visitors

Sunday, June 20, 2021

నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 2 - ముఫ్ఫై ఆరవ భాగం

20.06.2021 - ఆదివారం భాగం - 36:
అధ్యాయం 2  భాగం 35 ఇక్కడ


నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్

1957 - 2021
🌿

మా ఆత్మీయ కుటుంబ సభ్యుడుఅభిమానులను, సన్నిహితులను దుఃఖంలో ముంచి అర్ధారంతరంగా వెళ్ళిపోయిన శ్రీ ఘంటసాల వెంకట రత్నకుమార్ కు మా హార్దిక శ్రధ్ధాంజలి.

💐💐💐

మా పక్కిల్లు, నెం.36, ఉస్మాన్ రోడ్, రాజగోపాలన్ మామా ఇంటి మేడమీదకు ఒక తెలుగు కుటుంబం అద్దెకు వచ్చారు. ఆ కుటుంబ పెద్ద పేరు మండా బుచ్చి రామారావుగారు. ఆర్మీ ఇంజనీర్. ఎక్కడో నార్త్ నుండే ట్రాన్సఫరై మద్రాసు వచ్చారు. వారికి ఇద్దరు ఆడపిల్లలు. పెద్దమ్మాయి బి.ఎస్.సి.  తిరుపతిలో, చిన్నమ్మాయి పి.యు.సి మద్రాస్  కాలేజీలో  జాయిన్ అయ్యారు. మాకు ప్రక్కనే మరో తెలుగు కుటుంబం రావడం మా అందరికీ ఆనందం కలిగించింది. ఆ కుటుంబంలోని వారంతా చాలా కలివిడిగా, స్నేహపూర్వకంగా వుండడంతో ఆ అక్కచెల్లెళ్ళిద్దరూ నెం.35, ఉస్మాన్ రోడ్ లోనే వుండేవారు. ఘంటసాల మాస్టారు ఇంట్లో లేని సమయంలో వచ్చి అమ్మగారితో కబుర్లు చెప్పేవారు. వాళ్ళకు సావిత్రమ్మగారితో మంచి స్నేహం కుదిరింది. 

 

పెద్దమ్మాయి తిరుపతిలో హాస్టల్ లో వుండి చదువుకుంటూ శని ఆదివారాలలోశెలవుల్లో మద్రాసు వచ్చేది. ఆ అమ్మాయితో పాటూ అక్కడ ఎమ్.బి.బి.ఎస్ చేస్తున్న ఆమె స్నేహితురాలు కూడా మద్రాసు వచ్చి శెలవులన్నీ వీరితో గడిపేది. ఆ అమ్మాయిది విజయనగరం. మా విజయనగరానికి సంబంధించిన అమ్మాయే అనేసరికి, వాళ్ళెవరో నాకు తెలియకపోయినా  నాకు చాలా సంతోషం కలిగింది. తండ్రి విజయనగరంలో ఓ సినీమా హాలు' ఓనర్ అని చెప్పిన గుర్తు. రాజకీయ పలుకుబడి కూడా వుందనుకుంటాను. ఆ ముగ్గురికి అన్నదమ్ములు లేకపోవడం వలన నన్ను, పెద్దబాబు విజయకుమార్ ను, మాస్టారింట్లోని నరసింగని తమ అన్నదమ్ముల్లాగనే అభిమానంతో చూసుకునేవారు. మేమూ తరచు వాళ్ళ మేడమీద క్యారమ్స్ లాటి గేమ్స్ ఆడేవాళ్ళం.


రామారావు గారిని ఆఫీస్ కు తీసుకువెళ్ళడానికి ఆర్మీ వ్యాన్ వచ్చేది. ఫోర్ట్ సెయింట్ జార్జ్ లో ఆఫీస్. సాయంత్రం ఆరు లోపలే ఇంటికి చేరేవారు. ఆ దంపతులిద్దరూ కూడా మేమంటే ఎంతో ప్రేమ చూపించేవారు. ఆయన ఆదివారం శెలవు రోజున ఘంటసాల మాస్టారితోనూ, సావిత్రమ్మగారితోనూ ముచ్చటించేవారు.

 

మండా బుచ్చి రామారావు గారితో మొదట్లో మాకు కలిగిన ఒక అనుభవం ఎప్పటికీ మర్చిపోలేను. అదేమిటంటే ---

 

రామారావు గారికి అరవం మట్లాడడం రాకఒక రోజు నన్ను, నరసింగడిని పిలిచి ఒక నలభై పేజీల రూల్డ్ నోట్ బుక్ కొనితెమ్మని డబ్బులు ఇచ్చారు.  వారింటి తర్వాత రెండిళ్ళకు ఎదురుగా ఒక ప్రొవిజన్ స్టోర్ వుండేది. అందులో స్టేషనరీ ఐటెమ్స్ కూడా దొరికేవి. మేము ఐదు నిముషాలలో ఆయన అడిగిన పుస్తకం కొని తెచ్చి ఇచ్చాము. ఆయన ఆ పుస్తకాన్ని నాలుగు పక్కలా చూసి అట్ట నలిగిపోయిందయ్యా అంటూ ఒక్కొక్క పేజీ లెఖ్ఖపెట్టడం మొదలుపెట్టారు. అన్ని పేజీలు లెఖ్ఖపెట్టి ఇందులో నలభై పేజీలు పూర్తిగాలేవు, ముఫ్ఫైఎనిమిదే వున్నాయి. ఇది ఇచ్చేసి పూర్తిగా నలభై పేజీలున్న పుస్తకం పట్రండి. వెళ్ళండి అన్నారు. మళ్ళీ ఆ పుస్తకం ఇచ్చేసి మరో మంచి పుస్తకం ఇవ్వమని అడిగాము. ఆ దుకాణం చెట్టియార్ మాకు పరిచయం వుండడం వలన మరో పుస్తకం ఇచ్చాడు. మేము అక్కడే ముందునుంచి చివర వరకు అన్ని పేజీలు లెఖ్ఖపెట్టాము. అందులోనూ ముఫ్ఫైఎనిమిది పేజీలే వున్నాయి. నలభైపేజీలు లేవు. ఆ కొట్టతను చెప్పిందేమిటంటే ముందు వెనక అట్టలకి అంటించిన పేజీలతో కలిపి నలభై పేజీలుగా పుస్తకాలు వేస్తారు.  అరవై పేజీలంటే ఏభై ఎనిమిది, ఎనభై పేజీలంటే డెభ్భై ఎనిమిది పేజీలుంటాయనిమీరే పుస్తకం కొన్నా అంతేనని చెప్పాడు. కావాలంటే మరో షాపులో కొనమని డబ్బులు తిరిగి ఇచ్చేసాడు. అదే విషయాన్ని రామారావు గారికి చెప్పాము. మిమ్మల్ని వాడు మోసం చేస్తున్నాడు. నేను రేపు ఆఫీస్ నుండి వచ్చేప్పుడు పూర్తిగా నలభై పేజీలున్న పుస్తకం కొని తెస్తాను చూడండని ఇచ్చిన డబ్బులు జేబులో వేసుకున్నారు. ఆ తర్వాత రామారావుగారు కొన్న పుస్తకము మాకు చూపించనూ లేదుమేము అడగనూ లేదు.

 

ఆయనకు శెలవు దినాలలో వచ్చి సావిత్రమ్మగారితో మాట్లాడేవారు. తన కుటుంబ కష్ట సుఖాలుసమస్యలు ఆవిడతో చెప్పేవారు. "ఇందిరాగాంధీ, లిండన్ జాన్సన్ల (అప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్ గా లిడన్ జాన్సన్, భారతదేశ ప్రధానమంత్రిగా శ్రీమతి ఇందిరాగాంధీ వుండేవారు) శిఖరాగ్ర సమావేశం జరుగుతోంది ఎవరూ డిస్టర్బ్ చేయకండని ఇంట్లోవాళ్ళు సరదాగా అనుకునేవారు.  


మండావారి కుటుంబం మా పక్కింట్లో సుమారు మూడేళ్ళపాటు వున్నారనుకుంటాను. తర్వాత మళ్ళీ వేరే చోటికి ట్రాన్స్ఫరై వెళ్ళిపోయారు.

 

ఆ తర్వాత కొన్నేళ్ళకు 1972 లో నేనుమా ఆవిడా  మా దొడ్డమ్మగారి అమ్మాయి శారదక్కను చూడడానికి ఒరిస్సా బోర్డర్ లోని పాతపట్నం వెళ్ళినప్పుడు అక్కడ అనుకోకుండా రోడ్ మీద రామారావు గారుఆయన భార్య కనిపించారు. ఆ ఇద్దరూ అలాగే వున్నారుఏ మార్పులేదు. అదే ఆప్యాయతతోఅభిమానంతో  పలకరించి మట్లాడారు. ఆ పాతపట్నంలో వారికేవో పంట భూములున్నాయని వాటి వ్యవహారాలు చూసుకుందుకు వచ్చామని చెప్పారు. పెద్దమ్మాయి పెళ్ళయి బొంబాయిలో వుందని, అల్లుడు ఏదో బ్యాంకులో మేనేజర్ అని చెప్పారు. రెండో అమ్మాయి పూనాలో వుంటోందని అన్నారు. వివరాలు ఆయన చెప్పనూలేదు. మేమూ అడగలేదు. అంతే ఆ తర్వాత వారిని మళ్ళీ చూడడం జరగలేదు. కానీమరికొన్నేళ్ళకు వారమ్మయిలను మాత్రం ఘంటసాలవారింట్లో ఒక అమ్మాయి పెళ్ళికి వచ్చినప్పుడు చూశాను. అక్కడితో ఆ కుటుంబంతో స్నేహం ముగిసింది.


ఘంటసాల మాస్టారు చాలా సహృదయులు. తనకు చేతనైనంత వరకూ ఇతరులకు సహాయంచేసేవారు. 'నెం.35,ఉస్మాన్ రోడ్' మేడమీది భాగం పునర్నిర్మాణం జరుగుతున్నప్పుడే మేముంటున్న ఔట్ హౌస్ డాబా మీద ఒక 'కొట్టాయ్వేయించారు. (కొబ్బరాకులశాల. ఆంధ్రా ప్రాంతాలలో ఇళ్ళకు తాటాకు లేదా చొప్ప వాడతారు. ఇక్కడ దక్షిణాదిన కొబ్బరాకుల మట్టలు అల్లి వాటిని పైకప్పుగా వేస్తారు)

 

నాకు తెలిసి మా డాబామీది కొట్టాయిలో ముందుగా భద్రంగారి కుటుంబం ప్రవేశించింది.  భద్రంగారు విజయనగరం మ్యూజిక్ కాలేజీలో మా తాతగారి శిష్యుడు. స్వస్థలం కొవ్వూరు అనుకుంటాను. గాయకుడు కావాలని మద్రాసు వచ్చి అందులో తగిన ప్రోత్సాహం లభించక ఘంటసాల మాస్టారి సలహాప్రోద్బలం మేరకు వైలిన్ ప్రాక్టీసు చేసి మాస్టారి ఆర్కెష్ట్రాలో, కచేరీలలో చోటు సంపాదించారు. తన భార్యముగ్గురు చిన్న పిల్లలతో ఆ కొట్టాయిలో కాపురం వుండేవారు. 35, ఉస్మాన్ రోడ్ రాశి ఏమిటో కానీ, ఆ భవనం ఎప్పుడు పిల్ల పాపల కేరింతలతో, ఆటపాటలతో మహా సందడిగా వుండేది. భద్రంగారికి ఒక ఆడపిల్ల? ఇద్దరు మగపిల్లలు - బాలచంద్ర, జయచంద్ర అని గుర్తు. పిల్లలిద్దరూ సినీ ఆర్కెస్ట్రాలలో వైలనిస్ట్లుగా స్థిరపడ్డారు. వీళ్ళంతా వయసులో నాకంటే బాగా చిన్నవాళ్ళు.


భద్రంగారు పొగచుట్టలు చుట్టడంలో సిద్ధహస్తులు. అయితే ఆయనకు పొగత్రాగే అలవాటు లేదు. ఘంటసాల మాస్టారికి నెలకు సరిపడా భద్రంగారే చుట్టలు చుట్టేవారు. మాస్టారి స్నేహితుడు గోసాల రామదాస్ వచ్చినప్పుడల్లా చేబ్రోలు పొగాకు తెచ్చేవారు. దానితోనే మాస్టారి చుట్టలు తయారయేవి. రోజుకు మూడు మాత్రమే కాల్చేవారు. 


ఒకసారి ఎప్పుడో ఇంట్లోని చుట్టలు అయిపోతే పాండీబజార్ ఆంధ్రా కిల్లీ షాప్ నుండి  దొరలు కాల్చే స్పెన్సర్ చుట్టలు కొన్ని కొని తెచ్చాను. కానీ అవి మాస్టారికి అంతగా నచ్చలేదు. 

 

భద్రంగారు వైలిన్ సాధన మొదలుపెట్టిన కొత్తల్లో తన చేతి వ్రేళ్ళకు ఏ కష్టమైన పని పెట్టేవారు కాదు. చాలా సుకుమారంగా జాగ్రత్తగా చూసుకునేవారు. వైలినిస్ట్ కు తన వేళ్ళే ప్రధానం అని చెప్పేవారు. భద్రంగారు వైలినిస్ట్ అయ్యారు కానీ ఏస్ వైలినిస్ట్ కాలేకపోయారు. కొన్నేళ్ళ తర్వాత భద్రంగారు నెం. 35, ఉస్మాన్ రోడ్ వదలి వళసరవాక్కం వెళ్ళిపోయారు.

 

మా ఔట్ హౌస్మీది కొట్టాయిలోకి బలి నారాయణ వచ్చారు. బలి పామర్తిగారి అన్నకొడుకు. పామర్తిగారు అతని సంరక్షణ భారం వహించి మద్రాసు తీసుకువచ్చారు. పామర్తిగారు అతనికి ఒక డోలక్ కొనిచ్చి శిక్షణ ఇచ్చారు. బలి గంటల తరబడి ఆ డోలక్ మీద సాధన చేయడం గుర్తుంది. వారికీ ఇద్దరు పిల్లలు. బలి మామగారు వెంపటి ముక్తేశ్వరరావుగారు మార్దంగీకుడు. ప్రముఖ కూచిపూడి కళాకారుల నృత్యాలకు మృదంగం వాయించేవారు. అలాగేసినీమాలలో వచ్చే కూచిపూడి నృత్య దృశ్యాలలో మృదంగం వాయిస్తూ కనపడేవారు. బలి ఒక మరదలి కొడుకు కొన్నేళ్ళక్రితం వరకూ తెలుగు టివి సీరియల్స్ లో నటించేవాడు. పేరు రాజేష్ అనుకుంటాను. బలి మొదట్లో మాస్టారివద్ద, పామర్తిగారివద్ద రిథిమ్ సెక్షన్లో  పనిచేసేవారు. క్రమేపి బలి నారాయణగారికి  అప్పారావుతో స్నేహం పెరిగింది. ఎప్పుడైతే అప్పారావు చక్రవర్తిగా మారారో అప్పుడే బలి నారాయణ దశ కూడా తిరిగింది.  చక్రవర్తి ఆర్కెష్ట్రా అరేంజర్గా బలి బాగా అభివృధ్ధిలోకి వచ్చారు. 


నెం.35, ఉస్మాన్ రోడ్ మేడ మీది భాగం పూర్తి అయ్యాక మాస్టారి కుటుంబం అంతా మేడమీదకు షిప్ట్ అయ్యారు. మా ఔట్ హౌస్ వేపునుండి కూడా మేడమీదకు వెళ్ళడానికి మెట్లు పెట్టించారు. బయటనుండి వచ్చేవారికి ముందువేపు మెట్లు, ఇంట్లోవారికి వెనకవేపు మెట్లు ఉపయోగంలో వుండేవి. అప్పుడే  రికార్డ్ ర్యాక్స్ తో కొత్త రేడియోగ్రామ్, కొత్త సోఫా సెట్ వంటివి ఇంట్లో అమరాయి. ఘంటసాల మాస్టారు ఆడంబరం, ఆర్భాటాలకు దూరం. ఆయనను అనుసరించే సావిత్రమ్మగారు కూడా తమ కుటుంబాన్ని నిరాడంబరంగా సామాన్య మధ్య తరగతి కుటుంబంలా నిర్వహించేవారు. గృహాలంకరణ, పిల్లల వేషభాషలు అన్ని సామాన్యంగానే వుండేవి. ఇతర సినిమా వాళ్ళ ఇళ్ళలో వుండే హంగుఆర్భాటాలు ఏవీ ఘంటసాలవారింట్లో కనపడేవికావు. అందువల్లనే నాలాటివాడు ఆ ఇంట్లో చనువుగా మసలడానికి వీలయింది.

 

మాస్టారి కుటుంబం మేడమీదకు వెళ్ళాక క్రింది పోర్షన్ లో ముందుగా ఒక మార్వాడి కుటుంబం అద్దెకు వచ్చారు. అప్పటినుండి నేను పోర్టికోలో కాలక్షేపం చేయడం తగ్గిపోయింది. 

నేను ఒక వేసవి శెలవులకు మద్రాసు వచ్చేప్పటికి ఘంటసాల మాస్టారింటి క్రింది పోర్షన్ లో నుండి తెలుగు మాటలు వినవచ్చాయి. అప్పుడే నాకు తెలిసింది, అంతవరకు వున్న మార్వాడీ కుటుంబం ఖాళీచేసి వెళ్ళిపోయారని. ఒక తెలుగు కుటుంబం వచ్చింది. వారు ఆ ఇంటికి వచ్చిన వేళా విశేషం, ఈ నాటి వరకు ఆ కుటుంబంతో మాకు స్నేహ బాంధవ్యం నిరాటంకంగా కొనసాగుతూవుంది. వారే కొల్లూరి వెంకటేశ్వరరావుగారు. వారు ఆ ఇంటికి వచ్చేసరికి మా లోగిట్లో పిల్లల సంఖ్య మరో ముగ్గురికి పెరిగింది. ముగ్గురూ ఆరేళ్ళ నుండి మూడేళ్ళ లోపువారే. వీరంతా మా కుటుంబాలతో ఏ అరమరిక లేకుండా కలసిపోయి తమ మమతానురాగాలను సరిసమానంగా పంచుకున్నారు.

 

వెంకటేశ్వరరావుగారు విద్యాధికుడు. ఛార్టర్డ్ ఎక్కౌంటెంట్కాస్ట్ ఎక్కౌటెంట్ వంటి అనేక విద్యార్హతలుండేవి. అంబత్తూర్  ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో వుండే 'వావిన్ ఇండియా' ప్లాస్టిక్ పైప్స్ లో కంపెనీ సెక్రెటరి. రావుగారి తమ్ముడిని వాళ్ళ పిల్లల్లాగే శాస్త్రిబాబు అని మేమంతా పిలిచేవాళ్ళం. అతను అన్నగారి వద్ద వుంటూ మద్రాస్ లో సి.ఎ. కోర్స్ చదువుతూండేవాడు. మనిషి దబ్బపండు రంగులో చాలా హ్యాండ్సమ్ గా వుండేవాడు. చిన్న పిల్లలను ఎలా హ్యాండిల్ చేయాలో అతనికి బాగా తెలుసు. కొల్లూరివారు వచ్చాక పోర్టికో మళ్ళీ నా సొంతమయింది.


"దేశభాషలందు తెలుగు లెస్స" అనే నానుడి శ్రీనాథుడి కాలంనుండే ప్రచారంలో వున్నా కన్నడ ప్రభువు, 'ఆంధ్రభోజ', 'మూరురాయయగండరుబిరుదాంకితుడైన కవిదిగ్గజం శ్రీకృష్ణ దేవరాయలు మరొక్కసారి తెలుగు భాషా ఔన్నత్యాన్ని నొక్కి వక్కాణించాడు. కళాపోషకుడిగా దిగ్గజాలవంటి ఎనిమంది ఉత్తమ కవులను తన కొలువులో వుంచి సాహిత్యాభివృధ్ధికి ఎనలేని సేవచేశాడు. భారతావనిలోనే అతి పెద్ద సామ్రాజ్యాన్ని విస్తరింపజేసిన గొప్ప చక్రవర్తి శ్రీకృష్ణ దేవరాయలు. ఆ కృష్ణదేవరాయలు ఔన్నత్యానికి అడుగడుగునా కృషి చేసిన స్వామిభక్తి పరాయణుడు సాళువ తిమ్మరుసు. రాయలవారి ప్రధానమంత్రి. తెలుగువాడు. నియోగి బ్రాహ్మణుడు. తిమ్మరుసు మంత్రాంగమే లేకుంటే కృష్ణదేవరాయల చరిత్రే లేదు. అటువంటి గొప్ప రాజతంత్రవేత్త  తిమ్మరుసు కధ 1962 లో "మహామంత్రి తిమ్మరుసు" పేరిట గౌతమీ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద నర్రా రామబ్రహ్మం, అట్లూరి పుండరీకాక్షయ్యలు నిర్మాతలుగా విడుదల చేశారు. టైటిల్ రోల్ ను గుమ్మడి, కృష్ణదేవరాయలుగా ఎన్.టి.రామారావు అత్యద్భుతంగా నటించి తెలుగులో ఒక గొప్ప కళాఖండాన్ని సృష్టించారు. కమలాకర కామేశ్వరరావు దర్శకుడు. పెండ్యాల నాగేశ్వరరావు సంగీతదర్శకుడు. సంగీత సాహిత్యాల కలబోతగా తయారైన ఈ చిత్రం ఘన విజయంలో  గాయకుడిగా ఘంటసాల మాస్టారి పాత్ర కూడా వుంది. ఈ చిత్రానికి  ఉత్తమ తెలుగు చిత్రంగా నేషనల్ అవార్డ్ కూడా లభించింది. ఈ చిత్రం తర్వాత నిర్మాతలు ఎన్.రామబ్రహ్మం, ఎ.పుండరీకాక్షయ్య మరల కలసి మరే చిత్రమూ నిర్మించినట్లు లేదు. ఐదేళ్ళ తర్వాత 1967లో ఈ ఇద్దరు నిర్మాతలు వేరే వేరే కుంపట్లు పెట్టుకొని రామబ్రహ్మంగారు 'నిర్దోషి' చిత్రాన్ని, పుండరీకాక్షయ్యగారు 'శ్రీకృష్ణావతారం' చిత్రాలను విడుదల చేసారు. ఒకటి సాంఘికం. మరొకటి పౌరాణికం. ఈ రెండు చిత్రాలకు అన్నగారే హీరో. రెండూ ఘనవిజయం సాధించాయి. ఈ నిర్మాతలు ఇద్దరూ పోటీలు పడి ఒకేసారి విడుదల చేయకుండా  తెలివిగా ఆరు మాసాల వ్యవధిలో విడుదల చేసారు. నిర్దోషికి ఘంటసాల మాస్టారు సంగీత దర్శకుడు. శ్రీకృష్ణావతారం సినీమాకు టి.వి. రాజుగారు సంగీత దర్శకుడు. ఈ రెండు చిత్రాల విజయానికి ఘంటసాలవారి గాన ప్రతిభ ఎంతగానో దోహదం చేసింది.

నిర్దోషి , శ్రీకృష్ణావతారం సినీమా పాటల ముచ్చట్లు...

ఇప్పుడు కాదు.... వచ్చేవారమే...

...సశేషం




Sunday, June 13, 2021

నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 2 - ముఫ్ఫై ఐదవ భాగం

  13.06.2021 - ఆదివారం భాగం - 35*:
అధ్యాయం 2  భాగం 34 ఇక్కడ
                                
                                    నెం.35, ఉస్మాన్ రోడ్
ప్రణవ స్వరాట్.
                  



 

  "ఋణానుబంధ రూపేణా
    పశు పత్నీ సుతాలయః 
    ఋణక్షయే క్షయం
    యాంతి కా తత్ర పరివేదన"

పశువులు,భార్యాసుతులు, గృహములు , భూవసతులు
మొదలైనవన్నీ  ఋణానుబంధ రూపంగా ఏర్పడి,ఆ ఋణం తీరగానే ఆ మనిషి నుండి దూరమైపోతాయి. ఆ ఋణం తీరిపోగానే వాటి వల్ల కలిగే దుఃఖమూ ఇంక మిగలదు అనేది సూక్తి.

" ఏనాటిదో ఈ బంధం
ఈ జీవుల సంబంధం
తెలియగరాని ఈ అనుబంధం
ఋణానుబంధం
అంతా ఋణానుబంధం....
..... ఎవరికి ఎవరు ఏమౌతారో 
అంతా ఋణానుబంధం..."

అని సముద్రాల రామానుజంగారు వ్రాసిన మాటల్లోని తాత్త్వికతను , వేదాంతాన్ని  పామరులకు సైతం అర్ధమయేలా సరళంగా మరింత భావోద్వేగంతో మన గాన గంధర్వుడు  ఘంటసాల మాస్టారు ఆలపించారు.

నేటితో మా తండ్రిగారి శ్రాద్ధ కర్మలు, మూడు రోజుల కార్యక్రమము  సంతృప్తికరంగా మా పరిధులమేరకు నిర్వర్తించాము. మా తండ్రిగారు నివసించిన మా పెద్దచెల్లెలు రమణమ్మ స్వగృహంలోనే వైకుంఠ సమారాధన కూడా జరిగింది. 
దైవత్వాన్ని పొందిన మా నాన్నగారి దివ్య ప్రసాదాన్ని మేమంతా భక్తి శ్రద్ధలతో స్వీకరించాము.

మాకు జన్మనిచ్చి, పెంచి, విద్యాబుద్ధులను నేర్పించి మమ్మల్ని మనుషులుగా తీర్చిదిద్దిన పూజ్యులు, మా తండ్రిగారు పట్రాయని సంగీతరావు గారికి మేము ఋణపడివున్నామో,
లేక ఆయనే మాకు ఋణపడి అన్ని ఋణాలు తీర్చుకొని ఈ భవబంధాలనుండి విముక్తులయ్యారో అనేటువంటి తార్కిక,తాత్త్విక,వేదాంత విషయాల గురించి చెప్పే విషయ పరిజ్ఞానం నాకు లేదు.

కానీ వారు మాత్రం ఈ లోకంతో తనకున్న 101 సంవత్సరాల భవబంధాలను, అనుబంధాలను అన్నింటిని తొలగించుకొని మనమెవ్వరమూ ఊహించలేని, అందుకోలేని సుదూర తీరాలకు తరలివెళ్ళిపోయారు.
భౌతికంగా మా తండ్రిగారు మమ్మల్ని వదలివెళ్ళినా ఆయన సౌజన్యం, వ్యక్తిత్వం, మానవతాదృక్పధం,
ఆయనతోటి జ్ఞాపకాలు మాత్రం సదా మమ్మల్ని వెన్నంటే వుండి మాకు తోడునీడగా నిలిచేవుంటాయి.

మా నాన్నగారికి సంబంధించిన వీడుకోలు మాటలను ఇంత త్వరలో 'నెం. 35,ఉస్మాన్ రోడ్' ధారావాహిక లో వ్రాస్తానని,
వ్రాయవలసివస్తుందని నేను ఏనాడూ ఊహించలేదు. 
ఈ కరోనా మహమ్మారికి ఆయన బలికావలసి వచ్చింది. 101 సంవత్సరాల 7 మాసాలతో ఆయన ఆయుర్దాయం ముగిసింది. 
ఈ భూమి మీద ఆయన ఋణం తీరిపోయింది.
ఉన్న నాలుగునాళ్ళు ఒక మహామనీషిగా  అందరి గౌరవమర్యాదలను అందుకొని అందరివద్దా శాశ్వతంగా శెలవు తీసుకొని వెళ్ళిపోయారు.

'నెం.35,ఉస్మాన్ రోడ్' తో శ్రీ పట్రాయని సంగీతరావు గారి అనుబంధం నిన్న మొన్నటిది కాదు. 1952 లో మొదటిసారిగా ఆయన ఆ ప్రాంగణంలో అడుగుపెట్టారు. ఆ రోజు 
కొత్త బంధాలకు, అనుబంధాలకు స్నేహ సత్సంబంధాలకు నాంది పలికిన రోజు.

ఆ రోజున ఘంటసాల మాస్టారింట్లో వారి తండ్రిగారి  ఆబ్ధికం జరుగుతోంది. మాస్టారు ఇంటిలోపల ఆ కార్యక్రమంలో నిమగ్నమైవున్నారు.
అలాటి సమయంలో శ్రీ సంగీతరావు గారు 'నెం.35, ఉస్మాన్ రోడ్' లోకి ప్రవేశించారు. వీధి వాకిలి, పోర్టికో దాటి వరండాలోకి వెళ్ళగానే అక్కడ ముందుగా మాస్టారి స్నేహితుడు మోపర్రుదాసుగారు కనిపించారట. ఆయన సంగీతరావు గారిని గుర్తుపట్టి,ఆయనను అక్కడే కూర్చోమని చెప్పి లోపలికి వెళ్ళి ఘంటసాలవారి తో చెప్పారట. వెంటనే మాస్టారు చేస్తున్న కార్యక్రమాన్ని మధ్యలో ఆపి బయటకు వచ్చి సంగీతరావు గారిని చేయిపట్టుకొని సగౌరవంగా ఇంట్లోకి తీసుకువెళ్ళారట. 
ఆనాటి సంగీతరావు గారి మనస్థితి కుచేలుడి మనస్థితి వంటిదే. బాల్యమిత్రుడైన కుచేలుడిని కృష్ణుడు ఆదరించినట్లుగానే సంగీతరావు గారిని ఘంటసాల ఆదుకున్నారు. 

శ్రీకృష్ణ కుచేల సినీమాలోని కుచేలుని విషయాల గురించి
చెప్పేప్పుడు మా నాన్నగారిలోని వేదనాపూరితమైన భావోద్వేగాన్ని చూస్తే ఆ కుచేలుడు తానే అయి మాట్లాడుతున్నారా ?అనే భావన నాలో కలిగేది. అంతలా  ఆ కుచేలుడి పాత్రలో లీనమైపోయేవారు.

మద్రాసు సినీమా వాతావరణం లో ఇమడలేక కొన్ని మాసాల తర్వాత విజయనగరం వచ్చేసినా మరో ఏడాది తర్వాత సంగీతరావు గారు మరల మద్రాస్ వెళ్ళడం, ఆ సమయంలో ఘంటసాల మాస్టారిని మా నాన్నగారు కలవడం జరిగింది. ఇక మర్నాడు ప్రయాణమనగా  ఆయన బసచేసిన హోటల్ కు మాస్టారు వెళ్ళి బలవంతాన ప్రయాణం ఆపుచేయించి తనతో కూడా కారులో తన ఇంటికి తీసుకువెళ్ళిపోయారు. అంతే, ఆ తర్వాత సంగీతరావు గారు మరల విజయనగరం లో నివాసం చేయలేదు. ఆనాడు ఘంటసాలవారు చూపిన ప్రేమాభిమానాలు, స్నేహభావం సంగీతరావు గారిని కట్టిపడేసాయి. ఇక తన జీవితమంతా ఘంటసాలవారి సహచర్యంలోనే అనే నిర్ణయానికి వచ్చేసారు. ముందు కొన్ని మాసాలు టి నగర్ రంగయ్యర్ స్ట్రీట్ ఇంటిలో గడిపినా , ఆ తర్వాత త్వరలోనే 'నెం.35,ఉస్మాన్ రోడ్' ఔట్ హౌస్ లోకి తన నివాసం మారిపోయింది. ఆ చిన్ని ఇంటిలో దాదాపు 28 సంవత్సరాలు ఘంటసాల కుటుంబీకుల మమతానురాగాల మధ్య సంగీతరావు గారు తన జీవనయానం కొనసాగించారు.


 శ్రీ సంగీతరావు గారు దాదాపు 22 సంవత్సరాలు సినీమారంగంలో గడిపినా తామరాకుమీది నీటిబొట్టులాగే వుండేవారు. సినీమా సంగీతం తన గమ్యం కాదనే దృష్టితో వుండేవారు. తనకు ఆశ్రయమిచ్చి ఆదరించిన ఘంటసాలవారి వద్ద తప్ప ఏ ఇతర సంగీత దర్శకుల దగ్గరా పనిచేయలేదు. చేయాలనే కోరికా వుండేదికాదు. స్వతహగా మంచి గాయకుడైనప్పటికీ సినీమాలలో పాడాలనే ఆసక్తే ఆయనకు కలగలేదు. తన వ్యక్తిత్వానికి, ఆశయాలకు భంగకరమనిపించినప్పుడు  ఆలిండియా రేడియో వంటి ప్రసార సాధనాలనే తృణీకరించారు. సంగీతరావు గారు ధనార్జన కోసం, కీర్తిప్రతిష్టలకోసం ఏనాడూ వెంపర్లాడలేదు. తనను గుర్తించి వచ్చిన అవకాశాలను మాత్రం స్వీకరించి త్రికరణశుధ్ధిగా అత్యంత నిజాయితీ తో పనిచేశారు. దాదాపు 70 సంవత్సరాలపాటు సంగీతరావు గారు మద్రాసులో గడిపినా తనకంటూ ఒక చిన్న ఇంటినిగానీ , ఒక సెంటు భూమిని కానీ ఏర్పర్చుకోలేకపోయారు. అందుకు కుటుంబ ఆర్ధిక పరిస్థితులు కూడా ఒక ముఖ్య కారణం. అయినా ఆయన ఏనాడూ బాధపడలేదు. తనకున్న దాంట్లోనే సుఖంగా,సంతోషంగా జీవించారు. 

1972 తర్వాత ఘంటసాల మాస్టారి ఆరోగ్యం క్షీణిస్తున్న సమయంలో చేతిలో తగినంత పని, ఆర్జన లేనప్పుడు కూడా, ఆయన దగ్గరవున్న ఇతర సహాయకులంతా వేరే మార్గాలు పట్టినప్పుడు కూడా సంగీతరావు గారు ఇతరులవద్దకు ఛాన్స్ల కోసం ఏ ప్రయత్నం చేయలేదు. 

అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో దైవం, ప్రముఖ నాట్యాచార్యుడు
 శ్రీ వెంపటి చిన సత్యంగారి రూపంలో వచ్చి తమ కూచిపూడి ఆర్ట్ ఎకాడెమీ  ఢిల్లీలో నిర్వహిస్తున్న ఒక నృత్యనాటకంలో పాడేందుకు రమ్మని ఆహ్వానించారు. అప్పుడు ఘంటసాల మాస్టారి అనుమతితోనే   సంగీతరావు గారు ఢిల్లీ కార్యక్రమానికి వెళ్ళారు. సరిగ్గా అదే సమయంలో ఘంటసాల మాస్టారు సంగీత దర్శకత్వంలో మొదలైన 'సతీ సావిత్రి' సినీమాలోని ఒక శ్లోకం , 'నాదబిందు కళాధరి' పాట రికార్డింగ్  జరిగింది. అది సంగీతరావు గారు లేకుండా జరిగింది.

అంతకుముందు కూడా ఒకసారి తన అనారోగ్యం కారణంగా 'సత్యనారాయణ మహత్యం' సినీమాలోని ఒక నృత్యగీతం రికార్డింగ్ లో పాల్గొనలేకపోయారు. ఈ రెండు సమయాలలో తప్ప  ఘంటసాలవారి చరమాంకం వరకూ ఆయనకు సహాయకుడిగానే జీవించారు.
 
1974 లో తన 54 వ ఏట, తనకు రిటైర్మెంట్ వయసు దగ్గర పడుతున్న తరుణంలో సరికొత్త జీవితాన్ని ఆరంభించారు. డా. వెంపటి చిన సత్యంగారి  ఆహ్వానం మేరకు కూచిపూడి ఆర్ట్ ఎకాడెమీలో గాయకుడిగా, అక్కడి విద్యార్ధులకు సంగీతం మాస్టర్ గా, హార్మొనిస్ట్ గా, వైణికుడిగా, సంగీత దర్శకుడిగా తనలోని బహుముఖ ప్రజ్ఞను కనపర్చి తన విద్వత్ ఏమిటో లోకానికి చాటిచెప్పారు. సుమారు మూడున్నర దశాబ్దాల పాటు  సంగీతజ్ఞుడిగా కూచిపూడి నృత్య విశిష్టత ప్రపంచ వ్యాప్తం కావడానికి ఇతోధికంగా కృషిచేశారు. కూచిపూడి నృత్య త్రిమూర్తులలో( డా.వెంపటి చిన సత్యం, పట్రాయని సంగీతరావు, శ్రీ ఎస్ వి భుజంగరాయ శర్మ) ఒకరిగా మన్ననలు పొందారు. అనేక సార్లు ప్రముఖ  ప్రపంచ దేశాలన్నీ పర్యటించి భారతీయ కళా సంస్కృతి ఔన్నత్యాన్ని ఆయా దేశాలలో చాటి చూపారు.
అక్కడే తన ఆశయసిధ్ధికి, సంగీత విద్వత్ కు తగిన గుర్తింపు, మన్నన , ప్రశంస లభించిందని మనసారా ఆనందించారు.తృప్తి చెందారు.

 కూచిపూడి ఆర్ట్ ఎకాడెమీ నృత్య నాటక సంగీత దర్శకుడిగా చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా తమిళనాడు ప్రభుత్వం వారి ప్రతిష్టాత్మక 'కలైమామణి' బిరుదును ఆనాటి ముఖ్యమంత్రి కుమారి జె. జయలలిత చేతులమీదుగా స్వీకరించారు. 


ఆ తర్వాత,  వివిధ సందర్భాలలో మరెన్నో సత్కారాలు, సన్మానాలు, పురస్కారాలు పొందారు. శ్రీ సంగీతరావు గారికి తన 
22 వ ఏటనే మొట్టమొదటిసారిగా ఆంధ్రా రీసెర్చ్ యూనివర్సిటీ వారిచే 'సంగీతభూషణ'  బిరుదు ప్రదానం జరిగింది. ఇన్ని బిరుదులు, సన్మానాలు,సత్కారాలు పొందినా తన జీవితాన్నంతా అతి నిరాడంబరంగా,ఏ డాబూ,దర్పం లేకుండా గడిపారు. సద్గురు శ్రీ త్యాగరాజస్వామి వారికి అసలు సిసలైన వారసుడు శ్రీ పట్రాయని సంగీతరావుగారు. సంగీతమే తన వృత్తిగా,ప్రవృత్తిగా, ఊపిరిగా జీవించిన ధన్యజీవి.

శ్రీ సంగీతరావు గారు ఒక నాదయోగి.

శ్రీ సంగీతరావు గారిలో నిగూఢమై వున్న,అనన్యసామాన్యమైన సంగీత విద్వత్, నిరాడంబరత, సౌమ్యత‌, సౌజన్యం, అనవసరంగా ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోకపోవడం వంటి లక్షణాలు ఘంటసాల మాస్టారిని బాగా ఆకర్షించాయి. వారిరువురి మధ్య స్నేహబంధాన్ని బలపర్చాయి. మాస్టారు సంగీతరావు గారిని గురుస్థానంలోనే వుంచి గౌరవించారు. ప్రేమగా 'సంగీతం బాబూ' అని పిలిచేవారు. ఘంటసాలవారు కనపర్చిన గౌరవమర్యాదలనే సినీమా రంగంలోని ఇతర సంగీత కళాకారులు,దర్శక నిర్మాతలు సంగీతరావు గారిపట్ల చూపించేవారు. 

శాస్త్రీయ సంగీతం, కూచిపూడి నాట్యం మీద పరిశోధనా వ్యాసాలు వెలువరించే ఎంతోమంది పిహెచ్ డి విద్యార్ధులు విషయసేకరణకోసం శ్రీ సంగీతరావు గారి వద్దకు వచ్చేవారు. ఆయనకూడా ఎంతో సహృదయంతో వారికి  కావలసిన సమాచారాన్ని సోదోహరణంగా వివరించి చెప్పేవారు. 

ఘంటసాల మాస్టారు స్వీయ సంగీతంలో చేసిన, పాడిన ఎన్నో పాటలు ఉత్తమ సంగీత విలువలు కల గీతాలని ,శాస్త్రీయ సంగీతం నేర్చుకునే ప్రాధమిక విద్యార్ధులకు  అవి ఒక బేస్ వంటివని వాటిని అందరూ నేర్చుకొని పాడాల్సిన అవసరం ఎంతైనా వుందని సంగీతరావు గారు అభిప్రాయపడేవారు. అలాగే తన విద్యార్ధులందరికీ నేర్పించారు కూడా. అందులో ప్రముఖమైనవి -

'దినకరా శుభకరా '- పంతువరాళి రాగం;

ఆరుద్రగారి ' తూరుపుదిక్కున అదిగో చూడు పొడిచె వేగుచుక్క - గుణ్ కలి రాగం; ఈ పాటనే సంగీతరావు గారు భూపాళ రాగంలో స్వరపర్చి పాడేవారు;

'ఎన్ని మాయలు నేర్చినావయా కన్నా' మల్లాది వారి సాహిత్యం. జంఝూటి రాగం. ఘంటసాలవారు 'దైవం' అనే సినీమాను తీయాలని సంకల్పించి మల్లాదివారిచేత ఈ పాట వ్రాయించి కంపోజ్ చేశారు. కానీ ఆ సినీమా ఆదిలోనే ఆగిపోయింది. ఇంతమంచి పాట రికార్డు కూడా కాలేదు.
 


మల్లాది వారి 'తెల్లవార వచ్చె తెలియకనా సామి' మోహన రాగం;

దాశరధిగారి 'ఏనాటికైనా ఈ మూగవీణా' సింధుభైరవి రాగం;


'ఏడుకొండలవాడా వెంకటా రమణా' - చక్రవాకం



'వేణుగాన లోలునిగన' - దేశ్


ఇలాటి పాటలు మరెన్నో. ఇవికాక తాను వ్రాసి,స్వరపర్చిన గీతాలను కూడా పిల్లలకు నేర్పేవారు.



 ఘంటసాలవారు 'మాస్టారు' గా చిత్రపరిశ్రమలోని ప్రముఖులందరిచేత గౌరవింపబడుతున్నప్పటికీ ఆయనలో ఆ అహంకారం,దర్పం కొంచెం కూడా కనిపించేవి కావు. తోటి కళాకారులందరినీ తనతో సమానంగా గౌరవించేవారు,అభిమానించేవారు. ముఖ్యంగా,శాస్త్రీయ సంగీత విద్వాంసుల పట్ల ఎనలేని భక్తి విశ్వాసాలుండేవి.
మ్యూజిక్ ఎకాడెమీలో జరిగిన నిస్సార్ హుస్సేన్ ఖాన్ గారి గాత్రకచేరీకి స్వయంగా  తంబురా శ్రుతి వేసినా; ఉస్తాద్ బడేగులాం ఆలీఖాన్ గారికి కొన్ని మాసాలపాటు తన ఇంట ఆతిథ్యం ఇచ్చినా; వీటన్నిటికీ కారణం ఘంటసాలవారిలోని వినయవిధేయతలే.

ఒక  శాస్త్రీయ సంగీత కచేరీ ముగింపులో సభ నిర్వాహకులు గాయకుడిని,పక్కవాద్యగాళ్ళను సత్కరించి తంబురా శ్రుతి వేసినాయనను వదిలేసారు. కొంత నిర్లక్ష్యం. కొంత అజ్ఞానం. అప్పుడు,ఆ సభలోనే వున్న మాస్టారు వేదికమీదకు వచ్చి సంగీతంలో శ్రుతికి గల ప్రాధాన్యత ను వివరించి ఆ శ్రుతిని సక్రమంగా వేస్తూ గాయకుడి గాత్రానికి దోహదపడే తంబురా కళాకారుడిని సన్మానించకుండా విస్మరించడం తగదని సన్నసన్నగా చీవాట్లు పెట్టారు. ఆ తర్వాత, తంబురా శ్రుతి వేసినాయనను ఘంటసాల మాస్టారే శాలువ కప్పి అభినందించారు. ఆ సమయంలో ఆ తంబురా సహకారం అందించిన వ్యక్తి ముఖంలోని సంతోషం,గుర్తింపు పొందానన్న తృప్తి స్పష్టంగా కనిపించింది.

ఘంటసాల మాస్టారి ఔన్నత్యం, వినయవిధేయతల గురించి మా నాన్నగారు,శ్రీ పట్రాయని సంగీతరావు గారు చెప్పిన ఒక ఉదంతం.

కదిరిలోనో లేక బళ్ళారిలోనో సరిగ్గా గుర్తులేదు, జరిగిన ఏవో సంగీతోత్సవాలకు ఘంటసాల మాస్టారు ఒక కచేరికి తన బృందంతో వెళ్ళారు. అక్కడ  సభ నిర్వాహకులు మాస్టారి కచేరీకి ముందు భీమ్ సేన్ జోషి గారి కచేరీ ఏర్పాటు చేసారట. భీమ్ సేన్ జోషి అంటే భారతదేశంలోని అగ్రశ్రేణి హిందుస్థానీ సంగీత విద్వాంసుడు. అత్యంత ప్రతిభాశాలి. అటువంటి గాయకుడి గానం వినగలగడం ఒక అదృష్టంగా భావించి ఘంటసాల మాస్టారు తన కచేరీ సమయం కంటే చాలా ముందుగానే బయల్దేరి సభాస్థలికి చేరుకున్నారట. 

ఘంటసాల వచ్చారన్న విషయం తెలిసిన మరుక్షణమే ఆడిటోరియంలో భీమ్ సేన్ జోషి గారి కచేరి వింటున్న శ్రోతలంతా ఒక్కుమ్మడిగా బయటకు పరిగెత్తుకుపోయి ఘంటసాలవారి కారును చుట్టుముట్టారట. ఆయనను చూడడానికి , మాట్లాడడానికి ఒకటే కలకలం చెలరేగిందట.
జనాలు అంతా ఎందుకు అంత అకస్మాత్తుగా లేచి పరిగెడుతున్నారో అర్ధంకాక వేదికమీద జోషిగారు తన గానం ఆపేసి నివ్వెరపోయి చూస్తున్నారట.
బయట ఘంటసాల మాస్టారికి విపరీతమైన ఆగ్రహం వచ్చిందట. ఆయన జనాలను తప్పించుకొని హాలులో వేదికమీదకు వెళ్ళి మైకు అందుకొని గట్టిగా అరిచారట. ఒక మహా విద్వాంసుడు అత్యద్భుతంగా గానం చేస్తూంటే మధ్యలో లేచిపోవడం చాలా అనుచితమని,సభామర్యాద కాదని, ఆ మహాగాయకుడిని అవమానపర్చడమేనని కేకలు వేసారట. ఆయన కంటే తానేం గొప్ప గాయకుడినేంకాదని ఆయన సంగీతం వినడానికే ముందుగా ఆడిటోరియంకు వచ్చానని , ప్రేక్షకులు ఇంత హీనంగా ప్రవర్తించడం తగదని, ఈ రకమైన వాతావరణం లో తాను ఇక అక్కడ కచేరీ చేయనని గట్టిగా చెప్పి తాను భీమ్ సేన్ జోషి గారికి ప్రేక్షకుల తరఫున క్షమాపణలు చెప్పారట.
ఘంటసాలగారు అంత తీవ్రంగా స్పందిచడంతో అంతా సద్దుమణిగి  జోషి గారి కచేరీ ప్రశాంతంగా ముగిసిందట.

ఇది ఘంటసాల మాస్టారి వినయానికి, వ్యక్తిత్వానికి,
హృదయవైశాల్యానికి ఒక మచ్చుతునక.

 'నెం.35,ఉస్మాన్ రోడ్' లో పుస్తక పఠనాన్ని అలవాటు చేసింది సంగీతరావు గారే. ఆసక్తికరంగా ఆయన చెప్పే కథలు విని సావిత్రమ్మగారు , పాప పిన్నిగారు, తర్వాతి కాలంలో పిల్లలు మంచి పుస్తకాలు చదవడం పట్ల అభిలాషను పెంపొందించుకున్నారు.

సంగీతరావు గారు అటు సంగీతంలో ఎంత నిష్ణాతుడో సాహిత్యం విషయంలోనూ అంతే. ఆయనకున్న విషయ పరిజ్ఞానం అపారం. ఏ విషయం మీదనైనా అనర్గళంగా మాట్లాడగల వాక్పటిమ వుండేది. అయితే అది బయటకు తీసుకురావడానికి ఇతరులు చాలా శ్రమపడవలసి వచ్చేది. మా నాన్నగారిలోని రచయితను చందూర్ దంపతులవంటివారు గుర్తించి ఒకటికి పదిసార్లు బలవంతపెడితే కొన్ని కధలు వ్రాసారు. అవి చందూర్ గారి 'జగతి' లో, మాలతిగారి నిర్వహణలోని ' ఆంధ్రమహిళ 'లోనూ ప్రచురితమయాయి. సంగీతరావు గారికి ఈ సాహితీ సంపర్కం విజయనగరం రోజుల్లోనే ఏర్పడింది. ఆయన మిత్రులు పంతుల శ్రీరామశాస్త్రిగారు , భట్టిప్రోలు కృష్ణమూర్తి గారు , మంథా  వెంకట రమణారావుగారు మంచి కవులు. చేయితిరిగిన రచయితలు. వీరే కాకుండా స్థానికంగా కవులుగా లబ్ధప్రతిష్టులైన పంతుల లక్ష్మీనరసింహ శాస్త్రిగారు, క్రొవ్విడి రామంగారు,తదితర సాహితీవేత్తల సాంగత్యంతో 
శ్రీ సంగీతరావు గారికి సాహిత్యంలో అభినివేశం, మక్కువ ఏర్పడ్డాయి.

మా నాన్నగారు డబ్బులు చేర్చుకోలేకపోయారు, కానీ,
అంతకుమించిన ఎన్నో రెట్లు విలువైన ఉత్తమ సాహిత్యాన్ని  సేకరించగలిగారు. అవి ఎవరి దగ్గరా సంగ్రహించినవికావు. స్వయంగా డబ్బుపెట్టి కొనుక్కున్నవి.
 ఆయన ఇంటివద్ద  ఖాళీగా వుంటే సగభాగం సంగీతంతోనూ , సగభాగం పుస్తక పఠనంతోనూ గడిచిపోయేది.

పాండీబజార్ రాజకుమారి ధియేటర్ ( ఇప్పుడు 'బిగ్ బజార్ కాంప్లెక్స్)  కాంపౌండ్ గోడను ఆనుకొని ప్లాట్ ఫారమ్ మీద 
చాలా పెద్ద సెకెండ్ హ్యాండ్ పుస్తకాల షాపు వుండేది. ఒక్క వర్షాలు పడే సమయంలో తప్ప, ఉదయం పది నుండి రాత్రి 10 వరకూ ఆ పుస్తకాల షాపు తెరిచివుండేది. పానగల్ పార్క్ చప్టాలమీద ముచ్చట్లాడే రచయితలంతా అక్కడ లేరంటే, పాండీబజార్ లోని ఈ పుస్తకాల షాప్ దగ్గర దర్శనమిచ్చేవారు. ఆ పుస్తకాల షాపులో వివిధ భాషలకు చెందిన అమూల్యమైన గ్రంథాలెన్నోదొరికేవి. పుస్తకం ఖరీదు నూరు రూపాయలైతే ఏభై రూపాయలకు అమ్మేవారు
ఆ రకంగా మా నాన్నగారు చాలా పుస్తకాలే కొన్నారు. 
ఆ షాపులో ఇటువంటి ఉత్తమ గ్రంధాలతోపాటూ 
యువతరానికి కావలసిన మిల్స్&బూన్, జేమ్స్ హాడ్లీ ఛేస్, టెంపోరావ్, కొమ్మూరి సాంబశివరావు వంటి వారి పల్ప్ సాహిత్యం కూడా విరివిగానే దొరికేది. ఉదయం నుండి రాత్రివరకూ ఆ పుస్తకాల షాప్ జనాలతో కళకళలాడుతూ వుండేది. ఎవరి అభిరుచికి తగిన పుస్తకాలు  కొని వారు పట్టుకువెళ్ళేవారు. ఆరుద్ర, జరుక్ శాస్త్రి,శ్రీరంగం నారాయణ బాబు , ఊహాగానం - లత వంటి ప్రముఖులెందరో అక్కడ కనిపించేవారు.

ఇలాటి  మరో పెద్ద సెకండ్ హ్యాండ్ బుక్స్ స్టాల్ లజ్ కార్నర్ లో కామధేను ధియేటర్ ఎదురు ప్లాట్ ఫారమ్ మీద వుండేది. ఆ పుస్తకాల షాపుతో తనకు చిరకాల సాన్నిహిత్యాన్ని గురించి  చాలా రసవత్తరంగా ముళ్ళపూడి వెంకట రమణ తన జీవితకధలో వ్రాసారు.

మా నాన్నగారి వద్ద శరత్ బాబు‌, రవీంద్రనాధ్ టాగోర్, మున్షీ ప్రేమ్ చంద్, చలం, కొడవటిగంటి కుటుంబరావు గార్ల పుస్తకాలు, దేశి ప్రచురణ ( బొందలపాటి శివరామకృష్ణ,శకుంతలాదేవి అనే గుర్తు) వారి పుస్తకాలు ఎన్నో వుండేవి. వీటితోపాటు సంగీతం ,నృత్యం,వేదాంతాలకు సంబంధించినవీ వుండేవి.  ఆ పుస్తకాలన్నిటినీ  నేను పై పైని తిరగెయ్యడమే తప్ప క్షుణంగా చదివే అవకాశం లభించలేదు.

'రంగులరాట్నం' సినిమా తో పరిచయమైన చంద్రమోహన్ మా ఇంటికి సమీపంలోనే కృష్ణమాచారి స్ట్రీట్ లో ఒక మేడమీద ఒక చిన్న గదిలో అద్దెకు వుండేవారు. ఆయన దగ్గర నవతర మహిళలు ఆశించే యద్దనపూడి , కోడూరి , ముప్పాళ వంటి వారి సాహిత్యం కొంత వుండేది. ఆ పుస్తకాలను తెలుగువారిళ్ళలో అద్దెకు ఇస్తూండేవారు. అలా చంద్రమోహన్ పుస్తకాలు ఘంటసాలవారింట్లోను వచ్చి చేరేవి. ఎవరో సైకిల్ మీద వచ్చి ఇచ్చి మళ్ళా రెండు మూడు రోజుల తర్వాత పట్టుకుపోయేవారు. ఒక్కో  పుస్తకానికి  రూపాయో, రెండో వసూలు చేసేవారు.

అలాటి సమయంలోనే పానగల్ పార్క్ దాటాక పింజల సుబ్రహ్మణ్యం వీధి మొగలో రాఘవన్ నెయ్యి దుకాణం. దాని పక్కనే 'రవిరాజ్ లెండింగ్ లైబ్రరీ'.
ముందుగా ఒక చిన్న రూమ్ లో ప్రారంభించాడు. ఓనర్ అప్పటికి యువకుడే. పెద్ద చదువు సంధ్యలు లేవు. 
చాలా రకాల పుస్తకాలు, మ్యాగజైన్స్  చాలా భాషల్లో దొరికేవి. షాపు తెరచిన కొత్త రోజుల్లో పుస్తకం రేటును బట్టి  ఒక్కో పుస్తకానికి పావలా, అర్ధ,రూపాయి,రెండూ అద్దె వసూలు చేసేవారు. ఇంగ్లీష్ పుస్తకం అయితే అద్దె ఐదు రూపాయలు.  సరికొత్త పుస్తకాలు , మ్యాగజైన్స్ అయితే వాటికి వేరే రేటు.ఒకే రోజులో చదివేసి మర్నాటికల్లా ఇచ్చేయాలి. చాలా లోప్రొఫైల్ లో మొదలైన ఆ లైబ్రరీ అతి త్వరలోనే టి నగర్ అంతటికీ అతి పెద్ద లైబ్రరీగా మారింది. అదే బిల్డింగ్ లో మరో రెండు రూమ్స్ లోకి విస్తరించింది. ఒక్కో పుస్తకం నాలుగైదు కాపీలు వచ్చేవి. యండమూరి ,మల్లాది వెంకట కృష్ణమూర్తి పుస్తకాలకు మంచి గిరాకీ వుండేది. అక్కడ వుండే పుస్తకాలన్నీ చదవాలంటే నా ఆదాయం చాలదు. అందుచేత నాకు  అందుబాటులో వుండే పాత తెలుగు ,తమిళం పుస్తకాలతోనే  నేను , మా ఆవిడ శేషశ్రీ కాలక్షేపం చేసేవాళ్ళం. దాదాపు 1990 ల వరకు ఆ లైబ్రరీ లో మెంబర్ గా వుండేవాడిని. ఆ తర్వాత పనుల ఒత్తిడివల్ల తరచూ లైబ్రరీకి వెళ్ళిరావడం కుదరక మానేసాను.

మా నాన్నగారు రికార్డింగ్ లు , రీరికార్డింగ్ లకు వెళ్ళినప్పుడు తనతో కూడా ఒకటో రెండో పుస్తకాలు తన వెంట తీసుకువెళ్ళేవారు.
లంచ్ బ్రేక్ లో ఆ పుస్తకాలు చదువుతూవుండేవారు.
ఇంటి దగ్గర మా అమ్మగారు కూడా పుస్తకపఠనంతోనే కాలక్షేపం.

మా నాన్నగారిది, అమ్మగారిది( శ్రీలక్ష్మి)  బాల్య వివాహం. ఆనాటికి ఆయనకు పదకొండు సంవత్సరాలు; ఆవిడకు ఐదు సంవత్సరాల లోపే. వారిద్దరిదీ అన్యోన్య దాంపత్యం. 85 ఏళ్ళ సహచర్యం. ఐదేళ్ళ వ్యవధిలో ఆ పుణ్యదంపతులు భౌతికంగా  మమ్మల్ని విడిచి వెళ్ళిపోయారు. మానాన్నగారి జన్మదినం,నిర్యాణం రెండూ 2వ తేదీయే కావడం ఒక విశేషం.


ఘంటసాల మాస్టారి బృందగానాల్లో పాడే కొంతమంది గాయనీమణులకు పుస్తకపఠనం మీద ఆసక్తివుండేది. మా నాన్నగారి దగ్గర చేరి ఆ పుస్తకాలు తీసుకొని చదివిన తర్వాత తిరిగి రికార్డింగ్ లకు వచ్చేప్పుడు తీసుకువచ్చి ఇచ్చేసేవారు. ఓ ఇద్దరు గాయనీమణులు పుస్తకం తీసుకువెళ్ళడమే తప్ప తిరిగి ఇవ్వడం మర్చిపోతూండేవారు. అడిగితే వచ్చే రికార్డింగ్ సమయంలో తెచ్చిస్తానని ,లేకపోతే ఇంటికి తీసుకువచ్చి ఇస్తామని చెప్పేవాళ్ళు. అక్కడితో సరి. ఎన్నాళ్ళైనా ఇదే తంతు. ఆడవాళ్లు. గట్టిగా అడగలేని పరిస్థితి. చాలా మంచి 
విలువైన పుస్తకాలు చేజారిపోయినందుకు మా నాన్నగారు,
అమ్మగారు చాలా బాధపడేవారు. 
అందుకే మన పెద్దలంటారు - ఏమని --

" పుస్తకం,వనిత,విత్తం
పరహస్త గతం గతః
అధవా పునరాయతి
జీర్ణం, భ్రష్టాచ,ఖండశః "
      
               
     

ఈనాటి 'నెం.35,ఉస్మాన్ రోడ్ 35వ భాగం -
పూజ్యులు, మా తండ్రిగారు శ్రీపట్రాయని సంగీతరావు గారికి, మాతల్లిగారు శ్రీమతి శ్రీలక్ష్మిగారికి శతాధిక వందనములతో సమర్పణం.

స్వరాట్
💐🙏🌺🙏💐🍀🙏🌺