

 

ఘంటసాల మాస్టారు ఇంట్లోనే కాదుతాను పనిచేసే ప్రతీచోట వాతావరణం ఆహ్లాదకరంగాఅనుకూలంగా వుండేలా చేసేవారు. రకరకాల సరదా కబుర్లతో తన చుట్టూవుండేవారిని సంతోషపర్చేవారు.

 

ఒకసారి విజయాగార్డెన్స్ లో ఏదో సినిమా రీరికార్డింగ్ జరుగుతోంది. ఉదయం 9 నుండి రాత్రి 9 వరకూ కాల్షీట్. లంచ్ బ్రేక్ లో ఆర్కెస్ట్రా వారు కొంతమంది బయటకుపోయారు. మాస్టారి లంచ్ ఇంటిదగ్గరనుండి తమ్ముడు కృష్ణ తెచ్చేవాడు. లేకపోతే కంపెనీవారు తెప్పించిన భోజనం చేసేవారు. మాస్టారు లంచ్ ముగించుకొని తర్వాతి సీన్ మ్యూజిక్ గురించి ఆలోచిస్తూ హార్మోనియం మీద ఏవో chords పడుతున్నారు. కొంచెం దూరంగా ఒక కుర్చీలో మా నాన్నగారు ఏదో పుస్తకం చదువుకుంటున్నారు. ఆయనకు లంచ్ బ్రేక్ సమయంలో పుస్తకాలతో కాలక్షేపం చేయడం అలవాటు. కొందరు ఒకపక్కగా కునుకుతీస్తారు. మరికొందరు చతుర్ముఖ పారాయణంతో అదనపు కాసులు సంపాయిస్తారుపోగొట్టుకుంటూనూ వుంటారు.  మాస్టారి పక్కనే తబలా ప్రసాద్ కూర్చొని వున్నాడు. మాస్టారు అనుకున్న విధంగా సరైన బిట్స్ అమరడం లేదు. వాతావరణం కొంచెం బోరింగ్ గా మారింది.


ఈలోగా బయటనుండి ఆర్కెస్ట్రా లోని ఆచారిత్రయం ఒక్కొక్కరుగా లోపలకు అడుగుపెట్టారు. వారిని చూడగానే మాస్టారు చటక్కున 'శఠకోపచారీగారూఅంటూ హార్మోనియం మీద ఒక స్థాయిలో ఒక కార్డ్ వాయించారు. దానికి వెంటనే తబలా డక్క మీద ప్రసాద్ ఒక దరువు వేసాడు. వెంటనేమాస్టారు 'హనుమంతాచారిగారుఅని మరో స్థాయిలో మరో కార్డ్ పట్టారు. దానికి కూడా ప్రసాద్ జవాబు ఇచ్చాడు. ముచ్చటగా మూడవసారి 'నరేంద్రాచారిగారుఅని మరోస్థాయిలో పాడి మరో కార్డ్ వాయించారు. దానికీ ప్రసాద్ ధాటీగానే డక్క మీద ముక్తాయింపు ఇచ్చాడు. అందరూ ఒకటే నవ్వులు. ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. స్థబ్దుగా ఉన్నవారందరిలో చైతన్యం పుట్టి హుషారుగా   ఎవరిచోట్లకు వారు చేరుకున్నారు. రికార్డింగ్ థియేటర్లో వివిధ వాయిద్యాలకు ప్రత్యేక స్థలాలు కేటాయిస్తారు. స్ట్రింగ్ ఇన్స్ట్ర్ మెంట్స్ వారు ఒక గ్రూపుగావిండ్ ఇన్స్ట్రమెంట్స్ వారు ఒక గ్రూప్ గారిథిమ్ సెక్షన్ వేరేగా కూర్చుంటారు. ఒక్కొక్క గ్రూప్ కు రెండేసిమూడేసి మైకులు ఉండేవి.  

ముందుగాఈ ఆచారి త్రయం గురించి చెప్పాలి కదా! 

శఠకోపచారిగారు వైలినిస్ట్. సముద్రాల రాఘవాచార్యులవారి అల్లుడు. నరేంద్రాచారి గారు కూడా వైలినిస్టే. విజయనగరం మ్యూజిక్ కాలేజీలో సంగీతం నేర్ఛుకున్నారు. మాస్టారికి విజయనగరం అన్నామ్యూజిక్ కాలేజీ విద్యార్ధులన్నా ఒక మమకారం వుండేది. వారందరికి తగిన అవకాశాలు కల్పించేవారు. రావూరి వీరభద్రం (మొదట్లో కోరస్ లు పాడేవారు)నరేంద్రాచారిమొసలికంటి సన్యాసిరావు (ముగ్గురూ వైలినిస్ట్ లే). ఇక ఇంతకు మునుపు చెప్పుకున్న హనుమంతాచారిగారు యూనివాక్స్ ప్లేయర్మంచి గాయకుడు కూడా. హిందుస్థానీ సంగీతంలో ప్రవేశముంది. అభంగాలుహిందీ భజన్స్ చాలా బాగా పాడేవారు. 'శ్రీరామచంద్ర కృపాళు భజమనఅనే గీతాన్ని మొదటిసారిగా ఆయన నోటే విన్నాను. హనుమంతాచారిగారు మంచి హాస్యనటుడు కూడా. చాలా కన్నడం సినీమాలలో నటించారు. 'ప్రేమ్ నగర్సినీమా మొదట్లో వచ్చే ఏరోప్లేన్ సీన్ లో కనిపిస్తారు. 



ఈ సీన్లో గాంధీ టోపీలో కనిపిస్తారు హనుమంతాచారిగారు

నాలుగు భాషల ప్రముఖ సీనీ సంగీత దర్శకులందరి దగ్గరా పనిచేసేవారు. మంచి వ్యక్తి. హనుమంతాచారి గారు కర్ణాటకమహారాష్ట్ర అంటూ బయట కచేరీలు ఎక్కువచేసేవారు. అలాటిచోట్లనుండి ఏవేవో వస్తువులు కొని ఘంటసాలమాస్టారికి ఇస్తూండేవారు. హనుమంతాచారి గారు తీసుకు వచ్చే సుగంధ వక్కపొడి ఎంతో బాగుండేది. ఒక్క పలుకు నోట్లో వేసుకుంటేచాలుఆ సువాసన ఎంతోసేపు వుండేది.

 

హనుమంతాచారి గారి అబ్బాయి రాజ్ కుమార్ (యోగి అసలు పేరు యోగీంద్రకుమార్). 'రాముతెలుగుతమిళ చిత్రాలలోని బాలనటుడు. ఆ సినీమాలోని నటనకు నేషనల్ అవార్డు కూడా వచ్చింది. అలాంటి సహృదయుడైన మంచి కళాకారుడు రావి కొండలరావుగారి ట్రూప్ తో 1981 లో  ఢిల్లీ నుండి మద్రాసు వస్తున్న తమిళనాడు ఎక్స్ప్రెస్ ట్రైన్ కు జరిగిన ఘోర విపత్తులో దుర్మరణం పొందారు. హనుమంతాచారి గారు అన్న కొన్ని మాటలు నాకు ఇంకా జ్ఞాపకం ఉన్నాయి. ఆయనను మాస్టారోఅమ్మగారో అడిగారుహాయిగా టి.నగర్ ఏరియాలో ఒక మంచి ఇల్లు కొనుక్కొని వచ్చేయచ్చు కదా అని ?

 

అందుకు హనుమంతాచారిగారు "ఎందుకమ్మా సొంత ఇల్లు. ఎప్పుడు ఎక్కడుంటామో తెలియదు. ఇవేళ మద్రాసురేపు బెంగుళూరు తర్వాత బొంబాయి.  సొంతిల్లంటే మనకు ఇష్టం వున్నా లేకపోయినా బలవంతంగా అదే ఇంట్లో పడివుండాలి. అదే అద్దె ఇల్లైతే దర్జాగా మనకు కావలసిన ఏరియాలో కావలసిన వసతులన్నీ అడిగి చేయించుకొని హాయిగా గడిపేయొచ్చు. స్థలం కొనడంఎవరినో నమ్మి ఇల్లు కట్టడంఅది మనకు నచ్చడంనచ్చకపోవడంఈ గొడవలన్నీ ఎందుకమ్మాఅద్దె ఇల్లే హాయి అని తన కన్నడ తెలుగు యాసతో అన్నారు. హనుమంతాచారి గారి మాటలు నాకు ఒక ఇంగ్లీష్ సామెతను గుర్తుకు తెస్తుంది. 'వెర్రి వెంగళప్పలు ఇళ్ళు కడతారుతెలివైనవారు వాటిలో నివసిస్తారుఅని తాత్పర్యం.

 

సొంతిల్లు కట్టడంలోని సాధకబాధకాలుకష్టనష్టాలు తెలియాలంటే చూడుడు బాలు మహేంద్ర తీసిన  నేషనల్ అవార్డ్ తమిళ ఆర్ట్ ఫిలిం  'వీడు' ( ఇల్లు) . ఈ సినీమాలో హీరో భానుచందర్ కు మన రత్నకుమారే డబ్బింగ్ చెప్పారు. ఏ గూడూ మన శాశ్వతం కాదు. దేవుడిచ్చిన గూడే (దేహం) శాశ్వతం కానప్పుడుమనం కట్టుకునే గూడు మాత్రం శాశ్వతమానిరంతరం నివసించడానికి.

 

హనుమంతాచారిగారు అప్పుడు ఎక్కడవుండేవారో కానీతర్వాత నాకు తెలిసేనాటికి కృష్ణవేణీ ధియేటర్ పక్క వీధి దామోదర్ రెడ్డి స్ట్రీట్ లో ఒక మేడమీద అద్దె ఇంట్లో ఉండేవారు. 

 

'ఏస్తబలిస్ట్ ప్రసాద్ ఘంటసాల ఆర్కెష్ట్రాకు ఒక లైవ్-వైర్. వురిమి జగన్నాథంగారు 1940-50 ప్రాంతాలలో జెమినీ స్టూడియో లో స్టాఫ్ తబలిస్ట్ గా పనిచేసేవారు. వారి స్వస్థలం సాలూరు . సాలూరి రాజావారి (జమీందారు) నాటకశాలలో సీనరీ తెరలు పెయింటింగ్ చేసేవారు. మా తాతగారికీ స్నేహితుడు. ఆయన పెద్ద కొడుకు రామలింగం ఆయన కూడా పేరు మోసిన తబలిస్ట్. ఎస్.రాజేశ్వరరావుకె.వి.మహాదేవన్ వంటి ప్రముఖ సంగీతదర్శకుల వద్ద పనిచేసేవారు. జగన్నాథంగారి మరో కొడుకు ప్రసాద్. అతను ఘంటసాలవారి ఆర్కెస్ట్రాలో సుమారు పదిహేడేళ్ళ వయసులోనే వచ్చి చేరాడు. ఆనాటికినాకు తెలిసీలక్ష్మణరావు గారురామలింగంగారు కూడా మాస్టారి దగ్గర అడపాదడపా పనిచేసేవారు.

 

విజయా సినీమాలకైతే అక్కడ భోగీలాల్ అనే ఆయన పెర్మనెంట్ తబలిస్ట్ గా వుండేవారు. ఆయన మాస్టారి పార్టీతో కచేరీలకు బయట వూళ్ళకు వెళ్ళేవారు. ఆ భోగీలాల్ అనే ఆయన మాస్టారి కచేరీకి ఏదో వూరు వెళుతూ రాత్రికి రాత్రి ట్రైన్ లోనే హార్ట్ అటాక్ తో మరణించారు. ట్రైన్ ఉదయం బెజవాడ చేరేవరకూ ఎవరికీ తెలియలేదు. మా నాన్నగారు కూడా వేరే కంపార్ట్మెంట్ లో ప్రయాణం చేస్తున్నారు. బెజవాడ స్టేషన్ లో మాస్టారు దగ్గరుండి ఆ బాడీని మద్రాస్ తరలించడానికి కావలసిన ఏర్పాట్లు చేయించారట.

 

తబలా ప్రసాద్ మాస్టారి దగ్గర చాలా కాలమే పనిచేశాడు. కంపోజింగ్ లు రిహార్సల్స్ బయట ఊళ్ళ కచేరీలు అన్నిటికీ వచ్చేవాడు. మాస్టారి పార్టీలో అతి చిన్న కుర్రవాడు ప్రసాద్. చాలా ఛలాకీగాఅందరినీ తన చిలిపి చేష్టలతో ఏడిపిస్తూ అల్లరి చేసేవాడు. తన సెన్స్ ఆఫ్ హ్యూమర్ తో అందరినీ తెగ నవ్వించేవాడు. అతని అరవ తెలుగు వినడానికి తమాషాగా వుండేది. కానీ తబలా వాద్యం విషయానికొచ్చేసరికి తెగ విజృంభించేవాడు. ఆ వేళ్ళలోని స్పీడ్పట్టుహావభావాలు సామాన్య శ్రోతలకు బహు ఆకర్షణగా వుండేది. ప్రసాద్ గురుముఖతా ఎవరి దగ్గరా తబలా నేర్చుకోలేదనే విన్నాను. తండ్రిఅన్నలే అతని గురువులు. అతని తబలా వాదనానికి అందరూ ముచ్చటపడేవారు.

 

ప్రసాద్  ఘంటసాల మాస్టారి కంపోజింగ్ లకు వచ్చేవాడు. కంపోజింగ్రిహార్సల్స్ వరకు బాగా వాయించేవాడు. మాస్టారు కూడా మెచ్చుకునేవారు. అతను వెంటనే రెండు చేతులూ జోడించి మాస్టారితో గుసగుసగా "ప్రొడ్యూసర్ కు చెప్పి మరో పది రూపాయలు ఎక్కువచేసి ఇవ్వండి" అనేవాడు. అందరూ అతని మాటలకు పగలబడి నవ్వేవారు. అలాగేమాస్టారి దగ్గర ఎక్కువ చీవాట్లు తినేది అతనే.  రికార్డింగ్ థియేటర్లో మానిటర్ చూసే సమయానికి నడక మార్చేసేవాడు. కంపోజింగ్ రిహార్సల్స్ లో వాయించింది కాకుండా మరేదో కొత్త నడక వాయించేవాడు. "ఒరే నాయనా ! ఇది కాదురాముందు అనుకున్నది వాయించరా ! టైమ్ వేస్ట్ చేయకురా!" అని మాస్టారు సౌండ్ ఇంజనీర్ రూమ్ లో నుండి గట్టిగా కేకెట్టేవారు.  బదులుగా "ఆ నడకే మాస్టారుఇది" అంటూ దబాయించేవాడు. కొంతసేపు పక్కనున్న డోలక్ వాళ్ళోరిథిమ్ ప్లేయర్సో వాయించి చూపాక ఒరిజినల్ నడకకు వచ్చేవాడు. ఇది అల్లరివల్ల కొంత, శ్రుతజ్ఞానంతో సంపాదించిన విద్యవల్ల కొంత అని పెద్దలు అభిప్రాయపడేవారు. కానీ ప్రసాద్ తన తబలా వాదనంతో పాటలకు ప్రత్యేక సొబగులు తెచ్చినమాట మాత్రం ఖాయం. మాస్టారిలాగే ప్రసాద్ వున్నచోట వాతావరణం చాలా లైవ్లీగా వుండేది.  ప్రసాద్ మీది ఆకర్షణతోనే నేను చాలా రికార్డింగ్ లకు రీరికార్డింగ్ లకు వెళ్ళాను. అతనికి ఘంటసాల మాస్టారంటే విపరీతమైన భక్తి వుండేది. క్రమక్రమేణా ప్రసాద్ చాలా బిజీ అయిపోయాడు. నాలుగు భాషల మ్యూజిక్ డైరక్టర్స్ అంతా ప్రసాద్ లేకుండా రికార్డింగ్ లు చేసేవారు కాదు. రోజుకు మూడు కాల్షీట్లు పనిచేసేవాడు. దీనివలన ఘంటసాలవారి కంపోజింగ్ లకురిహార్సల్స్ కు సమయానికి రాలేకపోయేవాడు. రికార్డింగ్ లకు మాత్రం హాడావుడి హడావుడి గా వచ్చిపోయేవాడు. అతను తబలా ముందు కూర్చుంటే మాత్రం పులే. తర్వాతఅతని స్థానంలోకి జడ్సన్ తబలాకుసుబ్బారావు డోలక్ కు వచ్చారు. ఆ ఇద్దరు కూడా మాస్టారి దగ్గర చాలా ఏళ్ళే పనిచేశారు.


మా నాన్నగారు తబలా ప్రసాద్ ను దృష్టిలో పెట్టుకొని రాసిన ఒక పెద్ద కథ "వాద్యగోష్ఠి"  చందూర్ గారి 'జగతిపత్రిక లో ప్రచురితమైంది. ప్రసాద్ కు తెలుగు చదవడంరాయడం తెలియదు. మా నాన్నగారు ఇచ్చిన ఆ పుస్తకాన్ని తాను వెళ్ళిన ప్రతీ చోటా చూపించి 'సంగీతరావుగారు నా మీద కథ వ్రాసారుఅని అందరికీ చెప్పి తెగ మురిసిపోయాడు.

 

అలాటి తబలా ప్రసాద్ ను 1974 తర్వాత కొన్ని దశాబ్దాల పాటు చూడనేలేదు. తర్వాతనా ప్రోద్బలంతో టివికె శాస్త్రిగారు మా మద్రాస్ తెలుగు అకాడెమీ వేదికల మీద రెండుసార్లు  ప్రసాద్  తబలా సోలో ప్రోగ్రామ్స్ పెట్టించారు. అప్పుడే అతనిని చూడడం. మనిషి బాగా మారిపోయాడు. చాలా సన్నగా వుండే మనిషి కొంచెం లావయ్యాడు. పట్టు లుంగీపట్టు షర్ట్నాలుగు వేళ్ళకూ ఉంగరాలు,మెడలో చైన్లుకున్నక్కుడి వైద్యనాథన్ స్టైల్ లో నుదురంతటికీ పెద్ద కుంకుమ బొట్టుతో వచ్చాడు. మనిషిలో అదే చైతన్యం. ముఖంలోమాటలో అదే చైతన్యం. అతనికి ప్రజలను ఎలా ఆకర్షించాలోవారికి ఏది వినిపిస్తే మెస్మరైజ్ అవుతారో ఆ పట్లన్నీ బాగా తెలుసు. మా వేదిక మీద పాల్గొన్నరెండు సార్లూ ప్రసాద్ ఘంటసాల మాస్టారు చెప్పిన ఒక ఉదంతాన్నే తబలామీద వాయించి చూపించి ప్రేక్షకులను తెగ నవ్వించాడు. దీనిని తన టివి షోలలో కూడా ప్రదర్శించేవాడు.

 ఆ కథ ఏమిటంటే -

 ఘంటసాల మాస్టారు 1958-59 లలో 'సతీ సుకన్యఅనే సినిమా కు సంగీతం నిర్వహించారు. ఆ సినిమాషూటింగ్పాటలు కంపోజింగ్ అన్నీ మైసూర్ ప్రీమియర్ స్టూడియోలోనే జరిగాయి. ఆర్కెష్ట్రా కూడా అక్కడివారేనని విన్న గుర్తు. పాటల కంపోజింగ్ కు ఘంటసాల మాస్టారు మైసూరు వెళ్ళినప్పుడు పాటల కంపోజింగ్ కు ఒక తబలా విద్వాంసుడిని ఏర్పాటు చేసారట. కానీ ఆయనకు సినీమాలలో పాటలకు వాయించే అలవాటుఅనుభవం లేదని తెలిసిందట. ఎలాగో అతనితోనే గడుపుకున్నారట. పాటల కంపోజింగ్ సమయంలో మాస్టారి ట్యూన్స్ కు ఆ తబలా విద్వాంసుడు ఎలాటి  హావభావాలతో వాయించాడో అవన్నీ చాలా స్వారస్యంగా మాస్టారు మద్రాసు వచ్చాకతన కంపోజింగ్ ల సమయంలో నటించి చూపించి అందరినీ వినోదపరిచారట. ఆ సంఘటననే ప్రసాద్ మా వేదికమీద తన తబలా సహాయం తో మిమిక్రీ చేసి చూపించాడు. ఏ హాస్యనటుడికి దొరకనంత రెస్పాన్స్ తబలా ప్రసాద్ కార్యక్రమానికి లభించింది.

 

అలాగే రీరికార్డింగ్ల సమయంలో ప్రసాద్, చిదంబరం  ఎస్.జయరామన్ అనే తమిళ గాయకుడిని మహాబాగా ఇమిటేట్ చేసి చూపేవాడు. అందుకోసం ముందుగా వైలినిస్ట్ చిత్తూర్ సుబ్రమణ్యంగారి స్టీల్ డబ్బాలోని తామలపాకులుసీవల్ అన్నీ నోటినిండా దట్టించి నములుతూ ఆ లాలాజలం నిండిన నోటితో సి.ఎస్.జయరామన్ పాత పాటలు పాడేవాడు. జయరామన్ గొంతు తాంబూలం వేసుకొని పాడినట్లుగా వుండేది. విశ్వనాథన్ రామ్మూర్తి సంగీతంలో శివాజీ గణేశన్ కు 'పుదయల్ అనే సినీమాలోని ఒక హిట్ సాంగ్ ను ప్రసాద్ మిమిక్రి చేస్తూ అందరినీ తెగ నవ్వించేవాడు.

 

తబలా ప్రసాద్ కు దాదాపు 77 ఏళ్ళు వచ్చేసాయి. అయినా మనిషిలోని ఆ పాత ఉత్సాహం అలాగే వుంది. ఘంటసాల మాస్టారి మీది భక్తితో ఇప్పటికీ అప్పుడప్పుడు రతన్ను కలియడంలేదా ఫోన్ లో మాట్లాడడం చేస్తూంటాడు.


మార్చ్ 7, 2019
 

తబలా ప్రసాద్ అనే ఉరిమి లలితా ప్రసాద్

సినీమాలకు ఏనాడో దూరమైపోయిన మానాన్నగారిని ఆమధ్య తబలా ప్రసాద్  కలుసుకొని ఆప్యాయంగా మట్లాడి కొంతసేపు గడిపాడు. అది ఆనాటి వ్యక్తుల మధ్య వుండే స్నేహానురాగాలుభక్తి విశ్వాసాలు అవన్నీ  ఈ తరం వారికి రుచి చూపించడం కోసమే ఈ 'నెం.35ఉస్మాన్ రోడ్'.

 💥కొసమెరుపు💥

ఘంటసాల సావిత్రమ్మగారికి అక్క చెల్లెళ్ళు చాలామందే వుండేవారు. తోడబుట్టినవారు కొందరైతే ఆవిడ సాన్నిహిత్యంతోరావమ్మలాటి  చెల్లెళ్ళు మరి కొందరు.  ఆ జాబితాలోకి కొత్తగా మరో ఇద్దరు - అక్కాచెల్లెలు వచ్చి చేరారు. మోహినికుమారి. తెలుగువారే. సావిత్రమ్మగారి స్నేహ బృందమూ పెద్దదే. బెంగుళూరు సరోజినిగారి కుటుంబంనెల్లూరి పవని నిర్మల ప్రభావతి (ప్రముఖ రచయిత్రి)గారి కుటుంబం ఘంటసాల కుటుంబానికి మంచి ఆప్తులు. వీరందరి రాకపోకలతో 'నెం.35, ఉస్మాన్ రోడ్సదా కళకళలాడుతూవుండేది. 

ఆ విశేషాలన్నీ వచ్చే వారమే...

 🌿

ఆ ఇద్దరూ మంచి మిత్రులే. అన్నగారి అనుయాయులే. ఘంటసాల మాస్టారికీ సన్నిహితులే. ఆ ఇద్దరూ కలసి అన్నగారితో ఒక మంచి చిత్రం తీసి రాష్ట్రపతి బహుమానం కూడా పొందారు. ఆ తర్వాత ఆ ఇద్దరూ విడిపోయి వేర్వేరు కుంపట్లు పెట్టుకున్నారు.

ఆ విశేషాలన్నీ వచ్చే వారం...

ఈలోగా  ఆ రెండు కుంపట్ల వారెవరో మీరూ కాస్తా ఆలోచించండి....

 

              సశేషం...


*With a view to make the narrative more authentic and to corroborate it, images, audio and video clips are attached at appropriate places. If such usage is found objectionable to the copyright holders the same shall be removed if and when notified.