visitors

Friday, August 7, 2020

నెం. 35 , ఉస్మాన్ రోడ్ ( ప్రణవ స్వరాట్ జ్ఞాపకాల మాలిక) - అధ్యాయం 1 - పదకొండవ భాగం

07.08.20 - శుక్రవారం భాగం - 11 :
పదవ భాగం ఇక్కడ

నెం.35 ఉస్మాన్ రోడ్

                                                          - ప్రణవ స్వరాట్

బాలరాజు, కీలుగుఱ్ఱం, లైలామజ్ను, మనదేశం, షావుకారు, పాతాళభైరవి, పెళ్ళిచేసి చూడు, సినీమాలతో గాయకుడిగా, సంగీత దర్శకుడిగా ఘంటసాల పేరు ఆంధ్రదేశమంతా తెలిసింది. విజయనగరం సంగీత కళాశాలలో సంగీతం నేర్చుకున్న వ్యక్తి మెడ్రాస్ వెళ్ళి సినీమాలలో స్థిరపడి పేరు తెచ్చుకోవడం ఆ వూరి వారందరికీ గర్వకారణంగా వుండేది.  విజయనగర ప్రాంతాలకు చెందిన రావి కొండలరావు, జెవి రమణమూర్తి వంటి నటులకు, ఏవిఎన్ మూర్తి వంటి గాయకులకు సినీమాలలో చేరడానికి ఘంటసాల ఒక స్ఫూర్తిగా నిలిచారు.

అప్పట్లో, జెవి రమణమూర్తి తయారు చేసిన 'విశ్వశాంతి' అనే నాటకానికి మా నాన్నగారు- సంగీతరావు గారు  సంగీతం సమకూర్చారు. ఆంధ్ర నాటక కళాపరిషత్ పోటీలలో ఆ నాటకానికి ఉత్తమ బహుమతి లభించింది.  కన్యాశుల్కంలోని గీరీశం పాత్ర రమణమూర్తి గారికి పేటెంట్. 
కన్యాశుల్కం నాటకాన్ని దేశవ్యాప్తంగా కొన్ని వందల ప్రదర్శనలిచ్చారు. తరువాత,  కెబి తిలక్ ఆయనను ఎమ్ఎల్ ఏ సినీమాలో హీరోగా పరిచయం చేయడం మీ అందరికీ తెలిసినదే. 'శంకరాభరణం' సోమయాజులు గారు రమణమూర్తి సోదరుడే. ఆయనా మంచి రంగస్థలనటులు. చాలా లేటుగా సినీమాల్లోకి వచ్చారు.  ఉత్తరాంధ్రాకు చెందిన పింగళి వారు, ప్రముఖ చిత్రకారుడు వడ్డాది పాపయ్యగారు అప్పటికే మద్రాసు చేరారు.

మా ఇంటికి ఎదురింట్లోనే గాయకుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీ ఏవిఎన్ మూర్తి కుటుంబం వుండేది. అప్పటికి ఆయన చిన్నవాడే. తరువాత సంగీతం నేర్చుకొని మద్రాసు వెళ్ళారు.

                                     శ్రీ ఏ.వి.ఎన్. మూర్తి
 ఆయన తమ్ముడు గోపాలరావ్, సర్వి అనే సర్వేశ్వరరావు, మంత్రిప్రగడ నాగభూషణం, వేలమూరి రామారావు, నా వయసువారు. అందరం కలసి ఆటలాడేవాళ్ళం. మల్లాప్రగడ, కందాళం, వడ్లమాని, నేమాని వంటి కుటుంబాలు ఆ గెడ్డ వీధిలోనే ఉండేవి.

ఘంటసాలవారు మా ఇంటికి వస్తారన్న వార్త అందరికీ తెలిసింది. ఒక్కొక్కరుగా వచ్చి ఎప్పుడొస్తారు, ఎన్నాళ్ళుంటారని మావాళ్ళను అడగడం మొదలుపెట్టారు. ఘంటసాల వెంకటేశ్వరరావు గురువుగారి శిష్యుడన్న విషయం వారికి తెలుసు. 

ఈ హడావుడి మా తాతగారికి కంగారు పుట్టించింది. మర్నాడు, ఘంటసాల వచ్చేప్పటికి వీధిలో వారంతా ఇంటికి వచ్చేస్తే సంబాళించడమెలా, వచ్చే అతిధులకు ఇబ్బందికరంగా తయారౌతుందేమోనని భయం. అదీకాక చాలా పసిపిల్లలున్న ఇంట్లో వచ్చే వారికి తగిన మర్యాదలు చేయడం కష్టమనే భావన. ఇవన్నీ ఆలోచించి ఘంటసాల కుటుంబాన్ని కొంతసేపు వుంచుకొని తరువాత, తమ మిత్రులైన వసంతరావు బ్రహ్మాజీరావుగారింట్లో దింపుదామనే నిర్ణయానికొచ్చారు. బ్రహ్మాజీరావుగారి తమ్ముడు వసంతరావు వెంకట్రావుగారు  ఎమ్ ఆర్ కాలేజీ ప్రిన్సిపాల్ గా వుండేవారు. వారంతా మా తాతగారికి అతి సన్నిహితులు.
1951లో ఘంటసాలవారు మెడ్రాస్ లో స్వంతంగా ఒక మేడను కొనుగోలు చేసి గృహప్రవేశ కార్యక్రమాన్ని వైభవంగా జరిపారు. ఆ సందర్భంగా గురువుగారిని మెడ్రాసు రప్పించి సగౌరవంగా సత్కరించారు. ఆ రోజు సాయంత్రం గురువుగారు, మా తాతగారైన పట్రాయని సీతారామశాస్త్రిగారి సంగీతకచేరీ కూడా ఏర్పాటు చేశారు. శిష్యుడు సాధిస్తున్న ప్రగతికి గురువుగారెంతో సంబరపడ్డారు.

అటువంటి శిష్యుడు కుటుంబ సమేతంగా తన ఇంటికి రావడం సంతోషకరమే అయినా  కనీసం కరెంట్ వసతి కూడా లేని ఆ ఇంటిలో వారు ఎలా గడపగలరు అనేది ఆయన చింత. అందుకే సకల వసతులు గల తమ మిత్రుల ఇంటిలో బస ఏర్పాట్లు చేశారు.

అనుకున్నట్లుగానే మర్నాడు ఉదయం ఒక కారులో అతిధులు వచ్చారు. మొత్తం ఎంతమంది వచ్చారో గుర్తులేదు‌, కానీ ఒక మగ, ఇద్దరు ఆడ, ఓ చిన్న బాబు మాత్రం బాగా గుర్తుండిపోయింది. వచ్చినాయన తెల్లటి చొక్కా, అరవ్వాళ గుండారు కట్టుకొని ఉన్నారు. వచ్చినావిడ చాలా తెల్లగా పొడుగ్గా కనిపించారు. వాళ్ళ బాబుకు రెండేళ్ళుంటాయేమో. ఆవిడను మా ఇంట్లో వాళ్ళందరికీ 'నా వైఫ్ సావిత్రి' అని చెప్పారు. ఆవిడ అందరితో కలుపుగోలుగా మాట్లాడారు. మరొక పెద్దావిడ ఆయన తల్లిగారట. 

(ఘంటసాలగారి తల్లిగారు రత్తమ్మగారు)
ఆ వచ్చినాయన పేరే ఘంటసాల అని తెలిసింది. వారిని చూచేందుకు నాకు తెలియని వాళ్ళు కూడా మా ఇంటికి వచ్చి పలకరించడం ఆయన సమాధానాలు చెపుతూ మాట్లాడడం జరిగింది.ఇల్లంతా కోలాహలంగా వుండడం పిల్లలమైన మాకు మంచి ఉత్సాహంగా అనిపించింది. ఘంటసాలగారు మధ్య మధ్యలో "రాజీ! అని పిలవడం, "ఓయ్ అని ఆ సావిత్రి గారు రావడం వింతగా అనిపించింది. ఆవిడ పేరు  సావిత్రి అన్నారే, ఇప్పుడు రాజీ అని పిలుస్తున్నారే. ఆవిడకు రెండు పేర్లా ? అని నాకు సందేహం.  అందరి మాటలు వింటూ ఇంట్లో ఒక ఓరగా నిలబడి వింతగా చూస్తూండిపోయాను. ఘంటసాల గారు ఏవో పాటలు పాడిన గుర్తు. ఆ పాటలకు తగినట్లు బొద్దుగా ఉన్న వారి బాబు కాళ్ళు చేతులు కదిలిస్తూ ఆడడం గుర్తుంది. మంచి లయజ్ఞానం ఉందని మాపెద్దవాళ్ళు ముచ్చట పడ్డారు. ఆ బాబు పేరు విజయకుమార్ అని చెప్పారు.

(ఘంటసాల విజయకుమార్)
ఘంటసాలగారు విజయా సంస్థలో ఆస్థాన సంగీత దర్శకుడిగా కాంట్రాక్టు జరిగిన మరుసటి సంవత్సరం ఈ బాబు పుట్టాడు. విజయాతో ఉన్న అనుబంధాన్ని పురస్కరించుకుని ఈ బాబుకు ' విజయ' కలిసేలా పేరు పెట్టమని విజయా అధినేత బి.నాగిరెడ్డిగారు సూచించారట. ఆయన కోరిక మేరకు వారి బాబుకు విజయకుమార్ అని పేరు పెట్టడం జరిగిందని తరువాత కాలంలో తెలుసుకున్నాను. ఆ అతిధుల మాటలు, చేష్టలు కొన్ని నాకు బాగా కొత్త . మా పెరట్లో రాచ ఉసిరి, జామి, కొబ్బరి, పత్తి వంటి చెట్లతో చాలా చల్లగా ఉండేది. ఆ సావిత్రి గారికి చాలా ఒత్తైన, పొడుగాటి తలకట్టు ఉండేది. జడవేసుకోవడానికి మావాళ్ళు  పన్ని ఇవ్వబోతే ఆవిడ తన దువ్వెనతో తల దువ్వుకోవడం గుర్తుండిపోయింది. మా ప్రాంతాలలో దువ్వెనను పన్ని అంటారు. మాఇంట్లో పన్నిలు చిన్నవి. కానీ ఆవిడ దగ్గరున్న రంగుదువ్వెన చాలా పొడుగు. తల దువ్వుకుంటూ ఆ దువ్వెనను ఆవిడ తల మధ్యలో పెట్టుకొని మరింకే పనులో చేయడం నాకు ఒకటే ఆశ్చర్యం. మా ఇంటిలో అప్పటికి చూడనివి.

ఇలా కొన్ని గంటలు గడిపాక, వారందరూ బయటకు వెళ్ళారు. మా తాతగారూ, నాన్నగారితో నేనూ వెళ్ళడం జరిగింది. మాతో పాటూ ఆ వూళ్ళోనే ఇంటర్మీడియట్ చదువుతున్న మా నాన్నగారి కజిన్ గుమ్మా మార్కండేయ శర్మ కూడా ఉన్నారు. శర్మ బాబుగా చిరపరిచితుడైన ఆయన పాటలు, పద్యాలు బాగా పాడేవాడు.

ముందుగా, వసంతరావు బ్రహ్మాజీరావు గారింటికి వెళ్ళాము. వారిల్లు చాలా పెద్దిల్లు. ఇల్లాంతా ఎలక్ట్రిక్ దీపాలున్నాయి. నీళ్ళకొళాయిలున్నాయి. వరండాలు,హాల్స్ లో పెద్ద పెద్ద స్థంభాలు, పైనుండి క్రిందికి వేలాడుతూ రంగు రంగుల అద్దాల లైట్ డూమ్స్. ఏ కాలానివో. వాటిలో దీపాలు వెలిగించేవారో లేదో తెలియదు. బ్రహ్మాజీరావు గారి భార్య పేరు రాధమ్మగారు. ఆ దంపతులిద్దరికీ మా తాతగారన్నా, ఆయన పాటన్నా చాలా ఇష్టం. వసంతరావు వెంకట్రావు గారిని కూడా అనేక సార్లు చూశాను. వారంతా ఘంటసాల వారి రాక పట్ల చాలా సంతోషం పొందారు. మాటలు, పాటలు పద్యాల మధ్య మద్యాహ్నపు విందు వారింట్లోనే జరిగింది. 

గురువుగారు తమను ఆ రాత్రికి కూడా బ్రహ్మాజీరావు గారింటనే ఉంచదల్చుకున్నారనే వార్త ఘంటసాలగారికి తెలిసింది. ఆ నిర్ణయానికి ఒప్పుకోలేదు. ఆయన మాతాతగారితోనూ,  వారి కుటుంబ సభ్యులతో గడపడం కోసమే వచ్చామని  అందుచేత వెంటనే ఇంటికి వెళ్ళిపోదామని రాత్రంతా గురువుగారింట్లోనే ఉంటామని పట్టుపట్టారు. అలాగే చేశారు. మార్గమధ్యంలో మ్యుజిక్ కాలేజి, ఎమ్ ఆర్ కాలేజి, సంస్కృత కాలేజి, ఆయనకు తెలిసిన ప్రదేశాలన్నీ చూసుకుంటూ, ఒకసారి అయ్యకోనేరు గట్టుమీద ఉన్న గుమ్చీ ప్రాంతంలో ఆగి తమ పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. అక్కడనుండి, విద్యార్ధి దశలో తనకు ఆకలి సమస్య తీర్చి నిశ్చింతగా సంగీతం నేర్చుకుందుకు దోహదపడిన సింహాచలం దేవస్థానం అన్నసత్రం లోపలికి కూడా వెళ్ళాము. అప్పటికి చీకటి పడింది. అక్కడి భోజనశాలలో కొంతమంది విద్యార్థులు బారులు తీరి భోజనాలు చేస్తున్నారు. అందులో చాలామందికి వచ్చినవారి గురించి ఏమీ తెలియక వింతగా చూశారు. ఘంటసాలగారు ఆ పరిసరాలన్ని తనకు బాగా తెలిసినవే అన్నట్లుగా అన్ని చోట్లకు వెళ్ళి చూశారు. చీకటిగా చిరు దీపాల వెలుగుతో ఉన్న వంటశాలలోకి కూడా వెళ్ళి అక్కడవారితో సరదాగా మాట్లాడారు. మనిషి ఎంత స్థితిమంతుడైనా గతం మరువకూడదనే దానికి నిదర్శనంగా ఘంటసాలగారు నిలుస్తారు. ఆ రాత్రి భోజనాలు మా ఇంట్లోనే జరిగాయి. అందరినీ పేరుపేరునా పలకరిస్తూ ఇంట్లో మనిషిలాగే గడిపారు. ఘంటసాలగారు సావిత్రమ్మగారిని మా పెద్దమ్మమ్మగారి వద్దకు తీసుకెళ్ళి "అమ్మగారూ! మీ చేతివంట తిని ఎన్నేళ్ళయిపోయిందో. మీరు చేసే సద్ది కోసమే వచ్చాన"ని చెప్పారు. ఉత్తరాంధ్ర ప్రాంతాలలో పులిహోరను 'సద్ది' అని అంటారు. అదెలా చేస్తారో అమ్మగారిని అడిగి నేర్చుకోమని సావిత్రిగారికి చెప్పారు. 

ఘంటసాలగారు తమ మద్రాస్ జీవితంలో అంతకన్నా రుచికరమైన, ఖరీదైన వంటకాలన్నో రుచి చూచి వుండవచ్చును. కాని,గతంలో తనకు అన్నం పెట్టి ఆదరించిన ఒక తల్లి పట్ల తనకుగల ప్రేమాభిమానాలను, కృతజ్ఞతను  వ్యక్తపర్చడానికి అన్న మాటలుగా నేను భావిస్తాను. కరెంట్ దీపాలు లేని ఆ ఇంట్లో హరికెన్ లాంతర్ల వెలుగులో సరదాగా కబుర్లు చెపుతూ భోజనాలు ముగించారు.

మర్నాడు ఉదయం మద్రాస్ ప్రయాణం.

రైలు ఎక్కడానికి ముందు తమ ఇంటికి వచ్చి వెళ్ళవలసిందేనని మా నాన్నగారి స్నేహితుడు శ్రీ ద్వివేదుల నరసింగరావుగారు, వారి భార్య విశాలాక్షిగారు బలవంతం చేసి వారింటికి తీసుకువెళ్ళారు.
(2001 - విశాఖపట్నంలో శ్రీ డి ఎన్ రావుగారు, విశాలాక్షిగారు)

 విశాలాక్షిగారు అప్పటికి రచనా వ్యాసాంగం మొదలుపెట్టలేదు. ఆవిడ ఆంధ్రా మెట్రిక్ పాసయ్యారు. నరసింగరావుగారు మహారాజావారి కాలేజీలో లెక్చెరర్. మా నాన్నగారు మద్రాసు వెళ్ళడానికి ముఖ్య ప్రేరణ ఆ నరసింగరావుగారే.  వారికి ఒక అబ్బాయి శ్రీనాధ్. నాకంటే ఓ రెండేళ్ళు పెద్ద కావచ్చు. తరువాత అమ్మాయి ఛాయ. నాకంటే కొంచెం చిన్నది. ఆ అమ్మాయికి మా ప్రభూ చిన్నాన్నగారు కొన్నాళ్ళు వైలిన్ నేర్పారు. తరువాతి కాలంలో శ్రీ నరసింగరావుగారు విజయనగరం మహారాజావారి స్కాలర్ షిప్ తో అమెరికాలో విస్కన్సిన్ యూనివర్శిటీలో ఎకనామిక్స్ విభాగంలో పి హెచ్ డి చేసి ఇండియాకు తిరిగి వచ్చారు. ఆ విశేషాలన్నీ రానున్న భాగాలలో చూద్దాము.

అలా ద్వివేదుల వారింటి ఆతిధ్యం పొంది ఘంటసాలవారు తమ కుటుంబంతో సంతోషంగా  మద్రాస్ మెయిల్ ఎక్కారు.

వచ్చేవారం మరిన్ని విశేషాలు. అంతవరకూ....
                      సశేషం

4 comments:

Patrayani Prasad said...

🙏🙏శ్రీ పట్రాయని ప్రణవ స్వరాట్ అన్నయ్యకు🙏🙏చాలా బాగా వివరంగా వ్రాశావు. నేను మళ్ళీ, విజయనగరం లో గెడ్డ వీధీ లో ఆనాడు శ్రీ తాతగారు పట్రాయని సీతారామ శాస్త్రి గారితోను, శ్రీ ఘంటసాల వారి కుటుంబంతోను, కలిసి విజయనగరంలో తిరిగినట్లు. అనిపించింది. ఆ జ్ఞాపకాలన్నీ,సినిమా రీలులా కదలాడాయి. ధన్యవాదాలు- పట్రాయని ప్రసాద్, బెంగుళూరు, 7-8-2020, శుక్రవారం.

P P Swarat said...

ధన్యవాదాలు

Ayapilla Sastry said...

చాలా రసవత్తరంగా సాగుతోంది.మరల ఈవారపత్రిక ఎంత వేగంగా వస్తుందా అని ఎదురు చూస్తున్నాం.చాలా సంతోషం.

P P Swarat said...

మీ ప్రోత్సాహానికి చాలా సంతోషం. ధన్యవాదాలు.